Jump to content

ఆనందరంగరాట్ఛందము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

ప్రథమాశ్వాసము

గ్రంథప్రారంభము



రామారమణపదాం
భోరుహపూజావిశేష బుధసత్కవిమం
దారా! విపక్షశైలశ
తారా! యానందరంగధరణీశమణీ!

1


గీ.

అవధరింపుము నీపేర నంకితముగ, సకలలక్షణగ్రంథవిస్తారసార
పటిమ లన్నియు నొకటిగా ఘటనపఱిచి, లక్షణగ్రంథ మొనరింతు రంగనృపతి!

2


క.

సుకవీంద్రులు తల లూఁచఁగ, గుకవు లొగిన్ దలలు వంచుకొనఁజేసెద నే
నొకలక్షణకావ్యంబును, రకముగ నానందరంగరాట్భంద మనన్.

3


గీ.

లక్షణమెకాని యెఱుఁగరు లక్ష్యపటిమ, లక్ష్యమే కాక యెఱుఁగరు లక్షణంబు
కొంద ఱేనంద ఱానంద మొంద లక్ష్య, లక్షణము లేర్పరించెద రంగనృపతి!

4


వ.

తద్విధం బెట్టిదనిన.

5


క.

చను నుత్తమగండాధ, ర్వణహనుమదనంతసు(న)కవిరాక్షసజయదే
వనుతశ్రీధరగోక, ర్ణనీలకంఠాదిభీమనచ్ఛందంబుల్.

6


వ.

ఉత్తమగండచ్ఛందము, హనుమచ్ఛందము, అధర్వణచ్ఛందము, అనంతచ్ఛం
దము, కవిరాక్షసచ్ఛందము, జయదేవచ్ఛందము, శ్రీధరచ్ఛందము, గోకర్ణ
చ్ఛందము, నీలకంఠచ్ఛందము, ఆదిమకవిభీమనచ్ఛందము యీదశవిధచ్ఛందంబులు
గాక లక్షణగ్రంథములగు [1]నన్నయభట్టు లక్షణసారంబును, విన్నకోట పెద్దిరాజు
నలంకారశాస్త్రంబును, రఘునాధీయలక్ష్మణదీపికయును, భైరవునికవిగజాంకుశ
మును, నప్పన యాంధ్రప్రయోగరత్నాకరంబును, నెఱ్ఱాప్రెగడ కవిసర్పగారుడము
ను, దాతంభట్టు కావ్యచింతామణియును, మల్లన [2]పాదాంగచూడామణియు నను
నీ మొదలగు లక్షణకావ్యంబులందుఁ గలుగు కవితాలక్షణప్రకరణంబు లన్నియుఁ

గ్రోడీకరించి సారవంతంబుగా సకలకవిజనసమ్మతంబుగా లక్షణలక్ష్యంబు లేర్పఱచి
భవదీయ విపులకృపావిభవసంపాదిత మనీషాచాతుర్యంబున వివరించెద నాకర్ణిం
పుము.

7

గణాష్టకసంభవనిర్ణయము

క.

హరునిత్రినేత్రములం దిగ, గురువు లొదవి మగణ మయ్యె గురుతుగ వరుసన్
యరసతజభనగణంబులు, స్థిరముగ దానికి జనించె శ్రీరంగనృపా!

8


గీ.

ఆదు లచ్చులు కాదులు వ్యంజనములు, హల్లు లనఁ జెల్లు సందులో యరలవశష
సహలు నంతస్థ లూష్మ లన్ సంజ్ఞఁ దనరు, సుందరీమోహనాంగ యానందరంగ!

9

స్త్రీపున్నపుంసకాక్షరనిర్ణయము

గీ.

సక్షలును రెండు నొత్తనియక్షరములుఁ, బడియు మగలచ్ఛషలు నొత్తఁబడినపదియు
రమణు లౌ ఙఞణనమయరసహలళలు, రహిని బేడులౌ నానందరంగశౌరి.

10


వ.

సకారక్షకారములు రెండు నొత్తనియగరము లగుకగచజటడతదపబయనునీపది
యును గూడఁ బండ్రెండక్షరములు పురుషజాతివి. ఆకారాదిస్వరములు పదునైదు,
నొత్తుగలయక్షరములు పదియును, శషలు రెండును మొత్త మిరువదేడక్షరములు
స్త్రీజాతివి. ఙఞణనమయరలవహళయను నీపదునొకండక్షరములు నపుంసకజాతివి
అని తెలియునది. మఱియు నీశ్వరునిమూఁడుకన్నులనుండి మూఁడుగురువులు పుట్టి
మగణ మాయెను. దానివలన వరుసగా యగణరగణసగణతగణజగణభగణనగణం
బులు పుట్టెను.

11

గణంబు లుద్భవించిన యామములు

గీ.

సరవిని జయవిజయశంఖమహాశంఖ,ము లను జాల మయరసలు జనించె
రాత్రిజాము లైనరామవిరామసు, ప్తప్రసుప్తలఁ దజభనలు పుట్టె.

12


క.

ఏజామునఁ గృతిఁ బూన్చిన, నాజాముగణంబె మొదట నమరింపక వే
ఱే జెప్పఁదగదు సద్గుణ, రాజిత యానందరంగ! రమణీయాంగా!

13


వ.

ఆయెనిమిదిగణములు నెనిమిదిజాములయందుఁ బుట్టినవి గనుక నందుఁ బగటిజాము
లయిన జయవిజయశంఖమహాశంఖముల మగణయగణరగణసగణంబు లుద్భవించె.
రాత్రిజాము లయినరామవిరామసుప్తప్రసుప్తలయందుఁ దగణజగణభగణనగణం
బులు జనియించినవి. కాన సుకవీంద్రుఁ డేవేళఁ గృతిసేయ నుపక్రమించె నా
వేళఁ బుట్టినగణమును పద్యాదిని బ్రయోగించినఁ గృతీశ్వరునకుఁ దనకు మేలుగలు
గును. భేదముగాఁ జెప్పినఁ గీడొదవును.

14
ఇందుకు లక్ష్యము, కవిసర్పగారుడమున:—
సీ.

జయవిజయంబులు శంఖమహాశంఖ, ము లనంగఁ బగటిజాములు చెలంగు
రాత్రిజాల్ రామవిరామసుప్తప్రసు, ప్తలు ననఁగా భువిఁ బరగుచుండు
నీయెనిమిదిరిజాలఁ బాయక మగణాది, గా జనించె గణాష్టకంబు వరుస
నేజామునను గావ్యుఁ డెలమిఁ గబ్బంబును, విరచింపఁ బూనె నవ్వేళయందు


తే.

నుద్భవం బైనగణముఁ బ్రయోగమునకు, శుద్ధిగాఁ గూర్పలేక విజ్జోడుపడఁగ
గణము లూహించి కూర్చుబికారికుకవి, పద్య మొల్లఁడు బ్రదు కాసపడెడువాఁడు.

15

బీజాక్షరనిర్ణయము - వానిశుభాశుభఫలములు

క.

ఆదిక్షాంతాక్షరముల, నైదువరుస లునుప వరుస కవి పది యగుచున్
బ్రోదిఁ బననాగ్నిభూజల, ఖోదితబీజాక్షరమ్ము లొగి రంగనృపా!

16


గీ.

అనిలబీజాళి శోకదం బగ్నిబీజ, సమితి మడియించు భూమిబీజములు శ్రీ ద
మంబుబీజము ల్ముదమిచ్చు నభ్రబీజ, రాజి లేము లొసంగు శ్రీరంగభూప!

17
వ.

అకారము మొదలు క్షకారమువఱకుఁ గలయేఁబదియక్షరముల నైదువరుసలుగ వ్రా
సిన నవి వరుసకుఁ బదియక్షరము లగును. అందు మొదటివరుసయందలి “ఆ ఊ
ఏకచటకపయష"లనునీపదియు వాయుబీజాక్షరములు, వీనిఁ బద్యాదినుంచిన నశు
భము. రెండవవరుసయందలి “ఆ ఋ ఐ ఖ ఛ ఠ థ ఫ ర స” లను నీపదియు నగ్ని
బీజాక్షరములు. వీనిఁ బద్యాదినుంచిన నశుభము. మూఁడవవరుసయందలి “ఇ
ౠ ఓ గ జ డ ద బ ల హ” అనునీపదియు భూబీజాక్షరములు. వీనిఁ బద్యాది నునుప
శుభము. నాలవవరుసయందలి "ఈ ఌ ఔ ఘ ఝ ఢ ధ భ వ" లను పదియ
క్షరములు జలబీజాక్షరములు. వీనిఁ బద్యాదినుంచిన శుభము. ఐదవవరుసయందలి

"ఉ ౡ అం ఙ ఞ ణ న న ళ క్ష”లను నీపదియు నాకాశబీజములు. వీనిఁ బద్యా
ది నునుప నశుభము. కాన సుకవీశ్వరు లగువా రిది విచారించి పద్యముల రచియిం
చునది.

18
ఇందుకు లక్ష్యము, కవిసర్పగారుడమున:—
[3]సీ.

ఆఇఉఋఌను మఱి యాదీర్ఘవర్ణంబు, లైదు నెకారాదు లైదు నవని
వరుసఁ గవర్గాదివర్గపంచకమును, యాదు లైదును షాదు లైదుఁ గూడ
నొండొంటితోఁ గూర్చి యొనరదొంతిగఁ బేర్చి, మానుగాఁ జూచిన వానిలోనఁ
బ్రథమాక్షరంబులు పవనబీజంబులు, నవలివి దహనబీజాక్షరములు


తే

నవనిబీజంబు లాతృతీయాక్షరములు, వారిబీజంబు లాతఱువాతి లిపులు
గగనబీజంబు లేనవకడలవెల్ల, వానికీడును మేలును వలయుఁ దెలియ.

19


[4]మ.

క్షితిబీజంబులు సంపద ల్పొదలఁ బోషించున్ బయోబీజముల్
సతతంబున్ బ్రమదం బొనర్చు శిఖిబీజంబు ల్మృతిం జేయు మా
రుతబీజంబులు శోకవారిధిఁ బడంద్రోయున్ నభోబీజముల్
పతి నత్యంతదరిద్రుఁ జేయుఁ గృతులన్ బద్యాది నొందించినన్.

20
అనంతచ్ఛందము:—
గీ.

పరగుఁ గవితగద్యపద్యంబులన పాద, కల్పనంబు వలదు గద్యమునకుఁ
బాదనియతి నొప్పుఁ బద్యంబు లవియు వృ, త్తములు జాతులనఁగఁ[5] దనరుఁ గృష్ణ.

21

1.6

యతిప్రాసంబు లుంచు తెఱఁగు

క.

ఎన్నిట యతి రాఁదగునని, రన్నిట సంస్కృతమునను నగు విచ్ఛేదం
బెన్నిట యతి రాఁదగు నని, రన్నిటఁ దెనుఁగునకు మొదటియక్షర మమరున్.

22
సాహిత్యరత్నాకరమున:—

"ఛందోజ్ఞాన మిదం పురా త్రిణయనా ల్లేఖే శుభం నందిరాట్
తస్మా త్ప్రాప సనత్కుమారక తతో౽గస్త్య స్తతో వాక్పతిః,
తస్మా ద్దేవపతి స్తతః ఫణిఫతి సస్యానుజః పింగళ
స్తచ్ఛిష్యై ర్మునిభి ర్మహాత్మభి రిదం భూమౌ ప్రతిష్ఠాపితమ్.”

అధర్వణచ్ఛందమున:—
గీ.

ఇందుమాళివలన నంది గాంచిన ఛంద, వెలమిఁ జదివి రొకరివలన నొకరు
లలి సనత్కుమార కలశజ జీవ వృ, త్రారి శేష పింగళాఖ్యు లోలి.

23

గురులఘుసంజ్ఞలు

క.

సున్నలు గలవర్ణములు స, మున్నతదీర్ఘాక్షరములు నూఁదినలిపులున్
జెన్నుగ గురువులు దక్కిన, వన్నియుఁ బరికింప లఘువు లగు రంగనృపా!

24


వ.

సున్నలు గలయక్షరములు, దీర్ఘములగునక్షరములు, సంయుక్తాక్షరములకు ముం
దున్న యక్షరములు ఇవియన్నియు గురువులు, తక్కినవి లఘువులు.

25


గీ.

చంద్రవంకవిధము వ్రాయుసంజ్ఞ గురువు, మరునిబాణమువలె వ్రాయుగురుతు లఘువు
నట్టి గురులఘుత్రయముచే నగుగణములు, రసికమందార యానందరంగధీర!

26


వ.

గురువు U, లఘువు I, ఇట్లు తెలియునది.

27


క.

మొదలక్షరంబు వడి యగుఁ, బదపడి రెండవది వెలయుఁ బ్రాసం బగుచున్
బదపద్యవృత్తజాతుల, నిదియే యానందరంగ! నృపసారంగా!

28


క.

చరణాదిని లఘువుండిన, గురువుండిన నట్ల నాలుగుచరణములకున్
సరిపడ రచియింపవలెన్, వరవిజయానందరంగ వసుధాధిపతీ!

29

గణములు

వృత్తరత్నాకరమున:—

“ఆదిమధ్యావసానేషు యరతా యాంతి లాఘవమ్,
భజసా గౌరవం యాంతి మనౌతు గురులాఘవే.”


గీ.

మొదల నడుమను దుద గురు లొదవెనేని
భజస లగు నట్ల లఘువులు పరగెనేని
యరత లగు నాది మూఁడేసిగురువు లున్నఁ
దగ లఘువు లున్న మగణంబు నగణ మగును.

30


క.

రంగేంద్రా యన మగణము, రంగన యన భగణమయ్యె రంగేంద్ర యనన్
సంగతిగఁ దగణ మయ్యె సి, రంగా యన యగణమయ్యె రంగనృపాలా!

31


క.

సరస యనఁగ నగణం బగు, సరసాయన సగణ మంశజాయన రగణం
బిరవొంద జితారి యనన్, మరి జగణం బయ్యె రంగ మహిపతిచంద్రా!

32


క.

సగణంబు లఘువు సలమగు, నగణంబును లఘువు నలము నగణము గురువున్
నగము గురుయుగము గగమగు, హగణము గురులఘువు వగణ మగులఘుగురువున్.

33

వ.

సగణముతో లఘువుకూడిన సలము. నగణముతో లఘువు కూడిన నలము. నగణము
తో గురువుగూడిన నగము. రెండుగురువులుండిన గగము. ఒకగురువు నొకలఘువు
గూడిన హగణము. ఒక లఘువు నొకగురువు గూడిన వగణ మని తెలియునది.

34


క.

భగణము రగణము తగణము, నగము నలము సలము దేవనాయకగణముల్
తగు నహము లినగణంబులు, మిగిలిన విందుగణములు సుమీ రంగనృపా!

35


వ.

భగణము, రగణము, తగణము, నగము, నలము, సలము ఇవి యాఱు నింద్రగణ
ములు, నగణము హగణము ఈ రెండును సూర్యగణములు, తక్కినవి చంద్రగణ
ములు.

36

కందపద్యలక్షణము

క.

గగనలభజసలలోఁ ద్రిశ, రగణంబులు గూర్చి మునివిరతి తుదగురువున్
జగణము సరింట నలజలు, మొగినాఱిట నిలుపఁ గంద మొగి రంగనృపా!

37


వ.

గగము, నలము, భగణము, జగణము, సగణము యీయైదుగణములలోనే మొదటి
చరణమునకు మూఁడుగణములు రెండవచరణమున కైదుగణములు నుండఁజెప్పిన
సగముపద్య మగును. తక్కినసగము నిట్లే యెఱుంగునది. దీనికి యతి మొదటిచర
ణము మూఁడుగణములు, రెండవచరణమున మొదటిమూఁడుగణములు మొత్త
మాఱుగణములు పోఁగా నేడవగణముయొక్క మొదటియక్షరమునకుఁ దగుల
వలెను. పద్యమంతయు నలములుగాఁ జెప్పినను రెండవచరణము కడపటను నాలవ
చరణము కడపటను గురువులుండవలెను. బేసిగణము జగణముగా నుండరాదు. ఆఱవ
గణము జగణముగ నైనను, సలముగ నైన నుండితీరవలెను. ఇన్నిరీతుల నమరి
నాల్గుప్రాసములతోఁ గూడినది కందపద్యము.

38

సీసపద్యలక్షణము

క.

సురరాజు లాఱుగురు భా, స్కరు లిద్దఱుఁ గూడ నొక్కచారణ మటువలెన్
చరణములు నాల్గు గీతియు, హరువొందిన సీసపద్య మగు రంగనృపా!


వ.

ఆ ఱింద్రగణములు నావెనుక రెండుసూర్యగణములు గూడిన నొకచరణము. అట్టి
చరణములు నాల్గును, నొకగీతియుఁ గూడిన నది సీసపద్యము.

40

గీతపద్యలక్షణము

గీ.

అబ్జహితులు మువ్వు రమరేంద్రు లిద్దఱు, నైదుగురుదినేశు లాటవెలఁది
ఇనుఁ డొకండు నింద్రు లిద్దఱు నిద్దఱు, రవులు తేటగీతి రంగనృపతి!

41


వ.

ఆటవెలఁది యనుపద్యమునకు మెజిలిచరణమునఁ గ్రమముగ సూర్యగణములు
మూఁడు, నింద్రగణములు రెండును, రెండవచరణమున నైదుసూర్యగణములును

నుండఁజెప్పిన నిది సగముపద్యమగును. తక్కినసగము నిట్లేయని యెఱుఁగునది.
తేటగీతియనుపద్యమునకు మొదటిచరణమున సూర్యగణమొకటియు నింద్రగణములు
రెండును మరల సూర్యగణములు రెండును నీయైదుగణము లుండవలెను. తక్కిన
మూఁడుచరణములు నిట్లే యని యెఱుంగునది. ఈరెండుజాతులగీతములకుఁ జరణ
చరణమున మూఁడవగణమువెనుక యతియైనను బ్రాసయతియైన నుండవలెను.

42

వృత్తలక్షణము

ఉత్పలమాలికాలక్షణము

ఉ.

పన్ని పదౌయతిన్ భరవభారవసంజ్ఞగణాళిఁ గూడి య
త్యున్నతవృత్తితోఁ దనరు నుత్పలమాలిక రంగధీమణీ!

43


వ.

భగణరగణనగణభగణభగణరగణనగణనగణములును, పదియవయక్షరము యతియుఁ
గలదొకచరణము. ఇట్లె నాల్గుచరణములు చెప్పిన నుత్పలమాలిక యగును.

44

చంపకమాలికాలక్షణము

చ.

సలలితరీతితో నజభజాజరసంజ్ఞగణాళిఁ జంపకం
బలవడు రుద్రవిశ్రమసమంచితమై తగి రంగభూపతీ!

45


వ.

నగణము, జగణము, భగణము, మూఁడుజగణములు, రగణములును, యతి పదు
నొకండవ యక్షరముగను జెప్పిన నొకచరణము. అట్టిచరణములు నాలు గొకచంపక
మాలావృత్త మగును.

46

శార్దూలవిక్రీడితలక్షణము

శా.

సారంబౌ మసజల్ సతాగురువులున్ శార్దూలవిక్రీడితం
బారూఢిం బదుమూఁటఁ గల్గుయతిచే నానందరంగాధిపా!

47


వ.

పదుమూఁడవయక్షరము యతియు, వరుసగా మగణము, సగణము, జగణము, సగ
ణము, తగణము, తగణము యీయాఱుగణములు, నొకగురువును గలయది యొక
చరణము. ఇట్టివి నాల్గైన నొకశార్దూలవిక్రీడితవృత్తము.

48

మత్తేభవిక్రీడితలక్షణము

మ.

నలువొందన్ సభరల్ నమల్ యవలతోనంగూడి మత్తేభ మిం
పలరారున్ బదునాలుగౌవిరతిచే నానందరంగాధిపా!

49


వ.

పదునాల్గవయక్షరము యతియు వరుసగా సగణము, భగణము, రగణము, నగణము,
మగణము, యగణము, వగణము నీయేడుగణములు గలిగిన నొకచరణము. ఇవి నాలు
గైన మత్తేభవిక్రీడితం బగును.

50

ద్విపదలక్షణము

క.

సురపతిగణములు నాలుగు, తరణిగణద్వయముఁ గూర్పఁ దనరు ద్విపద యీ
తెఱఁగున నలుచరణమ్ములు, సరుసుకొనన్ జౌపద యనఁజను రంగనృపా.

51


వ.

నాలు గింద్రగణములు రెండు సూర్యగణములు నొకచరణమగును. ఇట్టిచరణములు
రెండు ద్విపద యనఁబడును. ఇట్లే నాలుగైనఁ జౌపద యనఁబడును. వీనినే మహా
నవమిపద్య మందురు.

52

ప్రస్తారక్రమము

గీ.

వరుస సర్వగురువు లుంచి గురువుక్రింద, లఘువు నవతలఁ బైబంతిలాగు వ్రాసి
దాపట గురువు లుంచఁ బ్రస్తారమయ్యె, ననఘ యానందరంగరాయాగ్రగణ్య.

53


వ.

ఎన్నవఛందము ప్రస్తరింపవలసిన నన్నిగురువులు వ్రాసి తొలిగురువుక్రింద లఘువు
వ్రాసి యావలఁ బైబంతిలాగుననే వ్రాసి దాపల నంతట గురువులే యుంచవలెను. ఇ
ట్లన్నియు లఘువు లగుదనుకఁ బ్రస్తరించవలెను. ఇదియే ప్రస్తారక్రమము.

54
సులక్షణసారమున:—
క.

చాలుగను సర్వగురులిడి, లాలితముగ గురువుక్రింద లఘువు వెలుపలన్
ఓలిసమంబును దాఁపలి, వ్రాలునకున్ గురువులిడినఁ బ్రస్తార మజా!

55

ఇనేంద్రచంద్రగణప్రస్తారము

గీ.

గురువు లొగి రెండు మూఁడు నా ల్గుంచి ప్రస్త
రింపఁ బ్రభవించు గణముల రెండు త్రోసి
లఘుగణాదుల నొక్కొక్కలఘువుఁ బెట్ట
రవిబలారీందుగణము లౌ రంగధీర!

56


వ.

రెండుగురువు లుంచి ప్రస్తరించిన నాల్గుగణములు పుట్టును. అందు రెండుగణములు మొదటఁ ద్రోసి తక్కినరెంటిలో లఘువు మొదలనుండుగణము మొదలు మఱియొక
లఘువుఁ గూర్చుకొనినచో హగణనగణము లగును. ఇవి సూర్యగణములు. మూఁడు
గురువు లుంచి ప్రస్తరించిన నెనిమిదిగణములు పుట్టును. అందు మొదలిరెండుగణ
ములు గాక తక్కినయాఱుగణములలో మొదట లఘువుగలగణమునకు మరియొక
లఘువుఁ జేర్చినయెడ నవి రగణము, నగణము, తగణము, సలము, భగణము, నలము
అగును. ఈయాఱుగణములు నింద్రగణములు. నాలుగుగురువు లుంచి ప్రస్తరింప
బదునాఱుగణములు పుట్టును. అందు మొదటి రెండుగణములుగాక తక్కినపదు
నాల్గుగణములలో మొదట లఘువుగలగణముమొదల నొకలఘువుఁ జేర్చిన రగురువు,
నగగము, తగురువు, సవము, భగురువు, నవము, మలఘువు, సహము, రలము,

నహము, తలము, సలలము, భలము, నలలము నను నీగణములు అగును. ఇవియే
చంద్రగణములు.

57
అనంతచ్ఛందము:——
క.

ద్విత్రిచతుర్గురుభవములు, ధాత్రీధవ రెండు మడఁపఁ దక్కినగణముల్
మిత్రేంద్రచంద్రు లనఁదగు, మాత్రాదిగణంబుమొదల మాత్రలు నిలుపన్.

58

(1. 18.)

మఱియుఁ బదునాలుగుచంద్రగణములకు నుదాహరణములు:—
సీ.

కదనశూరా నగగంబు కమలనేత్ర నహ మరిమర్దన నాఁగ సలల
మిందురుచి భలంబు నందకులా యన్న భగురు రంగాధీశ మగణలఘువు
సువజారతా యన్న సవ మనఘస్వాంత సహము రంగాధిపసంజ్ఞ తలము
రంగశౌరి రలంబు రసికమణీ యన్న నవి మమితగుణ నా నలల మయ్యె


తే.

రగణగురువు రంగరాజా యనంగ వి, ద్వన్నుతా యనంగఁ దగణగురువు
విజయుఁడా యనంగ విజయుఁడ విజయాంక, నాఁగ నొప్పు నగము నలము సలము.

59


వ.

ఇవ్విధంబున గణాష్టకసంభవనిర్ణయంబును, స్త్రీపున్నపుంసకాక్షరనిర్ణయంబును,
గణంబు లుద్భవించినయామంబులును, బీజాక్షరనిర్ణయంబును, వాని శుభాశుభఫలం
బులును, యతిప్రాసంబు లుంచుతెఱంగును, గురులఘుసంజ్ఞలును, గందసీసగీతవృత్త
ద్విపదలక్షణంబులును, నినేంద్రచంద్రగణప్రస్తారంబును వివరించినాఁడ. నింక
మగణాద్యష్టగణంబులకు నధిదేవిత గ్రహాదినిర్ధారణంబును, నన్యోన్యగణసాంగ
త్యంబును, వానిశుభాశుభఫలంబులును, బంచాదశద్వర్ణసముద్భవనిర్ణయంబును, దజ్జాతి
గ్రహాధిదేవతాఫలబీజనాయకనిర్ణయంబును, దదుపహారవస్త్రభూషణవర్ణవిమర్శనం
బును, దదూర్ధ్వముఖాధోముఖపార్శ్వముఖసమముఖవివేచనంబును, నమృతాక్షరవి
షాక్షరప్రకటనంబును, సంయుక్తనరఫలాఫలంబులును, సురనరతిర్యగ్రౌరవాక్షర
భేదంబులును, నల్పప్రాణమహాప్రాణాక్షరసూచనంబును, జీవపక్షమృతపక్షసంగతు
లును, దగ్ధజ్వలితధూమితనక్షత్రవిమర్శనయియిను, రాశివిరోధంబులును, సత్త్వరజస్త
మోవేళాపరిశీలన౦బును, రాశ్యధిపతిప్రకారంబును, నుచ్చనీచస్థానవిధంబును, గ్రహ
మిత్రామిత్రసమత్వభావంబులును, గ్రహవర్ణనిష్పత్తియు భూసురాదివర్ణంబులకు గ్ర
హమైత్రి ముఖ్యపొంతనములు పరికించు తెఱంగును, షోడశచక్రక్రమంబును, మాతృ
కాధ్యానపూజావిధానంబును నివి మొదలుగాఁ గల కవితాలక్షణప్రపంచంబు వివ
రించెద నవధరింపుము.

60


మ.

పరరాజన్యచమూభిదుగ్రబలదీప్రస్థాన ప్రస్థాన[6]భా
గురుభేరీరవసంచలీకృతదిశాకుంభీన కుంభీనసే

శ్వరనీకాశవచఃప్రమోదితసుధీసంతాన సంతానఖే
చరకానీనసమానదానకలనాసన్మానసన్మానదా!

61


పంచచామరము.

దరాతికంపితాజిభూసదాపరాజయాంతభా
గరాతిరాజసుందరీకరాబ్జధూయమానచా
మరప్రకాండసంభవోగ్రమారుతప్రవృద్ధమా
నరౌద్రదుస్సహప్రతాపనవ్యహవ్యవాహనా!

62


క.

సితధారావిస్ఫురదసి, లతికాసంచలితముష్కరవిపక్షధరా
పతిజీవమారుత వజా, రతవిజయానందరంగరాయ శుభాంగా!

63


గద్యము.

ఇది శ్రీమదుమామహేశ్వరకరుణాకటాక్షలబ్ధసాహితీవిభవ ధర్మవెచ్చకుల
జలధికుముదమిత్ర శ్రీవత్సగోత్రపవిత్ర వేంకటకృష్ణార్యపుత్ర విద్వజ్జనమిత్ర కుకవి
విజనతాలతాలవిత్ర యార్వేలకమ్మనియోగికులీన లక్షణకవికస్తూరిరంగయనామ
ధేయప్రణీతం బైనయానందరంగచ్ఛందం బనులక్షణచూడామణియందుఁ బ్రథ
మాశ్వాసము.

  1. అన్నయ
  2. వాదాంగ; పాదాంగద
  3. ఈరెండుపద్యములు కవిసర్పగారుడములోనివని ఇక్కడ స్పష్టముగా ఉన్నది; గాని, వీటినే (కొద్దిగా పాఠభేదములతో) కవిజనాశ్రయములో సైతము చూచినాము (చూ. సంజ్ఞ. 58, 59) నిజముగా ఇవి ఎవరిపద్యములో తెలియదు.
  4. ఈరెండుపద్యములు కవిసర్పగారుడములోనివని ఇక్కడ స్పష్టముగా ఉన్నది; గాని, వీటినే (కొద్దిగా పాఠభేదములతో) కవిజనాశ్రయములో సైతము చూచినాము (చూ. సంజ్ఞ. 58, 59) నిజముగా ఇవి ఎవరిపద్యములో తెలియదు.
  5. నమరు
  6. భాం, కురు