ఆనందరంగరాట్ఛందము/పీఠిక

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ఆనందరంగరాట్ఛందము

పీఠిక



వక్షస్స్థలి ముద్దుగుల్కుచును ధాత్రీదేవి నీలాసతుల్
ఠీవిం గ్రేవల నొప్పు నిర్జరవధూటీకోటి సద్భక్తిచే
నేవ ల్సేయఁగ హర్షరీతిఁ గొలువై చెల్విందు లోకేశ్వరుం
డావిష్ణుం డొగిఁ బ్రోచుఁగాత దయతో నానందరంగాధిపున్.

1


ఉ.

తెల్లనికొండ యిల్లుగను దెల్లనిగిబ్బయె వారువంబుగాఁ
దెల్లనియేఱుఁ దాల్చికొని తెల్లనిమిన్కులవానిఁ బువ్వుఁగాఁ
దెల్లనిత్రాఁచు సొమ్ముఁగను దెల్లమిగాఁ గయికొన్నయట్టి యా
తెల్లనిసామి రంగనృపధీమణి కీవుతఁ గీర్తిసంపదల్.

2


చ.

ముదియును వారిలోనఁ గడుముఖ్యుఁడు ముందటిజాతిఱేఁడు ప్రాఁ
జదువులకాణయాచి పజసామి తనంతనె కల్గు మేటి నె
న్నుదుటను వ్రాయుసంప్రతి కను ల్దుగచౌకము గల్గువేల్పు స
మ్ముదమున రంగభూపతికిఁ బూర్ణతరాయు వొసంగుఁ గావుతన్.

3


సీ.

ఘనమహాపద్మవైఖరి నంఘ్రులు వహింపఁ గచ్ఛపమహిమ మీఁగాళ్లు గాంచ
మకరసంపదను వేమఱు జంఘ లింపొంద శంఖరీతి గళంబు సరవిఁ జెందఁ
బద్మరాగప్రౌఢిఁ బాణిద్వయము గేరఁ గుందవిస్ఫూర్తిఁ బల్కుదురు మీఱ
నిందీవరోన్నతి నీక్షణంబు లదల్ప నిలవైభవముఁ బెన్నెఱులు దాల్స


తే.

నాముకుందవక్షస్స్థలి నమరులక్ష్మి, ప్రకటమతి యౌవజారతరాయవిజయ
రంగ దానందరంగధరావిభునకుఁ, జెలఁగునవనిధు లిచ్చి రక్షించుఁ గాత!

4


సీ.

బలుతావి సుధదీవివలె ఠీవి గలమోవి పై దంతకాంతులు పరిఢవిల్ల
నునుగప్పుమసిచొప్పునను మెప్పు గలకొప్పు ననలకుఁ బుట్టిల్లుగను జెలంగ
సితధాముఁ డగుసోముగతి గోము గలమోము నను నవ్వువెన్నెల లెసఁగి కాయ
మరుతూపులను బాపు నెఱవైపు గలచూపులందు దయాదృష్టి చిందుచుండ

తే.

నీపరాశక్తికన్న వేఱెవరు మిన్న, గన్నవేలు పని విపన్నగణము లెన్న
హరునిసామేనుఁ గైకొన్నయయ్యపర్ణ, పూని యానందరంగేంద్రుఁ బ్రోచుఁగాత!

5


సీ.

నాలుకపై నటనము సేయుగజయాన పుస్తకరూప మై పొసఁగుచాన
భజన చేసినవారిపాలి కల్పకపల్లి యన్నిబాసలు తాన యైనతల్లి
మూఢునైనను జగత్పూజ్యుఁ జేయువధూటి యఖిలవర్ణాత్మక యైనబోటి
నిస్తులశోణమాణిక్యవీణాపాణి మత్తననప్రియమంజువాణి


తే.

వాణి శ్రీ నందగోపాలవంశజలధి, రాజతిరువేంగళేంద్రగర్భప్రశస్త
నవ్యమౌక్తిక మైనయానందరంగ, నృపమనోంబుజమున నెప్డు నిలుచుఁ గాత!

6


తే.

అనయమును దాను గజముఖుఁ డయ్యుఁ దండ్రి, యైన పంచాస్యుచేఁ బూజ లందినట్టి
గణపతి సమగ్రభోగభాగ్యంబు లొసఁగుఁ, గాత యానందరంగభూకాంతునకును.

7


వ.

అని ప్రార్థించి.

8


సీ.

ఆదిమ సుకవి భీమనకు దండము వెట్టి యన్నయభట్టుకు నర్థి మ్రొక్కి
యమరఁ దిక్కనసోమయాజికిఁ గేల్మోడ్చి కవిరాక్షసునకుఁ జోకఁ బ్రణమిల్లి
ఆలసాని పెద్దన కంజలి గావించి శ్రీనాథునకు రెండుచేతు లెత్తి
రంగనాథునకు సాష్టాంగంబు గావించి యలభాస్కరునికిఁ జోహారు చేసి


తే.

బాణ భవభూతి భారవి భాస కాళి, దాస దండి మయూరా ద్యుదారసుకవి
రాజిరాజత్పదాబ్జపరాగ మెలమి, మస్తకస్థలి ధరియింతు మహితభక్తి.

9


ఆ.

వాణి వేణిరీతి వన్నెగా మిన్నగాఁ, గలియఁ గూర్చు కవిత కవిత గాక
కసువ....నట్లు పస లేనికవితయుఁ, బలుకఁ గవిత యగునె పవిదె గాక.

10


ఉ.

ఒప్పును దప్పులేనికృతి యుగ్మలి...............తియొప్పునున్
దప్పును రెండు గల్గుకృతి దక్కఁగ హీనపునాతిజాతి యే
తప్పును లేక యొప్పుగను దార్కొనుసత్కృతి రూపరేఖలన్
జొప్పడుప్రోడ యౌ వయసు సుందరిరీతిగదా తలంపఁగన్.

11


వ.

అని యిష్టదేవతానమస్కారంబును సుకవిపురస్కారంబును గుకవితిరస్కారం
బును గావించి యెద్దియేనియు నొక్కదివ్యప్రబంధంబు నిబంధించన్ మది నెంచు
నవసరంబున.

12


సీ.

తనయుక్తి తనభక్తి తామరపాసను నతనితనూభవు నపహసింపఁ
దనకీర్తి తనమూర్తి దైత్యకులాంతకు నతనితనూభవు నటమరిం(టిం)పఁ
దనకల్మి తనబల్మి దాక్షాయణీభర్త నతనితనూభవు ననువుఁ గాంచఁ
దనవైపుఁ దనయేపు ధారాధరతురంగు నతనితనూభవుఁ బ్రతిభ మించ

తే.

ధరణి ప్రాంసుమహారాజదత్తమత్త, కరటిఘటఘోటకభటాదిఘనవిభూతి
ప్రబల శ్రీమద్వజారతరాయవిజయ, లాంఛనానందరంగధరావరుండు.

13


సీ.

అమితవిక్రము లైనహదురావు లొకచోట నొకచోట మత్తరాహుత్తవితతి
సరిలేక మితిమీఱుసరదారు లొకచోట నొకచోట రాయబారికసమాజ
మమరఁ గుంపినివర్తకావళి యొకచోట నొకచోటఁ దక్కునుద్యోగిజనము
ఘనధరామండలాఖండలు లొకచోట నొకచోట రాయనియోగిచయము


తే.

లొకట శాబ్దికతార్కికసుకవిరాజ, వందిమాగధగాయకవైణికభట
నటవిటులు గొల్వఁగా సమున్నతవిభూతి, రమణఁ గొల్వుండె నానందరంగవిభుఁడు.

14


వ.

వెండియు సముద్దండభుజదండమండలాగ్రఖండితారిభూమండలాఖండలశుండా
లకాండవరూధినీమండలుండును, మండలీకృతకోదండముక్తచండకాండదండి
తాభియాతిసమూహఢిల్లీశ్వరప్రముఖరాజన్యమూర్ధన్యమస్తకనిస్తులకోటీరకోటీ
రచితశోణమణిశ్రేణీవిరాజితపదరాజితప్రాంసుమహారాజేంద్రహృదయాను
గతచరత్కుంపినీప్రభువర్యసర్వకార్యనిర్వహణచణమనిషావిశేషుండును,
శేషశయనచరణారవిందమకరందతుందిలేందిందిరాయమాణమానసకథాభి
(కిడాంబి)శ్రీనివాసాచార్యవర్యపదభక్తివైభవుండును, భవనాంతరప్రవర్ధమాన
సామ్రాజ్యలక్ష్మీవిలాసభాసురుండును, సురధేనుమందాకినీమందారకుంచార
విందారిబృందారకాహారహారడిండీరతుషారక్షీరపారావారవారణాహితసితఘ
నాఘనఘనసారనారదపారదశారదాశరధరదరపురస్రహరగిరికులిశమరాళహరి
దంతకరిదంతనితాంతకాంతియశస్సమాక్రాంతభూనభోంతరుండును, తరతమ
ప్రజ్ఞావిచక్షణుండును, క్షణక్షణప్రవర్ధితోత్సాహబాహుళ్యుండును నగుచు నిగ
నిగమను మగఱాలనిగరాలజిగి చాలఁజాలుకొను జాళువారుటంపుబోదియలప్రోది
యలమించుపగడాలజగడాలకంబంబులు డంబుమీఱి విడంబించు నీరాజచందువుల
నందంబై చెలువొంది నిండుసరిగెబహతిపనిహర్వుజాలరులన్ జాలుకొని క్రొత్త
ముత్తియపుగుంపుల నింపఁజాలు తివాసులరతనంపుజతనంబుల మించు జలతారు
బారిమెఱుఁగుదిండ్లు బటువుబిల్లలు నుల్లసిల్లుకొల్వుకూటంబున సుఖాసీనుండై
సకలరాజాధిరాజపరివృతుం డగుపట్టాభిరామమూర్తితెఱంగున నిఖిలయాదవసమ
న్వితుండైన కృష్ణదేవునిఠీవిని సమస్తబృందారకసంసేవితుండైన దేవేంద్రునిచందం
బున నపారతారకాగణమధ్యభాసమానుం డగుపూర్ణచంద్రునియోజం దేజరిల్లుచు
నొకయెడ జాతామిత్రు లగుమిత్రులును, నొకచెంతఁ బురోహితు లగుపురోహితు
లును, నొకచాయ గాయకులగు గాయకులును నొకదండఁ బండితు లగుపండితులును,
నొకయోర నర్థులగు నర్థులును వెలయ నొకక్రేవ నిజకీర్తిప్రతాపదీపితగద్యపద్యా

త్మకదివ్యప్రబంధంబుల వందిబృందంబు కైవారంబు సేయ నొకఠేవ భావభవశాస్త్ర
ప్రవీణ లగుగణికామణికాగణంబులు స్వాభావరీతి సభారమ్యంబుగ నృత్యగీతవా
ద్యాభినయంబు లభినయంబుగా మెరయింప నొకచక్కి రాయసము లగు రాయస
ములును, నొకవంకఁ బ్రవర్తకు లగుప్రవర్తకులును, నొకచోట నిష్కపటవంతు
లగునిష్కపటవంతులును, నొకపొంత మహదాశుచిత్రవిస్తారశ్లేషావిశేషాధికసా
హిత్యంబులు కవిరాజులు ప్రకటింప నొకయిక్కఁ బరమపావనరామాయణభారత
భాగవతాష్టాదశపురాణేతిహాసప్రసంగనిగూఢార్థతత్పరతావాదప్రతివాదంబులు
సేయుశాస్త్రజ్ఞు లెసంగ నొకదాపున బహువిధసమరనిపుణతాసహానుశూరవజీర
సందోహంబును, నొకచేవ నప్పాజి భట్టి యుగంధరాదిమంత్రిమూర్ధన్యప్రతి
మానమనీషావిభవాప్రతిమానమానభాసమాను లగునమాత్యశేఖరులును, నొక్క
దిక్కున నటవిటభటపరిహాసికవైణికవైతాళికప్రముఖపరివారంబును యథాస్థానం
బులం బరివేష్టించి కొలువ భూలోకదేవేంద్రునిచందంబున వైభవోన్నతుఁడై పేరో
లగంబునఁ గొలువుండి.

15


మ.

నను శ్రీసాంబపదాబ్జసేవకు నపర్ణాపూర్ణకారుణ్యభా
జనసంశీలుఁ జతుర్విదాంధ్రకవితాసల్లక్షణగ్రంథశో
ధనధీసంయుతు భావగర్భపదపద్యాళిప్రబంధానుబం
ధనుని గస్తురిరంగసత్కవిని జెంతం బిల్చి నెయ్యంబునన్.

16


మ.

కవితాధోరణి నెన్న నీవలె సమగ్రఖ్యాతి గైకొన్నవా
రవనిం బ్రౌఢు లనేకు లొప్పెదరు వార ట్లెంద ఱున్నన్ భవ
త్కవితల్ భద్రకరంబు లయ్యె నదిగాకన్ మాకుఁ బట్టంపుస
త్కవి వీవైతివి గావునన్ బుధమణీ కస్తూరిరంగాగ్రణీ!

17


క.

అబ్బురముగ నీచే నొక, కబ్బము గావించి దానిఁ గైకొని కీర్తుల్
జొబ్బిల నందఱితో నను, గబ్బిగఁ బాలన మొనర్తుఁ గడు ముద మొదవన్.

18


తే.

సప్తసంతానములను శాశ్వతయశంబు, దనరఁజేయును సత్ప్రబంధంబు గాన
గరిమతో నొకలక్షణ గ్రంధమును మ, దంకితమ్ముగ రచియింపు మనుచుఁ బలికి.

19


వ.

సగౌరవంబుగా సన్మానించి పనిచిన నమందానందంబు డెందంబున సందడింప మం
దిరంబునఁ జేరి మదంతరంగంబున.

20


క.

భువనోపకారముగ నను, నవముగ నాపేర లక్షణగ్రంథమునున్ (నునన్)
వివరింపు మనుచుఁ బలుకుట, సవరణ నేఁ జేయుసుకృతసారము గాదే!

21


వ.

కావున నాదిమకవిభీమనప్రభృతులు గావించినదశవిధచ్ఛందంబులు, లక్షణకావ్యం
బులుం గ్రోడీకరించి యందునఁ గలసారం బంతయు లక్షణంబుగాఁ గైకొని కాళి

దాసాదిగీర్వాణకవులు నన్నయభట్టప్రముఖాంధ్రకవులు గావించిన మహాకావ్యం
బులందు లక్ష్యంబులు వివరించి సకలకవిసమ్మతంబుగా నానందరంగచ్ఛందం బను
లక్షణగ్రంథంబు విస్తరించెద.

22


తే.

ననలతోఁ గూడి వాసించు నారరీతి, శంఖమునఁ గూడి తీర్థ మౌ జలముభాతిఁ
బూర్వసుకవీంద్రసాహిత్యములను గలసి, నేను రచియించు సాహితి నెగడకున్నె?

23


వ.

అని యింతిం తనరానిసంతసంబున నజారతరాయవిజయానందరంగరాయచక్రవర్తి
పేర నంకితంబుగ ఛందంబుఁ బొందింప నుద్యుక్తుండ నగుటంజేసి తత్కృతిపతి
వంశావతారం బభివర్ణించెద.

24


సీ.

ఏదేవదేవునిపాదపరాగంబు శిరసావహించు నిర్జరసమూహ
మేమహామహుదివ్యనామకీర్తనములు భజన గావింతురు పరమమౌను
లేస్వామిశుభమూర్తి నీక్షింప మదిఁ గోరి కమలజప్రముఖులు నెమకుచుందు
రేదయానిధియసాంగేక్షణం బాశించి వ్యాసాదిసద్భక్తు లాశ్రయింతు


గీ.

రట్టిపురుషోత్తమునిఁ బరమాత్ముఁ డైన, కృష్ణదేవుని సుతునిఁగాఁ బ్రేమఁ బడసి
బలిమిఁగలిమిని మించి వ్రేపల్లెనుండు, నందుఁ డొకనాఁడు సంతతానందుఁ డగుచు.

25


సీ.

శ్రీకృష్ణమూర్తి నీక్షించి మించినభక్తిఁ "బరమాత్మ జగదీశ భక్తవరద
నీ విట్లు వసుదేవదేవకీదేవులకడుపునఁ బుట్టి నా కొడుకు వనఁగ
నమరి సమస్తలోకములను సత్కీర్తి యొనరఁజేసితివి యింకొక్కమనవి
యున్నది నీవు సమున్నతప్రేమ మద్వంశంబున జనింపవలయు” ననుచు


తే.

నెలమిఁ బ్రార్థింప నట్టులే కలియుగమున, నవతరించెద నని చాల నాదరించి
పలుక నానందుఁ డుల్లంబు పల్లవిల్ల, నల్ల వ్రేపల్లె శ్రీ లుల్లసిల్ల వెలసె.

26


క.

ఆతనిమనుమలు భువన, ఖ్యాతభుజాబలవినిర్జితారాతిధరి
త్రీతలనాథులు కొందఱు, నూతనరాజ్యపరిపాలనోత్సుకు లగుచున్.

27


తే.

ప్రబలి తమకు విభాగసంప్రాప్త మగుచు, నెగడు మంజీరవాణీమణీతటాక
మంచితనిజోత్తమాంగంబు లను పురత్ర, యమును నేలుచు నుండిరి హర్షమునను.

28


క.

అం దగ్రవంశజుఁడు గో, విందనృపతి యయనపురము వెస నేలుచు శ్రీ
లంది యంశంబొంది విజయ, నందనుఁ డనుపేర వెలయునందనుఁ బడసెన్.

29


ఇట్లు పడసిన యాకుమారశ్రీముఖుఁడు దినదినప్రవర్ధమానుండై, చతుష్షష్టివిద్యా
విశారదుఁడై సకలశుభలక్షణలక్షితుండయి తేజరిల్లుచు నొక్కనాఁడు మృగయా
వినోదంబుగా వనాంతరంబునకుం జని యచ్చట విహరించుసమయంబున.

30

సీ.

ఘనుఁడు విద్యారణ్యుఁ డనుపుణ్యపురుషుఁడు, బహుళతరైశ్వర్యపదవిఁ గోరి
పరదేవతోపాస్తి బహుకాల మొనరింప, నయ్యంబ ప్రత్యక్షమగుచు నీదు
కోర్కె లీడేర్తు నింకొకజన్మమున కంచుఁ, బలికిన వ్యాకులపాటుఁ జెంది
సన్న్యసించినను దత్క్షణమున నాదేవి, సాన్నిధ్యమై మహైశ్వర్యసమితి


తే.

బలిమి నొసఁగినఁ జింతించి తెలివిఁ గాంచి, విజయనగరాఖ్యపురము గావించి మించి
దీనిఁ బాలించుటకు యోగ్యుఁడైన నమ్మేటి, యెవ్వఁడో యనియాత్మలో నెంచుచుండ.

31


తే.

అమ్మహారణ్యసీమ వేఁటాడు విజయ, నందనునిఁ జూచి యతని నానగరమునకు
శ్రీకరంబుగఁ బట్టాభిషిక్తుఁ జేసి, విజయనందనరాయ లన్ పే రొసంగె.

32


చ.

అతఁడు సమస్తభూమివలయం బనవద్యవిశేషనీతిప
ద్ధతిఁ దగ నేలుచుం గుటిలదర్పవిరోధివరూధినీహిమ
ప్రతతి సహస్రభానుఁ డనఁ బ్రస్తుతికెక్కి మనోజ్ఞభాషియై
శ్రితజనపోషియై ప్రజజఁ జేకొని ప్రోచెను వన్నెవాసిగన్.

33


సీ.

ఆమహామహునకు రామచంద్రాఖ్యరాయలు పుట్టె నతనికి నెంచ (యంబ) దేవ
రాయ లావిభునకు రాజశేఖరరాయ లానరేంద్రునకు గోళనరసింహ
రాయ లతనికి శ్రీరామచంద్రేశుఁ డాఘనునకు లాంగూలగజపతీంద్రుఁ
డతనికి గరుడమహాదేవరాయ లాధీరున కచ్యుతదేవరాయ


తే.

లాయనకు వీరనరసింహరాయనృపతి, చంద్రు లుదయించి రందఱు ఛత్రపతులు
చక్రవర్తులు నై ధరాచక్ర మేలి, మేలుఁగాంచిరి ప్రజలు మేల్మే లనంగ

34


సీ.

ఆవీరనరసింహభూవరుపట్టంపురాణి లక్ష్మమయందు రామదేవ
రాయలు తిరుమలరాయలు శ్రీరంగరాయ వేంకటపతిరాయఘనులు
హేమంతరాయ లీయేవురు పుట్టిరి యడపకత్తైనదీపాలియందుఁ
గృష్ణరాయలు పుట్టి కీర్తిగా నప్పాజి యనుమంత్రిఁ గూడి


తే.

యశము రెట్టింప బంధువు లనుమతింపఁ, దొలుతఁ చెప్పిన యేవురుదొరలు కొంత
సీమ కధిపతు లై రందు రామదేవ, నృపతిమణి చంద్రగిరిదుర్గ మేలుచుండె.

35


క.

ఆరామదేవరాయధ, రారమణునకున్ దివాకరసముద్యుతి మై
మీఱి కళాధరుఁ డనెడుకు, మారుఁడు జనియించె వంశమండనుఁ డగుచున్.

36


చ.

లలితగుణాభిరాముఁ డకలంకయశోవిభవుండు సింహస
ద్బలుఁడు కళాధరుండు తమతాతలనాఁటిమిరాశి యై సము
జ్జ్వలబలరాశియో యనఁగఁ బట్టణరాజ్యముఁ జేరి యచ్చటం
జెలువుగ రాజ్యపాలనము సేయుచునుండె ననేకవర్షముల్.

37

క.

నెరయోధ తదీయకళా, ధరునకుఁ గౌముదికి గర్భదారకుఁ డనఁగా
వరపుత్త్రుఁ డొకఁడు పుట్టెను, గరికలభముఠీవి బలవికాసప్రౌఢిన్.

38


వ.

అతఁడు దినది ప్రవర్ధమానుండై నిఖిలవిద్యానిధానుండై వదాన్యగుణవిభాస
మానుండై యయననగరము పాలించుచుండెఁ దదీయుకీర్తి నిఖిలదేశంబుల నిండి
మెండుకొనినం జూచి కుముదుండు మొదలుగాఁ గలకవిదిగ్గజంబు లెనమండ్రు
గోలకొండనుండి వెలువడి యాగర్భదారకనృపాలుని రాజధాని యైన యయన
పురంబుఁ జేరి నగరివాకిట వచ్చునెడ నందు వడ్లకణజంబు ముందఱఁ జిందియున్న
ధాన్యం బేర్పఱించు నేర్పరియే గర్భదారకుం డని యచ్చటివారలచే నెఱింగి యిట్టి
వాఁడు మన కేమి త్యాగ మీయఁబోయెడి నెందుకు వచ్చితిమని మంతనంబునం
గొంతచింతించి యంతలో నిసుమంఠ దిటవు దెచ్చుకొని యతనిచెంతం జేరి యాశీర్వ
దించిన రాజన్యమూర్ధన్యండు వారియంతరంగం బెఱింగి చిఱునవ్వు నవ్వుచు
యవ్విద్వన్నికరంబును దనయంతఃపురంబునకుం దోడ్కొని పోయి రంగులరారు
బంగారుపళ్ళెంబులఁ జిరత్నంబు లగునవరత్నంబు లుంచి వేఱువేఱ వడ్డించి భుజి
యింపుఁ డని యుపచరించిన నయ్యర్థు లతని సమర్థతకు హెచ్చుగా మెచ్చినంజూచి
యనంతరంబ పడ్రసోపేతంబుగా భోజనంబుఁ జేయించి వలయుధనకనకవస్తు
వాహనభూషణాంబరంబులు బహుమతు లొసంగి యెసంగినప్రేమను వీడ్కొలి
పిన వార లుప్పొంగి.

39


సీ.

శిబినృపాలుఁడు ఘనశ్రీమంతుఁడై నుండి తూఁచియిచ్చినయట్టికోఁచఁదనము
వైరోచనుఁడు చక్రవర్తియై యుండియుఁ గొలిచి యిచ్చినయట్టిపలుచఁదనము
పుడమిలో ధారాధరుఁడు ఘనుఁడై యుండి మొలులు నెట్టటుయిచ్చుములుచఁదనము
నెరదాత యనుపేరఁ బరఁగి రాధేయండు బదులుకు బదులిచ్చుపరుసుఁదనము


తే.

సారె నిందించి నీకీర్తి సన్నుతించు, వారికిని వారి .... యవ్వారిగాను
ధన మొసంగెడుదాతలదాత వీవె, ప్రకటగుణశీల గర్భదారకనృపాల!

40


చ.

ఇఁక నిటువంటిదాత గలఁడే త్రిజగంబులలోన నెన్నఁగా
సకలగుణాభిరామ యని సారెకు సన్నుతిఁజేసి గోలకొం
డకుఁ జని గర్భదారకుగుణాతిశయంబుల నెల్ల మేలు త
ప్పక మకరాంకభూపతికిఁ బల్కిన నాతఁడు సంతసింపుచున్.

41


తే.

గర్భదారకుఁ బిలిపించి గారవించి, ఛత్రపతి యనుపేరును వేత్రపురము
కోటిరాజ్యంబు రథరథ్యకుంజరములు, సన్నుతు లొసంగి పనుప నుత్సాహలీల.

42


ఉ.

వేత్రపురంబుఁ జేరి కడువేడుక మీఱఁగ దానధర్మముల్
పాత్ర మెఱింగి సేయుచు నపారయశంబును గాంచి యెంతయుం

బుత్రులులేమి డెందమునఁ బొక్కుచు నుండెడు గర్భదారక
చ్ఛత్రపతిక్షమాపతికి సారసనేత్రుదయాసమగ్రతన్.

43


క.

శ్రీలక్ష్మమాంబయం(దలి)దురు, శోలయనరనాథశౌరి సూనృతభాషా
శీలుఁడు వడమలధరణీ, పాలుఁడుఁ దిరుమలవిభుండు ప్రభవించి రొగిన్.

44


వ.

అందు.

45


సీ.

సకలజనామోదచర్య వాక్యప్రౌడి నేదాత యాధాత నెగ్గులాడుఁ
గమనీయరూపరేఖావిలాసస్ఫూర్తి నేభర్త శ్రీభర్త నెదురుచూచు
నసమానతరసమగ్రైశ్వర్యవిఖ్యాతి నేరాజు రారాజునే పణంచుఁ
విమలతేజోవిభాసమానోన్నతి నేయినుం డాయినుచాయఁ దెగడు


తే.

నట్టి శ్రీనందగోపవంశాబ్ధిచంద్ర, గర్భదారకనంరలగర్భశుక్తి
మౌక్తికం బైనశోలయమహితలేంద్రు, సుగుణముల నెవ్వరికి నైనఁ బొగడవశమె.

46


తే.

అట్టినెరయోధ యగుశోలయాధిపతికి, శ్రీమదలమేలుమంగావధూమణికిని
బొమ్మయప్రభుఁ డుదయించి భోగభాగ్య, గరిమ సరిమన్నెదొర లెన్న ఖ్యాతిఁ గాంచె.

47


చ.

వెలవెలఁ బోక యప్పుగొని వృద్ధిని జెందక మూలవస్తువున్
లలి భువిఁ బాఁతుకోకను ఫలావధి నొందక ని(ల్చి)చ్చి యిచ్చి యా
కులపడకుండెనేని యొకకొంత సమం బగుఁ గల్పకం బిలన్
వెలయఁగ బొమ్మయప్రభుని విస్ఫుటదానకలావిభూతికిన్.

48


వ.

అని జనులు వొగడ ఖ్యాతినిం గాంచి.

49


క.

నయనమ్మయందుఁ గనియె, న్నయనోత్సవ మొంద సుతుల నయముగఁ బెదబొ
మ్మయనరనాథుని చినబొ, మ్మయధీరునిఁ గదనశూరు నమితోదారున్.

50


సీ.

ఆచిన్నబొమ్మనృపాగ్రణిగర్భాభిచంద్రుఁడై బొమ్మయక్ష్మాధవుండు
నయనప్రభుండు కృష్ణఘనుండు వర్ధమానావనిపతి రామధీవరుండు
లక్ష్మీనృపాలలలామం బనఁగ నిట్టిపుత్త్రు లాఱుగురును బుత్త్రి యైన
మంగళావతి పుట్టి మహిఁజాల వర్ధిల్ల నం దగ్రజుఁడు బొమ్మయాధిపతికి


తే.

జాయ యై తగురామానుజమ్మ యందు, వేంగడవిభుండు శ్రీతిరువేంగడేంద్రు
డనఁగ నిద్దఱుసుతులు మంగమ్మ యనెడు, తనయ జనియించి 'కాంచిరి ఘనయశంబు.

51


క.

ఠీవిని నావెంగడధా, త్రీవిభునకు నందనులుగఁ దిరుమలఘనుఁడున్
గోవిందనృపతి వెంగడ, భూవరు లుదయించి రమితభుజబలు లగుచున్.

52


తే.

చతురుఁ డౌతిర్మలధరాధిపతికి వేంక, టాచలనృపాలశేఖరుం డవతరించె
మఱియు గోవిందనరనాథమణికి రంగ, సామి జనియించెను గుణాభిరాముఁ డనఁగ.

53

వ.

ఇంతకు మున్ను వివరించి యున్న బొమ్మనృపాలక రామానుజాంబికాగర్భశుక్తిము
క్తాయమానభవ్యగాత్రుండును, సకలజనమిత్రుండును, బుణ్యచారిత్రుండును,
నైనతిరువేంగడధరణీరమణుండు శుక్లపక్షసుధాకరునిచందంబున దినదినప్రవర్ధమా
నుండై రాజాధిరాజపూజనీయుం డై తేజరిల్లుచు.

54


సీ.

నీలకంధరురీతి నీలకంధరుభాతిఁ దనదానవిభవంబు ఘనతఁ గాంచ
రాజరాజును మీఱి రాజరాజును గేరి తనమహైశ్వర్యంబు ఘనతఁ గాంచఁ
జిత్రభానుని గెల్చి చిత్రభాను నదల్చి తనవిక్రమోన్నతి ఘనతఁ గాంచ
హరినందనుని మించి హరినందను హసించి తనమోహనాకృతి ఘనతఁ గాంచ


తే.

నందగోపాలవంశరత్నాకరైక, పూర్ణచంద్రాయితాంగవిస్ఫూర్తి బొమ్మ
యావనిపాలరామానుజాంబికాత, నూజుఁ డగుతిరువేంగడేంద్రుండు వెలయు.

55


సీ.

అసురగురుం డైన నాతనిదెస కేగి యనుసారిగా మాటలాడఁ గలఁడె
చతురాననుండైన నతినిచమత్కృతి కింతైన నుత్తరం బీయఁగలఁడె
యలబృహస్పతియైన నతనియోజనరీతి దీర్ఘదర్శితఁ గని తెలుపఁగలఁడె
యాదిశేషుండైన నతనివాగ్ధాటికిఁ బ్రతిపోటిగా నిల్చి పల్కఁగలఁడె


తే.

యెంతమతి యెంతచతురతవయెంతయుక్తి, యెంతవాక్ప్రౌఢి యని జనులెల్లఁ బొగడ
నెగడెఁ దిరువేంగళేంద్రుండు జగతిలోని, భూపమాత్రుఁడె యవతారమూర్తి గాక.

56


సీ.

తీరనివ్యాజ్యము ల్తిరుగుపూనుచు యుక్తి తీరనితగువులు దీర్చుశక్తి
యెటువంటిదొర నైన నెంతలేదనుపద్దు ఫ్రాంసుభాషను కథ ల్పల్కుముద్దు
సమయోచితముగ నీసభలఁ బల్కెడునేర్పు హితులనేరములు సహించునోర్పు
తనకుఁ బ్రియోక్తు లందఱుఁ బల్కఁదగువీఁక పురుషసింహ మనంగఁ బొసఁగుడాక


తే.

గాంచి యిలఁ జా(ల)తిదొరల మెప్పించి మించి, కవులఁ దనియించి చుట్టాల గారవించి
యహితుల నణంచి దిక్కుల యశము నించి, ప్రబలు శ్రీతిరువేంగడప్రభుకిరీటి.

57


వ.

ఇవ్విధంబున మహాయోగశాలి యై ప్రాంసుహింగ్లీజుదినమార్గయొలందాయం పరు
దొరుపురతకేశు మొదలయిన జాతిభాషావిశేషంబులఁ బ్రవీణతఁ గాంచి యాయా
జాతిఫాదరులకుం దెలియనిగూఢార్థంబులఁ దెలియఁజేసి వారిచే మేలు మేలని
పొగడికలు గాంచి యితరమతంబుల మర్మకర్మంబులన్నియుఁ బరిశీలించి జ్ఞాననిధు
లయిన సకలకలావల్లభసన్నిభులగు తోటరమల్లు ప్రముఖులకు విశదపడనిభావార్ధం
బుల మాటమాత్రంబున నాటలవలెఁ దేటపఱిచి బుద్ధి మూర్తీభవించినట్లు ధైర్యంబు
సాక్షాత్కరించినట్లు, చాతుర్యంబు రూపంబు గైకొన్నట్లు నీతి యాకృతిం దాల్చి
నట్లు దేజరిల్లి పరేంగితజ్ఞానంబును, దారతమ్యవిమర్శనంబును ఘటనాఘటన
సామర్థ్యంబును నుచితానుచితకార్యవివేచనంబును గలిగి యవ్యాజపరోకోపకార

మూర్తియై దిగంతపరివ్యాపితవిశాలకీర్తియై ప్రవర్తిల్లునమ్మహాపురుషునిప్రభఁ జూచి
సైరింపఁజాలక ప్రాంసుకుంపినీ కార్యధురంధరుం డైన [1]జంన్రాలు పట్టంబునుం
బూని దొరతనంబు సేయు ముశియనె జన్రాలు కొన్నికుచోద్యంబులు సేసి నా
నాఁట హెచ్చుగా మచ్చరించిన నాజడ దెలిసి యేవిధంబున నైన నితని మట్టు
వెట్టెదనని యెంతయుం బంతగించి సీమకు సూత్రంబులు పన్ని లక్షాంతరంబులు
కర్చుచేసి విస్తారంబుగా దస్తరంబులు వ్రాయించి ప్రాంసురాజన్యున కాజంన్రాలు
దుర్వ్యాపారంబు లెఱింగించి తత్క్షణంబునం బదులుదొరను రప్పించి యాతని
చేత నాముశేయే చెరను వానిఁ బట్టి కట్టించి కొట్టించి గిడ్డంగిన వేయించి తనమనం
బునం గలచలం బంతయుఁ దీర్చికొని పద్దు చెల్లించితి వని యెల్లవారలుం గొనియాడఁ
గుంపిని(ణి)కి ముఖ్యమంత్రియై యవతారపురుషుం డనఁదగిన ముశేను నంతటిదొరచేత
మెప్పులొందుచుఁ బెంపొందిన జూచి నవాబులు, సంస్థానపతులు, సాఁటివారలు
వర్తకులు నాశ్చర్యంబునం బొదలి యిట్లనిరి.

58


సీ.

[2]జాతికొంసేలు మేజాపల్కపైఁ గొట్టి లీల నేఘనుఁడు చెల్లించుకొనియె
సీమమట్టు ఫిరాదు చేసి దస్త్రాల్ వ్రాసి యేతంత్రి [3]కపితాను నెత్తఁ గొట్టెఁ
డగఁబ్రాంసుదొరలతోఁ దగవుల కేర్పడి యేదిటవరి నిర్వహించి మించెఁ
గరితోరుపట్నాలు గలుగుమంత్రులలోనఁ జెలఁగి యేమేటి ప్రసిద్ధిఁ గాంచె


తే.

సకలభాషలు మాటాడఁ జదువ వ్రాయ, నిపుణత వహించి యెవ్వఁడు నెగడ జగతి
నట్టితిరువేంగళేంద్రుగుణాతిశయము, లెలమిఁ బన్నగపతి కైన నెన్న వశమె?

59


సీ.

ఏతంత్రి యుజ్జ్వలశ్వేతాతపత్రంబు పరితాపమును జేయుఁ బగతురకును
నేజనపాలుని తేజంబు చీఁకట్లు గ్రమ్మించు రిపుకోటికన్నుఁగవల
కేనెరయోధసు దానఘనుం డధికము సేయు వైరిశోకానలంబు
నేమంత్రి సత్కీర్తి పోముఁ డించిం(కిం)చు నిర్ణిద్రారిసేనాసముద్రములను


తే.

జగతి నేమేటి నెరడాక సాటియైన, మంత్రులకు గుండె గాలంబుమాడ్కి దనరు
నట్టితిరువేంగడేంద్రుదీ టైనయోధ, కలుగ నేర్చునె మూఁడులోకములయందు.

60


క.

అతనికులపాలికామణి, పతిభక్తివిశాల బంధుపరిపాల యరుం
ధతిసదృశశీల బుధస, మ్మతసద్గుణజాల లక్ష్యమాంబిక వెలయున్.

61


చ.

సతిపతు లిద్ద ఱెంతయును సం(తతి)పద గాంచు తలంపునన్ మహా
వ్రతములుఁ దీర్థయాత్రలుఁ దపంబులు బ్రాహ్మణపూజయున్ శివా
యతనిలయంబులున్ వనచయంబులు సత్రము లగ్రహారముల్
వితతతటాకపాళి చలివెందర లచ్చపుభక్తి సేయఁగన్.

62

వ.

ఇవ్విధంబున నవ్వధూవరులు సుపుత్రులఁ బడయుటకై కావించువూజల శ్రీ
కృష్ణమూర్తి సంతసిల్లి తొల్లి నందునికులంబున నవతరించెదనని యతనికి వరం
బొసంగినవిధంబు దలంచి యీతిరువేంగడనాథునకు అమ్మమాంబికకుఁ గూర్మి
నందనుఁడనై యుద్భవింతుంగాక యని నిశ్చయించి.

63


మ.

క్షితిలోఁ గోసలరాజవర్యుసుతకున్ శ్రీరాముఁ డాపార్వతీ
సతికిన్ శక్తిధరుండు గల్గుగతి గృష్ణస్వామి విఖ్యాతిగా
నతులప్రౌడిని లక్ష్మమాంబసుతుఁ డై యానందరంగక్షమా
పతిచంద్రుండన నుద్భవించెను గలాభాగప్రపూర్ణాకృతిన్.

64


క.

అతనికి సహోదరుం డై, మతిధృతి వితరణకళాచమత్కారమహో
న్నతుఁడు తిరువేంగడమహీ, పతి యుద్భవ మై చెలంగె బాలార్కుక్రియన్.

65


సీ.

ధైర్యంబు సంతతౌదార్యంబు శౌర్యంబు గాంభీర్యచాతుర్యకౌశలములు
మతి శక్తి ఘనయుక్తి మధురోక్తి పితృభక్తి యుచితజ్ఞతయు నీవి యోర్పు నేర్పు
దాక్షిణ్యమును జల్లఁదనము చక్కదనంబు రసికత యాశ్రితరక్షకతియుఁ
దారతమ్యప్రౌఢి తంత్రంబు శీలంబు సత్యవాక్యోన్నతి చలము బలము


తే.

నుగ్గుతోఁ బాలతోఁ దల్లి యొనరఁ గూర్చి, ప్రేమ నల్లారుముద్దుగాఁ బెంచినట్టు
లఖిలసుగుణాభిరాముఁ డై యనుదినంబుఁ, బ్రబలె నానందరంగభూపతికిరీటి.

66


చ.

తెలివికిఁ బుట్టినిల్లు జగదీశుల కెల్లను మేలుబంతి వి
ద్యల కొరగల్లు తాలిమికిఁ దావు వదాన్యతకున్ నిధాన మా
ప్తులకును మెట్టపంట కవిభూసురవాటికి గల్పవాటి యై
కలియుగకృష్ణమూర్తి యనఁ గాంచెను రంగవిభుండు కీర్తులన్.

67


సీ.

శ్రీవిష్ణునంశచే నావిర్భవము చెందుకతమున శ్రీరంగపతి యనంగ
సర్వజనానందసంఛాయి యగుటచే నెలమి నానందరంగేంద్రుఁ డనఁగ
లఖిలదిక్కుల విజయముఁ గాంచగా విజయానందరంగభూజాని యనఁగ
మెచ్చి పాచ్చా కితా బిచ్చుటచే వజారత వజయానందరంగరాయ


తే.

అనఁగ బౌరుషనామధేయముల వెలసి, శుక్లపక్షసుధాకరస్ఫూర్తిగాను
దినదినంబున కమితవర్ధిష్ణుఁ డగుచుఁ దేజరిల్లును దులలేని రాజసమున.

68


సీ.

బంగారుకొండ దా ముంగిట నమరెనో సురభూజరాజంబు పెరటిచెట్టొ
శ్రీరామమాడనించితము గానున్నదో కామధేనువు దొడ్డిఁ గట్టినాఁడొ
రసవాదశక్తి కరస్థలామలకమో తఱుచునిక్షేపంబు దొరకినదియొ
తగధనాంజనవిద్యఁ దా నేర్చుకొన్నాఁడొ స్పర్శవేధియు బొక్కసమునఁ గలదొ

తే.

కాకయుండిన విటులు లక్షలకొలంది, నిచ్చి యర్ధులఁ దనియింప నెవరిశక్య
మని జనంబులు దనకీర్తి వినుతిసేయఁ, బ్రబలు జితవైరి యానందరంగశౌరి.

69


శా.

ఆంతం జెంగలిపట్టునం దనరు శేషాద్రీంద్రుసత్పుత్రి యౌ
కాంతారత్నము రూపవిభ్రమకళాకారుణ్యదాక్షిణ్యవి
శ్రాంతిన్ లక్ష్మిని మించు సద్గుణసమాజన్ మంగతాయీసతిన్
సంతోషంబునఁ బెండ్లియాడె విభవైశ్వర్యంబు లుప్పొంగఁగన్.

70


సీ.

సదమలపతిభక్తి సాక్షాదరుంధతి యసమానగుణముల నాదిలక్ష్మి
దీనుల పాలిటి దేవతారత్నంబు నన్నదానప్రౌఢి నన్నపూర్ణ
యాశ్రయించినవారి కమరునిక్షేపంబు పొలుపొందునోర్పున భూమిదేవి
కొనియాడువారికిఁ గొంగుబంగారంబు బంధుజనములకుఁ బారిజాత


తే.

మనుచు జను లెల్ల వేనోళ్ల నభినుతింప
సత్యమును ధర్మమును బద్దుఁ జల్లఁదనము
దయయు దాక్షిణ్యమును బూని ధరను బ్రబలు
మాననికురుంబ యలమేలుమంగమాంబ.

71


సీ.

కన్నులా చిన్నారిపొన్నారికి బిడారు చూపులా కరుణకుఁ బ్రాపు దాపు
పలుకులా సత్యసంపదలకుఁ బుట్టిలు గుణములా యమృతానకు నిలయంబు
వితరణమా సదావిశ్వవిఖ్యాతంబు శీలమా లోకప్రసిద్ధికరము
చిత్తమా బహుధర్మచింతనాయత్తంబు పుణ్యమా సౌజన్యమునకుఁ దావు


తే.

నగుచు నేసతీమణికిఁ జెన్నలరు నట్టి, శ్రీ మదలమేలుమంగమ్మ చెయ్యివట్టి
నదిమొదలు ప్రాజ్యసామ్రాజ్యపదవిరంగ, భూపతికి నాఁడు నాఁటి కుప్పొంగుకున్నె.

72


సీ.

పెండ్లియాడిన మొదల్ పెనిమిటి కైశ్వర్య మధికమై వెలసినయతిశయంబు
చేపట్టినది మొదల్ చెలువునకును గీర్తి విస్తరిల్లుచు వచ్చు విస్మయంబు
బొట్టుగట్టిన మొదల్ పురుషునకును మండలాధిపత్యము వచ్చు నద్భుతంబు
చేకొన్నయది మొద ల్చెలఁగి భర్తకు దొరా దొరలెల్ల స్వవశులై పరఁగువింట


తే.

యింతయని కొనియాడ నెవరివశము, మహితలక్షణవతి యైన మంగతాయి
యాదిలక్ష్మియె నిజము కాదనిన నెట్లు, రంగశౌరికిఁ బట్టంపురాణి యగును.

73


క.

అని జనములు దనుఁ బొగడఁగ, ఘనతరగోభూహిరణ్యకన్యాదానా
ద్యనుపమదానంబులు భ, క్తిని భూసురకోటి కొసఁగి కీర్తిఁ జెలంగున్.

74


వ.

అంత.

75


గీ.

సీమలోనుండి ఫ్రాన్సురాట్శేఖరుండు, పసిఁడిబెత్తంబు భూషణాంబరము లనిచి
కుంపినిదుబాసితన మీయ సొంపుమీఱి, రహి చెలఁగమీఱి యానందరంగశౌరి.

76

సీ.

విసువక యేవేళ విషదవృత్తి భరించు కులపర్వతంబులకొలఁది యెఱిఁగి
చెదరి మూలకుమూలఁ జేరినహరిదంతదంతావళంబులఁదారిఁ జూచి
యెన్నాళ్లకును దల లెత్తనేరకయుండు పన్నగవల్లభు బలిమి గాంచి
సతతంబు తా నధోగతఁ బడియున్నట్టికచ్ఛపప్రభునియోగ్యత గణించి


తే.

లీల సర్వంసహారమణీలలామ, శ్రీ నజారతరాయఁ డై చెలఁగువిజయ
రాజితానందరంగవీరాగ్రగణ్య, పటుభుజాస్తంభమున నిల్చి ప్రమద మొందె.

77


వ.

తదనంతరంబ.

78


సీ.

సదమలాచారంబు సత్యవాక్యప్రౌఢ యమర చెల్వొందు లక్ష్మాంబ యనఁగ
దయయు దాక్షిణ్యంబు ధారాళగుణముచే హవణిల్లు కఠినస్వర్ణాంబ యనఁగ
అమరిక బుద్ధి శీలము నోర్పు నేర్పుచేఁ దెలివొందుజానకీదేవి యనఁగ
హరిభక్తి గురుభక్తి యాశ్రితావనశక్తిఁ బరఁగి శ్రీ త్రిపురసుందరి యనంగ


తే.

నలుగురు సుపుత్త్రికలు తదానందరంగ, రాయశేఖరునకు మంగతాయిసతికి
నుదయ మొందిరి సంతతాభ్యుదయ మొదవఁ, దల్లిదండ్రులయుల్లము ల్పల్లవింప.

79


క.

ఆవిజయరాయరంగసు, ధీవరు సహజన్ము లైనతిరువేంగడగో
త్రావిభుఁడు నాఁడునాఁటికిఁ, బూవులచే రెత్తినటులఁ బొసఁగి చెలంగెన్.

80


గీ.

ఫ్రాన్సు పుడతకీసుహర్విపార్సి తెనుఁగు, నరవమును మొదలయినభాషాంతరముల
మాటలాడఁ జదువ వ్రాయ మేటియగుచు, సాంద్రతరకీర్తి తిరువేంగడేంద్రుఁ డమరె.

81


క.

నెరయోధ యై తగినయా, తిరువేంగడభూపమణికిఁ దిరువేంగడధీ
వరమౌళి రాజరాజే, శ్వరి యనుసత్పుత్త్రికయును జనియించి రొగిన్.

82


సీ.

చక్కఁదనంబునఁ జక్కెరవిలుకాఁడు చల్లఁదనంబునఁ జందమామ
మిక్కుట మైనట్టి లెక్కకు శేషాహి విక్రమక్రమమున విక్రమార్కుఁ
డమరు నశ్వారోహణమున రేవంతుఁడు సురుచిరవాక్ప్రౌఢి సురగురుండు
ఘనదానవైఖరిఁ గలియుగకర్ణుండు సత్యవాక్యమున నజాతవైరి


తే.

యనఁగఁ జెలువొంది తిరువేంగడావనీంద్రు
గర్భకలశాంబునిధికి రాకామృగాంకుఁ
డగుచు నానందరంగేంద్రుఁ డనుదినంబు
మనుపఁ దిరువేంగడేంద్రుండు మహినిఁ బ్రబలె.

83


వ.

 తదనంతరంబ.

84


సీ.

ప్రభవవత్సరధనుర్మాసశుద్ధాష్టమి భానువాసరము రేవతియుఁ దనర
లగ్నంబు కటక మారాశిని గేతువు నాలుగింటను సూర్యనందనుండు

నాఱింట రవిబుధు లలసప్తమమున బృహస్పతికవిరాహు లష్టమమున
మహితనూజుఁడు నవమమునఁ జంద్రుఁడుగతి మనసార్వభౌమయోగం బెసంగ


తే.

రాయసింహాసనాసీన రంగపతికి
శ్రీమదలమేలుమంగాసతీమణీకిని
రమణ ముద్దువిజయానందరంగరాయ
చంద్రుఁ డుదయించె సత్కళాసాంద్రుఁ డగుచు.

85


సీ.

ఈధన్యుఁడేకదా యెలమి సాక్షాద్విష్ణువంశచే నుదయించినట్టిదేవుఁ
డీఘనుఁడేకదా యిల ఢిల్లిపాచ్చాయిచేతఁ బూజలు గాంచు శ్రీనిధానుఁ
డీరాజరాజేగదా రాజసింహాసనోద్దామసామ్రాజ్యయోగశాలి
యీమహామహుఁడేగదా మేటిమండలాధీశులమ్రొక్కు లంచెడికెరీటి


తే.

యనుచు సకలమహీపాలు రభినుతింప, శుక్లపక్షస్ఫురత్సుధాంశువలె దినది
నప్రవృద్ధి ముద్దువిజయానందరంగ, రాయమణి పట్టభద్రుఁడ్రై రహిఁ జెలంగు.

86


క.

ఈలీల నిరుపమానమ, హాలక్ష్మణశాలి యగుచు నతఁ డొదవినయా
వేళం దనరునవగ్రహ, లీలావసరములు నేర్పరించెద వేడ్కన్

87


వ.

తద్విధంబు.

88


సీ.

రతనంబులను జాల జతనమౌ మొలనూలు బలుకిరీటంబు సొమ్ములు చెలంగఁ
దెలిచల్వఁ గట్టి ముత్తియపుఁబేరులు దాల్చి మురువైన సంగోలు పూని రత్న
సింహాసనస్థుఁడై చెనఁటివైరులఁ గొట్టి యఖిలధరామండలాధిపత్య
గర్వసంజనిత మౌఘనసంభ్రమమునందుఁ జిత్తంబు లీనతఁ జేసి మించి


తే.

తగ నజాతారి యగుచు నుత్తరముఖముగఁ
బొడవుగాంచుచుఁ గుడిక్రే యొడరఁగాను
అలుక తోఁచుట యవసరంబయ్యె కటక
లగ్నయుతకేతునపసరోల్లాస మరయ.

89


గీ.

మఱి చతుర్ధాధిపతి శని సరిగె కంబి, నీలివలువకిరీటభూషాదిఁ దాల్చి
తూర్పు గని కుడికాలు ముందుంచి నిల్చి, యమరకేతుపట్టము గట్టు నవసరంబు.

90


సీ.

మఱియు నయ్యాఱింట మెఱయుచున్న బుధుండు లలిమీఱఁ బసపు దల్లడముఁ బూని
బలుతోలుకుళ్లాయిపై నిన్పగొల్సును జుట్టి జందెంబువేసుకొని విల్లు
నమ్ము చేఁ బూని యాయనిలునిదెస కేగి బలిమి సమస్తభూముల జయించి
యాగ్నేయదిక్కున కందుండి చనుదెంచి గగనమండలమున కెగసి నిలిచి


తే.

దక్షిణాభిముఖంబుగాఁ దనరి యూర్ధ్వ, దృష్టి గైకొని శరము సంధించి మించి
పంతమున ముజ్జగముల దహింతువనుచు, నాగ్రహావేశమున నుండునవసరంబు.

91

గీ.

ఆటను దగువినుఁడు పీతాంబరంబు, వరకిరీటము ముత్యాలసరులు దాల్చి
పరఁగుగజ్జెలహయ మెక్కి పశ్చిమమున, హౌసుగా స్వారి వెలువడునవసరంబు.

92


గీ.

సప్తమాధిపతిగురుండు స్వర్ణకాంతి, వెలయఁ గేతుసామ్రాజ్యాభివృద్ధి యొసఁగి
తగ శిరోవేష్టనముఁ బూని దక్షిణముగ, నమరి నైఋతిదిశఁ జూచునవసరంబు.

93


సీ.

ఆసప్తమాస్థాన మగుమకరంబున దీపించుశుక్రుఁడు తెల్లపాగ
తెల్లకోకలు గట్టి దివ్య మౌ పచ్చనిగంధంబుఁ బూసుకొ కాంతతోడఁ
దూర్పుఁ బడమటివాస్తువును దక్షిణముగ నెసఁగువాకిలి గలయింటిలోనఁ
బట్టెమంచము దూదిపఱపుపై నమరి యష్టైశ్వర్యసంపన్నుఁ డగుచు నెడను


తే.

జెయ్యి తలక్రింద నిడి దిండిచేరిమీఁది రాజ్యమునఁ గల్గుమదవదారాతివితతి
నశ్రమంబున ఖండింప నాత్మలోన నమరి యోజన గావించునవసరంబు.

94


సీ.

మఱియును నాసప్తమస్థితరాహువు యమునిముఖముఁ బోలునట్టిముఖము
రక్తనేత్రముల ఘోరముగాను జూపట్టి యలశుభాయుర్యోగములను బూని
భక్షించునంతఁ గోపంబుతో వాయవ్యదిశఁ దల యాగ్నేయదిశను దోఁక
యుంచి కేతువును నత్యుగ్రతఁ జూచుచు ననిశంబు సకలగ్రహములు తనకు


తే.

వెఱచునట్లు నహంకారవివశుఁ డగుచు, నుండువేళ శరీరంబు రెండుగాను
విఱిచి గాయాలచేఁ బ్రజ్ఞ మఱచి సోలి యవనిమీఁదను బడియుండు నవసరంబు.

95


గీ.

అష్టమాధిపతి కుజుండు వరుదుముత్తి, యములఁ దగుకిరీటమును దూణాంబరంబు
చెలఁగుసింహాసనమును దనచేత నెత్తి, యచటికేతువు కొసఁగెడునవసరంబు.

96


సీ.

నవమాధిపతి శశి పవడాలకంబముల్ రతనాలకొణిగలు వితతములుగ
వన్నెకోకలు చందువలు గలమంటపం బొకటి నిర్మించి యం దున్నతాస
నమున హౌసుగ నర్తనసుగీతవాద్యము ల్గనుగొంచు లేఖలు వినుచు రాజ్య
శాసనుఁడై ధాన్యరాశి కట్టెదుటను రెండుప్రక్కలఁ బైఁడివెండికుప్ప


తే.

లొనర రత్నపరీక్ష చేయుదును గేతు, జాఠరులకును రెండవయాతఁ డగుచు
దిండు చేరుకొ పడమటిదిక్కుఁ జూచి, యధికసంతోషమున నుండునవసరంబు.

97


క.

ఈసహి నవగ్రహములు ని, జావసరప్రౌఢిఁ దనరి జాతకునకు సు
శ్రీయోగబలా(శ్రీవితతా)యుర్యోగమ, హావిభవము లొసఁగ నతఁడు హవణిల్లునెడన్.

98


సీ.

ప్రభవ మొందిననాఁడె ప్రాంసురాజేంద్రుండు బహుమానములు చాలఁ బనిచినదియుఁ
బలుకనేర్చిననాఁడె పాచ్చాయి మొదలైన ప్రభువులు భవ్యులై పరఁగినదియు
నడువనేర్చిననాఁడె కడిమిసీమను సుబా దొరతనంబు వహించి మెఱసినదియు
నాడనేర్చిననాఁడె యఖిలభూపతులచేఁ గానుకకప్పము ల్గాంచినదియుఁ

తే.

జదువ నేర్చిననాఁడె విస్తారమండ, లాధిపత్యంబుఁ బూని చెలంగినదియు
నందకులజముద్దువిజయానందరంగ, నృపతికే కాక కలుగునే యితరులకును.

99


సీ.

చందమామను మించునంద మౌనెమ్మోము కమలంబుల హసించుకనులగోము
కదియఁబట్టినఁ బాలుగారుచెక్కులఠీవి చిగురుటాకును మీఱు చిన్నిమోవి
వాసించుసం పెఁగవంటిచక్కనిముక్కు వజ్రాలఁ గేరుపల్వరుసటెక్కు
వన్నె దేరువిశాలవక్షఃస్థలము వీఁక యొనరు నాజానుబాహువులజోఁక


తే.

కలిగి మహి మహాపురుషలక్షణత నమరు, నితఁడు రాయసింహాసనాధీశుఁ డగుట
కేమియాశ్చర్య మని జనులెల్లఁ బొగడఁ, బ్రబలు ముద్దువిజయానందరంగశౌరి.

100


వ.

అంత.

101


సీ.

మహిఁ బ్రమోదూత సంవత్స రాశ్వయుజశుక్లాష్టమిదినమున నమరునుత్త
రాషాఢయందుఁ దివ్యం బైనలగ్నంబు మేష మారాశిని మెఱయు గురుఁడు
మిథునానఁ గేతువు మెలఁతయందుఁ గుజుండు తుల నర్కశుక్రబుధులును వృశ్చి
కమున మందుఁడు కార్ముకమున రాహువు మకరమునఁ జంద్రుండు రహిఁ జెలంగి


తే.

కలితసామ్రాజ్యవిభవయోగం బెసంగ, రంగనృపతికి నలమేలుమంగమకును
దనర రెండుపుత్రుఁ డై తగి కుమార, విజయతిరువేంగడేంద్రుఁ డావిర్భవించె.

102


క.

ఇల రామలక్ష్మణులవలె, బలకృష్ణుల జంటఁ బాయక వా రు
జ్జ్వలయోగశాలులై తగి, తలిదండ్రులు సంతసింపఁ దనరుదు రెలమిన్.

103


వ.

ఇ ట్లాపుత్రరత్నంబులు దినదినప్రవర్ధమానప్రతిభం ప్రబలిన నం దగ్రజుండగు
ముద్దువిజయానందరంగరాయనృసాలుఁడు బాలగోపాలమూర్తివలె ముద్దుగుల్కు
చు నేతుశీతాచలాంతరధరావలయం బంతయు నేకచ్ఛత్రాధిపత్యంబుగా నేలుచు
రాయసింహాసనారూఢుం డగుటం జేసి యతని ప్రబలజాతకఫలశుభసూచకంబు
నానాఁట వి స్తరిల్లి వెలయుకతంబునఁ దదీయయోగాతిశయంబునకు దృష్టాంతం
బెట్టిదనిన.

104


క.

ఇమ్మహిఁ బ్రబలినఢిల్లి య, హమ్మదుషా పాదుషా ధరాధీశ్వరుహు
క్కుమ్మున నాసరజంగ మ, నమ్మునఁ జేకొనక మెలఁగినన్ విని కినుకన్.

105


గీ.

వడిగ నాసరజంగుసత్వం బడంచి, కోరి దక్షిణసుబ కట్టుకొమ్మటంచు
ఘనహిరాయత మొహదీనుఖానుఁ బూని, పాదుషా పంప నతఁడు దోర్బలము చెలఁగ.

106


వ.

తద్విధంబునఁ బరిపంథికంధరసందోహగంధవహదుస్సహగంధాంధసింధురబంధుర
సైంధవవరూధినీసంగతుండై తరంగిణీభుజోత్తుంగతరంగమాలికలపోలి కైదళంబు
వెంటనంటిరా వెడలి యందందుఁగలదుష్టుల మట్టుపెట్టి యిష్టులం జేపట్టి మట్టు

మీఱినచలంబునం బలం బగ్గలంబై కనుపట్టి బహుదూరంబు గడచివచ్చునెడఁ దన
కుం బ్రాంసురాజు సహాయంబు సేయవలె నని మంతనంబునం జంతించి యా పుదు
చ్చేరికుంపినికిం గార్యస్వతంత్రియుఁ దండ్రియు మంత్రియు నైనవిజయానంద
రంగనృపాలపుంగవునకుఁ గాగిదంబు వ్రాసి తనకు సహాయంబు సేయవలె నని
ప్రార్థించిన నత్తెఱంగంతయు దొర యైన [4]డూప్లెక్సు మహారాజున కెఱింగించి
పరమప్రయత్నంబున నతని సమ్మతిలంజేసి నిజతంత్రశక్తివలన నాతారకుం దగిన
సూత్రంబులం బన్నియు, నచ్చటం జేరంబడియున్న ఛందాసాహేబు న్విడిపించి
యాహిరాయితమొహ(దీను)దినీఖాను వెంటనంటిరా దిట్టపఱిచి పుదుచ్చేరి నున్న
రజాసాహేబునకు నవాబుతనం బిప్పించి, యతనివెనువెంట విక్రమవిక్రమార్కు
లగుఫాన్సుసోల్దారులను నసహాయశూరు లగుబారుసిపాయీలను గూర్చి తగిన జగ
డంపుసామానుల దిట్టపఱిచిన నమితోత్సాహంబున వెలువడి యారజాసాహేబు,
ఛందాసాహేబు, హిరాయిత మొహ(దీను)దినీఖానుండు మొదలయినశూరు లేక
స్థులై ప్రాంసుపౌఁజును మున్నిడుకొని అనవర్లిఖానుని నతనిపౌఁజును నిముసమాత్రం
బున ముంచి యార్కా డాక్రమించి మించినకీర్తిచేఁ బ్రకాశించిన యానిజాము నబా
బుల పుదుచ్చేరికిఁ బిలిపించి సకలవైభవంబులతోన దొరచెంతం దోడ్కొనిపోయి
నవరత్నభూషణాంబరంబులు నపారంబుగా బహుమతిని గావించి మధుర, తంజా
పురి, మైసూరు, యిక్కేరి మొదలైన సంస్థానంబుల నిట్టట్టు గావించి తమపై దండెత్తి
వచ్చి నాసరజంగు లక్షగుఱ్ఱంబుతోఁ బుదువాపురి నావరించుకొనిన వాని నానెట్టున
నిలువనీయక తఱుమఁగొట్టి గులాంనహుషుమహమ్మదుఖానుని బలాయమానునిం
జేసి తురకతమాషుఖానుని నిర్నామంబు గావించి నబుసిందుఖానుని దండంతయుఁ
జూఱలాడించి మహమ్మదుఅబరాల్ పాళయం బంతయు నెత్తఁగొట్టించి మహమ
దల్లిఖానునిపౌఁ జంతయుఁ బటాపంచలై పాఱందఱిమి మఱియునుం గలుగువీరా
ధివీరుల నెచ్చ టఱకా లూఁదనీక చెల్లాచెదరు గావించి పరాక్రమించినయట్టి
యెడ నాహిరాయిత మొహదీనుఖానుఁడు నాసరజంగుదళంబునం జొచ్చి పీనుం
గుపెంటలు గావించి పేర్చి యార్చి పోరాడి యవగడంబుగా వారిచే బట్టువడిన
యాసుద్ది విని కట్టల్క రెట్టింప సామాద్యుపాయభేదంబులం దంత్రంబులం
బన్ని యన్నాసరజంగుం ద్రుంగడంచి వారిదం డంతయుఁ జూఱలాడించి యెప్ప
టియట్ల హిరాయతీ మొహదీనుఖానుని నిజాము పట్టనంబునఁ బ్రతిష్ఠించి యతనివలన
నజారతరాయఁ డను బిరుదుపేరునుం జెంగలిపట్టుకిల్లా జాగీరునుం గుమారశేఖరుం
డైన ముద్దువిజయానందరంగరాయాగ్రణిపేర మూఁడువేలగుఱ్ఱంబునకు మనసుబా
దొరతనంబును నవపత్తుమాయినురాతంబు మొదలయిన మహారాజలాంఛనంబులుం

గైకొని దొరయైనడూప్లెక్సు రాజేంద్రునిచేత నా నబాబునిజాములచేత ననేకస్తో
త్రంబులం బడసి యపారం బైన కీర్తింగాంచిన సకలదేశాధీశు లానందకందళిత
హృదయారవిందు లై.

107


సీ.

సాతారలో నున్న చందసాహేబును బెఱఁబాపి పిల్పించు నెఱతనంబు
ధృతి హిరాయిత మొహదీన్ ఖాను జతఁజేసి యనవర్ధిఖానుఁ గొట్టినచలంబు
హెచ్చుగా దండెత్తి వచ్చిన వాసరజంగును దునిమిన సాహసంబు
నార్కాడు మొదలైనయట్టికర్ణాటక సుబకు నబాబుగాఁ


తే.

డాఁకఁగాఁ గృష్ణ హద్దుకన్యాకుమారి, దాఁకఁ గలిగిన దేశమంతయును గట్టి
నట్టిసామర్థ్యము విజయానందరంగ, ఘనునకేగాక యొరులకుఁ గలదె ధరను?

108


ఉ.

వింతకు నందగోపకులవీరవరేణ్యుఁడు రంగధారణీ
కాంతునిచేతిహేతి కినుకన్ వెస మార్కొని పోరఁ జూచుదు
ర్దాంతునిజాముసైన్యనికరంబులు కొద్దిని బోవనీయదౌ
నంతకు నంతకుం బఱచునంతకు నంతకుఁ జేరునంతకున్.

109


సీ.

పురినుండి వెడలి గోపురి గొని వాకిళ్లు చొరవ నేర్చినరీతి చోద్య మయ్యె
రణమండలిని జొచ్చి రవిమండలముఁ జొచ్చి చనునది మిగుల నాశ్చర్య మయ్యె
నెత్తురుటేట మునింగి మిన్నేట లేచినచంద మెన్న విచిత్ర మయ్యెఁ
గరికుంభములనుండి సురవధూకుచకుంభములకు లంఘించు టద్భుతము నయ్యె


తే.

రాయవినుతవజారతరాయవిజయ, విక్రమానందరంగభూవిభుని హేతి
జగడమున నింద్రజాలవిద్య గనుపింప, వలయుఁ గాదేని రిపు లిట్లు మెలఁగఁగలరె?

110


క.

అని యిట్లు సకలజనములుఁ, గొనియాడ ననర్ఘరత్నఘోటకమదనా
రణభూషణాంబరంబులు, ఘనమోదము మీఱ నజరుఁ గైకొని వేగన్.

111


సీ.

ముష్కరి యౌ సైదులుష్క రిఖానుఁడు గరిమ యబ్బలిమీరుఖానుధీరుఁ
డబ్బల్నబీఖానుఁ డబ్బల్నజీరుఖాన్ ఘనులు దిలావరుఖాను మేటి
ప్రబలుఁ డాహిమ్మదుఖాదరుఖానుఁడు సైదుషరీబుఖాను షానవాసు
ఖానులు మహమదుఖాను నవాసులఖానుఁ డల్లవముషిఖాను మేటి


తే.

యాదిగాఁ బేరుపెంపుచే నమరుపౌఁజు, దార్లు హుదురావులును కిలాదారులు సర
దారులు వజీరులును సుబాదార్లు దొరలు, వచ్చి రానందరంగభూవరునిసభకు.

112


వ.

మఱియును.

113


సీ.

సరసరాజారామచంద్రరాయాగ్రణి జాకోటినింబాళు జనవరుండు
ధైర్యవంతుఁడు సులుతాన్ జనింబాళును మాధవరావు దామర్లవారు

మట్లవారును హనుమంతరావు బరికి వేంకటరావుకపీలజంగు
నలరామరాజేంద్రుఁ డేఁచభూపాలుండు నగరాలవారును నూకరాజు


తే.

వారు తక్కినపాళయప్పట్లదొరలు, ప్రబలుమోకోజిపంతులు రామదాస
పండితార్యులు మొదలైన ప్రభువు లెల్ల, వేడ్క వచ్చిరి శ్రీరంగవిభునిసభకు.

114


వ.

ఇట్లతివైభవంబున సకలరాజాధిరాజులు నదురుగైకొని భేటికి వచ్చునెడ నతనినగరి
వాకిలి నీవు ముందు నేను ముం దని చొరవ సేయంబోయి యచ్చటి నకీబులు
మహలుదార్లచే నిలువరింపఁబడి వెలవెలఁబోయి యొండొరుల మొగంబులఁ జూచు
కొనుచు.

115


సీ.

ఈహజారముచెంత నెంతయు భేటికై చేరి నిల్వనిదునేదారు లెవ్వ
రీబంకునందు నకీబులచేత... ద్రొబ్బులు వడసినవాబు లెవ్వ
రీవాకిటను జాళువావెండిబెత్తాలచేఁ బెట్లువడనివజీరు లెవ్వ
రీదరుబారున నెపుడు దేవారికులఁ గనివేఁడని హుదురావు లెవ్వ


తే.

రైన నేమాయె నివి యపమానము లన, రాదు మహి నెంతవారికి రంగవిభుని
సన్నిధిని హెచ్చుతక్కువ లెన్నఁదగునె, యనుచుఁ జేరిరి వారంద ఱతనిసభకు.

116


తే.

ఇటులు సభఁజేరి వైభవం బెసఁగ మత్త, వారణతురంగకాంచనవస్త్రరత్న
భూషణంబుల బహుమానములు నొసంగ, నదురుఁ గైకొని యతులితానందముగను.

117


తే.

వారివారికిఁ దగునుపచారములును
బలికి మర్యాద లొనరించి బాగుగాను
కరితురగరత్నభూషణాంబరము లొసఁగి
పసుప వీడ్కొని రుత్సాహభరితు లగుచు.

118


సీ.

తనరాక విన్నమాత్రమున బల్లిదుఁ డైన ఢిల్లిపాచ్ఛాగుండె తల్లడిల్లఁ
దనఢాక విన్నయంతనె జయసింగును భయపడి కాన్కకప్పము లొసంగఁ
దనపేరు విన్నంత దద్దరిల్లి మరాటిపౌఁజు చీకాకుగాఁ బరువులెత్తఁ
దనయాజ్ఞ బలుసుబాదారులు నితరదేశాధినాథులు శిరసావహింప


తే.

జగతిఁ బెంపొంద నాసరుజంగువంటి, వాని నవలీలఁ దెగటార్చి వన్నె వాసి
చెందిన వజారతవిజయానందరంగ, ఘనునిదృష్టికి నెవరైనఁ గాని యెదురె!

119


చ.

నిలుకడ లేక ముందఱికి నిల్వక నూటికి మించ కేరికిం
దెలియక యుండుబ్రహ్మలిపి ధీరవజారతరంగశౌరి వ్రా
యులలితశాసనాక్షరము లుర్విఁ దిరంబుగ నాస్తియై యసం
ఖ్యలు నయి తేట యాఘనతఁ గాంచవె పూజ్యులు సేయు కార్యముల్.

120

సీ.

ఏఘనుజయభేరికాఘనధ్వని విన్నఁ బరరాజహంసలు పఱువులెత్తు
నేనరేంద్రునిధాటి నీక్షించినంతనె భోగికులంబులు పుట్ట లెక్కు
నేరాజుతేజంబు నిసుమంత విన్నంత శత్రుచక్రంబులు సంచలించు
నేనృపకేసరి హెచ్చుఢాకను విన్న వైరికుంజరపాళి పూరిగఱచు


తే.

నట్టియానందరంగధరాధినాథు, బలపరాక్రమవైఖరిఁ బ్రస్తుతింప
వశమె మహిలోన మనవంటివారి కనుచుఁ, బొగడుచును దమతమదేశములకుఁ జనిరి.

121


వ.

ఇవ్విధంబున నబాబులు మొదలగునఖండమండలాధీశ్వరులచేఁ బొగడికలు గాంచి
యసమానవైభవంబు, ననుపమానకీర్తి, ననూనప్రభావంబు, నహీనదాతృత్వంబు,
నఖండసామ్రాజ్యంబు, నపారతరైశ్వర్యంబు, నమితోత్సాహంబు, ననవరతలక్ష్మీక
టాక్షంబు గలిగి చెలంగుచు నొక్కనాఁడు నిజపుత్త్రికాపుత్త్రికలకు వివాహ
మహోత్సవంబులు గావింప నిశ్చయించి చతుస్సముద్రముద్రితం బైనభూమండ
లంబునం గలుగు ప్రముఖులకు నాకల్యాణమహోత్సవంబు గనుంగొన వచ్చుటకై
శుభపత్రికలును వస్త్రతాంబూలంబులుం దగువారిచేఁ బనిచి సకలలక్షణవతి య
గుజానకీదేవిని నక్షిణలక్ష్మీకటాక్షవీక్షణాలంకృతుం డైనస్కందనృపాలపురం
దరునకు నిత్యకళ్యాణసౌభాగ్యవతి యైన త్రిపురసుందరీదేవిని నహార్యవర్యధైర్య
స్థైర్యశౌర్యగాంభీర్యౌదార్యచాతుర్యైశ్వర్యధుర్యుం డగుచిదంబరనాథనరనా
థునకు నగణ్యతారుణ్యలావణ్యసాద్గుణ్యనైపుణ్యమహాపుణ్యవతి యగురాజరాజేశ్వ
రిని నశేషభాషామనీషావిశేషాశేషీకృతశేషాహిభాషాయోషాస్వామి యగునారా
యణభూపాలునకుం గన్యకాప్రదానంబులు సేయసమకట్టి యసమానసమానలసమా
నరూపానునయదాననిదానసుగుణనిదానసకలకలావిరాజమానయానారోహణస
మాశ్రయుఁడునై సహజనందనుఁ డగుతిరువేంగడమహిపాలపుంగవునకు శ్రితజన
కల్పకవల్లియుం బల్లవాధరీమతల్లియు నైన కనకవల్లీదేవినిం బరిణయంబుగాఁ గైకొన
నిర్ణయించి కుబేరునిపుష్పకంబును గేరి యింద్రుని యాస్థానమండపంబును మీఱి,
మయనిసభతోడన్ సరిపోరి, లక్ష్మీరంగస్థలంబుదారి విలసిల్లు పెండ్లిచవిక లొన
రవేయించి రెండులక్షలు నిష్కంబులుం బెండ్లినెలవులు నేనుకంబులుం జేసికొని
దొడ్డకొంచెంబుల నెంచక నలువదిదినంబులు నొకనాఁటిచందంబునం బెండ్లివేడు
కల నొనరింప నిశ్చయించి భూదానకన్యాదానోపనయనదానాన్నిదానభూరి
దానంబులును బదియాఱువిధంబుల మహాదానంబు లొనరించి యథాశాస్త్రప్రకా
రంబున వివాహమహోత్సవం బొనరించునవసరంబున.

122


ఉ.

శంబరవైరినిం గెలుచుచక్కఁదనంబును వారివంటిభో
గంబును గల్గుకందవిభు కందనృపుం గబరీనిరస్తరో

లంబకదంబ మంజులకలానికురుంబ గుణావలంబ నె
య్యంబున జానకమ్మ వరియించె హరిన్ వరియించు శ్రీవలెన్.

123


సీ.

కలితాబ్ధికన్యకాకలితశుభాగారు నభినవమదనమోహనశరీరు
నిఖిలలోకైకవర్ణితకీర్తివిస్తారు భానుసూనుసమానదానశూరు
విశ్వవిశ్రుతసర్వవిద్వజ్జనాధారు జాంబూనదాచలసదృశధీరు
ఘనసదాశివమహీకాంతప్రియకుమారు శ్రీ చిదంబరనాథనృపవజీరు


తే.

మానవిభవసమానసుశ్రీనిధాన, యైన త్రిపురసుందరి పెండ్లియాడెఁ గోరి
జనకసుకుమారి శ్రీరామచంద్రుఁ జేరి, పెండ్లియాడిన దారిన ప్రేమ మీఱి.

124


మ.

రవితేజున్ ఘనపుణ్యమూర్తిని యశోలంకారునిన్ వీరరా
ఘవునారాయణభూమిపాలకమణిం గారుణ్య సంశీలన
ర్మవచోజాలగుణాలవాల యగు శ్రీమద్రాజరాజేశ్వరీ
యువతీముఖ్య వరించె గౌరి వృషవాహుం బెండ్లి యైనట్టులన్.

125


సీ.

సంతతసత్యభాషాహరిశ్చంద్రుని వరనందగోపాలవంశచంద్రుఁ
డనఘుఁ డాతిరువేంగడాధీశుపౌత్రుఁడు తిరువేంగడక్షమాధిపతిపుత్త్రుఁ
డానందరంగభూజానిప్రియమమారుఁ డల పెరంబూరిసత్కులవిహారుఁ
డలమేలుమంగాంబ యరిమె పెంచినబాలుఁ డల కుమారతిరువేంగళనృపాలుఁ


తే.

డతులలక్షణవతి రూపపతి శుభవతి, పుణ్యవతిని యరుంధతిఁ బోలు కనక
వల్లిసతి నుల్లమలర వివాహమయ్యెఁ, గృష్ణమూర్తి రుక్ష్మిణిని వరించినటులు.

126


క.

ఈరీతి వేడ్క మీఱఁ గుమారీమణులకును సత్కుమారునకు మహో
దారతఁ గల్యాణమ్ముల, శ్రీ రంజిలఁ జేసి ముదము చేకొని వెలయన్.

127


సీ.

రాజాధిరాజులు రాయమన్నీలు సుబాదారులు వజీరు పౌఁజుదారు
సంస్థానపతులు నిజాముల్ నవాబులు వర్తకు ల్పాళయప్పట్లదొరలు
మొదలైనవారు సంపుగఁ బెండ్లివేడుక గనుఁగొని యాశ్చర్యకలితు లగుచు
నవరత్నభూషణాంబరగజాశ్వంబులు నదరులు ఘటియించి బదులుగాంచి


తే.

వీడ్కొనిన యంతనత్యంతవిభవ మొదవ, నల్లురకు మువ్వురకుఁ జాల నరణమిచ్చి
కూఁతురులు మదిఁ గోరిన కోర్కె లొసఁగి, యెసఁగి సౌభరిసంతతి పొసఁగి వెలయు.

128


సీ.

ఇటులు సమస్తధాత్రీంద్రులు వజ్జీర్లు బలురాయమన్నీర్లు పౌఁజుదార్లు
మొదలైనదొరలచేఁ బొగడిగల్ గైకొని పుత్త్రులు పుత్త్రికా పౌత్త్రు లాప్త
భృత్యులు మంత్రులు హితులు బంధువులతోఁ దామరతంపరదారి నలరి
యాసేతుశీతాచలాంతరావనియందు నాచంద్రతారార్కయశము నించి

తే.

మెఱయుదాతలదాతయై మేటి యగుచు, శ్రీపెరంబూరివంశకిరీటి యగుచు
రాజసమున నజారతరాయవిజయ, విక్రమానందరంగభూవిభుఁడు వెలయ.

129

షష్ఠ్యంతములు

క.

ఇత్యాది సకలగుణసాం, గత్యునకు నసాధ్యకార్యఘటనాఢ్యునకున్
నిత్యమహాసత్యమహా, కృత్యమహారాజమణికిఁ గృతధోరణికిన్.

130


క.

కలహాశనబలశాసన, జలజాసనభక్తివిభవచాతుర్యునకున్
ఖలభీషణబలశోషణ, బలభూషణునకు నపారపటుధిషణునకున్.

131


క.

భటనాయక నటనాయక, విటగేయక సద్విశేషవితరణగుణికిన్
గుటిలాహితపటవాతత, చటులోద్ధత శౌర్యనికరసజలాబ్దునకున్.

132


క.

కమలాహితకమలాహిత, కమలాహితసదృశశౌర్యకరుణాకృతికిన్
సుమనోగమసుమనోవిమ, లమనోజ్ఞమణీసముజ్జ్వలవిభూషునకున్.

133


క.

నందకులామందకలా, నందవిలాసప్రభావునకు సారసభూ
నందనహరిచందనహరి, చందనహరినిభయశోవిశాలద్యుతికిన్.

134


క.

యావనజన పావనఘన, పావనగుణశాలికి సముపార్జితభాస్వ
ద్భావిజయ శ్రీవిజయ, శ్రీవిజయానందరంగనృపచంద్రునకున్.

135


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన లక్షణచూడామణి యైన
యానందరంగచ్ఛందం బను పేరం జైలువొందులక్షణగ్రంథంబునకుం గవితాలక్షణ
ప్రకరణంబునకుం గలిగిన మార్గంబు లన్నియు విశదంబుగా వివరించెద.

136

  1. Genaral
  2. Council
  3. Captain
  4. Dupleix