ఆనందరంగరాట్ఛందము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ద్వితీయాశ్వాసము



వనితాతాండవలసి
తావాసవిలాస మందహాసనదనరా
జీవ తిరువేంగళేంద్రుని
శ్రీవిజయానందరంగ! నృపసారంగా!

1


గీ.

అవధరింపుము నీపేర నంకితముగ, సకలలక్షణగ్రంథవిస్తారసార
పటిమ లన్నియు నొకటిగా ఘటనపఱిచి, లక్షణగ్రంథ మొనరింతు రంగనృపతి.

2


వ.

తద్విధం బెట్టిదనిన.

3

అష్టగణాధిదేవతాగ్రహాదినిర్ణయము

క.

మగణాద్యష్టగణములకుఁ, దగ దేవత గ్రహము రాశి తార రసము యో
ని గణమ్ము జాతి ఫలితము, జిగి రూప మెఱుంగవలయు శ్రీరంగనృపా!

4


వ.

మగణము మొదలయిన యష్టగణములకు నధిదేవతలు, గ్రహములు, రాసులు, నక్ష
త్రములు, రసములు, యోనులు, గణములు, జాతులు, ఫలములు, కాంతులు,
రూపములు, ఇవి పదునొకండువిధము లని తెలియునది.

5
మగణమునకు:—
క.

ధర వేల్పు జ్యేష్ఠ తారక, పురుషుఁ డసురగణము శూద్ర బుధుఁడు గ్రహము రౌ
ద్రరసము వసురుచి శుభఫల, మురువృశ్చికరాశి హరిణయోని మగణమౌ.

6


వ.

మగణమున కధిదేవత భూమి, నక్షత్రము జ్యేష్ఠ, రూపము పురుషుఁడు, రాక్షస
గణము, శూద్రజాతి, గ్రహము బుధుఁడు, రౌద్రరసము, పచ్చనికాంతి, శుభ
ఫలము, వృశ్చికరాశి, హరిణయోని యని తెలియునది.

7
ఇందుకు లక్షణము, పాదాంగచూడామణి యందు:—
చ.

పరగ ధరాధిదైవతము పచ్చనికాంతియు శూద్రజాతియౌ
నరయ బుధుండు తద్గ్రహము హాటకవర్ణ మతండు తత్ఫలం

బురుశుభ మెన్నఁగా హరిణయోనియు వృశ్చికరాశి నిర్జరే
శ్వరవరతార దైత్యగణసంగత(మున్)మా మగణంబు శంకరా!

8
కవిసర్పగారుడమున:—
మ.

ధర దైవంబు గ్రహంబు సౌమ్యుఁడు హరిద్వర్ణంబు దత్కాంతి యా
సురమూహింపగణంబు జాతి దలఁపించున్ శాద్రి(శూద్ర)యాయోనిదా
హరిణం బుజ్జ్వలతారజ్యేష్ఠ రస ముద్యద్రౌద్ర మారాశితే
లురుభద్రంబు ఫలంబు నా మగణ మింపొందున్ బుధస్తుత్యమై.

9
చమత్కారచంద్రికయందు:—

"క్షేమం సర్వగురు ర్ధత్తే మగణో భూమి దైవతః”

10
సాహిత్యచంద్రోదయమున:—

"సౌమ్యో౽పి మగణః క్రూరః క్రూరం గణ ముపాశ్రితః,
క్రూరగ్రహసమాయుక్త శ్శత్రుదేశే బుధో యథా,
బుధః పాపయుతః పాపీ క్షీణచంద్రో౽న్యథామతిః”

11
శ్రీధరచ్ఛందంబున:—
క.

మగణం బెప్పుడు శుభకర, మగు నైనన్ గ్రూరగణము నది డాసినచోఁ
దెగి చంపు బుధుఁడు క్రూరుం, డగు గ్రహమును గదిసి క్రూరుఁడై చనుమాడ్కిన్.

12
అలంకారచూడామణియందు:—

"కర్తుః కారయితు శ్చైవ మగణో బుధకర్తృకః,
సగణేన సమాయుక్త స్సర్వకామఫలప్రదః.”

13
కవిగజాంకుశమున:—
క.

మగణంబు పద్యముఖమున, సగణముతోఁ గూర్చి చెప్పఁ జనుఁ గృతి యొండెన్
దగఁ బద్య మిడిన భర్తకు, నగణితముగ నర్థసిద్ధు లగు సత్యముగన్.

14
మఱియును, గావ్యచింతామణియందు:—
క.

జగతి గణంబుల కెల్లను, మగణము కారణముగాన మగణముఁ గదియన్
నిగిడించు గణము లెల్లను, దగ శుభ మొనరించుఁ గీడు తగులదు దానన్.

15


వ.

ఇట్లు మగణసగణముల కన్యోన్యమైత్రిగనుకఁ బద్యాదిని బ్రయోగార్హమని పూర్వ
కవులు నిశ్చయించుటచేతను మగణ మత్యుత్తమ మయ్యెను.

16
ఇందుకు లక్ష్యము, రఘువంశముమొదటఁ గాళిదాసు:—

"వాగర్థావివసంపృక్తౌ" అనియెను.

ఆదిపర్వము మొదట శబ్దశాసనుఁడు:—

"శ్రీవాణీగిరిజాః" అనియెను.

18


వ.

మఱియు నాంధ్రగీర్వాణములయం దనేకులు ప్రయోగించినారు.

19
యగణమునకు:—
గీ.

జలము వేల్పు కాంతి తెలుపు పూర్వాషాఢ, చుక్క రసము కరుణ రొక్క మీవి
వరగణమ్ము బ్రాహ్మణది రాశి విల్లు గ్ర, హము కవి కపియోని యగణమునకు.

20


వ.

అధిదేవత జలము, కాంతి తెలుపు, పూర్వాషాఢానక్షత్రము, కరుణరసము, ధనప్ర
దము, మనుష్యగణము, బ్రాహ్మణజాతి, అఁడుది, ధనూరాశి, శుక్రుఁడు గ్రహము,
వానరయోని.

21
ఇందుకు లక్ష్యములు, పాదాంగ చూడామణియందు:—
చ.

జల మధిదైవమున్ రజితసన్నిభకాంతి కులంబు విప్రుఁడున్
ఫలము ధనంబు తద్గ్రహము భార్గవుఁ డాతనివర్ణ మెన్నఁగాఁ
దెలుపు జలంబు [1]తారకము తెల్లమిగా ధనురాశి యోనియున్
బలిముఖ మాగణంబు నృగణంబును నౌ యగణాన కీశ్వరా.

22
కవిసర్పగారుడమున:—
మ.

అలరన్ దైవము వారి బ్రాహ్మ్యము కులం బావన్నె తె ల్పర్ధమా
ఫల మాయోని ప్లవంగ మాగణము చెప్పన్ మానవం బాగ్రహం
బలశుక్రుండు రసంబు దాఁగరుణ పూర్వాషాఢనక్షత్ర మి
మ్ములఁ గోదండము రాశి నా యగణ మొప్పున్ గోవిదస్తుత్యమై.

23
చమత్కారచంద్రికయందు:—

“కరో త్యర్థా నాదిలఘు ర్యగణో వారి దైవతః”

24
సాహిత్యరత్నాకరమున:—

"ప్రకృత్యా యగణో నిత్యం శ్రీకరః కథ్యతే బుధైః,
సఏవ వికృతిం యాతి సగణోమగతో యది.”

25
గోకర్ణచ్ఛందంబున:—
క.

సయలం జెప్పిన శుభ మగు, జయలం జెప్పినను బతికి జయకీర్తు లగున్
రయలం జెప్పిన నెంతయుఁ, బ్రియ మగు మఱి మయలఁ జెప్పఁ బెంపొనరించున్.

26

వ.

అని యున్నదిగనుక యగణము శుభప్రదమేయైనను సద్గణసాంగత్యముచేత విశే
షముగ శుభఫలము నిచ్చును.

27
రగణమునకు:—
గీ.

గ్రహము భౌముఁ డగ్ని కర్త శృంగారంబు, రస మసురగణంబు రాచవెలఁది
భయము ఫలము కృత్తికయు తార కెంపుడాల్, రాశి యోని యజము రగణమునకు.

28


వ.

గ్రహ మంగారకుఁడు, అగ్ని దేవత, శృంగారరసము, అసురగణము, క్షత్త్రియజాతి,
యాఁడుది, ఫలము భయము, నక్షత్రము కృత్తిక, కాంతి యెఱువు, రాశి యోని
యు మేషము.

29
ఇందుకు లక్ష్యములు, పాదాంగచూడామణియందు:—
చ.

జ్వలనుఁ డధీశుఁడున్ గులము క్షత్రియమున్ బవడంపుఁగాంతి పెం
పలరు గ్రహంబు భూతనయుఁ డాతఁడు రక్తపువన్నె పావకా
ఖ్య లలితతార దైత్యగణ మయ్యజయోనియు మేషరాశియున్
ఫలము భయప్రదంబు రగణంబునకున్ ద్రిదశేంద్రవందితా.

30
కవిసర్పగారుడమున: —
మ.

అనలుం డీశుఁడు రాశి మేషము గ్రహం బాభౌముఁ డత్తార సం
ప్రణతిన్ గృత్తిక దైత్య మౌ గణము వైరాజ్యంబు వంశంబు మే
క నెఱిన్ యోని ఫలంబు భీ రసము శృంగారంబు సత్కాంతి కో
కనదాచ్ఛచ్ఛవి మించు నారగణ మేకాలంబు ధాత్రీస్థలిన్.

31
చమత్కారచంద్రికయందు:—

"భీతిదాయీ మధ్యలఘూ రగణో వహ్ని దైవతః”

32
సాహిత్యచంద్రోదయమున:—

“రగణ శ్శ్రీకరః పుంసాం యగణానుగతో భవేత్
గద్యపద్య ప్రబంధాదౌ తత్రోదాహరణం కృతిః"

33
అధర్వణచ్ఛందంబున:—
క.

పొగడొందఁ బద్యముఖమున, రగణము యగణంబుఁ గూడి రాజిల్లిన నీ
జగమంతయు నేలెడివాఁ డగుఁ గృతిపతి విభవయుక్తుఁ డగుఁ గవివరుఁడున్.

34


వ.

రగణము కానిదైనను సద్గణసాంగత్యముచేత శుభఫలము నిచ్చును. ఈరగణ మగ్ని
గణముగనుక వాయుగణ మైనసగణముతోఁ గూడినఁ జిచ్చు గాలికూడినట్టులు
కావున నటువలె నుంచరాదు.

35
సాహిత్యచంద్రోదయమున:—

“అనలానిలసంయోగం కరోతి విభుమందిరే,
మహానలభయం తత్ర భీమజ్వాలాసమాకులమ్.”

36
కవికంఠపాశమున:—

"మారుతపూర్వే వహ్నౌ వహ్నిభయం శుభయుతో౽న్యేషామ్.”

37
అధర్వణచ్ఛందంబున:—
క.

అనలానిలసంయోగం, బనుపమకీలాకరాళ మగువహ్నిభయం
బొనరించుఁ గర్తృగృహమున, ననుమానము లేదు దీన నండ్రు కవీంద్రుల్.

38


వ.

అనియున్నది గనుక రగణసగణములు కారావు.

39
సగణమునకు
గీ.

అనిలుఁ డీశుఁడు పేడి గ్రహఁబు మందుఁ, డంత్యజాతి తులారాశి యసురగణము
స్వాతి తార మహిషయోని క్షయఫలదము, శ్యామరుచి భయరసమున సగణ మొప్పు.

40


వ.

వాయువుదేవత, నపుంసకుఁడు, శనిగ్రహము, చండాలజాతి, తులారాశి, రాక్షస
గణము, స్వాతినక్షత్రము, మహిషయోని, క్షయఫలము నిచ్చునది, నలుపువన్నె,
భయరసము.

41
ఇందుకు లక్ష్యములు, పాదాంగచూడామణియందు:—
చ.

అనిలుఁ డధీశుఁడున్ గువలయంబులకాంతి కులంబు హీనమున్
జనుగ్రహ మాశనైశ్చరుఁడు చాలఁగ నల్పగువన్నె తౌలయౌఁ
దనరఁగ రాశి స్వాతియగుఁ దార ఫలంబు క్షయంబు దానవం
బొనరగణంబు నా మహిషయోని యగున్ సగణాన కీశ్వరా.

42
కవిసర్పగారుడమున:—
మ.

అనిలుం డీశుఁడు స్వాతితార రుచిశ్వేతాభావ మెన్నన్ గ్రహం
బినజుండౌ దుల రాశి హైన్యము కులం బేపార క్షీణంబుదా
మునులబ్ధంబు భయంబు తద్రసము కార్పో తెమ్మెయిన్ యోని యెం
దును దైత్యుండు గణంబు నాసగణ మొందున్ గీర్తి విర్ఫూర్తిగన్.

43
సాహిత్యచంద్రోదయమున:—

“సగణ స్సర్వసౌభాగ్యదాయక స్సర్వదా భవేత్,
కర్తుర్మగణసాన్నిధ్యా ద్రగణో నపురో యది.”

44
అట్లే కవిరాక్షసమున:—

"అనంతపదవిన్యాస్యచాతుర్యసరసం కవేః,
బుధో యది సమీపస్థో న దుర్జనపురో యది.”

45
కవిసర్పగారుడమున:—
గీ.

సగణమగణములు పొసంగిన విభవంబు, రసగణంబు లెనయఁ బ్రబలుఁ గీడు
రగణయగణయుతము రాజ్యప్రదం బగు, భయము లిరువురకును భయము లిడును.

46
సాహిత్యచంద్రోదయమున:—

"సౌమ్యగ్రహాధిష్ఠితత్వా త్సగణ శ్శుభదాయకః,
మిత్రామిత్రగణై స్సార్ధం సౌరిశ్శుభఫలప్రదః
శుభగ్రహౌసితేంద్రజ్యౌ పాపామందారభాస్కరాః.”

47


వ.

సగణము కానిదైననేమి గురుశుక్రగ్రహధిష్ఠితగణమ లసమీపమున నున్నను, వెనుక
కుజగ్రహాధిష్ఠితగణము లేకున్నను మంచిది.

48
మఱియును, సాహిత్యచంద్రోదయమున:—

"సగణ శ్శుభదో జ్ఞేయాః రగణస్య పురస్థితః.”

49
అథర్వణచ్ఛందంబున:—
క.

మునుకొని పద్యముఖంబున, ననిలగణం బిడిన నాయురారోగ్యంబుల్
కొనసాగు దానిముందఱ, ననలగణం బిడినఁ బతికి నలజడి సేయున్.

50
ఇందుకుఁ జెల్లుబడి, శాలినీసహకారమున - సార్వభౌమకవి:—

“అవలంబస్య హేరంబం” అనియు.

51
వృత్తరత్నాకరమున- కేదారకవి:—

“సుఖసంతానసిద్ధ్యర్థం” అనియు సగణరగణములు చేరియున్నవి.

52
తగణము
క.

దివి వేల్పు తార పుష్యమి, దివిజగణము కర్కి గ్రహము ధిషణుఁడు నీల
చ్ఛవి విప్రుఁడు శాంతరసము, భువిశ్రీదము యోని మేషము తగణమునకున్.

53


వ.

ఆకాశము దేవత, నక్షత్రము పుష్యమి, దేవగణము, కటకరాశి, గ్రహము
బృహస్పతి, నల్లనికాంతి, బ్రాహ్మణజాతి, పురుషుఁడు, శాంతరసము, ఐశ్వర్య
ప్రదము, మేషయోని.

54
ఇందుకు లక్ష్యము- పాదాంగచూడామణియందు:—
చ.

నెఱయ నభంబు దైవతము నీలపుఁగాంతియు విప్రజాతి గీ
ర్వరుఁడు గ్రహంబుఁ గాంచనపువర్ణ మతండు ఫలంబు చెప్ప నై
శ్వర్యము వార పుష్యమియు వాలినకర్కటరాశి మేషమౌ
నిరవగుయోని దేవగణ మీతగణంబున కిందుశేఖరా!

55
కవిసర్పగారుడమున:—
మ.

అమరన్ మి న్నధిదైవ మక్కులము బ్రాహ్మ్యం బాగణం బెన్న దై
వము జీవుండు గ్రహంబు నల్పు రుచి యైశ్వర్యంబు లబ్ధంబు మే
షము దాయోని రసంబు శాంత మలనక్షత్రంబు పుష్యంబు రా
శి మహిన్ గర్కటకంబు నాఁ దగణ ముత్సేకం బగున్ జెల్వమై.

56
ప్రయోగసరణి - సాహిత్యరత్నాకరే:—

“నిత్యం భగణసాన్నిధ్యా త్సర్వాభీష్టఫలప్రదః,
కర్తుః కారయితా శ్చైవ తగణో వ్యోమదైవతః.”

57
ఉత్తమగండచ్ఛందంబున:—
క.

తగణంబు తొలుతఁ బిమ్మట, భగణముఁ గదియించి నిలిపి పద్యము హృద్యం
బుగ రచియించినఁ గర్తకు, నగణితముగ నొదవు నాయురైశ్వర్యంబుల్.

58
చమత్కారచంద్రికయందు:—

"ఈశత్వ మంత్యలఘు చ తగణో వ్యోమదైవతః”

59
సాహిత్యచంద్రోదయే:—

“తగణ స్సర్వసౌభాగ్యదాయక స్సర్వదా భవేత్”

60
కావ్యచింతామణియందు:—
క.

తగణంబున కధిదేవత, గగనం బని శూన్య మనుచుఁ గాదని పలుకన్
దగ దది మిక్కిలి మంచిది, గగనం బది నిత్యవిభవ గావునఁ దలఁపన్.

61
అమరుకకావ్యమున:—

"జ్యాకృష్ణ బద్ధ కటకాముఖపాణి”రితి.

62
కుమారసంభవమున:—

“అస్త్యుత్తరస్యాందిశి”

63
తర్కభాషయందు

"బాలో౽సి యో న్యాయనయే ప్రవేశం”

64
కృష్ణవిజయమునందు :—

"పాయా దపాయా త్పరమస్య పుంస” ఇతి.

65
కుసుమాయుధవ్యాకరణమున:—

“యే నాక్షరసమామ్నాయం” ఇతి.

66
మంత్రమహార్ణవమున:—

"ఓంకారపంజరశుకీమ్" ఇతి.

67
మంత్రదర్పణమున :—

“ఆధారపద్మవనఖేలనరాజహంసీ” అనియు నిందఱు మహాకవులు తగణము నాదిని
బ్రయోగించిరికాన మంచిదని తెలియునది.

68
జగణమునకు:—
క.

అరుణుఁడు పతియు గ్రహము వీ, రరసము పురుషుండు సింహరాశి నృగణ ము
త్తర తార రోగదము రా, జరుణద్యుతి ధేనుయోని జగణంబునకున్.

69


వ.

అధిదేవత గ్రహము సూర్యుడు, వీరరసము, పురుషుఁడు, సింహరాశి, మనుష్య
గణము, ఉత్తరానక్షత్రము, రోగకరము, క్షత్రియజాతి, రక్తవర్ణము, పశు
యోని.

70
పాదాంగచూడామణియందు:—
చ.

రవి యధిదైవమున్ బరఁగ రాట్కులమున్ గురువిందకాంతియున్
రవి గ్రహ మెన్నఁగా నతఁడు రక్తపువర్ణము సింహరాశి యు
ద్భవ మగు రోగ మాఫలము తారక యుత్తర ధేనుయోని మా
నవగణమున్ దలంప జగణంబునకున్ ద్రిదశేంద్రవందితా!

71
కవిసర్పగారుడమున:—
మ.

అరుణుం డేలిక చాయ రక్తిమ రసం బవ్వీర మాయన్వయం
బురువై రాజ్యము రాశి సింహము గ్రహం బుష్ణాంశుఁ డత్తార యు
త్తర రోగంబు ఫలంబు యోని యిరువొందం ధేను వమ్మానవం
బరుదారంగ గణంబు నా జగణ మింపారుం జగత్సిద్ధమై.

72
ప్రయోగసరణి, చమత్కారచంద్రికయందు:—

"రుజాకరో మధ్యగురు ర్జగణో భానుదైవతః” అనియు.

73
సాహిత్యరత్నాకరమున:—

“మధ్యేగురు ర్ణో రుజ” మనియు.

74
కవికంఠపాశమున

“భాను ర్దుఃఖ” మనియు.

75
కుమారసంభవమున

“చతుర్ముఖముఖా ఇత్యాదౌ వర్ణాజగణే౽పిచ,
బ్రహ్మనామాంకితత్వేన కావ్యాదావతిశోధనః" యనియు.

76
మరలఁ జరత్కారచంద్రిక యందు

“వర్ణో౽పి జగణశ్చైవ బ్రహ్మనామాక్షరో (రే)శివః” అనియు.

77
మరల, సాహిత్యరత్నాకరమున

"జగణ స్సూర్యదైవత్యో రుజం హంతి న దోషకృత్,
గణానా ముత్తమోజ్ఞేయో గ్రహాణాం భాస్కరో యథా.”

78
కావ్యచింతామణియందు
క.

అవివేకులు జగణంబును, భువి రోగము సేయు ననుచుఁ బోనాడుదు రో
కవివర్యులు శబ్దార్థము, వివరింపరు రోగహరము విదితము గాఁగన్.

79


వ.

అనియు ననేకవిధముల జగణమును బేర్కొనియున్నారు. ఇందుకుఁ బూర్వకవి
ప్రయోగములు.

80
మాఘకావ్యమున

"శ్రీయఃపతి శ్శ్రీమతి" యనియు.

81
భారవికావ్యమున

"శ్రియః కురుణా” మనియు.

82
ఉత్తరరామచరితమున

"అలం కవిభ్యః పూర్వేభ్య” యనియు.

83
కాలనిధానమున

"శ్రియః కరారోపిత రత్నముద్రికా" యనియు.

84
మణిదర్పణమున

"దివాకరం నమస్కృత్య" అనియు.

85
ఛప్పన్నమున

"ప్రణమ్య లోకకర్తార” మనియు.

86
గణితశాస్త్రమున

“త్రిలోకరాజేంద్ర కిరీటకోటీ" యనియు.

87
లక్షణదీపికయందు, వీరాచార్యులు—

"ప్రణమ్య విద్వజ్జనపారిజాత” మనియు.

88


వ.

ఇట్లు మహాకవిప్రయోగము అనేకము లున్నవిగనుక జగణము శుభగణసంయుక్త
ముగాఁ బ్రయోగింపనగును.

89
భగణమునకు
క.

శశి పతియు గ్రహము హాస్యము, రసము సుఖద మురగయోని రాశి వృషము పే
డి సురగణము మృగశిర యుడు, పస తెల్లన వైశ్యకులము భగణంబునకున్.

90


వ.

అధిదేవత, గ్రహము, చంద్రుఁడు, హాస్యరసము, సుఖమునిచ్చునది, సర్పయోని,
వృషభరాశి, నపుంసకము, దేవగణము, మృగశిరానక్షత్రము, తెల్లనికాంతి వైశ్యజాతి.

91
పాదాంగచూడామణియందు

చంద్రుఁ డధీశ్వరుం డమృతసారము కాంతియు విట్కు లంబు త
చ్చంద్రముఁడే గ్రహం బతనిచాయయుఁ దెల్పు వృషంబు రాశి భో
గీంద్ర సుయోని దేవగణ మీప్సితసౌఖ్యము తత్ఫలం బిలన్
జంద్రునితార యెన్నగను జంద్రధరా భగణాన కెన్నఁగన్.

92
కవిసర్పగారుడమున
మ.

పతి చంద్రుం డహియోని రాశి వృష మావంశంబు వైశ్యంబు దై
వత మెన్నం గణ మాఫలంబు సుఖ మావర్ణంబు శ్వేతంబు సం
యుతనక్షత్రము చెప్పఁగా మృగశిరంబున్ దద్గ్రహం బానిశా
పతి హాస్యంబు రసంబు నాభగణ మేర్పా టయ్యె సర్వంసహన్.

93
సాహిత్యరత్నాకరమున

“దినకరముఖగ్రహే ష్వపి యది హ శశీ వర్తతే భజతి సుగుణాన్.”

94
కవిసర్పగారుడంబున
గీ.

చంద్రుఁ డేగ్రహంబు సరస నిల్చిన దాని, వర్ణ మై శుభాశుభంబు లిచ్చు
భగణ మేగణంబుఁ దగిలించెఁ దత్ఫలం, బిచ్చుఁ దనకుఁ జంద్రుఁ డీశుఁ డగుట.

95
నగణమునకు
క.

పరమాత్ముఁడు పతి తారక, భరణి మొదటిజాతి వన్నె పసుపు జయశ్రీ
కర మిష్టదంబు పురుషుఁడు, నరగణమును మేషరాశి నగణంబునకున్.

96


వ.

పరమాత్ముఁడు అధిదేవత, నక్షత్రము భరణి, బ్రాహ్మణజాతి, కాంతి పసుపు, ఆయు
రారోగ్యైశ్వర్యముల నిచ్చునది పురుషుఁడు, మనుష్యగణము, మేషరాశి.

97
పాదాంగచూడామణియందు
చ.

గుణములకెల్ల నాకరము కోరి కృతీంద్రుని డాసియున్నదు
ర్గుణగణదోషముల్ చెఱచుఁ గోరినవస్తువినూత్నరత్నభూ
షణముల నిచ్చుఁ గావున లసత్కవిశేఖరు లెంచు సర్వల
క్షణములు గల్గి యొప్పు బుధసన్నుతమైనగణంబు శంకరా.

98
కవిసర్పగారుడమున
మ.

పరమాత్ముం డధినాయకుండు జయసౌభాగ్యైకసామ్రాజ్యపూ
జ్యరమాసంతతు లీగి లబ్ధము నిజోపాంతస్థదుష్టాక్షరో
త్కందోషాఢ్యగణౌఘధూర్తగుణముల్ ఖండించుటల్ శీల మె
వ్వరికిన్ గాదనరాదు నా నగణ మవ్యాజస్థితిన్ బొల్పగున్.

99


వ.

నగణము సర్వోత్తమము గనుక దానికి గ్రహతారాయోనిగణరసజాతులు చూడ
నక్కరలేదు.

100
చమత్కారచంద్రికయందు

“ధనాకర స్సర్వలఘు ర్నగణో బ్రాహ్మ్యదైవతః”.

101
సాహిత్యచంద్రోదయమున

“నగణస్య సమీపస్థో దుర్గణ శ్శుభదో భవేత్,
అయః కాంచనతా మేతి వివర్ణ స్స్పర్శవేదినః.”

102
కవికంఠపాశమున

“పర్వతానాం యథా మేరు స్సురాణాం శంకరో యథా
మృగాణాం చ యథా సింహో గణానాం నగణ స్తథా.”

103
భీమనచ్ఛందంబున
క.

ఏగణముఁ గదియు నగణం, బాగణము సమస్తమంగళావ్యాప్తం బై
రాగిల్లు నినుము పరుసపు, యోగంబునఁ బసిఁడివన్నె నూనినమాడ్కిన్.

104
ఉత్తమగండచ్ఛందంబున
క.

చందనతరుసంగతిఁ బిచు, మందంబును బరిమళించు మాడ్కి నమందా
నందకర మైననగణము, పొందున దుష్టగణవర్ణములు శుభ మొసఁగున్.

105
అథర్వణచ్ఛందంబున
గీ.

పర్వతములందు మేరువుభాతి యగుచు, సర్వసురలందు శంకరుచంద మగుచు
నరయ మృగములయందు సింహంబు కరణి, గణములం దెల్ల నగణంబు గరిమఁ గాంచు.

106


వ.

అని నగణ మన్నిగణములకు శ్రేష్ఠముగాఁ జెప్పఁబడినది.

107

గణముల శుభాశుభఫలములు

క.

మయరసరజభనగణముల, సుయశా మొదలింట నిలుప శుభకనకభయ
క్షయభూతిరోగసుఖధన, చయ మొసఁగుం బతికి రంగజననాధమణీ!

108


వ.

ఈయెనిమిదిగణములు వరుసగా నెనిమిదిఫలముల నిచ్చును.

109
ఆదిమకవి భీమన (కవిజనాశ్రయము. సంజ్ఞ. 24)
క.

శుభసుఖరుక్క్షయధనకన, కభయైశ్వర్యములఁ జేయుఁ గ్రమమునఁ గావ్య
ప్రభులకు సుకవులు మొదలిడ, మభజసనయరతగణాళి మల్లయరేచా!

110
మఱియును

గణములజాతులు

క.

మగణంబు శూత్రకులజము, భగణము సద్వైశ్యజాతి బ్రాహ్మణజాతుల్
నగణయగణతగణంబులు, జగతీశులు జరలు నంత్యజాతి సగణమౌ.

111
ఉత్తమగండచ్ఛందమున
క.

మగణము నాలవకులజము, భగణము మూఁడవకులంబు బాపణ నయతల్
రగణము జగణము రాజులు, సగణము దానంత్యజాతి సర్వజ్ఞనిధీ!

112
అథర్వణచ్ఛందంబున
క.

నాయకుఁ డేకులమైనన్, బాయక తక్కులము గణము పద్యముమొదలన్
ధీయుక్తి నిలుప మేలగు, నేయెడ సంకరము నైన నెగ్గగుఁ బతికిన్.

113


వ.

అనియున్నది గనకఁ దెలిసి ప్రయోగింపఁదగినది.

114

గణసాంగత్యము

సీ.

మగణాంతనమయసల్ మహితభాగ్యములిచ్చు, యగణాంతమగుమసల్ యశ మొసంగు
రగణాంతభనతయల్ జగతి నేలించును, సగణాంతనభమయల్ సౌఖ్య మొసఁగుఁ
దగణాంతనభరజల్ ధనధాన్యముల నిచ్చు, జగణాంతయరతభల్ జయముఁ గూర్చు
భగణాంతతనరసల్ భాగ్యవంతుని జేయు, యగణాంతరతజభల్ దిగు లొసంగు


తే.

రాంతసమలును భాంతమయగణములును, దాంతమయలును మాంతమౌతజభరములు
సాంతజరలు జసల్ కీడు చాల నొసఁగు, నగణ మెనయ శ్రీ లొసఁగు నానందరంగ.

115


వ.

మగణము దాపున నగణమగణయగణసగణము లుండిన నుత్తమము. యగణము
వెనుక మగణనగణము లుండవచ్చును. రగణమువెనుక భగణము నగణము
తగణము యగణము నుండవచ్చును. సగణముదాపున నగణము భగణము
మగణము యగణము నుండవచ్చును. తగణము వెనుక సగణ భగణ గణజగణము
లుండవచ్చును. జగణము వెనుక యగణ రగణ తగణ భగణము లుండవచ్చును. భగ

ణము వెనుక తగణనగణ రగణసగణము లుండనగును. ఇవన్నియు నుత్తమములు.
యగణమువెనుక రగణతగణజగణభగణము లుండరాదు. రగణము వెనుక సగణమ
గణము లుండరాదు. భగణమువెనుక మగణయగణము లుండరాదు. తగణమువెనుక
మగణయగణము లుండరాదు. మగణమువెనుకఁ దగణజగణభగణరగణము లుండ
రాదు. సగణమువెనుక జగణరగణము లుండరాదు. జగణమువెనుక సగణము
కానేకారాదు. నగణముతో నేగణములు గూడినను నిర్దోషము లగును.

116

అక్షరసంఖ్యాప్రకరణము

కవిసర్పగారుడమున
క.

శివుసద్యోజాతాది, ప్రవిమలముఖపంచకమునఁ గ్రమమునను సము
ద్భవమై అ ఇ ఉ ఏ ఓ, లావిష్కృతి నవియు నేఁబదై వర్తిల్లున్.

117


వ.

ఈయేఁబదక్షరములలో నాదులు 16. కాదులు 25. యాదులు 9. మొత్త మేఁ
బదియక్షరములని యందురు. కొందఱు “ఆం. అః.”లకు అధిదేవత రుద్రుఁ డే
గావున “అః” అను అక్షరమును నిలిపి, ఆదులు 15. కాదులు 25. యాదులు
ళతోడ 10. మొత్తము 50 అక్షరము లందురు. కావునఁ దద్విధం బెఱిఁగించెద.

118


క.

ఈ యేఁబది వర్ణములకు, బాయక కులములు గ్రహములు ఫలబీజములున్
నాయకులు తెలియగావలె, శ్రీయుత యానందరంగ నృపసారంగా!

119

అక్షరగ్రహనిర్ణయము

సులక్షణసారమున
గీ.

ఆదులకు రవి కాదుల కవనిజుండు, చాదులకు బుధుఁడును గవిటాదులకును
దాదులకు బృహస్పతి శని పాదులకును, యాదులకు నెల్ల శశియు గ్రహంబు కృష్ణ.

120


వ.

అమొదలు అంవఱకుఁ గల 15 అక్షరములకు గ్రహము సూర్యుఁడు. కవర్గము 5
కి గ్రహము అంగారకుఁడు; చవర్గము 5కి బుధుఁడు; టవర్గము 5కి శుక్రుడు;
తవర్గము 5కి బృహస్పతి; పవర్గము 5కి శని; యాదులు 10కి చంద్రుడు; ఇది
అక్షరగ్రహనిర్ణయము.

121

అక్షరములజాతులు, వానిశుభాశుభఫలములు

సీ.

అచ్చులలో ఌౡ అం ఋౠల్ దక్కఁగఁ, దక్కినయక్షరదశకమును గ
వర్గునఁ గలయైదువర్ణముల్ ఝడణతల్, క్షధదపబభయవశషహ లెన్న
ముప్పదియక్షరంబులు శుభంబు లొసంగు గొదువయిర్వది లిపుల్ కొదువపఱుచు
నాద్యక్షరములు పదైదును గచటవ, ర్గాక్షరసమితి పదైదు గూడ

తే.

విప్రజాతులు తపవర్గవితతి రవలు, క్షత్త్రియకులంబు యలశషసహలు వైశ్య
జాతి ళక్షఱ లొగి శూద్రజాతి యయ్యె, వరుస నానందరంగ భూవరపతంగ.

122


వ.

అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఐ ఓ ఔ క ఖ గ ఘ జ ఝ డ ణ తక్ష ద ధ ప బ భ య
వ శ ష హ యీముప్పదియు నుత్తమములు. కడమ కూడనివి. అకారముమొదలు
ణకారమువఱకును గల 20 యక్షరములు బ్రాహ్మణజాతిని. త థ ద ధ న ప ఫ బ
భ మ ర వ యీ 12 అక్షరములు క్షత్త్రియజాతివి, య ల శ ష స హ యీ
6ను వైశ్యజాతివి. ళ క్ష ఱ యీ 3 ను శూద్రజాతివి గనుక తెలియునది.

123

ఏఁబదియక్షరముల కధిదేవతలు

సీ.

అగజచక్షడఫల కధిపతి విష్ణుండు, సంసపమహలకు హరుఁడు కాకు
బ్రహ్మ, ఈశలకు శ్రీ, భజఓఉలకు గౌరి, ణసలకు వాణి నేనాని ఛాకు
ధషలకు సూర్యుండు, ధాకుఁ బన్నగవైరి, తాకు శేషుఁడు నందిదాకు, భూమి
యాకు, గణేశుఁడు మా, కాశ్వినేయు ల్బ, ౡలకు వసువులు ఌకును, నగ్ని


తే.

డరలకు, శమనుండు టాకు, నైరృతి ఠాకు, జలపతి వాకు, ఖయలకుఁ గాలి
ఐఈలకు మరుండు, ఔకుఁ జాముండియు, వారాహి ౠకుఁ, గౌమారి ఋకును

124


తే.

అదితి ఊకును, బంచభూతాళి ళాకు, ఞాకుజినుఁ, డభ్రకరి లాగు, ఝాకు భైర
వుండు, ఏకు వసంతుండుఁ, బొసఁగ దొరలు, రమ్యగుణహారి యానందరంగశౌరి!

125
అథర్వణచ్ఛందంబున
క.

వసుధామరులకుఁ గచటలు, వసుధాపతులకును దపరవలు వైశ్యులకున్
యసహలశషలును శూద్రులు, కసమవుళక్షఱలు చెప్పనగుఁ బద్యాళిన్.

126
మఱియు ననంతచ్ఛందంబున
క.

ఆదులు వర్గత్రయమును, భూదేవత లుతపవర్గములు రవలున్ ధా
త్రీయుతులు యలశషసహ, లాదట నూరుజులు ళక్షఱాఖ్యలు శూద్రుల్.

127

అక్షరాణాం వర్ణవివేకః

అలంకారసంగ్రహే

"ద్విజాతీయః పంచదశ పూజ్యాః కచటవర్గజాః
నృపాన్వయా స్తపరవా వర్ణా ద్వాదశ సంస్మృతాః.
యలహా శ్శషసా వైశ్యకులజాః పూజితాళ్చషట్,
ళక్షరా శ్శూద్రకులజా స్త్రయోవర్ణాః ప్రకీర్తితాః”

128
కవికంఠపాశే

“అక్షరే పరిశుద్ధే తు నాయకో భూప ఉచ్యతే”

129
చమత్కారచంద్రికాయామ్

“న్యస్తాః కావ్యముఖే వర్ణా సత్తదైవతమూర్తయః,
కర్తుః కారయితు శ్శోతుః కల్పయంతి శుభాశుభమ్”
అని యున్నది గనుక దెలియునది.

130

భూసురాది చతుర్జాతులవర్ణములు

క.

ధవళారుణపీతశ్యా, మనసనభూషలు పయోవిమలఘృతమధ్వా
సనము లుపహారములు గా, నవనీసురాద్యక్షరముల కగు రంగనృపా.

131


తా.

బ్రాహ్మణజాత్యక్షరములకుఁ దెల్లనివస్త్రభూషణములు, నుపహారము పాలు. క్షత్రియజాత్యక్షరములకు నెఱ్ఱనివస్త్రభూషణములు నుపహారము నేయి. వైశ్యజాత్యక్షరములకుఁ బచ్చనివస్త్రభూషణములును నుపహారము తేనె. శూద్రజాత్యక్షరములకు నల్లనివస్త్రభూషణములు నుపహారము మద్యము. కాన నేజాతియక్షరము లాదిని బ్రయోగించుచున్నారో, యాజాతియక్షరములకుఁ దగినవస్త్రభూషణనైవేద్యముల నర్పించి మాతృకాపూజ చేసి ప్రబంధము మెరవడిచేయవలయును గనుకఁ గవు లైనవార లీరీతిని నడిపించునది.

ఇందుకుఁ గవిసర్పగారుడమున
సీ.

కాదిత్రివర్గవర్ణాదికి మౌక్తిక, వజ్రభూషలు తెల్పు వస్త్రచయము
తపవర్గరవవర్ణతతి కబ్జరాగంబు, తొడవులు నలువలు తొగరుచాయ
యలశషసహబీజముల కగుపుష్యరా, గాభరణములు పీతాంబరములు
ళక్షరములకు నీలాలసొమ్ములు కారు, కొనునీలివన్నెలకోక లమరు


తే.

వరుస నీనాల్గుతెఱఁగులవర్ణములకు, ననుభవం బగు ద్రవ్యంబు నానవా(బా)లు
నాజ్యమును గమ్మదేనియ యాసవంబు, దీనిఁ దెలియ కేగతిఁ గవి యౌను జగతి.

132


క.

ఇత్వము నేత్వ మధోముఖ, మైత్వం బిల నూర్ధ్వముఖము నౌత్వము నుత్వం
బోత్వము పార్శ్వముఖంబులు, నత్వంబులు సమముఖంబు లగు రంగనృపా!

133
అనంతచ్ఛందంబున
గీ.

ఇత్వ మేత్వములును నిల నధోముఖములు, నైత్వ మూర్ధ్వముఖము నొత్వములును
నుత్వదీర్ఘ మోత్వ మొగిఁ బార్శ్వముఖములు, సహజవర్ణసమితి సమముఖములు.

134
మఱియును
గీ.

మీఁదిముఖము లైన మిడియించుఁ బతి నేఁట, బార్శ్వముఖము లైనఁ బాయు లక్ష్మి
క్రిందిముఖము లైనఁ గీడు కల్గించును, సమముఖంబు లైన సౌఖ్య మొదవు.

135

వ.

అని యున్నది గనుకఁ బద్యాదిని శ్రీకారము చెప్పకున్నట్టైన శుభాక్షరముగా విమ
ర్శించి యాదిని ముఖాక్షరముగా నిలుపఁదగినది.

136

అమృతాక్షరవిషాక్షరనిర్ణయము

కవికంఠపాశే

“అకచటతపయశవర్గా దమృతం ప్రోక్తం విపాణి దీర్ఘాణి”

137
గోకర్ణచ్ఛందంబున
క.

అమృతాక్షరములు హ్రస్వము, లమరఁగ దీర్ఘములు విషము లనఁబడు దీనిన్
గ్రమమున నకచటతపయశ, సముదయమునఁ దెలిసి నిలుపఁజనుఁ బద్యాదిన్.

138


తా.

దీర్ఘములు లేనియక్షరము లమృతాక్షరములు గనుక నవి పద్యాది నుంచఁదగినవి. దీర్ఘాక్షరములు విషాక్షరములు గనుక నవి పద్యాది నుంచరా దనుట. అయినను నాయక్షరము సంయుక్తాక్షర మైనచోఁ దనగుణమును విడిచి వేఱుగుణమును బొందును.

ఇందుకు లక్ష్యము, మాతృకానిధానే

"నిశారజః క్షారయోగా త్తక్షణా ద్రక్తతాయథా”

139
భీమన
క.

వినఁబడు దీర్ఘము విషమును, ననియెడివర్ణమ్ము సంయుతాక్షర మైనన్
మునుపటిగుణములు విడివడి, తనరన్ వేఱొక్కగుణముఁ దాల్చును బేర్మిన్.

140


వ.

పచ్చనిపసుపు తెల్లనిసున్నము గూడిన వానివర్ణములు విడిచి రక్తవర్ణ మైనట్టు లనుట.
శ్రీకారము దీర్ఘాక్షరమును సంయుక్తాక్షరము నయియుండి యెట్టు లత్యుత్తమ
మయ్యె ననఁ దద్విధంబు వివరించెద.

141


చ.

శరలకుఁ జంద్రుఁ డీకి రవి చాలగ్రహంబు లటంచు వార లి
ద్దఱు హితు లంచు నీశలకు దేవత లక్ష్మి యటంచు రాకు శ్రీ
కరుఁ డగువహ్ని యంచు మును గావ్యులు శ్రీ శుభవర్ణనిర్ణయం
బరసి ఘటించి రౌ కృతులనాది నభీష్టము లుల్లసిల్లఁగన్.

142


తా.

శవర్ణమును ఈకారమును రేఫయును గూడిన శ్రీకారమయ్యెను. అందు శవర్ణరేఫలకుఁ జంద్రుఁడు గ్రహము. ఈకారమునకు సూర్యుఁడు గ్రహము. గనుక వారి కిద్దఱికి నన్యోన్యమైత్రి. ఈకారశవర్ణముల కధిదేవత లక్ష్మీదేవి. రేఫ కధిపతి యగ్ని.

చమత్కారచంద్రికయందు

“లక్ష్మీప్రదో హుతాశనః” అనియు.

143
శాస్త్రకారకుఁడు

"శ్రియ మిచ్ఛే ద్ధుతాశనాత్" అనియుఁ జెప్పుటచేత నాయగ్నియు లక్ష్మీప్ర
దుఁడుగను, శ్రీకారము లక్ష్మీప్రదమని యెఱుఁగునది.

144

లక్ష్యము

సులక్షణసారంబున
క.

శ్రీకారము ప్రథమంబునఁ, బ్రాకటముగ నున్నఁ జాలు బహుదోషంబుల్
పోకార్చి శుభము లొసలును, బ్రాకటముగ నినుము సోఁకుపరుసముమాడ్కిన్.

145
మఱియు, విశ్వేశ్వరచ్ఛందంబున
గీ.

దిక్ప్రసిద్ధంబుగా మును దీర్ఘమయ్యు, ననఘతరసంయుతాక్షర మగుటఁ జేసి
ధరను శ్రీకార మతిశుభదాయి యగుచుఁ, గాంచె నాద్యుక్తలిఖితవిఖ్యాతి రామ!

146

సురనరతిర్యగ్రౌరవలక్షణము

గీ.

పంచవర్గాంతదుర్వర్ణపంక్తి దక్క, కొదువ సురగతు లగు నవి గురువు లైన
నృగతులగు నధోగతి యగురేఫ తక్కు, నఙఞణమలు తిర్యక్కు లానందరంగ.

147


తా.

కవర్గు, చవర్గు, టవర్గు, తవర్గు, పవర్గు యీ 5 వర్గువులయందలి కడపటియక్షరము లగు ఙఞణనమలుగాక తక్కినయిరువదియక్షరములు సురగతులు. ఆయక్షరములు గురువులైన నరగతులు. రేఫమాత్ర మధోగతి. ఆరేఫతక్కఁ దక్కినయకారాద్యక్షరములు ఙఞణనమలు ఇవి తిర్యగ్గతు లనఁబడును. పద్యాదిని సురగతులు నరగతులు నైన యక్షరములఁ బ్రయోగింపవచ్చును. తిర్యగ్గతులు కూడవు. అధోగతియగు రేఫ పనికిరాదు.

ఇందుకు లక్ష్యము, శ్రీధరచ్ఛందంబున
క.

సురవరతిర్యగ్రౌరవ, వరగతు లగుభూసురాదివర్గాక్షరముల్
గురులఘువులు నరసురగతు, లరిరాయనిఫాలసోమ యవనీపాలా.

148
కవిసర్పగారుడమున
సీ.

నణమఙఞావిహీనం బగువర్గపం, చకములఁ గల్గునక్షరము లెల్ల
నెరయంగఁ గుఱుచలై నిర్జరగతులగు, నిడుదలై యుండిన నృగతు లగును
న ఋ ౠ ఌ ౡ ఙఞణమలు రేఫవిహీన, యాద్యష్టకమును దిర్యక్క్రమంబు
అగుగాని రేఫ యధోగతి యగు నిందుఁ, బ్రత్యేకదళము లేర్పడఁగ వరుస


తే.

సురనృగత్యక్షరంబులు శుభము లొసఁగు, మధ్యఫలద తిర్యగ్గతమాతృకాళి
నిరయ గతవర్ణ మొక్కటి నెరయఁ గాను, ప్రౌఢకవులు రచించుకబ్బముల మొదల.

149

క.

సురనరగతు లిచ్చు శుభము, మఱి తిర్యగ్వర్ణపంక్తి మధ్యమఫలమున్
నెరపు నధమంబు రేఫయు, సరసా యానందరంగ సదయాపాంగా!

150
మఱియు, కవికంఠపాశమున

“దేవనృతిర్యగ్రౌరవభేదా గతయ శ్చతుర్విధావర్ణాః,
తత్క్రమలఘవో దేవాః కచటతపా అధనరాదీర్ఘాః.”

151


వ.

అని యున్నది గాన తెలియునది.

అల్పప్రాణ మహాప్రాణాక్షరములు

"వర్గాణాం ప్రథమతృతీయా అంతస్థా శ్చాల్పప్రాణాః,
యథా తృతీయా స్తథా పంచనూ ఇతరే సర్వే మహాప్రాణాః.”

152
శ్రీధరచ్ఛందంబున
క.

అల్పప్రాణము లతిమృదు, జల్పోచితపచనపంక్తి ఝఛఘఢఠములౌ
నల్పకఠోరాక్షరముల,వల్పాటగునవి మహాయుతప్రాణంబుల్.

153


క.

సరళము లగువర్ణములే, ధర నల్పప్రాణములు పదంపడి కఠినా
క్షరతతులె మహాప్రాణము, అరయగ నానందరంగ యమితశుభాంగా!

154


తా.

లలితములై యొత్తఁబడనియక్షరము లల్పప్రాణము లనఁబడును. అవి మంచివి. కఠినములై యొత్తఁబడిన యక్షరములు మహాప్రాణములు అవి మంచివి కావు.

విషమాక్షరవిచారము

ఉత్తమగండచ్ఛందంబున
క.

అకచటహ లనఁగ నైదును, బ్రకటంబుగ ఋతుల గిరులఁ బదునొక్కింటన్
వికటముగఁ బెట్టి పద్యము, సుకవులు సత్ప్రభుల కీ రశుభదము లగుటన్.

155
మఱియు, భీమనచ్ఛందమున
క.

అకచటతప లీయారును, బ్రకటితముగ ఋతుల గిరులఁ బదునొక్కింటన్
వికటముగఁ బూని చెప్పిన, నకటా మఱి మడియకుండ నజుఁడో హరుఁడో.

156
అనంతచ్ఛందంబున— (1.25)
క.

పురశరరసగిరిరుద్రుల, నరయ నకచటతప లిడుట యనుచిత మయ్య
క్షరములు నరచఛజంబులు, బరిహరణీయంబు లాదిఁ బంకజనాభా.

157


వ.

అని యున్నది గనుకఁ దెలిసి ప్రయోగించునది.

158


క.

కృతులన్ స్త్రీపుంలింగా, ద్భుతశబ్దము లునుపకను నపుంసకము లిడన్
వెతఁ బొరయును పతికి వజా, రతవిజయానందరంగ రాయబిడౌజా.

159
కవిసర్పగారుడమున
క.

సంగతిగఁ గృతుల స్త్రీపుం, లింగసుశబ్దములు నిలుప లెస్సగు మొదలన్
వెంగలిబుద్ధి నపుంసక, లింగం బగుశబ్ద మిడిన లేవు సుఖంబుల్.

160


వ.

అని యున్నది గనుకఁ తెలిసి ప్రయోగింపఁదగినది.

161

దేవతావాచకభద్రవాచకములు

క.

శుభవిజయదేవతా శ్రీ, విభవాయురభీష్ణకుశలవిధుముఖ్యము లౌ
శుభశబ్దంబులు మొదలన్, బ్రభువులపైఁ జెప్పవలయు రంగనృపాలా.

162


వ.

పద్యాదిని మంగళకరముగా నుండుశబ్దములు నిలుపఁదగు ననుట.

163
ఇందుకు లక్ష్యము, కవికంఠపాశంబున

“దేవతావాచకా శ్శబ్దా యేచ భద్రాదివాచకాః,
తే సర్వే నైవ నింద్యా స్యు ర్గణతో లిపితో౽పి వా."

164
సాహిత్యచూడామణియందు

“అధసిద్ధిప్రణవాదిశ్రీ చంద్రసూర్యదీర్ఘాయుః,
ఆరోగ్యకుశలవాణీసాగరమేఘాదిమంగళాశ్శబ్దాః"

165
కవిసర్పగారుడమున
క.

తరణీందుభద్రసాగర, గిరికుశలారోగ్యమేఘగీస్తుత్యాయు
స్ఫురదమలకీర్తిసుమనో, త్కరాదివాచకము లిడఁగఁ దగుఁ బద్యాదిన్.

166
మఱియును
గీ.

దేవతావాచకముల వర్తిల్లె నేని, భద్రవాచకములఁ గూడి పరగెనేని
నగణసంపర్కలబ్ధితోఁ దగియెనేనిఁ, గ్రూరసంయుక్తలిపు లైనఁ గూడు మొదల.

167
మఱియును, కావ్యచింతామణియందు
క.

నిరుపమకావ్యాదిని సుర, వరభద్రాదిప్రశస్తవాచకపదముల్
బెరసివఁ దద్దుష్టగణాక్షరదోషము లుజ్జగించి సంపద లిచ్చున్.

168
మఱియు, ననంతచ్ఛందంబున
క.

[2]తనరఁగ శుభవాచకములు, ఘనతరముగ దేవవాచకంబులు నై పే
ర్చినగణములు వర్ణంబులు, నవింద్యములు గృతులమొదల నహిపతిశయనా!(1-28)

169

పృథివ్యాదిపంచతత్త్వములు

గీ.

ఎనిమిదియు వాలు గా ఱైదు నేడుగడెలు, పంచతత్త్వంబు లుండు రేపగలు వరుస
నందు గురుశుక్రశనులవ్యోమాది యగుచు, నడుచునవి మోహనాంగ! యానందరంగ!

170

తా.

పృథ్వీతత్త్వమున కెనిమిది గడియలు, జలతత్త్వమునకు నాలుగు గడియలు, అగ్నితత్త్వమునకు నాఱుగడియలు, వాయుతత్త్వమున కైదుగడియలు, నాకాశతత్త్వమునకు నేడుగడియలు. మొత్తము 40 గడియలు. ఆదివారము మొదలు బుధవారమువఱకుఁ బృథివ్యాదిగాఁ జరించును. గురుశుక్రశనివాసరముల నాకాశము మొదలుగాఁ జరించును. ఈయైదును వరుసగా సంపద, శుభము, ఆర్తి, రోగము, దారిద్ర్యము నిచ్చునవి గనుక నివి తెలిసి కవిత్వము చెప్పునది.

ఇందుకు లక్ష్యము, కవిసర్పగారుడమున
సీ.

ఉర్వికి నెనిమిది యుదకంబునకు నాల్గు, గాడ్పునెచ్చెలి కాఱు గాలి కైదు
నాకాశమున కేడు నై తత్త్వముల కిట్లు, ముప్పదిగడియలు తప్పకుండు
రవిశశికుజబుధదివసంబులను భూజలాగ్నివాయువులకు నాది యగుచు
వరుసఁ బ్రవర్తిల్లు గురుశుక్రశనులందు, నాకాశమున నాది యగుచు నడుచుఁ


తే.

గాన నిట్లుండు వారసంగతులు దెలిసి, తత్త్వవేళల నాయైదుతత్త్వములకుఁ
బ్రమదశుభమృతిరుగ్దరిద్రత్వములగు, ఫలముల నెఱింగి కవిత చెప్పంగవలయు.

171
మఱియును
క.

కలిమి శుభ మార్తి రోగము, తిలకింపఁ దరిద్రతయుఁ బృథివ్యస్తేజో
నిలగగనవేళలన్ గవి, తలు చెప్పిన నొదవు రంగధరణీనాథా!

172

బాలాదిపంచస్వరములు

.
సీ.

మొనసి కకారంబుమొదలు క్షకారంబు, వఱకును గల్గినవర్ణసమితి
ముప్పదైదక్షరంబులకు బాలకుమార, రాజ్యవృద్ధమృతస్వరంబు లనఁగఁ
బరగుచు నొక్కొక్కస్వరమున కాఱేసి, గడియ లేడేసి యక్షరము లొప్పు
గ్రమముగా నది యింద్రయమవరుణకుబేర, భర్గదిక్కులరేయుఁ బగలు వెలుఁగు


తే.

నెట స్వరములొండె దానికి నెదురుకొనుచుఁ, గుశలధనధాన్యపీడార్తు లొసగువాని
ఫలముల నెఱింగి కవి కవిత్వంబు పలుకు, నాయకుని జేరు లక్ష్మి యానందరంగ!

173


తా.

కకారము మొదలు క్షకారమువఱకుఁ గలిగిన 35 అక్షరములకు, బాలస్వరము, కుమారస్వరము, రాజ్యస్వరము, వృద్ధస్వరము, మృతస్వరము నన 5 విధంబుల స్వరములు చెలఁగు. నందొక్కొక్కస్వరమునకు వరుసఁగ నేడేసియక్షరములవంతునఁ జెల్లును. ఒక్కొకస్వరమున కాటేఱేసిగడియలచొప్పున గలుగుటఁ జేసి, బాలస్వరము తూర్పునను, గుమారస్వరము దక్షిణమునను, రాజ్యస్వరము పడమరను, వృద్ధస్వర ముత్తరమునను మృతస్వర మీశాన్యమునను రేయుంబవలు వెలుగుచు, సంతోషము ధనలాభము, రాజ్యలాభము, శరీరపీడ, యధికక్లేశము ననయైదు ఫలముల నిచ్చును గనుక

లక్షణకవి యగువాఁడు స్వరనిర్ణయ మెఱింగి యేదిక్కున స్వరమున్నదో యాదిక్కున కెదురుగాఁ గూర్చుండి కవిత్వము రచియించినఁ గృతిపతి కాయురారోగ్యభాగ్యములు గలుగును.

ఇందుకు లక్ష్యము, కవిసర్పగారుడమున
క.

అసదృశకాదిక్షాంతా, ర్ణసమూహంబునకుఁ దగు స్వరంబులు వరుసన్
పొసఁగంగను నేడింటికి, వెస బాలకుమారరాజ్యవృద్ధామృతముల్.

174
మఱియును
చ.

ప్రమదవిధిజ్ఞు లైనకవిరాజులు బాలకుమారరాజ్యవృ
ద్దమృతము లింద్రుదిక్కునఁ గృతాంతుఁడు కాపుర మున్నచోటఁ బ
శ్చిమమున నుత్తరంబునను శ్రీగళు దిక్కున నుండుఁ గానఁ బ
ద్యము నిడ దత్ఫలం బెఱిఁగి యాముఖమై రచియింపఁగాఁదగున్.

175


శా.

బాలాదిస్వరపంచకంబునకు నాభానూదయం బాదిగా
గాలంబు ల్విభజించి యాఱుగడియల్ గాఁ జేసి యొండొంటికిన్
వాలాయంబుగఁ బంచివేసి మన కావ్యంబుల్ కవిశ్రేష్ఠు లా
వేళన్ దత్ఫలనిర్ణయంబుకొలఁదుల్ వీక్షించి చెప్పందగున్.

176


క.

బాలస్వర మతిలాభము, పోలింపఁ గుమారరాజ్యములు ధనరాజ్య
శ్రీ లురుజాడ్యము వృద్ధం, బాలంబునఁ గడపునవలి దాఁగృతికర్తన్.

177


వ.

అని యున్నది గనుక లెస్సగాఁ దెలిసి కవిత్వముం జెప్పునది.

178

రసమైత్రి

క.

వరకరుణహాస్యము లు, ర్వరవీరభయానకములు రౌద్రాద్భుతముల్
మఱి బీభత్సము శృంగా, రరసముఁ గదియింపఁ దగదు రంగనృపాలా.

179


తా.

కరుణారసమునకు హాస్యరసమునకు వీరరసమునకు భయానకరసమునకు, రౌద్రరసమునకు, అద్భుతరసమునకు, భీభత్సరసమునకు, శృంగారరసమునకు నవ్యోన్యవైరము గనుక రసమైత్రిఁ దెలిసి గణములలోఁ బ్రయోగించఁదగినది.

ఇందులకు, సులక్షణసారంబున
గీ.

మున్ను శృంగారభీభత్సములకు నొంట, దరులు తమలోన వీరభయానకములు
సమవిరోధంబు రౌద్రాద్భుతముల కపుడు, హాస్యకరుణములకుఁ బగ యనుదినంబు.

180

జీవనిర్జీవవ్యాధితనక్షత్రములు

వాసిష్ఠసంహితయందు

“నిర్జీవం సప్తఋక్షాణి సజీవం ద్వాదశ స్మృతమ్,
వ్యాధితం నవఋక్షాణి సూర్యఋక్షం సమారభేత్.”

181
సాహిత్యచూడామణియందు —

"జీవయుక్తే ఘనం భాగ్యం వ్యాధి ర్వ్యాధియుతేషు చ,
జీవహీనేతు మరణమ్ ఇతి.

182


క.

సతచుక్కలు తగు నిర్జీ, వత మఱి పండ్రెండు జీవవంతంబులు వ్యా
ధితములు దొమ్మిది రవివిల, సితనక్షత్రంబుమొదలు శ్రీరంగనృపా.

183


తా.

సూర్యుఁ డేనక్షత్రమున నున్నాఁడో యదిమొద లేడునక్షత్రములు నిర్జీవము లనఁబడును. వానియందు సాహిత్యం బారంభింపరాదు. అవ్వలిపండ్రెండునక్షత్రములు సజీవము లనఁబడును. అవి మంచివి. తఱువాతినక్షత్రములు వ్యాధితములు
గనుక నవి కారావని తెలియనది.

ఇందుకు లక్ష్యము, అధర్వణచ్ఛందము
క.

కమలహితుఁ డున్ననక్ష, త్రము మొదలుగ నేడు దోషతమములు నడుమన్
బ్రమదప్రదములు పండ్రెం, డమరగ నశుభములు తొమ్మి దిడఁ బద్యాదిన్.

184

జీవపక్షమృతపక్షనక్షత్రములు

కవికంఠపాశమున

“రాహుభుక్తాని ఋక్షాణి జీవపక్షే త్రయోదశ,
చతుర్దశకభోజ్యాని మృతపక్షే ప్రకీర్తితాః."

185


గీ.

రాహు వసియించినట్టితారకము మొదలు, నవలిపదునాల్గు మృతము లౌ నతనిభుక్తి
కమర పదుమూఁడు జీవయుక్తములు శ్రీక, రంబు లవి యగు నానందరంగభూప!

186


తా.

రాహువు తలక్రిందుగా నక్షత్రములఁ జరించువాఁడు గనుక నాతఁడున్ననక్షత్రముమొదలు పదునాలుగునక్షత్ర ములు మృతనక్షత్రములు. కాన వానియందుఁ బ్రబంధాదిపద్య ముపక్రమించిన నశుభము. అతని భుక్తి కిమ్మైననక్షత్రములు పదుమూడు జీవనక్షత్రములు గనుక నవి మిక్కిలి శుభకరములని తెలియునది.

ఇందుకు లక్ష్యము, శ్రీధరచ్ఛందంబున
క.

విదితముగ రాహుభుక్తికి, నొదవినపదుమూఁడు జీవముక్తము లవియు
న్నదిమొదలు నెదుటితారలు పదునాలుగు మృతము లనఁగఁబడు నెల్లెడలన్.

187
కవిగజాంకుశమున
క.

పతి మృతుఁ డగుఁ బద్యాదిని, మృతనక్షత్రంబు లిడిన; మేదురసౌఖ్యా
న్వితుఁ డగు నమృతము లన న, ప్రతిమము లగుతారకములఁ బద్యాది నిడన్.

188


వ.

అని యున్నది గనుకఁ దెలియునది.

189

దగ్ధజ్వలితధూమితనక్షత్రములు

సంహితాసారే

"క్రూరోన్ముక్తం దగ్ధంక్రూరయుతం జ్వలితధూమితం పురతః,
శన్యర్కరాహుమాహేయ ఏతే పాపాః ప్రకీర్తితాః.”

190


క.

ఇనశనికుజరాహువు లొ, య్యన విడిచినయవియు నిలిచినవి యెదిరినవిన్
ఘనదగ్ధము లన జ్వలితము, లన ధూమితము లనుతార లగు రంగనృపా!

191


తా.

సూర్యుడు, శని, అంగారకుఁడు, రాహువు యీ నలుగురు క్రూరగ్రహములు గనుక నాగ్రహము లనుభవించి విడిచిన నక్షత్రములు దగ్ధము లనియు, వాసముచేయు నక్షత్రములు జ్వలితములనియు, బ్రవేశింపఁబోవు నక్షత్రములు ధూమితము లనియుఁ జెప్పఁబడును. కావునఁ బద్యాదిగణముయొక్కనక్షత్రము, ప్రబంధమారంభించిననాఁటి నక్షత్రము, ప్రభువునక్షత్రము నీమూఁడును పైనుదాహరింపఁబడిన మూఁడుతెగలలో చొఱకయుండవలెను.

ఇందుకు లక్ష్యము - గోకర్ణచ్ఛందంబున
క.

క్రూరగ్రహభుక్తము లగు, తారలు దగ్ధములు; ధూమితంబులు వానిన్
జేరంగ నెదుర నున్నవి; క్రూరయుతంబు లవి యెఱిఁగికొను జ్వలితంబుల్.

192
అధర్వణచ్ఛందంబున
గీ.

ధనముఁ గోలుపుచ్చు దగ్ధనక్షత్రంబు, చాలఁగీడుఁ దెచ్చు జ్వలితతార
ధూమితంబు మారితునిఁ జేయు మున్నటు, గాన మొదట నిలుపఁగాదు వీని.

193
మఱియును, కవికంఠపాశంబునందు

"ఏనం గజానాం నక్షత్రం కర్తు ర్జన్మర్క్షకం తథా,
కర్తుర్నామాదివర్క్షం శ్లోక సాద్యక్షరర్క్షకమ్.

194


అనుకూల్యం సముద్ద్వీక్ష్య శ్లోకాదా రచయే ద్భుధః,
అన్యథా దోషబాహుళ్య ముభయో స్స్యాన్న సంశయః”

195
కవిసర్పగారుడమున
గీ.

గణముతారయుఁ బతితారకమును రెండు, క్షేమసిద్ధికి వ్యాధినిర్జీవగతుల
జ్వలితధూమితదగ్ధప్రసంగములను, గ్రూరముక్తులు గాకుండఁ గూర్పవలయు.

196
మఱియును, గోకర్ణచ్ఛందంబున
క.

పతితారకుఁ బద్యముఖ, స్థితతారకమునకుఁ జెలిమి తెలియక జడుఁడై
కృతియొండెఁ బద్యమొండెను విదితంబుగఁ జెప్పునతఁడు వీరిఁడి కాఁడే.

197

అక్షరములకు నామనక్షత్రములఁ దెచ్చు వివరము.

చూచేచోలా అశ్విని ఇత్యాదులు.


వ.

ఈనాలు గక్షరములు నక్షత్రములకు నాలుగు పాదములుగాఁ దెలియఁగలది.

198

షష్ఠాష్టకములు

గీ.

మెఱయుమీనతులలు మిథునవృశ్చికములు, వృషభధనులు మకరమృగవరములు
ఘటకుళీరములను గన్యకామేషముల్, చేరఁదగదు రంగధారుణీంద్ర!

199


తా.

మీనతులలకు, మిథునవృశ్చికములకు, వృషభధనుస్సులకు, మకరసింహములకు, కుంభకటకములకు, కన్యామేషములకును, షష్ఠాష్టకములు. కావునఁ బద్యాద్యక్షరరాశికిని, ప్రభువు నక్షత్రరాశికిని ఇవి పరిహరించి చెప్పవలెను.

ఇందుకు లక్ష్యము, విశ్వేశ్వరచ్ఛందంబున
గీ.

మీను తూని కోల మిథునంబుఁ దేలును, ఎద్దు విల్లు మొసలి పెద్దమెకము
కుండ యెండ్రకాయ గొఱ్ఱెయ మగువతోఁ గూడెనేని మిగులఁ గూడ దండ్రు.

200

సత్త్వరజస్తమోవేళానిర్ణయము

గీ.

చంద్రగురుదినముల సత్త్వంబు కుజశుక్ర, దివసములను రజము రవి బుధార్కి
వాసరములఁ దమము వరలు నాలుగు గళ్లు, లగ్న మండ్రు శనికి రంగభూప!

201


తా.

సోమగురువారముల నుదయాది సత్త్వవేళ. అంగారకశుక్రవారముల నుదయాది రాజసవేళ. రవిబుధశనివారముల నుదయాది తామసవేళ. శనివారము తప్ప తక్కినవారములయందు లగ్న మొకటికి మూడుమ్ముప్పాతిక గడియ. శనివారమునాఁడు లగ్న మొకటికి నాలుగు గడియలు.

ఇందుకు లక్ష్యము, సంహితసారమున

“సత్త్వవేళాచంద్రగురూ రాజసా కుజభార్గవౌ,
అర్కార్కిసోమపుత్రాశ్చ తమోవేళా చతుర్ఘటీ!”

202
విశ్వేశ్వరచ్ఛందంబున
గీ.

శశిగురుదినోదయంబుల సత్త్వ మొదవుఁ, గుజకవిదినోదయంబుల రజము పరగుఁ
దరణిబుధశనిదినములఁ దమము వెలయ, నాల్గుగడియలు దనరు లగ్నంబు శనికి.

203


వ.

ఇంక నీమూఁడువేళలలో సాహిత్యము చెప్పుటకు నిర్ణయము.

204


గీ.

ఝషధనుస్త్రీకటకములు సత్త్వవేళ, అజకులావృశ్చికవృషముల్ రజమువేళ
మకరిహరిఘటయుగము తమంబువేళ, రచనకు నయోగ్య మండ్రు శ్రీరంగధీర!

205

తా.

మీనము, ధనుస్సు, కన్య, కటకము యీనాల్గురాసులు కలవారిపేర సత్త్వవేళఁ బ్రబంధ మారంభింపరాదు. మేషము, తుల, వృశ్చికము, వృషభము, యీనాలుగురాసులు కలవారిపేర రాజసవేళయం దారంభింపరాదు. మకరము, సింహము, కుంభము, మిథునము యీనాల్గురాసులు గలవారిపేరఁ దామసవేళఁ బ్రబంధ మారంభింపరాదు.

ఇందుకు లక్ష్యము, కవిసర్పగారుడమున
సీ.

అంగనాచాపమత్స్యకుళీరరాసుల వెలయువారికి సత్త్వవేళలందు
వృషభతౌలీమేషవృశ్చికరాసుల వెలయువారికి రజోవేళలందు
మకరపంచాస్యయుగ్మకకుంభరాసుల వెలయువారికిఁ దమోవేళలందుఁ
గూర్చుండి కబ్బంబుఁ గూర్చియిచ్చిన భర్త మట్ట మేఁడాదికి మట్టుపడును


తే.

గవియు నన్నిదినాలకే కర్తతోడ, గంటగొట్టినచందాన గంతు వేయు
శిథిలమై కావ్యసరణి విచ్ఛిత్తిఁ జెందుఁ, గర్తృకారసంస్కారసంగతులఁ గూడి.

206


వ.

అని యున్నది కానఁ దెలిసి రచియించునది.

207
నక్షత్రములకు రాసు లేర్పఱచు క్రమము

అశ్వినీ భరణీ కృత్తికా పాదః మేషమ్ ఇత్యాదులు.

207

రాశ్యధిపతులు

గీ.

రవి హరికి రాజు కర్కికి నవనిజుఁ డజ, వృశ్చికములకు బుధుడు స్త్రీమిథునములకు
గురుఁడు ఝషధనువులకు శుక్రుండు వృషభ, తులల కార్కి మకరకుంభములకుఁ బతులు.

208


తా.

సూర్యుఁడు సింహమునకుఁ, జంద్రుఁడు కర్కాటకమునకు, నంగారకుఁడు మేషవృశ్చికములకు, బుధుఁడు కన్యామిథునములకు, బృహస్పతి ధనుర్మీనములకు, శుక్రుడు వృషభతులలకు, శని మకరకుంభములకు నధిపతు లని తెలియునది.

ఇందుకు లక్ష్యము కవిసర్పగారుడమున
చ.

దినపతికర్త కేసరి, కధీశుఁడు కర్కికిఁ జంద్రుఁ, డుర్వినం
దనుఁ డజవృశ్చికంబులకు నాథుఁడు, సౌమ్యుఁడు రాజు యుగ్మకాం
గనలకుఁ, జాపమత్స్యములకర్త బృహస్పతి, భార్గవుండు భ
ర్త నలిఁ దులావృషంబులకు, గ్రాహఘట ప్రభుఁ డర్కజుం డగున్.

209

గ్రహమైత్రి

సీ.

తరణికి శశికుజగురులు మిత్రులు శుక్రశనులు విద్వేషులు సముఁడు బుధుఁడు
చంద్రునకును సూర్యసౌమ్యులు మిత్రులు శనిశుక్రగురురుజల్ సమమువారు

కుజునకుఁ జంద్రార్కగురులు హితులు శుక్రార్కజు ల్తుల్యు లరాతి బుధుఁడు
బుధునకు సూర్యకావ్యులు హితు ల్శనికుజగురులును సములు చందురుఁడు వైరి
గురునకు రవిహిమకరకుజుల్ హితులు శత్రులు కవిబుధులు మందుండు సముఁడు
కవికి మిత్రులు బుధార్కజులు తుల్యులు కుజగురువులు చంద్రభాస్కరులు రిపులు


తే.

మందునకు బుధశుక్రులు మైత్రివారు, సముఁడు ధిషణుఁడు కుజసూర్యచంద్రు లరులు
గాఁగ సమమైత్రి వైరముల్ గ్రహముల కగు, రసికమణి విజయానందరంగశౌరి.

210


తా.

సూర్యునకుఁ జంద్రాంగారకులు మిత్రులు, శుక్రశనైశ్చరులు శత్రులు, బుధుఁడు సముఁడు; చంద్రునకు సూర్యబుధులు మిత్రులు, శుక్రశనిబృహస్పతికుజులు సములు, శత్రువులు లేరు; అంగారకునకుఁ జంద్రసూర్యబృహస్పతులు మిత్రులు, శనిశుక్రులు సములు, బుధుఁడు శత్రువు; బుధునకు సూర్యశుక్రులు మిత్రులు, శన్యంగారకబృహస్పతులు సములు, చంద్రుఁడు శత్రువు; బృహస్పతికి సూర్యచంద్రాంగారకులు మిత్రులు, శని సముఁడు, బుధశుక్రులు శత్రువులు; శుక్రునికి శనిబుధులు మిత్రులు, అంగారకబృహస్పతులు సములు, సూర్యచంద్రులు శత్రువులు; శనికి బుధశుక్రులు మిత్రులు, బృహస్పతి సముఁడు, సూర్యచంద్రాంగారకులు శత్రువులు గనుకఁ దెలియునది.

ఇందుకు లక్ష్యము, సులక్షణసారంబున
సీ.

ఇనశశుల్ రవికుజు లినగురు ల్గురుభూజులు శనార్కజుల్ శుక్రశశితనూజు
లన్యోన్యమైత్రివా రమరంగ బుధరవుల్ గురుసుధాధాములు కుజశశులును
మందసౌమ్యులు సమమైత్రివారలు గురుశనులును గవికుజుల్ సమమువారు
మార్తాండశుక్రులు మందప్రభాకరు లన్యోన్యశాత్రవు లైనవారు


తే.

రాజసౌమ్యులు శత్రుమిత్రములవారు, గురుకవులు కుజసౌమ్యులు గురుబుధులును
శనికుజులు భార్గవేందులు సౌరిశశులు, వరుస సమశాత్రవంబుల వారు రామ.

211
మఱియును, కవిసర్పగారుడమున
గీ.

మైత్రి యత్యుత్తమము సమమైత్రి గలయ, మధ్యమం బగు సమ మధమంబుఁ దలఁప
శాత్రవము మారణము శత్రుమిత్రయుతము, జగడము విరోధ మగు సమశాత్రవమున.

212


వ.

అని యున్నది గనుక నిది తెలిసి సాహిత్యము ఘటియించునది.

213

గ్రహవర్ణనిర్ణయములు

క.

కవిచంద్రులు తెల్లనివా, రవనిజభాస్కరులు నెరుపు నాంగిరసబుధుల్
భువిఁ బసుపు రాహుమంద, చ్ఛవి నల్లన యండ్రు రంగజగతీనాథా!

214

క.

సితచంద్రుఁ డిచ్చు గుశల మ, సితసోముఁడు తునుము రణము చేయును రక్త
ద్యుతినిధుఁడు పీతశశి ధీ, రత హర్ష మొసంగుఁ జాల రంగనృపాలా!

215


క.

నలినారి యేగ్రహముతో, నలిపడెఁ దద్వర్ణమై శుభాశుభఫలముల్
గలిగించు భగణ మట్లనె, చెలఁగున్ బతి చంద్రుఁ డగుట శ్రీరంగనృపా!

216


తా.

చంద్రశుక్రులు తెలుపు, సూర్యాంగారకు లెరుపు, బుధబృహస్పతులు పసుపు, శనిరాహులు నలుపు, చంద్రుఁ డేగ్రహముతోఁ గూడిన నావర్ణమై యాఫలమునే యిచ్చును. తాను ప్రత్యేకముగ నుండినఁ దనఫలము నిచ్చును. శుక్రబుధబృహస్పతులతోఁ జంద్రుఁడు కూడిననాఁడు ప్రబంధ మారంభించిన శుభకరము. సూర్యాంగారకశనిరాహువులతోఁ జంద్రుఁడు కూడియున్న నక్షత్రమునఁ గృతి యారంభించిన నశుభకరము. అట్లే భగణమును జంద్రాధిదైవత్య మైనగణము గనుక స్వకీయమైనఫలము నీఁజాలదు. ఏగణమునుఁ గూడియుండిన నారీతిగ శుభాశుభఫలముల నిచ్చును.

ఇందుకు లక్ష్యము, సాహిత్యరత్నాకరమందు
“శ్లో.

రక్తే చంద్రే భజే ద్యుద్ధం కృష్ణ మృత్యు ర్నసంశయః
తజ్జయంతు విజానీయా త్పీతే శుభకరం భవేత్.”

217
కవిసర్పగారుడంబున
గీ.

చంద్రుఁ డేగ్రహంబు సరస నిల్చిన దాని, వర్ణమై శుభాశుభంబు లిచ్చు
భగణ మేగణంబుఁ దగిలినఁ దత్ఫలం, బిచ్చుఁ దనకుఁ జంద్రుఁ డీశుఁ డగుట.

218
మఱియును
గీ.

శశియు శుక్రుండు తెల్లనిచాయవారు, సవితృఁడును మంగళుఁడుఁ గెంపుచాయవారు
సౌమ్యుఁడును జీవుఁడును బైఁడిచాయవారు, శనియు రాహువు నల్లనిచాయవారు.

219


గీ.

ధవళచంద్రు వలనఁ దనరారుఁ గుశలంబు, సమరమగును శోణచంద్రువలన
నీలచంద్రువలన నిధనంబు సిద్ధించుఁ, బీతచంద్రుఁడైనఁ బ్రీతిఁజేయు.

220


వ.

అనియున్నది గనుక నిది తెలిసి పద్యాదిగణంబులకు వర్ణంబులకు గ్రహమైత్రి
కలుగఁ జెప్పవలెను.

221
కాళిదాసు, రఘువంశమున

“వాగర్ధా వివసంపృక్తౌ"

222


వ.

అన్నాఁడు గాన నందు మొదటిమగణసగణములకు బుధశనులు గ్రహములు గనుక
ను, వకారగకారములకుఁ జంద్రాంగారకులు గ్రహములు గనుకను సమమైత్రి.

223
కిరాతార్జునీయమున

"శ్రియః కురూణా మధిపః"

224


వ.

అని యున్నది గనుక నందు మొదటి జగణతగణంబులకు సూర్యబృహస్పతు
లు గ్రహములు. వారి కన్యోన్యమైత్రి. శవర్ణయకారంబులకుఁ జంద్రుఁడే కర్త
గనుక లెస్స.

225
ఆదిపర్వము మొదట, శబ్దశాసనుఁడు

"శ్రీవాణీగిరిజా”

226


వ.

అనియెను గనుక నందలితొలిగణము లగుమగణసగణములకు బుధశనులు గ్రహ
ములుగనుక వారికి సమమైత్రి. శవర్ణవకారములకుఁ జంద్రుఁడు గ్రహముగనుక
లెస్స యని యీజాడఁ దెలిసికొనునది.

227
ఉచ్ఛనీచస్థాననిర్ణయము
గీ.

మేషవృషభమకరయోషాకటకమీన, తులలు నుచ్చగతులు తులయు వృశ్చి
కకటకఝసమకరకన్యాజములు గ్రహ, రాజినీచగతులు రంగశౌరి!

228


తా.

సూర్యునకు మేషము ఉచ్చ, నీచము తుల; చంద్రునికి వృషభము ఉచ్చ, నీచము వృశ్చికము; అంగారకునికి ఉచ్చ మకరము, కర్కాటకము నీచము; బుధునకు కన్య యుచ్చము, మీనము నీచము; బృహస్పతి కుచ్చము కర్కాటకము, నీచము మకరము; శుక్రున కుచ్చము మీనము, నీచము కన్య; శని కుచ్చము తుల, నీచము మేషము.

ఇందుకు లక్ష్యము, బృహజ్జాతకమున

“అజవృషభమృగాంగనాకుళీరా ఝషవణిజౌ చ దివాక దితుంగాః."

229
అథర్వణచ్ఛందమున
క.

స్థానచ్యుతి యగు నీచ, స్థానగ్రహయుక్త మగుచుఁ దార్కొన్న యుదా
సీనగణంబులు పతికి సు, ఖానందముఁ జేయు నుచ్చకలితగణంబుల్.

230


గీ.

బ్రాహ్మణక్షత్రవిట్ఛూద్రవర్ణములకు, ఘనత గ్రహమైత్రి గణమైత్రి కన్యకావి
దూరమును యోనిపొత్తువుల్ చేరవలయు, వరుస నానందరంగభూవరపతంగ.

231


తా.

బ్రాహ్మణులకు గ్రహమైత్రియును, క్షత్త్తియులకు గణమైత్రియును, వైశ్యులకుఁ గన్యాదూరమును, శూద్రులకు యోనిపొంతనమును ముఖ్యముగానుండవలెను.

ఇందుకు లక్ష్యము, సంహితాసారమున

"గ్రహమైత్రి ర్ద్విజాతీనాం క్షత్త్రియాణాం గణోత్తమమ్,

కన్యాదూరంతు వైశ్యానాం శూద్రాణాం యోని రేవచ”.

232
అథర్వణచ్ఛందంబున
క.

సారగ్రహమైత్రియు నొ, ప్పారఁగ గణమైత్రి మఱియ నమరఁగఁ గన్యా
దూరము పొత్తువు యోనివి, చారముఁ డగు భూసురాదిజాతుల కెలమిన్.

233


గీ.

గణముమైత్రి కంటె గ్రహము ముఖ్యముగాన, మొదటిపద్యమునకుఁ గదిసినట్టి
గణయుగగ్రహంబు కర్తృగ్రహంబు జే, రంగవలయుఁ గోరి రంగశౌరి!

234


తా.

గ్రహమైత్రి ముఖ్యముగనుకఁ బ్రబంధాదిపద్యపు మొదటిరెండుగణముల యొక్క గ్రహములు, ప్రభువుగ్రహమును విరోధము లేకుండఁ జేరియండవలెను.

ఇందుకు లక్ష్యము, కవిసర్పగారుడమున
గీ.

గణముసామికన్న గ్రహము సత్వముగాన, నాదిగణయుగగ్రహంబు లెనసి
కలియవలయు మఱియుఁ గర్తృగ్రహంబును, మొదలిగణముగ్రహము బొసఁగవలయు.

235


క.

కృతిమొదటిపద్యమునఁ గల, పతిపేరున కిరుదెసలను బరగులిపులకున్
జత గ్రహమైత్రెయె సర్వో, న్నత మగు నానందరంగనరనాథమణీ!

236


తా.

ప్రబంధాదిపద్యమునందలి ప్రభువుపేరునకు రెండుపార్శ్వముల నుండు నక్షరములకు గ్రహమైత్రి యుండిన సకలదోషములను హరించుననుట.

ఇందుకు లక్ష్యము, కవిసర్పగారుడమున
క.

విరచించుకృతులపొందున, సరసపుఁబద్యంబు మొదల సత్కవివర్యుల్
పరికించి విభునిపేరిటి, కిరుదెసల శుభగ్రహంబు లిడఁగా వలయున్.

237


గీ.

ప్రభువుపేరిటఁ గృతియైనఁ బద్యమైనఁ, బూన్చిరేనియు మాతృకాపూజ లేక
అక్షణకవీంద్రు లొసఁగరు దక్షు లగుట, రసికమణివిజయానందరంగధీర!

238
ఇందుకు లక్ష్యము, సాహిత్యరత్నాకరమున

"ప్రభు ముద్దిశ్య పద్యంవా ప్రబంధం వా కదాచన,
నవక్తవ్యం నవక్తవ్యం మాతృకాపూజనం వినా.”

239

దేవదైత్యమానుషగణనిర్ణయము

సీ.

శ్రవణపునర్వసుల్ స్వాతిపుష్యాశ్వినుల్ రేవతిహసమైత్రిమృగశీర్ష
అమరగణంబు లై యమరు జ్యేష్ఠవిశాఖ కృత్తికశతతారచిత్తమూల
మఱి ధనిష్ఠాసర్పమఖలు దైత్యగణంబు లార్ద్రయుఁ బూర్వత్రయంబు భరణి
రహి రోహిణియు నుత్తరాత్రయంబు మనుష్యగణము లై ధరలోన గణుతి కెక్కు

తే.

దేవదైత్యగణములు దెవు లొసంగు, మనుజరాక్షసగణములు మడియఁజేయు
సమగణమ్ములు మనుజనిర్జరగణములు, ప్రమద మొనరించు నానందరంగశౌరి!

240


తా.

శ్రవణము, పునర్వసు, స్వాతి, పుష్యమి, ఆశ్విని, రేవతి, హస్త, అనూరాధ, మృగశీర్ష యీ 9 నక్షత్రములు దేవగణములు. జ్యేష్ఠ, విశాఖ, కృత్తిక, శతభిషం, చిత్త, మూల, ధనిష్ఠ, ఆశ్లేష, మఖ, యీ నక్షత్రములు రాక్షసగణములు. ఆర్ద్ర, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, భరణి, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర యీ 9 నక్షత్రములు మనుష్యగణము. కాన నిందు దేవరాక్షసగణములు రాక్షసమానవగణములు కూడినయెడలఁ గారాదు. దేవనునుష్యగణములు కూడినను, సమగణములు కూడినను మంచిదని తెలియునది.

యోనిపొంతనము

విశ్వేశ్వరచ్ఛందమున
సీ.

అశ్వినిశతతార లవి రెండు నశ్వముల్ స్వాతిహస్తంబు లచ్చపుటెనుములు
తనరు పూర్వాభాద్రయును ధనిష్ఠయు హరుల్ భరణిరేవతు అవి భద్రకరులు
అభిజిత్తు మఱి యుత్తరాషాఢ ముంగులు రోహిణి మృగశిరల్ రూఢిపణులు
గర్వితాశ్లేషపునర్వసు ల్పిల్లులు ముఖపుబ్బ లవి రెండు మఱి యెలుకలు
వినుతపూర్వాషాఢ విష్ణు నామము కపుల్ పుష్యకృత్తిక లవి భువి నజములు
బడి నుత్తరోత్తరాభాద్రలు గోవులు వైశాఖచిత్తలు వఱలుపులులు
మూలయు నార్ద్రయు మేలైనశునకముల్ జ్యేష్ణానురాధలు చెలఁగులేళ్లు
మును జెప్పినవెల్ల నెన్నఁగాఁ బోతులు పిదపఁ జెప్పిన వెల్లఁ బెట్లు దలఁపఁ
పోతుఁబోతునైనఁ బోరంగఁజొచ్చును నాతినాతియైనఁ ప్రీతిసేయుఁ


తే.

బోతు నాతికైన నాతి పోతుకునైనఁ, గలహ మగుచునుండుఁ గాన నెఱిఁగి
స్వామిభృత్యపురుషసతులకు నాదిగా, నెంచి యోనిపొత్తు లెఱుఁగవలయు.

241


తా.

ఈచెప్పిననక్షత్రములలో మొదట చెప్పినవన్నియుఁ బురుషులును, వెనుకఁ జెప్పినవన్నియు స్త్రీలునుగా నెంచవలెను. అశ్వమహిషములకు, నేనుఁగుసింగములకు, ముంగిపాములకుఁ, బిల్లియెలుకలకు, వానరములకు గొఱ్ఱెలకు, గోవులకుఁ బులులకు, శునకములకు లేళ్లకు, నన్యోన్యవైరము గనుకఁ దెలిసి యుంచఁగలది.

ఇందుకు లక్ష్యము, విశ్వేశ్వరచ్ఛందమున
గీ.

హరియు గరియును బులి ధేను వహియు ముంగి
సారమేయంబు మృగము నశ్వంబు మహిష

మరియఁ బిల్లియు నెలుక వానరము నజముఁ
జెలిమి యొండొంటి కెనయక పొలిసివోవు.

242
అథర్వణఛందమున
గీ.

ప్రభువుతారనుండి పద్యాదినిలిచిన, తారదాక నెంచి దానిమీఁదఁ
బదియమూఁడు గడచి పారిన స్త్రీదూర, పొత్తు వండ్రు వైశ్యపుంగవులకు.

243

ఇఁక భూసురాదిచతుర్జాతులకుఁ బొంతనము

లక్ష్యము

“గ్రహమైత్రి ద్విజాతి నాం” అనుటకు సమ్మతి.

244
శృంగారనైషధమున
శా.

శ్రీరామాకుచమండలీమృగమదశ్రీగంధసంవాసిత
స్పారోదారభుజాంతరుండు ధరణీసంశ్లేషసంభావనా
పారీణుండు కృతార్ధుఁ జేయుఁ గరుణాపాథోధి పద్మాక్షుఁ డిం
పారన్ మామిడిపెద్దమంత్రిసుతు సింగామాత్యచూడామణిన్.

245


వ.

పద్యాదినున్న మగణసగణములకు గ్రహములు బుధశనులు గనుక సమత్రి. ఆద్యక్ష
రము లైనశవర్ణరేఫలకు గ్రహము చంద్రుఁడే గనుక లెస్స. ప్రభువు పేరున కిరుపా
ర్శ్వముల నున్నతకారఆకారములకు గ్రహములు గురుసూర్యులు గనుక నన్యోన్య
మైత్రి. ఇది యుత్తమము. శ్రీకారమే యాదినున్నది గనుక సర్వదోషహరము. ఇది
గాక మగణసగణములకు రాక్షసగణము కాన శ్రీనాథుఁడు గణగ్రహమైత్రి
అక్షరగ్రహమైత్రి పార్శ్వాక్షరగ్రహమైత్రి, పద్యాదిని శుభగణప్రయోగము
నాగణమైత్రి దీనిని బరికించి నిర్దోషముగాఁ జెప్పినాఁడు కనుక నిట్లే మహాకవు
లనేకులు సలక్షణముగాఁ బ్రబంధరచన చేసి ప్రభువులపేర నంకితము చేసినారు.
కనుక నాజాడ తెలియవలయును.

246


"క్షత్త్రియాణాం గణోత్తమమ్.”

247
అనుటకు లక్ష్యము తిక్కన, ఉత్తరరామాయణమున

శ్రీరాస్తాం మనుమక్షితీశ్వరభుజస్తంభే జగన్మండల
ప్రాసాదస్థిరభారభాజి దధతీ సా సాలభంజీక్రియమ్
శుండాలోత్తమగండభిత్తిషు మదవ్యాసంగవశ్యాత్మనాం
యా ముత్తేజయతేతరాగ మధులిహా మానందసాంద్రాస్థితిః.

248

వ.

అనియెను గనుక మనుమరాజునక్షత్రము మఖ గనుక నది రాక్షసగణములోనిది. మగ
ణమును రాక్షసగణము గనుక శుభకరము. అతనిరాశి సింహము, ఆదిగణమైనమగ
ణముయొక్క రాశి వృశ్చికము గనుక రాశివిరోధము లేదు. ప్రభువుపేరున కుభయపా
ర్శ్వములనుండు నక్షరములు రెండును సంయుక్తాక్షరము లయిన స్తకారక్షకారము
లలో తొలివర్ణమందలి సకారతకారములకుఁ జంద్రగురువులు గ్రహములు గనుక
సమమైత్రి. మలివర్ణమందలి కకారషకారములకు నంగారకచంద్రులు గ్రహము
లు గనుక సమమైత్రి. సకారక్షకారములకుఁ జంద్రుఁడే గ్రహము గనుక విచా
రించి నిర్దోషముగా నాదిని శ్రీకార ముంచి చెప్పినాఁడు.

249


"కన్యాదూరంతువైశ్యానాం"

250
భీమనఛందమున (కవిజనాశ్రయం సంజ్ఞ 1)
క.

శ్రీకాంతాతిప్రియ వా, క్ఛ్రీకాంతజగత్త్రయైకసేవితనుతవి
ద్యాకాంతదివ్యకావ్యస, దేకాంతనితాంతకాంతి యీవుత మాకున్.

251


వ.

అని రేచనమీఁద నంకితముగాఁ జెప్పినాఁడు కాన నాతని నక్షత్రము స్వాతి.
ప్రబంధాద్యక్షర మగుశవర్ణ మునకు ఉత్తరాభాద్ర. స్వాతి మొద లుత్తరాభాద్ర
వఱకు నెంచఁగా నభిజిత్తుతోఁగూడఁ బదుమూఁడునక్షత్రము లయ్యెను కాన స్త్రీ
దూరము దొరకెను. కృతిపతిరాశి తుల. రగణరాశి వృశ్చికము గనుక రెంటికి వై
రము లేదు. ఇట్లే కడవఱకుఁ దెలియునది.

252


"శూద్రాణాంయోని రేవచ.”

253
శ్రీనాథుఁడు, కాశీఖండమున
శా.

శ్రీకాశీనగరాధిరాజ్యపదవీసింహాసనస్థుండు లో
కైకగ్రామణి విశ్వనాథుఁడు విశాలాక్షీమనోభర్త సు
శ్లోకున్ దొడ్డయయళ్లభూవరతనూజున్ వీరభద్రేశ్వర
క్ష్మాకాంతున్ జగనొబ్బగండని మహైశ్వర్యాన్వితుం జేయుతన్.

254


వ.

అని చెప్సియున్నాఁడు. ఇందుఁ బ్రభువునక్షత్రము రోహిణి. అహియోని. మొదటి
మగణము మృగయోని గనుక రెంటికి వైరములేను. పద్యాదివర్ణము శవర్ణము గనుక
దాని నక్షత్ర ముత్తరాభాద్ర. అది ధేనుయోని. అందుకు విరోధము లేదు. కృతి
పతిరాశి వృషభము, గణరాశి వృశ్చికము గనుక రాశివిరోధము లేదు. కృతిపతి
పేరున కుభయపార్శ్వముల నుండు నకారమకారములకు గ్రహములు గురుసూర్యు
లు గనుక నన్యోన్యమైత్రి.. కావున లక్షణకవు లైన వారు తమకుఁ గృతినాయకునికి

నారోగ్యభాగ్యములు గలుగునట్లుగా నిర్దోషముగాఁ బ్రబంధరచన చేయుదురు.
కాన నీజాడఁ దెలియునది.

255
కవిసర్పగారుడమున
గీ.

వర్ణనక్షత్రయోనియు వరునితార
యోనియును గూడకుండిన నొప్ప దెందు
యోనియుఁ గర్తనక్షత్రయోని
యును మిగులఁ బొత్తువునఁ గూడియుండవలయు.

256
సులక్షణసారమున
క.

ధరపై గుటగుటకవితల, నరసిన శుభలక్షణంబు లబ్బవు సుమ్మీ
పరిపరిగతుల మహాకవి, వరులకవిత్వములనున్నవైఖరి రామా!

257
కవిగజాంకుశమున
గీ.

గ్రహము ములికి గణము గరి యక్షరము పింజ
పద్య మెసగుకోల చోద్యమైన
జిహ్వ విల్లు నలుక శింజిని లక్ష్యంబు
ధూర్తజనుఁడు సుకవివార్త జోడు.

258
మఱియును సులక్షణసారంబున
క.

లక్షణ మెఱుఁగనికవి యవ, లక్షణుఁడు తదీయకవిత లాఘవ మది ప్ర
త్యక్షమునఁ గీడు చూపుఁ బ, రోక్షంబున స్వర్గసౌఖ్య మమరదు రామా.

259
మఱియును
గీ.

గ్రుడ్డియెద్దు జొన్నఁ బడ్డట్లు సన్మార్గ, మెఱుఁగలేక కవిత సెట్లు చెప్ప
నగును జెప్పెనేని హాస్యాస్పదము గాన, లాక్షణికుఁడె కావలయును రామ!

260
కవిగజాంకుశమున
సీ.

అవనిగణాలిగణవలి కధిదేవతలును వన్నెలు గ్రహంబులును వాని
కులములు ఫలములు కూర్ములు పగలును చుక్కపొత్తువులు నచ్చుగ నెఱింగి
పిదప మహాభూతబీజచింతనమును వర్ణవర్గగ్రహనిర్ణయంబు
నక్షత్రవేధయు నరిమిత్రశోధనక్రమముఁ దత్ఫలవిచారమును దెలిసి


తే.

తమకు నెదురులేక తప్పించి ధారుణీ
విభులసభల బుధులు వివిధగతులఁ

వెలఁగి పొగడఁ గవిత చెప్పెడువారు స
త్కవులు గాక యితరకవులు కవులె!

261


వ.

అని యున్నది.

262
మఱియును సులక్షణసారంబున
సీ.

వినుత పద్యాది నిల్పినవర్ణమునకు నాథునివర్ణమున కరి తొడరకుండ
మొదటిరెండక్షరంబులు గణద్వంద్వంబు గ్రహదైవములతోడఁ గలయకుండ
గృతినాథుపేరిటికిని బార్శ్వవర్ణముల్ క్రూరగ్రహప్రాప్తిఁ గూడకుండ
దగ్ధజ్వలితధూమితవ్యాధినిర్జీవతారకలాదులఁ జేరకుండ


తే.

[3]గణగణజయామములు తత్త్వగతులు రసము
లొప్పఁగాఁ బొత్తువులు తప్పకుండఁ బలుకు
కబ్బ మొక్కటియే చాలు గంపెఁ డేల
లక్షణవిహీనముల్ జగద్రక్షరామ!

263

మిత్రారిషోడశచక్రము

క.

విధుపురహరనిధిదృగ్వన, నిధిరవిదిక్ఛా స్త్రదంతినృపమనుశరభూ
మిధరదివసత్రయోదశ, పృథుగృహముల వ్రాయవలయు శ్రీరంగనృపా!

264


తా.

చౌకముగాఁ బదునాఱిండ్లు వ్రాసికొని అందు నకారాది యేబదియక్షరములు — విధు=1, పుర=3, హర=11, నిధి=9, దృక్=2, వననిధి=4, రవి=12, దిక్ =10, శాస్త్ర=6, దంతి=8, నృప=16, మను=14, శర=5, భూమిధర=7, దివస=15, త్రయోదశ=13, యీలెక్కమేరకు వరుసగా నకారముమొద లేఁబదియక్షరములు వ్రాసినట్టయిన నది సిద్ధము, సాధ్యము, సుసిద్ధము, అరి అని నాలుగుచక్రములై చక్ర మొక్కటికి నాల్గేసియిం డ్లేర్పడును. అందు మొదటిచక్రము నాల్గిండ్లకు సిద్ధసిద్ధము, సిద్ధసాధ్యము, సిద్ధసుసిద్ధము, సిద్ధారి అనిపేరులు. రెండవచక్రము నాల్గిండ్లకు సాధ్యసిద్ధము, సాధ్యసాధ్యము, సాధ్యసుసిద్ధము, సాధ్యారి అనిపేరులు. మూడవచక్రము నాల్గిండ్లకు సుసిద్ధసిద్ధము, సుసిద్ధసాధ్యము, సుసిద్ధసుసిద్ధము, సుసిద్ధారి అనిపేరులు, నాల్గవచక్రము నాల్గిండ్లకు అరిసిద్ధము, అరిసాధ్యము, అరిసుసిద్దము, అర్యరి అనుపేర్లు. కానఁ గృతినాయకునిపేరుయొక్క మొదటియక్షరము ప్రబంధపు మొదటియక్షరము అరి యనుచక్రపుటిండ్లలో నుండక యుండవలెను. ఉండినఁ గారాదు.

ఇందుకు లక్ష్యము, సాహిత్యరత్నాకరమున

“అద్యగ్నిరుద్ర గ్రహనేత్ర వేదరనిర్దిశర్తుర్వసుషోడ శాశ్చ,
మన్వంతరౌ బాణతురంగవాసరాస్త్రయోదశస్యుః పదవర్ణమాహుః.”

265
లక్షణదీపిక
మ.

మొదటన్ మూఁడిట రుద్రులన్ నిధికరాంభోరాసులన్ బంగజా
ప్తదిశారిద్విపరాణ్మనుప్రభృతులన్ బాణాద్రిఘస్రంబులన్
బదుమూఁటన్ గవి యేఁబదక్షరము లొప్పన్ వ్రాసి తా వ్రాసిన
ట్లది భావింపఁగ సిద్ధసాధ్యకసుసిద్ధారుల్ తగన్ శ్రీహరీ!

266


సీ.

చదురమై పదియాఱుచౌకపుటిండుల యదియె షోడశచక్ర మందులోన
మొదలింట మూఁటను బదునొకంటను దొమ్మిదింట రెంటను నాలుగింటఁ బదియు
రెంటఁ బదింట నాఱింట నెనిమిదింట నలిఁ బదాఱిటఁ బదునాలుగింట
నేనవతావున నేడింటను బదియేనింటను బదుమూఁట నెనసి వెలయు


తే.

నక్షరంబులు గృహముల నైదుపదులు, నిలిపి పతికోష్ఠమున నుండి వలయముగను
సిద్ధసాధ్యసుసిద్ధారిచింతనంబు, వెలయఁ గావించి రిపులిపు ల్విడువవలయు.

267


వ.

అని కవిగజాంకుశమున నున్నదిగనుక నీషోడశ చక్ర మీక్రమంబున విమర్శించు
కొనునది.

268

మాతృకాపూజావిధానము

విప్రమాతృకకు, సిద్ధ(నిధి)ప్రదీపికయందు
గద్యము.

అథ కుముదకుందకందుకపురందరకరిశిశిరగిరికందరశరదంబుదకంబు
శశిబింబశుభ్రామ్ విభ్రాజమానముఖరాజీవపరిమళవిలోలబాలమధుకరగరు
దంచలపవనచలితకుటిలకుంతలామ్, లతాంతబాణప్రాణబాణసహోదరీనిజకృ
పాపాంగతరంగితసుధాపూరపూరితదిఙ్మండలామ్, నిజకపోలతలదర్పణప్రతి
బింబితరత్నకుండలామ్, అభినవవికచకల్హారకరవీరకేసరమాలతీమాలాలాలితనీల
వేణీమ్, వీణాపుస్తకపాణిపల్లవామ్, అచ్ఛేదనచందనరసేనధవళీకృతతనుల
తామ్, శుకసనకసనందనాదిమునిబృందవందితామ్, అరవిందాసనకేశవాసవ
ప్రముఖసురనికరసన్నుతామ్, సుకవిశుకఫలితపారిజాతలతామ్, మధూకతైల
నీరాజనదేవధూపకదళీఫలచషకపరిపూరితక్షీరోపహారప్రియామ్ విప్రమా
తృకాం ధ్యాయేత్. అనేన వాగీశ్వరీధ్యానముక్తమ్ - మంత్రరహస్యే.

269
అథర్వణచ్ఛందమున
చ.

కలువల గొప్పుఁ దీర్చి సిరిగంద మలంది మెఱుంగు ముత్తియం
బులతొడవుల్ బెడంగడరఁ బూని దుకూలముఁ గట్టి చేతులం
బొలు పగురత్నవీణీయయుఁ బుస్తకమున్ విలసిల్లఁ గుందకు
టలరుచి నొప్పు విప్ర లకుమాతృక సత్కవితాప్రదాయి యై.

270
క్షత్రియమాతృకకు, సిద్ధప్రదీపికయందు
చూర్ణిక.

విదళితకురువిందపురందరగోపనిందూరసంధ్యాభ్రబంధూకబంధురప్రభాబం
ధుశోణామ్ శోణార్కమాణిక్యతాటంకకంకణకేయూరహారనూపురభద్రముద్రి
కాదివిభూషణభూషితాం కదంబకుసుమకందుకవిడంబితకుచకుంభభారావనమ్ర
మధ్యాం విద్యాధరీనికరచికురకుసుమపరాగపరిమళపరంపరార్పితమృదులపల్లవామ్,
ఉత్ఫుల్లమల్లికాశోకపున్నాగచంపకకేతకీజాతిప్రసూనమాలాబద్ధసుస్నిగ్ధవేణీం
లతాంతబాణమధురకోదండమండితకరసరోజయుగళామ్, మృగమదాగురుఘన
సారచందనానులేపితామ్, నవవికచదాడిమీకుసుమరుచిరగైరికాంబరామ్, రాజమనో
హరధూపకాలాగరు(స్నేహ)దీపకనకచషకపరిపూరితఘృతోపహారప్రియామ్,
రాజమాతృకాం ధ్యాయేత్.

271

ఇతి ధ్యానముక్తమ్.
అనేన వశ్యముఖీధ్యానముక్తమ్ తత్కథమ్."

“సంధాయ సుమనోబాణాన్ కర్షంతీం భైక్షవంధనుః,
జగజ్జైత్రాం జపారక్షాం దేవీం వశ్యముఖీం భజే.”

272
అధర్వణచ్ఛందంబున
చ.

అలవడ సంపెఁగల్ తురిమి యచ్చపుఁగస్తూరి మేనఁ బూసి కెం
పులతొడవు ల్వహించి మఱి పుష్పశరంబును దీయవిల్లుఁ జే
తుల విలసిల్లఁ గావిజిగి దూకొనుపుట్టముఁ గట్టి దీపకు
ట్మలరుచిఁ బొల్చు రాజకులమాతృక భూజనవశ్యకారియై.

273


వ.

అని యున్నది గనుకఁ గవి పూర్వోక్తప్రకారమున నుపక్రమింపఁదగినది.

274
వైశ్యకులమాతృకకు, సిద్ధప్రదీపికయందు
చూర్ణిక

అథ దినకరతరుణకరనికరవికసితకనకకమలవారితావినీలజలధరాంతరనటత్త
టిల్లతాఫుల్లత్కర్ణికారకోరకనిభప్రభాభాసమానామ్, అసమానఘుసృణకుంకుమ
సంకుమదపంకభూషితవిపులకుచకలశశోభినమ్, కనత్కనకమయమంజుమంజీరహార
కేయూరమనోహరామ్, నవవికచనవమాలికాకుందశతపత్త్రమల్లికాస్తబకవిలసిత
కబరీమ్, అమందసౌందర్యసరసవదనారవిందకందళితమందస్మితచంద్రికాపానగ
ర్వితపరివారగీర్వాణపురంధ్రీలోచనచకోరీమ్, ఉన్నిద్రపలాశకుసుమపరాగపరి
మళితహరిద్రారంజితాంబరామ్, శంబరారిహరకుటుంబినీమ్, అంబురుహముకుళహ
స్తామ్ బస్తౌజ్యదీప, మహేశ్వరధూప, కలధౌతచపక పరిపూరితమధురసోపహార
ప్రియాం వైశ్యమాతృకాం ధ్యాయేత్. ఇతి.

275


అనేన సిద్ధలక్ష్మీధ్యానముక్తమ్. తథా.

మంత్రమహార్ణవే

"పీతాంబరా మంబుజయుగ్మహస్తాం శాతోదరీం నూతనహేమగౌరీమ్,
శీతాంశుబింబోపమచారువక్త్రాం సేవే సదా చేతసి సిద్ధలక్ష్మీమ్."

276
శ్రీధరచ్ఛందంబున
చ.

వెలయఁగ బొండుమల్లియలు వేనలి నంగమునన్ విభూషణా
వళులు ధరించి లేఁబసుపువన్నియపుట్టముఁ గట్టి కుంకుమం
బలఁది పసిండితామరలు హస్తములన్ వెలుఁగొంద భర్మని
ర్మలరుచిఁ బొల్చు వైశ్యకులమాతృక భూరిధనప్రదాయి యై.

277


వ.

ఇవ్విధంబున మాతృకాధ్యానపూజలు గావించి కవి పూర్వోక్తప్రకారంబున నుప
క్రమింపవలెను.

278
శూద్రమాతృకకు, సిద్ధప్రదీపికయందు
చూర్ణిక.

అథతరుణతరహరితతృణగరుడమణిశకలమరకతమణిపురందరనీలశ్యామలామ్,
కోమలకనకకదళీదళాంకురశ్యామలకర్బురకేశపాశామ్, అభివవతారుణ్యవిభవ

వితానలీలాలాలితవిలాసమండితామ్, ఇందిరానందనసుందరహరినీలకందుకప్రస్యం
దకఠినకుచతటవిలుఠన్మంజుగుంజాహారలతామ్, నితాంతసుభగయూధికానువిద్ధసు
స్నిగ్ధకుండలాం, దంతావళదంతకర్పూరగోరోచనామలేపితసర్వాంగీమ్, అనంగమో
హనశరరూషితమేదురగ(ర)ళసోదరసుకుమారకజ్జలరేఖామనోహరవిచక్షణేడు
ణాంచలచలితకర్ణావతంసితకీరశాబామ్, అకలంకశశాంకధవళదంతతాటంకవిలసి
తామ్, అసదృశహరిచందనతరుణకిసలయరచితాంశుకామ్, మల్లికావిచిత్రబర్హిగరు
దంచితకాంచనపుంఖనిశితశరవైణవబాణాసనలలితపాణిపల్లవామ్, సుకుమార
కరధూపపూతైరండతలదీపకాంస్యచషకపరిపూరితహాలారసోపహారప్రియామ్, శూ
ద్రమాతృకాంధ్యాయేత్.

279


అనేన త్వరితాధ్యానముక్తమ్. తథా.

మంత్రదర్పణే

“పర్ణాంశుకాం పరుషకుంచితకేశపాశాం కర్ణావతంసపరికల్పితకీరకాబామ్,
వేదండదానమృగనాభివిలిప్తగాత్రీం కోదండకాండవిదుషీంప్రణమేన్నిషాదీమ్.”

280


వ.

అనియున్నది గనుకఁ గవి పూర్వోక్తప్రకారంబున నుపక్రమింపవలెను.

281


గీ.

అద్దమునఁ గరి కాన్పించినట్టి పగిది, సంచితంబుగఁ గవితాప్రపంచలక్ష
ణంబు లన్నియు నిందె యున్నది గణించి, తెలియ ఘటనాఘటనశక్తి గలుగు రామ.

282


మఱియును.
గీ.

ఇన్నిలక్షణములు పల్క నీశ్వరునకుఁ, దరము గాదని కవు లాత్మఁ దలఁచిరేని
ప్రకటశుభలక్షణము లుండి యొకటి రెండు, చాలకుండినఁ గడమయే సదయహృదయ.

283


వ.

కావున క్వచిద్దోషయుక్తమైనను, శుభబాహుళ్యమైనయెడల నది దోషరహితమని
యెఱింగి రచన సేయునది. ఇది లక్షణప్రకరణము. దీని నామూలాగ్రంబుగఁ
దేటపఱిచితి నింక యతిప్రాసప్రకరణంబు వివరించెద.

284

ఆశ్వాసాంతము

చారుమతి.

రంగదతి సత్వర కురంగసమరాజితతురంగమమదప్రయుతసా
రంగచయముఖ్యచతురంగబలరమ్య రణరంగరిపుగర్వహృత పా
రంగతమహాగుణతరంగ కమలానటనరంగ సదసాంగకలితా
రంగనగరీనిలయ రంగవిభుభక్తమణి రంగనరనాథసోమా!

285


పంచచామరము.

గరిష్ఠబాహుగర్వమత్త కర్కళద్విషద్వసుం
ధరావరా సదృగ్యశఃప్రతాపచంద్రమోదివా

కర్మగ్రసక్రియోగ్రసింహికాతనూభవాయమా
నరౌద్రశాతమండలాగ్ర నందవంశభూషణా!

286
భుజంగప్రయాతము

నిశాధీశమందారనీహారతారా,
కుశాబ్జార్జునాభ్రభ్రగోగోమణీగీ
ర్దిశాదంతిదంతద్యుతిస్వచ్ఛలీలా, యశోవైభవోత్తుంగ యానందరంగా!

287


గద్యము.

ఇది శ్రీమదుమారమణకరుణాకటాక్షలబ్ధసాహితీవిభవ ధర్మవెచ్చకులజల
ధికుముదమిత్ర శ్రీవత్సగోత్రపవిత్ర వేంకటకృష్ణార్యపుత్ర విద్వజ్జనమిత్ర కుక
విజనతాలవిత్ర యార్వేలకమ్మనియోగికులీన లక్షణకవి కస్తురిరంగనామధేయ
ప్రణీతం బైన యానందరంగచ్ఛందం బను లక్షణచూడామణియందు ద్వితీయా
శ్వాసము.

  1. తారయును దెల్లమిగా ధనురాశి రాశియున్
    బలిముఖయోనియున్ నరగణం బగు నయ్యగణంబు శంకరా.
  2. ఒనరఁగ
  3. గణజనన