Jump to content

ఆనందరంగరాట్ఛందము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

తృతీయాశ్వాసము




విష్ణుచరణసారస
సేవాయితహృదయ రూపళితవాసవితా
రావల్లభనలకూబర
భావజ యానందరంగ పార్థివముఖ్యా!

1


గీ.

అవధరింపుము నీపేర నంకితముగ, సకలలక్షణగ్రంథవిస్తారసార
పటిమ లన్నియు నొకటిగా ఘటనపఱిచి, లక్షణగ్రంథ మొనరింతు రంగనృపతి.

2


సీ.

ఆదిమకవిభీమనార్యముఖ్యులు పల్కుఛందమ్ములను గల్గుచందములును
లక్షణగ్రంథమ్ములను గల్గుభేదముల్ పూని విమర్శించి వానిలోన
యతిభేదములు ప్రాసగతిభేదములు చూచి యొనరఁ బూర్వకవిప్రయోగములను
వెదకి యన్నింటికి వేర్వేఱ లక్షణలక్ష్యముల్ సత్కవిరాజు లెన్న


తే.

సకలజనముల కుపకారసరణి గాఁగఁ, జెలఁగి వివరించెదను వేడ్కఁ జిత్తగింపు
రసికమూర్తి వజారతరాయవిజయ, విక్రమానందరంగేంద్ర వినయసాంద్ర!

3


క.

క్షితిఁ గవిత యనుచుఁ జెప్పిన, యతులును బ్రాసములు వలయు నన్నిటి కవి నే
జతగూర్చి వ్రాసెద వజా, రతవిజయానందరంగ రాయబిడౌజా!

4


వ.

తద్విధం బెట్లనిన నాదిమకవిభీమనచ్ఛందంబులును, గవిరాక్షసచ్ఛందంబును, నథర్వ
ణభాస్కరచ్ఛందంబులును, నుత్తమగండచ్ఛందంబును, ననంతచ్ఛందంబును, హ
నుమచ్ఛందంబును, జయదేవచ్ఛందంబును, శ్రీధరచ్చందంబును, గోకర్ణచ్ఛందంబు
ను, నీలకంఠచ్ఛందంబును, విశ్వేశ్వరచ్ఛందంబును, నన్నయభట్టు లక్షణసారంబును,
విన్నకోట పెద్దిరాజు [1]నలంకారశాస్త్రంబును, రఘునాధయ లక్షణదీపికయును, గవి
సర్పగారుడంబును, గవిగజాంకుశంబును, మల్లన [2]పాదాంగదచూడామణియును
మొదలుగాఁ గలఛందశ్శాస్త్రంబులు లక్షణకావ్యంబులు విమర్శించి యందు మహా
కవివరులు వివరించు తెఱంగంతయు నెఱింగి యెల్లరకుఁ దెలియునట్టులు తేటపఱి
చెద నవధరింపుము.

5

సీ.

అయహలకును గియ్యలగును కచటతపవర్గుల నాల్గేసివర్ణములుగ
నొకటొకటికి యతి యొప్పును చాదులుశషసలు తమలోన క్షాకుఁ జెల్లు
లళలును గిల్క క్రారయు రేఫకుఁ జెలంగుఁ పభబభల్ వాకును బరగు వణలు
పొల్లక్షరములకుఁ బొసఁగు పవర్గు బిందూక్త మైనను మాకు నొనరుచుండు


తే.

పుఫుబుభులకు ముకారంబుఁ బూన్పవచ్చు
మఱి ఋకారంబు రేఫకు విరతియగును
వాడుకగ నుండుయతు లివి వరుసతోడ
శ్రీమదానందరంగ పార్దివపతంగ.

6


తా.

అకారయకారహకారములును, గియ్యముడికలయక్షరములు నొండొంటికి యతి చెల్లును. కఖగఘ, చఛజఝ, టఠడఢ, తథదధ, పఫబభ యీయైదువర్గములలో నాయావర్గములోని నాల్గక్షరము లొండొంటికి యతిఁ జెల్లును. చఛజఝుశషసక్ష యీ యెనిమిదియక్షరములు నొండొంటికి యతి చెల్లును. క్షకారము కవర్గముతోఁ జెల్లును. లకారమును, ళకారమును, వెలుపల గిలకగలయక్షరములును, క్రారవడిగలయక్షరములు నొండొంటికి యతి చెప్పవచ్చును. పఫబభవ యీయైదక్షరములు నొకటికొకటి యతి చెల్లును. నకారణకారములును, నకారపొల్లు గలిగినయక్షరములును నొకటికొకటి యతి చెల్లును. పఫబభ యీనాల్గక్షరములకు దాఁపలసున్న లుండినచో మకారమునకు యతి చెల్లును. పుఫుబుభు యీ నాల్గక్షరములును ముకారమును బరస్పరము యతి చెల్లును. స్వరములలోని ఋకారమునకును రేఫకును యతి చెల్లును. ఇదియంతయుఁ జాల వాడుకగా బహుజనులు చెప్పెదరు కావున నివియు, మహాకవిరాజులు, ప్రబంధములయందుఁ బ్రయోగించుయతులును, బ్రాసభేదములును వివరించెద.

ప్రాసములకు నాదిమకవి భీమనచ్ఛందమున (సంజ్ఞ 76)
క.

భాసురము లగుచు సుకర, ప్రాసానుప్రాసదుష్కరప్రాసాంత్య
ప్రాసద్విప్రాసత్రి, ప్రాసము అన షడ్విధములఁ బ్రాసము లమరున్.

7
మఱియు, ననంతచ్ఛందమున (1-35)
క.

సమనామప్రాసము ప్ర్రా, సమైత్రి ఋత్రియును బ్రాదిసమలఘువు విక
ల్పము బిందు వర్ధబింద్వా, ఖ్య ముభయసంయుక్తసంధిగతసంజ్ఞికమున్.

8


తా.

అని యివ్విధంబున సుకరస్రాసము, దుష్కరప్రానము, అంత్యప్రాసము, అనుప్రాసము, ద్విప్రాసము, త్రిప్రాసము, చతుష్ప్రాసము, సమనామప్రాసము, ప్రాసమైత్రి, ఋప్రాసము, త్రివిధప్రాసము, ప్రాదిప్రాసము, వికల్పప్రాసము, బిందుప్రాసము, అర్ధబిందుప్రాసము, ఉభయప్రాసము, సంయుక్తప్రాసము, సంధిగతప్రాసము, సమలఘుప్రాసము అనగా 19 విధముల ప్రాసములు వివరించినారు.

ఇఁకను యతులకు ఆదిమకవి భీమనచ్ఛందమున (సంజ్ఞ 62)
క.

స్వరవర్గాఖండప్ర్రా, ద్యురుబిందుప్లుతములును బ్రయుక్తాక్షరముల్
పరువడి నెక్కటి పోలిక, [3]సరస లనన్ బదివిధములఁ జను వళ్లు మహిన్.

9


అని పది యతులున్ను,

పెద్దిరాజు అలంకారంబున
గీ.

యతులు స్వరవర్గసరసగుణితవిభాగ
బిందుకాకుస్వరాఖండ భిన్ వృద్ధి
దేళ్యములు ప్రాదియెక్కటాదేశములును
పోల్కి గూఢస్వర మన నొప్పును బదాఱు.

10


అని పదాఱుయతులున్ను జెప్పి ఉన్నది. మఱిన్ని,

అథర్వణచ్ఛందంబున
సీ.

స్వరయతుల్ ప్లుతయతుల్ సంయుక్తయతులును వర్గయతులు బిందువడి యఖండ
విరతి పోల్కి వడి యభేదయతి సరసయతి చక్క టెక్కటియతులు మఱియుఁ
బ్రభునామయతియును బ్రాదులు వృద్ధులు మయతియు నిత్యసమాసయతియు
నాదేశయతులు రియతి ఋయతి వికల్పయతులు విభాగపుయతులు దేశ్య


తే.

యతులు భిన్నయతులును గుణితయతులును
ప్రాదినిత్యసమాసవిరహితయతులు
ఘజ్ యతులు శకంధుయతులు నఞ్ యతు లవ
ల నసమాసయతు లిరువదెనిమిదొకటి.

11


అని యతులు 29 విధములుగాఁ జెప్పి ఉన్నది. మఱిన్ని,

కవిరాక్షసచ్చందంబున
శా.

శ్రీదైతాయతు లిర్వదొక్కటియగున్ ఋప్రాదినిత్యజ్ఞ కా
క్వాదేశంబులు వృద్ధిఘఞ్ సరసనామాఖండవర్గప్లుత
భాగమల్ స్వరజముల్ మాసుస్వరంబుల్ విక
ప్రాదుల్ చక్కటిపోల్కి యెక్కటియుఁ గావ్యాళిన్ బ్రసిద్ధంబగున్.

12


అని 21 విధములుగా చెప్పివున్నది. మఱియు,

నన్నయభట్టు లక్షణసారంబున
మ.

స్వరవర్గప్లుతముల్ శకంధుగణఋత్వప్రాద్యభేదోర్వను
స్వరభిన్నప్రభుకాకునిత్యములు దేశ్యజ్ఞోభయాఖండముల్

సరసాదేశవిభాగవృద్ధులునుమాసంయుక్త వైకల్పముల్
గరిమంబోలిక చక్కటెక్కటి యనంగా నిర్వదేడౌయతుల్.

13


వ.

అని 27విధములుగా జెప్పివున్నవి. ఇది గాక జయదేవచ్ఛందంబున తొమ్మిదియతులున్ను,
కవిలోకసంజీవనియందు పండ్రెండుయతులున్ను, అనంతచ్ఛందంబున ఇరువదినాలుగు
యతులున్ను, నీలకంఠచ్ఛందంబున ఇరువదియైదు యతులున్ను, శ్రీధరచ్ఛందంబు
న ముప్పదియతులున్ను, ఉత్తమగండచ్ఛందంబున పదునెనిమిదియతులును గా వా
రువారు వేఱువేఱువిధంబుల నేర్పరిచి యుండుదురు. వాని నన్నిటిని బరికించి
యిందు స్వరయతీయు, గూఢస్వరయతియు, కాకుస్వరయతియు, వాహ్వానప్లుత
యతియు, రోదనప్లుతయతియు, సంశయఫ్లుతయతియు, గానప్లుతయతియు, వృద్ధి
యతియు, నఞ్ సమాసయతియు, భిన్నయతియు, నిత్యసమాసయతియు, దేశ్యయ
తియు, మకారయతియు, వికల్పయతియు, బిందుయతియు, ప్రాదియతియు, నర్ధ
బిందుయతియు, నాదేశయతియుఁ, బ్రభునామాఖండయతియు, ఘఙ్ యతియు,
శకంధుయతియు, సంయుక్తయతియు, విభాగయతియు, చక్కటియతియు, సరసి
యతియు, నభేదయతియు, నెక్కటియతియు, ఋయతియుఁ, బ్రాకృతాదేశయతి
యు, బోలికయతియు, నఖండయతియు, సమలఘుప్రాసయతియు, రియతియు,
గుణితపుయతియుఁ, బ్రాసయతియు నివి మొదలుగా గలయతిభేదంబులను బ్రాసవి
న్యాసంబులును విమర్శించి యన్నియు నొకటిగా సంఘటించి దానిదానికిఁ బూర్వ
కవిప్రయోగములు లక్షణలక్ష్యంబులు నిలిపి యేయేజాతిలక్షణంబులు వివరించిన
నందుకు భవదీయనామాంకితంబులుగా బద్యంబులు రచియించి యనంతరంబ
లక్ష్యంబులు విభియించి భవదీయదయావిశేషసంపాదితమదీయమనీషాచమత్కా
రంబుఁ దేటపఱచెద. పామరులు పండితు లగురీతిఁ బండితులు సంతసిల్లుభాతిగా
నాయేర్పరిచిన యీయానందరంగచ్ఛందంబున ముందుగాఁ బ్రాసంబులు వివరించె
ద నందు.

14

సుకరప్రాసలక్షణము

పెద్దిరాజు నలంకారంబున (7-74)
క.

సుకుమారము శ్రుతిసుఖదము, నక లంకము నైనవర్ణ మాద్యక్షరసృ
ష్టికి రెండవవ్రాయిసుమీ, సుకరప్రాసం బనంగ సులభము కృతులన్.

15


తా.

లలితమై చెవి కింపుగానుండే అక్షరము ప్రాసస్థానమునం దుంచితే అది సుకరప్రాసము.


క.

పరకవులపాలిపెన్నిధి, సరసుం దానందరంగజనపతి గాకన్
మఱి యెవ్వ రనుచుఁ బలికిన, ధర సుకరప్రాస మనఁగఁ దగుఁ గృతులందున్.

16
మఱిన్ని, భీమనచ్ఛందంబున (సంజ్ఞ-78)
క.

పరమోపకార ధరణీ, సురవరసురభూజ సుగుణసుందర తరుణీ
స్మరనిభ సుకరప్రాసం, బరుదుగఁ గృతులందు నొప్పు నభినుతచరితా.

17

దుష్కరప్రాసము

పెద్దిరాజు నలంకారచూడామణియందు (7.78)
క.

పరువడిఁ బాదాదుల ను, చ్చరణాసహ్యాక్షరముల సమకూర్చిన దు
ష్కర మనియెడు ప్రాసం బగు, సరసాలంకారమగుచుఁ జను సత్కృతులన్.

18


తా.

చెవికింపుగాక, నోట మెదుగక, దుస్తరముగా నుండే అక్షరములు ప్రాస చెప్పితే నది దుష్కరప్రాస మనబడును.

లక్ష్యము
క.

నిష్కపటజనులకెల్లను, నిష్కపటంబులను రంగనృపమణి యెంతో
నిష్కర్ష నొసఁగు ననఁగా, దుష్కర మనుప్రాస మై కృతులఁ బేరొందున్.

19
అనంతచ్ఛందంబున (1-70)
క.

దోఃకీలితమణికటక యు, రఃకలితరమావినోద రంజితసుజనాం
తఃకరణ ఖండితారిశి, రఃకందుక యనిన దుష్కరప్రాస మగున్.

20

అంత్యప్రాసము

పెద్దిరాజు నలంకారచూడామణియందు (7–80)
క.

మొదలిచరణంబుకడ శుభ, పద మయ్యెడివ్రాయి యన్నిపాదంబులకున్
దుదలందు నుండఁ జెప్పిన, నది యంత్యప్రాస మనఁగ నమరుం గృతులన్.

21


తా.

మొదటిచరణముకడపట నున్నయక్షర మేదో ఆఅక్షరము చొప్పుగానే నాల్గుచరణాలయందు నంతమున నుండఁ జెప్పిన నది యంత్యప్రాస మగును. ఆనియమమునఁ బద్యమునకుఁ బ్రాసాక్షర మెద్దియో యదియ యంత్యమందుండునట్లు చెప్పిన మఱియు లెస్సఁగా నుండు ననియందురు.

లక్ష్యము
క.

శ్రీజయకీర్తిసమాజా, రాజిలు నానందరంగరాయబిడౌజా
ధీజనకల్పకభూజా, నాఁ జనుఁ బ్రాసాంత్యమై యినస్ఫుటతేజా!

22
మఱియు, భీమనచ్ఛందంబున (సంజ్ఞ -88)
క.

జననుతభీమతనూజా!, మనయార్జితవిభవతేజ సుభగమనోజా,
వినుతవిశిష్టసమాజా!, యన నంత్యప్రాస మిది యహర్పతితేజా!

23

ద్వంద్వత్రిప్రాసములు

పెద్దిరాజు నలంకారచూడామణియందు (7.82)
క.

క్రమమునఁ బాదాదుల యం, దమలము లై రెండుమూఁడు నక్కరములు చె
న్నమరిన ద్వంద్వత్రిప్రా, సము లనఁగాఁ బరగు వానిఁ జనుఁ దెలియంగన్.

24


తా.

చరణాదిని మొదటి అక్షరముగాక అవతలి రెండక్షరములు చెప్పిన అక్షరములే నాలుగు చరణాలకు ప్రాసములు వస్తే అది ద్వంద్వప్రాస మగును ఆరీతిగా మూఁడేసి అక్షరములు వస్తే అది త్రిప్రాస మగును.

ద్వంద్వప్రాసమునకు లక్ష్యము
క.

శ్రీరంగరమణసేవా, పారంగతుఁ డైనరంగపార్థివమణి యా
సారంగ మెక్కి తగుఁ జను, దేరం గని పొగడి రనఁగ ద్విప్రాస మగున్.

25
భీమనచ్ఛందంబున (సంజ్ఞ-82)
క.

దోసంబు లేక వస్తుని, వాసం బై పరగఁ జెప్పవలయును ద్వంద్వ
ప్రాసం బుచితాక్షరవి, న్యాసంబుగఁ గృతుల రేచ [4]యభినవచరితా.

26
త్రిప్రాసమునకు లక్ష్యము
క.

కొమ్మనెరా బాళిని నిను, రమ్మనెరా తనదుమేను రంగాధిప! నీ
సొమ్మనెరా విడిదికిఁ దో, తెమ్మనెరా యనుచుఁ బల్కఁ ద్రిప్రాస మగున్.

27
భీమనచ్ఛందంబున (సంజ్ఞ-84)
క.

దానమున సత్యమున నభి, మానమునం బోల్ప నీసమానము ధరణిన్
గాన మనం ద్రిప్రాసము, దాన మనోహర మగును బుధస్తుతచరితా.

28

చతుష్ప్రాసము

ఉత్తమగండచ్ఛందంబున
గీ.

మొదటివ్రాయి గాక కొదువ నాల్గక్షర, ములును నాల్గుచరణములను గలుగ
జెప్ప నదియె కృతుల నొప్పు జతుష్ప్రాస, మనఁగ సుకవు లెన్న నాదిదేవ!

29


తా.

చరణమున మొదటియక్షరము గాక తక్కిననాల్గక్షరములు చరణచరణానకు జెప్పితే అది చతుష్ప్రాసము.

లక్ష్యము
క.

నిరతనముచిహ్న(ఘ్న)విభవత, నెరతనమును గాంచి రంగనృపమణి యెవరీ
ధరతనముం గలయని బలు, దొరతనమును బూనె ననఁ జతుష్ప్రాస మగున్.

30
అనంతచ్ఛందంబున (1-73)
క.

వారణవరద నిశాటవి, దారణ వీరావతార ధరణీవలయో
ద్ధారణ వరమునినుత యని, ధోరణిగాఁ జెప్ప నది చతుష్ప్రాప మగున్.

31


తా.

ఈయాఱువిధము లగుప్రాసములు నిండావాడుక అయినందుచేత లక్ష్యాలు ప్రబంధాదులనుండేవి యెత్తివ్రాయలేదు. తక్కిన ప్రాసములకు వ్రాయవలెను గనుక వ్రాస్తున్నాను.

ఋకారప్రాసము

క.

అరయ రేఫలు మూఁడు ఋ, కార మొకటి ప్రాసముగను గదియించినచో
మీఱు ఋకారప్రాసము, పేరున నానందరంగ పృథ్వీరమణా!

32


తా.

స్వరములలో ఉండే ఋకారము 1, రేఫలు 3 గాని, ఋకారములు 3, రేఫ 1 గాని కూర్చి నాలుగు చరణములకు ప్ర్రాసములుగా వుంచుకొని పద్యము చెప్పవచ్చును.

లక్ష్యము, అథర్వణచ్ఛందంబున
క.

అరయ స్వరగణ మయ్యు ఋ, కారము ఋప్ర్రాస మగుచుఁ గదియును రేఫన్
జేరి తనయురముఁ దన్నిన్నయాఋషి పాదములు పిసికె నచ్యుతుఁ డనఁగన్.

33
భారతము, అరణ్యపర్వమున
క.

ఆఋషికొమరుఁడు గట్టిన, చీరలు మృదులములు నవ్యచిత్రములు మనో
[5]హారులు నాతనిపృథుకటి, భారమ్మున నొక్కకనకపట్టము మెరసెన్.

34

ప్రాది ప్రాసము

గీ.

ప్రాది యైననకారశబ్దములు మూఁటి, కొకనకారంబు రేఫసంయుక్త మగు న
కార మొక్కటి మూఁడుణకారములకుఁ, బ్రాసములు చెల్లు నానందరంగధీర!

35


తా.

ప్ర అనే ఉపసర్గయాదిగా గలనకారశబ్దము "ప్రాణ” అనుశబ్ద మయ్యెను గనుక ఆశబ్దములు మూఁటికి ఒక నకార ప్ర్రాసము చెల్లును. నకారములు మూఁటికి రేఫతో చేరిన ణకార మొకటి చెల్లును.

అనంతచ్ఛందంబున (1-48)
గీ.

ప్రాది యై[6]ననకారంబు ప్ర్రాణమగుట, పరగ నణలకు [7]నొండొంటఁ బ్రాసమైత్రి
క్షోణిధరుఁ డెత్తె నేనుఁగుప్రాణమనఁగ, దానవారాతివ్రేఁతలప్ర్రాణ మనఁగ.

36
బృందాసంభవము, [8]పరాంతం అప్పన్న
క.

పో నుద్యోగము చేసిన, ప్ర్రాణంబా యిదియె నీకుఁ బాథేయం బా
మానిని మందస్మితమధు, రానన చంద్రికలఁ గ్రోలి యరుగుము పిదపన్.

37
వరాహపురాణమున
క.

శ్రీ నారాయణ నిన్నున్, బ్రాణముగాఁ జూచుకొని...

38


అని వున్నది గనుక తెలియవ్రాసినాను.

బిందుప్రాసము

గీ.

రహిని బ్రాసాక్షరాదివర్ణంబు గిలుక, నమరియుండిన నది బిందు వగుచు బిందు
వర్ణములఁ జేరి ప్రాసమై వన్నె కెక్కు, సుందరీమోహనాంగ యానందరంగ!

39


తా.

మూఁడుచరణముల ప్రాసాక్షరములకు మొదటియక్షరములకు సున్నలుండి ఒక యక్షరానకు వలపలిగిలక వుంటే అదిన్ని సున్నగలయక్షరమై ప్రాసము చెల్లును.

లక్ష్యము, అనంతచ్ఛందమున (1. 51)
గీ.

పేర్చి పొల్లునకారంబు [9]బిందు వగుచు
[10]మీఁది సున్న ధకారంబు నూఁదఁ బ్రాస
బంధ మగుఁ గృష్ణుఁ డుదయించినన్ ధరిత్రి
యంతయును నిరుపద్రవం బయ్యె ననఁగ.

40
మఱిన్ని, సారంగధరచరిత్రమున
క.

కన్ దోయి చల్ల గా నిటు, కందోయి నృపాలు లెస్సగా నింకొకమా
ఱందఱిముందఱ నీవని, చిందఱవందఱయు గుట్టు చిట్టాడంగన్.

41
హరికథాసారము, చతుర్థాశ్వాసము, అల్లసాని పెద్దన
క.

అంబరము వగుల నార్చి ప్ర, లంబాసురుఁ డాగ్రహము వెలయఁ గదిరిన వే
ళం బలరాముఁడు చేముస, లంబున వానితలఁ ద్రుంచె లావు మెఱయఁగన్.

42
భారతము, ఆరణ్యపర్వమున
మత్త.

అమ్మునీంద్రునివాసశక్తిఁ దదంగరాజ్యములందు మే
ఘమ్ము లెల్ల కెలంకులం గడుఁ గ్రమ్మి సర్వజనప్రమో

దమ్ముగాఁ బ్రచలద్బృహజ్జలధార లొప్పఁగ వృష్టిఁ జే
నె మ్మహానదులున్ మహాసరసీచయమ్ములు నిండఁగాన్.

43
భారతము, ఆదిపర్వమున
లయగ్రాహి.

కమ్మనిలతాంతములకు మ్మొనసి వచ్చు మధుపమ్ము...

44


అని వున్నది గనుక జాడ తెలుసుకోగలది.

అర్ధబిందుప్రాసము

అనంతచ్ఛందంబున (1.52)
గీ.

సార్ధ బిందువులై తేలినట్టిటపల, కరయఁ బ్రాసంబు నిర్బిందువైనఁ జెల్లు
వీఁపు మూఁపును మఱి తలమోపు నయ్యె, మాట లేటికి మేటి తాఁబేటి కనిన.

45
నన్నయభట్టు లక్షణసారంబున
గీ.

ఒకటి కరసున్న గలిగి మూఁటి కవి లేక
ప్ర్రాసములు లఘుపదము లై పైనిజెల్లుఁ
గృతుల నొక్కొక్కచో నది యెట్టులనిన
నిఁకను నెఱిఁగింతుఁ జెప్పుడీ సుకవు లనఁగ.

46


తా.

కచటకప వర్గాక్షరములలో అరసున్న గలయక్షరములు మూఁడు, సున్న లేనియక్షర మొకటిగాని, సున్న లేనియక్షరములు మూఁడు, అరసున్న గలయక్షర మొకటిగాని వున్నట్టయితే ప్ర్రాసము చెల్లును.

లక్ష్యము
గీ.

వీఁక నానందరంగమహీకళత్రుఁ, డాటల విధంబు రిపులను వేఁటలాడి
దాపురం బైనవైరంబు వాపుకొనియెఁ, జూచినవజీరు లొగిఁ దలలూఁచగాను.

47
మఱియు, భారతము, విరాటపర్వమున (2-271)
క.

నాకొఱఁతఁ దీర్చి వచ్చితి, నీకొఱఁతయె యింక సూతునిం దెగఁజూడన్
లోకము వంచింపం దగుఁ, జీఁకటిరేయొదవ నేమిచేయుదొ చెపుమా.

48
మఱిన్ని, భారతము, ఆదిపర్వమున (2-42)
క.

ఆపన్నగముఖ్యులఁ దనవీఁపునఁ బెట్టుకొని పఱచి విపినములు మహా
ద్వీపంబులు గిరు లలఘుది, శాపాలపురములు చూపెఁ జని వారలకున్.

49
భారతము, ఉద్యోగపర్వమున, (4-407)
క.

మేటు లగురథికులను నొక, నాఁటికి వేవుర వధింతు వరుశరములునో
నాటి పడవైచునంతకు, వేఁటాడెదఁ బ్రతిబలంబువీరుల నెల్లన్.

50
వరాహపురాణమున
క.

ఆచింతామణి ముని తన, పీచమణఁచుదాఁక నీక పృథులోభముచే
దాఁచుకొనుఁగాక నాచే, నీచే నిఁక మోసపోవునే నరనాథా!

51


వ.

అని వున్నది గనుక సూచనగా వ్రాసినాను.

అభేదప్రాసము

కవిరాక్షసచ్ఛందమున
క.

లళలకు లడలకు నొకటొక, టలవుగఁ బ్రాసంబు యతియు నౌ వపలకు న
వ్వలఁ దడలకు రళలకు యతి, వెలయున్ బ్రాసంబు తగ దభేద మిది యగున్.

52
ఉత్తమగండచ్ఛందంబున
క.

లడలు లళలు నొండొంటికి, వడి ప్రాసము చెల్లు రలలు వపలును దడలున్
వడిఁ జెల్లుఁ బ్రాస మమరదు, కడు నరయ నభేదసంజ్ఞఁ గను నివియెల్లన్.

53


తా.

లకారడకారములకు, లకారళకారములకుఁ బ్రాసములు యతులు చెప్పవచ్చును. వకారమునకు పవర్గమునకున్ను, దకారడకారములకున్ను, రకారలకారములకున్ను యతిమాత్రము చెప్పవచ్చును. ప్ర్రాసము లుండవు.

ఇందుకు లక్ష్యము
క.

వ్రీడావతు లలసగతిన్, వేడుక నానందరంగవిభుసముఖమునన్
జోడుగ నటియింతురు పటు, తాళవిభేదముల నద్భుతాభినయములన్.

54
నందిసింగన వరాహపురాణమున
క.

దాడింబబీజముల మగ, రాలన్ గురువిందములను రహి వరుసగ నా
బాలామణి దంతద్యుతి, రాలించును మూల నుంచుఁ ద్రాసున నుంచున్.

55
నృసింహపురాణమున
సీ.

ఈళాపు నీలంపు గోడను దను వింత, దనుపట్టు తీవంచు కంబములను...

56
అథర్వణాచార్యులు భారతమున
క.

తాలాంకుతుములసమర, క్రీడకుఁ దాళగలవాఁడు క్షితిలోపల నె
వ్వాఁడును లేఁడని యుండకు, నీడగ్గర నున్నవాఁడ నే సెల విమ్మా.

57
శతమఖరామాయణమున
సీ.

చూడు మంచును సప్తతాళముల్ దెగవ్రేయ, వీక్షించి రవిపట్టి విస్తువోయె...

58
[11]ప్రబంధరాజమున
క.

వ్రీడావతు లయ్యెడ నీ, లీలన్ బుష్పాపచయకలితఘనకేళిన్
లాలితజనితశ్రమ లై, యాలో జలకేళికాంక్ష నట చన నెదుటన్.

59


వ.

అని యిట్లు బహుప్రబంధములయం దున్నది గనుక తెలియగలది.

60

వర్గ ప్రాసము

నన్నయభట్టు లక్షణసారంబున
గీ.

కనఁదవర్గద్వితీయథకారమునకుఁ, బ్రాస మొకచోఁ జతుర్థధవర్ణమైన
గాకను దకారమునకు ధకారమైన, నమరినదియు వర్గప్రాస మండ్రు గృతుల.

61
కవిరాక్షసచ్ఛందంబున
క.

తిలకింపఁ దవర్గములో, పలినలువర్ణము ద్వితీయవర్ణ మదియుఁ గా
కలఁతిగ వర్ణము నాలవ, దలరిన వర్గంపుఁబ్రాస మండ్రు కవీంద్రుల్.

62


తా.

తవర్గథకారమునకును ధకారమునకును దకారమునకును ధకారమునకును బ్రాసము చెల్లును.

లక్ష్యము
గీ.

ప్రోది నానందరంగభూనాథుకీర్తి, యీధరిత్రి స్థిరంబుగాఁ బాదుకొనియె
సాధురక్షణుఁ డతనిదే మేధగాని, మేధయే యన్యులది వట్టిగాథ గాని.

63
మఱిన్ని, పుత్తేటి రామభద్రయ రామాభ్యుదయమున
క.

గాధేయోక్తపురాతన, గాథానిరవద్యపద్యగద్యగ్రహణా
సాధారణానివారణ, మేధానిధు లైనయట్టిమిత్రకులేంద్రుల్.

64
ఎఱ్ఱాప్రగ్గడ, సంక్షేపరామాయణమున
క.

ఆదశరథసూనుండు ప, యోధిజలం బింకఁజేసి యొకశరమునఁ గ్ర
వ్యాదవిభుఁ దునిమి సీతను, మోదంబునఁ జేకొనె సురపుంగవు లెన్నన్.

65
అల్లసాని పెద్దన, హరికథాసారమున
క.

ఆదేవోత్తముఁడు సుధాం, బోధి వటైకాగ్రిమదళమున బాలుండై
చేదోయిచేత దక్షిణ, పాదముఁ గొని నోటఁ జేపెఁ బకపక నగుచున్.

66
భారతము, ఆదిపర్వము (2.200)
ఉ.

కాదన కిట్టిపాటియపకారము తక్షకుఁ డేకవిప్రసం
బోధనఁ జేసి చేసె బుధపుంగవ నీవు ననేకభూసురా

పాదితసర్పయాగమున భస్మము సేయుము తక్షకాదికా
కోదరసంహతిన్ హుతవహోగ్రసమగ్రశిఖాచయమ్ములన్.

67


అని యున్నది గాన జాడ తెలియునది.

త్రివర్ణప్రాసము

శ్రీధరచ్చందంబున
గీ.

కృతులఁ ద్రత్వత్రయమును దత్వ మొకటి, యటులు గాక తవర్ణత్రయముఁ ద్రకార
మొకటి ప్రాసంబులుగ నిల్ప సుకవిచంద్రు, లవనిలోఁ ద్రివర్ణప్రాస మండ్రు శౌరి.

68
ఇంకను అనంతచ్ఛందంబున (1,45)
గీ.

[12]సంధిఁబల్కు త్రికారంబు చనుఁ దకార, సదృశ మైత్రికారప్రాససంజ్ఞఁ గలిగి
ఆత్రివిక్రముఁ డభయప్రదాత యనఁగ, వాక్త్రిపథగోజ్జ్వలులు విష్ణుభక్తు లనఁగ.

69


తా.

త్రకారములుగావుండే అక్షరములు మూఁటికిన్ని ఒక్కతకారమైనా, తకారములు మూఁటికిన్ని ఒక్కత్రకారమైనా ప్రాసములుగా వుంచి చెప్పవచ్చును.


క.

దాతలదాత యనంగా, రీతిగ నానందరంగనృపమణి గనె వి
ఖ్యాతి నెరయోధ యతఁ డే, యీత్రిభువనమునను గలుగునృపతులలోనన్.

70
మఱిన్ని, నంది సింగన బలరామవిజయమున
క.

క్షత్రియధర్మంబున మాం, ధాతృఁడు రాజ్యంబు నీతిఁ దగఁ బాలించెన్
శాత్రవరహితంబుగ నిజ, గోత్రము వెలయంగఁ బ్రజలు గొనియాడంగన్.

71
నాచనసోముని హరివంశమున
[13]శా.

నాతో మార్కొనలేరు నిర్జరమరున్నాగేంద్రబృందారకా
రాతు ల్మున్నుగ దేవసంఘములె పోరన్ లేవు సాంగ్రామికుం
డీత్రైలోక్యమునందుఁ గానము రణం బెచ్చోట లేకుండఁగాఁ
జేతు ల్వేయు వృధాభర మ్మగుచుఁ దోఁచెం దేవ యిమ్మేనికిన్.

72
అల్లసాని పెద్దన హరికథాసారమున
సీ.

ఆత్రినేత్రుఁడు వనజాతదళాక్షుని, గూరిచి తపముఁ గైకొనినచోటు...

73


వ.

అని యీరీతి ఆయాప్రబంధములం దున్నది గనుక దెలియఁ గలదు.

74

సంధిగతప్రాసము

అనంతచ్ఛందంబున (1.59)
క.

ధృవముగ సంధిజనితరూ, పవిశేషప్రాస మగుచుఁ బరగుఁ బకారం

బవిరళవకార మగు న, య్య [14]పదాఱవపే రెఱుంగు ననఁగ ముకుందా.

75
అథర్వణచ్ఛందంబున
గీ.

అరయఁ గన్గవ చన్గవ యనెడి రెండు, నుడులపొల్లులు బిందుతను గని ప్రాస
సంగతిని సంధిగత మగుఁ గంగవ యన, చంగవ యన బిందుయతి యెసంగనెందు.

76
కవిలోకసంజీవనియందు
క.

[15]ప్రథమాంతవిభక్తులపై, కథితము లగుకచటతపలు గసడదవ లగున్
పృథివి నవి గజడదబ లగు, ప్రథమపుసున్న లగు నాంతపదములమీఁదన్.

77


తా.

ప్రథమాంతవిభక్తిగావుండే తెనుఁగుశబ్దముమీద కచటతప ఈ 5 అక్షరములు ఆదినుండే శబ్దములు నిలిచినట్టయితే కకారము గకారమగును. చకారము సకారమగును. టకారము డకారమగును. తకారము దకారమగును. పకారము వకారమగును. మఱియొకప్పు డాచకారము జకారమగును. పకారము బకారమగును. ఈగజడదబలు వలపలిగిలక కలిగినయక్షరములతోఁ జేరివుంటే ఆవలపలిగిలకలు సున్న లగును.

ఇందుకు లక్ష్యము
గీ.

అవని భవదీయకీర్తిలక్ష్మి పరమేశు, నిం గదిసి మించి యతనితురంగ మతని
మంజునిలయ౦బుఁ గేరి వెసం జెలంగె, నౌర యానందరంగరాయాగ్రగణ్య!

78
మఱిన్ని, భారతము, ఉద్యోగ పర్వమున
క.

కావలియై సురరాజ్య, శ్రీ వాలింపం దగున్.........

79
వసుచరిత్రమున
మ.

వివిధోర్వీపతులన్ జగన్నుతుల మున్ వీక్షింపమో వారిపెం
పు పరీక్షింపమొ నింపమో చెలిమి యేభూపాలునందైన నీ
భువనత్రాణపరాయణు...

80
భారతము, విరాటపర్వమున
శా.

సింగం బాఁకటితో గుహాంతరమునన్ జేట్పాటుమై నుండి మా
తంగస్ఫూర్జితయూధదర్శనసముద్యత్క్రోధ మై వచ్చునో
జం గాంతారనివాసఖిన్నమతి నస్మత్సేనపై వీఁడె వ
చ్చెం గుంతీసుతమధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్.

81
భారతము, భీష్మపర్వమున
శా.

గంగానందనుఁ గూల్చి ద్రోణుపని చక్కం జేసి [16]ఘోరారి శౌ
ర్యాంగారంబుల నొక్కపెట్టఁ గొని బాహాటోప మేపారని
త్తుం గౌంతేయుల కిమ్మహీవలయమున్...

82
భారతము, కర్ణపర్వమున
క.

సంజయ మురభంజనుని ధ, నంజయునిం జీరికింగొనఁడు కర్ణుం డిం
ద్రుం జెనకి యైన గెలుతు న, నుం జచ్చెనె యట్టివాఁడునుం గయ్యమునన్.

83


వ.

అని మహాకవులప్రయోగము లున్నవి గనుక జాడ తెలుసుకొనేది.

84

ప్రాస మైత్రి

[17]అనంతచ్ఛందమున
గీ.

లళలు రెండును నొండొంటిఁ గలసి వచ్చు, నమరు నన్యోన్యముగ ఋయుతాయుతములు
బిందుపూర్వమై తమలోనఁ బొందు బమలు, ప్రాసమైత్రికి నిది స్వరూపంబు గృతుల.

85
మఱిన్ని, గోకర్ణచ్ఛందమున
గీ.

తగ ఋకారాన్వితంబు ద్విత్వంబు గాఁగఁ
బరఁగు నచ్చపుజడ్డతోఁ బ్రాసమైత్రి
యక్కృపానిధి హరిఁ గని మ్రొక్కె ననఁగ
సంభృతాశ్రితుఁ డతియశోజ్జృంభి యనఁగ.

86


తా.

లకారరకారములు ప్రాసములున్నా వట్రువసుడి లేనియక్షరము ప్రాసమున్నా నున్నలుగలిగినబకారము మకారము ప్ర్రాసములున్నా అది ప్రాసమైత్రి.

అనంతునిచ్ఛందమున (1-41)
గీ.

లాలితానందరంగరాణ్మౌళి చాల, నెమ్మితో రాయసింహాసనంబు నెక్కి
సకలరాజన్యపూజితసుకృతి యగుచు, శాశ్వతఖ్యాతిఁ జెందు నీవిశ్వమునను.

87


గీ.

నీలవర్ణగర్భగోళంబునందు లో, కంబులెల్ల నుండు నెమ్మితోడ
శ్రీకి వొడయఁ డుజ్జ్వలాకృతి యితఁ డన్న, [18]బ్రాసమైత్రి యెసఁగు వాసుదేవ!

88
భారతము, ఆనుశాసనికపర్వమున
.
క.

భాతృస్నేహము గలిగి య, రాతులు భయమందఁగా ధరారాజ్యము సం
ప్రీతి ననుభవించిరి జను, లాతతహర్షమునఁ బొంది రందఱు నెమ్మిన్.

89
రాఘవపాండవీయమున
శా.

లోకత్రాణరతిన్ దదాదిమమహీలోకప్రవేశోత్కభా
షాకౢప్తప్రథమద్వితీయపదగుంజన్మంజుమంజీరగ
ర్జాకల్పాదుల రామభారతకథాసర్గంబుల న్మించువా
ల్మీకివ్యాసులఁ గొల్చెదన్ దదుభయశ్లేషార్థసంసిద్ధికిన్.

90
భాస్కరరామాయణము, యుద్ధకాండమున
క.

నా కింకను దిక్కెవ్వరు, శోకాంబుధిఁ గడచుటెట్లు శూరతమై భూ
లోకాధిపసుతు ననిలో, నేక్రియ నిర్జించువాఁడ నెట్టిది వెరవో.

91


క.

అకృతాస్త్రుఁడ బాలుఁడఁ గా, ర్ముకవిద్యాప్రౌఢిమై నిరూఢు లయినయా
శకుని జయద్రథ దుర్ముఖ, వికర్ణ కర్ణాదియోధవీరుల కెదురే.

92


అని వున్నది. దీనినే కొందఱు సమలఘుప్రాస మందురు.

ఇందుకు అనంతచ్ఛందంబున (1-49)
గీ.

ఓలి రేఫతోఁ గూడియు నూఁదఁబడక, తేలి తెనుఁగునఁ దమయట్టివ్రాలతోన
సములఘుప్రాస మగు రెక్క లమరఁబట్టి, విఱచెఁ గృష్ణుఁ డసురదిక్కులద్రువ ననఁగ.

93


వ.

అని యున్నది గనుక జాడ తెలిసికొనునది.

94

లాటానుప్రాసము

పెద్దిరాజు నలంకారమున (6-17)
క.

పాటిగఁ జెప్పిన శబ్దమె, చాటుగతిన్ సొరిదిఁ బల్కు చక్కటి నర్థా
ఘాటోత్కర్షము చేసిన, లాటానుప్రాస మనఁగ లలితం బయ్యెన్.

95


తా.

అనుకరణముగా చెప్పినశబ్దమే యర్థము వేఱువేఱుగా వుంటే అది లాటానుప్రాసము.

ఇందుకు లక్ష్యము
క.

రంగలరంగల దానికు, రంగటఁ జేరంగఁ దగునె రంగ నృపతి పా
రంగ యొనరంగ సుగుణత, రంగ జితారిచతురంగ రంగపతి సమా!

96
ప్రబంధరాజమున
క.

నినుఁ గనుకన్నులు కన్నులు, నినుఁ బేర్కొనుపలుకు పలుకు నీపుణ్యకథల్
వినియెడు వీనులు వీనులు, నినుఁ దలఁచుతలంపు తలఁపు నీరజనాభా!

97
మఱియును పెద్దిరాజు నలంకారమున (6.14)
క.

కందర్పదర్పదము లగు, సుందరదరహాసరుచుల సుందరిచందం
[19]బందం బెందును లేదని, వందారూదారు విశ్వవరు నర్చించెన్.

98

తృతీయాశ్వాసము.

భీమనచ్ఛందమున (సంజ్ఞ. 86)
క.

విత్రస్తాఘపవిత్రచ, రిత్ర జితత్రిదశవర ధరిత్రీసుతస
స్మిత్రాంబుజమిత్రగుణా, మత్ర యనుప్రాస మిదియె మల్లియరేచా!

99


వ.

అని యున్నది గనుక కొందఱు ఇదే ఛేకానుప్రాసమనిన్ని లాటానుప్రాసమనిన్ని
గొంద ఱనుప్రాస మనిన్ని వాడుకొందురు గనుక జాడ తెలుసుకొనేది.

100

శకారప్రాసలక్షణము

అథర్వణచ్ఛందంబున
క.

తొలుత శకారమ్ములు తిగ, గలిగి సకార మొకటైన గాక సకార
మ్ములు తిగ శకార మొక్కటి, గలిగిన శప్రాస మండ్రు కంజదళాక్షా!

101


తా.

శకారములు మూఁడు ఒకసకారమయినా సకారములు మూఁడు ఒకశవర్ణమయినా ప్ర్రాసము లుంచి పద్యములు చెప్పవచ్చు ననుట.

లక్ష్యము
క.

వసునగసమధీరుం డై, పొసఁగిన యానందరంగభూపతి సభ నిం
పెసఁగిన తారలనడుమన్, శశి భాసిలురీతి వెలయు జనులు నుతింపన్.

102
మఱిన్ని, నన్నయభట్టు ఇంద్రవిజయమున
క.

ఆసరసిజాక్షి కౌనుకు, గా సరి యొక్కింతపోలుకతమునఁ గద యా
కాశ మనంతాహ్వయమునఁ, గేసరి హరినామమునఁ దగెన్ విను మింద్రా!

103
అప్పన్న ఆంధ్రపదప్రయోగమున
క.

పసలేని పనికిఁ బోయిన, రసభంగము గాక మేలు రానేర్చునె యెం
తసహాయశూరుఁ డైనను, దశ దప్పిన నేమి సేయు దశరథరామా!

104
పరమభాగవతచరిత్రమున
క.

ఆశీర్వదించి శుకుఁ డుచి, తాసీనుం డగుచు రాజు నంద నునిచి యా
వేశకృపామతి శాప, క్లేశవిషాదాత్ముఁ డగుటఁ గృతనిశ్చయుఁ డై.

105
భాస్కరరామాయణము, యుద్ధకాండమున
ఉ.

వ్ర్రేసియుఁ జీరియున్ బొడిచి వ్రేచియుఁ గ్రుచ్చియుఁ జించి త్రుంచి చి
ట్టేసియుఁ గూల్చియున్ బగుల నెమ్ములు రాల్చియుఁ గ్రుచ్చి నుగ్గుగాఁ
జేసియుఁ గంఠముల్ దునిమి చిందఱవందఱగుఁ గాఁగ మోదినన్
గీశులు భీతిఁ జెంది దమకించుదు రాఘవుమర్వు చొచ్చినన్.

106
జానకీనాయకశతకమున
మ.

కసుమాలం బగుదేహి పుట్టువు(ను)ల నీకష్టంబులం బాపి ది
వ్యశరీరం బొనరింతు వెప్పుడు నిను న్వాక్రుచ్చినన్ యోగిమా
నసగేహంబుల నుండి లోహము సువర్ణచ్ఛాయలం జేయఁగా
రసవాదంబుల నేర్చికొంటె రఘువీరా జానకీనాయకా.

107


వ.

ఈరీతిని అనేకకవులు చెప్పినారు గనుక తెలియగలదు.

108

వికల్పప్రాసము

శ్రీధరచ్ఛందమున
గీ.

[20]సానునాసికతనువర్గహల్లులని తృ, తీయలుగ వికల్పప్రాసమై యెలర్చు
ప్ర్రాఙ్నగంబున రవి దోఁచె నగ్నిఁ బోలి, ప్రాఙ్ముఖుండయి నుతియించె వాగ్మి యనఁగ.

109


తా.

అనునాసికసంయోగ మైనయక్షరములు సమానసంధిచేత వికల్పమవును. ప్ర్రాక్ + ముఖము = ప్రాఙ్ముఖము. ఈ ప్రాఙ్ముఖశబ్దము 'గ్మ' ప్రాసమునకు చెప్పవచ్చును. దిక్ + ముఖము = దిఙ్ముఖము, ఈదిఙ్ముఖళబ్దము, 'గ్మ' ప్ర్రాసమునకు చెప్పవచ్చును. ఉద్యత్ + మోదము = ఉద్యన్మోదము. ఈ ఉద్యన్మోదశబ్దము 'ద్మ' ప్ర్రాసమునకు చెప్పవచ్చును.

లక్ష్యము, అనంతచ్ఛందమున
[21]క.

పద్మాసమాన యగుమన, పద్మావతిఁ జూచి ధరణిపాలకసుతుఁ డు
ద్యన్మోదంబున దనముఖ, పద్మము నలరించె ననుచుఁ బరిజను లలరన్.

110
కావ్యచింతామణియందు
గీ.

తిగ్మదీధితి వెలిఁగించు దిఙ్ముఖముల, దిఙ్మహీతలనాథుండు వాగ్మి యనఁగ...

111


వ.

అని యివ్విధంబున మహాకవిప్రయోగము లుదాహరణము లున్నవి గనుక సూచన
వ్రాయడమయినది.

112

ఇక యతి ప్రకరణము

స్వరయతిః భీమనచ్ఛందమున (సంజ్ఞ 64)
క.

స్వరగణము కకారాద్య, క్షరములతో సంధిచేసి కదియించినఁ ద
త్స్వరము కొని చెప్పునవి వ, ళ్లరవిందజసదృశ కవిజనాశ్రయకృతులన్.

113
మఱియును
క.

ఆఅ లై ఔలకు మఱి, ఇఈలు ఋకారసహిత మెఏలకు నౌ
ఊఊ ల్తమలో నొడఁబడి, ఒఓలకు వళ్లగు న్నయోన్నతచరితా!

114

వ.

ఈరెండు నొకటొకటికి యతి చెల్లును. ఇది స్వరము లైనఅచ్చులకున్ను వ్యంజన
ము లైనహల్లులకున్ను కూడా నిర్ణయము గనుక తెలియగలది.

115


గీ.

అమితధీరత్వమునఁ గనకాద్రిఁ గేరి, యుజ్జ్వలాకృతి మాధవు నోహటించి
యెన్నఁదగువిక్రమమున మృగేంద్రుఁ దెగడి, ప్రబలి తౌరౌర యానందరంగధీర!

116
మఱిన్ని, పెద్దిరాజు నలంకారంబున (7-33)
గీ.

అవని ధర్మజుఁ బోలు నిత్యార్యచర్య, నాదిరాజులఁ దొరయు నిత్యైంద్రభూతి
నరుల నిర్జించు [22]భుజశక్తి నతిశయిల్లి, విధుకులాగ్రణి చాళుక్యవిశ్వవిభుఁడు.

117


వ.

అని వున్నది గనుక ఈజాడను అన్నిటికీ తెలుసుకొనేది.

118

గూఢస్వరయతి

అథర్వణచ్ఛందంబున
గీ.

అరయ నన్యోన్యశబ్దపరోక్షములకు, న్యోరువర్ణంబు లగు నుర్వి నుతచరిత్ర
వినుము గూఢస్వరములగు వీనియందు, నచ్చులకు హల్లులకు యతు లమరు నండ్రు.

119


తా.

అన్యోన్య పరోక్ష దాసో౽హ శబ్దములయందు గూఢస్వరము లుండుటచేత నవి యచ్చులకు హల్లులకు యతులు చెల్లును.

లక్ష్యము
గీ.

ఒనర వైభవవిజితబిడౌజ నీకు, నహితనికరంబు మ్రొక్కు దాసో౽హ మనుచు
నమరఁ గవిరాజవినుత యశో౽బ్ధివగుట, నవ్యకవితాప్రసంగ యానందరంగ.

120
మఱియును, నన్నయ లక్షణసారంబున
గీ.

స్వరముతుద నుండు లుప్తవిసర్గ కోత్వ, మైన గూఢస్వరయతి దాసో౽హ మనఁగ
నచ్యుతాశ్రితు లుర్వి నన్యోన్యమిత్రు, లనఁగ నమ్మాధవుండు యశో౽బ్ధి యనఁగ.

121


వ.

అని వున్నది గనుక తక్కిన అన్నింటికిని తెలియగలది.

122

కాకుస్వరయతి

[23]అథర్వణచ్ఛందంబున
క.

కాకుస్వరయతి దగు నితఁ, డే కదలక జలధిఁ బవ్వళించె ననఁగ [24]బు
ణ్యాకలిత దీర్ఘముగ నితఁ, డే కవ్వడి రథము గడపె నిమ్ముల ననఁగన్.

123

తా.

చరణము మొదటీయక్షరమయినా విశ్రమస్థానాక్షరమైనా స్వరముండఁజెప్పి యందుకు విశ్రమాక్షరము హల్లువుంచితే అది కాకుస్వరయతిగాఁ జెప్పుట.

లక్ష్యము
క.

వసుమతి రసికాగ్రణి యై, యెసఁగిన నానందరంగఁడే ప్రోచు సుధీ
విసరముల నామహాత్ముని, యసమతరఖ్యాతి వింటిరా కవులారా!

124
భారతము, విరాటపర్వమున
ఉ.

చూచుచుఁ జేరి వ్రేల్మిడుచుచుం దలయూఁచుచు నిర్విదగ్ధయై
యాచపలాక్షి ముక్కుపయి నంగుళముం గదియించి దీనికై
కీచక యింతచేసితి సుఖిత్వముఁ బొందుదుగాక యింక న
ట్లేచిన నిట్లు కాకుడుగునే యనుచున్ వెఱఁగొందుచుండఁగన్.

125
భారతము, ఉద్యోగపర్వమున
క.

నీచెప్పెడి పెద్దలు ద్రో, ణాచార్యులు మొదలుగాఁగ ననికొల్లనివా
రై [25]చన్న వారలంగొని, యేచక్కంబెట్టువాఁడ నేఁ బాండవులన్.

126
మనుచరిత్రమున
ఉ.

అక్కట! గంధవాహ! తగవా హరిణాంకునిఁ గూడి పాంథులన్, బొక్కఁగఁజేయ...

127
భాస్కరరామాయణము, ఆరణ్యకాండమున
క.

ఓనారీమణి! యీమెక, మే నిప్పుడు తెచ్చియుంతునే నీమ్రోలన్
గానుకగా నని రాముఁడు, చే నమ్ములు విల్లుఁ దాలిచి యొకండె తమిన్.

128


వ.

అని యున్నది గనుక ఈజాడను అన్నీ తెలుసుకొనేది.

ప్లుతయతి

క.

దూరాహ్వానమునందు మ, హారోదన గాన సంశయార్థములతుదన్
[26]వారక జనియించిన ఫ్లుత, [27]మారయ వడి నిల్పఁ జెల్లు నచ్చులతోడన్.

129


వ.

అని భీమనచ్ఛందంబున నున్నది (చూ. సంజ్ఞ. 70) గనుక ప్లుతయతులు నాలుగు
విధాలు. అందు ప్రత్యక్షముగా మాట్లాడినట్లు చెప్పుట ఆహ్వానప్లుతము. శోకరస
యుక్తముగాఁ జెప్పుట రోదనప్లుతము. సంశయార్థముగా చెప్పుట సంశయప్లుత
ము. స్వరసంగతిని గానము చేసినట్లు చెప్పుట గానప్లుతము. గానప్లుతము మాత్రము
ప్ర్రబంధాదులయందు అపూర్వము గనుక దక్కినమూఁడుప్లుతములకు లక్ష్యములు.

ఆహ్వానప్లుతము

మల్లికార్జున పండితారాధ్యుల శివతత్త్వసారంబున
[28]క.

ఆయతిఁ ద్రిపురాంతక దే, వా యనిపిల్చుటయు నధిక మంతయు వినంగా....

130
శరణాగతవజ్రపంజరశతకమున
[29]చ.

గ్రహగతు లేమి సేయు....
యిహపరసాధనా రఘుపతీ! శరణాగతవజ్రపంజరా.

131


క.

ఆనందరంగపతిమో, వానంజూచెదవు దొరకునా నీకు వధూ
టీనవమదనుం డొసఁగుట, యేనాతికొ కాని దానిదే భాగ్యమిలన్.

132
పారిజాతాపహరణమున
చ.

...ఇదె చను దెంచి వత్తుననుమీ శతమన్యునితోడ సంయమీ!

133
శృంగారనైషధమున
శా.

.... ఏలా! నాపయి దక్షిణానిలము పక్షీ సేయు దాక్షిణ్యమున్.

134
ఆముక్తమాల్యదయందు, నాల్గవచరణము
క.

........ గా కాకోదరనగోదయస్థపతంగా!

135


అని యున్నది.

రోదనఫ్లుతము

భాస్కర రామాయణము, ఆరణ్యకాండమున
ఉ.

ఏ జనకాత్మజన్ దశరథేశ్వరుకోడల రాముభార్యఁ జుం
డోజనులార! యడ్డపడరో సురలార! సురారి కంచు నం, భోజదళాక్షి...

136
కళాపూర్ణోదయమున
మ.

అకటా! యేమని దూరుదాన మిము నాథా! వేగుజామయ్యె...

137
బ్రహ్మాండపురాణమున
సీ.

రోషంబునను గావరో మునీశ్వరులార యనిపల్కు వనవీథి నరుగువేళ...

138


అని యున్నది.

సంశయప్లుతము

విజయసేనమున
ఉ.

...ఉల్లమ నీకు నిట్లు తగునో తగదో పరికించి చూడుమా!

139
భారతము, ఉద్యోగపర్వమున
ఉ.

... ఎక్కినపార్థుపైఁ గవిసెనే పసి నాతఁడు గ్రమ్మరింపఁగాన్.

140
భాస్కర రామాయణము, యుద్ధకాండమున
గీ.

అన్న నీవు బుద్ధు లన్నకుఁ జెప్పుచు, నున్నమాట లెల్ల విన్న గోలెఁ
బొగులుచున్నదాన మొగ మొప్పకున్నది, యెత్తెఱంగొ చెప్పవే కుమార!

141
మనుచరిత్రమున
శా.

ఈపాండిత్యము నీకుఁ దక్క మఱి యెందేఁ గంటిమే కామశా
స్త్రోపాధ్యాయిని నా వచించెదవు...

142
శృంగారనైషధమున
ఉ.

హింసయ నీకు వేడ్క యగునేని కృపాశ్రయ మైనయీసరో
హంసముఁ జంపనేల కఱవా తరువాత వసుంధరాధిపో, త్తంస...

143
మఱియు, శృంగారనైషధమున
చ.

...హరిహయుఁ డేమియయ్యెనొ కదా మదనానలతాపవేదనన్.

144
భారతము, ఉద్యోగపర్వమున
క.

సభ నీకయి యేఁ బలికితి, నిభపురమున మాట పుట్టదే నీవు ననున్...

145
భాస్కరరామాయణమున
ఉ.

ఆరఘువీరుతోడఁ బగ యందుట యల్పమె తద్వధూటి మా
యారుచిఁ దెచ్చి నిల్పఁ దరమా యతఁ డస్త్రము నారిఁ గూర్చినన్
వారిధు లుండునో విపినవర్గము లుండునొ...

146

వృద్ధియతి

[30]కావ్యాలంకారచూడామణియందు (7.72)
క.

ఏకైకపదమ్మునకున్, నాకౌకశ్శబ్దమునకు నచ్చులు వడిగాఁ
గాకోకారంబులు నిఁక, గైకొనఁజను వృద్ధివళ్లు కవు లొడఁబడుటన్.

147
మఱిన్ని, నన్నయభట్లు లక్షణసారంబున
గీ.

కృతులలో శబ్దశాస్త్రజ్ఞమతముచేత, వృద్ధియెందును రూఢిగా నెసఁగియుండె
నట్టియెడఁ బ్రకృతివికృతుల ననుసరించి, యుభయమును జెల్లు వళ్లకు శుభచరిత్ర.

148


తా.

ఏకైక, నాకౌక, రసైక, అక్షోహిణీ మొదలయినశబ్దములయందలి అచ్చులకు హల్లులకు రెంటికీ యతి చెల్లుననుట.

లక్ష్యములు
గీ.

అనఘ! యానందరంగ లోకైకమిత్ర, యెలమి నీసూక్తి యమృతరసైక మయ్యె
నింద్రుని హసించునట్టి భోగైకపటిమ, నొనరు నినుఁ బొగడుదురు దివౌకు లెల్ల.

149
అథర్వణచ్ఛందమున
గీ.

హరియె పరమాత్ముఁడును ద్రిలోకైకనాథుఁ, డిందిరాదేవి సకలలోకైకజనని
యుష్ణకరసూనుఁ డయ్యె నక్షౌహణీశుఁ, డట్ల శల్యుఁడు నాథుఁ డక్షౌహిణులకు.

150
విష్ణుపురాణమున
క.

ఉర్వీశతిలక నాపే, రూర్వశి నొకపనికిఁగా దివౌకులమహిమల్
సర్వంబు విడిచి వచ్చితి, నుర్వర నొకకొంతకాల ముండెడుకొఱకున్.

151
భారతము, విరాటపర్వమున
ఉ.

ఆకమలాక్షిరూపమహిమాతిశయంబు మనోహరంబు భో
గైకపరాయణుల్ పురుషు లంగజుఁ డప్రతికారచేష్టిత
స్వీకృతలోకుఁ డట్లగుటఁ జేటు పురమ్మునవారి కెమ్మెయిన్
రా కెటులుండు నిట్టియపరాధపుఁబొత్తు మనంగ వచ్చునే?

152
భాస్కరరామాయణము, యుద్ధకాండమున
శా.

నీకంఠార్పితకాలపాశము శిరోనిర్ఘాతపాతంబు లం
కౌకస్సంచయకాళరాత్రి గళబద్ధోదగ్రకాలాహి క
న్యాకారాగతమృత్యు వౌజనకకన్యన్ వేగ యొప్పించి లో
కైకత్రాణుని రామునిం గనుము నీ కీబుద్ధి గాకుండినన్.

153
[31]విజయవిలాసమున
క.

......ర, సైకము నెమ్మొగము దీనిమృదుమధురోక్తుల్.

154


వ.

ఇట్లు అనేకప్రబంధాలలో ఉన్నది గనుక తెలియదగినది.

155

నఞ్ సమానయతి

ఉత్తమగండచ్ఛందంబున
క.

నసమాసనఞ్ సమాసము, లసమమ్ముగ నచ్చుహల్లులన్ యతితగుఁ దా
పసమానసశ్రితమానస, రసజలవిహరణవిలోల రాజమరాళా!

156

తా.

అనుపమ, అనంత, అనేక, అనన్వయ, అనవద్య మొదలైన నఞ్ సమాసశబ్దములయందలియచ్చులకును యతి చెల్లుననుట.


గీ.

ఇలఁ గుటుంబప్రతిష్ఠ లనేకములు న, నంతగుణనిధి యైనయానందరంగఁ
డమరఁ గావించి కాంచె ననంతకీర్తి, నూత్నమా యెన్న నతనియనుపమమహిమ.

157
భారతము, ఆదిపర్వమున
ఉ.

ఆశ్రితపోషణంబున ననంతవిలాసమునన్ నీషివిమ
ద్యాశ్రమతత్వవిత్తమున...

158
భారతము, కర్ణపర్వమున
ఉ.

మ్రొగ్గెడు వాహనంబులును మోములు ద్రిప్పక పాఱుదంతులున్
నెగ్గితొలంగు సైనికు లనేకులు...

159


వ.

అని మఱిన్ని బహుప్రబంధములయందు చెప్పియున్నది గనుక జాడ తెలుసుకోగలది.

160

భిన్నయతి

.
అనంతచ్ఛందమున (1.123)
గీ.

అట ఇకారాంతపదముమీఁదటిదికార, మది యనంగ నవ్వలిభిన్నయతికిఁ జెల్లు
దివిజవిభవంబు శౌరిచేతిది యనంగ, నసురనాశంబు హరిచేతి యది యనంగ.

161
[32]మఱిన్ని, పెద్దరాజు అలంకారంబున
క.

అంచితతిలకము శౌరి ధ, రించె ననఁగ జగణమధ్యరేఫవిరతి యౌ
నంచితతిలకము హరి ధరి, యించె ననఁగ భిన్నవిరతి నిత్వము వచ్చున్.

162


తా.

ధరించె-ధరియించె, వరించె-వరియించె, భరించె - భరియించె, అను నీమొదలైనశబ్దములున్ను; చేతిది-చేతియది, వానిది-వానియది, ఊరిది-ఊరియది, ఆను నీమొదలయినశబ్దములున్ను మధ్యాక్షరవిరళములగును గనుక అచ్చుకు హల్లుకు యతి చెల్లుననుట.


క.

ఆనందరంగనృపతి య, హీనధరాభార[33]మున్ భరించుటచే ని
మ్మానవపతినిన్ సారెక, హీన ప్రముఖు లొనర న్నుతింతురు ప్రేమన్.

163
అధర్వణచ్ఛందమున
క.

...ముంచుకొనుఱాలజడికి భ, రించెద గోవర్ధనాద్రి యెలచేఁ గృష్ణా.

164
రాజశేఖరచరిత్రమున
ఉ.

చొచ్చినఁ బోకు పోకు మనుచు న్నృసకేసరి తేరు డిగ్గి నీ
వెచ్చటి కేఁగినన్ విడుతునే పటుబాణపరంపరాహతిన్

బచ్చడి సేయువాఁడ నని ఫాలనటద్భ్రుకుటీకరాళుఁ డై
యిచ్చ నొకింతయేనియుఁ జలింపక తద్బిలవీథిఁ దూఱఁగన్.

165
హరికథాసారమున
క.

తెంపరియై మది యింత చ, లింపక ననిలోనఁ దెగియె నెవ్వఁ డతఁడు నై
లింపసభనుండు ననుఁడుఁ బ, దంపడి యార్యులు వచింపఁ దా ని ట్లనియెన్.

166
భారతము, ఆరణ్యకాండమున
క.

వంచనయు మాయయు మదిఁ గు, ఱించి పరాక్రాంతి వయ్యు మేశాస్త్రమునన్
గొంచక నంతకుపురి కే, గించితి పౌలోనుకాలకేయాసురులన్.

167


వ.

అని యిట్లు బహుప్రబంధములయందు నున్నది గనుక జాడ తెలియగలదు.

168

నిత్యసమాసయతి

అనంతునిచ్ఛందమున (1. 103)
గీ.

ఏని యనుపదమ్ముతో నాదిపదమూది, సంధి నిత్యయతులు జరుగు రెంట
నెట్టికూరకర్ముఁ డేని సద్గతిఁ జెందు, నిన్ను నాత్మఁ దలఁచెనేని కృష్ణ.

169
మఱిన్ని, ఉత్తమగండచ్ఛందమున
క.

చను నాపోశన వాతా, యనము లల రసాయనము పరాయణ నారా
యణ శుద్ధాంతైకాంతము, లనునిత్యసమాసములకు యతు లిరుతెఱఁగుల్.

170


తా.

“ఏని” యను తెనుఁగుపదము నిత్యసమాసపద మైనపుడు 'కనెనేని, వినెనేని, ఎవ్వఁడేని' యని బహువిధములుగా విస్తరిల్లినది కావున వానియందచ్చుకు హల్లుకు రెంటికి యతిచెల్లును. మఱియు సంస్కృతమున ఆపోశన వాతాయన రసాయన పరాయణ నారాయణ శుద్ధాంతైకాంతాది నిత్యసమాసశబ్దముల నచ్చునకు హల్లునకుఁ గూడ చెల్లు ననుట.


క.

ఆనందరంగరాయమ, హీనాయకచంద్రుఁ డెన్నఁడేని దురాశల్
దా నొడువఁడు సుకవుల కనే, నేనియు నాక్షణమె యొసఁగు నెమ్మది తనియన్.

171
మఱిన్ని, నంది సింగన వామనపురాణమున
గీ.

సరసచిత్రాన్నములును రసాయనములు, భత్యములు నూరుఁబిండ్లును బాలుజున్ను.......

172
బ్రహ్మాండపురాణమున
సీ.

అంబుధిశయన నారాయణ విగ్రహ యంబుజనాభ వేదాంతవేద్య....

173
మనుచరిత్రమున
ఉ.

ఇంతలు......................................యే
కాంతమునందు నున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు...

174
నంది సింగన వామనపురాణమున
క.

కాంతాలలామ నీ కే, కాంతంబునఁ బల్కరింతుఁ గల్గినకార్యం
బంతయు ముదమలరఁగ విను, మంతట నీమదికిఁ దెలివిడై యుండు సుమీ!

175
వరాహ(వామన)పురాణమున
గీ.

.... తత్తరమున నాపోశన మెత్తఁబోయి, భూసురుం డెత్తె నుత్తరాపోశనంబు.

176
భారతము, ఆదిపర్వమున
గీ.

కామభోగములకును నేకాంతగృహము, పొలుపుమీఱిన ధర్మార్థములకు నిదియె
యాస్పదంబును వర్ణత్రయానిరుద్ధు, లయినజనుల నెంతయు నొప్పు నప్పురంబు.

177


వ.

అని మఱిన్ని అనేకప్రబంధముల నున్నది గనుక జాడ తెలియునది.

178

దేశ్యయతి

కావ్యాలంకారచూడామణి (7.89)
చ.

కఱకరి [34]కల్లడంబు కడుఁ గట్టిఁడి తెమ్మెర యోలమాస గ్ర
చ్చఱ యెసలా[35]రజంబెఱకులారడి వీఱిఁడి రజ్జులాఁడు క్రి
క్కిఱియుట నాఁ దెనుంగునకు నీయుభయంబు యతిప్రకాశమై
మెఱయుఁ గవిప్రయోగముల మేర లెఱింగి రచింపనేర్చినన్.

179
మఱియు నథర్వణచ్ఛందంబున
గీ.

దేశ్య తెలుఁగులందుఁ దెలియ నొక్కొకచోట, హల్లులోన నచ్చు లణఁగియుండు
నట్టిచోట రెండు నమరు వళ్లకుఁ జెప్ప, నాదిసుకవివరులయనుమతమున.

180


తా.

తెమ్మెర, ఓలమాస, క్రచ్చఱ, ఆఱడి, వీఱిఁడి, క్రిక్కిఱిసి అనునీమొదలుగాఁగల దేశ్య తెనుఁగుశబ్దములయందు హల్లులలో నచ్చులైన స్వరము లిమిడియుండుటచేత ఆచ్చుకు హల్లుకు ఆయక్షరమునే యతిగా జెప్పనగు ననుట.


క.

దొరలదొర యనఁగ విని గ్ర, చ్చఱ విజయానందరంగ హంవీరునియ
బ్బరపునగరివాకిటఁ గ్రి, క్కిఱిసి కవుల్ కాచినా రహీనప్రౌఢిన్.

181
భారతము, అనుశాసనికపర్వమున
క.

అతిథి నిను వచ్చి వేఁడిన, మతిఁ గింకిరి పడక యోలమాసగొనక స, మ్మతితో...

182
ముక్కుతిమ్మన వాణీవిలాసమున
క.

తెఱవా తరువాతను గ్ర, చ్చఱ నీనాయకుడు వశ్యుఁ డగు నెట్లంటే
మఱువక విను కలఁ గాంచిన, తెఱఁగెల్ల నటంచుఁ దేటతెల్లమి గాఁగన్.

183
భారతము, విరాటపర్వమున
క.

ముఱిముఱి చీఁకటియప్పుడు, నఱిముఱి సుభటులు గడంగి యని సేయంగా
మెఱసి తమ మెల్లచోఁ గ్రి, క్కిఱిసిన మఱి పాఱి నిలిచి రింతను వంతన్.

184


వ.

అని మఱిన్ని అనేకప్రబంధములయం దున్నది గనుక తెలుసుకోగలది.

185

మకారయతి

[36]గోకర్ణచ్ఛందంబున
గీ.

యరలవశషసహార్ణము లాదిబిందు, యుతము లై మవర్ణవిరామయుక్తి నలరు
మారుతాత్మజుఁ డరిదిసంయమి యనఁగ, మదనజనకుఁడు దితిజసంహరుఁ డనంగ.

186
మఱిన్ని, గావ్యచింతామణియందు
క.

సున్న యనంగ మకారము, పన్నుగ శషసహలమీఁదఁ బ్రభవించిన యా
సున్న మకారంబునకు, గొన్నిట మవడియని చెప్పుకొందురు సుకవుల్.

187


తా.

యరలవశషసహలకు దాపలసున్నలు కలిగి మకారమునకు యతిగాఁ జెప్పవచ్చును. ఎటువలెనంటే సంయమి, సంవాసము, సంవాసము, సంశయము, సంసారము, సంహరణము ఇవి మొదలయినశబ్దములయందలి దాఁపలసున్న గలయక్షరములు
మకారముతో యతి చెప్పవచ్చును.


గీ.

మహితభక్తవత్సలత సంయములఁ బ్రోచు, మాధవునివలె విగతసంశయతశ్రితుల
మనుపుచు నరాతిదంతిపింహమయి మించె, మహిమ రంగేంద్రుఁ డర్థసంసక్తిఁ గొనక.

188
ఆదిమకవి భీమన చాటుధార
చ.

గరళపుముద్దలోహ మన గాఢమహాశనికోట్లు సమ్మెటల్
హరునిటలాగ్ని కొల్మి యురగాధిపుకోరలు పట్టుఁగార్లు ది
క్కరటిశిరంబు దాయి లయకారుఁడు కమ్మరి వైరివీరసం
హరణరణాభిరాముఁ డగు మైలముభీమనఖడ్గసృష్టికిన్.

189
బ్రహ్మాండపురాణమున
క.

ఓ సంయమిశేఖర! సం, వాసమ్మునకు భవదాశ్రమము లెస్స యనం
గా నెలవి నగవు దెచ్చుక, యాసురవల్లభుని జూచి యతఁ డిట్లనియెన్.

190
నాచనసోముని హరివిలాసమున
క.

జయ మగుటకు నీమది సం, శయ మేటికి వినుమనుచు సమంచితకరుణా
లయుఁడగుమునీంద్రుఁ డెంతయుఁ, బ్రియముగ మంత్రంబు చెప్పె నృపతికి నెలమిన్.

191


వ.

అని తరుచుగాఁ బ్రబంధములలో వ్రాసి ఉన్నది గనుక జాడ తెలుసుకోగలది.

192

వికల్పయతి

అనంతచ్ఛందమున
గీ.

నలినఁగకారహ ల్లితరానునాసికాఖ్యఁ, గదిని తత్పంచమముగా వికల్పవిరతి
గలుగుఁ జక్రి వల్లవీసుదృఙ్నాథుఁ డనఁగఁ, గమలనేత్రుండు సకలదిఙ్మహితుఁ డనఁగ.

193
కవిరాక్షసచ్ఛందమున
గీ.

హయుతవర్గహల్లు వికల్పయతికిఁ జెల్లు, దేవకీనందనుఁడు జగద్ధితుఁ డనంగ
హరికుమారాగ్రజుండు వాగ్ఝరుఁ డనంగ, నవనిఁ దాల్చినయవి కకుబ్భస్తు లనఁగ.

194


తా.

వాక్ఛబ్ధము, కకుప్ఛబ్దము, దిక్ఛబ్దము, దృక్ఛబ్దము, జగచ్ఛబ్దము యీమొదలైనశబ్దములు సమాససంధిచేత వికల్పము లగును. గనుక వాటికి యతి చెప్పితే వికల్పయతి అని పేరు.


గీ.

అవని భవదీయవిక్రమోద్ధతికి వెఱచి, దెసలకును బాఱె విద్విషన్నికర మెల్లఁ
గడఁక నీవిక్రమం బవాఙ్మనసగో, చరంబుగా నున్న దానందరంగనృపతి.

195
నాచన సోముని ఉత్తర హరివంశమున
మ.

ఒకనాఁ డిందుధరుండుఁ బార్వతియు లీలోద్యానకేళీసరి
న్నికటాసేకవిహారదేశముల దైతేయేంద్రకన్యాప్సరో
నికురుంబంబులు.....

196
బేతాళపంచవింశతియందు
శా.

చోరాగ్రాహ్యగజాంకుశంబు నలిసి శుంభన్మదేభంబు ది
ఙ్నారీమౌక్తికదర్పణంబు రజనీకాంతామనోహారి వి
స్తారాంభోధితరంగకారి గిరిజాప్రాణేశభాస్వజ్జటా
శ్రీరమ్యాభరణంబు చంద్రుఁ డుదయించెన్ సుప్రభాభాసి యై.

197
మనుచరిత్ర, వంశావళియందు
సీ.

అరివీరభటమహోద్ధతి నబ్ధి గంపింప దురమునఁ గదిసి తద్ద్రోహుఁ దునిమి...

198
బ్రహ్మాండపురాణమున
మ.

అవనీనాథ! తదాహవాంతరమునం దస్మత్కరాకృష్టశా
ర్ఙ్గవినిర్ముక్తనిశాతసాయకశతాగ్రచ్ఛిన్నమై...

199


వ.

అని యిట్లు పెక్కుప్రబంధముల నున్నది గనుకఁ దెలియునది.

200

బిందుయతి

కావ్యాలంకారచూడామణియందు
గీ.

టతపవర్గాక్షరములకు దాపలించి, యొనరనూఁదిన బిందువు లుండెనేని
వరుస నణమలు యతులగు వానికెల్ల, నవనిఁ గొందఱు సుకవులయనుమతమున.

201


తా.

టఠడఢ తథదధ పఫబభ యీపండ్రెండక్షరములకు దాపల సున్నలుంటే ణకారనకారమకారములకు వరుసగా యతులు చెల్లును. ఇదిగాక యేయక్షరము వలపలగిలఁకతో గూడియున్నదో ఆయక్షరములన్నీ నకారణకారములకు యతి చెల్లును.

లక్ష్యము
గీ.

మహిఁ గుబేరునివంటి సంపదలఁ బొదలి, నిఖిలదిక్కులఁ గీర్తిచంద్రిక లవార
ణస్థితి వెలుంగ సుకవితండములఁ బ్రోచి, తౌర యానందరంగధరాధినాథ.

202
మనుచరిత్రమున
శా.

శీలంబున్ గులమున్ ...........
సాలగ్రామము మున్నుగాఁ గొనఁడు మాన్యక్షేత్రముల్ పెక్కుచం
దాలం బండు నొకప్పుడుం దఱుఁగ దింటం బాడియుం బంటయున్.

203
విజయవిలాసమున
శా.

చెండ్లా గుబ్బలు ..................యీజవ్వనిన్
బెండ్లాడంగలవాఁడు చేసినది సుమ్మీ భాగ్య మూహింపఁగాన్.

204
మనుచరిత్రమున
మ.

అకలంకౌషధ................................... మంచుకొం
డకు రాఁజెల్లునె బుద్ధిజాడ్యజనితోన్మాదు ల్గదా శ్రోత్రియుల్.

205
రుక్మాంగదచరిత్రమున
మ.

ధరఁ బాలించెఁ బురూరవున్ సగరునిన్ ద్రైశంకునిన్ హైహయున్
బురుకుత్సున్ నరు నంబరీషు శశిబిందున్ రంతి నంగున్ మరు
త్తు రఘూత్తంసు భగీరథున్ బృథు సుహోత్రున్ నాహుషున్ భార్గవున్
భరతక్ష్మాధిపునిన్ దిలీపు గయు మాంధాతన్ శిబిం బోలుచున్.

206
కళాపూర్ణోదయమున
ఉ.

కావునఁ జంద్రుఁ గింద్రుఁ జిలుకన్ గిలుకన్ బికమున్ గికంబునుం
గావు మటంచు వేఁడకుఁడు కీరపుజాతికిన్ బ్రియం
బే వివరింప మీకుఁ బలెఁ బెంచినజాతికి ముద్దుగాక పెన్
బావురుబిల్లికిన్ గలుగునా మొకమోట మొకింత చిల్క పైన్.

207
మన కూర్మ పురాణము; మలయమారుతమున
క.

తలిరాకుఁబోఁడినిడుక, న్గెలఁకులఁ గర్ణాగ్రపాళి నీలాంబురుహం
బల రె నది యెట్టులన దృ, క్కుల కిది తులగామిఁ జేరి కొలుచువిధమునన్.

208
భారతము, అశ్వమేధపర్వమున(1)
చ.

అనుమతి యింక వేఱె పడయన్ గత మెయ్యది కౌరవేంద్ర నన్
బనుపుము వాజిమేధకరణంబున కెయ్యది సేయువాఁడ నీ
యనుజులు...

209


వ.

అని యున్నది గనుక నీజాడఁ దెలిసి యతులు చెప్పవచ్చును.

210

ప్రాదియతి

[37]కవిరాక్షసచ్ఛందమున
గీ.

ప్రాదినిత్యసమాసశబ్దములు గాక, పెఱపదంబులపై యచ్చు బెరసినప్పు
డన్నియునుస్వరయతులగు సాంబశివుఁడు, శ్రీశుఁ డమరాన్వయాబ్ధిపూర్ణేందుఁ డనఁగ.


తా.

సాష్టాంగము, సాహంకారము, సాంబశివుఁడు, సాంగోపాంగము, సాటోపము యివిమొదలైనవానియందు అద్యక్షరహల్లుతో అచ్చుకూడి ఉన్నందున హల్లునకైనను, అచ్చునకైనను యతియుండ జెప్పితే ప్రాదియతి యగును గనుక రెంటికి లక్ష్యము.


గీ.

అమలభక్తితోడ సాష్టాంగముగఁ బూని, సాంబమూర్తి దివ్యచరణములకు
దాసులెల్ల మ్రొక్కుదారి మ్రొక్కిరి నీకుఁ, బ్రబలు లైనరిపులు రంగనృపతి!

212
మఱియు, కేతన కాదంబరియందు
గీ.

జనవరేణ్యుఁ గాంచి సాష్టాంగ మెఱఁగిన, నావిభుండు వాని లేవనెత్తి
కౌఁగిలించి వానిఁ గనుఁగొని కేయూర, కాభిధాన మొసఁగెఁ [38]గౌతుకమున.

213
నాచనసోముని హరివిలాసమున
క.

శంబరవైరివిభంజన, సాంబశివా యంధకప్రశాసక గజచ
ర్మాంబరధర యని నీదుప, దంబులు పూజించువాఁడు ధన్యుఁడుసుమ్మీ!

214
కాశీఖండమున
క.

అంగీకరించు మనుజుఁడు, సాంగోపాంగాధ్వరక్రియాఫలము వియ
ద్గంగాపులినంబున శివ, లింగార్చన మాచరింప లెస్సఁగ శౌరీ!

215
మనుచరిత్రమున
శా.

సాహంకారత శంకరుం డలిగి నేత్రాగ్నిం బయిం బంచినన్
స్వాహాకాముకుఁ డౌట...

216
అథర్వణాచార్యులు
గీ.

అనవరతమును బూజించి సాంబశివుని
దలఁపఁ దలఁపులు ఫలియించుఁ గలుష మణఁగు.....

217


వ.

అని యనేకప్రబంధములయందుఁ చాలా చెప్పియున్నది గనుక సూచన వ్రాసినాను.

218

ఆదేశయతి

కవిరాక్షసచ్ఛందంబున
గీ.

ద్వీప నా కాంతరీప ప్రతీపశబ్ద, ములకు నచ్చుహల్లులకు యతులు చెలంగు
నితఁడు పటుశక్తి జాంబవద్వీప మేలి, నాకవాసులచే నుతు లందె ననఁగ.

219


తా.

ద్వీప నాక అంతరీప ప్రతీప ఈశబ్దముల హల్లులలో అచ్చు లిమిడియుండుటచేత రెంటికిని యతులు చెల్లును.

లక్ష్యము
గీ.

ఎలమి సత్కీర్తి జాంబవద్వీపమునకు, భర్త యగుపాదుషాచేతఁ బ్రణుతులంది
నాకపతివైభవముఁ బూని యమరి తౌర, రసికమందార! యానందరంగధీర!

220
మఱిన్ని, పెద్దిరాజు అలంకారమున (7-65)
ఉ.

ద్వీపులఁ ద్రుంచు విశ్వజగతీపతి యుత్తమశక్తి జాంబవ
ద్వీపమునందు గోవులకు నిమ్ముగఁ జేయుటచేఁ బ్రసన్న యై
గోపతిధేను వవ్విభునకున్ దనవైభవ మిచ్చెఁగాక యే
భూపతు లీవదాన్యగుణబుద్ధిఁ బ్ర, సిద్ధి వహించి రుర్వరన్.

221
మఱిన్ని, అందే
క.

నీకరవాలముపాలై, నాకంబున కేఁగి రాజి నారాయణ యా
భూకాంతు లెట్టి చనవో, నాకవిటోత్తములఁ దూల వడుతురు లీలన్.

222
భాస్కరరామాయణమున
క.

నాకులజుఁ డైన రాముఁడు, శ్రీకంఠునివిల్లు విఱిచి సీతను ప్రేమన్
గైకొను రే పని చెప్పఁగ, నాకమునకు నరుగువిధమునన్ రవి గ్రుంకెన్.

223
రంగనాథరామాయణమున
ద్వి.

నాకీశ మొదలమున్నాఁడఁ బల్కితివి.

224


వ.

అని చాలాదిక్కుల నుదాహరణము లున్నవి గనుక సూచన తెలుసుకోగలది.

225

ప్రభునామాఖండయతి

అనంతచ్ఛందంబున (1-120)
గీ.

ఒరుల నన్నమ్మ యనుచోట నూఁదఁబడక, ద్వివిధమగుఁ బ్రభునామాంతవిరమణంబు
మహి నయోధ్యకు రాజు రామన యనంగ, నతనిపట్టపుదేవి సీతమ యనంగ.

226
మఱిన్ని, నీలకంఠచ్ఛందంబున
క.

తెనుఁగున నామాంతరములఁ, గనుపట్టెడి స్వరముఁ జెప్పఁగాఁ దగుహల్లున్
జనువళ్లకు రంగన సిం, గన యనఁగన్ వరుసతో నుదాహరణంబుల్.

227


తా.

రామన, రామయ, సీతక, సీతమ అని యొకరిపేరితో కూడి తేలికగా బలుకఁబడిన శబ్దముల యచ్చులకు హల్లులకు యతి చెల్లును.

లక్ష్యము
గీ.

అవనిలో నలమేలుమంగమకు సాటి, యాదిలక్ష్మి యానందరంగనకు సాటి
విష్ణు వటుగాన నోములు వేయు నోచి, మహిమ నాతనిఁ గన్నలక్ష్మమదె కీర్తి.

228
కాశీఖండమున
మ.

అనవేమాధిపురాజ్యభారభరణవ్యాపారదక్షుండుఁ బె
ద్దనమంత్రీశుఁడు మామిడన్నసుతుఁ డేతన్మాత్రుఁడే చూడఁగన్.

229
ఎఱ్ఱాప్రగ్గడ హరివంశమున
చ.

నగినగియేనియున్ విను జనార్దన యెన్నఁడు బొంకు వల్క మ
త్యగణితవిక్రమోరుబలధైర్యసమగ్రుల మట్లు గాక కా
లగతిఁ దొలంగఁ ద్రోవఁగఁ దలం బగునే యగుగాక నీకు మె
చ్చుగ నిదె ప్రాణ మిచ్చెదము స్రుక్కము చావున కాత్మ నేమియున్.

230


వ.

అని యనేకప్రబంధములయం దున్నది.

ఘఞ్ యతి

నన్నయభట్టు లక్షణసారమున
గీ.

అచ్చు హల్లును లాపశబ్దాదివర్ణ, ములకుఁ జెప్పిన ఘఞ్ యతు లనఁగఁ దనరు
నంబురుహగేహిని మధురాలాప యనఁగ, లక్ష్మి వాగ్జితకోకిలాలాప యనఁగ.

232

తా.

అలాపశబ్దమధ్యవర్ణ మగులకారమునందు స్వరముకూడా గలసియుండుటచేత ఆ లకారము యతివచ్చుతావున అచ్చుకు హల్లుకు యతి చెల్లును.

లక్ష్యము
క.

శ్రీ పరిఢవిల్ల సత్యా, లాపవిలాసి యగుకృష్ణు నటువలె రంగ
క్ష్మాపతి శ్రీకరసత్యా, లాపవిలాసమునఁ బ్రజల లాలన సేయున్.

233
పింగళి సూరన గిరిజాకల్యాణమున
క.

కోపాటోపంబున ధర, ణీపాలకచంద్రముఁడు మునిశిఖామణులన్
ద్రోపించిన వారు దురా, లాపము లాడుచును బోయి రాసమయమునన్.

234
ఆముక్తమాల్యదయందు
ఉ.

గోపురకందరాళికడకున్ శశిపుష్కరిణీకణార్ద్రపం
తాపహరానిలంబులు పతాకరణన్మణికింకిణీకలా
లాపములన్ సుఖంబడుగనాఱిట జొచ్చి యకాండగాహనా
చాపలకృన్మరుద్గణముఁ జండుఁడు దోలెడులోనివాకిటన్.

235
[39]ప్రబంధరాజమున
సీ.

రమ్యతరాదినారాయణవిగ్రహహారివైణికకలాలాపహృదయ....

236
నాచన సోముని హరివంశమున
గీ.

అగ్రజన్మ నాతోమృషాలాప మిప్పు, డాడినందుకు ఫలము జిహ్వాంచలంబుఁ
గత్తరించెదనీసూరకత్తిచేత, ననుచు దగ్గర జేరిన యసురఁ జూచి.

237


వ.

అని యచ్చు లైనస్వరముల కుండఁజెప్పినది కాన హల్లుకు నిస్సంశయ మని తెలియఁగలది.

238

శకంధుయతి

కవిలోకసంజీవనియందు
గీ.

స్వాంత వేదండ మార్తాండ శబ్దములకు
యతుల నుభయంబు నగు బుధస్వాంతమునకు
నతిసుఖావహుఁ డెపుడు వేదండవరదుఁ
డనఁగ హరి దైత్యతిమిరమార్తాండుఁ డనఁగ.

239


తా.

“క్షుబ్దస్వాంతధ్వాంత' అనేసూత్రాన నిపాతయైనప్పటికిన్ని లింగాభట్టీయమున భిన్నముగా వ్యాఖ్యానము చేసినందువల్లనున్ను, పూర్వమహాకవి ప్రయోగసరణిచేతనున్ను శకంధు, కర్కంధు, కులటా, సీమంత, మనీషా, హలీషా, లాంగలీషా, పతంజలి, సారంగ శబ్దములకు నచ్చు హల్లు ఈరెండుయతులు చెల్లును.

లక్ష్యము
గీ.

అనఘ యానందరంగ! మార్తాండతేజ, యవుర నీశౌర్యమునకు వేదండవైరి
స్వాంతమున భీతిఁ జెంది మహాగుహాంత, రమున దాఁగెను మిగులఁ జిత్రంబుగాను.

240
భారతము, ఆదిపర్వమున
మత్త.

దండితాహితవీర సూరినిదాన దానవినోద కో
దండపార్థ పరాక్రమ ప్రియ ధామదిక్పరిపూరితా
ఖండపాండుయశోనిధీ పరగండభైరవ వైరివే
దండతుండవిదారిఘోరతరాసిభాసినిజంగుళా!

241
భారతము, భీష్మపర్వమున
ఉ.

పాండునృపాలనందనుల పావని మున్నుగ నేచి యప్డు భీ
ముండు కడంకమై నడుచుచోటికిఁ జక్కటిగాఁగఁ ద్రోచి యొం
డొండఁ గడంగి సేన తమయుబ్బున కుబ్బగ నన్యసైన్యవే
దండముఖాంగముల్ దృణవితానముగాఁ గొని నిర్వికారులై.

242
భారతము, విరాటపర్వమున
ఉ.

స్వాంతము బాహుగర్వఘనసంతమసాంధము గాఁగ శంక యా
వంతయు లేక......

243
శృంగారనైషధమున
గీ.

అధికరోషకషాయితస్వాంతుఁ డైన, నరపతికి విన్నవించకు నాయవస్థ...

244
భారతము, ద్రోణపర్వమున
మ.

ధరణీచక్రము దిద్దిరం దిరిగె మార్తాండుండు కుంఠీభవ
త్కిరణుండయ్యె దిశావితానము వడంకెన్...

245
సారంగధరచరిత్రమున
ఉ.

...సారంగధరా యనన్ గువలయప్రమదం బగు....

246
బహుళాశ్వచరిత్రమున
ఉ.

ఇందఱి మించి పల్కెదు మనీషివె...

247


వ.

అని యీరీతి వారువారు మహాకవులు చెప్పిరి గనుక లెస్సఁగాఁ దెలియగలది.

248

సంయుక్తయతి

భీమనచ్ఛందమున (సంజ్ఞ. 71)
క.

వెలయఁగ సంయుక్తాక్షర, ములలో నెద్దాని నైన మునుకొని వడిగా
నిలుపఁగ నగుఁ బాదమ్ముల, నలఘుపరాక్రముఁడ రేచనా! వినయనిధీ!

249

తా.

అక్షరానికి సావత్తు, పావత్తు, మావత్తు, వలపలిగిలుక, కొరవడి యివిమొదలైనవర్ణము లేవి కూడియుండినా ఆజాతియక్షరములకు కూడా యతులు చెప్పవచ్చును.

లక్ష్యము
గీ.

ప్రకటమతి విజయానందరంగనృపతి, క్షణములోఁ దృణమును మేరుసమము చేయు
క్షణములో మేరువుఁ దృణముఁగాఁగ జేయుఁ, దనదుచూపుల నిది విచిత్రంబు గాదె.

250
ఆముక్తమాల్యదయందు
గీ.

ఆతఁ డఘమర్షణస్నాన మమ్మరుద్ధ్ర, దాంబువుల నాడి మాధ్యాహ్నికంబు దీర్చి
స్నాతయు నలంకృతయు నౌతనయను దోడి, కొనుచు వైష్ణవపరిషత్తు కొలువ నరిగి.

251
భీమన నృసింహపురాణమున
క.

మానవనాథుఁడు గంగా, స్నానానంతరము సకలదానములు మహా
దీను లగువిప్రకోటికి, సేనాదయతోడ నిచ్చి శివు సేవించెన్.

252


వ.

దీనినే కొందఱు తకారయతి యందురు. కడమ సంయుక్తయతులు నిట్లే యని
యెఱుంగునది.

253

విభాగయతి

[40]కవిరాక్షసచ్ఛందమున
గీ.

సంఖ్యకును బరిణామసంజ్ఞకుఁ దనర్చు
శబ్దములపై విభాగోక్తి సంఘటించు
నప్పుడు యతులు రెండేనియగు నుపేంద్రు
డిచ్చుచుం డర్థమును మోపెఁడేసి యనఁగ.

254


తా.

రెండవది, మూఁడవది, నాలవది యనిపలుకఁబడు సంఖ్యాపరమైనశబ్దములకున్ను గంపెఁడేసి, మోపెఁడేసి, చేరిఁడేసి, పట్టెఁడేసి యనిపలుకఁబడు ప్రమాణమైనశబ్దములకును అచ్చుహల్లులకు రెంటికిని యతి చెల్లును.

లక్ష్యము
గీ.

అతులవైభవపటిమ రెండవసురేంద్రు, డీతఁడే యనఁ దగి పెట్టెఁడేసి సొమ్ము
లింపుతో నర్థులకు మోపెఁడేసివలువ, లిచ్చునానందరంగేంద్రు నెన్నవశమె?

255
భారతమున
సీ.

ఆయంబునందు నాలవభాగ మొండె మూఁ, డవభాగ మొండెఁ దదర్థ మొండె...

256
మనుచరిత్రమున
మ.

గవిలో..........రెం
డవకాండంబున నార్తియున్ గినుక డాయన్ వచ్చి కౌక్షేయక
ప్రవిభిన్నం బయి యోలిఁ గూలెఁ బనిధారాకీర్ణశైలాకృతిన్.

257
కాశీఖండమున
మ.

... రెండవకైలాసముఁబోలె నున్నయది బ్రహ్మాండంబుతో రాయుచున్

258
[41]అనంతచ్ఛందమున
గీ.

కృష్ణుఁ డిచ్చె నాలుగేసికోకలు కూర్మి, యింతులకును నాలుగేసిమణులు
ఠీవితోడ దోసెఁడేసిరూకల కడు, నిం పెసంగ గంపెఁడేసి సొమ్ము.

259


వ.

అని వున్నది గనుక సూచన తెలియ వ్రాసినాను.

260

చక్కటియతి

నన్నయభట్టు లక్షణసారంబున
గీ.

పుఫుబుభులకు ముకారంబు పూర్వమునను
గాని పైగాని చెప్పఁ జక్కటియతియగు
ముప్పిఁ గొని కృష్ణుఁ డురమునఁ బొడిచె ననఁగ
బుధుల వినుతులఁ దగె వ్యాసముని యనంగ.

261


తా.

పు, ఫు, బు, భు యీ నాలుగక్షరములు ముందుగావున్నా వెనుకనున్నా యతి చెల్లును.

లక్ష్యము
గీ.

మొనసి యానందరంగభూభుజునికీర్తి, భువనముల నాక్రమించిన మురహరుండుఁ
బురహరుండును దమగీము లరయలేక, నధివసించిరి యతనిచిత్తాబ్జమునను.

262
భాస్కరరామాయణమున
మ.

అనుచున్ జేరఁగ వచ్చి లక్ష్మణ వృధాయాసంబు నీకేల వే
చను మెచ్చోటికి నైన నీతరమె దోస్పారంబునన్ బోరఁగా
నను మున్నీవు నెఱుంగు దారయఁగ నానాగాస్త్రపాశంబు లే
పున బంధించినవన్నియున్ మఱచితే మోహంబునం గల్గునే.

263
శ్రీరంగమాహాత్మ్యమున
క.

అనుటయు నాగంధర్వుఁడు, మునివర! శ్రీకృష్ణుఁ డఖిలభూతావళియం
దును బాయకుండునేనియుఁ, గనరామి యదేమి యనినఁ గాశ్యపుఁ డనియెన్.

264
హరిశ్చంద్ర ద్విపద

భూతేశుఁ డప్పుడు ముష్టిని బొడిచె.

265


వ.

అని యిట్లున్నది గనుక తెలియఁదగినది.

266

సరసయతి

[42]గోకర్ణచ్ఛందంబున
క.

వెలయఁగ వర్గువు శషసలు, గలసిన సరసవడి యండ్రు కవివరు లెల్లన్
కలికావర్గువు క్షాతోఁ, గలుపందగు వళ్ల కట్ల కందర్పనిభా!

267
భీమనచ్ఛందంబున
క.

అయహలు చఛజఝశషసలు, నయసన్నుతనణలురేచవాసరసగుణా
శ్రయ! యివి యొండొంటికి నిశ్చయముగ వళ్లయ్యె సర్వశాస్త్రవిధిజ్ఞా!

268


తా.

అకారయకారహకారములకున్ను నకారణకారములకున్ను చఛజఝశషస యీ7 అక్షరములకున్ను ఒకటొకటికి యతులు చెప్పితే అది సరసయతి యనఁబడును.

లక్ష్యము
గీ.

సరసకవిచకోరములకు శశివి నీవె, జగతిలో నెన్న నీశ్వరాంశజుడ వీవె
యఖలజగములఁ బ్రోచు నాయకుఁడ వీవె, నవ్యకవితాప్రసంగ! ఆనందరంగ!

269
రాఘవపాండవీయమున
సీ.

గంభీరవేదిలక్షణలక్షితంబు లై...

270


వ.

అని యీరీతి సకలకవులు విస్తారముగా చెప్పుటచేతను ఇందుకు పూర్వకవిప్రయో
గము వ్రాయవలసినది అక్కరలేదు గనుక తెలియగలది.

271

అభేదయతి

జయదేవచ్ఛందంబున
గీ.

రహిగ లళలకు లడలకుఁ బ్రాసయతు లొ, నరుప నవి యభేదప్రాసవిరతు లగును
గళల విలసిల్లు నీనిండునెల యనంగ, జాడ నేసె రాముఁడు సప్తతాళము లన.

272


తా.

లకారళకారములకున్ను లకారడకారములకున్ను ప్రాసములు యతులు చెల్లును. ఱకారరేఫలకు లకారమునకున్ను దకారడకారములకున్ను యతులు మాత్రము చెల్లును.

లక్ష్యము
గీ.

రంగనరపాల విష్ణుకళావిలాస, దీనజనపారిజాత పాటించి నిన్ను
డాయువారికి లేము లేదారిఁ గలుగు, సకలసామ్రాజ్యగరిమ పొసంగుఁ గాక.

273
మఱియు, శ్రీనాథుని సునందనచరిత్రమున
సీ.

శాశ్వతవిశ్వవిశ్వంభరాచక్ర మీ, రాజకుమారుఁ డేలంగఁ గలఁడు

274
ధూర్జటివారి కాళహస్తీశ్వరశతకమున
శా.

నీకుం గాక కవిత్వ మెవ్వరికి నే నీనంచు మీఁదెత్తితిన్
జేకొంటిన్ బిరుదంబుఁ గంకణము ముంజేఁ గట్టితిన్ బట్టితిన్
లోకు ల్మెచ్చ వ్రతంబు నాతలఁపు తీరున్ భీరునింగాదు ఛీ
ఛీ కాలంబున రీతితప్పుడు సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!

275
అల్లసాని పెద్దన
ఉ.

ఏపునఁ గృష్ణరాయజగతీశ్వరుఖడ్గము మింటిమార్గమున్
జూపిన భానుమండలముఁ జొచ్చి హుటాహుటి శత్రు లేగుచో
రేపటిబాపనయ్య పగలింటిమహోగ్రపుజంగమయ్య యో
మాపటిదాసరయ్య మము మన్నన సేయు మటందు రెంతయున్.

276
భారతము, ద్రోణపర్వమున
క.

అభిముఖసరివృత్తము లగు, నిభతురగస్యందనంబు లిలఁ గూలఁగ సం
క్షుభితుం డగు వృషసేనుఁడు, రభసంబున నతని శరములను గడు నొంచెన్.

277
నన్నయభట్టు ఇంద్రవిజయమున
చ.

ఒకపలువాతఁ గొన్నకిటియుం దలలో నిడుకూర్మభర్త నా
లిక లిరు గన్న సీదిరపుఱేఁడు పయోధరధారఁ బొట్టఁబెం
చుకులనగాళి యీడు ప్రతి జో డెన యెంచనఁ గూడ దేరి కె
న్నికగ యయాతియొండె ధరణిన్ భరియించి చెలంగు వానికిన్.

278
భాస్కరరామాయణమున
క.

దానవసుందరు లత్తఱి, జానకి నందలముమీఁద సమ్మద మొదవం
గా నునిచి శారదాభ్రవి, లీనత నేసారుచంద్రరేఖయుఁ బోలెన్.

279
రాఘవపాండవీయమున
రగడ.

లలిత మగులవలీకుడుంగముల లుంగమాల...

280
భాస్కరరామాయణమున
ఉ.

గొబ్బున నానతిమ్ము రఘుకుంజర! నీకరుణాసముద్ధతిన్
డెబ్బదిరెండువెల్లువల దేవరలక్ష్మణు లంకఁ జేర్తునో
గబ్బిగ రావణాసురుని గర్వమడంచి...

281
కేతన కాదంబరియందు
శా.

డాచే యంకతలంబుఁ జేర్చి వలచేతన్ మాలికన్ దాల్చి...

282
జైమినిభారతమున
శా.

డిండీరోత్తరవీచులం దరసి యుద్రేకించి కూలంకషల్
మండూకీపరిణీయమానవిలసన్మాహాత్మ్యమున్...

283
ఆముక్తమాల్యదయందు
చ.

ఇలఁగలవస్తుసంతతుల నెల్లను గెల్చెడుమత్స్యజాతపా
టల రుచి యింక వేఱె యొకదారికి వచ్చునె?....

284
మఱిన్ని, ఈయభేదయతికి నన్నయభట్టు లక్షణసారంబున
క.

వపయోరభేద మనియెడు, నెపమునఁ బఫబభలు వాకు నిలిచినయెడలం
దుపమింప వచ్చుఁ గృతులం, దుపనిషదుచితార్ధసూక్తి యొనరుట వలనన్.

285


తా.

పఫబభ యీ నాలుగక్షరములకు వకారమునకు యతి చెల్లును.

భారతము, ద్రోణపర్వమున
క.

తురగము తురగము కరి కరి, నరుఁడు నరుఁడు తేరు తేరు నలిఁ దాఁకినయ
ప్పరుసుఁదన మేమి చెప్పుదుఁ, బొరి మిణుఁగురు లెగఁసె గైదువులపొడి రాలెన్.

286
భారతము, ఆదిపర్వమున
......
క.

వీరుం డగునరుఁ డేయున, పారశరావళుల నడుమ వారింపంగా
నేరక యే టుడిగి మహా, శూరుఁడు రాధేయుఁ డింద్రజున కి ట్లనియెన్.

287
భారతము, ఆదిపర్వమున
చ.

నుతజలపూరితంబు లగునూతులు నూఱిటికన్న సూనృత
వ్రత యొకబావి మేలు మఱి బావులు నూఱిటికన్న నొక్కస
త్క్రతు వదిమేలు సత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త
త్సుతశతకంబుకంటె నొకసూనృతవాక్యము మేలు చూడఁగన్.

288

ఎక్కటియతి

భీమనచ్ఛందమున (సంజ్ఞ 72)
క.

ధర ఙఞ అనునీరెండ, క్షరములు విన్నయది లేదు శబ్దము మొదలన్
మరవఱల లనెడియైద, క్కరములు తమతమకె చెల్లుఁ గమలాధీశా!

289
అనంతచ్ఛందముశ (1.118)
క.

ధర నెక్కటివ ళ్లై చను, లరమఱవలు వానిలోఁ దొలంగక ళాకున్
సరిలా యని విశ్రమవే, ళ రమాధిప! రెండునుం గలసి వర్తిల్లున్.

290

తా.

మకారమునకు మకారమున్ను, రేఫకు రేఫయున్ను, వకారమునకు వకారమున్ను, లకారమునకు లకారళకారమున్ను ఱాకు ఱాయున్ను యతిగా నుండునట్లు చెప్పిన నెక్కటియతి యగును.


వ.

వీనికి బ్రయోగములు సముద్రతరంగములవలెఁ బ్రబంధాదులయందు గలవు గనుక
ఇట వ్రాయలేదు.

291

ఋయతి

అనంతచ్ఛందంబున (1-87)
గీ.

క్షితి ఋకారరూపస్వరయతులు పరఁగు, ఋగ్యజుస్సామవినుతుండు కృష్ణుఁడనఁగ
వృష్ణికులజుండు కరుణాసమృద్ధుఁ డనఁగ, [43]హేమచేలుండు దేవతాఋషభుఁ డనఁగ.


తా.

స్వరములలోని ఋకారమునకు హల్లులతోఁ గూడినఋకార మగువట్రువసుడికిని, ఇకారరూప మైనక్రారవడికిని, రేఫ చెప్పితే అది ఋయతి యగును.

లక్ష్యము
క.

క్షితి ధనదుమించుకలిమియు, ఋతురాజును మించురూపరేఖావిభవో
న్నతి రంగపతికిఁ జెల్లును, గృతిశతముల కతఁడె కర్త శ్రీకరుఁ డగుటన్.

293
అథర్వణభారతమున
శా.

తృష్ణాతంతునిబద్ధబుద్ధు లగురాధేయాదులున్ గూడి శ్రీ
కృష్ణుం గేవలమర్త్యుగాఁ దలంచి మర్ధింపంగ నుత్సాహవ
ర్ధిష్ణుం డయ్యె సుయోధనుం డకట! ధాత్రీనాథ! యూహింపుమా
యుష్ణీషంబునఁ గట్టవచ్చునె మదవ్యూఢోగ్రశుండాలమున్.

294
వరాహపురాణమున
క.

కావున మీరు రచించిన శ్రీవారాహంబు మంచికృతి నాపేరన్
గావింపుఁ డనుచు సుముఖుఁ, డై వీడెముఁ గప్పురంబు నర్పించుటయున్.

295
మనుచరిత్రము
సీ.

ప్రతిఘటించుచిగుళ్లపై నెఱ్ఱవారిన, రీతి నున్నవి వీనిమృదుపదములు...

296


వ.

అని యిట్లు బహుప్రబంధములయందుఁ జెప్పఁబడి యున్నది గానఁ దెలియునది.

297

ప్రాకృతాదేశయతి

నన్నయభట్టు లక్షణసారంబున
గీ.

తొలుతఁ బ్రాకృతసూత్రంబువలన జ్ఞాకు నార్ణ మాదేశముగ వచ్చి యమరుకతనఁ
బ్రాకృతాదేశసరసవిరామ మై త, నర్చుఁ గృతుల శుకుండు సుజ్ఞాని యనఁగ.

298
అనంతచ్ఛందమున(1-114)
గీ.

యజ్ఞమునకు జన్న మాజ్ఞప్తి కానతి, యాజ్ఞ కాన సంజ్ఞ కరయ సన్న
విన్నపంబు వెండి విజ్ఞాపనమునకు, జ్ఞాకుఁ దద్భవంబు నా ధరిత్రి.

299


తా.

జ్ఞాకు దద్భవపదముగా నకారము వచ్చును గనుక నారెంటికి యతి చెప్పితే అది యాదేశయతి యనఁబడును.

లక్ష్యము, వరాహపురాణమున
మ.

......నాకూర్మినం, దనమే లాత్మఁ దలంచి దేవరకు విజ్ఞాపింప నేనచ్చితిన్.

300
పావులూరు మల్లన గణితమున
ఉ.

...సత్యభారతీ, జ్ఞానులు పద్మగర్భువదనంబులు నాలుగు...

301
ప్రబంధరాజవిజయవేంకటేశ్వరవిలాసమున
సీ.

తావకనగజలస్త్నాతపాపహరాయ నతిమాత్రసాధన జ్ఞాయదాయ...

302


వ.

అని వున్నది గనుక తెలియునది.

303

పోలికయతి

భీమనచ్ఛందమున (సంజ్ఞ. 73)
క.

పోలున్ పుఫుబుభులకు మూ, పోలికవడి శీలముల్లమున కెన యనఁగా
శీలం బుల్లం బనఁగా, భూలోకం బమరలోకమున కెన యనఁగన్.

304


తా.

శీలము, శీలంబు; లోకము, లోకంబు; చిత్తము, చిత్తంబు; కరము, కరంబు; అని రెండువిధములుగా పలుకఁబడిన ముకారము తుదనుండేశబ్దములకు పుఫుబుభులు యతి చెప్పవచ్చును.

లక్ష్యము
క.

ఆనందరంగనరపతి, భూనుతగుణశాలి లోకమున నతనికి సా
టైనదొర లేఁడు కావునఁ, బూనిక నిఁక రాయపట్టమున కర్తుఁ డగున్.

305
భారతము, శాంతిపర్వమున
క.

దారుణకల్పాంతమరు, త్ప్రేరితహవ్యవహశిఖలపె ల్లిది యన బృం
దారకమునిబృందస్తుతి, బో రనఁగా నగ్నినూక్తములతో నెగసెన్.

306


వ.

అని బహుప్రబంధాదుల విస్తరించి చెప్పియుండుటచేత నుదాహరణములు మెం
డుగ నిట వ్రాయలేదు.

307

అఖండయతి

భీమనచ్ఛందమున (సంజ్ఞ. 66)
ఉ.

మానుగ విశ్రమాక్షరసమన్వితమై స్వర మూఁదినన్ దదీ
య్యానుగణాక్షరంబె కొనియైనను జెప్పఁగవచ్చు నీక్రియన్

భానుసహస్రభాసి వృషభాధిపుఁ డన్నటు లర్ధయుక్తమై
పూనినచో నఖండయతి పొల్పగు నాదికవిప్రణీత మై.

308


తా.

హల్లుగా నిల్చియున్నవిశ్రమాక్షరమందు స్వరము కూడియున్నను నాయక్షరముచే యతిగాఁ జెప్పినఠ్లైతే అది యఖండయతి యనఁబడును.

లక్ష్యము
క.

ఆనందరంగనృపతి జ, నానందత సేయు నొక్కనాఁటిసెలవు పా
చ్ఛానగరున నెలకట్టడ, మానుగ లెక్కింపఁ దుఖ్య మందురు పేర్మిన్.

309
భారతము, అశ్వమేధపర్వమున
క.

నీవును దల్లులు బంధుజ, నావళి పురజనులు హస్తినాపురమునకున్
రావలయు ధర్మజుని సం, భావనయుతో బడయు డెసఁగుఁ బరమసుఖంబుల్.

310
భారతము, ద్రోణపర్వమున
ఉ.

తేరులయొప్పు మోటువడఁ దేకువ దప్పి పదాతికోటి ను
గ్గై రుధిరమ్ములో మునుఁగఁ గ్రమ్మినయేనుఁగుపిండు వక్షముల్
ఘోరము గాఁగ...

311
భారతము, ఆదిపర్వమున
క.

నావచనమున నపత్యముఁ, గావించున్ గుంతి నీకుఁ గడు నెయ్యముతో
నీ వడిగినయీయర్థము, సూవె మనంబునను దలఁచుచుండుదు నేనున్.

312
భారతము, ఉద్యోగపర్వమున
క.

తమతండ్రి భంగి నీకును, సముచితముగ భక్తిఁ జేసి సజ్జననుత మా
ర్గమునఁ జరింపంగా విమ, లసుతీ నీకొడుకు నట్టు లరయంగ నగున్.

313
అష్టమహిషీకల్యాణమున
ద్వి.

ఉన్నాఁడు తడవుగా నున్నాఁ డతండు, మన్నాఁడు మమ్ముఁ దెమ్మ న్నాఁ డటన్న.

314


వ.

ఋషిపర్యాయమున అచ్చు కద్దని పూర్వకవిప్రయోగము గలదు.

315
రంగనాథరామాయణమున
ద్వి.

ఎక్కడ గురుఁడని యెఱుఁగనినీకు, నక్కటా! గురుఁడు విశ్వామిత్రుఁ డయ్యె.

అల్లసాని పెద్దన హరికథాసారమున
క.

శఠకోపయతికి ఖలతరు, కుఠారరూపమతికి శఠగురుమతహృత్క
ర్మఠనిరతికిఁ జతురాగమ, పఠనాయతనియతకి యజపాధికభృతికిన్.

317
భాస్కరరామాయణమున
క.

రమణీయరత్నములరుచి, నమరెడునది పంక్తికంకునగరు నృపాలో
త్తమ ఇది దశయోజనవృ, త్తము వింశతియోజనాయతమునై యొప్పున్.

318

వ.

దీనిని గొంద ఱాదేశయతికి ఉదాహరణమందురు. అది కాదు.

319
భాస్కర రామాయణమున
ఉ.

అన్నవు తండ్రియట్ల విను మంతియగా దటుమీఁద రాజ నే
మన్నను లెస్సయౌను మణిమండనముఖ్యము లైనకానుకల్
మున్నుగ సీత నిచ్చి జనలోకపతిన్ గని సంధిసేయు మీ
సన్నపుఁ గార్యము ల్వలదు సంధియె మే లటుగాక తక్కినన్.

320
పారిజాతాపహరణమున
చ.

వనిత యొకర్తు మున్కొని గవాక్షతలంబున నిల్చి యుండుటన్
గనుఁగొనఁ బోయి...

321
రాఘవపాండవీయమున
గీ.

గళితహరికుంజరశతాంగముల ధరిత్రి, గప్పుచు యథామనోరథగతిఁ జరించె
నవనిజారూఢమదవారణక్రియలకు, నిలువలేక పార్ధబలయోధులు తొలంగె.

322


వ.

అని యి ట్లనేకప్రబంధములయందు విస్తారముగా నుదాహరణయోగ్యముగా లక్షణ
కవులైన మహాత్ములు చెప్పియున్నారు గనుక ఇది జాడ యని తెలిసి యతుల నిలు
పునది.

323

ప్రాదియతులు

భీమనచ్ఛందమున (సంజ్ఞ. 67)
క.

ప్రపరాపసమనుసుప్ర, త్యపినిర్దురధిన్యుపాభ్యుదాఙ్న్యత్యవప
ర్యుపసర్గవింశతికి వ, ళ్లు పరస్పరవర్ణయుక్తి నుభయముఁ జెల్లున్.

324


తా.

ప్ర, పర, అప, సం, అను, సు, ప్రతి, అపి, నిః, దుః, అధి, ని, ఉప, అభి, ఉత్, ఙ్, ని, అతి, అవ, పరి అని ఇరువదివిధముల యుపసర్గములు కలవు. వీనికి స్వరము లున్నచో నచ్చులకును, హల్లులకును యతి చెల్లుననుట. ఇందొక్కొక్కదానికిఁ బ్రత్యేకముగాఁ బూర్వకవిప్రయోగములు వ్రాయుచున్నాఁడను.

1. 'ప్ర' అను నుపసర్గయందలి యచ్చుకు ఉత్తరహరివంశమున
శా.

ప్రారంభం బగుశక్తి కుట్మలితహస్తాంభోజ యై యి ట్లనున్.

325
హల్లుకు పాండురంగమాహాత్మ్యమున
శా.

ప్రారంభించిన వేదపాఠములకున్ బ్రత్యూహమౌ నంచు నో...

326
2. 'పర' అను నుపసర్గయందలి యచ్చుకు శ్రీరంగమాహాత్మ్యమున
క.

పరమ మిది యొకరహస్యం, బరవిందజ వినుము మత్పరాయణు లెందున్
దురితములు పెక్కొనర్చియు, నరుగరు పటుఘోరనారకాధోగతులన్.

327
హల్లుకు భారతము, ద్రోణపర్వమున
చ.

అమరనదీతనూజు సమరావనిఁ గోల్పడి నాదుయోధవ
ర్గము మఱి యెవ్వరిన్ గొని పరాక్రమదుర్దమపాండుపుత్త్రసై
న్యములను మార్కొనం గడఁగె నక్కట! కౌరవు లేమి సేసిరో...

328
3. 'అవ' అను నుపసర్గయందలి మచ్చుకు భారతము, ఆనుశాసనీకపర్వమున
క.

నాయంగముల నెల్ల, బాయస మతిభక్తిఁ బూసి పాదతలమునన్
బూయవు కావునఁ గలుగు న, పాయం బరకాల నీకు నవిలంఘ్యం బై.

329
హల్లుకు భారతము, ఆదిపర్వమున
క.

భారతవంశాచార్యుఁడు, భారద్వాజుండు నా కపాయము సేసెన్
ఘోరాజి నతనినోర్చు న, పారపరాక్రమునిఁ బుత్త్రుఁ బడయఁగవలయున్.

330
4. 'సం' అను నుపసర్గయందలి యచ్చుకు భారతము, ఆనుశాసనీకపర్వమున
చ.

అమరఁగ రాజధర్మము సమాశ్రయ మై నడపున్ ద్రివర్గమున్...

331
హల్లుకు భారతము, ఆదిపర్వమున
క.

చల్లని దక్షిణమారుత, మల్లన వీతెంచి తగిలె నాలలనాధ
మ్మిల్లకుసుమాంగరాగస, ముల్లసితసుగంధి యగుచు మునివరుమీఁదన్.

332
5. 'అను' అను నుపసర్గయందలి యచ్చుకు భారతము, ఆదిపర్వమున
క.

నయమును ధర్మము గలయ, న్వయమున జనియించినాఁడ వక్కట ధర్మ
క్రియ యెఱుఁగంగావలయును, భయలోకవిరుద్ధ మైన పద మేమిటికిన్.

333
హల్లుకు బ్రహ్మాండపురాణమున
సీ.

నృపవరాగ్రణి విను మిఁక మీఁదఁ దానకాన్వయమున సారసనాభుఁ డుదయమంది దుష్టాత్ముల నణఁచు...

334
6. ‘సు' అను నుపసర్గయందలి యచ్చుకు భారతము, ఆరణ్యపర్వమున
చ.

వదనభుజోరుపాదయుగవర్ణచతుష్టయమున్ యుగాదియం
దొదవ సృజించు ఋగ్యజుషసూక్తులు సామ మధర్వణంబునన్.

335
హల్లుకు భారతము, ఆరణ్యపర్వమున
ఉ.

కప్పినయాదురాగ్రహము గర్వము ముంచుకొనంగ నాకు మున్
జొప్పడియెన్ సుధాసదృశసూక్తులఁ దేర్చితి వీవ యచ్యుతా
యిప్పుడు...

336
7. 'ప్రతి’ అను నుపసర్గయందలి యచ్చుకు భీమన నృసింహపురాణమున
సీ. గీ.

ఉల్లసిల్లుచు మేలిమి యొప్పునప్పు, డబ్జగర్భునిమ్రోలఁ బ్రత్యక్షమయ్యె.

337
హల్లుకు భారతము, ఆరణ్యపర్వమున
క.

దక్షమఖక్షయకరు నిట, లాక్షజహుతవహనభక్షితానంగు విరూ
పాక్షు మహోక్షధ్వజుఁ బ్రత్యక్షముగాఁ జేసికొనియెఁ దపముల పేర్మిన్.

338
8. ‘అపి” అను నుపసర్గయందలి యచ్చుకు పెద్దిరాజు హరికథాసుధారసమున
క.

శయధృతఫణివలయ భవా, వ్యయ విహితవిశుద్ధసంవిదాత్మక మాయా
మయ నానావిధలీలో, దయ సదయకటాక్ష శైలతనయాధ్యక్షా.

339
హల్లుకు నాచనసోముని హ(రి)రవిలాసమున
క.

జయవిజయవినుత జన్యా, వ్యయ దూరానందరూపభాసురదత్తా
భయ హరిహయముఖనిర్జర, నయనన్నక్షత్రయూథ నళినీనాథా!

340
9. 'ని' అను నుపసర్గయందలి యచ్చుకు రాజశేఖరచరిత్రమున
ఉ.

సాహసికాగ్రగామి నృపసత్తముఁ డట్లు తదీయఘోరమా
యాహిమికల్ హరింపుచు నిరంకుశవిక్రమకేళిఁ జూప ను
త్సాహముఁ దక్కి యాత్మపురిచక్కటి నొప్పెడు నొక్కకాళికా
గేహముఁ జొచ్చి తద్దనుజకీటము పాటిలుభీతి పెంపునన్.

341
హల్లుకు శ్రీనాథుని నందనచరిత్రమున
సీ.

రామానుజుండు నిరంతరము పదాఱువేల నూ టెనమండ్రువెలఁదు లతని...

342
10. ‘దు' అను నుపసర్గయందలి యచ్చుకు శ్రీరంగమాహాత్మ్యమున
ఉ.

అంత నిరంతరంబును దురంతసమున్నతిమంత మయ్యె హే
మంత ముదారవిస్ఫురితమంజులమౌక్తికజాలఝల్లరీ
కాంతలసత్తుషారకరకాపరిగుంభితభిల్లభీరుసీ
మంతము దుర్దమశ్రమవిమర్దితపద్మవనాంత మెంతయున్.

343
హల్లుకు భీమన హరవిలాసమున
క.

ఎంతయును దుస్తరంబు దు, రంతర సంసారవారిరాశి యది వెసన్
గంతుగొను మానవుం డొక, యింత శివస్మరణ చేసి యేచిన భక్తిన్.

344
11. 'అధి' అను నుపసర్గయందలి యచ్చుకు
సీ.

అగ్రజుచేత నధ్యాత్మరామాయణం బొకపరి విన జనులకును గలుగు...

345
హల్లుకు భీమన హరవిలాసమున
క.

భువిలో మిత్రుం డగువాఁ, డవిరతమును వేఱులేక యాత్మీయమహో
త్సవముఖకృత్యంబుల న, ధ్యవసాయం బెఱుకపఱుపఁ దగు సంప్రీతిన్.

346
12. 'ని' అను నుపసర్గయందలి యచ్చుకు సునందనోపాఖ్యానమున
క.

భూతలపతి మదిలోపల, నీతముఁ బాలించి యమ్మెయిన్ విప్రగురు
వ్రాతముల ధనములంతయు, నాతతతదుర్మతి హరించి యలమట నిడియెన్.

347
హల్లుకు సునందనోపాఖ్యానమున
గీ.

నిఖిలజనములు గనుఁగొన నీబలంబు.

348
13. 'ఉప' అను నుపసర్గయందలి యచ్చుకు జైమినిభారతమున
ఉ.

అఱ్ఱున వింటినారి బిగియం దగిలించి విరోధిమోముఁ గ
ట్టెఱ్ఱవహించుకన్నుల నిరీక్షణ మొప్పఁగఁ దెచ్చి వేఁటకాఁ
డిఱ్ఱియుఁబోలె నవ్వుచు నుపేంద్రుని ముందటఁబెట్టి వీఁడుగో
గుఱ్ఱపుదొంగ వచ్చె సమకొన్నప్రతిజ్ఞ వహించె నావుడున్.

349
హల్లుకు దశకుమారచరిత్రమున
ఉ.

ఆమగధేశమాళవధరాధిపు లెక్కటిఁబోరి రాజిలోఁ
గాముఁడు శంబరుండు శశిఖండధరుండు గజాసురేంద్రుఁడున్
రాముఁడు రావణుండు సురరాజతనూజుఁడు సింధునాథుఁడున్
భీముఁడు దుస్ససేనుఁడు నుపేంద్రుడు కంసుఁడు బోరునాకృతిన్.

350
మఱియు, అల్లసాని పెద్దన
గీ.

అఖిలపారికాంక్షికాశ్రయపర్ణశా, లోపకంఠమునకు లోకకర్త
చేర నేఁగి యచట వారువంబును డిగ్గి, యధివసించి యుండునట్టియెడను.

351
14. 'అభి' అను నుపసర్గయందలి యచ్చుకు భాస్కరుఁడు నందనోపాఖ్యానమున
గీ.

ఇప్పు డేనుదలఁచినయభీష్ట మెల్లఁ, జేకుర నొనర్చి నీవు రక్షింపవయ్య.

352
హల్లుకు విజయసేనమున
ఉ.

అల్లనఁ దొండ మెత్తి శివు నౌదలయేటిజలంబుఁ బుచ్చి సం
ఫుల్లతఁ బాదపీఠమున పొంతనయున్నసహస్రనేత్రుపైఁ

జల్లి శివార్చనాకమలసంహతిఁ బ్రోక్షణ సేయునట్లు శో
భిల్లు గజాననుండు మదభీప్సితసిద్ధికరుండు గావుతన్.

353
15. 'ఉత్' అను నుపసర్గయందలి యచ్చుకు మనుచరిత్రమున
క.

కాంచి తదీయవిచిత్రో, దంచితసౌభాగ్యమహిమ కచ్చెరువడి య
క్కాంచనగర్భాన్వయమణి, యించుక దరియంగ నచటి కేఁగెడువేళన్.

354
హల్లుకు భారతము, ఆరణ్యపర్వమున
చ.

పటువిశిఖంబులం ద్రిదళపాలతనూజుఁడు పంది నేసెఁ దా
నటు పరమేశ్వరుండును రయంబున దానికి మున్నె యేసె నొ
క్కట పడియెన్ హరార్జునుల ఘోరశరంబులు పందిపైఁ గుభృ
త్తటముపయిన్ వడిం బడునుదగ్రమహాశనులట్ల మ్రోయుచున్.

355
16. 'ఆజ్' అను నుసనర్గయందలి మచ్చుకు అల్లసాని పెద్దన హరికథాసారము
క.

బాలరసాలకిసాలముఁ, గ్రోలుచుఁ బలికెడిపికం బకో యనఁ జాలా
జాలిపడియాన యతిమధు, రాలాపము లనియె నాదరణమున వినఁగన్.

356
హల్లుకు నాచనసోమన హర(ర)విలాసమున
క.

మౌనితిలక! సజ్జనసం, తానమహీరుహ! భవత్సుధాలాపము నా
వీనులకు విందొనర్చెన్, మేనుగఁ గలతాపమణఁచె మృషగాదు సుమీ.

357
17. 'వి' అను నుపసర్గయందలి యచ్చుకు మనుచరిత్రమున
మ.

అతఁ డావాతపరంపరాపరిమళవ్యాపారలీలన్.

358
హల్లుకు భారతము, సభాపర్వమున
క.

ఉపగతశుద్ధులు పాప, వ్యపగతబుద్ధులు వినీతివంతు లసములన్
సుపరీక్ష నియోగించితె, నిపుణుల నర్థార్జనాదినృపకార్యములన్.

359
18. 'అతి' అను నుపసర్గయందలి యచ్చుకు భారతమున
చ.

ఇనసమతేజు లై ధరణి నెన్న నధర్మపథంబుచక్కిఁ ద్రొ
క్కనిభరతాదిరాజుల జగన్నుతవంశమునందుఁ బుట్టి య
త్యనఘచరిత్ర! యిట్లు తగునయ్య! యధర్మము సేయ నీ వెఱుం
గనినృపధర్మము ల్గలవె కౌరవపుంగవ గౌరవస్థితిన్.

360
హల్లుకు బ్రహ్మాండపురాణమున
మ.

సమదేభాళి తలంకి పైకురికినన్ శంకించి భూపాలుఁ డా
లముఁ గన్నన్ గని దాని శూద్రకుఁడు లీలన్ ద్రుంచె నే నప్పు డ
త్యమితోద్యత్ప్రసవార్థి నై కుసుమగంధఘ్రాణలుబ్ధభ్రమ
ద్భ్రమరభ్రాజితపాటలీవిటపమధ్యస్థుండనై చూచితిన్.

361
19. ‘అవ’ అను నుపసర్గ యందలి యచ్చుకు భీమన నృసింహవురాణమున
సీ.

నరనాథ! యతని దానమ్ములచేత నవాప్తకాములు గానియగ్రజన్ము(లు)

362
హల్లుకు రంగనాథుఁడు మిత్రవిందాపరిణయమున
సీ.

వనమాలి గొల్చినజనములం దెన్న నవాప్తకాములు గానివారు లేరు.

363
20. ‘వరి’ అను నుపసర్గయందలి యచ్చుకు రుక్మాంగదచరిత్రమున
ఉ.

ఆయెడ దేహదీప్తు లఖిలావనిభాగము లాపరింప నా
రాయణపాదపంకజపరాయణుఁ డంబుజగర్భసూనుఁ డా
మ్నాయవిశారదుండు మునినాయకమౌళివిభూషణంబు ప
ర్యాయపితామహుండు హృదయంబున నంతకుఁ జూచు వేడుకన్.

364
హల్లుకు ధ్రువచరిత్రమున
సీ.

రాజులకును విపర్యాసబుద్ధి జనింప నాసీమప్రజకెల్ల హానిగాదె?

365


తా.

ఇట్లు బ్రాదియతుల కనేకప్రబంధముల నుదాహరణములు గలవు. గ్రంథవిస్తరభీతిచే నిట సూచనగా వ్రాయబడినవి. ఇట యతిప్రాసలక్షణలక్ష్యప్రకరణం
బంతయు విశదంబు కావించినాఁడ. ఇఁక సంధివిభక్తిసమాసగతులవింతలను వృత్తరత్నాకరప్రకరణంబును విస్తరించెద.

ఆశ్వాసాంతము

చ.

ధృతమహిభార! భారవిసదృక్కవిరాజసమాజసన్నుతా
ద్భుతగుణవార! వారణరిపుప్రతిమానపరాక్రమారిప
ర్వతసుశతార! తారకనరాశనశాసనసన్నిభోజ్జ్వలా
మితభుజసార! సారతరమేరుధరాధరధీర ధీరతా!

366


పంచ.

త్వరాసదృగ్విధీయమానదానతోయశోషితాం
బురాశివర్ధనాతికృత్ప్రభూతకీర్తిమండల
స్ఫురత్సుధామయూఖవైరిభూమిభృచ్చిరోల్లస
త్కిరీటరత్నరాజికాంతిదీపితాంఘ్రిపంకజా!

367

మాలిని.

 విమలజలధికన్యా విస్ఫుటాగారధన్యా
శమితసుజనదైన్యా సర్వరాజన్యమాన్యా
సమధికతరపుణ్యా సత్యభాషానుగుణ్యా
సమదహితశరణ్యా నందవంశాగ్రగణ్యా!

368


గద్యము.

ఇది శ్రీమదుమామహేశ్వర కరుణాకటాక్షలబ్ధసాహితీవిభవ ధర్మవెచ్చ
కులజలధికుముదమిత్ర శ్రీవత్సగోత్రపవిత్ర వేంకటకృష్ణార్యపుత్త్ర విద్వజ్జన
మిత్ర కుకవిజనతాలవిత్ర యార్వేలకమ్మనియోగికులీనలక్ష్మణకవి కస్తూరిరంగనామ
ధేయప్రణీతం బైన యానందరంగచ్ఛందం బను లక్షణచూడామణియందుఁ దృతీ
యాశ్వాసము.

  1. కావ్యాలంకారచూడామణి
  2. పాదాంగచూడా; వాదాంగచూడా.
  3. సరసలు నాఁ బదియు వళ్లు చను నిద్ధాత్రిన్.
  4. నయతత్వనిధీ ; నయవినయనిధీ
  5. హారము లాతని; హారితము లతని
  6. యనశబ్దంబు
  7. వేర్వేఱఁ బ్రాసమయ్యె
  8. బృందాననసారంబున (ఈపద్యము అప్పకవీయములో మధుసేవనమునందు అని ఇచ్చి ఉన్నది)
  9. బిందువగుట
  10. మీఁద నున్నధకారంబు నూఁదఁ బ్రాస
  11. ప్రబంధరాజవిజయవెంకటేశ్వరవిలాసము
  12. సంఖ్యఁ
  13. ఈ పద్యము హరివంశమునఁ గానరాదు గాని అప్పకవీయములో కూడా ఉదాహృతము. (చూ. 3-320)
  14. నదాఱవపాలె
  15. ఈపద్యము అనంతచ్ఛందములో గ్రంథకర్త పద్యమువలె ఉన్నది. (చూ. 1–61)
  16. కౌరవ్యవీ
    రాంగమ్ముల్ నుఱుమాడి తత్ప్రబలసైన్యంబెల్ల మాయించి యి
    త్తుం
  17. వ్రాతప్రతులలో ఇది ఉత్తమగండచ్ఛందములోని దని ఉన్నది.
  18. బ్రాసమైత్రి యిట్లు పరఁగుఁ గృష్ణ.
  19. బందముఁ గూరఁగ శంకర
  20. ఈపద్యము అనంతచ్ఛందమున గ్రంథకర్త పద్యముగా ఇచ్చివున్నది. (1-50).
  21. ఇది అనంతచ్ఛందమున కనబడదు.
  22. బాహుదండాగ్ర్యమునను
  23. ఈపద్యము అనంతచ్ఛందములో అనంతుఁడే చెప్పినట్లున్నది (1.95). అప్పకవీయములో అనంతచ్ఛందమునందు అని ఉన్నది (8-94).
  24. ప్ర,శ్నాకలిత (అనంతచ్ఛందములోను, అప్పకవీయములోను ఉన్నది.)
  25. చేరనివారిం గొని
  26. జేరువఁదగ నాద్యచ్చుల; జేరువతో-జేరుపఁ దగునాద్యచ్చుల
  27. నారూఢిగఁ బ్లుతమువడి మహత్త్వము మీఱున్; తో రూఢిన్ బ్లుతమువడి యెదుర్కొని నిలుచున్
  28. కొన్నిప్రతులలో లేదు.
  29. కొన్నిప్రతులలో లేదు.
  30. ఈ పద్యము వేదము వేంకటరాయశాస్త్రిగారు సంప్రతించిన కావ్యాలంకారచూడామణిప్రతిలో కొంచెము భిన్నముగా ఉన్నది.
  31. వ్రాతప్రతులలో సుభద్రాపరిణయ మని ఉన్నది. విజయవిలాసమునకు అది రెండవపేరు.
  32. ఇది అనంతచ్ఛందములో అనంతుఁడు చెప్పిన పద్యముగా ఉన్నది. (చూ1-122)
  33. ముద్ధరించు
  34. ప్రల్లదంబు
  35. రులుల్లుఱుకులాడెడి
  36. ఈపద్యము అనంతచ్ఛందములో అనంతుఁడు చెప్పినట్లున్నది (చూ.1-117). అప్పకవీయములో అనంతునిఛందమునందు అని ఉన్నది (చూ. 8-77). సులక్షణసారములో పెద్దిరాట్ ఛందమున అని ఉన్నది.
  37. ప్రతులలో ఇట్లే ఉన్నది గాని ఈపద్యము అనంతచ్ఛందములో అనంతుఁడు చెప్పినట్లున్నది (చూ. 1-92).
  38. కడుముదమున
  39. ప్రబంధరాజవిజయవేంకటేశ్వరవిలాసము
  40. ఈ పద్యము అనంతచ్ఛందములో అనంతుఁడు చెప్పిన ట్లున్నది. (1-121).
  41. ఈపద్యము అనంతచ్ఛందమున లేదు. అప్పకవీయములో కావ్యచింతామణియందు అని ఉన్నది (చూ.3-220).
  42. ఈపద్యము కొన్నిప్రతులయందుఁ గాన్పింపదు.
  43. హేమపీతాంబరుఁడు దేవవృషభుఁ డనఁగ