ఆనందరంగరాట్ఛందము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

చతుర్థాశ్వాసము



లలనావాణీరమ
ణీలసితకటాక్షవదననరేజ సుహృ
జ్జాలసురసాల కీర్తివి
శాలా! ఆనందరంగ! సదయాపాంగా!

1


గీ.

అవధరింపుము నీపేర నంకితముగ, సకలలక్షణగ్రంథవిస్తారసార
పటిమ లన్నియు నొకటిగా ఘటనపఱిచి, లక్షణ గ్రంథ మొనరింతు రంగనృపతి.

2


క.

వరసాహితి చెప్పినవే, మఱు సంధివిభక్తులును సమాసపువింతల్
పరికింపవలయుఁ గావున, ధర నేనవి కొన్ని తెలిపెదన్ రంగనృపా!

3


వ.

సాహిత్యంబు రచియించునెడఁ బ్రాబంధికు లగుమహాకవీంద్రులు తమతమలాక్షణి
కసామర్థ్యంబు విశదం బగుటకునై యపూర్వంబు లైనసంధిభేదంబులు, నచ్చెరువై
నవిభక్తిరీతులు, నరుదైనసమాససంగతులు వివరించియున్నవారు కావున నే నది పరి
శోధించి తత్కవిసార్వభౌమవిరచితాంధ్రప్రబంధంబులం గలపద్యంబులు లక్ష్యం
బులుగాను భవదీయనామధేయాంకితంబు లైనపద్యంబులు లక్షణంబులుగా జతగూ
ర్చి యద్దంబులోన నేనుంగును గనుంగొనిపించినతెఱంగున సుకవులు ప్రయాసం
బెఱింగి పొంగఁ గుకవు లసూయచే నంతరంగంబునం గ్రుంగ భవదీయసమగ్రద
యావిశేషంబునఁ బురాతనకవినాయకపూర్ణానుగ్రహబలంబున, నుమామహేశ్వర
సాంద్రప్రసాదవైభవంబున వివరించెద నాకర్ణింపుము.

4
[1]అనంతచ్ఛందంబున
గీ.

నుఱులురులు బొల్లు లగును దెనుంగుసంధి
హేమ మది పదార్వన్నె; నల్మోములతఁడు
బ్రహ్మ; హరిఁ గొల్చియున్నవా ర్పరమమునులు
కోటిలో నొప్పు సతికిఁ గన్గొనలనంగ.

5

తా.

పదాఱు+వన్నె=పదార్వన్నె; నలు+మోములు=నల్మోములు; వారు+పరమమునులు=వార్పరమమునులు; కను+కొనలు=కన్గొనలు; పలు+మాఱు=పల్మాఱు. అని యిట్లు నుకార రుకార లుకారము లంతమందుఁగ తెనుఁగుశబ్దములు సమాససంధిచేత ద్విత్వములు గూడ నగును.


క.

తెల్లంబుగను నకారపుఁ, బొల్లులకు న్నచ్చుసంధి పొసఁగుఁ గవులకున్
గొల్లలుగ రంగధరణీ, వల్లభుఁ డిచ్చు న్నపారవస్తువు లనినన్.

6


తా.

నకారపొల్లువెనుక నచ్చులయినయకారాదు లుండిన సంధి పొసఁగును.

లక్ష్యము భారతము, ఆదిపర్వమున
మ.

అనిలం బాపురిపౌరచిత్తముల కత్యానంద మొందంగనం
దిని యన్నేటితరంగలం బెనఁగుచున్ దివ్యద్రుమాకీర్ణనం
దనసందోహము దూరుచున్ వికచకేతక్యాదినానాలతాం
తనవామోదము నొందుచు న్నెగయు నిత్యంబున్ గరం బిష్టమై.

7
మఱియు భారతము, ఆరణ్యపర్వమున
చ.

వరదుఁడు పార్థుశౌర్యవిభవంబున కాతనిధైర్యశక్తికి
న్నరుదుగ మెచ్చి సన్నిహితుఁ డయ్యె జటామకుటేందురేఖయున్
గరమున శూలముల్ గరళకాలగళంబు బృహద్గజాజినాం
బరముఁ దృతీయలోచనముఁ బన్నగహారము లొప్పుచుండఁగన్.

8
భారతము, ఆదిపర్వమున
మత్త.

మానితం బగునాతపోమహిమం ద్రిలోకపరాభవం
బేను జేయఁగఁ బూని చేసితి నిట్టి దొక్కప్రతిజ్ఞ మున్
దీని నెట్టులు గ్రమ్మఱింతు మదీయభాషణ మెన్నఁడు
న్నేని మోఘము గాదు దిగ్ధరణీందుభాను లెఱుంగఁగాన్.

9
పారిజాతాపహరణమున
క.

వచ్చిన మునిపతి కెదురుగ, వచ్చి నమస్కృతు లొనర్చి వనితయుఁ దాను
న్నొచ్చెంబు లేనిభక్తి వి, యచ్చరరిపుభేది సల్పె నాతిథ్యంబున్.

10


వ.

అని యున్నది గనుకఁ దెలియఁదగినది.

11


గీ.

హల్లుతోఁగూడ సంధిగా నచ్చుపొసఁగు, నెలమి నానందరంగరాయేంద్రుతోడ
నహితు లేలొక్కొ యీరీతి నలుకొనర్చి, వనముల వసించుచున్నవా రనుచుఁ బలుక.

12


తా.

ఏల+ఒక్కొ=ఏలొక్కొ; అలుక+ఒనర్చి=అలుకొనర్చి. అని హల్లు లైన కకారాద్యక్షరములతో నచ్చు లైనస్వరము లిముడ సంధి గూర్పవచ్చును.

లక్ష్యము భారతము, ద్రోణపర్వమున
మ.

వెర వేసంపదఁ గోరి గాండివగుణావిర్భూతబాణాళి కి
ట్లెరయై వచ్చుట యిమ్మహీపతి కితం డేలొక్కొ యత్యంతని
ష్ఠురశౌర్యోన్నతి నిన్నుఁ దాఁకఁదలఁపన్ జోద్యంబు వీఁ డగ్గమై
దొరకో లర్జున! నీదుతొంటిసుకృతస్తోమంబుకల్మిం జుమీ!

13
భారతము, విరాటపర్వమున
క.

జన్నములు సేయునెడఁ బ, క్వాన్నంబులు గుడుచుచుండు మధిపతి నిన్నున్
జన్నియవిడిచె రణముతఱి, [2]మిన్నక కినుకుడిగి పొమ్ము మీగృహమునకున్.

14


వ.

అని యున్నది గనుకఁ దెలియునది.

15


గీ.

క్రియలతుది రేఫ పొల్లగుఁ గృతులయందు, మదిఁ దలంతు ర్విపక్షభూమండలేంద్ర
లహరహము భవదీయశౌర్యాతిశయము, శ్రీవజారతరంగధాత్రీతలేంద్ర!

16


తా.

ఏతురు, ఒప్పుదురు, తునుముదురు, చూతురు, ఖండింతురు అనునీమొదలగు ఋకారాంతశబ్దముల రేఫ పొల్లుగాఁ గూడ నుండవచ్చును.

లక్ష్యము భారతము, శాంతిపర్వమున
మ.

పరిహాసంబునఁ దేలి భృత్యులయెడన్ బ్రహ్లాదముం జెందు భూ
వరునాజ్ఞం జన రేఁగి మెచ్చరు పనిన్ వంచింతు రెగ్గాడఁ జొ
త్తురు కౌతూహలవేషభాషణములన్ దుల్యత్వముం జెంది యే
తురు వా రెల్లపదంబు వేఁడుదురు సింతుర్భూమి మాఱొడ్డుచున్.

17
భారతమున
క.

అప్పరుసునఁ బెనఁగినరిపు, లిప్పుడు భారతరణోర్వి కెర యై పలువుర్
కుప్పలు గొనఁబడి రనికిన్, దప్పినవాఁ డొకఁడొకండు ధర నింతంతన్.

18


వ.

అని యున్నది గనుక జాడ తెలియునది.

19


గీ.

క్రియ విభక్త్యవ్యయములు సంస్కృతములు గను
దెనుఁగునందుండు శ్రీరంగ ధీవరాయ
భూపచంద్రాయ 'తుభ్యన్నమో' యటంచు
నహితు లేప్రొద్దు మ్రొక్కుదు రనుచుఁ బలుకు.

20


తా.

క్రియలుగ నుండునవియు, విభక్తిరూపములుగ నుండునవియు, నన్వయములుగ నుండునవియు నగుసంస్కృతశబ్దములు తెనుఁగున నొక్కొక్కదిక్కున ననుకరణమునందుఁ బ్రయోగింపవచ్చును.

లక్ష్యము భారతము, విరాటపర్వమున
ఉ.

శ్రీయన గౌరినాఁ బరగు చెల్వలయుల్లము పల్లవింప భ
ద్రాయితమూర్తియై హరిహరం బగు రూపముఁ దాల్చి 'విష్ణురూ
పాయ నమశ్శివాయ' యనిపల్కెడుభక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చ మెచ్చుపరతత్త్వము గొల్చెద నిష్టసిద్ధికిన్.

21
నైషధమున
మ.

కమలేందీవరషండమండితలసత్కాసారసేవారతిన్
గమికర్మీకృతనైకనీవృతుఁడనై కంటిన్ విదర్భంబునన్
రమణిన్ బల్లవపాణిఁ బద్మనయనన్ రాకేందుబింబాననన్
సమపీనస్తని నస్తి నాస్తి విచికిత్సాహేతు శాతోదరిన్.

22
ఆముక్తమాల్యదయందు
శా.

అద్ధావాగ్విబుధం బహోవచనకవ్యాహారమాహావచ
స్సిద్ధమ్మాః కృతతాంగతఃకలిరితి శ్రీసూక్తివిద్యాధరం
బిద్ధౌద్ధత్య మగాల్లయం హి కుధియా మిత్థం వదత్కిన్నర
మ్మద్ధీరాగ్రణిగెల్పుటుత్సవమునం దయ్యె న్నభంబంతయున్.

23
రుక్మాంగదచరిత్రమున
సీ.

అంబుజభవసురేంద్రార్చితచరణాయ మరణదూరాయ నమశ్శివాయ
పద్మాప్తకోటిప్రభాదివ్యదేహాయ మఘహరణాయ నమశ్శివాయ
డమరుత్రిశూలఖడ్గకపాలహస్తాయ మధితరోషాయ నమశ్శివాయ
గగనకల్లోలినీకలితోత్తమాంగాయ మౌళిచంద్రాయ నమశ్శివాయ


తే.

మధువిరోధిశరాయ నమశ్ళివాయ, మౌనిసంసేవితాయ నమశ్శివాయ
మదనదర్పహరాయ నమశ్శివాయ, మంత్రరూపాయ తుభ్యన్నమశ్శివాయ.

24
మఱియును రుక్మాంగదచరిత్రమున
సీ.

దంభోళిధరసతీ తాంబూలపేటీషు దహనబింబాధరీస్తనభరేషు...

25


వ.

అని తెలియఁదగినది.

26


గీ.

ఇల నుకారాంతశబ్దము ల్తెనుఁగులైన, నుత్వము విసర్గలోపమౌ నొనరు పురుష
మేరు శ్రీరంగపతి రఘుదారి నాపు, రూరువలె బాహుబలిమిచే మీఱు ననఁగ.

27


తా.

మేరు, ఊరు, రాహు, రఘు, లఘు, ధేను, మను, తను, గురు ఈ మొదలగు నుకారాంతశబ్దములు తెనుఁగు లైనచో మేరువు, ఊరువు, రాహువు, బాహువు, రఘువు, లఘువు, తనువు, ధేనువు, మనుపు, వసువు, గురువు అనియు, 'వు' కారము అంతమున లేకనే సంస్కృతశబ్దమువలెను చెప్పవచ్చును.

లక్ష్యము రఘుశబ్దమునకు భారతము, ఆదిపర్వమున
మ.

రజనీనాథకులైకభూపణుఁడవై రాజర్షివై ధారుణీ
ప్రజనెల్లన్ బ్రజవోలె ధర్మనియతిన్ బాలింపుచుం దొంటిధ
ర్మజు నాభాగు భగీరథుం దశరథున్ మాంధాతృ రామున్ రఘున్
విజయుం బోలితి సద్గుణంబుల జగద్విఖ్యాతపారిక్షితా!

28
బాహుశబ్దమునకు భారతము, విరాటపర్వమున
గీ.

నేల నాలుగుచెఱఁగుల నృపులకొలువు,లందు నేను వర్తించితి నవనినాథ
యగ్గలించి నాయెదురఁ బాహప్పళింపఁ, గడఁగఁజాలినమల్లుఅఁ గాన నెందు.

29
రాహుశబ్దమునకు భారతము, శల్యపర్వమున
క.

ఉర్వీచక్రము వడఁకెను, బర్వము లేకుండ రాహు భానునిఁ బట్టెన్
పర్వతము లురలె వరళులు, సర్వదిశల నరచె నభము శర్కర గురిసెన్.

30
ఊరుశబ్దమునకు భారతము, కర్ణపర్వమున
శా.

లీలన్ గేల నమర్చి మత్తగజకేళీసుందరోల్లాస మా
భీలత్వం బలరింపఁ ద్రిప్పుఁ జదలన్ బృథ్వీస్థలిన్ వైచు ముం
గాలన్ ద్రోచు మొగంబువ్రేయు దిశ లుగ్రస్ఫూర్తి వీక్షించు మో
కాలూరుం బయిఁ గ్రమ్మ నెక్కు మెడ నిక్కం ద్రొక్కు, లేచున్ నగున్.

31
మేరుశబ్దమునకు పాండురంగమాహాత్మ్యమున
శా.

మీఁదన్ దారధరాధరంబుగల యామేరు న్నగంజాలి త
త్తాదృక్తుం డరుచిన్ దలిర్చు ఖగయూధస్వామి హేమప్రభా
ప్రాదుర్భావశుభప్రదుండు మనుచున్ రామానుజామాత్యు శ్రీ
వేదాద్రీశు విదూరిమందిరు జగద్విఖ్యాతచారిత్రునిన్.

32


వ.

అని యీరీతి నున్నది గనుకఁ దెలియునది.

33


గీ.

పరగు నభిలాషశబ్దము భ్రమపదంబు, నొనరు స్త్రీలింగరీతి నొక్కొక్కచోట
భ్రమను సుందరు లానందరంగపతికి, వలచి రభిలాష యెట్టిదో వారి కనఁగ.

34


తా.

భ్రమశబ్దము, అభిలాషశబ్దము అకారాంతములు గనుక నవి తెనుఁగులైనపుడు భ్రమము, అభిలాసము అని యండవలెను. అట్లుగాక భ్రమ, యభిలాష అని స్త్రీలింగశబ్దములవలెఁ జెప్పవచ్చును.

భారతము, ఆనుశాసనికపర్వమున
క.

భ్రమచే నద్దేవునిఁ జి, త్తమునం దిడి శరణు శరణు దయఁ గావుము న
న్నమితైశ్వర్య...

35

వ.

అని యున్నది గానఁ దెలియునది.

36


గీ.

హంస లన హంసము లనంగ నమరుఁ గృతులు, నిరుదెఱంగుల రంగనరేంద్రుకీర్తి
హంసమును గాంచి ధరఁ గల్గుహంసలెల్ల, మించ వెలవెలఁ బాఱెనటంచు బలుక.

37


తా.

హంసయనియు, హంసమనియుఁ జెప్పవచ్చును.

లక్ష్యము భారతము, కర్ణపర్వమున
సీ.

అనుటయుఁ గాక మిట్లను హంసములతోడ గతులు నూటొక్కటి గలవుగాన.

38
భారతము, ఆరణ్యపర్వమున
క.

దమయంతికి నలునకు సం, గమకారణదూత యైనకలహంస మనో
జ్ఞమనుష్యవాక్యముల నా, దమయంతికి హర్ష మొదవఁ దా నిట్లనియెన్.

39
భారతము, కర్ణపర్వమున
క.

బలశాలి యైనహంసముఁ, బిలిచితి పురుడించి పాఱ బేలతనమునన్
గలవే యింతకుమును హం, సలతోఁ బురుడించువాయసంబులు జగతిన్.

40


వ.

అని యున్నది గనుకఁ దెలియునది.


గీ.

కృతుల స్త్రీలింగమువలెఁ జరిప చరిత్ర, బరగు నానందరంగభూపాలుచరిత
వినవినఁగఁ జీవులకు జాల వేడ్క పుట్టె, మాధవచరిత్ర యాలించు మాడ్కి ననఁగ.

41


తా.

చరిత, చరితము, చరిత్ర, చరిత్రము అని రెండువిధములుగను చెప్పవచ్చును.

భారతము, ఆదిపర్వమున
గీ.

ధరణిప్రజఁ గరంబు దయతోడ సర్వధ, రాభిరక్షఁ బెంచి యమలచరిత
రాజ్యవిభవ మిదియేల నని తప, శ్చరణ నునికి వనికిఁ జనియె ననఘ!

42
భారతము, ఉద్యోగపర్వమున
గీ.

హితముఁ గర్తవ్య మెఱిఁగించి తీవు నాకు, ధర్మపుత్రుచరిత విదితంబు నీకు
నట్లు గావున వివరింపు మఖిలకార్య, జాతమును జిత్తతాపోపశమము గాఁగ!

43
చరిత్రకు భారతము, ఆదిపర్వమున
చ.

హిమకరుఁ దొట్టి పూరుభరతేశకురుప్రభుపాండుభూపతుల్
క్రమమున వంశకర్త లనఁగా మహి నొప్పుచు నస్మదీయవం
శమునఁ బ్రసిద్ధులై యమలసద్గుణశోభితు లైన పాండవో
త్తములచరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్ట మెంతయున్.

44


వ.

అని యున్నది గనుకఁ జరిత చరిత్ర అను రెంటికిని లక్ష్యములు వ్రాసినాఁడను, చరి
తము, చరిత్రము వాడుకలోనివి గనుక వ్రాయలేదు.

45

గీ.

భువిఁ దకారాంతశబ్దముల్ పురుషపరము, లైన నూఁదుచుఁ దేలుచు నలరుఁ గృతుల
నమరుఁ గైటభజితువలె యశముఁ గాంచు, శ్రీవజారతరంగధాత్రీశుఁ డనఁగ.

46


తా.

కైటభజిత్తు, యుధాజిత్తు, పరీక్షిత్తు, ఇంద్రజిత్తు, సత్రాజత్తు యివి మొదలగుపురుషవాచ్యశబ్దములు తెనుఁగున నొక్కొక్కదిక్కునఁ దేలికగాఁ గైటభజితు, ఇంద్రజితు, సత్రాజితు, యుధాజితు అనియుఁ జెప్పవచ్చును.

భారతము, ఆదిపర్వమున
చ.

అనవరతాన్నదానయజనాభిరతున్ భరతాన్వవాయవ
ర్ధను సకలప్రజాహితవిధాను ధనంజయసన్నిభుం భవ
జ్ఞనకుఁ బరీక్షితుం బటుభుజంగుఁ డసహ్యవిషగ్రధూమకే
తనహతిఁ జేసి చేసె నతిదాంతుఁ గృతాంతనికేతనాతిథిన్.

47


వ.

అని యున్నది గనుక జాడ తెలియునది.

48


గీ.

కలిగి యనుచోట నై యని పలుకవచ్చు, నండ్రు శ్రీమద్వజారతానందరంగ
రాయమణి గంధసింధురరాజముఖ్య, చిరతరవిభూతి యై ప్రకాశించు ననఁగ.

49


తా.

‘కలిగి’ యనుశబ్దము నిలుపఁదగినచోట 'ఐ' యనుశబ్దము నుంచినయెడల నాయర్థమునే యిచ్చును.

లక్ష్యము భారతము, విరాటపర్వమున
క.

అరుణాశ్వంబులఁ బూన్చిన, యరదంబున వీఁడె నిడుద లగుచేతులు బం
ధురకంధరంబు వెడలుపు, టురమును నై ద్రోణుఁ డొప్పె నుత్తర కంటే.

50
భారతము, ద్రోణపర్వమున
సీ.

తెల్లనిగొడుగు నై తేజరిల్లుచు నున్న యల్లవాఁడే పాండెవాగ్రజుండు...

51
భారతము, శాంతిపర్వమున
సీ.

అర్థి విశ్వావసుఁ డాదిగా గలుగుగంధర్వులు హృద్యవాదన మొనర్ప
నప్సరోనికురుంబ మాటలుపాటలు నై వినోదింపంగ నమరగణము....

52


అని యున్నది.


గీ.

పంచమివిభక్తిని నికారవర్ణ మొకటి, లోపముగఁ జెప్పవచ్చు ముల్లోకములను
గీర్తులను నించి మించి శ్రీకృష్ణుకంటె, నసము గని రంగభూపాలుఁ డెసఁగె ననఁగ.

53


తా.

కృష్ణుకంటె, కృష్ణునికంటె; రాముకంటె, రామునికంటె; అని పంచమీవిభక్తి రెండువిధములఁ జెప్పవచ్చును.

అక్ష్యము భారతము, విరాటపర్వమున
సీ.

రాత్రిమైఁ దాఁకి క్రూరతఁ బోరి మగఁటిమి వాసినయంగారపర్ణుకంటె
ఘోషయాత్రావిధిఁ గురురాజు చెఱఁబట్టి మాన మేఁదినచిత్రసేనుకంటె

ఖాండవోచ్యానంబుఁ గాన నేరక సిగ్గు, పడి చన్ననిర్జరప్రభునికంటెఁ గ్రీడాకిరాతుఁడై క్రోడంబునకుఁ గాను, బెనఁగి చిక్కినత్రిలోచనునికంటె.

54


వ.

అని యున్నది గనుకఁ తెలియునది.

55


గీ.

ప్రథమలు విశేషణములుగాఁ బలుకవచ్చు
షష్ఠికి రమాధవుఁడు రంగశౌరియొకఁడె
సాటి యగు శ్రీయుతుఁడు రంగశౌరి కనఁగ
ఘనుఁడు తిరువేంగళేంద్రనందనున కనఁగ.

56


తా.

షష్ఠీవిభక్తికి విశేషణములైనశబ్దములు ప్రథమావిభక్తులుగఁ గూడఁ జెప్పవచ్చును.

లక్ష్యము భారతము, భీష్మపర్వమున
క.

అపరాహ్ణసమయమున ని, ట్లుపమాతీతాతిఘోరయుద్ధం బయ్యెన్
నిపులభుజబలుఁడు భీమున, కపరిమితబలుండు కౌరవాధీశునకున్.

57


వ.

అని యున్నది గాన జాడ తెలియునది.

58


గీ.

వెలయ మూర్ఖధూర్తవృద్ధనచపదాళి, కొనరు డుత్వమైన నుక్వమైన
క్షోణి రంగనృపతి సుగుణవృద్ధై యొప్పు, సకలరాజవర్యసభల ననఁగ.

59


తా.

ధూర్తు, ధూర్తుఁడు; మూర్ఖు, మూర్ఖుఁడు; నీచు, నీచుఁడు; వృద్ధు, వృద్ధుఁడు; అని యీ నాలుగుశబ్దములు రెండువిధములుగఁ బ్రయోగింపవచ్చును.

లక్ష్యము భారతము, ఉద్యోగపర్వమున
ఉ.

చొచ్చినచోన చొచ్చి తెగఁజూచెద నంచుఁ గడంగుఁ గాని నన్
మెచ్చఁడు బాహుగర్వమున నీచు సుయోధనుఁ డట్టివానితో
నొచ్చెము లేక కూడి మన నూల్కొనియుండఁగ రాదు నాకు వి
వ్వచ్చుఁడు రాచవారుఁ గురువర్గము చావున కోర్వకుండుటన్.

60
భారతము, ఆరణ్యపర్వమున
క.

అలయికయుఁ దలవడఁకు వె, క్కలు జనియించుటయు నురలు గలుగుటయును వృ
ద్ధులలక్షణమే జ్ఞానము, కలదేనియు బాలుఁ డైనఁగడువృ ద్ధరయన్.

61


వ.

అని యున్నది గనుక జాడ తెలియనది.

62


గీ.

పరఁగ దిర్యక్కు లిల శ్రేష్ఠపదము లైనఁ, బురుషవాచకములుగాను బూన్పవచ్చు
చక్కనితురంగరాజు పై నెక్కి వెడలె, స్వారి యానందరంగభూజాని యనఁగ.

63


తా.

తిర్యక్పదము లైనశబ్దములు శ్రేష్ఠవాచకము లైనపుడు పన్నగేంద్రము, పన్నగేంద్రుఁడు; మృగరాజము, మృగరాజు; పరిగశ్రేష్ఠము, పరిగశ్రేష్ఠుఁడు;

అశ్వోత్తమము, అశ్వోత్తముఁడు; గజేంద్రము, గజేంద్రుఁడు; అనియు నిదియఁ గాక ఉరగము, ఉరగుఁడు; సముద్రము, సముద్రుఁడు; ఘనము, ఘనుఁడు; అనియుఁ జెప్పవచ్చును.

లక్ష్యము భారతము, సౌప్తికపర్వమున
ఉ.

అగ్గురునందనుండు హరిణావళిఁ గాంచి కుభృత్తటంబు వే
డిగ్గుమృగేంద్రుచాడ్పునఁ గడిందిమగంటిమి యుల్లసిల్లఁగా...

64
భారతము, ఆదిపర్వమున
మ.

వివిధోత్తుంగతరంగఘట్టనచలద్వేలావనైలావళీ
లవలీలుంగలవంగసంగతలతాలాస్యంబు వీక్షించుచున్
ధవళాక్షుల్ చని కాంచి రంత నెదుటన్ దత్తీరదేశంబునం
దవదాతాంబుజఫేనపుంజనిభు నయ్యశ్వోత్తముం దవ్వులన్.

65
భారతము, ఆరణ్యపర్వమున
క.

గిరిశృంగతుంగవిగ్రహుఁ, డురుతరసత్త్వుఁడు విహంగమోత్తముఁ డపు డొ
క్కరుఁ డొయ్యన నయ్యెడకున్...

66
భారతము, ఆదిపర్వమున
చ.

అరిదితపోవిభూతి నమరారులఁ బాధలు వొందకుండఁ దా
నురగులనెల్లఁ గాచినమహోరగనాయకుఁ డానమత్సురా
సురమకుటాగ్రరత్నరుచిశోభితపాదున కద్రినందనే
శ్వరునకు భూషితంబయిన వాసుకి మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.

67
భారతము, ఆరణ్యపర్వమున
క.

మృగయార్థ మరిగి హిమవ, న్నగభూములయందుఁ బవననందనుఁ డొకప
న్నగుచేతఁ జిక్కు వడి యి, మ్ముగ ధర్మజుచేతఁ దాను మోచితుఁ డయ్యెన్.

68


వ.

అని యీతీరున విస్తారముగా నున్నది గనుకఁ దెలిసికొనఁదగినది.

69


గీ.

పడెఁ బఱచెఁ బట్టెఁ బాటను నుడువు మెకట, సంస్కృతంబునఁ జెల్లును శత్రువులను
భంగపడఁజేసి యానందరంగనృపతి, ధీజనులకష్టపాటెల్లఁ దీర్చు ననఁగ.

70


తా.

పడె, పఱచె, పట్టె, పాటు ఈ నాల్గుశబ్దములు సంస్కృతపదములన్నిటియందుఁ జేరియుండవచ్చును. సుఖపడె, సుఖపఱచె, సుఖపెట్టె; దుఃఖపడె, దుఃఖపాటు, దుఃఖపెట్టె, దుఃఖపఱచె; సంకటపడె, సంకటపఱచె, సంకటపెట్టె; భంగపడె, భంగపెట్టె, భయపఱచె; అని యిటువంటిశబ్దములమీఁద నొకసమాసమువలె నుండవచ్చును.

లక్ష్యము
ఉ.

దానవుచేతఁ గష్టపడి దైన్యమువొందుట కోర్వలేక నీ
దైనపదాంబుజంబుల భయం బని వేఁడితి...

71
భారతము, ఉద్యోగపర్వమున
గీ.

తండ్రి లేని ప్రజలు తల్లిని బాసి పె, ద్దయునుగాల మవ్విధమునఁ బడఁతి
భంగపాటు దుఃఖపాటును సంకట, పాటుఁ గలిగె విరటు పాలఁ బిదప

72
పాండురంగమాహాత్మ్యమున
సీ.

దరిఁద్రొక్కి యున్నయాతలిదండ్రులను జాలఁబడుచవై సంతోషపఱుచవైతి.....

73
భారతము, ఆదిపర్వమున
చ.

తిరుగుచుఁ బుట్టలం బొదలఁ ద్రిమ్మరుపాముల రోసిరోసి ని
ష్ఠురభుజదీర్ఘదండమునఁ డొల్లఁగ వ్రేయుచు వచ్చి వచ్చి య
య్యెర నొకడుండుభం బనువహిం గని వ్రేయఁగ దండ మెత్తుఁడున్
హరిహరి యంచు డుండుభమహాహి భయంపడి చేరి భార్గవున్.

74


వ.

ఈరీతి నున్నది కనుక జాడ తెలుసుకొనఁదగినది.

75


గీ.

ఆంధ్రభాషను నాలుగైదక్షరముల, పైని సంస్కృతపదముఁ బూన్పఁగను జెల్లు
మగువ లానందరంగేంద్రుతొగరుమోవి, యమృతమును గ్రోల నాసింతు రనుచుఁ బలుక.

76


తా.

తెనుఁగున నైదాఱక్షరములకు విశేషణమును నవతల సంస్కృతశబ్దము విశేష్యముగను చెప్పవచ్చును.

భారతము, కర్ణపర్వమున
సీ. గీ.

అవలికౌరవాధీశులఁ గవసికడిమిఁ
బొదవుటయు నన్నిశరముల భూరిరయము
మెఱయ నందఱఁ దెగటార్చి తఱుమ నతనిఁ
దాఁకె వేయు మున్నూఱుదంతావళములు.

77


గీ.

ఇంద్రునకు రుద్రుఁ డత్తఱి నిట్టులనియె, ననఘ యిరువదివేయుదివ్యాబ్దములు మ
హాతపం బొనరించెను నసుర వాని, కొసఁగె పద్మజుఁ డధికమహోగ్రబలము.

78
ఆముక్తమాల్యదయందు
మ.

పునుగుందావినవోదనంబు మిరియంపుంబొళ్లతోఁ జట్టిచు
య్యనునాదారనికూరగుంపు ముకునుం దైయేర్చునావం జిగు
ర్కొనుపచ్చళ్లును బాయసాన్నములు నూరుంగాయలుం జేచురు
క్కనునేయుం జిఱుబాలవెల్లువుగ నాహారంబిడున్ సీతునన్.

79
మనుచరిత్ర
సీ.

కటికిచీఁకటి తిండి కరముల గిలిగింత నెవ్వాఁడు తొగకన్నె నవ్వఁ జెనకు....

80


వ.

అని యున్నది గనుక జాడ తెలియునది.

81


గీ.

అగును స్త్రీలింగశబ్దంబు హ్రస్వముగ స, మాసమధ్యంబునను రంగ మనుజవిభుని
కీర్తి హరజటాజూటసంకీర్ణదివ్య, గంగజలముల మితి మీఱు గరిమ ననఁగ.

82


తా.

గంగాజలము, గంగజలము; తమసాతీరము, తమసతీరము; రాకాచంద్రుఁడు, రాకచంద్రుఁడు, నదీసుతుఁడు, నదిసుతుఁడు అని యీరీతి స్త్రీలింగశబ్దములు అకారాంత, ఇకారాంతశబ్దములవలె నుండవచ్చును.

లక్ష్యము, భారతమున, ఆది పర్వమున
చ.

జలరుహనాభ రమ్యగిరిసానువనంబుల వేఁట లాడుచున్
సలుపుద మీనిదాఘదివసంబుల నీవును నేను [3]నెమ్మదిన్
నలినరజస్సుగంధియమునా హ్రదతుంగతరంగసంగతా
నిల శశిరస్థలాంతరవినిర్మితనిర్మలహర్మ్యరేఖలన్.

83
రాఘవపాండవీయమున
క.

నెలకొనియె వేఁటతమి న, బ్బలియుఁడు శిశిరనగరుచిరపరిసరమహిమం
గలతమసతీరసికతా, విలసనములు డెందమునకు విందొనరింపన్.

84
శృంగారనైషధమున
ఉ.

రాకసుధాంశుమండలమురాకకు మాఱుమొగంబు పెట్టుచో
దీకొనివచ్చు దండధరదిక్పనమాన మదక్షిణంబగున్...

85


వ.

అని యున్నది గనుక జాడ తెలిసికొనునది.

86

వృత్తరత్నాకరప్రకరణము

క.

క్షితి వృత్తనియమములసం, గతి విద్వజ్జనము లెన్న గణబద్ధములై
ధృతివెలయఁ జెప్పెద వజ, రతవిజయానందరంగరాయబిడౌజా!

87


గీ.

ధరను బ్రస్తార మనఁగ నధ్వం బనంగ, నష్టమన సంఖ్యయనఁగ నుద్దిష్ట మనఁగ
విను లగక్రియ యన నాఱువిధములుగును, ప్రత్యయము లొప్పు నానందరంగశౌరి.

88


తా.

ప్రస్తారప్రత్యయము, అధ్వప్రత్యయము, నష్టప్రత్యయము, సంఖ్యాప్రత్యయము, ఉద్దిష్టప్రత్యయము, లగక్రియాప్రత్యయము, అని యాఱువిధముల ప్రత్యయము లొప్పును. అందుఁ

బ్రస్తారప్రత్యయము

గీ.

వరుస సర్వగురువు లుంచి గురువుక్రింద, లఘువు నవతలఁ బైబండిలాగు వ్రాసి
దాపటను గురు లుంచఁ బ్రస్తార మయ్యె, నసఘ! యానందరంగరాయాగ్రగణ్య.

89


తా.

ఎన్నవఛందము ప్రసరింపవలె నన్న నన్ని గురువులు వరుసఁగ వ్రాసి యందు తొలిగురువు క్తింద లఘువును నావలఁ బైబంతి యెట్లున్నదో యామేరకు వ్రాసి దాపట గురువు వాసినఁ బ్రస్తారమగును. ఇట్లు సర్వలఘువు లగువఱకు వ్రాయునది.

అధ్వప్రత్యయము

గీ.

అమర నుక్తాది యిన్నిఛందములవఱకు
నివృత్తంబు లెఱిఁగింపు మన్న దాని
లెక్క రెట్టించి యందులో రెండు త్రోయఁ
దక్కినది యధ్వ మగు రంగధారుణీంద్ర!

90


తా.

మొదటిఛందస్సు మొదలుకొని యిన్ని ఛందస్సులవఱకు నెన్ని వృత్తము అనిచో నడిఛందస్సుకుమాత్ర మెన్నివృత్తము లున్నవో యవి రెట్టించి
యందులో రెండు త్రోసి మిగిలిన వెన్నియో యన్ని చెప్పునది.

నష్టప్రత్యయము

గీ.

పలుకఁబడు లెక్కభాగ మేర్పడినలఘువు, వ్రాసి బేసైన నొక్కటి వ్రాసిఁ గూర్చి
యది సగము చేసి గురువుంచి తుదకుఁ గనిన, నష్టాలబ్దాఖ్య మయ్యె నానందరంగ!

91


తా.

ఎన్నవవృత్త మేరీతి నుండు నని యడిగిన నాలెక్క భాగించి సరిగా నున్నలఘువు వ్రాసికొని బేసిగానుండిన నొకటి కూర్చి భాగించి యందుకు గురువు వ్రాసికొనునది. ఇట్లు కడదనుక భాగించుకొని గురువు లఘువు వ్రాయుచు వచ్చినట్లయిన నది నష్టప్రత్యయ మగును.

సంఖ్యాప్రత్యయము

గీ.

వెలయ నీఛందమున కెన్నివృత్తము లని, యడుగ నేకోత్తరంబుగా నదివఱకును
గూర్చి యా లెక్క రెట్టించుకొనిన వృత్త, సంఖ్య యగు నది రంగరసాతలేంద్ర!

92


తా.

ఈఛందమున నెన్నివృత్తములు పుట్టు నని యడిగిన నెన్నవఛందము చెప్పుచున్నాఁడో యదివఱకు నేకోత్తరవృద్ధిగా రెట్టించి కడనువచ్చిన లెక్కను రెట్టించి యిన్నయని చెప్పునది.

ఉద్దిష్టప్రత్యయము

గీ.

వృత్తమున గురులఘువులు పేర్చి దాని క్రింద నేకోత్తరర్థి లెక్కించి యాల
ఘువులసంఖ్యలో నొక్కటి గూర్చుకొనిన, నామ ముద్దిష్ట మయ్యె నానందరంగ.

93

తా.

ఈఛందములో నిది యెన్నవవృత్త మనియడిగిన నావృత్తమున్నమేరకు గురులఘువులు వరుసఁగా వ్రాసికొని దాని క్రింద నేకోత్తరవృద్ధిగా లెక్కలెన్ని యందు లఘువులు క్రింద నుండు లెక్క మాత్రము కూడి యందు మఱియొకటిగూడఁ గూర్చుకొని యిన్నవవృత్త మని చెప్పునది.

లగక్రియా ప్రత్యయము

సులక్షణసారంబున
సీ.

చక్రి లగక్రియాచక్రంబునకు మేరు వర్ధమేరు వనంగ నమరు నందు
నాదినొక్కటిఁ బెట్టి యా క్రిందటిండ్లలో నారెంటి నిడుచు నయ్యడ్డబంతి
రెండవ దాదిగా రెట్టించి దానిలో నొక్కటొక్కటి తీసి లెక్క విడుచు
నడిచాలిలో నొప్పుకడలెక్క కెక్కుడౌ నంతన నిలుపుచు నవలికడకు


తే.

మీఁదియోలికుఱుచ లాదట నినుమడుల్, గూర్చి వ్రాసికొదునకును మునుపటి
వలెనె నొకటి త్రోసి వ్రాయంగ నగు నిట్టు, లన్ని ఛందములకు నవధరింపు.

94


సీ.

వరుస నీచక్రాదిఁ బరగడ్డబంతిని సర్వగుర్వులవృత్తసమితి కలరు
నాక్రిందిచాలున నమరు వృత్తములెల్ల నొక్కొక్కమాత్రల నొప్పుచుండు
నావెన్క చాలిపద్యము లెల్ల రెండేసిలఘువులు గలవి యై లలిఁ దనర్చు
నానాలుగవచాలి నలరువృత్తములు మాత్రలు మూఁటమూఁట నై తనరుచుండు


తే.

నిటుల బంతుల కన్నింటి కిట్టిసంజ్ఞ, జరుగుఁ గడబంలివృత్తముల్ సర్వలఘువు
లిది లగక్రియ యనఁదగు నిలను బ్రత్య, యంబు నాఱవదై యొప్పు నంబుజాక్ష.

95


తా.

మేరువు, అర్థమేరువు అని రెండు కలవు. అందు మేరుచక్ర మిరువదియాఱుఛందములకు నిరువదియాఱిండ్లునిడివిని, బహుగా నిండ్లు నడ్డబంతులుండ వ్రాసి నిడివిబంతి మొదటియింట నొకటి పెట్టి యా క్రిందియిండ్ల 2, 4, 8, 16, 32 యీ
క్రమమున రెట్టింపు లెక్కలు నిరువది యారిండ్లను వ్రాసి, ఒక అడ్డబంతి రెండవ యింటి రెండును ఒకటి మూఁడు లెక్క పెట్టి అది రెట్టించి ఒకటితీసి 5 ఆవలియింట వ్రాసి యీతీరున నిరువదియాఱుఛందములకును వ్రాసి మొదటినిడిబంతి రెట్టిలెక్కచేత నడ్డబంతుల నెల్ల నాయాపైబంతిఁ గూర్చి వ్రాయుచు నధిక మైన లెక్క మట్టున నిల్పి మఱి యా క్రిందటిరెంటిలెక్కను దాని కుఱుచ లెల్ల నన్నిఛందస్సుల కొకటొకటి విడిచి యీవిధమున సావధానముగా వ్రాయవలెను.

ఇది షట్ప్రత్యయముల లక్షణము

లక్షణవృత్తంబులు

వ.

ఇక నిర్వదియాఱుఛందములకు వివరము. ఉక్త, అత్యుక్త, మధ్య, ప్రతిష్ఠ,
సుప్రతిష్ఠ, గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి, అతి
జగతి, శక్వరి, అతిశక్వరి, అష్టి, అత్యష్టి, ధృతి, అతిధృతి, కృతి, ప్రకృతి, ఆకృతి,
వికృతి, సంకృతి, అభికృతి, ఉత్కృతి అనునామధేయంబులఛందంబు లిర్వది
యాఱై విస్తరిల్లై, అందు మొదటిఛందంబున వృత్తములు 2, రెండవఛందంబున
4; మూఁడవచ్ఛందంబున 8, నాలవచ్ఛందంబున 16, ఐదవచ్ఛందంబున 32,
ఆఱవచ్ఛందమున 64, ఈతీరున నేకోత్తరవృద్ధిగా నిరువదియాఱు ఛం
దంబుల వృత్తంబులు పదుమూఁడుకోట్లు నలువదిరెండులక్షలు పదునేడువేలు
నేడునూట యిరువదియా ఱుద్భవిల్లి నాల్గేసిపాదంబులు గల్గి యొకయక్షరము
మొదలుగఁ క్రమక్రమంబున నెక్కుడుగణాక్షరంబులు వెలయుచు వేఱువేఱఁ
బ్రశస్తంబులై ఛందంబు లనియెడుగనుల వృత్తంబు లనియెడురత్నంబులు పుట్టి
విస్తరిల్లె నందుఁ బ్రశస్తంబులైన విద్యున్మాలయుఁ, జిత్రపదంబును, బ్రమాణియుఁ,
గిరకిశోరంబు నుత్సుకంబును, వాగ్మియుఁ, గోమలంబును, శుద్ధవరాటియు, నుప
జాతియు, నుపేంద్రవజ్రంబును, శృంగారిణియుఁ, గలరవంబును, నింద్రవజ్రం
బును, దోదకంబును, స్వాగతంబును, శ్యేనియు, వాతోర్మియు, భుజంగప్రయా
తంబును, దోటకంబును, నింద్రవంశంబును, వంశస్థంబును, ద్రుతవిలంబితంబును,
సగ్విణియు, జలధరమాలికయు, మత్తమయూరంబును, మంజుభాషిణియు,
బంభరగానంబును, లతావృత్తంబును, వసంతతిలకంబును, వనమయూరంబును,
బుష్పదామంబును, ప్రహర్షణకలితంబును, సురుచిరంబును, మణిగణనికరంబును,
గజరాజంబును, మాలినియు, సుగంధియు, శాంతియు, లలితగతియు, బ్రియ
కాంతయుఁ, బాలాశదళంబును, బంచచామరంబును, జంద్రభానువును, బృథ్వి
యు, శిఖరిణియు, మందాక్రాంతంబును, ద్వరితపదగతియు, మత్తకోకిలయు,
దేవరాజంబును, శార్దూలవిక్రీడితంబును, గుసుమితలతావేల్లితంబును, దరళయు,
భూతిలకంబును, మత్తేభంబును, గలితయుఁ, భుజంగంబును, నుత్పలమాలికయు,
నంబురుహంబును, ఖచరప్లుతంబును, సురభూజరాజంబును, స్రగ్ధరయు, గనక
లతికయు, మానినియున్, జంపకమాలికయు, లాటీవిటంబును, మణిమాలికయు,
వనమంజరియు, మాలినియుఁ, గుసుమంబును, మహాస్రగ్ధరయుఁ, దురగంబును,
మృగనాభియు, విచికిలస్తబకంబును, బంచశరంబును, శృంగారంబును, నశ్వలలి
తంబును, గవిరాజవిరాజితంబును, సరసిజముకుళంబును, గ్రౌంచపదంబును, వనరు
హంబును, వసురుచియు, విజయంబును, బంధురంబును, బుధవరనుతంబును, భాస్క

రవిలసితంబును, జారుమతియును, భుజంగవిజృంభితయు, మంగళమహాశ్రీయు నను
నీ మొదలుగాఁగల వృత్తంబు లపారంబు లై విస్తరిల్లుటంజేసి తదీయలక్షణంబులు
వివరించెద. నానందరంగేంద్ర! విన నవధరింపుము మొదలియుక్తాచ్ఛందంబున
నొకయక్షరంబు పాదంబుగా రెండువృత్తంబులు పుట్టె. నందు

96
శ్రీయనువృత్తము (భీమనచ్ఛందమున)

"శ్రీ
శ్రీఁ
జే
యున్"

97


వ.

రెండవయత్యుక్తాచ్ఛందమున రెండక్షరములు పాదములఁ గలనాలుగుసమవృత్తం
బులు పుట్టె. అందు

శ్రీ పెంపు అనువృత్తము (భీమనచ్ఛందమున)

"శ్రీపెం
పొప్పున్
ప్రాపుం
దాపున్”

98


వ.

మూఁడవమధ్యాచ్ఛందంబున మూఁడక్షరములు పాదములఁ గలసమవృత్తము లెని
మిది పుట్టె. నందు నాలవ దగు

వినయ మనువృత్తము (భీమనచ్ఛందమున)

"వినయం
బునయం
జ్ఞునకున్.”

99


వ.

నాల్గవ ప్రతిష్ఠాచ్ఛందంబువ నాల్గక్షరములు పాదములఁ గలసమవృత్తములు పదు
నాఱు పుట్టె. నం దేడవ దగు

బింబ యనువృత్తము (భీమనచ్ఛందమున)

"పంబి భకా
రంబు గళా
రం బనఁగా
బింబ మగున్.”

100

వ.

అంద 2వ దగు

సుకాంతియనువృత్తము (భీమనచ్ఛందమున)

“జకారమున్
గకారమున్
సుకాంతి కొ
ప్పకుండునే"
జ. గ.

101


వ.

ఐదవసుప్రతిష్ఠాచ్చందంబున నైదక్షరములు పాదములఁ గలసమవృత్తంబులు 32
పుట్టె. నందు 16వ దగు

వలమురి యనువృత్తము

“నలగ పదం
బలవడఁగా
వలమురియౌ
జలదనిభా”
న. లగ.

102


వ.

అంద 7వ దగు

సుందరీవృత్తము (భీమనచ్ఛందమున)

“చెంది భకారం
బొంది గగంబుల్
సుందరి యన్ బే
రందురు సూరుల్".
భ. గగ.

103


వ.

ఆఱవ గాయత్రీచ్ఛందంబునం దాఱక్షరములు పాదములఁ గలసమవృత్తంబులు
64 పుట్టె. నందు 16వదగు

విజయశుభ మనువృత్తము (సులక్షణసారమున)

“నయగుణవృత్తిన్
నయచరణాప్తిన్
జయశుభవృత్తం
బె యగు మురారీ!”
న. య.

104


వ.

అంద 28వ దగు

కిసలయ మనువృత్తము

“సస లింపొసఁగన్
వసుధన్ బద మై
కిసలం బెసఁగున్
వసుదేవనుతా!"
స. స.

105

వ.

ఏడవయుష్ణిశ్ఛందంబున నేడక్షరములు పాదములఁ గలసమవృత్తంబులు 128
పుట్టె. నందు 32వదగు

ప్రసవపర మనువృత్తము (సులక్షణసారమున)

"ఎసఁగఁ బదమందున్
నసగములు చెందన్
బ్రసవశర మయ్యెన్
బీసరుహదళాక్షా!”
న. సగ.

106


వ.

ఎనిమిదవయనుష్టుప్ఛందంబున నెనిమిదక్షరంబులు పదంబులం గలసమవృత్తంబులు
256 పుట్టె. నందు మొదటిదగు

విద్యున్మాలావృత్తము

“దేవా మాగాప్తిన్ విద్యున్మా
లావృత్తం బౌ రంగాధీశా!"
మ. మ. గగ.

107


వ.

అంద 55వ దగు

చిత్రపదం బనువృత్తము

"రాగిలుఁ జిత్రపదం బై
భాగయుగాప్తత రంగా!”
భ. భ. గగ.

108


వ.

అంద 86వ దగు

ప్రమాణి యనువృత్తము

"ప్రమాణికిం జర ల్తుదన్
వ మొప్పు రంగపార్థివా!”
జ.ర. వగణము.

109


వ.

తొమ్మిదవ బృహతీచ్ఛందంబునఁ దొమ్మిదక్షరంబులు పాదంబులఁ గల సమవృత్తం
బులు 512 పుట్టె. నందు 183వ దగు

నుత్సుక మనువృత్తము

“అంగుగ నుత్సుక మై చనున్
రంగనృపా భభరంబులన్.”
భ. భ. ర.

110


వ.

అంద 184వ దగు.

కిశోర మనువృత్తము

“సునభరాప్తి కిశోర మిం
పెనయు రంగమహీపతీ!
న. భ. ర.

111


వ.

పదవపంక్తిచ్ఛందంబున పదియక్షరంబులు పాదంబులం గల 1024 సమవృత్తం
బులు పుట్టె, నందు నేఁబదైదవదగు

కోమల మనువృత్తము

“భామగురు ప్రతిభన్ బెంపొందున్
గోమలవృత్త మనన్ రంగేంద్రా.”
భ. భ. మ. గ.

112


వ.

అంద 199వ దగు

వాగ్మి యనువృత్తము

“వారక యొప్పున్ వాగ్మికి భంబున్
ధారుణి రంగేంద్రా మసగంబుల్."
భ. మ. స. గ.

113


వ.

అంద 345వ దగు

శుద్ధవరాటి యనువృత్తము

“రంగచ్ఛుద్ధవరాటికిన్ మసల్
రంగోర్వీప వరా జగంబగున్.”
మ. స. జ. గ.

114


వ.

పదునొకండవత్రిష్టుప్ఛందంబునఁ బదునొకొండక్షరంబులు పాదంబులం గలిగిన
సమవృత్తంబులు 2048 పుట్టె. నందు 357వ దగు

నింద్రవజ్రావృత్తము

"ఆనందరంగేంద్ర మహానుభావా
తానుంద్రవజ్రం బగు దాజగాప్తిన్.”
త. త. జ. గగ.

115


వ.

అంద 358వ దగు

నుపజాతి (నుపేంద్రవజ్రా)వృత్తము

“జత ల్జగల్గం బుపజాతి కొప్పున్
రతీశతుల్యాకృతి! రంగభూపా!
జ. త. జ. గగ.

116


వ.

అంద 439వ దగు

తోట(దోద)క మనువృత్తము

“జ్ఞావన భత్రయగాప్తిని రంగో
ర్వీవర తోటకవృత్తము మీఱున్."
భ. భ. భ. గగ.

117


వ.

అంద 388వ దగు

నుపేంద్రవజ్ర యనువృత్తము

"ఉపేంద్రవజ్రం బొనరు సిరంగా
ధిపా! జతల్జద్విగురు ల్చెలంగున్.”
జ. త. జ. గగ.

118


వ.

అంద 443 వ దగు

స్వాగత మనువృత్తము

“స్వాగతంబు రనభ ల్లగ యుక్తిన్
రాగిలున్ విజయరంగమహీషా!"
ర. న. భ. గగ.

119

వ.

అంద 817వ దగు

వాతోర్మి యనువృత్తము

“దాసత్రాతా మభతంబుల్" లగ మై
భాసిల్లున్ రంగప వాతోర్మి కిలన్."
మ. భ. త. లగ.

120


వ.

పండ్రెండవజగతీచ్చందంబునఁ బండ్రెండక్షరంబులు పాదంబులం గలసమవృత్తం
బులు 4096 పుట్టె నందు 880వ దగు

కలరవ మనువృత్తము

“కలరవవృత్తము గాంచు నజాయల్
బలయుత రంగనృపాలకచంద్రా!”
న. జ. జ. య.

121


వ.

అంద 1756వ దగు

తోటక మనువృత్తము

“ససలున్ ససలున్ వరుసం గదియన్
రసఁ దోటకమై తగు రంగనృపా!"
స. స. స. స.

122


వ.

అంద 1171వ దగు

స్రగ్విణీ యను వృత్తము

"సారె భూభృద్యతిన్ స్రగ్విణీవృత్త మా
రారరల్ గూడినన్ రంగరాయాగ్రణీ!”
ర. ర. ర. ర.

123


వ.

అంద 586వ దగు

భుజంగప్రయాత మనువృత్తము

"యయల్ భుజంగప్రయాతాన కిమ్మౌ
నయా నాగవిశ్రాంతి నానందరంగా!"
య. య. య. య.

124


వ.

అంద 1381వ దగు

నింద్రవంశ మనువృత్తము

“తా నింద్రవంశం బగుఁ దాజరాప్తిచే
నానందరంగా! వడి! యామవైఖరిన్."
త. త. జ. ర.

125


వ.

అంద 1382వ దగు

వంశస్థ మనువృత్తము

“సనీతి వంశస్థ మగున్ జతల్జరల్
పెనంగ రంగోర్విప! షడ్విరామతన్.”
జ. త. జ. ర.

126

వ.

అంద 1464వ దగు

ద్రుతవిలంబిత వృత్తము

"ద్రుతవిలంబిత రూఢిని రంగభూ
పతి! మరుద్యతిఁ జర్వు నభారలన్.”
న. భ. భ. ర.

127


వ.

అంద 880వ దగు

తోధకవృత్తము

"ద్విపయతిఁ దోధకవృత్తము రంగా
ధిపతి నజాయలఁ దేజముఁ జెందున్.”
న. జ. జ. య.

128


వ.

అంద 241వ దగు

జలధరమాలావృత్తము

“మారమ్యాస్యా జలధరమాలావృత్తం
బౌ రంగేంద్రా! మభసమ లందంబైనన్.”
మ. భ. స. మ.

129


వ.

పదుమూఁడవదగు నతిజగతిచ్ఛందంబునందుఁ బదుమూఁడక్షరంబులు పాదంబులం
గలసమవృత్తంబులు 8192 పుట్టె. నందు 3520వ దగు

బంభరగాన మనువృత్తము

"ప్రజితవిమత బంధరగాన మగున్
గజయతి ననభాగల రంగనృపా!
న. న. భ. భ. గ.

130


వ.

అంద 4048వ దగు

లతావృత్తము

“సతవడి రంగేశ్వర నయననగో
న్నతిని లతావృత్తము చెలువమరున్.”
న. య. న. న. గ.

131


వ.

అంద 2769వ దగు

మంజుభాషిణి యనువృత్తము

"చను మంజుభాషిణి సజల్సజప్రగా
ప్తిని రంగధీర! నవవిశ్ర మోన్నతిన్.”
స. జ. స. జ. గ.

132


వ.

పదునాల్గవశక్వరీచ్ఛందంబునందు పదునాలుగక్షరంబులు పాదంబులం గలసమ
వృత్తంబులు 16384 పుట్టె. నందు 4069వ దగు

సురుచిర మనువృత్తము

"యతి నిధి దుగనన లమరిన రంగ
క్షితిపతిమణి సురుచిర మగు గాప్తిన్.”
న. న. న. న. గగ.

133

వ.

అందు 2933వ దగు

వసంతతిలకావృత్తము

"ధీతత్పరా వసుయతిన్ తభజాగగప్ర
ఖ్యాతిన్ వసంతతిలకం బగు రంగధీరా!”
త. భ. జ. జ. గగము.

134


వ.

అంద 3823వ దగు

వనమయూర మనువృత్తము

“ఆవనమయూరమున కా భజసనల్గా
ప్రావిరళరత్నయతి రంగమహిపాలా!"
భ. జ. స. న. గగ.

135


వ.

అంద 8128వ దగు

ప్రహరణకలిత మనువృత్తము

"బలుననభనవల్ ప్రహరణవిలస
త్కలితకుఁ దగు రంగనృప వసుయతిన్."
న. న. భ. న. వ.

136


వ.

పదునైదవ యతిశక్వరీచ్ఛందంబునఁ బదునైదక్షరంబులు పాదంబులం గల
వృత్తంబులు 32768 పుట్టె నందు 15788వ దగు

గజరాజ మనువృత్తము

“సజభా సలష్ట విశ్రమ రీతిఁ దనరినన్
గజరాజ మౌను రంగనృపాల వసుమతిన్.”
స. జ. భ. భ. స.

137


వ.

అందు 4672వ దగు

మాలినీవృత్తము

“నపవిరమణ యుక్తిన్ నామయాసంగతం బై
యవనిఁ దగును మాలిన్యాఖ్యచే రంగధీరా!”
న, న, మ, య. య.

138


వ.

అంద 16384వ దగు

మణిగణనికర మనువృత్తము

“ననలను ననసల నవయతిఁ దగి రం
గనృపతిమణి మణిగణనికరము నౌ.”
న. న. న. న.స.

139


వ.

అంద 10923వ దగు

సుగంధి యనువృత్తము

"ఖండవిశ్రమంబునన్ సుగంధి యొప్పి మిన్నగా
నుండు నారజల్ రజల్ రయుక్తి రంగధీమణీ!”
ర. జ. ర. జ. ర.

140

వ.

అంద 15360వ దగు

లలితగతి యనువృత్తము

“నలిని బదునొకటి యతి నానజసలున్
లలితగతి కలరు నిల రంగనృపతీ!”
న. న. న. జ. స.

141


వ.

పదునాఱవయష్టిచ్ఛందంబునఁ బదునాఱక్షరంబులు పాదంబులంగల 65536
సమవృత్తంబులు పుట్టె నందు 21848వ దగు

చంద్రభాను వనువృత్తము

“నరజరల్ జగల్ గదించినం దిశావిరామ మై
యరయఁ జంద్రభానువృత్త మౌను రంగభూవరా!”
న. ర. జ. ర. జ. గ.

142


వ.

అంద 21846వ దగు

పంచచామర మనువృత్తము

"క్రమంబునం, జరల్జరల్జగంబు గల్గి పంక్తివి
శ్రమాప్తిఁ బొల్చుఁ బంచచామరంబు రంగధీమణీ!”
జ. ర. జ. ర. జగ

143


వ.

అంద 13264వ దగు

ప్రియకాంత యనువృత్తము

"నయనయసల్గం బలవడినంతన్ బ్రియకాంతా
హ్వయ మగు నేకాదశయతి యై రంగమహీశా!”
న. య. న. య. స. గ.

144


వ.

పదునేడవ యత్యష్టిచ్ఛందంబునందుఁ బదునేడక్షరంబులు పాదంబులఁ గల సమ
వృత్తంబులు 131072 పుట్టె నందు 38750వ దగు

పృథ్వీవృత్తము

“జసల్జసయవంబుతోను జలజాప్తవిశ్రామతన్
బొసంగు నిలఁ బృథ్వివృత్తము సుభోగరంగాధిపా!"
జ. స.జ. స. య. వ.

145


వ.

అంద 59338వ దగు

శిఖరిణి యనువృత్తము

"యశోభూషాయొప్పున్ యమనసభవప్రాప్తినిద్రయో
దశోద్యద్విశ్రాంతిన్ శిఖరిణి లసద్రంగనృపతీ!”
య. మ. న. స. భ. వ.

146


వ.

అంద 18929వ దగు

మందాక్రాంత యనువృత్తము

“సంతుష్టాత్మా మభనతతగా సమ్మతిం ధాత్రి మందా
క్రాంతం బయ్యెన్ బదునొకయతిన్ రంగభూపాలవర్యా!"
మ. భ. న. త. త. గ. గ.

147

వ.

అంద 32768వ దగు

త్వరితపదగతి యనువృత్తము

“అయిదునగణములు గగ మమితగుణ రంగేం
ద్ర యతిపదునొకటఁ ద్వరితపదగతి కొప్పున్.”
న. న. న. న. న. గగ.

148


వ.

పదునెనిమిదవ దగుధృతి యనుఛందంబునఁ బదునెనిమిదియక్షరంబులు పాదం
బులం గల సమవృత్తంబులు 262144 పుట్టె నందు 125912వ దగు

దేవరాజ మనువృత్తము

"క్షితి నరల్ నజల్ భసలును జెన్నుగా నభవయతి
స్థితియు దేవరాజమునకుఁ జెల్లు రంగనరపతీ!”
న. ర. న. జ. భ. స.

149


వ.

అంద 93019వ దగు

మత్తకోకిల యనువృత్తము

"సత్తయౌ రసజాభరల్ భవసంఖ్య విశ్రమ మొప్పినన్
మత్తకోకిలవృత్త మౌ నసమానరంగనృపాలకా!"
ర. స. జ. జ. భ. ర.

150


వ.

అంద 37857వ దగు

కుసుమితలతావేల్లిత యనువృత్తము

"శ్రీరంగోర్వీశా మతనయయయల్ చెంది విశ్రాంతియున్తా వే
ర్వేఱన్ మిత్రాప్తిన్ గుసుమితలతావేల్లితావృత్త మయ్యెన్.”
మ. త. న. య. య. య.

151


వ.

పందొమ్మిదవ యతిధృతిచ్ఛందంబునందుఁ బందొమ్మిదక్షరంబులు పాదంబులం గల
సమవృత్తంబులు 524288 పుట్టె నందు149337వ దగు

శార్దూలవిక్రీడిత యనువృత్తము

“సారంబౌ మసజల్సతాగురువులున్ శార్దూలవిక్రీడితం
బారూఢిం బదుమూటఁ గల్గుయతిచే నానందరంగాధిపా!”
మ. స. జ. స. త. త. గ.

152


వ.

అంద 186039వ దగు

భూతిలక మనువృత్తము

"సారెకు భారసజాగముల్ మది సారసాప్తవిరామమున్
జేరిన భూతిలకం బగున్ నుతశీల రంగనృపాలకా!”
భ. భ. ర. స. జ. జ. గ.

153

వ.

అంద 186040వ దగు

తరళ యనువృత్తము

“తరళ కౌ నభరల్సజాగయుతంబుగా నినవిశ్రమ
స్ఫురణ రంగనృపాలశేఖర భూరిదానగుణాకరా”
న.భ.ర.స. జ. జ. గ.

154


వ.

ఇరువదవ దగుకృతిచ్ఛందంబునం దిరువదక్షరంబులు పాదంబులం గలసమవృత్తం
బులు 1048576 పుట్టె నందు 522176వ దగు

కలిత యనువృత్తము

“నసభసననవంబుల నలినాప్తవిరమణము రస
ప్రణుత కలితవృత్త మరు రంగమనుజపతీమణీ
న. న.భ. స. న. న. వ.

155


వ.

అంద 298676వ దగు

మత్తేభవిక్రీడితావృత్తము

“నలువొందన్ సభరల్ నమ ల్యవలతోనం గూడి మత్తేభ మిం
పలరారున్ బదునాలుగౌవిరతిచే నానందరంగాధిపా!
స. భ. ర. న. మ. య. వ.

156


వ.

అంద 355799వ దగు

నుత్పలమాలికావృత్తము

"పన్ని పదౌయతిన్ భరనభారవసంజ్ఞగణాళిఁ గూడి య
త్యున్నతవృత్తితో వెలయు నుత్పలమాలిక రంగధీమణీ!”
భ. ర. న. భ. భ. ర.వ.

157


వ.

అంద 372216వ దగు

భుజగ మనువృత్తము

“మును నభల్ నభరసవముల్ పదుమూఁట విశ్రమ మొప్పినన్
ఘనవజారతవిజయరంగశిఖామణీ భుజగం బగున్."
న. భ. న. భ. ర. స. వ

158


వ.

అంద 372151వ దగు

నంబురుహ మనువృ త్తము

"నాలుగుభంబులపై రసవంబులు నల్వు గాఁ బదుమూఁట నిం
పోలి విరామము లంబురుహంబున కొప్పు రంగమహీపతీ!”
భ. భ. భ. భ. ర. స.వ.

159


వ.

ఇరువదియొకటవ దగుప్రకృతిచ్ఛందంబునం దిరువదియొకండక్షరంబులు పాదం
బులం గలసమవృత్తంబులు 2097152 పుట్టె నందు 386104వ దగు

సురభూజరాజ మనువృత్తము

“రవియతిన్ సురభూజరాజము ప్రబలు నభరననారలన్
తవిలి రంగమహీతలాధిప! దళితవినుతనృపాలకా!”
న. భ. ర. న. న. న. ర.

160


వ.

అంద 711600వ దగు

చంపకమాలిక అనువృత్తము

"సలలితరీతితో నజభజాజరసంజ్ఞగణాళిఁ జంపకం
బలవడ రుద్రవిశ్రమసమంచిత మై తగు రంగభూవరా!”
న. జ. భ. జ. జ. జ. ర.

161


వ.

అంద 302993వ దగు

స్రగ్ధర యనువృత్తము

"సారె నాగాధిరాట్పంచదశవిరమతన్ స్రగ్ధరావృత్త మౌఁ గాం
తారాజీవాస్త్ర యుద్యన్మరభనయయయోద్భాసియై రంగభూపా"
మ. ర. భ. న. య. య. య.

162


వ.

అంద 744304వ దగు

వనమంజరి యనువృత్తము

“నగణముపై జజజాభరలున్ పదునాల్గిట విరమంబునున్
దగి చెలఁగున్ వనమంజరివృత్తము ధాత్రి రంగనృపాలకా”
న. జ. జ. జ. జ. భ. ర.

163


వ.

ఇరువదిరెండవ దగు నాకృతిచ్ఛందంబునం దిరువదిరెండక్షరంబులు పాదంబులం
గలవృత్తంబులు 4194304 పుట్టె నందు 1797559వ దగు

మానిని యనువృత్తము

"ఏడిటవళ్లు మహిన్ బదుమూఁడిట యెక్కము తక్కువ యిర్వదిటన్
కూడిన మానిని కొప్పును శైలభగుర్వులు రంగప! గూఢముగాన్.”
భ. భ. భ. భ. భ. భ. భ. గురు.

164


వ.

అంద 2097152వ దగు

కనకలతిక యనువృత్తము

“దనర నినుల కవలివడి సతనగణములు గురువు రం
గనృపతిమణి వితరణగుణి కనకలతికకును దగున్."
న. న. న. న న. న. న. గ.

165

వ.

అంద 605988వ దగు

మహాస్రగ్ధర యనువృత్తము

“రహి ఖండగ్లౌకళావిశ్రమములను మహాస్రగ్ధరావృత్త మౌ శ్రీ
సహితౌదార్యా సతానల్ సరరగురువు లుంచంగ శ్రీరంగభూపా!"
స. త. త. న. స. ర. ర. గ.

166


వ.

అంద 14909444వ దగు

తురగ మనువృత్తము

“ఇలను దురగము నెనిమిదిటఁ బదునేనిటన్ యతు లొప్పఁగా
నలరు నలువగణములు సజజగలంది రంగమహీపతీ!"
న. న. న. న. స. జ. జ. గ.

167


వ.

ఇరువదిమూఁడవవికృతిచ్ఛందంబునం దిరువదిమూఁడక్షరంబులు పాదంబులఁ గల
వృత్తంబులు 8388608 పుట్టె నందు 4193784వ దగు

కుసుమ మనువృత్తము

“నభనభ ల్తిగనగణము ల్వగణయుతమయి చెలు వలరినన్
విభుఁడు రంగనృపతి! త్రయోదశవిరతి వసుమతిఁ గుసుమమౌ."
న. భ. న. భ. న. న. న. స.

168


వ.

అంద 3595120వ దగు

కవిరాజవిరాజిత మనువృత్తము

“నగణము షడ్జగణంబులపై నగణంబుఁ ద్రయోదశవిశ్రమమున్
దగఁ గవిరాజవిరాజితవృత్త మనంజను రంగనృపాలమణీ!”
న. జ. జ. జ. జ. జ. జ. వ.

169


వ.

ఇరువదినాల్గవ దగుసంకృతిచ్ఛందంబునం దిరువదినాలుగక్షరంబులు పాదంబులం
గలసమవృత్తంబులు 16777216 పుట్టె నందు 4193479వ దగు

పంచశర మనువృత్తము

"మించినరుద్రప్రౌఢిని బందొమ్మిదిటను యతి తగి మెఱసినయంతన్
బంచశరం బౌ రంగనృపాల ప్రభుతిలక! భమసభనననయాప్తిన్.”
భ. మ. స. భ. న. న. న. య.

170

వ.

అంద 4193380వ దగు

శృంగార మనువృత్తము

"మృడవిశ్రామం బవలన్ బందొమ్మిదిటను యతి తగి మెఱసినయంతన్
గడు శృంగారాఖ్యఁ జెలంగున్ రంగనృపతి! సతయభనననయయుక్తిన్”
స. త. య. భ, న, వ.స. య.

171


వ.

ఇరువదియైదవ దగు నతికృతిచ్ఛందంబునం దిరువదియైదక్షరంబులు పాదం
బులం గల సమవృత్తంబులు 33554432 పుట్టె నందు 16776601వ దగు

వనరుహ మనువృత్తము

“రుద్రప్రౌఢిని బందొమ్మిదిటన్ రుజు లగుయుతు లొనరుట వనరుహ మై
భద్రశ్రీయుత! రంగాధిపతీ! పరగులిపుల మసభభననననగల్.”
మ. స. భ. భ. న. న. న. న. గ.

172


వ.

అంద 4179904వ దగు

సురుచి యనువృత్తము

“వసుమనువుల నిర్వదియొకటన్ జెల్వై విరమణములు వఱలం బాగో
నసమసురుచి శ్రీహరిసమ రంగేంద్రా! ననభసతననయగప్రాప్తిన్."
న. న. భ. స. త. న. న. య. గ.

173


వ.

అంద 16644511వ దగు

విజయ మనువృత్తము

“భానులఁ బదియుం దొమ్మిదిటన్ జొప్పడి విరతులు నేర్పడ విజయ మగున్
సైనికయుతరంగాధిససల్లాణసుభసభతనల్ సననగములతోన్.”
భ. స. భ. త. న. స. న. న. గ.

174


వ.

అంద 8381311వ దగు

భాస్కరవిలసిత మనువృత్తము

“మానితసుగుణ త్రయోదశవిశ్రామంబును భవజయభవనసగాప్తిన్
భానుసదృశరుచిరంగనృపాలా భాస్కరవిలసిత మగు నిలలోనన్.”
భ. న, జ. య. భ. న. న. స. గ.

175

వ.

అంద 15658735వది యగు

చారుమతి యనువృత్తము

“చారుమతి యొప్పును భజల్ సనభజల్ సనగ
              సంగతి కవీంద్రవినుతా!
సారెకుఁ ద్రయోదశకసప్తదళసద్యతి ల
              సద్గతిని రంగనృపతీ!
భ. జ. స. న. భ. జ. స. న. గ.

176


వ.

ఇరువదియాఱవ దగు నుత్కృతిచ్ఛందంబునం దిరువదియాఱక్షరంబులు పాదం
బులం గల సమవృత్తంబులు 67108864 పుట్టె నందు 15658735 వ
దగు

మంగళమహాశ్రీ యనువృత్తము

“సత్తుగనురత్నముల సప్తదశమంబునను
              సద్యతులు మంగళమహాశ్రీ
వృత్తమున కౌ భజసవృత్తినభజల్సనల
              పై గురులు రంగనృపధీరా!”
భ. జ. స. న. భ. జ. స. న. గ. గ.

177


ఇవ్విధంబున నుక్తాదియిరువదియాఱుచ్ఛందంబుల నుద్భవిల్లినవృత్తంబులందు నూతనపురాతనవృత్తంబులు కొన్ని పూర్వకనిప్రయోగసరణి వివరించినాఁడ, నింక నం దుద్ధరమాలావృత్తంబులు స్వస్థానపరస్థానవృత్తంబులు మొదలుగాఁ గలవృత్తభేదంబులు వివరించెద.


క.

ధర రంగధీమణీ! యీ, యిరువదియాఱక్షరముల కెక్కుడు లై యు
ద్ధరమాలావృత్తమ లని, పరగు లయగ్రాహి లయవిభాతియుఁ గృతులన్.

178
లయగ్రాహివృత్తము

“ఎమ్మె వెలయన్ భజసనమ్ములు మఱిన్ భజస
              నమ్ములపయిన్ భయగణమ్ములు అయగ్రా
హి మ్మెఱయు రంగనృప! యిమ్మహిని బ్రాసయతు
              ల మ్మెఱసి నాల్గుచరణమ్ములను వేడ్కన్."
భ. జ. స. న. భ. జ. స. న. భ. య.

179
లయవిభాతి

“నగణము సనమ్ములును నగణము సనమ్ములును
              నగణము సనమ్ములును నగణము సగంబుల్
జగతిఁ గృతులందు వెలయఁగ లయవిభాతి యనఁ
              దగు విజయరంగనృప! యగణితగుణాఢ్యా!"
న. స. న. న. స. న. న. స. న, న. స. గ.

180


వ.

మఱియు లయవిహారి, తరువోజ, త్రిభంగి మొదలగునవియు, బహువిధోపరివృత్తం
బులుం గలవు. వెండియు దండకవృత్తంబులు దశవిధంబులుగల వవి చండవృష్టి,
ఆశ్వ, అర్హవ, వ్యాళ, జీమూత, లీలాకర, ఉద్దామ, శంఖ, తగణ, యగణ దం
డంబులు ప్రశస్తంబులై విస్తరిల్లు నందు మొదటి చండవృష్టిదండకంబునకు 27
అక్షరంబు లొప్పు నది యెట్టులనిన.


“నగణయుగముమీఁద రేఫావళుల్ మౌనిసం
ఖ్యన్ దగన్ జండవృష్ట్యా మహిన్ భూధవా!
న.న.ర.ర.ర.ర.ర.ర.ర.

181


క్రమంబున [4]నశ్వాదిదండకములకు నొక్కొక్కరగణ మెక్కువగా నొప్పుచుండును.

భీమనచ్ఛందంబున

అమరఁగ ననహంబు లందాదిగా నొండె కాదేని నాదిం దకారంబుగా నొం
డెలోనం దశారంబు లిమ్మైఁ గకారావసానంబుగాఁ జెప్పిన దండకం బండ్రు
దీనిం గవీంద్రుల్ జగద్గీతకీర్తీ! పురారాతిమూర్తీ! సదాచారవర్తీ! వణిగ్వంశచూ
డామణీ ! బంధుచింతామణీ! రేచనా! కావ్యసంసూచనా! దానవైరోచనా!”

182


అని యున్నది గనుకఁ బురాతనకవులు తగణప్రధానముగానే దండకములు రచియించినారు గనుక నాలాగునను జెప్పవచ్చును.

రగడలు

   రగడలు తొమ్మిదివిధములు. హయప్రచారము, తురగవల్గనము, విజయమంగళము,
ద్విరదగతి, విజయభద్ర, మధురగతి, హరిగతి, హరిణగతి, వృషభగతి అని. అందు
హరిగతి యనురగడకు ఆటతాళము; హయ ప్రచారము, తురగవల్గనము, విజయ
మంగళము వీనికి రూపకతాళము; మధురగతి యనురగడకు నేకతాళము; ద్విరదగతి,

విజయభద్ర వీనికి జంపెతాళము; హరిణగతి, వృషభగతులకుఁ ద్రిపుట తాళము.
ఇట్లు నవవిధంబు లైనరగడలు తాళభేదంబులు జెలఁగుచు నుదాహరణంబులకు
నాకరంబై యుండు. ఆయుదాహరణములు వీరావళి మొదలయినవి పెక్కులు గలవు.

      భీమన గారు సప్తవిభక్తులు సంబోధనతోఁగూడ నెనిమిదివిభక్తులకు వరుసగాఁ
గృతినాయకాంకితపద్యంబులు రచియించి రగడల పాళిగా 8 దళంబులతోఁ గద
ళిక యనన్ వివరించి యందు సగం బుత్కళికగా నేర్పరిచి యేడేసిపదమ్ము లేక
సమాసరీతి విభక్త్యర్ధము లుండఁజెప్పి వానికి సరిగా నెనిమిదవదళంబుఁ గూర్చి
కడను బద్యం బొకటి సర్వవిభక్త్యర్థకంబుగాఁ జెప్పవలయుననియు నట్లు కాదేని
యన్నియుత్కళికలకు విభక్త్యాభాసంబుగాఁ జెప్పి షష్ఠ్యుత్కళికకేనియుఁ జతు
ర్థోత్కళికకేనియుఁ బొసఁగునట్లు రచియింపవలయునని చెప్పినారు. ఈవిభక్తుల
కధిదేవతలు, ప్రథమకు వీరావళి; ద్వితీయకుఁ గీర్తిమతి; తృతీయకు సుభగ; చతుర్థికి
భోగమాలిని; పంచమికిఁ గళావతి; షష్ఠికి గాంతిమతి; సప్తమికిఁ గమల; సంబో
ధనకు జయసతి. అను నీపేరులు గలుగఁ జెప్పినఁ దద్దేవతలు సకలశుభంబు
లొసంగుదురు. ఇవ్విధంబునం బలుక నది యుదాహరణం బనందగును.

    మఱియు ననంతనపథ్యార్య, విపులార్య, చపలార్య, ముఖచపలార్య, జఘనచప
భార్య అని యైదువిధంబుల యార్యావృత్తంబులును; మహాక్కర,మధ్యాక్కర, మ
ధురాక్కర, అల్పాక్కర, అంతరాక్కర ఆనియక్కరజాతివృత్తంబులు 5 తెఱం
గులును; గద్య, బిరుదుగద్య, చూర్ణిక, వచనము, విన్నపములు నని 5 విధములు
గద్యలును, ఆటవెలఁది, తేటగీతి, పవడగీతి, మలయగీతి, ఉపగీతి, ఉద్గీతి, యార్యా
గీతి యని 7 విధంబులగీతంబులును; వృత్తప్రాససీసము, సర్వతఃప్రాససీసము, అర్థ
సమసీసము, అవకలిసమసీసము, అవకలివడిసీసము, అవకలిప్రాససీసము, సర్వలఘు
సీసము, ఉత్సాహవేదండసీసము, విషమసీసము, సమనామప్రాససీసము, గీతరహి
తచతుష్ప్రాససీసము, సర్వవడిసీసము అని 12 విధముల సీసపద్యములును; సమకం
దము, విషమకందము, ఆర్యాకందము, కురుచకందము, నిడుదకందము, ద్వివిధ
కందము, చతుర్విధకందము, వృత్తగర్భితకందము, శ్రమితాక్షరకందము నన 9
విధంబులకందపద్యములును; పంచరత్నంబులు, దిగ్గజంబులు, నవరత్నంబులు, కళా
వళి, తారావళి, విద్యావళి, శతకము, వృత్తమాలిక, కందమాలిక, సీసమాలిక,
యక్షగానము, నాటకము, కీర్తనలును, పదములు, సూళాదితాళకొ(క)ట్నములు,
ధవళములు, శోభనములు, ఉరుటణులు, ఆరతిపాటలు, జోలలు, అష్టకములు,
ఏలలు, గొబ్బిళ్లు, చందమామపదములు మొదలుగాఁగల బహువిధగతుల నతుల
ప్రభావంబుల గంగాప్రవాహంబులై విస్తరిల్లు. మఱియుఁ బద్యభ్రమక, పాదభ్ర

మక, సౌగంధిక, కుసుమమంజరీగర్భితోత్పలమాలికా, కందగీతగర్భితచంపకమా
లికా, వృత్తకందగర్భితసీస, మంగళమహా శరీ, వనమయూరగర్భితలయగ్రాహి,
కందద్వయగర్భితక్రౌంచపద, గీతగర్భితవృత్తాదులును; చలజిహ్వ, అచలజిహ్వ,
ఓష్ఠ్యము, నిరోష్ఠ్యము, ఉత్వకందవృత్తములు, ఇత్వకందములు, అత్వకంద
ములు, పాదగోపనంబులు, గుణితరీతులు, తురగ, శంఖ, డిండిమ, మండూక,
చక్రవాళములును; త్రిపాదసంఘట్టనంబులును; శంఖబంధ, చక్రబంధ, ఖడ్గబంధ,
శార్ఙబంధ, గదాబంధ, పద్మబంధ, ఛత్రబంధ, చామరబంధ, శూలబంధ, దళా
వరణచక్రబంధ, కులాలచక్రబంధ, మణిమాలికాబంధ, పుష్పగుచ్ఛబంధ, పుష్ప
మాలికాబంధ, చతురంగబంధ, డమరుబంధాదిచిత్రకవిత్వనానావిధబంధనిబంధ
నంబులును; త్రిపాదసమస్యాపూర్తి విషసమస్యాపూర్తులు మొదలుగాఁ గల ప్ర
యాసబంధంబు లనేకంబులు గలిగి, ఆశు చిత్ర మధుర విస్తారంబు లనుచతుర్విధ
కవితాచాతురీమహిమంబులు విస్తరిల్లియున్నయవి. కావున నిట్టికవిత్వంబునందుఁ
బదవాక్యాదిదోషంబులు పెక్కులు గల వవి యెట్టులనిన:

183


సీ.

పునరుక్తి గ్రామ్యంబు ప్రోవ విసంధి సంశయము హీనోపమ చతురుప్రాస
భంగంబు విశ్రమభంగంబు ప్రక్రమభంగంబు ఛందోభంగము నతి
మాత్రయు న్యూనోపమయు భిన్నలింగంబు వ్యర్థంబు పరమగూఢార్థసరణి
యమరఁ గ్లిష్టార్థ మనన్యప్రయోగంబు లాది యౌనష్టాదశాతిదోష


తే.

ములను వర్ణించి కృతిపతికులముతారఁ
గని శుభగణంబు తద్యామమునను మొదట
నిలుపునెడ సమముఖవర్ణములును బీజి
యుక్తముగఁ జూచి కృతి పూన్ప నొదవు శుభము.

184


వ.

కావునఁ గవీంద్రు లగువార లిన్ని తెఱంగుల విమర్శించి కృతులు రచియించిరేని
యవి యుత్తమకావ్యంబు లనంబరగుఁ గావున నేను గవితాలక్షణప్రకరణంబు
లన్నియు టీకామూలంబును లక్ష్మణలక్ష్యయుక్తంబునుగాఁ దేటపఱచుటంజేసి సుక
వు లైనవారు తప్పొప్పు లారసి క్షమించి యీ యానందరంగచ్ఛందంబు నాచం
ద్రార్కంబుగా వర్ధిల్లునట్టు అనుగ్రహింపఁదగిన దని వేఁడుకొనియెద.

185


మత్తకోకిల.

సాధుపోషణ దుష్టభీషణ సత్యభాషణభూషణా
యోధనాయక ధీరగాయక యూధగేయక సాయకా

బోధబంధుర ధీయుగంధర భూధురంధరసింధురా
సాధునిగ్రహ భీమవిగ్రహ శాత్రవాగ్రహనిగ్రహా!

186


మ.

హరిసద్విక్రమచంద్రచేలవిధుభక్తాగ్రేసరా యబ్జసుం
దరపాణిద్వయసోమభూతియుతసన్నాధాసు(ను)జైవాతృకా
యరిహారాజకళానిధీ కుముదమిత్రాగోమదీశాన్వయా
హరిణాంకస్ఫుటబింబసన్నిభముఖా యానందరంగాధిపా!

187


క.

ఘననందసంతతిపయో, వననిధిరాకాశశాంకవాసవవిభవా
వనితాజనతానూతన, మనసిజయానందరంగమహిపతిచంద్రా!

188


గద్యము.

ఇది శ్రీమదుమామహేశ్వర కరుణాకటాక్షలబ్ధసాహితీవిభవ ధర్మవెచ్చ
కులజలధికుముదమిత్ర వేంకటకృష్ణార్యపుత్త్ర శ్రీవత్సగోత్రపవిత్ర విద్వజ్జన
మిత్ర కుకవిజనతాలవిత్ర యార్వేలకమ్మనియోగికులీనలక్షణకవి కస్తురిరంగ నామ
ధేయప్రణీతం బైన యానందరంగఛ్ఛందం బను లక్షణచూడామణియందు సర్వం
బును జతుర్థాశ్వాసము.

ఆనందరంగరాట్ఛందము సంపూర్ణము.

  1. ఈపద్యము అనంతచ్ఛందస్సులో లేదు; కొన్ని ప్రతులలో ఇది ఎవరిదో చెప్పలేదు.
  2. మిన్నకుడిగి మగుడిపొమ్ము
  3. నున్మిష, న్నలిన.
  4. నార్తాది