ఆధునిక రాజ్యాంగ సంస్థలు/ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఏడవ ప్రకరణము.

శాసనసభ్యుడు.

ఈకాలమున ప్రాముఖ్యతవహించిన ప్రజాస్వామిక రాజ్యాంగములందు, రెండు శాసనసభలు కలవు. కాని వానిలో

ప్రజలు
పార్టీలు.

ప్రజాప్రతినిధిసభలకే, మంత్రివర్గముల నేర్పరచుటలోను, శాసననిర్మాణ మొనర్చుటలోను, బడ్జెట్టుల నామోదించుటలోను, ప్రాధాన్యత సంపాదితమగుచున్నది. కాని రెండుశాసనసభాసభ్యులకును, కొంతవరకు సమానమగు హక్కు బాధ్యతలు కలవు. ముందుగా వానిని విచారించి - పిమ్మట, ప్రముఖుడగు ప్రజాప్రతినిధిసభాసభ్యుని హక్కుబాధ్యతల ప్రత్యేకముగా వివరింప బ్రయత్నింతము.

శాసనసభాసభ్యు లెల్లరకు, తమతమ సభలందు, ప్రజాభిప్రాయమును వెలిపుచ్చుటకును, తమయభిప్రాయములనే తెల్పుటకును, ప్రభుత్వవ్యవహారముల తమకు తోచినరీతి విమర్శించుటకును, సంపూర్ణమగు హక్కుయుండు టగత్యము. మాననష్టమునకై, ఏప్రభుత్వోద్యోగియైన వ్యాజ్యము తెచ్చునేమోయను భయముండుచో, ఏశాసనసభాసభ్యుడైనను, ప్రభుత్వపుచర్యలను నిర్భీతమై విమర్శింపజాలడు. ప్రభుత్వవ్యవహారముల తీవ్రముగా విమర్శించినందులకై శిక్షాపాత్రులగుచో, అతడు మూగవాడగును. కాన శాసనసభలం దొసంగబడిన యుపన్యాసములందు వెలిపుచ్చబడిన విషయములం దెద్దానికైనను, ఏ సభ్యుడును శిక్షాపాత్రుడు కాగూడదు.

ప్రభుత్వ వ్యవహారముల నిర్వహించు నుద్యోగులలో నెవ్వరివలన నైనగాని, శాసనసభాసభ్యుడు ప్రభుత్వపు అపకార్యముల గురించి తగుసమాచారము తెలుసుకొని అతడా తప్పిదముల శాసనసభయందు ప్రకటించి, ప్రభుత్వమును నిరసించుటకు హక్కుకల్గియుండవలెను. తన కాభోగట్టా యిచ్చినవారెవ్వరో చెప్పవలసిన యావశ్యకత ఆయనకు ప్రభుత్వ మెప్పుడుకాని కల్గింపరాదు. కోర్టులందు ఆయనను తనభోగట్టాకు మూలపురుషుడగువానిపేరు తెలుపమని, సభ్యుని నిర్బంధింపరాదు. అట్లుకానిచో ఎప్పటికిని శాసన సభాసభ్యులకు, ప్రభుత్వోద్యోగులద్వారా ఏవిధమగు మంచిచెడ్డలు తెలియరావు.

శాసనసభలు సమావేశమై యుండునంతకాలము, ఏ శాసనసభాసభ్యుడును, అప్పటికప్పుడొనర్చిన హత్యానేరము రాజవిద్రోహకార్యము, మరియే యితర ఘోరకృత్యమునకు గాక, అదివర కెప్పుడో యొనర్చిన తప్పిదమునకై నిర్బంధింపబడరాదు. ఇట్టి స్వాతంత్ర్యము సభ్యునకు లేనిచో, తన కయిష్టులగు, తనతప్పిదముల బయల్వెట్టువారిని, ప్రభుత్వము నిర్బంధితులజేసి శాసనసభను పూర్తిగా లొంగదీసుకొన బ్రయత్నించును. మరియు, శాసనసభయందుండగా, ఏసభ్యునిగాని నిర్బంధితునిచేయుట ధర్మవిరుద్ధము. శాసనసభయొక్క ఆవరణయందు సభవారికే సంపూర్ణాధికారము చెందవలయును. పైన వివరింపబడిన ఘోరకృత్యాపరాధములకై ఏసభ్యుడైనను తనకు కావలయుచో, ప్రభుత్వము శాసనసభాధ్యక్షునికి తగు విన్నపము పంపుకొనవలయును. ఆవిన్నపమాలించి, తమసభ్యుని ప్రభుత్వమునకు వదిలివేయుటకు శాసనసభ వారంగీకరించిననే ఆసభ్యుని నిర్బంధించుటకు ప్రభుత్వమునకు హక్కు కలుగగలదు. ఈహక్కులను అప్పుడప్పుడు ఫ్రెంచిప్రభుత్వము గౌరవింపక, కమ్యునిష్టు, డెప్యూటీల నిర్బంధించుచుండుట విచారకరము. మనదేశమందును, బెంగాలు ప్రభుత్వము, శాసనసభాసభ్యులను విచారణ లేకయే నిర్బంధితుల జేయుచుండుటయు, పౌరసత్వపుహక్కులకు విరుద్ధము. శాసనసభాసభ్యుల హక్కులకు భంగకరము.

శాసనసభయందు చేయబడు యుపన్యాసముల కేరును శిక్షాపాత్రులు కాగూడదు. ఆయుపన్యాసములను వార్తాపత్రికలద్వారా కరపత్రములద్వారా ప్రకటించుటకు సర్వస్వాతంత్ర్య మగత్యము. సాధారణముగా శాసనసభయొక్క సమా వేశములకు కొలదిమందియే ప్రేక్షకులు వచ్చెదరు. దేశీయు లెల్లరకు సభవారి కార్యక్రమముగురించి వివరములు తెలియవలెనన్న, సభయొక్క వృత్తాంతముల సర్వస్వతంత్రముగా పత్రికలు వగైరాలద్వారా ప్రకటితమగు టగత్యము. ఈహక్కును బొందుటకై ఇంగ్లాండునందు 1760 ప్రాంతమున గొప్ప యలజడి జరుగవలసివచ్చెను. ఈహక్కు నుపయోగించుకొని, ప్రతిసభ్యుడును తాను సభయందొసంగు ఉపన్యాసముల తనవోటరులకు ఎరుకపరచుకొననగును. ప్రభుత్వపు శుభాశుభకార్యముల ప్రజలకు తెల్పి, ప్రజాభిప్రాయమును తగురీతి సృష్టించవచ్చును.

ప్రభుత్వము ఏ యే సమయములం దే యే శాఖలలో ఎట్లెట్లు పెత్తనము జేయుచుం ద్రో అవసరము కల్గినప్పుడెల్ల కన్గొనుటకు ప్రతిశాసన సభ్యునకు తగుయవకాశములు అవసరము. శాసనసభయందు తగుప్రశ్నలువేసి, సంతృప్తికరమగు సమాధానముల ప్రభుత్వమునుండి పొందు యధికారము, ఆయనకుండవలయును. ప్రభుత్వము సంతృప్తికరమగు సమాధాన మివ్వకుండినచో, ఆవిషయము ముఖ్యమైనదై అధిక సంఖ్యాకులగు సభ్యుల కట్టి సమాధాన నిరాకరణమువలన, ప్రభుత్వముపై అసూయకల్గు నెడల వెన్వెంటనే, "అడ్జరన్ మెంటు" తీర్మానమును ప్రతిపాదించుట కాసభ్యునకుగాని, మరియే యితరసభ్యునకుగాని హక్కుకలదు. అధిక సంఖ్యాకులచే నాతీర్మానము సకాలమున ఆమోదింపబడుచో, ప్రభుత్వమునందున్న మంత్రివర్గము పదభ్రష్టత నొం దుటకూడ తటస్థించును. కనుక సర్వసాధరణముగా సభ్యుల ప్రశ్నలకు తగుసమాధానముల నొసంగుటయే ప్రభుత్వమునకు క్షేమకరము.

సాధారణముగా నిట్టిపశ్నలను, సభాసమావేశమునకు పూర్వము, కొన్ని దినములకు ముందుగా (15 దినములు) సభాధ్యక్షునికి పంపుట ఆచారమై యున్నది. అధ్యక్షులు ఆప్రశ్నలను మంత్రాంగనసభవారికి పంపి, తగుసమాధానములను కోరును. సభసమావేశమైన పిమ్మటకూడను అత్యవసరమగు విషయములహురించి కొన్నిప్రశ్నల పంపనగును. వీలున్నచో, ప్రభుత్వము తగుసమాధానముల తయారుచేయవచ్చును. సభ సమావేశమైయుండ, ప్రశ్నలకు మంత్రులు సమాధాన మిచ్చుచుండ, ఇవ్వబడిన సమాధానమునకు సంబంధించిన, "అనుబంధప్రశ్నలను" సభ్యులు పెట్టవచ్చును. సాధ్యమగుచో అప్పటి కప్పుడే ఆయామంత్రులు సమాధాన మివ్వవచ్చును. కానిచో వ్యవధి కోరనగును. చురుకుతనము కల్గి సమయస్ఫూర్తి జ్ఞానముకల్గిన సభ్యులీ "అనుబంధప్రశ్నల" తగురీతి లేపుటద్వారాయే మంత్రివర్గమునుండి తెల్వి తేటలతో ప్రజలకు సుముఖమగు సమాధానముల బొందుటయు, తమ స్వపక్షములవాదమునకు బలముకల్గించుటయు సాధ్యము. ఇట్లు ప్రభుత్వ మొసంగు సమాధానములవలన బయల్వడిన అసంతృప్తికరమగు ప్రభుత్వచర్యల విమర్శించుటకై "అడ్జరన్ మెంటు" తీర్మానమును ఏసభ్యుడైనను నియమితమందు మరికొందరు సభ్యుల సమ్మతిపై ప్రతిపాదించనగును. అధ్యక్షునికట్టి తీర్మానము సమ్మతి మగుచో, శాసనసభవారు దానిని చర్చించనగును. సుసమయములందట్టి తీర్మానములు సభవారిచే ఆమోదితమగుటయు, అంతప్రభుత్వపుకార్యవిధానము తగురీతి మార్చవలసినయగత్యత యేర్పడుటయు సాధ్యము.

ఫ్రాన్సునందిట్లు "అడ్జరన్ మెంటు" తీర్మానమును తగినంతవ్యవధిగా ప్రతిపాదించుటయేకాక, ప్రశ్నల కొసంగబడిన సమాధానము అసంతృప్తికరముగా నున్నయెడల, వెనువెంటనే "ఇంటరుపెల్లేషను" అను తీర్మానముద్వారా, ప్రభుత్వమునకు తగుసమాధానము సంపాదించుకొను వ్యవధి కల్గించకయే, ప్రభుత్వచర్యల ప్రజాప్రతినిధిసభయందు చర్చించి, అయ్యది సభవారిచే నంగీకృతమగుచో, మంత్రివర్గముల పతనమును దెచ్చిపెట్టుట అనుభవసిద్ధము. ఈపద్ధతి తదితర రాజ్యాంగములం దనుకరింపబడుట లేదు. ఇయ్యది మంత్రాంగవర్గముల సుస్థిరతకు చాలా భంగకరము గనుక కోరదగినది కాదు.

పెత్తనమందున్న మంత్రివర్గముయొక్క పతన మభిలషించకయే, శాసనసభయొక్క యభిప్రాయ ప్రకటనమును ఏ సంస్కరణను గురించిగాని సభ్యులు కోరుచో, ఆసంస్క్రణ మునుగురించి, ఒక తీర్మానమును ఏసభ్యుడైనను ప్రతిపాదించనగును. ఆతీర్మానమునందు కోరబడిన సంస్కరణమును ప్రభుత్వ కార్యక్రమమందు జేర్చవలెననికాని, శాసనరూపముగా పెట్టవలెననిగాని, మంత్రాంగవర్గమునకు సలహాల నివ్వవచ్చును. దీనిని సభ్యులెల్లరు, తమతమ పార్టీల ననుసరించిగాని, స్వతంత్రముగాగాని, చర్చించి ఇష్టమున్న అంగీకరింప వచ్చును. ఇట్టి తీర్మానముల చర్చించుటద్వారా, ఆయాసంస్కరణముల ప్రలయందు ప్రచారితమగునట్లు చేయుటసాధ్యము. ప్రభుత్వమునకు తానట్టి సంస్కరణము ప్రతిపాదింపకపూర్వమే, శాసనసభ వారి యభిప్రాయమును అట్టి తీర్మానములద్వారా తెలుసుకొనుటకు వీలగును.

సభ్యుల, తమపార్టీల ప్రోద్బలముచేగాని, తమవ్యక్తి స్వాతంత్ర్యముతోడనేగాని, బిల్లులను శాసనసభలందు ప్రవేశ పెట్టవచ్చును. శాసనసభకు కలవ్యవధియం దెవ్వరెవ్వరి బిల్లులు చర్చకువచ్చునో వానిపైతగుచర్య జరిపించి, తద్వారా దేశమందు తగుయలజడి ప్రచారము చేయింపవచ్చును. శాసనసభయం దేసంస్కరణకు సంబంధించిన బిల్లైనను ప్రవేశపెట్టబడుచో వార్తాపత్రికలు దానిని చర్చించును; ఆవిషయమునందు శ్రద్ధవహించు ప్రభుసంఘములు తగుయలజడి గావించును. ఇవ్విధముగా ప్రజలయందు తగినంతచర్య ఆ సంస్కరణపై జరుగుటయు, అందువలన ఆసంస్కరణయెడ శ్రద్ధవహించువా రెక్కువగుటయు తధ్యము. మంత్రివర్గమున కట్టిబిల్లులలో ఎదియైన అంగీకృతమగుచో, అయ్యది ప్రభుత్వపుబిల్లుగా పరిగణింపబడవచ్చును. లేక మంత్రివర్గమున కట్టి బిల్లుపై అంతశ్రద్ధ లేకున్నను, విముఖత్వము లేనిచో, తానేమి యభ్యంతరపెట్టక, దానిని శాసనముగా సభవారిచే అంగీకరింప జేయవచ్చును. అటులగాక అట్టిబిల్లులపై తనకు వ్యతిరేకాభిప్రాయము కల్గుచో, మంత్రివర్గము దీనిని తీవ్రముగా నిరోధించి ఓడించవచ్చును. ఎటులైనను, శాసనసభవారి చర్యలు మాత్ర మట్టి బిల్లులను ప్రజలయందు ప్రచారమునకు దెచ్చును. ఆబిల్లుల సమర్థించు సభ్యులు ప్రాముఖ్యతకు వచ్చుటయు కద్దు.

పైనపేర్కొనబడిన అవకాశములే కాక, ప్రజాప్రతినిధిసభా సభ్యుడగు నాతడు (శాసనసభ్యుడనియే చెప్పబడును) మరికొన్ని

ప్రజాప్రతి
నిధిసభ.

యవకాశముల గల్గియున్నాడు. "అడ్జరన్‌మెంటు" తీర్మానమును ప్రతిపాదించి, మంత్రివర్గమునెడ సభవారికి విశ్వాసములేదని నిరూపించుటకు, సభ్యునకు అవకాశముకలదు. అట్టితీర్మానమును ప్రభుత్వము తీవ్రముగా నెదిరించి అయ్యది యంగీకరింపబడుచో, తాను రాజీనామానిత్తునని మంత్రివర్గపు ప్రతినిధి పల్కుచో, అప్పటికిని ఆతీర్మానము సభవారిచే నంగీకరింపబడుచో, మంత్రివర్గము పదభ్రష్టత జెందును. ఇటులనే ఫ్రాన్సునందును "ఇంటరుపెల్లేషను"ను ప్రభుత్వమున కెదురుగా సభ వారంగీకరించుచో, మంత్రివర్గము మారవలసివచ్చును.

ప్రతిసంవత్సరము, ప్రజాప్రతినిధిసభవారి సమావేశారంభమందును, అంతమందును, ప్రభుత్వముయొక్క చర్యలను సంపూర్ణముగా విమర్శించి, మంత్రివర్గమందు "విశ్వాసరాహిత్యతీర్మానము"ను ప్రతిపాదించుటకు సభ్యునకు హక్కు కలదు. సాధారణముగా ప్రతికక్షి పార్టీకి జెందిన సభ్యుడే పార్టీ వారి యనుమతిపైననే యిట్టి తీర్మానమును చర్చకు తెచ్చును. ఈ యవకాశము నుపయోగించుకొని, ప్రభుత్వమువలన ప్రజలకు కల్గుచుండు యిబ్బందులనన్నిటి ప్రకటించి మంత్రివర్గమువారి కార్యప్రణాళిక అనుభవమందు అదృశ్యమైనట్లు నిరూపించుచు, ప్రతికక్షి వారి రాజకీయప్రణాళిక యెటుల దేశపుటవసరముల దీర్చెడిదో వర్ణించుచు, మంత్రివర్గపు మార్పుకోరుచు సభ్యులుపన్యసించనగును. మంత్రివర్గమును బలపరచువారు మంత్రులొనర్చిన సుకార్యముల వర్ణించి, ప్రభుత్వమువలన కల్గుచున్న లాభముల వివరించి ప్రతికక్షుల బలహీనత, కార్యక్రమ వికలాంగముల నిరసించుటకును అవకాశము కల్గును. తుదకా తీర్మానము సభ వారిచే అంగీకరింపబడినదా మంత్రివర్గము మారవలసినదే! ఫ్రాన్సునందుమాత్రము తఱచు, మంత్రివర్గమువారే "విశ్వాసతీర్మానము"ను ప్రతిపాదించుటయు జరుగుచుండును. ప్రజాప్రతినిధిసభవారికి శాసననిర్మాణ కార్యమునకు తగినంత వ్యవధియుండదు. బాధ్యతాయుతమంత్రివర్గమున్న రాజ్యములందు, శాసననిర్మాణము మంత్రాంగముయొక్క ప్రధానధర్మములలో నొక్కటైయున్నది. కనుక, మంత్రాంగ సభవారిచే ప్రతిపాదింపబడు బిల్లుల చర్చించుటకు, సభవారు ముందు వ్యవధికల్గించు టవసరము. ఆబిల్లులను చర్చించునప్పుడును, ప్రతిపక్షులు ప్రతిష్టంభనము నవలంబించి, ఎప్పటికి పూర్తిగాని చర్యలజేయుచు, బిల్లులయభివృద్ధి నాపకుండుటకై ప్రతిబిల్లును ఎన్నిదినములలో చర్చింపబడవలయునో, ఏయే భాగము లేయే గడవులలోపల వోటునకు పెట్టబడవలెనో నిర్ణయించు యధికారము మంత్రివర్గమునకు సభ్యులిచ్చుటయే యుత్తమము. అప్పుడే కొన్ని బిల్లులైనను, ప్రతికక్షి వారి విమర్శనలకు మించి, శాసనరూపము దాల్చగలవు. ఇట్లు మంత్రివర్గము వారిచే నియమింపబడిన వ్యవధియందె, సభ్యలాయాబిల్లుల చర్చించుటకు బ్రయత్నించవలయును.

కాని, ఈ పద్ధతివలన సభయందే బిల్లులనన్నిటి సమగ్రమముగా చర్చించుటకు తగుయవకాశము కలుగనిమాట నిజము. శాసననిర్మాణమున కెంత కుతూహలత సభ్యులు పడుదురో, అంతయాతురత వానిని సక్రమముగా సవ్యముగా నిర్మించుటలోను జూపెట్టవలసియున్నది. కనుక బిల్లులందంతర్గతమైయున్న ప్రధానసూత్రములమాత్రము సభవారు రెండ వ చర్యయందు సమగ్రముగా విచారించి, తదితరవివాదముల చర్చించుటకు ఆబిల్లులను స్థాయిసంఘములకుగాని, ప్రత్యేక సంఘములకుగాని పంపించవచ్చును. ఆసంఘములందు సభవారి వివిధరాజకీయకక్షీలు వారివారి బలముననుసరించి ప్రాతినిధ్యత నొందవచ్చును. అట్టిసంఘములందు సభ్యత్వముబొందిన వారెల్లరు, ఆయాబిల్లుల సమగ్రముగా చర్చించి తగు మార్పులసూచించి తిరిగి వానిని సభవారికి నివేదించవచ్చును. ఆసంఘపు చర్చలందుకూడ అధికసంఖ్యాకులకు జెందిన మంత్రివర్గమువారు తమకంగీకృతమగు సవరణలనే జేర్చునట్లు జాగ్రత్తపడును. తిరిగి సభవారు మూడవమారు స్థాయిసంఘములచే సవరింపబడిన బిల్లులచర్చించి, తమకంగీకృతమగుచో శాసనములుగా నిర్మించనగును. ఇటుల మంత్రివర్గమువారి పెత్తనముక్రిందనే, శాసననిర్మాణముజేయుటలో సభ్యులు హెచ్చుగా సహకార మొనర్చుటకు వీలుకలదు.

ఫ్రాన్సునం దిట్లు మంత్రివర్గమువారి పెత్తనము సాగుటలేదు. మంత్రివర్గమువారి బిల్లును స్థాయిసంఘమువారు తమ యిష్టమువచ్చినట్లు మార్పు జెందించి, తుదకు మంత్రివర్గము వారికే యిష్టము లేనిరీతి చేయవచ్చును. "మెజారిటీ" నెట్లో రాచకీయ బృందములసమ్మేళన ద్వారా సభయందు బొందినను స్థాయిసంఘమందలి బృందములు స్వతంత్రించి ప్రవర్తించును గనుక, మంత్రివర్గమువారికి తమ కిష్టమగురీతినే శాసననిర్మా ణము చేయించుకొనుశక్తి కల్గుట లేదు. ఇటులనే అమెరికా యందును ప్రెసిడెంటుగారు కోరినట్లుగాక కాంగ్రెసువారు అనేక మారులు స్వతంత్రించి శాసనముల జేయుట కలదు. ఈపద్ధతి యెంతయు అనర్ధ దాయకము.

బడ్జెట్టును తయారుచేయుటకు సంపూర్ణ స్వాతంత్ర్యము మంత్రివర్గమునకే యుండుట మేలు. ధనము సంపాదించవలసిన బాధ్యత మంత్రివర్గముపై యుండుటచే ఏయే కార్యములకై ఎంతెంతధనము ఖర్చిడవలెనో తీర్మానించుయధికారము మంత్రివర్గమునకు చెందవలెను. అటులగాక, ప్రతిసభ్యుడును తనకుతోచిన కార్యమునకై, తననియోజకవర్గమునకు లాభము కల్గించు వ్యవహారమునకై ప్రజలందరిధనమగు ప్రభుత్వపుటాదాయమును ఖర్చిడుట కుత్సాహపడుచుండును. ప్రతిసభ్యుడిట్లేచేయుచో ప్రభుత్వపుఖర్చులు మితిమించిపోవుటయు, ఆదాయము చాలకపోవుటయు, తుదకు దివాలా కల్గుటయు తధ్యము. అట్టిదుస్థితి కలుగకుండుటకై శాసనసభా సభ్యులకు వ్యక్తిగతముగ ఖర్చుల నధికముగావించు ప్రతిపాదనలు జేయుశక్తి విరమించుటమేలు. అంత వివిధ డిపార్టుమెంటులపై మంత్రివర్గమువారు ఎంత ప్రభుత్వధనమును ఖర్చిడ తలపెట్టినారో ఆధనము నేయేశిస్తులద్వారా రాబట్టతలంచినారో తెలియ జేయుదురు. సభ్యుల కట్టియేర్పాటులు అసంతృప్తికల్గించుచో తగు యలజడిజేయనగును. ప్రభుత్వము తలపెట్టు ఖర్చులలో కొంత తగ్గించవలెనని ప్రతిపాదన (Cut) పెట్టి ఆవ్యవహారమునకై హెచ్చుఖర్చు అగత్యమనియు, ప్రభుత్వము సూచించు ఖర్చు చాలదుగనుక, వృధాయగుననియు, కనుక, తలపెట్టిన దానికంటె తక్కువే ఖర్చిడుట మంచిదని వాదించనగును. ప్రభుత్వము ఉపపాదించు శిస్తులు భారమైనవని తలంచుచో ఆశిస్తులను తగ్గించమనియు సభ్యు లాందోళన చేయనగును.

ప్రభుత్వము క్రొత్తసాంఘికావసరములపై ఖర్చిడుట మంచిదని తలంచినచో సభ్యులు ప్రత్యేకముగా నొకతీర్మానమును అంగీకరించి తన్మూలమున ప్రభుత్వమునకు బడ్జెట్టు తయారుచేయకముందే తగు సలహాల నివ్వవచ్చును. ప్రభుత్వము వృధాగాగాని, పొరపాటునగాని, ఏడిపార్టుమెంటుపైన గాని అధికముగా ఖర్చిడుచున్నచో ఆపొరపాటును విమర్శించుచు ఆ గ్రాంటును కొంతవరకు తగ్గించమని సవరణ ప్రతిపాదించనగును. బడ్జెట్టునందు జేర్చబడినగ్రాంటులు చాలక సంవత్సరాంతము కాకముందే తిరిగి "అనుబంధగ్రాంటు"లకై మంత్రివర్గము ప్రజాప్రతినిధిసభవారి శరణుజొచ్చుచో మన సభ్యులు ప్రతిగ్రాంటును జాగ్రత్తగా పరీక్షించి అవసరమగు విమర్శనలజేసి ప్రభుత్వమును సక్రమమార్గములందుంచనగును.

ఈధర్మములను శాసనసభవారు శ్రద్ధమై సంతృప్తికరముగా నిర్వర్తించుటకుగాను "ఫైనాన్సుస్థాయిసంఘ" మొకటి యేర్పరచబడుచున్నది. దానియందు ప్రజాప్రతినిధిసభయొక్క ప్రతినిధులు రాచకీయపక్షములవారీగా సభ్యులుగానుందురు. బడ్జెట్టుబిల్లు నీసంఘమునకు నివేదించబడును. ఈసంఘమాబిల్లును సమగ్రముగా విమర్శించి తగు సవరణలజేసి తిరిగి సభకు నివేదించును. ఇంగ్లాండునందు వేరే యొకసంఘము స్థాపించబడుటకుమారు కామన్సుసభవారే కామన్సుసంఘముగా సమావేశమై, ఈప్రత్యేకపరీక్ష చేయుదురు. ఫ్రాన్సునందును, అమెరికాయందు నీస్థాయిసంఘములు సర్వస్వతంత్రతబొంది మంత్రివర్గమువారి నంతగాలక్ష్యపెట్టక తమకుతోచినరీతి ఆదాయపుమార్గముల ఖర్చులవిధానముల మార్చుచుందురు.

అమెరికాయందుతప్ప తదితరదేశము లన్నిటియందును ప్రజాప్రతినిధిసభ వారికే, బడ్జెట్టు తయారుచేయుటకు ప్రధానమగు హక్కుగలదు. సెనేటుసభ వారీదేశములందు బడ్జెట్టు బిల్లును నిరాకరించుటకుగాని, ప్రజాప్రతినిధిసభ వారంగీకరింపజాలని సవరణల జేయుటకుగాని వీలులేదు. బెడ్జెట్టుబిల్లును శ్రద్ధగావిర్శించి, తప్పొప్పులవివరించి, ప్రజలకు న్యాయా న్యాయముల తెల్పుటయే సెనేటుసభయొక్క ధర్మము. అమెరికాదేశములో మాత్రము ప్రజాప్రతినిధిసభతో సమానమగు హక్కు సెనేటుసభకును బడ్జెట్టును నిర్ణయించు యధికారము కలదు.

ఈవిధముగా, బాధ్యతాయుత మంత్రివర్గములున్న దేశములందు శాసనసభాసభ్యునకు, బిల్లులప్రవేశపెట్టి శాసన ములనిర్మించు యవకాశము సన్నగిల్లుచున్నది. బడ్జెట్టుపై నాతనికుండు పెత్తనము చాల తక్కువగాయున్న్నది. ప్రభుత్వపుచర్యల విమర్శించుటకైనను శాసనసభలకు తగువ్యవధి లేకుండుటచే ప్రతిసభ్యునకు తగినంతయవకాశము కల్గుట లేదు. ప్రభుత్వపుబిల్లులను చర్చించుటకుగూడ శాసనసభాసభ్యునకు తగినంతసావకాశము చిక్కుట లేదు. రాచకీయపార్టీలు శాసనసభలందు స్థిరపడి యుండుటచే వివిధబిల్లులను, బడ్జెట్టును, తీర్మానములను, అడ్జెరన్‌మెంటు తీర్మానముల చర్చించుటకుగాను సాధ్యపడు అవకాశములను సంపూర్ణమగు యుపయోగమునకు పెట్టుటకై పార్టీ నాయకులు తమ యనుచరులలో ఏకొందరినో నియమించుచుందురు. కాన, హెచ్చుమంది సభ్యులకు అరుదుగామాత్రమే ఉపన్యసించుటకు అవకాశము కల్గుచుండును. ఇట్టిపరిస్థితులందు, శాసనసభాసభ్యులు తమ సభాకార్యక్రమమందు అశ్రద్ధబూని తమస్వలాభమును, తమనియోజజవర్గపు లాభమును , తమపక్షముల శ్రేయమునేకోరుచు, తమధర్మమును నిర్వర్తింపలేకున్నారు. ఈదుస్థితిపోగొట్టుటకై ప్రతిసభ్యునకు ప్రభుత్వ వ్యవహారముల గురించి తగినంత అనుభవజ్ఞానము కల్గుటకై ప్రభుత్వ చర్యలను ఎప్పటికప్పుడు విమర్శించి వ్యవహారము చెడుమార్గముల బట్టకముందే మంత్రివర్గమునకు జాగ్రత్తగొల్పుచుండుటకు దగు అవకాశములను స్థాయిసంఘములస్థాపిం చుటద్వారా కల్గించవలయును. ప్రతిడిపార్టుమెంటు వ్యవహారముల విచారించుటకు బడ్జెట్టు లెఖ్కలపరీక్షించుటకు వివిధ వాణిజ్య వ్యాపార సాంఘిక వ్యవహారములకు సంబంధించిన ప్రభుత్వకార్యముల గమనించు చుండుటకు స్థాయిసంఘముల నిర్మించి వానియందు వివిధ రాచకీయపార్టీలకు వాని బలముననుసరించి, సభ్యతకల్గించవలెను. ఈవిధముగనే ఫ్రెంచి, అమెరికా శాసనసభలయందు స్థాయిసంఘములు కలవు. కాని, మంత్రివర్గము యొక్క బాధ్యతను భంగము కలుగకుండా వారితో సహకారము చేయుటకును సహాయనిరాకరణము జేయకుండుటకును, ఈస్థాయిసంఘములు వ్యవహరించు చుండవలెను. కొన్నిసంఘములకు సభవారికి తమతీర్మానముల నివేదనజేయు యధికారమివ్వవలెను. మరికొన్నిటికి మంత్రులకు సలహాలనిచ్చు యధికారమున్న చాలును. ఈసంఘములందు పనిచేయు సభ్యుల కాయాడిపార్టుమెంటుల వ్యవహారము లెట్లు జరుగుచుండునో తెలియును. ప్రభుత్వమెట్లు జరుగుచున్నదో వానిసభ్యులు తెలుసుకొనగలరు. మంత్రులతోడను, ప్రభుత్వోద్యోగులతోడను సభ్యులకు ముఖాముఖి పరిచయముకల్గును.

II

రాచకీయ పార్టీ లుండుటవలననే, శాసనసభలు సంతృప్తికరముగా తమకున్న వ్యవధిలో తమ కార్యనిర్వహణము చేయకల్గుచున్నవి. పార్టీలే లేనిచో సభ్యులెల్లరు "ఎవరికి వారే యమునాతీరే" యనునట్లు అనేక దారులబట్టి వివిధ బృందముల నేర్పరచుకొని తమలోతాము కొట్టాడుకొనుచు భీభత్సముచేయుచుందురు. ఇంగ్లాండునందు కొన్నిశతాబ్దముల పర్యంతము రెండేపక్షములుండెడివి. కాని క్రిందటి యిరువదియైదు వత్సరములనుండి మూడుపార్టీలు (కన్సర్వేటివు, లిబరలు లేబరు) ప్రాముఖ్యతబొందుచున్నది. అందు కన్సర్వేటివు, లేబరుపార్టీలు అత్యంతముఖ్యతబొందినవి. ఆదేశపు రాచకీయనాయకులలో శ్రీఏడ్మండుబక్కుగారుతప్ప తదితరులెల్లరు పార్టీలప్రాపకముజూచి భయసంభ్రమముల బొందుచుండిరి. కాని, కామన్సుసభయందు కార్యనిర్వహణమొనర్చుటకై పార్టీపద్ధతిని ఎల్లరు నుపయోగించుకొను చుండిరి. అమెరికాయందును ప్రధమప్రెసిడెంటుగారగు జార్జి వాషింగ్టను గారు పార్టీ పద్ధతికూడదని అమెరికనుప్రజలకు భద్రతగొల్పినను ఆయన వానప్రస్తమునకు వెళ్ళిన ఆరువత్సరములలోనే రాచకీయపార్టీలు ప్రెసిడెంటు ఎన్నికలందు ప్రజ్వలించమొదలిడెను. అప్పటినుండి యిప్పటివరకు అమెరికాదేశపు శాసనసభలందు రెండుపార్టీలు (రిపబ్లికను డెమాక్రాటెకు) ప్రధానస్థానమాక్రమించి యున్నవి.

ఫ్రాన్సు, జర్మనీ, బాల్కనురాష్ట్రములు, ఐర్లండు దేశములందు రాచకీయపార్టీలు రెండో మూడో ప్రధాన మగు స్థానమలంకరించుటకుమారు అనేక రాచకీయపుబృందములు బయలుదేఱినవి. ఇందువలన ఇంగ్లాండు, అమెరికా దేశములందు పెత్తనమందుండు ప్రభుత్వము ఏదేనొక్కపక్షమునకే చెందియుండ ఆదేశములందలి ప్రతిమంత్రివర్గము రెండు, మూడు, నాల్గురాచకీయ బృందముల సమ్మేళనము ద్వారా నిర్మింపబడుచున్నది. కనుక, ఇంగ్లాండుదేశపు మంత్రివర్గము రెండుమొదలుకొని ఐదువత్సరములవరకు పెత్తనమందుండుచుండ ఫ్రాన్సు, జర్మనీ దేశములందు ఆరుమాసముల నుండి పదునెనిమిది మాసములకంటె హెచ్చుకాలము మను చుండుట లేదు.

ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా దేశములందును, ఇంగ్లాండునందువలెనే, రెండే ముఖ్యమగు రాచకీయపక్షములు ప్రాముఖ్యతవహించి యుండుటచే, మంత్రివర్గములు కొంతవరకు నిలకడజెందియున్నవి.

కనుక, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా దేశములందలి, ప్రజాప్రతినిధిసభా సభ్యులకు, హెచ్చుస్వాతంత్ర్యము కల్గుటలేదు. అచ్చటి రాచకీయపార్టీలే, ప్రాముఖ్యతబొంది, రాచకీయాధికారము కల్గి, వ్యక్తులగు సభ్యుల స్వాతంత్ర్యము నరికట్టు చున్నవి.ఫ్రాన్సునందట్లుగాక, బృందములనేకముండుటయు, మంత్రివర్గములు బృందముల సమ్మేళనములపై యాధారపడి యుండుటచే, సభ్యులు వ్యక్తిగత ముగా చాలాస్వతంత్రించి వ్యవహరించగలరు. బృందముల కట్టడియే తక్కువ. ఇక, బృందసమ్మేళనముల అదుపుఆజ్ఞలు కఠినము కాజాలవన్న ఆశ్చర్యమేమి? ప్రతిసభ్యుడును, ఒక బృందమునుండి మరొకబృందమునకు మరలుట దుస్సాధ్యము కాదు. బృందసమ్మేళనములు త్వరత్వరగా మారుచుండుట ఆశ్చర్యముకాదు. సభ్యులు బృందములపై నాధారపడి యున్నను, వ్యక్తిగతస్వాతంత్ర్యమును హెచ్చుగా బొందగల్గుచున్నారు. ఈపరిస్థితులు, ఫ్రాన్సునం దెచ్చుగా ప్రజ్వలించి యున్నను, కొంతవరకు జర్మనీయందును గాననగును. కమ్యునిస్టులు, సోషలిస్టులు, నాజీపార్టీవారలు జర్మనీయొక్క "రైష్ టాగ్"నందు కొంత సంఘైక్యత, కలయిక కల్గించుచున్నారు.

ఫ్రాన్సునందలి స్థాయిసంఘములకు, మంత్రివర్గములకుమించి, వ్యవహరించుటకు శక్తికలదు గనుక, వానిసభ్యులు అనేక స్వాతంత్ర్యాధికారముల బొంది, మంత్రుల వేధించి, వారిద్వారా అనేకలాభములను, ప్రత్యేకముగా తమకు, తమనియోజక వర్గములకు కల్గించుకొన జూచుచున్నారు.

ఇటుల పార్టీ బలముతగ్గి, సభ్యులవ్యక్తిగత ప్రాపకము హెచ్చుకొలది, సభ్యులు, దేశలాభముకై పోరాడుట కట్టిబెట్టి, సంకుచితాభిప్రాయులై, స్థానికలాభములగోరి, జాతీయసమస్యల నంతశ్రద్ధగా విచారించకుందురు. మరియు, వివిధబృంద సమ్మేళనముల జేరుటవలననే, వివిధలాభములు, అనుభవము లుకల్గునను ఆతురతచే, మంత్రాంగ సభల అచిర కాలజీవులజేసి, ప్రభుత్వమును నిర్బలత జేయుచుండుటయు జూడనగును.

రాజ్యాంగమందుండు రాచకీయపక్షము లన్నియు, రాజ్యాంగవిధానమునే యుపయోగించి, సక్రమమగు మార్గములద్వారా, తమరాచకీయప్రచారమును జేయగోరువరకు, శాసనసభలందు కార్యక్రమము సంతృప్తిగా జరుగును. జర్మనీ, ఫ్రాన్సునందువలె కమ్యునిస్టులు, సోషలిస్టులు, తమచే నిర్ణీతమగు నియమములు సంతృప్తినొందినగాని, మంత్రివర్గములందు జేరమనుపట్టుదల జూపుట రాజ్యాంగ క్షేమమునకు భంగకరము. జర్మనీయందు ముఖ్యముగా, కమ్యునిస్టులు, నాజీలు, ఇప్పటి ప్రజాస్వామిక బాధ్యతాయుత రాజ్యాంగ విధానమందు నమ్మికకల్గియుండక, నిరంకుశ రాజ్యాంగము గోరుచు, ప్రజాప్రతినిధిసభయందు, తదితర రాచకీయపార్టీలతో సంపూర్తిగా సహకార మొనర్పనంతవరకు, రాజ్యాంగాభివృద్ధి కాజాలదు.

శాసనసభాసభ్యుడు, ప్రజాసేవనార్థమై, తనధర్మనిర్వహణార్థమై, రాచకీయబృందమునందు చేరవలసియుండుటే కాక, ప్రజాప్రతినిధిసభయందలి ముఖ్యములగు రాచకీయ బృందసమ్మేళనములు రెండు లేక, మూడింటిలో నేదోయొక్క దానియందు చేరియుండుట శుభప్రదము. మంత్రాంగసభను నిర్మించియున్న బృందముల సమ్మేళనము, తనకార్య క్రమమును సక్రమముగా నడుపవలయునన్న, మరొకవిధమగునట్టియు, తన కార్యప్రణాళికతో సమానమగు ప్రాముఖ్యత ప్రచారితమైనట్టియు ప్రణాళికకల్గియున్న, ప్రత్యర్ధి బృందసమ్మేళనములు, అధమమొక్కటైన బలిష్టమై యుండవలయును. అప్పుడే, తాను పదభ్రష్టత బొందుచో, ప్రత్యర్ధి సమ్మేళనము పెత్తనమునకు వచ్చునేమో యనుభయము మంత్రివర్గమునకు కల్గి, తనకార్యప్రణాళికనైన సంపూర్ణముగా నమలుజరిపించ బ్రయత్నించును. అటులనే, ప్రత్యర్ధియగు సమ్మేళనమువారు కూడ, పెత్తనమందున్న మంత్రివర్గము పదభ్రష్టతబొందుచో, తాము మంత్రివర్గము నేర్పరచుచో, తా మవలంబించవలసిన కార్యక్రమ మిదియని తెలిసికొనియుండి, దానిని ప్రజల మధ్య ప్రచారముచేసి, దానినెట్లు అమలుజరుపుటో విచారించుచున్ననే, తాము పెత్తనమునకు వచ్చిన వెంటనే, గోళ్లు గిల్లుకొనుచు, కాలము వృధాపుచ్చక, ప్రజలకు, శాసనసభలకు సంతృప్తికల్గించుటకు సాధ్యమగును.

కాబట్టి, ఇప్పుడు ఫ్రాన్సు, జర్మనీయందున్న బృందముల వ్యవహారము లంతగా సంతృప్తికరము గావని చెప్పవలసి వచ్చుచున్నది.అచ్చట, ప్రత్యర్ధిబలగములకు, ఇదమిద్ధమను కార్యప్రణాళిక లేదు. పెత్తనమందున్న బృందములలో కొన్నియు, ప్రతిపక్షమందలి బృందములుకొన్ని చేరి, మరొక్కమంత్రివర్గ మేర్పడుచుండుటయు, ఏమంత్రివర్గమునకు ఎట్టి కార్యప్రణాళికయుండునో, శాసనసభాసభ్యులకు గాని, ప్రజలకుగాని తెలియకుండుటయు తటస్థించుచున్నది. ఇందువలన, మంత్రివర్గములచర్యల సంతృప్తికరముగా విమర్శించుటకుగాని, ప్రజలకు రానున్న మంత్రివర్గపు కార్యప్రణాళిక యిదమిద్ధముగా యుండునని చెప్పుటకుగాని, సభ్యులకు సాధ్యపడుట లేదు. ఇట్టిపరిస్థితులందు, సభ్యులు, తగినంతసేవ చేయ లేకున్న వింతయేమి?

ఇంగ్లాండునందువలె రెండు లేక మూడు ప్రధానపక్షములైన యుండవలెను. లేదా బృందముల సమ్మేళనములు రెండో లేక మూడో యుండవలెను. ఒకమంత్రివర్గము పదభ్రష్టతబొందుటతోడనే మరొక మంత్రివర్గము ప్రత్యర్ధిబృంద సమ్మేళనములలో నొక్కదానిచేగాని, రెంటిచేకాని ఏర్పరుపబడవలెను. అటుల లేక, ఇప్పుడు ఫ్రాన్సు, జర్మనీలందున్న స్థితిగతులే తప్పనిచో, సభ్యులు వ్యక్తిగతముగను, బృందములద్వారాను, సంకుచితాభిప్రాయములు కల్గి, స్వార్ధలాభముల జూచుకొనెదరు. ప్రతిబృందమును తమ ప్రత్యేకలాభమునే కోరునంతవరకు, రాజ్యాంగశాంతి క్రమముగా క్షీణించుచుండుటయు, ప్రజాక్షేమము భంగపడుటయు బాధ్యతాయుత ప్రభుత్వవిధానము కళంకమగుటయు జరుగును. రాజ్యాంగక్షేమమునకై వ్యక్తు లెట్లు తమ ప్రత్యేకాభిప్రాయముల తీవ్రతను కొంతవరకు ఇతరులతో కలసి సహకారము చేసుకొనుటకై తగ్గించుకొనుచుందురో అటులనే వివిధబృందములు తమతమ ప్రత్యేకపట్టుదలలను కొంతవరకు తగ్గించుకొని అందరికి సమ్మతమగు కార్యప్రణాళికను తాత్కాలికముగా అమలునందు పెట్టుటకు సంసిద్ధత బొందవలెను. అప్పుడే రాజ్యాంగజీవితము సాధ్యమగును. అప్పుడే శాసనసభలు తమ ధర్మనిర్వహణ మొనర్చకల్గును.

ఇట్టి యవసరముయొక్క తీక్ష్ణజ్వాలలకు గురియై వివిధబృందములు శాసనసభలందు కొంతవరకు మెత్తబడుచున్నవి. ఈ సక్రమమగు, లాభకరమగు మార్పుల జూచి వెలుపలనున్న ఈబృందముల నాయకులు, అనుచరులు ఓర్వజాలక తమయశాంతిని ప్రకటించుచుండుట అనుభవైకవేద్యము. ప్రతిదేశమందును శాసనసభయందలి బృందములన్నిటికి కార్యనిర్వాహకు లుందురు. ఆబృందముల అనుచరులు, నాయకులు శాసనసభాంగణమునకు వెలుపల కార్యనిర్వాహక సంఘముల స్థాపించుచున్నారు. తఱచుగా శాసనసభలలోని నాయకులకు వెలుపలినాయకులకు సంఘర్షణ జరుగుచుండుట సహజేమేకదా! వెలుపలివారికి వోటరుల పట్టుదలయే చూడనగును. లోపలివారికి రాజ్యాంగమును నడుపుటలోగల సాధకబాధకములు తెలియును కనుక కొంతవరకు తమతమ పట్టుదలను తగ్గించుకొనవలసిన యవ సరము కన్పడును. వెలుపలి నాయకులు లోపలినాయకులు, జర్మనీలోని కమ్యునిష్టులు నాజీలు, ఫ్రాన్సునందలి కమ్యునిష్టులు సోషలిష్టులు, ఒకేయభిప్రాయులై ఏమాత్రము తమ కార్యప్రణాళికలందు మార్పుల జేయకోరమి రాజ్యాంగక్షేమము భంగ మొందుచున్నది. కాని పార్టీపట్టుదల నిలబడి యున్నది. ఇంగ్లాండునందు వెలుపలినాయకులు లోపలినాయకులయెడ భ్రాతృభావము నెరపి అవసరమగు మార్పులను తమ కార్యప్రణాళికలందు జేయుట కొప్పుకొని రాచకార్య విజ్ఞానమును జూపెట్టుచున్నారు. ఆస్ట్రేలియాయందు లేబరుపార్టీ మంత్రివర్గముల నేర్పరచినను రాజ్యాంగావసరముల గమనింపక వెలుపలి నాయకుల యాజ్ఞల ననుసరించియే మంత్రివర్గములు నడచుటవలన లేబరుపార్టీకి అపజయము సంప్రాప్తమైనది. రాజ్యాంగారోగ్యము బాగుపడి సభ్యులు దేశసేవాపరాయణులై యుండవలెనన్న ప్రజలయందలి పార్టీనాయకులు తమపక్షములకు జెందిన శాసనసభానాయకులకు స్వతంత్రత నొసంగు టగత్యము.

III

శాసనసభాసభ్యుడు తననియోజకవర్గముయొక్క ఆజ్ఞల ననుసరించి నడచుకొనవలసియుండుట శ్రేయము కాదు. నియోజకవర్గముయొక్క సాధారణ రాచకీయాభిప్రాయముల నాతడు గమనించి సాధ్యమైనంతవరకు వానికి శాసనసభ యందు ప్రచురము కల్గించవలెను. కాని తాను జాతీయప్రతినిధిననియు, ప్రజలెల్లరి పెత్తందారుననియు, దేశీయుల యభిప్రాయముల వెల్లడిచేయవలసినభారము తనపై కలదనియు ఆతడు గ్రహించవలెను. నియోజకవర్గముపై తాను తన సభ్యత్వమునకు ఆధారపడియున్నను దేశమునకంతకు సేవచేయుటే తన పరమావధియని నమ్మవలెను. తనవలెనే అందరును తమతమ నియోజకవర్గముల ప్రత్యేకలాభములకై కృషిచేయబూనుకొనుచో దేశీయుల అవసరముల దీర్చువా రెవ్వరుండరని ఆతడు తెలుసుకొనవలెను.

ఏసభ్యుడును తాను తన నియోజకవర్గమునకు గాని అందలి తనపక్షపు నాయకులకుగాని ఏజెంటునని భావించరాదు. ఆతని ఎన్నుకొనుటె ప్రజలధర్మము. ఆయనరాచకీయాభిప్రాయములు, ఆశయములు, అనుభవములు నడతలగూర్చి తెలుసుకొని తమకుగాను కాలక్రమేణ బయలుదేరు రాజ్యాంగ వ్యవహారములందు తగుపెత్తనము జేయుటకై ప్రజలు వాని నెన్నుకొనవలెను. ఆసభ్యుడు రెండు మూడు నాల్గు లేక ఐదువత్సరముల కొకమా రెన్నుకొనబడును, కనుక ఎన్నికలు జరుగుసమయమందే వోటరులు తమకప్పుడుండు యభిప్రాయములప్రకారము తనసభ్యత్వ కాలమందంతట నడచు కొనుమని కోరుట అసంగతము. అప్పటి కప్పుడు కల్గుచుండు వ్యవహారములపై తమప్రతినిధి ఎట్లు ప్రవర్తించ వలెనో తెల్పుటకు ప్రజలకు దుస్సాధ్యముగదా! ఎన్నికలందు ఒకేపార్టీవారిచే ఆతడెన్నుకొనబడినను సభ్యుడై నపిమ్మట మాత్రము తాను ప్రజలందరి ప్రతినిధినని ప్రతిసభ్యుడు తలంచవలసియున్నది.

తన సభ్యత్వమునకు మూలాధారులైన ప్రజలకె తాను దాసుడై యుండుటకు మారు ఏజెంటుగా యుండుటకు బదులు ప్రతినిధిగాను, స్నేహితుడుగాను, నాయకుడుగాను వ్యవహరించుట సభ్యతయని శ్రీఎడ్మండు బర్కుగారు ఇప్పటి కెప్పుడో తన నియోజకవర్గమగు బ్రిష్టల్ వోటరులకు తెలియపరచెను. ప్రతి అభ్యర్ధియు తానే యేరాజ్యాంగ సంస్కరణములకు సుముఖుడో, ఏయే రాజకీయ సిద్ధాంతము ననుసరించి తనసభ్యత్వము నడుపతలంచునో ఎన్నికలందు ప్రజలకు తెలియజేయవచ్చును.

ఈదినములందు ప్రతి అభ్యర్ధియు ఏదే నొక రాచకీయ బృందమునందు కాని పార్టీయందు కాని సభ్యుడై యుండును. జర్మనీదేశమందును, ఫ్రాన్సునందును "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యపద్ధతి అమలునందున్నదిగనుక ఎన్నికలందు అభ్యర్థుల కంటె పార్టీలే హెచ్చుప్రాముఖ్యత నొందుచున్నవి. ఇతర దేశములం దీపర్యవసానమే కల్గుచున్నది. కనుక శ్రీ బర్కుగారి సిద్ధాంతము ఈనాటి అభ్యర్థులకు సభ్యులకు అనువర్తించుటకు మారు హెచ్చుగా బృందములకే అనువర్తించునని చెప్పుట సబబుగానున్నది. ఒక్కమా రెన్నుకొనబడినపిమ్మట సభ్యుడు తన యిష్టమువచ్చినట్లు ప్రతిరాచకీయ వ్యవహారములైనను, శాసనసభయం దుపన్యసించుటకు వీలులేకున్నది. అన్ని ముఖ్యవ్యవహారము లందును పార్టీయే ముందుగా సమావేశమై సభ్యులెట్టివైఖరి జూపనగునో, ఎటుల వోటుచేయనగునో తీర్మానించుచుండును. ఒక్కొక్కప్పుడు పార్టీనాయకు లెవ్వరో, ఇద్దరో నల్గురో, పార్టీ వైఖరిని నిర్ణయించుచుందురు. ఈవిధముగా సభ్యుడు అస్వతంత్రుడగుచున్నాడు. తనపార్టీద్వారా క్రొత్తవ్యక్తిత్వమును బొందుచున్నాడు. క్రొత్తశక్తుల సంపాదించు కొనుచున్నాడు.

వివిధబృందముల తమప్రత్యేక పట్టుదలను పరస్పరముగా వీడి సహకారము ఒకరితోనొకరు చేసుకొనుట కెట్లు ప్రయత్నించ వలెనో అటులనే తమసభ్యులకును సాధ్యమైనన్ని వ్యవహారములందు, వోటింగులందు, స్వాతంత్ర్యమిచ్చుట లాభకరము. ఎల్లప్పు డన్నివిషయములందు పార్టీయభిప్రాయము ప్రకారమె వోటుచేయవలెను, ఉపన్యసించవలెనను ఆజ్ఞనే సభ్యులకిచ్చుచో వారికి నిరుత్సాహతకల్గి ఆలోచించుట కుత్సాహము లేక మందమతులగుట సిద్ధము. అటులగాక అప్పుడప్పుడు వారికి సర్వస్వాతంత్ర్యము నిచ్చుచో ఉత్సాహపరులై నిర్మాణకార్య కలాపములందు జొచ్చి స్వాతంత్ర్య సభ్యత్వపు సౌఖ్యముల ననుభవించి హెచ్చుశ్రద్ధతతో, ఇష్టముతో పార్టీవారి ఆజ్ఞలపిమ్మట శిరసా వహించును. అటులగాక, ఇటలీయందలి ఫాసిస్టుపార్టీ జర్మనీయందలినాజీపార్టీ, పాశ్చాత్యదేశమందలి కమ్యునిస్టుపార్టీలు, ఆస్ట్రేలియాయందలి లేబరుపార్టీలు వ్యక్తులయొక్క స్వాతంత్ర్యము నరికట్టి పార్టీ కార్యక్రమమునకే ప్రాముఖ్యతనిచ్చి శాసనసభాసభ్యు లెల్లప్పుడు తమ స్వంత యభిప్రాయములగాక, పార్టీయాలోచనలనే ప్రకటించుచుండవలెనని పట్టుపట్టుచో ఆసభ్యులాలోచించుటయే మానెదరు; అభిప్రాయ ప్రకటనమే వారికి క్రొత్తదగును. అంత శాసనసభయందు స్వతంత్రమగు చర్యలు జరుగజాలవు. వివిధపక్షములు శాసనసభేతరముగనే తమతమ వైఖరిని నిర్ణయించుకొని, శాసనసభయందు నామకార్ధము కొంతవరకు చర్యలసాగించి ఒకరి వాదమువలన మరొకరు మార్పబడుటకు సంసిద్ధతకల్గియుండక ప్రజలదృష్టిని తమవైపునకు ద్రిప్పుకొనుటకుమాత్రము ఉపన్యాసములను నియమితులగు నాయకులచే చేయించుట జరుగును. ఈదినములం దనేక శాసనసభలందు ముఖ్యముగా ప్రజాప్రతినిధిసభలయందు ఇట్టి నిరుపయోగమగు చర్యలు నడుపబడుచున్నవి. శాసనసభాచర్యలవలన యేమాత్రమైన యుపయోగముండ వలయునన్న ఒక పార్టీ వారు మరొక పార్టీ వారిని ఒక సభ్యుడు మరొకరిని తమ వాదములద్వారా, ఉపన్యాసములద్వారా, తమ కార్యవిధానమునకు కొంతవరకైన సుముఖముగా నొనర్చుకొనుటకు తగు యవకాశముండవలెను. అట్టియవకాశము లేనంతవరకు వివిధరాచకీయపార్టీలు వానిసభ్యులును "తమవారకు తమలోక"మను సంకుచితాభిప్రాయములై సమరస భావమునుబొందక జాతీయాదర్శములమరచి, "ఇచ్చి పుచ్చుకొను" స్వభావమునువీడి, ప్రజాస్వామిక మందు అభిప్రాయ ముఖ్యతను భావప్రచారమును అరికట్టుట తటస్థించును.

న్యాయముగా నేరాచకీయపార్టీయును ఏవిషయము నందును సూత్రములగురించియే పట్టుదలవహించి వివరములకు సంబంధించినంతవరకు ఇతరులనుండి యుక్తమార్గము జూపెట్టబడుటకు సంసిద్ధత జెందియుండవలెను. సత్య మొక్కరి పరమే కాదనియు, ధర్మపధమొక్కరికే గోచరమగుట లేదనియు, న్యాయమార్గమెల్లరికి, కొలదిగనో, గొప్పగనో, తెలియుచుండుననియు వివిధ రాచకీయపార్టీలును గ్రహించుటొప్పు. కమ్యునిష్టులుగాని, నాజీపార్టివారుగాని, తమ కార్యప్రణాళిక యందెంతయభిమానము కల్గియున్నను, తమ ప్రత్యర్ధులుగూడ న్యాయమార్గమును వెదుకుచున్నారనియు, కొంతవరకు సత్యపధము వారును కన్గొనియుండవచ్చుననియు తలంచి వారియభిప్రాయములు అభిమానముల యెడ గౌరవము ఆదరముకల్గి యుండుట యుత్తమము.

ఒక పార్టీ వారేదైన తప్పుమార్గ మవలంబించుచో, అందలిసభ్యు లెల్లరొక్కమా రద్దాని కనిపెట్టజాలరు. సభ్యులు వ్యక్తిపూర్వకముగా ఆతప్పిదమును కన్గొని తమ యలజడిని ప్రక టించుకుందురు. క్రమముగా పార్టీకూడ తనమార్గమును మార్చుకొనవచ్చును. అటులనే ఇతరపార్టీ వారి కార్యవిధాన మేవిషయమందైన సవ్యముగనుండుచో, పార్టీసభ్యులలో కొందరు ముందువ్యక్తిపూర్వకముగా, క్రమముగా, జంటలుగా, ఆపిమ్మట బృందములుగా నా సక్రమాభిప్రాయమును అంగీకరింప మొదలిడుట సహజము. ఇట్టి నెజపరిణామము తగునట్లు వృద్ధిబొంది దేశమునకు, ప్రజలకు, శాసనసభలకు శ్రేయోదాయకమగుటకై తగుస్వాతంత్ర్యమును శాసనసభాసభ్యులకు రాచకీయపార్టీ లొసంగుటలాభకరము. శాసనసభాసభ్యులు ప్రజలకేగాక, రాచకీయపార్టీలకు గూడ సంపూర్ణముగా లొంగిపోరాదు. రాచకీయపార్టీలు సంపూర్తిగా తమచే ప్రకటితమగు కార్యక్రమప్రణాళికయం దన్ని హంశములపై పట్టుపట్టి ఇతరులతో సహకార మొనర్చక రాజ్యాంగము స్తంభించునట్లు జేయరాదు.

IV

పౌరులు తమ ప్రతినిధినియెన్ను కొనునప్పుడు ఏయే రాచకీయాశయములకై ఆర్ధిక జీవితపర మార్ధమునకై సాంఘిక పరిణాములకై కృషి చేయవలెనని కోరుదురో, ముందుగా తమకుతాము తెల్సుకొని ఆపరమార్ధములకై తనశక్తియుక్తులనే యభ్యర్ధి నుపయోగించెదనని వాగ్దానమిచ్చుచో వానినే, ఎన్నుకొనుట భావ్యము. ఎన్నికల సమయములందు తమకేమి పట్టనట్లుండి ఎన్నికదినమునాడెవ్వరిపై మక్కువకల్గిన వారికి తమవోటులనిచ్చుట పౌరులకు భావ్యము కాదు. ముందుగానే సమర్ధులును, యోగ్యులును, పాత్రుడునగు అభ్యర్ధులను స్థిరపరచుకొని, వారే జయమందునట్లు శక్తివంచనలేక పాటుపడుట పౌరులధర్మము. కనుక, వివిధరాచకీయ పక్షముల నేర్పరచుకొని, పౌరులు పరస్పరముగా సహాకార మొనర్చుకొనుచు తమపక్షముల తరపున తగు అభ్యర్థులనిలబెట్టి వారు జయమందుటకై కావలసినప్రచార మొనర్చుట యవసరము. తమపార్టీల యభ్యర్థులు జయప్రదులు కావలెనన్న వారెట్టి పరమార్దములకై నిలబడిన దేశమోక్షము కల్గునో, అధిక సంఖ్యాకులగు పౌరులకు వారెట్లు ఆమోదకరమగుదురో విచారించి ఆయామార్గముల నవలంబించవలయును. ఇందులకు ఇప్పటి ప్రజాస్వామిక రాజ్యాంగములందు రాచకీయపార్టీలు బలవత్తరముగా స్థాపించబడుటయు, ఆపార్టీలకు కార్యప్రణాళికలు తయారుచేయబడుటయు, ఆప్రణాళికలు ప్రజలమధ్య ప్రచారము చేయబడుటయు, వానినంగీకరించి పార్టీలకు సేవచేసి సమర్థులగువారిని అభ్యర్థులగా నియమించుటయు, చూడనగును. ఆదేశములందు పౌరులెల్లరియొక్క ధర్మము నట్టిరాచకీయ పక్షములందుజేరి తమశక్తికొలది తమతమపక్షముల జయ సంపాదనకై కృషి చేయవలెను.

ఎన్నుకొనబడిన శాసనసభాసభ్యులు తమరాచకీయ పార్టీలందు వాని కార్యప్రణాళికల ననుసరించి దేశమునకు శాస నసభద్వారా తగినంత సేవ చేయవలయుననియే పౌరులు కుతూహలపడుచుండ వలయును. పార్టీలయొక్క కార్యప్రణాళికలను కాలానుగుణముగా కల్గుచుండు రాజ్యాంగావసరముల బట్టి మార్పుచేయించుచుండుటయు పౌరులవిధికృత్యము. శాసనసభలందుగాని, తదితరముగాగాని, తమసభ్యులు ఆకార్యప్రణాళికలమీదనే మొత్తముమీద దృష్టినిగుడ్చి తమకు నమ్మకముకల్గించురీతి పెత్తనముచేయవలెనని పౌరులు తమ సభ్యులకోరవలెను. అటుల తమధర్మము నెరవేర్చక పార్టీల కార్య ప్రణాళికలనే తిరస్కరించి సంపూర్ణముగా స్వతంత్రించి పార్టీలనుమార్చు సభ్యులను తమపదవులకు రాజీనామానివ్వమని కోరుటకు పౌరులకు హక్కుకలదు. ఈ హక్కు శ్రీబర్కుగారు నిర్వచించిన సభ్యుని స్వాతంత్ర్య సూత్రమునకు విరుద్ధము కానేరదు. జాతీయావసరముల విచారించి దేశమునకంతకు అనువర్తించునట్లు దేశీయుల మేలునకై రాజ్యాంగ వ్యవహారముల గురించి ప్రతిపార్టీయు తనకార్య ప్రణాళికను తయారుచేయుచుండును. దాని నంగీకరించిన వారే ఆపార్టీతరపున అభ్యర్ధులుగా నిలబెట్టబడి జయప్రదులగుదురు. అట్లు తమసభ్యత్వములకు మూలాధారమైన పార్టీ కార్యప్రణాళికనె తిరస్కరించు సభ్యులు ఏధర్మమునైతే శ్రీబర్కుగారు వారికి పరమావధియని సూచించిరో ఆధర్మమును తిరస్కరించిన వారగుదురు. ధర్మచింతనమును మాని, సర్వస్వతంత్రతకోరు సభ్యుల నెట్లు పౌరులు, ఋజుమార్గమునకు తెచ్చుట? అట్టి అసాధారణ పరిస్థితులందు పౌరులు తమ సభ్యతను, తిరిగి పొందుట యెట్లు? పౌరులు కోరదగినదెల్ల, పార్టీ కార్యప్రణాళికల తిరస్కరించిన సభ్యులను, రాజీనామా యివ్వమనియు, తిరిగి ధైర్యమున్నచో, ఎన్నికలకు నిలబడమనియు మాత్రమే! ఇంతవరకు మొత్తముమీద, తన పార్టీనిమార్చుకొనిన ప్రతిసభ్యుడును, పాశ్చాత్యదేశములందు, అందును ఇంగ్లాండులో, తిరిగి వెంటనే ఎన్నికలకు నిలబడుట ఆచారమైయున్నది. ఇందువలన వోటరులకు, తమ కట్టి సభ్యు డిష్టమో కాదో, లేక ఎదిరించబడిన పార్టీయొక్క నూతన అభ్యర్ధియే యిష్టమో తెల్పుటకు అవకాశముకల్గును. కాని, ఈ యాచారము కిందటి ఆరేడువత్సరములందు కొన్ని సమయములందు ధిక్కరింపబడుచున్నది. జర్మనీ, ఫ్రాన్సు, అమెరికాదేశములందువలె, పార్టీలకు మినహా ఎవరును సభ్యులుకాజాలరని స్థితికల్గుచున్నది గనుక, ఈయాచారము శాసనబద్ధమగుట లాభకరము. కాని, రాచకీయపార్టీని మార్చుకొన్నప్పు డెల్ల సభ్యులు తమ స్థానముల ఖాళీచేసి, తిరిగి ఎన్నికల తెచ్చిపెట్ట వలయునను నియమమేర్పరచినచో, పార్టీలకు తమ సభ్యులపైయుండు పెత్తన మిప్పటికంటె ఎన్నో రెట్లు హెచ్చిపోవును. అందువలన, పార్టీయన్న అభిమానులై యుండినను, రాజ్యాంగ వివరముల చర్చించుటందు స్వతంత్రత ఇప్పుడు పొందగల్గుచుండు వారిపై నిర్బంధము హెచ్చగును. కనుక, రాచకీయపార్టీల మార్చిన సభ్యులవిషయమున, వారి వారి నియోజక వర్గము లందలి వోటర్లలో నాల్గవవంతుమందో లేక, పదవవంతుమందో, తిరిగి ఎన్నికలు కావలెనని కోరుచో, అప్పుడు వారు, తమ స్థానముల ఖాళీచేయవలె నని నిర్ణయించుట మేలు.

తమ శాసనసభాసభ్యులు, తాము కోరుబిల్లుల ప్రవేశపెట్టనిచో, ఆబిల్లులను ప్రజలే తయారుచేయించి, శాసనసభవారికి పంపి, రాజ్యాంగ ప్రధానాధికారిద్వారా, వాని తగురీతి పరిష్కరింపజేసి, రిఫరెండమునకు పెట్టించవచ్చును. ఆబిల్లులను ప్రజలెల్లరు మెజారిటిపై అంగీకరించుచో శాసనములుగా ప్రకటింపబడును. అటులనే, తమ ప్రతినిధుల కయిష్టమైనప్పుడుగాని, తమ ప్రతినిధుల బలపరచవలసినప్పుడుగాని, జర్మనీయందువలె, శాసనసభ వారికి, వివాదగ్రస్థమగు వ్యవహారముల విచారించుటకై, పిటీషనుల బంపుటకు ప్రజాసంఘముల కధికారముండుట శ్రేయోదాయకము.

శాసనసభాసభ్యు లెట్లు, ప్రజలయెడ, తమధర్మముల నెఱపవలెనో, అటులనే పౌరులును, తమందరియెడ తామే కొన్ని బాధ్యతల నడుపవలయును. శాసనసభాసభ్యులు, తమ సభ్యత్వముద్వారా, ఎలాంటిస్వలాభముపొంద బ్రయత్నించ రాదు. అటులనే, పౌరులును, తమవోటుహక్కు నుపయోగించుటద్వారా, స్వార్ధలాభము నపేక్షింపరాదు. తమనియోజక వర్గమునకుగాని, అందలి మరియేభాగమునకుగాని, దేశమునకు అవసరముకానంతవర కేలాంటి ప్రత్యేకలాభముల కల్గించవలెనని, తమ అభ్యర్ధులగాని, పిమ్మట సభ్యులగాని కోరరాదు. దేశావసరములబట్టియే, తమనియోజకవర్గములకు ప్రత్యేకలాభముల చేకూర్చుటగత్యమైనచో, తమసభ్యు లెట్లైనను, వారిశక్తికొలది కృషిచేయుదురు. ఫ్రాన్సు, అమెరికా, మనదేశమందు ఇట్లుగాక, పౌరులనేకులు, తమకనేక వ్యక్తిగతమగు స్థానికమగులాభముల, వారిరాజ్యాధికారముద్వారా, కల్గించవలెనని, తమసభ్యులు వేధించుట అనుభవసిద్ధము. ఈదేశములందలి శాసనసభాసభ్యులును, తమధర్మముల మరచిగాని, వోటరులపోరు పడజాలకగాని, తిరిగి ఎన్నికలందు జయమాశించిగాని, తమతమ నియోజక వర్గములయొక్క ప్రత్యేక అజాతీయమగు లాభములకల్పించ ప్రయత్నింతురు. ఇందువలన, వారు మంత్రులను, వారి ఉద్యోగులను సంతుష్టులజేయుటకై, తమరాచకీయపార్టీలయెడ విద్రోహము జేయుచు, తమస్వాతంత్ర్యము నుపయోగించుకొనక, ప్రభుత్వచర్యల నిర్మొఖమాటముగా విమర్శించక, నిరుపయోగులు కావలసివచ్చును. కనుకనే, జర్మనీయందలి విశాలమగు నియోజకవర్గములు, ఈలాంటి యిబ్బందుల తొలగించుచు న్నవి. మరియు, పార్టీలపైననే, అభ్యర్ధులజాబితా తయారుచేయు బాధ్యత యుండుటవలన, అభ్యర్ధులను ప్రత్యేకముగా స్థానిక పౌరులు వేధించుట కవకాశము కలుగుట లేదు.

మరియు తమప్రభుత్వము అధర్మపథానువర్తి యగుచొ, ఆయధర్మచర్యల ధిక్కరించుటకు పౌరులెల్లరు సంసిద్ధులై యుండవలెను. వారిరాచకీయపార్టీలు, సంస్థలు, ప్రతినిధులు, వారి యీధర్మమును వారు సక్రమముగా నిర్వర్తించుటకు సాయపడవలయును. ఈవిధముగా తమపౌరసత్వపు ధర్మమును నిర్వర్తింప దలచుటచేతనే, పోలండు, జుగోస్లావియా, ఇటలీ దేశస్థులనేకులు కారాగారములందు మ్రగ్గుచున్నారు. కొందరు నాయకులు వలసపోయినారు. కనుకనే రషియా రాజ్యాంగ నిర్మాతలలో ప్రధానులగు, శ్రీట్రాట్క్సీగారు, టర్కీయందు తలదాచుకొనవలసివచ్చినది. అటులనే మనదేశమందును, లక్షలమంది దేశభక్తులు కారాగారములందు స్వాతంత్ర్య జపము జేయుచున్నారు.

స్థానికావసరములను గురించి, ప్రభుత్వము అశ్రద్ధచేయకుండుటకై, పౌరులు, తమతమ రాచకీయపార్టీలద్వారా, వివిధజిల్లాలయొక్క ప్రత్యేకావసరముల దీర్చుట, ఎట్లు దేశమునకు క్షేమకరమో నిరూపించుచుండుట మేలు. ముందు తమపార్టీలద్వారాను, పిమ్మట, శాసనసభలయందును, దేశీయు లెల్లరి ప్రతినిధుల చేతను, తమతమ స్థానికావసరముల యోగ్యతను గమనింపచేయవలెను. అప్పుడె ప్రభుత్వమట్టి అవసరముల దీర్పకలదు. "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యపుపద్ధతి హెచ్చుగా అవలంబింపబడు యీదినములం దీవిధముగా పౌరులు, తమ జిల్లాలయొక్కయు, తాలూకాలయొక్కయు అవసరములగురించి జాగ్రత్తచేయకపోయినచో, రాచకీయపార్టీలు, దేశపుప్రధానావసరములనే గుర్తించి, ప్రజల ప్రాధమిక అవసరముల మరచును.



_________________