ఆధునిక రాజ్యాంగ సంస్థలు/ఎనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఎనిమిదవ ప్రకరణము.

వస్తు నిర్మాతల శాసనసభ.

సాంఘికవాదులు, సమిష్టివాదులును, ఈకాలపు శాసనసభలన్న చాలయసంతృప్తి పొందియున్నారు. ఏదేశమందును పదికాలములపాటు కార్మికుల మంత్రివర్గముల పెత్తనము వచ్చి, ప్రజాసామాన్యమునకు వలయు సౌకర్యములు కల్గించుట, ఇప్పటి శాసనసభాప్రవృత్తి సాధ్యపరచుట లేదని వారికి కష్టముగానున్నది. కార్మికులు ప్రతిదేశమందును అధికసంఖ్యాకులై యుండినను, వోటర్లందును కార్మికులే మెజారిటీయందున్నను, కార్మికుల మంత్రివర్గముల నేర్పరచు యోగ్యత ఏదేశమందును సాధారణముగా కలుగకుండుట అన్యాయమే! ప్రజాజీవితమందు తినుటకు తిండి, త్రాగుటకు నీరు, పరుండుట కిల్లు, సంపాదించుకొనుటకే హెచ్చుకాలము పట్టుచున్నది. ఆకాలమందు వారు ఏయే కర్మాగారములందు, వర్తక వాణిజ్యములందు కృషిచేయుచున్నారో ఆ వ్యవహారములతో నంతగా జోక్యము కల్గించుకొనని యీకాలపు శాసనసభలతో ప్రజ లసంతృప్తిబొందుచున్నారు. వారికి ఏవ్యవహారములు సక్రమముగా జరిగిన తమ జీవితము సలక్షణమగునో అట్టి ఆర్థికజీవితముతో ప్రత్యేక సంబంధము లేని యిప్పటి శాసనసభలవలన లాభమేమియు కన్పించుట లేదు. ప్రజాసామాన్యము ఏనియమముల ననుసరించి అనుదినము కూలినాలి చేసుకొనుచున్నారో, ఎట్టిజీవనభృతి సంపాదించుకొనుచున్నారో, ఆయావృత్తులం దెట్టి కష్టములు వారికి కల్గుచున్నవో విచారించుట కిప్పటి శాసనసభలు శ్రద్ధవహింపకుండుటయు, శ్రద్ధచేయవలెనన్నను వ్యవధిబొందకుండుటయు చాలా అసంతృప్తికరముగనే యున్నది. ఇంగ్లాండునందు లంకషైరు కర్మాగారాధిపతులు వారికార్మికులమధ్య క్రొత్తమెషినుల నుపయోగించవచ్చునా లేదా యను విషయముపై గొప్పతగాదా వచ్చి కార్మికులెల్లరు నిరుద్యోగులై బాధలు పడచుండ, పార్లమెంటు తనకు పట్టనట్లే యుండుట ప్రజల కయిష్టము కల్గించును. రాక్షసబొగ్గుగనులందలి కార్మికులు లక్షల కొలదిగా, యజమానులు పెట్టుతిప్పలు పడజాలక, సమ్మెకట్టి, నిరుద్యోగులైయుండ, పార్లమెంటు కండ్లుతెరచి చూచుచు, ఏమియుచేయకుండెను. ఇటులనే యితరదేశములందును, కర్మాగారాధిపతులు, భూస్వాములు, గనులయజమానులు, తమకార్మికుల హింసించుచుండ, శాసనసభ లేమాత్రము ప్రజలకు సహాయముచేయకున్నవి. ఇట్టిపరిస్థితులందు, కార్మికులకీసభలన్న గౌరవముకల్గుటెట్లు? ఇంతటితోబోక, కార్మికులు జయప్రదులై, తమసమ్మెలను, తీవ్రతరముగా సాగిం చుచు, హెచ్చు జీతభత్యముల కోరుచుండ, నిష్పక్షపాతముగ, మధ్యవర్తిగనైన యూరకుండక, శాసనసభలు, వానిపై యాధారపడియుండు మంత్రివర్గములు, కర్మాగారాధిపతులతరపున జేరి, కార్మికులహింసించుచు, వారిసమ్మెల నిర్మూలింప జేయుచున్నవి. ఇంగ్లాండునందు 1926 సంవత్సరమందు సాగించబడిన, "జనరలుస్ట్రైకు"ను నిర్మూలింప జేయుటకు ప్రభుత్వము, పార్లమెంటు తమశక్తులనన్నిటి ధారపోసిరి. మనదేశమందును, దక్షిణయిండియా రైలుమార్గముపై నట్టిసమ్మెయే జరుగుచుండ, ప్రభుత్వము, రైలుయజమానుల తరపున నిలబడి, కార్మికనాయకుల నిర్బంధించి, సమ్మెనుఓడించిరి. జమీందారీరైతులు వెంకటగిరియందు జమీందారుపై ఆందోళనజేయుచుండ, ప్రభుత్వము జమీందారులకు అండగా నిలబడుచున్నది. ఇట్టి దురన్యాయముల కల్గించుచుండు శాసనసభలు, వానిపై యాధారపడియుండు మంత్రివర్గములపై, కార్మికులకు సంపూర్ణముగా నమ్మకముపోయినది. కనుకనే, జర్మనీ, ఫ్రాన్సు, ఇంగ్లాండునందలి, కార్మికులలో తీవ్రవాదులందరు, రాచకీయజ్ఞులలో కొందరు, ఈకాలపు శాసనసభలు, ప్రజాభిప్రాయమును వెల్లడించలేవనియు, ప్రజాస్వామిక రాజ్యమనునది, ఈశాసనసభలద్వారా సాధ్యముకాదనియు, ఇప్పటి ప్రజాస్వామిక రాజ్యము వట్టి బూటకమనియు, అభిప్రాయ పడుచున్నారు. కమ్యునిస్టులు, సోషలిస్టులకు, ఇప్పటి శాసనసభలయం దేమాత్రము నమ్మకము లేకుండుట వలననే, తఱచు ప్రతిష్టంభనము చేయుచు, మంత్రివర్గములందు జేరక, సాధ్యమైనంత త్వరితముగా, ఇప్పటి రాజ్యాంగ పద్ధతుల మార్పుచేయవలెనని ఆశించుచుండుట కిదియే ముఖ్య కారణము.

ప్రజలకు ముఖ్యమగు ఆర్థికజీవితముతో నంతగా సంబంధము లేక వివ్విధవృత్తుల యొక్క అవసరానవసరములతో సంబంధము లేక గలజనుల ప్రత్యేకాభిప్రాయముల వెల్లడింప జాలక వివిధ భాగములందు నివసించు అన్నివిధములగు ప్రజలపేరున ధనికుల, భూస్వాముల, కర్మాగారాధిపతుల యాధిక్యతనే బలపరచుచుండు యిప్పటి శాసనసభలు కార్మికులకు నిరుపయోగములు. ప్రజలెల్లరు ఏదోయొకవృత్తివలన తమ జీవనోపాధి సంపాదించుకొనవలసి యున్నది. సంపాదించిన ధనము బెట్టి జీవితాధారముకై వివిధవస్తువుల కొనవలసియున్నది. పూర్వీకులవలన ఆస్తిపొందినవారు తప్ప అత్యధిక సంఖ్యాకులు కార్మికులు. ప్రజలందరును వస్తువుల కొనువారు కనుక, కార్మికులందరికి "వస్తునిర్మాతకుల శాసనసభ" యొక్కటియు, ప్రజలెల్లరికి "భోక్తలశాసనసభ" మరొక్కటియు నిర్మించుచో, ఒక్కటి పనివారెల్లరు కర్మాగారములాదిగా గల వానియందెట్లు జీవించి జీవనోపాధి బొందనగునో నిర్ణయించుననియు, మరొకటి ప్రజలు తమ సంపాదనల నెట్లు ఖర్చిడుకొననగునో నిర్ణయించుననియు, సాంఘిక వాదులు చెప్పుచున్నారు. ఈసభలద్వారా దేశాంతర్గతమగు వ్యవహారములన్నియు చక్కబెట్టబడుచు వీనికిమించిన విదేశాంగ వ్యవహారములు, రక్షణదళమున నిర్వహణము, దేశీయపుశాంతి రక్షణ ఆదిగాగల కార్యములకై మరొక శాసనసభ నేర్పరచుటకు బదులు "భోక్తలశాసనసభ"నే నియమించుటమంచిదని వారివాదము. ప్రధమసభయందు వివిధవృత్తులందలి ప్రజలు ప్రాతినిధ్యము బొందెదరు. రెండవసభకు దేశమందలి ప్రజలెల్లరు ఇప్పటివలెనే వివిధ నియోజకవర్గములనుండి తమ ప్రతినిధుల పంపెదరు.

కాని, ప్రస్తుతపు పరిస్థితులందు, యజమానులు కార్మికులు ప్రతివర్తకమందును, వాణిజ్యమందును కలరు గనుక, యజమానులను పూర్తిగా పదభ్రష్టుల నొనర్చిననగాని "వస్తునిర్మాతకులశాసనసభ" యందు కార్మికులకే ప్రాతినిధ్యత యిచ్చుట సాధ్యపడదు. ఒక వేళ నానాజాతి కార్మికసంఘము (జనీవాయందున్నది) నందువలెనే యజమానులకును, కార్మికులకును, ప్రతివృత్తియందును సమాన ప్రాతినిధ్యమునే యిచ్చి, ఆయిరుపక్షముల ప్రతినిధులకు ఆశాసనసభయందు తావొసంగుట న్యాయమని సాంఘిక వాదులు చెప్పుచున్నారు. అప్పుడైనను వివిధవృత్తులకు పరస్పరముగా ఎంతెంత ప్రాతినిధ్యమివ్వవలెనో ఎవ్వరు తేల్చుట? ఒకప్పుడొకవృత్తి అత్యం తప్రాముఖ్యతబొందియున్నను ఇప్పు డతిక్షీణదశ యందుండవచ్చును. వెనుక దీనావస్థయందున్నవృత్తి యిప్పుడు వృద్ధి యందుండనోపును. ఇటుల కాలానుగుణముగా కల్గుచుండు మార్పులననుసరించి వివిధవృత్తుల కొసంగబడు ప్రాతినిధ్యము మారుచుండవలయునుగదా? ఆయావృత్తులందలి కార్మికులు వారిప్రతినిధుల నెన్నుకొనవలెనా? లేక వారిసంఘము లెన్నుకొనునా? ఒకవృత్తికిహెచ్చు, మరొకవృత్తికితక్కువ ప్రాతినిధ్యము చే కూరినదని వివాదములు కల్గుచుండును. ఇన్ని యిబ్బందులున్నను అనుభవమున "వస్తునిర్మాతకుల శాసనసభను" నిర్మించుట దుస్తరముకాదని జర్మనీయందలి ఆర్ధిక శాసనసభావృత్తాంతము, ఇటలీయందలి ఫాసిస్టుపార్టీవారి యేర్పాటులు, రషియాయందలి "సిండికేటుల నిర్మాణము" తెల్పు చున్నవి.

"వస్తునిర్మాతకుల శాసనసభ" ఎటులనైన నేమి యేర్పడినదనుకొందము. ఈసభవారు నిర్వర్తించవలసిన కార్యవిధానమెద్ది? వివిధవృత్తులందు యజమానులు కార్మికుల మధ్య కల్గువివాదము లెట్లు పరిష్కరింపబడునో తీర్మానింతురు. యజమానులు తమకర్మాగారముల నెట్లుసృజింపవలెనో, కార్మికుల కపాయము కల్గకుండుటకై యేలాటి యేర్పాటులు చెయనగునో వివిధతరగతులకు జెందిన కార్మికులకు ఎట్లెట్లు ఎంతెంత కూలి నాలి చెల్లింపవలెనో, నిరు ద్యోగులైనవారి కెంతజీవనభృతి చెల్లింప నగునో, అవిటివారైన కార్మికుల కెట్లు నష్టపరిహారము చెల్లింపవలెనో శాసననిర్మాణము చేయదగును. వివిధవృత్తులందలి కార్మికులు, యజమానులమధ్య లాభముల నెట్లుపంచియిడనగునో, ఆయావృత్తుల నడపుటలో యిరుపక్షములవారి కెంతెంత పెత్తనము కలుగవలెనో ఈసభవారు నిర్ణయించనగును. ఈసభయొక్క చర్యలద్వారా కర్మాగారాధిపతులకు, కార్మికులకు, దేశమందలి వర్తక వాణిజ్య వ్యవహారము లన్నియు ఎట్లెట్లు జరుపబడుచున్నవో, ఏయేవిధముల ఏయేవృత్తులందు జాతీయైశ్వర్యము వృద్ధిబొందుట కాని క్షీణతజెందుట కాని జూడనగునో, విదేశములయొక్క ఆర్ధికజీవితమునకు తమ దేశీయుల ఆర్ధికవ్యవహారముల కెట్టిభేదములు కలవో? దేశమంతకు లాభకరమగునట్లు వివిధవృత్తులమధ్య తగుపోటి సహకార మేర్పరచి, ఆర్ధికజీవితము కళాప్రపూర్ణముగా నొనర్చుటకు సాధ్యమగును. ఇప్పటివలె యుద్ధములందు దిరుగుటకుగాని, ఎగుమతి దిగుమతి పన్నుల వేయుచు విదేశములతో ఆర్ధిక సంఘర్షణ కల్గించుటకు కాని ఆసభ యేర్పడిన పిమ్మట అంతసుళువుగా సాధ్యముకాదు. ఇప్పటి శాసనసభలకంటె "వస్తునిర్మాతకుల శాసనసభ" వారు ఆర్ధికవ్యవహారములకె హెచ్చుప్రాముఖ్యత నిచ్చి ఎగుమతి దిగుమతులు ప్రపంచమందంతట ఏయడ్డంకులు లేకుండ జరుగవలయునని ఆశించుచుందురు. యుద్ధమువలన ఆర్ధికజీవితము తారుమారై ప్రజలు కష్టముల పాలగుదురని యీసభవారు త్వరితముగా గమనించకలరు. యజమానులే యిప్పటి సభలందు హెచ్చుప్రాముఖ్యత పొందుచుండుటవలన ఆర్ధికసంక్షోభములు కల్గుటతు, యుద్ధములు సంప్రప్తమగుటయు జరుగుచున్నది. ఈసభవారు ఆర్ధికసామరస్యమును, వర్తకవ్యాపార విజృంభణమును, నానాజాతిసౌభ్రాతృత్వమును హెచ్చుగా కోరుచుందురు. కనుక శిస్తులభారము తగ్గి వ్యాపారము హెచ్చగుటకు వీరు తోడ్పడుదురు.

ఈకార్యము లన్నిటిని సాధారణశాసనసభ నిర్వర్తింపకలదు. ఇప్పటికే వీనిలో ననేకములను చాలవరకు జరుపుచునే యున్నది. ఆస్ట్రేలియాదేశపు శాసనసభలు కార్మికులకు చాలవరకు సంతృప్తికల్గించుచున్నవి. ఇంగ్లాండునందు యజమానులు కార్మికులమధ్య కల్గుచుండు సంఘర్షణల తగ్గింప పార్లమెంటు చాలా ప్రయత్నముల జేయుచున్నది. కనుక పౌరులెల్లరు మేల్కొని తమవోటులను సక్రమముగ ప్రజాసామాన్యపు మేలుకోరువారికే యిచ్చుచో పైన పేర్కొనబడిన "వస్తునిర్మాతకుల శాసనసభ" వారిధర్మముల నన్నిటి నెరవేర్చకలదు. కాని అనుభవమందు ప్రజలు తమ మేలునే కోరు లేబరుపార్టీని బలపరచుస్థితియందు లేరు గనుక "వస్తునిర్మాతకుల శాసనసభ"యందు కార్మికుల యోగ క్షేమములగూర్చి కన్పరచు శ్రద్ధ, ఓపిక, ఆతురత, ఇప్పటి శాసనసభలయందు ప్రకటింపబడుట లేదు. మరియు యిప్పటి శాసనసభలందు కదాచితుగ మాత్రము కార్మికులకు యజమానులతోబాటు సమానమగు ప్రాతినిధ్యము సంపాదితమగు చుండ "వస్తునిర్మాతకుల శాసనసభ"యందు ప్రధమమునుండి శాశ్వతముగా యజమానులతో సమానముగా కార్మికులును ప్రాతినిధ్యత పొదగల్గుదురు.

"భోక్తల శాసనసభ" వాస్తవముగా ఇప్పటిశాసనసభలవలెనే యుండును. ఇప్పటికాలసభలును, భోక్తల యొక్క అవసరముల గురించియు, పౌరుల కోర్కెలగురించియు, శ్రద్ధజేయుచున్నవి. ఐతే ఇప్పటి శాసనసభలందు ప్రజాప్రతినిధిసభలే ప్రాముఖ్యత బొందియున్నవి. ప్రజాప్రతినిధిసభలో పౌరులెల్లరి ప్రతినిధులు కలరు. వివిధనియోజకవర్గముల నుండి ఈసభయొక్క ప్రతినిధు లన్ను కొనబడుచున్నారు. అటులనే "భోక్తల శాసనసభ"యు నిర్మింపబడును, కనుక సాంఘికవాదుల తత్వముప్రకారము ఇప్పటి ప్రజాప్రతినిధిసభ లట్లే యుండవచ్చును. సెనెటుసభలమాత్రము నిర్మూలించి వారిస్థానే "వస్తునిర్మాతల శాసనసభ"ను స్థాపించవలెను.

ఐతె బడ్జెట్టు తయారుచేయుటలో ఈరెండు శాసనసభల కెట్లెట్టిబాధ్యత లుండవలయును? వృత్తులందలి ప్రజలే గదా శిస్తులచెల్లింపవలసినది. వివిధవృత్తులందలి కార్మికు లెంతగా శిస్తుభారము మోయవలెనో, యజమానులెంత భరించవలెనో తీర్మానించుటకు "వస్తునిర్మాతకుల శాసనసభ" కు హెచ్చుశక్తి యుండును. కాన వారు "ప్రజాప్రతినిధిసభ వారితో బడ్జెట్టు తయారుచేయుటలో" పోటీపడజొచ్చెను, "ప్రజాప్రతినిధిసభ వారు" ప్రజావసరములకై ధనమునుకోరుచుందురు. కనుక ఒకరు శిస్తులనిచ్చువారు, మరొకరు ఖర్చిడువారునై యుందురు. బడ్జెట్టును నిర్మించుటలో యీవిధమగు ద్వంద్వపెత్తనముండుట శ్రేయస్కరముగాదని ప్రపంచపుటనుభవము తెల్పుచున్నది. మరియు శిస్తులనివ్వకల్గు సభయే ప్రభుత్వపుధనమును ఖర్చుపెట్టు అధికారమును కోరుచుండును. కాని ప్రజలందరి యవసరముల గమనించుచు, అన్ని వృత్తులయందును సమానభావము కల్గియుండి దేశమందు శాంతి నెలకొల్పి, ఉద్యోగులు, నిరుద్యోగులు, వృద్ధులు ఎల్లరికి ప్రతినిధియై బాల బాలికలు తదితరుల క్షేమమునకై కృషిచేయవలసిన బాధ్యతకల్గిన "ప్రజాప్రతినిధిసభ"కె బడ్జెట్టును తయారుచేయు అధికారము నొసంగుట యుత్తమము. "వస్తునిర్మాతకుల సభ"వారు వివిధవృత్తులమధ్య శిస్తుభార, మెటుల పంచి యిడనగునో నిర్ణయింపజాలరు. ప్రభుత్వాదాయమును కూడ వృత్తులవారీగాగాక ప్రజావసరములబట్టి ఖర్చిడవలసియున్నది. కనుక "ప్రజాప్రతినిధి సభ" వారికే బడ్జెట్టును నిర్మించు ప్రధానాధికారమిచ్చుట లాభకరము. ఇట్టి పరిస్థితులందు బడ్జెట్టుపై యధికారము లేకపోవుచో "వస్తునిర్మాతకుల సభ" వారికి ప్రజాప్రతినిధి సభవారితో సమానస్థానము లభింపజాలదుగదా?

శాసననిర్మాణమందును ఈరెండుసభలకు సమానాధికార మొసంగుచో ఈదినములందు రెండుశాసనసభలున్న దేశములందు కల్గుసమస్యలే బయలుదేరునని భయపడనక్కర లేదు. ఇప్పటి సెనెటుసభలందు పూర్వాచారపరాయణులు, వృద్ధులు, మితవాదులు, ధనికుల స్నేహితులు బలముగనుండ "వస్తునిర్మాతకుల సభయందు" వారికి మహాఅయితే సగ భాగపు ప్రాతినిధ్యము కల్గును. కనుక సెనెటుసభకంటె "వస్తునిర్మాతకుల సభ" యే హెచ్చుగా కార్మికుల సమస్యల యెడ సుముఖత జూపుచుండును. ఐనను "వస్తునిర్మాతకుల సభ" వారు బిల్లుల నెంతశ్రద్ధమై తయారుచేసి చర్చించి, అంగీకరించి ప్రజాప్రతినిధిసభ వారికి పంపినను ఆసభయందు సాధారణముగా యజమానుల ప్రతినిధులే అధికసంఖ్యాకులై యుండెదరు కనుక ఆబిల్లులకు సాధారణముగా ప్రతిష్టంభనము జరుగుచుండును. ఈయిబ్బందిని తప్పించవలెనన్న ఈ రెండుసభలమధ్య భేదాభిప్రాయము కల్గుచో వోటరులందు యిరువదవవంతు మంది "రిఫరెండము" కోరుచో ఆబిల్లులను వోటరులసమ్మతిపై తేవలయును. ఈవిధానమువలన ఇప్పటికంటె చులకనగా శాసననిర్మాణము జరుగవచ్చును. బాధ్యతాయుతమంత్రివర్గము స్థిరపడియున్నంతకాలము అయ్యది "ప్రజాప్రతినిధిసభ" వారికె బాధ్యతచెందియుండుట తప్పదు. కాని యిప్పుడెటుల సభయొక్క సభ్యులు కొందరు మంత్రివర్గమందుందురో, అటులనే వస్తునిర్మాతకుల సభయొక్క సభ్యులు కొందరు మంత్రివర్గమందు జేర్చుకొనబడుచుండవలెను. అప్పుడే మంత్రివర్గమునకు ఈసభ వారి తత్వము త్వరితముగా బోధపడుటయు, వారి శాసననిర్మాణకార్యక్రమము నెడ ఈసభవారు సుముఖతజూపుటయు సాధ్యమగును. అట్టియెడ శాసననిర్మాణకార్యమందు "వస్తునిర్మాతకుల శాసనసభ" వారు ప్రతిపాదించు బిల్లులను మంత్రివర్గమువా రంగీకరింపజాలనిచో వానిని ప్రజాప్రతినిధి సభ వారిచే నిరాకరింపజేయవచ్చును. కాని "రిఫరెండము" నం దాబిల్లులు ప్రజలచే నామోదింపబడినయెడల, మంత్రివర్గము రాజీనామా యివ్వవలసివచ్చును. ఇందువలన వృత్తుల యవసరముబట్టి అవసరమగునప్పుడెల్ల ప్రజాభిప్రాయమునెడ భయభక్తులుకల్గిన మంత్రివర్గమువారు శాసననిర్మాణమును జేయించుచుండుట సాధ్యమగును.

ధనికులు, యజమానులగువా రదృశ్యులై, వృత్తులన్నియు, కార్మికుల సంఘములద్వారా, ప్రభుత్వము వలన నడుపబడు చుండుదినములం దెట్టిశాసనసభ లగత్యమో, "ఆధునిక రాజ్యాంగతత్వము" అను గ్రంథమందు వివరింతు ము. ఇప్పటి శాసనసభలు, ఆర్ధికజీవితముయెడ తగినంత శ్రద్ధ జూపుట లేదనియు, కార్మికుల యవసరముల గమనించుట లేదనియు, అందువలన ప్రజాసామాన్యమునకు, వానియెడ తీవ్రమగు అసంతృప్తి కల్గుచున్నదనియు మన మిచ్చట గమనించవలెను. ఇప్పుడున్న "సెనెటుసభలకు బదులు, వస్తునిర్మాణకుల శాసనసభ"ల నేర్పరచుట ప్రజోపయోగకరము. శాసననిర్మాణము చురుకుగా జరుగుటకై "వస్తునిర్మాణకుల శాసనసభ"కు "రిఫరెండము"ను తోడుజేయుట శ్రేయస్కరము.

ఇట్టి "వస్తునిర్మాణకులసభ"కు మాతృక ఈకాలమందు జర్మనీరాజ్యాంగమందలి "ఆర్థిక శాసనసభ" యందు జూడనగును. ఆసభయందు వివిధజిల్లారాష్ట్రీయ కార్మికసంఘములు "యజమానుల" సంఘముల ప్రతినిధులు కలరు. వివిధ వృత్తులకు వానివాని ప్రాధాన్యతల ననుసరించి తగురీతి ప్రాతినిధ్యత యొసంగబడుచున్నది. ప్రముఖులగు కార్మిక నాయకులు, యజమానులుకూడ ప్రత్యేకముగా సభ్యులుగా నియమింపబడుటకలదు.

ఈసభ వారు ఆర్ధికజీవితమునకు సంబంధించినంతవరకు ఏబిల్లునైనను తయారుచేసి చర్చించి అంగీకరించనగును. అంత నాబిల్లును మంత్రివర్గమువారు పరిశీలించి తమ యభిప్రాయ ముతో రైష్‌టాగ్ అను ప్రజాప్రతినిధిసభయందు ప్రవేశపెట్టవలెను. "ఆర్థిక శాసనసభాచర్చలయం దెట్లు మంత్రులుపన్యసించి మంత్రివర్గమువారి అభిప్రాయములతెలుప నగునో, అటులనే ప్రజాప్రతినిధిసభయందు తమ బిల్లు చర్చింపబడునప్పుడు తమ యాశయముల తెలుపుటకై "ఆర్థిక శాసనసభవారు" తమ ప్రతినిధులను పంపించవచ్చును. ఇటులనే, ప్రజాప్రతినిధి సభవారిచే అంగీకృతమున బిల్లులను ఈసభ వారికి చర్చకొరకై నివేదించవలసియున్నది. కాని ప్రజాప్రతినిధిసభ వారి యంగీకార అనంగీకరములపై, ప్రతిబిల్లు యొక్క అదృష్టము, దురదృష్టము ఆధారపడియున్నవి. బడ్జెట్టు బిల్లు, ఆర్ధిక శాసనసభ వారికి నివేదింపబడుట లేదు. కనుక, జర్మను రాజ్యాంగ విధానమం దీసభ కింకను, తుదకు "రైషులైరు" అను సెనెటుసభకున్న ప్రాముఖ్యతకూడ కల్గుట లేదు.

ఐనను, ఈసభ వారి వివిధస్థాయి సంఘములు, ప్రభుత్వపు వివిధ వ్యవహారముల పరీక్షించుటకు మంత్రులు, తదితర ప్రభుత్వోద్యోగుల, తమకు సలహా నిచ్చుటకు, భోగట్టా తెల్పుటకై పిలిపించుట కధికారముకలదు. అవసరమగు ప్రభుత్వ సమాచారములు చర్చల గురించి తగు రిపోర్టులను, మంత్రివర్గముద్వారా వీరు తెప్పించనగును. ఈవిధముగా, కార్మిక ప్రతినిధులు, యజమానుల ప్రతినిధులును, ప్రభుత్వ మునకు, దేశీయ ఆర్ధిక ప్రపంచపు ఆలోచనలు, అవసరముల గూర్చి తెల్పుటకును, ప్రభుత్వపు వ్యవహారముల విమర్శించి, మంచిచెడ్డల తెలుసుకొనుట కవకాశము కల్గుచున్నది.

దురదృష్టవశాత్తు, శాసననిర్మాణమందు కాని, బడ్జెట్టును తయారుచేయుటలో కాని, మంత్రాంగవర్గము నేర్పరచుటలో కాని, ఈసభవారికి, ప్రజాప్రతినిధిసభ వారితో పాటు, కొంతవరకైన సమానప్రతిపత్తికలుగ కుండుటచే, జర్మనీ వారి రాజ్యాంగమం దత్యంత హీనస్థానము నలకరించు చున్నది. క్రిందటి ఐదుఆరువత్సరములనుండి, ఈసభ సమకూడుటయే లేదన్న ఆశ్చర్యము లేదు. కాని, భవిష్యత్తునందు, ప్రజాస్వామిక రాజ్యాంగము వివిధదేశములందు జయమంది, కార్మికులకు సంతృప్తికల్గించి, అన్ని పార్టీలను సక్రమ రాజ్యాంగ పధమందుంచవలయునన్న, "వస్తునిర్మాతకుల సభ"కు ఇప్పుడు సెనెటుసభకంటె హెచ్చు ప్రాముఖ్యత, అధికారము సంప్రాప్తమగుట అత్యవసరము. ప్రజాసామాన్యమునకు తగు ప్రాతినిధ్యము కల్గిననే, రాజ్యాంగము సురక్షితమగును. "వస్తునిర్మాతకుల శాసనసభ" ఇప్పటి భాగ్యవిభజనపద్ధతికి భంగముకల్గించకుండ ప్రజాస్వామికమును ప్రజలకు ప్రీతికరమొనర్చుట కుపయోగపడును._________________