ఆధునిక రాజ్యాంగ సంస్థలు/ఆఱవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఆఱవ ప్రకరణము.

సెనేటుసభ.

ఇప్పటి కమలులోనున్న ముఖ్యమగు ప్రజాస్వామిక రాజ్యాంగములందు, అన్నిటియందు రెండుసభలు శాసననిర్మాణాది కార్య నిర్వహణమునకై ఏర్పరుపబడియున్నవి. అందొక్క సభను "ప్రజాప్రతినిధి సభ" యనియు మరొకటి "సెనెటు" సభయనియు సాధారణముగా వ్యవహరించుచున్నారు. ప్రజాప్రతినిధి సభయందు వోటరులైన వారందరియొక్క ప్రతినిధులు సభ్యత బొందియుందురు. సెనెటుసభయందు ప్రజల యొక్క పెద్దలే ప్రాతినిధ్యత బొందుట సాధారణమై యున్నది. ఆస్ట్రేలియా, అమెరికాదేశములందు వోటరులెల్లరు రెండుసభలయొక్క సభ్యల నెన్నుకొను హక్కు కల్గియున్నను వోటరులెందెవరైనను ప్రజాప్రతినిధి సభాసభ్యత్వమున కభ్యర్ధులుగా నిలబడనగును గాని సెనెటుసభకు ధనికులైనవారుగాని, అనుభజ్ఞులైన వారుగాని, దాదాపు నడివయస్కులైనవారే అభ్యర్థులుగా నిలబడ నర్హులు. కనుక ఒకటి ప్రజల సభయనియు, మరొకటి పెద్దల సభయనియు చెప్పనొప్పును.

ఇన్ని దేశములందును రెండు శాసనసభలు ఒకే కార్య నిర్వహణమునకై యవసరమాయని అనేకులు క్రిందటిశతాబ్దారంభమునుండియు ప్రశ్నించు చున్నారు. ఆదిమకాలపుగ్రీసు దేశమందొక్క శాసనసభయే చాలియుండ, రోమను రాజ్యమందు సెనెటుసభగూడ యేర్పరుపబడియుండెను. కాని రోమనురాజ్యమందు రాజ్యాధికారముక్రమముగా సెనెటు సభనుండి ప్రజాప్రతినిధి సభవారికి చెందుటవలన రెండు శాసనసభలు తప్పవాయెను. అటులనే ఫ్రాన్సు, ఇంగ్లాండుదేశములందును ప్రప్రధమమునుండియు మూడు శాసనసభలు చిద్రూపము బొందుచుండెను. కొంతకాలమునకు రెండుసభలే స్థిరపడెను. ఫ్రాన్సునందు విప్లవము జరుగువరకు, ఇంగ్లాండునందు 1688 రాజ్యాంగ సంస్కరణములు అంగీకరింపబడువరకు, సెనెటుసభవారికె రాజ్యాంగమందు అధిక్యత సంపాదితమై యుండెను. అమెరికాదేశమందు రాజ్యాంగనిర్మాతలు సమ్మేళన రాజ్యాంగపు ప్రత్యేక సమస్యల పరిష్కారార్థమై (సభ్యరాష్ట్రముల హక్కుల సురక్షితపరచుటకై) రెండు శాసనసభల సమ్మేళనరాజ్యాంగమం దేర్పరచిరి. ఇంగ్లీషువారి రాజ్యాంగవిధానమున కలవాటుజెందిన ఆరాజ్యాంగవిధాన నిర్మాతలు తమ సభ్యరాష్ట్రములందును రెండు శాసనసభలుండుట మేలనితలంచిరి. ఇంగ్లీషువారి రాజ్యాధికారము అమెరికాపై సాగుచున్న దినములందే అనేక రాష్ట్రములందు రెండు సభలుండెను. కనుక సెనెటుసభ నేర్పరచుట రాజ్యాంగనిర్మాతలకు సహజకృత్యముగనే తోచెను. అప్పటినుండి అమలులోనికి వచ్చిన ప్రజాస్వామిక రాజ్యాంగములందు రెండు శాసనసభల నేర్పరచుట రాజ్యాంగ రక్షణమునకై లాభకరమను యభిప్రాయముతో వివిధదేశముల నాయకులు రెండు శాసనసభలను ఏర్పరచుచుండిరి.

శాసనసభలయొక్క ప్రధానధర్మమగు శాసననిర్మాణముగూర్చియె రాజ్యాంగ నిర్మాతలు శ్రద్ధవహించి, శాసననిర్మాణము జాగ్రత్తగా, శ్రద్ధగా, నెమ్మదిగా, శుభప్రదముగా జరుగుటకై ప్రజాప్రతినిధిసభ చాలదను భ్రమచే సెనెటుసభ యగత్యమను యభిప్రాయము బొందుచుండిరి. శాసన నిర్మాణమన్న, ఆదిమకాలమునుండియు వచ్చుచున్న భయము, రాజ్యాంగనిర్మాతల వదలకుండుటచే త్వరపడి ఎప్పుడెట్టి శాసనముల ప్రజాప్రతినిధి సభవారు నిర్మింతురో యను సందియముతో సెనెటుసభను నిర్మించు టగత్యమని వారు తలంచుచుండిరి. ఆధునిక కాలమందు ప్రజల సాంఘి కార్థిక నైతికమత రాచకీయ కట్టుబాటులు, అవసరములు, దినదినమునకు మారుచుండుటయు పెరుగుచుండుటయు; ఆకట్టు బాటుల అవసరముల ననుసరించియె ప్రభుత్వము తన వ్యవహారముల నడపుచు ప్రజల కన్నివిధముల చేయూతనిచ్చుచుండవలెనన్న, ప్రభుత్వపు నియమములు, శాసనములు ఎల్లప్పుడు పునర్విమర్శింపబడుచు పునర్నిర్మాణము బొందుచు దినదిన ప్రవర్ధమానమగు చుండుటయు, అగత్యమని రాజ్యాంగ నిర్మాతలం దధిక సంఖ్యాకులు గమనించరైరి. ప్రజలయందు ప్రజ్వలించుచుండు సంస్కరణాభిలాషలు అతి త్వరితముగ శాసనరూపము దాల్చకుండుటకే రెండవసభను నిర్మించుట తగునను యభిప్రాయమునకు వారు లోనగుచుండిరి. ఇతరదేశములందు రెండుసభలగత్యమని తలంపబడుచుండ తమకుమాత్రము అవసరము కావాయని కొందరు వాదించుచుండిరి. ఎటులనెననేమి ఇప్పటికి అధిక సంఖ్యాకమైన రాజ్యాంగములందు రెండు శాసనసభ లేర్పరచబడియున్నవి.

ఆధునిక రాజ్యాంగావసరములబట్టి, ఎంతవరకు సెనేటు సభ (పెద్దలసభ) అవసరమో ఆలోచించుదము. శాసననిర్మాణమునకై ఈసభ యగత్యమా? ఇప్పటి కధికారమందున్న ధనికులు, భూస్వాములపక్షీయులు, మితవాదులు, ప్రజలన్న భయమొందువారు సెనేటుసభ యగత్యమని వాదింతురు. ప్రజలు రాచకీయానుభవములేనివారుగనుక స్వార్థపరులగు లేక అవిచారులగు లేక అనుభవరహితులగు ప్రజానాయకుల బోధలకు తలలొగ్గి, త్వరపడి వేలం వెర్రిగా అనగత్యమగు, అపాయకరమగు, అన్యాయము వృద్ధిగావించుశాసనములను, తమ ప్రజాప్రతినిధిసభద్వారా నిర్మింతురని వీరు వా కొనుచున్నారు. నిర్ధనికులు అధిక సంఖ్యాకులు గనుకను, కార్మికులు రాచకీయవిజ్ఞానరహితులుకానను తృటిమాత్రమున భూలోకము స్వర్గప్రాయముగ జేయుట సాధ్యమనినమ్మి అల్పసంఖ్యా కులగు ధనికులు, భూస్వాములు, నాయకులు, యజమానులు విద్యాధికులహక్కుల నిర్మూలన మొనర్చి, ఆస్థిపాస్థుల హక్కు భుక్తముల పంచుకొనగోరి, స్వాపరాధమును శాసననిర్మాణముద్వారా కల్గించుకొనగోరెదరుకాన, వారి అవిచారతను ఆపి, సంకుచితదృక్పథమును చంపి, శాంతమును, ఓర్పును, న్యాయమును ప్రచారిత మొనర్చుటకు సెనేటుసభ యవసరమని వారు తలంచుచున్నారు.

మితవాదులగు రాజ్యాంగవేత్తలు రాజ్యాంగవ్యవహారములు రానురాను క్లిష్టతమమగుటచే వానిని జాగ్రత్తగ విమర్శించి, మంచిచెడ్డలనాలోచించి యుక్తమగు కార్యవిధానము నిర్ణయించి, దాని నమలులోపెట్టుటకు తగు మంత్రివర్గమును నిర్మించి, దానిని పెత్తనమందు కొంతకాలమువరకు నుంచి, ఆమంత్రివర్గపు కార్యముల జాగరూకతతో విమర్శించుచు, మంత్రుల అదుపుఆజ్ఞలందుంచి, ప్రజాభిప్రాయమును పాటించునట్లుచేయుటకే ప్రజాప్రతినిధిసభవారి కాలమంతయు వ్యయమగుచున్నది కనుక, శాసననిర్మాణమునకు తగిన సావకాశము కల్గుటలేదని చెప్పుచున్నారు. రాచకీయపక్షములు బలిష్టతబొంది, ప్రజాప్రతినిధిసభయందు పక్షములకార్యప్రణాళికల ననుసరించి దీర్ఘమగుచర్చల జరుపకుండనే ప్రజాప్రతినిధులకు స్వతంత్రముగా ఆయాబిల్లుల విచారించుట కవకాశము కల్గించకుండనే బిల్లుల సభవారిచే నంగీకరింపజేయుట సులభమగుచున్నదందురు. మరియు, మంత్రివర్గమువారికి జెందిన మెజారిటీపార్టీవారు తమ మంత్రివర్గమువారు ప్రవేశపెట్టు బిల్లులను, దీర్ఘ విమర్శనలకు లోనుగా జేయకుండనే మైనారిటీపార్టీ వారికిగూడ నట్టిబిల్లులను తగినట్టు విమర్శించుట కవకాశముకల్గించకుండనే శాసనసభ వారిచె నంగీకరింపబడునట్లు చేయుచుందురు. మంత్రివర్గమువారికి గత్యమగు, శాసనసభవారి అనుమతిబొందనగు వ్యవహారముల చర్చించుటకే, సభవారి వ్యవధినెంతో, మంత్రివర్గమువారు స్వీకరించుటచే బిల్లుల చర్చించుటకుగల వ్యవధితగ్గుచుండుటయు, ఆవ్యవధియందే, ఏయేబిల్లులచర్చించుట కెంతకాలము సభవారు ఉపయోగించనగునో, మంత్రివర్గమువారే నిర్ణయించుచుండుట ప్రజాప్రతినిధిసభకు బాధ్యత వహించు మంత్రివర్గముల బొందిన, బ్రిటిషు ప్రజాస్వామిక రాజ్యములు, ఫ్రాన్సు, జర్మనీదేశములందును ఆచారమైయున్నది. కనుక అవ్యవధిగా అసంతృప్తికరముగా, అసంపూర్తిగా చర్చింపబడిన బిల్లులు సెనేటుసభ వారిచేపునర్విమర్శింపబడక పూర్వమే శాసనములుగా ప్రకటింపబడుట యుక్తముగాదని ఈమితవాదులు తలంచుచున్నారు. వీరివాదము పూర్తిగా దుర్బలమైనదనిగాని స్వలాభప్రేరితమైనదని గాని చెప్పుటకుసాధ్యపడదు.

ప్రజాస్వత్వవాదు లేకొందరు ప్రజాప్రతినిధిసభయొక్క అసమర్థత గురించి చాలవిచారపడుచున్నారు. అమెరికాయం దలి అనేక రాష్ట్రియశాసనసభలవలె స్థానికముగా ప్రాధాన్యతవహించియుండు ధనికులు కర్మాగారాధిపతులు జమాందారుల మాటలకులోనై, వారి ప్రతిభకుదాసులై శాసనసభాసభ్యులు అల్పసంఖ్యాకులకు, కొందరువ్యక్తులకు, ఏకంపెనీకో, ఏవాణిజ్యాధికారులకో ప్రత్యేకలాభముల కల్గింపబూనుకొని, ప్రజాసామాన్యపు లాభనష్టములలెక్కింపక ప్రజాస్వత్వముల వమ్ముజేసి అనర్ధదాయకమగు శాసనముల ప్రజాప్రతినిధి సభలు అంగీకరించునేమో యను భయముచేవారు పీడింపబడుచున్నారు. అనుభవమందనేక శాసనసభలిట్లు దుర్మార్గముగ ప్రవర్తించియుండుటచే, వీరిభయసంభ్రమములు భ్రమ ప్రమాదములని చెప్పుటకు వీలు లేదు.

ముందుగా, ధనికులు, భూస్వాములు, తదితర స్వసంఘస్వత్వములకై యాతురతజెందువారికి ఎట్టిసమాధానము సాధ్యమో విచారింతము. ప్రజాస్వామిక రాజ్యాంగము, వివిధదేశములం దేర్పరచబడినపిమ్మట ఎచ్చటను, ప్రజాప్రతినిధిసభ అల్పసంఖ్యాకులగు యీధనికులు, భూస్వాములు, కర్మాగారాధిపతులయొక్క న్యాయమగునట్టిగాని, ఆచారముచే బలపరపబడినను అన్యాయమగునట్టిగాని హక్కులను, అకస్మాత్తుగాగాని, త్వరితముగాగాని, పూర్తిగాగాని, భంగపరుపజాలినదని చెప్పజాలము. జనబాహుల్యము, బీదలకే జెందియున్నను, అన్ని దేశములందును, హెచ్చుగా ధనికుల, వారి అనుయాయుల ప్రాపకము నిలబడియుండుటయు, మంత్రివర్గములు వారికేలోబడియుండి ప్రజాప్రతినిధి సభలయందలి అధికసంఖ్యాకులగు సభ్యులు వారిపై ఆధారపడియుండుటయు అనుభవసిద్ధమైయున్నది. లేబరుమంత్రివర్గముల ననుభవించిన ఆస్ట్రేలియా, ఇంగ్లండు, జర్మనీదేశములయందును, ఆమంత్రి వర్గములు పతనమొందినపిమ్మట పెత్తనమునకొచ్చిన ధనికుల మంత్రివర్గములే హెచ్చుకాలము రాజాధికారముబొంది యుండుటయు, లేబరుమంత్రివర్గములు పాటకపుజనులకు సుముఖమౌ కార్యముల నెరవేర్చుటకు శాసనముల నిర్మించుటకు కల్గినయవకాశములకంటె ధనికుల మంత్రివర్గములకే హెచ్చు యవకాశములు కల్గుచుండుటయు చరిత్రప్రసిద్ధము. లేబరుపార్టీ వారు, మెజారిటీయందుండినకాలమున ఏదేశపు ప్రజాప్రతినిధిసభయందైనను, అయుక్తమగునట్టిగాని, అధర్మమైనట్టిగాని, ధనికుల పతనమును అతిత్వరితముగా కల్గించునట్టిగాని, బిల్లులుకాని, కార్యప్రణాళికలుగాని, అంగీకరింపబడి యుండలేదు.

మరియు, ప్రజాసామాన్యమునకంతకు వోటుహక్కు వచ్చి ఏబదివత్సరములైనను ఇంగ్లండునందలి పార్లమెంటులో మెజారిటీని ఈనాటికి లేబరుపార్టీ సంపాదింపలేకున్నది. ఆస్ట్రేలియాయందలి సమ్మేళనరాజ్యాంగమందును, రాష్ట్రీయ ప్రభుత్వములందును, లేబరుపార్టీ సుగమముగాగాని, సంపూర్ణము గాగాని, ఆధిక్యతపొంద లేకున్నది. జర్మనీ ఫ్రాన్సుదేశములందింకను లేబరుపక్షములు తమంతతామే మంత్రివర్గముల నేర్పరచుయోగ్యత పొందజాలకున్నవి. వార్తాపత్రికాబలము పార్టీనిధులబలము ధనాడ్యులగు అభ్యర్థులబలము పార్టీప్రచారబలము ధనాథికులపక్షములగు కన్సర్వేటివు లిబరలుపార్టీలకున్నట్లు లేబరుపార్టీ వారికేదేశమందును కలుగుట లేదు. పేరునకు అల్పసంఖ్యాకులైనను ధనికులప్రాపకము అత్యధికమని అనుభవమే నిరూపించుచున్నది. బీదలైయున్న ప్రజలందు (అందుముఖ్యముగా స్త్రీలలో) ధనికులన్నను, వారిఆచారములన్నను, వారిమాటలన్నను, వేషములన్నను, అత్యంతమగు భ్రాంతివ్యామోహతకలదు. ప్రతికార్మికుడును స్వతంత్రుడు కాగోరుచుండును. ప్రతికార్మికుని భార్యయు, ధనికురాండ్రవేషభాషలననుకరింప బ్రయత్నింపుచుండును ప్రతికార్మికకుటుంబమును ధనికులుకాగోరుచు, ధనికులహక్కుల హెచ్చుజేయ నిచ్చగించుచు, ఎప్పటికైన ధనికులమనిపించుకొన గోరుచుండును. మధ్యతరగతివారు కార్మికులతక్కువగా జూచుచు, ధనికులవేషముల ననుకరింపుచు, తామును ధనికులమనే భ్రమయందుమున్గితేలుచు, తాము పడిమొల్చినవారము కామని గర్వించుచు, ఎల్లప్పుడు భూస్వాములు తదితర పురాతన కుటుంబీకులమనుకొనువారితో సంబంధబాంధవ్యములు నేర్పరచకొనగోరుచుందురు. కనుక ప్రతిసంఘమందును, అధోగతి యందున్న బీదలు, కార్మికులు, తమతమస్వత్వముల వృద్ధిపరచుకొనగోరి ధనికులు భూస్వాములకు కల్గుప్రత్యేక హక్కులు అవకాశములు అక్రమముగా సంక్రమించుచున్నవని తెలుసుకొనకున్నారు. ధనికులు అదృష్టజాతకులనియు వారితోనేదే నొకవిధముగా సంబంధము, బాంధవ్యము, సాహచర్యము, నెరపుట గౌరవప్రదమనియు, బీదలందెక్కువమంది తలంచుచున్నారు. ధనికులుపోషకులుగానున్న సంఘములందు భూస్వాములు సభ్యులుగానున్న సంస్థలందు ధనికులు భూస్వాములు తదితరులతో కలసిమెలసి సంచరించుచుండు వ్యవహారములందు ఏదో యొకవిధముగా చేరుటే గొప్పతనమను పిచ్చిభ్రమకు ప్రజాసామాన్యమింకను ఎల్లదేశములందును లోనైయున్నది. ప్రస్తుతపు సాంఘికార్థిక రాచకీయపు టేర్పాటులు కాకులనుకొట్టి గద్దలకు వేయునట్లు తమ్మునిరసపరచి అల్పసంఖ్యాకులగు భూస్వాముల, కర్మాగారాధిపతుల, ధనికుల బలపరచుచున్నను రహస్యమును బీదలుగ్రహింపజాలకున్నారు. ఇట్టిపరిస్థితులందు వోటరులందింకను అధికసంఖ్యాకులు వివిధదేశములందు లిబరలు కన్సర్వేటివు పక్షీయులకే వోటుల నిచ్చుచున్నారన్న ధనికులకు భూస్వాములకు చెందినమంత్రివర్గములు బలిష్టతబొంది పెత్తనమునకు వచ్చుచున్నవన్న ఆశ్చర్యమేమి? ఈవిధముగ తమప్రతిభ అప్రతిహతముగ సాగుచున్నప్పుడు ప్రజాప్రతినిధిసభవారు తమ్ముమించి తమస్వత్వము లభంగపరచుటకు ధైర్యపడునని వాదించుట ధనికులకు తగునా? ప్రజలం దెవ్వారికైన ఇప్పటి ప్రజాప్రతినిధిసభలపై అసంతృప్తికల్గుటకు కారణమున్నచో వారుప్రజాసామాన్యముకాని, ధనాధికులు కర్మాగారాధిపతులు భూస్వాములు మాత్రముకాదు.

మితవాదులు జూపెట్టు అభ్యంతరములు సెనెటు సభయొక్క యగత్యతను నిరూపించజాలవు. ప్రజాప్రతినిధిసభవారు ప్రజలయందు ప్రజ్వరిల్లుచుండు తాత్కాలికోద్రేకాభి ప్రాయములకు ప్రాధాన్యతనిచ్చి అనవసరమగునట్టివే కాక, అనర్ధదాయకపు బిల్లులనంగీకరించి శాసనములుగా నిర్మించు నేమోయనిగదా వీరిభయము. ఇప్పటికమలులోనున్న ప్రజాస్వామిక రాజ్యాంగములన్నిటియందును, ప్రజలకగత్యమగు శాసనములు తగినంతత్వరితముగా నిర్మితములగుట లేదనియు, శాసనసముదాయము ప్రజాభిప్రాయమునకేగాక ప్రజావసరములకెంతో వెనుకబడియున్నదనియు అనుభవైక వేద్యము. శాసనసముదాయమిట్లు ప్రజావసరములకు వెనుకబడియుండుటవలన ఆశాసనములకు భాష్యముల సిద్ధాంతీకరించి తమ సమ్ముఖమునకు తేబడిన కేసులందు తీర్పు జెప్పుటలో కాలానుగుణమగు ధర్మశాస్త్రముల నిర్వచించుటకు న్యాయమూర్తుల కవకాశముకల్గుటయు, తన్మూలమున ప్రజలయొక్క హక్కుబాధ్యతలు వారికిబాధ్యులగు ప్రజాప్రతినిధిసభవారిచే నిర్ణ యింపబడక నిరంకుశులగు న్యాయమూర్తుల యభిప్రాయములపై యాధారపడియుండు దుస్థితితటస్థించుచుండును. ఇంగ్లండునందు స్త్రీలయొక్క ఆస్థిపాస్థిహక్కులు, వైవాహిక విధబంధనపుటేర్పాటులు, తండ్రిలేని బిడ్డలగతి, ఆదిగాగలవిషయములందిప్పటికిని పార్లమెంటు ప్రజలందరిచే కోరబడు శాసనముల నిర్మించకపోవుటచే, ఆదేశస్థులకనేక యిబ్బందులుకల్గుచున్నవి. ఫ్రాన్సునందు ప్రజాసామాన్యమంతయు, స్త్రీలకు వోటుహక్కు ప్రసాదించుటకు సుముఖమైయుండ, శాసనసభలు ఆహక్కును నిరాకరించుచున్నవి. అమెరికాయందిట్లే ప్రజలనేక నూతనవ్యవహారముల పరిష్కార మొనర్చుటకు శాసనములనిర్మింప ఎంతోకాలమునుండి అవసరపడుచుండ, ఆదేశపు రాజ్యాంగవిధానపు చట్టమునకు విరుద్ధమను నెపముపై శాసనసభలా శాసనముల నిర్మింప బూనుకొనకున్నవి. ఇందువలన ఈవిషయములందు, న్యాయమూర్తుల కెంతో నిరంకుశాధికారము సంప్రాప్తమగుచున్నది.

ఈపరిస్థితులందు ప్రజాప్రతినిధిసభ త్వరపడి అనవసరమగు శాసనములనిర్మించునని వాదించుట న్యాయముకాదు. ఐతే ప్రజాప్రతినిధిసభవారు అంగీకరించిన అనేక అనవరరమగు, అన్యాయకరమగు బిల్లులను సెనేటుసభవారు నిరాకరించియున్న దృష్టాంతముల నీ మితవాదులుజూపెట్టుచున్నారు. కాని, సెనేటుసభవారెటులైన నట్టిబిల్లుల తిరస్కరింతురను నమ్మకముండుటవలననే అనేక ప్రజాప్రతినిధులు వానికి సుముఖముగా తమవోటులనిచ్చిరని కూడ జూపెట్టసాధ్యమగును. తాముచేయదగు కార్యమును మరొకరు సరిజూడనగునని తలంచునంతవరకు తమచే నంగీకరింపబడిన బిల్లుల నిరాకరించుటకు, అట్టికార్యమునకు బాధ్యతవహించుటకు మరొక సభవారు కలరను తలంపుకల్గువరకు ప్రజాప్రతినిధిసభ బాధ్యతకల్గి ప్రవర్తించుట దుస్తరముగదా? తాము ఆయాబిల్లుల నంగీకరించి వానిని బలపరచు ప్రజలనమ్మికను జూరగొని, ఆబిల్లుల నిరాకరించు సెనేటుసభపై నిందమోపుటకు వీలున్నంతవరకు ప్రజాప్రతినిధిసభవారు బాధ్యతకల్గి తమ విధిని నిర్వర్తింపకున్న ఆశ్చర్యమేమి?

బాధ్యతలేకుండా ప్రవర్తించుట కిట్టిసదుపాయమున్నను ఈకాలపు శాసనసభలయందలి ప్రజాప్రతినిధిసభలు సాధ్యమైనంతవరకు బాధ్యతకల్గియే ప్రజలయొక్క నిజాభిప్రాయముల కన్గొనియే ప్రజలక్షేమాభివృద్ధి కారకమగునట్టి బిల్లులనే అంగీకరించుచున్నవని చెప్పకతప్పదు. అందులో నాశ్చర్యమేమియు లేదు. ప్రజాప్రతినిధిసభవారు తమనడతకు తాము బిల్లులయెడజూపువైఖరికి తమచే నిల్పబడు ప్రభుత్వపుచర్యలకు ఆప్రభుత్వముచే ప్రతిపాదింపబడు బిల్లులకుగాను ప్రజాసామాన్యమునకు బాధ్యతవహించవలసియున్నది. మెజారిటీ యందున్న పక్షమున తన మంత్రివర్గముద్వారా ప్రజాసా మాన్యమునకు అంగీకృతమగు బిల్లులనే ప్రవేశపెట్టించుటకు బ్రయత్నించుచుండును. అందేబిల్లుపైకాని వివాదముకల్గి ;జనరలుఎన్నికలు' వచ్చుచో ప్రజలు తమ పరమైయుండుటకే వారాశించుచుందురు. కనుక, బాధ్యతరహితముగా అనవసరమగు ప్రజలచే వాంఛింపబడని ప్రజానాయకులచే నిరోధింపబడుబిల్లులను ఆమెజారిటీపార్టీవారు ప్రజాప్రతినిధిసభయందు ప్రవేశపెట్టించుటకొప్పుకొనరు. మంత్రివర్గమును ప్రభుత్వ కార్యనిర్వహణమందు తగిన అనుభవమును బొందుచుండును. కనుక ప్రభుత్వవ్యవహారములకు తగినట్లుగా ప్రజాభిప్రాయానుసారముగా నుండునట్టి బిల్లులనే తయారుచేయుటకు సంసిద్ధమగును. ఈ మెజారిటీపార్టీ వారి నెదిరించుచు మంత్రివర్గపు చర్యల విమర్శించుచు చేయబడుచున్న, చేయబడనున్న, దుష్కార్యముల ప్రజలకయిష్టమగు బిల్లుల జాగ్రత్తగా సహేతుకముగా చర్చించుటకు మైనారిటీపార్టీ యెల్లప్పుడు కాచుకొనియుండును, కనుక, ప్రజాభీష్టమున కెదురైన ప్రతిబిల్లును ఎదిరించి దానిపై ప్రజలకుండు వైమనస్యతను వృద్ధిపరచి బహిరంగముగా ప్రజాభిప్రాయమును ప్రకటింపజేసి తప్పుదారులబడిన మంత్రివర్గమును దానికాధారమగు మెజారిటీపార్టీని ప్రజాసంఘమధ్యమందు అప్రతిష్ట పాలగునట్లుచేయుటకు మైనారిటీపార్టీ అనిశము వేచియుండును. ఇట్టిస్థితిగతులందు మెజారిటీయందుంటిమిగదా యను గర్వముతో ఏపా ర్టీయు, తన మంత్రివర్గముద్వారా ప్రజాసామన్యమునకు కంటగింపుకల్గించు బిల్లుల ప్రజాప్రతినిధిసభయందు ప్రవేశ పెట్టించుటకు సాహసించజాలదు. కనుకనే, సర్వసాధారణముగా ప్రజాప్రతినిధిసభవారు బాధ్యతనుమరచి ప్రజల కగత్యమగు బిల్లుల నంగీకరించుట తటస్థించదని చెప్పుటకు సాధ్యమగుచున్నది.

రెండుసభలనుకల్గిన రాజ్యాంగములందును ఒక్కొక్కప్పుడు అనవసరమగునట్టివేకాక, అపకారముకల్గించునట్టి శాసనములుకూడ నిర్మింపబడుట కాననగును. మనుష్యులచే జేరిన శాసనసభలు, మనుష్యులవలెనే, అప్పుడప్పుడు, పొరపాటులొనర్చుచుండుట సహజమే. కాని, ఒక్కసభవారొనర్చినపొరపాటునే, రెండవసభవారును జేసిరన్న ప్రజాప్రతినిధిసభయొక్కటియే తప్పిదమొనర్చుననియు, ఆతప్పుల దిద్దుటకు "పెద్దలసభ" యవసరమను వారివాదము బలహీనతపొందుట లేదా?

మరియు, సెనేటుసభ వారు ప్రజలకు ప్రజాప్రతినిధిసభవారివలెనె అంతగా బాధ్యతబొందియుండరు. ప్రజలును మంత్రాంగవర్గము నేర్పరచి ప్రభుత్వమును సాగించుట కధికారముబొందియున్న ప్రజాప్రతినిధిసభపై హెచ్చుశ్రద్ధజేయుచుందురుగాని, మంత్రాంగవర్గమువారిచే ప్రతిపాదింపబడు బిల్లుల పునర్విమర్శనమాత్రముచేయగల్గిన సెనేటుసభవారి చర్యల నంతగా గమనించుచుండరు. ఇందువలన ప్రజాభిప్రాయముననుసరించి ప్రజాభీష్టము నెరవేర్చుటకు ప్రజాప్రతినిధిసభవారాతురతపడునట్లు సెనేటుసభవారు ప్రయత్నించరు. కనుక, ప్రజాశయముల తిరస్కరించి తమకునచ్చిన యేఅల్పసంఖ్యాకులకు లాభకరమగు బిల్లులనో బలపరచుటకు సెనేటుసభవారు సాహసించకలరు. కాని, ప్రజాప్రతినిధిసభవారట్లు చేయజాలరు. అట్లుకాక, ప్రజాప్రతినిధిసభవారుకూడ ఎప్పుడైన ఏకొలదిమందిధనికులకో, భూస్వాములకో, కర్మాగారాధిపతులకో ప్రత్యేకలాభముల కల్గించుబిల్లుల నంగీకరించినచో వానిని సత్వరముగను, సంతోషముగను, సెనేటుసభవారామోదించుట దుస్సాధ్యము. కనుకనే అమెరికాదేశపు సభ్యరాష్ట్రముల శాసనసభలు ప్రజాసామాన్యమునకు నష్ట దాయకమగు శాసనముల నెన్నిటినో అంగీకరించి తమ యధికారముల వమ్ముజేసుకొనెను. ఇందాశ్చర్యమేమియు లేదు. సెనేటుసభవారు ధనికులాదిగాగల అల్పసంఖ్యాకుల కెల్లప్పుడుసుముఖమైయుందురు. ప్రజాసామాన్యపు అధికారములు హెచ్చగుచో ఈసభవారు జాగ్రత్తగా విముఖతజూపెదరు గాని, ప్రజాప్రతినిధిసభవారే తమధర్మముమరచి అల్పసంఖ్యాకులకు లాభములు కల్పింపబూనుకొనుచో ఈసెనేటుసభవారుత్సాహపడుట వింతయేమికలదు? సెనెటుసభయందు, వృద్ధులును, పూర్వాచారాపరాయణులును, మిత వాదులును, "పోయిన కాలమే పుణ్యకాలము. వర్తమానమె కష్టకాలము, రానున్న కాలము కష్టతరముగాదా" యని సంశయించు నిరాశులును, ధనికులును, కర్మాగారాధిపతులును, భూస్వాములును, జనసామాన్యపు హక్కులందు అవిశ్వాసము జూపువారును సభ్యులుగా నుండుట జూడనగును. ఈసభవారికి శాసనముల మార్చుటగాని, నూతన శాసనముల నిర్మించుటగాని, అంతగా మనస్కరించదు. ఈకాలపు భాగ్యవిభజనపద్ధతి, అనగా కోట్లకొలది ప్రజలకు చిల్లిగవ్వలు, కొలదిమందికి కోటానకోట్లు ధనము లభ్యపడు పద్ధతి, ఈసభవారికి, సత్యకాలపుటేర్పాటుగా దోచును. ఇప్పటి సాంఘికపుటలవాటులుగాని, ఆర్థిక కట్టుబాటులు గాని, రాచకీయపు వ్యవహారములు గాని, మార్పుబొందరా దనుపట్టుదల వీరికి కలదు. కనుక, ప్రజా సామాన్యమునకు హెచ్చుహక్కుల ప్రసాదించుటకు గాని, ప్రజలకు ఆర్థికవ్యవహారములందు పెత్తనముకల్గుటకుగాని, రాచకీయమునం దత్యంతప్రాముఖ్యత సంపాదితమగుటకాని, సాంఘికముగా ఆత్మగౌరవము హెచ్చగుటగాని, ధనికుల, భూస్వాముల గౌరవాధిక్యతలకు లోటుకల్గించునను భయ మీసభవారికి అన్నిదేశములందును కలదని చెప్పవచ్చును. ఇట్టిసభవారు, ప్రజావసరముల గుర్తించి, తగునట్టి శాసన ముల నిర్మించుటెట్లు? ప్రజల కగత్యమగు బిల్లుల ప్రజాప్రతినిధిసభవారు అంగీకరించినను, ఈసభవారు వానిని నిరోధించి, ప్రజాశయముల భంగపరుపరా? ఈకాలపు ప్రజాస్వామికములందు, ప్రజావసరముల కెంతగానో శాసనసముదాయములు వెనుకబడియుండుటకు, ఈసెనెటుసభవారు ముఖ్యకారకులని చెప్పకతప్పదు.

ప్రతిరాజ్యాంగమందును, ప్రజలెల్లర అధమము మూడుతరగతులుగా తమరాచకీయాభిప్రాయములందు విభజింపనగును. మార్పుల నంతగా గోరక ధనికులప్రభావము నట్లేయుంచి, ఇప్పటివిపరీతపు భాగ్య విభజనపద్ధతిని చెక్కు చెదరకుండ నుంచదలచువారొక పక్షీయులు. వీరినే కన్సర్వేటివులని, కాపిటలిస్టులని, కుడిపక్షమువారని పిల్చుట కలదు. ఈకాలపు భాగ్యవిభజన పద్ధతిని మార్చి, ప్రజా సామాన్యమున కంతకు సమాన ఆర్ధికజీవిత హక్కుల ప్రసాదించి, సాధ్యమైనంతవరకు ప్రజలచే సృష్టించబడుచున్న భాగ్యమును ప్రజలందరిమధ్య సమానముగా, (వారివారి అవసరముల గమనించుచునె) పంచియిడుచు, ప్రజాసామాన్యపుజీవితము కలకలమనునటుల ఆదర్శప్రాయమగునటుల, భాగ్యవంతముగ, సరస్వతి కాలవాలముగ నుండునటుల జేయగోరువారు మరొకపక్షీయులు. వీరినే లేబరుపార్టీ యనియు, సోషలిష్టులనియు పిల్చుట కలదు. ఈ యిరుపక్ష ములమధ్యను నిలబడి ఈకాలపు ఆర్ధిక రాచకీయపు టేర్పాటుల, ధర్మసూత్రముల ననుసరించి కొంతవరకు మార్చు టగత్యమని యంగీకరించుచు, దేశపుభాగ్యమును ప్రజలందరి మధ్య పంచుట లాభకరముగాదని వాదించుచు, వాణిజ్య వ్యాపారాభివృద్ధికొరకై అల్పసంఖ్యాకులగు ధనికులు, భూస్వాములు, కర్మాగారాధిపతులు నాయకత్వము వహించి యుండుట లాభకరమును, అవసరమును నని పట్టుపట్టువారు మధ్యపక్షమువారు. వీరినె సెంట్రలుపార్టీయనియు, లిబరలు పార్టీయనియు రాడికలు పార్టీయనియు పిల్చుచుండుట కలదు.

సెనెటుసభయందు లేబరుపక్షమున కేదేశమందును సభ్యతకల్గుట లేదు. అమెరికాయందు లేబరుపక్షము రాచకీయజీవిత మందు లేదనియే చెప్పవలెను. ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్సుదేశములందు, లేబరుపార్టీవారికి సెనేటుసభలలో చాల కొద్దిగా సభ్యత కల్గుచున్నది. కాని మొత్తముమీద అన్నిదేశములయొక్క సెనెటుసభలయందును, కన్సర్వేటివు పక్షీయులే మెజారిటీయందు గలరు. కనుక ప్రజాప్రతినిధిసభయందు, కన్సర్వేటివుపక్షీయులే మెజారిటీ యందుండి, మంత్రివర్గము నేర్పరచి, బిల్లులను ప్రవేశపెట్టుచో, వానినంతశ్రద్ధగా విచారింపకయే సంపూర్ణసుముఖతతో సెనెటుసభ వారంగీకరించు చున్నారు. ఇందువలన కన్సర్వేటివుపక్షమువారు రాజ్యాధికారమందున్నప్పుడు, సెనెటుసభవారు సక్రమ ముగా వ్యవహరించుట లేదు. బిల్లులు ప్రజాప్రతినిధిసభవారిచే యంగీకరింపబడినట్లే తుదకు శాసనరూపముదాల్చును. కాని లిబరలుపార్టీకాని, లేబరుపార్టీగాని పెత్తనమున కొచ్చినచో, వెంటనే సెనెటుసభవారు నిద్రనుండి మేల్కొన్న కుంభకర్ణునివలె శరపరంపరలుగా ప్రజాప్రతినిధిసభవారి బిల్లుల నన్నిటి అసందర్భముగా, అన్యాయముగా, అక్రమముగా విమర్శించ బూనుకొని ఎన్నిటి నిరాకరింతుమా యను యాతురత బొందుచుందురు. కనుక ఈసభవారు శాసన నిర్మాణకార్యమునందు, ప్రజాప్రతినిధి సభవారికి చేదోడై తమయనుభవము కార్యచతురత నుపయోగించి ప్రజలకు వలయు శాసనముల నిర్మించుటకు తోడ్పడుటకుమారు, తమ కయిష్టమగు మంత్రివర్గమువారి శాసననిర్మాణకార్యక్రమ విధానమును విధ్వంసమొనర్చుటకే బూనుకొనుచుందురు. కాననే అనేక రాజకీయజ్ఞులు సెనెటుసభవారి కనుకూలమగు పార్టీ రాజ్యాధికారమందున్న కాలమం దనవసరమగుననియు వ్యతిరేకమగు పార్టీ మంత్రివర్గమేర్పరచిన ప్రతిష్టంభన జేయునుగాన, నష్టదాయకమనియు వాదించుచున్నారు.

ఐనను ప్రజాప్రతినిధిసభవారికి ఈకాలముబట్టి అగత్యమగుచుండు శాసనముల నిర్మించుటకు తగుపాటి వ్యవధి కల్గుటలేదనిమాత్రము ఎల్లరంగీకరింపక తప్పదు. నానాటికి ప్రభుత్వపు కార్యవిధానము క్లిష్టతరమగుచున్నది. ప్రభుత్వముచే నడుపబడు వాణిజ్యములు హెచ్చుచుండుటయు, దానిచే పరీక్షింపబడు అదుపాజ్ఞలం దుంచబడువాణిజ్య వ్యాపారముల ప్రాముఖ్యత హెచ్చుటయు, ప్రభుత్వమునుండి రక్షణగోరు ప్రజాసమూహములు వృద్ధిబొందుచుండుటయు, దానిద్వారా తమతమ జీవితములు శుభప్రదముగాజరుగుట కవసరమగు శాసనముల సృష్టించవలసియుండుటయు తటస్థించుచున్నది. ఇట్టి ప్రభుత్వమును సాగించు మంత్రివర్గముయొక్క యాధిపత్యమును కడుంగడు జాగరూకతతో, పరీక్షించుచు, ప్రజాభిప్రాయము ననుసరించియే రాజ్యాంగము నడుపబడునట్లు చేయుధర్మము, ప్రజాప్రతినిధిసభవారిపై యున్నది. ఈధర్మమును సంతృప్తికరముగా, శక్తివంచనలేకుండ నడపుటకే, ఆసభవారి శక్తియుక్తులన్నియు, వ్యవధిఅంతయు నుపయోగపరుపబడుచున్నవి. ఇకనీప్రభుత్వ వ్యవహారములకే సంబంధించిన శాసననిర్మాణకార్యమును నిర్వర్తించుచు, ప్రజలయొక్క సాంఘికార్థిక రాచకీయజీవితమునకును, రాజ్యాంగపుటేర్పాటునకును తగుసంబంధము నేర్పరచుట కగత్యమగు శాసన నిర్మాణ మొనర్చుటకు తగువ్యవధి, సావకాశము, ప్రజాప్రతినిధిసభకు కల్గుట దుస్తరమగుచున్నది. కనుక, ఈకార్యనిర్వహణమందు, ప్రజాప్రతినిధిసభకు తగుపాటిసహాయము చేయుటకు సెనేటుసభయుపయోగమేమో విచారించుట అప్రస్తుతము కాదు. వర్తక వాణిజ్యవ్యవహారములకు సంబంధించినంత వరకు, సెనేటుసభవారికి శాసననిర్మాణాధికార మొసంగుట వలన ఎట్టియాపదలు సంభవించునో, అమెరికావారి రాష్ట్రీయ శాసనసభల వృత్తాంతములు చెప్పుచున్నవి. ధనికుల, వ్యాపారుల, భూస్వాముల పరమగు సెనేటుసభవారు ఆయల్పసంఖ్యాకుల కగత్యమగు శాసననిర్మాణ కార్యమును, నిష్పక్షపాతముగా, ప్రజలకు లాభకరముగా, దేశాభ్యుదయ కారకముగా జేయజాలరుగదా! తదితరవిషయములం దగత్యమగుశాసనముల నిర్మించుటలో నిష్పక్షపాతముగా, ధర్మాధర్మముల విచారించి, యుక్తాయుక్తములగమనించి, పార్టీలతత్వమును మించి, ప్రజావసరములనే లెక్కించి, తనధర్మము నిర్వర్తించుటకు, సెనేటుసభవారు, తగియుందురని చెప్పజాలము. ప్రజాప్రతినిధిసభవారు ప్రజాసామాన్యపు దృక్పధమునుండియు, సెనేటుసభవారు ధనికులదృక్పధమునుండియు ప్రతివిషయమును విచారించుచుందురు గనుక ఈసభలమధ్యను ఎల్లప్పుడు సంఘర్షణ కలుగక తప్పదు, సంఘర్షణకాలమందు రెండుసభలును తామెవ్వరిపై ఆధారపడియుందురో వారి ప్రత్యేకావసరములనే గమనించుచుండును. ప్రజాస్వామ్యమునందు ప్రజాప్రతినిధిసభకే, ప్రజలయభిప్రాయముల తెల్పుటకును ప్రజాశయములచొప్పున శాసనముల జేయుటకును హక్కుయుండవలెనుగాని, ధనికులకె, భూస్వాములకే చెందియుండు సెనేటుసభవారికట్టి హక్కుయుండుట భావ్యము గాదు. మరి యిట్టిస్థితియందు శాసననిర్మాణము సక్రమముగా జరుగుటెట్లు యని కొందరికి సందేహము కలుగవచ్చును. ఏశాసనమైనను ప్రజలకగత్యమగునా? కాదాయని నిర్ణయించుటకు ప్రజాప్రతినిధిసభకంటె హెచ్చుహక్కు సెనేటుసభవారి

రిఫరెండము.

కుండజాలదుగదా! ఆసభకంటెను హెచ్చుశ్రద్ధతో ఏయేశాసనమగత్యమో చెప్పకల్గిన హక్కు ప్రజలకేగలదు. కనుకనే, ప్రజాస్వామిక రాజ్యాంగవాదులు సెనేటుసభను బలపరచుటకుమారు ప్రజాప్రతినిధిసభవారు అంగీకరించు బిల్లులపై ప్రజలయొక్క ఆమోదమునుబొందుటయే మేలని వాదించుచున్నారు. శ్రద్ధతో, ప్రతిబిల్లును తగురీతి చర్చించి ప్రజావసరముల గమనించి తమకుండు రాచకీయయానుభవము ననుసరించి ప్రజాప్రతినిధిసభ వారంగీకరించిన పిమ్మట అయ్యది తమకు ఇష్టమో,కాదో, తెల్పుటకు, ప్రజలసమక్షమందు బెట్టుటకంటె కర్తవ్యమెద్దియు లేదని వారివాదము. ఈవిధానమునే "రిఫరెండము" అని పిల్తురు. కాని, ప్రతిబిల్లును "రిఫరెండమునకు" బెట్టుటవలన అనేక యిబ్బందులుకల్గునని గమనించవలసి యున్నది. ప్రజలకు, తమకు నివేదింపబడినబిల్లుల పరీక్షించి మంచిచెడ్డలతేల్చగల్గిన శక్తి లేకున్నది. వారిరాచకీయపక్షములు, సంఘములు, స్నేహితులెంతగా వారికి సలహానిచ్చినను, వ్యాపారములగూర్చియు, వాణిజ్య వ్యవహారములగురించియు, వివిధనే రముల నిరూపించుటకు తదితరవిషయముల గూర్చి తయారు కాబడుబిల్లుల విచారించుశక్తిలేకున్నది. కనుక, వాదప్రతివాదములకు తీవ్రముగా తావిచ్చు ఏకొన్ని బిల్లులగూర్చియో తప్ప, ప్రజలకు సాధారణబిల్లులగూర్చి శ్రద్ధకలుగుట దుస్తరము. కాన వారి యామోదమునకు ప్రతిబిల్లును సమర్థించుటవలన ఇప్పటికన్నను హెచ్చుబాధ, శాసననిర్మాణము నందెదుర్కొనవలసివచ్చును. ఇప్పటికే ఏసంస్కరణనైనను, ప్రజలయందు ప్రచారితమొనర్చి ప్రజాప్రతినిధి సభయందు చర్చింపజేసి వివిధరాచకీయకక్షలవారి దృష్టికిందెచ్చి, తుదకాసభవారిచే యామోదింపజేయుసరికి అనేక వత్సరములు పట్టుచున్నది. ఇక యీశ్రమకుతోడు "రెఫరెండమును" గూడ తెచ్చిపెట్టుచో, ఇంకెన్నో వత్సరములు ఏసంస్కరణకైనను శాసనము నిర్మించుటకు పట్టును.

ఈరహస్యమును గమనించియే, 'రిఫరెండము' పద్ధతి నవలంభించిన రాజ్యాంగములన్నిటి యందును, వోటర్లందరిలో ఇరువదివ వంతుమందికాని, మరేవంతుమందికాని, ప్రజాప్రతినిధిసభవారిచే అంగీకరింపబడిన బిల్లును 'రిఫరెండము' నకు తేవలయునను నియమము చేర్పించుట కలదు. జర్మనీయందు మంత్రివర్గమువారిచే ప్రోద్బల పరచబడిన ప్రెసిడెంటుగారు, శాసనసభలచే నంగీకరింప బడిన బిల్లును రిఫరెండమునకు తీసుకొనిరావచ్చును. కాని, మంత్రివర్గమువారిచే కోరబడినబిల్లులపై నిట్టిచర్యతీసుకొనుట చాల అరుదుగా జరుగును. చెకో స్లావాకియా దేశమందు రెండుసభలచే నంగీకరింపబడిన బిల్లుపై 'రిఫరెండము' కావలెనని మంత్రివర్గమువారు కోరుచో "రిఫరెండము" నకట్టిబిల్లు తేబడవలెను. వోటింగునకు వచ్చిన వారిలో మెజారిటీవారు, అటో యిటో తీర్మానించగలరు. "రైష్" శాసనసభలవారిచే అంగీకరింపబడినబిల్లును, శాసనముగా ప్రకటింపరాదని, ప్రజాప్రతినిధిసభ వారిలో మూడవ వంతుమంది వారుకోరుచో, రెండుమాసములవరకు, ఆబిల్లును ఆపుదలచేయవలెను. అంత, వోటరులలో ఇరువదవవంతు మంది "రిఫరెండము" కోరుచో, ఆబిల్లు "రిఫరెండము" నకు తేబడును. ఆరెండుమాసముల వ్యవధియందే, రెండుశాసనసభలును ఆబిల్లు అత్యంతావసరమని తీర్మానించినచో, వెంటనే, శాసనముగా ప్రకటింపబడును. ఇందువలన చీటికి మాటికి ప్రతిబిల్లును "రిఫరెండము"నకు దెచ్చుటకు వీలులేకున్నది. కాని, మైనారిటీయందున్న పార్టీ, "రిఫరెండమున" కేబిల్లునైనను తెప్పించుటకు శక్తికల్గియున్నది. ఒకవేళ "రిఫరెండము"లో వివాదగ్రస్తమగు బిల్లు అంగీకరింపబడుచో, "రిఫరెండము"ను కోరినపక్షము అప్రతిష్టపాలగును గనుక, మైనారిటీపక్షముకూడ మాటిమాటికి "రిఫరెండము" కావలెనని ఆందోళనజేయుటకు బూనుకొనదు.

ప్రజలకగత్యమగు, ప్రజలచే వాంఛితమగు బిల్లులనే, ప్రజాప్రతినిధిసభవారు నిర్మించినను వారట్టిబిల్లును సక్రమ ముగా సంతృప్తికరముగా నుండునట్లు నిర్మించుటకుగాను, తగు సావకాశము కల్గియుండుటలేదు గనుక, సెనెటుసభ వారగత్యముకాదా? అట్టిపరిస్థితులందు సెనెటుసభవారు పార్టీ పద్ధతులనవలంబించక బిల్లులందంతర్గర్భితమగు సూత్రములభంగపరుపక బిల్లుల అంగుఆకారముల సక్రమముగా దిద్దుటకు పూనుకొనుచో, ఉపయోగపడగలదు. కాని, అట్టిసభ "శాసననిర్మాణస్థాయిసంఘము"లయొక్క ధర్మములనే నిర్వర్తించవలయును. కనుక ప్రత్యేకముగా నవసరమేయుండదు. మరియు 'శాసననిర్మాణస్థాయిసంఘ' మందు ప్రజాప్రతినిధిసభయందలి వివిధపార్టీలప్రతినిధులు వారివారిబలగముల ననుసరించి ప్రాతినిధ్యతబొందియుండ సెనెటుసభయందు కన్సర్వేటివుపక్షీకులే అధికసంఖ్యాకులై యుందురు కాన స్థాయిసంఘమే హెచ్చు సంతృప్తికరమైనది.

ఇట్టి స్థాయిసంఘమువారు, తమకునివేదించబడిన బిల్లులను సమగ్రముగా విచారించి అవసరమగుమార్పుల సూచించుచు, తిరిగి ప్రజాప్రతినిధిసభకు పంపుచుందురు. తమచే నిర్మితమగు తమపెద్దలచేకూడిన స్థాయిసంఘమువారే సూచించిన సూచనలు ప్రజాప్రతినిధిసభవారికి రుచ్యములగును, కాని ఆసూచనలనె, సెనెటుసభవారుచేయుచో, ప్రజాప్రతినిధిసభవారు వానియందు సుముఖులైయుండుట దుస్తరము. స్థాయిసంఘముల సూచనల పునర్విమర్శనజేసి ప్రజాప్రతినిధి సభవారు ఆయాబిల్లుల పునర్నిర్మాణమొనర్చుట కవకాశ, ముకలదు.

ప్రజలయందే ఆసభయందుజర్చింపబడబోవు, చర్చింపబడుచున్న బిల్లులను ప్రచారమొనర్చుటకుగా రాచకీయపక్షములు ప్రతిపట్టణమందును స్థాపించదగు 'రాచకీయగోష్టు' లందు ప్రజానాయకులచేతను వక్తలచేతను చర్చింపజేయనగును. వార్తాపత్రికలందును ఆయాబిల్లులగుణాపగుణముల విచారింపనగును. వివిధప్రాంతములందు, ప్రజాభిప్రాయము కన్గొనుటకై వివిధరాచకీయపక్షములు తగుప్రచారమొనర్చిన పిమ్మట, సూక్ష్మముగా 'రిఫరెండము' నెత్తవచ్చును. ఈవిధముగా ప్రతిబిల్లును సలక్షణముగా నుండునట్లు జేయుటకు, సెనెటుసభయొక్క సహాయము లేకనే స్థాయిసంఘములద్వారా, గోష్టులసహాయముతో రాచకీయపార్టీల ఆందోళనవలన స్థానిక 'రిఫరెండము'ల ద్వారా, ప్రజానాయకులు తగు ప్రయత్నములు చేయనగును. అత్యవసరమైనప్పుడు 'రిఫరెండమ'ను అంకుశము నుపయోగించి అనవసరమగు బిల్లుల నురు మాడుట కవకాశముకలదు.

ప్రజల కగత్యమగు బిల్లులను, ప్రజాప్రతినిధిసభవారు తమ పై నున్న కార్యభారమును భరింపజాలక ప్రవేశపెట్టుట లేదు గనుక వానిని "సెనెటుసభ" వారు బయలుదేరదీయుదురని కొందరందురు కాని, కదాచితుగాతప్ప ప్రభుత్వమే తన వలయునన్న ప్రజాప్రతినిధిసభవారిచేగాని, వారి స్థాయిసంఘమువారిచేగాని, తగునట్లు పరిష్కరింపబడుట యుత్తమము. ఈ నియమమును జర్మను అమెరికారాష్ట్రముల రాజ్యాంగము లంగీకరించుచున్నవి.

ఇవ్విధముగా సకాలమున ప్రజాప్రతినిధిసభవారు బిల్లులు ప్రవేశపెట్టునట్టుచేయుటకు "ఇనిషియేటివు" ఆసభవారిచే నిర్మింపబడుబిల్లులు ప్రజాంగీకారము బొందునా, లేదా, యని పరీక్షించుటకు "రిఫరెండము" అను రెండు విధానముల నేర్పరచినపిమ్మట సభయందు ప్రవేశపెట్టబడిన బిల్లుల తగురీతి సంస్కరించి సవరించుటకు స్థాయిసంఘముల స్థాపించి ఆయాబిలులు ప్రజలయందు గోష్టులు, పత్రికాపక్ష ప్రచారములద్వారా ప్రచార మొనర్చిన తరువాత శాసననిర్మాణకార్య విధానము సంతృప్తికరముగా జరుపబడకుండునా? ఇన్ని సదుపాయముల నేర్పరచినపిమ్మటకూడ సెనెటుసభ యగత్యమా?

"రిఫరెండము"ను, "ఇనిషియేటివు" ను, చాలాకాలమునుండి స్విడ్జర్లండు ఉపయోగించుచున్నది. క్రిందటి ముప్పది సంవత్సరములందు, అనేక అమెరికను రాష్ట్రములుకూడ, ఈవిధానముల నంగీకరించినవి. "రిఫరెండము" ప్రజాప్రతినిధి సభవారికి చేయూతగానుండుటమారు సెనెటువారికే సహాయమొనర్చుచు, అనేక అవసరమగు, లాభకరమగు బిల్లులు నిరాకరింపబడుట కుపయోగించెను. ప్రజాసామాన్యము, రాచకీయ అజ్ఞానమందుమున్గి తేలుచు, మంచిచెడ్డల నెరుంగక, తమ కగత్యమగు బిల్లులగూర్చి తగినంతజ్ఞానము బొందకుండుటయే యిందులకు కారణము. ఇటులనే "ఇనిషియేటివు" ద్వారా అనేక బిల్లులు బయలు దేరదీయబడినను, ప్రజలయొక్క "రిఫరెండము"ద్వారా నిరాకరింపబడెను. ప్రజలయం దెంతో ప్రచారమొనర్చి పార్టీలచే సంస్కరణావసరముల గుర్తింపచేసి, ప్రజాప్రతినిధులచే, ప్రవేశపెట్టబడబోవు బిల్లుల నంగీకరింపచేసి, తుదకు బిల్లుల ప్రవేశపెట్టి సభవారిచే సమ్మతింపజేయువరకే ఎన్నో వత్సరముల తరబడి సంస్కరణవాదులు కష్టనష్టములబొందవలసి వచ్చుచున్నది. దీనికితోడు, "రిఫరెండము"నందు ప్రజలందరిచే, ఆయా బిల్లుల నంగీకరింపజేయుట కెంతో బాధపడవలసి వచ్చుట వలన, శాసననిర్మాణము ఆపబడుటయు సంస్కరణములు అసాధ్యమగుటయు, అభివృద్ధి స్తంభించిపోవుటయు, తటస్థించును. ఇట్టి పరిస్థితులందు, శాసననిర్మాణకార్యమును మరింత కష్టతమ మొనర్చుటకు 'సెనెటుసభ' యవసరమా?

శాసననిర్మాణమునకై, సెనెటుసభ ప్రత్యేకముగా యవసరముకాకున్నను, సమ్మేళన, రాజ్యాంగములందు సభ్యరాష్ట్రముల యొక్క ప్రత్యేకతను సురక్షితపరచుటకై సెనెటుసభ యొకటుండుట మేలనియు, అందు వివిధరాష్ట్రముల మధ్యగల ధనధాన్య జనసంఖ్య భూవిస్తీర్ణతభేదముల గమనించక అన్నిటికి సమానమగు సభ్యతనిచ్చుట శ్రేయమనియు రాకీయజ్ఞులనేకులు వాదించుచున్నారు, కాని అమెరికా యందలి సెనెటులో ప్రతిరాష్ట్రమునకు యిద్దరుసభ్యులున్నను వారు, ఆయారాష్ట్రములందలి వోటరులందరిచే యెన్నుకొనబడుచున్నారు గనుక, సెనెటుసభ్యులు ప్రజాప్రతినిధి సభాసభ్యులవలెనే ప్రజాభిప్రాయమున భేద మేమంతంగా జూపెట్టకయే ప్రకటింపకల్గుచున్నారు. సెనెటుసభ్యు లేమాత్రము ప్రత్యేకించి, రాష్ట్రీయ స్వత్వములగురించి శ్రద్ధజేయుచుండుట లేదు. ఇటులనే ఆస్ట్రేలియాయందును, సెనెటుసభ్యులు ప్రజాప్రతినిధిసభా సభ్యులువలెనే, ప్రజలందరిచేతనే యెన్నుకొనబడుచున్నారు. రాగాపోగా, సెనెటుసభ్యులకు, ప్రజాప్రతినిధిసభాసభ్యులకు గలభేద మెల్ల మొదటివారు రాష్ట్రమొక్కొక్కటి ఒక్కనియోజకవర్గముగాగా అందలివోటర్లచే యెన్నుకొనబడుచుండ రెండవవారు జిల్లాలవారిగా నున్న నియోజకవర్గములనుండి వచ్చుచున్నారు. ఇటుల శాసన నిర్మాణమందు ప్రజాభిప్రాయ ప్రకటనమందు సెనెటుసభ్యులు ఈరెండు సమ్మేళన రాజ్యాంగములందు, ప్రజాప్రతినిధి సభాసభ్యులతో భేదించకున్నను సమ్మేళనమందుజేరిన సభ్యరాష్ట్రములకు జెందదగుహక్కుల సురక్షితపరచుటకై కొన్ని హక్కులబొంది, కొన్ని బాధ్యతల నిర్వర్తించవలసియున్నది. జర్మనీయందలి సభ్యరాష్ట్రములు పరస్పరముగా సమానసభ్యత్వము సెనెటుసభయందు పొందక ప్రషియా, బవేరియా రాష్త్రములు చాలతక్కువగాను, తదితరరాష్ట్రములు వాని జనసంఖ్యనుపట్టి హెచ్చుగాను సభ్యత నివ్వబడియున్నవి. ఈసభ్యులు ఎన్నుకొనబడుటకుమారు సభ్యరాష్ట్రీయప్రభుత్వముల ప్రతినిధులై యున్నారు. ఈసభవారును సమ్మేళన రాజ్యాంగపు ప్రత్యేకవిధులు కొలదిగా నిర్వర్తింపుచున్నారు. ఇంతయైనను అమెరికాయందుతప్ప తదితర సమ్మేళన రాజ్యాంగములందు, సెనెటుసభ లేకుండగనే రాజ్యాంగవ్యవహారములను ప్రజాప్రతినిధిసభవారు సంతృప్తికరముగా చక్కబెట్టి అవసరమగు శాసననిర్మాణము జేయగలరని చెప్పుటకు తగు యాధారము కలదు.

రెండవశాసనసభ ప్రజాప్రతినిధిసభవారికి సహాయముచేయుటకే అగత్యమగుచో అయ్యది "నస్తునిర్మాతకుల" దైయున్న మేలు. అట్టిసభ నేర్పరచుటవలన ఇప్పటిపెద్దల సభలవలన కల్గునష్టములు కలుగవు. పైగా అనేకలాభములు చేకూరవచ్చును.

ఈవిధముగ రాజ్యాంగసూత్రముల ననుసరించియు, రాజ్యాంగానుచరణపు ఫలితముల బట్టియు జూచిన, నిరర్థకముగా

ఇంగ్లాండు.

నుండు సెనెటుసభ, వివిధరాజ్యాంగములందు ఏర్పరచబడినది. ఈసభవారు ప్రజా ప్రతినిధిసభతోబాటు సమానగౌరవప్రతిపత్తుల సంపాదించుకొని, రాజ్యాంగమున ప్రాధాన్యత బొందజాలకున్నారు. ఇంగ్లాండునందు వంశపారంపర్యాయతా, సభ్యత్వపు హక్కు గల్గిన ప్రభువులచే జీవితాంతమువరకు న్యాయమూర్తులుగా నుండు ప్రభువులచే, ప్రభువులసభ నిండియున్నది. కాని కామన్సు సభవారిముందు, ఎందులకు కొరగాకున్నది. క్రీ. శ. 1911 ఆక్టుప్రకారము కామన్సుసభవారిచే తమ ప్రతికూలమును లెక్కగొనక, రెండుమారులు ఏమార్పులులేకుండ అంగీకరింప బడినబిల్లు శాసనమగును కనుక ప్రభువులసభకు తక్కువస్థానమే లభ్యమగుచున్నది. కవులు, గాయకులు, శాస్త్రజ్ఞులు, కళాభిజ్ఞులు, రాచకార్యధురంధరులు, వాణిజ్యశిఖామణులును జీవితాంతపు ప్రభువులుగా నొనర్చి ఈసభయందు సభ్యులుగా జేసి ఈప్రభువుల సభ కిప్పటికంటె గౌరవము, ఆధిక్యత, అనుభవజ్ఞానము సంపాదితమగునట్లు చేయవలెనని కీ. శే. శ్రీలార్డు బ్రైసుగారు తమ కమిటీనివేదికయందు సూచించిరి. కాని ఇప్పటివరకు ప్రభువుల సభను సంస్కరించుట సాధ్యపడుట లేదు. ఐనను లేబరు ప్రభుత్వము, మైనారిటీపార్టీపై యాధారపడియుండి, హెచ్చుకాలము పెత్తనమందుండుటకు వీలులేకుండుటచే, వారిచే నంగీకరింపబడి కామన్సుసభవారిచే ఆమోదింపబడినబిల్లులను ప్రభువులసభవారు తిరస్కరించి తాత్కాలికముగా, లేబరుశాసననిర్మాణమును మట్టుపెట్టకల్గిరి.. జర్మను రైషులైర్ అనుపెద్దల సభయందు వివిధసభ్య రాష్ట్రప్రభుత్వముల ప్రతినిధులే, సభ్యత్వముబొందియుందురు గనుక,

జర్మని.

రైష్‌టాగ్ నందలిసభ్యులకన్న ధైర్యము పట్టుదల వారికుండజాలవు. ప్రజాప్రతినిధులముందు ప్రభుత్వనియామకులెట్లు ప్రజాభిప్రాయముగురించి తర్కించగలరు? కనుకనే ఈరెండు శాసనసభలమధ్య భేదాభిప్రాయముకల్గుచో, "రైష్‌రాత్" వారు 'రైష్‌టాగ్‌' వారిచే వివాదగ్రస్థమైనబిల్లు అంగీకరింపబడిన పదునైదుదినములలో తమ అభ్యంతరమును ప్రభుత్వమునకు తెలియపరచవలయును. రిపబ్లికుప్రెసిడెంటుగారు, అట్టిఅభ్యంతరము బయలుదేరిన మూడుమాసములలో ఆబిల్లును 'రిఫరెండము'నకు తేవచ్చును. ఆతడట్లు 'రిఫరెండము' కోరనిచో ఆబిల్లు శాసనము కా జాలదు. కాని, మూడింట రెండువంతులుగా రైష్‌టాగ్ వారట్టిబిల్లు అత్యవసరమనియు, రైష్‌రాత్ వారి అభ్యంతర మనవసరమనియు తీర్మానించుచో, మూడుమాసములు లోగా ప్రెసిడెంటుగా రట్టిబిల్లును శాసనముగానైన ప్రకటించవలెను. లేదా, "రిఫరెండము"న కద్దానిని తేవలయును. 'శాసననిర్మాణమును రైష్‌టాగ్‌వారు చేయుదురు.' అను చట్టపుప్రకటనయే, 'రష్‌రాత్‌' యొక్క నిర్బలత, నిస్సారత తెల్పుచున్నది. కెనడా దేశమందు సమ్మేళనరాజ్యమున సెనేటు సభ కలదు. అందు ఒక్కొక్క రాష్ట్రమునకు 24 సభ్యులు చొప్పున మొత్తము

కెనడా.

72 సభ్యులు ప్రధమమునకలరు. కాని, అందలి సభ్యుల నెల్లర తాత్కాలికముగా పెత్తనమందున్న మంత్రివర్గమువారు అవసరముకల్గి నప్పుడెల్ల జీవితాంతమువరకు ముప్పదివత్సరముల వయస్సు మించినవారిని ఆస్థిపరులగు వారిని సెనెటుసభ్యులుగా నియమించనగును. అవసరమగునప్పుడెల్ల ఆర్గురు క్రొత్తసభ్యుల నియమించుటకు ప్రభుత్వమునకు హక్కుకలదు. మొత్తముమీద డెబ్బదియెనిమిదిసభ్యులకు మించకుండ నుండవలయును. కనుక మంత్రివర్గమువారిచే ప్రతిపాదింపబడు బిల్లులను ప్రజాప్రతినిధిసభవా రంగీకరించినపిమ్మట చర్చించి సాధారణమార్పుల సూచించుటకే సెనెటుసభవారికి ధైర్యముండునుగాని, ప్రజాప్రతినిధిసభవారిచే తిరిగి బలపరుపబడు బిల్లు నెదిరించుటకు ధైర్యముకలుగజాలదు. కనుక ఇంగ్లాండునందు ప్రభువులసభ తాత్కాలికముగా, మంత్రివర్గపుశాసన నిర్మాణకార్యక్రమము నాపుటకు శక్తికల్గియుండ జర్మనీయందు నట్లే రైష్‌టాగ్ వారి బిల్లులు శాసనములు గాకుండజేయుటకై తాము అభ్యంతరముల బెట్టిగాని, "రిఫరెండము" కోరిగాని, అడ్డంకులు బెట్టుటకు "రైష్‌లైల్" న కవకాశముండ కెనడాయందు మంత్రివర్గముచే ప్రవేశబెట్టబడి ప్రజాప్రతినిధిసభవారిచే నామోదింపబడిన బిల్లుల నిరాకరించుటకు, సెనెటుసభవారి కేమాత్రము శక్తిజాలకున్నది. ఇట్టిసభవలన యిక లాభమేమికలదు? తుదకీసభకు ప్రజాప్రతినిధిసభ యొక్క స్థాయిసంఘమునకుండు స్వాతంత్రమైనలేదుగదా?

ఫ్రెంచిరాజ్యాంగమునందలి సెనెటుసభ, కెనడా రాజ్యాంగపు సెనెటుకంటె, బాధ్యతకల్గియున్నది. జర్మనుదేశపు రైష్‌రాత్ వలె, రాష్ట్రీయప్రభుత్వములచే నియమింపబడిన సభ్యులచేకాక, ప్రజలందు కొందరిచే ఎన్నుకొనబడిన సెనెటురులచే,

ఫ్రాన్సు.

ఫ్రెంచిసెనెటు అలంకరింపబడుచున్నది. ప్రజాప్రతినిధిసభ్యులును, జిల్లా, తాలూకాబోర్డుల సభ్యులును, మ్యునిసిపాలిటీలు (కమ్యూనులు) తరుచుగా ఎన్నుకొనిన డెలిగేటులును, సెనెటరుల నెన్నుకొనుట కధికారముబొందియున్నారు. ప్రతిజిల్లాయు ఒక్కనియోజకవర్గముగా నేర్పరపబడినది. అందలి వోటరులెల్లరు ఎన్నికలందు పాల్గొని, సెనెటరుల నెన్నుకొందురు. ఈవిధముగా ప్రజాప్రతినిధులచే సెనెటరులెన్నుకొనబడుచున్నారు గనుక కొంతవరకైనను, ప్రజాభిప్రాయమును తెలుసుకొనుటకు ప్రజలఆలోచనల గ్రహించుటకు సెనెటరులకు సాధ్యమగుచున్నది. ప్రతిసెనెటరును తొమ్మిదివత్సరముల వరకు సభ్యత్వము బొందియుండును. ప్రజాప్రతినిధిసభాసభ్యులు నాల్గువత్సరముల వరకె సభ్యత్వముబొందును. కాన సెనెటరునకు హెచ్చు శాసనసభాసభ్యత్వానుభవము కల్గుటకు సాధ్యముకాగలదు. ఇందువలన, సెనెటుసభవారు, అనేక మారులు ధైర్యముతో ప్రజాప్రతినిధిసభవారి నెదిరించుట కుద్యుక్తులై యుందురు. ఈ రెండుసభలమధ్యను అభిప్రాయభేదము కల్గుచో, వివాదగ్రస్తమగు బిల్లునుగురించి, తీర్మానమునకు వచ్చుటకై, ఈ సభానాయకులు కలసి, ఏదేనొక రాజీకి రాప్రయత్నించవచ్చును. రాజీ సాధ్యముకానిచో రెండుసభలును కలిపి, ఏకసభగా (నేషనల్ అస్సెంబ్లీ) సమావేశమె, ఆబిల్లును చర్చించి, ఏదేనొక తీర్మానమునకు రాబ్రయత్నించవచ్చును. ప్రజాప్రతినిధి సభయందు 584 సభ్యులును, సెనెటునందు 300 సభ్యులే యుండుటవలన, ఈరెండుసభలమధ్య కల్గు వివాదమును చులకనగా ప్రజాప్రతినిధిసభవారికి సుముఖముగా నుండునటుల తీర్మానించ సాధ్యమని తలంచరాదు. ఈరెండు సభలయందును రాచకీయపార్టీ లున్నవి. కనుక మితవాదులు, కన్సర్వేటివుపక్షములవారు సెనెటునందెక్కువ ప్రాముఖ్యత వహించి యుండుటచే, ఆపార్టీవారు, ప్రజాప్రతినిధిసభయం దే యే బిల్లుల నెదిరించుచున్నారో, ఆబిల్లులను రెండుసభలయందున్న తమబలగములనన్నిటిజేర్చి 'నేషనల్ అస్సెంబ్లీ' యం దట్టిబిల్లులను చులకనగా నోడించనగును. కాన, ఫ్రాన్సునందు సెనెటుసభవారు ప్రజాప్రతినిధిసభవారి శాసననిర్మాణ కార్యక్రమమును, వీలుగానున్న ధనికులకు సుముఖముగా జరుగునట్లుచేయును. లేదా, జయప్రదముగా ప్రతిష్టంభనముచేయకల్గును. అనుభవమందును, రాచకీయ పరిజ్ఞానమందును, సెనెటుసభ వారు ప్రజాప్రతినిధిసభవారికంటె ఆధిక్యత కల్గియున్నను, ప్రజాభిప్రాయము ననుసరించి శాసననిర్మాణము చేయవలసిన బాధ్యతను, ప్రజాప్రతినిధిసభవారు నెరవేర్పకల్గినట్లు సెనెటుసభవారు నిర్వహింపజాలరు గనుక, ఇంతబలవంతమైన సెనెటుసభను నిర్మించుట ప్రజాభ్యుదయ కారకముగా లేదు. స్త్రీలకు వోటుహక్కు ప్రసాదించుటకు, ఫ్రెంచిప్రజలెల్లరు సుముఖులైయున్నను సెనెటుసభవారు కాలడ్డముబెట్టి, అవసరమగు శాసననిర్మాణమును నిరోధించుచున్నారు.

ఐర్లాండునందలి, ఐరిషు ఫ్రీస్టేటువారి సెనెటుసభ అత్యున్నతమగు పద్ధతులననుసరించి నిర్మింపబడుచున్నది. ఈసభ యందు (సెనెడు ఐరీషు) అరువదిమంది సభ్యులు కలరు. ఈసభ్యులు, ముప్పది ఐదు వత్సరముల వయస్సుబొంది

ఐర్లాండు.

యుండవలెను. వారు పన్నెండువత్సరములవరకు సభ్యులై యుందురు. వారిలో నాల్గవవంతుమంది, మూడు వత్సరముల కొకమారు తమస్థానముల ఖాళీచేయవలెను. ఆస్థానములకు తగుసభ్యులను, అభ్యర్థులజాబితా యందుదహరింపబడిన వారినుండి, ప్రజలెన్నుకొనవలెను. ఈజాబితాయందు, మూడువత్సరములకొక మారు ఎన్నుకొనబడదగుసభ్యులకు మూడువంతులమంది అభ్యర్ధులను, ప్రజాప్రతినిధిసభ వారు (డెయ్‌ల్ ఐరీసు) 'ప్రపోర్షనల్‌' పద్ధతిప్రకారము ఎన్నుకొన వలెను. ఈజాబితాలయందు సెనెటుసభయందు సభ్యులయి యుండువారు తిరిగి అభ్యర్థులుగా నుండగోరుచో, వారినామముల నుదహరింపవలయును. ఈజాబితాయందు వివిధమతసాంఘిక ఆర్థిక సంఘముల పెద్దల, రాజకీయవిజ్ఞానుల, అనుభవపరుల నామముల జేర్చవలసియున్నది. ఈవిధముగా ప్రజాప్రతినిధిసభవారి కంగీకారమగు పెద్దలే, అభ్యర్ధులుగా నియమింపబడుచున్నారు కనుక ప్రజలచే తుద కెన్నుకొనబడు సెనెటరులు ప్రజాప్రతినిధిసభకు వ్యతిరేకములుగాక, ప్రజాభీష్టములయెడ విముఖతజూపెట్టనివారై యుండవచ్చును. తుదకీసభవారైనను, ప్రజాప్రతినిధిసభవారివలె ప్రజేచ్ఛల నెరవేర్పతగు కుతూహలపడుట దుస్సాధ్యము కనుకను, శాసననిర్మాణము త్వరితగతి అడ్డంకులంతగ లేకుండగనే జరుగు టగత్యము కానను ఐరిషురాజ్యాంగచట్టము క్రొత్తపద్ధతుల నవలంబించుచున్నది. ప్రజాప్రతినిధిసభవారిచే నంగీకరింపబడిన బిల్లు సెనేటుసభవారిచే చర్చింపబడుటకై పంపబడినపిమ్మట 270 దినములలోగా, రెండుపక్షములకు సమ్మతమగునట్లు మార్పు జెందినను, లేక, అట్టిరాజీపద్ధతి సాధ్యపడకున్నను, రెండుసభలచే నంగీకరింపబడినట్లే పరిగణింపబడునను నియమము కలదు. ఈ తొమ్మిదిమాసముల వ్యవధియందు ప్రజాప్రతినిధి సభవారే తిరిగి తమబిల్లును సెనేటుసభవారిసలహాల ననుసరించి పునర్విమర్శన మొనర్చుట కంగీకరించి, బిల్లును కొంతవరకు మార్చుటకు పూనుకొననగును. ఈవ్యవధియందే మంత్రివర్గము మారుచో, సెనేటుసభవారి అభ్యంతరముల నన్నిటి బలపరచుటకుగూడ సాధ్యమగును. అవసరమైనచో, రెండుసభలును సమ్మేళనమై వివాదగ్రస్తమగు బిల్లును సమగ్రముగా చర్చింపవచ్చును. కాని దానిపై సమ్మేళనసభవారు వోటుచేయుటకూడదు. ఇవ్విధముగా బిల్లులు అంతఆలస్యమునకు గురి కాకుండనే శాసనములగుటకును ప్రతిబిల్లును అగత్యమైనచో, పునర్విమర్శనకు లోనగుటకు అవకాశము కల్పించబడినది. సెనేటుసభయే అగత్యమగుచో, శాసననిర్మాణము త్వరితగతి జరుగుటకు, ఈ రాజ్యాంగపు సెనెటుసభపద్ధతియే అత్యంత సుగమమని తోచుచున్నది.

అమెరికా సమ్మేళనరాజ్యాంగపు సెనెటుసభయందు, సభ్యరాష్ట్రములన్నిటికి ఒక్కొక్కరాష్త్రమునకు ఇద్దరు సభ్యులచొప్పున 96

అమెరికా.

మంది సభ్యులుకలరు. ప్రతిరాష్ట్రమునందును, ఒకే నియోజకవర్గము కలదు. రాష్త్రమందలి వోటరులెల్లరు, సెనెటుసభ్యుల నెన్నుకొనుటకు అర్హులు. సెనెటరులు, ఆరువత్సరములవరకు సభ్యత్వముబొంది యుందురు. రెండువత్సరముల కొకమారు, మూడవవంతువరకు, తిరిగి సభ్యులు యెన్నుకొనబడవలయును. ప్రతి బిల్లును, సెనెటుసభవారిచే అంగీకరింపబడిననే, శాసనముగా ప్రెసిడెంటుగారిచే ప్రకటింపబడుట కర్హతబొందును. ఒకసభవా రొప్పుకొన్నను, మరొకసభవా రంగీకరించనిచో, ఆ బిల్లు, శాసనముగా నిర్మింపబడజాలదు. శాసననిర్మాణమమం దిట్లు సెనెటుసభవారికి ప్రజాప్రతినిధిసభవారితోబాటు సమానాధికారము లభించుటవలన శాసననిర్మాణము అమెరికాయందు, చాల మందగతిబొందుచున్నది. అసలే రాజ్యాంగవిధానపుచట్టము, కాంగ్రెసుయొక్క శాసననిర్మాణాధి కారమును సంకుచితపరచుచున్నది. దీనికితోడు, ఈ రెండుసభలకు, పరస్పరశాసననిర్మాణప్రయత్నములకు ప్రతిష్టంభనము చేయకల్గుహక్కుయున్నచో, శాసననిర్మాణము జరుగుట కష్టతమమగునుగదా!

ఆస్ట్రేలియాయందలి సమ్మేళనరాజ్యాంగమందు సెనెటుసభ కలదు. ప్రతిసభ్యరాష్ట్రమునకు ఆర్గురు సభ్యులు కలరు.

ఆస్ట్రేలియా.

వీరెల్లరు, రాష్ట్రమంతయు నొకే నియోజకవర్గము కాగా అందలి వోటరులందరిచే, ప్రపోర్షనల్ ప్రాతినిధ్యసూత్రనుసారము ఎన్నుకొనబడుచున్నారు. ప్రధమసెనెటుసభ్యులను రెండుతరగతులుగ విభజించి, ఒక్క తరగతివారు మూడువత్సరముల పిమ్మట, రెండవతరగతివారు ఆరువత్సరములపిమ్మట, తమస్థానముల ఖాళీచేయుటయు, ఆ స్థానములకు తిరిగి యెన్నికలుజరుగుటయు, అవసర ము. అప్పటినుండి సెనెటుసభ్యులు, ఆరువత్సరములపాటు సభ్యత్వము బొందుదురు. కాని అమెరికా, ఐర్లండు, ఫ్రాన్సుదేశమలందువలె ఎల్లప్పుడు, సెనెటుసభ నిర్మితమైయుండునని చెప్పుటకు వీలు లేదు. గవర్నరుజనరలుగారు చట్టబద్ధమగు అవసరముకల్గునెడ, ఈసభనంతమొందించనగును.

ప్రజాప్రతినిధిసభవారిచే అంగీకరింపబడిన బిల్లును సెనెటుసభ వారు నిరాకరించుచో, లేక, అంగీకరింపనిచో, మూడుమాసములపిమ్మట, తిరిగి ఆబిల్లును, ప్రజాప్రతినిధిసభవా రంగీకరించుచో, అప్పటికిని సెనెటుసభవా రద్దాని నిరాకరించుచో, గవర్నరుజనరలుగారు, ఈ రెండుసభల నంతమొందించనగును. కాని ప్రజాప్రతినిధిసభవారు, సహజముగా అంతమొందువ్యవధి ఆరుమాసములకు తక్కువగా నున్నప్పుడుమాత్ర మాసభలను గవర్నరుజనరలుగారు అంత మొందించరాదు. నూతనముగా నిర్మింపబడుసభలు సమావేశ మొందినపిమ్మట, ప్రజాప్రతినిధిసభవారు వెనుకటి సెనెటుసభ వారిచే సూచింపబడిన సవరణల నంగీకరించిగాని, అంగీకరింపక యేగాని, తిరిగి యావివాదగ్రస్తమగు బిల్లును బలపరచుచో, అప్పటికిని నూతనముగా యేర్పడిన సెనెటుసభవారద్దాని నిరాకరింపుచో, గవర్నరుజనరలుగారు ఇరు సభాసమ్మేళన మొనర్చనగును. ఆసమ్మేళనసభవారు, ఆ బిల్లును పూర్తిగా విచారించి, తుదకు దానిపై "వోటు" నెత్తవచ్చు ను. ఆ సభయందలి సభ్యులలో మెజారిటీవా రేయేభాగముల నంగీకరింతురో, వానినన్నిటి జేర్చినచో యేర్పడుబిల్లును, మెజారిటీవా రంగీకరించినచో, అప్పుడు బిల్లు శాసనముగా పరిగణింపబడును. ఆస్ట్రేలియాయందు, ప్రజాప్రతినిధిసభలో కార్మికులకును, సెనెటునందు ధనికులకును, భూస్వాములకును హెచ్చుప్రాముఖ్యత చేకూరుచుండును. రెండుసభలును, ఒకేవోటరుబృందములచే యెన్నుకొనబడుచున్నను, సెనెటుసభకు అభ్యర్థులుగా నిలబడువారు ధనికులైయుండనిచో, ఎన్నికల ఖర్చుల భరింపజాలరుగదా! అప్పటికి లేబరుపక్షముకూడను, తదితరదేశముల సెనెటుసభలందుకంటె, ఆస్ట్రేలియా సెనెటుసభయందెక్కువ సభ్యతబొందకల్గుచున్నది. సహజముగనే, ఈ రెండుసభలమధ్య అనేకమారులు సంఘర్షణకల్గుచుండును. కొలదికాలమే పెత్తనమందుండు మంత్రివర్గమువారు తలపెట్టిన శాసననిర్మాణమును వ్యతిరేకపక్షము సెనెటుయందు ప్రాముఖ్యత బొందియుండుచో, సులభముగా నరికట్టుట సాధ్యము. కనుక శాసననిర్మాణము, ఆదేశమం దత్యంతకష్టసాధ్యమగుచున్నది. రెండుసభలును, ఒకేవోటరు సముదాయమునకు బాధ్యతవహించు చుండుటయు, అందును, ప్రజాప్రతినిధిసభాసభ్యులు చిన్న చిన్న నియోజకవర్గముల తరపునను సెనెటరులు రాష్త్రములతరపున యెన్నుకొనబడుచుండుటచే, సెనెటరులు ప్రజాప్రతినిధిసభవారి నెదిరించుట కేమాత్రము సందియ మొందరు. మరియు, వారికి తామును ప్రజాభిప్రాయమును ప్రకటించగలమను ఆత్మవిశ్వాసముగలదు. ఇట్టి పరిస్థితులం దీరెండుసభలమధ్య సంఘర్షణ తఱచుగా కల్గుటయం దాశ్చర్యమేమి?

దక్షిణాఫ్రికాదేశపు సెనెటునకు ఆదేశపు రాజ్యాంగ మంత ప్రాముఖ్యత నివ్వదలచినట్లు లేదు. ఎనిమిదిమంది సెనెటురులను

దక్షిణా
ఫ్రికా.

గవర్నరుజనరలుగారు మంత్రివర్గము వారి సలహాపై నియమించవలెను. ప్రతిసభ్య రాష్త్రమునకు, ఎనిమిదిమంది సభ్యుల నెన్ను కొను యధికారమొసంగబడెను. ప్రతిసభ్యుడును పదివత్సరముల వరకు సభ్యత్వము బొందియుండును. ఆతడు ముప్పదివత్సరములకు మించియుండవలెను. కొంతవరకు ఆస్తిపరుడై యుండవలెను. ప్రతిసభ్యరాష్ట్రమునందలి శాసనసభలు, ఒక చో సమావేశమై తమరాష్ట్రముతరపున, ఎనిమిదిమంది సెనెటు సభ్యుల నెన్నుకొనవలెను. నాల్గురాష్త్రములు కలవుగనుక సమ్మేళన సెనెటుసభయందు, నలుబది సభ్యులుందురు. ఈ సభవారు బడ్జెట్టుబిల్లులకు సవరణలు ప్రతిపాదించరాదు. ప్రజాప్రతినిధిసభవారు, అంగీకరించిన బిల్లును, ఈ సభ వా రంగీకరింపజాలనిచో, లేక, ప్రజాప్రతినిధిసభవారికి అసమ్మతికల్గించు సవరణల ప్రతిపాదించుచో, ఆబిల్లు తిరిగి ప్రజాప్రతినిధిసభవారిచే అంగీకరింపబడినను, సెనెటుసభవారద్దాని నిరాకరించినయెడల గవర్నరుజనరలు రెండుసభల సమ్మేళన సమావేశమును సమకూర్చవలెను. ఆ సమ్మేళనసభవారా బిల్లును సమగ్రముగా చర్చించి, దానిపై వోటు తీసుకొనవచ్చును. ఈ సమ్మేళనసభవారిచే నంగీకరింపబడినబిల్లును శాసనముగా గవర్నరుజనరలుగారు ప్రకటించవలెను. ప్రజాప్రతినిధిసభయందు 111 సభ్యులును, సెనెటుయందు 40 సభ్యులును కలరుగనుక, సమ్మేళనసభయందు ప్రజాప్రతినిధిసభలోని అధిక సంఖ్యాకులచే రెండుమారు లంగీకరింపబడిన బిల్లులు సాధారణముగా తిరిగి అంగీకరింపబడుట దుర్ఘటము కాదు. కనుక ప్రజాప్రతినిధిసభవా రిశాసననిర్మాణముపై పట్టుదలకల్గియుందురో ఆ కార్యమునందు వారు జయముబొందుట సుసాధ్యమగును.

నార్వేదేశపు సెనెటుసభ (లాంగ్ దింగ్, ప్రజాప్రతినిధిసభను ఒదెల్ దింగ్) యే హెచ్చు సంతృప్తికరముగా నిర్మింప బడినదని అనేక రాచకీయజ్ఞులు తలంచుచున్నారు. ప్రజాప్రతినిధిసభయందు నూటయేబది సభ్యులు కలరు. ఆసభవారే తమ ప్రధమ

నార్వే.

సమావేశమునందే తమలో నాల్గవవంతు మందిని సెనేటరులుగ ఎన్నుకొనవలెను. ఆనాల్గవవంతుమందిసభ్యు లప్పటినుండి ప్రజాప్రతినిధిసభయందు సభ్యత్వముమాని సెనేటుసభగా జేరుదురు. ప్రతిబిల్లును ముందుగా ఒదెల్ దింగ్ (ప్రజాప్రతినిధిసభ) యందు ప్రతిపాదింపబడి దానిచే అంగీకరింపబడినపిమ్మట లాంగ్ దింగ్ నకు పంపించబడును. 'లాంగ్ దింగ్‌' సభవా రాబిల్లును అంగీకరించినచో రాజు ఆబిల్లును శాసనముగా ప్రకటించవలెను. అటులకాక, "లాంగ్ దింగ్" వారు ఆబిల్లును నిరాకరించినగాని, సవరణజేసినగాని తిరిగి "ఒదెల్ దింగ్" వారు దానిని చర్చించవలెను. తమకు సవరింపబడిన బిల్లు సంతృప్తికరముగానిచో దానిని వదలివేయవచ్చును. లేదా తిరిగి తగుసవరణలతోగాని సంపూర్ణముగా వెనుకటి స్వరూపముననే ఆబిల్లును బలపరచి "లాంగ్ దింగ్" వారికి పంపించబడగా అప్పటికాసభవారద్దానిని నిరాకరింపుచో రెండు సభలసమ్మేళన సమావేశమునందు (స్టార్ దింగ్) ఆబిల్లు చర్చింపబడును. అంత నా"స్టార్ దింగు" నం దాబిల్లు పూర్తిగా చర్చింపబడినపిమ్మట మూడింట రెండు వంతులుసభ్యు లద్దాని నంగీకరించుచో రాజుగా రాబిల్లును శాసనముగా ప్రకటించవలెను. ఈ నా ర్వేపద్ధతివలన శాసన నిర్మాణము త్వరితగతి జరుగుటకును, ప్రతిబిల్లును సమగ్రముగా, సంతృప్తికరముగా చర్చింపబడుటకును, ప్రజాభిప్రాయము నెరింగి, దానియెడ సుముఖతజెంది దానిని ప్రకటించుట కుత్సాహులైయుండు ప్రతినిధులే రెండుసభలయందుండుటచే ప్రజాభిప్రాయానుసారము తగినంతత్వరితముగా బిల్లులు తయారుకాబడి శాసనములుగా ప్రకటింపబడుట సాధ్యమగుచున్నది. కాని, ఈ నార్వేవారి సెనేటుసభ పేరునకు గొప్పసభగా పరిగణింపబడుచున్నను వాస్తవముగా స్థాయిసంఘమువలెనే కార్యనిర్వహణ మొనర్చుచున్నది. సాధారణముగా స్థాయిసంఘసభ్యులు ప్రజాప్రతినిధిసభాసభ్యులై యుండి ఆసభ యెడ తమధర్మముల నిర్వర్తింపవలసి యుండుటవలన తగు వ్యవధికల్గియుండరు. కాన, బిల్లులను సంతృప్తికరముగా విచారింపజాలక పోవచ్చును. కాని వారు ప్రత్యేకముగా సెనేటు సభాసభ్యులైయుండి తమ వ్యవధినంతను మంత్రివర్గమును ఏర్పరచి దాని నదుపు నాజ్ఞలందుంచుటకు బదులు, శాసననిర్మాణమందే హెచ్చుజాగ్రత్త వహించుటచే శాసననిర్మాణమును చేయుటలో ప్రజాప్రతినిధిసభవారికి అపారమగు సహకారము చేసి రాజ్యాంగమున కమోఘమగుసేవ జేయగల్గుదురు. కనుకనే సెనేటుసభ యనునదియొక్కటి అవసరమని తలంచుచో ప్రజాప్రతినిధిసభవారితో సహకారమొనర్చుటకు సంసిద్ధపడునట్టి ఈ నార్వేవారి "లాంగ్ దింగ్" సభయే ఆదర్శప్రాయమైయున్నది.

శాసననిర్మాణమునందుతప్ప మంత్రివర్గము నేర్పరచుటయందు కాని, స్థానభ్రష్టతజేయుటలో కాని, బడ్జెట్టు

బడ్జెట్టు.

నంగీకరించుటలోను, ప్రజలపై శిస్తుల వేయుటలోను, ప్రజలధనమును ఖర్చిడుటలోను, సెనేటుసభవారి కేమాత్రము స్వతంత్రాధికారము ఒక్క అమెరికాదేశమందు తప్ప మరియే యితర ప్రజాస్వామిక రాజ్యాంగమందును ప్రసాదించబడుట లేదు. బాధ్యతాయుతమగు మంత్రివర్గము ప్రజాభిప్రాయము ననుసరించియే నిర్మింపబడి తన కార్యనిర్వహణమొనర్చ వలయునన్న ప్రజలకే సరాసరి ప్రాతినిధ్యత వహించునట్టిసభవారిచే నిర్మింపబడవలయునని ఇంగ్లీషువారు ఇప్పటి కెప్పుడో కన్గొనిరి. వారి రాజ్యాంగవిధానపు పద్ధతులనే అవలంబించినతదితర రాజ్యములప్రజలును ప్రజాప్రతినిధిసభవారికే మంత్రాంగసభపై సంపూర్ణమగు ఆధిపత్యమునొసంగిరి. ప్రజలపై ఎట్టెట్లు ఏయేశిస్తులు ఎంతెంతవరకు వేయనగునో ప్రభుత్వధనము ఎట్లు ఏయే కార్యములకై ఖర్చిడనగునో నిర్ణయించు నధికారము ప్రజలపై యాధారపడియుండి ప్రజలకు సరాసరిబాధ్యులగు ప్రజాప్రతినిధిసభవారికే చెందియుండవలె నను సూత్రమునుకూడ బ్రిటిషువారినుండియే తదితరులు గ్రహించిరి. కనుక, ప్రజల కిష్టమగు మంత్రివర్గమును నిరాకరించుటకు అల్పసంఖ్యాకులకు జెందిన సెనేటుసభ వారి కధికారముకల్గుట న్యాయముకాదు. అటులనే ప్రజలందరియొక్క ధనమును అల్పసంఖ్యాకులగువారి ప్రతినిధులగు "సెనేటుసభవారు" ఏవిధముగ ఖర్చిడనగునో తీర్మానించుటయు సభ్యతకాదు. ఐతే ఈకాలపు ప్రజాస్వామిక రాజ్యాంగములందు ప్రభుత్వాదాయమం దెచ్చుభాగము అల్పసంఖ్యాకులగు ధనికులు, భూస్వాములు, కర్మాగారాధిపతులనుండియే రాబట్టుబడుచున్నది. గదా! అట్టి ప్రభుత్వాదాయమును రాబట్టుటలో సెనేటువారికి ప్రజాప్రతినిధిసభవారికంటె హెచ్చుజోక్యము, అధికారమివ్వబడుట సబబుకాదాయని కొందరు వాదించవచ్చును. కాని, సెనేటుసభయందు ప్రజలందరికి ప్రాతినిధ్యత లేకుండుటయు (ఆస్ట్రేలియా, అమెరికాయందుతప్ప) ప్రజాప్రతినిధిసభయందు ప్రజలెల్లరు ప్రాతినిధ్యతబొంది యుండుటవలన సెనెటువారికి శిస్తుల వేయుటకు ప్రభుత్వధనమును ఖర్చిడుటకు అధికారముండరాదు. మరియు ప్రభుత్వము ప్రజలందరిక్షేమాభివృద్ధికై యేర్పరచబడినది. శిస్తులను ఎవ్వరు చెల్లింపగలరో వారినుండి రాబట్టుట న్యాయము. ధనికులు, భూస్వాములు, కర్మాగారాధిపతులు ప్రభుత్వము సాగుచున్నంతకాలమే తమ ఆస్థుల భద్రముగా బొంది, తమ వ్యవహారముల సాగించుకొనగలరు. కనుక వారు తమ సంవత్సరాదాయమునుండి తమశక్తికొలది శిస్తుల చెల్లించవలయును. వాస్తవముగా ఈశతాబ్దారంభమువరకు ప్రతిదేశమందును (ఇప్పటికి, అనేక దేశములందు) బీదసాదలే ప్రభుత్వాదాయమం దెక్కువభాగము చెల్లించు చుండిరి. క్రమముగా ప్రజాసామాన్యపు పలుకుబడి వివిధరాజ్యాంగములందు హెచ్చుచున్నకొలది శిస్తులభారము ధనికులాదిగాగలవారిపై హెచ్చుగా మోపబడుచున్నది. శిస్తులభారము నిర్ణయించి, అద్దాని వివిధతరగతుల వారిమధ్య యెటుల పంచి యిడుట న్యాయమో విచారించుట కధికారము సెనెటు సభవారికుండరాదను సదభిప్రాయము ప్రపంచమందంతట అంగీకరింపబడుచున్నది. ఇక, ప్రభుత్వాదాయమును హెచ్చుగా బీదవారిపై ఖర్చిడుట న్యాయమా? ఆవిషయములైనను తీర్మానించు నధికారము సెనేటుసభవారి కుండుట న్యాయము కాదాయని లార్డుహ్యూసెసిలువగైరాలు వాదించుచున్నారు. కాని, ఈ కాలపు సాంఘికార్థికపుటేర్పాటులవలన హెచ్చులాభము అన్నిదేశములందును ధనికులే బొందుచున్నారు. కొలదిమందిధనికులు, అధిక సంఖ్యాకులు బీదలు, ఐయుండుటచే సంఘ దుర న్యాయములెన్నో కల్గుచున్నవనియు, ప్రజాసామాన్యము కుడువ తిండి, కట్ట బట్ట, పండ నిల్లు లేక అలమట జెందుటచే సంఘారోగ్యము క్షీణించుచున్నదనియు, సాధ్యమగునంతవరకు శాంతియుతమగు మార్గములద్వారా దేశపు సంవత్సరాదాయము హెచ్చుగా బీదసాదల క్షేమాభివృద్ధినిమిత్తమై ఖర్చిడుట దేశీయు లెల్లరికి, మానవకోటికంతకు శ్రేయమని ఎల్లరొప్పుకొనుచున్నారు. అట్టియెడ ప్రభుత్వాదాయము ప్రజల మేలునకై ఎటుల ఖర్చిడవలెనో తీర్మానించుటకు ప్రజాప్రతినిధిసభవారికేగదా అధికారముండవలయును? అల్పసంఖ్యాకుల "సెనేటుసభ"కే యధికారమిచ్చుట న్యాయమా?

ప్రభుత్వనిర్వహణ మెట్లు జరుపబడుచున్నదో విచారించుటకు, ప్రభుత్వ వ్యవహారములగురించి తగు ప్రశ్నలనడిగి మంత్రివర్గమువారినుండి సమాధానముల గైకొని అందలి తప్పొప్పుల గమనించి ప్రజలకు ప్రభుత్వపు మంచి చెడ్డల ప్రకటించుటకు సెనెటుసభ వారెల్లెడ నుపయోగపడుచున్నారు. ఈ విషయమునందు ప్రజాప్రతినిధిసభ వారికివలెనే ఈసభకు సంపూర్ణమగు సమానాధికార మొసంగుట లాభకరము. వ్యవధి అంతగాలేని ప్రజాప్రతినిధిసభ వారికి ఈసభవా రీవ్యవహారమందు చేయూతగా నుండవచ్చును. ఎప్పటికప్పుడు ప్రతి ప్రభుత్వపు శాఖయందు ఎల్లెడల యెట్లెట్లు రాజ్యాగ వ్యవహారములు నడుపబడుచున్నవో ప్రజలకు తెల్పుట చాలయగత్యము. ప్రభుత్వమందున్న మంత్రివర్గమునకు తన సకార్యముల ప్రకటించుకొనుటకు ప్రతికక్షులకు ప్రభుత్వపు అ కార్యముల వెల్లడించుటకు ప్రజాప్రతినిధిసభవారితో బా టీసభవారును సహాయపడవచ్చును. ప్రభుత్వపు చర్యల ననుదినము పరీక్షించుటయు మంత్రివర్గమువారికి ప్రజాక్షేమకరములగు మార్గముల సూచించుటయు, ప్రభుత్వముయొక్క తప్పొప్పుల సూదిగ్రుచ్చినట్లు లెక్కించుటయు ప్రజోపయోగకరము. కనుక ఈ ధర్మమును రెండుసభలును నిర్వర్తించవలయును. ఇందులకై ప్రతిసభయు ప్రశ్నల వేయవచ్చును. తీర్మానముల ప్రతిపాదించవచ్చును. ప్రభుత్వముయొక్క ప్రకటనల కోరవచ్చును.

ప్రశ్నలద్వారా కన్గొనబడిన తప్పుల జాగ్రత్తగా విచారించుటకు గాని, ప్రభుత్వ ప్రకటనలవలన బయల్పడిన ప్రభుత్వపు అ కార్యముల పరీక్షించి తప్పొనర్చినవారి కన్గొని తప్పుల నిరాకరించు మార్గముల సూచించుటకు విచారణ సంఘముల నిర్మించుటకు రెండుసభలవారికి సమానాధికారము కల్గుట శ్రేయము. మరియు ప్రజాప్రతినిధిసభ వారికంటె ఇట్టి విచారణలను సెనెటుసభవారే హెచ్చుశ్రద్ధతో సమర్ధతతో చేయగలరు.

ప్రజలకు రాచకీయ విజ్ఞానమును కల్గించుటలోను, మంత్రివర్గపుచర్యల ప్రకటించుటలోను ప్రజాభిప్రాయము స్థిరపడుటకై తగు సహాయము చేయుటలోను వివిధరాజ్యాంగ సాంఘికేతర సంస్కరణలు ప్రజలయందు ప్రచారితమగుటలోను ప్రజాప్రతినిధి సభవారితోబాటు సెనెటుసభ వారును ప్రజాసేవ చేయనగును. మరియు ప్రజలకు రాచకీయనాయకు లెవ్వరెవ్వ రెట్టెట్టివారో తెలియజేయుటకు ప్రజాప్రతినిధులు ప్రజాసేవ చేయుటయందు ప్రజాభీష్టముల తెల్పుటయందు ప్రజలకు ముందు దారిజూపెట్టుటందు నాయకత్వము తమయందు పెంపొందింపజేయుటకు ఈ రెండుసభలును తగు యవకాశము కల్గించుట కుపయోగపడుట శ్రేయము. కనుకనే అమెరికాయందు తప్ప తదితర ప్రజాస్వామికదేశములందు మంత్రులతో కొందరు సెనెటుసభయందుకూడ సభ్యులైయుండనగును. స్విట్జర్లండు, జర్మనీ, నార్వేదేశములందు ప్రతిమంత్రియు అవసరమగు నప్పుడెల్ల సెనెటుసభయొక్క చర్యలలో పాల్గొనవచ్చును. అమెరికాయందు తప్ప మిగత దేశములందలి సెనెటుసభ్యులలో కొందరు మంత్రివర్గమందు జేర్చుకొనబడుచున్నారు. సెనెటుసభయే యుండుట తటస్థించినచో అందు అనుభవజ్ఞులు రాచకీయవిజ్ఞాను లనేకులుండుట సాధ్యము. కనుక వారిలో కొందరు మంత్రివర్గమందు జేర్చుకొనబడుట ప్రజాక్షేమకరమగును. మరియు ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఆదిగాగల దేశములందు శాసననిర్మాణమునందు సెనెటుసభకు చాల యధికార మివ్వబడుచున్నది. గనుక మంత్రివర్గముతో నాసభవారు సాధ్యమైనంతవరకు సహకార మొనర్చునట్లు ప్రోద్బలపరుపకల్గు సభ్యులుకొందరు మంత్రివర్గమునందు జేర్చబడుట లాభకరము.

ప్రభుత్వపు కార్యనిర్వాహకభారము హెచ్చగుచున్న కొలది వర్తక వాణిజ్యములు బీదసాదల రక్షణ ప్రయత్నములకు సంబంధించిన శాసనముల ననేకము ప్రతివత్సరము శాసనసభలు నిర్మించవలసి వచ్చుచున్నది. ఆ శాసనములందే ప్రతివిషయము గురించియు వివరముల తెల్పుచు ప్రతినియమమునకు సంబంధించిన హంశముల వివరించుటకు శాసనసభలకు వ్యవధియుండదు. పైగా కాలానుగుణముగా పరిస్థితుల ననుసరించి అనేక క్రొత్తనియమము లగత్య మగుచుండును కాన వాని నిర్మించుటకు శాసనసభవారే పూనుకొనుటకు బదులు అట్టిశాసనముల నమలులో పెట్టవలసిన మం త్రివర్గముపై ఆకార్య భారము మోపుట తగును. కనుకనే ఫ్రాన్సునం దెక్కువగాను, ఇంగ్లాండునం దిప్పుడిప్పుడును, తదితర దేశములందును ఆయాశాసనములందు జేర్చబడిన సూత్రముల ననుసరించి ఆశాసనముల ఆశయములు నెరవేరుటకై తగునట్టిరూల్సు రెగ్యులేషనుల ప్రకటించుటకు మంత్రివర్గమున కధికార మివ్వబడుచున్నది. కాని అట్టిప్రకటన అమలులోనికి వచ్చుటకు ముందు రెండు శాసనసభలముందద్దాని నియమితమగు కాలమువరకు నివేదించి యుంచవలసియున్నది. ఆవ్యవధిలోగానే రెండు శాసనసభలలో నేదైనను అవసరమగు అభ్యంతరముల నిరూపించి తగుమార్పుల జేయించనగును. ఈ ధర్మనిర్వహణమునకు సెనెటుసభవారు ప్రత్యేకముగా తగియుందురు. ఆసభవారికి తగినంతవ్యవధి, అనుభవము, వ్యవహార కుశలత యుండును. కనుక వారిట్టి "స్టాండింగు ఆర్డరు"లను పరీక్షించుచుండుట భావ్యము.

అనేక దేశములందు (అమెరికా, ఫ్రాన్సు, జర్మనీ, ఇంగ్లాండునందు ముఖ్యముగా) రాజవిద్రోహులగు రాచకీయ నాయకులను, ప్రజాప్రతినిధిసభవారు నిందితుల జేయుటయు వారిని విచారించుటకు సెనెటుసభ వారు న్యాయమూర్తులై న్యాయా న్యాయముల తేల్చుటయు ఆచారమై యున్నది. ఇంగ్లాండునందిట్టి 'రాజవిద్రోహవిచారణల'ను ప్రభువులసభ వారు చేయుచుండుట చాలకాలమునుండి లేదు కాని ఫ్రాన్సునం దింకనువాడుకలోనే యున్నది. మొత్తముమీద యీహక్కు సెనెటుసభవారినుండి తగ్గించుటయే ఆచారమగుచున్నది.

ఫ్రాన్సునందు ప్రజాప్రతినిధిసభ నంత మొందించుటకు రిపబ్లికు ప్రెసిడెంటుగారు సెనెటుసభవారి యనుమతిబొందవలెను. కాని చాలకాలమునుండి ప్రెసిడెంటుగారు తన యీయధికారము నుపయోగించుట లేదుగాన సెనెటువారికి ప్రజాప్రతినిధిసభ వారిపైగల యధికార మదృశ్యమగుచున్నది. అమెరికాయం దింకను సెనెటుసభ కార్యనిర్వహణమందే ప్రెసిడెంటుగారితో కలసి కొన్ని యధికారముల నడుపకల్గుచున్నది. సుప్రీముకోర్టు జడ్జీలు తన మంత్రులు ఫెడరలు రిజర్వుబోర్డు వ్యవ ----- బోర్డుల సభ్యులు ఆదిగాగల ప్రధానప్రభుత్వోద్యోగుల నియమించుటలో ప్రెసిడెంటీ సభవారి సహకారము పొందవలసి యున్నది. ఇందువలన ప్రతిరాష్ట్రపు ప్రధాన సెనెటరునకు చాల పెత్తనము ప్రాముఖ్యత సంపాదితమగుచున్నది. ఇతరదేశములపై యుద్ధము ప్రకటించుటకు గాని, యుద్ధమాపి సంధి చేసుకొనుటకు గాని, ప్రెసిడెంటుగారితో సెనెటుసభవా రంగీకరింపవలెను. శిస్తులవేసి ప్రభుత్వధనము ఖర్చిడుటలోకూడ సెనెటుసభవారికి ప్రజాప్రతినిధిసభ వారితోబాటు సమానమగు హక్కుకలదు.

ఈ ప్రకరణమందు ప్రజాస్వామిక మగు రాజ్యాంగములందు రెండు శాసనసభ లగత్యమా యను ప్రశ్నకు సమాధాన మివ్వ బ్రయత్నించితిమి. ఏక శాసనసభయే యంగీకరింపబడుచో ఏయే విధముల ఇప్పటికంటె హెచ్చు జాగ్రత్తగా సమర్థతతో శాసననిర్మాణము జేయవీలగునో జూచితిమి. రెండుశాసనసభలనే కల్గియున్న దేశములందు సెనెటుసభ యెట్లు నిర్మింపబడుచున్నదో దానికి శాసననిర్మాణమం దేయే యధికారములు కలవో రెండు శాసనసభల మధ్య శాసననిర్మాణమందు సంఘర్షణ కల్గుచో ఎటుల శాసననిర్మాణకార్యము జరుగుచున్నదో విచారించితిమి. బడ్జెట్టు విషయమం దెట్లు సెనెటుసభకు జోక్యము తగ్గింపబడినదో ప్రభుత్వ వ్యవహారముల విమర్శించుటయందు ప్రజలకు ప్రభుత్వచర్యలగురించి భద్రత కొల్పుటయం దెట్లు సెనెటుసభ వారు ప్రజాప్రతినిధి సభవారికి సహకార మొనర్పవలెనో సూచించితిమి. ఈవిధముగ రెండవ శాసనసభ తప్పనిసరియగుచో వస్తునిర్మాతల సభనే యేర్పరచుట మంచిది.

ఇంగ్లాండునందలి రాజకీయజ్ఞులు ప్రభువుల సభను సంస్కరించవలెనని చాలా కాలమునుండి ప్రయత్నముల జేయుచు ఆశాభంగులగుచున్నారు. ఇప్పటికున్న ప్రభువులందరికి కొందరు సభ్యుల నెన్నుకొను హక్కు నొసంగి జీవితాంతము వరకు సభ్యులుగా నుండుటకై రాచకీయజ్ఞు లాదిగాగలవారిని కొందరి నిరూపించి ఆసభ యిప్పటికంటె హెచ్చు యుపయోగ కారిగా నుండునట్లు చేయ కొందరు తలపెట్టుచున్నారు. ఈ దినములందుమాత్ర మాసభ నిరుపయోగమై యున్నదన్న సత్యదూరము కాదు. ఫ్రాన్సునందలి సెనెటుసభ యందనుభవజ్ఞులు, వయోవృద్ధులు, సుప్రసిద్ధు లనేకులుండుటచేతను, కమిటీలద్వారా వారు ప్రభుత్వచర్యల పరీక్షించగల్గుశక్తి యుండుటవలనను అ సెనెటు చాలాప్రాముఖ్యత వహించుచున్నది. అమెరికాసభ అన్నిటికంటెను బలిష్టమైయున్నది.కెనడాసభయు దక్షిణాఫ్రికాసభయు అంత ప్రాముఖ్యత బొందకున్నను స్థాయిసంఘములవలన కల్గు ప్రయోజనముల కల్గించుచున్నది. జర్మను సెనెటునందు రాష్ట్రీయప్రభుత్వముల ప్రతినిధులుండుటచే వివిధరాష్ట్రీయుల కెట్లెట్టి శాసనము లగత్యమో తెల్పుటకుమాత్ర ముపయోగ పడుచున్నది. ఐర్లండు సెనెటుసభయు నార్వేసభయు ప్రజాప్రతినిధిసభపై ఆధారపడియుండి స్థాయిసంఘపు ప్రయోజనముల కల్గించుచు, ప్రజలకు వలయు శాసననిర్మాణకార్యము సాగునట్లు తోడ్పడుచున్నవి. ఆస్ట్రేలియాయందలి సభమాత్రము ప్రజాప్రతినిధి సభ కెదురై ప్రతిష్టంభనమును సాగింపకల్గియున్నది.

ఇటుల రెండు శాసనసభలున్నను మరియేయితర సహాయము లేకనే శాసననిర్మాణము సుగమముగా జరుగుట సాధ్యము కాకున్నది. ఆస్ట్రేలియాయందు ఈ రెండు సభల మధ్య భేదభావము కల్గిన జనరలుఎన్నికలు రెండుసభల కగత్యమగు చున్నవి. జర్మనీయందు "రిఫారెండము" కావలసి వచ్చుచున్నది. ఇంగ్లాండునందు రెండుమూడు వత్సరములు, ఐర్లండునందు తొమ్మిది మాసముల కాలము చట్టనిర్మాణ మాగవలసియున్నది. ఈవిధముగ సెనెటుసభ యుండుటవలన శాసననిర్మాణము మందగతి బొందుచున్నది. సంస్కరణములు శాసన రూపము దాల్చుట దుర్ఘటమగుచున్నది. ఎన్నటికో శాసననిర్మాణావశ్యకత తెలుసుకొని ఈ రాజ్యములు ఏకసభాస్థాపన మొనర్చునది! అదృష్టవశాత్తు మనరాష్ట్రములందైన ఏకసభాస్థాపనము జరుగవచ్చునని తోచుచున్నది.




_________________