ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/స్నేహ సహవాసములు
ఇది జరిగిన చిరకాలమునకుఁ బిమ్మట శర్మగారును నేనును రైలులోఁగలసికొంటిమి. అపు డాయన మద్రాసులో న్యాయవాదిగను, నేను బెజవాడలో నుపాధ్యాయునిగను నుంటిమి. "మీప్రస్తుతానుభవమునుబట్టి మీచిన్న నాఁటిచర్య వట్టి యల్లరిచేష్ట యని మీరం గీకరింపరా?" యని యాయన యడిగినప్పుడు, మే మిరువురమును నవ్వుకొని లోకవిశేషములు మాటాడుకొంటిమి !
8. స్నేహ సహవాసములు
మేము రాజమంద్రి చేరిన కొంతకాలమునుండి 1887 వ సంవత్సరమువఱకును, అప్పుడప్పుడు ఏకొలఁదిమాసములో తప్ప తక్కినకాలమంతయును, మాతండ్రి యుద్యోగఁపుఁబనుల మీఁద విదేశమున నుండుచువచ్చెను. మా రెండవమేనమామ తఱచుగ రాజమంద్రి వచ్చి, బజారునుండి వస్తువులు కొని తెచ్చి మా కిచ్చి స్వగ్రామము వెడలిపోవుచుండువాఁడు. కావున సంసారము నడిపి మా చదువుసాములు సాగించు భార మంతయు మాతల్లిమీఁదనే పడెను. పిల్లలలో నెవరికైన జబ్బు చేసినయెడల, ఆమె రాత్రి నిద్దుర మాని కూర్చుండును. ఇరుగుపొరుగున దొంగలు పడినయెడల, రాత్రు లామెకు కునుకు పట్టనేపట్టదు ! ఇట్టిబాధలు 1884 వ సంవత్సరము వేసవికాలమున మిక్కుటమయ్యెను. రాజమంద్రి వేసవిగడుపుట కనువగు ప్రదేశము కానేకాదు. దీనికిఁ దోడుగ, ఆయేఁట నెండ లతిశయించి యుండెను. పట్టణమున మశూచి ప్రబలెను. మేము భయపడినట్టుగనే, స్ఫోటకదేవత శీఘ్రమే మాయింట పీఠము వేసికొనెను. నాకుఁ జిన్న నాఁటనే మశూచకము గానిపించెనఁట. వెంకటరామయ్య తప్ప తక్కినపిల్ల లందఱికి నిపుడు స్ఫోటకము సోఁకెను. పాటెక్కువయై కొందఱు మిగుల బాధపడిరి. రోఁతవిసువులు వీడి నేను దల్లితోపాటు పిల్లలకుఁ బరిచర్యలు చేసితిని. వెలివెన్ను పోయి మాయమ్మమ్మను పట్టణమునకుఁ గొనివచ్చితిని. దైవానుగ్రహమున పిల్ల లందఱును కాలక్రమమున నారోగ్యస్నానము చేసి సుఖముగ నుండిరి.
మే ముండునింటికిఁ జేరువ మమ్మెఱిఁగినవారును బంధువులును నంతగ లేనందున, 1885 వ సంవత్సరమున మా పెద్దతండ్రిగారును, ఇంకఁ గొందఱు కావలసినవారును నివసించెడి రాఘవయ్యగారి కొట్లలోనికి మేము వెడలిపోయితిమి. అందువలన నొంటరిగ నుండవలసిన కష్టము మాకుఁ గొంతవఱకుఁ దొలఁగిపోయెను.
ఆ సంవత్సరముననే మా సోదరులలో నాలుగవవాఁ డగు సాంబయ్యను మా మేనమామలు తమ గ్రామమునకుఁ దీసికొని పోఁగా, అచ్చట పొంగు చూపి వాఁడు చనిపోయెను. అందఱిలోను వాఁడు మిగుల నీరసుఁడు. ముద్దుమోమున నుండెడి యాబాలకుని మరణము మమ్మందఱిని దు:ఖాబ్ధిని ముంచివైచెను. ఇదివఱకు పుత్రశోక మెఱుఁగని మాతల్లి వెఱ్ఱిదు:ఖమున వేఁగెను. ఆ మఱుసటి సంవత్సరమున మా కుటుంబమున నిం కొకమరణము తటస్థించెను. మా రెండవ పెద్దతండ్రికుమారుఁడు, నాగరాజు, నావలెనే ప్రవేశపరీక్షకుఁ జదువుచుండెను. అతని కపుడు వ్యాధి యంకురించి, కొలఁదిదినములలోనె వానియసువులను గొనిపోయెను. పాప మాతఁడు విద్యాస్వీకారమునకై గంపెడాసతో రాజమంద్రి కేతెంచి, పడరానిపాట్లు పడి, విఫల మనోరథుఁడై, తుద కకాలమృత్యువువాతఁ బడెను ! కొలఁదికాలము క్రిందటనే యాతని భార్య కాపురమునకు వచ్చియుండెను.
జ్యేష్ఠపుత్రుని మరణమున కోపక, తీర్పరాని మనోవ్యధకు లోనైన మా పెదతండ్రి కంతట రాచకురుపు వేసి, 1887 వ సంవ త్సరారంభమున నాయనజీవములఁ గొనిపోయెను. అన్న వ్యాధిసమాచారమును సకాలమున నేను దెలుపకుండిన హేతువున, కన్నులార నాయనను గడసారి చూడలేకుంటి నని మాతండ్రి మిగుల వగచెను.
రాజమంద్రి పోయినది మొదలు ఉన్నతపాఠశాలలో నేను జదువు పూర్తిచేసిన యైదు సంవత్సరములలోను, నేను దమ్ములును బయటి సహవాసుల నంతగ నెఱుఁగమనియే చెప్పవచ్చును ! ఇంట మాతమ్ములు చెల్లెండ్రు, పాఠశాలలో సహపాఠులును, మా ముఖ్యసహవాసులు. నేను మాధ్యమికపరీక్షతరగతిలోఁ జదువునపుడు, అనఁగా 1884 వ సంవత్సరమున, మా తరగతిలోని నా పరిచితులలో కూనపులి కొండయ్యశాస్త్రి ముఖ్యుఁడు. తరగతిలోఁ దెలివి గలవారలలో శాస్త్రి యొకఁడు. అచిరకాలములోనే నే నీతనిని మించి మొదటివాఁడ నైతిని. అప్పటినుండియు నా కితఁడు సహవాసుఁ డయ్యెను. ప్రభుత్వమువారి మాధ్యమికపరీక్షలో మాపాఠశాలలో మొదటితరగతిని జయము నొందిన నలుగురిలో నే నొకఁడను. కొండయ్యశాస్త్రి మాత్రము మూఁడవతరగతి నైనఁ దేఱక, మరలమరల క్రింది తరగతియందే కాలము గడుపచుండెను. ఈతఁడు నావలెనే ఇన్నిసుపేటలో నివసించెడివాఁడు. సాయంకాలమునను, సెలవు దినములందును, శాస్త్రి మాయింటికి వచ్చి, నన్ను షికారునకుఁ గొనిపోవుచుండును. నా వెనుకటి సహపాఠియు, మొగమెఱిఁగిన విద్యార్థియు నగుటచేత, నే నాతని సావాసమున నుండుటకు మాతల్లి యభ్యంతరము పెట్టెడిది కాదు. లోకవిషయములు నాకుఁ దెలుపుచు, పాఠ్యగ్రంథములందు నిమగ్న మైన నామనస్సునకు, శాస్త్రి కొంత విరామము గలిగించుచుండువాఁడు. సాహిత్య విషయములందు తనకుఁగల యభిరుచి నాకును గలిపింప నితఁడు ప్రయత్నించుచుండువాఁడు. ఇతనిసం భాషణ మతిశయోక్తులతోఁ గూడియును, మొత్తముమీఁద జ్ఞానదాయకముగను సంతోషకరముగను నుండెడిది.
నా రెండవమిత్రుఁడు బంధకవి వెంకటరావు. రాజమంద్రిలో మొదటినుండియు నా కితఁడు సహాధ్యాయుఁడు. పరిస్థితుల వైపరీత్యమున నితఁ డిటీవల విద్యాభ్యాసమున నంతగ శ్రద్ధ వహింపకుండినను, తరగతిలోఁ దెలివిగలవారలలో నొకఁడు. నాతోఁ జెలిమిచేసి చదివినచో, తన కడగండ్లు కొంత మఱచిపోయి, తాను పరీక్షలో సులభముగ జయ మందఁగల నని యాతనియాశయము. అందువలన నీతఁడు నేనును మా యింటికిఁ జేరువ నొకగది పుచ్చుకొని, ప్రవేశపరీక్ష తరగతిలోఁ గొంతకాలము చదివితిమి. ఆసంవత్సరము వెంకటరావు పరీక్షలోఁ దప్పిపోయినను, నన్నుఁ బలుమారు గలిసికొనుచు, నాతో సుఖసంభాషణములు సలుపుచుండువాఁడు.
ఈ యిరువురు మిత్రులును నాకంటె వయస్సునఁ గొంత పెద్దలై, ఎక్కువ లోకానుభవము సంపాదించినవారలు. అంతకంతకు వారలను నేనును, నన్ను వారును విడువనొల్లని ప్రాణమిత్రులమైతిమి. వారలలో నొకరి కొకరికి మాత్రము సరిపడియెడిది కాదు! నన్నుగుఱించి వా రేకసమయమున వచ్చి యొకరి నొకరు కలిసికొనినపుడు, ఒకరి కొకరు ప్రేమభావము చూపక, వట్టి ముఖపరిచితులుగ మాత్రమే మెలంగుచువచ్చిరి ! ఇంతియ కాదు. నేను మూర్ఖుఁడనై, కన్నులు మూసికొని, వారలలో నొకని సహవాసము చేయుచుంటి నని రెండవవాఁడు కొన్ని సమయముల నన్నుఁ బరియాచకము చేయుచుండును ! స్థిరచిత్తుఁడు గాఁడనియు, నియమదూరుఁ డనియు నొకనినిగుఱించి యొకఁడు మొఱ పెట్టుచుండువాఁడు ! ఐనను నేను వారిలో నెవ్వనిఁగాని రెండవవానియొద్ద నిందింపక, నా మిత్రు లిద్దఱును సజ్జనులే యని నమ్ముచుండువాఁడను. నిజమునకు, మేము మువ్వురమును ఉదారాశయములతో నొప్పియుండియు, అనుభవలేశము లేని వట్టి విద్యార్థులమె ! మాలో నెవ్వనికిఁ గాని యింకను శీలబలము, చిత్తస్థైర్యము నేర్పడలేదు. ఐనను, కొలఁదికాలములోనే, పరిస్థితులప్రభావమున, మాయభిప్రాయము లందును, నీతినియమాదులందును గొంత దృఢత్వ మేర్పడెను. ఈసంగతి ముందలి ప్రకరణముల యందుఁ దేటపడఁగలదు.
9. కళాశాలలో ప్రథమవత్సరము
1887 వ సంవత్సరము జనవరినెలలో నేను రాజమంద్రియందలి ప్రభుత్వకళాశాలలో ప్రథమశాస్త్ర పరీక్షతరగతిలోఁ బ్రవేశించితిని. నా సహపాఠి ముఖ్యప్రాణరావు నేనును ఆమండలమున ప్రవేశ పరీక్షలో నుత్తీర్ణు లైనవారిలో ప్రథమతరగతియం దుండుటచేత, మా కిరువురకును విద్యార్థివేతన మీయఁబడెను. ముఖ్యప్రాణరావు కడచిన నాలుగు సంవత్సరముల నుండియు, మాపాఠశాలలోనే నా సహాధ్యాయుఁడు. ఆతనినమ్రతను, కుశాగ్రబుద్ధిని మెచ్చనివారు లేరు. విద్యాభ్యాసమే జీవితనియమముగఁ గైకొనిన విద్యార్థి యాతఁడు. పాఠము చదువక యాతఁడు బడికి వచ్చినరోజు గాని, అపజయమందిన పరీక్ష గాని, లేదనియె చెప్పవచ్చును. ఆతని జ్ఞాపకశక్తి యత్యద్భుతము. ఒకసారి చదివినతోడనే యాతని కెంత కఠినపాఠమైనను ముఖస్థమయ్యెడిది. కావుననే యతఁడు ప్రతితరగతియందును, ప్రతిపరీక్షయందును, ప్రథమస్థాన మలంకరించి యుండెడివాఁడు. అతనిని విద్యావిషయమున మించుట యటుండఁగా, సమీపించుట కైన నేసహపాఠికిని వలను గాకుండెను. ఆసంవత్సరము రాజమంద్రిలో ప్రవేశపరీక్ష