ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/దుష్కార్యము

వికీసోర్స్ నుండి

సాయము చేయుచుండువాఁడను. ఆమె యింట లేనపుడు నేనే మడిగట్టి, నా వచ్చియురాని వంటతో సోదరులకు భోజనము సమకూర్చుచుందును. రాజమంద్రి వెళ్లనపిమ్మట పాఠశాలలోని చదువునకు నే నెక్కువ శ్రద్ధ వహింపవలసిన కాలమందును, ఇంటఁ దల్లికిఁ దోడుపడుట నా కార్యక్రమమున నంతర్భాగ మయ్యెను. దీనికి బంధువులు సహచరులు నన్నొక్కొకమాఱు గేలి చేసినను, జననీ సేవయు సోదరపరిపోషణమును నవమానకరమని తలంపక, విద్యా నిరతికిని గృహకృత్యనిర్వహణమునకును ఆవంతయు విరోధము లేదని బాగుగ గుర్తెఱిఁగి మెలఁగితిని.

5. దుష్కార్యము.

నేను 11 వ యేటఁ జేసిన యొక దుష్కార్యమువలన నామనస్సు మెరమెరలాడు చుండును. నాలుగవతరగతి పఠనీయపుస్తకములలోని "ఆసియాభూగోళము" నాకు లేదు. ఎన్ని సారులు కొను మని వేడినను మాతండ్రి యాపుస్తకము నాకుఁ గొనిపెట్టలేదు. మాసహపాఠులలో అచ్యుతరామయ్య యనువాఁడు కారణాంతరములచేతఁ జదువు మానివేసి, నాకుఁ దనపుస్తక మమ్మఁజూపెను. దానివెల నాలుగణాలు. తరువాత డబ్బిచ్చెద ననఁగా, నా కాతఁడు పుస్తక మిచ్చివేసెను.

ఆతఁ డెన్నిసారులు తన డబ్బడిగినను, నే నేదో మిష చెప్పి తప్పించుకొనువాఁడను. ఒకనాఁడతఁడు పాఠశాలకు వచ్చి, సొమ్మీయుమని గట్టిగ నడిగి, "నా పావులా యిచ్చువఱకును నీపుస్తకము లీయ" నని చెప్పి, నాపుస్తకములబొత్తి లాగివైచెను. పుస్తకములకై మే మిద్దఱము పెనఁగులాడినప్పుడు, అవి క్రిందఁ బడిపోయెను. అందఱిలో న న్నీతఁ డవమానము చేయుటకు నేను గోపించి, వాని మీఁదఁ గసి తీర్చుకొన నొక యుపాయము చేసితిని. నాఁడు ప్రొద్దున నే నడుగఁగా మాతండ్రి పుస్తకము ఖరీదు నా కిచ్చివేసె ననియు, అది యాతని కొసంగుటకై యొక పుస్తకములో నుంచితి ననియు, అచ్యుతరామయ్య నాపుస్తకములు చిందరవందరగఁ జేసినపు డాపావులా యెక్కడనో పడిపోయె ననియును నే నంటిని ! తనమూలముననే పావులా పోవుటవలన నాతఁడె నష్టపడవలె నని నావాదము. ఈ యొక పన్నుగడమూలమున రెండుపనులు సమకూరు నని నాయాలోచన, - ప్రాఁతయప్పు తీఱిపోవుట యొకటి, పరాభవము చేసినవానిమీఁదఁ బగ సాధించుట మఱియొకటి!

మొదట నేను బరియాచకమునకె యిట్లనుచుంటినని యచ్యుతరామయ్య తలంచెను. కాని, మొగము ముడిఁచి, మాటిమాటికి పుస్తకములో పావులా యుంచితి నని చెప్పుచుండుటచేత, నామాట లాతఁడును దగ్గఱవారును నమ్మి, నాపుస్తకములు పలుమాఱు తిరుగవేసి చూచిరి. క్రిందిదుమ్ములో వెదకిరి. ఎక్కడను పావులా కానఁబడ లేదు. పావులా నే నింటియొద్దనుండి తెచ్చుటయె నిజ మైనచో, తన మూలముననే యది పోయెను గావున, తానె యానష్టము వహింతునని యచ్యుతరామయ్య చెప్పివేసెను.

ఐన నింత సులభముగ నీయుదంతము సాంతము కాలేదు. ఆప్రొద్దున మాతండ్రి నాచేతికి పావులా యిచ్చివేసె నని స్పష్టపడవలెను. కావున నచ్యుతరామయ్య నన్ను బ్రమాణము చేయు మనెను. ఒక యబద్ధ మాడువాఁడు తనమాట నిలువఁబెట్టుకొనుటకు పెక్కు లసత్యములు పలుకవలెను. నే నపు డెన్ని యొట్టులో పెట్టుకొంటిని; ఎన్ని ప్రమాణములో చేసితిని ! నాయసత్యతములు పెరుగుచుండుటకు మనస్సున వెత నొందుచున్నను, డబ్బుమీఁదఁ గన్ను వేసి, అన్నమాట పోవునను భయమున, నే నెన్ని బాసలకును వెఱవలేదు! నా స్థిరత్వము నా సత్యవాదిత్వమున కమోఘనిదర్శన మని యచట నందఱును రూఢిచేసికొనిరి. ఈసిద్ధాంతమును స్థిరపఱచుట కింకొకసంగతియె కావలెను. అది మా తండ్రి సాక్ష్యము. కాని, దానినిగూర్చి నా కేమియు భయము లేదు. పిమ్మట నేను నెమ్మదిగ మానాయనతో మాటాడి లాభకరమగు నామాటను సమర్థించునటు లాయన నెటులో యొడఁ బఱుపఁగల నని నాయాశయము! కావున నే నీరుజువునకును సమ్మతించి ధైర్యమున నుంటిని.

కాకతాళన్యాయముగ మాతండ్రి యపుడె యాదారిని బోవుచుండెను. అచ్యుతరామయ్య యాయనను గలసికొని, తనపుస్తకపు బాకి నిప్పింపు డని మెల్లగ నడిగెను. ఒకటిరెండు రోజులలో తప్పక యిచ్చివేయుదు నని మానాయన పలికి, అచ్యుతరామయ్య ప్రశ్నింపఁగా, తా నాప్రొద్దున నాచేతికి డబ్బేమియు నీయలే దని చెప్పివేసెను!

పరిభవభారమున నాశిర మంత నేల కొరగిపోయెను! పిమ్మట నేనుగనఁబడినపు డెల్ల, అచ్యుతరామయ్య నన్ను దెప్పుచు, నాయొట్లు బాసలు నాకు జ్ఞప్తికిఁ దెచ్చి, నామనస్సునందలిపుండును రేఁపుచుండువాఁడు! కొంతకాలమువఱకును సహచరులమోములు చూచుటకు నేను సిగ్గుపడుచుండువాఁడను. జరిగిపోయినది మాపుట దుస్సాధ్య మైనను, ముం దిట్టిసత్యములకును మోసపుఁబనులకును బాల్పడనని మనోనిశ్చయము చేసికొంటిని!