ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/జనకుని వ్యవహారదక్షత, శకటవ్యాపారఫలితము
30. జనకుని వ్యవహారదక్షత, శకటవ్యాపారఫలితము
ఇటీవల మాతండ్రి, దూరదేశము పోలేక, ఉద్యోగము విరమించుకొని, యింటిపట్టుననే యుండెను. ఎవరితోడనో మాటలసందర్భమున బండివ్యాపారము లాభకర మైన దని యాయన వినెను. త్రాడు బొంగరములు లేని వ్యవహారములలోఁ జొరఁబడుటకు నే నిష్టపడు వాఁడను కాను. నా చెన్నపురిప్రవాససమయమున మాజనకుఁడు మా తల్లిని, పెద్దతమ్ముని నెటులో యొప్పించి, కొంతసొమ్ము బదులుచేసి, బండిని ఎద్దులజతను కొనెను. బాడుగకు బండి తోలుటకై యొకజీతగాఁడు నియమింపఁబడెను. బండివలన దినమున కొకరూపాయి వచ్చి, ఖర్చుల కర్ధరూపాయి వ్యయ మైనను, కనీస మెనిమిదణాలు మిగులునట్లు తేలెను. కావున నింకొకబండియు నెద్దులజతయును శీఘ్రమే మాతండ్రి కొనెను. దినకృత్యములు చేసికొనుటయె భారముగ నుండెడి మాతల్లి, సాయంకాల మగునప్పటికి, ఎద్దులు నాలుగింటికిని, చిట్టుపొట్టులుకుడితియు గుగ్గిళ్లును సమకూర్పవలసివచ్చెను ! రెండుబండ్లకును పని కుదుర్చుట, పనివాండ్రు సరిగా పని చేసి సొమ్ము తెచ్చి యిచ్చుట మొదలగుకార్యభార మంతయు మాతండ్రిమీఁదఁ బడెను. మాతమ్ము లాయనకు సాయముచేయుచుండిరి. ఈశకటవ్యాపారవ్యామోహము మాతో నిలిచిపోయినదికాదు ! మా మామగారికిని మా తండ్రికిని చెలిమి యెక్కువ. ఆయనయు మా నాయనవలెనే తనపుత్రుని విద్యాభివృద్ధికై సకుటుంబముగ నిచ్చటికి వచ్చి, ఇపు డూరకయే కాలము గడపుచున్నారు. వారును బండి యొకటి కొని, కుటుంబాదాయ మేల వృద్ధిచేసికొనరాదు ? మాజనకుని ప్రేరేపణమున, కొలఁదిరోజులలో వారికిని నొక బండి యెద్దులజతయు సమకూడెను ! ఇపుడు వారు మాపొరుగునకుఁ గాఁపురము వచ్చిరి. కావున నీయుభయకుటుంబముల కును, తెల్ల వాఱుసరికి శకటవ్యాపారసందర్భమునఁ జేతులకుఁ బనియు, మనస్సున కలజడియు సమృద్ధిగఁ జేకూరెను ! ఒకరియెద్దులకంటె నొకరివి మంచి వనియు, ఒకరిబండికంటె నొకరిదాని కెక్కువలాభము వచ్చు ననియు నెంచెడి యీర్ష్యాజనకములగు నభిప్రాయములు గలిగి, పరస్పరస్నేహసౌహార్దములకు భంగకరము లగు పరిస్థితు లేర్పడెను !
నేను చెన్నపురినుండి యింటికి వచ్చునప్పటికి, నాకీ క్రొత్త సంగతు లన్నియు ద్యోతకమయ్యెను. తన వ్యవహారదక్షతనుగుఱించియు, మా కుటుంబమున కిపుడు గలుగు ధనలాభమునుగూర్చియు మా తండ్రి నాకుఁ జెప్పఁదొడంగెను ! నాకుమాత్రము మాకుటుంబమున కింతసులభముగ నే గొప్పయదృష్టమును పట్టునను నమ్మకము లేదు ! మా యదృష్టముమాట యటుంచి, మా జనకుని యాలోచనాసౌష్ఠవమునుగూర్చి విచారించినను, నా మనస్సున కేమియు సంతృప్తి గలుగదయ్యెను. ఆయన వ్యాపారకౌశలమునుగూర్చి నాచిన్న తనమున రేలంగిలో నొకగాథ వినుచుండువాఁడను. ఇప్పటివలెనే మాతండ్రి యపుడును ఉద్యోగము చాలించుకొని, యింట దినములు గడపుచుండెను. ఆ కాలమున చింతపండు అమితప్రియ మయ్యెనఁట. వీసె ముప్పావలా దాఁటిపోయెను. ఒకటేల, చింతపండుధర హెచ్చుచుండుటచేత, వర్తకులు దానిలో ఖర్జూరపుపండు మిశ్రమము చేసి యమ్మి లాభము గడించుచుండిరి ! ఈతరుణమున చింతపండువర్తకము చేసి మంచిలాభ మేల సంపాదింపరాదని మా తండ్రిమనస్సునకు స్ఫురించెను. ఇట్టి వ్యాపారపరిశ్రమమం దీయనకుఁ దీసిపోని ప్రజ్ఞానుభవములుగల యాయనపెద్దయన్న దీనికి వల్లె యనెను ! అంత మా నాయన రాజమంద్రి వెళ్లి, కొన్ని కంట్లముల చింతపండుకొని, రహదారిపడవమీఁద సరకు రేలంగి తీసికొనివచ్చెను. ఈబుట్టల యమ్మకమున మితిమీఱిన లాభము రానున్న దని యన్నదమ్ములు గుసగుసలాడుకొనిరి ! ఇంకను విరివిగా నీవ్యాపారము సాగించినచో, సులభముగ వందలు వేలును లాభము మూటగట్టవచ్చు నని యాసోదరులు తలపోసిరి. అంత మా జనకుఁడు సొంతచేతులతోనే యాచింతపండు తూఁచి యమ్ముటకు తక్కెడయు రాళ్లును తయారు చేసికొనెను !
గాలిపాటువలె వర్తక పరిస్థితులును నిముసనిముసమును పరివర్తన మందుచుండును ! మఱునాఁటినుండియె చింతపండుధర తగ్గసాగెను, పూర్తిగ లాభము తీయవలయు ననుపేరాస ప్రేరింపఁగా, మాతండ్రి కాలానుసారముగ కొంతధర తగ్గించి, తా నెటులో సరకు నమ్మివేయుటకు సమ్మతింపలేదు. రానురాను చింతపండు చౌక యైపోయెను. స్వల్పలాభమునకో నష్టమునకో సకాలముననే సర కమ్మలేనివారు, అది కారుచౌక యగునపుడు, ఎక్కువనష్టమునకు తెగించి యమ్మివేయఁ గలరా? పర్యవసాన మేమన, మా నాయన తెచ్చినచింతపండుబుట్టలు, తెచ్చినవి తెచ్చినట్టుగనే నిలువయుండి, పదు నుడిగి, బూజు పట్టి, గడ్డగట్టిపోయినవి ! ఇపు డవి యెవరికిఁ గావలెను? ఇంట నైన నుపయోగింప వలనుపడకుండెను. మావాండ్రు నీళ్లపొయిలో చింతపండు అడలు వేయుచుండువారు ! శీతకాలమందు ప్రొద్దున చలిమంటల కివి యుపకరించుచుండెను. మంట యారిపోవ నున్నపు డెల్ల, "ఇంకొక అడ తెచ్చివేయండిరా !" అనుమాటలు చిన్న నాఁడు నేను వినుచుండిన జ్ఞాపకము ! ఈచింతపండువ్యాపారప్రస్తావము తెచ్చి, మావాండ్రు, అప్పుడప్పుడు మాతండ్రిని పరియాచకము చేయుచుండువారు. అపు డాయన ముసిముసినవ్వులు నవ్వుచు నుండువాఁడు !
ఇపు డీబండ్లవ్యాపారము నటులే పరిణమించు నని నేను వాక్యము పెట్టితిని ! కాలము గడచినకొలఁది, బండ్ల'గిరాకి' తగ్గెను. బండి'కిరాయి' తగ్గుటచేత, స్వల్పలాభము స్వల్పనష్టముక్రింద దిగెను. ఇదే బండ్లమ్మివేయుట కద నని నేను మాతండ్రిని హెచ్చరించితిని. ఒక బండి యమ్మివేయుట కాయన యొడఁబడుటచే, కొంచెమునష్టమునకు దానిని, దానియెద్దులను అమ్మివేసితిమి. కష్టనష్టములు పెరుఁగుచుండుటచేత, రెండవబండిని ఎద్దులనుగూడ పోకడపెట్టితిమి. మా మామగారి సంగతి కూడ నిట్లే జరిగెను. ఉభయకుటుంబములును, ఈ బండ్లవ్యాపారమున మూటగట్టుకొనినది, శ్రమయు ఋణమును మాత్రమే! ఈయప్పు భావికాలమందలి కుటుంబఋణమునకు ప్రాతిపదికము కూడ నయ్యెను !
31. రచనావ్యాసంగము
చెన్నపురినుండి వచ్చిన మఱుసటిదినముననే నా పుస్తకములు సరదుకొని, చెలికాండ్రను జూచివచ్చి మద్రాసులో నారంభించిన వ్రాతపని సాగింపఁబూనితిని. నా గురువర్యులగు వెంకటరత్నముగారిని చూచినపుడు, తెలుఁగులోనికి తర్జుమా చేయు మని యాయన నా కొక యింగ్లీషుపుస్తక మిచ్చెను. అది నేను ముందు వేసికొని, యింటఁ గూర్చుంటిని. తెలుఁగున గద్యపద్యరచనము చేయ నే నుద్యమించి, పోపు విరచిత మగు "సార్వజనికప్రార్థన"ను, 'గ్రే' వ్రాసిన "పెంపుడుపిల్లి" యను గీతమును, పద్యరూపమున ననువదించితిని. చేంబర్సు "నీతిపాఠక పుస్తక" మందలి పాఠములు కొన్ని చదివి తెలుఁగు చేసితిని. వీనిలోఁ గొన్ని కరపత్రములుగఁ బ్రచురించి ప్రార్థనసమాజ పక్షమున జనుల కుచితముగఁ బంచిపెట్టుట మంచి దని తలంచితిని. వీరేశలింగముగారు తెప్పించుకొనుచుండు "ఇండియన్ మెసెంజర్" అను బ్రాహ్మసమాజ వారపత్రికను జదువుటకు వారమువారమును వారిం