ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/చెన్నపురిప్రయాణము
మృత్యుగర్భము సొచ్చెను ! ఆ బాల్యస్నేహితుని యకాలమరణము నాహృదయనౌకను దు:ఖజలధిని ముంచివైచెను. ఓ మరణదేవతా ! నీచేష్టల నిరోధించు సాధనకలాప మీభూలోకమున నెచటను లేనేలేదా ?
29. చెన్నపురిప్రయాణము
రాజమంద్రికళాశాలలో పట్టపరీక్షతరగతిలో నేనును, ప్రథమశాస్త్రపరీక్షతరగతిలో మాతమ్ముఁడును జేరి చదువుచుంటిమి. మా స్నేహితులు కనకరాజు గంగరాజులు తిరిగి రాజమంద్రి వచ్చి ప్రథమ శాస్త్రపరీక్షకును, కొండయ్యశాస్త్రి ప్రవేశపరీక్షకును మరలఁ జదువుచుండిరి. అంతకంతకు సంఘసంస్కారప్రియుల సావాసము మరిగి. శాస్త్రి మున్నగు పూర్వాచారపరులతోడి సంసర్గము నేను విరమించు కొంటిని.
సంఘసంస్కరణసమాజము వెనుకటివలెనే పనిచేయుచున్నను, క్రమక్రమముగ దానిప్రాశస్త్య మణఁగిపోయి, ప్రార్థనసమాజప్రాముఖ్యము హెచ్చెను. నిజమునకు రెండుసమాజముల సభ్యులు నొకకూటము వారే. చర్చనీయాంశముల విషయనవీనత నానాటికి వన్నెవాసి, చేయుపని యంతగఁ జేతులకు లేకపోవుటచే, సంస్కరణసమాజ వ్యాపనము ప్రార్థనసమాజకార్యక్రమమున నంతర్లీనమై, కాలక్రమమున నేతత్సమాజము ప్రత్యేకవ్యక్తిత్వమును గోలుపోయెను ! ఇట్లనుటవలన, సంస్కరణాభిమానము సభ్యుల మనస్సీమనుండి వీసమంతయుఁ దొలఁగె నని తలంపఁగూడదు. ప్రార్థనసమాజసభ్యత్వము సంస్కరణాభిమానమునకుఁ బర్యాయపద మగుటచేత, ఏకోద్దేశమున రెండుసభలు జరుపుట యనగత్యమై, ప్రార్థనసమాజము పేరిటనే మత సంఘ సంస్కరణవిషయముల ప్రసంగప్రణాళిక యంతయు నింతటినుండి జరిగెను.
ఇవి ప్రార్థనసమాజ వార్షికోత్సవదినములు. మద్రాసునివాసులు, సంఘసంస్కారులు నగు మన్నవ బుచ్చయ్యపంతులుగా రిపుడు కొన్ని దినములనుండి రాజమంద్రిలో వీరేశలింగముగారియింట బసచేసి యుండిరి. ఏప్రిల్ 9 వ తేదీని బుచ్చయ్యపంతులుగారు "ఈశ్వరసేవ"ను గుఱించి ప్రసంగించిరి. వయస్సు తీఱిన యనుభవశాలి యగు పంతుల వాక్కులను యువకులము మేము సగౌరవముగ నాకర్ణించితిమి. ఆ మఱుసటిదినము సారంగధరపర్వతమున భగవన్నామసంకీర్తనముచేసి, గీతములు పాడుచు, పురప్రవేశము చేసితిమి. నా కన్నుల కాసమయమున నాచార్యపదవి నధిష్ఠించిన యిద్దఱుపంతుళ్లును ఋషిసత్తముల వలెఁ గానవచ్చిరి. కొన్నిదినములక్రిందటనే కళాశాల వేసవికి మూయఁబడెను. 11 వ తేదీని నేను వీరేశలింగముగారియొద్దకుఁ బోయి, నేత్ర వైద్యమునకై చెన్నపురి కేగవలెనని చెప్పితిని. ఆయనయు, బుచ్చయ్య పంతులును సకుటుంబముగ మఱునాఁడే చెన్నపురిప్రయాణము పెట్టుకొనియుండుటచేత, నన్ను దమతోఁ దీసికొనిపోయెద మనిరి.
కొంతకష్టముమీఁద నా చెన్నపురిపయనమునకు మా తలిదండ్రులు సమ్మతించిరి. వీరిని, తమ్ములను చెల్లెండ్రను నేను విడిచిపోవునపుడు, అందఱమును కంట నీరు పెట్టుకొంటిమి. కొందఱు స్నేహితులతో పడవప్రయాణముచేసి, 13 వ తేదీని కాకినాడ చేరితిని. మఱునాఁడు ప్రొద్దుననే సహచరుఁడగు మద్దిరాల రామారావుగారియింట భోజనము చేసి, ఒకడబ్బాతో మంచినీరు, ఇంకొకదానితో పెరుగును కొంత మిఠాయియు వెంటఁదీసికొని, నేను చిన్న పడవమీఁదఁ బోయి, సాయంకాలమున పొగయోడ నెక్కితిని. ఇదివఱకు నే నెన్నఁడును సముద్రదర్శనము చేసియుండలేదు. నాకన్నుల కిపుడు లోక మంతయు వింతవన్నెలు దాల్చినటు లుండెను ! బిడియముచేత పొగయోడలో వీరేశలింగముపంతులు మున్నగు పరిచితు లుండుచోటఁగాక వేఱొకచోటఁ గూర్చుంటిని. ఓడ మఱునాఁటియుదయమునకు బందరురేవు చేరి, సామా నెక్కించు కొనుచు నచటనే సాయంకాలమువఱకును నిలిచియుండెను. ఒక్కొకసారి పెద్దయలలు చెలరేగుటవలన బందరురేవు కల్లోలముగ నుండును. నాఁ డంతయు పొగయోడ పెద్దకెరటములతాఁకున కుయ్యల వలె నూఁగుటచేత, పైత్యప్రకోపమున నాకు వాంతులయ్యెను. సాయంకాలము పొగయోడ కదలిపోయినపుడు శమనము గలిగి, కొంచెము ఫలాహారము చేసితిని. మఱునాఁటి యుదయమునకు చెన్నపురి సమీపించితిమి. అనతిదూరమున నగరము సముద్రముమీఁద మిగుల రమణీయముగఁ గానవచ్చెను. అపుడు వీరేశలింగము బుచ్చయ్యపంతులు గార్లు కనఁబడి, కుశలప్రశ్న చేసి, పట్టణమందలి తమబసకు నన్నాహ్వానించిరి. క్రొత్తప్రదేశము చూచి బెదరిననాకు, చేరఁబిలిచిన యీ ప్రాఁతపరిచితులు ప్రాణరక్షకులవలెఁ గానఁబడిరి ! వారితో నే నంత పరశువాక మేగితిని. అచ్చట బుచ్చయ్యపంతులుగారి కొక లోగిలి గలదు. ఆసాయంకాలమే వీరేశలింగముగారితో నేను గుజిలీబజారు మున్నగు పురభాగములు సందర్శింప వెడలితిని.
నేను చెన్నపురిలో బుచ్చయ్యపంతులుగారియింటనే విడిసి వీరేశలింగముగారియతిథిగ నుంటిని. ఒకొక్కప్పుడు బుచ్చయ్యపంతులుగారితోఁగూడ భోజనము చేయుచుందును. నేత్రవైద్యాలయమునకుఁ బోవునపుడు తప్ప, తక్కినకాలమందు నే నింటనో బయటనో వీరేశలింగముగారితోనే యుండుచువచ్చితిని. రాజమంద్రియందు నాకుఁ బ్రాప్తింపని పంతులుగారి నిరంతరసహవాసభాగ్యము నా కిచట లభించెను. నీతిమతసాంఘికసాహిత్యాంశములందు ఆమహనీయుని యూహలు నుదారాశయములును నే నిపుడు గ్రహించి యానందింపఁ గలిగితిని. భార్యయగు రాజ్యలక్ష్మమ్మగారితోను, అభిమానపుత్రకుఁడగు చిన్న వీరేశలింగముతోను, ఆయన మాటాడి మెలఁగుచుండురీతి నేను గనిపెట్టితిని. వ్యర్థకాలక్షేపము చేయక, పంతులుగారు సదా సద్గ్రంథపఠనమునను, పుస్తకరచనమునందును లగ్న మానసు లై యుందురు.
29 వ తేదీని నా కనులు డాక్టరు బ్రాకుమను పరీక్షించి, అందేమియు జబ్బు కానఁబడకపోవుటచేత, నే నింటికి వెడలిపోవచ్చు నని చెప్పివేసిరి. ఇది సంతోషకరమైన సంగతి యైనను, కనులముం దాడెడి చుక్కలనుగుఱించి వైద్యుఁడు ప్రస్తావింపకపోవుటచేత, ఆయన వానిని గుర్తింపలేకుండెనేమో యని నేను సంశయమందితిని. ఐనను, నేత్రవైద్యవేత్త యగు బ్రాకుమనుని నిశ్చితాభిప్రాయము నే నెట్లు శిరసావహింపకుందును? కావున నేను తిరుగుపయనమున కాయత్తపడితిని.
మే 1 వ తేదీని వీరేశలింగముగారితోఁ బోయి, రాజధానీ కళాశాలను జూచితిని. అందలియాంధ్రభాషావర్ధనీసమాజసభ కాయన యధ్యక్షుఁడై యొక చక్కనియుపన్యాస మొసంగిరి. బుచ్చయ్యపంతులుగారు, బ్రాహ్మమతస్వీకారమునుగూర్చి నాతో మనసిచ్చి మాటాడిరి. అదివఱ కాయన చిరకాలము మద్రాసునందలి బ్రాహ్మ సమాజనున సభ్యులుగ నుండి, సమాజాభివృద్ధికై మిక్కిలి పాటుపడి, మందిరనిర్మాణముఁ గావించిరి. ఆ సమాజమువారికిని పంతులుగారికిని సరిపడనందున, వారినుండి యాయన విడిపోవలసివచ్చెను. అంత మద్రాసున స్వంతముద్రాలయమును స్థాపించి, "హిందూజన సంస్కా రిణి" అను మాసపత్రికను నెలకొల్పి, పంతులు జరుపుచుండెను. బుచ్చయ్యపంతు లిపుడు హిందూమత పునరుద్ధారణము ప్రధానాదర్శముగఁ జేసికొని, పండితులసాహాయ్యమున నర్థతాత్పర్యసహితముగ హిందూధర్మశాస్త్రము లాంధ్రమునఁ బ్రకటించుచుండిరి.
మే 2 న తేదీని బళ్లారి "సరసవినోదినీ నాటకసమాజము" వారు తాము ప్రదర్శించెడి యొక నాటకమునకు వీరేశలింగముపంతులుగారి నాహ్వానింపఁగా, నేనును వెళ్లితిని. నాటకము మిగుల రమ్యముగ నుండెను. ఆ మఱుసటిదినము పంతులుగారితోఁ గలసి బ్రాహ్మమందిరమున కేగితిని. ఉపాసనసమయమున సామాజికు లందఱును గలిసి కీర్తనలు పాడుటకు మాఱుగా, జీతమునకుఁ గుదిరిన యొకపాటకుని గీతము లూరక వినుచుండిరి ! ఇది నాకు రుచింప లేదు. వీరేశలింగముగా రంతట "ఐహికాముష్మిక సుఖముల"నుగూర్చి యుపన్యాసముచేసిరి.
నేను చెన్నపురిలో నుండురోజులలోనే, స్విప్టువిరచిత మగు "గల్లివరునిప్రయాణముల" ననుసరించి, "సత్యరాజాపూర్వదేశయాత్రలు" అను విచిత్రకథను పంతులుగారు రచింపఁదొడంగిరి. ఏనాఁడు వ్రాసిన ప్రకరణముల నానాఁడు పంతులు నాకుఁ జదివి వినిపించి, నాయభిప్రాయము గైకొనుచుండెను. ఓడప్రయాణమందలి నాబాధలసంగతి నేఁ జెప్పగా విని, సమయోచితముగ నందుఁ గొన్నిటిని సత్యరాజున కాయన యారోపించుట చోద్యముగ నుండెను. హాస్యరసకల్పనా విషయమున పంతులుగారు అడ్డిసనునికంటె స్విప్టునే యెక్కువగఁ బోలియుండె నని నే నంటిని. అడ్డి నుని మృదుహాస్యప్రయోగము తెలుఁగునఁ జొప్పింప పంతులయాశయము. అది కడు దుస్సాధ్య మని నేను జెప్పితిని. పంతులుగారి నిరంతరపరిశ్రమము నా కాశ్చర్యానందములను గొలిపెను. వారివలెనే నేనును పాటుపడనెంచి, నే నక్కడ కొనిన 'ఈసపుకథల'ను తెలిఁగింప మొదలిడితిని. ఈవిధముగ నేను చెన్నపురిలోఁ గొన్నికథల ననువదించితిని.
5 వ తేదీసాయంకాలము వీరేశలింగము బుచ్చయ్యపంతులు గార్లకు అద్వైతమతమునుగుఱించి పెద్దచర్చ జరిగెను. బుచ్చయ్యపంతు లిపుడు అద్వైతమతాభిమాని. వీరేశలింగముగారి మనస్తత్వమున కామతము బొత్తిగా సరిపడకుండెను. దానియం దణుమాత్రమును సత్యము లే దని యాయననిశ్చితాభిప్రాయము. అంత బ్రాహ్మధర్మమందలిలోపములను బుచ్చయ్యపంతులుగారు వెలువరింపఁగా, వీరేశలింగముగారు వారివాదమును ఖండించిరి. నేను వీరేశలింగముగారి పక్షమునే యవలంబించితిని.
6 వ తేదీని, ఈయిరువురు మహాశయులయొద్దను, జననులవలె నిన్నాళ్లును నాకు భోజనసౌకర్యములు గలిగించిన వారిసతీమణుల యొద్దను, నేను సెలవు గైకొని, మద్రాసునుండి బయలుదేఱితిని. వెనుకటి యనుభవములు మఱచిపోయి, నాస్వాభావికరుచుల ననుసరించియె, పొగయోడలో భుజించుటకు తీయని యుపాహారములే యీమాఱును నేను వెంటఁదీసికొనిపోయితిని ! కాని, యోడలో పయనము చేయుచుండు నామిత్రుఁ డొకఁడు, సముద్రయానమందు పైత్యోద్రేకకరములగు మధురపదార్థములు పనికిరావని నాకుఁ జెప్పి, తాను దెచ్చుకొనిన పచ్చడియూరుగాయలతోఁ గలిపినయన్నము నాకుఁ బెట్టెను. ఈమాఱు నాపయనము హాయిగ నుండెను. 8 వ తేదీమధ్యాహ్నము కాకినాడ తీరము చేరి, బండిమీఁద మఱునాఁటి సాయంకాలమునకు రాజమంద్రి వచ్చితిని. సుఖముగ నే నిలు చేరినందు కందఱు నానందపరవశులైరి. 30. జనకుని వ్యవహారదక్షత, శకటవ్యాపారఫలితము
ఇటీవల మాతండ్రి, దూరదేశము పోలేక, ఉద్యోగము విరమించుకొని, యింటిపట్టుననే యుండెను. ఎవరితోడనో మాటలసందర్భమున బండివ్యాపారము లాభకర మైన దని యాయన వినెను. త్రాడు బొంగరములు లేని వ్యవహారములలోఁ జొరఁబడుటకు నే నిష్టపడు వాఁడను కాను. నా చెన్నపురిప్రవాససమయమున మాజనకుఁడు మా తల్లిని, పెద్దతమ్ముని నెటులో యొప్పించి, కొంతసొమ్ము బదులుచేసి, బండిని ఎద్దులజతను కొనెను. బాడుగకు బండి తోలుటకై యొకజీతగాఁడు నియమింపఁబడెను. బండివలన దినమున కొకరూపాయి వచ్చి, ఖర్చుల కర్ధరూపాయి వ్యయ మైనను, కనీస మెనిమిదణాలు మిగులునట్లు తేలెను. కావున నింకొకబండియు నెద్దులజతయును శీఘ్రమే మాతండ్రి కొనెను. దినకృత్యములు చేసికొనుటయె భారముగ నుండెడి మాతల్లి, సాయంకాల మగునప్పటికి, ఎద్దులు నాలుగింటికిని, చిట్టుపొట్టులుకుడితియు గుగ్గిళ్లును సమకూర్పవలసివచ్చెను ! రెండుబండ్లకును పని కుదుర్చుట, పనివాండ్రు సరిగా పని చేసి సొమ్ము తెచ్చి యిచ్చుట మొదలగుకార్యభార మంతయు మాతండ్రిమీఁదఁ బడెను. మాతమ్ము లాయనకు సాయముచేయుచుండిరి. ఈశకటవ్యాపారవ్యామోహము మాతో నిలిచిపోయినదికాదు ! మా మామగారికిని మా తండ్రికిని చెలిమి యెక్కువ. ఆయనయు మా నాయనవలెనే తనపుత్రుని విద్యాభివృద్ధికై సకుటుంబముగ నిచ్చటికి వచ్చి, ఇపు డూరకయే కాలము గడపుచున్నారు. వారును బండి యొకటి కొని, కుటుంబాదాయ మేల వృద్ధిచేసికొనరాదు ? మాజనకుని ప్రేరేపణమున, కొలఁదిరోజులలో వారికిని నొక బండి యెద్దులజతయు సమకూడెను ! ఇపుడు వారు మాపొరుగునకుఁ గాఁపురము వచ్చిరి. కావున నీయుభయకుటుంబముల