ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/కమలామనోహరులు

వికీసోర్స్ నుండి

వలె వెంకటరావు నన్ను గుఱించి యిట్లు చెప్పెను : - "నీ వీసంవత్సరము పరీక్షలో జయ మంది, రాఁబోవువత్స రారంభమున గృహస్థాశ్రమమునఁ బ్రవేశింతువు. సంస్కరణోద్యమము కొనసాగించుటకు చెన్నపురి పోలేక, రాజమంద్రిలోనే నీవు పట్టపరీక్షకుఁ జదివెదవు. ఒకటి రెండు వత్సరములలో నీకు సంతానప్రాప్తియుఁ గలుగును. గృహభారము శిరమునఁ బడిన నీభార్య విద్యాభివృద్ధి నొనరించుకొన నేరదు. సంస్కారావేశము గలుగునపు డెల్ల, కావింప నేరని సంస్కారములనుగూర్చి నీవు పరితపించుచుందువు ! ఐదాఱువత్సరములలో నీవు ప్రభుత్వోద్యోగ మనునెరను బడి సంస్కరణాపేక్షను పూర్తిగ మఱచిపోయి, మీఁదు మిక్కిలి నీతినియమములకే మోసము తెచ్చుకొందువుసుమీ !"

చెలికానిజోస్యమె నిజ మయినచో, జీవితమునకంటె మరణమే వేయిమడుంగులు మేలుగ నాకుఁ దోఁచెను ! ఉన్నతాదర్శపూరిత హృదయము సతతము నాకు దయచేయు మని దయామయుని వేడుకొంటిని.

24. కమలామనోహరులు

స్వకుటుంబములోనే బాల్యవివాహముల నిరోధింపలేక యూరక చూచుచుండు నామనస్సున వివాహసంస్కరణాగ్ని మఱింత తీవ్రముగ వెలుఁగఁజొచ్చెను. ఆ జూనుమొదటితేదీ సాయంత్రము నేను రేలంగిలో కాలువగట్టున షికారు పోవుచు, నాకు, బ్రియమగు నీవివాహసంస్కరణవిషయమునుగుఱించి తలపోసితిని. మలయమారుతము వీచుచుండెను. కోకిలకూజితము శ్రవణానందకరముగ నుండెను. అయినను, వీనివలన నాహృదయవేదన యుపశమింపకుండెను. ఉష్ణ బిందువులు కనులనుండి జలజల రాలెను. నా మనస్తాపము భావోద్రేకముగఁ బరిణమిల్లెను. అంత నేను సంస్కరణవిషయిక మగు కథ నొకటి కల్పించుకొని వినోదించితిని. రాత్రి యంతయు కథావిమర్శనమునఁ గడపుటచేత కంటికిఁ గూర్కు రాలేదు. మఱునాఁటి దినచర్యపత్రములం దాకథ నింగ్లీషున లిఖించి, భావికాలమున దానిని తెలుఁగున పద్యరూపమునఁ గూర్ప నాశించితిని. ఈజన్మమున నా కిఁక కవిత్వభాగ్య మబ్బుట కవకాశము లేమింజేసి, దాని నాంధ్రమున ననువదించి, "కమలామనోహరులు" అను శీర్షికతో "ఆంధ్రపత్రిక" లో 18 - 1 - 1930 తేదీని ఇట్లు ప్రచురించితిని : -

(1)

నలువది సంవత్సరముల క్రిందట వసంతపురమున నొకబాలుఁడు నొకబాలయుఁ గలరు. సమానప్రాయముగల వా రిరువురును, గ్రామమున నొకశ్రేణినె కాపురమున్న భిన్న శాఖలకుఁ జెందిన సాధు విప్ర కుటుంబములలో జన్మించిరి. కమలామనోహరు లాజన్మమిత్రులు. వీరి స్నేహ సౌహార్దములు పూర్వజన్మఁపునాఁటివే యని లోకు లనుకొను చుందురు ! ఆట పాట లందును, విద్యాలయమునను వా రొకరి నొకరు విడిచియుండువారు కారు. దేహములు వేరైనను, ప్రాణములు వారి కొకటియె ! ఒక్కొకతఱి వారు అనతిదూరమందలి సెలయేటి యొడ్డున కేగి, పెద్దరాతిపలకమీఁదఁ గూర్చుండి, భూమ్యాకాశములు తిలకించి, సుఖసంభాషణములు జరుపుచుందురు.

లోకమున సౌఖ్యకాల మెంత త్వరితగతి నంతరించుచున్నది ! బాల్యవివాహాచారబద్ధు లగు జననీజనకులు, కమలకు పండ్రెండు వత్సరములకె పాతికయేండ్లు నిండునట్లు భావించి, కొమార్తె వివాహ మేర్పఱిచిరి. కమలపెండ్లి మిత్రు లందఱికివలెనే మనోహరమునకు నానందదాయక మయ్యెను. ఏకారణముననో కాని, పెండ్లికూఁతునకే సంతోషావహముగ లేదు. పురుషునికంటె స్త్రీకి, భవిష్యద్దాంపత్య జీవితరహస్యము, అతివేగముగను, స్ఫుటముగను బొడకట్టుచుండును. తన కీపెండ్లి యక్కఱలేదను కమల పలుకులు, అబద్ధమని నిరసించుటకుఁగాని, నిజమని నమ్ముటకుఁగాని తలిదండ్రులకుఁ దోఁపకుండెను. పసిరిక మొగ్గవంటి బాలికమాటలు చెవియొగ్గి వినుటయె వెఱ్ఱియని తుదకు తలిదండ్రులు తలపోసి, కమలను తమబంధువులలో నొకని కిచ్చి పరిణయము గావించిరి.

పూర్వదిశాంగనాముఖము, ప్రాతస్సమయమున నొక్కొక్క పరి పలువన్నెల మబ్బులచే మాటుపడియు, భానూదయకాంతుల ప్రథమస్పర్శముననె వికాసముఁ జెందుచుండును. పెండ్లిపీటలమీఁద నుండునపుడు, కమల వదనబింబ మొకించుక విచారమేఘావృత మయ్యును, తలంబ్రాల సమయమునకు కళంకరహిత మయ్యెను. బాల్యదశయందు సుఖదు:ఖములు స్వల్పనిమిత్తములకు వశవర్తు లగు చుండును. కాని, బాల్యకాలపు టూహలు నుద్దేశములు నొక్కొక్కప్పుడు, జీవితభూమిని వేళ్లువాఱి, ఆమరణమును పెకలింప నసాధ్య మగుచుండును !

(2)

అది ప్రాత:కాలము. వసంతభానుఁ డింక నుదయాద్రి నధిష్ఠింపలేదు. గృహారామమున చూత నారికేళాదివృక్షములు, పూవులమొలకలును, గుబురుగఁ బెరుఁగుచున్నవి. విరుల నెత్తావులు గాలి యంతటను ప్రసరించియున్నవి. లేఁజివురులు మెసవుచు కోకిల శ్రావ్యనాదములతో జనలోకమునకు స్వాగతగీతము లర్పించుచున్నది. జగమెల్లయు నరుణోదయచ్ఛాయల నలరుచు, ఆనందవీచికల నోల లాడుచుండెను.

కమల నిషేకముహూర్త మీదినముననె జరుగవలసియున్నది. నీలాలకములు గప్పిన సుందరవదనమును వంచి, చెట్టుక్రిందఁ గూర్చుండి, తనయశ్రుజలముతోఁ జెంతప్రవహించు చిన్న కాలువ పొంగునట్టుగ, దైన్యమున విలపించెడి యీసుందరి యెవరు ? లోకమెల్ల నానందమున నోలలాడెడి యీసుఖసమయమున నీకోమలి యిట్లు కుందుటకుఁ గారణ మేమి ? సమీపమున నాసీనుఁడగు నీయువకుఁ డెవడు ? వారు ప్రేయసీప్రియులవలెఁ గానిపించు చున్నారు. అంత తనదు:ఖ మొకింత త్రోసివైచి యాతరుణి, "జీవితేశ్వరుఁడవగు మనోహరా ! నేఁటితో మనస్నేహవృక్షమున కాయువు చెల్లి పోయెనుగదా !" యని పలికి, హృదయము శోకపరవశము కాఁగా, మౌనముద్ర నూనియుండెను.

మనోహర మా మానిని నిటు లోదార్చెను : "కమలా, ప్రాణ సఖీ ! ఏల నీవు విచారమునఁ బ్రుంగుచున్నావు ? నీసంతుష్టవదన సందర్శనమును, నిష్కల్మషహృదయసూచకము లగు లోచనవిలోకనమును గనుల పండువుగఁ జేకొనినమిత్రు నేల దు:ఖాతిరేకమున నెత నొందించెదవు? ఓహో, జ్ఞాపకము వచ్చినది ! మన ప్రేమసఖ్యముల కీనాఁడు ప్రబలవిరోధిగ పరిణమించిన ప్రపంచమునుజూచి యిన్నాళ్లు నెట్లు భ్రమపడితిమి !" అని పలుకుచు మనోహరము, ప్రేయసిని దు:ఖానలమునుండి తొలఁగింపఁబూని తానే సంతాపమున కుమిలి పోయెను ! ఆయువతీయువకు లెంతసేపు దు:ఖతోయములఁ దోఁగుచుండిరో తెలియదు. బాలసూర్యుని యరుణకిరణములు తన శోక తిమిరమును దొలఁగించినట్టుగఁదోచి, గమల కనులువిప్పి చూచునప్పటికి, మనోహర మెచ్చటను గానరాకుండెను !

సూర్యబింబము సువర్ణకాంతులతో వియత్పథమున వెలుఁగు చున్నను, కమల కన్నుల కాదివసము కాఱుమబ్బులు గ్రమ్మిన కేవల దుర్దిన మయ్యెను ! ఆసాయంకాలము చెలికత్తెలు శుభకార్యమున కనువగు నలంకారములు తనకుఁ జేయునపుడు, చుక్కల నడుమనుండు చందురునివలె కమల వారలమధ్యఁ గొమరారుచుండెను. అపుడె యింటి కేతెంచిన యెఱుకతచేఁ జేయిచూపించుకొనుమని యామెచెలులు పట్టు పట్టిరి. తమగతి తమ కెఱుకపడినవారి కెఱుకలు జోస్యములు నేల? ఐనను, నెచ్చెలుల కోరిక చొప్పున కమల చేయిచాచెను. కన్నులు కరమం దున్నను, ఎఱుకత కెపుడును, మనస్సు ముఖముననె దవిలీయుండును ! అది యిట్లు లోనఁ దలపోసెను: "ఈ శుభసమయమున సొబ గొందవలసిన యీసుందరి ముఖపద్మ మేల ముకుళించి యున్నది? ఎందుల కీ సోగకనులు సోలియున్నవి ? ఈమె హృదయము వ్యాకులితమై యుండవలెను. ఇది గుప్తముగ నే గనిపెట్టెదను !" ఐనను, కుతూహల లగు నా కోమలులఁ దనియింపఁబూని యెఱుకత, "ఈ ముద్దరాలి కడుపున పదిమంది పుత్రులు పుట్టెదరు." అని పలికి, చెలులందఱు సంతోషకోలాహలమున నుండునపుడు, నాఁటిరాత్రి యొకసారి తోఁటలోనికి రమ్మని కమలకు మెల్లగఁ జెప్పి వెడలిపోయెను.

పిమ్మట తోఁటలో నెఱుకత కమల కిట్లనెను: "నీచేయి చూచి సమయమున కేదో కల్ల బొల్లి కల్పించితినిగాని, నీమనసున విచార మున్నట్లు కానఁబడెను. ఆరహస్యము తెలిపితివేని, నీ యభీష్టము నెరవేర్చి, బాధ తొలఁగించెదను. నిజము చెప్పు, నీ హృదయము పరపురుషునిమీఁద..............."

కమల దాని నోరణఁచునట్టుగ నిట్లు ప్రత్యుత్తర మిచ్చెను: "తల్లీ! నీవు నా హృదయశల్యమును పెకలింప పాల్పడినందుకు సంతోషమె. కాని, యటుచేయుట కదను తప్పినది. రానున్నది నాకుఁ దెలిసియె యున్నది. ఇంక మన మిచట మసలఁగూడదు. అదిగో పురోహితుఁడు నారాక కెదురుచూచుచున్నాఁడు. నన్నుఁ గొనిపోవుట కిదిగో మాయమ్మ వచ్చుచున్నది !" అనిపలికి, దానిచేత నొక్కింత రాలిచి పొమ్మనెను. ఆ సుశీలమీఁది జాలిచే కంట నీరు గ్రమ్మి, యెఱుకత వెడలిపోయెను.

(3)

మఱునాఁడు వసంతపురమున కమల యకాలమరణమునకు విలపింపని మనుజులు లేరు. "ఏమి యీ సౌభాగ్యలక్ష్మికి శుభదినమె తుదిదిన మయ్యెనే !" యని కొందఱును, "పూవు పుట్టఁగనే పురుగు నోటవేసికొనెనే!" యని కొందఱును, కమల మృతినిగూర్చి చెప్పుకొనసాగిరి. "మానవజన్మము బుద్బుదప్రాయముగదా !" యని ప్రజలు వైరాగ్యవచనములు చెప్పుకొనిరి.

కమల యవసానకాలమున గుఱించి పెండ్లికుమారుఁ డిట్లు చెప్పెను : - "నిన్న రాత్రి తలుపు మూయఁగనే, కమల శయ్యయొద్ద నిలిచి, నన్నుద్దేశించి 'అయ్యా! నన్ను విధి తఱుముకొని వచ్చు చున్నది ! కాని నేను త్వరితముగ మీతో కొన్నిమాటలు చెప్పవలెను. వివాహ బంధమువలన మన మిద్దఱము భార్యాభర్తల మైతిమని లోక మెంచుచున్నను, చిన్ననాఁటనుండియు నామనస్సు మనోహరము మీఁదనే యున్నది. అతఁడె నా హృదయాధి నాధుఁడు. భూలోక కిల్బిషము లెవ్వియు సోఁకకుండ దైవము మా ప్రేమలత నిన్నాళ్లును బ్రోచుచుండెను. అట్టి పవిత్రప్రేమ కాధారమగు ప్రియుని వదలి పరపురుషుని జేపట్ట నొల్ల కున్నను, ఇంతవఱకు నా నిజాభిప్రాయము వెల్లడింపమికి ప్రాణత్యాగమే ప్రాయశ్చిత్తముగఁ జేకొనుచున్నాను ! నా తుదితలంపులు దెలుపు లేఖను మనోహరమున కందఁజేయ మిమ్ము వేడుచున్నాను !' అని యాయువతి, కలము కాకితమును గైకొని యీ రెండు కమ్మలును వ్రాసెను. ఇవి లిఖించినపు డా తరుణి ముఖబింబమున తాండవించిన తేజోవిశేష మేమని వర్ణింతును ? ఆ సుందరవదనమున ప్రస్ఫుటమైన యాత్మవికాసము భూలోక సంబంధమైనది గాక, ఏ దివ్యలోకమునుండియో దిగి మరల నా భవ్యలోకమును వేవేగమె పొంద కాంక్షించునట్టిదిగఁ దోఁచెను! రెండవలేఖ పూర్తి కాకమునుపె, ఆ చెలువ చిన్ని వేళ్లనుండి కలము పట్టుతప్పెను ! ప్రచండవాయుచలనమున నేలపాలగు చూతలవలె నాలతాంగి పుడమి మీఁద కోరగిల్లి పడిపోయెను !

"ఆ సుందరి వ్రాసియుంచిన కమ్మలివె!" అని యా పెండ్లి కుమారుఁడు జేబునుండి యవి తీసియిచ్చెను. అందొకటి తలిదండ్రులకును రెండవది మనోహరమునకును కమల వ్రాసెను.

మనోహరుని కమ్మలో నిటులుండెను : - "ప్రియసఖా! ఇది నా తుది యుత్తరము. ప్రేమబంధమున మన జీవితము లొక్కటియగు నని నేను మొదటినుండియు నువ్విళ్లుగొనుచుండుధానను. కాని, నే నిష్టపడకున్నను, తలిదండ్రులు చిన్న నాఁడె నాకుఁ బరిణయము చేసిరి. స్వేచ్ఛయుండిన నెవరిని జెట్టవట్టియుందునో చెప్పవలెనా ! పరిస్థితులు సవ్యముగనె యుండినచో మనోహరుఁడె నాకుఁ బతియై యుండెడివాఁడు ! ఐనను, నిరపరాధు లగు తలిదండ్రులను నేను నిందింపను. హృదయంగతమగు కోరికలు తెలుప మన సెంత తహతహపడుచున్నను, లజ్జాతిరేకమున పెదవి మెదలుపనేరకున్న పసిబాలిక మాటలు, జననీజనకులు బాగుగగ్రంహింపనేర్తురా? గ్రహించియు, పూర్వాచారపరాయణు లగు తలిదండ్రులు శాఖాభేదములు పరిగణింపక మన కిద్దఱి కానాఁడు పెండ్లిచేయుదురా ? కాన, నా కకాలమరణ మవశ్యమని గుర్తెఱిఁగియె కాలము గడిపితిని. ఇప్పటికి గడువు సమీపించినది. నేను పరలోకయాత్రకు వెడలిపోవుచున్నాను. శాఖా భేదములు పాటించి, ఆచారమును శిరసావహించి, వదూవరుల యభీష్టము నారయక జనులు జరిపెడి యీ యతిబాల్యవివాహము లచిరకాలముననె యంతరించుఁగాక! బలవత్తరమైన యాచారపిశాచమునకు బలియై యబలను నేను గతించినను, సుగుణములకాకరమును, మహదాశయములకుఁ దావలమును నగు నీవు సత్కార్యసాఫల్యమున ధన్యుఁడవై చిరకాలజీవియై, వర్ధిల్లెదవుగాక!'

25. ఏకాంతజీవితము

స్నేహితులతో నే నాకాలమునఁ జర్చింపని రహస్య మేమియును లేదు. నేను రేలంగిలో నున్నరోజులలో పలుమారు వెంకటరావును జూచి, అతనితో లోకాభిరామాయణమే గాక, సంస్కరణోద్యమమునుగూర్చియును బ్రసంగించుచుండెడి వాఁడను. నేను వ్రాసిన 'కమలామనోహరుల' కథ నాతనికి వినిపించితిని. కథలోఁ గొన్ని పట్టులఁ దగినచతురతఁ గనపఱచలేదని యతఁ డసంతృప్తిఁ జెందెను.