ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/ఏకాంతజీవితము
స్వేచ్ఛయుండిన నెవరిని జెట్టవట్టియుందునో చెప్పవలెనా ! పరిస్థితులు సవ్యముగనె యుండినచో మనోహరుఁడె నాకుఁ బతియై యుండెడివాఁడు ! ఐనను, నిరపరాధు లగు తలిదండ్రులను నేను నిందింపను. హృదయంగతమగు కోరికలు తెలుప మన సెంత తహతహపడుచున్నను, లజ్జాతిరేకమున పెదవి మెదలుపనేరకున్న పసిబాలిక మాటలు, జననీజనకులు బాగుగగ్రంహింపనేర్తురా? గ్రహించియు, పూర్వాచారపరాయణు లగు తలిదండ్రులు శాఖాభేదములు పరిగణింపక మన కిద్దఱి కానాఁడు పెండ్లిచేయుదురా ? కాన, నా కకాలమరణ మవశ్యమని గుర్తెఱిఁగియె కాలము గడిపితిని. ఇప్పటికి గడువు సమీపించినది. నేను పరలోకయాత్రకు వెడలిపోవుచున్నాను. శాఖా భేదములు పాటించి, ఆచారమును శిరసావహించి, వదూవరుల యభీష్టము నారయక జనులు జరిపెడి యీ యతిబాల్యవివాహము లచిరకాలముననె యంతరించుఁగాక! బలవత్తరమైన యాచారపిశాచమునకు బలియై యబలను నేను గతించినను, సుగుణములకాకరమును, మహదాశయములకుఁ దావలమును నగు నీవు సత్కార్యసాఫల్యమున ధన్యుఁడవై చిరకాలజీవియై, వర్ధిల్లెదవుగాక!'
25. ఏకాంతజీవితము
స్నేహితులతో నే నాకాలమునఁ జర్చింపని రహస్య మేమియును లేదు. నేను రేలంగిలో నున్నరోజులలో పలుమారు వెంకటరావును జూచి, అతనితో లోకాభిరామాయణమే గాక, సంస్కరణోద్యమమునుగూర్చియును బ్రసంగించుచుండెడి వాఁడను. నేను వ్రాసిన 'కమలామనోహరుల' కథ నాతనికి వినిపించితిని. కథలోఁ గొన్ని పట్టులఁ దగినచతురతఁ గనపఱచలేదని యతఁ డసంతృప్తిఁ జెందెను. అనగత్యముగను, అకస్మాత్తుగను నేను కొన్ని యుదంతముల నందుఁ జొప్పించితి ననియు, ప్రేమాకుసుమమును పొంకముగఁ జిత్రింపలే దనియును, అతఁడు చిఱాకుపడెను. నా కథయందు వర్ణనములకుఁ దావు లేదనియు, ముందు రచించెడి కథాసంగ్రహమే నే నిందు సూచించితిననియు, నా సమాధానము. అచటనచట సొంపులు లేక పోలేదని యతఁడు పలికెను.
మరల రాజమంద్రి చేరినపిమ్మట మే మిరువురమును విచిత్ర లేఖలు కొన్ని వ్రాసి, ఒకస్త్రీ వ్రాయునట్టుగా వానిని "వివేకవర్థని"లోఁ బ్రచురింప నుద్యమించితిమి. 13 వ జూన్ తేదీని వెంకటరావు నేనును, "వీరేశలింగముపంతులు నిజమైన సంస్కర్తయేనా?" యను విషయమునుగుఱించి చర్చించుకొంటిమి. మతసాంఘికవిషయములందు సంస్కర్తకర్తవ్య మేమి ? లోకముదెస నాతనివర్తన వ్యవహారములు నిష్కళంకములుగ నుండవలయును. అతనికి శత్రువులు, ముఖ్యముగ వ్యక్తిసంబంధమగు శత్రువులు, నుండరాదు. వీరేశలింగము పంతులు కోపస్వభావులై, కక్షలకుఁ గడంగి రని మే మనుకొంటిమి. ఏకైకస్నేహితుఁడగు గవరరాజుగారు అకాలమరణము నొందుటచేత, కలసి పని చేయుట కెవరును తోడు లేక, ఏకాకియై పంతు లిపుడు దినములు గడుపుచున్నాఁడు వితంతూద్వాహపక్షమువారు, వీరేశలింగముగారిని విడిచి, ఆయనపలుకులకు క్రియలకు వికటవ్యాఖ్యలు సలుపుచుండు నొక ప్రబుద్ధుని యండఁజేరి రని మేము చెప్పి పంతులను వారింప నుద్యమించితిమి.
12 వ తేదీని నేను వెంకటరావును గలసికొంటిని. అతఁడు స్త్రీలోలత్వమునుగుఱించి ప్రసంగింపఁబూనఁగ, అది గర్హ్య మని నేను బలికితిని. తుంటరులనుగుఱించి యతఁ డంత ప్రస్తావించెను. చెడుగును గుఱించి వచించుట కాతఁడు వెనుదీయకుండుటయు, ఎందును తనప్రాముఖ్యముఁ దెలుపుచు మాటాడుటయు, నా కాతనిసంభాషణమునకు ముఖ్యచిహ్నములుగఁ దోఁచెను. అతిశయోక్తులతో నుపన్యసించుటయు నతని కభ్యాసము. సహచరునియలవాటు పట్టుపడి, అపుడపుడు సంభాషణమున నతిశయోక్తులు చొప్పింప నేనును వెఱువకుండెడి వాఁడను !
కళాశాల తీయు దినములు సమీపించుటచే నేను, తమ్ము లిద్దఱును రాజమంద్రి పయనము కావలసివచ్చెను. నేను వెంకటరావు నొద్ద వీడ్కోలు గొంటిని. మరల వానినిఁ గలసికొనకయె నేను మృత్యువువాతఁ బడినచో, నన్ను గుఱించియైన నాకుఁ బ్రియమగు సంస్కరణపక్ష మవలంబింపు మని వానినిఁ గోరితిని. 17 వ జూన్ మధ్యాహ్నమున తమ్ము లిద్దఱితో నేను బయలుదేఱితిని. రేలంగి యిల్లు 'మరమ్మతు' అగుచుండుటచేత, మా తలిదండ్రులు, చిన్నపిల్లలును మాతో రాలేకపోయిరి. మరల విద్యాశాలఁ జేరవలె ననెడి యాశ మమ్ము వేగిరపెట్టగ, వర్షములోనే మేము నడచిపోవ సమకట్టితిమి. రెండు పెద్దమూటలు మేము మోయవలసి వచ్చెను. దారిలో వాన హెచ్చినను రాత్రికి వేలివెన్ను చేరవలె ననెడియాశచే మేము బురదలోనే పయనము చేసితిమి. ఎట్టకేలకు కాల్ధరికాలువగట్టు చేరితిమి. కాలువ పూర్తిగఁ బ్రవహించుచుండెను. దాటుటకు బల్లకట్టు లేదు. ప్రవాహమును దాటింపుఁ డని ఆవలియొడ్డున బట్ట లుదుకుకొను వ్యవసాయదారులను వేడితిమి. వారు సాయపడక, చిన్న తమ్ముని పెద్దవార మిరువురము చేతులు పట్టుకొని నీట నడిపించినచో, కాలువ దాటవచ్చు నని యాలోచన చెప్పిరి. కాఱుమబ్బుచే నల్ల బడిన యాకాశము ప్రతిఫలించి యిపుడు భయంకరాకృతిఁ దాల్చిన కాలువనీట మే మంత చొరఁబడితిమి. కొంత నడచునప్పటికి, నీటి లోతు హెచ్చి, నేను మాచిన్నితమ్మునిచేయి యట్టె వదలివేసితిని ! వెంకటరామయ్యమాత్రము పిల్లవాని చేతిపట్టు విడువలేదు. అంత మేము మువ్వురము వెనుక మొగము పట్టి, మాకుఁ దోడ్పుడుఁ డని మరల నా మనుష్యులను వేడితిమి. వారిలో నొకఁ డంత నీదుకొని వచ్చి, ఒక్కొక్కరినే మమ్మావలియొడ్డు చేర్చెను. పిల్లవానిని నిష్కారణముగఁ జంపివేసియుందు రని యచటివారు మమ్ము నిందించిరి. మా మేనమామలయిల్లు చేరి, బందుగులకు మా ప్రయాణవృత్తాంత మెఱిఁగించితిమి. నాఁడా గ్రామమందలి బాలికలు బొమ్మలపెండిండ్లు చేసికొనుచుండిరి. వారిలో నాభార్యయు, నా పెద్దచెల్లెలు నుండిరి.
మఱునాఁడే మేము రాజమంద్రి పయన మయితిమి. వాయు వతితీవ్రముగ వీచుచుండెను. ఒక్కొకప్పుడు గాలి తాఁకునకు నెత్తి మూటలతో మేము తూలిపోవుచుంటిమి. ఎటులో విజయేశ్వరముఁ జేరితిమి. ఆనాఁడు స్టీమరు రా దని తెలిసెను. ఆపెనుగాలిలో పడవ లేవియు నీటిమీఁదిపయనమునకు సాహసింపలేదు. ఇంతలో వాడపల్లిరేవున నొక రహదారీపడవ మునిఁగె ననియు, కొందఱుప్రయాణికులు చనిపోయి రనియు, మాకు వినవచ్చెను. మేము వాడపల్లికి నడచి పోయితిమి. మునిఁగిపోయినపడవ యొడ్డున కొకింత దూరమునఁదేలు చుండెను. చనిపోయినవారినిగూర్చి యేమియుఁ దెలియదు. రాజమంద్రినుండి యంత నొకస్టీమరు వచ్చి యెంత ప్రయత్నించియును, బోరగిలినపడవను తిరుగఁదీయ లేకపోయెను. ఇపుడు చీఁకటి పడుచుండుట చేత, రాత్రిభోజనమునకు మేము వెనుకకుఁ బోయి, విజయేశ్వరము సత్రమున బస చేసితిమి. మఱునాఁడు (20 వ తేది) మేము విజయేశ్వరమునుండి మరల వాడపల్లి పోయితిమి. ఏదైన పడవమీఁద ధవళేశ్వరము చేరుదమా యనుకొనుచుండఁగనే, రేవుస్టీమరు వచ్చెను. ఇపు డది మునిఁగిన పడవను తిరుగఁదీయఁగా పడవగదిలో నిరుకుకొని చనిపోయిన యొకస్త్రీ, ఆమెకొడుకు కూఁతురు నందు గానవచ్చిరి! ఆశవములు చూచి యందఱమును దైన్యము నొందితిమి. మే ,మంత స్టీమరుమీఁద రాజమంద్రి వెళ్లితిమి.
ప్రియపట్టణమగు రాజమంద్రిని నేను మరల సందర్శించుట కమితానందభరితుఁడనైతిని. సంస్కారప్రియుఁడగు మిత్రుఁడు రాజగోపాలరావు నన్నుఁ జూచుటకు స్వగ్రామమునుండి యిక్కడకు వచ్చియుండెను. చెలికాఁడు కొండయ్యశాస్త్రికూడ నిచట నుండెను. ఆతఁ డీమాఱు సంఘసంస్కరణమునెడల సానుభూతి గనపఱుచునట్లు తోఁచెను. వేంకటరావును గుఱించి మాటాడుకొంటిమి. ఆతనికి నియమానుసరణమునకంటె సమయానుకూలవర్తనమే ప్రియతర మైన దని సిద్ధాంతపఱుచుకొంటిమి. ఆదినములలో వీరేశలింగముగారు కట్టించు చుండెడి పురమందిరము వీక్షింపఁబోయితిమి. ఆ సంస్కర్తనుగుఱించి యచటివా రెవరో పరిహాసముగఁ బలుకఁగా నేను జిన్నపోయితిని. సమాజమిత్రుఁడు, సచ్ఛీలుఁడునగు పాపయ్యగారు, "క్రైస్తవ మతబోధకులవలె శాంతమతితో మనము కష్టములకుఁ గటువుపదములకు నోర్చుకొనుచు, పట్టుదలతోఁ బనులు చేసినచో, మనకు విజయము చేకూరును" అని పలికి నన్నోదార్చెను.
జూలై 1 వ తేదీన మా యనుంగుమిత్రుఁడు లక్ష్మీనారాయణగారు రాజమంద్రి వచ్చి, సంఘసంస్కరణవిషయమున నా కృషిని గూర్చి తాను మిత్రులవలన వింటి నని చెప్పి, నన్నభినందించెను అయినను, నాకుఁ బ్రియమగు స్త్రీ స్వాతంత్ర్యము నాయన పరిహసించి, స్త్రీలను మఱింత బంధింపవలె నని చెప్పి, సంస్కరణనిరసనము చేసినపుడు నా కధికవిచారము గలిగెను. బంధువును, మిత్రుఁడును నగు కొండయ్యశాస్త్రియొక్క విపరీతపు ప్రాఁతమతాభిప్రాయముల నీతఁడు సమర్థించునటు లగఁబడెడివాఁడు! కాని, యీయన చిత్తవృత్తి యపు డేకవిధమున నుండెడిదికాదు. కేశవచంద్రసేనుల యాంగ్లేయోపన్యాసముల నత్యుత్సాహమున మా కీయన చదివి వినిపించి,ఉద్రేకము గలిగించుచుండెడివాఁడు. ఆకాలమున నా సహచరులలో నొకరగు శ్రీ ఆనూరి కాంతయ్యగారినిగూర్చి కొంత చెప్పవలెను. పూర్వము తానును సంస్కరణములయం దమితాభినివేశము గలిగియుండెడివాఁడ ననియు, కాని యావిషయమునఁ దా నిపుడు కాఁగి చల్లారిన పాలవలె తటస్థుఁడ నైతి ననియు, ఆయన పలుకుచుండెడివాఁడు. చాత్తాద వైష్ణవుఁ డయ్యును, ఆయన సామాన్య బ్రాహ్మణయువకులందుఁ బొడఁగట్టని పారిశుద్ధ్య మనోనిగ్రహములచే నొప్పెడివాఁడు. సాధువర్తన మితభాషిత్వము లాయన సొ మ్మగునటు లుండెడివి ! ఆసమయమున పట్టపరీక్ష రెండవశాఖకుఁ జదువుచు, తర్కమనశ్శాస్త్రములు అభిమానవిద్యగాఁ గైకొని, నీతిశాస్త్రమందలి మంచికథపట్టులు మాకు వినిపించుచుండెడివాఁడు. ఆ సంగతులు మిగుల చిత్తాకర్షకములుగ నుండి, పట్టపరీక్షకుఁ జదివినచో, ఆశాస్త్రపఠనమే చేయ నాకు సంకల్పము గలిగెను.
మా తలిదండ్రు లింకను రేలంగిలో నుండుటచేత, సోదరులు మువ్వురము రాజమంద్రిలో నొంటరిగ నుండి, మావంట మేమే చేసికొనుచువచ్చెడివారము. పెద్దవాఁడనగు నామీఁద సామాన్యముగ వంటపని పడుచువచ్చెను. ప్రొద్దున పదిగంటలకే మేము మువ్వురము వంట చేసికొని భోజనము చేసి పాఠశాల కేగవలసివచ్చుటచేత, మా కెంతో కష్టముగ నుండెడిది. వీనికిఁదోడు, సంస్కారప్రియులగు మిత్రుల సందర్శనసంభాషణములు నా నిత్యానుష్ఠానములో నంతర్భాగములె ! ఇంట పాఠములు దిట్టము చేసికొనుటకే మాకు వ్యవధి చాలకుండెను. ఈమధ్యగ భోజనసదుపాయము లేమింజేసి మాతమ్ముఁడు కృష్ణమూర్తి జబ్బుపడియుండెను. ఆసమయమందు మా యలజడి మఱింత హెచ్చియుండెను. మా స్నేహితు లా దినములలో సంస్కరణము పట్ల చూపిన యశ్రద్ధ మిగుల నిరుత్సాహకరముగ నుండెను. అద్దానిని గుఱించి రాజగురునితో నేను మొఱపెట్టఁగా, దీనివిషయమై మా సంస్కరణసభలో నొకనాఁ డాతఁడు తీవ్రముగ మాటాడెను. కనక రాజు ఆమాటలకుఁ గుపితుఁడయ్యెను. పాపయ్యగారు పలికిన చల్లని పలుకులును, వీరేశలింగముగారి సంస్కరణోపన్యాసమును ఆతని కోపము నొకింత చల్లార్చెను.
సంస్కరణసమాజకార్యక్రమమే నా యసంతుష్టికి హేతువయ్యెను! ఈసమాజమున కాస్తికమతముతో సన్నిహితసంబంధము గలసినఁగాని దీనికి మోక్షము లేదని నానిశ్చితాభిప్రాయము! 27 వ జూలై తేదీని జరిగిన సంస్కరణసభకు లక్ష్మీనారాయణగా రగ్రాసనాధిపతి. సంఘసంస్కరణమునుగుఱించి కష్టపడి వ్రాసినవ్యాసము నేను జదివితిని. భీమశంకరము వ్యతిరేకాభిప్రాయ మిచ్చినను, కనక రాజు నాకు సానుభూతిఁ జూపెను. 3 వ ఆగష్టున జరిగినసభకు నే నగ్రాసనాధిపతిని. వివాహమునుగుఱించి కృష్ణమయ్యంగారు వ్యాసము చదివిరి. మిక్కుటమగు సభాకంపమునకు లోనైనను, నే నెటులో నావిధులు నిర్వర్తించితిని. మాటలకొఱకు నేను తడవికొనుచువచ్చితిని. నా యుపన్యాస మతిదీర్ఘముగ నుండెను. అంత్యోపన్యాసము ముగించి నేను గూర్చుండుసమయమున శంభుశాస్త్రిగారు లేచి, కొన్ని మితసంస్కరణములు సూచించి, అవి మాసంఘమువా రవలంబించుట మంచిదని చెప్పెను. అంత నేను మరల లేచి, యీ సాంఘికవ్యాధికి బాల్యవివాహనిర్మూలనమే తగినచికిత్స యని వక్కాణించితిని. నాయీ తీవ్రసంస్కార పద్ధతి యావక్తను మరలమరల మాటాడ నుద్రేకింపఁగా నేనును సముచిత ప్రత్యుత్తరము లిచ్చుచువచ్చితిని. అంతట పాపయ్యగారు లేచి కొన్ని సామవచనములు చెప్పినమీఁదట, ఇంకొకవారమునకు సభ నిలిపివేసితిమి. పిమ్మట జరిగిన ప్రార్థనసమాజసభలో తమయధ్యక్షోపన్యాసమున వివాహసంస్కరణావశ్యకతను గూర్చి చెప్పుచు, వీరేశలింగముపంతులుగారు నా యభిప్రాయములను సమర్థించిరి. సభికు లందఱి మన్న నలకుఁ బాత్రమైన యగ్రపీఠము నధిష్ఠించినందు కెంతయు ముద మందితిని. నా పరిచితు లనేకు లానాఁడు సభ కేతెంచిరి. మధ్యమధ్య నాంగ్లేయపదములు పడి నేను గొంత చుట్టుత్రోవఁ ద్రొక్కినను, నాయుపన్యాసము నా నిశ్చితాభిప్రాయములను స్పష్టీకరించెను. నిజముగా నేను కీర్తి కెక్కు చుంటినా యని సంప్ర్రశ్నించుకొంటిని !
4 వ ఆగష్టు మధ్యాహ్నము పాఠశాలనుండి యింటికివచ్చినతోడనే, రేలంగినుండి యపుడె వచ్చిన మాతల్లిదండ్రులు తమ్ములు చెల్లెండ్రును గానఁబడి మోదమున మేము మిన్నందితిమి. ఇన్నాళ్ల నుండియు మువ్వురు సోదరులమును ఇంటిపను లన్న విసిగియుంటిమి. చదువుకొనుటకు వ్యవధాన మేమియులేదు. ఇంకముందు మా భారమంతయు తల్లి దండ్రులె వహింతురు గాన, క్రమముగఁ జదువుకొన వచ్చునని మేము సంతసిల్లితిమి. రాఁబోవు డిసెంబరులోనే నేను ప్రథమశాస్త్రపరీక్షకును, నాతమ్ముఁడు ప్రవేశపరీక్షకును బోవలయును గావున, కాలము వ్యర్థముచేయక, పెక్కు భోజనసదుపాయములకై తల్లిని వేధింపక, విద్యాపరిశ్రమముఁజేయ నిశ్చయించుకొంటిమి. ఆదినమే మిత్రుఁడు వెంకటరావు వచ్చికలసికొనుటచే నాయానందమునకు మితి లేకుండెను. నాఁడు నలుగురు స్నేహితులము నడిరేయివఱకును సంభాషణలతోఁ బ్రొద్దు పుచ్చితిమి. నా స్నేహితుఁడు కొండయ్యశాస్త్రి తాను జదువుకొనుటకు మా కావలివీథినున్న యొకయింట చిన్న గది యొకటి యద్దెకు పుచ్చుకొనెను. ఇపుడు నేను మాతమ్ముఁడును, దాని కెదురుగ నున్న గదిలోఁ బ్రవేశించి చదువనారంభించితిమి. ఆకాలమున బాడుగలు మిగుల స్వల్పము. మాగది యద్దె పావలామాత్రమె !
15 వ తేది ప్రొద్దున నాగదిలో మూఁడునాలుగు గంటలు చదివినపిమ్మట నింటికి భోజనమునకు వచ్చితిని. ఆఁకలిచేత నాకుఁ బ్రాణములు కడఁబట్టుచుండెను ! ఆ యసమయమున మా యమ్మ ప్రశాంతమనమున నొకకందమొలకకుఁ బూజలొనర్చుచుండెను ! నే నేమిచేతును ? గోరుచుట్టుమీఁద రోకలిపో టనునట్టు, నాయాఁకలి బాధకు నా ప్రబలవిరోధియగు విగ్రహపూజా సందర్శనము తోడై, నా కోపవహ్నిని రగులుకొలిపెను. దేవదేవునికిఁ జెల్లింపవలసిన పూజాపురస్కారము లీక్షుద్రవస్తువున కేల సమర్పించితి వని మా తల్లిమీఁద మండిపడి, నోటికి వచ్చిన వాక్కులు ప్రయోగించితిని ! కాని, కొంతసేపటికి చిత్తనిరోధము చేసి, శాంతించి, "సదుద్దేశమున నీ యిల్లాలు చేసెడిపూజల కేల నేను నొచ్చుకొనవలెను ? సాధువాక్యములతోనే సత్యదేవునివై పున కామెమనసును మరల్పుట కర్తవ్యము కదా !" అని నన్ను నేను సంప్రశ్నించుకొంటిని. హిందూ స్త్రీల మూఢత్వమునకై దైన్యమునఁ గన్నీరు విడిచితిని. తాము చేయు పనుల యర్థము గ్రహింపని భారతనారుల దుస్థితిని తొలఁగింపు మని దయామయుఁడగు దేవదేవుని వేడికొంటిని.
మఱుసటినెల 20 వ తేదిని రాజగురు మృత్యుంజయరావులు నన్నుఁ గలసికొని, మిత్రులందఱమును గూడి చదువుకొనుట కొక పఠనాలయము స్థాపించుటనుగూర్చి నాయభిప్రాయము తెలుపుమనిరి. నేను సమ్మతింపక, దీనికి బదులుగా చందాలు వేసికొని బీదలకు సాయము చేయుట మేలని చెప్పితిని. నన్ను తమవైపునకుఁ ద్రిప్పుకొన పరిపరివిధముల వారు ప్రయత్నించినను, వారికి సాధ్యము కాలేదు. తమ మురిపఁపుపేళ్ల తో నన్ను వారు నిందించినను నేను నాపట్టు విడువలేదు. అంతట రాజగురువు, "నీబోటివా రిఁక నైదుగురు దొరికిరేని, రాజమంద్రి నంతటి నొక్కపట్టున సంస్కరణ వాహినియందు ముంపఁగలను !" అని చెప్పివేసెను. ఆతని యర్థము నాకు బాగుగ వ్యక్తము గాకున్నను, నా కధిక నైతికధైర్యము గలదని పలికినట్లు నమ్మితిని. నాకు ధైర్యసాహసము లింకను ప్రసాదింపు మని భగవానుని వేడుకొంటిని
30 వ సెప్టెంబరున నాకు శరీరమునందు నీరసము, కనుల బలహీనతయు నేర్పడుటచేత రాత్రి చదువు మానితిని. ఆనాఁడె కళాశాలలో అధ్యక్షుఁడగు మెట్‌కాఫ్‌దొర నన్ను గుఱించి మాటాడుచు, భాషాభాగమున నాచదువు బాగుగనున్నను, గణితమున మంచి కృషి చేసినఁగాని పరీక్షలో తప్పిపోవుదు వని నన్ను హెచ్చరించెను. ఆరాత్రి ప్రార్థనసమయమున నే నిట్లు తలపోసితిని : -
"ప్రభువా ! తన నియమితకార్యము సగము కొనసాగించిన పిమ్మటనే మిల్టనుకవి కంధత్వము సంప్రాప్తమయ్యెను. నాకర్తవ్య మొకిం తయుఁ జేయకమునుపే, జీవిత ప్రథమ సోపానముననే, నాదేహము వ్యాధిపా లగుచున్నది ! నా విధికృత్యములు నెరవేర్పఁబూనినచో, ఈ దుర్బలశరీరము తుత్తునియ లైపోవునేమో గదా ! పరిశుద్ధవర్తనము వీడకుండ జరుపుకొనునటుల నా కనుగ్రహింపుము !"
26. పరీక్షాపూర్వదినములు
1900 అక్టోబరునెలలో ప్రథమశాస్త్రపరీక్షకుఁ బోవువారిని నిర్ణయించుటకు జరిగిన కళాశాలాపరీక్షలో, ఇంగ్లీషులో నేను బాగుగ వ్రాసినను, లెక్కలలో గుణములు నాకు కనీస మైనను రా లేదు. బజులుల్లాసాహేబు నాకంటెను తగ్గియుండెను. గణితమున తరగతిలో మే మిరువురము నధమాధములము ! అయినను క్రిందటి సంవత్సరపు పరీక్షలో నాతఁడు నేనును తరగతిలో క్రమముగ ప్రథమ ద్వితీయస్థానములం దుండుటచేతను, ఇప్పటిపరీక్షలోఁ దక్కిన యన్ని పాఠములందు మేము సరిగా నుండుటచేతను, మమ్ముఁగూడ పరీక్ష కంపిరి. అప్పటినుండియు నేను మఱింత శ్రద్ధతోఁ జదువుచుంటిని. నా నిత్యకార్యక్రమము వెనుకటివలెనే జరుగుచుండెను. వ్యాయామము, ప్రాత:స్నానము, ప్రార్థనము, మిత్రులతోడి గోష్ఠి - ఇవి కొన్నిమార్పులతో నిపుడును నా దినచర్యలోని యంతర్భాగములే. పరీక్ష సమీపించినకొలఁది చదువునకు ప్రాముఖ్య మిచ్చితిని.
కాని, నా శరీరారోగ్యము అసంతృప్తికరముగనే యుండెను. నే నెంత జాగ్రత్తతో నుండినను, అనుదినము నేదోబాధ వచ్చి మూలుగుచుందును. తలనొప్పి, నీరసము, అత్యుష్ణము, పైత్యప్రకోపము, మున్నగు బాధలు నాకు సన్నిహితబంధువులె ! వీని పీడఁ బడుచుండు నేనాకాలమున నెట్లు చదువు సాగించికొనుచు, సభల కేగుచు,