ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/సూర్యనారాయణుని నిర్యాణము
తిరుగఁబెట్టెనని యా రోజుననే నాకు జాబు వచ్చినను, వెంటనే బయలుదేఱలేకపోయితిని. బెజవాడలో వ్రాఁతపని పూర్తిపఱుచుకొని, 21 వ తేదీని ఏలూరు వెళ్లితిని. పర్లాకిమిడినుండి మద్రాసు తిరిగిపోవుచుండు పాలుపీటరుపిళ్ల గారిని నేను రెయిలుస్టేషనులోఁ గలసికొంటిని. పర్లాకిమిడి పనికి ఇద్దఱు యం. యే. లును, పెక్కు మంది యితరులును దరఖాస్తు పెట్టిరనియును, నా కది లభింపవచ్చు ననియును వారు చెప్పిరి. మా పెదతండ్రి కుమారుఁడు పట్టాభిరామయ్య చనిపోయెనను దు:ఖవార్త 22 వ తేదీ సాయంకాలమున నేలూరులో నాకుఁ దెలిసెను. మఱునాఁడు ప్రొద్దుననే యుభయులమును రాజమంద్రి బయలుదేఱితిమి.
49. సూర్యనారాయణుని నిర్యాణము
1901 డిసెంబరు 23 వ తేది సాయంకాలమునకు రాజమంద్రిలో దిగి మే మింటికిఁ బోవునప్పటికి, సూర్యనారాయణకు మిక్కిలి జబ్బుగా నుండెను. గత రాత్రియే వానికి సంధిగుణము ప్రవేశించె నని చెప్పి వెంకటరామయ్య విలపించెను. రోగి నన్నుఁ జూచి మిగుల సంతోషపడెను. నే నేమి క్రొత్తవస్తువులు తెచ్చితినో చూపుమని వాఁడు నన్నడిగెను. 'నాకు బందరుచెప్పులు తెచ్చి పెట్టితివా?" యని వాఁ డడుగునపుడు, లే దని చెప్పుటకు నేను మిగుల నొచ్చుకొంటిని. వైద్యుఁడు కోటయ్యనాయఁడుగారిని దీసికొనివచ్చి చూపించితిమి. రెండు శ్వాసకోశములును బంధించె ననియు, సన్ని పోతము ప్రబలె ననియును, ఆయన చెప్పివేసిరి. మేము క్రమముగ మందు లిచ్చుచు రాత్రి జాగరము చేసితిమి. మఱునాఁటికి వానివ్యాధి ముదిరెను. శ్లేష్మప్రకోపమువలన రోగి యొత్తిగిలలేకుండెను ! ఊపిరి పీల్చుట కష్టమయ్యెను. అంత దేశీయవైద్యు నొక నిని బెట్టితిమి. ఆతని మందులును శ్లేష్మము నరికట్టలేకపోయెను. సంధి విజృంభించి, రోగిదేహము వణఁకెను. రాత్రి 11 గంటలకు మా తమ్ముఁడు మృత్యువువాతఁ బడిపోయెను !
మా చిన్ని తమ్ముఁడు మరణమొందె నని మేము నమ్మలేకపోయితిమి ! ఆ ముద్దుమోము, దృఢకాయము, ఉన్నతాకారము, నయ వినయములు, అసమానబుద్ధి వికాసమును, తలపోసి తలపోసి మేము విలపించితిమి !
మాకు ప్రపంచ మంతయు నంధకారబంధుర మయ్యెను ! మే మిట్టి దు:ఖావస్థ నెపుడు ననుభవింపలేదు. 3 సంవత్సరముల క్రిందట మరణము నందిన మాతండ్రియు, గత సంవత్సరమం దీదినము లందు కాలగతినొందిన మాపినతల్లియు, కొంతకాలము జీవించిన యనుభవశాలురు. ఇపుడు చనిపోయిన మా తమ్ముఁడు వట్టి పసరిక పిందెయే ! ముద్దుమాటలు, కొంటెతనఁపుఁ జేష్టలును, - వీని నింకను సరిగా వీడనేలేదు ! అట్టి పిల్లవానికి సంభవించిన యకాలమరణమునకై మే మమితముగ వెతనొందితిమి. ఈ పాపిష్ట రాజమహేంద్రవరపట్టణ మిఁక వదలిపెట్టి, బెజవాడవంటి క్రొత్తప్రదేశమునకు సంసారము తరలించుట మంచి దని మే మందఱము తలంచితిమి. 'జనానాపత్రిక' 1902 సంవత్సరము జనవరిసంచికలో మాతమ్మునిగూర్చి నే నిట్లు వ్రాసితిని : - "ఈ పత్రికాధిపతి కనిష్ఠసోదరుఁడగు సూర్యనారాయణ యను 18 సం. వయస్సుగల చిన్నవాఁడు గత డిసెంబరు 24 వ తేదీని జ్వరపీడితుఁడై లోకాంతరగతుఁ డయ్యె నని తెలుపుట కెంతయు విచారకరముగ నున్నది. ఈతఁడు 'జనానాపత్రిక' కు వ్యాసములు వ్రాయుచువచ్చెను. విద్యాధికత చేతను, బుద్ధి తీక్షణముచేతను, వినయాది సద్గుణములచేతను శోభిల్లు చుండెడి యీబాలుని యకాలమరణము మిగుల దుస్సహముగ నున్నది. దయామయుఁడగు భగవంతుఁ డీతనియాత్మకు శాంతి నొసంగుఁగాక !"
సూర్యనారాయణకు గణితశాస్త్రమునం దసమానప్రజ్ఞ గలదు. నాయొద్ద కొన్ని సంవత్సరముల క్రిందట బెజవాడ పాఠశాలలో 4 వ ఫారములో వీఁడు చదువుచుండునపుడు, తరగతిలో నే నెంత చిక్కులెక్క లిచ్చినను, అందఱికంటె మున్ముందుగనే లెక్కచేసి, ముసిముసినవ్వులు నవ్వుచు, నాయొద్దకు వచ్చుచుండువాఁడు ! అతఁడు ప్రవేశపరీక్షనిచ్చి రాజమంద్రికళాశాలలో ప్రథమశాస్త్రతరగతిలో 1901 వ సంవత్సరమునఁ జదివెను. గణితశాస్త్రమునం దితనికిఁ గల సమర్థతను గనిపెట్టి, అధ్యాపకులు వీనియం దమితానురాగము గలిగియుండిరి. కళాశాలలోఁ దానొకసంవత్సరమే చదివినను, ఈతఁడు గణితశాస్త్రపుస్తకము లందలి చిక్కులెక్కలు పెక్కులు చేసి తనపుస్తకమున నెక్కించి యుంచుకొనెను ! ఈతని యకాల మరణము ఉపాధ్యాయులకు, సహపాఠీయులకును గడు విషాదకరముగ నుండెను. ఇటీవల నింట చిన్న పను లన్నియు నీతఁడే చేయుచుండువాఁడు. ఈతని నయవినయములు దలఁచుకొనినప్పుడు, మా కందఱికిని గుండె నీఱైపోవుచుండెను ! మా సోదరుల కెవరికిని బ్రాప్తింపని యున్నతవిద్య నీతనికిఁ జెప్పించి ముందు మంచిస్థితి కీతనిఁ గొని రావలెనని మే మనుకొనెడివారము. ఇపుడు మాయాశ లన్నియు నీటఁగలసెను ! మాతల్లి కీపిల్లవాని మరణము కడు దుస్సహ మయ్యెను. అందఱము నీ దుర్భరవిషాద మనుభవింపవలసినవార మైతిమి ! 50. సందిగ్ధావస్థ !
కాఱుమబ్బులు క్రమ్మిన యాకసమం దొకప్రక్క మేఘము తొలఁగిపోయి, సూర్యకిరణ ప్రసార మొకింత కలిగినట్లు, ఈ దు:ఖసమయమున మా కొక సంతోషవార్త వినవచ్చెను ! నాకు దొరతనమువారికొలువులో నుద్యోగ మయ్యె ననియు, నరసారావుపేటలో సహాయపరీక్షాధికారిగ నియమింపఁబడితి ననియు నొక స్నేహితుఁడు చెప్పెను. దీనినిగుఱించి విచారింపఁగా, ఇది సత్య మని తేలెను ! మరల మేము తల లెత్తుకొనసాగితిమి. అందఱము నరసారావుపేట పోవుట యుక్త మనుకొంటిమి. ప్రస్తుతమున నే నీపనిలోఁ బ్రవేశించినచో, కళాశాలలో నాకుఁ బిమ్మట మంచియుద్యోగ మిప్పింతు నని స్కాటుదొర వ్రాసి, మాతమ్ముఁడు చనిపోయినందుకు తన విచారమును దెల్పెను.
నా కీసమయమునందే, పర్లాకిమిడి కళాశాలలో నూఱురూపాయిల వేతనముమీఁద ప్రకృతిశాస్త్రోపన్యాసకపదవి నిచ్చితిమని, యాకళాశాలాధికారి టెయిలరుదొర వ్రాసెను ! నేను బెజవాడ పాఠశాలలోనే యుండినయెడల నెక్కువజీత మిప్పించెద మని అనంతముగారు వ్రాసిరి ! ఇట్లీ మూఁడు ఉద్యోగములలో నేది శ్రేష్ఠమో నిర్ణయించుకొనుట మాకుఁ గష్టముగఁ దోఁచెను !
ప్రభుత్వమువారి కొలువులోఁ బ్రవేశించుటకు వైద్యుని సర్టిఫికెటు కావలయును. కొంతకాలమునుండి దేహస్వస్థత లేని నా కాసర్టిఫికటు దొరకునో లేదో ముందు చూచుకొనుట మంచిదని నాకును తమ్ముఁడు వెంకటరామయ్యకును దోఁచెను. ఇపు డది యవసరము లేదని పరీక్షాధికారియగు విలియమ్స్ పిళ్ల గారు చెప్పినను, ఎందుకైన