ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/సందిగ్ధావస్థ !

వికీసోర్స్ నుండి

50. సందిగ్ధావస్థ !

కాఱుమబ్బులు క్రమ్మిన యాకసమం దొకప్రక్క మేఘము తొలఁగిపోయి, సూర్యకిరణ ప్రసార మొకింత కలిగినట్లు, ఈ దు:ఖసమయమున మా కొక సంతోషవార్త వినవచ్చెను ! నాకు దొరతనమువారికొలువులో నుద్యోగ మయ్యె ననియు, నరసారావుపేటలో సహాయపరీక్షాధికారిగ నియమింపఁబడితి ననియు నొక స్నేహితుఁడు చెప్పెను. దీనినిగుఱించి విచారింపఁగా, ఇది సత్య మని తేలెను ! మరల మేము తల లెత్తుకొనసాగితిమి. అందఱము నరసారావుపేట పోవుట యుక్త మనుకొంటిమి. ప్రస్తుతమున నే నీపనిలోఁ బ్రవేశించినచో, కళాశాలలో నాకుఁ బిమ్మట మంచియుద్యోగ మిప్పింతు నని స్కాటుదొర వ్రాసి, మాతమ్ముఁడు చనిపోయినందుకు తన విచారమును దెల్పెను.

నా కీసమయమునందే, పర్లాకిమిడి కళాశాలలో నూఱురూపాయిల వేతనముమీఁద ప్రకృతిశాస్త్రోపన్యాసకపదవి నిచ్చితిమని, యాకళాశాలాధికారి టెయిలరుదొర వ్రాసెను ! నేను బెజవాడ పాఠశాలలోనే యుండినయెడల నెక్కువజీత మిప్పించెద మని అనంతముగారు వ్రాసిరి ! ఇట్లీ మూఁడు ఉద్యోగములలో నేది శ్రేష్ఠమో నిర్ణయించుకొనుట మాకుఁ గష్టముగఁ దోఁచెను !

ప్రభుత్వమువారి కొలువులోఁ బ్రవేశించుటకు వైద్యుని సర్టిఫికెటు కావలయును. కొంతకాలమునుండి దేహస్వస్థత లేని నా కాసర్టిఫికటు దొరకునో లేదో ముందు చూచుకొనుట మంచిదని నాకును తమ్ముఁడు వెంకటరామయ్యకును దోఁచెను. ఇపు డది యవసరము లేదని పరీక్షాధికారియగు విలియమ్స్ పిళ్ల గారు చెప్పినను, ఎందుకైన మంచిదని వారియొద్దనుండి యుత్తరము పుచ్చుకొని, నేను గుంటూరు పోయి, యచటి వైద్యాధికారితోఁ బరిచయము గలిగింపుఁ డని నామిత్రులు వెంకటకృష్ణయ్యనాయఁడు గారిని కోరితిని. కాని, వారికిని వైద్యాధికారియగు తమ్మనుసింగుగారికిని మిత్రభావము లేకుండుటచేత, నా కీసాయము గలుగ లేదు. వైద్యుఁడు నన్నుఁ బరీక్షించి, నాయందు హృద్రోగ చిహ్నములు గాన్పించెననియు, దొరతనమువారి కొలువులోఁ బ్రవేశింపవలదనియుఁ జెప్పిరి ! ఐనను నన్ను బాగుగఁ బరీక్షించి, నిజమంతయు వ్రాసివేయుఁ డని వైద్యుని నేను గోఱితిని ! పర్యవసాన మేమన, నేను ప్రభుత్వోద్యోగమున కనర్హుఁడ నని వైద్యుఁడు వ్రాసివేసెను !

నాయఁడుగారికిని తమ్మనుసింగుగారికినిత గల వైషమ్యములే నాదురదృష్టమునకుఁ గారణ మయ్యె నని పలువురు తలంచిరి ! నే నంత గుంటూరు నుండియే 11 వ జనవరిని రెండు తంతుల నంపితిని. ఒకటి పరీక్షాధికారికి, - నాకు వైద్యుఁడు కావలసిన సర్టిఫికెటు నీయలే దనియు, రెండవది పర్లాకిమిడి కళాశాలాధికారికి, - నేను వారి కళాశాలలో నుద్యోగము స్వీకరించితి ననియును, మఱునాఁడు ఉదయముననే నేను బెజవాడ వచ్చితిని. నా యలౌకిక చర్య కందఱు నాశ్చర్యపడిరి. దొరతనము వారికొలువు చేర నిశ్చయించుకొనినవాఁడు, వైద్యునియొద్దకు పొడిచేతులతోఁ బోవుటకు వారు నవ్విరి !

నాకు పర్లాకిమిడి యుద్యోగ మిచ్చితి మని తంతి యింకను రాలేదు. పెద్ద పరీక్షాధికారిని జూచి, వారిసాయమున నెటులో దొరతనమువారికొలువున నుద్యోగము సంపాదింపవలె నని యెంచి, ఆయన మకాముచేసియుండు నెల్లూరుపురమునకు నే నంతట వెళ్లితిని

1901. రాయసం రత్నమ్మ, వెంకటశివుడు

అప్పటి కప్పుడే యాయన మద్రాసు పోయె నని యచటఁ దెలిసెను. పూర్వము నాకు సైదాపేటకళాశాలలో సహపాఠియైన సంతాన రామయ్యంగారు, పర్లాకిమిడి కళాశాల వదలి యిపుడు నెల్లూరుపాఠశాలలో ప్రథమోపాధ్యాయు లయిరి. ఈయన నాకు నెల్లూరులోఁ గానఁబడి, నేను పర్లాకిమిడిలోని యుద్యోగము స్వీకరించుట యుక్తమని సలహా నిచ్చిరి.

అంతట నేను మద్రాసు పోయి, విలియమ్స్ పిళ్ల గారిని స్కాటుదొరగారిని మఱికొందఱిని సందర్శించితిని. జరిగినదానికి వా రేమియును జేయఁజాలకుండిరి. వీరేశలింగము గారితోను బుచ్చయ్య పంతులుగారితోను మాట్లాడితిని. ఇంతలో బెజవాడ వచ్చిన మాతమ్ముఁడు వెంకటరామయ్య నాకు మద్రాసునకు తంతి నిచ్చెను. నాకు పర్లాకిమిడి యుద్యోగమయ్యెననియు ఫిబ్రవరి ప్రారంభముననే నాకళాశాల చేరవలయు ననియును, అం దుండెను ! తల తడివిచూచుకొని, నే నంత బెజవాడ మరలివచ్చితిని.

ఇంకను నాకు దొరతనమువారి కొలువు విషయమై విరక్తి కలుగలేదు ! పైయధికారి యేమియుత్తర మిచ్చునో చూత మని వారికి తంతి నంపితిని. తుదకు 24 వ జనవరిరాత్రి వారియొద్దనుండి ప్రత్యుత్తరము వచ్చెను. నా కిచ్చినపని రద్దుచేసితి మనియు, పర్లాకిమిడి యుద్యోగము నన్నుఁ జేకొను మనియు నాకు వారు తెలియఁబఱిచిరి ! అందుచేత నేను దొరతనమువారి కొలువునం దాశ మానివేసి, బెజవాడయుద్యోగము విరమించుకొని, పర్లాకిమిడి పోవుటకు నిర్ధారణ చేసికొంటిని.

51. నూతనోద్యోగము

1902 వ సంవత్సరము జనవరి 28 వ తేదీని నాకు బెజవాడ పాఠశాలాభవనమున విద్యార్థులు నుపాధ్యాయులును గలసి వీడ్కో లొసంగిరి. అపుడు వారు సమర్పించిన విజ్ఞాపనపత్రము నందు, ఈ పాఠశాలలో నీ యెనిమిది సంవత్సరములనుండియు నందఱి మెప్పు నొందునట్టుగ నా విధ్యుక్తములు నెరవేర్చితి ననియును, విద్యార్థుల యవినీతి నడంచుటయందు నే నమితశ్రద్ధ వహింతి ననియు, బోధనమూలమునను సాహితీసంఘముల చర్చలలోఁ బాల్గొనుచును విద్యార్థుల మనోవికాసమునకు నే నధికప్రోత్సాహము గలిగించితి ననియు, విద్యార్థులతోఁ గలసి మెలసి యాటలాడుచు వారికి దేహారోగ్య భాగ్యము గలిగించితి ననియును వారు చెప్పిరి. నా కాసమయమున నొక వెండిగడియారముకూడ బహుమాన మీయఁబడెను.

ఇంతకాలమునుండియు బోధకునిగ నుండిన యీపాఠశాలను, ఈ నగరమును, విడిచిపోవ నా కమితసంతాపకరముగ నుండెను. ఆరాత్రి యధిక భావోద్రేకమున నాకంటికిఁ గూర్కు రానేలేదు ! ఇటీవల సంభవించిన నాకనిష్ఠసోదరుని మృతి, దొరతనమువారి యుద్యోగవిషయమై నే పడినయలజడి, నూతనోద్యోగమునందు నాకుఁ గలుగనున్న కష్ట సుఖములు, - వీనియన్నిటినిగుఱించియుఁ దల పోయుచు, నే నారాత్రి జాగరము చేసితిని ! మఱునాఁడు ప్రొద్దుననే లేచి భార్యసమేతముగ నేను రెయిలులోఁ గూర్చుంటిని. మాకు వీడ్కో లొసంగుటకు నుపాధ్యాయులు, వియార్థులు ననేకులు రెయిలుదగ్గఱకు వచ్చిరి. వారియొద్ద సెలవుగైకొని మే మంత రెయిలులో బయలుదేఱితిమి. మధ్యను ఏలూరులో నొకరోజు నిలిచి,