ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/వేసవిసెలవులు

వికీసోర్స్ నుండి

"ఇస్లాము విశ్వాసము" అను నాంగ్లగ్రంథము నే నపుడు చదివి, మహమ్మదీయ మతసిద్ధాంతములను గ్రహించితిని. ఆపుస్తక మందలి ముఖ్యాంశములను నేను వ్రాసిపెట్టుకొంటిని. ఎంతో శ్రమకోర్చి నే నాకాలమునఁ జదివి యిట్లు సారము వ్రాసికొనినవ్రాఁత పుస్తకము లింకను నాయొద్ద నున్నవి.

6 వ మేయితేదీని స్నేహితులు గంగరాజు కనకరాజుగార్లు చెన్నపురినుండి వచ్చిరి. మేము మువ్వురమును గూడి యానాఁడు వీరేశలింగముగారి రాకకై బెజవాడరెయిలుస్టేషనునొద్దఁ గనిపెట్టుకొని యుంటిమి. పంతులుగారు భార్యాసహితముగా వచ్చి మాపొరుగున నుండు పాటిబండ వెంకటరమణయ్యగారి యింట విందారగించి, వెంటనే చెన్నపురి రెయిలెక్కిరి. మేము వారిని సాగనంపి వచ్చితిమి. మఱునాఁ డాస్నేహితులు రాజమంద్రి వెడలిపోయిరి. మాపాఠాశాలను వేసవికి మూయుటచేత, మేమును 8 వ తేదీని రాజమంద్రి బయలుదేఱితిమి.

3. వేసవిసెలవులు

9 వ మెయి తేదీని తమ్ముఁడు వెంకటరామయ్యతోఁ గూడి రాజమంద్రియందలి స్నేహితులను సందర్శింపఁ బోయితిని. 'సత్యసంవర్థనీ' సంచికను వేగమే ముద్రింపుఁ డని "వివేకవర్థనీ ముద్రాక్షరశాల"లోఁ జెప్పి, మిత్రులు పాపయ్య, రంగనాయకులు నాయుఁడు గార్లను వీక్షించితిని. మధ్యాహ్నము మృత్యుంజయరావు, నరసింహరాయుఁడుగార్లనుఁ జూచివచ్చితిని. మృత్యుంజయరా విపుడు నవీనముగ రాజమంద్రిలో స్థాపితమైన దొరతనమువారి బోధనాభ్యసన కళాశాలలో నుపన్యాసకుఁడు. నరసింహరాయుఁడుగా రేతత్కళా శాలలో బోధనాభ్యసనముఁ జేయుచుండిరి. స్నేహితు లిట్లు గురు శిష్యు లయిరి !

10 వ తేదీని నన్నుఁజూచుటకు మృత్యుంజయరావు మాయింటికి వచ్చెను. ఇటీవల రాజమంద్రిలో జరిగిన ప్రార్థనసమాజ సమావేశమున నన్ను గుఱించియు, నా తమ్ముని గుఱించియు నతఁడేల ద్వేష భావమున మాటాడి, మామీఁద నపనిందలు వెలయించెనని యాతని నడిగితిని. అతఁడు ప్రత్యుత్తర మీయలేదు. మిత్రుల పోరాటములు లెక్కసేయక యథాప్రకారముగ నేను "సత్యసంవర్థని"కి వ్యాసములు వ్రాసి యచ్చున కిచ్చుచుంటిని. కాని, కొలఁదిరోజులలో నరసింహరాయుడుగారిని నేను గలసికొని, యిటీవలి యల్లరికిఁ గారణ మడుగఁగా, "మీ రెప్పటివలెనే నిరంకుశాధికారముఁ జెల్లింపఁ బ్రయత్నించుచున్నారు. ముం దట్లు సాగనీయము. సరియైన త్రోవను మీరు పత్రికను నడపిననే మే మందఱమును మీకు సాయముచేతుము" అని యాయన చెప్పెను. ఈమాటలు విని నే నిఁక "సత్యసంవర్థనీ" పత్రికతోడి సంబంధము విడువ నుద్యమించితిని. పత్రిక విషయమున కనకరాజు, మృత్యుంజయరావు, నరసింహరాయుడుగార్లు మామీఁదఁ గినుక వహించుట నేను సవిస్తరముగ గ్రహించి, దానితో జోక్యము వదలుకొన నిశ్చయించితిని.

శ్రీ మల్లాది వెంకటరత్నముగారి కోరికమీఁద, శ్రీమతి సత్యనాథము కృపాబాయిగారు ఇంగ్లీషున రచించిన "సగుణచరిత్రము"ను నేను తెలుఁగుఁ జేయనారంభించి, అచ్చువేయుటకై కొన్నిప్రకరణములు వారికిఁ బంపితిని. లివింగ్సుటను చరిత్రమును జదివితిని. అమహామహుని యపారదైవభక్తికి నే నాశ్చర్యమంది, నాజీవితము నటులే ధన్యముఁ జేయు మని దైవమును వేఁడితిని. నామనస్సు నిప్పుడు కలఁచెడి విషయములు కొన్ని కలవు. పెద్దచెల్లెలు కనకమ్మ వివాహసంబంధనిశ్చయ మింకను గాలేదు. కొన్ని సంబంధములు వచ్చినవి. మా తండ్రియు తమ్ముఁడును వీనిని గుఱించి మిక్కిలి తిరిగిరి. ఏదో యొక సంబంధము శీఘ్రమే నిర్ణయింపవలెనని నాకోరిక. మాతల్లి తనపెద్దకోడలిమీఁద నాగ్రహపడి, ఆకోపము నామీఁదఁ జూపసాగెను ! నాకిది యాశ్చర్యవిషాదములు గొలిపెను. ఇపుడు మాయింటితీరు నాకు బాగుగఁ గనఁబడలేదు. చిన్న పిల్లలు తలిదండ్రుల యెడఁ దగిన గౌరవములేక, వారిని బరిహసించుచు, సత్యదీక్షలేక నవ్వుటాలతోఁ బ్రొద్దుపుచ్చుచుండిరి! వారికి నాభార్యకు నిపుడు మనసు గలియక, ఉభయులు చిన్న చిన్న కయ్యములకుఁ గాలుద్రవ్వుచుండిరి !

అప్పుడప్పుడు నేను మిత్రుఁడు రంగనాయకులునాయఁడు గారినిఁ గలసికొనుచువచ్చితిని. తన భావికార్య ప్రణాళికను గుఱించి యాయన చెప్పుచుండువాఁడు. తాను ఉద్యోగమునుండి విశ్రాంతిఁ గొనినపిదప, రాజమంద్రిలో స్వకీయవైద్యాలయ మొకటి స్థాపింతు ననియు, అచట మందులిచ్చుటకై తన పెద్దకొడుకున కీలోపుగ మూలి కాజ్ఞానమును సమకూర్చు చదువు చెప్పింతు ననియు నాయన యనుచుండువాఁడు. ఇపుడు జబ్బుపడిన నాభార్యకు, చెల్లెండ్రకును నాయఁడుగారు మంచిమందు లిప్పించిరి.

ఈ సమయమున నాకు నాబావమఱఁది వెలిచేటి వెంకటరత్నముగారితో స్నేహము పెంపొందెను. ఆయన క్రమక్రమముగ ప్రార్థన సమాజముపట్లను, సంఘసంస్కరణ విషయములందును, సుముఖత్వముఁ జూపుచు నాకు సాయపడుచువచ్చెను. కాని, క్రొత్తస్నేహితులు నాకు లభించుకొలఁది, ప్రాఁతవారి తోడినేస్తము విడివడుచుండెను! సమాజ సత్యసంవర్థనుల గుఱించి యిటీవలప్రబలిన గడిబిడ యేమని నేను వ్రాయఁగా, కనకరాజు పాలకొల్లు నుండి ప్రత్యుత్తరమిచ్చెను. ఆతనిమనస్సు లేఖలో ధారాళముగ ప్రతిబింబత మయ్యెను. ఆతనియెడ నేను వైరభావమూని నిరంకుశాధికారము సల్పుచుంటిననియు, మిత్రు లారోపించెడి లోపము లన్నియు నాయందుఁ గలవనియు, నాతని యభిప్రాయము ! మాతమ్మునిదెసఁ గూడ నీతనికి వైరస్యమే. మే మిరువురమును సత్యసంవర్థని కధ్వర్యము వదలుకొని, మృత్యుంజయరావున కాపదవి కట్టఁబెట్టి, పత్రికా విలేఖకులముగ మాత్ర ముండినచో, తానును బత్రికకు వ్రాయుచుందునని యాతఁడు చెప్పివేసెను! ఈమిత్రునివైఖరి చూచి నాకు వెఱ్ఱికోపము వచ్చెను. నిజముగా నా వర్తనమునం దీపెద్ద లోపము లుండెనా ? ఇపుడు నన్నుగుఱించి మొఱపెట్టుటలో మిత్రులు సద్భావమున మెలంగిరా ? నేను మిగుల విలపించి నిరుత్సాహమందితిని. నేను మిత్రులనుకొనినంత దోషిని గాననియు, ఈవిషయమున వారైన నిర్దోషులు గారనియు, నా నిశ్చయాభిప్రాయము! స్నేహితుల సోదరప్రేమ మిట్లు కోలుపోయిన నాకు, సోదరుని స్నేహ ప్రేమములు పెంపొందఁ జొచ్చెను.

నే నీకాలమున ప్లేటో విరచితమగు "ప్రజాస్వామికత్వము"ను పఠించితిని. బహుదేవతారాధనాది మతోన్మాదములను నిరసించిన ప్లేటో, 19 వ శతాబ్దమందలి యాస్తికునివలె గనఁబడెను. ఐనను స్త్రీసామాన్యతా సిద్ధాంతమును సమర్థించిన ప్లేటో మొఱకుమానిసి వలెఁ గన్పించెను. ఇందుఁ బ్రతిఫలితమగు సోక్రటీసుని యాకార మునకును, ఏకపత్నీత్వముమున్నగు నీతినియమములను సముద్ధరించిన జీససునకును నెంతయో యంతరము గలదు !

నా మనస్సునకుఁ గళవళపాటు కలిగించిన యొకవిషయమును గూర్చి యిచటఁ బ్రస్తావించెదను. ఇపుడు మా కెన్నియో చిల్లర యప్పులుండెను. ఇవియన్నియుఁ దీర్చివేయుటకై యెచటనైన మూఁడువేలరూపాయల పెద్దయప్పునకు మేము ప్రయత్నించితిమి. నా స్వల్పశక్తితో నీ ఋణము నెట్లు తీర్చివేయఁగలనా యని నేను తల్ల డిల్లితిని. ఋణవిముక్తుఁడనై మఱి చనిపోవునటు లనుగ్రహింపు మని పరమేశ్వరునికి మ్రొక్కులిడితిని. జూన్ 19 వ తేదీని యీ యప్పు సంగతి రంగనాయకులునాయఁడుగారితోఁ బ్రస్తావింపఁగా, కొంచెము వడ్డికి నా కీసొమ్ము లభించునట్టుగ ధనికులగు తమస్నేహితులతోఁ జెప్పెదనని యాయన వాగ్దానముఁజేసెను.

4. "జనానాపత్రిక"

నా పూర్వ గురువులగు మల్లాది వెంకటరత్నముగారు 1893 వ సంవత్సరము జూలై నెలలో స్త్రీవిద్యాభివృద్ధి నిమిత్తమై "తెలుగు జనానాపత్రిక" యనునొక మాసపత్రికను నెలకొల్పి, యొక సంవత్సరము నడిపి, అది యిపుడు విరమింప నుద్యమించి, నే నద్దానినిఁ గైకొని సాగింతునా యని, మెయి 28 వ తేదీని నాకు వ్రాసిరి. "సత్యసంవర్థని" ని గుఱించి మొగము తిరిగిన నాకు, "జనానాపత్రిక" వంటి వేఱొకపత్రిక చేతనుండుట కర్తవ్యమని తోఁచెను. ఆ జూను మొదటి వారమున జబ్బుగనుండు మాముత్తవతల్లిని జూచుటకు వేలివెన్ను వెళ్లియుండునపుడు, బావమఱది వెంకటరత్నముతో నూతన పత్రికను గుఱించి నేను ముచ్చటించితిని. మిత్రులతోడి