ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/పితృనిర్యాణము
ములు నేను దిరుగవేయవలసివచ్చెను. ఆ పుస్తకములనుండి రమ్యములగు పద్యములుకూడ నుల్లేఖించితిని. కథలో రసహీనములగు భాగములు వదలివేసి, వినోదకరములును నీతిదాయకములును నగుపట్టులకుఁ బ్రాముఖ్య మిచ్చుచుండువాఁడను. పురాణేతిహాసములలోని కథాక్రమమును సామాన్యముగ మార్పకుండువాఁడను. మిక్కిలి యరుదుగనే నా సొంత యభిప్రాయములను చరిత్రములలోఁ జొప్పించుచుండువాఁడను.
ఈకథలలో నెల్ల సీతాద్రౌపదులచరిత్రములు ఉత్కృష్టములు. ప్రాచీనకాలహిందూసుందరు లందఱిలోను సీతయే శీలపవిత్రతలయందుఁ బ్రథమగణ్య. రాముఁడు సుగుణాభిరాముఁడె యైనను, హృదయేశ్వరియగు సీతయెడఁ దుద కాయన చూపిననిరసనమునకును, అందుమూలమున నా పుణ్యవతి కాపాదిల్లిన శోకకష్టములకును వగవానివా రుండరు. ఈకథలన్నిట్టిలోను ద్రౌపదిచరిత్రము కడు దీర్ఘమైనది. ఆ సుగుణవతిచరిత్రమున నెన్ని యంశములో యిమిడియుండుటచేత, కథ విపులముగఁ దెలుప నవకాశము గలిగెను.
29. పితృనిర్యాణము
విజయదశమిపండుగలకు నే నొకసారి మా తల్లిదండ్రులను జూచుటకు 24 వ సెప్టెంబరున రాజమంద్రి వెళ్లితిని. అందఱు నచట సుఖముగ నుండిరి. మిత్రులను సందర్శించితిని. మందిరములో ప్రార్థన జరిపితిని. స్నేహితులగు పాపయ్యగారికి పోలవరము సంస్థానాధికారి యుద్యోగ మగుటకు మా యభినందనములు తెలుపుచు నొక తీర్మానము గావించితిమి. మఱునాఁడు అత్తగారు మున్నగు బంధువులను జూచివచ్చితిని. నాకు రాజమంద్రికళాశాలలో నుద్యోగము దొరకు ననెడియాశ యిప్పటికిఁ దొలఁగిపోయెను ! 20 వ తేదీని తల్లి దండ్రులను సోదరులను విడువలేక విడిచి, రైలెక్కి బెజవాడ చేరితిని.
ఆ దినములలో బెజవాడపఠనాలయమున సాయంకాలము చీట్లాడుట పెద్దమనుష్యుల సంప్రదాయమయ్యెను. ఇది నాకును తక్కిన సంస్కారపరులగు మిత్రులకును సరిపడకుండెను. దీనిని నిరసించుచు నేను పత్రికలకు వ్రాసితిని. వీరభద్రరావుగా రొకప్రహసనము కల్పించిరి. మావ్రాఁతలు సభ్యులకుఁ గష్టముగాఁ దోఁచెను. మావ్యాఖ్యానము లసమంజసములని యొక బహిరంగసభలో నధ్యక్షుఁడు వాకొనియెను.
నా "గృహనిర్వాహకత్వ" మిదివఱకె ప్రకటింపఁబడినను, ముద్రితమైన మున్నూఱుప్రతులును వేగమె విక్రయమగుటచేత, కొన్నిమార్పులు చేసి, రెండవకూర్పునకు పుస్తకమును మద్రాసుపంపితిని. కాని, సొమ్మునుగుఱించిన చిక్కులవలన, అచ్చుపని యాఁపుఁడని నేను అక్టోబరు 5 వ తేదీని తంతి నంపినను, ముద్రాలయాధిపతి పుస్తక ముద్రణము మానివేయలేదు.
ఆకాలమునందు నాగ్రంథపఠనవైపరీత్యము నా దినచర్యపుస్తకమందలి యీక్రిందియుల్లేఖమువలనఁ దెలియఁగలదు : -
"1898 అక్టోబరు 6 గురువారము: 'లండనునగర రహస్యముల'లోను, కార్లయిలుని 'భూతవర్తమానముల'లోను కొన్ని పుటలు చదివితిని. 'మార్కసు అరీలియసునిమననములు,' 'సెనీకానుండి యుల్లేఖనములు' అనుపుస్తకములు చదువఁ దీసికొంటిని. ఉత్కృష్టములు నికృష్టములునగునిట్టి పరస్పరవిరుద్ధ విషయములను సమానప్రేమమున నాయాత్మ క్రోలుటకుఁ గారణము తెలియదు ! రైనాల్డ్సుని విషయవాం ఛావర్ణనమువలెనే కార్ల యిలు, అరీలియసుల తత్త్వశాస్త్రవిషయములును నాకు హృదయానుమోదము లే!"
హైదరాబాదు ప్రాంతములనుండి యారోజులలో బెజవాడ యొక స్వాములవారు వచ్చిరి. ఆయన గొప్పమాహాత్మ్యము గలవాఁడని జను లనుకొనిరి. స్వామివారిని సందర్శింపఁగోరి, 15 వ అక్టోబరు శనివారము వేఁకువనే కామశాస్త్రి వీరభద్రరావుగార్లు వెంటరాఁగా, నేను ప్రాఁతయూరు పోయితిని. స్వామివారు మౌనముద్ర నూనియుండుటచేత, వారి నిచటికిఁ గొనివచ్చిన బెజవాడ నివాసులగు శ్రీగోవిందరాజుల రామప్పగారితో మేము ప్రసంగించితిమి. స్వామివారు తమ వయస్సు 800 వత్సరములని నుడివి రని తెలి సెను. ఆయన నిరశనవ్రతులుకూడనఁట!
ఆ సెలవుదినములలోఁ గొందఱు మిత్రులతోఁ గలసి నే నొకనాఁడు కొండపల్లి వెళ్లితిని. పర్వతశిఖరమగు "నొంటిమన్యము"ను జూచితిమి. అచటి ప్రకృతిదృశ్యము లత్యంతరమణీయములు.
6 వ నవంబరునాఁటి దినచర్య యిటులుండెను: - "రాఁబోవు సంవత్సరము వెంకటరత్నమునాయఁడుగారు నోబిలుకళాశాలనుండి వెడలిపోవుదురను దుర్వార్త వినవచ్చెను. నాయఁడుగారు బ్రాహ్మసమాజప్రచారమునం దమితోత్సాహము గలిగియుండుట, కళాశాలాధ్యక్షుఁడగు క్లార్కుదొర కిష్టము లేకుండుటయే దీనికిఁ గారణము ! నేను నాయఁడుగారి కొక పెద్దయుత్తరము వ్రాసి, పూర్వము మే మనుకొనిన 'ఆస్తికపాఠశాల' నిపుడు నెలకొల్పఁగూడదా యని యడిగితిని. ఆకాశము మేఘావృత మగుటచేత నేఁడు దుర్దినము. మిత్రుఁడు నాయఁడుగారినిగూర్చిన దు:ఖవార్త వినుటవలన నామనస్సునకును నేఁడు దుర్దినమే !" ఇటీవల మాతల్లి తఱచుగ వ్యాధిపీడిత యగుచుండెడిది. మా తండ్రిమాత్రము సామాన్యముగ నారోగ్యభాగ్య మనుభవించుచునే యుండెడివాఁడు. కాని, 8 వ నవంబరున మాతండ్రికి జ్వరమువచ్చెనని తమ్ముఁడు వెంకటరామయ్య జాబువ్రాసెను. ఈరోజున వర్షము కురిసెను. నేను వ్యాకులచిత్తుఁడనైతిని. నాఁటిరాత్రి 9 గంటలకు రాజమంద్రిలోని మాతమ్మునియొద్దనుండి నాకు తంతివచ్చెను. మాతండ్రికి వ్యాధి యధికమయ్యెనని యం దుండెను. తమ్ముఁడు సూర్యనారాయణుని వెంటఁదీసికొని, నేనారాత్రి రైలులోనే బయలు దేఱితిని. దారి పొడుగునను మాజనకునిగుఱించిన దు:ఖకరమగు తలంపులు నామస్సును జీకాకుపఱిచెను.
మఱునాఁడు ప్రొద్దున మేము రాజమంద్రిచేరి, యింటికిఁ బోయి చూచునప్పటికి, మానాయన స్పృహతప్పి వేదనపడుచుండెను. అందఱమును విలపించితిమి. గతరాత్రి గడచుటయే దుర్లభమయ్యెనని మావాళ్లు చెప్పిరి. మాతండ్రి కేవిపత్తు సంభవించునో యని మేము భీతిల్లితిమి. భార్యను రమ్మని బెజవాడ తంతి నంపితిని. జాగ్రత్తతో మందులిచ్చుచు, మానాయనకు బరిచర్యలు చేసితిమి.
మాతండ్రికి సన్ని పాతము గానఁబడెను. దానికిఁదోడు, ఎక్కిళ్లుకూడ నారంభమయ్యెను. దేశీయవైద్యుఁడు కృష్ణమరాజుగారివలన లాభము లేదని యెంచి, రమణారావుగారి నేర్పఱిచితిమి. ఈవైద్యుల మార్పువలన రోగి కేమియు లాభము చేకూరదయ్యెను. 13 వ నవంబరు దీపావళినాఁడు మానాయనకు వ్యాధి ప్రబలమయ్యెను. నాడి క్షీణించెను. జ్వరము తగ్గినను, రోగి బొత్తిగ విశ్రాంతి లేక బాధపడు చుండెను. 14 వ నవంబరున మేము వైద్యాలయాధికారిని దీసికొనివచ్చితిమి. వాతము క్రమ్మిన దనియు, రోగి జీవింపఁ డనియు, ఆయనచెప్పి వేసెను. మాతండ్రి కదివఱకు చాయాపటము తీయనేలేదు. మంచము మీఁదనే పడియుండు రోగిపటము తీయుఁ డని యిపు డొకచిత్రకారుని గోరితిమి. ఆతఁ డొకపట మెత్తి, అది పాడయ్యె నని చాలదినములకుఁ బిమ్మట మాకుఁ జెప్పివేసెను !
శిశువును బెంచురీతిని, నలుగురు సోదరులమును అహర్నిశము జనకునికిఁ బరిచర్యలు చేసితిమి. కాని, యాయనదేహస్థితి క్షీణదశకు వచ్చెను. ఒక్కొక్కమాఱు మిల్లె గరిఁటెఁడు పాలయినను మ్రింగలేక, ఆయన స్పృహతప్పిపడి యుండెను. వెక్కిళ్లు వచ్చునప్పుడు మాత్రము కొంచెము తెలివిగలుగుచుండెను కాని, యాస్పృహయే యాయనవేదనను మఱింత పెంచుచుండెను ! 15 వ నవంబరు రాత్రి యెక్కిళ్లు మితిమీఱెను. పొత్తికడుపు దగ్గఱనుండి లోనయేదో యెత్తుగ పొంగి, పామువలె కడుపులో పైకెగఁబ్రాఁకి, గొంతుదగ్గఱకు వచ్చునప్పటికి, రోగి, యొక్కొక్కప్పుడు ఉక్కిరిబిక్కిరి యగుచుండెను. ఇ ట్లొక్కొక్కప్పుడు ఊపిరాడక, ఆయన పడిపోవుచువచ్చెను. మృత్యువాసన్న మయ్యె ననుకొనుచుందుము. మరల తెప్పిఱిల్లుచువచ్చినను నాడి క్షీణించిపోసాగెను.
16 వ నవంబరు ప్రాత:కాలమున మాజనకునికి ప్రాణోత్క్రమణసమయ మాసన్నమయ్యెను. మరల దేశీయవైద్యుని పిలువఁగా ఆయన ముసాంబ్రపుగంధము రోగికడుపుమీఁద పట్టువేయించెను. వేంటనే వెక్కిళ్లు కట్టెను. అందుచేత మాకుఁ గొంత యాశ కలిగెను. కాని, రోగినాడి క్రుంగిపోవుచున్న దనియు, లాభము లేదనియు వైద్యుఁడు చెప్పివేసెను. నే నంత దు:ఖపరవశుఁడనైతిని. ఈకర్ణకఠోరపుఁబలు కాడిన వైద్యుని దిట్టివైచి, నేను లేచి నిలువఁబడితిని. నా కింతలో, మా తండ్రితోడనే కాక, లోక మంతటితోను సంబంధము వీడిపోయెనను వెఱ్ఱిభ్రమ గలిగెను! బయటికి వెడలిపోవుచున్నా నని చెప్పివేసి, నే నంత వీథినిఁ బడితిని. వర్ణింపరాని గాఢాంధకార మేదియో జగము నావరించునటు లయ్యెను. నా దేహమున గగుర్పాటు గలిగెను. శరీరమనశ్శక్తులన్నియు నొక్కుమ్మడి నుడిఁగిపోవుచున్నట్లు తోఁచెను. స్పృహ దాదాపుగ నంతరించెను. చనిపోవుచుండు మాతండ్రి నంతవదలివేసి, నాభార్యయు మఱికొందఱును నావెంటఁబడి, నన్నుబట్టుకొని, పొరుగున నుండునొక మిత్రుని యిల్లు చేర్చిరి. నా కపుడు శైత్యోపచారములు చేసిరి. అపుడే వారియింటిలో వంట సిద్ధముకాఁగా, నా చేత ముఖము కడిగించి, నాభార్య, నాకుఁ గొంచెము మజ్జిగతోఁ గలిపిన యన్నము పెట్టి, వారివీధిగదిలో నిద్రపుచ్చెనఁట !
నాకు మెలఁకువ వచ్చునప్పటికి, పగలు పదిపదునొక్కగంట యయ్యెను: మానాయన యదివఱకే చనిపోయెను ! తమ్ముఁడు వెంకటరామయ్యయు నావలెనే కొంతసేపు మతి తొలఁగియుండెనఁట నేనపుడు మాయింటికిఁ జని, చనిపోయిన తండ్రికై విలపించితిని. మమ్ముఁ బెంచి పెద్ధవాండ్రను జేసి, విద్యాబుద్ధులు గఱపి సంరక్షించిన ప్రియజనకునికి మే మపుడు, గోదావరినదీసైకత ప్రదేశమున నగ్ని సంస్కారము జరిపితిమి. ఇటీవల నడ్డులేని పోఁకడలు పోవు నాపాపపుహృదయమును గుఱించియే మాకీ ఘోరవిపత్తు సంఘటిల్లె నని నేను విలపించితిని. మాసంసారము నిబిడాంధకారనిమగ్న మయ్యెను! 30. జనకసంస్మరణము
దినముల కొలఁది నిద్రాహారములు సరిగాలేక మేము తండ్రిని గనిపెట్టుకొని యుండుటవేతను, ఇపు డాయన పరలోకప్రాప్తిఁ జెందుటవలనఁ గలిగిన యాశాభంగపుఁ దాఁకుడుచేతను, మాసోదరుల కందఱికిని శరీరస్వాస్థ్యము తప్పిపోయెను. నన్ను రక్తగ్రహణి పట్టి పీడించెను. చిన్నతమ్ముడు సూర్యనారాయణకు తీవ్రజ్వరము వచ్చెను. అందువలన, ఇపుడు సంప్రాప్తమైన విపత్తును విచారమును మఱపించెడి యలజడికి కుటుంబము తావల మయ్యెను. కాని, క్రమముగ నందఱికిని దేహమున నెమ్మది గలిగెను. ఆదినములలో మాయందఱియాలోచనలకును మా తండ్రిని గూర్చిన సంగతులే ముఖ్యవిషయ మయ్యెను. మానాయన సదా పెరటిలోని చెట్లు పెంచుచుఁ బాటు పడుచుండువాఁడు. ఆయన నిరతము కూరగాయల మొలకలే పెంచు చుండును గాని, పూలచెట్లనిన మక్కువ లేశమును లేనివాఁడని వెనుక నే నే నాయన నొకటిరెండు మాఱులు గేలిచేసితిని. క్రియాపూర్వక మైన ప్రత్యుత్తరము నా కీయఁగోరిన వానివలె, మాతండ్రి యిటీవల నొక యాంగ్లేయుఁడు పట్టణము విడిచిపోవుచుండఁగా, జవానుల నడిగి, వానిపెరటిలోని క్రోటనులు పూలమొలకలు ననేకములు తెచ్చి, విశాలమగు మా పెరటిలో నాఁటెను. ఇపు డాచెట్లు, వింత రంగుల చిగురు జొంపములు వెట్టియు, సువాసన లీను పూవులు దాల్చియు కనులపండువు సేయుచుండెను. ఆయన మిగుల శ్రద్ధతోఁ బెంచిన నిమ్మచె ట్టీదినములలో పచ్చనిపండ్లతో నిండియుండెను. పెరటిలో నెచటఁ జూచినను మాతండ్రి పాటు గానవచ్చుచుండెను. ఆయన యేచెట్టునకుఁ గలుపు తీయుచునో, ఏమొలక తీఁగల సరదు