ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/చీఁకటివెన్నెలలు !
భావము నేను జెప్పఁగా, నామిత్రులు కామశాస్త్రిగారు చక్కని తెలుఁగు పద్యములు రచించి నా కిచ్చుచు వచ్చిరి. అవి నేను బుస్తకమునఁ జేర్చితిని.
43. చీఁకటివెన్నెలలు !
నేను మాతండ్రిగారి యాబ్దికమునకై అక్తోబరు చివరభాగమున రాజమంద్రి వెళ్లినపుడు, సంసారమును బెజవాడకుఁ దరలించుటను గుఱించి మా తమ్మునితో మరల ముచ్చటించితిని. అందఱము నొకచోటనె యుండినఁగాని మా రాబడి యెంత హెచ్చినను, మేము సొమ్ము కూడఁబెట్టలేమని గ్రహించితిమి కాని, మాచెల్లెలు కనకమ్మ పురుడు రెండునెలలలో రావచ్చును గావున, మావాండ్రు రాజమంద్రి యిపుడు విడుచుటకు వలనుపడకుండెను. అందుచేత వర్తమానమున మా సమష్టికాఁపురపు సంగతి కట్టిపెట్టితిమి.
30 వ అక్టోబరు వార్తాపత్రికలలో మోక్షమూలరు పండితుఁడు పరమపదముఁ జెందెనని యుండెను. ఆ మహామహుఁడు హిందూమతగ్రంథ ప్రచురణమునకై చేసిన యపార పరిశ్రమము కడు శ్లాఘనీయమైనది. ఆకాలమున దొరతనమువారు రాజమంద్రి కళాశాలను మూసివేతురనియును, ఒక క్రైస్తవ సంఘమువారు దానిని గైకొని నడుపుదు రనియును వదంతులు ప్రబలెను. ఇవి యందఱికిని విషాదమును గలిగించెను. అంతట ప్రభుత్వమువారు తమ మనస్సును మానుకొనినట్లు విని సంతోషించితిమి.
రచనావిషయమున నొకపనితో రెండుఫలితము లొనఁగూర్ప నేను బ్రయత్నించుచు వచ్చితిని. 11 వ నవంబరున నాగుండెమంట లొకింత చల్లార్చుకొనుటకో యనునట్టుగ, "వెన్నెల"ను గుఱించి యొక తెలుఁగువ్యాసము వ్రాసి, ఆనాఁడు జరిగిన ప్రార్థనసమాజసభలో ధర్మోపన్యాసముగ దానిని జదివితిని. అదియే యానెల 'జనానాపత్రిక' లో నొక వ్యాసముగఁ బ్రకటిత మయ్యెను. భారతమందలి "శారదరాత్రు లుజ్జ్వలలసత్తరతారకహార పంక్తులన్" అను పద్యమును నేను ఉల్లేఖించి యిట్లు వ్రాసితిని : - "తెల్ల వెన్నెల యను మహాసముద్రమున మునింగియున్న పదార్థసమూహమును జూచితిమా, మనస్సు ఆనందపరవశమై, చిత్రచిత్రమగు నూహలకును తలంపులకును జన్మభూమి యగుచుండును ! వెన్నెలరాత్రులందు సముద్రమును జూచి వినోదింపని కన్నులు గన్నులు కావు.
"చంద్రుఁడు వెన్నెలయును లేకుండినచో, భూలోక సౌందర్యమును, మనుజుని సౌఖ్యరాశియును మిగుల కొఱఁతపడియె యుండును ! * * * దేవతలలోని మువ్వురు సుందరాంగులలోను జంద్రుఁ డొకఁడు. ఆతఁడు విష్ణుని యెడమకన్ను, శివునితలపూవు. చంద్రుఁడు కవులకల్పతరువు * * సౌందర్యవతి చంద్రముఖి యగుచున్నది. లావణ్యవతుల నవ్వును వెన్నెలతోఁ బోల్చుచున్నాము. * * వెన్నెలవలెనే యిహలోకసౌఖ్య మస్థిరము. ఎన్నఁడు నస్తమింపని చంద్రుని, నెప్పుడును సమసిపోని చంద్రికను మనము వీక్షింపఁగోరెద మేని, పరమాత్ముఁడను మహాచంద్రునే మనము గాంక్షింపవలెను. ఆ మహామహునియెడ భక్తిప్రేమములు పెంపొందించుకొనుటకే, వెన్నెలవంటి సౌందర్య పదార్థములు మనకుఁ బ్రసాదింపఁబడి యున్నవి !"
పై వ్రాఁతయందలి తుదివాక్యములు పత్రికా వ్యాసమును ధర్మోపన్యాసముగ మార్చివేయుచున్నవి ! 1900 వ సంవత్సరాంతమున మరల ప్రాథమిక పరీక్షలు, నాయఁడుగారియొక్కయు వారియనుచరులయు స్నేహసహవాసములును ! ఇప్పటి ప్రధానోపాధ్యాయులు కల్యాణరామయ్యరుగారు, నామీఁద దయగలిగి, ఆపరీక్షలు చేయుటకు వలసినప్పుడు నన్ను, బోనిచ్చెడివారు. 27 వ నవంబరు తేదీని నేను బండిమీఁద వుయ్యూరు పయనము చేసితిని. 29 వ తేదీని నాయఁడుగారు నేనును బరీక్షలలో నుండఁగ, మాతమ్ముఁడు బెజవాడ కిచ్చినతంతి నా కిచటఁ జేరెను. మాతల్లికి నిన్న మరల మూర్ఛలు ప్రబలముగ వచ్చెనని యందలి దు:ఖవార్త ! పరీక్షలో నేఁ జేయవలసినపని వేగమే పూర్తిపఱిచి, పగలు 12 గంటలకు బండిమీఁద దిరిగి బయలుదేఱి, సాయంకాలమునకు బెజవాడ చేరితిని. అంత రాజమంద్రి తంతి నిచ్చి, తల్లికి నెమ్మది పడెనని తెలిసికొని, మనశ్శాంతి నొందితిని.
అంత తిరువూరు మున్నగు ప్రదేశములలో జరిగిన పరీక్షలలో నాయఁడు గారికి నేను సహాయకునిగ నుంటిని. రాఁబోవు సంవత్సరమున ననంతముగారు మరల నీపాఠశాలకు వచ్చుట కేర్పాటయ్యెను.
14 వ డిశెంబరున మాచెల్లెలు కనకమ్మ సుఖప్రసవమై కూఁతుని గనియెనని విని సంతోషించితిమి. ఆనెల 25 వ తేదీని మేము రాజమంద్రి వెళ్లి, చెల్లెలిని పిల్లను జూచితిమి. శిశువు మిగుల బలహీనగ నుండెను. మోగల్లులో మాతమ్మునిభార్య ప్రసవించె ననియు, కుమారుఁడు కలిగె ననియును మఱునాఁడు మాకుఁ దెలిసి, మే మమితానంద భరితుల మయితిమి.
డిశెంబరు 30 వ తేదీని మధ్యాహ్నమున తమ్ముఁడు నేనును వీథి చావడిలోఁ గూర్చుండి, యిన్నాళ్ల కీశ్వరుఁడు మరల మాకు సుఖదినము లొసంగెనే యని సంతోషమున ననుకొను చుంటిమి. మా మాటలను వెక్కిరించుటకో యన, ఆనిమేషముననే మాపెరటిలోనుండి కేకలు నేడ్పులును వినవచ్చెను ! పొరుగింటికిఁ బోయి వచ్చుచు, పెరటిలోని మా పెద్దబావిగట్టు దాటఁబోయి, మాపినతల్లి యాకస్మికముగ నీటిలోఁ బడిపోయెను ! వెంటనే మేము త్రాళ్లును గడలును వేయించితిమి. లాభము లేకపోయెను. అంతట పొరుగున నుండు నొక యువకుఁడును, మాతమ్ముఁడు సూర్యనారాయణయును నూతిలో నుఱికిరి. కాని, వీ రామెను వెలికిఁ దీయునప్పటికే యామె ప్రాణము లెగిరిపోయెను ! ఆమెకు మరల నూపిరి వచ్చుటకై యెన్నియో సాధనములు చేసితిమి. వేఁడిమి గలుగుటకై పాదములకు నరచేతులకును కర్పూరతైలము రాచితిమి. ప్రాణము రాలేదు. ఆరాత్రి యంతయు మే మామెశవము గనిపెట్టుకొని యుంటిమి. పాపము, మాముసలిముత్తువతల్లి మాతోడనే యుండెను. ఆమె దు:ఖ సముద్రమున మునిఁగిపోయెను ! వెనువెంటనే మా మేనమామలకు వేలివెన్ను తంతి నిచ్చితిమి. కూలివాని నంపితిమి. కాని, బంధువు లెవరును సకాలమున రాలేకుండుటవలన, మఱునాఁడు మేమె యామెకు దహనాదికర్మలు జరిపితిమి.
44. "మహలక్ష్మి మరణము"
1900 డిశెంబరు 30 వ తేదీని మరణించిన మాపినతల్లి, నాకంటె నాలుగైదుసంవత్సరములు మాత్రమే పెద్దది యగుటచేత, చిన్న నాఁడు వేలివెన్నులో నాకు సావాసురాలుగ నుండెడిది. బాల్యమున మాయుభయులకును మాతాతగారు పద్యములు లెక్కలును జెప్పుచుండువారు. దురదృష్టవశమున నీమెకు మంచి