ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/ఆశాభంగము
"జనానాపత్రిక" యాదినముననే చందాదారుల కంపివైచి, పాఠశాలకుఁ బోయి, అచట నుపాధ్యాయులయొద్దను, విద్యార్థులయొద్దను వీడ్కో లొందితిని. నాలుగుసంవత్సరములు గలసి మెలసి యుండిన మిత్రుల నొకసారి వీడుట కష్టముగఁ దోఁచెను. తోడియుపాధ్యాయులగు అయ్యన్న గారు నన్నుఁ గౌఁగలించుకొని విలపించిరి ! నేను మాత్రము చిఱునవ్వు నవ్వి, త్వరలోనే మరలివచ్చెద నని వారి నూరడించితిని. అంత, సామానులు సరిదికొని, స్టేషనునకు వచ్చి, విద్యార్థులు బోధకులును వీడుకొలుపఁగా, మేము రెయిలులోఁ గూర్చుంటిమి.
21. ఆశాభంగము
మేము బెజవాడనుండి బయలుదేఱునాఁడే, చెన్నపురినుండి నాకొక 'యాకాశరామన్న' జాబు వచ్చెను. 'చెన్నపురి ఆర్యపాఠశాల'లో జీతములు సరిగా నీయ రనియు, మంచిపాఠశాల వదలి యిట్టి దిక్కులేని విద్యాలయమున కేగినచో సుఖమున నుండు ప్రాణమును దు:ఖములపాలు చేసికొందు ననియు నందుండెను ! ఐనను, మించినపనికి నే నిపు డేమి చేయఁగలను ?
ఆకాలమందు బెజవాడనుండి సరిగా, చెన్నపురికి రెయిలు పడ లేదు. మేము చిన్నబండి మీఁద గుంతకల్లుదారిని బోయితిమి. దారిలోని చెట్లు చేమలు, కొండలు కనుమలును జూచి, మా కనులు సేదదేఱెను. మఱునాఁటిరాత్రి గుంటకల్లులో బొంబాయిమెయి లెక్కితిమి. తిలకు మహాశయునికి 18 నెలలు కఠినశిక్ష వేసిరని రెయిలులో విని విచారించితిని. 17 వ సెప్టెంబరు ప్రొద్దున్నకుఁ జెన్నపురిచేరి, పరశువాక మేగి, మన్నవ బుచ్చయ్యపంతులుగారి యింట, బసచేసితిమి. పంతులుగారు నేనును గలసి తిరువళిక్కేణి వెళ్లి, సుబ్రహ్మణ్యయ్యగారిని సందర్శించితిమి. ఆయన దయార్ద్ర హృదయుఁడు. నన్నాయన పాఠశాలకుఁ గొనిపోయి, ప్రతియుపాధ్యాయునికి నెఱుక పఱచిరి. పాఠశాల కడు బీదస్థితిలో నుండెను. తిరువళిక్కేణిలో నుండు బంధువు మంత్రిరావు వెంకటరత్నమును నే నపుడు కలసికొని, అతఁడు త్వరగా స్వస్థలమునకుఁ బోయి, భార్యకు మంచిమం దిప్పించుట యగత్య మని చెప్పితిని.
మఱునాఁడు నేను తిరువళిక్కేణి వెళ్లి, పూర్వము "ఆర్య పాఠశాలా" ప్రథమోపాధ్యాయుఁడును, ఇపుడు "హిందూపత్రికా" సహాయవిలేఖకుఁడునునగు శ్రీ. కే. నటరాజనుగారిని, వారిమిత్రులనుఁ జూచితిని. మాపాఠశాలలోని యొకబోధకుఁడు నాకు బస కుదుర్చుటకై నాతో వచ్చి, కొన్ని యిండ్లు చూపించెను. బ్లాకుటవను పోయి మిత్రుఁడు శ్రీ కొల్లిపర సీతారామయ్యగారిని జూచితిని. మఱునాఁడు ఆదివారము బ్రాహ్మమందిరమునకుఁ బోయినపుడు, రాఁబోవు రామమోహనరాయలవర్ధంతి సందర్భమున నొకయుపన్యాసము చేయుఁడని మిత్రులు నన్ను గోరిరి.
నేను పాఠశాలలో వెంటనే పనిచేయ నారంభించితిని. ఆవిద్యాలయ మంచిస్థితిలో లేదు. ప్రవేశపరీక్షతరగతి క్రమము తప్పి యుండెను. నేను జేయవలసిన కృషి యత్యధికముగఁ గలదు.
"ఆర్యపాఠశాల"కు సమీపముననందు నొకచిన్న యింటిలో నేను అద్దెకు రెండుగదులు పుచ్చుకొంటిని. ఆ యింటిలో రెండవ భాగమున సుబ్రహ్మణ్యయ్యరుగారి బావమఱఁదులు కాపుర ముండిరి. సెప్టెంబరు 26 వ తేదీని బ్రాహ్మసమాజమువారు రాజారామమోహనుని వర్ధంతి జరిపిరి. వారి మందిరమునఁ గూడిన బహిరంగ సభకు రా. బ. పనప్పాకం ఆనందాచార్యులుగారు అధ్యక్షులు. నేను రామమోహనుని గుఱించి వ్రాసిన యింగ్లీషువ్యాసమును జదివితిని. అధ్యక్షులు నావ్యాసమును మెచ్చుకొని, బ్రాహ్మమతమును గుఱించి సదభిప్రాయము దెలిపిరి. అపుడు "సంఘసంస్కారిణీ" పత్రికలో ముద్రితమైన నావ్యాసమును, కలకత్తా సాధారణ బ్రాహ్మసమాజమువారి "ఇండియన్ మెసెంజరు" పత్రిక పునర్ముద్రితము చేసెను.
30 వ సెప్టెంబరు ప్రవేశపరీక్షకు దరఖాస్తు లంపుటకు తుది దినము. మా పాఠశాలనుండి 31 మంది బాలుర నా పరీక్షకంపి, యిద్దఱిని మాత్రము నిలిపితిమి. కాని, యా యిరువురు విద్యార్థులును పలుమాఱు యింటికి వచ్చి చేసిన దీనాలాపములకు జాలినొంది, వారినిఁ గూడఁ బంపివేసితిని.
నా మిత్రులు కనకరాజు గంగరాజుగార్లు బి. యల్. పరీక్షలో తప్పి, తిరిగి యాపరీక్ష నిచ్చుటకై అక్టోబరు 9 వ తేదీని మద్రాసు వచ్చిరి. మాయింటికి వారినిఁ గొనివచ్చి, కొలఁదిరోజులలో వారి కొక బస కుదిర్చితిని. ఇపుడు నేను మద్రాసులో నివసించుటచేత, 'జనానాపత్రిక' నిచటనే ప్రచురించి తపాలో పంపుచువచ్చితిని.
మద్రాసులో నొకనెల యుండునప్పటికే నా కచటి నివాసమునందు విసువు జనించెను. నెల కేఁబదిరూపాయిలతో నా కక్కడ జరుగకుండెను. ఆ జీతమైనను సరిగా నొక్కసారి చేతికి రాదు. పాఠశాలలో పనియు, బాధ్యతయును అధికము. ఫలము స్వల్పము ! తలిదండ్రుల పోషణమునకు రాజమంద్రి పంపుటకు నాయొద్ద సొమ్ము లేనేలేదు. కావున నేను త్వరలోనే యీ పట్టణమునుండి కానిన కనీస మీపాఠశాలనుండి కాని, వెడలిపోయి, వేఱొక యుద్యోగమునఁ బ్రవేశింపవలసినదే. నాపూర్వమిత్రులగు అనంతముగారికి నేనీ సంగతి వ్రాయఁగా, నేను మరల బెజవాడ వెడలిపోవుటయె శ్రేయమని వారు హితవుచెప్పిరి. వెనుక బెజవాడపాఠశాలలో నుపాధ్యాయ మిత్రులగు దేవసహాయముగా రిపుడు చెన్నపురి రాయపేట కళాశాలలో నుపాధ్యాయులుగ నుండిరి. ఆయనను నే నిపుడు సందర్శించి, వేఱు మంచియుద్యోగ మేమైన నిచట దొరుకునా యని యడుగఁగా, అచటి క్రైస్తవ పాఠాశాలాధికారుల నిద్దఱిని జూడు మని వారు చెప్పిరి. నే నట్లు చేసితిని. కాని, నాకు లాభ మెచటను గానఁబడలేదు. తిరిగి బెజవాడకు వెడలిపోవుటయె మే లని తోఁచెను. కావున 26 వ అక్టోబరున బెజవాడ పాఠశాలాధికారికి తంతినిచ్చి, డిశెంబరు ప్రారంభమున నేను మరల బెజవాడలో నాపనిలోఁ జేరెదనంటిని. వారు దాని కొప్పుకొనిరి. నే నిట్లు బెజవాడకుఁ బోవుటయే నిశ్చయించుకొంటిని.
సుబ్రహ్మణ్యయ్యరుగారును నా బెజవాడ ప్రయాణమునకు సమ్మతించిరి. నా తోఁటబంగళా నాకొఱకు నిలిపి యుంచుఁడని బెజవాడస్నేహితులకు నే నంత వ్రాసివేసితిని.
చెన్నపురిలో నుండునపుడు, తఱచుగ నేను మిత్రులు కనకరాజు గంగరాజుగార్లను గలసికొని, మాకుఁ బ్రియమగు సంస్కరణోద్యమమును గూర్చి ముచ్చటించువాఁడను. నాపత్రికపేరు బాగుగ లేదు కావున, శ్రవణానందకరమగు వేఱొక నామమును, ముఖపత్రము మీఁద నాకర్షణీయమగు స్త్రీప్రతిమయు నుండవలెనని కనకరాజు చెప్పెను. ఇంకను నాభార్యకు మత సంఘ సంస్కరణ విషయములు కంటకములుగఁ దోఁచెను. ప్రకృత హిందూస్త్రీల స్థితిగతులు సామాన్యముగ నిట్టివియే యని నేను మనస్సును గొంత సమాధానపఱుచు కొంటిని. మద్రాసులో నున్న దినములలో నే నప్పుడప్పుడు "సంఘ సంస్కరణ సమాజము" వారి విడిదికిఁ బోవుచుండువాఁడను. నన్ను వారు సభ్యునిగఁ జేర్చుకొనిరి. సభికులు వారమున కొక్కమాఱు తమబసలో సమావేశమై, తమలో సౌభ్రాతృత్వమును బెంపొందించు కొనుటకై యందఱును గలసి ఫలాహారములు చేయుచుండువారు. ఇది నా కంతగ తృప్తికరముగ లేదు.
నేను చెన్నపురికి వచ్చినపిమ్మట, "లండను నగర రహస్యములు" మున్నగు ననేకపుస్తకములు చదివితిని. కాని, నేనిచ్చటికి వచ్చిన ముఖ్యకార్యమె మఱచిపోయితినికదా ! ఎన్ని కష్టములు పడియైనను, ఇచట రెండుమూఁడు సంవత్సరము లుండి, యం. యే. పరీక్షకుఁ జదివి యందు జయ మందినచో, ఏకళాశాలలోనైనను నాకు మంచి యుద్యోగము లభింపఁగలదు. లేనిచో, బి. యల్. పరీక్షకైనను నేను మెల్ల మెల్లగఁ జదివి కృతార్థుఁడనైన బాగుండునని మా తలిదండ్రుల తలంపు. కాని, యీ పాఠశాలలో దినమున కాఱుగంటలు నేను పని చేయవలసివచ్చెను. ఇదిగాక, ప్రథమోపాధ్యాయుఁడ నగుటచేత, నాబాధ్యత యధికముగ నుండెను. పాఠశాలకు సొమ్ము చాలదు. బోధకుల కందఱికి నెలలకొలఁది జీతములు ముట్టుట లేదు ! ఇటువంటి విద్యాలయమున నే నెటులుండి యుద్ధరింపఁగలను ? ఈ పాఠశాలకుఁ జేరువనుండెడి "తిరువళిక్కేణియున్నత పాఠశాల"తో సరిసమాన మైన మంచిపేరు దీనికిని గొనిరావలదా యని సుబ్రహ్మణ్యయ్యరు గారితో నే నొకనాఁ డనఁగా, "మన పాఠశాల వేఱొకవిద్యాలయముతో పోటీ చేయ నక్కఱలేదు. మంచి విద్యార్థులు ఇతరపాఠశాలల కేగినను, మిగిలిన తక్కువరకపు బాలురే మనకుఁ జాలు" నని ఆయన చెప్పివేసిరి ! ఇంకొకసారి, ఇచటి యుపాధ్యాయులకు నెల నెలకును సరిగా జీతములు లభింపకుండుట చింతనీయ మని నే ననఁగా, "పంతులుగారూ, పట్నము సంగతులు మీకు బాగా తెలియవు. మనము జీతములు బాకీపడియుండుటయే మనబడికి శ్రేయము. ఉపాధ్యాయులు మన విద్యాలయమునుండి దాటిపోకుండ వారి కిదియే సంకిలి యగుచున్నది సుమీ !" అని అయ్యరుగారు నాకు సమాధాన మిచ్చిరి ! విద్యాశాలాధికారి కిట్లు ఉదారాశయములు లేకుండుట చేతను, తోడి బోధకుల కష్టములు నిరతము చూడలేకయు, నే నిట్టి పాఠశాలలో పాఁతుకొనిపోవుట వ్యర్థమని తలంచితిని.
ఇదిగాక, పెద్దపరీక్షలకుఁ జదువుటకు నాకీ పాఠశాలలో బొత్తిగ తీఱిక లేకుండెను. దీనికితోడు ఈ మహాపట్టణమున నేఁబది రూపాయిలతో నాకు జరుగదని నే నధైర్యపడితిని. అప్పులు తీర్చుట యటుండనిచ్చినను, తలిదండ్రుల పోషణమునకును, సోదరుల చదువునకును వలయు సొమ్ము మాసమాసమును నే నెట్లు సమకూర్పఁగలను ? ఈ కారణములచేత నేను బెజవాడకు సంసారమును తరలింపవలసి వచ్చెను.
నవంబరుమధ్యనే నేను సామానులు సరదుకొన నారంభించితిని. మద్రాసులో కొంతకాలము నివసించి యిచట సంస్కరణోద్యమ ప్రచారము సలుపు నుద్యమించిన వీరేశలింగముగారి సరకులు పుస్తకములు నపుడే రాజమంద్రినుండి వచ్చుచుండెను. నా సామానులు కొన్ని బకింహాముకాలువ పడవమీఁదను, కొన్ని రెయిలులోను వేసి, బెజవాడ కంపివేసితిని. అంత 26 వ నవంబరున మేము మద్రాసునుండి బయలుదేఱితిమి. చెన్నపురికాపుర మిట్లు కడతేఱెను ! తా నొకటి తలంచిన దైవ మొకటి తలంచును ! 22. మరల బెజవాడ (2)
అనంతముగా రిపుడు సకుటుంబముగ బళ్లారిలో నివసించి యుండిరి. వారి యాహ్వానము ననుసరించి మే మపుడు మార్గమధ్యమందలి బళ్లారి పోయి యచట రెండుదినములు నిలిచితిమి. వారి స్నేహితులగు సి. యస్. సుబ్రహ్మణ్యమయ్యగారి యిల్లు మాకు విడిది యయ్యెను. అయ్యగారు సుప్రసిద్ధాంద్రులగు మీనాక్షయ్యగారి యల్లుఁడు. ఈ దంపతులు సాధుజనులు. అనంతముగారు మాకు బళ్లారినగరము చూపించిరి. పట్టణము చక్కనిదియె కాని, అందు దోమలబాధ మెండు. దివ్యజ్ఞానసామాజికులగు ఆర్. జగన్నాధయ్యగారును, వార్డ్లాపాఠశాలాధ్యక్షులగు కోటిలింగముగారును నా కచటఁ బరిచితులైరి. నా స్నేహితులును, బాలికాపాఠశాలల పరీక్షాధికారులునునగు శ్రీ పి. రామానుజాచార్యులుగా రచట నుండిరి.
30 వ నవంబరు ప్రొద్దున మేము మరల రెయిలులో కూర్చుండి డిశెంబరు 1 వ తేదీ యుదయమునకు బెజవాడ చేరితిమి. కడుఁ బ్రియమగు బెజవాడను మరలఁ గాంచి నా కన్నులనుండి యానందాశ్రువు లొలికెను. నాకొఱకు విద్యార్థులు రెయిలుస్టేషనులోఁ గనిపెట్టుకొని యుండిరి. మేము మాతోఁటబంగాళాకుఁ బోయితిమి. పెరటిలోని జామలు, సీతాఫలపుచెట్లును పండ్లతో నిండియుండి, మాకు సుస్వాగత మొసంగెను ! ఆసాయంకాలము టానరుదొరను, దాసుగారిని జూచి, మరల బెజవాడ పాఠశాలలోఁ బ్రవేశించితిని. మే మంత సంవత్సర పరీక్షలు జరుప నారంభించితిమి. డిశెంబరు 2 వ తేదీని మిత్రులతోఁ గలసి, రెయిలుస్టేషనులో వీరేశలింగముగారిని సందర్శించితిని. చెన్నపురిలోఁ గృషి చేయవలెనని గంపెడాసతోఁ గదలిపోవుచుండు