ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/"జీవాత్మ - పరమాత్మలు"
నా దేహారోగ్య మెటు లుండినను, ఆత్మారోగ్యము మాత్రము క్రమముతప్పి యుండెను. నా యాత్మకు పాపేచ్ఛ యనునది జీర్ణ వ్యాధిగఁ బరిణమించెను ! ఆత్మావ్యాధులు సులభ నివారితము లని పూర్వము నే ననుకొనువాఁడను గాని, అంతకంటె మొండిరోగము లుండవని నా కిపుడు ద్యోతక మయ్యెను.
1 వ జూన్ తేదీని మిత్రుఁడు కనకరాజు భార్య చనిపోయె నను దు:ఖవార్త విని, నా సంతాపమును సానుభూతిని దెలుపుచు నాతని కొకలేఖ వ్రాసితిని. 18 వ జూన్ ప్రొద్దున బెజవాడ పయనమయితిని. రెయిలులోఁ గూర్చుండి నే నిట్లు తలపోసితిని : -
"ఈ సెలవులలో రాజమంద్రిలో నుండురోజులలో నేను తల్లితో ధారాళముగ మాటాడలేకపోయితిని. విపరీత మిత భాషిత్వము నన్నావహించి యుండెను. దీనికితోడు, ఆమె రుసరుసమనుచు, విరోధ భావమున మెలంగెడిది. తుదిదినములలో మా తండ్రియు నిట్లే యుండెడివాఁడు. కావుననే నే నాయనతో మనసిచ్చి మాటాడనేరకుండెడివాఁడను !" రెయిలులో నేను విశాఖపట్టణమునుండివచ్చు దాసుగారిని గలసికొంటిని. మరల మేము మిత్రులమయితిమి. నేను బెజవాడలో దిగునప్పటికి నన్నుఁ గలసికొనుటకు రాజారావు, విద్యార్థి పానకాలును గనిపెట్టుకొని యుండిరి. రాజారావునింట నేను భుజించితిని. బెజవాడలో ఆస్తికసమావేశము జరిపింతుమని ప్రకటించిన రాజగోపాలరావు మీఁద నేను కోపించితిని.
34. "జీవాత్మ - పరమాత్మలు"
ఆ వేసవిసెలవుల పిమ్మట బెజవాడలో యథాప్రకారముగ నాపనులు నేను జేయుచువచ్చితిని. పుట్టినిల్లగు కట్టుంగ పోయి చాలదినములవఱకును నాభార్య బెజవాడ చేరకుండుటచేత, కొన్ని రోజులు శిష్యమిత్రులు నాకు వంట చేసిపెట్టిరి. ఒక్కొకప్పుడు వంటపని నామీఁద పడుచుండుటచేత పాఠశాలపనికిని, ఇతర పనులకును వ్యవధానము చాలక, చికమకలు పడుచుండువాఁడను. దీనికిఁ దోడు, నా మనస్సీమను పాపపుఁదలంపు లేపారి తిరుగాడుచుండెను ! ఎక్కువపనిచే నేను డస్సియుండినను, పలువిధములగు దుష్ట సంకల్పములు నన్ను విడువనొల్లక, నా మనోవీథిని స్వైర విహారములు సల్పుచుండెడివి ! జీవిత మొక విషాదాంతనాటకముగఁ బరిణమిల్లు నట్లు తోఁచెను. ఇదిగాక, జ్వరముచేఁ బీడింపఁబడినప్పు డైనను తోడి క్రైస్తవబోధకునివలె నొక దినమైనను నేను బడి మానరాదు ! ఐరోపావారు పక్షపాతబుద్ధితో భరతదేశమున క్రైస్తవమతప్రచారము సల్పుచున్నా రని నేను మొఱలిడువాఁడను. ఈ చిక్కులలో నేను మరల న్యాయశాస్త్రసంబంధమగు చదువు సాగించితిని.
ఇట్టి విషమస్థితిలో నాకు 7 వ జూలయిని రెండు జాబులు వచ్చెను. అవి రెండును మా ఋణములనుగుఱించినవియే ! తన కీయవలసిన వేయిరూపాయిలు నీయు మని యొక ఋణదాత నిర్బంధించెను. రెండవయుత్తరము మాతమ్ముఁడు వ్రాసినది. మాకు బదు లిచ్చిన వేలివెన్ను కమ్మస్త్రీ యొకతె మామీఁద వ్యాజ్యెము వేసినటు లందుండెను !
10 వ తేదీని నాభార్య తన పినతండ్రితో బెజవాడ వచ్చెను. రాజమంద్రిగాని బెజవాడగాని తనను దీసికొని వచ్చు బంధువులు లేకుండుటవలన తనరాక కీ యాలస్య మయ్యె నని యామె సమాధానము. వేలివెన్ను ఋణదాత కిచ్చుటకై పాఠశాలలో పండితులగు కామశాస్త్రిగారియొద్ద నిన్నూఱు రూపాయలు నే నప్పు పుచ్చుకొని, 15 వ జూలై శనివారమునాఁడు రెయి లెక్కి, నిడదవోలులో దిగితిని. అచట తమ్ములు కృష్ణయ్య వెంకటరామయ్యలు నన్నుఁ గలసికొనిరి. అట్లపాడుమీఁదుగ మేము పోవుచుండఁగా పింగళివారి పెద్దకోడలు అత్తమీఁదికోపమున కాలువలోఁ బడిపోయె నని మాకచటఁ జెప్పిరి.! శవ మింకను కానఁబడలేదు. రాత్రికి మేము వేలివెన్ను చేరి యచట జరిగిన వీథినాటకము చూచి సంతోషించితిమి.
మేము బాకీపడిన కమ్మస్త్రీతో రాజీ కుదరకుండ నొక తుంటరి యడ్డపడుటచేత, మఱునాఁడు గ్రామము విడిచిపోయితిమి. నేను బెజవాడ చేరినమఱునాఁడే మా పొరుగుననుండు యువతి యొకతె గృహల్లోలములచేత బందరుకాలువలోఁబడి యాత్మహత్య గావించుకొనెను ! మనదేశమునఁ గోడండ్ర ఘోరదుర్మరణము లెపుడంతరించునోకదా!
26 వ జూలయి తేదీ దినచర్య నా కా దినములలోఁగల బాధ నొకదానిని తేటపఱుచు చున్నది : - "న్యాయశాస్త్రపుఁ జదువులు, పాఠశాల పనులును - ఇపుడు నా నిత్యకార్యక్రమము. * * * ఈ భార్యతో నే నెట్లు వేఁగఁగలను? ఒకనాఁడు ముడుఁగుదామర, ఒకనాఁడు వికచపద్మమునగు నీ కలహాంతరితను పైసలేని నే నెట్లు ప్రసన్నవదనఁ జేయఁగలను ? ఎటు లాభరణములకు ధన మొసంగి సంతృప్తఁ జేయఁగలను ?"
తమ్ముఁడు రాజమంద్రిలో చిల్లరయప్పులు తీర్చి వేయుచుండెనని తెలిసి సంతోషించితిని. వేలివెన్ను వ్యాజ్యెము జరుగుచునే యుండెను. తమ చరిత్రమును నేను వ్రాయుటకు వీరేశలింగముగారు సమ్మతింపకున్నను, నే నీవిషయమున కృషి చేయఁదలంచితిని.
జూలయి 30 వ తేదీని మాపేట పఠనమందిర కార్యదర్శి పని మానుకొనఁగ, ఆ యుద్యోగము నా కిచ్చెద మనిరి. నే నొప్పుకొన లేదు. రాత్రి ఏడున్నరగంటలకు నా కొకతంతి వచ్చెను. రాజమహేంద్రవరమున మాతల్లికి మూర్ఛ లీనాఁడు విడువకుండ వచ్చుచుండుటచేత, నన్ను మా తమ్ముఁడు, వెంటనే రమ్మని కోరెను. కాఁబట్టి నే నారాత్రియె బయలు దేఱితిని. రెయిలులో నాకొన స్నేహితుఁడు కానఁబడి, ధవళేశ్వరమునందలి యొక వైద్యునిచే మాయమ్మకు మందిప్పించుమని చెప్పెను. రేవుస్టీమరులోనే నా కావైద్యుఁడు కానఁబడి, రాజమంద్రిలో దిగినతోడనె నాతో మాయింటికి వచ్చి మా తల్లిని బరీక్షించి వ్యాధినివారణ చేసెదనని పలికెను. వెంకటరామయ్య వృత్తి సంబంధమగు పనిమీఁద నిడదవోలు వెళ్లి, అక్కడనుండి మా వ్యాజ్యెమునకై తణుకు పోయెద నని చెప్పెను. నేను రాజమంద్రిలో నుండి మాయమ్మ కుపచారములు చేసితిని.
మఱునాఁడు వైద్యునికొఱకు ధవళేశ్వరము వెళ్లితిని. నాతల్లికి భార్యకునుగూడ నాయన మందులు నిర్ణయించి చెప్పెను. ఆరాత్రి బండిమీఁద విధిలేక నేను బెజవాడ బయలుదేఱితిని. మాతల్లి యెడ నాకుఁగల ప్రేమాతిశయము నే నెట్లు వెలిపుచ్చఁ గలను ? ఆసంగతి యా పరమాత్మునికే యెఱుక !
ఇపుడు నా "గృహనిర్వాహకత్వము", "హిందూ సుందరీమణుల" ప్రతులు బాగుగ నమ్ముడువడుచు నా కెంతయు నుత్సాహ ప్రమోదములు గలిపించెను. 7 వ ఆగష్టు మధ్యాహ్నమున తపాలజవాను నాచేత నొక యుత్తరమును నాలుగు పుస్తకములును బడవైచెను. "జీవాత్మ - పరమాత్మల" మీఁది నావిమర్శనమునకే యీనాలుగుపుస్తకములును బహుమతులని యాకమ్మయం దుండెను. ఇవి మార్టినోమహాశయుఁడు రచించిన "నీతిసిద్ధాంతములు" అను పుస్తకసంపుటములు రెండును, "మత విమర్శనము" అను పుస్తకములు రెండును. ఈ యమూల్యమగు పుస్తకము లందుకొని, నేను హర్షాంబుధి నోలలాడితిని.
హిందూదేశమునం దా సంవత్సరమున నీ బహుమతులకు పోటీచేసిన వారిలో నెల్ల, నా మిత్రులును బందరుపుర వాస్తవ్యులును నగు శ్రీ వేమూరి రామకృష్ణారావుగారికిని నాకును ఈ మొదటితరగతి బహుమానము లీయఁబడె ననియు, వేఱుప్రదేశములనుండు మఱి యిద్దఱికి రెండవతరగతి బహుమానములుగ మఱి కొన్ని పుస్తకము లీయఁబడిన వనియు, నాకుఁ బిమ్మట తెలిసెను.
"జీవాత్మ - పరమాత్మల" విమర్శనమున, ఈశ్వర విశ్వాసమునకు స్వభావజనితజ్ఞానమే ప్రధానమని గ్రంథకర్త చెప్పినవాక్యములు కొన్ని నేను విమర్శించి, ఈవిషయమున ననుభవముకూడ ముఖ్యమని నేను జెప్పితిని.
35. నిత్యవిధులు(2)
15 వ ఆగష్టున "సంఘసంస్కరణసమాజము" వారి యాజమాన్యమున బెజవాడలో నొక బహిరంగసభ జరిగెను. డిస్ట్రిక్టు మునసబు టి. కృష్ణస్వామినాయఁడుగారు అగ్రాసనాధిపతులు, నా పూర్వ మిత్రులగు కొరిటేపాటి నరసింహాచార్యులుగారు సంస్కరణ పక్షానుకూలముగఁ బ్రసంగించి రాజమంద్రిపండితులు చేసిన యాక్షేపణలను