Jump to content

ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/శుభాశుభములు

వికీసోర్స్ నుండి

దానికి న్యాపతి హనుమంతరావుగా రధ్యక్షులు. డిశెంబరు మొదటి వారములో వెంకటప్పయ్యగారి కుటుంబమున నందఱును మిక్కిలి యలజడికిలోనయిరి. వెంకటప్పయ్యగారి పెద్దయల్లుఁడు, అక్క యు బావయు భార్యయు వలదని వారించుచుండినను వినక, సింగరాయకొండదేవళములో రెండవ పెండ్లి చేసికొనెను.

20. శుభాశుభములు

1918 వ సంవత్సరము జనవరి 5 వ తేదీని గుంటూరు పురపాలకాధ్యక్షుని యెన్నిక జరిగెను. వెనుకటి యధ్యక్షు లగు న్యాపతి హనుమంతరావుగా రొకరును, పి. యతిరాజులు నాయఁడుగా రొకరును ఈ యుద్యోగమున కభ్యర్థులు. హనుమంతరావుగారు శక్తివంచన లేక, తమవృత్తిపనులును, తుదకుఁ దమయారోగ్యము నైనను జూచుకొనక, ప్రజాసేవ లొనరించినవారు. ఐనను, పురపాలకసంఘసభ్యులలోఁ బలువుర కాయనయందు సదభిప్రాయము లేదు. ఈసమయమునఁ దమయభ్యర్థిత్వము విరమింపుఁడని వెంకటప్పయ్యగారును, నేనును హెచ్చరించినను పంతులు గారు విన లేదు. అంత జరిగిన యెన్నికలలో పంతులుగారు పరాజితులైరి. తమ యధికారకాలమున నమితముగ శ్రమపడి, ఇప డాశాభంగము గాంచిన పంతులుగారికి, దేహమున నుష్ణ మధికమై, ఆనెల చివర దినములలో పెద్దజ్వరము సోఁకెను. కొన్ని రోజుల కాయనకు స్వస్థత కలిగినను, చాలకాలమునకుఁగాని శరీరమునకు మరల సత్తువ చేరుకొనలేదు.

ఫిబ్రవరి మూఁడవతేదీని గుంటూరు కళాశాలలోఁ జిరకాలము బోధకుఁడుగ నుండిన వంగిపురము కృష్ణమాచార్యులుగారు పరలో ప్రాప్తిఁ జెందిరి. వీరు సంస్కృతాంధ్రసాహిత్యములందును, గణిత శాస్త్రమందును ప్రతిభావంతులు; వినయాది సుగుణభూషితులు. ఇట్లయ్యును, తమప్రజ్ఞకుఁ దగిన యౌన్నత్యమును విద్యాశాలలోఁ బడయఁజాలకుండిరి. ఇటీవలనె వీరికిఁ గళాశాలతరగతులలో నాంధ్రరచనోపాధ్యాయపదవి యొసంగుఁడని అధ్యక్షులకు నేను సిఫారసు చేసితిని. కాని, యీపని యయిన కొలఁదికాలమునకే వీరికి మృత్యు నాసన్న మయ్యెను ! వృద్ధురాలగు వీరి జనిని యింకను జీవించియే యుండెను ! ఆనెల తొమ్మిదవతేదీని వీరి గౌరవార్థమై జరిగిన బహిరంగసభకు నేనే యధ్యక్షత వహించితిని. ఈయన జ్ఞాపకార్థమై యేదేని శాశ్వతకార్య మొకటి చేయఁ బౌరులు సమకట్టిరి. ఈయనస్థానమున, నాయాలోచన ననుసరించి, కళాశాలా పూర్వ విద్యార్థి కొలచలమ కృష్ణసోమయాజులుగారు నియమింపఁబడిరి.

ఈ నెల 20 వ తేదీని మాచెల్లెలి రెండవకూఁతురు సీతమ్మ వివాహమును, కుమారుఁడు జనార్దనుని యుపనయనమును కాకినాడ దగ్గఱ సర్పవరములో జరిగెను. ఆసమయమున నాఁడువారు పిల్లలు కూడరాఁగా మువ్వురన్న దమ్ములమును అచ్చటకు వెళ్లితిమి.

చనిపోయిన చెల్లెలు కామేశ్వరమ్మభర్త పింగళి సూర్యనారాయణ మరణించెనను దు:ఖవార్త మార్చి 6 వ తేదీని మాకు వినవచ్చెను. ఈతని కిటీవల ద్వితీయవివాహము జరిగి, ఒక కొమార్తెయు నొక కుమారుఁడును గలిగిరి. నిడదవోలు ప్యారీకంపెనీలో గుమాస్తాగానుండు యభివృద్ధి నొందుచుండెడి యీతని కిపుడు మరణ మాసన్న మయ్యెను ! మావెల్లెలికుటుంబ మిట్లు సమూలముగ నాశన మగుట కడు దుస్సహముగ నుండెను ! ఈ మార్చి నెల తుదిని మాతమ్ముఁడు వెంకటరామయ్య జ్యేష్ఠ పుత్రుఁడు నరసింహమూర్తి వివాహము రాజమంద్రిలో జరిగెను. మండలన్యాయసభలో పెద్దయుద్యోగి యగు పోడూరి వెంకయ్య గారి పెద్దచెల్లెలు సూర్యకాంతమును వీని కిచ్చిరి. మా కొక పెద్ద భవనము విడిద యయ్యెను. రాజమంద్రిమిత్రులు పలువు రా సందర్భమున మా కగపడిరి. వివాహదినములలో నొకనాఁడు వీరేశలింగము పంతులుగారు మావిడిదకు విచ్చేసిరి. అపుడు వారితోఁ జాలసేపు మాటలాడితిమి. మరల వారి "హితకారిణీ పాఠశాల"లో ప్రథమోపాధ్యాయపదవి ఖాళీ యయ్యెను. ఈతరుణమందైన రాజమంద్రి రావలెనని నే నాలోచించితిని. కాని, యిపుడు కళాశాలలో ప్రథమోపన్యాసకపదవిలో నుండి, కొలఁదికాలములో నధ్యక్షక పదవిని అధికవేతనమును నందనుండు నేను, రాజమంద్రియందలి యీ చిన్న పనికివచ్చుట తగదని వీరేశలింగముగారి యొక్కయు, మిత్రులు పాపయ్య సాంభశివరావుగార్ల యొక్కయు నభిప్రాయము. ఆపాఠశాలలో నిదివఱకు ద్వితీయోపాధ్యాయుఁడును, పర్లాకిమిడిలో నాపూర్వశిష్యుఁడును నగు జయంతి గంగన్న గారి కీ యుద్యోగ మపు డీయఁబడెను.

ఏపిల్ 27 వ తేదీని "ఆస్తిక పుస్తకాలయ" ప్రవేశ మహోత్సవమునకు రమ్మని రాజమంద్రినుండి నాకు పిలుపువచ్చెను. పనితొందరవలన రాలేనని వీరేశలింగముపంతులు పాపయ్యగార్లకు నేను వ్రాసి, నాయొద్దనుండు "మనశ్శక్తి విమర్శనా సంఘము" వారి ప్రచురణము లన్నియును అట్టలు గట్టించి నూతనపుస్తకాలయమున నుంచుఁడని రాజమంద్రి పంపించితిని.

ఆ మేనెల 5 వ తేదినాఁటికి పరీక్షాపత్రములు దిద్దుపని ముగించితిని. ఈ రెండు మూఁడునెలలును నేను పరీక్షా కార్యదీక్ష నుంటిని. విశ్రాంతితో నుండు నా మనస్సు నిపుడు మరల విచారము ముట్టడించెను ! కార్యనిమగ్నత నుండిననే గాని, నాహృదయము దు:ఖకూపమున మునుఁగ సిద్ధమగుచుండెను ! ఇటీవల కొనినస్థలములో మేమొక కుటీర మేర్పఱుప వచ్చుననియు, కనీసము చుట్టుగోడలైనఁ బెట్టింప వచ్చుననియు, భార్య నాకు బోధించెను. నా మనస్సున కే పనియందు నిష్టము లేకుండెను !

ఈమాఱు ఆంధ్రరాష్ట్రీయసభలు కడపలో జరుగు నని తెలిసెను. మిత్రులు హనుమంతరావు వేంకటప్పయ్యగార్లు నన్నచటికిఁ గొనిపోయిరి. కడప మిగుల వెనుకఁబడియుండు ప్రదేశమువలెఁ దోఁచెను. ఉత్తరాదియాంధ్రులకును, అచటి తెలుగుఁవారికిని వేషభాషాచారము లందు మిగుల వ్యత్యాసము గానఁబడెను. జూన్ 1 వ తేదీని సభలు పూర్తికాఁగా మిత్రులతో నేనచటినుండి బయలుదేఱితిని. ఆరాత్రి మేము పండుకొనిన రైలుగదిలోని కొక యన్యుఁడు రెండవజామున వచ్చి కూర్చుండెను. పైబల్ల మీఁదఁ బండుకొనిన నేను వానిని గనిపెట్టుచునే కను లట్టే మూసితిని ! ఇంతలో పెద్దశబ్దము వినుపింపఁగా నేను లేచి చూచు సరికి, ఆ మనుష్యుఁ డదృశ్యమయ్యెను ! తోడనే మిత్రులను లేపి, వారి కీసంగతి చెప్పి, సామానులు సరిచూచుకొమ్మని హెచ్చరించితిని. పాపము హనుమంతరావుగారిపెట్టె పోయెను ! ఆయన సొమ్ము, బట్టలు, టిక్కెట్టుకూడ నందే యుండెను ! గుంటకల్లులో మే మీసంగతి పోలీసువారికి జెప్పితిమి. ఆస్తి దొరకలేదు.

ఈ సంవత్సరము గుంటూరు మండల సభలు సత్తెనపల్లిలో జరిగెను. నన్ను గ్రంథాలయసభ కధ్యక్షునిగ నెన్నుకొనిరి. సత్తెనపల్లి పరిశుభ్రమగు చిన్న పట్టణము. అచట 5, 6, 7, తేదీలలో సభలు జరిగెను. గ్రంథాలయసభలో, గ్రంథాలయోద్యమమును గుఱించి యధ్యక్షకోపన్యాసము జదివితిని. సాంఘికసభలో స్త్రీవిద్యను గూర్చి తీర్మానమును నేను బ్రతిపాదించితిని. అచట నెలకొల్పఁబడిన "మండల సంఘ సంస్కరణ సమాజము" నకు న న్నధ్యక్షుని గను, న్యాపతి నారాయణరావుగారిని కార్యదర్శిగను నెన్ను కొనిరి.

నేను గుంటూరుచేరిన మఱునాఁడే (20 వ జూన్) మాపిల్లవాని స్మారకదినము ! అకాలమరణ మందిన యర్భకునిమృతికై నేను విలపించితిని. నాదు:ఖమునకు మేరలేకుండెను. నాఁడే మామఱఁదలు లక్ష్మమ్మ చిన్న కొమరిత చనిపోయెనను దు:ఖవార్త తెలిసెను.

ఈ సంవత్సరము వేసవియందుకూడ గోదావరీమండల సంచారము మానుకొని, మేము గుంటూరియందే నివసించితిమి. సూర్యనారాయణ ప్రథమశాస్త్రపరీక్షయందు జయమంది, ఉన్నతవిద్యకై రాజమంద్రి వెడలిపోయెను. మాబావమఱఁది వెంకటరత్న మిపుడు స్వల్పమగు నుపకారవేతనముమీఁద నుద్యోగము చాలించుకొనెను.

21. గృహశంకుస్థాపనము

పాపము బంగారయ్య తనవిద్యనుగుఱించి చేసిన చిల్లరయప్పు లింకను తీఱనెలేదు ! గుంటూరిలో వెంకటప్పయ్యగారికిని, మఱికొందఱికి నాతఁడు కొంత బాకీపడియుండెను. అతని బావమఱఁది నాకుఁ గొంత సొమ్మంపఁగా, ఋణదాతలతో నేను మాటాడి, వారిబాకీసొమ్ము తగ్గించి పుచ్చుకొనునటు లొడఁబఱిచితిని. అల్పజ్ఞులకు మర్త్యుల మనోరథములిట్లె సఫలమగుచుండును !