ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/నివేశనస్థల సంపాదనము

వికీసోర్స్ నుండి

19. నివేశనస్థల సంపాదనము

నెల్లూరిలో హనుమంతరావుగారు మున్నగు మిత్రులతోఁగలసి నేను వెంకటప్పయ్యగారి విడిదిలో బసచేసితిని. వెంకటప్పయ్యగారు మహాసభకధ్యక్షులు. ఒంగోలు వెంకటరంగయ్యగారు ఆహ్వాన సంఘాధ్యక్షులు. వారియింటికిఁ జేరువనే మాబస. సభలో వెంకటప్పయ్యగారికిని ఆమంచర్ల కృష్ణారావుగారికిని అభిప్రాయభేదములు కలిగెను. కాని మూఁడవనాఁడు, అందఱును మిత్రులయిరి. సభలు జయప్రదముగ జరిగెను. సంఘసంస్కరణసభకు చిలకమర్తి లక్ష్మీనరసింహముగా రధ్యక్షులు.

ఆ జూను 10 వ తేదీని వెంకటరత్నము నాయఁడుగారు నాకొక జాబు వ్రాసిరి. ఆయన ప్రవేశపరీక్షాధిపసంఘసభ్యులు. క్రొత్తగ మూఁడుసంవత్సరములు ఆంధ్రపరీక్షాధికారిపదవి ఖాళి కాఁగా, అది నా కొసఁగుఁడని డైరక్టరుగారికిఁ దాము సిఫారసు చేసితిమని వారు వ్రాసిరి. ఎదురుచూడని యీ మేలునకు నే నానందమంది, నాయఁడుగారికి నాకృతజ్ఞతను దెలిపితిని.

ఆంధ్రపత్రికాకార్యస్థానమున మిత్రులు శ్రీ చల్లా శేషగిరిరావు గారికి సంపాదకపదవి లభించినందుకు, "గుంటూరు యువజన సాహితీ సమాజము"వారొక యభినందనసభ 15 వ తేదీని గావించిరి. శేషగిరిరావుగారు శాంతస్వభావులైనను, వలసినపట్టులం దాయన కలమునకుఁ గఱకుఁదనము గలుగుచుండుట నేనెఱుఁగుదునని పలికి, ఇట్టివారికి నుద్యోగ మిచ్చినందుకు నాగేశ్వరరావుగారి నభినందించితిని. మఱునాఁడే శేషగిరిరావుగారికి రెయిలునొద్ద మేము వీడ్కో లొసంగితిమి. 17 వ తేదీని కూచిపూడిలో జరిగిన గ్రంథాలయసభకు నేనును, రాజకీయసభకు వెంకటప్పయ్యగారును అధ్యక్షులము. అనిబిసంటమ్మగారిని దొరతనమువారు నిర్బంధించిరని యీనాఁడే పత్రికలు తెలిపెను. ఆమె కీశిక్ష గలుగుటకు ప్రజలు మిగుల సంక్షోభించిరి.

ఆ నెల 26 వ తేదీని వెంకటప్పయ్యగారు నాతో మాటాడుచు, బ్రాడిపేటలోని తమస్థలమునకుఁ జేరువనె నాకొక స్థలము బేరము చేయుచుంటిమనియు, అది తప్పక నేను గొనవలెననియుఁ జెప్పిరి. కాని నాకది యిష్టములేదు. 29 వ తేదీని మిత్రులు వల్లభజ్యోస్యుల కామేశ్వరరావుగారు మమ్మిరువురను గలసికొని, ఆస్థలము తమ యల్లునిదనియు, 1200 రూపాయిలకు నాకది కుదిర్చెదమనియుఁ జెప్పిరి. నాభార్య దీనికి సమ్మతించెను. వెంటనే లోగిలి కట్టినను గట్టకున్నను, ఆస్థలము నేను బుచ్చుకొనుట యుక్తమని వెంకటప్పయ్యగారు మున్నగు మిత్రులు గట్టిగఁ జెప్పిరి. స్థలము కొనుటకు నే నంతట సమ్మతించితిని.

జూలై 3 వ తేదీ కళాశాల తెఱచు దినమైనను, అపుడె కీర్తిశేషులైన దాదాభాయి నవరోజీగారి గౌరవార్థమై యా నాఁడు సెలవీయఁబడెను. ప్రవేశపరీక్షకు ముఖ్యపరీక్షాధికారిపదవి నా కొసఁగితిమని డైరక్టరుగారినుండి నాకు లేఖవచ్చెను. నామనస్సునకీ క్రొత్తవిషయము కొంత వ్యాపృతిఁ గలిగించెను. నే నిపుడీయ వలసిన ప్రశ్నపత్రమును గుఱించియు, దీనికి సంబంధించిన యితర విషయములను గుఱించియు నాలోచనలతో నామనస్సు దు:ఖము బారినుండి కొంత తప్పించుకొనెను.

ఇపుడు నాకుఁగలిగిన క్రొత్తపని యిది యొకటియె కాదు. కళాశాలాధ్యక్షులు, పుస్తక భాండాగారమునకు నన్ను ముఖ్యాది కారిగఁజేసి, అందలి కార్యక్రమము సరిగజరుపుటకై ప్రత్యేకముగ నొక గుమాస్తాను, జవానును నియమింతుమని చెప్పిరి.

బ్రాడీపేటలోని స్థలము కొనుటకు నిశ్చయించితిని గాన, కొంతసొమ్ము వెంటఁదీసికొని, నేను కామేశ్వరరావుగారితో బందరు వెళ్లితిని. సుమా రరయకరము పరిమితి గల గుంటూరిలోని తమ స్థలమును చిట్టా సుందరరామయ్యగారు నాకు విక్రయించి, ముందుగ నేనూరు రూపాయిలు నాయొద్దనుండి పుచ్చుకొని, నాకు దస్తావేజు వ్రాసియిచ్చిరి. ఇది జరిగిన రెండుమూఁడు దినములకు వెంకటప్పయ్యగారు నాదగ్గఱకు వచ్చి, తమయింటి కలపకు తాము రాజమంద్రి పోవుచుంటిమని చెప్పి, కలపకొనుట కిదె తరుణము గావున నాయింటి సామానుకొనుటకై నన్ను రాజమంద్రి యాహ్వానించిరి. స్థలము కొనుట కెట్టులో నేను సమ్మతించితినికాని, యింత యవ్యవధానముగ నే నీ పురమున నిల్లుకట్ట నాకు మనసొప్పుట లేదని నేను బ్రత్యుత్తరమిచ్చితిని. అందువలనఁ బంతులుగా రొకరె రాజమంద్రిపోయి, తమ యింటికిఁ గావలసిన కలపతెచ్చుకొనిరి.

ఆ జూలై నెల తుది దినములందు గుంటూరు క్రైస్తవ మత వ్యాపనాసంఘరత్నోత్సవము జరిగెను. కళాశాలాధ్యాపకులు విద్యార్థులును గలసి యూరేగి, అతివైభవమున నుత్సవములు జరిపిరి. కాని, నామనస్సు వానియందు లేదు. పడిన చిన్న నలుసునకుఁ గనులు మెర మెరలాడునట్లు, నా చిన్నపిల్లవానిమరణసంస్మరణమున మాటిమాటికి నాహృదయము వ్యాకులత నొందుచుండెను.

మామామగారికి జబ్బుచేసెననియు, మఱఁదలు లక్ష్మమ్మకుఁ గురుపువేసెననియుఁ దెలిసి నాభార్య 29 జులయిని కట్టుంగ వెడలిపోయెను. ఇపుడు నే నింట నొక్కఁడనే యుంటిని. నరసింహము సూర్యనారాయణ రామచంద్రరావులు విద్యాధోరణినుండునట్టిపిల్లలు ! నామనస్సును వేధించు దు:ఖము వారి కేమి తెలియును ?

ఆగష్టు 4 వ తేదీని మిగిలిన సొమ్మిచ్చి, సుందరరామయ్య గారిచే నేను దస్తావేజు రిజిష్టరి చేయించుకొంటిని. ఇపుడు నాస్థలము కొలిపించి, దానికి దిమ్మెలు వేయించి, పలుమా రా ప్రదేశమును జూచుటకై బ్రాడీపేట పోయి వచ్చుచుండువాఁడను. నా మనస్సున కిపు డేర్పడిన నూతనాకర్షములలో నిదియొకటి.

ఇంతలో దేశమున రాజకీయపరిస్థితులు తీవ్ర మయ్యెను. బిసంటమ్మగారికి విధించిన శిక్షకొఱకు సర్. యస్. సుబ్రహ్మణ్యయ్యరుగారు దొరతనమువారిమీఁద నలిగి, తమకు వా రదివఱ కొసఁగిన గౌరవపట్టమును వారి కంపివేసిరి. దేశనాయకులలోఁ బలువురు ప్రభుత్వమువారిని నిరసించిరి. ఇట్టివారిలో వెంకటప్పయ్య గారొకరు. వీరికిఁగూడ నిట్టిశిక్షయె గలుగునని మిత్రుల మనుకొను చుండువారము.

సెప్టెంబరు 20 వ తేదీని నాకు వచ్చిన యుత్తరములో మాయత్తగారు ధవళేశ్వరమునఁ జనిపోయిరని యుండెను ! నెల క్రిందట నేను మామామగారిని జూచుటకు వెలిచేరు వెళ్లియుండినపుడు, భర్తకుఁ బరిచర్యలు చేయుచు నామె యచటనే యుండెను. ఇపుడు మామామగారికిఁ గొంచెము శరీరమున నెమ్మదిగనుండెను గాని, కొలఁదిరోజుల క్రిందటనె యాయనతల్లి కట్టుంగలోఁ జనిపోయెను. ఒక నెలలోనె యత్త కోడండ్రు పరలోకప్రాప్తిఁ జెందిరి. శాంతమూర్తియగు మాయత్తగారి యాకస్మికమరణమునకు విషాదమందితిని. గుంటూరు ప్రార్థనసమాజమునకు మందిరనిర్మాణము చేయుటకు మేమంత ప్రయత్నించితిమి. స్థలసంపాదనా విషయమున నా కిపుడు కొంత చొరవ గలిగి, 29 వ సెప్టెంబరున సామవేదము నరసింహాచార్యులుగారియొద్ద 412 గజముల స్థలము నేను కొంటిని. నే నంతట వెలిచేరు వెళ్లి బంధువులను పరామర్శించితిని. కాకినాడ పోయి మాచెల్లెలిని, కొంచెము జబ్బుగనుండు మామేన కోడలిని జూచివచ్చితిని. కొంత విశ్రాంతి గలుగుటకై మామామగారిని గుంటూరు కొనివచ్చితిమి. కొలఁదికాలము క్రిందటనె వ్యాధిగ్రస్తుఁడై, మాసములోనె మాతృపత్నీ వియోగములు సంప్రాప్తమయిన మా మామగారిశరీరము రక్తవిహీనమయ్యెను. ఆయనకు గుంటూరినివాసము ఆరోగ్య ప్రదము కాఁగలదని నమ్మితిమి.

దు:ఖములో దు:ఖము సంప్రాప్తమగుచుండును. అధిక విద్యా పరిశ్రమముఁ జేసి, విదేశమున గొప్పయుద్యోగము సంపాదించిన నామిత్రుఁడు బంగారయ్య యిటీవల చనిపోయెనని అక్టోబరు 11 వ తేదీని నాకుఁ దెలిసెను ! పాపము, అతనితలిదండ్రు లింకను జీవించియుండిరి. వారికి బంగారయ్య యొకఁడె కుమారుఁడు ! తనవిద్యకె యిటీవల బంగారయ్యచేసిన ఋణములైన నింకను తీర లేదు ! భార్య సుగుణవతి యగు నిల్లాలు. ఇద్దఱుముగ్గురు చిన్నపిల్లలు కలరు. లాహూరు దూరప్రదేశమని యెంచి, యతఁ డిటీవల బంగాళాలోని రంగపూరు కళాశాలలో నుపన్యాసకుఁ డయ్యెను. అచటనె మన్యపుజ్వరము సోఁకి, యతని యసువులఁ గొనిపోయెను ! ఆహా ! అకాలబాల్య మరణములు చూచిచూచి నాకనులు కాయలు కాచిపోవుచున్నవి !

ప్రస్తుతదేశపరిస్థితులను గూర్చి యాలోచించుటకు ప్రత్యేక మండలసభ యొకటి గుంటూరిలో నవంబరు 25 వ తేదీని జరిగెను. దానికి న్యాపతి హనుమంతరావుగా రధ్యక్షులు. డిశెంబరు మొదటి వారములో వెంకటప్పయ్యగారి కుటుంబమున నందఱును మిక్కిలి యలజడికిలోనయిరి. వెంకటప్పయ్యగారి పెద్దయల్లుఁడు, అక్క యు బావయు భార్యయు వలదని వారించుచుండినను వినక, సింగరాయకొండదేవళములో రెండవ పెండ్లి చేసికొనెను.

20. శుభాశుభములు

1918 వ సంవత్సరము జనవరి 5 వ తేదీని గుంటూరు పురపాలకాధ్యక్షుని యెన్నిక జరిగెను. వెనుకటి యధ్యక్షు లగు న్యాపతి హనుమంతరావుగా రొకరును, పి. యతిరాజులు నాయఁడుగా రొకరును ఈ యుద్యోగమున కభ్యర్థులు. హనుమంతరావుగారు శక్తివంచన లేక, తమవృత్తిపనులును, తుదకుఁ దమయారోగ్యము నైనను జూచుకొనక, ప్రజాసేవ లొనరించినవారు. ఐనను, పురపాలకసంఘసభ్యులలోఁ బలువుర కాయనయందు సదభిప్రాయము లేదు. ఈసమయమునఁ దమయభ్యర్థిత్వము విరమింపుఁడని వెంకటప్పయ్యగారును, నేనును హెచ్చరించినను పంతులు గారు విన లేదు. అంత జరిగిన యెన్నికలలో పంతులుగారు పరాజితులైరి. తమ యధికారకాలమున నమితముగ శ్రమపడి, ఇప డాశాభంగము గాంచిన పంతులుగారికి, దేహమున నుష్ణ మధికమై, ఆనెల చివర దినములలో పెద్దజ్వరము సోఁకెను. కొన్ని రోజుల కాయనకు స్వస్థత కలిగినను, చాలకాలమునకుఁగాని శరీరమునకు మరల సత్తువ చేరుకొనలేదు.

ఫిబ్రవరి మూఁడవతేదీని గుంటూరు కళాశాలలోఁ జిరకాలము బోధకుఁడుగ నుండిన వంగిపురము కృష్ణమాచార్యులుగారు పరలో