ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/దు:ఖోపశమన ప్రయత్నములు (2)
"దయాళసింగు కాలేజికి ధనము బాగానున్నది. లాహూరు కాలేజీలలో నిదియె మిగుల ధనవంతమైనది.
"నే నున్నానను ధైర్యముతో మీరు రావలె ననుకొనుచున్నారు...సాధ్యమైనంత త్వరలో నేను మనవైపు రావలెనని యున్నది. ఇక్కడ శీతలము ఉష్ణము అతి విశేషము. కూరలు మంచివి దొరకవు. చచ్చు బెండకాయలు, బటాణీలు, గోబీపువ్వు, కందచేమలును తప్ప మరేమి దొరకవు. నేయి అతిప్రియము. నోటబెట్ట నసహ్యము ! పాలుమాత్రము చౌక. నీటివసతి బాగా లేదు.. ప్రశస్తమైన గుంటూరుపని వదలి, ఇంతదూరము మీ వయస్సులో వచ్చుట అసమంజసము....భ బంగారయ్య."
మిత్రుని యుత్తరమువలన నా సంశయవిచ్ఛేద మయ్యెను. మేము స్థానము వీడుట నాభార్య కసమ్మతము. మమ్ముఁజూచిపోవుట కిపుడు గుంటూరువచ్చిన మాతమ్ముఁడు వెంకటరామయ్యకూడ నిష్టపడలేదు. పర్యవసానము, నా కీయుద్యోగ మక్కఱలేదని మాఱు తంతి నిచ్చివేసి, తమ కిచ్చినశ్రమకు మన్నింపుడని యచటి మిత్రులకు వ్రాసివైచితిని. లాహూరు ఉద్యోగమునకై నేను జేసిన కృషి యంతయు నిట్లు వృథాప్రయాస మయ్యెను !
18. దు:ఖోపశమన ప్రయత్నములు (2)
1916 వ సంవత్సరము డిశంబరు 31 వ తేదీ దినచర్య యందు నే నిటు వ్రాసితిని : - "ప్రార్థన సమాజమున నేను ఉపాసనను జరిపితిని. ప్రార్థనచేయుటకు మిగుల లజ్జ నొందితిని. చిన్నపిల్లవాని మరణమునకుఁ బిమ్మట దేవు నారాధించుట కిదియె మొదటిమాఱు. విపత్తు సంభవించినప్పటినుండియు దేవునిమీఁద నేను సమ్మెకట్టియున్నాఁడను. ఈసంవత్సర కార్యక్రమమును విమర్శించుకొని, ఆర్థికజ్ఞానారోగ్యముల విషయమై నేను వెనుకటికంటె సుస్థితి నున్నను, నైతికాత్మీయ విషయములం దభివృద్ధి గాంచనట్టుగఁ దెలిసికొన్నాను. ఈసంవత్సరమున జీవితమున నెపుడు నెఱుఁగని విధమున నామనస్సు సంక్షోభించెను. గత జూను నెలలో సంభవించిన మాపిల్ల వాని మృత్యువు సంసారజీవితమును నాకు విషప్రాయముగఁ జేసి, దేవునికి నాకు నెడఁబాటు గావించెను. ఈ విషమస్థితినుండి నన్నుఁ దప్పింపఁగలది మృత్యు వొకటియె."
మఱునాఁటి (1 - 1 - 1917) దినచర్యయం దిట్లు గలదు : - "ఈసంవత్సరాదిని గత యుగాదితోఁ బోల్చితిని. మా పిల్ల వాఁడు అపుడె పొంగుపడి నెమ్మదినందెను. అపుడు నాపరిచితులగు దొరలకు సంతోషమున క్రిస్మసు బహుమతు లంపితిని. ఇపుడొ నాకనుఁగవను గాఱు చీఁకటులు గప్పియున్నవి ! జీవితఫలము నాకేమియుఁ గానరా కున్నది. మృత్యువె నాకు దు:ఖోపశాంతి గావింపఁ గలదు. లాహూరు కళాశాలోద్యోగము వలదనుట పెద్దపొఱపాటె. అచటి కేగినచో నా కీపాటికిఁ గొంత యుపశమనము గలిగియుండెడిది....నేనీమధ్య చెన్నపురి కేగి, తనకు హితవు బోధించినందుకు, నా పూర్వ శిష్యుఁడు నన్నుదూఱి, నాకు చెడుగారోపించుచున్నాఁడు ! ఇతరుల తప్పు దిద్దఁజూచువారికి ప్రతిఫల మిదియె ! తన సతిని బరిత్యజించి, పరవనిత నింటఁ జేర్చినందు కాతని కనుతాపమె లేదు !"
నా ప్రాఁతదినచర్య పుస్తకములు తిరుగవేయుచుండుటవలన విచారభారము కొంత తొలఁగిపోవుచుండెడిది. భూతకాల విషయములను దలపోయుచు, ఆ సుదినములందలి నాయాశలు, ఊహలును మననము చేసికొనుచు, వర్తమానమందలి విషాదముల నొక్కింత విస్మరించు చుండువాఁడను.
6 వ జనవరిని, ఇరుగుపొరుగులందు మృత్యుదేవత మాకుఁ బొడగట్టెను. చిరకాలమునుండి కొండ వెంకటప్పయ్యగారి యింట మిగుల నమ్మకముగనుండిన చెన్నకృష్ణమ్మయను వంటబ్రాహ్మణుఁడు, ఉత్తర హిందూదేశ మేగిన యజమానునిఁ గాంచ మిగులఁ బరితపించి, ప్రాణములు విడిచెను. మఱునాఁడే వెంకటప్పయ్యగా రిలుసేరి, ఇంతకాలమును దమకుఁ బరిచర్యలు సల్పిన సజ్జనునికిఁ దనకును తుదిచూపులు లేకపోవుటకు మిగుల విషాదమందిరి. గోవిందరాజుల శ్రీనివాసరావు గారి పెద్దకొమార్తె బాలప్రాయముననె హృద్రోగపీడితయై, వైద్యులు తన కేమియు నుపశమనము గావింపలేకపోవుటచేత, నారాయణ స్మరణము చేసికొనుచు, ప్రాణములు విడిచెను.
న్యాపతి హనుమంతరావుగారును, ఆయన యన్నయును తమ చెల్లెలిని జూచుటకై 1917 సం. జనవరి 11 వ తేదీని కాకినాడ బయలుదేఱఁగా, అచటనే యుండిన మాచెల్లెలిని జూచివచ్చుటకై నేనును వారితోఁ బయనమైతిని. మార్గమధ్యమున రాజమంద్రిలో న్యాపతి సుబ్బారావుపంతులుగారియింట మఱునాఁడు మేము నిలిచి, ఆరాత్రికి కాకినాడ చేరితిమి. మఱునాఁటి యుదయమున మాచెల్లెలిని జూచితిని. మాచిన్న చెల్లెలిని, దానిపిల్ల లను నిర్దయత్వమున మృత్యు దేవత నోట వైచుకొనిపోయినందుకు మేము విలపించితిమి. కాకినాడలో వెంకటరత్నమునాయఁడు, పెద్దంబరాజు, కొండయ్యశాస్త్రిగార్లు మున్నగు మిత్రులు, పిఠాపురము రాజాగారు జరుపుచుండెడి యనాథశరణాలయమును సందర్శించితిమి. నేను తిరిగివచ్చిన కొలఁదిదినములకే పిఠాపురవాస్తవ్యులును, సుప్రసిద్ధకవులు నగు ఉమ్రా అలేషాగారు గుంటూరను గొప్ప ప్రసంగము గావించిరి. ఆసభకు నే నధ్యక్షత వహించి, పూర్వమందు హిందూమహమ్మదీయులకు వైషమ్యము లుండినను, సోదరతుల్యులుగ నొకరి నొకరు ప్రేమించి మెలఁగవలసిన శుభసమయ మిపు డాసన్న మయ్యెనని నుడివితిని. 20 వ జనవరిని పాలపర్తి నరసింహముగారు, "బ్రాహ్మధర్మాశయముల"ను గుఱించి యుపన్యాస మిచ్చిరి. ఆ సమయమున నధ్యక్షత వహించిన నేను, హిందూ బ్రాహ్మమతములను బోల్చి, బ్రాహ్మసామాజికుల ప్రస్తుత పరిస్థితులను విమర్శించితిని. బంగాళములో బ్రాహ్మసమాజమువారు మాంసాహారవిసర్జనము చేయఁ జాలకుండి రనియు, యువకులలోఁ బలువురు నిర్మలప్రవర్తనముపట్ల నిర్లక్ష్యము వహించి రనియు, ఆంధ్రబ్రాహ్మసామాజికులును గొందఱు తమవిధులు బాగుగ గుర్తెఱుఁగకున్నా రనియును జెప్పివేసితిని. బ్రాహ్మసమాజ వార్షికోత్సవ పవిత్ర సమయమందలి నాయప్రస్తుతపుఁ బ్రసంగమునకు నరసింహముగారు నొచ్చుకొనిరి. నాకుఁ దోఁచిన నిజము పలుకుటయె ధర్మమని నే ననుకొంటిని.
"లండనునగర మనశ్శక్తి విమర్శనాసమాజము"న వెనుక నేను చిరకాలము సభ్యుఁడనుగ నుండి, వారి గ్రంథములందలి వినోదకర విషయములు గ్రహించుచుండువాఁడను. ఇపుడు నే నట్టి పుస్తక మేదైనఁ జదివి, ఆత్మోపశాంతి గాంచ నెంచి, యిటీవల లాడ్జిమహాశయుఁడు ప్రచురించిన "రెయిమండు" అను పుస్తకమును తెప్పించి చదివితిని. ఆగ్రంథకర్త కుమారుఁడు రెయిమండు గత జర్మను యుద్ధములో నాకస్మికముగఁ జనిపోయెను. కుమారుని యాత్మ తండ్రితోఁ దన వృత్తాంతము చెప్ప ననేకప్రయత్నములు చేసెనని యిటీవలఁ గనుఁగొనిరి. నే నీపుస్తకమును మిగుల వినోదమునఁ జదివి స్నేహితులకు, సోదరులకును జదువనిచ్చితిని.
ఫిబ్రవరి 17 వ తేదీని "రామమోహన ధర్మపుస్తకభాండాగారము" న "శిశుశాఖ" నేర్పఱుచుటకై బెజవాడ కేగితిని. 26 వ తేదీని మా కళాశాలలో పెద్దతరగతివారు కళాశాలాధ్యక్షునికి నుపన్యాసకులకును వీడుకోలువిందొనర్చిరి. ఆసభలో బోధకులు బోధితులు నొండొరులనుగూర్చి శ్లాఘనప్రసంగములతోఁ గాలక్షేపము చేసిరి. ఆసమయమున వినువారలతలలు వాఁచునట్టుగ విద్యార్థుల మెప్పువడసినవారము, సత్యనారాయణమూర్తియు నేనును.
ఇటీవల యూరపుఖండమేగి తిరిగివచ్చిన నాపూర్వ శిష్యుఁడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు విదేశమునందలి తమ యనుభవములను గుఱించి 4 వ మార్చిని మాయింట ముచ్చటించిరి. పెక్కులు వినోదాంశము లాతఁడు ప్రస్తావించెను.
దు:ఖోపహతులమగు మేము, వెనుకటివలెఁగాక, యీవేసవిని గుంటూరిలోనె గడుపవలెనని నిశ్చయించుకొంటిమి.
మైసూరు విశ్వవిద్యాలయములో నాంగ్లోపన్యాసకపదవి ఖాళి యయ్యెనని తెలిసి, నేను దరఖాస్తు నంపితిని. కొందఱు స్నేహితులతోఁగలసి నేనంత మద్రాసుపోయి, మైసూరు ఉద్యోగవిషయమున నాకు సాయముగలుగుటకై శ్రీయుతులు నాగేశ్వరరావుగారు భానుమూర్తిగారు మున్నగు మిత్రులద్వారా ప్రయత్నములు చేసితిని. కొన్ని సిఫారసు ఉత్తరములు గైకొని, 16 వ తేదీని నేను బెంగుళూరు పోయితిని. బసవంగుడిలో "అనాధశరణాలయము" ను నడుపుచుండు పరిచితులు వెంకటవరదయ్యంగారు నా కాతిధ్యమొసంగిరి. అచటనే వేసవిని గడపవచ్చిన కందుకూరి వీరేశలింగముపంతులుగారిని జూచి, వారివలన నొక యుత్తరము పుచ్చుకొని, 18 వ తేదీని నేను మైసూరునగరము చేరితిని. మైసూరువారు మైసూరుబోధకులకె ప్రోత్సాహము గలిగింపఁబూనిరి గాన, అచట నా కేమియు లాభము గలుగలేదు. మైసూరుకంటె బెంగుళూరె యారోగ్యప్రదముగఁ గాని పించెను. కాని, యీ సంవత్సరమున బెంగుళూరికంటె గుంటూరె చల్లగ నుండునట్లు తోఁచెను.
నేను గుంటూరు తిరిగివచ్చిన మఱునాఁడె మాచిన్నపిల్లవాని స్మారకదినము. వానినిగుఱించి తలపోయుచు మేము సంతాపజలధిని మునిఁగిపోయితిమి. నన్నోదార్చుటకై హనుమంతరావుగా రానాఁడు తమ ప్రయాణమును మానుకొనిరి. దు:ఖపరవశుఁడనగు నన్నాయన కలక్టరు కచేరిలో శిరస్తాదారగు మిత్రులు వడ్లమూడి బ్రహ్మయ్య పంతులువారియొద్దకుఁ గొనిపోయిరి. వారు నాకు హితోపదేశము చేసిరి. పిల్ల వాని జ్ఞాపకార్థముగ బీదలకు అన్న దానము చేసితిమి.
ఆ నెల 29-30 తేదీలలో రేపల్లెలో గుంటూరు మండలసభలు జరిగెను. నేను సంఘసంస్కరణసభలోఁ గొంత పాల్గొంటిని. ఆసభకు ఉన్నవ లక్ష్మీనారాయణగా రధ్యక్షులు. పూర్వము దక్షిణ హిందూదేశమున శైవమతవ్యాపనము చేసిన బసవేశ్వరునికాలము నుండియు ఆంధ్రులు సంఘసంస్కరణాభిముఖులని వీరు చెప్పిరి. మెయి 31 వ తేదీని కొండ వెంకటప్పయ్యగారు నెల్లూరిలో జరుగు ఆంధ్రరాష్ట్రీయసభలకు సకుటుంబముగ బయలుదేఱుచు, మాదంపతు లిద్దఱి నాహ్వానింపఁగా, మేమును నెల్లూరికిఁ బయనమయితిమి. 19. నివేశనస్థల సంపాదనము
నెల్లూరిలో హనుమంతరావుగారు మున్నగు మిత్రులతోఁగలసి నేను వెంకటప్పయ్యగారి విడిదిలో బసచేసితిని. వెంకటప్పయ్యగారు మహాసభకధ్యక్షులు. ఒంగోలు వెంకటరంగయ్యగారు ఆహ్వాన సంఘాధ్యక్షులు. వారియింటికిఁ జేరువనే మాబస. సభలో వెంకటప్పయ్యగారికిని ఆమంచర్ల కృష్ణారావుగారికిని అభిప్రాయభేదములు కలిగెను. కాని మూఁడవనాఁడు, అందఱును మిత్రులయిరి. సభలు జయప్రదముగ జరిగెను. సంఘసంస్కరణసభకు చిలకమర్తి లక్ష్మీనరసింహముగా రధ్యక్షులు.
ఆ జూను 10 వ తేదీని వెంకటరత్నము నాయఁడుగారు నాకొక జాబు వ్రాసిరి. ఆయన ప్రవేశపరీక్షాధిపసంఘసభ్యులు. క్రొత్తగ మూఁడుసంవత్సరములు ఆంధ్రపరీక్షాధికారిపదవి ఖాళి కాఁగా, అది నా కొసఁగుఁడని డైరక్టరుగారికిఁ దాము సిఫారసు చేసితిమని వారు వ్రాసిరి. ఎదురుచూడని యీ మేలునకు నే నానందమంది, నాయఁడుగారికి నాకృతజ్ఞతను దెలిపితిని.
ఆంధ్రపత్రికాకార్యస్థానమున మిత్రులు శ్రీ చల్లా శేషగిరిరావు గారికి సంపాదకపదవి లభించినందుకు, "గుంటూరు యువజన సాహితీ సమాజము"వారొక యభినందనసభ 15 వ తేదీని గావించిరి. శేషగిరిరావుగారు శాంతస్వభావులైనను, వలసినపట్టులం దాయన కలమునకుఁ గఱకుఁదనము గలుగుచుండుట నేనెఱుఁగుదునని పలికి, ఇట్టివారికి నుద్యోగ మిచ్చినందుకు నాగేశ్వరరావుగారి నభినందించితిని. మఱునాఁడే శేషగిరిరావుగారికి రెయిలునొద్ద మేము వీడ్కో లొసంగితిమి.