ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/గృహశంకుస్థాపనము
జరిగెను. గ్రంథాలయసభలో, గ్రంథాలయోద్యమమును గుఱించి యధ్యక్షకోపన్యాసము జదివితిని. సాంఘికసభలో స్త్రీవిద్యను గూర్చి తీర్మానమును నేను బ్రతిపాదించితిని. అచట నెలకొల్పఁబడిన "మండల సంఘ సంస్కరణ సమాజము" నకు న న్నధ్యక్షుని గను, న్యాపతి నారాయణరావుగారిని కార్యదర్శిగను నెన్ను కొనిరి.
నేను గుంటూరుచేరిన మఱునాఁడే (20 వ జూన్) మాపిల్లవాని స్మారకదినము ! అకాలమరణ మందిన యర్భకునిమృతికై నేను విలపించితిని. నాదు:ఖమునకు మేరలేకుండెను. నాఁడే మామఱఁదలు లక్ష్మమ్మ చిన్న కొమరిత చనిపోయెనను దు:ఖవార్త తెలిసెను.
ఈ సంవత్సరము వేసవియందుకూడ గోదావరీమండల సంచారము మానుకొని, మేము గుంటూరియందే నివసించితిమి. సూర్యనారాయణ ప్రథమశాస్త్రపరీక్షయందు జయమంది, ఉన్నతవిద్యకై రాజమంద్రి వెడలిపోయెను. మాబావమఱఁది వెంకటరత్న మిపుడు స్వల్పమగు నుపకారవేతనముమీఁద నుద్యోగము చాలించుకొనెను.
21. గృహశంకుస్థాపనము
పాపము బంగారయ్య తనవిద్యనుగుఱించి చేసిన చిల్లరయప్పు లింకను తీఱనెలేదు ! గుంటూరిలో వెంకటప్పయ్యగారికిని, మఱికొందఱికి నాతఁడు కొంత బాకీపడియుండెను. అతని బావమఱఁది నాకుఁ గొంత సొమ్మంపఁగా, ఋణదాతలతో నేను మాటాడి, వారిబాకీసొమ్ము తగ్గించి పుచ్చుకొనునటు లొడఁబఱిచితిని. అల్పజ్ఞులకు మర్త్యుల మనోరథములిట్లె సఫలమగుచుండును ! ఆగష్టునెల మధ్య ప్రత్యేకాంధ్ర రాష్ట్రీయసభలు గుంటూరు పురమున జరిగెను. ఉత్సాహపూరితుఁడనై కొన్నిసభలకు నేను బోయితిని. ఆదినములందు గుంటూరునందు విషజ్వరములు ప్రకోపించి యుండెను. 22 వ తేదీని నేనును మఱునాఁడు భార్యయు, పిమ్మట నరసింహ రామచంద్రులును, జ్వరపీడితుల మైతిమి. ఇంట మేము నలుగురమును మంచ మెక్కి యుండునప్పుడు, పేదయవ్వ యొకతె వంట చేసిపెట్టి, మాకు సాయముచేసెను. 25 వ తేదీని మాతమ్ముఁడు వెంకటరామయ్య గుంటూరు వచ్చి మమ్ముఁ జూచి పోయెను.
సెప్టెంబరు 8 వ తేదీని జరిగిన మాయత్తగారి సాంవత్సరిఁక సందర్భమున వెలిచేరులో బంధువులు సమావేశమైరి. నేను నచటికి బోయితిని. ఆసమయమున మామఱఁదలు చామాలమ్మయు, ఆమె యిద్దఱు కూఁతులును విషజ్వరమునకు లోనయిరి, మాబావమఱఁది వెంకటరత్న మిపుడు కడియము ఠాణాదారుగ నుండెను. ఒక డింగీ కుదిర్చి, అతనికుటుంబమును సామానులను మేము వెంటఁగొని, 12 వ తేదీని కడియము చేరితిమి. 14 వ తేదీని నేను వెంకటరత్నమును రాజమంద్రివెళ్లి, ఆనందాశ్రమమున వీరేశలింగము గారి దర్శనముఁ జేసితిమి. ఆయన యారోగ్యవంతులుగనే యుండిరి. మఱునాఁడు నేను గుంటూరు వచ్చితిని.
అక్టోబరు మొదటిభాగమున, ఇరుగుపొరుగున నుండు స్నేహితులకుఁ గష్టములు సంభవించెను. ఉన్నవ లక్ష్మీనారాయణగారి భార్య లక్ష్మీబాయమ్మగారికి మూర్ఛలు వచ్చుచుండెను. వైద్యులు రాఘావాచార్యులుగారిని బిలిపించితిమి. కొలఁది కాలమున కామెకు నెమ్మది గలిగెను. సత్తిరాజు కామేశ్వరరావుగారి భార్యయు శాయన్న పంతులుగారి రెండవ కొమార్తెయును జనిపోయిరని తెలిసి మిగుల విచారము నొందితిమి.
బ్రాడీపేటస్థలమున నేను జిన్న యిల్లు కట్టుట యుక్తమని నాకిప్పటికి నచ్చెను. అక్టోబరు 15 వ తేదీని వెంకటప్పయ్యగారు మా నూతనగృహస్వరూపము కాకితమున గీచినాకుఁ జూపించిరి. మఱునాఁడె మాయింటికి శంకుస్థాపనము జరిగెను. ఇంటికిఁ గావలసిన రాలుతెప్పించుటకును, బావి త్రవ్వించుటకును నే నంత ప్రయత్నములు చేసితిని. ఇంతలో విషజ్వరములు మఱింత ప్రబలుటచేత గుంటూరుకళాశాల పదిదినములు మూసివేయఁబడెను. తననగలు కొన్ని యమ్మివేసి, భార్య నాచేతికి వేయురూపాయి లిచ్చుటచేత, ప్రస్తుతమున వంటయిల్లు ప్రహారి గోడయును గట్టుటకు నేను బూనుకొంటిని.
నవంబరు ప్రారంభదినములలో గుంటూరుపురమున దివ్యజ్ఞాన సమాజసభలుజరిగెను. ఎంతో శ్రమపడి న్యాపతి హనుమంతరావుగారు కట్టించిన దివ్యజ్ఞానసమాజభవనమునకు అనిబిసంటమ్మగారు ప్రవేశ మహోత్సవము సలిపిరి. ఆసందర్భమున నిచ్చిన యుపన్యాసములను బట్టి యానారీమణి శక్తిస్వరూపిణివలెఁ గానవచ్చెను.
టర్కీ ఆస్ట్రియాదేశములు మిత్రమండలిచేఁ బరాజిత మయ్యె నని 5 వ తేదీని వార్తతెలిసెను.
ఈ సంవత్సరమున రాజమంద్రిలో నైనను మంచిటేఁకు చౌకగ దొరకదని మిత్రులు చెప్పిరి. కావున ప్రస్తుత మొక వంట యిల్లే యేర్పఱచుట మంచిదని నాకుఁ దోఁచెను. ఇపుడు బావి త్రవ్వుపని ప్రారంభమయ్యెను. రాలు మొదలగు పరికరములు వచ్చుచుండెను. ఈసమయమున మాస్థలమునకుఁ జేరువుననె నివసించుట యుక్తమని తోఁచి, నవంబరు 27 వ తేదీని మేము అరండలుపేట వదలి, బ్రాడీపేటలోని గడియారమువారియింటఁ బ్రవేశించితిమి.
గత సంవత్సరమునవలెనే యీ యేటఁగూడ గుంటూరిలో బొబ్బలరోగము వ్యాపించెను. ప్రాఁతగుంటూరు, అగ్రహారము, అరండలుపేటలలో క్రమక్రమమున నీవ్యాధి యల్లుకొనియెను. కావున మేము స్థలము మార్చుట శ్రేయస్కర మయ్యెను. 6 వ తేదీని ప్రహరీగోడ పునాదు లారంభించితిమి. అపుడె మా బావమఱఁది పంపిన యంటుమామిడి మొలకలు పెరటిలో పాతించితిమి.
బ్రాహ్మమతప్రచారముకొఱకై గుంటూరి కేతెంచినమిత్రులు పాలావజ్ఘల లక్ష్మీనారాయణగారు, నాబాల్యస్నేహితుఁడగు కొండయ్యశాస్త్రి మూఁడునెలలక్రింద చనిపోయెనను వార్త చెప్పి నా కమిత విషాదమును గలిపించిరి. పిఠాపురము దివానుగారగు మొక్కపాటి సుబ్బారాయఁడుగారు దివంగతులయిరని 25 వ తేదీని నాకుఁ దెలిసెను. నాకు వీరితో నంతగఁ బరిచయము లేకుండినను, వీరు ఉదారస్వభావులనిమాత్రము తెలియును. చిలుకూరి వీరభద్రరావు గారి "ఆంధ్రులచరిత్ర" ప్రకటనమునకు సహాయము చేయుఁడని నేను గోరఁగా, వెనువెంటనే యొక నూఱురూపాయిలు వీరు వీరభద్రరావుగారి కంపిరి. ఆకాలముననే వీరభద్రరావుగారిని బెజవాడయందలి యొక లక్షాధికారియొద్దకు నేను గొనిపోఁగా ఒకరూకయైనను ఆయన వలన లభింపదయ్యెను ! కొలఁదికాలములోనె యాలక్షాధికారి మృతి నందెను. ఆయన ధనరాసులు భస్మహవ్యము లయిపోయెను ! ఆహా ! తమ యసువులు నైశ్వర్యములును ప్రపంచమున స్థిరసంస్థలని మురిసి మనుజు లెట్లు మోసపోవుచున్నారు ! 22. గృహప్రవేశము
1919 వ సంవత్సరమందలి తొలినెలలలో నాచేతులకుఁ బని పూర్తిగఁ దగిలియుండెను. కళాశాలలో విద్యబోధించు రెండుమూఁడు గంటలు తప్ప, దినమంతయు నింటిపనిచేయు వడ్రంగులు, బేలుదార్లు మున్నగు వారలతోఁ బ్రొద్దుపుచ్చుచుండువాఁడను. మార్చి మధ్యభాగమున మాగృహప్రవేశము జరిగెను. ఆ సమయమున సోదరీసోదరులు మఱఁదండ్రు, పిల్లలు మున్నగు బంధుజనులు వచ్చి, మా కానందము గలిగించిరి. ఆ సందర్భమున పురమందలి స్నేహితులకు విం దొనర్చితిమి. నూతనగృహము చొచ్చిన మాకు నూతనలోకవిలోకనము చేయునటు లయ్యెను !
అంత కొంతకాలమువఱకును నా సంపాదించిన ద్రవ్యము గృహనిర్మాణమునకె వినియోగ మగుచుండెను. అప్పుమాత్రము చేయక, కుటుంబపోషణమునకు వలసినసొమ్ము పోఁగా మిగిలిన యాదాయ మంతయు నింటికట్టునకె వ్యయము చేయుచుంటిని. కళాశాలాధ్యక్షుఁడగు రూప్లేదొరగారు గంభీరస్వభావుఁడు. మిత భాషియు నయ్యును, దయార్ద్రహృదయుఁడగు సరసుఁడు. వలసినపుడు నా కాయన కొంచెముసొమ్ము ముందుగ నిచ్చుచుండువాఁడు. కావున నే నప్పుల మునుఁగక, ఆదాయమునకు మించని వ్యయమె చేయుచు, మెలఁకువతో గృహనిర్మాణకార్యము సాగించితిని.
19 వ సంవత్సరమందలి నా ప్రవేశపరీక్షాపత్రము వెనుకటి సంవత్సరపుఁ బ్రశ్నపత్రమువలెనె యుండెను. విద్యార్థుల తెలివితేటలు, పరిశ్రమాదులు నద్దానివలన బాగుగఁ బరిశోధింపఁ