Jump to content

ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/గృహప్రవేశము

వికీసోర్స్ నుండి

22. గృహప్రవేశము

1919 వ సంవత్సరమందలి తొలినెలలలో నాచేతులకుఁ బని పూర్తిగఁ దగిలియుండెను. కళాశాలలో విద్యబోధించు రెండుమూఁడు గంటలు తప్ప, దినమంతయు నింటిపనిచేయు వడ్రంగులు, బేలుదార్లు మున్నగు వారలతోఁ బ్రొద్దుపుచ్చుచుండువాఁడను. మార్చి మధ్యభాగమున మాగృహప్రవేశము జరిగెను. ఆ సమయమున సోదరీసోదరులు మఱఁదండ్రు, పిల్లలు మున్నగు బంధుజనులు వచ్చి, మా కానందము గలిగించిరి. ఆ సందర్భమున పురమందలి స్నేహితులకు విం దొనర్చితిమి. నూతనగృహము చొచ్చిన మాకు నూతనలోకవిలోకనము చేయునటు లయ్యెను !

అంత కొంతకాలమువఱకును నా సంపాదించిన ద్రవ్యము గృహనిర్మాణమునకె వినియోగ మగుచుండెను. అప్పుమాత్రము చేయక, కుటుంబపోషణమునకు వలసినసొమ్ము పోఁగా మిగిలిన యాదాయ మంతయు నింటికట్టునకె వ్యయము చేయుచుంటిని. కళాశాలాధ్యక్షుఁడగు రూప్లేదొరగారు గంభీరస్వభావుఁడు. మిత భాషియు నయ్యును, దయార్ద్రహృదయుఁడగు సరసుఁడు. వలసినపుడు నా కాయన కొంచెముసొమ్ము ముందుగ నిచ్చుచుండువాఁడు. కావున నే నప్పుల మునుఁగక, ఆదాయమునకు మించని వ్యయమె చేయుచు, మెలఁకువతో గృహనిర్మాణకార్యము సాగించితిని.

19 వ సంవత్సరమందలి నా ప్రవేశపరీక్షాపత్రము వెనుకటి సంవత్సరపుఁ బ్రశ్నపత్రమువలెనె యుండెను. విద్యార్థుల తెలివితేటలు, పరిశ్రమాదులు నద్దానివలన బాగుగఁ బరిశోధింపఁ బడుచుండెనని లోకు లనుచుండిరి. ఈ పరీక్షవలన సంవత్సరమున కే నూఱురూపాయిలు నాకు వచ్చుచుండెను. గృహనిర్మాణమున కీ సొమ్మెంతో సహాయకారి యయ్యెను.

ఈ సంవత్సరమందలి వేసవియు మేము గుంటూరనే కడపితిమి. ఈమాఱు మండలసభలు దాచేపల్లిలో జరిగెను. రాజకీయ సభకు శ్రీచల్లా శేషగిరిరావుగా రధ్యక్షులు. స్థాయి సంఘమునకు నధ్యక్షుఁడనగు నేను సంఘసంస్కరణసభలో పాల్గొంటిని. దాచేపల్లిలోని నాగులేఱు, నాపరాలు, తమలపాకుఁదోఁటలును దర్శనీయములుగ నుండెను. భావికాలపు చిత్రకథారచనమున కీప్రదేశమును రంగస్థలముఁ జేయ సంకల్పించుకొంటిని.

గృహప్రవేశసమయమునకు మా మామగారు గుంటూరు రాలేదు. అప్పు డాయన కడియములో వ్యాధిగ్రస్తులయి యుండిరి. ఒకటి రెండు మాసములలోనె యాయన పరలోకప్రాప్తిఁ జెందిరి. పరీక్షల తొందరలో నుండినను నే నాయనను తుది దినములలోఁ జూడఁబోయితిని. నారాక కాయన మిక్కిలి సంతోషించి, నాసోదరుని పుత్రు నొకనిని నన్ను దత్తుచేసికొను మనియు, తనకుమారునితో వియ్య మందు మనియు నాకు హితబోధనముఁ జేసిరి. ఆదినములలోనె నాకళాశాలామిత్రులు పువ్వాడ వెంకటరెడ్డిగారును చనిపోయిరి.

శ్రీకొండ వెంకటప్పయ్యగారు చెన్నపురి శాసానిర్మాణసభ కభ్యర్థులుగ నిలువ నుద్దేశించి, వోటర్లను దర్శించుటకై గోదావరిజిల్లా కేగుచు, నన్ను, దమతో రమ్మనిరి. కావున నే నావేసవి సెలవులలో వారితో కాకినాడ, రామచంద్రపురము, అమలాపురము తాలూకాలు సంచారము చేసితిని. అమలాపురమున నుండఁగా ఆయనకు జబ్బుచేసెను. కొంతనెమ్మది పడినపిదప, నే నాయనను విడిచి, అమలాపురము రాజమంద్రి తాలూకాలలో కొన్నిగ్రామములు పోయి, పంతులుగారినిమిత్తమై కృషి సలిపి, గుంటూరు తిరిగివచ్చితిని. వెంకటప్పయ్యగా రంతట చట్టనిర్మాణసభ్యులుగ నెన్ను కొనఁబడిరి.

గృహప్రవేశ మైతి మనుమాటయె కాని, మా ప్రహారిగోడయు, నింటికిటికీల తలుపులు మున్నగునవి యెన్నో యింకను పూర్తి కాలేదు. అందువలన పిమ్మట కొన్ని నెలలవఱకు నింటిపనినుండి మాకు విరామము కలుగదయ్యెను.

1919 మెయి 27 వ తేదీని ఆంధ్రదేశ నాయకమణి యగు కందుకూరి వీరేశలింగముపంతులుగారు మద్రాసునఁ గాల ధర్మనొందిరి. వారి గౌరావార్థమై గుంటూరిలో నంతట జరిగిన సభలలో నేను బాల్గొని, దేశోద్ధరణమునకై పంతులుగారు చేసిన కార్యముల నుగ్గడించితిని. "హితకారిణీసమాజము" వారు జులై నెలలో రాజమంద్రిలో పంతులుగారి గౌరవార్ధమై జరిపినసమావేశములకు నేను బోయితిని. ఆమహామహుఁడు తలపెట్టిన సత్కార్యములు కొనసాగించుటయె యాయన నుచితరీతిని గౌరవించుట యని నేను జెప్పితిని.

ఆగష్టునెలలో బెజవాడలో జరిగిన "సహకార సంఘ" సభలకు నేను బోయియుండునపుడు, "హిందూదేశసేవక" సమాజ సభ్యులగు శ్రీవెంకటసుబ్బయ్యగారు నాకుఁ బరిచితులయిరి. వారి యొక్కయు, వెంకటప్పయ్యగారియొక్కయు కోరిక ననుసరించి నేను వీరేశలింగముపంతులుగారినిగూర్చి యొక యాంగ్లవ్యాసము వ్రాసి, పైసమాజమువారి "హిందూదేశసేవికా" పత్రికలోఁ బ్రచురించితిని. నావ్యాసము ఆపత్రిక ఆగష్టు 28 వ తేదీ పత్రికయందును, మఱుసటి వారపత్రికయందును బ్రకటింపఁబడెను.

నా యాంగ్లవ్యాసమునందలి ముఖ్యాంశము లిందుఁ బొందుపఱుచుచున్నాఁడను : - "ఆధునికాంధ్రజనులలో నగ్రస్థాన మలంకరించి, ఆర్ధశతాబ్దకాలము దేశసేవ లొనరించి ధన్యులైన పంతులుగారు మేధావంతులు, కార్యశూరులు, సాహిత్య విశారదులు, సంఘ సంస్కార వేత్తలును. వితంతువివాహ సంస్కరణమును ఆంధ్రావనిని ప్రప్రధమున నెలకొల్పిన ధైర్యశాలులు. తన కెన్ని కష్టము లాపాదిల్లినను పట్టినప్రతిన విడువక, ఆంధ్రజనుల హృదయ సీమల యందు సంస్కరణాభిమానబీజముల నాఁటిన మహనీయులు. నవీనాంధ్రవాఙ్మయమున కీతఁడు సృష్టికర్త. సాంఘికవిషయములం దీతఁడు సాధింపని సంస్కరణవిశేషము లేనెలేదు. ఆంధ్రదేశ మాతకు వీరిరచనములు, వీరి సౌశీల్యసచ్చారిత్రములును నెనలేని భూషణములు."

గుంటూరు ప్రార్థనసమాజమున కని నేను కొనిన వెనుకటి స్థలమున కంటియున్న స్థలము నొక దానిని డిశెంబరులో కొంటిని. ఇట్లు నేను ఒకవేయిరూపాయిలు కర్చు పెట్టితిని. దీనికై మిత్రులు కొందఱు చందాలిచ్చిరి. కాని, యామొత్తములు మిగుల స్వల్పమగుటచేత, అంత వ్యయమును నేనె వహింపఁబూని, ఎవరిచ్చినసొమ్ము వారి కిచ్చివేసితిని.

మా నూతనగృహమునఁ జేరియుండు విశాలమగు పెరటిలో నీసంవత్సరమున వివిధజాతుల దోసకాయలు కాచినవి. అవి మే మను బడెను. గుంటూరు కళాశాలలో నే నిచ్చవచ్చినంతకాలము నిలువ వచ్చును. నాజీతముకూడ ప్రోత్సాహకరముగనే యుండెను. కాని, యీక్రైస్తవ విద్యాలయమున నాబోటి హిందువున కెన్నఁడు నధ్యక్షకపదవి సమకూరుట యసంభవము. అందువలననె కదా నేను గొంతకాలముక్రిందట సేలము కళాశాలాధ్యపదవికై ప్రయత్నించితిని. మున్నూఱు మొదలు నన్నూఱు రూపాయిలవఱకును జీతముగల యీ నెల్లూరు కళాశాలాధ్యక్షకోద్యోగమునకుఁ బ్రయత్నింపవలె నని నాకుఁదోఁచెను. నా కిదివఱకు విద్యాలయములందును, కళాశాలలలోనుగల పెక్కేండ్లయనుభవమునుబట్టి నా కీనూతనపదవి లభింపఁగలదని మిత్రులు ప్రోత్సహించిరి. నాదరఖాస్తును స్ట్రాకుదొరగారి సిఫారసుతో నంపివేసితిని. నెల్లూరు విద్యాలయ పాలక వర్గసభ్యులకు మిత్రులచే నన్ను గుఱించి యుత్తరములు వ్రాయించితిని. మిత్రులు నూతనబంధువులునగు శ్రీపోడూరి వెంకయ్యగా రీసమయమున నెల్లూరు జిల్లాకోర్టులో నుద్యోగిగ నుండిరి. నన్నుగుఱించి నెల్లూరు ప్రముఖులకు ఆయన గట్టిసిఫారసుచేసిరి. అంతట, నెల్లూరు వాస్తవ్యులును, విజయనగర కళాశాలలో నుపన్యాసకులు నగు శ్రీమామిడిపూడి వెంకటరంగయ్యగారి కాయుద్యోగమీయఁబడెను. కాని, తమకీ యుద్యోగ మక్కఱలేదని వెంకటరంగయ్యగారు చెప్పివేయుటచేత, ఆపని మరల ఖాళియయ్యెను. ఈమాఱు నేను గట్టి ప్రయత్నము చేసితిని. ఆ యేప్రిలు నెలలో ప్రవేశపరీక్షాధికారుల సభకు నేను మద్రాసు పోయివచ్చుచు నొకదినము నెల్లూరిలో నిలిచి, ఆకళాశాలా పాలకవర్గ సభ్యుల దర్శనము చేసివచ్చితిని. ఈ మాఱు ఆసభవారి కను లిద్దఱిమీఁద బడినట్లు నాకుఁ దెలియవచ్చెను. ఇదివఱ కాపాఠశాలలో ప్రథమోపాధ్యాయలుగ నుండు సంతానరామయ్యంగారికిఁ గాని, నాకుఁగాని యీయుద్యోగము లభింపవచ్చునని తెలిసెను. నా పూర్వసహపాఠియగు నయ్యంగారు అనుభవశాలులగు ప్రతిభావంతులె కాని, యాయన యమ్. యె. పరీక్ష నీయకుండుటయు, కళాశాలలోఁ దగినంత నవీనానుభవము లేకుండుటయు వారొలోపములుగ నెన్నఁబడియెను. వీరియందుఁ గొందఱు సభ్యులకు సదభిప్రాయము లేదనికూడఁ దెలిసెను. ఐనను, నెల్లూరిలో నిల్లు కట్టి చిరకాల మచటనె నివసించిన యయ్యంగారికె యీ యుద్యోగము కావచ్చునని నే ననుకొంటిని.

ఇంతలో వేసవిసెలవులకు మేము భీమవరము వెడలిపోయితిమి. మాతమ్ముఁడు వెంకటరామయ్య కొమార్తె సీతమ్మ కపుడు వివాహము జరిగెను. ఏలూరునివాసియు, పట్టపరీక్షలో జయమందిన యువకుఁడునగు బొమ్మిరెడ్డిపల్లి రాజగోపాలరావు వరుఁడు. నెల్లూరి యుద్యోగము నాకు లభించెనని పెండ్లిమూఁడవనాఁడు నాకు తంతి వచ్చెను. ఈ సంతోషవార్త వివాహసందర్భమందలి మాయానందము నినుమడింపఁజేసెను. పెండ్లి ముగిసినవెంటనే మేము గుంటూరు తిరిగి వచ్చితిమి. స్థిరమగు గుంటూరి కళాశాలలో నున్నతపదవి నంద, యిటీవలనే యిట స్థిరనివాస మేర్పఱుచుకొనిన నేను, అంత సుస్థిరము కాని నూతనోద్యోగమున కంజవేయుట యసమంజస మేమో యని సందియ మందితిని. కనీసము కొన్నివత్సరములైన నాకీనెల్లూరియందలి నూతనోద్యోగము స్థిరమని వాగ్దానము వడయుఁడని మిత్రులు కొందఱనిరి. కాని, యిట్టి నూతనసంస్థల స్థిరత్వమును గూర్చి యెవరు బాధ్యత వహింతురు? స్వయంకృషిమీఁదను, కరుణానిధియగు దేవదేవుని యనుగ్రహముమీఁదను భారము వైచి, నేనీ నూతనోద్యోగస్వీకారము చేసితిని. జూను నెలారంభముననె నెల్లూరు రమ్మని యాకళాశాలకార్యదర్శి నన్నుఁ గోరిరి. గుంటూరి కళాశాలాధ్యక్షులు నాకోరికమీఁద సెలవులలోనె సంతోషపూర్వకముగ నాకు వీడుకో లొసంగిరి. అంత 30 వ మేయి తేదీని నేను గుంటూరునుండి బయలుదేఱితిని.

1920 సం. జూను మొదటి తేదీని నేను నా నెల్లూరి యుద్యోగమునఁ బ్రవేశించితిని. ఈజూను నెలలోనె కళాశాల నెలకొల్పుటకు వలయుపను లెన్నియో నేను చేయింపవలసివచ్చెను. కావున కళాశాలకు సమీపముననుండు నొక గృహమును బుచ్చుకొని మరల గుంటూరు వెళ్లి, వస్తువులు సరదుకొని, ధర్మగృహనిర్మాణకార్యము పాలపర్తి నరసింహముగారి కొప్పగించి, 9 వ జూనున సకుటుంబముగ నెల్లూరికిఁ బయనమైతిని. మేము నెల్లూరిలో బసచేసిన యిల్లు దండువారి వీధిలోని మహదేవమొదలియారుగారి మేడ. ఆయనయు, వారిభార్య ఉన్నామలమ్మగారును సజ్జనులె, సాత్త్విక స్వభావులును. నెల్లూరిలో నివసించినంతకాలమును మేము వారి యింటనే విడిసియుంటిమి. ఆయిల్లు చిరకాలముక్రిందటఁ గట్టఁబడినను, బలిష్ఠముగను 'నాళ్ల' నడుమను నుండుటచేత, చోరభయ మెఱుఁగక, మే మందు శాంతచిత్తమునఁ గాలము గడపితిమి.

కళాశాలకుఁ గావలసిన సామానులన్నియు నేనిపుడు చేయించితిని. పుస్తకములు సమకూర్చితిని. భాండాగారమునకు కొనిన పుస్తకములు బీరువాలలో సరదించితిని. రాజాగారి పాఠశాలాభవనమున దక్షిణమువైపున నున్న మేడలో కళాశాలతరగతులు కూర్చుండుట కిర వేర్పఱిచితిమి.

జులై 2 వ తేదీని శ్రీవెంకటగిరి మహారాజాగారు కళాశాల తరగతికి ప్రారంభోత్సవము జరిపిరి. రాజాగారి పాఠశాలలో ప్రథమోపాధ్యాయులగు సంతానరామయ్యంగారు తమకుఁ గళాశాలధ్యక్షపదవి చేకూరకుండుట కాగ్రహించి, వేసవిసెలవులలోఁ దమపదవికి రాజీనామా నిచ్చిరి. నే నీ కళాశాల ప్రవేశించినతోడనె నా పూర్వమిత్రులు, ననుభవశాలులునగు నయ్యంగా రిటు లావిద్యాశాలను విడనాడుట నాకు బొత్తిగ నిష్టములేదు. తమ రాజీనామాను ఉపసంహరింపుఁడని అయ్యంగారికి నేను హితోపదేశము చేసితిని. కళాశాలాపరిపాలక వర్గములో నధ్యక్షునికివలెనే తనకును స్థాన మిచ్చి, పాఠశాలశాఖాపరిపాలనమునఁ దనకు సర్వాధికార మొసఁగినచో, తాను పాఠశాలను విడువనని యయ్యంగా రంత చెప్పిరి. నాయోజనమీఁద వారికోరికను పాలకవర్గమువారు మన్నించిరి. కావున సంతానరామయ్యంగారు పాఠశాలలోనే యుండిరి.

1920 జులై నెల యారంభమునుండియు కళాశాల తరగతిలోనిపని సక్రమముగ జరుగుచువచ్చెను. ఆ సంవత్సరము నందు పదునెనమండ్రు విద్యార్థులుండిరి. ప్రకృతిశాస్త్రముబోధింప మేము పూనుకొనలేదు. కావున, విద్యార్థు లందఱును మూఁడవ శాఖలోనే చేరి చదివిరి. కళాశాల కిపుడు నాతో నలుగురె యుపన్యాసకులు. కాజ శివరామకృష్ణారావుగారు చరిత్రయు, రాఘవన్ గారు తర్కమును, దుర్భా సుబ్రహ్మణ్యశర్మగారు తెలుఁగును, నేను ఆంగ్లమును బోధించుచుంటిమి. మొదటి సంవత్సరమున నంతగఁ బని లేకుండుటచేత, ఇంగ్లీషున నాకు శివరాకృష్ణారావుగారు సాయము చేయుచువచ్చిరి.

నాతమ్ముఁడు వెంకటరామయ్యపెద్దకుమారుఁడు నరసింహమూర్తి నెల్లూరు వచ్చి మావిద్యాశాలలో ప్రవేశపరీక్షతరగతిలోఁ జేరి చదివెను. నాబావమఱఁది వెంకటరత్నముకొడుకులు నరసింహము బుచ్చిరామయ్యలు చిన్నతరగతులలోఁ జేరిరి.

ఇదివఱకు దొరతనమువారి కొలువులో తెలుఁగు ట్రాన్సులేటరుపదవిలో నుండిన మిత్రుఁడు గోటేటి కనకరాజు కొంత కాలముక్రిందట పక్షవాతరోగమునకు లో నై, పని పోఁగొట్టుకొని, స్వస్థలమగు పాలకొల్లు చేరెను. తాను వెతలఁ బెట్టిన రెండవసతియె యిపు డాతనికి గతియయ్యెను ! కాలవైపరీత్య మిటు లుండును. ఈతనికి నే నప్పుడప్పుడు కొంచెముగ సొమ్మంపుచు సాయము చేయుచుండు వాఁడను.

24. నెల్లూరునివాసము : రెండవవత్సరము

నేను గుంటూరు కళాశాలయం దుండిన చివర యైదేండ్లును, నెలనెలయు నాజీతములో రూపాయి కొక యణావంతున కళాశాల 'సహాయనిధి' లో నిలువచేసికొని యుండువాఁడను ఇటు లైదుసంవత్సరములు సొమ్ము పెరిఁగిన హేతువున, 19-20 వ సంవత్సరము జులై నెలలో నేనచటి యుద్యోగమును విరమించిన సమయమున వడ్డీతోఁ గలసిన నా సొమ్ము మొత్త మంత మొత్తమును కళాశాలాధికారులు తామును జేర్చి, 1730 రూపాయిలు నా కపు డొసంగిరి.

1920 వ సంవత్సరము తుదిభాగమున నాకు నెల్లూరుకళాశాలలోని యొక యుపాధ్యాయునితోఁ గొంత సంఘర్షణము గలిగెను. అనుభవశాలియైనను, ఆయన యుచితజ్ఞత గలిగి మెలఁగ నేర్చినవాఁడు కాఁడు. సమయపాలనవిషయమై యశ్రద్ధ వహించి యుండెడివాఁడు. దీనిని గుఱించి పలుమాఱు నేనాయనను హెచ్చ