Jump to content

ఆంధ్ర శ్రీవిష్ణుపురాణము/సప్తమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీవిష్ణుపురాణము

సప్తమాశ్వాసము


రావూరిపురాధిప
వారాశిగభీర వంశవర్ధన బసవ
క్ష్మారమణపుత్ర సంప
త్ప్రా రంభకళాదిలీప రాఘవభూపా.[1]

1


వ.

సకలపురాణవిద్యాధురంధరుం డైన పరాశరుం డామైత్రేయున కిట్లనియె నట్లు రాజ
వంశంబులపరిపాటి నేర్పరించి చెప్పితి నింక నెయ్యిది విన నిష్టం బనిన నతం డిట్లనియె.[2]

2


క.

యాదవవంశంబున దా, మోదరుఁ డగుకృష్ణుఁ డతిసముజ్జ్వలమహిమన్
ప్రాదుర్భవించి బాల్యం, బాదిగ నేమేమి సేసె నది వినవలయున్.[3]

3


వ.

అని శ్రీకృష్ణకథాశ్రవణకుతూహలుండయి యడిగిన మైత్రేయునకుఁ బరాశరుం
డిట్లనియె.

4


క.

దేవసమానుండగువసు, దేవుఁడు దేవకునికూఁతు దేవకి నవనీ
దేవినిభఁ బెండ్లియాడి మ, హావిభవము దొంగలింప నాలుం దానున్.[4]

5

శ్రీకృష్ణావతారకథాప్రస్తావము

ఆ.

అరద మెక్కి సూతుఁడై కంసుఁ డేతేరఁ, దగినవారుఁ దానుఁ దనపురమున
కరుగుదేర నడుమ నందఱు వెఱఁగంద, గగనవాణి పలికెఁ గంసుతోడ.[5]

6


క.

ఇమ్మగువయెనిమిదవగ, ర్భమున నుదయించునట్టిబాలుఁడు నీ ప్రా
ణమ్ములు రాజ్యము గొనియెడు, సుమ్మీ యనిపలికె మనసు చుఱ్ఱుమనంగన్.

7


ఉ.

అవ్వచనంబు చిత్తమున నారటపా టొదవింప నెంతయున్
నివ్వెఱఁ గంది యొం డుపమ నేరక యారకయుండి యింతలో

నువ్వునఁ జేవ గైకొని సహోదరిపాడి దొఱంగి చెల్లెలిన్
మవ్వపుముద్దరాలి నభిమానవతిన్ వధియించుతెంపుతోన్.[6]

8


ఉ.

అందఱుఁ జూచి యింతదుడుకా యని దూఱఁగఁ గ్రొమ్మెఱుంగు లం
దంద చెలంగుభీకరకరాసి వెసన్ జళిపించి దేవకిన్
ముందలపట్టి వంచి తెగమొత్తఁ గడంగినఁ గంసుఁ గేలితో
డం దగులంగఁ బట్టుకొని డాసి కడున్ వసుదేవుఁ డిట్లనున్.[7]

9


క.

ఓహో యీసేఁత మహా, ద్రోహము నీవంటిమేటిదొర చుట్టఱికం
బూహింపక చెలియలిపై, స్నేహము చెడి యిట్లు నఱకఁ జేయెత్తునొకో.[8]

10


ఉ.

ఈయవివేకపుంబనుల కెట్లు దొడంగితి గొప్ప దింతయ
న్యాయము గాలిపోయెడుదురాగతముల్ విని పాపబుద్ధి న
య్యో యిటువంటిముద్దులసహోదరి ముందలపట్టి యీడ్చి గో
గో యని కూయఁగాఁ గుతిక కోసిన లోకమువారు తిట్టరే.[9]

11


ఆ.

నిన్న పెండ్లి చేసి నేడిదె చెలియలి, నత్తవారియింటి కనుపుచుండి
తప్పులేనితప్పు తలగోసి చంపిన, నెంతరట్టు పుట్టు నెఱిఁగికొనుము.[10]

12


ఆ.

ఇప్పు డాకసమునఁ జెప్పినయశరీరి, పలుకువలన నీకు భయము మిగులఁ
గలిగెనేని దీనికన్నబిడ్డలనెల్లఁ, బుట్టినపుడె నీకుఁ బట్టి యిత్తు.

13


తే.

పురిటిలోననవారిఁ జంపుదువు గాని, దీనిప్రాణంబులకు నేడు తెగకు పంచ
భూతములసాక్షిగా నేను బొంక నిట్టు, లైన నపకీర్తి కొంత నీ కణఁగిపోవు.[11]

14


క.

అని పలికిన నాతఁడు తన, మనసు దిరిగి మగుడఁ దెచ్చి మఱఁదిఁ జెలియలిన్
దనవీటఁ దుష్టిఁ గావలి, నునిచి పరామరిక సేయుచుండె మునీంద్రా.[12]

15

భూదేవి ప్రజాభారపీడితయై తనమనఃక్లేశమును బ్రహ్మకుఁ దెలుపుట

క.

అంత నొకనాడు ధరణీ, కాంత ప్రజాభారపీడఁ గ్రాఁగి బడలి య
త్యంతవిషాదపరీత, స్వాంత యగుచు వదనపంకజము కడువాడన్.[13]

16


క.

ఆదిత్యయక్షగంధ, ర్వాదులు చనుదేరఁ గూడి యటఁ జని కాంచెన్
బ్రాదుర్భూతవివేక, ఛ్ఛేదీకృతహృదయకలుషజిహ్మన్ బ్రహ్మన్.[14]

17

వ.

ఇట్లు కనుంగొని వినయావనతవదనయై తనకునైన ప్రజాభారపరిపీడవలనఁ గలి
గినబడలిక యెఱింగించి నాకునయిన యిమ్మహాభారం బపయింపకుండిన నిర్వ
హింపనోపనని కంసశిశుపాలజరాసంధదుర్యోధనబాణాసురనరకధేనుకారిష్ట
ప్రలంబశంబరకేశిప్రముఖు లనువారి వారిబంధుమిత్రపుత్రభ్రాతృసుహృత్ప్ర
ధానవర్గంబులను వేఱువేఱం బేర్కొని వీరివలనిభారంబు మానుటకు నుపా
యంబు సేయుమనిన.[15]

18


ఉ.

నీరజసంభవుండు ధరణీసతిఁ గన్గొని నీకు నైనయీ
భూరిభరంబు మాన్ప ననుబోఁటి కశక్యము భక్తలోకర
క్షారతుఁడున్ జగంబులకుఁ గారణభూతుఁడునై వెలుంగు ల
క్ష్మీరమణుండు నేర్చు నెఱిఁగింపుద మివ్విధ మమ్మహాత్ముతోన్.[16]

19


వ.

అని యాప్రొద్దె కదలి.[17]

20


మ.

దివిజశ్రేష్ఠుఁడు తాపసోత్తములతో దిక్పాలకశ్రేణితో
నవనిం దోడ్కొనివచ్చి కాంచె జగదేకానందచిద్రూపమున్
వివిధామ్నాయకళాకలాపము సుపర్వీగీతసల్లాపమున్
ధవళద్వీపముఁ బుణ్యరూపము నవిద్యావేద్యసంతాపమున్.[18]

21


వ.

అమ్మహాద్వీపమధ్యం బనేకశతసహస్రసూర్యకిరణంబులను సోల్లుంఠనంబు గావించు
నకుంఠతేజంబుగల వైకుంఠపురోపకంఠంబునఁ గంఠోపరికంఠీరవుండును సకల
దేవతాకంఠీరవుండును నై యిచ్ఛావిహారంబులు సలుపుచున్న పన్నగాశనవా
హనుం బొడగాంచి సాష్టాంగదండప్రణామంబులు చేసి యిట్లని స్తుతియించె.[19]

22


సీ.

చంద్రశేఖరవంద్య చంద్రార్కలోచన చంద్రశైలాధార చంద్రవస్త్ర

కమలసన్నిభనేత్ర కమలామనోహర కమలనివాస యోకమలనాభ
ధరణీధరాధార ధరణీభరనివార ధరణీధ్రమంథాన ధరణినాథ
దశదిశాపరిపూర్ణ దశకంఠవిదళన దశరూపధారణ దశపగమన


తే.

పంచభూతరూప పంచేంద్రియాకార, పంచబాణజనక పంచపంచ
తత్వబోధవితత సత్యాదిగుణకర్మ, మముఁ గరుణతోడ మనుపు మనుచు.[20]

23


క.

వినుతించి నలువ దనపై, ననుపమకారుణ్యనవసుధామృతధారల్
వనజాక్షుఁడు దొరగించుట, మనమునఁ దలపోసి పలికె మఱియున్ హరికిన్.[21]

24


శా.

దేవా యీవసుధావధూటి సమదాంధీభూతభూతంబులన్
మోవంజాలక జాలిఁబొందుచు బలంబున్ జేవయున్ బోయి దుః
ఖావస్థం దురపిల్లుచున్నయది దైన్యం బొంది యేతద్వ్యథల్
పోవంజేయఁగ నీవ నేర్తువు కృపాపూతాత్మ విశ్వాత్మకా.[22]

25


క.

అని విన్నపంబు చేసిన, వనజభవుని నాదరించి వసుధాసతిఁ గ
న్గొని నీ కిప్పుడు చెందిన, ఘనభారము మాన్పి జగము గాచెదఁ గరుణన్.

26


చ.

అని తనమేనియందు ధవళాసితరోమయుగంబుఁ బుచ్చి య
య్యనిమిషకోటిఁ గన్గొని మదంశములై యివి రెండు భూమిపై
జననము నొంది దుష్టజనసంహరణంబును సాధురక్షణం
బును నొనరించు భూభరము పోయెడు నెంతయు నిశ్చయంబుగన్.

27


మ.

పురుహూతప్రముఖాఖిలామరచయంబుల్ తత్తదంశంబులన్
ధరణిన్ సూర్యసుధాకరాన్వయములన్ ధాత్రీశులై పుట్టి న
న్నురుభక్తిన్ భజియించుచున్ రణమునం దుగ్రాహితానీకమున్
బొరిమార్పంగలవారు నామహిమచేఁ బొల్పారు శౌర్యంబులన్.[23]

28


క.

జగతి వసుదేవుప్రియసతి, యగుదేవకియందు నెనిమిదవగర్భమునన్
జగతీభరనాశార్థం, బుగఁ బుట్టెదఁ గృష్ణనామమున మర్త్యుఁడనై.

29


వ.

పుట్టి కంసాదిరాక్షసులం జంపి జగంబులకు సుఖంబు సేయువాడ నని పలికి
యద్దేవుం డంతర్ధానంబునం బొందె నప్పుడు.

30

మత్తకోకిల.

వాసుదేవునియాజ్ఞపెంపున వారిజాసనుపంపునన్
వాసవాదిసుపర్వు లందఱు వచ్చి మేరువుచేరువన్
డాసి యొక్కెడఁ గార్యచింత యొనర్చుచుండిరి సంతతో
ల్లాసభాసురయై ధరిత్రి చెలంగుచుండె మనంబునన్.[24]

31


వ.

అంత.

32


క.

ఆవైకుంఠములోపలి, దేవరహస్యంబులెల్లఁ దెలిసి రయమునన్
దేవముని యైననారదుఁ, డావార్తలు చెప్పి పోయె నాకంసునకున్.[25]

33


తే.

నాటనుండియుఁ గంసుండు నాటుకొన్న, దిగులుపెంపున వసుదేవదేవకులను
మిగులఁ బదిలంబు గావించి మెదలనీక, యొక్కకారాగృహంబున నునిచియుండె.[26]

34


తే.

గరిమ నాహిరణ్యకశిపునితనయు లా, ర్వురు మహోగ్రదానవులును విష్ణు
మాయవలన వచ్చి మహియందు దేవకీ, వనిత కుదయమైరి వరుసతోడ.

35


క.

మును కంసునితో నాడిన, తనసత్యము దప్పనీక తనయులఁ దోడ్తోఁ
గొని చని వసుదేవుం డా, తని కిచ్చిన వాఁడు వారిఁ దడయక చంపెన్.

36


ఉ.

ఏడవగర్భ మాజలరుహేక్షణ దాల్చిన లోకమంతయున్
వేడుక నొందె భూసతికి వింతవిలాసము తొంగలించె నీ
రేడుజగంబులుం బొగడ నీశ్వరుఁ డప్పుడు దేవబృందముల్
చూడఁగ యోగనిద్రదెసఁ జూచి ముదం బొదవంగ నిట్లనున్.[27]

37


సీ.

భూభార ముడుపంగ భూమిఁ బాతాళాధిపతి యైనశేషాహిపతి మదీయ
తామసోద్వృత్తుఁడై ధరణీతలంబున జన్మింప దేవకీజఠరమునను
బెరుగుచు నున్నయాపిన్నపాపని నీవు గొనిపోయి నందగోకులమునందు
వర్తించుచున్న యావసుదేవపత్నులలోన రోహిణి యనులోలనేత్ర


తే.

యుదరమున నొరు లెఱుఁగక యుండ బెట్టు, కంసుభయమున దేవకీకమలముఖకిఁ
గడుపు దిగఁబడిపోయె నక్కట యటంచు, వెల్లివిరి గాఁగ నాడుదు రెల్లవారు.[28]

38


తే.

గర్భసంకర్ష ణం బైనకారణమున, నాకుమారుండు సంకర్షణాఖ్యమహిమ
గలిగి ధవళాద్రినిభమైనగాత్రమునను, భూమిలోపల భద్రుఁడై పుట్టఁగలఁడు.[29]

39


వ.

ఏను బ్రావృట్కాలంబున శ్రావణమాసంబున శుక్లపక్షాష్టష్టమియందు మహా

నిశీధసమయంబున దేవకీదేవియందు జనియించెదఁ దత్కాలంబున నీవును యశో
దాదేవి గర్భంబున నుదయింపుము. మదీయశక్తిప్రేరితుండయి వసుదేవుండు
బాలవేషంబుననున్న నన్నుం గొనిపోయి నందుభార్యశయనంబున నునిచి
నిన్నుం గొనివచ్చిన గంసుండు తొల్లింటియట్ల వధ్యశిలాతలంబున వైచిన.[30]

40


తే.

ఆది మాయామహాశక్తి వగుచు నరిగి, దుర్గవై యష్టభుజములతోడ నిలిచి
యెగసిపోయెద వింద్రాదు లెల్ల నిన్ను, జయజయధ్వానములతోడ సన్నుతింప.

41


క.

క్రమమున శుంభనిశుంఖా, దిమహా రాక్షసుల నెల్లఁ దెగటార్చి త్రిలో
కములకు నభయం బిచ్చుచుఁ, బ్రమదంబున నుండు నీకు భద్రము లొదవున్.[31]

42


వ.

మఱియు నీవు నానాస్థానంబులందును భూతి సన్మతి క్షాంతి వృద్ధి ధృతి లజ్జా
పుష్టి రుషా నీతి ప్రశ్రయ ఆర్య దుర్గ దేవగర్భ అంబిక భద్రకాళి భద్రక్షమ
క్షేమంకరి అనునామంబులం బరఁగి ప్రాతరపరాహ్ణకాలంబులందు భక్తిపరిపూర్ణ
హృదయులై సురామాంసోపహారంబులం బూజించువారికి నభీష్టఫలంబు లిచ్చు
చుండు మని పనిచిన.[32]

43


క.

శ్రీవల్లభుండు పనిచిన, కైవడి నాయోగనిద్ర గ్రక్కునఁ జని యా
దేవకిగర్భములోని మ, హావీరుని శేషమూర్తి యగునాశిశువున్.

44


క.

కొనిపోయి కడురహస్యం, బున రోహిణిగర్భదేశమున నునిచెను గం
సునిభీతిఁ గడుపు దిగఁబడె, నని దేవకిఁ జూచి వగచి రందఱుఁ గరుణన్.

45

శ్రీకృష్ణావతారఘట్టము

క.

దేవసమానుం డగువసు, దేవునిపుణ్యమున విష్ణుదేవునిమహిమన్
దేవకి యష్టమగర్భము, పావనముగఁ దాల్చె జగతి ప్రస్తుతి సేయన్.

46


సీ.

కోరి దేవతలకోర్కులు వృద్ధిఁ బొందినగతి నాడు నాటికిఁ గౌను బలిసె
గంసాదివీరులగర్వంబు పొలియించు పొలుపునఁ జనుమొనల్ నలుపులయ్యె
వసుదేవు సత్కీర్తి వన్నియకెక్కినవిధమునఁ జెక్కులు వెలుకఁబాఱె
దనుజశుద్ధాంతకాంతలు చిన్నవోయెడువడువున వదనంబు వాడువాఱె


తే.

గోపకాంతలయాసలు కొనలుసాగు, చందమునఁ గోర్కు లెంతయు సందడించెఁ
గడుపులోపల సర్వలోకములు నిడిన, బాలకునితల్లి యైనయప్పద్మముఖికి.[33]

47

వ.

ఇట్లు సకలలోకోపకారభూతుం డయినభూతేశ్వరుండు దేవకీగర్భంబున నర్భ
కుండై జన్మించుసమయంబున.[34]

48


ఆ.

నందగోపపత్నియందు వైష్ణవశక్తి, యైనయోగనిద్ర యవతరించె
నంబుజాక్షుఁ డుదయ మైనలగ్నంబున, గ్రహవితతులు వక్రగతులు విడిచె.

49


ఆ.

సకలభువనపంకజము లుల్లసిలఁజేయ, విష్ణుసూర్యుఁ డుద్భవించఁజేయు
పూర్వసంధ్యకరణిఁ బొలిచి తేజోరాశి, యై వెలింగె దేవకీవధూటి.[35]

50


వ.

ఇట్లు జాజ్వల్యమాన యైనయమ్మానవతిం జూచి దుర్నిరీక్ష్యులై సహస్రాక్ష
ప్రముఖదేవగణంబులు గగనంబుననుండి యిట్లసిరి.[36]

51


చ.

కడుపున సర్వలోకములు గైకొని దాఁచినయాదిమూర్తి నీ
కడుపున నుద్భవించు నటు గాన జగంబులకెల్లఁ దల్లివై
పొడమితి విప్పు డీపరమపూరుషుఁ డచ్యుతుఁ డుద్భవించఁగా
జడిసి ప్రసూతివేదనలసంకటపాటు వహింపకుండుమీ.

52


వ.

అని యనే ప్రకారంబులం గొనియాడుచున్నసమయంబున.

53


ఉ.

నల్లనిమేను పూర్ణశశినవ్వెడుమోము నురంబు మచ్చయున్
దెల్లనికన్నులుం గరుణ దేఱెడుచూపులు పచ్చపట్టురం
జిల్లుకటిప్రదేశమును జేతులు నాలుగు నై విభూతితో
నెల్లజగంబులం బలిమి నేలెఁడువాఁ డుదయించె బాలుఁడై.[37]

54


వ.

ఇట్లు సకలభువనరక్షణదక్షుం డైన పుండరీకాక్షుండు శంఖచక్రగదాభయచారు
హస్తుండును వినమితాఖిలదేవగణమస్తుండును నై జన్మించె నప్పుడు నానాలో
కంబులకు నాహ్లాదంబయ్యె సాధుజనులకుఁ బరమసంతోషంబు గలిగెఁ జండమా
రుతంబులు ప్రశాతంబులయ్యె యమునానదీప్రముఖమహావాహినులు ప్రసాద
వాహినులయ్యె సముద్రంబులు నిజశబ్దవాద్యంబులు మొరసె గంధర్వులు సం
గీతంబులు చేసిరి యప్సరోగణంబులు నృత్యంబులు సలిపిరి భూనభోంతరవర్తు
లయిన దేవతలు పుష్పవర్షంబులు గురియుచు దివ్యదుందుభులు మొరయించిరి

యజ్ఞంబులు ప్రదక్షిణార్చులై వెలింగె మేఘంబులు మందగర్జితంబులై వర్షించె
నప్పుడు.[38]

55


తే.

దేవకీవసుదేవులు దివ్యమూర్తి, యైనయావాసుదేవునియమితమహిమ
చూచి తమలోన నెంతయుఁ జొక్కి మ్రొక్కి, పలికి రత్యంతసంతోషభరితు లగుచు.[39]

56


ఉ.

దేవ జగజ్జనస్తుతివిధేయ చరాచరభూతనాథ ల
క్ష్మీవసుధాకళత్ర సరసీరుహసన్నిభచారునేత్ర నా
నావిబుధావనస్ఫుటఘృణారసపూరిత వాసుదేవ మా
కీవు జనించినాఁడవఁట యెంతకృతార్థులమో కదా హరీ.[40]

57


ఆ.

దివ్యమూర్తి నధికతేజంబుతో నిట్టు, లున్నఁ గంసుఁ డెఱిఁగి మున్న వచ్చి
మమ్ము నిలువనీక మాప్రాణములమీఁద, వచ్చునంతపనులు వాఁడు సేయు.[41]

58


ఉ.

కావున నిట్టిరూపము జగన్నుత మాని నరార్భకుండవై
నీవు నటింపుమన్న జలజేక్షణుఁ డవ్వసుదేవదేవకీ
దేవుల నెంతయుం గరుణ దేఱెడు చూపులఁ జూచి మీకు నే
లా వెఱవంగఁ గంసునిబలంబుఁ జలంబును మీఱఁ జంపెదన్.[42]

59


వ.

అని యభయం బిచ్చి మనుష్యబాలవేషంబు గైకొని యూరకుండె నంత.

60


క.

శ్రీధరునియోగమాయా, బోధవలన దేవకీవిభుండు ప్రయత్నం
బాధిక్యంబుగఁ గంసభ, యాధీనం బైనచిత్త మల్లలనాడన్.[43]

61


క.

బాలున్ గపటక్రీడా, లోలున్ నానానిశాటలోకసమీర
వ్యాళున్ భక్తజనావన, శీలున్ గొని చనియెఁ గంసచిత్తనిమీలున్.[44]

62


వ.

ఇ ట్లొక్కరుండును నయ్యర్ధరాత్రంబునఁ గారాగృహంబు వెడలి వచ్చునప్పుడు.[45]

63


క.

ఆనగరంబునఁ గలిగిన, నానాజంతువులు కమలనాభునిమాయా
ధీనత నిద్రామోహితు, లై నిశ్చలవృత్తి నుండి రాసమయమునన్.

64


సీ.

ఏపుతోఁ జెఱసాలయింట నల్దిక్కులఁ గావున్నవారలఁ గన్ను మొఱఁగి
పారికాఁపులతోడఁ బరగడంబులు వచ్చియున్నవారల నెల్ల నోసరించి

కరదీపికలతోడఁ బురిరాజవీథుల వర్తించు తలవరివారిఁ ద్రోచి
కోటవాకిట నున్నకొలువుమోసలలోని ద్వారపాలుర నిద్రఁ గూలఁజేసి


తే.

 బీగములు వుచ్చి గడియలు పెకలఁజేసి, బోరుతలుపులు దెఱంచి గొబ్బునఁ బురంబు
వెడలె నానకదుందుభి విష్ణుమాయ, యఖిలమును గప్పి తనకుఁ దోడై నటింప.[46]

65


వ.

అంత.

66


క.

సంపాదితశంపావళిఁ, బెంపారిన మేఘచయము పృథివియు నభమున్
గంపింపఁగ బెట్టుఱుముచు, నంసాచారంపువాన లప్పుడు గురిసెన్.[47]

67


ఆ.

వనజనయనుమీఁదఁ జినుకులు పడకుండ, గాలి సోఁకకుండ ఘనసహస్ర
భోగమయకుటీరములు మాటుగాఁ బట్టె, నయ్యనంతదేవుఁ డాకసమున.[48]

68


ఆ.

విష్ణుమహిమవలన వేగంబె మోఁకాలి, బంటనీళ్లఁ దఱిసి భానుపుత్రి
యైనయమున దాఁటి యవ్వలిదరి కేగె, దేవనిభుఁడు దేవకీవరుండు.[49]

69


క.

హరిసేవకులకు భవసా, గరకో ట్లరకాలిబంటి గావఁట హాహా!
హరితండ్రికి యమునానది, యరయఁగ మోఁకాలిబంటి యగుటది యరుదే.

70


వ.

అని దేవతలు గొనియాడుచుండి రప్పుడు.

71


క.

వానలలో మొగమడిచిన, గానంగారాని యంధకారములోనన్
దానొక్కరుండుఁ బోవుచు, నానదితీరమున నోలలాడెడుచోటన్.[50]

72


ఆ.

నందుఁ డాదిగాఁగఁ గొందఱుఁ గొల్లలు, పగిదిధనము దీర్పఁ బాలుఁ జమురు
నులుప గొంచుఁ గంసుఁ డున్నచోటికిఁ బోవు, వారిఁ గాంచె ననతిదూరమునను.[51]

73


వ.

కని తన్నెఱింగించుకొనక చని గోకులంబు ప్రవేశించి నందగోపమందిరంబుఁ
జొచ్చె నప్పుడు సద్యఃప్రసవవేదనాభేదమానసయు యోగనిద్రామోహితయునై.[52]

74


క.

తన కాఁడుబిడ్డ పుట్టుట, యును నెఱుఁగక నిద్రవోవుచున్న యశోదం
గనుఁగొని శయ్యాతలమునఁ, దనయుని నిడి కూఁతుఁ గొని ముదంబున వెడలెన్.

75

తే.

గొల్లపల్లియలో నున్నగొల్లవారు, చొక్క చల్లినకైవడి నొక్కరైన
మేలుకొనక నిద్రింప నామేటి యపుడు, తిరిగి చెఱసాలలోని కేతెంచియుండె.[53]

76


ఉ.

కావలివారు మేలుకొని కంసునిపాలికిఁ బోయి దేవకీ
దేవి ప్రసూతియయ్యె నని తెల్పిన వాఁడును నిప్పుద్రొక్కిన
ట్లై వెసఁ బాఱుతెంచి హృదయంబునఁ గొంకక కల్కిచిల్కపై
బావురుబిల్లి బిట్టుఱుకుభంగి నరిష్టము సొచ్చె నుధ్ధతిన్.[54]

77


క.

వచ్చినకంసునిఁ బొడఁగని, వెచ్చనినిట్టూర్పు గదుర విహ్వలమతితో
ఱిచ్చవడి బాష్పధారలు, పిచ్చిల నయ్యిందువదన బెగడుచుఁ బలికెన్.[55]

78


తే.

అన్న నిన్నువంటి యన్నకుఁ దోఁబుట్టి, యాఁడుబిడ్డపోఁడిమంద లేక
సుతులఁ గన్నకడుపు చుఱ్ఱునఁ గాలఁగా, నలమటింపవలసె నకట నాకు.[56]

79


తే.

ముద్దుకొడుకుల నార్వుర ముందు దింటి, వింతపాపంబు నేయంగ నేమి గలిగె
యాడుఁబడు చిది యీబిడ్డనైనఁ గాచి, విడువు నాయుల్లమునఁ గొంత యుడుకు దీఱ.[57]

80


వ.

అని బహుప్రకారంబుల విలాపించుచు హాహాకారంబుల నక్కుమారిక నక్కున
నిడి పెనంగుచున్న యన్నలినలోచన నదల్చుచు బిట్టుదిట్టుచు శిశువుకడకా
లోడిసి తిగిచి బిరబిరం ద్రిప్పి చట్ట్రాతితోడ వ్రేసిన నక్కుమారికయును.[58]

81


క.

ఆకాశంబునఁ గడుభయ, దాకారముతోడ నిలిచి యాయుధనికర
స్వీకారాష్టభుజంబులు, గైకొని కోపించి నవ్వి కంసునిఁ బలికెన్.[59]

82


క.

నన్నేల యింతసేసితి, మున్నిటి నీవైరి దివిజముఖ్యుల కెల్లన్
బెన్నిధి యిప్పుడు పెరుగుచు, నున్నాఁడు నినున్ వధింప నొకచో శిశువై.[60]

83


వ.

అని పలికి యతండు చూచుచుండ గంధర్వవరులచేత దివ్యంబు లైనగంధమా
ల్యంబులం బూజితయై యదృశ్యయయ్యె నప్పుడు.

84


ఉ.

గ్రక్కున నేటు దాఁకినమృగంబునుబోలె నతండు తద్దయున్

స్రుక్కి మనంబులోనఁ గడుశూరతయున్ బలమున్ బ్రతాపమున్
మొక్కలువోవఁగాఁ గొలువు మోసలలోనికి, బోయి మంత్రులన్
దక్కినవారుఁ గొల్వ వెడదండితనంబున నుండి యుధ్ధతిన్.[61]

85


వ.

తనకుం బరమాప్తు లైనపూతనారిష్టప్రలంబకేశిధేనుకాదు లైనరక్కసులం
బిలిపించి సవినయంబుగా నిట్లనియె.

86


చ.

వినుఁ డసురేంద్రులార నెఱవీరుఁడనై జగమెల్ల నేలుచున్
ఘనమహిమం జెలంగుననుఁ గయ్యములోన వధించుయత్నముల్
పనివడి చేసినారఁట సుపర్వులు నేను శ్రుతాశ్రుతంబుగా
నొనరఁగ వింటి నాకడిమి కోర్వఁగ నెంతటివారు దేవతల్.[62]

87


తే.

మీ రెఱుంగరె వజ్రి నామీఁద వచ్చి, వేయిమాఱుల దాఁకను వీ స్వపోట్ల
తోడఁ బాఱుట లిటువంటి తులువ వచ్చి, సిగ్గుచెడ కిఁక నేరీతిఁ జెనకునొక్కొ.[63]

88


తే.

బ్రహ్మవిష్ణుమహేశ్వరప్రభృతులైన, దివిజవర్గంబు నాకును దృణకణాయ
మాన మటువంటి పటువిక్రమప్రతాప, శాలి యగునాకు నెదురె యీజగతి నొరులు.[64]

89


క.

బంధురయశుఁ డైనజరా, సంధుం డొకరుండు తక్క సమరంబుల గ
ర్వాంధు లగునృపపిశాచపు, టింధనములు నిలువఁగలవె యే ననుశిఖికిన్.[65]

90


ఉ.

కావున నన్ను మార్కొన జగంబుల నెవ్వఁడు లేఁడు నేడు మా
దేవికి గన్నబిడ్డ ననుఁ దిట్టుచు న న్ననిఁ జంప నెవ్వఁడో
దేవుఁడు బాలుఁడై వసుమతిన్ జనియించినవాఁ డటంచు నా
తో వివరించిపోయె నిది తొల్లియు నారదుచే నెఱింగితిన్.[66]

91


ఉ.

 మీరిఁక నేటనుండియును మేదినిలోఁ గలపిన్నబిడ్డలన్
వారక చంపుఁ డంచు బలవంతులఁ దెంపునఁ బంపు వెట్టినన్
వారలు బెక్కురూపముల వచ్చి శిశుప్రకరంబునెల్ల సం
హారము చేయుచున్ రుధిర మానిరి మానిరి పుణ్యకర్మముల్.[67]

92

వ.

అంత కంసాసురుండు శుద్ధాంతమందిరంబునకుం బోయి దేవకీవసుదేవుల రావించి
మిథ్యావినయంబున నిట్లనియె.[68]

93


చ.

కటకట మిమువంటి గుణగణ్యుల బుణ్యులఁ జెప్పరానిసం
కటములఁ బెట్టి యెట్టికొఱగాములు చేసితిఁ బెక్కు నాకు నీ
కిటుకున నేమి మేలు గలిగెన్ సుతులందఱుఁ జచ్చి రంచు ము
చ్చట చెడి వంత నొందకుఁడు సర్వము దైవముసేఁత గావునన్.[69]

94


వ.

అని యాశ్వాసించి వారల కారాగృహనిరోధంబు మాన్పి యుద్విగ్నచిత్తుఁ డై యుండె.[70]

95

వసుదేవుఁడు శ్రీకృష్ణునిఁ జూడ గోకులంబునకు వచ్చుట

క.

వసుదేవుఁ డంతఁ దనబా, లసఖుం డగునందుగోకులమునకుఁ జనియిం
పెసలార గోపగోపీ, విసరంబులు సంతసిల్ల వేడుకతోడన్.[71]

96


క.

నందునిఁ బుత్రవిభూతిము, కుందుని సేవావిధేయగోపాలజనా
నందునిఁ గరుణారసని, ష్యందునిఁ బొడగాంచె నధికసంభ్రమ మొదవన్.[72]

97


వ.

కని యతనిచేతఁ దగుతెఱంగున సంభావితుండై యావృద్ధగోపదంపతులు సంత
సిల్లి మానుషవేషంబు ధరించి యున్నకపట బాలకునిఁ దనచేతి కిచ్చిన నెత్తుకొని
ముద్దులాడుచు వారి కిట్లనియె.[73]

98


మత్తకోకిల.

మీకుఁ గల్గిన భాగ్యదేవత మిమ్ము ధన్యులఁ జేయఁగా
నీకుమారునిఁ దెచ్చి ముప్పున నిచ్చె నీతనిఁ జూచినన్
నాకు నైనను బుత్రమోహము నాటియున్నది యిట్టియ
స్తోకపుణ్యుఁడు ముద్దుసేఁతలఁ జొక్కఁజేయఁడె మీమతుల్.[74]

99


ఆ.

ఇతనిఁ జూచి మీకు నెంతమోహము గల, దంతకంటె మాకు నధిక మైన
మోహరసము మూరి మోచియున్నది యీకు, మారుఁ డొక్కరూప మాకు మీకు.[75]

100

వ.

అని పలికి మఱియు నిట్లనియె.

101


తే.

నందగోపక రోహిణీనందనుండు, పెరుగుచున్నాఁడు మీయొద్ద గరిమతోడ
నీకుమారునిఁ బెంచిన ట్లాకుమారు, నరసి రక్షింపు మీమది బెరుకు లేక.[76]

102


క.

అని యిట్లుపలికి మంతన, మున కాతనిఁ బిలిచి మీకు మొల్లమిగలవా
రని కంసుఁ డెఱిఁగియుండును, జన దిచ్చట నుండ నొండుచాయకుఁ జనుఁడీ.[77]

103


క.

నెట్టన వర్షావధికిం, బెట్టంగలయప్పనములు పెట్టియు మధురా,
పట్టణసమీపమున మీ, రొట్టినసంపదలతోడ నుండఁగ నేలా.[78]

104


తే.

పావకుండును గపటంపుభూవరుండుఁ, దమ్ముఁ గడుఁజేరి మందెమేలమ్ముతోడ
నున్నవారికిఁ గీడు సేయుదురు వారి, కంచితన్నేహమున మంట లధికమగును.[79]

105


మ.

అని గర్భీకృతవాక్యపద్ధతుల నధ్యాహారముల్ సేయ హా
యిని నందాదులు గోసమూహములతో నేపారి దూరంబుగాఁ
జని రమ్యాటవులందు నుండిరి యథేచ్ఛావృత్తితోడన్ దృణం
బును నీరున్ గలతావులన్ బసులగుంపుల్ మేసి సొంపారఁగన్.[80]

106

పూతనావధశకటాసురవిధ్వంసనాదివివరణము

వ.

అంత నానందగోకులంబున నత్యంతసుందరాకారంబున నందనందనుండు పెరుగు
చుండుట విని పూతన మనోహరం బైనయాకారంబు దాల్చి యర్ధరాత్రసమ
యంబున యశోదానివాసంబు సొచ్చి.

107


తే.

నిద్రవోవంగ మెల్లన నిమిరి యెత్తి, మేలుకొనఁజేసి చెక్కులు మీటిమీటి
విష మమర్చినచన్ను తావిషధిశయను, నోరిలోపల నిడి చేత నొక్కుటయును.[81]

108


తే.

చన్నుఁబాలతోఁగూడ నాజంతయొడలి, ప్రాణవాయువు లన్నియు బలిమిఁ గ్రోలె
నప్పు డుద్విగ్నచిత్తయై యసురవనిత, బిట్టు రవమున హో యని పృథివిఁ గూలె.[82]

109


వ.

ఇవ్విధంబున.

110


క.

పూతనఁ గంసవచోమృత, వేతనఁ బ్రాణప్రయాణవిహ్వలచేతో

యాతనఁ బాతకజాతని, కేతనఁ బరిమార్చె గరుడకేతనుఁ డలుకన్.[83]

111


మ.

ఘనవజ్రాహతిఁ గూలు నీలగిరిశృంగప్రాయమై విహ్వల
ధ్వనితో నిట్లు వసుంధరంబడినఁ దద్ధ్వానంబు ఘోరంబుగా
విని గోగోపకగోపికానికరముల్ విభాంతిమై బిట్టు మే
ల్కని చూడన్ జనుదెంచి రర్భకుల కెల్లన్ వెక్కసిన్ రక్కసిన్.[84]

112


వ.

అంత యశోదానందు లప్పాపాత్మురాలియంకంబున నిశ్శంకితుండై యాడు
చున్న యర్భకు నెత్తుకొని భూతభయనివారణంబుగా గోపుచ్ఛంబు సురాళించి
గోమయంబునఁ దిలకంబు పెట్టి నారాయణస్తోత్రకవచంబులు పఠియించి
గృహోపకరణంబులు నిండిన బండిక్రింద నుయ్యాలతొట్టిలోనం బెట్టి.[85]

113


క.

రక్కసురాలికళేబర, మొక్కయెడకు నీడ్చి యిట్టియుత్పాతము నే
డిక్కడికి నెట్లు వాటిలె, నొక్కో యని గోపవృద్ధు లున్నట్టియెడన్.[86]

114


క.

ప్రకటముగ గపటబాలుఁడు, వికటముగాఁ బాదపద్మవిక్షేపములన్
నికటమున సకలపరికర, శకటంబై యున్న యట్టిశకటముఁ దన్నెన్.[87]

115


ఆ.

నిండుబండి నేడు నిష్కారణం బేలఁ, బొరలే నొక్కొ యనుచుఁ జొక్కి పడుచు
నున్న గోపసతులయొద్దకు నచ్చోట, నాడుచున్న పడుచు లరుగుదెంచి.[88]

116


ఆ.

ఈయశోదపట్టి యిప్పు డేమెల్లను, జూచుచుండ బండిఁ ద్రోచెఁ బొరల
ననుచుఁ జెప్పిపోయి రప్పు డచ్చటనున్న, వ్రేతలెల్లఁ జూచి వెఱఁగుపడిరి.[89]

117


ఆ.

ఆయశోద వచ్చి యాబండిలో నిండి, యుండినట్టి కుంభభాండతతుల
పాలు నెయ్యి నేలపాలైనఁ జిడిముడి, పడుచుఁ బడుచుమీఁద నడిచిపడుచు.[90]

118


వ.

వచ్చి యచ్చిన్నిపాపనిపాదవిక్షేపంబువలన విధ్వస్తంబు అయినసమస్తవస్తువులను
బొందుపఱిచి దధిగంధపుష్పాక్షతంబులచేత శకటంబుఁ బూజించిన.[91]

119


ఉ.

గోపిక లెల్ల నచ్చటికి. గూడి యశోద వినంగ నమ్మ నీ

పాపడు మొన్న మేరుగిరిపాటినిశాచరి నంత సేసె నే
డేపునఁ గట్టుబండి నిదె నిందఱు సూడఁగ నింత సేసె వీఁ
డోపిక ముందఱన్ బ్రతికియుండిన నెవ్వరి నెంత సేయునో.[92]

120

రామకృష్ణుల జాతకర్మ నామకరణాదిప్రశంసనము

వ.

అని యట్లు సల్లాపంబులు చేసి రంత వసుదేవుడు నిజపురోహితుఁ డయినగర్గు
రావించి తనపుత్రు లైనరోహిణీదేవకీనందరులకు నామకరణంబులు సేయుటకు
నియోగించి నందగోకులంబునకుఁ బంచిన.

121


క.

గర్గుఁడు పరి వేష్టితముని, వర్గుఁడు సంపాదితాపవర్గుఁడు భవనై
సర్గుఁడు పరతత్వకళా, మార్గుఁడు చనుదెంచె నందుమందిరమునకున్.[93]

122


వ.

వచ్చి యభ్యాగతవ్యాజంబున యశోదానందులం బొడగాంచి యెవ్వరు నెఱుం
గకుండ వసుదేవనందను లిరువురకు జాతకకృత్యంబులు నిర్వర్తించి రోహి
ణీనందనునకు రామనామంబును దేవకీనందనునకుఁ గృష్ణావధానంబును జేసి
పోయె నంత.[94]

123


క.

ఆరామకృష్ణు లిరువురు, గారామున నందగోపకవ్రజమున నొ
ప్పారుచు నాసితనీలశ, రీరంబులతోడఁ బెరిగిరి ముదం బొప్పన్.[95]

124


సీ.

ఉయ్యాలతొట్టిలో నునిచి చేతులు పట్టియూఁచి యాడెడు పాట నుబ్బ నేర్చెఁ
బసిఁడికుందియనలోపలఁ బట్టుపొత్తులయొత్తున నొఱగి కూర్చుండ నేర్చె
నించు కించుకదూర మిందు రమ్మని పిల్వ నల్లనల్లన దోఁగియాడ నేర్చె
వ్రేలు చేతికి నిచ్చి విద్దెంబు లాడంగ నిలిపిన గొంకుచు నిలువ నేర్చె


తే.

వేడ్క మాటల విందులు విందు లనుచుఁ, బిలిచి చేచాఁప నడుగులు పెట్ట నేర్చెఁ
దల్లిదండ్రులమనములు పల్లవింపఁ, గృష్ణుఁ డొప్పారె శైశవక్రీడలందు.[96]

125


వ.

మఱియు నానందనందనుండు రోహిణినందనసమేతుండయి యథాకాలంబుల

గోకరీషధూళిధూసరితశరీరంబుతోడ వాడవాడలం బరువులు పెట్టుచు వెండి
యునుం గ్రీడ లాడుచున్న లేఁగదూడలతోఁకలు వీఁకలం బట్టుకొని వెనుచనిన
నవి యఱచుచుం డుల్లమల్లాడుచుం బాఱిపోయినఁ బోనీక యాఁగియును పితికి
తెచ్చి పసిండిభాండంబులనిండంబోసిన పాలలోనఁ దననీడ చూచి బూచి వచ్చెనని
విచ్చలవిడిఁ బెచ్చు పెరిగి నెచ్చెలులతోడం జెప్పియును చిలికి చిలికి వెలికి వచ్చిన
గొల్లగుబ్బెతలమొఱంగి పెరుంగుబోనలోనం దనపాదంబులు వెట్టి బిట్టు వెద
చల్లియును గోవులం గావంబోయినమగల తగులున కాసపడి నిజకుటీరద్వారం
బులకవాటంబులు వాటంబులు చేసి చనిన జవరాండ్రయిండ్లు సొచ్చి సమస్తం
బును విధ్వస్తంబు చేసియును ఏమఱించివచ్చి కాఁగుచున్న కాఁగులమీఁదిమీఁ
గడలు మెల్లమెల్లనె పుడుక వెరఁజి యారగించియును మందపాలకుంబోయిన
యిందువదనలమందిరంబులు మొఱంగి సొచ్చిన నెఱింగి పొరుగులచంచలాక్షు
లదలించుచుఁ జిట్టకంబులకుఁ బట్టుకొనవచ్చిన మచ్చికలతోడి యిచ్చకంబులు
చేసియును పసులమందకుం బోవువ్రేతలు తనకు నందరాకుండ కుండలం బెట్టి
యుట్టిమీఁద నిడినవెన్న యులూఖలంబులు దాపులుగా నిడి యెక్కి నిక్కి
యందుకొని యన్నయుం దానును గడుపుకొలందియు నారగించియు ఇట్లు
బహుప్రకారంబులఁ గపటబాలక్రీడ లాడుచున్న నీలవర్ణుదుండగంబులకు వేసఱి
యొక్కనాడు.[97]

126


తే.

వెన్నుఁ డొకయింటిలో జొచ్చి వెన్న దినఁగ, నెఱిఁగి కొందఱు గోపిక లేగుదెంచి
వీఁడె కృష్ణుఁడు పెనుదుండగీఁడు మనకుఁ, జిక్కెఁ బోనీకుఁడీ యంచుఁ జేరవచ్చి.[98]

127


తే.

పట్టవచ్చినఁ గనుఁ బ్రామి పాఱిపోయి, జననియంకతలంబున సాధువృత్తి
ముద్దుచూపుచు నొయ్యారమున నటింప, గోపకాంతలు గుంపులు గూడివచ్చి.[99]

128

గోపికలు శ్రీకృష్ణునిదుండగములు యశోదతోఁ జెప్పుట

ఆ.

అయ్యశోదఁ జూచి యమ్మ దయ్యపుబిడ్డ, నెట్లుగంటి కృష్ణుఁ డెదురులేక
వచ్చి వెన్న లెల్ల మ్రుచ్చిలుచున్నాఁడు, మమ్ము నిండ్లలోన మనఁగనీక.

129

ఆ.

ఉవిద నీకుఁ దెలియదోకాని యేయింట, నైనఁ జొచ్చి యెప్పుడైన వచ్చి
వెదకి వెదకి వెన్న వెరజాడుచున్నాఁడు, నీసుతుండు మమ్ము నిలువనీక.[100]

130


ఆ.

చూచి చూచి యేము రాచకుమారుని, నాడ వెఱతు మైన నాడకుండ
రాదు కృష్ణుచేతిరాయిడి యింతంత, యనఁగరాదు మాకు మనఁగరాదు.[101]

131


వ.

అని యంత నిలువక గోపబాలికలు కపటబాలునికోమలాంగుళీరేఖాచిహ్ని
తంబు లగునవనీతభాండంబులు చూపిన యశోదాదేవి కొడుకుమీఁదం గోపించి
యిట్లనియె.[102]

132


మత్తకోకిల.

ఎల్లభాగ్యములు గృహంబున నెప్పు డుండఁగ నేలరా
గొల్లపల్లియ యంతయున్ గలగుండు పెట్టి సమస్తమున్
గొల్లలాడెదు నిన్ను నేగతిఁ గుస్తరించి యదల్చినన్
దల్లిదండ్రులయాజ్ఞ నిల్వవు దంటదయ్యపుబిడ్డఁడా.[103]

133


తే.

ఏల పొరిగిండ్లు చొచ్చెద వేల వెన్న, లెల్ల వెరఁజెదవింటిలో నేలయుండ
వేల యీసరివారిలో నింతఱట్టు, చేసెదవు నీచరిత్రంబు చెప్ప నరుదు.[104]

134


క.

అని దామపాశమున నా, తని నెన్నడు ముగ్గఁగట్టి తక్కినకొనత్రా
డొనరఁగ నులూఖలముతో, జనని వెసన్ ముడిచి నిలిపి సదనమునందున్.[105]

135

శ్రీకృష్ణుండు ఉలూఖలబద్ధుండై యమళార్జునభంజనంబు చేయుట

క.

ఉనిచి కడుఁగోపసంభ్రమ, మున చిడిముడి పడుచునుండెఁ బురుషోత్తముఁడు
జనని తనుఁ బట్టి కొట్టునో, యనుభయమునఁ జాఱిపోయినట్లు రయమునన్.

136


తే.

గొల్లపడుచులు చని గుండు గూడి చూడ, ఱోలు దామెనత్రాడును లీలతోడ
నీడ్చికొనివచ్చి దమయింటియెదురుకట్లఁ, దనరు యమళార్జునంబులఁ దగులఁ బెట్టి.[106]

137


క.

బద్దులఁ దొలుపుట్టుక వెడ, బుద్దుల నొండొంటితోడఁ బురుణించిన పె
న్నుద్దుల మద్దుల ముద్దుల, సుద్దులబాలకుఁడు ద్రోచె క్షోణిఁ బడంగన్.[107]

138


వ.

ఇవ్విధంబున నయ్యమళార్జునంబులు రెండునుం గటకటధ్వానంబులతోడ విఱి

గిన నాఘోషంబు ఘోషంబున కెల్ల నత్యంతవిభీషణంబయ్యె నప్పు డచ్చటివార
లాబాలగోపాలంబుగా వచ్చి చూచి ఱిచ్చలువడియుండి రంత.[108]

139


ఆ.

పెద్దఱోలితోడ బిగువు దామెనతోడఁ, బడినమద్దిచెట్లనడుమ ముద్దు
లైనతొక్కుఁ బలుకులాడుచు నిలుచున్న, కపటబాలుదుండగములు చూచి.[109]

140


ఉ.

గోపిక లయ్యశోదకడకుం జని నీతనయుండు వాఁడె నే
డాపెనుమద్దిమ్రాఁకుల రయంబునఁ బెల్లగిలంగఁ ద్రోచినాఁ
డీపసిబిడ్డ దయ్యము సుమీ యని పల్కిన యామృగాక్షి యు
ద్దీపితశోకసంభ్రమవిధేయమతిన్ బఱతెంచి గ్రక్కునన్.[110]

141


వ.

ఉలూఖలంబులతోడఁ గట్టువడియున్న బాలకృష్ణుని యుదరబంధం బైనదామం
బు విడిచి యెత్తుకొని యక్కునం జేర్చి మూర్ధాఘ్రాణంబు చేసి యానందబాష్ప
ధారాసారంబున నతని నభిషేకించె నిట్లు దామం బుదరబంధనం బగుటంజేసి
కృష్ణుండు దామోదరుం డనంబరఁగె నప్పుడు.[111]

142

నందాదిగోపకులు రామకృష్ణసమేతులై బృందావనంబునకుఁ బోవుట

క.

వారక యందఱుఁ జూడఁగ, ధారుణిపై మద్ది చట్లు తమయంతన ని
ష్కారణము విఱిగిపడు టా, భీరవరుల్ చూచి భయము పెద్దయుఁ గదురన్.[112]

143


క.

నా డర్ధరాత్రి పూతన, పోడిమి చెడె మొన్న బండి పొరలఁగఁబడియెన్
నే డిదె యీమద్దులకును, మూఁడెను నిష్కారణంబు మూలాగ్రముగన్.[113]

144


తే.

ఇంక నిచ్చోట నుండిన నేమికీడు, పుట్టునో యొండుచోటికిఁ బోవవలయుఁ
బూరియును నీరుఁ గడుఁ బరివోయెఁ బసులు, కందుచున్నవి మనకేల యిందునుండ.[114]

145


చ.

తొలుకరివానలుం గురిసి తోరపుఁబూరియుఁ దేటవారియున్
గలిగిన నెంతయున్ గుబురుకానలు వానలు లేకయుండినన్
కొలమున నెమ్మెయిన్ బసరముల్ చెడ వెన్నఁడు నెల్లి యాలగుం
పుల గదలించి బృందకును బోద మటంచు వినిశ్చితాత్ము లై.[115]

146

వ.

ఉండి రమ్మఱునాటివేకువ నతిరతిశ్రాంతు లైనకాంతలతోడం గవలుగూడి నిద్రా
సక్తులైయుండి వేగుఁబోకను శునకభౌ క్రియానాదంబులకు బిట్టులికి మేల్కని
గృహాంగణప్రదేశంబులం దమసఖులతోడం ద్రిమ్మరువారును ప్రయాణసందర్భం
బులు డెందంబున సందడింప సరగునం బెరుగులు భాండంబుల నిండించి బంధు
రంబు లయినమంథంబులు వన్నియాలీఢపాదంబులతోడఁ గృష్ణలీలలు పాడుచుం
జిలుకుచు చిలుకుచూపుల గోపికలవచనరచనామృతపానంబుల మేను లెఱుంగక
చొక్కుచున్నవారును రాత్రి కదలిపోయి చెదరి కదుపులం గలసినమొదవుల
వెదకి తెచ్చి తమతమవెరవుల నిరవులఁ గూడం దోలువారును లేగదూడలకు
మెంపుచు గుంపులై యఱ్ఱులెత్తి యంబేయని యఱచుచు జిఱ్ఱజిఱ్ఱన నఱ్ఱాడు
ధేనువులఁ బేరుపేరం బిలుచువారును దూడలం గుడువవిడిచి దుగ్ధదోహనంబు
నకుం జేరవచ్చిన బెదరి పసులసందునం బాఱిపోవు గోవావుల వెనుదగిరి సాదు
సులచాటునం బొంచి కూడముట్టి తలకోలలు వెట్టి యాఁగువారును మస్తరిం
చుచు నుఱ్ఱుద్రాళ్లం గట్టి కుక్కుటాసనంబునం గూర్చుండి భాండంబులు జూను
లగ్నంబులు చేసి ఘుమఘుమధ్వానంబున ఫేనంబు లొదువ పాలు పిదుకువారును
పచ్చిపాలలో నుడుకువంటకంబు నులివేఁడిగాఁ గలిపి గొల్లగుబ్బెతలు వడ్డింప
గ్రామ్యాహారంబులతోడ వలయాకారంబులుగా గొంతులు గూర్చుండి పాణి
పాత్రంబుల వరుసతోడ నారగించువారును దామెనలు చుట్టి తలకోలలు గట్టి
మూపులం బెట్టుకొని యీలలు వెట్టుచు గోగణంబులఁ జెదరందోలి వెనుక
చిక్కిన బక్కపసులఁగూడం బిలుచువారును దధిక్షీరాజ్యపూరితంబు లైన
భాండప్రకరంబులు సుకరంబులుగా నమర్చినశకటంబుల సాదుబుద్దులు గల
యెద్దులం గట్టి సరళపథంబున నడపించువారును బేగడలతోడి బిల్లలచెప్పులు

దొడిగి చెంగావికాసెకోకలు కట్టికొని భారంబువలన వీఁకలుగల కొరకావళ్లు
మోచికొని యొండొరులతోడఁ బంతంబులాడుచు గునిసి గునిసి నడుచువారు
నుం గలిగి గౌష్ఠీనంబు మశకమక్షికకాకకంకసమాకీర్ణంబులవలన సర్వశూన్యం
బగునట్టుగాఁ గదలి బృందావనంబునకుం జని.[116]

147


తే.

యమునచేరువ నొక్కరమ్యప్రదేశ, మున విశాలస్థలంబున నొనర విడిసి
యర్ధచంద్రాభముగ శకటాళి నిలిపి, పారివెలుఁగులు దొడ్లు నేర్పడ నమర్చి.[117]

148


ఉ.

గోవుల లేఁతపూరిగల కొండలదండల మేసి తెచ్చి నా
నావిమలోద యైనయమునానదిలోపల నీళ్లు పెట్టి త
త్పావనతీరదేశములఁ బాటల నాటల క్రీడలాడి బృం
దావనభూమియందుఁ బ్రమదంబున గోపకు లుండి రిమ్ములన్.[118]

149


క.

ఆరాముఁడు కృష్ణుఁడు నా, భీరకుమారకులఁ గూడి బృందాటవి నే
పారుచు దూడలఁ గాచిరి, గారవమున జగము గావఁగలవారయ్యున్.

150


సీ.

బర్హిపత్రములు సంపాదించి శృంగార మొనరించుచుండుదు రొక్కవేళ
మురళీరవంబులు మొరయించి తమలోన నుల్లాస మొనరింతు రొక్కవేళఁ
గాకపక్షంబులఁ గమ్మపూవులు చుట్టి యొయ్యారులై యుందు రొక్కవేళ
నిడువున నాకులు మడిచి పీఁకెలు చుట్టి యూఁదుచు నటియింతు రొక్కవేళ


తే.

నిగురుపాన్పులపైఁ బొదరిండ్లలోన, నొలసి నిద్రించుచుండుదు రొక్కవేళ
రామకృష్ణులు బాల్యాభిరామవర్త, నములఁ బెంపారి బృందావనంబునందు.[119]

151


వ.

ఇవ్విధంబున వినోదించుసమయంబున.

152


సీ.

వసుధాభిహతపూర్వవాతసంఘాతంబు సంచితోదగ్దిశాచంచలంబు
పర్జన్యధనురాత్తపశ్చిమాశాశంబు సంఛాదితాఖిలాశాఘనంబు
పటపటధ్వానవిభ్రాజితస్తనితంబు ప్రస్ఫుటద్బహుతరేరమ్మదంబు
ప్రశమితాంభోజాతబంధుమయూఖంబు చంద్రనందనశుక్రసంయుతంబు

తే.

భూరిభారానితాంతోగ్రవారివృష్టి, పూరితాఖిలనిమ్నగాంభోచయంబు
సంతతధ్వానదర్దురసంచయంబు, గలిగి వర్షాగమంబు ప్రకాశమయ్యె.[120]

153


చ.

అమరిన లేఁతపచ్చికబయళ్లను దట్టములైన యింద్రగో
పములు నటింపఁగా నవనిభాగము తద్దయుఁ జూడ నొప్పెఁ గ్రొ
త్తమరకతంబులన్ విఘటితం బగుపేటికయందుఁ బద్మరా
గము లనురత్నముల్ దఱుచుగా నమరించినసోయగంబునన్.[121]

154


క.

నీలాంబుదములక్రేవలఁ, గ్రాలెడుకొక్కెరలగుంపు కడుఁజూపట్టెన్
మాలిన్యమతులచే నుప, లాలితులై యున్ననిష్కళంకులభంగిన్.[122]

155


క.

కడునధికవృష్టి గురియఁగ, వడితో నదు లెల్ల నుబ్బి వఱదలు వాఱెన్
నడుమంత్రపుసంపదగల, వెడఁగుమతులు నుబ్బి వెల్లివిరిసినభంగిన్.[123]

156


ఆ.

పూరి మిగులఁ బెరిగి పొదియంగఁబడిన మా, ర్గములమేర లెఱుఁగరాకయుండె
నల్పబుద్ధియుక్తు లాడినమాట ల, ర్థాంతరములఁ బొంది యణఁగినట్లు.[124]

157


తే.

నీలజలధరములలోన నిర్మలేందు, మండలము గానరాకుండె మలినహృదయు
లైనదుర్జనకోటితో నాడినట్టి, సత్యసంధప్రగల్భవాక్సరణి యట్లు.[125]

158


వ.

ఇట్టి జలధరకాలంబున సహోదరు లైన రామదామోదరులు గోపాలురం గలసి
గోవులం గాచుచుఁ బరిమళకదంబంబు లయినకదంబదామకంబుల శృంగారించు
కొనియును బర్హిపత్రంబులు విచిత్రంబుగా గాత్రంబు నలంకరించుకొనియును
యీలలు పెట్టుచు సాళగంబులతోడ నేలపాటలు పాడుచుఁ బిసాళించియును
సైరికవేషంబుల గైరికనికరంబులు శరీరంబులఁ దోరంబుగా నలందియును

జీమూతంబులు గర్జించినయాకారంబులఁ గ్రేళ్లు దాఁటియును తమతోడియాభీర
కుమారులు పాడినం దోడున శిరఃకంపంబులు చేసి మెచ్చుచు వినోదకృత్యంబు
లాడియును కలాపంబులు విచ్చి విలాసంబులుగా నాడుచున్న మత్తమయూరం
బుల వెనువెంటందగిలియును నిట్లు నానావిధంబు లయినబాల్యవినోదంబులం
బరమసంతోషచిత్తులై యుండి రంత.[126]

159

కాళీయమర్దనము

ఉ.

శ్రీవిభుఁ డొక్కనాఁడు విలసిల్లెడుచి త్తముతోడ లాంగలిన్
గోవుల గావ నంపి యొకకొందఱు బాలురతోఁడగూడి బృం
దావనమెల్లఁ జూచి యమునానదికిం జని తత్సమీపనీ
పావళినీడలం గడువిహారము సేయుచు నున్నయత్తఱిన్.[127]

160


ఉ.

ఆరయ నమ్మహాతటినియం దొకచోట హ్రదంబులోపలన్
దారుణ మైనహాలహలతాపవిషోల్బణ మైనగాలిచే
జేరువ నున్నవృక్షములజీవములం బరిమార్చుచుండు దు
ర్వారుఁడు కాళియాహి యనువాఁడు భయంకరవేషధారి యై.[128]

161


ఆ.

ఉగ్ర భుజగవిషసముజ్జ్వాల లెప్పుడు, నిగిడి వేఁడిసెగల పొగల మిగుల
నుడికి పొరలఁబడుచు నుండు నాయుదకంబు, లధికతప్తతైల మనఁగ మెఱసి.[129]

162


ఉ.

అట్టి హ్రదంబు తద్దయు రయంబున డగ్గఱి క్రూరకర్ముఁడై
యిట్టి భుజంగుఁ డిందు వసియించుటఁ జేసి కళిందకన్యము
చ్చుట్టును బాడువాఱి కడుశూన్యము నొందును వీని నెమ్మెయిన్
బట్టి వధింతు నంచుఁ జలపట్టి యదూద్వహుపట్టి దిట్ట యై.[130]

163


ఉ.

తటమునఁ బూచి యేచిన కదంబమహీరుహశాఖ యెక్కి యు
త్కటగతి కుప్పిగంతు గొని తద్భదమెల్ల గలంచుచుండి ను
ద్భటపటుగంధసింధురము పల్వలముం గలగుండు పెట్టి ప
ర్యటనము సేయునట్లు జలమంతయు భగ్గున మంట లుబ్బగన్.[131]

164

చ.

కడుఁ బెనుమంట లైనయుదకంబు తొలంకున వారిబిందువుల్
మిడిసి సమీపభూజములమీఁద వెసంబడి మండుచుండ నె
క్కుడురభసంబుతో దివియకోలలకైవడి భంగసంగతిన్
బొడమినఫేనముల్ మెఱసె బోరునఁ జల్లిన నిప్పులో యనన్.[132]

165


ఉ.

అంతట కాళియాహివిభుఁ డారవముల్ విని కోపతప్తుఁడై
సంతతకాలకూటనిభచండవిషోల్బణఫూత్కృతుల్ జగం
బంతయు మూఁడఁజేయఁగ రయంబున వచ్చె ననేకభృత్యులన్
గాంతలుఁ బుత్రులుం గొలువఁగా పటుకోపపరీతచిత్తుఁడై.[133]

166


ఉ.

మించి మహోగ్రపావకసమేతవిషానలముల్ ముఖంబుపై
నుంచియు దష్ట్రలం గఱచియున్ బెనుతోఁకను వీఁపుతో విభా
ళించియు గాలుఁ జేయు మెదలింపకయుండ శరీరమెల్ల బం
ధించియు నిట్లు దుర్దశకుఁ దెచ్చెను గృష్ణుని లోకజిష్ణునిన్.[134]

167


ఉ.

అమ్మురవైరి యిట్ల విషమాహికిఁ జేపడి వెళ్లలేక దుః
ఖమ్మున నున్నవాఁ డనుచు గ్రక్కున గోపకుమారులందఱున్
గ్రమ్మిన శోకవార్ధి కడగానక యేడ్చుచుఁ బాఱు తెంచి ఘో
షమ్మునఁ జెప్ప నాపిడుగుచందపుమాటల కుల్కి యత్తఱిన్.[135]

168


ఉ.

నందయశోదలు బరిజనంబులుఁ దక్కినగోపబాలికా
బృందము సీరపాణియును బెద్దయు నేడ్చుచు శోకవార్ధి నం
దంద మునుంగుచున్ బటురయంబొదవం జని కాంచి రంత గో
విందునిఁ గాళియాహిఫణవేష్టితచారుముఖారవిందునిన్.[136]

169


మ.

ఘనదర్వీకరభోగవేష్టనముచేఁ గంపించుచున్నట్టి యా
తనయుం గన్గొనినప్పు డాత్మల యశోదానందు లత్యంతదుః
ఖనితాంతాత్మకు లైరి గోపకులు శోకవ్యాకులాలోలవ
ర్తనులై యేడ్చిరి గోపికాజనులు చింతాక్రాంతులై యెంతయున్.[137]

170


వ.

ఇవ్విధంబున నాక్రోశించుచున్న వారల వారింపనోపక బలభద్రుండు దామోదరు
నవలోకించి యిట్లనియె.[138]

171

ఉ.

నెట్టన నిమహత్వమును నీభుజశక్తియు నీచలంబు నీ
గుట్టు నెఱుంగలేక పటుఘోరవిషాహికిఁ జిక్కితంచు నీ
చుట్టలుఁ దల్లిదండ్రులును శోకపయోధి మునుంగుచున్నవా
రట్టె మహాత్మ యెంతదడ వైనను మానుషలీల లేటికిన్.[139]

172


శా.

భూలోకంబున దుష్టశాత్రవచయంబుం జంపి ధర్మజ్ఞులన్
బాలింపంగ జనించినాఁడవు మహీభారావతీర్ణక్రియా
శీలత్వంబు వహించి నీ విపుడు లక్ష్మీనాథ యీపాముతో
బాలక్రీడలు సల్ప నేమిటికి నిర్బంధించి మర్దింపవే.[140]

173


చ.

అనవుడు లేతన వ్వొలయ నాజలజాక్షుఁడు దివ్యమూర్తిఁ గై
కొని తను వుబ్బఁజేయుటయు ఘోరభుజంగమబంధనంబులె
ల్లను వెస వీడె నప్పుడు బలంబుఁ జలంబును మీఱ పన్నగేం
ద్రునిశిరముల్ పదంబులును ద్రొక్కి విచిత్రగతుల్ చెలంగఁగన్.[141]

174


తే.

కడఁగి హ స్తంబులను రెండుకడలనున్న, రెండుతలలును వెసఁబట్టి దండి మెఱయ
నడిమి శిరమెక్కి కడుఁగఠినంబులైన, పాదఘట్టనములచేతఁ బగులదన్నె.

175


క.

తల యీగతి నలినలియై, సొలవక నెత్తురులు గ్రక్కుచును దైన్యముతో
పొలుపఱిన కాళియాహిని, పెలుచన నొక్కింతవెలితి పీనుఁగుఁ జేసెన్.[142]

176


మ.

వివశుండై పెనుమూర్ఛనొందిన విభున్ వీక్షించి యత్యంతశో
కవిలాపంబులతోడ నంగలతికల్ కంపింప నాగేంద్రమా
సవతుల్ వచ్చి భుజంగరాజశయనున్ నాళీకపత్రాక్షు యా
దవచూడామణిఁ జేరి యిట్లనిరి తాత్పర్యంబుతో మ్రొక్కుచున్.[143]

177


ఉ.

దేవ సమస్తలోకనుత దివ్యమునీంద్రమనోనివాస ల
క్ష్మీవర వాసుదేవ సరసీరుహనేత్ర యనాథనాథ లో
కావనదక్ష నిర్జరగణాధిప కేశవ యీశ పీతవ
స్త్రావృత దేవకీసుత దయాపర మమ్ము ననుగ్రహింపవే.[144]

178


తే.

నిఖిలలోకాశ్రయం బైననీపదోగ్ర, ఘట్టనంబున నెట్లోర్చుఁ గమలనాభ
యల్పబలుఁ డైనయీకాళియాహిశిరము, హస్తిమశకాంతరము నీకు నాతనికిని.

179

క.

దేవర కడుఁగోపంబున, నీవిధమున నాజ్ఞ పెట్ట నీక్షణమందున్
జీవంబు విడుచుచున్నాఁ, డీవాతాశనుఁడు కోప మేటికిఁ గృష్ణా.[145]

180


ఆ.

మాకు పురుషభిక్ష మన్ననతోఁ గృప, సేయుమయ్య యనుచుఁ జిన్నవోయి
మ్రొక్కుచున్నఁ గరుణ మొలచుచిత్తంబుతో, గాళియాహివిభునిఁ గాచి విడిచె.

181


క.

ముక్కున నోరున నెత్తురు, గ్రక్కుచుఁ దలదిమ్ముపట్టి కడుదీనతతో
నొక్కింత యీరెలుంగున, నక్కమలదళాక్షుఁ జూచి యతఁ డిట్లనియెన్.[146]

182


క.

ఏ నేమితప్పు చేసితి, నోనలినదళాక్ష నీనియోగంబునఁగా
దే నాడు జలధినుండుట, మాని యిటకు వచ్చినాఁడ మగువలు దానున్.[147]

183


ఆ.

ఓరపడగఁ బెట్టి యోరంతప్రొద్దును, గుటిలవృత్తితోడఁ గ్రూరకర్మ
ములకు నోర్చి లోకములకుఁ గీడొనరించు, పాపజాతిజాతి పాఁపజాతి.[148]

184


వ.

అట్టి మాజాతిరూపానురూపస్వభావంబులు దప్పి యన్యథామార్గంబులు నాజ్ఞ
వెట్టుట యుచితంబుగాక నన్ను నిట్టిక్రూరజాతియందుఁ బుట్టించిన నీవు మానడవ
డులకు నిరోధించి యిట్లు చేసినయపరాధంబు నిరూపించక రక్షించి వలయు
పనులకు నియోగింపు మనినఁ గరుణించి కృష్ణుం డిట్లనియె.

185


క.

నీ వింక నిందు నుండక, నావచనముఁ బూని యంగనామిత్రసుపు
త్రావళితో జలరాశికి, వేవేగమ కదలిపొమ్ము విషధరముఖ్యా.[149]

186


క.

నీపడగమీఁద నుండెడు, నాపదచిహ్నములు చూచినను గరుడుఁడు ని
న్నెపుడు భక్షింపఁడు నా, నాపన్నగవరుల నట్టు లడుచు నతుండున్.

187


వ.

అని యానతిచ్చినఁ బ్రసాదంబని యాప్రొద్దె కదలి చని సముద్రంబ ప్రవేశించె నంత.[150]

188


క.

మడుఁగు వెడలి హరి వచ్చినఁ, గడుమోదముతోడ గోపికలు గోపకులున్
వడి గ్రుచ్చి కౌఁగిలించిరి, కొడుకుం దలిదండ్రు లెత్తికొనిరి ముదమునన్.

189


వ.

ఇవ్విధంబునం గాళియాహిమర్దనుం డైనజనార్దనుం బ్రశంసించుచు నతండు
చేసినపరాక్రమంబు లుగ్గడించుచుఁ బ్రమోదభరితమానసులై గోకులంబునకు
వచ్చి సుఖంబుండి రంత.[151]

190

ధేనుకాసురసంహారము

ఉ.

గోవులఁ గాచుచు బలముకుందులు తొల్లిటియట్ల గోపపు
త్రావళిఁ గూడి శైశవవిహారవినోదములం గడింప బృం

దావనభూమినుండి యొకనాడు మహోగ్రనిశాటకోటికిం
దావలమై మహింబరఁగు తాళవనంబున కేగి యచ్చటన్.[152]

191


క.

పచ్చనికసవులు పసులను, విచ్చలవిడి మేయఁదోలి వేడుకతోఁ గ
న్నిచ్చకు వచ్చిన యచ్చటి, మెచ్చులతాళములలోన మెలఁగుచు నున్నన్.[153]

192


క.

కొందఱు గోపులు రామము, కుందులకడ కేగుదెంచి గోగణములతో
నిందు మనమున్న నొప్పుమి, చెందుఁ జుమీ యసురకోటిచే బశుతతికిన్.[154]

193


ఆ.

ధేనుకాదు లైనదానవు లీతాళ, వనములోన నున్న వారు దీని
సొచ్చి వాసవాదిసురగణంబులకైన, వెక్కసంబు బ్రతికి వెడలి చనుట.[155]

194


చ.

అని వినిపించిన బలమురాంతకు లుక్కునఁ జేరి యవ్వనం
బునఁ గల దైత్యకోటి బొరిపుచ్చక లోకముబాద మానదం
చు నరిగి చండకేసరికిశోరయుగంబును బోలె భీకర
ధ్వను లొనరించుచున్ జెలఁగి తాళవనాంతరభూమి సొచ్చినన్.[156]

195


ఉ.

ఆనినదంబు బిట్టు విని యప్పుడు గార్దభరూపధారులై
ధేనుకముఖ్యరాక్షసులు తీవ్రగతిం బఱతెంచి దేవకీ
సూనునిఁ దన్నుచున్ గఱచుచున్ సమరం బొనరింపఁ జొచ్చినన్
భానునిభప్రతాపబలభద్రుఁడు యాదవవీరుఁ డుగ్రుఁడై.[157]

196


క.

తనుఁ బొదివి బిట్టు కదిపిన, ఘనగార్దభదైత్యకోటికడ
కాళ్లం గై
కొని త్రిప్పి త్రాటిమాఁకుల, కొనలు దునిసి నేలమీఁదఁ గూలఁగ వైచెన్.[158]

197


క.

ధేనుకుఁడు చటులగార్ధభ, మై నిష్ఠురవృత్తితోడ నాహవమునకున్
బూని చనుదెంచుటయు హరి, వానిం గడకాలువట్టి వడిగా నింగిన్.[159]

198


చ.

బిరబిరఁ ద్రిప్పివైచుటయు బెట్టుగ నెత్తురు నోరఁ గ్రక్కుచున్
ధరణితలంబునం బడియెఁ దక్కినరక్కసులెల్ల భీతులై
యరిగి ప్రలంబుఁ జేరి శరణాగతులై యనిలోన ధేనుకా
సురవరుచావు చెప్పుటయు శోకసమాకులుఁడై ప్రలంబుఁడున్.

బలభద్రుండు ప్రలంబాసురుని సంహరించుట

వ.

మాయోపాయంబుల బలభద్రకృష్ణులఁ బరిభవించువాఁడై తదీయరంధ్రాన్వే

షణంబు సేయుచుండె నిట్లు తాళవనంబు నిష్కంటకంబు చేసి దైత్యకంటకు
లచ్చటం బసులగుంపుల నింపుల మేపుచుఁ దాళఫలంబులు సమస్తజనులకుఁ
జూఱలు విడిచి యిష్టవినోదంబులం దగిలియుండి రంత.[160]

200


ఆ.

సీరచక్రపాణు లిరువురు విజయసం, పన్నులై చెలంగి పసుల మేపు
చుండి యొక్కనాఁడు భాండీరవటమున, కరిగి యచట నిష్టమైనగతుల.[161]

201


సీ.

కోలక్రోఁతులు బిల్లగోళ్లు దూరనఁగోల లందలంబులు మఱికుందికాళ్లు
పుట్లచెం డ్లుప్పనఁబట్టె లాలంకులు గుడుగుడుగుంచాలు గుంటచాళ్లు
చీఁకటిమొటికిళ్లు చిమ్ముబిల్లలు నెట్లు బొట్టనఁగోలలు బొమ్మరాలు
కుప్పిగంతులు పిడిగ్రుద్దులాటలు పిల్లదీవులు గొబ్బిళ్లు గూవనాలు


తే.

గుళ్లు దాఁగిలిమ్రుచ్చులు గోడిపట్టె, లేలపాటలు సరిబేసు లీలకూఁత
లాదిగా శైశవక్రీడ లాడి రచట, రామకృష్ణులు గోపదారకులఁ గూడి.[162]

202


వ.

ఇవ్విధంబున వినోదించుచున్న నొక్కనాఁడు ప్రలంబుండు గోపబాలవేషంబు
గైకొని వారలలోపల వర్తించుచుండి.

203


క.

ఇరువురు నిరువురు జోడై, బెరసి యొకరినొకరు మోచి పెద్దయుదూరం
బరుగుచు గెల్చుచు నోడుచు, నరుదగు క్రీడలఁ జెలంగి రందఱుఁ దమలోన్.[163]

204


ఆ.

హలి ప్రలంబు మోచె హరి సుదాముఁడు మోచె, నిట్టు లొక్కరొకరి నెక్కి వచ్చు
వారి మోచివచ్చువార లోడినవారి, భుజములందు నెక్కి పోవునపుడు.[164]

205


చ.

చెలఁగి సుదాము నెక్కి హరి సీరధరుండు ప్రలంబు నెక్కి వి
చ్చలవిడి నందఱుం దగినచందములన్ దమతోడియుద్దులన్
బలువిడి నెక్కి పోవునెడ బంధురవిక్రముఁ డైనదానవుం
డలుకమెయిన్ హలాయుధుని నప్పుడు మూఁపునఁ దాల్చె దండితోన్.[165]

206


క.

ఘనశకటచక్రనిభమగు, కనుఁగవయును దగ్ధశైలగాత్రము వికటా
ననమును లంబోదరమును, గనకాభరణములు బూని గగనమునందున్.[166]

207


తే.

పూర్ణచంద్రసమేతమై పొలుచు వర్ష, కాలమేఘంబుకైవడి కపటదనుజుఁ
డభ్రమార్గంబునందు హలాయుధప్రయుక్తుఁడై చనె లోక మోహో యనంగ.[167]

208

క.

బలభద్రుని భరియింపఁగ, నలవు చెడి ప్రలంబదైత్యుఁ డయ్యెడ ధరణీ
తలమునకు వచ్చె నప్పుడు, జలజాక్షుం డెచ్చరింపఁ జటులప్రౌఢిన్.[168]

209


వ.

దనుజునిశిరోరుహంబులు వామహస్తంబునం జుట్టి పట్టి చరణంబులఁ గంఠంబు
బిగియించినం గళవట్టి గుడ్లు వెలికుఱికి కదలనేరక యున్నసమయంబున దామో
దరచోదితుండై బలభద్రుండు.[169]

210


క.

ఘనతరకోపారుణలో, చనములఁ గల్పాంతకాలశమనునిగదతో
నెనవచ్చుముష్టిచేతను, దనుజునిమస్తకము బెట్టిదంబుగఁ బొడిచెన్.[170]

211


క.

పొడిచిన మెదడును నెత్తురు, పడి దొరుఁగఁగ శిరము పగిలి వాఁడు ధరిత్రిన్
బడి చచ్చె గోపబాలకు, లుడుగక బలభద్రుఁ బొగడుచుండిరి వేడ్కన్.

212


వ.

ఇవ్విధంబున.

213


క.

బలభద్రుఁడు మర్దించెను, బలవద్రి పుభయదభూరిబాహువిడంబున్
ఘనదనుజజనకదంబున్, లలితేతరదుర్గుణావలంబుఁ బ్రలంబున్.[171]

214


మ.

బలవద్వైరిమదప్రభంజనకళాపారీణు లారామకృ
ష్ణులు గోపాలకుమారులం గలిసి తేజోమూర్తులై నందగో
కులవాసుల్ గొనియాడ నిష్టగతులన్ గోపాలవేషంబులన్
బొలుపైయుండిరి తల్లిదండ్రులకు సమ్మోదంబు సంధిల్లగన్.[172]

215

శరత్కాలవర్ణనము

వ.

అంత శరత్కాలంబు ప్రవేశించిన.

216


క.

అడవులలోన ముదంబులు, విడిచి మయూరములు మౌనవృత్తుల నుండెన్
గడునొప్పనిసంసారము, లుడిగిన యోగీంద్రు లూరకుండినకరణిన్.[173]

217


తే.

భానుదీప్తులవేఁడిచేఁ బల్వలంబు, లెండి పిండలివండుగా నింకిపోయె
దారుణం బైనసంసారతాపములను, నలఁగి చిక్కినదుర్గృహస్థునివిధమున.[174]

218


ఆ.

నీరదములు లేక నిర్మలాకారమై, యాకసంబు చూడ నతిశయిల్లె
విగ్రహంబులెల్ల విడిచి సౌమ్యజ్ఞాన, యుక్తుఁ డైనదివ్యయోగిఁబోలె.[175]

219

ఆ.

సూర్యదీప్తివల్ల శోషించుచున్నప, ద్మాకరంబులెల్ల నతిశయిల్లె
బెక్కులంపటములఁ జక్కి మమత్వముల్, మానకున్న జనులమనసు లట్ల.[176]

220


క.

అమలోదకములలోపలఁ, గుముదములు వికాసవృత్తిఁ గొమరైయుండెన్
విమలాత్మునిసంగతమున, నమరి వికాసమున నున్నయధికులఁబోలెన్.[177]

221


ఆ.

తొల్లి విడిచి యున్నతోయజాకరముల యందు మరలఁ జేరె నంచపిండు
పూర్వసంచితాశములకు యోగజ్ఞాను, లంద మగుడనిల్చు నవ్విధమున.[178]

222


ఆ.

సలిలంబు వినిర్మలమై, పొలుపారెను విష్ణుభక్తిపూతంబై ని
శ్చలయోగవిద్యపెంపునఁ, జెలువొందెడు యోగివరుల చిత్తములగతిన్.

223


ఆ.

నేలమీఁదియదను నింగిపై ఘనములు, జలము గలుగుటయును బొలిసిపోయె
నింద్రియంబులందు నింద్రియార్థములు ప్రత్యాహతంబు లైనయవ్విధమున.[179]

224


వ.

ఇట్టి శరత్కాలంబు వ్రజనివాసు లయిననందాదిగోపాలవర్గంబు లనర్గళంబు
లయిన ప్రయత్నంబులతోడఁ బురుహూతప్రీతిగా యాగంబు చేయం దలంచి
సకలపదార్థంబులు సంపాదించుచున్న యప్పుడు యజ్ఞమూర్తి యైననారాయ
ణుండు నందున కిట్లనియె.[180]

225

శ్రీకృష్ణుఁడు గోవర్ధనపర్వతము నెత్తుట

ఆ.

ఏమిఫలము గోరి యింద్రునిఁగూర్చి యీ, యాగకర్మ మిప్పు డాచరించు
చున్నవారు చెప్పుఁడన్న నాదామోద, రునకు నందగోపుఁ డొనరఁ బలికె.

226


సీ.

దేవతాధీశచోదితములై మేఘముల్ వసుమతీతలమున వానగురియు
వానగల్గిన మహీవలయంబు సస్యసమృద్ధయై ధాన్యంబు మిగులఁగల్గు
ధాన్యంబు గల్గిన ధరణీప్రజల కెల్ల సంతతానందంబు సలుపుచుండుఁ
బ్రజల కానందంబు పాటిల్లినను దేవసంతర్పణంబులు సాగివచ్చు


తే.

నావు లెల్లను బ్రతుకు క్షీరంబు వలసి, నటులఁ బిదుకును మొదవులు నట్టు లైన
నెల్లప్రజలకు మనకు నచ్చికము లేక, యుండగలుగు మహిమ లుల్లసిల్ల.[181]

227


వ.

కావున లోకోపకారంబుగా నేఁటేఁట నింద్రోత్సవంబు చేయుదు మనిన ముకుం
దుండు పురందరునకుఁ గోపంబు పుట్టునట్టుగా నందున కిట్లనియె.

228


ఆ.

పైరువలన మనము బ్రతికెడువారము, గాము విపణివర్తకంబుచేత

జీవనంబు నడుప మావులే దైవంబు, లనుచు నుండువార మగుటఁ జేసి.[182]

229


వ.

అన్వీక్షత్రయీవార్తాదండనీతులను విద్యాచతుష్టయంబునందు వార్త యను
విద్య కృషివాణిజ్యగోపాలనంబులవలనను వృత్తిత్రయాశ్రయంబై యుండు కర్షకు
లకు గృషియును విపణిజీవులకు వాణిజ్యంబును మనకు గోపాలనంబును బరమ
వృత్తులగు నీమూడుదెఱంగులవారికిం తమతమవృత్తులే పరమదైవంబులగు
నవియె వారికి పూజనీయంబులయి యభీష్టఫలంబుల నొసంగుచుండు.[183]

230


ఆ.

తనకు నిష్టమైనదైవంబు కృపచేత, బ్రతికి యన్యదైవభజన సేయు
వార లిందు నందు వరపుణ్యహీనులై, పొలిసి తమ్ముదారె పోదు రనఘ.[184]

231


ఆ.

సీమ యగును పైరు చేసినచోటెల్ల, నందు నుండి యయ్యె నడవిబీడు
శాసనాంత మది కటకంబులును బర్వ, తములు మనకుఁ బరమదైవతములు.[185]

232


తే.

ఇల్లు ముంగిళ్లు మొదలుగా నెల్లవియును, విడిచి పక్షులకైవడి నడవులందుఁ
గొండలందును వర్తించుచుండు మనకుఁ, బరమదైవంబు లగుఁ గదా పర్వతములు.

233


ఉ.

కొండలు కామరూపములఁ గ్రమ్మరుచున్ విపినాంతరంబులం
దుండుమహాపరాధుల వనౌకసులం జటులోగ్రగండభే
రుండగజేంద్రదుష్టమృగరూపములన్ వధియించుసజ్జనుల్
నిండినభక్తిఁ గొల్చినను నెక్కొనఁజేయు ననేకభాగ్యముల్.[186]

234


క.

కావునఁ బర్వతములకును, గోవులకుఁ బ్రియంబు గాఁగఁ గోరి మఘంబుల్
గావింత మెన్నివిధముల, భావించిన నింద్రుతోడి పని మన కేలా.

235


ఆ.

భూసురులకు మంత్రపూజలు హలపూజ, కర్షకులకు గోనికాయశైల
పూజ మనకు నధికపుణ్యఫలంబుల, నొసఁగు విపినచరుల కొండు వలదు.[187]

236


వ.

కావున నొండువిచారంబులు విడిచి మీరు సర్వఘోషసమేతంబుగా గోవర్ధన
శైలంబునకు నుత్సవంబు సాటించి గాటంబుగా వేఁటలం జంపి బహుప్రకారం
బులయినపూజలతోడ జాతరలు చేసి యాగమోక్తప్రకారంబున హోమ
కృత్యంబు నిర్వర్తించి పాయసాపూపవ్యంజనరంజితంబులుగా బ్రాహ్మణులకు

భోజనంబులు పెట్టించి గంధపుష్పాక్షతల నలంకరించిన మొదవులతోడ గిరి
ప్రదక్షిణంబు చేసిన మనకు శోభనంబు గలుగునని చెప్పిన నతనివచనంబు లాద
రించి సాధువాదంబులఁ గొనియాడి.[188]

237


క.

ఆగోవిందుఁడు చెప్పిన, లాగున నందాదిగోకులావాసులు నా
నాగతుల నాచరించిరి, గోగిరియజ్ఞములు భక్తి కొనసాగంగన్.[189]

238


వ.

ఇట్లు గోవర్ధనమహోత్సవంబు చేసి గర్జితాభంబులచందంబున నర్తనంబులు చేయు
దుర్దమవృషభంబులతోడ సర్వాలంకారశోభితంబు లైనగోగణంబులు మున్నుగా
సమస్తగోపాలవర్గంబులు పర్వతప్రదక్షిణంబులు చేసి యనేకస్తోత్రంబులతోడ
నమస్కారములు చేసి రంత.[190]

239


క.

ఆపర్వతాగ్రమునఁ దన, రూపము బలభద్రసోదరుఁడు చూపుచు నా
గోపాలవర్గమునకును, నేపార ననేకఫలము లిచ్చి చనుటయున్.

240


వ.

ఇవ్విధంబున.

241


క.

గోవర్ధనశైలమునకు, గోవులకును మఘము చేసి గోపాలురతో
నావులగుంపులతోడను, గోవిందుఁడు మరలివచ్చె గోకులమునకున్.

242


క.

వాసవుఁడు నందగోపుఁడు, చేసినయపరాధమునకుఁ జిత్తములోనన్
గాసిలి మేఘగణంబుల, లో సంవర్తాఖ్యజలదలోకముఁ బెలుచన్.[191]

243


క.

రప్పించి యధికసంభ్రమ, ముప్పొంగఁగ నందగోపుఁ డున్నవ్రజముపై
చెప్పరపుతాలవర్షము, గుప్పింపుఁడు గోగణములు గోవులు మడియున్.[192]

244


క.

ఇది యనుచితకృత్యం బని, మదిఁ దలఁపక యరుగుఁ డభ్రమాతంగముపై
ముదమొప్ప నెక్కి యేనుం, గదలి మిముం జూడ వత్తుఁ గడునెచ్చరికన్.[193]

245


వ.

అని యనేకప్రకారంబుల బుజ్జగించుచు వెచ్చరించిన ప్రసాదంబని యాసంవ
ర్తనమేఘగణంబు చని పర్జన్యుండు మెచ్చునట్లు నిర్ఘాతవాతవర్షంబులు గురి
యంజొచ్చిన.[194]

246


మ.

శతమన్యుండు తటిత్కరావళులచే ఝంఝాగతిం గొట్టఁగా
నతిభీతిన్ మొఱవెట్టెనో యనఁగ నుద్యల్లీల గర్జించి యు
ద్ధతవృత్తిన్ జటులాంబుదంబులు తదీయానేకభూషామణి
ప్రతతుల్ రాలినయట్లు రాలె పిడుగుల్ ప్రవృతమై భూస్థలిన్.[195]

247

మ.

ధరణీదిగ్గగనంబు లేకముగ నుత్పాతాంబుదశ్రేణి ని
ర్భరవృత్తిన్ క్షణమాత్రలో నిబిడధారాసారపూరంబుగాఁ
గురిసెన్ వానలు చండవాతములతో ఘోరాంధకారంబుతో
నురునిర్ఘాతతటిత్పరంపరలతో నొక్కుమ్మడిన్ బెట్టుగన్.[196]

248


వ.

ఇట్లు మహోత్పాతవర్షంబులు గురియునప్పు డత్యంతదుర్నిరీక్ష్యప్రకంపితశంపా
తేజంబులవలనను బధిరీకృతసమస్తభూతవ్రాతఘుమఘుమారావస్తనితశబ్దంబుల
వలనను మహోగ్రతుంగశృంగమహీధరచూర్ణితనిర్ఘాతపాతమహోగ్రధ్వానం
బులవలనను చండశుండాలశుండాదండసమానధారాసారకరకావర్షంబులవలనను
దుర్దినీభూతసకలదిశాపరిచ్ఛిన్నజీమూతజాతఘనాంధకారంబులవలనను బ్రమసి
నందగోకులంబునం గలనానాగోగణంబులును జచ్చియును నొచ్చియును
వడఁకులు పట్టియును మెడలు మడంగియును నఱచియునుం బఱచియును జెల్లా
చెదరయ్యును వఱదలం గలసియును నిట్లు బహువిధంబుల నింద్రజాలంబు
చూపినవిధంబునఁ బసులు నేలపాలైనం గనుగొని గోపికాగోపవర్గంబు లార్తనా
దంబులతోడ నున్నం జూచి దామోదరుఁ డిట్లనియె.[197]

249


క.

తనయాగము విఘ్నము చే, సినకీడున వజ్రి యింత చేసెను మీగో
ధనమును మిమ్మును గాచెద, రునికితములు మానుఁ డనుచు మదిఁ గృప మెఱయన్.[198]


క.

గోపాలురు వెఱఁగందఁగ, గోపీజనవల్లభుండు గొడుగుగఁ బట్టెన్
గోపీగోపకగోగణ, గోపనసద్వర్తనమును గోవర్ధనమున్.[199]

251


వ.

ఇట్లు గోవర్ధనశైలంబుఁ బెఱికి సకలచరాచరభూతసంజాతకంజాతభవాండభార
వహనప్రశస్తం బైనయపసవ్యహస్తంబున విచిత్రంబుగాఁ దాళఛ్ఛత్రంబునుం
బోలె గోపాలగోపాంగనాగోగణంబులమీఁద పురందరచోదితసంవర్తధారా
ధరప్రయుక్తం బైనయమహావర్షంబు గురియకుండఁబట్టె ని ట్లేడహోరాత్రం

బులు సుత్రాముండు పరుషంబుగఁ గరకావర్షంబు గురియించి గోష్ఠంబునకు
నేయపాయంబును జేయనేరక విషణ్ణహృదయుండై మేఘంబుల వారించిన
నాక్షణంబ.[200]

252


క.

ఆశాశంబు పయోదా, నీకంబులు లేక మిగుల నిర్మలమయ్యెన్
భీకరతరసంసార, వ్యాకులములు లేనియోగియాత్మయుఁ బోలెన్.[201]

253


క.

ఈవిధమున నాఘోషము, గోవిందుఁడు గాచి కరుణ కొనసాగంగా
గోవర్ధనాద్రిఁ దొల్లిటి, తావున నీడి మహిమతో విడంబించుటయున్.[202]

254

శ్రీకృష్ణునిసన్నిధికి నింద్రుండు వచ్చుట

ఆ.

పాకశాసనుండు పరమానురాగంబు, తోడ నందసుతునిఁ జూడఁగోరి
యభ్రగజము నెక్కి యరుదెంచి పొడగాంచె, నఖిలలోకజిష్ణుఁ డైనకృష్ణు.[203]

255


క.

గరుడుఁడు గగనమునను నె, వ్వరికిం గానంగరాక వరపక్షములన్
గరువమున నీడపట్టఁగఁ, బరమానందమున నున్నభవ్యునిఁ గాంచెన్.

256


వ.

ఇట్లు కనుంగొని యైరావతావతరణంబు చేసి సకలభువననిక్షేపీకృతోదరుండైన
దామోదరు నాలింగనాద్యుపచారంబుల సంభావించి యిట్లనియె.[204]

257


ఉ.

ఏపున నాదితేయదనుజేంద్రగణంబులు దేఱిచూడఁగా
నోపని యమ్మహీధరము నొక్కకరంబునఁ దాల్చి గోపికా
గోపకగోనికాయములకున్ బటువృష్టిభయంబు మాన్చి యు
ద్దీపితబాహుఁగర్వమునఁ దేజము నొందితి నందనందనా.

258


తే.

ఇట్టి యద్భుతకర్మంబు లీవు బాల్య, కాలమున నాచరించితి గానఁ గృష్ణ
భావికాలంబునందు భూభార ముడుప, నీవు చాలుదు వని నిశ్చయించినాఁడ.

259


క.

నీవు జగంబులు మెచ్చఁగ, గోవర్ధనపర్వతంబు గొడుగుగ నిడి యీ
గోవులఁ గాచితి గావున, గోవిందుఁడవైతి నందగోపకుమారా.

260


క.

అనఘాత్మ గోగణంబుల, యనుమతమున నీకు గోగణాధిపతిత్వం
బొనరింతు నుపేంద్రత్వం, బున నుండుము సకలలోకములు జయపెట్టన్.[205]

261


వ.

అని పలికి యైరావతంబుచేతం బవిత్రోదకంబులు దెప్పించి యభిషేకించె నదినిమి
త్తంబుగాఁ గృష్ణుం డుపేంద్రుండును గోవిందుండును ననంబరఁగె నప్పుడు
గోగణంబు లత్యంతప్రసన్నమూర్తులై యయ్యాదిమూర్తికి క్షీరధారాభిషేకం
బు చేసె సురాసురయక్షగంధర్వకిన్నరకింపురుషసిద్ధవిద్యాధరగణంబులు గగన

మార్గంబున నిలిచి జయజయశబ్దంబులఁ బుష్పవర్షంబులు గురియుచు దివ్యదుం
దుభినినాదంబులు రోదసీకుహరంబున బెరయ మొరయించి రప్పు డేకాంతంబున
శచీకాంతుండు లక్ష్మీకాంతున కిట్లనియె.[206]

262


ఉ.

ఈజగతీభరం బుడుప నీవు గడంగెడునాడు నీకుఁ దో
డై జయలక్ష్మిఁ జేకొనఁగ నర్జుననామముతో మదంశజుం
డై జనియించినాఁడు పృథయందుఁ గుమారుఁడు వానిఁ గావు మీ
యాజులలోన శాత్రవభయంబునఁ బొందకయుండఁ గేశవా.[207]

263


సీ.

అనిన నుపేంద్రుఁ డయ్యమరేంద్రుతోడ నిట్లను నేను నెఱుఁగుదు నవ్విధంబు
పాండవకౌరవుల్ బలసి యష్టాదశాక్షౌహిణీబలముతో నాహవంబు
గావించునప్పుడు కవ్వడితోఁ బాండుసుతుల కేవురకు నెచ్చోటఁ గీడు
రాకుండ నారసి రక్షింతు నాశరీరప్రాణముల యట్లు రమణతోడ


తే.

భూమిభారంబు సర్వంబుఁ బొలియఁజేసి, యేను బరమపదంబున కేగునంత
కాలమును భూమి నేలింతుఁ గాని మాన, వారికీర్తులు ధరణిలో వన్నె కెక్క.[208]

264


వ.

ఇప్పుడే నరిష్టకంసకేశినరకాసురాదు లైనవారలం బరిమార్పి పదంపడి భారత
యుద్ధంబునఁ బ్రజాక్షయంబు సేయువాఁడ నర్జునునిమిత్తంబుగా నీకు నింతపరి
తాపంబు వలవదని చెప్పినఁ బురందరుండు సంతుష్టహృదయుండై యతనిం
గౌఁగిలించి యామంత్రితుండై యైరావతంబు నెక్కి దేవలోకంబునకుం బోయె
నంత.[209]

265


మ.

అమరేంద్రాదులకైన భారమగు కార్యంబుల్ ముకుందుండు బా
ల్యమునం జేసినఁ జూచి గోపవరు లత్యాశ్చర్యచేతస్కులై
సముద్రగ్రోచ్చరవంబులం బొగడి యాసర్వేశ్వరున్ మూఁగి యో
విమలాకారవికారదూరకరుణావిద్భూతదామోదరా.[210]

266


ఆ.

కొండ గొడుగుఁజేసి గోవులతోఁగూడ, మమ్ముఁ గాచినట్టి మహితకృత్య
మమరు లైననోప రట్టిపౌరుషము నీ, వాచరించు టెల్ల నద్భుతంబు.

267


క.

మాగొల్లపల్లెలోపల, నీగతిఁ గ్రీడించుచున్న నీ వమరుఁడవో
నాగేంద్రుఁడవో సిద్ధుఁడ, వో గంధర్వుఁడవో దానవుండవో చెపుమా.

268


ఆ.

నిను మనుష్యమాత్రుఁడని నమ్మఁగారాదు, మాకు నీస్వరూపమహిమయెల్ల
నిజము చెప్పకున్న నీకు నీపాదంబు, లాన తండ్రియాన యావులాన.

269

చ.

అనవుడుఁ గొంతసేపు జలజాయతలోచనుఁ దూరకుండి గ్ర
క్కున నలవోకగాఁ బ్రణయకోపము గైకొని వారితోడ ని
ట్లను నను నొత్తి మీ రడుగు టర్హమె నందునకున్ యశోదకున్
దనయుఁడఁగాని కాను మఱితక్కినవారలలోన నెవ్వఁడన్.[211]

270


క.

నాయందు మీరు బాంధవు, లైయుండుట నీతిగాక యన్యవిచార
ప్రాయవిధి నీయపృచ్ఛలు, సేయుట యేనీతి యేమి చెప్పుదు మీకున్.[212]

271


ఆ.

అనుచు వారిమతుల కాంధ్యంబు గల్పించి, వలయుభంగి బాంధవంబు నడపి
నందనందనుండు బృందావనమున గో, పాలబాలకేళిఁ దేలుచుండె.[213]

272

శ్రీకృష్ణుండు వేణుగానము సేయఁగా గోపికలు విని మోహించుట

వ.

అంత వికాసభాసురకుముదసౌరభసంవాసితసకలదిశాభాగంబును నిందీవరమక
రందబైందవానందసుందరేందిందిరఝంకారరావంబును షోడశకళాపూర్ణచంద్ర
చంద్రికాసాంద్రసమస్తభువనతలంబును నైనశరత్కాలంబునఁ గృష్ణుండు
గోపికాజనమనోహరంబయిన సౌకుమార్యంబుతోడ వినోదించుచుండి యొక్క
నాఁడు నిశాసమయంబున.[214]

273


ఉ.

పున్నమవన్నె శంభుతలపువ్వు ముకుందునిచూపు దట్టపున్
వెన్నెలదుంప జక్కవలవేసడి చీఁకటిమూఁకవిప్పు వా
రాన్నిధియుబ్బు తామరల రాయడి వేల్పులపంట మింటిపైఁ
దిన్ననిపూర్వచంద్రికలు దిక్కులకున్ వెదచల్లుచుండఁగన్.[215]

274


మ.

తనసౌందర్యవికాసయౌవనము కందర్పాభిరామంబుగాఁ
దనయొయ్యారపునీతి గోపికలచిత్తప్రీతి గావింపఁగాఁ
దనసంగీతవచోవిలాసము సుధాధారాప్రపూరంబుగా
వనజాతాక్షుఁడు సర్వమోహనకళావర్ధిష్ణుఁడై పెంపుతోన్.[216]

275


సీ.

పరఁగు షడ్జాదిసప్తస్వరంబులు మంద్రమధ్యతారకతానమార్గములును
బురుషాంగనారాగములు ముప్పదియు రెండు వానిమిత్రంబులు వరుస నెఱిఁగి
కాలక్రియామానగతులతోఁ దాళంబు లెఱిఁగి మూర్ఛనవృత్తు లేర్పరించి
గీతంబు దరువు జక్కిణి చిందు మొదలుగా నొక్కొక్కవర్ణంబు నుగ్గడించి

తే.

శుద్దసాళగసంకీరశోభితముల, శ్రుతులు చెడకుండఁ జెవులకు సొగసు గులుక
వేణునాదంబు మొరయించె రాణ మెఱయ, మదనగోపాలమూర్తి యమ్మాధవుండు.[217]

276


వ.

ఇట్లు సకలజనప్రమోదంబుగా వేణునాదంబు పూరించిన గోపాలగోపాంగనాగో
గణంబులును బశుపక్షిమృగాదినానాజంతుజాలంబును బర్వతవృక్షలతాగుల్మాది
సమసస్థావరభూతంబులును దమకుఁ దారి చొక్కి చిత్రరూపంబుల చందం
బుల నుండి రప్పుడు వల్లవపల్లవాధర లమ్మోహనాకారునందు బద్ధానురాగలై.[218]

277


క.

పెనిమిటికి నత్తమామల, కును దలిదండ్రులకు బంధుకోటికిఁ దోఁబు
ట్టిన మగవారికి వెఱవక, ననుపునఁ జని రతనివేణునాదంబునకున్.[219]

278


సీ.

ప్రాణేశ్వరునిశయ్యపై నుండి యొకయింతి కృష్ణలీలలు సాళగించి పాడె
నత్తమామలు చూడ నలివేణియొక్కతె తతకారములు చేసి తాళమొత్తె
దల్లిదండ్రులమ్రోలఁ దమకించి యొకలేమ లీలాగతుల సుమాళించి పాడెఁ
జుట్టంబు లెల్లను జూడ నొక్కమృగాక్షి మెల్లనఁ దలయూచి మెచ్చె నతని


తే.

వనజనయనుమీఁదివలపున నొకకొమ్మ, యిల్లు వెడలివచ్చి యెదురుకట్ల
పెద్దవార లున్నఁ బెద్దయు శంకించి, మమతతోడ మేను మఱచియుండె.[220]

279


క.

వల్లవసతియొక్కతె తన, వల్లభునిరతిప్రసంగవైభవములపొం
దొల్లక మెల్లనె లక్ష్మీ, వల్లభునిం జూడవచ్చె వల పేపారన్.

280


ఆ.

లేఁగదూడ నొక్కలేమ చిక్కముతోడఁ, గుడువ విడిచె నొక్కకోమలాంగి
కాఁగి పొంగుచున్న గాఁగులపాలలో, నీరు చల్ల మఱచి నిలిచియుండె.

281


ఆ.

ఆవుఁ బిదుకఁబోయి యలివేణియొక్కతె, దూడ వెనుకకాళ్లతోడ నావు
నడగఁగట్టి యొద్ది యాఁబోతుఁ దలకోలఁ, బట్టి యుఱ్ఱుగట్టి బయలు బితికె.

282


ఆ.

వనితయొకతె పతికి వడ్డించి వడ్డించి, బానతోడ నున్న యానవాలు
కుమ్మరించి తోడికోడండ్రు వదినెలు, మేలమాడుచుండ మేను మఱచె.[221]

283


ఆ.

మందలోన నుండి మగఁ డేల రాడోకో, యనుచు నత్త మొఱిఁగి యరిగె నొకతె
యావు వెదకితెత్తునని యొక్కగొల్లత, విభునిఁ గికురువెట్టి వెడలిపోయె.[222]

284


ఆ.

మగఁడు చూడ నత్తమామలు కోపింప, నిండ్లు విడిచి మీకు నేల పోవఁ
బొలఁతులార యనుచు బుద్ధి చెప్పఁగఁ బోయి, నట్లు పోయె నొక్కయబ్జవదన.

285

వ.

మఱియు ననేకప్రకారంబుల నాభీరవారిజాక్షు లమ్మదనగురుకడకుం జని
యతనిం బరివేష్టించి మురళీనాదంబు వినుచుఁ జిత్రరూపంబులచందంబున నుండి
రంత.[223]

286


మ.

మురళీనాదముచేత గోపికలకున్ మోహంబు పుట్టించుచున్
సరసత్వంబున మేనిచక్కఁదనమున్ సంగీతపాండిత్యమున్
బెరయన్ వారలు దన్నుఁ గూడి నడవన్ బృందాటవీమధ్యభా
సురరమ్యస్థలులందుఁ క్రీడ సలిపెన్ సొంపారి లీలాగతిన్.

287


క.

బృందావనమున నీగతి, బృందారక చక్రవర్తి ప్రియమున గోపీ
బృందయుతుండై మోహము, చెందఁగఁ బుష్పాపచయము సేయుచునుండెన్.[224]

288


ఉ.

వ్రేతలఁ గూడి యిట్లు వనవీథులఁ బూఁబొదరిండ్లు దూఱియున్
జేతులు వ్రేసి పాఱియును జెచ్చెర దాఁగిలి ముచ్చులాడియున్
గీతము నేర్పి యొండొరుల గెల్వఁగఁ జేసియు నిట్లు శంబరా
రాతిగురుండు యౌవనము రంజిలఁగా విహరించె నొక్కెడన్.

289


ఉ.

వల్లవకాంత యోర్తు యదువల్లభునిం దననేర్పు చూపి రం
జిల్లఁగఁజేసి తోడిసరసీరుహనేత్రను గానకుండఁ దా
నల్లనఁ గొంచుఁబోయి సముదంచితశీతలవారిబిందువుల్
చల్లుచు నున్న యయ్యమునసైకతభూములఁ క్రీడలాడఁగన్.

290


ఉ.

గోపమృగాక్షులందఱు ముకుందునిఁ గానక తద్వియోగసం
తాపము లంతకంతకు మనంబున నివ్వటిలంగ నవ్విభుం
డేపొల మేగెనో వెదకరే చెలులార యటంచు మాధవీ
నీపరసాలసాలరమణీయతలంబులఁ జూచి యొక్కెడన్.[225]

291


క.

గోపసతి యొకతె గాంచెను, జాపకలశవజ్రశంఖచక్రజలజరే
ఖాపరిశోభితమహిమలఁ, జూపట్టెడు హరిపదములచొ ప్పొకచోటన్.[226]

292


చ.

కని తనుఁ గూడి వచ్చు చెలికత్తియలన్ గుమిగూర్చి మీకుఁ గృ
ష్ణునిపదపంకజాతముల చొప్పిదె చూపెద భాగ్యరేఖలన్
దనరుచు నున్న దెవ్వతెకుఁ దాఁ బ్రియుఁడై రతి సల్పఁబోయెనో
గొనకొని యొక్కయింతి యడుగుం జనుచున్నది దీనివెంబడిన్.

293


క.

చనుఁగవయు గొప్పపిఱుఁదును, ఘనభారము లగుటఁ జేసి కడుఁగుంగిన యా
వనితపదంబులు కుఱుచై, చనుచున్నవి హరిపదము లసవ్యము లందున్.

294


సీ.

మునివ్రేళ్లు భూమిపై మోపనిచ్చుట నిక్కి యల్ల చెట్టున బువ్వు లంది కోసె

నచట నయ్యింతియొయ్యారంపుఁగొప్పులో వెనుకదిక్కుననుండి విరులు దుఱిమె
సరులు చిక్కులువడ్డఁ జక్కఁద్రోయఁగఁబోలు నెదురులై యున్నవి యివె పదమ్ము
లివె తనపాదంబు లవి గ్రుంగియున్నవి యువిదకుఁ గైదండ యొసఁగఁబోలు


తే.

నడచి బడలినసతిఁ దనతొడలమీఁద, నునిచి కౌఁగిటఁ జేర్చి కూర్చుండె నచట
నలిగి మరలిన ప్రియురాలి యలుకదీర్చి, యల్ల పొదరింటిలో రతు లనుభవించి.[227]

295


చ.

అని తనతోడియింతులకు నంబుజలోచనుచొప్పుఁ జెప్పుచున్
జని చని ముందటం గనిరి చంద్రనిభాస్యలు మందవాతసం
జనితకళిందజాసలిలసంభృతశీకరశీతలంబు లై
తనరుచు నున్నయట్టి సికతామయవేదుల నున్న వెన్నునిన్.[228]

296


ఉ.

పెన్నిధిఁ గాంచి సంతసిలు పేదలకైవడి గోపికాజనుల్
వెన్నునిఁ జూచి చిత్తముల వేడుక లుల్లసిలంగ నిప్పు డీ
వెన్నలదొంగఁ జూడఁగలిగెన్ మనపాలిటిభాగ్య మబ్బెనో
కన్నియలార యంచుఁ బులకల్ తనువల్లుల నివ్వటిల్లఁగన్.

297


సీ.

తరళాక్షి యొక్కతె త్రస్తరి గావించెఁ జేయెత్తి యంజలి చేసె నొకతె
యాలింగనము చేసె యలరించె నొక్కర్తు తనమోవి చవిచూపి తనిపె నొకతె
పులకాంకురంబులు పొదలించె నొకలేమ చూపులు నాటించి చొక్కె నొకతె
యొకతె పువ్వులదండ యుపధాన మొనరించె నొకయింతి తరులకు నొయ్యఁ బిలిచె


తే.

నతని వదనాంబుజము దరహాసరసము, కాంత యొక్కతె నేత్రభృంగములఁ దనిపె
నివ్విధంబున గోపిక లెల్ల నధిక, సంభ్రమంబున నుండి రాసమయమునను.[229]

298

రాసక్రీడావిహారము

క.

ఎందఱు గోపవధూమణు, లందఱకును నన్నిరూపులై యప్పుడు గో
విందుఁడు రాసక్రీడా, నందంబున రతులు సలిపె ననువేపారన్.

299


క.

ఒక్కొకకృష్ణుఁడు గోపిక, యొక్క తెయును వరుస నిలిచి యొండొరుకరముల్
మక్కువఁ గైకొని యందఱు, నక్కజముగ రాసమండలాకృతి బెరయన్.

300


వ.

ఇట్లు రాసమండలప్రమాణంబు చేసి పెద్దయుం బ్రొద్దు నటియించి యత్యంతపరి
శ్రాంత లైనయక్కాంతల నాలింగనంబునం జుంబనసంభాషణసంభోగాదివిశే
షంబులం దనిపి సేదలు దేర్చి తాళమానంబుగా నందఱు రాససంగీతంబు చేసి
ప్రభాతసమయంబున గోకులంబునకు వచ్చి యథాప్రకారంబున నుండి రిట్లు ప్రతి
రాత్రంబును గోపికలతోడఁ గైశోరవినోదంబుల రాసక్రీడ లాడుచుండె.[230]

301

తే.

అఖిలభూతమయుం డైనయమ్మహాత్ముఁ, డనిలమునుబోలె సకలమునందు నుండుఁ
గాన గోపాంగనలతోడఁ గలసి రతులు, సలిపె లోకాపవాదంబు గలుగకుండ.

302


వ.

ఇవ్విధంబున వినోదించుసమయంబున.

303

అరిష్టాసురవధ

సీ.

మీఱిన క్రొవ్వాఁడికోఱకొమ్ములపుట్ట లాడ కాడకును గోరాడియాడి
కడునుబ్బునను గణింగని ఱంకె వేయుచు ధరణీతలము కాలఁ ద్రవ్వి త్రవ్వి
కాలాహికంటె భీకరమైరవాలంబు దిక్కులు కంపింపఁ ద్రిప్పి త్రిప్పి
చటులతరస్కంధసంఘర్ష ణంబున తోడమ్రాఁకులు గూలఁ ద్రోచి త్రోచి


తే.

నీలమేఘంబుకైవడిఁ గ్రాలుచున్న, రూపమున భీకరాకృతి చూపి చూపి
వృషభరూపంబు గైకొని వెస నరిష్టుఁ, డేపుతో గోకులంబున కేగుదెంచె.[231]

304


క.

కంజాకరంబుఁ జొచ్చిన, కుంజరమునుబోలెఁ బసులగుంపులలో లీ
లం జొచ్చి గోగణంబుల, భంజించుచునుండె నధికభయదాకృతితోన్.[232]

305


వ.

అప్పు డాభీరవరు లత్యంతభయాకులమానసులై మొఱవెట్టుచుఁ గృష్ణుని
మఱుంగు పొచ్చినం గరుణించి.

306


మ.

హరి గోపాలుర నోడకుండుఁడని కోపాటోపసంపీడితా
ధరుఁడై యావృషభాసురుం గదిసి యుద్యద్ఘోరహుంకార ము
ద్ధురతన్ జేసిన కృష్ణుకుక్షిపయి దైత్యుం డుద్ధతిన్ గ్రుచ్చినన్
మురవిధ్వంసి నిశాచరాధముని కొమ్ముల్ పట్టి బిట్టార్చుచున్.

307


ఉ.

మిక్కుట మైనతీవ్రమున మింటిపయిన్ వెసఁ ద్రిప్పి నేలతో
నుక్కణఁగంగ వైచుటయు నొక్కట ముక్కున నోర నెత్తురుల్
గ్రక్కుచుఁ బ్రాణముల్ విడిచెం గంజదళాక్షునిఁ జూచి గోపకుల్
మ్రొక్కుచు హస్తపద్మములు మోడ్చి నుతించి రనేకభంగులన్.[233]

308


క.

హరి బిట్టుగిట్టి చంపెను, బరమమునివ్రాతశాపపన్నగదష్టున్
సురసంఘస్ఫీతరిష్టున్, దురహంకృతచేష్టు లోకదుష్టు నరిష్టున్.[234]

309

కంసుండు నారదువలన రామకృష్ణులప్రభావము విని సహింపక ధనుర్యాగవ్యాజంబున వారల మధురకుఁ దోడ్కొని రమ్మని యక్రూరు నంపుట

వ.

అంత నొక్కనాఁడు నారదుండు కంసుపాలికిం బోయి యతండు చేయుసత్కారం
బులు వడసి యతనితోడ వైష్ణవాంశంబుల దేవకీదేవియందు రామకృష్ణులు

జన్మించి నందగోకులంబునం బెరుగుటయును గృష్ణుండు పూతనచన్నుఁబాలతో
డంగూడఁ బ్రాణంబులు గ్రోలుటయును శకటపరివర్తనంబు సేయుటయును యమ
ళార్జునంబులఁ గూలఁద్రోచుటయు యమునాహ్రదంబున నున్న కాళియాహి
మర్దించుటయు ధేనుకాసురుం బరిమార్చి తాళవనంబు నిష్కంటకంబు సేయుట
యును భాండీరవనంబున నున్న ప్రలంబుని బలభద్రుచేతం జంపించుటయును
బర్జన్యప్రయుక్తం బైనవర్షంబువలన నందగోకులనివాసులకు నుపద్రవంబు గా
కుండ గోవర్ధనశైలంబు ఛత్రంబుగాఁ బట్టుటయును గోపికాజనసమేతుండై
రాసక్రీడల వినోదించుటయును అరిష్టాసురుం బరిమార్చుటయును మొదలుగా
సమస్తంబును సవిస్తరంబుగాఁ జెప్పిపోయిన.

310


క.

కంసుఁడు భోజేంద్రకులో, త్తంసుఁడు శక్రాదిదేవతాగణశుభవి
ధ్వంసుఁడు భగినీపుత్రనృ, శంసుఁడు నానాసురప్రశంసుఁడు కినుకన్.[235]

311


సీ.

ఆనకదుందుభి నవరాని వినరాని దుర్వాక్యసూచులఁ దూలపుచ్చె
వృష్ణిభోజాంధకవీరవర్గము నెల్లభంగుల సకలసంపదలు గొనియె
నందగోపునియాలమందల నన్నింటి బలిమిఁ గైకొని వీరభటుల నినిచెఁ
దనమేలు చూడఁజాలనివీరవర్గంబు క్రొవ్వాఁడి గొఱ్ఱుల గ్రుచ్చఁ బనిచె


తే.

ధర్మమార్గంబు దప్పనితండ్రి నుగ్ర, సేను శృంఖలాబద్దునిఁ జేసి బంది
గమున నిడి మేటిదైత్యులఁ గాపువెట్టె, గంసుఁ డత్యంతభీకరాకారుఁ డగుచు.[236]

312


ఉ.

జన్నము పేరు చెప్పి పటుసత్వసమగ్రుల రామకృష్ణులన్
మిన్నక పిల్వఁబంచి బలిమిన్ వధియించెద నొండె నట్లుగా
కున్నను జెట్లచేత వధ మొందగఁజేసెద నొండెఁ బోరిలో
నెన్నివిధంబులం బగఱనే పణగించెద నిన్నినేర్పులన్.

313


వ.

అని యిట్లు తనలో విచారించి.

314


సీ.

అక్రూరుఁ బిలిచి యిట్లను నన్నుఁ జంపుటకై విష్ణుదేవునియంశమునను
వసుదేవదేవకీవరపుత్రులై రామనారాయణులు పుట్టి నందగోప
గోకులంబున బెరుగుచునుండి నావారి నందఱిఁ జంపినా రనుచు నేఁడు
నారదుం డేతెంచి నాతోడ సకలంబు నేకాంతమునఁ జెప్పి యిప్పు డేగె


తే.

నెంత చేసిరి చూచితే యీవుదక్క, నకట నాతండ్రి యుగ్రసేనాదులైన
యాదవులు నాకుఁ గీడు సేయంగఁ బూని, యున్నవా రింక నేమని యుగ్గడింతు.

315


మ.

అది యట్లుండెను గాందినీసుత ధనుర్యజ్ఞంబు గావింపఁగా
నిదె యెల్లుండి యుపక్రమించెదను నీవే తన్నిమిత్తంబుగా
ముద మొప్పన్ రథ మెక్కి వే గదలి రాముం గృష్ణునిన్ నందగో
పదురాత్ముం గొనిరమ్ము వచ్చినను దత్పాపాత్ములం జంపెదన్.

316

క.

ముష్టికచాణూరాదుల, ముష్టిహతులనైనఁ బ్రాణములు గొనిపింతున్
దుష్టాత్ములలోకముల న, పష్టంభం బైనఁబ్రాభవము నా కొదవన్.[237]

317


సీ.

తొలిదొలి రామకృష్ణులఁ జంపి మఱి దేవకీవసుదేవుల గీటణంచి
నందగోపాదుల నందఱఁ బెదపెదకొఱ్ఱుల నిడి వారిగోధనంబు
హరియించి మాతండ్రి యగునుగ్రసేనునితోఁగూడ నాకతిద్రోహులైన
యదువంశజులనెల్లఁ బొదివి దామెనకట్టుగాఁ గట్టి వెసఁ గులక్షయము చేసి


తే.

యేచి నిష్కంటకం బైనయీజగంబు, నేన యేలెద లోకంబులెల్లఁ బొగడ
నీవు నాకుఁ బ్రియంబుగా నీప్రయోజ, నంబు గావించుటకుఁ బయనంబు గమ్ము.

318


క.

చాలఁగ నేతులు పెరుగులు, పాలును గోపకులచేతఁ బట్టించుక ర
మ్మాలస్యము సేయక యని, లాలన గావించుటయుఁ జెలంగుచు మదిలోన్.

319


వ.

పరమభాగవతుం డైననాశ్వఫల్గునందనుండు దనకుఁ గృష్ణసందర్శనంబు గలిగెఁ
గృతార్థుండనయితి నని సంతసిల్లుచు రథారూఢుండై మధురాపురంబు నిర్ణమించె
నప్పుడు.

320

కేశి యనువాని వధించుటవలన నారదుండు కృష్ణునికిఁ గేశవుఁ డని పేరిడుట

మ.

అట కంసాసురుదూత కేశి యనువాఁ దశ్వాకృతిన్ దారుణ
స్ఫుటహేషారటనంబు లాకసమునన్ బూరింపఁగాఁ జేయుచున్
పటలం బుట్టినగాలిచే జలధిసంఛన్నంబు గావించుచున్
జటులోదగ్రఖురాగ్రఘట్టనల భూచక్రంబు భేదించుచున్.[238]

321


మ.

చని బృందావనవీథిలో మెఱయు గోష్ఠం బుద్ధతిన్ జొచ్చి గ్ర
క్కున గోవిందునిమీఁద వచ్చునెడ నాగోపాలగోపాంగనా
జనులెల్లన్ మొఱపెట్టుచుఁ బఱచినన్ సంరంభచండప్రతా
పనిరూఢుం డగునవ్విభుం డసురుపైఁ బ్రస్వేదకోపంబునన్.[239]

322


మ.

ఎదు రేతెంచి యదల్చుచున్నహరిపై హేషరవోద్వృత్తుఁడై
వదనద్వారము విచ్చి బిట్టు గఱవన్ వల్గింపఁగా లీలతో
యదుచూడామణి ముష్టిహస్తము తదీయాస్యంబున జొన్పినన్
రదముల్ శారదవారిభృచ్ఛకలవిభ్రాంతిన్ వెసన్ డుల్లినన్.[240]

323


ఉ.

అక్కమలాయతాక్షుఁడు భయంకరబాహువు దైత్యుకుక్షిలోఁ
గ్రుక్కినఁ దద్దయున్ బలిసి రోగ ముపేక్షలచేత మేనికిన్
వెక్కస మైనచందమున విహ్వలభావముఁ జేసి దేహమున్

ప్రక్కలు వాపి చంపె సురవర్గము కో యని యార్చుచుండఁగన్.[241]

324


ఉ.

ఆదనుజేంద్రు నిట్లు దెగటార్చి వికాసవిభాసి యైనదా
మోదరు విక్రమక్రమము నున్నతి గోపకగోపికాజనుల్
సాదరచిత్తులై పొగడి రప్పుడు నారదమౌ నివచ్చి యం
భోదపథంబునన్ నిలిచి బోరునఁ గృష్ణునిఁ బ్రస్తుతించుచున్.[242]

325


చ.

కలహము నాకుఁ గన్గొనఁగఁ గల్గిన నంతియె చాలు నెమ్మెయిన్
బిలువనిపేరఁటం బరిగి ప్రేమముతోఁ గనుఁగొందు గావునన్
జలరుహనేత్ర యీహయనిశాచరవీరునిచావు చూడఁగా
వలసి యతిప్రయత్నమున వచ్చితిఁ జూచితిఁ జాల మెచ్చితిన్.

326


ఉ.

ఓశతపత్రనేత్ర కరుణోదయ నందకుమార దేవతా
ధీశునకైన మార్కొని జయింపఁగరాని బలాఢ్యుఁడైన యీ
కేశిని జిత్రయుద్ధమున గీటణఁగించితి గానఁ బెంపుతో
గేశవనామకంబు గలిగించితి నీకు జగత్ప్రసిద్ధిగన్.

327


ఉ.

నిక్కము గాఁగఁ గంసునకు నీకును నాలుగుమూడునాళ్లలో
నక్కజమైన యుద్ధ మగునప్పుడు వానికి బూని భూపతుల్
స్రుక్కక యెందఱేనియును రూపఱిపోయెద రట్టివైభవం
బొక్కటియుం గనుంగొనఁగ నుత్సవ మేర్పడ నేగుదెంచెదన్.[243]

328


వ.

నీకు నభ్యుదయం బగుఁ బోయివచ్చెద నని నారదుండు పోయె నంతట.

329

అక్రూరుండు వ్రేపల్లెకు వచ్చి భగవత్సందర్శనంబు సేయుట

మ.

అరదం బెక్కి ప్రమోద మేర్పడఁగ నయ్యక్రూరుఁ డేతెంచుచున్
బరమాహ్లాదము భక్తియుక్తియును దాత్పర్యంబుఁ జిత్తంబులో
బెరయన్ గృష్ణునిఁ బుండరీకనయనున్ బీతాంబరున్ ధారుణీ
ధరునిన్ జూడఁగ నేడు గల్గెను గృతార్థంబయ్యె నాజన్మమున్.[244]

330


సీ.

తలఁచినమాత్రఁ బాతకముల నెడఁబాపు సుజనవత్సలు నేడు చూడఁగలిగె
బ్రహ్మాదులకునైనఁ బ్రణతుల కోపని మురవిరోధికి నేడు మ్రొక్కఁగలిగె
నఖిలవేదాంతవిద్యారహస్యంబులప్రోడతో నేడు మాటాడఁగలిగెఁ
బ్రాపంచికముఁ దృణప్రాయంబు గావించు ప్రభువుమన్నన నేడు పడయఁగలిగె


తే.

సత్వగుణలేశములచేత జగముఁ గాచు, పురుషవర్యుండు నను నేడు ప్రోవఁగలిగె
నెంత భాగ్యోత్తరుఁడనొకొ యేను గమల, నాభు సేవించి భక్తి యొనర్పఁగలిగె.[245]

331

వ.

అని యివ్విధంబున విష్ణుభక్తియుక్తం బైనడెందంబు పరమానందంబునం బొందఁ
దదనులాపంబులు చింతించుచు నరిగి యరిగి నందగోకులంబునకు వచ్చి నంత.[246]

332


చ.

పడమటివంకఁ గ్రుంకఁ జను భాస్కరబింబముఁ దూర్పుకొండపైఁ
బొడిచినచంద్రమండలముఁ బొల్పెసలారెఁ బయోజసంభవుం
డెడపక రాసిమాసగతు లెక్కువతక్కువ లైనకాలముల్
తడఁబడు నంచుఁ దూన్చునెడఁ దాసునఁ దేలెడు చిప్పలో యనన్.[247]

333


వ.

ఇట్టి సాయంకాలసమయంబున రామకృష్ణులు వల్లవకుమారసమేతులై పసులక
దుపులనెల్లను గోష్ఠంబునకుఁ దెచ్చి తమతమవెరవులం గుదురఁద్రోలి దుగ్ధదో
హనంబునకు సమకట్టుచున్నసమయంబున.[248]

334


మ.

కనియెన్ భాగవతోత్తముండు త్రిజగత్కల్యాణవర్ధిష్ణునిన్
వనజాతాసనవాసవప్రభృతిదేవప్రాభవాధిష్ణునిన్
ఘనగర్వాంధనిశాచరేంద్రవరభాగ్యప్రక్రియాజిష్ణునిన్
కనదంభోధరకృష్ణునిన్ సుజనరక్షాతృష్ణునిన్ గృష్ణునిన్.[249]

335


మ.

లలితాంభోరుహపత్రనేత్రుఁ గరుణాలంకారు నాజానుబా
హులతాశోభితుఁ బీతవస్త్రకటిభారోదగ్రుఁ గస్తూరికా
తిలకున్ మండితమందహాసవదనున్ దేదీప్యమానప్రభా
కలితున్ భూషితవన్యపుష్పుఁ ద్రిజగత్కల్యాణపారీణునిన్.[250]

336


సీ.

అరుణారుణచ్ఛాయ లగుపాదములు నేల నూఁది చక్కఁగ నిలుచున్నవానిఁ
బరిమళించుచునున్న విరితెల్లదామర నెలమితో నవతంస మిడినవాని
గోధూళిపొదివినకుండలంబులతోడ నింద్రనీలచ్ఛాయ నెసఁగువాని
వక్షంబునందు శ్రీవత్సచిహ్నము క్రేవబెడఁగుగా వనమాల యిడినవాని


తే.

పేరుకొని లేఁగటావులఁ బిలిచి పిలిచి, పిచ్చలించుచుఁ గ్రేవుల విడుచువాని
క్షీరకలశంబు నుఱుద్రాళ్లుఁ జేతఁబట్టి, యమరు గోపాలకృష్ణు నల్లంతఁ గాంచె.[251]

337

వ.

మఱియును.

338


క.

కైలాసనగమునందును, గ్రాలెడు ప్రావృట్పయోధరముచందమునన్
లాలితకటిభాగంబున, నీలాంబర మమరు రామునిం బొడగాంచెన్.[252]

339


వ.

ఇవ్విధంబున నయ్యిరుపురం బొడగాంచి యక్రూరుండు.

340


మ.

భగవంతుం డగువిష్ణుదేవుఁడు మహీభారంబు వారింపఁగా
జగతీమండలి రామకృష్ణు లనఁగా జన్మించె నీమూర్తులై
జగదేశస్తుతిపాత్రులన్ భువనరక్షాదక్షులన్ సంతసం
బిగురొత్తం గనుఁగొంటి నాకొదవేకాదే జన్మసాఫల్యముల్.

341


వ.

అని తలంచి దంతురీభూతపులకితశరీరుండై రథంబు డిగ్గి వినయసంభ్రమభక్తి
తాత్పర్యంబులు చిత్తంబునం బెనంగొన వచ్చి దామోదరునకు సాష్టాంగదండ
ప్రణామంబు చేసిన.[253]

342


క.

బలి యవనిదానధారా, జలములు చిలికించి యతని శతమన్యునిగాఁ
నిలిపి కులిశాబ్జరేఖలు, గలశ్రీహస్తములు నెత్తి కౌఁగిటఁ జేర్చెన్.[254]

343


వ.

తదనంతరంబ గాందినేయుండు రౌహిణేయునకు నభివాదనంబు చేసిన నతండును
నట్ల గారవించి కుశలం బడిగి యర్హప్రకారంబుల మన్నించి యాత్మీయమంది
రాంగణంబున నొక్కరమ్యప్రదేశంబున నమ్మువ్వురుం గూర్చుండి యిష్టసల్లాపం
బులు సేయుచుండి తగుతెఱంగున మజ్జనభోజనంబులు దీర్చి పథశ్రాంతివలననైన
బడలిక తమకరుణామృతసేచనంబుల నపనయించి యతనితోడ మధురాపురం
బునఁ బుట్టినవిశేషంబు లడుగుటయుఁ జక్రధరునకు నక్రూరుం డిట్లనియె.[255]

344


తే.

నీవు సర్వజ్ఞమూర్తివి నీకుఁ దెలివి, పడని యదియేమి యున్నది పద్మనాభ
యయిన నావిన్నపం బెల్ల నాదరించి, వినుము నీచిత్త మటమీఁదిపనులు నడప.

345


వ.

అని పలికి కంసుండు నారదప్రచోదితుండై యాదవసభామధ్యంబున దేవకీవసు
దేవుల నుదాసీనంబు లాడుటయు పితృగౌరవంబు విచారింపక యుగ్రసేనుని
నిగళప్రాప్తునిం జేసి కారాగృహంబున నునుచుటయును తనతోడ బంధుద్రోహం
బు సేయ విచారించుటయు నద్దురాత్మునిదుర్మంత్రంబున నుపాయనంబులు గొని

ధనుర్యజ్ఞవ్యాజంబున నందాదిగోపకులతోడఁ దముం బిలువవచ్చుటయును
విన్నవించిన నాప్రపంచవేది యతని కిట్లనియె.[256]

346


క.

నీ విపుడు నాకుఁ జెప్పిన, యీవచనము లెల్ల నేను నెఱుఁగుదు నక్రూ
రా వినుము కంసు నసువులు, లేవనియుండుదువు గాని లెక్కింపకుమీ.[257]

347


తే.

నీవు మెచ్చంగా నెల్లుండి నేను గంసు, ప్రాణములు గొని మానవప్రతతు లెల్ల
నుల్లసిల్లంగ భూమికి నుగ్రసేనుఁ, బట్టభద్రునిఁ జేసేదఁ బ్రాభవమున.

348


ఉ.

ఎల్లి ప్రభాతకాలమున నిచ్చటఁ గల్గిననెయ్యిపాలు కా
వళ్ల నమర్చికొ న్చనఁగ వల్లవులన్ సమకట్టి సంబరం
బెల్లవిధంబులన్ మెఱయ నేనును నీవును నందవీరులున్
గొల్లలలోనఁ బెద్దలును గూడి రయంబునఁ బోద మర్థితోన్.[258]

349


వ.

అని పలికి యారాత్రి నందుమందిరంబున నందఱు వసియించి మఱునాఁడు ప్రభా
తసమయంబునఁ గాలోచితకృత్యంబులు దీర్చి దధిక్షీరాజ్యాద్యుపాయనంబుల
తోడం దగువారి ముందర ననిపి యక్రూరుండు సారథిగా బలభద్రసహితం
బుగా రథారోహణంబు చేసి చనునప్పుడు.

350

గోపికలు శ్రీకృష్ణవిరహభీతలై చింతించుట

ఉ.

అచ్చటిగోపభామలు మురారిప్రయాణము చూచి యెంతయున్
ముచ్చట లగ్గలింప మరుమోహనబాణవిభిన్నచిత్తలై
వెచ్చనియూర్పులు న్నిగుడ వేదనలం దురపిల్లికన్నులన్
బిచ్చిలుబాష్పవారిఁ దమబింకపుఁజన్నులు దొప్పఁదోఁగఁగన్.[259]

351


క.

విరహాగ్నివలన దేహము, లరవరలై హస్తభూషణావళులెల్లన్
హరిఁ గోరి జాఱిపడఁగా, నరుదుగ నొకచోటఁ గూడి యందఱుఁ దమలోన్.[260]

352


ఉ.

ఇందునిభాస్యలార మనకెల్ల మనోహరమూర్తియైన యీ
నందతనూభవుండు కరుణారస మించుక యైనలేక తా
నిందఱఁ గూడి యామధుర కిచ్చమెయిం జనుచున్నవాఁడు సొం
పొందఁగ వీనితోఁ గలసియుండుట కింకొకనాడు గల్గునే.

353


ఆ.

పౌరసతుల సరసభాషామృతంబుల, సోన లితనిచెవుల సోఁకెనేని
గొల్లసతులతోడి కూరిమి దలపోసి, యితఁడు చౌక సేయ కేల మాను.[261]

354


ఆ.

ఏమి సేయువార మీతనిఁ బెడఁ బాసి, కంతుసాయకముల గాసిపడక

పడఁతులార యెట్లు బ్రతుకువారము దైవ, మేల వాపె నొక్కొ యితని మనల.[262]

355


తే.

నందసూనుండు పౌరాంగనావిలాస, నిగళములఁ జిక్కి యచ్చట నిలుచుఁగాక
యిచటి కేటికిఁ దా వచ్చు నుచితవాక్య, చతురవచనలు లేని గొల్లతలకడకు.[263]

356


క.

ఈరీతి మనకు విరహము, ప్రేరేప యశోదపట్టిఁ బెడఁబాపిన యీ
క్రూరుని నక్రూరుం డని, యేరీతిం బిలువవచ్చు నింతులు వినరే.

357


తే.

కొందఱము పోయి కృష్ణుని కొంగుపట్టి, యాఁగి మము నిట్లు విరహాగ్నిఁ గ్రాగఁజేసి
యేలపోయెదు మము డించి యేము వత్తు, మనిన మన పెద్ద లచట నేమందురొక్కొ.[264]

358


ఆ.

మాధవుండు లేని మనగొల్లపల్లియ, నేడు మొదలుగాఁగ నెలఁతలార
చిన్నవోయియుండుఁ జెల్లఁబో యీదైవ, మెంతకీడు చేసె నిపుడు మనకు.[265]

359


వ.

అని యి ట్లత్యంతవిరహవ్యథాధీనహృదయ లగుచు ఘోషకాంతలు ధేనుకాం
తకువలను చూచుచు దృష్టి కగోచరం బగుటం జేసి మగిడి తమతమనివాసంబు
లకువచ్చి యథాప్రకారంబుల నుండి రంత.

360

అక్రూరునకు యమునానదీజలమునందు శ్రీకృష్ణభగవంతుఁడు ప్రత్యక్షమగుట

క.

సారథియై యక్రూరుఁడు, తేరితురంగముల నధికతీవ్రతఁ బఱపన్
వారలు మధ్యాహ్నమునకు, బోరనఁ గాళిందిదరికిఁ బోయి మునీంద్రా.[266]

361


క.

అరదము దిగి యక్రూరుఁడు, హరితో మాధ్యాహ్నికాదు లగుకృత్యంబుల్
పరిపాటిఁ దీర్చి వచ్చెద, నరగడియకు మీరు నిలువుఁ డని చని భక్తిన్.[267]

362


ఉ.

ఆనదిలోపల మునిఁగి యాచమనం బొనరించి నిశ్చల
ధ్యానసమాధి నుండి పరతత్వమహత్త్వము నాసికాగ్రసం
ధాననిరీక్షణంబుగ నొనర్చుచు వెండియుఁ దీర్థ మాడినన్
మానుగఁ గానవచ్చెఁ బరమం బగువైష్ణవతత్వ మేర్పడన్.[268]

363


సీ.

కుందేందుధవళితాంగుని నీలపరిధానపరిశోభితునిఁ గదంబప్రసూన
వనమాలికాభూషితుని రత్నకుండలాంచితగండమండలు నతులవికసి
తాంభోజదళనేత్రు రంభాదిదేవాంగనాజనస్తోత్రు ఫణాసహస్ర
భాసితు వాసుకిప్రముఖనానాపన్నగేశ్వరపరివృతు నిద్ధచరితు


తే.

ముసలలాంగలపాణి తమోగుణప్ర, శస్తు నాద్యు ననంతు సమస్తభువన
భారవహు బలభద్రునిఁ బరమపురుషు, దివ్యతేజోవికాససందీప్తుఁ గాంచె.[269]

364

వ.

మఱియు నాబలభద్రునియుత్సంగంబున నతసీకుసుమవర్ణుండును వనమాలావి
రాజితుండును పీతాంబరధరుండును నై శక్రచాపతటిన్మాలికాపరిశోభితం బైన
నీలమేఘంబుచందంబున నున్నకృష్ణునిం బొడగాంచి పులకదంతురాంచితశరీ
రుండై నాసికాగ్రంబున దృష్టి నిలిపి పెద్దయుంబ్రొద్దు చూచి సంశయాద్భుతచి
త్తంబున లేచి బహిఃప్రదేశంబునం జూచిన.[270]

365


ఆ.

తేరిమీఁద నధికదివ్యతేజోవిలా, సముల నున్నరామచక్రధరులఁ
దెలియఁ జూచి మఱియు సలిలంబులోపల, మునిఁగి కాంచెఁ దొంటిమూర్తియుగము.

366


చ.

కనుఁగొని యద్భుతంబును వికాసము భక్తియుఁ జెంగలింప న
య్యనముఁడు యోగదృష్టిఁ బరమార్థమహామహిమాన్యులైన యా
ఘనులవికాసమూర్తు లొడికంబుగఁ గన్గొని వారియందు నె
మ్మనమున యందు నొందఁగ నమర్చి కడుం దడ వుండి పెంపుతోన్.[271]

367


వ.

మనోమయంబు లైనగంధపుష్పధూపదీపనైవేద్యనమస్కారాద్యుపచారంబులు
గావించి కృతార్థుండై జలంబులు వెడలి దామోదరుపాలికి వచ్చి గమనంబునకు
సంభ్రమించుచున్న యక్రూరునకుఁ జక్రధరుం డిట్లనియె.

368


క.

నీవదనంబు వికాసము, శ్రీ వెలయుచు నున్న దిపుడు చెచ్చెర యమునా
పావనజలంబులోపల, భూవినుత విశేష మేమి పొడగంటివొకో.[272]

369


చ.

అనవుడు గాందినీతనయుఁ డమ్మురమర్దనుఁ జూచి నీవెఱుం
గని పని యేమి యున్నది జగన్నుత నన్నుఁ గృతార్థుఁ జేయఁగా
మనమునఁ గల్గి యీసలిలమధ్యమునం దటువంటి నీపురా
తన మగుదివ్యమూర్తి విదితంబుగఁ జూపితి వద్భుతంబుగన్.[273]

370


క.

నీకరుణ యివ్విధంబున, నేకొఱఁతయు లేక యున్న యేను దురాత్ముం
డై కపటవృత్తు లుడుగని, యాకంసునిఁ గొలిచియుండ నర్హుఁడ నైతిన్.

371


ఆ.

వలసినట్లు తనకు వర్తింపఁగాఁ జెల్ల, దొడలిసుఖము లాసపడఁగరాదు
పరులఁ గొలిచి కుడిచి బ్రతికెడుఁవాఁడు జీ, వన్మృతుండు వాఁడె వారిజాక్ష.[274]

372

వ.

అని యిట్లు పలుకుచున్న యతనిచిత్తంబున నున్నఖేదం బుడిపి నారాయణుండు
మన్నించె నిట్లు వారలు రథారూఢులై యచ్చోటు గదలి సాయాహ్నకాలంబు
నకు మధురాపురంబున కరిగి రప్పుడు సీరిచక్రుల కక్రూరుం డిట్లనియె.[275]

373


ఆ.

అరద మెక్కి మీర లరుగుదెంచినఁ గంసుఁ, డలిగి నన్ను నేమియైనఁ బలుకుఁ
గానఁ బాదచారులై నడతెండు మీ, యుపద లెల్లఁ గొనుచు నిపుడు పురికి.[276]

374


వ.

మీరు దేవకీవసుదేవులం బొడగనుటకై తదీయనివాసంబునకుఁ బోయిన మీ
మీఁదివిరోధంబున నావృద్ధదంపతుల కద్దురాత్ముం డైవకంసుం డుపద్రవంబు
సేయందలంచుఁ గావున నవ్విధంబు పరిహరించునది యని నిర్దేశించి యామం
త్రితుండై కంసుపాలికిం జని తనపోయివచ్చినవృత్తాంతంబును రామదామో
దరానుగమనంబునుం జెప్పి నిజనివాసంబునకుం జనియె నంత.[277]

375

శ్రీకృష్ణుండు మధురాపురంబుఁ బ్రవేశించి రజకుని వధించి చలువవలువలు గొనుట

ఉ.

గోపకుమారకుల్ బలసి కొల్వఁగఁ గృష్ణుఁడు సీరపాణితో
నాపురిరాజమార్గమున నంచితమోహనదివ్యమూర్తియై
యేపున మత్తదంతిగతి నేగుచునుండెను భక్తిసంభ్రమ
స్థాపితచిత్తులై నిలిచి సర్వజనంబులుఁ జేరి చూడఁగన్.[278]

376


క.

చనుదెంచుచున్నసమయం, బున నొకరజకుండు మడుఁగుపుట్టంబులు కం
సునినగరికిఁ గొనిపోవఁగఁ, గనుఁగొని వస్త్రములు దనకుఁ గట్టఁగ నడిగెన్.[279]

377


క.

నీచగుణవర్తి గావున, నాచాకి వివేకహీనుఁడై మురవైరిన్
జూచి నిరసించి మదమున, నేచినదుర్వాక్యసరణి నిట్లని పలికెన్.[280]

378


మ.

విను మాయేలికకంసుఁ డీవచనముల్ విన్నన్ నినున్ బ్రాణముల్
గొను గోపాల మదించి గోధనములన్ గోల్పోయెదో పోయెదో
యనుచుం బల్కిన శౌరి కోపహృదయుండై తచ్ఛిరం బుద్ధతిన్
దునియంగొట్టెఁ బతాకహస్తనిహతిన్ దోరంబు లీలాగతిన్.[281]

379


తే.

సీరపాణికి నందులో జిలుఁగువన్నె, పట్టుపచ్చడ మొక్కటి గట్ట నిచ్చి
పసిఁడిచెఱఁగులపచ్చనిపచ్చడంబు, తాను ధరియించెఁ గృష్ణుఁ డుద్దండమునను.

380


వ.

తక్కినవస్త్రంబు లన్నియు వల్లవకుమారుల కొసంగి పుష్పలావికగృహంబున
కుం బోయి తమకు ముడువందగిన సురభికుసుమనికరంబు లడిగిన వాఁడు భయ

భక్తితాత్పర్యంబులతోడ మోఁకరించి కరంబులు నేలనూఁది నమస్కరించి పరి
మళమిళితంబు లైనపూవుదండ లొసంగి వారిజాక్షున కిట్లనియె.[282]

381


ఉ.

దేవా దేవరవంటివారు కరుణాదృష్టిన్ ననున్ బుణ్యునిన్
గావింపంగఁ దలంచి పుష్పములకుం గామించి యేతెంచినా
రీవేళన్ మిముఁ బూజసేయఁగలిగెన్ హేలావినోదాత్మ నా
సేవల్ గైకొనుమంచు మ్రొక్కినఁ గృపాచిత్తంబునన్ గృష్ణుఁడున్.[283]

382


క.

అతనికిఁ గులాభివృద్ధియు, నతులితమోక్షంబుఁ గలుగునట్టివరంబుల్
ధృతి నొసఁగి శౌరి యామంత్రితుఁడై పురవీథి నరుగుదేరఁగ నెదురన్.

383

శ్రీకృష్ణుండు తనకు పరిమళగంధం బొసంగిన కుబ్జను సుందరాంగిగాఁ జేయుట

ఉ.

దేవకిపట్టి గాంచెను ధృతిన్ మృగనాభియు హైమవారియున్
గోవజవాదియుం బునుఁగుఁ గుంకుమపంకముఁ గప్పురంబుఁ గ్రొ
త్తావులు పిక్కటిల్లఁగఁ గదంబము గూర్చినచందనంబు హే
లావిధిఁ జంద్రకాంతపుశిలామయపాత్రికఁ దెచ్చుజవ్వనిన్.[284]

384


వ.

ఒక్కకుబ్జకాంతం గనుంగొని చందనం బడుగుటయు నయ్యిందువదన ముకుం
దునిసౌందర్యంబు మెచ్చుచు నిట్లనియె.[285]

385


సీ.

నిత్యకృత్యంబుగ నేరుపుతో నేను దిగిచినగందంబు మృగమదంబు
మొదలుగాఁ బరిమళంబులు కదంబము గూర్చి సూడిద గాఁగఁ గంసునికి నిచ్చి
కడలేనిమన్ననల్ గైకొను నన్ను నీ విట్లెఱుంగవొ కాని యెల్లవారు
వినియుండుదురు మీరు వేడుకపడియున్న నీరానివస్తువు లేమి గలవు


ఆ.

నాకు మిమువంటిలోకోత్తరుల కియ్యఁ, గలిగె నింతకంటె ఘనత గలదె
యనుచుఁ గోరలోనిఘనసారగంధంబు, వలసినట్ల యొసఁగె వారలకును.[286]

386


క.

తనువున నెఱపూఁతలుగా, నొనరఁగ గందంబుఁ బూయుచుండి వినోదం
బున సల్లాపము లాడుచు, వనజాక్షుఁడు కుబ్జకాంతవరచిబుకంబున్.[287]

387


తే.

తనకరాంగుళములఁ బట్టి దానిపాద, యుగముపై నిజచరణంబు లొనరఁబెట్టి
నిక్కఁ దిగిచి విక్షేపణ మక్కజముగఁ, జేయుటయు మోహనాకృతిఁ జెలఁగెఁ దరుణి.[288]

388

ఆ.

కృష్ణుకొంగుఁ గేలఁ గిలించి నేడు మా, యింట విడిది చేసి యేగుఁ డెల్లి
యనిన నేడు దీర దరుగుము నీవంచుఁ, బలికి మాధవుండు బలుఁడుఁ దాను.

389


వ.

ఒండొరు చేతులు వ్రేసి పెద్దయెలుంగున నవ్వుచుం జని రాజద్వారంబున నున్న
ధనుశ్శాలలోపలి కరిగి యచ్చట గంధపుష్పంబుల నలంకృతంబైనకంసునిధనువుఁ
గనుంగొని యమ్మహోత్సవంబుఁ జూచువారిచేత ధనుర్మహత్త్వంబు విని.

390

శ్రీకృష్ణుండు కంసుని ధనుర్యాగార్థ మలంకరింపఁబడినవిల్లు విఱుచుట

క.

శ్రీపతి యాచాపము గొని, మోపెట్టి చెలంగ మౌర్వి మ్రోయించుచు
నాటోపంబు మెఱయఁగాఁ దెగ, వాపిన లస్తకము పటురయంబున విఱిగెన్.[289]

391


తే.

ఆయుధాగారరక్షకు లైనవారు, కలహ మొనరింపఁ దమమీఁదఁ గడఁగుటయును
వారినందఱఁ దెగటార్చి ఘోరసింహ, నాద మొనరించెఁ బౌరజనములు బొగడ.[290]

392


తే.

అపుడు హతశేషు లగువార లరిగి కంసు, గాంచి యారామకృష్ణులు గబ్బితనము
తోడ నరుదెంచి చేసిన దుండగములు, విన్నవించినఁ బటుకోపవివశుఁ డగుచు.[291]

393


ఉ.

భూరినియుద్ధకౌశలము పొంపిరివోయి వెలుంగుచున్న చా
ణూరుని ముష్టికుం బిలిచి నూతనవస్తువు లిచ్చి నామదిన్
వైరము రేఁచుచున్న బలవంతులు నాబలభద్రకృష్ణులన్
మీరు వధింపుఁ డెల్లి కడుమీరిన మీభుజదర్ప మేర్పడన్.[292]

394


ఉ.

ఏపున దొమ్మినైన మఱియెక్కటి పోరుననైన వైరులన్
రూపఱఁ జేసి నాహృదయరోగము మాన్పుఁడు మీరు నేడు నా
కీపగ దీఱఁజేసితిరయేని మదీయవిభూతికెల్ల మీ
ప్రాపులు కాపులై నిలుచు బ్రహ్మకునైనఁ జలింపకుండుదున్.[293]

395


క.

ఎల్లి ప్రభాతంబున మీ, మల్లురతోఁ గూడి రంగమధ్యంబున మీ
రెల్లవిధంబులఁ జంపుఁడు, గొల్లపడుచులను నియుద్ధకుశలత మెఱయన్.[294]

396


వ.

మఱియుఁ గువలయాపీడం బనుగంధసింధురంబు మావంతునిచేతఁ బ్రచోదితం
బయి రంగద్వారంబున నిలిచి బలభద్రకృష్ణులు వచ్చినప్పుడె వధియింపంగల
యది సమస్తసైన్యంబులు కట్టాయితంబయి బలసి నగరివాకిటికి వచ్చునది యని

నియమించి కృష్ణునితో వైరానుబంధంబుననైన కోపంబు ప్రేరేప శుద్ధాంతమంది
రంబునకుం జని యుచితమార్గంబున నుండి మఱునాఁడు ప్రభాతసమయంబున.[295]

397

శ్రీకృష్ణబలభద్రులు కువలయాపీడం బనుగజంబును చాణూరముష్టికు లనుమల్లులను చంపుట

ఉ.

తమ్ములు బంధుమిత్రులును దాను నమాత్యచయంబు రాజలో
కమ్మును బౌరులుం గొలువఁ గంసుఁడు రంగసమీపతుంగమం
చమ్మున నెక్కి యుండెను విశాలసమున్నతభర్మరమ్యహ
ర్మ్యమ్ములనుండి చూడఁగఁ బురాంగనలున్ మఱి రాజపత్నులున్.[296]

398


వ.

మఱియు వసుదేవాక్రూరాదియాదవులును నందాదిగోపకులును మొదలుగా
సమస్తజనంబులును ప్రదేశంబులఁ జూచుచుండిరి. మల్లయుద్ధసన్నద్ధ
చాణూరముష్టికాదివీరులు మల్లప్రాశ్నికులతోడ రంగమధ్యంబు ప్రవేశించిరి.
కువలయాపీడగజేంద్రంబుతోడ మావంతుండు వచ్చి రంగద్వారంబున నొలసి
యుండె. సమస్తసైన్యంబులును జతురంగసమేతంబుగాఁ గట్టాయితంబయి
యుండె. అప్పుడు రాజానుమతంబున బలసి బలభద్రదామోదరులు గోపాల
కుమారులతోఁ గూడవచ్చి రంత.[297]

399


సీ.

కంసచాణూరాదికపటాయితశ్రేణి కలఁగుచు మృత్యువుగాఁ దలంప
సురపథంబుననుండి చూచి వియచ్చరౌఘము పరదైవముగాఁ దలంపఁ
గృతకృత్యు లగు దేవకీవసుదేవులు గరువంపుఁబుత్రుడుగాఁ దలంప
గోపాంగనాజనకోటి మోహనరూపకందర్పనిభమూర్తిగాఁ దలంపఁ


తే.

గోరి యాభీరదారకకోటి తమ్ముఁ, గలసి యాడెడు చెలికానిఁగాఁ దలంప
భూమిభారావతరణుఁడై భుజగనాథ, శయనుఁ డరుదెంచె బలభద్రసహితుఁ డగుచు.[298]

400


వ.

అప్పుడు.

401


ఉ.

ఏవున రామకేశవుల నెక్కటి మార్కొని బాహుశౌర్యముల్
చూపెడుమల్లు రెవ్వ రనుచున్ జనులెల్లఁ దలంచుచుండఁగాఁ
బాపవిచారులై యచటిప్రాశ్నికవర్గము కంసుచే నను
జ్ఞాపరులై సమస్తజనసంఘములున్ వెఱఁగందిచూడఁగన్.

402


క.

నారాయణుతోడను జా, ణూరుఁడు మఱి రోహిణీతనూజునితో దు
ర్వారబలుఁ డైనముష్టిక, వీరుఁడు యుద్ధంబు సేయ విభజించుటయున్.

403


వ.

అచ్చటి పెద్ద లయ్యుద్దులం జూచి.

404

ఉ.

భూరినియుద్ధచాతురిని బ్రోడలు చూడఁగ ముష్టికుండుఁ జా
ణూరుఁడు వీరితో యదుతనూభవు లెంతయుఁ బిన్నబిడ్డలే
పోరెడువారలంచుఁ దలపోయుచు నుండిరి యొక్కమ్రోఁతగా
నారభసంబు కంసుహృదయంబునకుం బగయయ్యె నత్తఱిన్.[299]

405


క.

మావంతునిచేఁ బ్రేరిత, మై వెసఁ బఱతెంచి కువలయాపీడగజం
బావసుదేవతనూజుల, పై వెసఁ గవియుటయు వారు పటుకోపమునన్.

406


ఉ.

పొంగుచు నైపుణంబులును భూరిబలంబులు నివ్వటిల్ల మా
తంగవిషాణముల్ పెఱికి తత్క్షణమాత్రన దానిఁ జంపి ప్రో
త్తుంగతదీయదంతములు దోల నమర్చినఁ జూడ నొప్పి రా
చెంగటఁ గాలదండములు చేకొనియున్న యమద్వయం బనన్.[300]

407


వ.

ఇట్లు విజృంభించి రంగమధ్యంబున నిలిచి చాణూరముష్టికులతోడం దలపడి
భద్రమూర్తులైన కృష్ణబలభద్రులు పెద్దయుం బ్రొద్దు పోరి రప్పు డన్యోన్య
భుజాస్ఫాలనధ్వానంబులును సముద్దండసింహనాదంబులును సకలసామాజికానేక
కలకలంబులును భేరీమృదంగతూర్యాదివాద్యఘోషంబులును వియచ్చరజయ
జయశబ్దంబులును దివ్యదుందుభినినాదంబులును మెదురంబయి రోదసీకుహరంబు
నిండె నప్పుడు.[301]

408


మ.

హరి చాణూరునితో నియుద్ధకుశలుండై పెద్దయుం బ్రొద్దు భీ
కరవృత్తిన్ సరిపోరుచున్న సుర లాకాశంబునన్ నిల్చి యీ
దురితాత్మున్ వధియించి కంసునసువుల్ త్రుంగించవే వేగనం
చు రణోద్యుక్తునిఁ జేసినన్ నగుచు యాశోదేయుఁ డుగ్రాకృతిన్.[302]

409


మ.

చతురుండై కడకాలు బిట్టొడిసి యాచాణూరునిన్ బల్విడిన్
శతవారంబులు ద్రిప్పెఁ గర్ణముఖనాసాగర్తలన్ ఘోరశో
ణితముల్ గాఱఁగ నంగముల్ దునిసి క్షోణీమండలిన్ రాల దై
వతలోకంబు నభంబునన్ నిలిచి కైవారంబు గావింపఁగన్.[303]

410


క.

హరి చాణూరునిఁ జంపిన, కరణిన్ హలపాణి ముష్టికనిశాచరునిన్
బరిమార్చి వారల కళే, బరయుగ మీడ్చుచును రంగభాగమునందున్.[304]

411


వ.

తమతోడిగోపబాలురనెల్లను బలాత్కారంబునం జేతులు పట్టి రంగస్థలంబునకుం
దిగిచి వారలుం దామును నుగ్రసేననందనుకర్ణంబుల కసహ్యంబులు సేయుచు
బేరెంబులు పాఱుచుండి రప్పుడు కంసుండు కోపరక్తలోచనుండై తనయమా
త్యులం బిలిచి యిట్లనియె.

412

సీ.

వసుదేవుఁదేవకీవనితనుఁ జెఱసాల నునుపుఁడు మాతండ్రి నుగ్రసేనుఁ
దల నఱకుఁడు నందుఁ దక్కినగోపులనెల్లను సంకిళ్ల నిడి తదీయ
గోధనంబుల నెల్ల గొల్లలాడుఁడు యదువృష్ణిభోజాంధకవీరవరుల
గొఱ్ఱుల నిడుఁడు గ్రక్కున నేను బలభద్రకృష్ణులఁ బోనీక గీటణంతు


తే.

ననుచు సంభ్రమించి ఘనవాద్యరవములు, మొరయకుండఁజేసి కరితురంగ
రథపదాతిచయము రావించుచున్న యా, కన్నెఱింగి కోపకలితుఁ డగుచు.[305]

413

శ్రీకృష్ణుండు కంసుని సంహరించుట

మ.

లలి మీఱన్ హరి కంసుమంచమునకున్ లంఘించి యమ్మేటియు
జ్జ్వలమాణిక్యకిరీట ముర్వరపయిన్ జాఱన్ శిరోజాతముల్
బలిమిం బట్టి వెసన్ బడందిగిచి లీలన్ వక్షమున్ మస్తమున్
నలియం బెట్టుగఁ గుప్పిగంతుగొని విన్నాణంబు గావించినన్.[306]

414


వ.

ఇట్లు విచిత్రంబుగా సకలలోకవిధ్వంసుం డైనకంసుండు ప్రాణపరిత్యాగంబు
చేసె నప్పుడు.[307]

415


క.

కురిసెన్ బువ్వులవానలు, మొరసెన్ సురదుందుభులు సముజ్జ్వలమహిమన్
బెరసెన్ గంధర్వనుతుల్, సరసన్ వినువీథియందు సంభ్రమములతోన్.[308]

416


క.

అవలీలను బలభద్రుఁడు, బవరంబునఁ గంసుననుజుఁ బరిమార్చినయా
దవవరులును నందాదులు, నవిరళసంతోషహృదయులైరి మునీంద్రా.

417


ఆ.

అంత రామకృష్ణు లవ్వసుదేవదే, వకులకడకు వచ్చి వారిపాద
పంకజాతములకుఁ బ్రణమిల్లుటయు వేడ్క, గౌఁగిలించి హర్షకలితు లగుచు.

418


వ.

కరంబులు మొగిచి నిలిచి యిట్లనిరి.

419


సీ.

అనిమిషాసురకోట్లకైన నసాధ్యంబు లైనయంతేసికార్యములు మీరు
చిఱుతప్రాయంబునఁ జేయుట లెంతయు నద్భుతంబులు పుట్టినట్టి మీరు
పరమపూరుషు లబ్జభవముఖ్యులకుఁ దండ్రియగు వాసుదేవునియపరమూర్తు
లగుమిమ్ముఁ బుత్రకు లనుచు మోహావేశమతులఁ జెందితిమి మీమాయవలన


తే.

నిట్టి మాయపరాధంబు లెల్ల మఱచి, కరుణ మెఱయ రక్షింతురు గాక యనుచుఁ
బరమవిజ్ఞానచిత్తులై భక్తినున్న, తల్లిదండ్రులఁ జూచి యాధన్యమతులు.

420


వ.

పెద్దయుం బ్రొద్దు గొనియాడి రప్పుడు కృష్ణుండు కృతాంజలియై మీరిట్లు పలు
కుట కర్తవ్యంబు గాదు మాయందుఁ బుత్రస్నేహంబు పాటించి గారవింతురు
గాక యనుచు వారివివేకంబు గప్పునట్లుగాఁ దనమాయాయావనికచేత నాచ్ఛా

దించి బంధుమిత్రపౌరజనంబుల నయ్యైతెఱంగుల సంభావించె నప్పుడు.[309]

421


సీ.

కంసు నంతఃపురకాంత లెంతయు దుఃఖపరవశలై వచ్చి ప్రాణవల్ల
భునికళేబరముపైఁ బొరిఁబొరిబడి శోకముల ముఖంబులు నురములును మోదు
కొనుచుఁ బెద్దయుఁ బ్రొద్దు ఘనవిలాపంబులు గావించుచుండంగఁ గమలనయనుఁ
డతికృపామూర్తియై యశ్రుధారాపూరితాయతలోచనుఁ డగుచు వచ్చి


తే.

యేడ్పు లుడిపి వారినెల్ల నయ్యైవిధంబులను గారవించి పుచ్చి బంధు
మిత్రసచివులెల్ల మెచ్చ జగం బెల్ల, నభినుతింప నుచితమగువిధమున.[310]

422


ఆ.

మును యయాతిశాపమున యదువంశంబు, వారలకును రాజ్యవైభవములు
చేకొనంగఁ దగవుచెల్లక యుండుట, దలఁచి తదభిలాష తనకులేక.

423

ఉగ్రసేనుండు యాదవరాజ్యమందు పట్టాభిషిక్తుఁ డగుట

వ.

కారాగృహంబున నిగళబద్ధుండై యున్న యుగ్రసేనుని విడిపించి తదీయరాజ్యం
బున కభిషిక్తునింజేసి యతినిచేతఁ గంసునికిఁ బరలోకక్రియలు సేయించి య
త్యంతకృపాతరంగితలోచనుండై యతని సింహాసనాసీనుం జేసి సమస్దరాజలో
కంబును గనిపించి యిట్లనియె.

424


ఉ.

ఈయదువృష్ణిపుంగవులు నేనును రాముఁడు నెల్లవారలున్
బాయక నిన్నుఁ గొల్చి నిరపాయత నుండెద మింక నెన్నఁడున్
మాయెడ శంకయున్ భయము మాని పనుల్ గొనుఁ డీజగంబు ని
త్యాయతబాహుశౌర్యగతమై విలసిల్లుచు నుండఁజేసెదన్.

425


ఆ.

అనుచు నుగ్రసేను ననునయోక్తులచేతఁ, దేర్చి యపుడు వాయుదేవుఁ బిలిచి
నిర్జరేంద్రుకడకు నీవు నాపనుపున, నరిగి యమ్మహాత్ము నర్థి గాంచి.

426


ఆ.

యాదవులకుఁ గర్త యగునుగ్రసేనుని, కమరసభ సుధర్మ యడిగి తెమ్ము
నావుడును నతండు దేవేంద్రు నడిగి సు, ధర్మఁ దెచ్చె నవనితలమునకును.

427


క.

అమ్మహనీయసభామ, ధ్యమ్మున యాదవులు కొలువ హరిప్రాపున లో
క మ్మలర నుగ్రసేనుం, డమ్మధురానగర మేలె నతులవిభూతిన్.

428


క.

అనవుడు మైత్రేయుం డి, ట్లను మునివర లోకవంద్యుఁ డైనయశోదా
తనయుని శైశవశుభవ, ర్తనములు విన మిగుల నద్భుతము మది కొదవెన్.

429


తే.

అమ్మహాత్ముఁడు తరువాత హలధరుండు, దాను నేమేమి చేసిరి తత్కథాక్ర
మములు విశదంబుగా ననుక్రమముతోడఁ, జెప్పి నన్నుఁ గృతార్థునిఁ జేయుమనిన.

430

చ.

శరనిధిమేఖలాఖిలరసావలయప్రచురప్రతాపభా
స్కర చతురప్రబంధకవికల్పితకావ్యరసజ్ఞతాధురం
ధర జగరక్షపాలబిరుదప్రకటీకృతభూమిభృత్సభాం
తర జగనబ్బగండ వనితాజనమోహనపుష్పసాయకా.[311]

431


క.

లలితకృపారసనేత్రో, తృలవిష్ణుపురాణసంహితశ్రవణకుతూ
హల చదలువాడ రాఘవ, నిలసత్కారుణ్యలబ్ధవిగతస్తబ్ధా.

432


లయగ్రాహి.

శ్రీరమణపాదసరసీరుహమదభ్రమర వారిధిగభీర చటులారిబలదుష్కాం
తారపవమానహిత మేరునగధైర్య ఘనసారశరదభ్రబలవైరిగజవాణీ
పారదమరాళనిభచారుతరకీర్తియుత సూరినుత పంటకులనీరనిధిరాకా
కైరవహితప్రతిమ ధీర బసవప్రభుకుమార రిపుభంజనకుమార సుకుమారా.[312]

433


గద్యము.

ఇది శ్రీమదమరనామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సుకవిజనవిధేయ
వెన్నెలకంటి సూరయనామధేయ ప్రణీతం బైన యాదిమహాపురాణం బగు బ్రహ్మాం
డంబునందలి పరాశరసంహిత యైన శ్రీ విష్ణుపురాణంబునందుఁ గంసుఁ డశరీర
వాణిపలుకుల కులికి దేవకీవసుదేవులఁ గారాగృహంబున నునుచుటయు భూమి
దేవి దేవతలతోడం జని వైకుంఠంబున విష్ణుదేవునకుఁ దనభారదుఃఖంబు చెప్పు
టయు రామకృష్ణులజన్మంబును పూతనవధయును శకటపరివర్తనంబును యమ
ళార్జునపాతంబును బృందావనగమనంబును కాళీయాహిమర్దనంబును ధేనుకా
సురవధయును ప్రలంబనిధనంబును గోవర్ధనధారణంబును రాసక్రీడావిహారం
బును కేశిదనుజవినాశంబును అక్రూరుండు రామకృష్ణుల మధురానగరంబునకుఁ
దోడుకొనిపోవుటయును కంసుమరణంబును ఉగ్రసేనుని యాదవరాజ్యంబునకుఁ
బట్టంబుగట్టుటయు నన్నది సప్తమాశ్వాసము.


————

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. వారాశిగభీర = సముద్రమును బోలిన గాంభీర్యగుణముగలవాఁడా, సంపత్ప్రారంభకళాదిలీప = సంపదను వృద్ధిచేయునట్టి ప్రయత్నముచేత దిలీపుఁడా.
  2. పరిపాటిన్ = క్రమముగా.
  3. ప్రాదుర్భవించి = పుట్టి.
  4. అవనీదేవినిభన్ = భూదేవివంటిదానిని, తొంగలించన్ = అతిశయింప.
  5. పురమునకు = ఇంటికి, వెఱఁగందన్ = ఆశ్చర్యము నొందఁగా.
  6. ఆరటపాటు = సంకటము, నివ్వెఱఁగంది = నిశ్చేష్టతను పొంది, ఒండుపమ = ఒకయుపాయమును, ఉవ్వునన్ = తటాలున, చేవ = బలమును - ధైర్యము ననుట, సహోదరిపాడి = తోడఁబుట్టు వనున్యాయమును, తొఱంగి = విడిచి, మవ్వపు = మనోజ్ఞురాలైన.
  7. అందంద చెలంగు = మిక్కిలి వ్యాపించునట్టి, భీకరకరాసి = భయంకరమైన చేకత్తిని, జళిపించి = ఆడించి, డాసి కడున్ = కడున్ డాసి యని యన్వయము.
  8. ఈసేఁత = ఈపని.
  9. తొడంగితివి = ఆరంభించితివి, దురాగతములు = రాఁగలచెఱుపును దెలుపునట్టి యాకాశవాణిమాటలను.
  10. తప్పులేనితప్పు = లేనితప్పును కలుగఁజేసికొని యనుట, రట్టు = అల్లరి.
  11. తెగకు = సాహసింపకుము.
  12. తనవీటన్ = తనపట్టణమునందు, తుష్టి = సంతుష్టి.
  13. క్రాఁగి= సంతాపము నొంది, అత్యంతవిషాదపరీతస్వాంత = మేరలేనిదుఃఖముచేత ఆక్రమింపఁబడిన మనసు గలది.
  14. ప్రాదుర్భూత...జిహ్మన్ = పుట్టినవివేకముచేత ఛేదించఁబడిన మనసులోని పాపకౌటిల్యములుగలవాఁడు - దుఃఖోపశమనసమర్థుఁ డనుట.
  15. పరిపీడ = అంతట వ్యాపించినపీడ, అపనయింపకుండినన్ = పోఁగొట్టకుండిన, నిర్వహింపన్ = చెడక మనుటకు.
  16. భూరిభరంబున్ = మిక్కుటమైన బరువును, ననుబోఁటిన్ = నావంటివానికి, అశక్యము = శక్యము కాదు, భక్తలోకరక్షారతుఁడు = భక్తులసమూహమును రక్షించుటయం దాసక్తుఁడు.
  17. ఆప్రొద్దె = అప్పుడే.
  18. జగదేకానందచిద్రూపమున్ = లోకమునందు ముఖ్యమైన జ్ఞానానందస్వరూపము గలదానిని, వివిధామ్నాయకళాకలాపమున్ = నానావిధములైన వేదవిద్యలయొక్క సముదాయము గలదానిని, సుపర్వీగీతసల్లాపమున్ = దేవతాస్త్రీలయొక్క పాటలనెడు ముచ్చటలు గలదానిని, ధవళద్వీపమున్ = శ్వేతద్వీపమును, పుణ్యరూపమున్ = పుణ్యమే ఆకృతిగాఁ గలదానిని, అవిద్యావేద్యసంతాపమున్ = అజ్ఞానముచేత తెలియఁదగిన సంతాపము గలదానిని - అజ్ఞానమును పోఁగొట్టుదాని ననుట.
  19. సోల్లుంఠనంబు = మర్మభేదక మైనపరిహాసము, అకుంఠ = మొక్కపోని - తక్కువకాని, ఉపకంఠంబునన్ = సమీపమునందు, కంఠోపరికంఠీరవుండు = మెడకు మీఁద సింహాకృతియైనవాఁడు - నరసింహుఁడు, పన్నగాశనవాహనున్ = గరుడవాహనుని.
  20. చంద్రశైలాధార = మేరుపర్వతమునకు ఆధారమైనవాఁడా - కూర్మవరాహరూపములతో మేరువుతోడ సర్వభూమిని శ్రీవిష్ణుదేవుఁడు ధరించుట ప్రసిద్ధము, చంద్రవస్త్ర = బంగారుపచ్చడము గలవాఁడా, కమలనివాస = జలమునందు నివసించువాఁడా - వటపత్రశాయి యనుట, ధరణీధరాధార = రాజులకెల్ల నాధారభూతుఁ డైనవాఁడా, ధరణీభరనివార = భూభారమును నివారించువాఁడా, ధరణీధ్రమంథాన = కొండ కవ్వముగాఁ గలవాఁడా, దశపగమన = గరుడవాహనుఁడా, పంచపంచతత్వబోధవితత = ఇరువదియైదుతత్వములబోధను విస్తరించువాఁడా, మనుపుము = రక్షింపుము.
  21. నలువ = చతుర్ముఖుఁడు - బ్రహ్మ.
  22. సమదాంధీభూతంబులన్ = మదముతోఁ గూడుకొనిన వగుటచేత కన్నులు గానవివిగా చేయఁబడిన ప్రాణులను, జాలిన్ = దుఃఖమును, చేవ = సత్త, దురపిల్లుచున్నది = విలపించుచున్నది, ఏకద్వ్యథంబు
    = ఈభూదేవియొక్క సంకటములను, కృపాపూతాత్మ = దయచేత పరిశుద్ధమయిన మనసుగలవాఁడా,
    విశ్వాత్మకా = ప్రపంచస్వరూపుఁడా.
  23. పురుహూతప్రముఖ = ఇంద్రుఁడు మొదలుగాఁగల, భజియించుచున్ = కొలుచుచు, ఉగ్రాహితానీకము = భయంకరులైన శత్రువులసమూహము, పొరిమార్పంగలవారు = చంపఁగలరు.
  24. పంపునన్ = ఆజ్ఞచేత, డాసి = చేరి.
  25. వార్తలు = వృత్తాంతములు.
  26. నాటుకొన్నదిగులుపెంపునన్ = స్థాయిపడిన భయాతిశయముచేత.
  27. తొంగలించెన్ = అతిశయించెను.
  28. తామసోద్వృత్తుఁడు = తమోగుణముయొక్క విజృంభణముగలవాఁడు, జఠరమునన్ = కడుపునందు, వెల్లివిరి = ప్రసిద్ధము.
  29. గర్భసంకర్షణంబు = గర్భముయొక్క లెస్సగా ఆకర్షించుట, ధవళాద్రినిభము = తెల్లనికొండను పోలినది, గాత్రమునన్ = దేహముతో.
  30. ప్రావృట్కాలంబునన్ = వానకాలమునందు, మహానిశీధసమయంబునన్ = మంచియర్ధరాత్రకాలమున, వధ్యశిలాతలంబునన్ = చంపుడుబండమీఁద.
  31. తెగటార్చి = చంపి, ప్రమదంబునన్ = సంతోషముతో, భద్రములు = శుభములు, ఒడవున్ = కలుగును.
  32. ప్రాతరపరాహ్ణకాలంబులందు = ప్రొద్దుటివేళలను మాపటివేళలను, సురా = కల్లు, ఉపహారంబులన్ = కానుకలచేత.
  33. నాడునాటికిన్ = దినక్రమమున, కౌను = నడుము, పోలియించుపొలుపునన్ = నశింపఁజేయువిధమున, వన్నియ కెక్కినవిధమున = ప్రసిద్ధి వహించినట్లు, చెక్కులు = చెక్కిళ్లు, వెలుకఁబాఱెన్ = తెల్లఁదనము పొందెను, దనుజశుద్ధాంతకాంతలు = రాక్షసులయొక్క అంతఃపురస్త్రీలు, వాడువాఱెన్ = వాడెను, కొనలుసాగు = నెఱవేఱు, సందడించెన్ = అతిశయించెను, ఇడిన =ఉంచుకొనిన.
  34. భూతేశ్వరుఁడు = పంచమహాభూతములకు ఒడయఁడైనవాఁడు, అర్భకుండు = శిశువు.
  35. భువనపంకజములు = లోకములనెడు కమలములను, ఉల్లసిలఁజేయన్ = వికసింపఁజేయుటకు, పూర్వసంధ్య = ప్రాతస్సంధ్య, పొలిచి = తోఁచిన.
  36. జాజ్వల్యమాన = జ్వలించుచున్నవి, సహస్రాక్షప్రముఖ = ఇంద్రుఁడు మొదలుగాఁగల. 52 పొడమితివి = పుట్టితివి, జడిసి = వెఱచి.
  37. నవ్వెడు = అపహసించునట్టి, తేఱెడు = తేటయయ్యెడు, విభూతితోన్ = సంపదతో.
  38. వినమితాఖిలదేవగణమస్తుండు = మిక్కిలి వంపఁబడినయెల్లదేవతాసమూహములతలలు గలవాఁడు - ఎల్లదేవతలచేత మ్రొక్కించుకొనువాఁడు, చండమారుతంబులు = భయంకరములైన తీక్ష్ణవాయువులు, ప్రశాంతంబు లయ్యెన్ = అణఁగెను, మహావాహినులు = పెద్దయేళ్లు, ప్రసాదవాహినులు = తేటనీటిప్రవాహము గలవి, భూనభోంతరవర్తులు = భూమియందు నాకాశమునందును మెలఁగువారు, కురియుచు = కురియించుచు, ప్రదక్షిణార్చులు = ప్రదక్షిణముగా వెలుఁగునట్టి మంటలుగలవి, మందగర్జితంబులు = మెల్లనియుఱుములు గలవి.
  39. చొక్కి = పరవశులై.
  40. చరాచరభూతనాథ = చరములును అచరములునైన ప్రాణులకు ప్రభువైనవాఁడా.
  41. ప్రాణములమీద వచ్చునంత పనులు = ప్రాణాంతము లైనపనులు.
  42. నరార్భకుండవు = మనుష్యశిశువవు, నటింపుము = ప్రవర్తింపుము.
  43. అల్లలనాడన్ = తత్తఱింపఁగా.
  44. లోలున్ = ఆసక్తుని, నిశాటలోకసమీరవ్యాళున్ = రాక్షససమూహమనెడు వాయువునకు సర్పమైనవానిని - సర్పములు వాయఁవును హరించునట్లు రాక్షసులను హరించువాఁ డనుట, అవన = రక్షణమునందు, నిమీలున్ = మూయువానిని - జడత్వము నొందించువాని ననుట.
  45. ఒక్కరుండును = ఒక్కఁడే.
  46. ఏపుతోన్ = హెచ్చరికతో ననుట, కాఁపు = కావలి; కన్ను మొఱఁగి = ఏమఱించి, పాఱికాఁపులతోడన్ = పరిచారకులతో, పరగడంబులు = పరస్థలవాసముగా, ఓవరించి = తొలఁగించి, కరదీపికలతోడన్ = చేదివటీలతో, త్రోచి = తఱిమి - ఆవలికి దాఁటిపోనిచ్చి యనుట, కొలువుమోసల = చావడిముందరిచోటు, పెకలన్ = పెల్లగిల, బోరు = పెద్ద, గొబ్బునన్ = తటాలున.
  47. సంపాదిత = కలిగింపఁబడిన, శంపావళిన్ = మెఱుపుచాలుచేత, పెంపారిన = సర్వత్ర వ్యాపించిన, బెట్టు = భయంకరముగా, అంసాచారంపు = నిరంతరధారలు గల.
  48. భోగమయ = ఫణారూపములైన, కుటీరములు = ఎత్తుడుగుడిసెలను.
  49. తఱిసి = చేఱి.
  50. ఓలలాడెడుచోటన్ = స్నానము చేయునట్టి సమయమందు.
  51. పగిదిధనము = పన్ను రూకలు, ఉలుప = ఉపాయనము.
  52. సద్యః = అప్పుడు, ఖేదమానస = సంకటముతోడి మనసు గలది.
  53. చొక్కు = మైమఱపు కలుగఁజేయు పొడి, మేటి = గొప్పవాఁడు.
  54. ప్రసూతియయ్యెన్ = కనియెను, వెసన్ = వడితో, పాఱుతెంచి = పరుగెత్తివచ్చి, కొంకక = శంకింపక, బావురుఁబిల్లి = గండుపిల్లి, బిట్టుఱుకు = తటాలున దుముకునట్టి, అరిష్టము = పురిటింటియందు, ఉద్ధతిన్ = దిట్టతనముతో.
  55. విహ్వల = విచారముచేత కలఁతనొందిన, ఱిచ్చవడి = నిశ్చేష్టురాలై, బాష్ప = కన్నీటియొక్క, పిచ్చిలన్ = ఉబికిరాఁగా, బెగడుచున్ = బెదరుచు.
  56. అలమటింపవలసెన్ = దుఃఖించవలసివచ్చెను.
  57. తింటివి = చంపితి వనుట, ఉడుకు = తాపము.
  58. అక్కునన్ = ఱొమ్మునందు, చట్ట్రాతితోడన్ = చట్టురాతిమీఁద.
  59. స్వీకార = పట్టిన, కైకొని = వహించి, కంసునిన్ = కంసునితో.
  60. మున్నిటి = మునుపు ఆకాశవాణి చెప్పిన, పెన్నిధి = పెద్దనిధివంటివాఁడు.
  61. ఏటు = బాణప్రయోగముదెబ్బ, స్రుక్కి = డస్సి - పౌరుషము పోయినవాఁడై, మొక్కలువోవఁగాన్ = వ్యర్థము లైపోఁగా, కొలువు మోసలలోనికిన్ = కొలువుకూటము ముందరిచావడిలోనికి, వెడదండితనంబునన్ = అల్పపౌరుషముతో.
  62. నెఱవీరుఁడను = మహాశూరుఁడను, పనివడి = పూని, సుపర్వులు = దేవతలు, శ్రుతాశ్రుతంబుగా = వినీవిననట్టు - జాడగా ననుట, ఒనరఁగన్ = యుక్తముగ, కడిమికిన్ = పరాక్రమమునకు.
  63. వజ్రి =- ఇంద్రుఁడు, చెనకునొక్కొ = ఎదిరించునో.
  64. తృణకణాయమానము = గడ్డిపోఁచను పోలినవారు.
  65. ఇంధనములు = సమిధలు, శిఖికిన్ = ఆగ్నికి.
  66. వివరించి = విశదవఱచి - చెప్పి యనుట.
  67. వారక = సంకోచింపక, పంపు వెట్టినన్ = ఉత్తరువు చేసి పంపఁగా, అనిరి = త్రాగిరి.
  68. శుద్ధాంత = అంతఃపురమునందలి.
  69. కొఱగాములు = అకృత్యములు, కిటుకునన్ = అకృత్యముచేత ననుట, వంతన్ = సంతాపమును, చేఁత = కృత్యము.
  70. ఆశ్వాసించి = ఊఱడించి, నిరోధంబు = నిర్బంధము, ఉద్విగ్నచిత్తుండు = వేదననొందినమనసుగలవాఁడు.
  71. గోకులమునకున్ = గొల్లపల్లెకు, ఇంపెసలారన్ = ప్రియము అతిశయింపఁగా, విసరంబులు = సమూహము.
  72. పుత్రవిభూతిముకుందునిన్ = పుత్రసంపదయైన విష్ణుమూర్తి గలవానిని, విధేయ = అడఁకువగల, నిష్యందునిన్ = జాఱుట గలవానిని, సంభ్రమము = త్వర.
  73. సంభావితుండు = గౌరవింపఁబడినవాఁడు.
  74. ముప్పునన్ = ముసలితనమునందు, నాకునైనను = నాకుఁగూడ, ఆస్తోక = అల్పముగాని, ముద్దుసేఁతలన్ = ఇంపు పుట్టించునట్టి చేష్టలచేత, చొక్కన్ = పరవశత నొంద.
  75. మూరి = మీఱి, మోచి = అంటి.
  76. బెరుకు = భేదము.
  77. మంతనమునకున్ = రహస్యస్థలమునకు, మొల్లమి = ధనసంపద.
  78. నెట్టనన్ = తప్పక, వర్షావధిన్ = సంవత్సరాంతమునకు, పెట్టంగలయప్పనములు పెట్టియున్ = ఇయ్యవలసినపన్నులు ఇచ్చియు, ఒట్టిన = అధికమైన.
  79. మందెమేలమ్ముతోడన్ = సరసత్వముతో, స్నేహమునన్ = మిత్రత్వముచేత - నూనెచేత, మంటలు = మనస్తాపములు - మండుటలు.
  80. గర్భీకృతవాక్యపద్ధతులన్ = లోపల విశేషార్థము కలిగియుండు మాటలరీతులను, అధ్యాహారములు = ఊహలు, హాయిని = నిశ్చింతతో.
  81. నిమిరి= తడవి, మీటి = వ్రేళ్లతో తాటించి, విషధిశయమునిన్ = ప్రళయసముద్రమునందు పండుకొనువాఁడైన శ్రీకృష్ణునియొక్క, నొక్కుటయున్ = ఒత్తిపట్టఁగా.
  82. జంత = ధూర్తురాలియొక్క, క్రోలెన్ = త్రాగెను, బిట్టు = అధికమైన.
  83. కంసవచోమృతవేతన = కంసుని ప్రియవాక్యములనెడు సంబళము గలది, విహ్వల = స్వాధీనముగాని, చేతోయాతన = మనోవేదన గలది, పాతకజాతనికేతన = పాపసమూహములకు నిల్లైనది.
  84. ఘనవజ్రాహతి = గొప్పవజ్రాయుధముయొక్క దెబ్బచేత, శృంగప్రాయము = శిఖరము వంటిటి, ధ్వానంబు = ధ్వని, ఘోరంబుగాన్ = భయంకరముగా, విభ్రాంతిమైన్ = దిగ్భ్రమముతో, బిట్టు = తటాలున, అర్భకుల కెల్లన్ = పసిబిడ్డల కెల్లను, వెక్కసిన్ = హింస కలుగఁజేయుదానిని.
  85. అంకంబునన్ = ఒడిలో, నిశ్శంకితుండు = భయపడనివాఁడు, సురాళించి = దిగదుడిచి.
  86. కళేబరము = దేహము, వాటిలెన్ = కలిగెను.
  87. ప్రకటముగన్ = ప్రసిద్ధముగా, వికటముగాన్ = పొరలి యెగుడుదిగుడుగా పడఁగా, విక్షేపములన్ =ఎగఁజాచుటల చేత, నికటమునన్ = సమీపమున, సకలపరికరశకటము = ఎల్లవస్తువులను వహించినది.
  88. పడుచులు = బాలకులు.
  89. వ్రేతలు = గోపికలు, వెఱఁగుపడిరి = ఆశ్చర్యబడిరి.
  90. కుంభభాండతతులు = కడవలయందును బానలయందును నుండిన, చిడిముడిపడుచు = ముఖవికారమును కలుగఁజేసికొనుచు, అడిచిపడుచున్ = కోపగించుకొనుచు.
  91. విధ్వస్తంబులు = మిక్కిలి చెదరివడిపోయినది, పొందుపఱిచి = అనువుగా నుంచి.
  92. మేరుగిరిపాటి = మేరుపర్వతమంత, అంత సేసెన్ = అంతటియవస్థను పొందించెను - చంపె ననుట, కట్టుబండిన్ = గృహోపకరణము లుంచుకొనెడుబండిని, ఓపికన్ = సమర్థతచేత, ముందరన్ బ్రతికియుండినన్ ఓపికన్ ఎవ్వరి నెంత సేయునో యని యన్వయము.
  93. పరివేష్టితమునివర్గుఁడు = చుట్టుకోఁబడిన మునిసమూహము గలవాఁడు, సంపాదితాపవర్గుఁడు = సంపాధింపబడినమోక్షము గలవాఁడు- మోక్షమును పొందఁగలవాఁ డనుట, భవనైసర్లుఁడు = శివస్వభావము గలవాఁడు - శివునిఁ బోలినవాఁ డనుట, పరతత్వకళామార్గుఁడు = పరతత్వవిద్యయొక్క మార్గమును తెలిసినవాఁడు.
  94. అభ్యాగతవ్యాజంబునన్ =తనంతట ఇల్లు వెదకుకొని వచ్చినయతిథియను నెపముచేత, నిర్వర్తించి = జరిపి.
  95. గారామునన్ = గారాబముతో.
  96. ఉబ్బన్ = సంతోషింప, కుందియనలోపలన్ = కూర్చుండ నేరని పసిబిడ్డలు కూర్చుండుటకై ఒకతట్టు దారి యేర్పఱచి చేయబడిన తొట్టిలో, పొత్తులయొత్తునన్ = పొత్తిగుడ్డలయొక్క ఒత్తుడుచేత, విద్దెంబులు = వెలికిల పండుకొని కాళ్లయడుగులను బిడ్డల కడుపున కానించి పైకెత్తి దించి యాడించునాటలు, కొంకుచున్ = బెదరుచు, శైశవక్రీడలందున్ = పసిబిడ్డల యాటలయందు.
  97. గోకరీషధూళిధూసరితశరీరంబుతోడన్ = ఎండినఆవుపేఁడ వల్లనైనదుమ్ము చుట్టుకొనుటచేత ఇంచుక తెల్లనైన దేహముతో, వీఁకలన్ = నిక్కులతో, డుల్లన్ = వీడ, మల్లాడుచున్ = పెనగులాడుచు, ఆఁగియును = నిలిపియు, గుబ్బెతలన్ = స్త్రీలను, మొఱఁగి = ఏమఱించి, తగులునకున్ = కూటమికి, కుటీర = గుడిసెలయొక్క, వాటంబులు చేసి = ఓరవాకిలిగా వేసికొని, జవరాండ్ర = యౌవనస్త్రీలయొక్క, విధ్వస్తంబు = పాడు, పెరఁజి = ఊడ్చియెత్తి, చిట్టకంబులకున్ =- వేడుకలకు, ఇచ్చకంబులు = ప్రియములు, ఉలూఖలంబులు = ఱోళ్లు, దాపులు = సమీపములు, పా, తాఁపలు = మెట్లు, దుండగంబులకున్ = దుష్టచేష్టలకు.
  98. దుండగీఁడు = దుష్టుఁడు.
  99. కనుఁబ్రామి = ఏమరించి, అంకతలంబులన్ = తొడమీఁద.
  100. వెరఁజాడు = ఊడ్చి యెత్తుకొని తిను.
  101. రాయిడి = బాధ.
  102. కోమలాంగుళీరేఖాచిహ్నికంబులు = మెత్తనివ్రేళ్లగీఱగుఱుతులు గలవి.
  103. భాగ్యములు = సంపదలు, కలగుండు పెట్టి = కలయవెదకి, కుస్తరించి = పట్టుపఱిచి, దంట = దిట్టతనముగల.
  104. ఱట్టు = అల్లరి.
  105. దామపాశము = దామెనత్రాటితో, ఉగ్గన్ = బిగియ.
  106. గుండు గూడి = చుట్టుచుట్టుకొని, ఎదురుకట్టన్ = ఎదుటిప్రదేశమునందు, ధవళార్జునంబులన్ = తెల్లమద్దిచెట్లను.
  107. బద్దులన్ = అశాశ్వతములైన, తొలుపుట్టుక వెడబుద్ధులన్ = పూర్వజన్మమునందు దుర్బుద్ధులైన, పురుణించిన = సరిపోలిన, ముద్దుల సుద్దుల బాలకుఁడు = ఒప్పిదములైన వృత్తాంతములు గలపిన్నవాఁడు, క్షోణిన్ = భూమిమీఁద.
  108. యమళార్జునంబులు = జంటమద్దిచెట్లు, ఘోషము = ధ్వని, గొల్లపల్లె, భీషణంబు = భయంకరము, కిచ్చలువడి = చేష్టలు దక్కినవారై.
  109. తొక్కు బలుకులు = వచ్చి రాని మాటలు.
  110. ఉద్దీపితశోకసంభ్రమవిధేయమతిన్ = మిక్కిలి యతిశయించిన దుఃఖమునకును తొట్రుపాటునకును లోఁబడినమనసు గలదై.
  111. ఉదరబంధంబు = నడుముకట్టు, దామంబు = దామెన, అక్కునన్ = ఱొమ్మునందు, అపారంబునన్ = ఎడతెగనివానచేత.
  112. నిష్కారణము = కారణము లేక, ఆభీరపరులు = గొల్లదొరలు, పెద్దయున్ = మిక్కిలి, కదురన్ = కలుగఁగా.
  113. పోఁడిమి చెడెన్ = చచ్చె ననుట, మూఁడెను = కీడు కలిగె ననుట, మూలాగ్రముగన్ = తుదముట్ట.
  114. పరివోయెన్ = కొల్లపోయెను - తగ్గిపోయె ననుట, కందుచున్నవి = కృశించుచున్నవి.
  115. తొరవు = అధికమైన, ఎల్లి = రేపు.
  116. శ్రాంతలు = అలసినవారు, కవలు = జతలు, వేగుఁబోకన్ = తెల్లవాఱుకట్ల, భౌంక్రియా = భౌం అనునట్టి, బిట్టులికి = మిక్కిలి యదరిపడి, త్రిమ్మరు = తిరుగు, సందడింపన్ = మెదలఁగా, సరగునన్ = శీఘ్రముగ, బంధురంబులు = పొడవులై కొంచెము వంగినవి, మంథంబులు - కవ్వములు, ఆలీఢపాదంబు = ముందరికి చాఁచి నిలుపఁబడిన కుడికాలు, చిలుకుచూపుల = బాణములను పోలినచూపులు గల, చెదరి = తొలఁగి, కదుపులన్ = పసులగుంపులను, మొదవులన్ = పాడియాపులను, మెంపుచున్ = ఎదురుకొని వచ్చుచు, నఱ్ఱాడు = మెలఁగునట్టి, ధేనువులన్ = వేఁగటి యావులను, దుగ్ధదోహనంబునకున్ = పాలు పితుకుటకు, గోవ = బెదరుగల, తలకోలలు = కొనను ఉచ్చు వేసినత్రాళ్లు గట్టిననిడుపాటికఱ్ఱలు (ఈకోలలు గోవాపులకొమ్ములకు తగిలించి కదలనీక పట్టుకొందురు), మస్తరించుచున్ = చనువుపఱుచుచు, కుక్కుటాసనంబునన్ = కాలిమడమలమీఁద పిఱ్ఱలు మోప, జానులగ్నంబులు చేసి = మోకాళ్లమీఁద పొందికగా నుంచుకొని, ఫేనంబులు = నురుఁగులు, ఉడుకువంటకంబు = వేఁడియన్నము, నులివేఁడిగాన్ = కొంచెము వెచ్చగా నుండునట్లు, గ్రామ్యాహారంబులతోడన్ = మాంసాద్యాహారములతో, పాణిపాత్రంబులన్ = దోసిళ్లయందు, సుకరంబులుగాన్ = పొందికగా, సరళపథంబునన్ = చదరమైనమార్గమున, బేగడ = కగాకిబంగారు, వీఁళలు = వంగుటలు, కోరకావళ్లు = మీఁది వంపుగా నుండు బద్దలు గలకావళ్లు, గునిసిగునిసి = క్రుంగుచు నిక్కుచు, గౌష్ఠీనంబు = మునుపటిమంద, కంక = బోరువ.
  117. అర్ధచంద్రాభముగ = అర్ధచంద్రాకారముగా, పారివెలుఁగులు = కంపకోటలు.
  118. దండలన్ = సమీపములందు, విమలోద = తేటనీళ్లుగలది, ఇమ్మున్ = నెమ్మదిగా.
  119. బర్హిపత్రములు = నెమిలియీఁకలు, మురళి = పిల్లంగ్రోవి, కాకపక్షంబులన్ = పిల్లజుట్లయందు, ఒయ్యారులు = విలాసవంతులు, పీఁకెలు = చప్పటగా మడిచి యూఁదెడు సాధనములు.
  120. అభిహత = ఎదురుతాఁకునట్టి, పూర్వవాత = తూర్పుగాలియొక్క, ఉదగ్దిశా = ఉత్తరపుదిక్కుయొక్క, పర్జన్యధనురాత్త = ఇంద్రధనుస్సుచే పొందఁబడిన, సంఛాదిత = లెస్సగా కప్పఁబడిన, అఖిలాశా = సమస్తదిక్కులు గల, ఘనంబు = మేఘము, విభ్రాజితస్తనితంబు = ప్రకాశింపఁజేయఁబడినయుఱుములు, ప్రస్ఫుటద్బహుతరేరమ్మదంబు = చక్కగాతోఁచుచు నధికమైనట్టి మెఱపులు, ప్రశమితాంభోజాతబంధుమయూఖంబు = చల్లగాఁ జేయఁబడిన సూర్యకిరణములు గలది, చంద్రనందన = బుధునితోడను, భూరిధారానితాంతోగ్రవారివృష్టి = ఎడతెగనిధారలచేత నధికమైన నీళ్లతోడి వాన, పూరితాఖిలనిమ్నగాంభోచయంబు = నిండింపఁబడిన యెల్లనదులలోని నీళ్లసముదాయము గలది, వర్షాగమంబు = వానకాలము అనుట.
  121. ఇంద్రగోపములు = పట్టుపురుగులు, విఘటితము = విశేషముగా కూర్పఁబడినది, పేటిక = పెట్టె, పద్మరాగములు = కెంపులు, సోయగంబునన్ = అందముగా - విధముగా.
  122. నీలాంబుదములక్రేవలన్ = మబ్బులపార్శ్వములందు, గ్రాలెడు = ప్రకాశించునట్టి, కొక్కెరల = కొంగలయొక్క, మాలిన్యమతులచే = కపటబుద్ధిగలవారిచేత, ఉపలాలితులు = ఊఱడింపఁబడినవారు, నిష్కళంకులు = కపటములేనివారు.
  123. వఱదలు = వెల్లువలు, నడుమంత్రపు = నడుమవచ్చిన, వెడగుమతులు = అల్పులైనబుద్ధి తక్కువవారు, వెల్లి విరిసిన = ప్రసిద్ధినొందిన.
  124. పొదియంగఁబడిన = కమ్ముకొన్న.
  125. ఇందుమండలము = చంద్రబింబము.
  126. జలధరకాలంబునన్ = వానకాలంబునందు, కదంబంబులు = సమూహములు గలవి, కదంబదామకంబులన్ = కడపపువ్వులదండలను, బర్హిపత్రంబులు = నెమలియీఁకలు, గాత్రంబులన్ = దేహములయందు, సాళగంబులతోడన్ = మేళనములతో, పిసాళించి = అతిశయించి, పైరిక = దున్నెడువారివలె, గైరికనికరంబులు = కావిరాలసముదాయములను, తోరంబుగాన్ = దట్టముగా, జీమూతంబులు = మేఘములు, క్రేళుదాఁటియును = కేకలు వేయుచు కుప్పెగంతులు వేసియు, ఆభీరకుమారులు = గొల్లపిల్లకాయలు, కలాపంబులు = పించెములు, మత్తమయూరంబుల = మత్తుగొన్న నెమిళ్లయొక్క.
  127. లాంగలిన్ = బలరాముని, నీపావళి = కడపచెట్లచాలుయొక్క.
  128. తటిని = యేఱు, హ్రదంబులోపలన్ = మడుఁగులో, హాలహల = హాలాహల మనెడు విషముయొక్క, ఉల్బణము = ఉప్పొంగినది.
  129. విషసముజ్జ్వాలలు = విషము యొక్క చక్కగా మీఁది కెగయునట్టి మంటలు, అధికతప్తతైలము = మిక్కిలి తెర్లిననూనె.
  130. కళిందకన్య = యమునానది, ముచ్చుట్టును =మూఁడుప్రక్కలను, యదూద్వహుపట్టి = శ్రీకృష్ణుఁడు.
  131. తటమునన్ = గట్టునందు, వీచిన = అతిశయించిన, కదంబ = కటపచెట్టుయొక్క, ఉత్కటగతిన్ … = ఉద్ధతితోడిరీతితో, గంధసింధురము = ఏనుఁగు, పల్వలమున్ = పడియను, కలగుండు పెట్టి = కలఁచి, పర్యటనము సేయు = తిరుగు.
  132. తొలంకునన్ = తొనుకుటచేత, మిడిసి = మీఁది కెగసి, దివియకోలలకైవడిన్ = దివటీలవలె, భంగసంగతిన్ = అలలచేరికచేత, జోరునన్ = అధికముగా.
  133. చండ = తీక్ష్ణమైన, మూడఁజేయన్ = నశింపఁజేయఁగా.
  134. విభాళించియున్ = చఱచియు, లోకజిష్ణునిన్ = లోకమునందలివారి (నందఱను) జయించుస్వభావము గలవానిని.
  135. చేపడి = చిక్కి, ఉల్కి = భయపడి.
  136. చటురయంబున = మిక్కిలి వడితో, వేష్టిత = చుట్టఁబడిన.
  137. ఘనదర్వీకరభోగవేష్టనముచేన్ = గొప్పసర్పదేహము చుట్టుకొనుటచేత, శోకవ్యాకులాలోలవర్తనులు = శోకముచేత కలఁతనొంది మిక్కిలి చలించుచున్న ప్రవర్తనముగలవారు.
  138. ఆక్రోశించుచున్ = ఏడ్చుచు.
  139. నెట్టనన్ = దృఢముగా, పయోధిన్ = సముద్రమునందు, అట్టె = అత్యంతము, మానుషలీలలు = మనుష్యక్రీడలు.
  140. శాత్రవచయంబు = పగవారికూటమిని.
  141. ఒలయన్ = కలుగఁగా ననుట, బంధనంబులు = కట్లు.
  142. నలినలియై = నజ్జునజ్జైలై - మిక్కిలి నలఁగి, సొలవక = తగ్గక, పొలుపఱిన = బాగు చెడిన - దీనత్వము నొందిన, పెలుచన = క్రూరత్వముతో.
  143. వివశుఁడు = పరవశుఁడు, అంగలతికలు = తీఁగలవంటి దేహములు, నాళీకపత్రాక్షున్ = తామరఱేకులవంటికన్నులు గలవానిని.
  144. లోకావనదక్ష = లోకులను రక్షించుటకుఁ జాలినవాఁడా, పీతవస్త్రావృత = పీతాంబరమును తాల్చినవాఁడా.
  145. ఆజ్ఞ పెట్టన్ = శిక్షింప, వాతాశనుఁడు = సర్పము.
  146. ఈరెలుంగునన్ = అల్పస్వరముతో.
  147. నీనియోగంబునన్ = నీయాజ్ఞచేత, తానున్ = నేనును.
  148. ఓరంత ప్రొద్దును = ఎల్లప్పుడును, కుటిలవృత్తి = వంకరనడత, పాపజాతి = దుర్జనత్వముగల, పాఁపజాతి = సర్పకులము.
  149. విషధరముఖ్యా = సర్పశ్రేష్ఠుఁడా.
  150. ప్రసాదంబు = చిత్తము.
  151. ప్రశంసించుదున్ = కొనియాడుచు, ఉగ్గడించుచున్ = చెప్పుకొనుచు.
  152. మహోగ్రనిశాటకోటికిన్ = మిక్కిలి క్రూరులైన రాక్షసులసమూహమునకు, తాళవనంబునకున్ = తాటితోపునకు.
  153. కన్నిచ్చవచ్చిన = చూపునకు మనోజ్ఞమైన.
  154. గోపులు = గొల్లవాండ్రు, ఒప్పమి = చెఱుపు.
  155. వెక్కసము = కష్టతరము.
  156. ఉక్కునన్ = బలముతో, పారిపుచ్చక = చంపక, చండకేసరికిశోరయుగంబు = కోపించిన సింహపుపిల్లలజంట, చెలంగి = విజృంభించి.
  157. నినదంబు = ధ్వని, బిట్టు = అకష్టాత్తుగా, సమరంబు = యుద్ధము, భానునిభప్రతాపబలభద్రుఁడు = సూర్యునితో సమానమైన ప్రతాపముగలవాఁడైన బలరాముఁడు.
  158. తునిసి = తునిఁగి.
  159. నిష్ఠురవృత్తితోడన్ = పరుషప్రవర్తనముతో, నింగిన్ = ఆకాశమునందు.
  160. పరిభవించువాఁడు = భంగపెట్టఁదలఁచినవాఁడు, రంధ్రాన్వేషణంబు = సందు వెదకుట, నిష్కంటకంబు = బాధ లేనిదిగా, దైత్యకంటకులు = రాక్షసులకు హింసకులు, ఇంపులన్ = మనసు వచ్చినట్లు, చూఱలు విడిచి = కొల్లపెట్టి, తగిలి = ఆసక్తులై.
  161. సీరచక్రపాణులు = బలరాముఁడును కృష్ణుఁడును.
  162. శైశవక్రీడలం = పసితనపుఆటలు, దారకులన్ = పిన్నవాండ్రను.
  163. బెరసి = కూడుకొని.
  164. హలి = బలరాముఁడు.
  165. ఉద్దులన్ = జతలను, బంధురవిక్రముఁడు = మంచిపరాక్రమము గలవాఁడు, దండితోన్ = సామర్థ్యముతో.
  166. దగ్ధశైలగాత్రము = కాలినకొండను బోలిన దేహము, వికటాననము = వికృతమైన ముఖము, లంబోదరము = వ్రేలుచున్న కడుపు.
  167. కాలమేఘంబు = నల్లనిమబ్బు, అభ్రమార్గంబునన్ = ఆకాశమునందు, ప్రయుక్తుఁడు = చక్కగా కూడుకొన్నవాఁడు.
  168. అలవు = శక్తి.
  169. కళవట్టి = స్మృతి చెడి, వెలికుఱికి = బయటికుఱికి, చోదితుండు = ప్రేరేపించఁబడినవాఁడు.
  170. కల్పాంతకాలశమనుని = ప్రళయకాలపుయమునియొక్క, ఎనవచ్చు = సమానమగు, బెట్టిదంబుగన్ = పరుషముగా.
  171. బలవద్రిపు...విడంబున్ = బలవంతులైన శత్రువులకు భయమును పుట్టించునట్టి విడుపులైన బాహువులచేత ఒప్పువానిని, ఘనదనుజజనకదంబున్ = గొప్పవారైన రాక్షసులసమూహములు గలవాని, లలితేతరదుర్గుణావలంబున్ = మంచికంటే ఇతరములైన చెడ్డగుణములకు నాధారమైనవానిని.
  172. ప్రభంజన = మిక్కిలి భంగపెట్టుట యనెడు, పొలుపై = ఒప్పిదము గలిగి, సమ్మోదంబు = సంతోషము.
  173. ముదంబులు = సంతోషములు.
  174. పిండలివండుగాన్ = పిడుచగట్టినవండుమట్టి గలవిగా.
  175. నీరదములు =మేఘములు, విగ్రహంబులు = వాదములు.
  176. సూర్యదీప్తిన్ = ఎండచేత, అల్లన్ = మెల్లగా - దినక్రమము ననుట, లంపటములన్ = విషయాశలయందు, మమత్వములు = మమకారములు.
  177. అమల = నిర్మలమైన, కొమరై = మనోజ్ఞమై, సంగతమునన్ = సహవాసముచేత.
  178. తోయజాకరములయందున్ = సరస్సులయందు, అంచపిండు = హంసలగుంపు, అందన్ = పొందుటకు.
  179. అదను = సమయము, పొలిసిపోయెన్ = నశించెను, ప్రత్యాహతంబులు = సంకోచింపఁబడినవి - అణఁగిన వనుట.
  180. అనర్గళంబులు = ధారాళములు, పురుహూత = ఇంద్రునికి.
  181. పాటిల్లినను = కలిగినను, ఆచ్చికము = కొఱఁత.
  182. విపణివర్తకంబుచేతన్ = బజారుబేరముచేత.
  183. వృత్తులు = జీవనోపాయములు, పూజనీయంబులు = పూజింపఁదగినవి.
  184. భజన = సేవ, పొలిసి తమ్ముఁదారె పోదురు = తమకుఁదామే నశింతురు.
  185. సీమ = దేశము, అద్రికటకంబులు = కొండనడుములు.
  186. కామరూపములన్ = ఇష్టమువచ్చినయాకారములతో, వనౌకసులన్ = వనమునం దుండువారిని, చటులోగ్ర = కఠినములును భయంకరములు నైన, నెక్కొనన్ = నిలుకడనొందు.
  187. విపినచరులకున్ = అడవియందు మెలఁగువారికి, ఒండు = ఇతరము.
  188. సర్వఘోషసమేతంబుగా = ఎల్లమందలతోడ, గాటంబుగాన్ = విశేషముగా, వేఁటలన్ = పొట్టేళ్లను, జాతరలు = ఉత్సవములు, పాయస = పరమాన్నము, ఆపూప = పిండివంటలు, వ్యంజన = కూరలు, రంజితంబులు = మనోజ్ఞములు, శోభనంబు = శుభము.
  189. కొనసాగంగన్ = అతిశయింపఁగా.
  190. గర్జితాభ్రంబులచందంబున = ఉఱుముచున్న మేఘములవలె, దుర్దమ = అణఁపరాని.
  191. గాసిలి = కోపించి, పెలుచన్ = ఉద్ధతితో.
  192. దెప్పరపు = ఆపద నొందించునట్టి, గుప్పింపుఁడు = కురియుఁడు, మడియున్ = చావఁగా.
  193. అభ్రమాతంగము = ఐరావతము.
  194. నిర్ఘాతవాతవర్షంబులు = పిడుగులతోడి గాలివానలు.
  195. శతమన్యుఁడు = ఇంద్రుడు, తటిక్కరావళులచేతన్ = మెఱుపులను చేతులచేత, ఝంఝా = వానగాలి, చటులాంబుదంబులు = భయంకరములైన మేఘములు, ప్రస్ఫీతము = మిక్కిలివెలుఁగునట్టిది.
  196. ఉత్పాతాంబుదశ్రేణి = ప్రళయమేఘపఙ్క్తి, నిబిడ పట్టమైన, చండవేగము గల, ఉరు=అధికమైన, ఒక్కుమ్మడిన్ = ఒక్కసారిగా.
  197. దుర్నిరీక్ష్యప్రకంపితశంపాతేజంబులవలనను = చూడ శక్యముగాని మిక్కిలి చలించునట్టి మెఱుపులవెలుఁగులవల్లను, బధిరీకృత = చెవుడుగలంగఁజేయఁబడిన, వ్రాత = సమూహముగల, స్తనిత = ఉఱుములయొక్క, తుంగ = ఉన్నతమైన, చూర్ణిత = పొడి చేయఁబడిన, నిర్ఘాతపాత = పిడుగుపడుటయొక్క, శుండాలశుండాదండ = ఏనుఁగుతొండముతోడ, కరకా = వడగండ్లతోడి, దుర్దినీభూత = సూర్యప్రకాశము లేని పగలు కలదిగా నగుచున్న, అపరిచ్ఛిన్న = కమ్ముకొనుటచే మితిలేని, జీమూతజాత = మేఘసముదాయముచేనైన, వఱదలన్ = ప్రవాహములలో, ఆర్తనాదంబులతోన్ = మొఱ్ఱోయనుకూఁతల చప్పుళ్లతో.
  198. కీడునన్ = లోపముచేత, మనికితములు = సందేహములు.
  199. గోపన = దాఁచుటచేత.
  200. సంజాత =పుట్టిన, కంజాతభవాండభారవహనప్రశస్తంబు = బ్రహ్మాండముయొక్క భారమును వహించుటచేత మెచ్చుపడిసినది, తాలచ్ఛత్రంబు = తాటాకుగొడుగు, ధారాధరప్రయుక్తంబు = మేఘములవలన ప్రయోగింపఁబడినది, సుత్రాముండు = ఇంద్రుఁడు, పరుషంబుగన్ = గడుసుగా, కరకావర్షంబు = వడగండ్లవాన, గోష్ఠంబునకున్ = మందకు, విషణ్ణ = విషాదము నొసంగిన.
  201. పయోదానీకంబులు = మేఘసమూహములు.
  202. విడంబించుటయున్ = ఒప్పఁగా.
  203. పాకశాసనుండు = ఇంద్రుఁడు, అభ్రగజము = ఐరావతమును.
  204. అవతరణంబు చేసి = దిగి, నిక్షేపీకృత = నిక్షేపముగాఁ జేయఁబడిన, సంభావించి = గౌరవించి.
  205. జయ పెట్టన్ = జయజయ యని పొగడఁగా.
  206. ప్రసన్నమూర్తులు = కళంకములేని యాకృతి గలవి, రోదసీకుహరంబునన్ = భూమ్యాకాశమధ్య మనెడుగుహయందు, బెరయన్ = వ్యాపింవఁగా.
  207. జగతీభరంబు = భూభారము, ఆజులలోనన్ = యుద్ధములయందు.
  208. కవ్వడితోన్ = ఆర్జునునితో, పొలియన్ = నశింప.
  209. పదంపడి = పిమ్మట, ఆమంత్రితుఁడు = పంపఁబడినవాఁడు.
  210. భారము = అశక్యము, చేతస్కులు = మనసు గలవారు, సముద్రగ్రోచ్చరవంబులన్ = గంభీరములైన గట్టి చప్పుళ్లతో, మూఁగి = చుట్టుకొని.
  211. అలవోకగాన్ = విలాసముగా, ప్రణయకోపము = ప్రేమతోఁగూడిన కోపము.
  212. అపృచ్ఛలు = తగనిప్రశ్నలు.
  213. ఆంధ్యము = గుడ్డితనము - అజ్ఞానమనుట.
  214. సంవాసిత = చక్కఁగా పరిమళింపఁజేయఁబడిన, మకరందబైందవ = పూఁదేనెబిందువులవల్ల నైన, చంద్రికా = వెన్నెలచేత.
  215. దుంప = రాశి యనుట, వేసడి = చెఱుపరి, చీఁకటిమూఁకవిప్పు = చీఁకటిని పోఁగొట్టువాఁడు, వారాన్నిధియుబ్బు = సముద్రమును ఉప్పొంగునట్లు చేయువాఁడు, రాయడి = పీడ, వేల్పులపంట = దేవతలఫలము, తిన్నని = సౌమ్యములైన.
  216. ఒయ్యారపు = విలాసముయొక్క, పూరంబు = మేలైన ప్రవాహము, వర్ధిష్ణుఁడు = వృద్ధి
    పొందు నిచ్ఛగలవాఁడు.
  217. తాన = మెట్టువరుసలయొక్క, మూర్ఛన = రాగములయారోహణావరోహణములయొక్క, సాళగ = కలగలుపుతోడి రాగాలాపముచేతను, రాణ = మనోజ్ఞత.
  218. గుల్మాది = పొదలు మొదలైన, స్థావర = తమయున్నచోటనుండి కదలనేరని, చొక్కి = పరవశత్వము నొంది.
  219. ననుపునన్ = మోహముచేత.
  220. సాళగించి = రాగమును ఆలాపన చేసి, తతకారము = తత అనుధ్వని, సుమాళించి = చొక్కి, ఎదురుకట్ల = ఎదుట.
  221. ఆనవాలు = నానబియ్యము, మేలము = ఎగతాళి.
  222. మొఱఁగి = ఏమఱించి, కికురువెట్టి = మోసపుచ్చి.
  223. అభీరవారిజాక్షులు = గోపికలు, మురళి = పిల్లంగ్రోవి.
  224. బృందారకచక్రవర్తి = దేవతలలో శ్రేష్ఠుఁడైన కృష్ణుఁడు, పుష్పాపచయము = పువ్వులు గోయుట.
  225. వియోగ = విరహమువలని, నివ్వటిలంగన్ = అతిశయింపఁగా.
  226. చొప్పు = జాడ.
  227. మోపన్ = ఆనఁగా, సరులు = హారములు, కైదండ = చేయాసరా.
  228. కళిందజా = యమునయందలి, శీకర = తుంపురులచేత, సికతామయ = ఇసుకదిన్నెలనెడు.
  229. త్రస్తరి = క్రిందు, పొదలించెన్ = వృద్ధిపొందించెను, ఉపధానము = తలగడ.
  230. పరిశ్రాంతలు = బడలికనొందినవారు, సేదలు = బడలికలు, కైశోర = పసితనపు.
  231. కోరకొమ్ములన్ = మీఁదికి నిక్కిన కొమ్ములతో, స్కంధసంఘర్షంబునన్ = మూఁపురాపిడిచేత, క్రాలు = ప్రకాశించు.
  232. కంజాకరంబు = తామరకొలను, కుంజరము = ఏనుఁగు.
  233. తీవ్రమునన్ = వాఁడిమితో, ఉక్కణఁగంగన్ = చావ.
  234. దష్టున్ = కఱవఁబడినవానిని, సురసంఘస్ఫీతరిష్టున్ = దేవతాసమూహమునకు మిక్కుట మైనకత్తి యైనవానిని.
  235. విధ్వంసుఁడు = చెఱుచువాఁడు, నృశంసుఁడు = హింసకుఁడు.
  236. సూదులన్ = సూదులచేత, శృంఖలాబద్ధునిన్ = సంకెల వేయఁబడినవానిని, బందిగమునన్ = కారాగృహమునందు, పగఱన్ = శత్రువులను.
  237. అపష్టంభము = అవలంబము.
  238. హేషారటనంబు = సకిలింతచప్పుడు, పటలన్ = జూలువలన, సంఛన్నంబు = చక్కఁగా కప్పఁబడినది, ఖురాగ్ర = గిట్టమొనలచేనైన.
  239. సంరంభ = వేగిరపాటుతోడి, చండ = వేండ్రమైన, ప్రస్వేద = మిక్కిలి వేండ్రమైన.
  240. వల్గింపఁగాన్ = చుట్టు పరుగుపాఱఁగా, శారదవారి భృచ్ఛకలవిభ్రాంతి = శరత్కాలమేఘఖండము లనెడుభ్రమ గల్గించుటతో, డుల్లినన్ = రాలఁగా.
  241. విహ్వలభావమున్ = వివశతను.
  242. అంభోదపథంబునన్ = ఆకాశమార్గమున, బోరునన్ = మిక్కిలి.
  243. అక్కజము = అధికము, స్రుక్కక = వెనుకదీయక.
  244. బెరయన్ = నిండుకొనఁగా.
  245. ఓపని = అనువు పడని, ప్రోడ = ప్రౌఢుఁడు, ప్రాపంచికమున్ = ప్రపంచమునందలి వ్యవహారమును.
  246. అనులాపంబులు = మాటిమాటికి మాటలాడుటలు.
  247. ఎడపక = ఎడపడక.
  248. దుగ్ధదోహనంబునన్ = పాలు పిదుకుటకు.
  249. వర్ధిష్టునిన్ = వృద్ధిపొందించుశీలము గలవానిని, వనజాతాసన = బ్రహ్మ, ప్రాభవాధిష్ణునిన్ = ప్రభుత్వము నధిష్ఠించియుండువానిని, ప్రక్రియా = అధికారమును, జిష్ణునిన్ = జయించు శీలముగలవానిని, కనదంభోధరకృష్ణునిన్ = ప్రకాశించునట్టి మేఘమువలె నల్లనైనవానిని, కృష్ణునిన్ = ఆసక్తిగలవానిని.
  250. అంభోరుహపత్ర = తామరఱేకులవంటి, ఆజానుబాహులతా = మోఁకాళ్లను తాఁకునట్టి చేతులనెడుతీఁగలచేత, పీతవస్త్రకటిభారోదగ్రున్ = పచ్చనివస్త్రము గలపిఱుఁదులచేత ప్రకాశించువానిని, మండిత = అలంకరింపఁబడిన, దేదీప్యమానప్రభాకలితున్ = మిక్కిలి వెలుఁగునట్టి కాంతితో కూడుకొన్నవానిని, వన్య = అడవియందుఁ బుట్టిన.
  251. అరుణారుణ = సూర్యునియెఱుపువంటి యెఱుపుగల, విరి = వికసించిన, అవతంసము = శిరోభూషణముగా, కుంతలంబులతోడన్ = ముంగురులతో, క్రేవన్ = పార్శ్వమునందు, పిచ్చలించుచున్ = త్వరపడుచు.
  252. ప్రావృట్పయోధరము = వానకాలపుమబ్బు.
  253. దంతురీభూత = ఎగుడుదిగుడుగా నైన.
  254. శతమన్యునిఁగాన్ = ఇంద్రునిగా, కులిశాబ్జరేఖలు = వస్త్రమువలెను కమలమువలెను కనఁబడుగీఱలు.
  255. గాందినేయుండు = అక్రూరుఁడు, అభివాదనంబు = నమస్కారము, పథఃశ్రాంతి = మార్గశ్రమము, సేచనంబునన్ = తడుపుటచేత, అపనయించి = పోఁగొట్టి.
  256. ప్రచోదితుండు = ప్రేరేపించఁబడినవాఁడు, ఉదాసీనంబులు = చెప్పరానిమాటలు, నిగళప్రాప్తునిన్ = సంకెళ్లు వేయఁబడినవానిగా, విచారించుట = ఆలోచించుట, దుర్మంత్రంబు = దురాలోచన, వ్యాజంబునన్ = నెపముచేత, ప్రపంచవేది = సర్వము తెలిసినవాఁడు.
  257. అసువులు = ప్రాణములు.
  258. ఎల్లి = రేపు, సంబరంబు = వేడుక.
  259. అగ్గలింపన్ = అతిశయింప, విభిన్న = మిక్కిలి భేదిల్లిన, దురపిల్లి = శోకించి, పిచ్చిలు = స్రవించు, బింకపు = బిగువులైన, తొప్పఁ దోఁగఁగన్ = మిక్కిలి తడియఁగా.
  260. అరవరలు = కృశించినవి.
  261. సోనలు =ధారలు, చౌక = అలక్ష్యము.
  262. కంతుసాయకములన్ = మన్మథుని బాణములచేత.
  263. నిగళములన్ = సంకెళ్లయందు.
  264. ఆఁగి = నిలిపి, క్రాఁగన్ = తపింప.
  265. చెల్లఁబో = అయ్యో.
  266. బోరనన్ = క్రమముగా.
  267. పరిపాటి = క్రమముగా.
  268. నాసికాగ్రసంధాననిరీక్షణంబుగన్ = ముక్కుమొనను గూర్చిన చూపు గలుగునట్టుగా.
  269. కుందేందుధవళితాంగునిన్ = మల్లెపువ్వులవలెను చంద్రునివలెను తెల్లనైన దేహముగలవానిని, పరిధాన = కట్టువస్త్రముచేత, కదంబప్రసూన = కడిమిపువ్వులచేనైన, అంచితగండమండలున్ = ఒప్పిదములైన గండస్థలములు గలవానిని, వికసిత = వికసించిన, ఇద్థ = ప్రకాశించునట్టి.
  270. ఉత్సంగంబునన్ = ముందఱిభాగమునందు, శక్రచాపతటిన్మాలికాపరిశోభితంబు = ఇంద్రధనుస్సుచేతను మెఱుపుచాలుచేతను ప్రకాశించునది, అద్భుత = ఆశ్చర్యము నొందిన.
  271. చెంగలింపన్ = హెచ్చగా, ఒడికంబుగన్ = చక్కగా, వారియందున్ = నీళ్లలో.
  272. వికాసము = తేటదనము.
  273. విదితంబుగన్ = తెలియఁబడునట్లు, అద్భుతంబుగన్ = వింతగా.
  274. జీవన్మృతుండు = బ్రతికియుఁ జచ్చినవాఁడు.
  275. ఖేదంబు = విచారమును.
  276. నడతెండు = రండు, ఉపదలు = కానుకలు.
  277. పరిహరించునది = మానుకోవలసినది, నిర్దేశించి = చెప్పి, ఆమంత్రితుండు = సెలవుపొందినవాఁడు.
  278. బలసి = చుట్టుకొని, ఏపునన్ = విజృంభణముతో, మత్తదంతిగతి = మదపుటేనుఁగువలె.
  279. రజకుండు = చాకలవాఁడు, మడుఁగుపుట్టంబులు = చలువవస్త్రములు.
  280. నిరసించి = తిరస్కరించి, ఏచిన = మీరిన - తనయధికారమునకు మించిన యనుట.
  281. ఏలిక = ఏలినవాఁడు - రాజు, ప్రాణముల్ గొనున్ = చంపును, 380 జిలుఁగువన్నె = చిత్రవర్ణముగల, ఉద్దండమునన్ = ఉద్ధతితో.
  282. పుష్పలావిక = పువ్వులవానియొక్క, సురభి = పరిమళముగల, మోఁకరించి = మోఁకాళ్లు నేల మోప నిలిచి, ఊది = ఊని.
  283. కామించి = కోరి, హేలావినోదాత్మ = లీలచే కాలము గడుపుటయందు మనసు గలవాఁడా.
  284. మృగనాభి = కస్తూరి, హైమవారి = పన్నీరు, గోవ = మనోజ్ఞమైన, క్రొత్తావులు = అపూర్వవాసనలు, కదంబము = నానావిధపరిమళము, హేలావిధిన్ = విలాసముగా, పాత్రికన్ = గిన్నెయందు.
  285. కుబ్జకాంతన్ = మఱుగుజ్జుదానిని.
  286. తిగిచిన = తీసిన, మృగమదంబు = కస్తురి, సూడిద = కానుక.
  287. సల్లాపములు = ముచ్చటలు, చిబుకంబున్ = గడ్డమును.
  288. విక్షేపణము = ఎగయనెత్తుట.
  289. మోపెట్టి = ఎక్కుపెట్టి, మౌర్వి = అల్లెత్రాడు.
  290. తెగటార్చి= చంపి.
  291. హతశేషులు = చావఁగా మిగిలినవారు, గబ్బితనము = గాంభీర్యము.
  292. నియుద్ధకౌశలము = బాహుయుద్ధమునందలి నేర్పు, పొంపిరిపోయి = అతిశయించి, రేఁచు = పెంచు.
  293. దొమ్మినైనన్ = గుంపుగా బోయి ఆక్రమించునట్టి యుద్ధమునందైనను, ఎక్కటి = ఒంటరి, రూపఱన్ = నశింప, ప్రాపులు = తోడుపాటులు.
  294. గొల్లపడుచులన్ = గొల్లపిల్లకాయలను.
  295. గంధసింధురము = మదపుటేనుఁగు, కట్టాయితంబు = మిక్కిలి సిద్ధపడినది, శుద్ధాంతమందిరంబునన్ = అంతఃపురమునందు.
  296. భర్మహర్మ్యమ్ములనుండి = బంగారుమేడలలోనుండి.
  297. ప్రాశ్నికులతోడన్ = సభికులతో, కలిసి = కూడి.
  298. ఆభీరదారకకోటి = గొల్లపిల్లకాయలగుంపు.
  299. రభసంబు = సందడి.
  300. నైపుణంబులు = నేర్పులు, విషాణములు = కొమ్ములు, దోలన్ = చేతులయందు, చెంగటన్ = సమీపమునందు.
  301. వియచ్చర = దేవతలవలని.
  302. త్రుంగించవే = చంపవయ్యా, యాశోదేయుఁడు = యశోదకొడుకైన కృష్ణుఁడు.
  303. శతవారంబులు = నూఱుమార్లు, గర్తలన్ = రంధ్రములనుండి, కైవారంబు = స్తోత్రము.
  304. కరణిన్ = విధమున.
  305. కన్ను = జాడ.
  306. శిరోజాతములు = తలవెండ్రుకలు, మస్తమున్ = తలయును.
  307. విధ్వంసుఁడు = చెఱుచువాఁడు.
  308. బెరసెన్ = వ్యాపించెను, సరసన్ = సమీపమునందు.
  309. కర్తవ్యంబు = యుక్తము, యవనికచేన్ = తెరచేత, ఆచ్ఛాదించి = కప్పి.
  310. అశ్రు = కన్నీళ్లయొక్క, పూరిత = నిండింపఁబడిన.
  311. శరనిధిమేఖలాఖిలరసావలయ = సముద్రము మొలనూలుగాఁ గలసకలభూమండలమునందు.
  312. పవమానహిత = అగ్నిదేవుఁడా, ఘనసార = కర్పూరముతోడను, బలవైరిగజ = ఐరావతముతోడను, పారద = పాదరసముతోడను, మరాళ = హంసతోడను, నిభ= సమానమైన, రాకాకైరవహితప్రతిమ = పున్నమవాటి చంద్రునిఁ బోలిన.