Jump to content

ఆంధ్ర శ్రీవిష్ణుపురాణము/అష్టమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీవిష్ణుపురాణము

అష్టమాశ్వాసము



మహిత యాశ్రితామర
భూమీరుహ పంటవంశభూషణ సుగుణ
స్తోమ పటుప్రాభవజిత
రామభగీరథదిలీప రాఘవభూపా.[1]

1


వ.

సకలపురాణవిద్యాధురంధరుం డైనపరాశరుండు మైత్రేయున కిట్లనియె నట్లు
గ్రసేనుని యాదవరాజ్యంబునకుఁ బట్టంబు గట్టి యతనిచేత ననేకయజ్ఞంబులు
సేయించుచు నెదురులేనివిభవంబుతో నుండి.

2

శ్రీకృష్ణబలరాములు సాందీపునియొద్ద విద్యాభ్యాసంబు సేసి సాందీపునికి మృతపుత్రుని బ్రదికించియిచ్చుట

ఆ.

ముసలచక్రధరులు మొద మొప్ప విద్యార్థు, లైయవంతిపురికి నరిగి వేద
శాస్త్రనిరతుఁ డైనసాందీపుని న్నిజా, చార్యుఁగా వరించి సరసమతుల.[2]

3


క.

ఆఱువదినాలుగువిద్యలు, నఱువదినాలుగుదినంబులందుఁ గ్రమముతో
నెఱిఁగిన సాందీపుఁడు కడు, వెఱఁగుపడి తదీయమతివివేకంబులకున్.

4


తే.

అద్భుతమనస్కుఁడై యున్నయట్టి గురునిఁ, జూచి మీ కెద్ది యిష్టంబు సుజనవినుత
తత్ప్రయోజనములు గురుదక్షిణలుగఁ, జేసెదము చెప్పుమనుటయుఁ జెలఁగి యతఁడు.[3]

5


తే.

ఈలవణసాగరముపొంత ప్రభాస, మనుమహాతీర్థమున మృతుఁడయ్యె నాసు
తుండు కడుబాలుఁ డాసుతుఁ దోడితెచ్చి, నాకుఁ గృపచేయవలయు మన్ననల ననిన.[4]

6


ఉ.

బోరన నస్త్రశస్త్రములు పూని రయంబున నేగుఁదేరఁగా

వారిధి భీతినొంది యదువర్యులఁ గాంచి ధరామరాత్మజున్
దారుణశంఖరూపమున దైత్యుఁడు పంచజనాభిధానుఁ డీ
నీరున నుండి చంపె నని నిక్కముగా నెఱింగించిపోయినన్.[5]

7


క.

శరనిధి చొచ్చి ముకుందుఁడు, సరభసగతి నరిగి పంచజనరాక్షసునిన్
బరిమార్చి తదస్థిభయం, కరనాదముతోడ మెఱయఁగాఁ జేయుటయున్.[6]

8


క.

ఆనాదము దానవులకు, హానియు నాదిత్యవరుల కభివృద్ధియునై
మానుగ నయ్యదువర్యుఁడు, తా నరిగి రణమున దండధరు నోర్చి వెసన్.[7]

9


తే.

యాతనాగతుఁడై నరకాంతరమునఁ, బూర్వదేహంబుతో నున్న భూసురేంద్ర
బాలకునిఁ దెచ్చి గురుని కర్పణము చేసి, యెలమితో మధురాపురి కేగుదెంచె.[8]

10

జరాసంధుండు పదునెనిమిదిమాఱులు మధురాపురముపై దండెత్తి వచ్చి యోడిపోవుట

వ.

అంత జరాసంధుండు కంసుభార్య లయినయస్తిప్రాస్తులు తనదుహిత లగుటం జేసి
పుత్రికారత్నంబుల వైధవ్యంబు మనంబు నెరియించినఁ గృష్ణుతోడి విరోధంబున
బలిప్రముఖం బయినమాగధబలంబులో నిరువదిమూఁడక్షౌహిణులతోడ మధు
రాపురంబుపై విడిసిన నల్పపరివారంబుతోడఁ బురంబు వెడలి రామదామోద
రులు ప్రతిబలంబుతో మహాఘోరయుద్ధంబు సేయ సమకట్టుచున్ననమరపథంబు
ననుండి.[9]

11


తే.

దారుణాక్షయబాణతూణీరములును, శార్ఙ్గధనువును గదయును సన్నిధాన
మైన హరి పూనె ముసలంబు హలము నింగి, నుండి వచ్చిన బలభద్రుఁ డొనరఁ చాల్చె.[10]

12


తే.

ఇట్లు దివ్యాస్త్రములు పూని యేపు మిగిలి, యాజరాసంధుతోడ మహారణంబు
చేసి దర్పించి కడుఁబరాజితునిఁ జేయు, టయును నతఁ డోడిపాఱె మహాభయమున.[11]

13


వ.

ఇవ్విధంబున నతండు యాదవుతోడ బద్ధవైరుండై పదునెనిమిదిమాఱు లెత్తి
వచ్చి సంగ్రామంబు చేసి రామకృష్ణులచేత నోటుపడిపోయె నంత.[12]

14

ద్వారకానిర్మాణ కాలయవనవధ ముచికుందానుగ్రహాదివివరణము

సీ.

కల్పాంతకాలభీకరమూర్తి యగు కాలయవనుఁడు నానొక్కయవనవిభుఁడు
నారదమునిచేతఁ బ్రేరితుండై మ్లేచ్ఛకోటిసహస్రంబు గొలువ మధుర
పై దండు వెడలి యుద్భటశక్తి నేతెంచుచుండుటఁ దెలిసి దామోదరుండు
చటులశౌర్యుఁడు జరాసంధునిపగమీఁద నిదియుఁ బాటిల్లె నింకెట్టు లోర్వ


తే.

వచ్చు నేరికి సాధింపవశముగాని, దుర్గ మొక్కటి గావింతు దుష్టశాత్ర
వుల కజేయంబుగాను నజ్జలధిలోన, ననుచుఁ దలపోసి యాలవణాబ్ధియందు.[13]

15


వ.

ద్వాదశయోజనవిశాలంబై ప్రాకారవప్రమహోద్యానతటాకానేకసుందరమం
దిరం బగుచు నమరావతికంటె రమ్యంబుగా ద్వారకాపురంబు నిర్మించి మధు
రాపురంబున నున్నసమస్తజనంబుల నందు నుండ నియమించి చతురంగసమేతం
బుగా దుర్గరక్ష సేయ బలభద్రునిం జాలించియుండె నంత.[14]

16


ఆ.

కాలయవనుఁ డపుడు ఘనసైన్యములతోడ, మధురమీఁద విడిసి మలయుటయును
వాని నుపమచేత వధియింపఁగాఁదగు, ననుచుఁ దలఁచి కృష్ణుఁ డాక్షణంబ.[15]

17


తే.

ఒగి నిరాయుధహస్తుఁడై యొక్కరుండు, కాలయవనునికడ కేగి గబ్బితనము
వెలయఁ దనపేరు చెప్పి గర్వించి తన్నుఁ, దఱిమి పట్టంగ నోపినఁ దగిలిరమ్ము.[16]

18


చ.

అనుటయుఁ గోపదీప్తహృదయంబున నానృపుఁ డమ్మురాంతకున్
వెనుకొని పాఱుచుండ యదువీరవరుం డెలయించుకొంచుఁ జ
య్యన నొకశైలగహ్వరమునందుఁ బ్రవేశము జేసెఁ జేసినన్
గనుఁగొని వాఁడు నాబిలము గ్రక్కున జొచ్చి చనంగ నచ్చటన్.[17]

19


వ.

తొల్లి దేవాసురయుద్ధంబున నింద్రునకు సహాయంబై రాక్షనులఁ బెక్కండ్రం
జంపి సంగరపరిశ్రాంతుండై దేవతలవలనఁ బెద్దగాలంబు సుఖనిద్రఁ జెందునట్లును
బలాత్కారంబునఁ దన్ను మేలుకొలిపినవారు తనయుగ్రదృష్టివలన భస్మం బగు
నట్లుంగా వరంబు గొని తదీయగిరికందరంబున విశాలవేదికాతలంబున ముసుంగు
వెట్టుకొని నిద్రించుచున్న ముచికుందుం గనుంగొని కృష్ణుండని నిశ్చయించి
వామపాదంబునం దన్నుటయును.

20

మ.

అవనీనాథుఁడు బిట్టు మేలుకొని కోపాటోపముల్ చూడ్కులన్
నివుడన్ దారుణవృత్తిఁ గాలయవనున్ వీక్షించినన్ వాఁడు భీ
మవిశాలానలకీల లంగమునఁ గ్రమ్మం గూలె నాలోన యా
దవచూడామణి తత్ప్రదేశమున నుద్యన్మూరియై నిల్చినన్.[18]

21


క.

జననాయకుఁ డెవ్వఁడవని, తను నడిగిన శౌరి కరుణ దళుకొత్తంగా
మనుజేశ్వర వసుదేవుం, డనుయాదవుసుతుఁడఁ గృష్ణుఁ డందురు నన్నున్.

22


మ.

అనినన్ దిగ్గన లేచి సంభ్రమముతో సాష్టాంగదండంబు చే
సి నితాంతప్రమదంబు చిత్తమున నుత్సేకింపంగాఁ బద్మలో
చనుని గృష్ణుని వాసుదేవుని జగత్స్రష్టన్ సమస్తామరా
వనకేళీరతునిఁ గృపానిరతునిన్ వర్ణించి సద్భక్తితోన్.[19]

23


సీ.

దనుజారిఁ జూచి యిట్లను దేవ నేఁ దొల్లి యింద్రునిపనుపున నీగుహాంత
రమున నిద్రింపంగ సమకట్టివచ్చుచో గార్గ్యుండు ననుఁ బొడగాంచి విష్ణు
దేవుఁడు యదువంశదీపకుండై దేవకీదేవి కుదయించి కృష్ణుఁ డనఁగ
నిరువదియెనిమిదివరదివ్యయుగములు వరుసతోఁ జనఁగ ద్వాపరయుగాంత


తే.

మున మహీభార ముడుపంగ జనన మొందు, నతఁడు నీకును బ్రత్యక్షమై శుభంబు
లొసఁగునని చెప్పె నట్టిపుణ్యోదయుండ, వీవు నాపాలఁ గలిగితి దేవదేవ.

24


వ.

అని యిట్లు పలికినఁ బ్రసన్నుఁడై సర్వభూతేశ్వరుం డైనముకుందుండు ముచికుం
దున కిట్లనియె.

25


తే.

ధరణీనాయక మత్ప్రసాదమున దివ్య, భోగములఁ జెంది సత్కులంబున జనించి
వైభవంబు జాతిస్మరత్వంబుఁ గలిగి, యభిమతం బైనలోకంబులందు నుండు.[20]

26


ఆ.

మోక్ష మంత్యకాలమునఁ గృపచేసితి, ననుచు వరము లొసఁగి యరిగె శౌరి
రాజవరుఁడు గహ్వరము నిర్గమించి క, న్గొనియె నల్పులైన మనుజతతిని.[21]

27


మ.

కని తొల్లింటివిధంబుగాక పెరమార్గం బైనకాలంబు గ
న్గొని యింక గలికాలమయ్యెడుఁగదా కొన్నాళ్ల కంచున్ మనం
బున శంకించి యధర్మమార్గమగు నాభూమిన్ బ్రవర్తింప రో
సినవాఁడై చని గంధమాదనగిరి జేరె దపోనిష్ఠకున్.[22]

28


వ.

ఇట్లు నరనారాయణస్థానంబునం దపంబు సేయుచుండె నటఁ గృష్ణం డుపాయం
బున రిపుం బరిమార్చి తదీయంబైన సకలసంపదలునుం గొని.

29


ఉత్సాహ.

అరిగి యుగ్రసేనునకుఁ బ్రియంబుతోడ నన్నియున్

వరుస నుపద యిచ్చె యాదవప్రవీరువంశ మే
యరులవలన భయములేక యంబుజాక్షరక్షణ
స్ఫురణవలన నధికవృద్ధిఁ బొందె ద్వారకాపురిన్.[23]

30


వ.

అంత నొక్కనాడు.

31

బలభద్రుండు వ్రేపల్లెకు వచ్చియుండి వరుణదేవునివలన వరంబు గొనుట

క.

బలభద్రుండు ప్రశాంతా, ఖిలవిగ్రహుఁ డైన దేవకీసుతు నచటన్
నిలిపి యదువరులు దన్నుం, గొలువంగా నరిగె నందగోకులమునకున్.[24]

32


వ.

అరిగి యశోదానందులకు నమస్కరించి తనకు బాలసఖులయిన గోపకుమారుల
నయ్యైప్రకారంబులు నాదరించి గోపికాజనంబులకు మనోహరంబు లయినవస్త్ర
భూషణంబు లోసంగి గోగణంబుల కుశలం బరయుచు నిష్టవినోదంబులం దగిలి
కతిపయదినంబు లుండునంత.

33


మ.

వరభూషాదులరత్నదీధితులు దుర్వారంబులై దిక్కులం
బరువుల్ పెట్టఁగ నుత్తమాంగనవపుష్పశ్రేణిసౌరభ్యముల్
గరుసుల్ మీఱఁగ గ్రాహవాహనపరిష్కారంబు తోరంబుగా
వరుణుం డక్కడి కేగుదెంచెఁ బ్రమదవ్యాపార మేపారఁగన్.[25]

34


వ.

ఇట్లు వచ్చి యత్యంతవినయపూర్వకంబుగా నతనిం బొడఁగాంచి యనేకమణి
మయభూషణజాలంబు లొసంగి యిష్టనినోదంబుల నున్నవరుణదేవునకు బలదే
వుం డిట్లనియె.

35


తే.

అనఘ పూర్వంబునందు నీయందుఁ బుట్టి, నట్టి వారుణీసేవ ప్రియంబుతోడఁ
జేయుదురు కొంద ఱార్యులు సిద్ధమతులు, వారి కేమిఫలంబులు వచ్చునొక్కొ.

36


క.

నావుడు నావరుణుఁడు బల, దేవున కిట్లనియెఁ దొల్లి దేవతలును దై
త్యావళియు నార్తిఁ దరువఁగ, నావారుణి యుద్భవించె నమృతముతోడన్.

37


మ.

పరమానందకరంబు రోగహరణోపాయంబు నానారసో
త్కర మత్యంతబలప్రహేతువు జగత్కల్యాణరూపంబు ని
ర్జరసేవ్యంబు వరాంగనాజనరతస్వచ్ఛంద మానందసుం
దర మామద్యము మద్యపానరతుఁ డేతన్మాత్రుఁడే లాంగలీ.[26]

38


మ.

సుర సేవించి కదా సురాసురవరస్తోమంబు లెల్లప్పుడున్
బరమానందపరంపరాభినయులై భాసిల్లుచున్నారు సు
స్థిరతన్ దొల్లిటిశుక్రశాపభయబుద్ధిన్ మద్యపానక్రియా
పరతన్ జెందనివానిజన్మము వృథాపాకంబు నీలాంబరా.[27]

39

క.

నీవింక నేటినుండియు, నావచనము లాదరించి నచ్చినమతితో
దేవతల కైనదొరకని, యావారుణిసేవ సేయు మతులితభక్తిన్.[28]

40


క.

అని వారుణీమహత్త్వము, గొనియాడి తదీయపానగోష్ఠీరతికిన్
మన మలరి యున్న బలభ, ద్రునికోర్కి యొనర్పఁగా వరుణదేవుండున్.

41


తే.

నెమ్మితోడ బృందావననీపకోట, రమ్మునను వారుణీకలశమ్ము నిలిపి
పోయె నామద్యగంధ మపూర్వ మగుచు, నవ్వనంబున బెరసె నయ్యవసరమున.[29]

42


ఉ.

సింధురవైరివిక్రముఁడు సీరధరుం డొకనాడు వృష్ణిభో
జాంధకవీరులం గలసి యచ్చటఁ ద్రిమ్మరువారిపాలికిన్
గంధవహుండు దెచ్చె నధికప్రమదాభినయానుబంధమున్
బంధురషట్పదాంధము నపారమదాంధము సీధుగంధమున్.[30]

43


వ.

ఇ ట్లతిమనోహరం బైనమదిరాగంధం బాఘ్రాణించి యవ్వలను గైకొని చని
కదంబతరుకోటరంబున నున్న దివ్యహాలాకుంభంబుఁ గనుంగొని వరుణప్రయుక్తం
బుగా నెఱింగి తదాసక్తచేతస్కుండై కైకొని చని.[31]

44


మ.

యమునాతీరమునందు నందమగుబృందారణ్యనీపప్రదే
శమునన్ నిర్మలచంద్రకాంతమణిరాజద్వేదిపైఁ బూర్ణచం
ద్రమయూఖంబులు దట్టమై వొలయు నుద్యల్లీలతో మద్యపా
నము చేసెన్ బలభద్రుఁ డంగనలతో నానావిధోల్లాసి యై.[32]

45


వ.

అప్పుడు.

46


చ.

కమలనిభాస్యయోర్తు చషకంబున మద్యము నిండఁబోసి యిం
దమనుచు నొక్కచంద్రముఖిఁ దార్కొని యిచ్చిన వారివక్త్రయు
గ్మముప్రతిబింబముల్ దనరెఁ గంజసుధాకరు లబ్జనామలా
భములకుఁ బోరుచున్ బుడుకుబానకు నందు మునింగిరో యనన్.[33]

47

మ.

మదిరాపానముచేత నొక్కసతి తా మత్తిల్లి వేఱొక్కతెన్
హృదయేశుండని కౌఁగిలించె నది దానిం బ్రాణనాథుం డటం
చొదవన్ గొమ్మని మోవియిచ్చె నటు లన్యోన్యప్రవృత్తక్రియల్
ముదితల్ కొందఱు చూచి నవ్వి సరసంబుల్ పల్కి రత్యున్నతిన్.[34]

48


వ.

ఇవ్విధంబున నయ్యిందువదనలవిలాసంబులును బహువిధోల్లాసంబులును పర
స్పరకోలాహలహాసంబులును సరససంగీతవిద్యావికాసంబులును బెరయ మద్య
పానంబు చేయుచున్న నయ్యిందువదనలుం దానును బరమసంతోషహృదయులై
నృత్తగీతవాద్యవిశేషంబులఁ బెద్దయుంబ్రొద్దు వర్తించి శరీరోద్ధతంబు లైన
ఘర్మకణంబులు మౌక్తికాహారంబుల నలంకరింప వారిజాక్షులుఁ దానును వారి
విహారంబున కుద్యోగించి మదిరాపానపరశత్వంబునఁ బోవనోపక యున్నతవచనం
బుల యమునాతటినిఁ బేరెలుంగునం బిలిచిన రాకున్నం గోపించి.[35]

49


క.

ఈలాంగలపాతముచేఁ, గాళిందీ నిను సహస్రగతులుగఁ బఱపన్
జాలుదు నావిధ మెఱుఁగక, యేలా మదియించి తనుచు నెంతయు బలిమిన్.[36]

50


క.

యమునాతీరమునకు వ, చ్చి మహాలాంగలము పూని చెచ్చెరఁ దత్కూ
లమునఁ దగిలించి తగిచిన, నమరులు వెఱఁగంది చూడ నవ్వాహినియున్.[37]

51


సీ.

పెదపెదపాయలై బృందావనంబునఁ బ్రవహించి కడుననూపంబు చేసె
బలభద్రుఁ డంగనాపరివృతుఁడై యందు జలకేళి లీలమై సలుపుచున్న
నపుడు కాళింది భయభ్రాంతయై నిజరూపంబుఁ బొడచూపి యాపురాణ
పురుషునిఁ బ్రార్థించి శరణంబు వేడిన నభయదానం బిచ్చి యనిపిపుచ్చి


తే.

మోదమున మద్యపానవినోదగోష్ఠిఁ, దగిలి రేవతీసతియును దాను సురత
కేళిఁ దేలుచుఁ దనివోని క్రీడ సలిపె, మమత లగ్గలమైన సౌమ్యాకృతులను.[38]

52


వ.

ఇవ్విధంబున వినోదింపుచున్నంత నొక్కనా డతనికడకు వరుణదేవుండు వచ్చి
నీలోత్పలావతసంబును కనకరత్నకుండలయుగళంబును నీలాంబరంబును ధవళ
చ్చత్రంబును నొసంగిపోయినఁ గైకొని మహనీయవిభవంబున మెఱసి నంద
గోపవ్రజంబున మాసద్వయం బుండి కృష్ణసందర్శనకుతూహలుండై ద్వారకా
నగరంబున కరిగియుండునంత.

53

రుక్మిణీకల్యాణము

ఉ.

అంచితుఁడై విదర్భవిషయంబున కుండినమన్ పురంబు పా

లించును భీష్మకుండు సుఖలీల నతండు తపంబు భక్తిఁ గా
వించి సురూపవైభవవివేకుల రుక్మిని రుక్మిణీసతిన్
గాంచి బ్రియంబుతోఁ బెనిచె గౌరవమున్ గుతుకంబు నేర్పడన్.[39]

54


తే.

అంత రుక్మిణి పెండ్లిప్రాయమున నున్న, నాలతాంగి మనోహరంబైన సౌకు
మార్యములు గోరి ఘనులైనమనుజనాథు, లడుగనంపిన నీకుండు నవ్విభుండు.

55


క.

హరిఁ గోరె రుక్మిణీసతి, హరియును నయ్యింతిఁ గోరె నయ్యిరువురు నీ
వెరపున మోహమువలనను, బరస్పరము లైనతగులు వాయక యున్నన్.[40]

56


క.

హరి దనకు నడుగ నంపిన, హరిపగతుం డైనరుక్మి యతనికి నీ కా
హరిమధ్యకు శిశుపాలుఁడు, వరుఁ డని యాతనికి నిచ్చువాఁడై యుండెన్.

57


వ.

ఇట్లు జరాసంధప్రచోదితుండై వివాహంబునకు శిశుపాలుం బిలువంబంపిన
నతండు సకలమేదినీపతులతోడఁ గదలి కుండినపురంబునకు వచ్చె కృష్ణుండు బల
భద్రాక్రూరకృతవర్మసాత్యకిప్రముఖు లగుయాదవులతోడఁ గూడి కట్టాయితం
బై వివాహసమయంబున నేమఱియున్న రాజమందిరంబు చొచ్చి యానవోఢం
దనరథం బెక్కించుకొని యుద్ధసన్నద్ధుండై యరిగిన.[41]

58


మ.

బలవద్వైరినిదాఘమేఘుఁ డగునాపద్మాక్షుమీఁదన్ సము
జ్జ్వలులై చైద్యుఁడు దంతవక్త్రుఁడు జరాసంధుండు సాళ్వుండు
పేరలుకం దాఁకి రణంబు సేసిరి యవశ్యాయాంబుదవ్రాతముల్
జలజాప్తుం గని బిట్టుముట్టినగతిన్ సన్నద్ధులై యుద్ధతిన్.[42]

59


వ.

ఇట్లు పొదివి మహాఘోరయుద్ధంబు సేసిన బలభద్రసాత్యకికృతవర్మాదులు
నయ్యూధంబుపయిం గవిసి ప్రచండకోదండనిర్ముక్తనిశాతసాయకపరంపరలు
గురియించి రథికులం బరిమార్చియు సారథుల రూపుమాపియు సిడంబులఁ
ద్రుంచియు ఛత్రంబుల ఖండించియు చక్రరక్షకుల విదళించియు ఏనుంగులఁ
బీనుంగులు గావించియు దంతంబుల రాల్చియు తొండంబులఁ ద్రుంచియు కుం
భంబులఁ బగిలించియు తురంగంబుల రూపఱనేసియు రౌతులప్రాణంబులు
గొనియు పక్కెరలు చెక్కలు చేసియు కవచంబులు చించియు పదాతులబారి
సమరియు చక్రకుంతపట్టసప్రాసకోదండగదాదండశూలాదిసాధనంబులు విటతా
టంబులు చేసియు నిట్లు విజృంభించిన సంగ్రామం బతిదారుణం బయ్యె నయ్యా
హవంబునకు నోహటించి యందఱు బహుముఖంబులం బఱచిరి శిశుపాలుం
డును సిగ్గుపడి నిజపురంబున కరిగె నంత రుక్మియును.[43]

60

క.

హరిఁ జంపక కుండినపురిఁ, జొర ననుచుఁ బ్రతిజ్ఞ సేసి శూరతతో నా
సరసీరుహలోచను ని, ర్భరశక్తిం దాఁకి బాహుబల మేపారన్.

61


మ.

తురగస్యందనపత్తివారణములం దోడ్తోడ మేకొల్పి యా
హరితోడన్ బటుఘోరసంగరము సేయం బూనినన్ యాదవే
శ్వరచూడామణి శాతబాణముల నాసైన్యంబు దైన్యంబునన్
బొరయంజేసి విరోధిఁ బట్టుకొని సొంపుందెంపు నేపారఁగన్.[44]

62


క.

ఆవనిత చూచుచుండఁగ, వావిరియై పాఱవాతి వాఁడిశరమునన్
బావా మేలము సూ యని, ఱేవులుగా నతనితల గొఱిగి పోవిడిచెన్.[45]

63


తే.

ఇట్లు విజయంబు గైకొని యేగుదెంచి, ద్వారకానగరమున నాతలిరుబోణి
రాక్షసవివాహమున నభిరామలీలఁ, బరిణయం బయ్యె జగములు ప్రస్తుతింప.

64

ప్రద్యుమ్నానిరుద్ధాదులచరిత్రములు

క.

ముదమున నాలలితాంగికి, నుదయించెను రూపవైభవోపేతుండై
మదనాంశమున విరోధి, ప్రదమనుఁ డగుధర్మమూర్తి ప్రద్యుమ్నుఁ డనన్.[46]

65


సీ.

అతఁడు జన్మించిన యాఱవదినమున శంబరుం డనఁగ రాక్షసవరుండు
తనకు నాబాలుచేతను జావు గలదని యశరీరి పలికిన యర్థరాత్ర
సమయమునం దరిష్టముఁ జొచ్చికొనిపోయి వనరాశిలోఁ బాఱవైచుటయును
మీన మామిషబుద్ధి మ్రింగె జాలరి దానిఁ బట్టి యాదైత్యునిపట్టి కిచ్చి


తే.

చనియె నాయింతియును జలచరము దఱుగు, నపుడు ప్రాణంబుతో నున్నయట్టి శిశువుఁ
జూచి వెఱఁగందుచున్న యచ్చోటి కమర, మౌని యగునారదుఁడు వచ్చి మంతనమున.[47]

66


మ.

హరికిం బుత్రుఁడు వీఁడు వీనిఁ బ్రమదం బాఱంగ రక్షింపుమీ
యరవిందానన యంచుఁ జెప్పుటయు నయ్యబ్జాక్షి యౌఁగాక యం
చు రహస్యంబునఁ జెప్పినన్ తెలిసి రక్షోనాథుఁ డవ్వీరునిన్
బరిమార్పన్ సమకట్టి తాను మడిసెన్ బ్రద్యుమ్నుచేఁ బోరిలోన్.

67


ఉ.

ఆవసుదేవపౌత్రునిమహత్త్వముఁ గన్గొని యామృగాక్షి మా
యారతి పుష్పసాయకశరాహతి నొంది తదీయరూపరే
ఖావిభవంబు మెచ్చుచును గ్రక్కున మేఘపథంబునందు ల
క్ష్మీవిభుఁ డేలు ద్వారవతికిన్ జని యంతిపురంబులోపలన్.[48]

68


ఉ.

వాలినఁ గృష్ణభార్య లగువారిరుహానన లద్భుతక్రియా

లోలతఁ జూచుచుండిరి త్రిలోకమనోహరమూర్తి యైనయా
బాలునిఁ జూచి రుక్మిణి యపారవిషాదము మానసంబునన్
గ్రాలఁగఁ బుత్రునిం దలఁచి కన్నుల బాష్పము లొల్కుచుండఁగన్.[49]

69


క.

ఈలలితాత్యుం డెవ్వరి, బాలుఁడొకో వీనిఁ గన్న పద్మానన ము
న్నేలీలఁ దపము చేసెనొ, కో లోకమువారికంటెఁ గోరిక మీఱన్.

70


తే.

శివుఁడు చిచ్చఱకంటఁ బ్రేల్చినప్రసూన, నాయకుఁడు వచ్చి క్రమ్మఱ జననమందఁ
బోలుఁ గాకున్న నిటువంటిపుణ్యమూర్తి, కలఁడె లోకంబులందు నేకాలమునను.[50]

71


తే.

నాకుమారుని దైవంబు నాఁచుకొనక, యున్న వీనిప్రాయంబున నుండకున్నె
యనుచు దుఃఖించుచున్న యయ్యవసరమున, నందసుతుఁ జూడఁ జనుదెంచి నారదుండు.

72


తే.

శంబరునిచేత నా డరిష్టంబులోనఁ, గోలుపోయినబాలుఁ డీకొడుకుఁగుఱ్ఱ
యనుచుఁ బ్రద్యుమ్నువృత్తాంత మాలతాంగి, తోడ వివరించి యమ్మునీంద్రుండు మఱియు.

73


ఉ.

ఈకమలాక్షుఁ డాదిహరి నీవు రమాసతి వీకుమారకుం
డాకుసుమాస్త్రుఁ డీయతివ యారతి గావున మీమహత్త్వముల్
నాకును శక్యమే పొగడ నన్నుఁ గృతార్థునిఁ జేయుఁ డంచు నా
పోకలప్రోక యైనముని పోయెఁ బురందరరాజధానికిన్.[51]

74


వ.

తదనంతరంబ కృష్ణుండు ప్రద్యుమ్నునకు నమ్మాయావతిం బాణిగ్రహణంబు
సేయించె, మఱియు నారుక్మిణియందుఁ జారుధేష్ణుండును చారుదేహుండును
వీర్యవంతుండును సుషేణుండును చారుగుప్తుండును భద్రచారుండును సుచా
రుండును మహాచారుండు నన నెనమండ్రుకుమారులను చారుమతి యనుకన్య
కనుం బడసె మఱియును.

75


ఉ.

ఆనలినాక్షుపెద్దకొడు కంచితరూపవిలాసచారుతే
జోనిధి పెండ్లియాడె నతిశోభనమూర్తిని రుక్మికూఁతురిన్
మేనఱికంబుగా నఖిలమేదినినాథులు చూచుచుండఁగా
నానలినాయతాక్షిని స్వయంవర మైనవివాహసంపదన్.

76


క.

మించిన యాప్రద్యుమ్నుఁడు, గాంచెన్ బుత్రకుని రుక్మికన్యకయందున్

బ్రాంచద్వివేకశుద్ధు ను, దంచితవిభవానిరుద్ధు నయ్యనిరుద్ధున్.[52]

77


తే.

రుక్మిణీసతి యనిరుద్ధు రుక్ష్మిమనుమ, రాలి నుద్వాహ మొనరించి లీలతోడ
సకలలోకంబులును దన్ను సన్నుతింప, నుజ్జ్వలం బైనమహిమతో నుండునపుడు.

78

నరకాసురవధప్రస్తావము

సీ.

మహిమతో ముడిచిన మందారసుమపుసౌరభము తుమ్మెదల రా రమ్మనంగ
దివ్యభూషణరత్నదీప్తులు తోరమై సకలదిక్కులఁ బ్రతిచ్ఛాయ లెసఁగఁ
గరపంకజంబునఁ గ్రాలెడిదంభోళి మెఱుఁగులు కడుమిఱుమిట్లు గొనఁగ
గంధర్వకిన్నరగాననాదంబులు చెవుల కానందంబు సేయుచుండ


తే.

దివ్యదుందుభిరవములు దిక్కు లెల్లఁ, బిక్కటిల్ల దిగీశులు బెరసి కొలువ
నభ్రమాతంగపతి నెక్కి యమరలోక, నాయకుఁడు వచ్చె ద్వారకానగరమునకు.[53]

79


ఉ.

వారిజనాభుఁ డప్పుడు దివస్పతిరాక యెఱింగి గ్రక్కునన్
సీరధరాదు లైనయదుసింహులుఁ దక్కినబంధుమిత్రులున్
బౌరులు తోడరా నుచితభంగి నెదుర్కొని తోడితెచ్చి బం
గారుమెఱుంగు లుప్పతిలుగద్దియపై నిడి పూజ లిచ్చినన్.

80


క.

సురలోకసార్వభౌముఁడు, పరితోషము నొంది దిగధిపతులున్ దానున్
హరిఁ బ్రస్తుతించి యవ్విధు, కరుణ పడసి వినయపూర్వముగ నిట్లనియెన్.[54]

81


ఉ.

యాదవవంశశేఖరుఁడవై విలసిల్లి యనాథు లైననా
నాదివిజవ్రజంబులకు నాథుఁడవై యుదయించియున్న య
య్యాదిమపూరుషుండవుగదా జలజాయతనేత్ర లోకముల్
నీదయచేతఁ గాదె రమణీయగతిన్ విలసిల్లు నెంతయున్.

82


ఆ.

అమరవరులు సోమయాజులు యజ్ఞాంశ, ములు కృశానురూపముల భుజింతు
రవ్విధంబు లెల్ల ననఘాత్మ నేటితో, మానవలసెఁ గాదె మాకు నెల్ల.[55]

83


సీ.

విను మవ్విధంబు పృథ్వీపుత్రుఁ డగునరకాసురేంద్రుఁడు జగదహితకారి
తనవంటిదుష్టదైత్యశ్రేణితోఁ గూడి ప్రాగ్జ్యోతిషం బనుపట్టణమున
వసియించి గర్వదుర్వారుఁడై లోకంబుకెల్ల నుపద్రవం బెపుడుఁ జేయు
యజ్ఞభాగంబుల కర్హుండు దా నని సవనాదు లెవ్వియు సాగనీఁడు


తే.

సంగరమున సిద్ధసాధ్యబృందారక, మనుజవరులనెల్ల మదమణంచి
సుందరాంగకముల శోభిల్లుకన్యల, నపహరించి తనగృహమున నునిచె.[56]

84

వ.

మఱియు సలిలప్రదం బయిన వరుణదేవుని ధవళాతపత్రంబును దివ్యరత్నమయం
బయిన మందరాచలశృంగంబును నమృతస్రావంబు లైనమజ్జననికుండలంబులును
గైకొని యెదురులేక మదీయరాజ్యలక్ష్మీవిభవంబులకుఁ బరమచిహ్నం బయిన
యైరావతంబుఁ గైకొనుతలంపునఁ దెంపుచేయుచున్నవాఁడు. నీవు దుష్టనిగ్రహ
శిష్టానుగ్రహంబులు చేయువాఁడవు కావున నెఱింగింపవలసె నీయుపద్రవంబు
మాన్చి జగంబులకు భద్రంబు సేయు మనిన జనార్దనుండు దయార్ద్రచిత్తుండై
యతనికరంబు తనహస్తంబునఁ గీలించి యిట్లనియె.[57]

85


తరల.

జగము లెల్లను దోడువచ్చిన సంగరాంగణభూమిలో
జగదుపద్రవకారియైన నిశాచరున్ నరకాసురున్
దెగి వధించెద నింతపట్టును నిశ్చయంబు మనంబులో
వగవకుండుము పొమ్ము నీ వని వారిజాక్షుఁడు పల్కినన్.[58]

86


క.

పురుహూతుఁడు సంతోష, స్ఫురితుండై యుల్లసిల్లెఁ బురుషోత్తముఁ డా
దర మొప్పఁ దలఁచె వినతా, వరతనయునిఁ బక్షిలోకవరుసత్వాఢ్యున్.

87


చ.

తలచిన వచ్చి తార్క్ష్యుఁడు ముదంబునఁ దామరసాక్షుసన్నిధిన్
నిలిచిన శత్రుభంజనవినిశ్చయబుద్ధి మనంబులోపలన్
దలకొన సత్యభామయును దాను దశాధిపు నెక్కి శౌరి యా
బలరిపుఁ గూడి యేగె బహుభంగుల లోకము ప్రస్తుతింపఁగన్.[59]

88


వ.

ఇవ్విధంబునఁ బ్రాగ్జ్యోతిషపురంబున కరిగి రప్పు డింద్రుం డుపేంద్రుని వీడ్కొని
నిజలోకంబునకుం బోయె కృష్ణుండును యుద్ధసన్నద్ధుండై ప్రకంపితాఖలనిశాచర
సంఘంబయిన శంఖంబు పూరించిన.[60]

89


ఉ.

ఆనినదంబుచేత జగమంతయుఁ గంపము నొందె గోత్రభృ
త్సానులయందు నెల్లఁ బ్రతిశబ్దము లొక్కట నుప్పతిల్లె నా
దానవనాథువీట బెడిదంబుగ నుల్కలు రాలుచుండె నం
భోనిధులెల్ల మ్రోసె మునిపుంగవు లెంచిరి సంతసిల్లుచున్.[61]

90


వ.

తదనంతరంబున.

91


మ.

నరకప్రేరితులై రథేభభటగంధర్వాదిసంఘంబుతో
గిరిభేదిప్రతికూలు రమ్మురహయగ్రీవుల్ రణోద్యోగవి

స్ఫురితస్వాంతులు వచ్చి కేశవునితోఁ బోరాడి ద్విడ్భంజనా
చిరచక్రానలవిస్ఫులింగముల భస్మీభూతులై రెంతయున్.[62]

92


వ.

ఇట్లు శతసహస్రబలంబులతోడ నమ్మగలు దెగుటం జూచి.[63]

93


చ.

నరకుఁడు రోషశోకములు నాటినచిత్తముతోడ నుగ్రుఁడై
హరిరథమత్తవారణభటావళితోఁ బటుదైత్యదానవే
శ్వరనికరంబుతో మెఱసి సంగరభూమికి నేగుదెంచి ని
ర్భరగతిఁ దాఁకె శాత్రవధరాధరభంజనజిష్ణుఁ గృష్ణునిన్.[64]

94


వ.

ఇట్లు తాఁకి మహాఘోరయుద్ధంబు చేసి యనేకశస్త్రాస్త్రజాలంబులు జగదాఖిలం
బులుగా బెరసి కురిసినం దెమలక కమలనాభుండును శార్ఙ్గధనుర్విముక్తచండ
కాండపరంపరలచేత నిలింపనిరోధియూథంబులఁ గృతాంతునంతికంబునకు బనిచి.[65]

95


క.

శక్రాదిసురులు పొగడఁగఁ, జక్రధరుఁడు భంజితారిచక్రం బగునా
చక్రంబుఁ బూని రాక్షస, చక్రేశ్వరుశిరము నఱికె సక్రోధమునన్.[66]

96


వ.

అప్పుడు.

97


ఉ.

కాటుకకంట నీరుఁ జనుఁగట్టునఁ బాసినచీరకొంగుఁ బెన్
బీటలతోడి వాతెఱయుఁ బెద్దయుఁ దూలెడుమేను వెన్నుపై
వాటములై నునున్ గురులు వాడినమోమును గల్గి పుత్రశో
కాటవిలోనఁ జిక్కి వసుధాంగన వచ్చె ముకుందుపాలికిన్.[67]

98


వ.

ఇట్లు వచ్చి సాష్టాంగదండప్రణామంబు సేసి గద్దదకంఠంబున.

99


ఉ.

అమ్మదిరాక్షి యిట్లనియె నంబురుహాయతనేత్ర మున్ను నీ
విమ్ముల సూకరాకృతి వహించినకాలమునందు నీప్రసా
దమ్మున నీనిశాటుఁడు ముదమ్మున నా కుదయించె నేడు నీ
విమ్మెయి వీని నేల వధియించితి తప్పు సహింపఁ జెల్లదే.[68]

100

క.

తనయుండు తప్పుచేసిన, జనకుఁడు తగుబుద్ధి చెప్పఁ జనుగాక రణం
బున నిట్లు పగతుకైవడి, మనమున దయలేక పిలుకుమార్పం దగునే.[69]

101


వ.

అనిన నవ్విశ్వంభరుండు విశ్వంభర కిట్లనియె.

102


ఉ.

నాదెస భక్తిచాలనిజనంబులు చుట్టము లైన నేమి కం
సాదుల యట్ల చంపుదు మదాప్తచయంబు లలంతులైన ప్ర
హ్లాదవిభీషణాదిసుకృతాత్ములకైవడి నాదరింతు శా
తోదరి పుణ్యశీలుఁడు మహోన్నతిఁ బొందఁడె యేయుగంబులన్.[70]

103


వ.

కావున సకలలోకాపకారి యగునరకాసురుండు వధకు నర్హుండుగాని పుత్ర
స్నేహంబున రక్షింపందగఁడు వీనికై శోకింపఁదగదు నేను భూమిభారం బుడి
గింప మనుష్యరూపంబున నవతరించుట నీ వెఱుంగవే యనిన ధరణి ధరణీధరున
కిట్లనియె.

104


క.

నరకుఁడు చేసినతప్పును పరికింపక వానిసుతుని బహురాజ్యరమా
భరితునిఁగాఁ బాలింపుము, శరణాగతరక్ష యనుచుఁ జాగిలి మ్రొక్కెన్.

105


ఆ.

శౌరి యాధరిత్రి కోరినలాగున, నరకసుతుని రాజ్యభరితుఁ జేసి
నదితికుండలము లమ్మురారాతికి, నిచ్చి యాలతాంగి యేగుటయును.

106

శతాధికషోడశసహస్రకన్యాపరిగ్రహేంద్రలోకగమనాదిశ్రీకృష్ణదివ్యచరితానువర్ణనము

వ.

కృష్ణుండు ప్రాగ్జ్యోతిషపురంబు ప్రవేశించి నరకాసురసంపాదితంబు లైనశతాధి
కషోడశసహస్రకన్యాజనంబులను చతుర్దంతదంతావళంబు లాఱువేలును సర్వల
క్షణసంపన్నంబు లైనకాంభోజహయంబులు రెండువేలును మనోహరంబు లైన
కనకరత్నరాసు లసంఖ్యంబులును నరకకింకరులచేత ద్వారకానగరంబున కనిచి
పుచ్చి.[71]

107


క.

వరుణునిగొడుగును మందర, గిరి మణిశృంగంబు గొనుచు గిరిరిపుఁ జూడన్
హరి యేగె గరుడవాహన, పరిశోభితుఁ డగుచు సత్యభామయుఁ దానున్[72].

108


మ.

చని దేవేంద్రపురోపకంఠమున నాసర్వంసహామండలా
వనకేళీరతుఁ డైనకేశవుఁడు దుర్వారధ్వనుల్ దిక్కు లె
ల్లను భేదింపఁగఁ బాంచజన్య మవలీలన్ బిట్టు పూరించినన్
విని బృందారకవల్లభుండు ప్రమదావిర్భూతచేతస్కుఁడై.[73]

109


క.

కొనిపోయి రత్నసింహా, సనమున నాసీనుఁ జేసి జలజాక్షున క
య్యనిమిషపతి యర్ఘ్యాదులు, తనగురుఁ డగుగురునిచేతఁ దగఁ గల్పించెన్.

110


తే.

ఇట్లు పూజితుఁడై యాదవేశ్వరుండు, తీపు లొలికెడుసరససల్లాపవిధులఁ

బెద్దదడ వింద్రుఁడును దానుఁ బ్రొద్దుపుచ్చి
కుండలము లదితి కర్పింపఁగోరి యపుడు.

111


చ.

అనఘ సితాద్రిశృంగశిఖరాకృతి నెంతయుఁ జూడ నొప్పు న
య్యనిమిషమాతయున్నయెడ కాహరితో హరి కూడి వచ్చి పెం
వునఁ బ్రణమిల్లి యవ్వెలఁది భూరిసుధామయకుండలద్వయం
బనుపమలీల నిచ్చి నరకాసురుచావు నెఱుంగఁ జెప్పినన్.[74]

112


క.

ప్రీతాత్మ యగుచు నిర్జర, మాత జగన్నాథుఁ డైనమధుసూదను వి
ఖ్యాతచరిత్రునిఁ ద్రిజగ, త్పూతాత్మునిఁ జూచి హర్షమున నిట్లనియెన్.

113


సీ.

భూతేశ భూతాత్మ భూతనాథస్తుత సర్వేశ సర్వజ్ఞ సర్వవినుత
నిర్ద్వంద్వ నిశ్చల నిగమార్థగోచర యవ్యయ యచ్యుత యాదిదేవ
త్రిదశనాథ త్రిలోకదేవ త్రివిక్రమ పరమ పరాపర పరహితార్థ
కమలా కమలేశ కమలరాశినివాస నరసింహ నరవంద్య నరకదమన


తే.

భక్తరక్షణ భవనాశ భవ్యరూప, నిగ్రహానుగ్రహవిధేయ నిత్యనిపుణ
కరుణతో నన్ను రక్షించి కావు మనుచు, భక్తితోఁ గొనియాడె నప్పరమసాధ్వి.[75]

114


తే.

అర్థితోఁ గల్పవృక్షంబు నాశ్రయించి, యల్పదానంబు కౌపీన మడిగినట్లు
నాడు నిన్ను దయార్ద్రమానసునిఁ జేసి, కొడుకుగాఁ గోరితిని ముక్తి గోరలేక.[76]

115


చ.

అనుటయు దేవమాతవదనాబ్జమునం దనచూడ్కి నిల్ఫి యా
ననమున మందహాసము పెనంగఁగ నిట్లనుఁ దల్లి యివ్విధం
బునఁ బలుకంగ నేమిటికిఁ బుణ్యచరిత్రవు దేవమాతవై
ఘనత వహించి పుణ్యమును గాంచితి మోక్షము నీకుఁ బెద్దయే.

116


వ.

అని పలుకుసమయంబున శచీదేవి సత్యభామం దోడుకొనివచ్చి యదితిం బొడ
గానిపించిన నద్దేవియుఁ గోడలి నాదరించి యిట్లనియె.

117


ఆ.

ముదిత మత్ప్రసాదమున సార్వకాలంబు, ముదిమియును విరూపమును దొలంగి
సంతతానవద్యసౌభాగ్యమూర్తివై, యుల్లసిల్లు మనుచు నొసఁగె వరము.[77]

118


క.

తదనంతరంబ సురపతి, యదితియనుమతమున యాదవాధీశుని స
మ్మద మొప్ప వీడుకొలిపినఁ, గదలెన్ గృష్ణుండు ద్వారకాపురమునకున్.

119


వ.

ఇట్లు సత్యభామాసమేతుండై గరుడారోహణంబు చేసి చనునప్పుడు అనవరత

దివ్యగంధప్రసూనబంధురంబును వికసితకుసుమనిష్యందమకరందపానానందమి
ళిందఝంకారంబును మందమలయానిలప్రకంపితబాలపల్లవశోభితలతానర్తనాభి
రామంబును నైన పాకశాసనునియారామంబు పొడగని యందుఁ గొండొక
సేపు వసియించునప్పుడు.[78]

120


ఉ.

ఆతరళాక్షి గాంచె సమదాళిపరీతము నందనాంతర
ఖ్యాతము కీరకోకిలనికాయనికేతము నాశ్రితామర
వ్రాతము పుష్పసౌరభపరాగసమేతము బాలపల్లవ
ద్యోతము దుగ్ధసాగరపయోవనజాతము పారిజాతమున్.[79]

121


క.

కని సత్యభామ తద్దయు, ననురాగము బొంది యాదవాధీశున కి
ట్లను నీభూరుహ మీనం, దనవనమున కెల్ల భూషణం బయ్యెఁ గదా.

122


తే.

సంతతముఁ గడివోనివాసనలు గలుగు, పారిజాతమహీజపుష్పములు ముడిచి
సఖులు దానును సుఖకేళి సలుపుచున్న, యమరపతిభార్య యెంత భాగ్యవతియొక్కొ.[80]

123


తే.

అమరపతికంటె సకలభోగముల నీవ, యెక్కుడని కొనియాడుదు రెల్లవారు
నట్టి నీపత్నినయ్యు నే నతనికాంతం, బోల లేనైతి నత్యంతభోగములను.

124


సీ.

ద్వారకాపురికి నీపారిజాతముఁ గొని యరిగి మదీయగృహాంగణమున
నుపవనంబులలోన నునిచిన నేను నీకారుణ్యమునఁ జేసి కమలనాభ
యీతరుపుష్పంబు లెలమితోఁ గొనివచ్చి చెలికత్తె లెత్తులు చేసి యొసఁగ
ముడిచి యొక్కొకవేళ ముదముతో నారుక్మిణీమిత్రవిందాదిభామినులకుఁ


తే.

పంపఁగ వారు నాపెంపు సూచి, సిగ్గుపడుచుందు రట్లుగాఁ జేసితేని
యనఘ నీపాల నాకును జనవుగలదు, సవతు లెవ్వరు నాతోడ సవతుగారు.[81]

125

పారిజాతాపహరణము

ఉ.

అనవుడు సత్యభామ పలు కాదరణీయము చేసి దేవకీ
తనయుఁడు పారిజాతవసుధారుహమున్ దనరాజధానికిన్
గొని చనఁబూని యాతరువు కూఁకటివేళ్లకుఁ బెల్లగించి గై
కొని బలమున్ జలంబు నొడఁగూడఁగఁ బోవఁగ నున్నయత్తఱిన్.[82]

126

క.

వనరక్షకు లడ్డముగాఁ, జనుదెంచి ముకుందుఁ గాంచి శతమఖుసతి గై
కొనఁగఁదగు దీనిపువ్వులు, మనుజసతులు ముడువ నర్హమా తలపోయన్.

127


మత్తకోకిల.

నీకు దేవధనంబు లేటికి నిర్జరేంద్రుఁడు విన్నఁ జీ
కాకు సేయక కొంచుఁబొమ్మని గారవింపఁడు గావునన్
నాకవల్లభుతోడ మైత్రి యొనర్పఁగోరెదవేని యీ
పోకలెల్లను మాని నెమ్మదిఁ బొమ్ము నీవని పల్కినన్.[83]

128


క.

వనజనయనుఁ డొండేమియు, ననక నగుచు నూరకుండె నాదిత్యుల కి
ట్లను సత్యభామ భావము, మనమునఁ బెనఁగొనఁగఁ గఱుకుమాటలతోడన్.[84]

129


క.

ఎక్కడిదేవేంద్రుఁడు మఱి, యెక్క డిపోలోమి వీరి కీభూజాతం
బెక్కడి దీలోకములో, నెక్కుడు వీరేల యైరి యెవ్వరికంటెన్.[85]

130


తే.

జలధిఁ బుట్టిన యీపారిజాతవృక్ష, మఖిలలోకములకు సమ మదియుఁ గాక
నామగఁడు శౌరి మీశచీనాథుకంటె, బల్లిదుండౌట యెఱుఁగరె యెల్లవారు.

131


క.

నామగఁడు సకలలోక, గ్రామణి దేవేంద్రుఁ డాదిగాఁ గలదివిజ
స్తోమములు గొలువనుండుట, యేమీ పౌలోమి యెఱుఁగదే మఱచెనొకో.

132


క.

తనమగఁడు బాహువిక్రమ, ఘనుఁ డయ్యెడు నేనిఁ గృష్ణుఁ గయ్యములో మా
ర్కొని గెలిచి పారిజాతము, గొనిపోవుంగాక యేల గొణుఁగులు తనకున్.

133


క.

అనుసత్యభామపలుకులు, విని వనరక్షకులు పోయి విబుధేశకులాం
గన యైనశచికిఁ జెప్పినఁ, గినియుచు నద్దేవి వజ్రకిం జెప్పుటయున్.[86]

134


మ.

దివిజాధీశ్వరుఁ డంత్యకాలశిఖిలీలన్ మండుచున్ దేవతా
నివహంబుల్ రథపత్తివారణహయానీకంబుతోఁ గొల్చి రా
నవలీలన్ జనుదెంచి యాదవకులాధ్యక్షున్ వెసం దాఁకినన్
బవరం బచ్చట నయ్యె నింగియును భూభాగంబుఁ గంపింపఁగన్.[87]

135


వ.

ఇట్లు దలపడి ఖడ్గపరశుకుంతప్రాసతోమరగదాచక్రకచభల్లపరిఘాదిసాధనంబులు
బెట్టిదంబులుగాఁ బ్రయోగించిన సళలశత్రుమర్దనుం డైన జనార్దనుండు చటుల
దనుజశుద్ధాంతకాంతావిభవశూన్యం బయినపాంచజన్యంబు ఘోషంబుచేత
దిశలనెల్లఁ బ్రతిశబ్దంబు గల్పించి శార్ఙ్గంబు గుణధ్వని చేసి శతసహస్రాయుత
నిశాతసాయకంబులు గురిసి యాకాశంబు నిరవకాశంబుఁ జేసిన నాదైవతలోకం
బు తమతమశస్త్రాస్త్రంబులు దివ్యమంత్రపూర్వకంబులుగా నడరించిన నవి బహు

సహస్రరూపంబులయి తన్నుంబొదివిన వానినిజబాణానలంబునకు నింధనంబులు
గాఁ జేసి వెండియు వసురుద్రాదిత్యగణంబుల గంధర్వసిద్ధవిద్యాధరాదియోధ
వీరుల నాయోధనపరాఙు్ముఖులం జేసి వెండియు.[88]

136


క.

వినతాతనయుఁడు తుండం, బున ఱెక్కలచేత నఖరముల రిపుసేనన్
దునిమి యణంచియుఁ జించియుఁ, బెనుపీనుఁగుపెంటఁ జేసె భీషణవృత్తిన్.[89]

137


మ.

అంత బలాంతకుండు సముదంచితబాహుబలప్రతాపదు
ర్దాంతతగతి సితద్విపకులాధివు నెక్కి నిలింపనేనతో
నెంతయుఁ దీవ్రకోపమున నేగి సముద్ధతశక్తితోడఁ గం
సాంతకుమీఁద వైచె సముదగ్రరుచుల్ వెలుఁగొంద వజ్రమున్.[90]

138


వ.

అమ్మహనీయసాధనంబు మాధవునియందుఁ గృతఘ్నునకుం జేసినయుపకారంబు
నుంబోలె నిష్ఫలంబయ్యె నంత నమ్మహితుండు సకలసాధుసుదర్శనం బయినసుద
ర్శనంబు గైకొనిన సకలభూతంబులు హాహాకారంబుల నాక్రోశించుచుండె నంత
నింద్రాణి భయాకులితమానసయై సకలశరణాగతరక్షణదక్షుం డగుపుండరీకాక్షు
నకు వినయవినమితోత్తమాంగ యగుచు నిట్లనియె.[91]

139


ఉ.

దేవ ముకుంద కృష్ణ జగతీధర కేశవ వాసుదేవ పు
ణ్యావహ పద్మనాభ జలజాయతలోచన వాసుదేవ యీ
దేవవరేణ్యుతప్పులు మదిన్ బరికింపక భర్తృభిక్ష నా
కీవలయు జుమీ యనుచు నెంతయు మ్రొక్కుచు విన్నవించినన్.

140


ఉ.

శౌరి పులోమజావిమలసంస్తుతు లెంతయు నాదరించి పెం
పారెడుచల్లచూపుల సురాధిపునిన్ గడు నాదరించి నీ
వీరస మెత్తి యీపనికి నేటికి వచ్చితి వింద్ర నాకు నీ
భూరుహ మిచ్చినం దఱిఁగిపోయెడినే భవదీయసంపదల్.[92]

141


మ.

పురుహూతా విను పారిజాతకుసుమంబుల్ సత్యభామామనో
హరముఁల్ గావున నిమ్మహీజము మదీయద్వారక నిల్పి యీ
యరవించాననకోర్కి దీర్చెద మహాత్మా దీనికై నీవు కో
పరసావేశముఁ జెంద నేటికి నిలింపప్రేరితోద్యోగి వై.[93]

142


సీ.

అనుటయు దేవేంద్రుఁ డంబుజాక్షునిఁ జూచి యీపారిజాతమహీరుహంబు
నధమలోకం బగునట్టిమర్త్యమునకుఁ గొని చన్న నిన్ను నే మనఁగవచ్చు
నైనను నీపత్ని యగుసత్యభామకుఁ బ్రీతి గావున నిది పెద్ద లెస్స

కమలాక్ష నీపరోక్షమున నీవృక్షంబు క్రమ్మఱ నాకలోకమునఁ జేరు


ఆ.

ననిన వాసుదేవుఁ డట్ల కాకని యింద్రు, వీడుకొలిపి తరువు వేగ గొనుచు
ధరణి కరుగుదెంచి ద్వారకాపురసమీ, పమున శంఖమొత్తె పటురవమున.[94]

143


వ.

ఇవ్విధంబునం జని యంతఃపురసమీపంబున సత్యభామానివాసంబున భాసిల్లు
నుద్యానవనమధ్యంబునఁ బారిజాతమహీజంబుఁ బ్రతిష్ఠించి నరకాసురపురంబునఁ
దెచ్చిన పదాఱువేలు న్నూర్వురఁగన్యకల నొక్కముహూర్తంబున వివాహం
బయి వారికిం బ్రత్యేకంబ గృహంబులును రమ్యహర్మ్యంబులు నుపవనంబు
లును కేళీజలాశయంబులును పరిచారికాజనంబులును వస్త్రభూషణాదినానా
పదార్థంబులును గొఱంతలేకుండ నొసంగి యవ్విశ్వరూపుం డందఱకు నన్ని
రూపంబులుగాఁ గామకేళీసుఖంబులు సంపాదించుచుండె నంత.[95]

144


తే.

నలిననాభుఁడు నరకకన్యకలయందుఁ, బ్రియతనూజుల ముప్పదిరెండువేల
మీఁద నిన్నూర్వురను గాంచె మేటిఘనుల, వార లత్యంతశౌర్యదుర్వారు లైరి.

145


వ.

మఱియుఁ ప్రద్యుమ్నాదు లయినరుక్ష్మిణీతనూజులును భానుకాదు లయినసత్య
భామాకుమారులును సాంబాదు లయినజాంబవతీపుత్రులును నాగ్నజితీసూను
లయిన భానువిందాదులును సంగ్రామజితాదు లయినశైబ్యాత్మజులును ప్రకా
శాదు లయినలక్ష్మణాపత్యంబులును శ్రుతాదు లయినకాళిందీసుతులును మొద
లుగాఁ గృష్ణుం డెనుబదివేలయొక్కవేలు న్నూర్వురుకుమారులం బడసి లబ్ధ
సంతానుండయి యుండునాకాలంబున.

146


ఆ.

బలితనూజుఁ డైనబాణాసురుఁడు పెక్కు, వేలవత్సరములు నీలకంఠు
నకుఁ దపంబు సేయ నగజాధినాథుండు, మెచ్చి వానియెదుర వచ్చి నిలిచి.[96]

147


వ.

సహస్రబాహుత్వంబును గాణపత్యంబును కౌమారత్వంబును మొదలుగా ననే
కవరంబు లొసంగి మఱియు వానినగరద్వారపాలత్వంబు నియ్యకొని తదీయ
రాజ్యవిభవంబునకు నొకకీడుఁ బొరయకుండ రక్షించుచుండ.[97]

148


క.

బాణుఁడు బాహాశౌర్య, త్రాణపరాయణతతోడ దనుజులు గొలువన్
శోణపురంబునఁ గడున, క్షీణమహీరాజ్యమహిమఁ జేకొని బలిమిన్.

149


మ.

ఆలము గోరి పోయి నసురాంతకుఁ గన్గొని స్వర్గమర్త్యపా
తాళనివాసు లైనబలదర్పసమేతులు వానిడాకకున్
జాలక జాలిఁ బొంది తమసంపదలెల్లను దెచ్చియిచ్చినన్

వాలినబాహుగర్వమున వైరములేని రమావిభూతితోన్.[98]

150


ఆ.

ఇ ట్లనేకకాల మేపున రాజ్యంబు, చేసి కడుమదించి యాసురారి
యుద్ధ మాత్మఁగోరి యొకనాడు పార్వతీ, విభునికడకు నేగి విన్నవించె.

151


ఉ.

చేతులు వేయు నాకుఁ గృపచేసితి బాహుబలంబు భీకరా
రాతులమీఁదఁ జూపి సమరంబులలో జయలక్ష్మిఁ బొందు పు
ణ్యాతిశయంబు లేదు త్రిపురాంతక మన్ననతోడ నింక నా
చేతులతీఁట వో రణము సేయఁగ నాకు ననుగ్రహింపవే.

152


చ.

అనవుడు నవ్వి శంభుఁడు సురారికి నిట్లను నీమయూరకే
తనము ధరిత్రిపైఁ బడిన దానవనాయక నీకుఁ బ్రీతిగా
ఘనతర మైనసంగరము గల్గెడు పొమ్మని పల్కినన్ ముదం
బునఁ దనమందిరంబునకుఁ బోయి నిజాంకముఁ జూచు నత్తఱిన్.[99]

153


ఆ.

అనఘ యేమి చెప్ప నమ్మయూరధ్వజ, మవనిమీఁదఁ గూలె నప్పురమునఁ
గలిగె సమరసూచకంబు లనేకముల్, బాణుఁ డాత్మలోనఁ బరిణమింప.[100]

154


తే.

అంత నొకనాడు సంతోష మావహిల్లఁ, బార్వతీపరమేశ్వరుల్ బహువిధముల
దనుజకన్యలు నప్సరాంగనలుఁ గొలువ, నుపవనక్రీడ సలుపుచునున్నవేళ.

155


క.

బాణునిసుత యుష దనకున్, బ్రాణేశుఁడు లేమి దుఃఖపరవశ యగుచున్
రాణ చెడియుండఁ గని య, య్యేణాక్షిం జూచి గౌరి యిట్లని పలికెన్. [101]

156


వ.

వైశాఖశుక్లపక్షంబున ద్వాదశినాటిరాత్రి కలలోన నెవ్వఁడేని నీసురతసౌఖ్యం
బు లనుభవించు నతండు నీకుఁ బతి యగునని చెప్పె ఉషాకన్యయుఁ దదీయ
వాక్యంబులకు సంతోషించి యుండె నంత.

157


మత్తకోకిల.

గౌరిచెప్పిన నాటి రాత్రి వికాసభాసురమూర్తి యై
మారసన్నిభుఁ డైనయొక్కకుమారచంద్రుఁడు వచ్చి య
న్నీరజాననతోడికూటమి నిల్చి తత్సురతంబులన్
గారవించి యదృశ్యుఁడయ్యెను గన్ను మాయువిధంబునన్.[102]

158


ఉ.

అక్కమలాక్షి, మేలుకని యద్రిజ చెప్పినమాటలన్నియున్
నిక్కములయ్యె నన్నుఁ దననేర్పునఁ బొందిన ప్రాణవల్లభుం
డెక్కడ నున్నవాఁడొ యతఁ డిచ్చటి కేగతి నేగుదెంచునో
యక్కట మూఁగగన్నకల యయ్యెను నాకల యేమి సేయుదున్.

159


క.

అని చింతించుచుఁ జని యొ, య్యన బాణాసురునిమంత్రి యగునాకుంభాం
డునిపుత్రి చిత్రరేఖకు, మనసునగలకోర్కి యెల్ల మానుగఁ జెప్పెన్.

160


తే.

చిత్రరేఖయు బాణునిపుత్రి తనకుఁ, ప్రాణసఖి గాన నయ్యింతిపలుకు లెల్ల

నాదరించి నీ కింతేల యమ్ము వగవ, నేను గలుగంగ నీవిభు నిపుడె తెత్తు.

161


క.

ఏడెనిమిదిదినముల నీ, రేడుజగంబులను వ్రాసి యిచ్చెద నీకున్
జూడుము చిత్రపటములోఁ, బ్రోడండై నిన్నుఁ బొంది పోయినవానిన్.

162


చ.

అతనిఁ దెచ్చి నీకుఁ బ్రియమారఁగఁ బెండిలి యేను జేసెదన్
బ్రీతి వసింప నుండుమని పెంపునఁ జిత్రపటంబునందు వి
ఖ్యాతిగ మూఁడులోకములఁ గల్గినయట్టిమహానుభావులన్
భ్రాతిగ వ్రాసి కొమ్మనుచు బాణతనూభవచేతి కిచ్చినన్.[103]

163


వ.

ఉషాకన్యయు స్వర్గపాతాళలోకంబులం దనమనోహరుం గానక భూలోకం బవ
లోకించుచు ద్వారకాపురంబుఁ బరికించి యందు ననిరుద్ధుం గనుంగొని లజ్జావనత
వదనయును బులకాంకురదంతురితశరీరయు నై చిత్రరేఖకు నతనిం జూపిన
నమ్మాయలాఁడి యక్కుమారునిం జొక్కుపెట్టి తెచ్చుతలంపున ద్వారకానగ
రంబునకుం జని యంతఃపురంబున నంగనాజనపరివృతుండయి నిద్రించుచున్న
యక్కుమారుం దెచ్చి చెలికిఁ గానుకగా నిచ్చె అప్పు డుష యనిరుద్ధునియందు
సురతసౌఖ్యంబులు సలిపి కొన్నాళ్లు చనిన పిదప.[104]

164


క.

కన్యాంతఃపురములలో, నన్యపురుషుఁ డుంట యెఱిఁగి యసురేశుఁడు లో
కన్యాయము దప్పిన నిజ, సైన్యంబులతోడ వచ్చి సమరము సేయన్.

165


మ.

అనిరుద్ధుం డతిఘోరదర్పమున దైత్యశ్రేణిపై ఖేటకం
బులు వాలుం గొనివచ్చి పెల్లడిరి యార్పుల్ నింగిముట్టంగఁ ద
ద్ఘనసైన్యంబులనెల్ల నేలఁ గలిపెన్ గల్పాంతకాలాగ్ని కా
ననభూముల్ దహియించుచందమున నానాచిత్రయుద్ధంబులన్.[105]

166


క.

అప్పుడు బాణుఁడు కన్నుల, నిప్పులు రాలంగ నతని నిశితాస్త్రములన్
నొప్పించి వేఁడి కోపము, ముప్పిరి గొన నాగపాశముల బంధించెన్.

167


తే.

అట్లు బంధించి కారాగృహంబునందుఁ, గూఁతుతోఁగూడ యాదవకులజు నునిచి
రాక్షసులను బెక్కండ్రను రాకుమారుఁ, మీఁదఁ బైకావలుంచి సోమించియుండె.[106]

168


వ.

అంత నొక్కనాడు నారదుండు కృష్ణునిపాలికిం బోయి.

169


సీ.

కరుణతో నచలేంద్రకన్యక యుషతోడఁ బలికినవిధమును బాణపుత్రి
కలలోన ననిరుద్ధుఁ గలిసినచందంబుఁ జిత్రపటంబునఁ జిత్రరేఖ
లోకంబు లెల్ల నాలోకింపఁజేయుటయును దైత్యతనయ ప్రద్యుమ్నతనయుఁ
జూపినఁ గుంభాండుసుత వానిఁ గొనివచ్చునప్పుడు దన కెదురైనక్రమము

తే.

నుషయు ననిరుద్ధుఁడును గూడియుండుటయును, గయ్యమైనవిధంబు రాక్షసుఁడు నాగ
పాశబద్ధునిగాఁ జేసి బందిగమున, నిడుటయును జెప్పి మునినాథుఁ డేగుటయును.[107]

170

బాణాసురయుద్ధము

క.

ఆమఱునాడు ముకుందుఁడు, రామప్రద్యుమ్ను లుగ్రరణకోవిదు లు
ద్దామగతిఁ గూడి రాఁగ మ, నోముదమున గరుడవాహనుండై యరిగెన్.

171


వ.

ఇట్లు శోణితపురంబున కరిగి బధిరీకృతనిశాచరసైన్యంబయిన పాంచజన్యంబు
పూరించుటయును.[108]

172


మ.

ధరణీచక్రము దిర్దిరం దిరిగె గోత్రవ్రాతముల్ గ్రుంగె భా
స్కరు నశ్వంబులు త్రోవదప్పె నుడుసంఘంబుల్ వెసండుల్లె సా
గరముల్ ఘూర్ణిలె నాకమెల్ల బెదరెన్ గంపించె శేషాహి భీ
కరమై బాణుపురంబులోఁ దొరిఁగె నుల్కాపాతముల్ బెట్టుగన్.[109]

173


వ.

అప్పుడు.

174


ఆ.

దనుజనాథురాజధాని రక్షింపంగ, భూతనాథువలనఁ బుట్టినట్టి
మూడుకాళ్లు తలలుమూడును గల్గిన, జ్వరము వచ్చి తాఁకె సరభసమున.[110]

175


ఆ.

తాఁకి యాజ్వరంబు తనచేతనున్న భ, స్మము సమంత్రకముగఁ జటులవృత్తి
నొఱు లెఱుంగకుండ నురుసత్వనిధియైన, సీరపాణిమీఁదఁ జిమ్మటయును.[111]

176


మ.

జ్వరహస్తప్రవిముక్తభస్మనిహతిన్ సంతాపముం బొంది భీ
కరదావానలరే ఖనంగ మొలయంగా భీతచేతస్కుఁడై
హరి చూడంగ హలాయుధుం డొఱగినన్ హాహానినాదంబు లం
బరభాగంబునఁ బుట్టె దేవతలచేఁ బ్రస్ఫీతమై యెల్లెడన్.[112]

177


ఉ.

అప్పుడు పద్మనాభుఁడు హలాయుధుఁ గన్గొని రోషశోకముల్
కప్పికొనంగ వచ్చి తనకౌఁగిటఁ జేర్చిన యమహాత్ముఁడున్
దెప్పిఱి లేచి యార్చె మఱి దేవతలున్ వినువీథి చక్కటిన్
జొప్పడ నాపురాణపురుషుం గొనియాడిరి తాపసోత్తమా.[113]

178


మ.

పరమాత్ముం డగుశౌరి యప్పు డనలప్రాయంబు మాహేశ్వర

జ్వరదర్పం బణఁపం దలంచి నిజతేజస్స్ఫూర్తి శోభిల్ల దు
ర్భరహైమం బగునట్టిశీతము జనింపంజేసి పొమ్మన్న ని
ష్ఠురవృత్తిన్ జని పట్టి తెచ్చి కొను మంచున్ శౌరి కొప్పించినన్.

179


చ.

జ్వరము పయోజనాభునకుఁ జాఁగిలిమ్రొక్కి నుతించి యేను నీ
శరణము వేఁడికొంటి ననుఁ జంపక కావు మటంచుఁ బల్కినన్
హరి కరుణారసంబున భయంపడకుండ ననుగ్రహించె, స
త్పురుషులు దీనమానసులఁ బ్రోవక మానుదురే సురేశ్వరా.

180


క.

జ్వరశీతంబుల రెంటిని, సరిగా మన్నించి శౌరి జగతీస్థలిపై
నురుతరరోగమ్ములతోఁ, దిరుగుఁడు హరిభక్తిలేని దీనులకడలన్.

181


క.

అని యానతిచ్చి వీడ్కొలి, పిన నారోగములు రెండు పృథివీస్థలి వి
ష్ణుని భక్తిఁ గొలువనేరని, జనులం బాధించుచుండె సన్మునితిలకా.

182


వ.

అంత.

183


మ.

అట బాణాసురుపంపునన్ సకలదైత్యానీకముల్ దారుణ
స్ఫుటరోషంబున వచ్చి యాదవులతోఁ బోరాడినన్ మాధవో
తటకల్పాంతదవానలంబు నిఖిలాస్త్రజ్వాలలం గాల్చెఁ ద
చ్చటులారణ్యము తాళకేతనమరుత్సంప్రేరితంబై వెసన్.[114]

184


ఉ.

అంతఁ బురాంతకుండు ప్రమథావళి గొల్వఁగఁ గార్తికేయుఁడున్
దంతిముఖుండుతో నడవ దానవనాథునిపంపు పూని య
త్యంతభయంకరస్ఫురణ నాహవభూమికి నేగుదెంచి కం
సాంతకుఁ దాఁకి పోరె విబుధావళి యచ్చెరువంది చూడఁగన్.

185


వ.

ఇవ్విధంబునఁ బినాకశార్ఙ్గపాణులు తలపడి పరస్పరజయకాంక్షులయి యనేకదివ
సంబులు మహాఘోరయుద్ధంబు సేసిన సకలలోకంబుల మహోత్పాతంబులు
పుట్ట నప్పుడు గగనవాణీవచనప్రబోధితుం డై పురాంతకుండు సురాంతకుకడ
కుం బోయి యిట్లనియె.[115]

186


ఉ.

చేతులతీఁట వో రణము సేయఁగ నిమ్మని నీవు నాడు నా
చేత వరంబు గొంటి వది సిద్ధముగా నివు డుగ్రశాత్రవ
వ్రాతభయంకరుండు యదువర్యుఁడు వచ్చినవాఁడు వీఁడె నీ
చేతులతీఁట వో రణము చేయుము పొమ్ము నిశాచలేశ్వరా.

187


క.

అని పలికిన బలిపుత్రుఁడు, దనచేతులలావు నమ్మి ధవళాంశుధరుం
బనిచి నిజసైన్యములతోఁ, జని కృష్ణునిఁ దాఁకి పోరె సరభసవృత్తిన్.[116]

188

వ.

ఇవ్విధంబున మహాఘోరయుద్ధంబు సేయునప్పుడు.

189


ఆ.

హరి సుదర్శనమున నసురేశ్వరుని వేయి, చేతులందు రెండుచిక్క నఱకెఁ
బార్వతీశుఁ డపుడు పఱతెంచి బాణునిఁ, గావు మనుచు వాసుదేవుఁ బలికె.

190


వ.

కృష్ణుండు మహేశ్వరప్రార్థితుండై బాణాసురుం గాచిపుచ్చి కారాగృహంబున
నున్న యుషాకన్యకానిరుద్ధులం దోడ్కొని ద్వారకానగరంబునకు వచ్చి సుఖం
బుండె నంత.

191


క.

వారాణసిపుర మేలెడు, ధీరాత్ముఁడు పౌండ్రవాసుదేవుఁ డనంగాఁ
బేరుగలరాజు తనతో, నే రాజులుఁ బోలరని మునీశ్వర యుండున్.

192

శ్రీకృష్ణుండు పౌండ్రకవాసుదేవుని సంహరించుట

తే.

వాసుదేవాభిధానగర్వమునఁ జేసి, పాంచజన్యసుదర్శనప్రముఖనిఖిల
చిహ్నములుఁ బూని రాజ్యంబు సేయుచుండె, నన్యభూపాలకులు దన్ను నవహసింప.

193


వ.

ఇవ్విధంబున నద్దురాత్ముండు దురహంకారంబునఁ దనకొలంది తా నెఱుంగక
కృష్ణుని మహానుభావత్వంబునకు నసహ్యపడి యతని పరిభవించుతలంపున నొక్క
దూతతోడ సమస్తంబు నిర్దేశించి కృష్ణునిపాలికిం బనిచిన వాడును సకల
బంధుమిత్రసమేతుండయి పేరోలగంబుననున్న కృష్ణునిం గాంచి యిట్లనియె.[117]

194


క.

విను పౌండ్రవాసుదేవుఁడు, నను నీకడ కనిచె నందనందన నీతోఁ
బనివడి నీవా రెల్లను, వినఁగా ననుమన్నమాట వినుమా తెలియన్.[118]

195


మ.

జగదేకప్రభుఁడ సముజ్జ్వలరమాసంపన్నుఁడ శంఖచ
క్రగదాశార్ఙ్గధరుండఁ గౌస్తుభమణిగ్రైవేయుఁడ నే మహో
రగవైరిధ్వజచారుపీతవసనప్రాప్తుండ శ్రీవత్సచి
హ్నగరిష్ఠుండను వాసుదేవుఁడ నృపుల్ నాతోడ నీడౌదురే.[119]

196


చ.

బెదరక వాసుదేవుఁ డనుపేరును జక్రముఁ బాంచజన్యమున్
గదయును శార్ఙ్గచాపమును గైకొనియుండిన నోర్వవచ్చునే
యదుకులజుండ నీకు నివి యర్హమె యిన్నియు నుజ్జగించి స
మ్మదమున నన్నుఁ గొల్వు మనుమానము మానుము నందనందనా.[120]

197

మ.

అటుగా కొండుదలంపు గైకొని మదీయంబైన సామర్థ్య మే
మిటికిం గైకొనకుండితేని నిను నెమ్మేనైన నుగ్రాజిఁ బ్ర
స్ఫుటశస్త్రాస్త్రహతిన్ వధించి వరుసన్ భూతంబులన్ దృప్తి సే
యుటకుం బూనుదు నీశ్వరాదులు సహాయుల్ గాఁగ నేతెంచినన్.[121]

198


క.

అనియె నని పల్కుటయు న, వ్వనజాయతలోచనుండు వానికిఁ దా ని
ట్లను మీయేలిక కోపిం, చిన నెవ్వరికైన నేమి సేయఁగవచ్చున్.

199


ఆ.

శంఖచక్రములును శార్ఙ్గంబు గదయును, నిచట విడువ నచటి కేను వచ్చి
పోరిలోనఁ దన్నుఁ బొడగాంచి ప్రాణముల్, విడుచునట్లు గాఁగ విడుచువాఁడ.

200


మ.

మదవద్వైరికులంబు నాహవములన్ మర్దించి మత్కీర్తిసం
పదఁ బొందించితి నెల్లలోకములు మద్బాహాబలస్ఫూర్తిచే
నిది నాకొక్కటియుం గొఱంత యగునే యెల్లుండిలోఁ దీర్చెదన్
వెదకంబోయినతీఁగె కాళ్లఁ బెనఁగెన్ వేయేల యూహింపఁగన్.

201


క.

మీయేలిక కీమాటలు, పోయి యెఱింగింపుమన్న బోరనఁ జని వాఁ
డాయంబుజనాభునభి, ప్రాయంబును దెలియఁజెప్పెఁ బౌండ్రునితోడన్.

202


సీ.

తదనంతరంబ మాధవుఁడు యాదవకోట్ల నిలిపి యాచతురంగబలముతోడ
బలభద్రసాత్యకిప్రముఖుల నిజరాజధానికిఁ గాపిడి వైనతేయు
నెక్కి యొక్కరుఁడు దేవేంద్రాదిదివిజులు జయపెట్టఁ జక్రాదిసాధనములు
గైకొని గగనమార్గంబునఁ జని పౌండ్రవాసుదేవుని పురద్వారసీమ


ఆ.

నిలిచి సకలదిశలు పెలుచఁ జెవుడ్పడ, నసురవరులగుండె లవియుచుండఁ
గాశిజనులు బెదరి కంపింప శాత్రవ, సంఘభయద మైనశంఖ మొత్తె.[122]

203


ఉ.

అట కాశీపతియున్ మురాంతకుఁడు యుద్ధార్థంబుగా నేగుదెం
చుటకున్ జిత్తములోనఁ గోపములు నిష్ఠ్యూతంబులై యుండఁ బ్ర
స్ఫుటనాగాశ్వవరూథినీభటచయంబుల్ గొల్వఁగా వచ్చెఁ ద
మ్మటభేరీముఖవాద్యఘోషము నభోభాగంబునన్ నిండఁగన్.[123]

204


వ.

ఇట్లు వచ్చి యబ్బలంబు నిబ్బరంబుగాఁ గృష్ణునిమీఁదం బురికొల్పిన.

205


ఆ.

పౌండ్రవాసుదేవపవనప్రయుక్తమై, యబ్బలంబులను మహాభ్రపటలి
కమలనాభపర్వతముమీఁదఁ బైకొని, యంపవాన గురిసె నతిరయమున.[124]

206

వ.

అప్పు డప్పుండరీకాక్షుండు దుర్నిరీక్ష్యుండై శార్జ్గంబు గుణధ్వని చేసి కనకపుంఖ
నానావిధబాణంబుల నబ్బలంబుఁ బీనుంగుపెంటలు చేసె నయ్యవసరంబున.[125]

207


క.

ఆపౌండ్రవాసుదేవమ, హీపాలుఁడు నిజబలంబు నెల్లను బాహా
టోపమున శౌరి చంపినఁ, గోపించి రథంబు దోలుకొని యేతెంచెన్.

208


వ.

అప్పుడు.

209


సీ.

చక్రాదిసాధనసముదగ్రహస్తునిఁ గౌస్తుభగ్రైవేయకప్రభాసు
గరుడకేతనపరిష్కారరథస్థునిఁ గనకరత్నోజ్జ్వలఘనకిరీటు
సురభిచందనలిప్తశోభితగాత్రుని దివ్యవిభూషణదీప్తమూర్తి
రమణీయపీతాంబరస్రస్తకటిభాగు శ్రీవత్సచిహ్నవిశేషవక్షు


తే.

వాసుదేవాభిధాను దుర్వారఘోర, సమరసన్నద్ధు నానాస్త్రశస్త్రజాల
ధరునిఁ బౌండ్రునిఁ జూచి యాధరణిధరుఁడు, మందహాసవికాసాననేందుఁ డయ్యె.[126]

210


వ.

ఇవ్విధంబునం గనుంగొని వాని కిట్లనియె.

211


ఆ.

దూతచేత నీవు తొల్లి చెప్పంపిన, మాట కింతయైన దాఁట రాదు
గాన నేడు రణముఖంబున నీమీఁదఁ, జక్ర మిపుడు విడుతు సరభసమున.

212


వ.

అని పలికి సంభూతమహోత్పాతభూతధాత్రీచక్రం బయినచక్రంబు ప్రయో
గించిన.[127]

213


క.

మండితమణిమయకాంచన, కుండలముకుటములతోడ గూడఁగ నాభూ
మండలపతి తల ధాత్రీ, మండలమునఁ గూలె నమరమండలి పొగడన్.[128]

214


మ.

జలజాతాక్షుఁడు శార్ఙ్గముక్తనిఖిలాస్త్రశ్రేణి నిశ్రేణిగా
నలఘుప్రౌఢిఁ దదీయనైన్యములన్ నాధారుణీవల్లభున్
జెలికాఁ డున్నసురాలయంబునకుఁ బుచ్చెన్ దేవతాసంఘముల్
బళిరే యంచు ననేకభంగుల నుతింపన్ దేవమార్గంబునన్.[129]

215


క.

హరి యాబలుమస్తకమున్, జరణాంగుష్ఠమున మీటె సరభసగతి నం
బరవీథి నరిగి కాశీ,పురిలోపలఁ బడఁగ విప్రపుంగవ బలిమిన్.

216


వ.

ఇవ్విధంబున విజయలక్ష్మీసమేతుం డగుకృష్ణుండు ద్వారకానగరంబునకు వచ్చి
యథోచితప్రకారంబున నుండి నంత.

217


క.

పౌండ్రునితనూభవుఁడు తమ, తండ్రిపగఁ దలంచి శౌరిఁ దాఁ జంపుటకై
పుండ్రేక్షుచాపహరునకుఁ, బండ్రెండేఁడులు తపంబు పాయకచేసెన్.[130]

218

ఆ.

మృడునివలన వరముఁ బడసి యాదవులతో, నబ్జనాభు గెలుచునట్టి కృత్తి
కలుగఁజేసి ద్వారకానగరంబుపై, ననుపుటయును గృష్ణుఁ డది యెఱింగి.[131]

219


క.

యదువరుల కెల్ల సంతస, మొదవఁగ నాకృత్తిపైఁ బ్రయోగించె వెసన్
మదవదరివిభవవక్రము, ముదితాఖిలదేవచక్రమున్ జక్రంబున్.[132]

220


వ.

ఇట్లు ప్రయోగించిన సుదర్శనంబు సకలలోకదర్శనీయంబయి చని కృత్తితోడఁ
బౌండ్రనందనుఁ బరిమార్చి కాశీపురంబు భస్మంబు చేసే క్రమ్మఱి దామోదరు
పాలికిం జనుదెంచె నివ్విధంబున.

221


క.

వారిజనాభుఁడు చేసిన, పౌరుషము లమానుషములు బలభద్రునిదు
ర్వారపరాక్రమములు వి, స్తారఫణితిఁ జెప్ప దేవతలకున్ వశమే.[133]

222


మ.

ధరణీభారము మాన్పఁగాఁ దలఁచి యాదామోదరుం డిమ్మెయిన్
నరరూపంబున నుద్భవించి యనిలోనన్ దేవగంధర్వు ల
చ్చెరువొంద నిజబాహువిక్రమము లుత్సేకింప విద్వేషులన్
బరిమార్చెన్ బలమిత్రపౌత్రకసుహృద్బంధుప్రయుక్తంబుగన్.[134]

223


వ.

మఱియు సకలలోకత్రాణపరాయణుం డయిననారాయణుండు భూభారంబు
మాన్చుట తనకు నవశ్యకర్తవ్యంబు గావున ద్వాపరయుగాంతంబున జ్ఞాతు
లయిన పాండవకౌరవులరాజ్యభాగంబునకు నై యన్యోన్యవిరోధంబులు గల్పించి
సముద్రముద్రితం బయిన మహీచక్రంబునం గలరాజులతోడంగూడ నేడు
పదునొకొం డక్షౌహిణు లుభయంబులం గూర్చి మహాఘోరయుద్ధంబు
సేయించి సవ్యసాచికి సారథియై పాండవుల నెపం బిడి పరస్పరయుద్ధంబుల నం
దఱం బరలోకగతులం జేసె పదంపడి యాదవులలోన నొండొరులకు విరోధం
బులు గల్పించి యందఱ నిరవశేషంబు చేసి తానును బలదేవుండు మున్నుగాఁ
బరమపదంబునకుం జనియె నని మైత్రేయుం డిట్లనియె.[135]

224

దుర్వాసఋషిశాపవ్యాజంబున యాదవవంశము పరిసమాప్తి నొందుట

మ.

మునినాథోత్తమ యావదార్తులభయంబుల్ మాన్పు నాకృష్ణుఁ డే
మినిమి త్తంబున నాత్మవంశజుల కెమ్మై పోరు గావించి చం
పెను రాముండును దాను నెట్లు సుగతిప్రీతాత్ము లై పోయిరో
వినిపించం దగునన్న నాతనికి నావిప్రోత్తముం డిట్లనున్.

225


తే.

అనఘ యాదవవంశ మత్యంతవృద్ధి, బొంది యింద్రాదిసురులచే బోలుపోఁక

యున్న నొకనాడు చూచి దామోదరుండు, తనమనంబున నిట్లని తలఁపు చేసె.[136]

226


క.

ఈవంశంబు వినాశము, గావింపక యున్నఁ దగవు గాదు ధరిత్రీ
దేవికి భారము మానదు, గావున నవ్విధము సేయఁగాఁదగు నంచున్.[137]

227


తే.

తనమనంబున నిబ్భంగి దలఁచుచున్న, యవసరంబున దుర్వాసుఁ డనుమునీంద్రుఁ
డొక్కనా డప్పురంబున కొంటినరిగి, కృష్ణు దర్శింపఁగోరి వాకిటికిఁ జనిన.[138]

228


తే.

దైవకృతమునఁ జేసి యాదవకుమార, వరులుకొందఱు సాంబుని వనితరూపు
గా నలంకార మొనరించి మౌనివరుని, కర్థి మొక్కించి నవ్వుచు ననిరి వారు.

229


తే.

అనఘ యీలతాంగియందుఁ గుమారకుఁ, డెన్నఁ దుద్భవించు నెఱుఁగఁ జెప్పు
డనినఁ దెలిసి మౌని ఘనకోప మాత్మలో, నెసఁగ వానితోడ నిట్టు లనియె.

230


మ.

ఇది మిథ్యాసతి లోహరూపముసలం బీయింతిగర్భంబులో
నుదయంబయ్యెడు నిందుచేత నుడియం దుగ్రాహవక్షోణిలో
యదువంశంబు సపుత్రబాంధవముగా నంతంబునం బొందుఁ ద
ప్పదు బ్రహ్మాదులు వచ్చి మాపినను నాపల్కంచు నత్యుగ్రుఁడై.[139]

231


క.

శాపం బిచ్చి యథేచ్ఛం, దాపసవరుఁ డరిగె నపుడు తద్దయు భయసం
తాపములతోడ యాదవు, లేపెల్లను బొలిసి శౌరి కెఱిఁగించుటయున్.

232


ఉ.

శ్రీరమణీశ్వరుండు మునిసేఁతకు శాంతి యొనర్ప నేర్చియున్
నేరని యట్లు చిత్తమున నివ్వెఱఁగందుచు నుండె నప్పుడ
ప్పౌరులు బంధువర్గమును బ్రార్థన చేసిన మాఱుమాటలే
కూరకయుండెఁ గాని మఱియొండొకకార్యము సేయఁ డెన్నఁడున్.[140]

233


వ.

అంతఁ గొన్నిదినంబులకును.

234


ఉ.

జాంబవతేయుగర్భమున సంభవమొందె మహోగ్రలోహరూ
పంబును గల్గురోఁకలి తపస్విమహోగ్రపుకోప మెల్లఁ గా
నంబడెనో యనంగను ఘనం బగునంధకభోజవృష్ణివం
శంబులపాలి మృత్యువని సర్వజనంబులుఁ దన్నుఁ జూడఁగన్.

235


క.

అమ్ముసల ముగ్రసేనుని, సమ్ముఖమువఁ బెట్టుటయు విషాదము భయముం
గ్రమ్మంగఁ జేవ చెడి యు, ల్లమ్మున దుఃఖించె యదుకులమునకు నెల్లన్.[141]

236


చ.

మది నొకతెంపు చేసి తనమంత్రులఁ గన్గొని వేగపోయి మీ
రిది కరసాన రూపుసెడ నెంతయుఁ ద్రెవ్వఁగఁబట్టి యారజం
బుదధిజలంబులం గలిపి యూఱడి నెమ్మది నుండుఁ డంతలో

యదుకుల మాపదం దొఱఁగి యభ్యుదయంబును బొందుచుండెడిన్.[142]

237


వ.

అని నిర్దేశించుటయు వార లమ్ముసలంబు రజంబు సేసి సముద్రజలంబుల గలిపి
రారజంబు దైవకృతంబునం జేసి ముయ్యంచుతుంగయై యుండె నమ్ముసలశేషం
బొక్కింత చిక్కిన నొక్కమత్స్యంబు మ్రింగిన కొండొకకాలంబునకు వేఁటక
రులు దానిగర్భగతంబయిన యినుపములికి యొక్కలుబ్ధకున కిచ్చిన వాఁడునుం
దాని దనశరంబునం దమర్చియుండె నంత.[143]

238


సీ.

అఖిలంబునందు భూతాక్రోశములు పుట్టెఁ బగలు చుక్కలు గానఁబడియె దివిని
గలిగె నుల్కాపాతములు పెక్కుదిక్కులఁ బురవీథి మృగధూర్తములు చరించె
నిండి మేఘంబులు నెత్తురు వర్షించె సందడించుచుఁ బిశాచములు దిరిగెఁ
బ్రతికూలనిర్ఘాతపవన ముగ్రత వీచె గ్రహములన్నియు వక్రగతుల నడచె


తే.

నిండ్లపై నెక్కి శునకంబు లేడ్చుచుండె, మలినమై యగ్నిహోత్రముల్ మండఁదొణఁగెఁ
గాకమూకనినాదముల్ గలయఁబర్వె, ద్వారకానగరంబునఁ దఱుచుగాఁగ.[144]

239


వ.

ఇ ట్లనేకదుర్నిమిత్తంబులు యదువంశవినాశకంబులయి కానిపించిన నొక్కనా
డుద్ధవుండు కమలోదరుపాలికిం జని యేకాన్తంబున నిట్లనియె.[145]

240


శా.

ఓనారాయణ నీ వెఱుంగనివిధం బొం డెద్దియుం గల్గునే
యైనం జెప్పెద యాదవాన్వయవినాశార్థంబు సూచించుచున్
నానాదిక్కుల దుర్నిమిత్తములు గానన్ వచ్చె నీపుత్రమి
త్రానీకంబులచేటు గాదె యని దుఃఖావేశుఁడై పల్కినన్.

241


ఉ.

అమ్మురవైరి యాతనిముఖాబ్జమునం దనచూడ్కి నిల్పి మో
దము దలిర్ప నిట్లనియె ద్వాపరమంతయుఁ జెల్లె నింక కా
ల మ్మెడ లేదు యాదవకులం బోక యించుకదప్ప భూమిభా
రమ్మఖిలమ్ము మాన్చి సమరమ్మునఁ జంపితి నెల్లవారలన్.

242


క.

ఈ వంశంబు వినాశము, గావింపఁ దలంపు చేసికాదే మునిశా
పావసరమున నశక్తుని, కైవడిఁ బ్రతికారరహితకరుఁడను నైతిన్.[146]

243


క.

నీవును మద్భక్తుండవు, గావున సాయుజ్యపదవిఁ గావించెద స
ద్భావమున నన్నుఁ దలఁపుచుఁ, గావింపుము తపము కొంతకాలము భక్తిన్.

244


వ.

ఏనును మానుషదేహంబు విడిచి దివ్యపదంబున కరిగెద మత్పరోక్షంబున ద్వార
కాపురంబు సముద్రంబునం గలయంగలయది యీవాక్యంబులు పరమరహస్యం
బులు సుమ్మీ యని వీడుకొలిపిన నతం డచ్చోటు వాసి గంధమాదనంబునకుం
జని బదరికాశ్రమంబున నరనారాయణస్థానంబునఁ దపంబు సేయుచుండె నంత

నొక్కనాడు దేవలోకంబుననుండి యొక్కదూత వచ్చి సముచితప్రకారంబునం
గమలనాభునిం గాంచి దేవేంద్రునివచనంబుగా నేకాంతంబున నిట్లనియె.

245


సీ.

వసుమతీభారంబు వారించుకొఱకునై మనుజవేషమున జన్మంబుఁ బొంది
యఖలభూతములకు నన్యోన్యవైరంబు గల్పించి నానాప్రకారములను
రమణీజనావశిష్టము లగునట్లుగా నందఱఁ బరిమార్చి తాహవమున
నియ్యాదవుల నింక నేయుపాయంబుననైనను మృతిఁ బొందునట్లు చేసి


తే.

మనుజలోకసుఖంబులు మాని నీవు, పరమపదమున కరుగుము పద్మనాభ
నీవు మహిమీఁద నూఱేండ్ల కెక్కుడుండఁ, దగునె కాలక్రమంబులు దలఁపవలదె.[147]

246


వ.

అనిన నాదేవదూతకు వాసుదేవుం డిట్లనియె.

247


క.

దేవేంద్రునివచనస్థితి, గావించెద యాదవప్రకాండమునెల్లన్
వేవేగ నేడుదినముల, లో వధ మొందించువాఁడ లోకోన్నతిగన్.[148]

248


ఆ.

ఏను బరమపదము కేతించుచున్నాఁడ, నివ్విధంబుఁ జెప్పు మింద్రుతోడ
ననుచు దేవదూత ననిచిన వాఁ డేగి, దివిజవిభునితోడఁ దెలియఁజెప్పె.

249


వ.

అంత యాదవులు విష్ణుమాయాప్రేరితులై సముద్రతీరంబునఁ బ్రభాసతీర్థంబునఁ
గృతస్నానులై మహోత్సవవ్యాజంబున మద్యపానంబు జేసి శరీరంబు లెఱుంగక
యొండొరులకు వివాదంబులు పుట్టి యనేకశస్త్రాస్త్రంబులను ముష్టిఘటనంబు
లను శిలాఘాతంబులనుం బోరాడి మఱియును.

250


తే.

ఆపయోనిధితీరంబునందు మొలిచి, యున్నముయ్యంచుతుంగ మహోగ్రగతులఁ
బూని పోరాడఁ దొడఁగిన భూరివజ్ర, ధారలై తాఁకు హరిమహత్త్వమునఁ జేసి.

251


వ.

ఇట్లు నీరవశేషంబుగా యాదవలోకంబు పరలోకప్రాప్తిం బొందె.

252


తే.

 శంఖచక్రగదాశార్ఙ్గసాధనములు, హరికి వలగొని మ్రొక్కి మాయమును బొందె
దనుజవైరియు సీరియు దారుకుండు, రథముపై నెక్కి జబధితీరమునఁ జనిరి.[149]

253


సీ.

అప్పుడు బలభద్రుఁ డలసుఁడై యొకతరుచ్ఛాయఁ గూర్చుండె నాసమయమునను
హలపాణివదనగహ్వరముననుండి శేషాహి నిజాకృతి నవతరించి
వారాశిలోఁ జొచ్చి వాసుకి మొదలుగాఁ బన్నగేంద్రులు దన్ను బలసి కొలువఁ
జనుచుండ నెదురుగా జలరాశి యేతెంచి యతిభక్తి నర్ఘ్యపాద్యాదివిధులఁ


తే.

బూజ లిచ్చుటయును బ్రీతిఁ బొంది నాక, లోకమున కేగుటయుఁ బద్మలోచనుండు
తాను బరలోకమున కేగఁ దలపు చేసి, సూతుఁ డగుదారకునిమోముఁ జూచి పలికె.[150]

254

క.

ఏ నిక ద్వారావతికిన్, రాను బరమపదమునకును రయమునఁ బోవం
గా నుద్యోగము చేసితి, నీనీరధితీరభూమి నెంతయు గరిమన్.

255


ఉ.

ద్వారవతీపురంబున కుదగ్రగతిం జని యుగ్రఁసేనుఁడున్
బౌరులు మద్గురుండు తగుబంధుజనంబులు వించునుండ దు
ర్వారబలాఢ్యు లైనయదువంశ్యులచావును మత్పరోక్షమున్
సీరధరుండు పోవుటయుఁ జెప్పు సవిస్తరభంగి నేర్పడన్.[151]

256


వ.

అర్జునుండు వచ్చి మదీయవనితాజనంబులం దనపురంబునకుఁ దోడుకొనిపోవంగల
వాఁడు సవ్యసాచి వెడలునపుడు ద్వారకాపురంబు సముద్రంబునం గలసిపోవం
గలయది యాదవులకుఁ బరిలోకక్రియలు నిర్వర్తించి వజ్రుండు వజ్రధరనంద
నుతోడనె యరుగంగలవాఁడు నీవు నాయందుఁ బరమభక్తుండవు గావున నవ్య
యలోకంబులు గృపసేసితి నరుగుమనిన దారుకుండు పునఃపునఃప్రదక్షిణప్రణా
మపరుండయి వీడుకొని చనియె నంత.[152]

257

శ్రీకృష్ణనిర్యాణము

క.

పరమాత్ముఁ డగుముకుందుఁడు, పరమ్మబ్రహైక్యతత్వభావనమతితో
నురుతరయోగాసనత, త్పరుఁడై కూర్చుండె సురలు బ్రస్తుతి సేయన్.

258


క.

కోపనుఁ డగుదుర్వాసుని, శాపము ప్రేరేచుచుండ జడుఁ డను మ్లేచ్ఛుం
డాపొలమున వేఁటాడుచు, శ్రీపతిపదము గని మృగము చెవి యని యేసెన్.[153]

259


వ.

ఇట్లేసి యామ్లేచ్ఛుండు డగ్గఱ వచ్చి.

260


తే.

శంఖచక్రగదాభయచారుహస్తు, సజలజలదాభగాత్రుని సకలలోక
వంద్యు శ్రీవత్సలాంఛను వాసుదేవు, విష్ణుఁ బొడగాంచి సంతోషవివశుఁ డగుచు.[154]

261


వ.

పునఃపునఃప్రణామంబులు సేయుచున్నకిరాతునకుఁ బ్రసన్నుండయి యుత్తమ
లోకంబునకుఁ గృపసేసి యున్నసమయంబున.

262


క.

అనిమిషవనితలు నాకం, బుననుండి విమాన మొకటి బోరనఁ గొనివ
చ్చిన నెక్కి దేవునాజ్ఞను, చనియెన్ వైకుంఠమునకు శబరుఁడు మహిమన్.

263


క.

పరమాత్ముఁ డపుడు సచరా, చరభూతము లుల్లసిల్లి జయపెట్టంగా
గరుడారూఢుం డగుచును, పరమపదంబున వసించెఁ బ్రమదం బొప్పన్.

264


క.

దారుకుఁ డవ్విధమున నా, ద్వారవతికిఁ బోయి యదుకదంబము చావున్
సీరి పరోక్షంబును నం, భోరుహలోచనుఁడు సిద్ధిఁ బొందినవిధమున్.[155]

265


క.

వినిపించిన వసుదేవుం, డును బౌరులు నుగ్రసేనుఁడును బంధులుఁ బే
ర్చినదుఃఖవార్ధిలోపల, మునుఁగుచు నట్లున్నసమయమున నచ్చటికిన్.

266


ఆ.

వాసుదేవుఁ జూడ వాసవపుత్రుండు, ద్వారవతికి వచ్చి దారుకాఖ్యు

వలన యదుకులంబు పొలిసినచందంబు, విని నితాంతదుఃఖవివశుఁ డగుచు.[156]

267


వ.

ఉగ్రసేనవసుదేవులతోడ రామకృష్ణులకళేబరంబులకడకుం జని తనమనంబున.

268


క.

ఇల నుత్పత్తిస్థితిలయ, ములకుం దాకర్త యైనమురవైరియఁటే
జలధిదరి నొకకిరాతుని, వలన నధమవృత్తిఁ జావవలసెను నకటా!

269


వ.

అని దుఃఖించె నప్పుడు రుక్మిణీసత్యభామాదిభార్యలెనమండ్రును గృష్ణునితోడ
సహగమనంబు చేసిరి రేవతియును బలభద్రునితోడ ననలముఖంబునఁ బరలోకం
బున కరిగె దేవకీవసుదేవులు నుగ్రసేనాదిపరమబంధుజనంబులును వారియట్ల
పుణ్యలోకంబునకుం జనిరి. అప్పు డర్జునుండు వజ్రుచేత సకలయాదవులకుఁ బర
లోకక్రియలు సేయించి ద్వారావతికి వచ్చె నంత.

270


తే.

వాసుదేవుండు పరలోకవాసి యైన, దివసమునఁ బారిజాతంబు దివికి నరిగె
ద్వాపరం బంతయును సమాప్తమునఁ బొందెఁ, గలియుగంబు బ్రవేశించి కానిపించె.

271


వ.

అర్జునుండును ద్వారకానగరంబునఁ గలసమస్తజనంబుల వెడలించి యొక్కరమ్య
ప్రదేశంబున నునిచె నప్పుడు వాసుదేవుని యంతిపురంబుదక్క నప్పురంబు సము
ద్రంబునం గలసెను.

272


సీ.

వాసుదేవుఁడు భక్తవత్సలుఁ డెప్పుడు నచ్చోట ప్రత్యక్షమై వసించు
నది కారణంబుగ నమ్మహాస్థానంబు పుణ్యంబులకు జన్మభూమి యయ్యె
నచ్చోట విష్ణువిహారస్థలముగాన సతతంబు పాపనాశము సమస్త
సుఖనివాసంబు నై సొంపారునమ్మహాదేశంబు ప్రజలమందిరములందు


తే.

బహుళధనధాన్యసంపదల్ పరఁగియుండు, నమ్మహాక్షేత్ర సందర్శనానురాగ
మానసుం డగుచు వచ్చినమానవునకుఁ, బద్మలోచనుఁ డిచ్చుఁ గైవల్యపదము.

అర్జునపరాజయము

క.

సురరాజతనయుఁ డప్పుడు, హరిభార్యలనెల్లఁ గొని రయంబున నరిగెన్
శరచాపహస్తుఁడై సిం, ధురపురిమార్గంబు పూని దోర్బలశక్తిన్.[157]

274


వ.

ఇట్లు మహారణ్యమధ్యంబున నరుగునప్పు డచ్చేరువపల్లెలబోయలు మూఁకలు కూడి
యడ్డంబు సని సవ్యసాచి కిట్లనిరి.

275


మ.

శరచాపంబులు పూని పౌరుషమహోత్సాహైకశీలుండవై
యరవించాక్షునిభార్యలం గొని మహోగ్రారణ్యదేశంబులో
నరుగంజూచెదు తొంటిబీరములు నీ కాలాగునం జెల్లునే
గరిమన్ వీరలఁ గొంచు నిన్ను నరుగంగా నిత్తురే లుబ్ధకుల్.

276


మ.

అని గర్వించి కిరాతదస్యులు మహోగ్రాకారులై పద్మనా

భునిభార్యానివహంబులందు నొకరిన్ బోనీక కొల్లాడినన్
ఘనుఁ డప్పార్థుఁడు గాండివంబు గొని వీఁకన్ నారి యెక్కింపఁబో
యిన దోశ్శక్తి దొలంగివో నబలుఁడై యెంతేని దుఃఖంబునన్.[158]

277


ఆ.

నలిననాభుతోడ నాబాహుశక్తియుఁ, బొలియఁబోలు వనుచు భూరిదివ్య
బాణపూర్ణ మైనతూణీరములు చూడ, నవియు రిత్తలయ్యె నద్భుతముగ.[159]

278


ఆ.

మహితదివ్యబాణమంత్రాధిదేవత, లందునొకఁడుఁ దోఁపదయ్యె మదిని
నమరరాజతనయుఁ డప్పుడు జీవన్మృ, తుండుఁబోలె నుండె దండి వొలిసి.[160]

279


వ.

ఇ ట్లెత్తువడినమత్తమాతంగంబునుంబోలె బలారాతినందనుండు గాండీవంబు
వీచుచు నదల్చుచున్న యతనిం గయికొనక చోరు లన్నవనీతచోరుభార్యలఁ
జెఱలుగొనిపోయి రంత.[161]

280


క.

శ్రీపతిభార్యలఁ గోల్పడి, యాపార్థుఁడు చిన్నవోయి యప్పుడు చనియెన్
ఏఁపున గోవులఁ గోల్పడి, గోపాలకుఁ డరిగినట్లు ఘోరాటవిలోన్.[162]

281


వ.

ఇ ట్లరిగి తనకు నభిముఖుండయివచ్చు కృష్ణద్వైపాయనుం బొడగాంచి విన్ననై
కృష్ణాదియాదవులు పరలోకగతులగుటయుఁ గృష్ణునిభార్యలం గిరాతు లపహరిం
చుటయుఁ దనబలంబు చేవ యడంగుటయుఁ జెప్పిన నమ్మునీంద్రుం డింద్రనందనున
కిట్లనియె.[163]

282


ఆ.

కాలగతుల దైవఘటనల నొక్కొక్క, వేళ నధికుఁ డైనవీరముఖ్యుఁ
డల్పబలునిచేత నవమానమునఁ బొందు, నపుడ వానిబలము నడఁగునొక్కొ.

283


సీ.

మధుకైటభులతోడ మచ్చరంబునఁ బోరి యిందిరాధీశుండు క్రిందుపడఁడె
యొక్కొక్కవేళ రాహుగ్రహంబున కోడి భానుశీతాంశులు పట్టువడరె
వృత్రాసురునితోడి వైరంబునకుఁ గాక బలవైరి భీతుఁడై పాఱిపోఁడె
గంగాతనూజుతో సంగరం బొనరించి పరశురాముఁడు మున్ను పంతమోడె


తే.

ద్రోణభీష్మాదు లగుమేటిదొరలు నీమ, హోగ్రబాణములకుఁ గాక మోటువడరె
వార లెల్లను బాహుగర్వప్రతాప, ఘనులు గా రనవచ్చునే కౌరవేంద్ర.

284


క.

ఒడలెల్ల నేలపాలై, మడియును జన్మంబు లెల్ల మరణము లై యె
ల్లెడలం జెల్లును దీనికి, వడి సుఖదుఃఖములు సెందవలదు కుమారా.

285


క.

హరిభార్యలు బోయలచేఁ, బరిభవమునఁ బొంది కోలుపడి రని మదిలోఁ
బరితాప మొందకుము భూ, సురశాపము మున్ను గలదు సూ వారలకున్.[164]

286

అష్టావక్రచరిత్రము

వ.

అది యెట్లనినం దొల్లి యష్టావక్రుం డనుబ్రాహ్మణుండు హిమనగసమీపంబున

నొక్కనలినాకరంబునఁ గంఠపర్యంతజలంబులలోన వికీర్ణపింగళజటాధరుండయి
యనేకకాలంబు ఘోరతపంబు సేయుచున్న నతనికడకు రంభాతిలోత్తమాదుల
యిన యప్సరాంగనానివహంబు వచ్చి నృత్తగీతవాద్యంబుల నతనిచిత్తంబు ప్రస
న్నం బగునట్లుగాఁ జేసి రంభాతిలోత్తమాదులు నిజనివాసంబులకుం బోయిరి.
అందుఁ గొందఱు దేవాంగన లమ్మునితోడి దేవా దేవదేవుం డయిన విష్ణుదేవునకు
దేవీజనంబులమయియుండ ననుగ్రహింపవలయు ననినఁ బ్రసన్నుండై.[165]

287


క.

హరి యదువంశంబున ద్వా, పరయుగమునఁ గృష్ణుఁ డనఁగఁ బ్రభవించు నతం
డిరవంద మీకుఁ బ్రాణే, శ్వరుఁడై యిప్టోపభోగవాంఛలు సలుపున్.

288


తే.

అని వరం బిచ్చి యాచమనార్థముగను, గొలనితీరంబునకు వచ్చి నిలిచియున్న
మౌనిపలుకుంట్లతో నున్నమేను జూచి, నలినవదనలు కలకల నవ్వుటయును.

289


క.

అవ్వనజనేత్ర లీగతి, నవ్విన లజ్జించి మౌనినాథుఁడు తనలో
నివ్వటిలునలుకపెంపున, జవ్వనులకు నలిగి యొక్కశాపం బిచ్చెన్.[166]

290


వ.

నన్ను నవమానించి నవ్వితిరి గావునఁ గృష్ణునిపరోక్షంబునఁ గిరాతులచేతఁ జెఱ
లు పోవం గలవారలని పలికి పదంపడి యనుగ్రహించి మానభంగంబులు గాక
నాకలోకసుఖంబు లనుభవించెద రని చెప్పి మునీంద్రుండు వోయె నది కారణం
బుగా వారి కివ్విధంబు వాటిల్లె నయ్యిందువదనలందఱు ప్రాణపరిత్యాగంబు చేసి
నాకలోకంబునకుం జనిరి మఱియును.

291


ఆ.

కలియుగంబుఁ జొచ్చెఁగాన మీరెల్ల నీ, వసుధయందు నుండవలవ దింక
నధికతపము చేసి యవ్యయసౌఖ్యప, దములఁ బొందవలయు ధర్మయుక్తి.

292


ఆ.

ఈ తెఱంగు నీవజాతశత్రునితోడఁ దెలియఁజెప్పు మనుచు దివ్యమౌని
చనియె నపుడు సవ్యసాచి వజ్రుఁడుఁ దాను, హస్తినగరమునకు నరుగుదెంచి.

293


ఆ.

పాండవాగ్రజునకుఁ బద్మలోచనునివృత్తాంతమెల్ల జెప్పి వ్యాసమాని
కలఁకదేర్చి తన్నుఁ బలికినపలుకును, విశదముగను విన్నవించుటయును.

294


వ.

వ్యాసోపదేశంబున ధర్మనందనుం డభిమన్యునందనుం డైనపరీక్షిత్తునిం గౌరవ
రాజ్యంబునకుఁ బట్టంబు గట్టి భీమార్జుననకులసహదేవ, ద్రౌపదీసమేతుండై తపోవ
నంబున కరిగె అని యిట్లు కృష్ణుచరిత్రంబులు చెప్పిన మైత్రేయుండు పరమానంద
పరిపూర్ణహృదయుండై పరాశరున కిట్లనియె.

295


క.

పరమాత్ముఁ డైననిష్ణుని, చరితము లన్నియును నీప్రసాదంబున వి
స్తరఫణితి వినఁగఁగలిగెను, హరిభక్తియుఁ గలిగెఁ గడుఁ గృతార్థుఁడ నైతిన్.

296


ఆ.

ఇంక నొక్కయర్థ మేను ని న్నడుగంగఁ, గోరియున్నవాఁడ గురుగుణాఢ్య
కలియుగంబునందుఁ గలధర్మములు జగ, త్ప్రళయలక్షణములు దెలుపవలయు.

297

కలియుగధర్మము

క.

అనవుడు నతఁ డమ్మునిసుతుఁ, గనుఁగొని యిట్లనియెఁ గలియుగంబున ధర్మం
బొనరంగ నేకపాద, మ్మున నడచుటఁజేసి ధర్మములు లేకుండున్.[167]

298


ఆ.

అవనియందు వైదికాచారములు తపో, యజ్ఞములును దేవతార్చనాగ్ని
హోత్రములు వివాహయోగ్యదాంపత్యక్రి, యలుఁ దొలంగిపోవుఁ గలియుగమున.

299


క.

గురుశిష్యవర్తనంబులు, పరిభవములు వొందు విష్ణుభక్తియు వేదాం
తరహస్యంబులుఁ జెడు సం, కరమగు వర్ణాశ్రమములు కలియుగవేళన్.

300


సీ.

కులహీనులకుఁ గన్యకల నిత్తు రధికులు బలవంతుఁ డగువాఁడె యిలకుఁ గర్త
ద్విజనామమాత్రులు దీక్షితు లగుదురు మనుజు లేవేల్పునైనను భజింతు
రాచరించినదె ప్రాయశ్చిత్తమగుఁ బల్కినవి శాస్త్రములు చెప్పినదియె నీతి
దానంబు గావించి తపములు విడుతురు ధర్మ మేలాగు వర్తనములైన


తే.

ధనముగలవాఁడె రాజు మౌగ్ధ్యమున నున్న, వాఁడె హీనుఁడు కల్లాడువాఁడె ప్రోడ
పాపవర్తను లగువారె భాగ్యవంతు, లెలమి గలవారె పూజ్యులు కలియుగమున.[168]

301


క.

కులసతుల విడిచి పురుషులు, కులహీనులయిండ్లఁ బోయి కూటికొఱకుఁ గ
న్నెలఁ బెండ్లియాడియుందురు, నిలువరుసలుఁ బౌరుషములు నెడలి మునీంద్రా.[169]

302


ఆ.

అర్థ మిచ్చెనేని యధమాధమునినైన, నాశ్రయింపఁ జూతు రార్యమతులు
సూనృతంబుబలము శూరత్వమును లేదు, కల్లతనము గలదు కలియుగమున.

303


సీ.

పతిభక్తి యుడిగి సంతతమును దమయిచ్చవచ్చినతెరువుల వ్యభిచరించి
పెక్కు బిడ్డలఁ గాంచి పేదఱికముచేత బడలుచు జీవనోపాయములకు
వెర వేమియును లేక విచ్చలవిడి నీచకర్మంబులకుఁ జొచ్చి గాసిపడుచుఁ
దల్లిదండ్రుల నన్నదమ్ముల నత్తమామల బంధుజనులఁ బుత్రులను విడిచి


తే.

యుండుదురు రెండుచేతులు నొక్క పరియ, మ స్తకము గోఁకికొందురు మగువలెల్లఁ
గల్లలాడుచుఁ బరుషవాక్యములతోడ, నలిగియును భాగ్యహీనలై కలియుగమున.[170]

304


క.

స్నానము సంధ్యయు జపమును, మాని దురాచారులై సమంజసకులధ
ర్మానుష్ఠానము లొల్లక, హీనత వర్తింపుదురు మహీసురు లెల్లన్.

305

సీ.

తఱుచు వానలు లేవు ధరణిఁ బంటలు పండ రాజు లన్యాయవర్తనము లుడుగ
రుర్వీసురులు వేద మొల్లరు దుర్భిక్షమగు నెల్లకాలంబు తగవు లెడలి
వార్తావిహీనులై వైశ్యులు శూద్రుల యట్ల వర్తింపుదు రధమజాతి
నాశ్రయింపుదురు ధనార్థులై యధికులు కడునీతిబాధయుఁ గలిగియుండు


తే.

విప్రవరులకు శూద్రులు వేదశాస్త్ర, ధర్మములు చెప్పుదురు తల్లిదండ్రులందు
భక్తి చెడి యత్తవారలప్రాపు గోరి, మెలఁగుదురు సర్వజనములు కలియుగమున.

306


తే.

కాంత కైదునాఱేండ్లకుఁ గలుగు సుతుఁడు, పదియు పండ్రెండు నేండ్లలో ముదిమి చెందు
మనుజుఁ డిరువదియేండ్లలో మరణ మొందుఁ, దాపసోత్తమ కలియుగాంతంబునందు.

307


సీ.

వేదశాస్త్రంబులు విప్లవంబును బొందుఁ బాషండమతములు ప్రబలివచ్చు
నాదిదేవుం డైనహరిఁ గొల్వ రెవ్వరు సేవింతు రల్పంపుదైవములను
శూద్రులుఁబోలె భూసురులు వర్తింతురు సకలవిద్యలు నీచజాతి నేర్చు
నుత్తము లగుక్షత్రియులు చెడిపోదురు మ్లేచ్ఛు లేలుదురు భూమితలంబు


తే.

పుణ్యవంతుల కాయువు పొలిసిపోవు, పాపకర్ముఁడు నూఱేండ్లు బ్రతికియుండు
నల్పబుద్ధులు నల్పభాగ్యములుగాని, మతులు సిరులును పస లేవు మనుజులకును.[171]

308


ఆ.

కృతయుగాదులందు నతులప్రయత్నంబు, సేయకున్న మేలు చెప్ప లేదు
కలియుగంబునందు సులభయత్నంబున, వలన నధికమైనఫలము గలుగు.

309


తే.

అనఘ యేతన్నిమిత్తమైనట్టి యొక్క, కథ వివక్షింతు విను మాదికాలమునను
మునులు కొందఱు సభగూడి వినుతఫలము, నల్పధర్మక్రియలు నెట్టు లబ్బు నొక్కొ.

310


తే.

అనుచుఁ దమలోనిసంశయం బవనయించు, కొనఁగనేరక నాసుతు ననఘమూర్తి
యైనయట్టి వేదవ్యాసు నడుగఁగోరి, కడుఁబ్రయత్నంబుతోఁ జని గంగయందు.[172]

311


క.

మౌనంబుతోడ నర్ధ, స్నానం బొనరించుచున్న సాత్యవతేయుం
గానిచి యమ్మౌని యను, ష్ఠానాంతమునందు నడుగఁ జనుఁ బను లనుచున్.[173]

312


తే.

తపసులెల్ల గంగానదీతటమునఁ దరు, పండములలోనఁ బ్రవిమలసైకతముల
యందుఁ గూర్చుండి రప్పు డంతయు నెఱింగి, వ్యాసమునిపతి యెఱుఁగనివాఁడుఁబోలె.[174]

313


వ.

వారలందఱు వినఁ గలిస్సాధు శూద్రస్సాధు స్త్రియస్సాధు వనుచు ముమ్మాఱు
మునింగి వెడలి కాలోచితకృత్యంబులు దీర్చి బ్రహ్మసభకుఁ బ్రదక్షిణప్రణామంబు

లాచరించి వారిచేత సంభావితుండై కూర్చుండి యుచితసల్లాపంబులు సేయుచు
న్నసమయంబున నమ్మును లతని కిట్లనిరి.[175]

314


ఆ.

సొరిదిఁ గలియుగంబు శూద్రులు కాంతలు, సాధు లనుచు నేటిజలములోనఁ
దీర్థ మాడునపుడు తెలియంగఁ బలికితి, రివ్విధంబు మాకు నెఱుఁగవలయు.

315


వ.

అనిన మందస్మితవదనారవిందుండై సత్యవతీనందనుండు వారల కిట్లనియె.

316


సీ.

కృతయుగంబున భక్తి గీలించి పదియేండ్లు ధ్యానంబు చేసిన నలరు శౌరి
త్రేతాయుగంబునఁ బ్రీతితో నేఁడాది మఘము చేసిన మెచ్చు మాధవుండు
ద్వాపరంబున రేపు మాపును నెలనాళ్లు పూజ చేసినఁ బ్రీతిఁబొందు విభుఁడు
కలియుగంబున భక్తి నెలకొన నొకనాటిసంకీర్తనకు మెచ్చు శార్ఙ్గధరుఁడు


ఆ.

మొదలఁ జెప్పినట్టి మూఁడుయుగంబులఁ, గడుప్రయాస పడినఁగాని యల్ప
ఫలము చేర దధికఫల మప్రయాసతఁ, గలుగుఁ గానఁ గలియుగంబు మేలు.

317


మ.

చతురామ్నాయములున్ బఠించి క్రతుదీక్షాదక్షులై యుత్తమ
వ్రతముల్ సేయుచు దేవతాతిథిసపర్యల్ భక్తి గావించి శా
శ్వతయోగంబును బ్రహ్మచర్యముఁ గులాచారంబుఁ దోరంబుగాఁ
బ్రతిభంజేయుట నిత్యకర్మములు విప్రక్షత్రవిడ్జాతికిన్.[176]

318


తే.

వసుధ బ్రాహ్మణక్షత్రియవైశ్యులకును, నైజములు నిత్యకర్మముల్ నడపుటెల్ల
నందు నొక్కటి వెలితైన నధికమైనఁ, బాతకము చెందు జేసినఫలము లేదు.

319


ఆ.

వినుఁడు పాకయజ్ఞమును విప్రసేవయుఁ, జేసి యధికఫలముఁ జెందు శూద్రుఁ
డవి దొఱంగెనేని నణుమాత మైనను, బాతకంబు వానిపాల లేదు.[177]

320


క.

వెలయఁగఁ గర్మాకర్మం, బులు పేయాపేయములును భోజ్యాభోజ్యం
బులు విప్రాదులకరణిని, గలుగవు శూద్రులకుఁ బుణ్యగతులును గలుగున్.[178]

321


క.

ఉపవాసాయాసంబులు, తపములు యజ్ఞములు దానధర్మంబులు లే
క పరమపుణ్యు లగుదు ర, చ్చపుశూద్రులు సాధు లగుదు రవనీస్థలిలోన్.

322


క.

మనమును బలుకును గర్మం, బును నేకముగా మనోవిభునిఁ గొల్చినయా
వనిత నిరాయాసంబునఁ, దనపతియును దాను శుభపదంబున నుండున్.

323


క.

క్రతువులు జపములుఁ దపములు, వ్రతములుఁ జేయక యథాభివాంఛితమతితో c
బతిభక్తిఁ బుణ్యఫలశా, శ్వతు లగుదురు గాన సతులు సాధులు సుండీ.[179]

324


చ.

అనవుడు సంతసిల్లి మునులందఱు సత్యవతీతనూభవున్
వినుతు లొనర్చి నిర్మలవివేకమహాత్మక యేము గోరిన

చ్చిన పనులెల్ల నీ విపుడు చెప్పినపల్కులలోఁ బ్రకాశమ
య్యెను జరితార్థులైరి విను మిందఱు నీవలన న్నిజంబుగన్.[180]

325


క.

అని కృష్ణద్వైపాయన, మునివరుఁ బూజించి ప్రమదమునఁ దాపసులె
ల్లను దమతమనెలవులకు, జనిరి తదీయంబు లైనసల్లాపములన్.

326


క.

అని చెప్పి పరాశరుఁ డ, మ్మునిపుత్రునిఁ జూచి పాపములకు నిలయమై
యొనరినకలియుగమందును, ఘన మొక్కటి గలిగియుండి గణనకు నెక్కున్.

327


క.

పరమరహస్యం బీకథ, పరిపాటిగ నీకుఁ దేటపడఁ జెప్పితి నా
హరిసంకీర్తన మఱవక, చరితార్థుం డగుచు నుండు సన్మునితిలకా.

328


మ.

అనినన్ శిష్యుఁడు సంతసం బొదవ నయ్యాచార్యునిం జూచి యి
ట్లనుఁ గల్పాంతమునన్ జగంబుల కపాయం బెమ్మెయిం గల్గు న
వ్వనజాతాయతనేత్రుఁ డెవ్విధమునన్ వర్తించు నా కేర్పడన్
వినుపింపం దగునన్న నాతనికి నవ్విప్రోత్తముం డిట్లనున్.

329

నైమిత్తికప్రాకృతాత్యంతికము లనెడు మూఁడుప్రళయములవివరణము

చ.

అనఘ నిమిత్తమాత్రముననైన పటుప్రతిసంచరక్రియల్
వినుము మహాయుగంబు లొకవేయి చనంగ దినంబునందు న
వ్వనరుహసూతి కప్పు డనివార్యగతిన్ హరి తామసంబు పెం
పొనరఁగ రుద్రరూపమునఁ బొంది భయంకరమై చెలంగినన్.[181]

330


క.

త్రాణలు చెడి దుఃఖంబులు, ప్రాణభయంబులును గలిగి బడలిక లొదవన్
క్షోణిఁ జరాచరచయములు, క్షీణప్రాయంబులై నశించు మునీంద్రా.[182]

331


క.

ఇలపై శతసంవత్సర, ములు వానలు లేక భూతముల నన్నింటిన్
బోలియించు నరాజకములు, గలుగుఁ బ్రజానాశమునకుఁ గారణములుగన్.

332


క.

జలజహితు వేయికిరణం, బులలోపల నధికతీవ్రములు నత్యుష్ణం
బులు నైన యేడురశ్ముల, నలినాప్తుఁడు నిలిచి క్రోలు నానాజలముల్.[183]

333


ఉ.

స్థావరజంగమంబులరసంబులు సప్తసముద్రవాహినీ
గ్రావగతోదకంబులు నగాధరసాతలజీవనంబులున్
ద్రావఁగ నెల్లలోకములు దగ్ధము నొందినయట్ల యుండు న
ద్దేవునిదీప్తు లేడు నవతీర్ణము నొందుఁ బ్రచండమూర్తులై.[184]

334


క.

ఆసప్తప్రళయార్క, వ్యాసమయూఖౌఘతీవ్రవహ్నిజ్వాలా
న్యాసముల మూఁడు జగములు, భూసురపుంగవ వినాశమునఁ బొందుఁ జుమీ.[185]

335

మ.

నదులు గొండలు వార్ధులు వనములున్ నానాతటాకంబులున్
ద్రిదశవ్రాతము మానవప్రతతియున్ దిర్యక్సమూహంబులున్
దుదగా నన్నియు భస్మమైన మహిఁ జెందున్ గూర్మపృష్ఠాకృతిన్
మద మేపార జనార్దనుం డపుడు భీమప్రౌఢసంరూఢుఁడై.[186]

336


క.

కాలాగ్నిరుద్రుఁడై బలు, కీలలక్రొమ్మంట లోలిఁ గ్రిక్కిఱియంగా
భూలోకంబున నించినఁ, ద్రైలోక్యంబునకుఁ బుట్టు దహనక్రీడల్.[187]

337


క.

శేషునిముఖనిశ్వాసవి, భీషణవాయువుల నాగబృందాలయమున్
శోషింపఁజేయు నప్పుడు, వైషమ్యము నొంది వాయువహ్నులు గూడన్.[188]

338


క.

పైకొని చిచ్చును గాలియు, నేకంబై ముజ్జగంబు నేర్చుచు నుండున్
లోకాలోకాంతరభూ, లోకము ప్రొయిఁబోలె మండు లోకేశనుతా.

339


క.

మును వోయి మహర్లోకం, బున నున్న సనందనాదిమునిబృందంబుల్
ఘనదహనార్చుల కోర్వక, జనలోకంబునకుఁ బోయి సంచారింతుర్.

340


వ.

అప్పుడు రుద్రరూపియై జనార్దనుండు.

341


క.

తనముఖనిశ్వాసంబున, ఘనతరసంవర్తమేఘగణములు విద్యు
జ్జనితస్తనితంబులుగా, జనియింపఁగఁ జేయుఁ జటులసంరంభమునన్.[189]

342


వ.

అవియును ననేకరూపంబులతోడ నానావర్ణసమేతంబులయి మహాఘోరసం
రావంబులు గల్పించుచు సమస్తదిశాపరిపూర్ణంబులయి మహాంధకారంబులు
గల్పించుచు విభీతకఫలప్రమాణంబు లయిన యాసారవర్షంబులు గురిసి మహా
ప్రచండప్రళయదహననిచయంబులు వారించి భువర్లోకపర్యంతం బేకోదకంబు
సేయు నప్పుడు.[190]

343


క.

హరి తనముఖనిశ్వాసో, త్కరములచే వాయువులను గల్పించి భయం
కరవారిధరచయంబులు, విరియఁగ నూఱేండ్లు బిట్టు వీచు మునీంద్రా.[191]

344


తే.

అట్టిప్రళయానిలంబు జనార్దనుండు, మగుడఁ గ్రోలి సమాధానమతిఁ జెలంగి
జలధిఁ బవళించు నాశేషశయ్యయందు, వేయిదివ్యయుగంబులు విప్రముఖ్య.[192]

345


వ.

ఇవ్విధంబునం బవళించి యాత్మమాయామోహితుండయి వాసుదేవాత్మకం
బయినపరతత్వంబుఁ జింతించుచు జనలోకనివాసులయిన సనందనాదిమునిబృం
దంబులచేత వర్ణితుండయి యోగనిద్రం జెంది నిశాతీతకాలంబునఁ బ్రబుద్ధుం

డయి రాజసగుణంబువలన బ్రహ్మరూపంబు ధరియించి ప్రజాసృష్టి యొనర్చునని
యిట్లు నైమిత్తికప్రళయంబుఁ జెప్పి యిట్లనియె.[193]

346


ఆ.

విప్రముఖ్య ప్రాకృతప్రళయంబు నీ, కేర్పరించువాఁడ నింక వినుము
మత్పితామహుఁడు జగత్పితామహుచేత, విరఁగఁ దెలివిపడఁగ వింటిఁ దొల్లి.[194]

347


క.

మును చెప్పిన నైమిత్తిక, మనుప్రళయము కరణి మాఱు హాయనములు భూ
మిని వాన గురియకుండిన, నొనరఁగ జగములకు నగు మహోపద్రవముల్.[195]

348


వ.

అప్పు డవనికిం బ్రధానగుణం బయినగంధతన్మాత్రగుణంబు జలంబులు గొనిన
నాజలం బగ్నియందుఁ గలయు ననలంబునకుఁ దన్మాత్రగుణం బయినరూపంబు
వాయువుఁ గొనిన ననలంబును ననిలంబునందుఁ గలయు సమీరంబునకుఁ
దన్మాత్రగుణం బయినస్పర్శంబు నాకాశంబుఁ గొనిన సమీరం బాకాశంబునందుఁ
గలయు నభంబునకుఁ దన్మాత్రగుణం బయినశబ్దంబు భూతాదిచేత గ్రసింపంబడు
నట్టిభూతాదియు బుద్దియుక్తంబైన మహద్వస్తువువలన గ్రహింపంబడు నిట్టి
సప్తావరణకంబయిన బ్రహ్మాండంబు మహార్ణవంబున మునింగి ప్రకృతియందు
లీనంబగు.

349


సీ.

మునినాథ యీవిశ్వమునకుఁ బ్రధానకారణభూత మైనట్టి ప్రకృతితత్వ
మవ్యక్తపురుషునియందు లీనంబగు నమ్మహాత్ముఁడు శుద్ధుఁ డక్షరుండు
భవ్యుఁ డేకాకి సర్వవ్యాపియై యుండు నతఁడు సర్వాత్మకుఁ డయినయట్టి
పరమాత్మునంశ సంభవుఁ డట్టి పరమాత్మునకు నామజాతు లెన్నఁడును లేవు


తే.

జ్ఞానమయుఁడు సత్తామాత్రుఁడై నిరస్త, భంగిఁ జెలువందు పరముఁడు బ్రహ్మ యీశ్వ
రుం డనంగను నెగడు నిరూఢవాచ, కములకును వాచ్యుఁడై యుండు నమలగతిని.[196]

350


తే.

అట్టిపరమాత్ముఁ డన విష్ణుఁ డవ్విభుండు, నిఖిలవేదాంతవేద్యుండు నిర్మలుండు
ముక్తికాముల కాహరిభ క్తియుక్తి, వలనఁ బునరాగమనములు గలుగకుండు.[197]

351


క.

ఆపరమాత్ముఁడు విష్ణుని, లోపల లీనమును బొందు లోకస్తుతుఁడై
దీపించు హరి సమస్త, వ్యాపియునై యెన్నఁడును లయము లేదు సుమీ.[198]

352


వ.

అని యిట్లు ప్రాకృతసంచరం బెఱింగించి పరాశరుండు వెండియు నాత్యంతిక
ప్రళయంబుఁ జెప్పువాఁడై మైత్రేయున కిట్లనియె.[199]

353

తే.

అనఘ యాధ్యాత్మికంబును నాధిభౌతి, కంబు నాధిదైవికమునాఁ గలుగునట్టి
వ్యధలు తాపత్రయంబులై యఖిలజంతు, వుల మహాదుఃఖములఁ బెట్టి యలఁపుచుండు.

354


క.

శారీరమానసములన, నారయ నిరుదెఱఁగులందు నాధ్యాత్మిక మా
శారీరము రోగములు మ, హారోషక్రోధమదము లగుమానసముల్.[200]

355


క.

ఇలఁబరులవలనఁ బ్రాణికిఁ, గలదుఃఖము లాధిభౌతికములన వాత
జ్వలనాదులపీడలనొ, ప్పలవడియుండుటయె యాధిభౌతికమయ్యెన్.[201]

356

దేహధారికిఁ గలుగుగర్భజన్మజరాదిక్లేశములవివరణము

వ.

ఇట్టి తాపత్రయంబు శరీరికి గర్భజన్మజరాజ్ఞానమృత్యునారకసంభవంబు లైన
యనేకభేదంబుల నత్యంతదుఃఖంబు లాపాదించు నెట్లనిన.[202]

357


సీ.

కోమలదేహంబుతో మలమధ్యంబునందు మావినిఁ బుట్టి యధికభుగ్న
మున నురమును బృష్ఠమును గూడి కంఠంబు కడుపులోన నడంగి కరచరణము
లంగంబుతోఁ గూడి యరఁటిపూవునుబోలె ముడిఁగి మూత్రములోన ముద్దగట్టి
తీక్ష్ణోష్ణతువరామ్లతిక్తామ్లములు తల్లి భుజియింపఁ దద్దుఃఖములకు నోర్చి


తే.

మేనఁ బ్రాణంబు గలిగియు మెలఁగరాక, వర్ధిలుచును బ్రజాపతి వాతనిహతి
చేతఁ దలక్రిందుగాఁబడ సూతిమారు, తమునఁ ద్రెళ్లింప మూర్ఛిల్లి ధరణిఁ ద్రెళ్లు.[203]

358


తే.

బాహ్యవాయువు సోఁకి విభ్రష్టమైన, యెఱుకతో దేహమంతయు నిఱచఁబట్టి
క్రకచములఁ గోసినట్టులఁ గంటకముల, నూఁదిన ట్లవయవంబులు నొచ్చుచుండు.[204]

359


ఆ.

ఒడలు గోఁకికొనఁగ నొదికిలఁ బవళింప, శక్తిలేక పెక్కుసంకటములఁ
బొంది స్నానపానభోజనోపాయంబు, లకు స్వతంత్రవృత్తి యొకటి లేక.

360


క.

ప్రువ్వులు నీఁగెలు దేహము, నొవ్వం గఱవంగ మిగుల నొచ్చి యధముఁడై
యివ్విధమున దుఃఖము లెడ, త్రెవ్వక వర్తించు జన్మదివసమునందున్.[205]

361


తే.

ఆధిభౌతికతాపంబులందుఁ గంది, సంతతంబును నజ్ఞానసంవృతాత్ముఁ

డగుచుఁ దాఁ దన్నెఱుంగక యధికమూఢ, వృత్తితో బాల్యముననుండి విప్రముఖ్య.[206]

362


తే.

యౌవనాదికాలంబుల నధికమత్తుఁ, డగుచు ధర్మవిరోధంబు లైనయర్థ
కామములు సంతరించుచుఁ గడయ గుఱుతు, లేనియీషణములచేత లీనుఁ డగుచు.[207]

363


వ.

శిశ్నోదరపరాయణుండై నరకప్రాప్తిహేతుభూతంబు లైనకర్మంబు లాచరిం
చుచు వార్ధకంబున.

364


సీ.

చంచలత్వముఁ బ్రతిశ్యాయంబు గలుగును దంతంబు లూడును దల వడంకు
సకలాంగకంబులఁ జపలత్వ మలఁచెడు శిరమును గడ్డంబు నరసియుండు
పెద్దవిన్నపము చెప్పినఁ గాని వినరాదు చెలువెలుం గిడకున్నఁ జెడును దృష్టి
శిథిలమై దేహంబు చిక్కు బీదనరంబు లవయవంబుల దట్ట మగుచునుండు


తే.

వెన్నెముక వంగు నాసలు విస్తరిల్లు, నల్పభోజన మగు నిద్ర యణఁగిపోవు
నడువఁగా నోపఁ డూఁతకో లిడకయున్న, ముదిసి ముప్పున నరుఁ డిట్లు ముట్టఁబడును.[208]

365


వ.

ఇట్లు వార్ధకదుఃఖంబు లనుభవించి యవసానకాలంబున.

366


సీ.

పలుకులు దొట్రిలు నెలుఁగు సన్నం బగు నలఁత దేహంబున నగ్గలించుఁ
గంపించు సకలాంగకములు వాఁకలిచెడు దాహంబు పొడము సత్వంబు పొలియుఁ
బరవశత్వం బంతఁ బాటిల్లుఁ జచ్చినవారితో భాషించు నోరలాల
దొరుఁగు వివర్ణంబు దోఁచుఁ జేతులు కాళ్లు మిగులశైత్యము లగు మీఁదు చూచు


తే.

ముక్కు గర్ణయుగంబును ముణిఁగివచ్చు, మర్మముల్ చించునట్టియామయము పెరిగి
ఱంపములచందముల విదారింపుచుండు, మరణ మాసన్న మైనను మానవునకు.[209]

367


క.

ధనధాన్యగృహసుహృజ్జన, తనయక్షేత్రాంగనావితానంబులపై
ఘనమైన మమత వొడమును, జనులకుఁ బరలోకగమనసమయమునందున్.[210]

368


క.

వ్యానాదిప్రాణంబులు, దానంబునఁ గూడ దండధరకింకరపీ
డానికరదుఃఖి యగుచును, మేను విడుచు యాతనాసమేతుం డగుచున్.

369

వ.

ఇవ్విధంబున యాతనాశరీరంబులఁ బ్రవేశించిన జంతువులను యామ్యకింకరులు
భయంకరము లైనకాలపాశంబుల సకలావయవంబులు బంధించి ప్రచండదండం
బులఁ గొట్టుచు బెట్టీడ్చికొని దక్షిణాభిముఖులై దుష్ప్రవేశంబులు దుర్గమంబు
లునైన వాలుకావహ్నియంత్రశస్త్రాస్త్రభీషణంబులైన యథోచితమార్గంబులం
గొనిపోయి నరకంబులం ద్రోచి.[211]

370


సీ.

బలుఱంపముల దేహములు ద్రవ్వఁగోసి యూషరకర్దమంబులఁ జదియఁ ద్రోచి
పటుకుఠారములచేఁ బరమొండెములు చేసి తలగానరా నేలఁ ద్రవ్వి పాఁతి
వాఁడికొఱ్ఱుల నాటవైచి మేడెములోనఁ బులులముందఱఁ గట్టి పొరలఁ ద్రోచి
క్రొవ్వాఁడియినుపముక్కుల కాకములచేతఁ బొడిపించి యుచ్చులు మెడలఁ బెట్టి


తే.

వ్రేలఁగట్టి దంచనముల వ్రేసి తప్త, తైలకుండంబులోఁ ద్రోచి దారుణాస్త్ర
శస్త్రనిహతుల నొంపించి జంతుతతుల, బాధసేయును గాలుని భటచయంబు.[212]

371


వ.

మఱియు ననేకపాపహేతూద్భవంబు లైనదుఃఖంబు లనేకకాలం బనుభవించి
తదనుభూతావసానకాలంబునఁ గ్రమ్మఱ గర్భంబు ప్రవేశించి యెప్పటియట్ల జరా
మరణనరకసంభవంబు లైనదుఃఖంబు లనుభవించుచుండు.[213]

372


క.

పుట్టును జావును జావును, బుట్టుకయునుగాని జీవముల కొకచోటన్
నెట్టుకొని యుండఁజెల్లదు, ముట్టినకర్మములు మూరి మోచినకతనన్.[214]

373


తే.

అర్థ మార్జించునప్పుడు నది సురక్షి, తంబు గావించునప్పుడుఁ దద్వియోగ
మైనయప్పుడు దుఃఖంబె కాని తనకుఁ, గలిమి సుఖ మని చెప్పుట కానిపలుకు.[215]

374


ఆ.

ప్రాప్తిలేమి మేలుపడయుదు నని ప్రయా, సంబుతోడఁ దిరిగి సంఘటింప
కున్ని దుఃఖపడుచునుండుఁ గోరనినాడు, కోరనైతి ననుచుఁ గోరుచుండు.

375


క.

వనితలుఁ జెలులుం జుట్టలు, దనయులు క్షేత్రములు నిల్లు ధనధాన్యములున్
దనకును బోయిన వచ్చిన, ఘనదుఃఖమె కాని మేలు కలుగదు సుమ్మీ.

376


ఆ.

పరమదుఃఖపాదపమునకు బీజముల్, కర్మచయము లిట్టుగాన నుభయ
కర్మమయశరీరకార్పాసబీజంబుఁ, బోలె నవధిలేక పుట్టుఁ బొలియు.[216]

377

జన్మజరాదిక్లేశనివృత్తిహేతుభూతభగవచ్ఛబ్దవాసుదేవశబ్దవాచ్యవస్తువివేచనము

తే.

గర్భజన్మజరామృత్యుకాలముల శ, రీరి సంసారమార్తాండఘోరతాప
ములకుఁ జిక్కక ఘనమైన మోక్షతరువు, నీడ నుండక సుఖ మేల నివ్వటిల్లు.

378

క.

ఈయాత్యంతికదుఃఖము, పాయ నుపాయంబు వినుము పరమం బగుపా
రాయణ భగవన్నామము, ధ్యేయం బని జ్ఞానవిదులు తెలిసిరి మొదలన్.[217]

379


క.

భగవత్ప్రాప్తికి హేతువు, లగుకర్మజ్ఞానియుగ్మ మాగమములచేఁ
దగులు వివేకముచేతను, జగతీసురముఖ్య చెప్పఁజను పూర్వమునన్.

380


వ.

అది యెట్లంటేని యాగమమయంబును జ్ఞానమయంబును నైన శబ్దబ్రహ్మపర
బ్రహ్మంబులు రెండును దారుణంబైన యజ్ఞానమహాంధకారంబునకు సూర్యదీప్తుల
విధంబునఁ దేజరిల్లు శబ్దబ్రహ్మనిష్ణాత్ము లగురుహేతులకుఁగాని పరబ్రహ్మస్వరూ
పంబు దెలియదు కావున నీరెండుతెఱంగులు ఋగ్యజుస్సామవేదంబులయం
దును వేదవాదులచేతఁ జెప్పంబడునని చెప్పి మఱియు నిట్లనియె.

381


క.

అనఘ యధర్వణవేదం, బున నివి యపరాపరాఖ్యములుగాఁ జెప్పం
జనుఁ బరమముక్తిహేతువు, వినుము పరము కర్మకాండ వేదమయ మగున్.

382


క.

పరవిద్య యనఁగ బ్రహ్మ, స్వరూప మగునట్టిపరము సర్వజ్ఞానో
త్కరమతులు దెలిసి తక్కిన, వెరవులకుం జనరు సద్వివేకము పేర్మిన్.

383


క.

అవ్యయ మచింత్య మజరం, బవ్య క్త మరూప మజర మతిశుద్ధ మజం
బవ్యాహత మనపాయము, భవ్య మకారణము సూవె బ్రహ్మం బనఘా.[218]

384


ఆ.

అదియె బ్రహ్మతత్వ మదియె పరమధామ, మదియె మోక్షవృక్ష మదియె విష్ణు
పదము చిద్వికాస మది భగద్వాచ్య, మదియె తెలిసికొనుము హృదయమునను.

385


వ.

స్వరూపరహితం బైనభగవద్వాచకం బుపచారమాత్రం బగునివ్వచనం బత్యంత
శుద్ధంబగు నణిమాదిమహైశ్వర్యధుర్యంబునునైన బ్రహ్మంబు నంద చెప్పంబడుం
గావున భగవన్నామధేయంబునకు నిర్వచనంబు చెప్పెద.

386


క.

విను సంభవంబు భర్తయు, నను రెండు భకారమునకు నర్థము పుట్టిం
చి నడపి లయముం బొందిం, చినకతమున నర్థయుక్తిఁ జెప్పఁగ నమరున్.

387


క.

తుర్యము విజ్ఞానము నై, శ్వర్యము సంపదయు యశము వైరాగ్యంబున్
వీర్యము నను నీయాఱును, నార్యా భగ మనుచు విబుధు లాడిరి మొదలన్.

388


తే.

షడ్గుణైశ్వర్యమయచరాచరమహాప్ర, పంచమునఁ దాను దనలోఁ బ్రపంచమును వ
సించియున్న కారణమునఁ జేసి బుధుల, భగవదర్థ మీరీతిఁ జెప్పఁబడును.

389


వ.

ఇట్టి భగవద్వాచకంబు పరబ్రహ్మస్వరూపి యైనవాసుదేవవాచకంబు గాని యితర

దేవతావాచకంబుగా దీయర్థంబు తొల్లి జనకసంభవుం డైన కేశిధ్వజుం డను
రాజర్షి ఖాండిక్యజనకున కుపదేశించెనని మైత్రేయుం డిట్లనియె.

390

కేశిధ్వజఖాండిక్యజనకసంవాదము

క.

మునివల్లభ కేశిధ్వజుఁ, డనఁగా ఖాండిక్యజనకుఁ డనఁగా నెవ్వా
రనఘాత్మ వారలకు యో, గనిమిత్తము వాద మేల గలిగెను మొదలన్.

391


క.

అనవుడుఁ బరాశరుం డి, ట్లను జనకునికి కులజుఁ డైనయమితధ్వజుఁ డ
త్యనఘుని ఖాండిక్యుని లో, కనుతుఁ గృతధ్వజునిఁ గాంచె గాదిలిసుతులన్.

392


వ.

వారిరువురుం దండ్రిపరోక్షంబునఁ బైతృకంబైన రాజ్యంబు సమభాగంబుగా
ననుభవించుచుండ నాకృతధ్వజనందనుం డైన కేశిధ్వజుండు మహాతపోధనుం
డును ఆత్మవిద్యాపరాయణుండును, బలపరాక్రమధుర్యుండును నై యవిద్య
వలన సంసారంబుఁ దరియింతునని నిశ్చయించి తండ్రి పిమ్మట నాత్మీయరాజ్య
భోగంబు ననుభవించుచుండె.[219]

393


తే.

కర్మమార్గమునను ఖాండిక్యజనకుండు, వసుధ యేలుచుండె వారిలోనఁ
గడువిరోధమైన ఖాండిక్యు గెలిచి కే, శిధ్వజుండు వానిసిరులు గొనియె.

394


క.

ఖాండిక్యుఁడు సకలమహీ, మండలమును గోలుపోయి మంత్రులుఁ దానున్
జండతరదుర్గములలో, నుండెను కేశిధ్వజుండు యుర్వర యేలన్.

395


మ.

ఆకేశిధ్వజుఁ డొక్కనా డొకమహాయజ్ఞంబు గావింపఁగా
నాకాలంబున ఘర్మధేనువు మహోగ్రారణ్యదేశంబులోఁ
జీకాకై పులిచేతఁ బట్టువడి చచ్చెన్ జచ్చినన్ దీనతన్
భూకాంతుండు మఘంబు మాని మిగులదుఃఖాకులస్వాంతుఁడై.[220]

396


వ.

తదీయదోషంబునకుం దగిన ప్రాయశ్చిత్తంబు ఋత్విజుల నడిగిన వా రెఱుంగక
కశేరుం జెప్పిన నారాజమునీంద్రు నడిగె నతండు భార్గవు నడుగుమనియె భార్గ
వుండు శునకునిం జెప్పిన నారాజు శునకు నడిగిన నతం డిట్లనియె.

397


మ.

అవనీనాయక గోవధంబునకుఁ బ్రాయశ్చిత్తసత్కర్మముల్
వివరింపంగ భవద్విరోధి యగుఖాండిక్యుండు దా నేర్చు వా
నివివేకంబునఁ బోల వెట్టి మతులున్ నీవేగి యారాజయో
గివరున్ వేఁడుము వానిచిత్త మకలంకీభూత మెప్పట్టునన్.[221]

398


క.

అని చెప్పి శునకుఁ డెందేఁ, జనియెను గేశిధ్వజుండు సందేహము లె
ల్లను విడిచి పూర్వవైరము, మనమునఁ జొరనీక కడుసమంజసవృత్తిన్.[222]

399

వ.

కృష్ణాజినపరివృతుండును మృగశృంగహస్తుండును నై రథం బెక్కి యొక్కం
డును ఖాండిక్యుకడకు నరిగె ని ట్లనతిదూరంబున వచ్చు కేశిధ్వజుం బొడగాంచి
పూర్వవైరంబు దలంచి ససంభ్రమంబుగా మంత్రులు తమరాజుతో నిట్లనిరి.

400


మ.

మనశత్రుం డిదె జోడుమైఁ బొదివి భీమం బైనఖడ్గంబు గై
కొని తే రెక్కి రణంబు సేయ నిదె పైకొన్నాఁడు వీఁ డొంటిపా
టునఁ జిక్కెన్ వధియింతమంచుఁ గడు నాటోపంబు దీపింప బో
రున శస్త్రాస్త్రచయంబు గైకొని మహారోషంబున జేరినన్.[223]

401


క.

వారలఁ గనుఁగొని వినయము, తోరంబుగ నతఁడు పలుకు దోర్బలమున మీ
తో రణము చేసి గెలువం, గా రాను విరోధ మాత్మఁ గలుగదు నాకున్.

402


ఆ.

క్రతువు సేయునపుడు ఘర్మధేనువు పులి, చేతఁ జచ్చె నందుఁ జెందునట్టి
పాతకంబు నన్నుఁ బాయఁ బ్రాయశ్చిత్త, విధు లొనర్పఁదగినబుధుల నరసి.

403


క.

శునకమునివలన ఖాండి, క్యునికందువ యెఱిఁగి శాస్త్రకుశలుండగు నీ
తనిచే ధర్మరహస్యము, లొనరంగా నెఱుఁగవచ్చుచున్నాఁడఁ జుఁడీ.[224]

404


వ.

అనుటయు.

405


క.

ఎక్కడి ధర్మరహస్యము, లెక్కడి చుట్టఱిక మింక నేటి వినయముల్
మొక్కలవు శత్రు డొంటిన్, జిక్కినఁ జంపుటయె నీతి సిరులు వలసినన్.[225]

406


క.

అని మంత్రు లిట్లు పలికిన, విని ఖాండిక్యుండు మీరు వెఱ్ఱులు దోషం
బున వచ్చు నల్పసుఖములు, గని పుణ్యము పారలౌకికము లుడుగుదురే.

407


మ.

వైరి నిరాయుధుం డగుచు వచ్చినఁ గాచుటకంటెఁ బుణ్యముల్
చేరునె క్రూరకర్మములచేఁ బరమార్థరహస్యవేది యీ
ధీరుఁడు పూర్వవైరము మదిం దలపోయక సాధువేష మే
పారఁగవచ్చి న న్నొకరహస్యము వేఁడినఁ జెప్పు టొప్పదే.

408


ఆ.

అనుచు వారుఁ దాను నతనికి నెదురేగి, తొడుకపోయి ప్రియముతోడఁ బూజ
లొసఁగి కుశల మడిగి యున్నఖాండిక్యునిఁ, గాంచి కేశిధ్వజుఁడు గారవమున.

409


క.

తన చనుదెంచినకార్యము, వినుపించిన నవ్విభుండు వేదోక్తముగా
ఘనపాపంబులు పాపఁద, గిన ప్రాయశ్చిత్తమునకుఁ గ్రియ లెఱిఁగించెన్.

410


వ.

కేశిధ్వజుండు నతనివలన సమస్తంబును నెఱింగి మగిడి నిజనివాసంబునకు వచ్చి
యథోక్తప్రకారంబులైన ప్రాయశ్చిత్తంబువలన దోషరహితుండై యజ్ఞంబు
సాంగోపాంగంబుగా నాచరించి ఋత్విజులకు సదస్యులకు యథోక్తదక్షిణ
లొసంగి దీనానాథజనంబులకుఁ గోరినధనంబు లెల్ల నొసంగి కృతకృత్యుండై
యొక్కనాడు.

411

మ.

అనురక్తిన్ దనపాతకంబులకుఁ బ్రాయశ్చిత్తకర్మంబు చె
ప్పినఖాండిక్యుని కిష్టమైనయవి సంప్రీతిన్ సమర్పింతు నే
నని కేశిధ్వజుఁ డాదరం బొదవ భృత్యామాత్యవర్గంబుతోఁ
జని వైదేహకులావతంసుఁ గని శశ్వద్భక్తితో నిట్లనున్.

412


ఆ.

ఆత్మఁ బూర్వవైర మణుమాత్రమునులేక, పాతకంబుఁ దనకుఁ బాపినట్టి
గురుఁడ వట్టినీకు గురుదక్షిణార్థ మే, మైన నిచ్చువాఁడ నడుగవలయు.

413


తే.

అనిన మంత్రులు ఖాండిక్యు నాననంబు, చూచి మును గోలుపడిన యస్తోకరాజ్య
మహిమ లన్నియు నాతని మగుడ నడుగు, మనిన నవ్వుచు వారితో నాతఁ డనియె.[226]

414


తే.

అర్థ మార్జించుటయు రాజ్య మాసపడుట, యును బ్రథానులమత మది యొల్ల నితని
వలనఁ బరమార్థయోగంబుఁ దెలిసి బ్రహ్మ, పదము నొందెద నీయల్పఫలము లొల్ల.

415


మ.

అని కేశిధ్వజుఁ జూచి యిట్లను మహాత్మా నాకు నీచేత మో
క్షనిరూఢం బగుయోగమార్గ మెఱుఁగంగా వేడ్కమైయున్న దీ
వినుతం బైనరహస్యమున్ దెలిపినన్ విజ్ఞానపారీణుఁగా
నొనరింపం దగునన్న నాతనికి నయ్యుర్వీశ్వరుం డిట్లనున్.

416


తే.

రాజవల్లభులకు రాజ్యవైభవముల, కంటెఁ బ్రియము లెవ్వి గలవు నీవు
పరులయెత్తులేని ధరణి నన్నడుగక, యనఘ యోగవిద్య యడిగి తేల.[227]

417


వ.

 అనిన ఖాండిక్యుం డిట్లనియె.

418


ఆ.

శత్రువరులఁ బోరఁ జంపుటయును బ్రజా, పాలనంబు భూమి యేలుటయును
ధరణివల్లభులకు ధర్మంబు లివి యుప, భోగకారణములు భోగులకును.

419


సీ.

అవనీశ విను మవిద్యకు మూలమగు సిరిబంధంబు కడలేనిపాతకముల
వలనఁ గల్గినయర్థములు ధర్మములకు నిరోధంబులగు సత్పురుషులు క్షత్ర
బంధులఁ బ్రార్థించి వడసిన యర్థముల్ మేలుగాఁ దలఁపరు మీఁదు దెలిసి
కావున నజ్ఞానకారణం బైనయీరాజ్యంబు మమతలఁ గ్రాఁగనున్న


తే.

చెడుగు గోరు సహంమానసీధుపాన, మత్తచిత్తులనడతలు మాకు లేవు
దివ్యయోగంబు మా కుపదేశ మిమ్ము, తక్కినవి యేమి యిచ్చినఁ దలఁప నొల్ల.[228]

420


వ.

అనినం గేశిధ్వజుం డిట్లనియె.

421

కేశిధ్వజుండు ఖాండిక్యజనకునకు యోగవిద్య నుపదేశించుట

ఆ.

ఏ నవిద్యవలన నెప్పుడు మృత్యువు, నొడుతు ననుచుఁ దలఁచుచుంటఁ జేసి
యవనిరాజ్యమెల్ల నంచితైశ్వర్యమై, కానిపించు నంతకాలములను.[229]

422


ఆ.

ఆత్మగాని వస్తువం దాత్మ యిది యని, తలఁపుసేయుటయును దనకు రాని
సొము తనది యనెడిచులుకఁదనంబు బీ, జము లవిద్యయనెడిసాలమునకు.[230]

423


క.

ఈపాంచభౌతికంబై, దీపించినదేహమునను దేహి మహామో
హోపాధికుఁడై యహ మిక, యాపాదించుచు దురాత్ముఁడై యెల్లపుడున్.

424


ఆ.

పంచభూతములకు బాహ్యమైయున్న నీ, యాత్మయందు నున్నయాత్మబుద్ధి
నీకళేబరముల నెవ్వఁడు సేయును, వసుధ గుమతి యైనవాఁడెకాక.

425


ఆ.

ఈకళేబరముల కెప్పుడు నుపభోగ, కారణంబులైన దారగృహధ
నాదులందు మమత లనయంబుఁ గావించు, వాఁడె దుర్వివేకి వసుమతీశ.

426


క.

పురుషుఁ డుపభోగవాంఛా, పరుఁడై దేహముల నిలిచి బహుకర్మంబుల్
పరువడి నొనర్చుఁ గర్మో, త్కరములు బంధముల కెల్లఁ గారణమయ్యెన్.[231]

427


క.

పార్థివమగు నీదేహము, పార్థివవర్గములచేతఁ బరితుష్టమగున్
స్వార్థముగ మద్దృహంబులు, పార్థివ మృజ్జలముచేతఁ బదిలమగుగతిన్.[232]

428


ఆ.

శతసహస్రకోటిసంఖ్యలు గలుగుసం, సారవర్గములను సంచరించి
ప్రాణివాసన లనురేణువులోఁ జిక్కి, మోహగహనమధ్యమునఁ జరించు.

429

ఆ.

కన్నులందు ధూళి గప్పినతెరువరి, వేఁడినీళ్లవలన విశదదృష్టి
నొందినట్లు కర్మయుతమైన యజ్ఞాన, మనఘ బోధవలన నణఁగిపోవు.

430


వ.

అజ్ఞానంబు విడిచినపుడె మోక్షంబు గలుగును.

431


క.

శీతలజలములు దహనము, చేతం గడునుష్ణమైన చెలువున మమకా
రాతిశయం బగు ప్రకృతిప, రీతంబై కుందుఁ బో శరీరి నరేంద్రా.[233]

432


వ.

కావునసకలకల్మషనియోగంబును గైవల్యమార్గసంయోగంబును నైనయోగంబు
నేర్చుటకంటె మోక్షసాధంబు లేదనినఁ గేశిధ్వజునకు ఖాండిక్యుం డిట్లనియె.

433


ఆ.

నిమికులంబునందు నీకంటె యోగవి, ద్యాఘనుండు పుట్టఁ డవనిలోనఁ
గాన యోగవిద్య గారవంబున నాకుఁ, జెప్పి ననుఁ గృతార్థుఁ జేయవలయు.

434


వ.

అనిన నతండు ప్రసన్నహృదయుండై ఖాండిక్యున కిట్లనియె.

435


సీ.

జగతీశ బంధమోక్షములకు హేతువు చిత్త మాచిత్త మశేషవిషయ
తతిఁ గూడెనేని బంధము నొందుఁ గూడక యున్న మోక్షంబును నొందుచుండు
గావున మనసు నానావిషయములకుఁ బోనీక బ్రహ్మంబుఁ బొందెనేని
నాత్మభావముఁ బొందు నయము సూదంటురాతికి వశమైనట్లు ప్రకటమైన


తే.

వాసనలచేత నాత్మభావమునఁ బొందుఁ, బ్రాణి యాత్మప్రయత్నసంపదలఁ గడు న
పేక్షగలబుద్ధితో నుండి యెల్లప్రొద్దు, నొనర బ్రహ్మంబుఁ దలఁచుట యోగమగును.[234]

436


ఆ.

అట్టి యోగవిద్యయందు నిరూఢుఁడై, యున్నవాఁడె దివ్యయోగనిరతుఁ
డతఁడె మోక్షయుక్తుఁ డతఁడె సమాధిసం, పన్నుఁ డతఁడె బ్రహ్మపారగుండు.

437


ఆ.

యోగపరుఁడు దివ్యయోగవిద్యాభ్యాస, మాచరించుచుండ నంతరాయ
మయ్యెనేని వాని కన్యజన్మమునందు, నైన ముక్తిగలుగు మానవేంద్ర.[235]

438


ఆ.

అప్రతిగ్రహంబు నతిశౌచమును నహిం, సయు నిజంబు బ్రహ్మచర్యమతము
నాత్మవశముఁ జేయునదియు నస్తేయంబు, యోగఫలము గోరకుండుటయును.[236]

439

యమనియమాదియోగలక్షణములు

క.

ఏచిన నియతియుఁ దపమును, శౌచము వేదమును గలిగి సంతోషముతో
వాచవులు విడిచి బ్రహ్మముఁ, జూచుట యమయోగమండ్రు సుజనులు మొదలన్.

440


తే.

మనుజవల్లభ యనియె కామ్యంబులైన, కడువిశేషఫలంబులు గలుగఁజేయు
వినుము కామ్యంబు లగునేని వినుతమోక్ష, సిద్ధి గావించుఁ బ్రాణికి సిద్ధముగను.

441

క.

సకలాసనములలోపల, నొకభద్రాసనము పూని యోగియు గుణపం
చకయుతముగఁ దనచిత్తముఁ, బ్రకటబ్రహ్మమునఁ గూర్పఁబడ నియమ మగున్.

442


ఆ.

ఒలసి ప్రాణవాయువులఁ దనవశముగాఁ, జేసి బ్రహ్మతత్త్వసిద్ధిఁ గాంచి
యోగమార్గసరణి నుంట ప్రాణాయామ, యోగ మండ్రు పరమయోగవిదులు.[237]

443


తే.

ఊర్ధ్వముఖమైన ప్రాణవాయువు నధోము, ఖమున వర్తిలు నయ్యపానము పరస్ప
రాభిభవములు గాకుండ నాసమాన, మొనర నిలుపుట లంబనయోగ మండ్రు.

444


క.

ఆలంబయోగవిద్యా, శీలత శబ్దాదులకు వశీకర మగు న
క్షాళిఁ దనవశముఁ జేయుట, వాలినఁ బ్రత్యాహరాఖ్యవరయోగ మగున్.[238]

445


తే.

ఇట్టియోగంబు లెల్ల నరేంద్ర పరమ, పావనుం డైనయిందిరాపతికి స్థూల
రూపములు వీని నెఱుఁగక రూఢి గాఁగ, సూక్ష్మరూపంబు దెలియదు సులభముగను.

446


క.

అనవుడు ఖాండిక్యుం డిట్లను సకలాధారుఁ డైనహరి నేగతి భా
వన చేసి యోగి మోక్షం, బునఁ బొందు నెఱుంగవలయంఁ బో నాకనినన్.

447

భావనాత్రయవివరణము

వ.

కేశిధ్వజుం డిట్లనియె.

448


సీ.

యోగిచిత్తంబున నోరంతప్రొద్దును దీపించువిష్ణునిదివ్యమూర్తి
స్థూలరూపంబును సూక్ష్మరూపంబును నైయుండు నిది యపరాపరాఖ్య
సంజ్ఞలఁ జెప్పంగఁ జను నివియన్నియు భావనాత్రితయసంపత్తివలన
నెఱుఁగంగఁదగు నివి యేర్పడఁ జెప్పెదఁ బ్రహ్మభావనయును బరమకర్మ


తే.

భావనయు బ్రహ్మకర్మాఖ్యభావనయు న, నంగ నీభావనలచేత నంగజాత
గురుఁడు భావింపఁగాఁబడి పరమమైన, మోక్షపద మిచ్చు ముక్తికాముకులకెల్ల.

449


చ.

హరిపదభక్తులైనసనకాదిమునీంద్రులు బ్రహ్మభావనా
పరులు పురందరాదినిరపాయచరిత్రులు కర్మభావనా
పరిచితు లబ్జజాదు లగుభవ్యవివేకులు బ్రహ్మకర్మత
త్పరతరదివ్యభావనలఁ బాటిలినారు పురాతనంబులన్.[239]

450

క.

ఈమూఁడుభావనలచే, నేమఱక ముకుందుఁ దలఁచి యెప్పుడు యోగ
శ్రీమహితబుద్ధినుండుట, భూమీశ్వర ధారణాఖ్యముగఁ జెప్పఁబడున్.

451


తే.

ఈచరాచరమైనట్టి యీ ప్రపంచ, మీశ్వరునిస్థూలరూపంబ యెఱిఁగికొనుము
మానవేంద్ర సత్తామాత్ర మైనమూర్తి, నమరు సూక్ష్మరూప మైనపరాపరములు.

452


తే.

స్థూలసూక్ష్మరూపంబులతోడి వాసు, దేవు నెవ్వాఁడు భావనాత్రితయకలిత
బుద్ధిఁ దలపోయు నతఁడె పో భూవరేణ్య, ధ్యాని యాత్రజ్ఞులకు నీమతంబు మేలు.

453


తే.

విష్ణుశక్తి చరాచరవితతియందుఁ, దారతమ్యప్రవృత్తులఁ దనరియుండు
నట్టి జగదాత్మకుం డైనయాదిదేవు, భేదవాదులు చూతురు భేదముగను.

454


వ.

ఇవ్విధంబునఁ జెప్పంబడిన యోగ విద్యాభ్యాసంబువలన జితశ్రము లయినమహా
త్ములయాత్మయందుఁ బ్రకాశితుండయి పరమాత్ముం డయిన లక్ష్మీకాంతుండు
మనోజనితంబు లయినకిల్బిషంబుల నణంచి పరమసాధనంబు లైనశుభంబులఁ
గావించునని యిట్లు సంక్షేపరూపంబుగా నధ్యాత్మవిషయం బుపదేశించినఁ
గృతార్థుండై ఖాండిక్యుం డిట్లనియె.

455


క.

నృపచంద్ర నీవు నా కిపు, డుపదేశము చేసినట్టి యోగమువలనన్
విపులజ్ఞానము వొడమెను, ప్రసన్న మయ్యె మనసు పద్మాక్షునిపై.

456


వ.

అని బహుప్రకారంబులం బూజించినం బ్రీతుండై కేశిధ్వజుండు నిజపురంబున
కరిగె ఖాండిక్యుండును దనరాజ్యంబునకుఁ గుమారునిం బట్టంబు గట్టి యోగ
విద్యాభ్యాసంబువలన సకలసుఖంబులం బడసి సుఖంబుండె నంత.

457


క.

ఘనసుతుఁ డగు కేశిధ్వజ, జనకుఁడు తనమిథిల కరిగి సత్కర్మములన్
వనజాయతాక్షు నారా, ధన సేయుచుఁ బెక్కుసప్తఠతంతులు సేసెన్.[240]

458


ఆ.

ఇవ్విధమున నతఁ డనేకయజ్ఞంబులు, చేసి వాసుదేవుచేత సకల
వైభవములుఁ బడసి ప్రాభవం బేపార, లీలతో ధరిత్రి యేలుచుండె.

459


వ.

ఇవ్విధంబున జనకచక్రవర్తి సకలశోభనకరుం డయినలక్ష్మీవల్లభుకృపాకటాక్షంబు
వలన ననేకపుత్రపౌత్రాభివృద్ధియును సముద్రవేలావలయితవసుంధరాచక్ర
సామ్రాజ్యలక్ష్మీనివాసంబును అణిమాదిమహైశ్వర్యధుర్యప్రాభవంబును గలిగి
సకలలోకంబులు జయపెట్ట మిథిలాపురంబున రాజ్యంబు సేయుచుండె నని పలికి
పరాశరుండు వెండియు నిట్లనియె.[241]

460

తే.

సర్గమన్వంతరప్రతిసర్గములును, వంశవంశానుచరితాభివర్ణనములు
నీకు నే వినిపించితి నిపుణఫణితి, నింక నెయ్యది విన నీకు నిష్ట మనిన.

461


క.

మైత్రేయుఁ డతని కిట్లను, ధాత్రీసురముఖ్య నీకతంబున జగదే
కత్రాణపరాయణుఁ డగు, ధాత్రీధరుకథలు వింటి ధన్యుఁడ నైతిన్.

462


క.

నా కింక నడుగఁదగినవి, యేకథలును లేవు చిత్త మెంతయు విశదం
బై కడలేక వివేక, శ్రీకంబై యున్నయది విశుద్ధచరిత్రా.[242]

463


శా.

దేవా నాహృదయంబులోనఁ గలసందేహాపనాయార్థ మి
చ్ఛావృత్తిగా గడుదుస్తరంబు లగుపృచ్ఛల్ పెక్కు గావించి మీ
భావం బెంతయు నొవ్వఁజేసితిఁ గృపాపారీణతన్ మన్ననల్
గావింపం దగునన్న నమ్ముని కృపాలంకారుఁడై యిట్లనున్.[243]

464


క.

నీవు మును నాకుఁ జేసిన, సేవవలన దేవతలకు సిద్ధింపని యీ
శ్రీవిష్ణుపురాణము స, ద్భావముతోఁ జెప్పవలసెఁ బరమప్రీతిన్.

465

శ్రీవిష్ణుపురాణపఠనశ్రవణలేఖనాదిఫలనివేదనము

సీ.

దేవగంధర్వదైతేయాప్సరస్సిద్ధసాధ్యకిన్నరయక్షసన్మునీంద్ర
దనుజపలాశవిద్యాధరవసుపక్షిమృగసరీసృపపశుమేదినీశ
పుణ్యనదీనదారణ్యవర్ణాశ్రమసాగరగ్రహతారకాగజేంద్ర
వర్ణాశ్రమాచారవసుమతీవల్లభజననస్థితులులయసంచరాగ్ని


తే.

హోత్రమన్వంతరర్తుమాసత్రికాల, వేదశాస్త్రపురాణముల్ విష్ణుమూర్తు
లేతదాఖ్యానములు విన్న నెల్లవారు, సకలశుభములు గాంతురు సన్మునీంద్ర.[244]

466


మ.

ఈసకలంబున వినుతికెక్కిన విష్ణుపురాణసంహిత
వ్రాసినఁ బేరుకొన్న వినిన బఠియించిన భక్తి నర్చనల్
చేసినఁ బుణ్యవంతులకుఁ జెందు శుభంబులు భక్తవత్సలుం
డాసరసీరుహాక్షుఁడు దయఁ గృపచేయు నభీప్సితార్థముల్.

467


ఆ.

అశ్వమేధవేళ నవభృథస్నానంబు, చేసినట్టిఫలముఁ జెందు నరుఁడు
విమలభక్తితోడ విష్ణుపురాణంబు, సంతసమున విన్నఁ జదువుకొన్న.

468


క.

మైత్రేయ ప్రయోగఁ గురు, క్షేత్రంబునఁ బుష్కరమునఁ గేశవపూజా
స్తోత్రములఁ గొలుచు ఫలము స, ర్వత్ర గలుగు నరున కీపురాణము విన్నన్.

469


ఆ.

అనఘ యేఁడుకాల మగ్నిహోత్రము సువృత్త, ముగ నాచరించు తత్ఫలంబు
గాంచు మానవుం డొకానొకవేళ నే, తత్పురాణకథలు దగిలి విన్న.[245]

470

ఆ.

ఒనర జ్యేష్ఠమాసమున సితద్వాదశి, యందు యమునఁ దీర్థమాడి మధుర
కరిగి విష్ణుఁ గొలిచినట్టి ఫలంబులు, కలుగు నీపురాణకథలు విన్న.[246]

471


క.

ఈవిష్ణుపురాణములో, నేవంకను నొక్కకథ సమాహితబుద్ధిన్
భావించి విన్నవారికి, భావజగురుఁ డశ్వమేధఫలము నొసంగున్.[247]

472


క.

శ్రావణమాసంబున నరుఁ, డీవిష్ణుపురాణకథల నేకాధ్యాయం
బేవంకఁ బఠనచేసినఁ, బోవును దుస్స్వప్న దోషములు మనుజులకున్.

473


శా.

వేదోక్తంబుల బ్రాహ్మణోత్తముల కుర్వీదానగోదానక
న్యాదానంబులు మేరగాఁ గలుగుదానంబుల్ ప్రమోదంబుతో
నాదిత్యగ్రహణంబునన్ యమునలో నర్పించుపుణ్యంబు లా
పాదించు నరుఁ డీవురాణ మతితాత్పర్యంబుతో వ్రాసినన్.[248]

474


క.

దురితములు పాయుఁ గీర్తియు, హరిభక్తియుఁ గలుగు నాయురారోగ్యము భా
సురతేజంబును బొందును, నరులకు నీకథలు విన్న నతిమోదమునన్.

475


క.

విను నేను బులస్త్యమహా, మునివరమున నీపురాణము సమస్తంబు
ఒనరఁగ నినువంటితపో, ధనునకు వినిపింపఁ గంటి ధన్యుఁడనైతిన్.[249]

476


క.

ఈకలియుగాంతమునను శమీకుఁడు నీచేత విని సమాచీనవచ
శ్శ్రీకరముగఁ బౌరాణికుఁ, డై కృతయుగమునను జదువు నతఁ డెల్లెడలన్.[250]

477


ఉ.

కావున నీపురాణము జగన్నుతమై కలికాలదోషముల్
పోవఁగఁజేయు భక్తిపరిపూతముగా వినినన్ బఠించినన్
నీవు మహానుభావుఁడవు నీజననంబు పవిత్రమయ్యె ల
క్ష్మీవిభుభక్తి నేమఱకు చిత్తములోపలఁ దాపసోత్తమా.

478


క.

అని యిబ్భంగిఁ బరాశరముని మైత్రేయునకు వేదమూలంబై పెం
పొనరినవిష్ణుపురాణము, వినిపించె సమాప్తముగ వివేకప్రౌఢిన్.

479


ఉ.

సత్యవచోవిలాస రిపుశాసన సంగరపార్థ పల్లవా
దిత్య సమస్తబాంధవవిధేయ వనీపకపారిజాత సా
హిత్యకళాభివర్ధన మహీనుత వెన్నెలగంటిసూరయా

మాత్యకవిత్వవైభవరమాపరిశోభితహృత్పయోరుహా.[251]

480


క.

తిరుమలతాతయవంశా, భరణశ్రీసింగరార్యపరమగురుకృపా
పరిపూర్ణహృదయయాచక, వరచేతఃకమలినీదివాకరమూర్తీ.[252]

481


శ్రీరమణవృత్తము.

 సంగరధనంజయ విశాలమహిమాస్పద ప్రశస్తగుణశోభిత మహీభృ
త్పుంగవసభాభినయభూరిగుణమండిత నభోమణినిభప్రకటతేజ
స్సంగత మహాసుకవిసన్నుతచరిత్ర రిపుశాసనపరాక్రమకసద్ది
వ్యాంగదసముజ్జ్వలమహామణివిభాంచితపదాంబురుహ భావభవరూపా.[253]

482


గద్యము.

ఇది శ్రీమదమరనామాత్యపుత్ర హరితగోత్రపవిత్ర సుకవిజనవిధేయ
వెన్నెలకంటిసూరయనామధేయప్రణీతంబైన యాదిమహాపురాణంబగు బ్రహ్మం
డంబునందలి పరాశరసంహితయైన శ్రీవిష్ణుపురాణంబునందు బలదామోదరులు
సాందీపునివలన విద్యాభ్యాసంబు సేయుటయు కాలయవనువధయును బల
భద్రుండు వరుణదేవుచేత వరంబులు గొనుటయు రుక్మిణీకల్యాణంబును నరకా
సురవధయును పారిజాతాపహరణంబును బాణాసురయుద్ధంబును పౌండ్ర
వాసుదేవునిమరణంబును దూర్వాసుశాపంబున యాదవులు పరలోకగతులగు
టయు రామకృష్ణులపరోక్షంబును అష్టావక్రుచరిత్రంబును కలియుగధర్మం
బును నైమిత్తికప్రాకృతాత్యంతికప్రళయంబులును కేశిధ్వజఖాండిక్యజనకసం
వాదంబును యోగవిద్యాప్రశంసయు నన్నది సర్వంబును అష్టమాశ్వాసము.[254]


శ్రీవిష్ణుపురాణము - సంపూర్ణము

————

కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం
వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం
కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే,
నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే
యదక్షపరిభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్,
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమో స్తుతే.

శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః

This work was published before January 1, 1930, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. అమరభూమీరుహ = కల్పవృక్షమా.
  2. ముసలచక్రధరులు = బలరామకృష్ణులు.
  3. అద్భుతమనస్కుఁడు = ఆశ్చర్యము నొందిన మనసు గలవాఁడు, చెలఁగి = సంతోషించి.
  4. పొంతన్ = సమీపమున, మన్ననలన్ = గౌరవములతో.
  5. బోరనన్ = తటాలున.
  6. శరనిధి = సముద్రము, తదస్థి = వానియెముక.
  7. ఆదిత్యవరులకున్ = దేవతాశ్రేష్ఠులకు, మానుగన్ = ఒప్పిదముగా, ఓర్చి = ఓడించి - గెలిచి, వెసన్ = శీఘ్రముగా.
  8. యాతనాగతుఁడు = తీవ్రవేదనను పొందినవాఁడు, ఎలమితోన్ = క్షేమముతో.
  9. వైధవ్యంబు = విధవాత్వము, ఎరియించినన్ = సంతాపము నొందఁజేయఁగా, అమరపథంబు = ఆకాశము.
  10. దారుణ = భయంకరములైన, తూణీరములు = అమ్ములపొదులు, నింగి = ఆకాశము.
  11. ఏపు = విజృంభణము, దర్పించి = గర్వించి, పరాజితునిఁ జేయన్ = ఓడఁగొట్టఁగా.
  12. ఎత్తి = దండెత్తి, ఓటుపడి = అపజయము నొంది.
  13. కల్పాంతకాలభీకరమూర్తి = ప్రళయకాలమునందలి యమునివలె భయంకరమైన ఆకృతి గలవాఁడు, యవనవిభుఁడు = అరబ్బీదొర, ఉద్భటశక్తిన్ = అణఁపరాని బలిమితో, దుర్గము = పర్వతములు (లేక) నీళ్లు ఆవరించియుండుటచే చొరశక్యముగాని పట్టణము.
  14. వజ్ర = కోట కొఱడు, చాలించి = నిలిపి.
  15. మలయుటయున్ = ముట్టడింపఁగా, ఉపమచేతన్ = ఉపాయముచేత.
  16. ఒగిన్ = పూనికతో, గబ్బితనము = గాంభీర్యము, తన్నున్ = నన్ననుట, తగిలి = వెంటనంటి.
  17. వెనుకొని = వెంబడించి, ఎలయించుకొంచున్ = వెంటఁ దీసికొనుచు, గహ్వరమునందున్ = గుహయందు.
  18. నివుడన్ = వ్యాపింపఁగా - తోఁచఁగా ననుట, ఉద్యన్మూర్తి = ప్రకాశమానమైన యాకృతిగలవాఁడు.
  19. ఉత్సేకింపంగా = అతిశయింపఁగా, జగత్స్రష్టన్ = లోకములను సృజించువానిని, అవన = రక్షించుట యనెడు.
  20. మత్ప్రసాదమునన్ = నాయనుగ్రహముచేత.
  21. నిర్గమించి = వెడలి, తతి = సమూహము.
  22. పెర = వేఱైన, రోసినవాఁడై = రోతపడినవాఁడై.
  23. ఉపద = కానుక.
  24. ప్రశాంతాఖిలవిగ్రహుండు = మిక్కిలియణఁగిన కలహములు గలవాఁడు.
  25. సౌరభ్యములు = పరిమళములు, గరుసులు = మేరలు, గ్రాహవాహనపరిష్కారంబు = మొసలివాహనముయొక్క అలంకారము, తోరంబు = మితిమీఱిన దనుట.
  26. ఉత్కరము = రాశి, స్వచ్ఛందము = స్వతంత్రమైనది.
  27. అభినయులు = ప్రకాశింపఁజేయువారు.
  28. నచ్చిన = నమ్మిన.
  29. నీపకోటరమ్మునన్ = కడపచెట్టుతొఱ్ఱయందు, బెరసెన్ = వ్యాపించెను.
  30. సింధురవైరివిక్రముఁడు = సింహపరాక్రమము గలవాఁడు, అధికప్రమదాభినయానుబంధమున్ = మిక్కిలి సంతోషమును తోఁపించునట్టి సంబంధము కలదానిని, బంధురషట్పదాంధమున్ = మనోజ్ఞమైనతుమ్మెదలకు అన్నమైనదానిని, సీధు = మద్యముయొక్క - కల్లుయొక్క.
  31. మదిరా =కల్లుయొక్క, అవ్వలను గైకొని = ఆదిక్కునుబట్టి, హాలాకుంభంబున్ = కల్లుకుండను, ప్రయుక్తంబు = చక్కగా చేర్పఁబడినది, చేతస్కుండు = మనసు గలవాఁడు.
  32. రాజద్వేది = ప్రకాశించుచున్న యరుఁగు, మయూఖంబులు = కిరణములు, సొలయన్= ప్రసరింపఁగా, ఉద్యల్లీలతోన్ = వృద్ధిఁబొందుచున్న విలాసముతో.
  33. చషకంబునన్ = త్రాగెడుగిన్నెయందు, తార్కొని =ఎదుర్కొని, వక్త్రయుగ్మము = మొగములజంటయొక్క, కంజసుధాకరులు = కమలమును చంద్రుఁడును, పుడుకుబానకున్ = (ఆయుస్సు నిచ్చునట్టిదైన) అమృతఘటముకొఱకు.
  34. మత్తిల్లి = మత్తుకొని.
  35. హాసంబులు = నవ్వులు, బెరయన్ = కూడుకొనఁగా, ఉద్గతంబులు = పొటమరించినవి, ఘర్మకణంబులు = చెమటబొట్లు, వారివిహారంబునకున్ = జలక్రీడకు, ఉన్నత = గంభీరములైన.
  36. పఱపన్ = ప్రవహింపఁజేయ, మదియించితి = మదించితివి.
  37. కూలమునన్ = గట్టునందు, తిగిచినన్ = లాగఁగా, వాహిని = నీఱు.
  38. అనూపము = అంతట నీళ్లు గలదిగా, తనివోని = తృప్తి కలుగని, అగ్గలము = అధికము.
  39. విషయంబున్ = దేశమునందు.
  40. తగులు = మనస్సంగము.
  41. ప్రచోదితుండు = ప్రేరేపింపఁబడినవాఁడు, నవోఢన్ = పెండ్లికొమార్తెను.
  42. నిదాఘ = వేసంగికాల మనెడు, అవశ్యాయ = మంచు.
  43. యూధంబు = సేనాసమూహము, నిర్ముక్త = విడువఁబడిన, నిశాత = వాడియైన, సాయక = బాణములయొక్క, సిడంబులన్ = ధ్వజములను, విదళించి = నఱకి, రూపఱన్ = స్వరూపనాశమగునట్లు, పక్కెరలు = గుఱ్ఱముల కవచములు, బారి సమరి = చంపి, విటతాటంబులు = తుత్తుమురులు, ఓహటించి= విముఖులై.
  44. పత్తి = పదాతి, మేకొల్పి = పూనుకొనునట్లు చేసి.
  45. వావిరి = ధూర్తుఁడు, మేలము సూ = ఎగతాళి సుమీ.
  46. ప్రదమనుఁడు = చక్కగా నణఁగఁగొట్టువాఁడు.
  47. అరిష్టము = పురిటిల్లు, వనరాశిలోన్ = సముద్రమునందు, అమామిషబుద్ధి = మాంసమను తలంపున, జాలరి = చేఁపలను బట్టువాఁడు.
  48. మేఘపథంబునందున్ = ఆకాశమార్గమునందు.
  49. విషాదము = విచారము, క్రాలఁగన్ = వర్తింపఁగా.
  50. చిచ్చఱకంటన్ = అగ్నినేత్రముచేత, ప్రేల్చిన = దహించిన.
  51. పోకలప్రోక = తనయందు రాశిగాఁ గూడుకొన్న బహుచేష్టలుగలవాఁడు.
  52. ప్రాంచద్వివేకశుద్ధున్ = ఒప్పిదమైన తెలివిచేత స్వచ్ఛమైనవానిని, ఉదంచితవిభవానిరుద్ధున్ = మిక్కుటమైన భోగముచేత అడ్డగింపఁబడనివానిని - ఎల్లభోగములు గలవాని ననుట.
  53. దంభోళి = వజ్రాయుధము, బెరసి = పరివేష్టించి, అభ్రమాతంగపతిన్ = ఐరావతమును.
  54. పరితోషము = సంతోషము.
  55. కృశాను = అగ్ని.
  56. జగదహితకారి = లోకమునకుఁ గీడు చేయువాఁడు, సవనాదులు = యజ్ఞములు మొదలగునవి.
  57. ధవళాతపత్రంబు = తెల్లగొడుగు, భద్రంబు = మేలు, దయార్ద్ర = దయారసముచేత తడిసిన - దయగల.
  58. తెగి = తెగఁబడి, ఇంతపట్టును = ఇదంతయు.
  59. భంజన = భంగపెట్టుటయందు, తలకొనన్ = పుట్టఁగా, దశాధిపున్ = పక్షిరాజైన గరుత్మంతుని.
  60. ప్రకంపితాఖిలనిశాచరసంఘంబు = మిక్కిలి వడఁకింపఁబడిన రాక్షససమూహములు గలది.
  61. గోత్రభృత్సానులయందున్ = కొండచఱులయందు, ఒక్కటన్ = ఒక్కసారిగా, వీటన్ = పట్టణమునందు, బెడిదంబుగన్ = భయంకరముగా, ఉల్కలు = కొఱవులు, ఎంచిరి = పొగడిరి.
  62. రథేభభటగంధర్వాది = రథములు ఏనుఁగులు కాలుబంట్లు గుఱ్ఱములు మొదలైన, గిరిభేదిప్రతికూలురు = ఇంద్రశత్రువులు - రాక్షసులు, ద్విద్భంజనాచిరచక్రానలవిస్ఫులింగములు = శత్రునాశమునందు ఎడలేనిచక్రాయుధమువలనఁ బుట్టినయగ్నివలని మిడుఁగుఱులచేత.
  63. మగలు = శూరులు, తెగుట = చచ్చుట.
  64. హరి = గుఱ్ఱములు, మత్తవారణ = మదపుటేనుఁగుల, మెఱసి = బయలుబడి, నిర్భరగతిన్ = చలింపనివిధమున, శాత్రవధరాధరభంజనజిష్ణున్ = శత్రువులను కొండలను భంజించుటయందు ఇంద్రుఁడైన.
  65. జగదాభీలంబు = లోకభయంకరము, తెమలక = చలింపక, విముక్త = విడువఁబడిన, చండకాండ = కఱకైనబాణములయొక్క, నిలింపవిరోధియూథంబులన్ = రాక్షససేనలను, కృతాంతునంతికంబునకున్ = యమునియొద్దకు.
  66. భంజితారిచక్రము = భంజింపఁబడిన శత్రుసమూహము గలది, చక్రేశ్వరు = రాజుయొక్క.
  67. వీఁటలతోడి = వీఁటికలతోఁ గూడిన, వాతెఱ = పెదవి, తూలెడు = తేరిపోవునట్టి, వాటములు = జాఱినవి.
  68. ఇమ్ములన్ = ఒప్పిదముగా, ప్రసాదమ్మునన్ = అనుగ్రహముచేత, నిశాటుఁడు = రాక్షసుఁడు, చెల్లదే = తగదా.
  69. పగతుకైవడిన్ = శత్రువువలె, పిలుకుమార్పన్ = చంప.
  70. నాదెసన్ = నాయందు, అలంతులు = అల్పులు.
  71. దంతావళంబులు = ఏనుఁగులు.
  72. గిరిరిపు = ఇంద్రుని.
  73. ఉపకంఠమునన్ = మొగసాలయందు, ప్రమదావిర్భూతచేతస్కుఁడు = సంతోషము పుట్టిన మనసుగలవాఁడు.
  74. సితాద్రి = వెండికొండయొక్క, హరితో = ఇంద్రునితోఁగూడ, పెంపునన్ = గౌరవముతో.
  75. భూతనాథస్తుత = శివునిచే నుతింపఁబడినవాఁడా, నిర్ద్వంద్వ = సుఖదుఃఖములు మొదలైన ద్వంద్వములు లేనివాఁడా, నిగమార్థగోచర = వేదార్థములయందు కనఁబడువాఁడా, అవ్యయ = నాశరహితుఁడా, త్రిదశనాథ = దేవతలకు ప్రభువైనవాఁడా, పరాపర = మాయాతీతుఁడా, పరహితార్థి = పరులమేలు కోరువాఁడా, నిత్యనిపుణ = శాశ్వతమైన నేర్పుగలవాఁడా.
  76. అర్థితోన్ = కోరికతో.
  77. అనవద్య = నింద్యముగాని, సౌభాగ్య = సౌందర్యముగల.
  78. దివ్యగంధప్రసూనబంధురంబు = మేలైనవాసనగల పువ్వులచేత ఒప్పిదమైనది, నిష్యంద = జాఱుచున్న, మిళంద = తుమ్మెదలయొక్క, బాలపల్లవ = లేతచిగుళ్లచేత.
  79. సమదాళిపరీతము = మదముతో గూడిన తుమ్మెదలచేత ఆవరింపఁబడినది, నికేతము = ఇల్లైనది, పరాగ = పుప్పొడితోడ, బాలపల్లవద్యోతము = లేతచిగుళ్లచేత ప్రకాశించునది, దుర్ధసాగరపయోవనజాతము = పాలసముద్రమునందలి పాలసముదాయమునందు జనించినది.
  80. గడివోని = తఱుఁగని.
  81. అంగణమునన్ = ముంగిటియందు, ఎత్తులు = దండలు, పెంపు = ఆధిక్యము, సవతు = సమానము.
  82. ఆదరణీయము = ఆదరింపఁదగినది, మరుధారుహమున్ = వృక్షమును, కూఁకటివేళ్లకున్ = క్రుంగుడువేళ్లతో.
  83. చీకాకు = గాసి, నాకవల్లభుతోడన్ = ఇంద్రునితో, పోకలు = చేష్టలు.
  84. ఆదిత్యులకున్ = దేవతలతో, కఱకు = కఠినములైన.
  85. పౌలోమి = శచి, ఎవ్వరికంటెన్ = ఎల్లవారికంటెను.
  86. కినియుచున్ = కోపగించుకొనుచు.
  87. శిఖి = అగ్ని, బవరంబు = యుద్ధము, నింగి = ఆకాశము.
  88. భల్ల = బల్లెము, చటుల = భయంకరులైన, శుద్ధాంతకాంతా = అంతఃపురస్త్రీలయొక్క, శూన్యము = లేకుండఁ జేయునది, కురిసి = కురియించి, నిరవకాశంబు = ఎడము లేనిది, దేవతాలోకంబు = దేవతలసమూహము, అడరించిన = ప్రయోగించఁగా, ఆయోధన = యుద్ధమునకు.
  89. తుండబున = ముక్కుచేత.
  90. సితద్విషకులాధిపున్ = వెల్లయేనుఁగును, నిలింపసేనతోన్ = దేవతాసైన్యముతో.
  91. ఆక్రోశించు = మొఱపెట్టు, ఇంద్రాణి = ఇంద్రునిభార్య, వినయవినతోత్తమాంగ = అడఁకువచేత మిక్కిలి వంపఁబడినశిరస్సు గలది.
  92. ఈరసమెత్తి = ఈర్ష్య కలిగి.
  93. మనోహరములు = ఇంపైనవి.
  94. నీపరోక్షమునన్ = నీకుఁ బిమ్మట.
  95. ప్రతిష్ఠించి = నాటి, జలాశయంబులు =సరస్సులు, సంపాదించుచు = కలుగఁజేయుచు.
  96. నీలకంఠునకున్ = శివునిఁ గూర్చి.
  97. గాణపత్యంబు = ప్రమథగణాధిపతిత్వము.
  98. ఆలము = యుద్ధము, డాకకు = పరాక్రమమనకు, జాలి = విచారము, వాలిన = హెచ్చిన.
  99. నిజాంకమున్ = తనటెక్కెమును.
  100. పరిణమింపన్ = కృతార్థత్వము నొందఁగా.
  101. రాణ = ఒప్పిదము.
  102. మారసన్నిభుఁడు = మన్మథునిఁ బోలినవాఁడు.
  103. బ్రాఁతిగన్ = ప్రియముగా, కొమ్ము = తీసికొనుము.
  104. చొక్కుపెట్టి = దేహము తెలియకుండునట్లు చేసి, చెలికిన్ = స్నేహితురాలికి.
  105. ఖేటకము = డాలువాఱు, వాలు = ఖడ్గము, ఆర్పులు = సింహనాదములు.
  106. సోమించి = తృప్తినొంది.
  107. బందిగమునన్ = కారాగృహమునందు.
  108. బధిరీకృత = చెవుడుపఱుపఁబడిన.
  109. గోత్రవ్రాతములు = కొండలసమూహములు, ఉడుసంఘంబులు = నక్షత్రసమూహములు, డుల్లెన్ = రాలెను, ఘూర్ణిలెన్ = కలఁగెను, తొరిఁగెన్ = వర్షించెను, ఉల్కాపాతములు = కొఱవులయొక్క పడుటలు.
  110. భూతనాథువలనన్ = శివునివలన.
  111. చిమ్ముటయున్ =ఎగఁజల్లఁగా.
  112. ప్రవిముక్త = విడువఁబడిన, నిహతిన్ =దెబ్బచేత, రేఖన్ = విధమున, ఒలయన్ = ఆవరింపఁగా, ఒఱఁగినన్ = చొక్కిపడఁగా, ప్రస్ఫీతమై = మిక్కిలి యధికమై.
  113. చక్కటిన్ = సమీపమునందు.
  114. పంపునన్ = ఆజ్ఞచేత, తాళకేతన = బలరాముఁ డనెడు.
  115. పినాకశార్ఙ్గపాణులు = శివుఁడును కృష్ణుఁడును, గగనవాణీవచనప్రబోధితుండు = ఆకాశవాణిమాటలచేత దెలుపఁబడినవాఁడు, సురాంతకుకడకున్ = బాణాసురునియొద్దకు.
  116. లావు = బలము, ధవళాంశుధరున్ = శివుని.
  117. కొలంది= అంతరము, అసహ్యపడి = రోసి, నిర్దేశించి = చెప్పి, పేరోలగంబునన్ = పెద్దకొలువునందు.
  118. పనివడి = ప్రయత్నపూర్వకముగా.
  119. మహోరగవైరిధ్వజ = గొప్పదైన గరుడధ్వజమును, చారుపీతవసనప్రాప్తుండన్ = మనోజ్ఞమైన పచ్చనివస్త్రమును పొందినవాఁడను, గరిష్ఠుండన్ = మిక్కిలి గౌరవము గలవాఁడను.
  120. ఉజ్జగించి = విడిచి.
  121. ఒండు = ఇతరమైన, ఎమ్మేనైనన్ = ఏవిధముచేతనైనను, ఉగ్రాజిన్ = భయంకరమైన యుద్ధమునందు.
  122. సీమన్ = ప్రదేశమునందు, అవియుచుండన్ = భేదిల్లుచుండఁగా.
  123. నిష్ఠ్యూతంబులు = వెడలఁగ్రక్కఁబడినవి, నాగ = ఏనుఁగులయొక్కయు.
  124. మహాభ్రపటలి = గొప్పమేఘముల సముదాయము, పైకొని = ఆక్రమించి, అంపవాన = బాణవర్షము.
  125. కనకపుంఖ = బంగారుపింజగల.
  126. పరిష్కార = అలంకారముగల, ప్రస్త = జాఱిన - జాఱుగా కట్టఁబడిన యనుట, ధరణిధరుఁడు = కృష్ణుఁడు.
  127. భూతధాత్రీచక్రంబు = భూమండలము గలది.
  128. మండిత = అలంకరిఁపఁబడిన, మండలి = సమూహము.
  129. నిశ్రేణి = నిచ్చెన, సురాలయంబునకున్ = స్వర్గమునకు.
  130. పుండ్రేక్షుచాపహరునకున్ = శివునిఁగూర్చి.
  131. మృడునివలనన్ = శివునివలన.
  132. మదవదరివిభవవక్రమున్ = మదించినశత్రువులయైశ్వర్యమును చెఱుచుదానిని, ముదిత = సంతోషింపఁబడిన.
  133. అమానుషములు = మనుష్యులకు అవిషయములైనవి.
  134. ఉత్సేకింపన్ = అతిశయింప.
  135. అవశ్యకర్తవ్యంబు = తప్పక చేయఁదగినపని.
  136. బోలుపోక = భేదింపరాక, తలఁపు చేసెన్ = తలఁచెను.
  137. తగవు = యుక్తము.
  138. దర్శింపన్ = చూడ.
  139. నుడియందున్ = మాటలో - మాటమాత్రమున ననుట.
  140. చేఁతకున్ = పనికి, నివ్వెఱఁగందుచున్ = నిశ్చేష్టతను పొందుచు.
  141. చేవచెడి = నిస్సారుఁడై.
  142. కరసానన్ = గఱుకులుగలసానయందు, త్రెవ్వఁగఁబట్టి = అఱుగరాచి, రజము = దుమ్ము, అభ్యుదయంబు = శుభమును.
  143. ముయ్యంచు = మూడంచులుగల.
  144. మృగధూర్తములు = నక్కలు.
  145. కమలోదరుపాలికిన్ = కృష్ణునియొద్దకు.
  146. ప్రతికారరహితకరుఁడను = ప్రతికారము చేయనివాఁడ ననుట.
  147. అవశిష్టము = మిగులుగలది.
  148. ప్రకాండము = సమూహము.
  149. వలగొని = ప్రదక్షిణము చేసి.
  150. అలసుఁడు = బడలిక నొందినవాఁడు, వారాశిలోన్ = సముద్రమునందు, బలసి = చుట్టుకొని.
  151. పరోక్షము = నిర్యాణము.
  152. అవ్యయ = చెడని.
  153. ప్రేరేచు = ప్రేరేపించు.
  154. సజలజలదాభగాత్రునిన్ = నీళ్లతోడి మేఘమువలె నల్లనైనదేహము గలవానిని, లాంఛనున్ = చిహ్నము గలవానిని, వివశుఁడు = పరవశుఁడు.
  155. కదంబము = సమూహము.
  156. పొలిసిన = నశించిన, నితాంత = మేరలేని.
  157. సింధుపురి = హస్తినాపట్టణము.
  158. దస్యులు = దొంగలు, వీఁకన్ = కడఁకతో.
  159. రిత్తలు = వట్టివి.
  160. ఒకఁడున్ = ఒకటియును, జీవన్మృతుండు = బ్రతికియుఁ జచ్చినవాఁడు, దండి = బలిమి.
  161. కైకొనక = లక్ష్యపెట్టక, నవనీతచోరు = కృష్ణునియొక్క.
  162. ఏఁపునన్ = సంతాపముచేత.
  163. విన్ననై = చిన్నబోయి, చేవ = సారము.
  164. పరిభవమునఁ బొంది = భంగపడి, కోలుపడిరి = కొల్లగొనఁబడిరి
  165. నలినాకరంబునన్ = సరస్సునందు, వికీర్ణపింగళజటాధరుఁడు = విరియఁదీయఁబడిన గోరోజనపువన్నెగల జడలు ధరించినవాఁడు, దేవీజనంబులము = భార్యలము.
  166. నివ్వటిలు = అతిశయించు.
  167. అజాశత్రునితోడన్ = ధర్మరాజుతో.
  168. ఎలమి = సంపద.
  169. ఇలువరుసలు = పెద్దలనాటినుండి జరుగుమర్యాదలు.
  170. ఒక్కపరియ = ఒక్కసారే, కల్లలు = అసత్యములు
  171. విప్లవంబును = చేటును.
  172. అపనయించుకొనఁగన్ = పోఁగొట్టుకొన.
  173. కానిచి = చూచి.
  174. తటమునన్ = గట్టునందు, షండము = సమూహము, సైకతములయందున్ = ఇసుకదిన్నెలయందు.
  175. బ్రహ్మసభకున్ = బ్రాహ్మణగోష్ఠికి.
  176. చతురామ్నాయములున్ = నాలుగు వేదములును, సపర్యలు = పూజలు, విడ్ఞాతి = వైశ్యజాతి.
  177. తొఱంగెనేనిన్ = విడిచెనేనియు.
  178. పేయాపేయములు = త్రాగఁదగినవి త్రాగరానివి, భోజ్యాభోజ్యంబులు = భుజింపఁదగినవి భుజింపరానివి.
  179. యథాభివాంఛితమతితోన్ = కోరఁదగినవానిఁ గోరునట్టిబుద్ధితో.
  180. ఏము = మేము, చరితార్థులు = నెఱవేఱిన ప్రయోజనము గలవారు.
  181. తామసంబు = తమోగుణము.
  182. త్రాణ = శక్తి.
  183. రశ్ములన్ = కిరణములచేత, గ్రోలు = పీల్చును.
  184. గ్రావగత = కొండలను బొందిన, జీవనంబు = నీళ్లు, అవతీర్ణమున్ = దిగుటను, ప్రచండమూర్తులు = వేండ్రమైన యాకృతి గలవి.
  185. వ్యాస = విస్తారముగా ప్రసరించిన, న్యాసములన్ = ఉంచుటలచేత.
  186. వార్ధులు = సముద్రములు, కూర్మపృష్ఠాకృతిన్ = తాఁబేటివీఁపుచిప్పవలె.
  187. బలుకీలలక్రొమ్మంటలు = మిక్కుటపుసెగలతోడి క్రొత్తమంటలు, ఓలిన్ = క్రమముగా, క్రిక్కిఱియంగాన్ = మిక్కిలి కమ్ముకొనఁగా.
  188. నాగబృందాలయమున్ = పాతాళమును, వైషమ్యమును =విషమభావనను (విషమము = సరి తప్పినది).
  189. సంవర్త = ప్రళయసంబంధియైన, విద్యుజ్జనితస్తనితంబులు గాన్ = మెఱపులవలనఁ బుట్టినయుఱుములు గలవిగా.
  190. సంరావంబులు = ధ్వనులు, విభీతకఫలప్రమాణంబులు = తాండ్రకాయలంతలేసి, ఆసారవర్షంబులు = ముసురువానలు.
  191. వారిధరచయంబులు = మేఘసమూహములు, విరియఁగన్ = విరిసిపోఁగా.
  192. సమాధానమతిన్ = నెమ్మదిగా.
  193. ప్రబుద్ధుండు = మేలుకొన్నవాఁడు.
  194. ఏర్పరించువాఁడన్ = విశదముగఁ జెప్పెదను.
  195. హాయనములు = సంవత్సరములు.
  196. అవ్యక్త = తెలియరాని, శుద్ధుఁడు = పరిశుద్ధుఁడు, అక్షరుండు = నశించనివాఁడు, భవ్యుఁడు = శుభస్వరూపుఁడు, ఏకాకి = ఒంటివాఁడు, సర్వవ్యాపి = అంతట నిండియుండువాఁడు, నామజాతులు = పేరుపుట్టుకలు.
  197. పునరాగమనములు = మరలవచ్చుటలు.
  198. లీనము = ఐక్యము.
  199. సంచరంబు = ప్రళయము.
  200. శారీరమాసనములు = శరీరసంబంధులు మనస్సంబంధులు నైనవి.
  201. వాతజ్వలనాదులు = వాయువు ఉష్ణము మొదలగువానివలని, నొప్పలపడు = బాధకలుగు.
  202. ఆపాదించున్ = కలిగించును.
  203. కోమల = లేఁతయైన, భుగ్నమునన్ = వంగరచేత, తీక్ష్ణ = కారము, ఉష్ణ = వేఁడియైన, తువర = వగరు, ఆమ్ల = పులుసు, తిక్తామ్ల = చేఁదుతోడిపులుసు, (ఇవిగలవస్తువులను,) వాతనిహతిచేతన్ = గాలిదెబ్బచేత, సూరిమారుతమునఁ ద్రెళ్లింపన్ = ప్రసూతివాయువుచేత పడఁద్రోయఁగా.
  204. విభ్రష్టము = మిక్కిలి చెడినది, ఇఱచఁబట్టి = చలిచే మొద్దుపాఱి, క్రకచములన్ = ఱంపములచేత, కంటకములన్ = ముండ్లచేత, ఊఁదినట్లు = పొడిచినట్లు.
  205. ప్రువ్వులు = పురుగులు, ఎడత్రెవ్వక = ఎడతెగక.
  206. కంది = తపించి, సంవృత = కమ్మఁబడిన.
  207. సంతరించుచున్ = సేకరించుచు - కూర్చుచు, గుఱుతు = గుఱి - మేర, ఈషణములచేతన్ = ఆవుత్రాడులవలనియాశలచేత, లీనుఁడు = అణఁగినవాఁడు.
  208. ప్రతిశ్యాయంబు = పీనసరోగము, పెద్దవిన్నపము = గట్టిగా, బీదనరంబులు = సారహీసము లైననాడులు, ఊతకోల = ఊనుకొనుకఱ్ఱ, ముప్పునన్ = ముసలితనమునందు.
  209. తొట్రిలు = తొట్రుపడు, అగ్గలించున్ = అతిశయించును, సత్వంబు = దేహబలము, లాల = జొల్లు, దొరుఁగున్ = కాఱును, వివర్ణంబు = వికారవర్ణము, విదారింపుచుండున్ = భేదించుచుండును.
  210. వితానంబులు = సమూహములు, మమత = మమకారము.
  211. యామ్యకింకరులు = యమునిభటులు, కాలపాశంబులన్ = యమునిసంబంధు లైనత్రాళ్లచేత, దండంబులన్ = దుడ్డుగఱ్ఱలచేత, దుష్ప్రవేశంబులు = చొరరానివి, దుర్గమంబులు = పొందరానివి, వాలుకా= ఇసుక.
  212. త్రెవ్వన్ = తెగునట్లు, ఊషరకర్దమంబులన్ = చవుటిబురదలయందు, చదియన్ = చదికిలఁబడునట్లు, పరమొండెములు = పరపుగలకబంధములు, మేడెము = గుదద్వారము.
  213. అనుభూతావసానకాలంబునన్ = అనుభవము తీరునట్టికాలమునందు.
  214. నెట్టుకొని = నిలుకడ కలిగి, చెల్లదు = సరిపడదు, మూరి = మీఱి.
  215. కాని = యుక్తముకాని.
  216. పాదపమునకున్ = వృక్షమునకు, కార్పాసబీజంబు = పత్తివిత్తు.
  217. అత్యంతిక = మేర లేనిదైన, ధ్యేయంబు = ధ్యానించఁదగినది, తెలిసిరి = తెలిసికొనిరి.
  218. అజరము = మదిమి లేనిది, అజంబు = పుట్టుక లేనిది, అవ్యాహతము = కొట్టుపడనిది, భవ్యము = మేలైనది.
  219. అవిద్యవలన = కర్మానుష్ఠానమువలన, తరియింతును = దాఁటుదును.
  220. ఘర్మధేనువు = ప్రవర్గ్యమునందలి హవిర్విశేషముకొఱకు పాలుపిదుకునట్టియావు (ఘర్మము = ప్రవర్గ్యమునందలి హవిర్విశేషము, ప్రర్గ్యము = అగ్నిష్టోమాద్యంగభూతమైన యాగవిశేషము.)
  221. అకలంకీభూతము = కలంకము లేనిది.
  222. సమంజస = యోగ్యమైన.
  223. బోరునన్ = దబ్బున.
  224. కందువ = జ్ఞానముయొక్క స్థితిని.
  225. మొక్కలపు = ముష్కరుఁడైన.
  226. అస్తోక = అధికమైన
  227. ఒత్తు = ఒత్తడి - తొందర.
  228. క్షత్రబంధులు = నీచులగురాజులను, మీఁదు = అనాగతమును, అహంమానసీధుపానమత్తచిత్తులనడతలు = నేనను గర్వమనెడు మద్యపానముచేత మత్తుకొన్న మనసుగలవారి ప్రవర్తనములు.
  229. అవిద్యవలనన్ = వర్ణాశ్రమవిహితకర్మానుష్ఠానమువలన, మృత్యువున్ = జ్ఞానవిరోధియు పున
    ర్జన్మకారణంబునగు ప్రారబ్ధకర్మమును, ఒడుతున్ = గెలిచెదను, అంచితైశ్వర్యమై = పూజింపఁబడిన
    ఐశ్వర్యము గలదై - భగవత్ప్రీత్యర్థయజ్ఞాదిసత్కర్మోపయుక్త మగుటవలన నీరాజ్యైశ్వర్యమునకు
    పూజితత్వము, [ఏతత్కథాసంగ్రహము - కేశిధ్వజుండను రాజయోగి తాను మిక్కిలి జ్ఞాననిష్ఠుం
    డైనను అవిద్యచేత మృత్యువును తరించి విద్యచేత మోక్షమును బొందుదురు అనునీయర్థముగల
    ఉపనిషద్వాక్యము ననుసరించి భగవత్ప్రీణనబుద్ధిచే బహువిధములైన యజ్ఞములు సేయుచుండ
    నం దొకయజ్ఞంబున ఘర్మధేనువునకు పులివలన నపాయము సంభవింపఁగాఁ దత్ప్రాయశ్చిత్తక్ర
    మమును కర్మనిష్ఠాగ్రేసరుఁ డైనఖాండిక్యజనకునివలనఁ దెలిసికొని యాయజ్ఞమును సమాప్తి నొందించి
    తనకు ప్రాయశ్చిత్తక్రమంబు నుపదేశించినఖాండిక్యజనకుకునకు గురుదక్షిణ సమర్పించ నుద్యుక్తుండై
    వచ్చి యిష్టమైనదానిఁ గోరుమని ప్రార్థించెను. ఆరాజర్షి నిన్స్పృహుండుగావున రాజ్యాదులేవియు నొల్ల
    క యోగవిద్య నుపదేశింపుమని వేఁడగా నట్లే కేశిధ్వజుం డాయనకు యోగవిద్య నుపదేశించెను. అవిద్య
    యనఁగా వర్ణాశ్రమోచితశ్రౌతస్మార్తకర్మము. విద్య యనఁగా జ్ఞానము, మృత్యు వనఁగా సంరము.]
  230. అట్టికర్మమును ఆత్మానాత్మభేదము లేక అహంకారమమకారాదులతోఁ జేసిన నది బంధహేతు
    వగునని యవిద్యాస్వరూపమును జెప్పుచున్నాఁడు. ఆత్మ కానివస్తువందు = ఆత్మ కాని దేహమునందు,
    ఆత్మ యిది యని = ఈదేహము నే నని, అవిద్య యనెడు = సంసారమే ఫలముగాఁ గల కామ్యకర్మమనెడు, సాలమునకున్ = వృక్షమునకు.
  231. పరువడిన్ = క్రమముగా, బంధములకు = పునర్జనరూప మైనబంధములకు.
  232. పార్థివమగు నీదేహము = పృథివీసంబంధియైన యీశరీరము, పార్థివవర్ణములచేత = పృథీవీసంబంధములైన అన్నపానాదినమూహములచేత, పార్థివ = రాజా.
  233. పరీతంబై = చుట్టఁబడినది కాఁగా.
  234. అయము = ఇనుము.
  235. అంతరాయము = విఘ్నము.
  236. అప్రతిగ్రహంబు = దానము పుచ్చుకొనమి, అస్తేయము = దొంగిలింపమి.
  237. ఒలసి = ఆకర్షించి.
  238. అక్షాళిన్ = ఇంద్రియసమూహమును.
  239. అబ్జజాదులు = బ్రహ్మ మొదలగువారు.
  240. సప్తతంతులు = యజ్ఞములు.
  241. జనకచక్రవర్తి = జనకచక్రవర్తివంశజాతుఁ డగుకేశిధ్వజుఁడు.
  242. వివేకశ్రీకంబు = వివేకసంపదగలది.
  243. సందేహాపనాయార్థము = సందేహములఁ బోఁగొట్టుటకొఱకు.
  244. పలాశ = దిక్పాలకుఁ డగునైరృతుఁడు.
  245. తగిలి = ఆసక్తి గలిగి.
  246. సితద్వాదశి = శుక్లపక్షద్వాదశి.
  247. ఏవంకన్ = ఏతట్టయినను.
  248. మేరగాన్ = మొదలుగా, తాత్పర్యంబుతోన్ = తత్పరత్వముతో.
  249. ఒనరఁగన్ = ఒప్పిదముగా.
  250. సమాచీనవచశ్శ్రీకరముగన్ = మంచివాక్సంపదను గలుగఁజేయునట్లు.
  251. సత్యవచోవిలాస = సత్యవాక్యమే లీలాప్రవర్తనముగాఁ గలవాఁడా, రిపుశాసన = పగవారిని శిక్షించువాఁడా, సంగరపార్థ = యుద్ధమునందు అర్జునుఁడా, పల్లవాదిత్య = పల్లవాదిత్యుఁడు అనుబిరుదు పేరుగలవాఁడా, వనీపకపారిజాత = యాచకులకు కల్పవృక్షమైనవాఁడా, సాహిత్యకళాభివర్ధన = సాహిత్యవిద్యను అభివృద్ధి పొందించువాఁడా, మహీనుత = లోకులచేత కొనియాడఁబడువాఁడా, వెన్నెల...పయోరుహా = వెన్నెలకంటి సూరయమంత్రియొక్క కవిత్వవైభవ మనెడులక్ష్మిచేత మిక్కిలి వికసించిన హృదయకమలముగలవాఁడా.
  252. యాచకవరచేతఃకమలినీదివాకరమూర్తీ = యాచకులయొక్క మంచిమనస్సు లనెడుతామరఱేఁకులకు సూర్యస్వరూపుఁడా.
  253. సంగరధనంజయ = యుద్ధమునందు ఆర్జునుఁడా, విశాలమహిమాస్పద = మిక్కుటమైనమహిమకు ఉనికిపట్టయినవాఁడా, ప్రశస్తగుణశోభిత = మేలైనగుణములచేత ప్రకాశించువాఁడా, మహీభృత్పుంగవసభాభినయభూరిగుణమండిత = రాజశ్రేష్ఠులగోష్ఠికిఁ దగినఅభిప్రాయమును సూచించెడి గొప్పగుణములచే అలంకరింపఁబడినవాఁడా, నభోమణినిభప్రకటతేజస్సంగత = సూర్యునితేజస్సువంటి తేజస్సును బయలుపఱచునట్టి తేజస్సుతో కూడినవాఁడా, మహాసుకవిసన్నుతచరిత్ర = గొప్పవారైన మంచికవులచే స్తోత్రము చేయఁబడినచరిత్రము గలవాఁడా, రిపు...పచాంబురుహ = శత్రువులను శిక్షించునట్టి పరాక్రమముచేత ప్రకాశమానమై అప్రాకృతమైన భుజకీర్తులయందు వెలుఁగునట్టి గొప్పమణులయొక్క కాంతులచేత ఒప్పునట్టి పాదపద్మములు గలవాఁడా - పాదాక్రాంతులైన శత్రువులు గలవాఁడా యనుట. భావభవరూపా = మన్మథునిసౌందర్యమువంటి సౌందర్యము గలవాఁడా.
  254. ఇది శ్రీమత్కౌళికకులతిలకానంతార్యవిరచితంబైన శ్రీవిష్ణుపురాణటీకాసంగ్రహము.