Jump to content

ఆంధ్ర శ్రీవిష్ణుపురాణము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

క.

విజయరమాపరిశోభిత, భుజబలపార్థునకు నమితపురుషార్థునకున్
సుజనహృదయాంబురుహపం, కజమిత్రున కమ్మలాంబికాపుత్రునకున్.[1]

80


క.

రావురితమ్మయబసవ, క్ష్మావరసూనునకు బంధుసన్మానునకున్
సేవాగతరిపుభూపా, లాననశుభమతికి రాఘవావనిపతికిన్.

81


వ.

అభ్యదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పం బూనినయాదిమహాపురాణం బగు
బ్రహ్మాండపురాణంబునందలి పరాశరసంహితయైన శ్రీవిష్ణుపురాణంబునకుఁ గథా
ప్రారంభం బెట్టిదనిన.[2]

82

ప్రథమాశ్వాసము

సీ.

వేదశాస్త్రపురాణవిద్యలు దమతల్లియుదరంబులోనన యుండి నేర్చె
శైశవంబునఁ దపస్సామర్థ్యమునఁ జేసి రాక్షసప్రళయసత్రంబుఁ జేసె
నిజకోపదావాగ్ని నిశ్శేషముగఁ బుచ్చి పర్వతాటవులపైఁ బాఱవైచె
నంబుజాసనపుత్రుఁ డగుపులస్త్యబ్రహ్మచేత దివ్యజ్ఞానసిద్ధిఁ బడసె


తే.

భక్తియుక్తిప్రసన్నతఁ బంకజాక్షు, పాదపద్మంబులందునే పాదుకొల్పెఁ
జారుతరమూర్తి మునిలోక చక్రవర్తి, రమ్యతేజోధరుండు పరాశరుండు.[3]

1


వ.

అమ్మహానుభావుం డాచార్యుండుగా మైత్రేయుం డతనివలన వేదవేదాంగం
బులు ననేకధర్మశాస్త్రంబులు నభ్యసించి కృతకృత్యుండై యనేకకాలంబు
శుశ్రూష సేయుచున్న సమయంబున నొక్కనాఁడు ప్రభాతకాలోచితకృత్యం
బులు నిర్వర్తించి సుఖాసీనుండై యున్నయాచార్యునకు నమస్కరించి బహు
విధంబుల స్తుతియించి యిట్లనియె.[4]

2


క.

మునినాథ నీప్రసాదం, బున సాంగములైన వేదములు శాస్త్రములున్

ఘనముగ నేర్చితి సంవి, జ్జనకంబై మనసు సుప్రసన్నతఁ బొదలెన్.[5]

3


తే.

ఇంక నొక్కటి యడుగంగ నిచ్చపుట్టె, నాకు నీకంటె నుత్తమశ్లోకు లొరులు
లేరు గావున నడుగంగలేను దగిన, యుత్తరంబులు నాకు నీనోప రొరులు.

4

మైత్రేయుండు పరాశరమునివరునిఁ గూర్చి కొన్నిప్రశ్నలు వేయుట

సీ.

ఏవేల్పు మూలమై యెల్లలోకంబుల వరిల్లు నేవేల్పు వాసవాది
సురులకు నొడయఁడై శోభిల్లు నేవేల్పుచేత భక్తులకోర్కి సిద్ధిఁ బొందు
నేవేల్పు సచరాచరావళియం దుండు నేవేల్పు సకలయోగీంద్రవినుతుఁ
డేవేల్పు వేదంబు లెల్లను దానయై కనుపట్టు నేవేల్పుకథలు విన్న


తే.

నిహపరోన్నతసౌఖ్యంబులెల్ల నాకుఁ, గలుగు నేవేల్పు విజ్ఞానకారణంబు
భువన మేవేల్పుమూలమై పుట్టు నడఁగు, నట్టి వేలుపుమహిమ నా కానతిమ్ము.[6]

5


వ.

మఱియు పృథివ్యాదిభూతప్రమాణంబులు, సప్తసాగరవిస్తారంబులు సప్తద్వీప
ప్రకారంబు, సప్తకులాచలసంస్థానంబులు, సప్తాశ్వప్రముఖగ్రహతారకాసంచా
రంబులు, దేవాదిచతుర్విధభూతనిర్మాణంబు, చతుర్దశమన్వంతరప్రమాణంబులు,
చతుర్యుగప్రమాణంబులును, కల్పకల్పవిభాగంబులు, యుగధర్మంబులు, దేవర్షి
చరితంబులు, రాజవంశానుకీర్తనంబు, వేదశాఖాప్రమాణంబులు, బ్రాహ్మణాది
వర్ణధర్మంబులు, బ్రహ్మచర్యాదిచతురాశ్రమక్రమంబులు మొదలుగా నఖిలంబును
వినవలతు నానతిమ్మని యడిగినం బరాశరుండు పరమానందహృదయుండై
యిట్లనియె.[7]

6


క.

నను నీ వడిగినయర్థము, వినిపింపందగినమతి వివేకము నాకున్
బనుపడి యున్నది పూర్వం, బున నది దలఁపింప నెఱుక పొడమెను నీచేన్.[8]

7

శ్రీపరాశరునకు సకలపురాణకర్తృత్వము గలిగిన ప్రకారము

మ.

విను మైత్రేయ మదీయశైశవకథావృత్తాంత మంభోరుహా
సనపుత్రుండు జగన్నుతుం డగుపులస్త్యబ్రహ్మ యేతెంచి మ
న్నన లేపారఁగ నన్నుఁ గన్గోని పురాణశ్రేణికిం గర్త వీ
వని నాకున్ వర మిచ్చి పోయెఁ బ్రమదవ్యాపార మేపారఁగన్.[9]

8

క.

అది కారణంబుగా నా, కొదవెఁ బురాణప్రవీణయోగ్యత నీ వె
ట్టిది గోరి నన్ను నడిగితి, వది నీకుం జెప్పువాఁడ నాద్యంతంబున్.[10]

9


వ.

అనిన శక్తితనయునకు మైత్రేయుం డిట్లనియె.

10


క.

మునివర పురాణముల కె, ల్లను గర్తవు గాఁగ మును పులస్త్యుఁడు నీ కే
మినిమి త్తంబున వర మి, చ్చె ననిన వాసిష్ఠసూతి సెప్పె నతనితోన్.[11]

11


సీ.

మున్ను విశ్వామిత్రమునినాయకుండు మాతాత వసిష్ఠుతో జాతవైర
మానసుం డగుచుఁ దత్సూనుల నూర్వురఁ జంపించెఁ గ్రూరరాక్షసులచేత
మాతండ్రి శక్తి యమ్మౌనిపుత్రులతోనె మృతిఁబొందె నాఁడు జన్మింప నేను
నిండుగర్భంబుతో నుండినమాతల్లియుదరంబులోనన యుండి క్రమత


తే.

వేదశాస్త్రపురాణాదివిద్యలెల్ల, నభ్యసించితి మఱికొన్నియబ్దములకు
జననమొంది తపోనిష్ఠ సలుపుచున్న, నంబ దృశ్యంతి నాపాలి కరుగుదెంచి.[12]

12


ఉ.

ఆగ్రహ మాత్మలోఁ బొడమునట్లుగఁ దండ్రి నకారణంబ య
త్యుగ్రనిశాచరప్రతతు లుక్కణఁగించుటఁ జెప్పి నిగ్రహా
నుగ్రహశక్తి గల్గినఘనుండవు నీవు జనించి రాక్షసో
దగ్రబలంబు మాన్పమి వృథా యని పల్కె ననేకభంగులన్.[13]

13


ఉ.

ఏనును దీవ్రకోపము వహించి కులాగతశాంత మంతయున్
మాని యథర్వణంబు లగు మానితమంత్రములన్ జగంబు లా
హా నినదంబులన్ భయము నందఁగ రాక్షసలోకసత్రముం
బూని యొనర్చితిన్ సురలు బోరన వర్ణన చేయుచుండఁగన్.[14]

14


వ.

అమ్మహాప్రళయం బగుసత్రంబున ననేకశతసహస్రసంఖ్యలం గలరాక్షసులు
భస్త్మీభూతులై రప్పుడు.

15


ఉ.

మారణహోమకృత్యముల మ్రందక నిల్చినదైత్యవర్గముల్
బోరన మత్పితామహునిపొంతకుఁ బోయి నమస్కరించి నా
దారుణమైనకోపమున దానవనాశముఁ జెప్పి సత్కృపా
పూరితుఁ గాఁగ దైన్యమునఁ బొందుచుఁ ప్రార్థన చేసి రర్థితోన్.[15]

16


వ.

ఇవ్విధంబునం బ్రార్థించినఁ బరమదయాగరిష్ఠుం డైనవసిష్ఠుండు రాక్షసుల
కభయం బిచ్చి నాపాలికి వచ్చి పరమాదరంబు లైనవాక్యంబుల నాతో నిట్లనియె.[16]

17

ఉ.

ఏమిటి కింతకోపము వహించితి వన్న కుమార రాక్షస
స్తోమముఁ జంపఁగా నకట దోషము చెందదె క్షత్రియోచితం
బీమహనీయకృత్యము మునీశ్వరధర్మము గాదు జీవహిం
సామతు లైనవారలకు పద్ధతి లేమియు నీ వెఱుంగవే.

18


క.

కోపము గల్గినచోటన, పాపము వర్తిల్లుఁ బాపపరులకుఁ గోప
వ్యాపారంబులె తోఁచును, గోపము పాపంబు నొక్కకుదురై నడుచున్.

19


క.

అపవర్గము స్వర్గంబును, దపమును సుకృతంబు యశము ధర్మముఁ బాపున్
విపులక్రోధము గావునఁ, దపసులకుం గ్రోధ మింత దగునే తండ్రీ.[17]

20


తే.

తండ్రిఁ జంపినపగఁ దీర్పఁ దలఁచి యిప్పు, డింత చేసేద విది నీకు నేల వారి
వారికర్మఫలంబు లవశ్యభుక్తి, కారణంబులు గా కెందుఁ గడవవశమె.[18]

21


వ.

కావునఁ బరమశాంతుండవై నిరపరాధులై దైన్యంబుతోడ నున్నరాక్షసుల
రక్షింపు మని యనేకప్రకారంబులం బ్రార్థించుచున్న పితామహువచనంబు
లాదరించి యువసంహృతరక్షస్సత్రుండ నైతి నిట్లు పరమశాంతుండ నైననాపా
లికి దైత్యదానవచోదితుండును మహామునిగణసమేతుండునునై పులస్త్యబ్రహ్మ
వచ్చి మాతాతచేత నర్చితుండై కూర్చుండి నిజకులప్రసూతు లైనరాక్షసుల
యందు నత్యాదరచిత్తుండ నైయున్నన న్నవలోకించి యిట్లనియె.[19]

22


ఉ.

నిష్ఠురకోపమున్ విడిచి నిర్మలశాంతి వహించి తీవు వా
సిష్ఠ భవన్మనోరథవిశేషము లిచ్చెదఁ జెప్పు మిమ్ముని
శ్రేష్ఠులు మెచ్చ నంచు విలసిల్లుచుఁ బల్కిన నేను దేవతా
జ్యేష్ఠతనూజుపాదములు చేరి ప్రణామము చేసి పల్కితిన్.[20]

23


శా.

నాచిత్తంబు నిరంతరంబును పురాణగ్రంథశాస్త్రక్రియా
వైచిత్రిన్ విలసిల్లుచున్నయది భవ్యజ్ఞానసంసిద్ధియున్
వాచామాధురియున్ మహాప్రతిభయున్ వైదగ్ధ్యముం బెంపుతో
నౌచిత్యంబుగ నాకు నిమ్మని పులస్త్య బ్రహ్మఁ బ్రార్థించితిన్.[21]

24


క.

నాకోరినట్ల వర మ, స్తోకంబుగ నిచ్చి బ్రహ్మసూనుఁ డరిగె సు
శ్లోకుఁడు తాతయు నేత, త్ప్రాకామ్యమ కరుణచేసి పలికె సదయుఁడై.[22]

25


వ.

అది కారణంబుగా నమ్మహానుభావులయనుగ్రహంబునం జేసి.

26


చ.

దేవరహస్యకార్యములు దీపము వెట్టినయట్ల వేదవి
ద్యావిషయస్థితుల్ కరతలామలకంబు లనేకధర్మశా

స్త్రావళు లాటపాట సచరాచరభూతగణప్రవర్తనం
బీవిధ మంచుఁ జెప్పఁగలనేను బులస్త్యువరంబు పెంపునన్.

27


వ.

కావున నీ వడిగినయర్థంబులు పురాణరూపంబుగా వక్కాణించెదు.

28


ఉ.

విష్ణుఁడె భక్తవత్సలుఁడు విష్ణుఁడె దేవమయుండు వేల్పులన్
విష్ణుఁడె ప్రోవనేర్చు మఱి విష్ణుఁడె విశ్వగురుండు సర్వమున్
విష్ణుమయంబులై నడుచు వేయును జెప్పఁగ నేల నీవు శ్రీ
విష్ణుపురాణమున్ వినుము వేదసమానముఁ దాపసోత్తమా.[23]

29


సీ.

వేదంబులందెల్ల వేదంబు ధర్మశాస్త్రంబులలోపల ధర్మశాస్త్ర
మాగమార్థములలో నాగమార్థం బగు జ్యోతిషంబులలోన జ్యోతిషంబు
బహుపురాణములలోపలఁ బురాణం బితిహాసంబులం దితిహాస మఖిల
నీతిశాస్త్రములలో నీతిశాస్త్రము మహాయోగవిద్యలలోన యోగవిద్య


తే.

కావ్యములలోనఁ గావ్యంబు భవ్యతరము, సకలలోకైకవేద్యంబు సకలసుజన
చిత్తరంజనకారణం బుత్తమంబు, క్షోణి నొప్పారు విష్ణుపురాణ మనఘ.

30


క.

పరమాత్ముఁ డైనవిష్ణుని, చరితంబులు గలపురాణసంహిత లోకో
త్తరుఁ డైనబ్రహ్మదేవుఁడు, వివరించెం దొల్లి మతివివేకముపేర్మిన్.

31


వ.

అమ్మహానుభావుం డఖిలమునిగణసమేతుం డైనదక్షప్రజాపతికిం జెప్పె నతండు
నర్మదాతీరంబునఁ జక్రవర్తిత్వంబునకుఁ దపంబు నేయుచున్న పురుకుత్సుం డనురా
జన్యునకుం జెప్పె నతండు సారస్వతులకు వక్కాణించె నతనిచేత నేను విన్న
విధంబు నీ కెఱింగించెద సావధానుండవై వినుమని యిట్లనియె.[24]

32


మ.

అవికారున్ జగదేకవీరు మహిమాయత్తుం గృపాచిత్తు దా
నవసంహారు మహాఘదూరుఁ బరమానందుం జగద్వంద్యు భా
గవతాధీశు నతామరేశు మునిలోకస్తుత్యు నిత్యున్ రమా
ధవునిన్ వర్ణన సేయఁగల్గెను గృతార్థంబయ్యె నాజన్మమున్.[25]

33


వ.

అని భగవద్ధ్యానపూర్వకంబుగా భగవంతుం డైనవాసుదేవున కభివాదనంబు
సేసి వసిష్ఠపులస్త్యబ్రహ్మలం దలంచి నిమీలితలోచనుండై యున్నకొండొక

సేపునకు నతీతానాగతవర్తమానంబులుం దనకు జ్ఞానగోచరంబు లగుటయుఁ
తెలివినొంది యతిప్రసన్నహృదయుండును సకలజనశ్రవణానందవచనరచనా
విశారదుండును నై యిట్లనియె.[26]

34

వాసుదేవశబ్దనిర్వచనము

క.

విను మైత్రేయ జగంబులు, దనలోనను జగములోనఁ దానును వసియిం
చునిమిత్తంబునఁ జుమ్మీ, యనఘాత్ములు వాసుదేవుఁ డండ్రు ముకుందున్.[27]

35


ఆ.

అట్టివాసుదేవుఁ డఖిలంబుఁ దనరూప, మై వెలుంగు నీచరాచరములు
లేక సర్వశూన్యమై కనుపట్టెడు, నవుడు కాలపురుషుఁడై చెలంగు.[28]

36


మ.

అమలం బచ్యుత మప్రమేయ మఖిలవ్యాపార మాద్యంతశూ
న్య మశేషంబు సమస్తముం దనమయంబై మించి వర్తించుఁ గా
లము కాలం బన వాసుదేవునకు లీలారూప మాకాలరూ
పము నిత్యంబు దివానిశాప్రకృతిఁ జూపట్టున్ మునీంద్రోత్తమా.[29]

37


ఆ.

విను మనాదినిధనుఁడును విశ్వమయుఁడును, నైనవాసుదేవుఁ డనఁగఁ గాల
పురుషుఁ డనఁగ వేదములమున్నువెనుకయుఁ, జెప్ప లేదు విత్తు చెట్టునట్ల.[30]

38


వ.

అట్టివాసుదేవుండు కాలరూపధరుండును నిరపాయశీలుండును నిర్వికారాకారుం
డును నిరాలంబవర్తియును నిష్కళంకతేజుండును నైననతనియందును.[31]

39


మ.

దినమున్ రాత్రియు భూనభోంతరములు న్ దేజోంధకారంబులున్
ఘనశీతోష్ణము లాదియా నొకటియుం గా కంతయుం దానయై
జననం బొందెఁ బ్రధానపూరుషుఁడు శశ్వద్బోధ్యబోధానువ
ర్తనవృత్తిం బ్రకృతిస్వరూపమహిమన్ రంజిల్లి విప్రోత్తమా.[32]

40


ఆ.

ఆప్రధానపురుషుఁ డన వాసుదేవస్వ, రూప మతఁడు కాలరూపవృత్తి
సర్గకాలవేళ సంక్షోభ మొనరింప, నందు శబ్ద ముదయమయ్యెఁ జూవె.[33]

41

సృష్టిక్రమము

వ.

అట్టిశబ్దతత్వంబువలన నాకాశతత్వంబు పుట్టే నయ్యాకాశంబునకు శబ్దంబు
గుణం బయ్యె నాశబ్దంబునకు స్పర్శంబు తన్మాత్రగుణంబయ్యె నాస్పర్శగుణంబు
వలన వాయుతత్వంబు పుట్టె నవ్వాయువునకు రూపంబు తన్మాత్రగుణంబయ్యె
నారూపంబువలన వహ్నితత్వంబు పుట్టె నావహ్నికి రసంబు తన్మాత్రగుణంబయ్యె
నారసగుణంబువలన నుదకతత్వంబు పుట్టె నయ్యుదకంబునకు గంధంబు తన్మాత్ర
గుణంబయ్యె నాగంధంబువలన భూమితత్వంబు పుట్టె నాభూమికి శబ్దాదు
లేనును తన్మాత్రగుణంబులయ్యె నివ్విధంబున.

42


క.

ఈపంచభూతములు దమ, లోపలిశబ్దాదిగుణములు ప్రవర్తింపన్
వ్యాపించి విశ్వమయమై, చూపట్టుట విష్ణుశక్తి చూవె నరేంద్రా.

43


వ.

అట్టిపృథివ్యప్తేజోవాయ్వాకాశంబు లనుభూతపంచకంబును, శబ్దస్పర్శరూపరస
గంధంబు లనుగుణపంచకంబును, త్వశ్చక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణంబు లనుబుద్ధీం
ద్రియపంచకంబును, వాక్పాణిపాదపాయూవస్థ లనుకర్మేంద్రియపంచకంబును,
మనోబుద్ధ్యహంకారంబులతోడ రాజసతామససాత్వికగుణోద్రిక్తంబుగాఁ బ్రజా
సృష్టి విస్తరిల్లె.

44


ఉ.

ఈవిధమై నిరస్తగతి నేచినయిన్నియు నాదిభూతముల్
గావున నీప్రపంచ మనఁగా నొకదేహము దేహధారి ల
క్ష్మీవసుధాకళత్రుఁ డగుకేశవుఁ డాతఁడు గానివెవ్వియున్
లేవు తదీయకృత్యముల లీలలు సూవె చరాచరస్థితుల్.[34]

45


క.

ఈసకలభూతసర్గ, వ్యాసక్తిం దగిలి విశ్వమంతయుఁ దానై
భాసిల్లు వాసుదేవుఁడు, శ్రీసంపద మెఱసి యేమి చెప్ప మునీంద్రా.[35]

46


క.

ఈయాదిభూతసర్గ, శ్రీయంతయు వాసుదేవుచేత వినోద
ప్రాయమున విస్తరిల్లెఁ జు, మీ యబ్జభవాండసృష్టి యింకను వినుమా.

47


మ.

పరమాత్ముండును బంచభూతమయుఁడున్ బ్రహ్మణ్యుఁడున్ దానయై
హరినారాయణమూర్తి తా ననుపమంబై యొప్పి యంభోధిపై
నురగాధీశ్వరతల్పుఁడై మెఱసి తా నున్నప్పు డాత్మీయమూ
ర్తిరజోవృత్తి వహింప మానసమునన్ దీపించె సర్గక్రియల్.[36]

48


వ.

అంత.

49


మ.

అమలం బై జలబుద్బుదప్రతిమమై యంభోధిలో నొక్కయం

డము జన్మించి క్రమక్రమంబున నిరూఢధ్వాంతమధ్యంబునన్
సుమహత్వంబున నుండె దానివెలి నస్తోకంబులై వారివ
హ్నిమరుద్విష్ణుపదంబు లావృతములై యేపారె గాఢంబుగన్.[37]

50


క.

ఆనాలుగుభూతంబులు, మానుగ నొక్కొకటి యేనునూఱులు పొదువన్
బానీయంబునఁ దేలుచుఁ, గానంబడు వారికడపుకాయయుఁ బోలెన్.[38]

51


తే.

అట్టియండంబులోన మహానుభావుఁ, డైన విష్ణునీరాజనం బవతరించి
సర్గకారణకర్తయై సంభవించె, బ్రహ్మదేవుండు నా నొక్కభవ్యమూర్తి.

52


ఉ.

ఆతనిగుల్ఫకంబు కనకాద్రిజరాయువు ధారుణీధర
వ్రాతము గర్భవారిజలరాసులు మూర్తివిశేష మున్నత
జ్యోతియునై వెలుంగ మధుసూదనుఁ డంతకుఁ దాన కర్తయై
యాతతశక్తిపెంపున నజాండము మున్ సృజియించెఁ బెంపుతోన్.[39]

53


ఉ.

అట్టియజాండమధ్యమున నచ్యుతురాజస మజ్జగర్భుఁడై
పుట్టి సృజించు లోకములఁ బూర్వపుతత్వము విష్ణురూపమై
నెట్టన భూతరాసులకు నెమ్మి యొనర్చుఁ దమంబు రుద్రుఁడై
పుట్టి చరాచరప్రళయముల్ వెసఁ జేయు ననేకభంగులన్.[40]

54


క.

ఇమ్మెయి బ్రహ్మాండప్రళ, యమ్ము లనేకములు సనియె నవియెల్ల వినో
దమ్ములు నారాయణునకు, నమ్మహిమలఁ జెప్ప బ్రహ్మకైనను వశమే.

55


వ.

అనిన మైత్రేయుం డతని కిట్లనియె.

56


క.

నిర్గుణుఁడని శ్రీరమణు న, నర్గళముగఁ జెప్పు వేద మట్టివిభుం డీ
సర్గస్థిత్యంతము లగు, మార్గములం జెందు టేమిమహిమ మునీంద్రా.[41]

57


చ.

అనినఁ బరాశరుం డనియె నంబుజనాభున కీజగంబు లె
ల్లను జననస్థితిప్రళయలక్షణవృత్తులఁ బొందఁజేయుటన్
విను సహజంబుగాని మఱివేఱొకచందము గాదు వహ్నికిన్
ఘనతరమయినయుష్ణము జగన్నుతనైజము నొప్పుచాడ్పునన్.[42]

58

వ.

అది యట్లుండె నారాయణాభిధానంబునకు నిర్వచనంబుఁ జెప్పెద.[43]

59

నారాయణశబ్దనిర్వచనము

క.

నారములు నాఁగ నుదకము, చారుతరాయనము నాఁగ సంచారం బా
నీరధిశయనుని కిమ్మెయి, నారాయణుఁ డనగ దివ్యనామము గలిగెన్.[44]

60


తే.

అట్టినరాయణుం డైనయాదిమూర్తి, భూతరాసులనెల్లను బుట్టఁజేయుఁ
దాఁ బ్రజాపతిరూపంబుఁ దాల్చి నూఱు, హాయనంబులు పరమాయువై జనించు.[45]

61


తే.

అబ్జగర్భునిపరమాయు వైననూఱు, వత్సరంబులలో మనవంటి వార
లకుఁ దలంప ననేకకాలములు వోవు, నట్టికాలక్రమము విను మనఘచరిత.

62

నిమేషాదిమహాకల్పపర్యంతకాలవిభాగక్రమము

సీ.

లఘు వుచ్చరించుకాలము నిమేషం బగు నవి పదునెనిమిదియైన కాష్ఠ
కాష్ఠలు ముప్పదికళ కళ లన్నియ క్షణమగుఁ బండ్రెండుక్షణము లోకము
హూర్తము త్రింశన్ముహూర్తంబు లకయహోరాత్రకం బయ్యహోరాత్రపంచ
దశకంబు పక్షంబు తద్వితయంబు మాసంబు మాసద్వితయంబు ఋతువు


తే.

ఆయనమగు మూఁడుఋతువుల కవియు నుత్త, రాయణంబును మఱి దక్షిణాయనంబు
ననఁగ నవి రెండు వత్సరంబై తనర్చు, నది యహోరాత్రమై చెల్లు నమరులకును.[46]

63


వ.

అది సౌరమానం బనంబడు నివ్విధంబున.[47]

64


సీ.

పదియేడులక్షలపై నిరువదియెనిమిదివేలవర్షముల్ మొదలియుగము
సమలు పండ్రెండులక్షలమీఁదఁ దొంబదియాఱుసహస్రంబు లయ్యెఁ ద్రేత
యష్టలక్షలమీఁద నిరువదినాలుగువేలేండ్లు ద్వాపరవేళ చెల్లె
మొగి నాల్గులక్షలు ముప్పదిరెండువేలబ్దముల్ కలియుగమై తనర్చు


తే.

నోలి నాలుగుయుగములు నొక్కదివ్య, యుగము నాఁ జను నమ్మహాయుగము సంఖ్య
వెలయ నలువదిమూఁడులక్షలు నిరువది, వేలహాయనములు గల్గి విప్రముఖ్య.[48]

65


తే.

ఇట్టియుగములు వేయి వోయిన పితామ, హునకు నాలుగుజాములదినము వోవు
నిండు నన్నూటముప్పదిరెండుకోట్ల, హాయనంబుల వర్థిల్లు నాదినంబు.

66


క.

అంతియకాలము వాణీ, కాంతుని రాత్రియును దానిఘస్రము లామ

న్వంతరములు పదునాలుగు, సంతతమును జెల్లుచుండు సరియై యెందున్.[49]

67


క.

ఒక్కొక్కమనువు డెబ్బది, యొక్కమహాయుగము లింతయును నేలు సుధా
భుక్కులము మునులు నింద్రులు, నక్కాలమునందు మనువులట్ల మునీంద్రా.[50]

68


ఆ.

మనువు మనువు మాని మనువు వచ్చినదాఁక, నంబురాసు లేకమై చెలంగు
నట్టిప్రళయకాల మాదియుగమా, ణాబ్దకాల మయ్యె ననఘచరిత.[51]

69


క.

వినుము పితామహుదివసం, బును సృష్టియు రాత్రి ప్రళయమును బాటిల్లున్
మునివర యిది నైమిత్తిక, మనుకల్పం బిట్ల చెల్లు ననవరతంబున్.

70


క.

ఇట్టిదినంబులు ముప్పది, నెట్టనఁ బద్మజున కొక్కనెల యట్టినెలల్
గట్టిగఁ బండ్రెండగు సమ, మట్టిసమలు నూఱు బ్రహ్మయాయుస్సు చుమీ.

71


తే.

అది మహాకల్పమై చెల్లు నంబుజాత, భవునిప్రథమపరార్ధంబు పద్మకల్ప
మగు ద్వితీయపరార్ధంబు దగు వరాహ, కల్ప మిప్పాట వర్తిల్లుఁ గాలగతులు.[52]

72


క.

కల్పాదులఁ బరమేష్ఠి య, నల్పీకృతసత్వయుక్తుఁడై లోకంబుల్
కల్పించును నారాయణ, కల్పంబగు దివ్యమూర్తిఁ గైకొని గరిమన్.[53]

73


క.

అనవుడు మైత్రేయుం డి, ట్లనుఁ గల్పాదిని బయోరుహాసనుఁ డేలా
గున లోకము సృజియించెను, మునుకొని నారాయణత్వమున సాత్వికుఁడై.[54]

74

శ్రీమన్నారాయణుండు వరాహరూపంబు నొంది సముద్రమగ్నం బైయున్నభూమిని నుద్ధరించుట

వ.

అనిన నతం డిట్లనియె నతీతకల్పావసానకాలంబున నిశాకాలనిద్రాప్రబుద్ధుం
డైనబ్రహ్మదేవుండు పరమసాత్వికుండును నారాయణధ్యానసమాధానమానసం
డును నై పరమశూన్యం బైనలోకం బాలోకించి తొల్లింటిమత్స్యకూర్మావతా
రంబులచందంబున మహావరాహరూపంబు ధరియించి యగాధం బైనపాథోని
ధానంబున మునింగినవసుంధర నుద్ధరింపం దలంచి యమ్మహార్ణవంబుఁ బ్రవేశించి.[55]

75


శా.

భూదారాధిపుఁ డుగ్రఘుర్ఘురరవంబుల్ నింగిఁ బొంగార హే

లాదర్పోద్ధతశక్తియుక్తి నవలీలన్ గహ్వరిం జేరి దం
ష్ట్రాదండంబునఁ గ్రుచ్చి యెత్తె నఖిలాశావిహ్వలీభూతసం
పాదస్ఫారసటాకలాపనిబిడప్రక్రీడ సంధిల్లఁగన్.[56]

76


క.

ధరణీచక్రము నీగతి, వరాహదేవుఁడు మహార్ణవంబునఁ దేల్చె
శరనిధి మునిఁగిననావను, దరిఁ జేరఁగఁ దెచ్చుకర్ణధారుఁడుఁబోలెన్.[57]

77


క.

నాళీకదళము సరసిం, దేలినచందమున వసుమతీసతి జలధిం
దేలిన నుదకంబులు పా, తాళతలంబునకుఁ జనియెఁ దద్రంధ్రములన్.[58]

78


క.

సూకరవరఘోణోద్గత, భీకరవాయువులవలనఁ బృథ్వీస్థలిపైన్
బైకొన్నయడుసుఁ బదునున్, లేక కడున్ సుపథగతి గలిగె నెల్లెడలన్.[59]

79


మ.

ధరణీమండల మమ్మహాంబునిధిమీఁద నిల్పి నల్దిక్కులన్
ధరణీధ్రంబులు గెంటకుండ నిడి యాధారంబుగాఁ గచ్ఛప
శ్వరశేషాహుల క్రిందఁ బూన్చి మఱి విశ్వవ్యాపియై యింతేనియున్
భరియింపం దనవిశ్వశక్తి నునిచెం బద్మాక్షుఁ డత్యున్నతిన్.[60]

80

నారాయణుండు బ్రహ్మరూపంబు దాల్చి దేవాసురమనుష్యాదుల సృజించినక్రమము

వ.

ఇవ్విధంబున వసుంధరాచక్రంబు నిర్వక్రపరాక్రమంబున నుద్ధరించి యన్నారాయ
ణుండు ప్రజాపతి బ్రహ్మరూపంబు ధరించి రాజసగుణోద్రిక్తుండై సకలసరిత్సాగర
పర్వతద్వీపంబులును దేవాసురమునుష్యపితృలోకంబులును గరుడగంధర్వసిద్ధ
విద్యాధరపశుపక్షిమృగాదినానావిధభూతజాలంబులును మొదలుగాఁ గలచరా
చరంబుల బురాతనసర్గంబులచందంబున నిర్మించి గుణరూపస్వభావచేష్టలు
గలుగునట్లుగా నొనరించె ననిన విని మైత్రేయుం డిట్లనియె.[61]

81


క.

మునివర సంక్షేపముగా, వినిపించితి బ్రహ్మసృష్టి విస్తారముగా
వినవలయు ననిన వాసి, ష్ఠనందనుఁడు వినిచె వేడ్కఁ జతురప్రౌఢిన్.

82

క.

విను వత్స యాదికాలం, బున బ్రహ్మ ప్రజాపతిత్వమునఁ జతురాస్యుం
డును రాజపగుణసంవ, ర్ధనుఁడును నై నిలిచి సావధానప్రౌఢిన్.[62]

83


వ.

సృష్టిఁ జింతించునప్పుడు బుద్ధిపూర్వకంబు గాని ధ్యానంబునఁ దమోమయంబును
తమోమోహంబును మహామోహంబును దమిస్రంబును నంధతమిస్రంబునుఁ
బుట్టె నయ్యేనును జగంబులకు ముఖ్యభూతంబు లయ్యుం దనకు సాధనంబులు
గాకున్న మఱియును.[63]

84


క.

ఆనలినగర్భుఁ డాత్మ, జ్ఞానాజ్ఞానములఁ దామసం బగుతిర్య
గ్ధ్యానము తిర్యక్స్రోతం, బై నెగడెను దానఁ బశుమృగాదులు పుట్టెన్.[64]

85


ఆ.

కమలభవునిసాత్వికము సుఖప్రీతుల, వెలసి కడుఁ బ్రకాశవృత్తి నూర్ధ్వ
మగుట నట్టియూర్ధ్వ మైనస్త్రోతంబునఁ, బొదలె నందు నమరు లుదయమైరి.

86


తే.

రాజసోద్రిక్తమును దమోరంజితంబు, నై ప్రకాశబాహుళ్యత నమరు నజుని
తలఁ పధోగతి వర్తింపఁ దాన మనుజు, లవతరించి రవాక్స్రోత మయ్యె నదియు.[65]


క.

ఆవనజసంభవుని నిఖి, లావయవంబుల జనించె నత్యున్నతితో
దేవాసురపితృమనుజో, చ్చావచభూతములతోడి సచరాచరమున్.[66]

88


వ.

మఱియు నానావిధంబు లగుచరాచరభూతజాలంబులు పురాతనసర్గంబులచం
దంబున వారివారికర్మంబులు కారణంబులుగా నుద్భవించి హింసాహింసలును
మార్దవక్రౌర్యంబులును నిందానిందలును ధర్మాధర్మంబులును సత్యాసత్యంబు
లును జ్ఞానాజ్ఞానంబులునుఁ గలిగి యింద్రియవ్యవహారంబులం దగిలి నానా
విధంబు లగురూపంబులును వర్తనజాతిస్వభావచేష్టాగుణంబులును తత్తత్ప్రకా
రంబులు నేర్పడునట్లుగా సృజించె ననిన విని మైత్రేయుం డిట్లనియె.[67]

89


క.

మనుజుల సర్వాక్స్రోతులె, యని చెప్పితి వారు బ్రహ్మయంగమ్ముల నే
యనువున నేగుణములతో, జనియించిరి చెప్పవయ్య సన్మునితిలకా.

90


వ.

అనినం బరాశరుం డిట్లనియె.

91


సీ.

సాత్వికోదయుఁ డైన శారదావల్లభువదనంబులను విప్రు లుదయమైరి
రాజసోన్నతుఁ డైన రాజీవగర్భునిభుజములఁ బుట్టిరి భూమిభుజులు
రాజసతామసప్రకృతిఁ జెందినవిధి యూరులయందు వైశ్యులు జనించి
రతితామసోద్రిక్తుఁ డైనప్రజాపతిపదముల శూద్రు లుద్భవము నొంది


ఆ.

రిట్లు వెలయువీరి కెల్ల వేదాధ్యయ, నంబు భూమిపాలనంబు కృషియు
విప్రభక్తి మఱియు విహితకర్మంబులై, యవనియందుఁ బరఁగె ననఘచరిత.

92

క.

ఇలఁ బరఁగినయీనాలుగు, కులములమానవులు సాధకులు క్రతుతంత్రం
బులకు నటుగాన వీరలు, వలయుఁ జుమీ యజ్ఞముల కవశ్యం బనఘా.

93


తే.

యజ్ఞములచేత నమరు లాప్యాయనంబుఁ, బొందుదురు దేవతలకు నానందమైన
నఖిలమునకుఁ బ్రజావృద్ధి యవనిఁ గల్గుఁ, గానఁ గ్రతువులు కల్యాణకారణములు.[68]

94


చ.

బలువిడిఁ బాపకర్మములపై మనమూఁదక దుర్జనక్రియల్
దలఁపక ధర్మమార్గములు దప్పక నిందలు వచ్చుత్రోవలన్
మెలఁగక యెల్లవారుఁ దము మెచ్చఁగ నొచ్చెము లేకయుండుమ
ర్యులు దలపోయ దేవతలతో సరివత్తురు గాక తక్కువే.[69]

95


క.

మానవులు దాము చేసిన, దానఫలంబులను దేవతలకు నగమ్యం
బైనయపవర్గభోగం, బానందముతోడఁ గాంతు రతిసులభమునన్.

96


వ.

మఱియు సమ్యక్ఛ్రద్ధాసమాచారప్రవణులును యథేచ్ఛాచారరతులును సర్వ
బాధావివర్జితులు నంతఃకరణశుద్ధులు నైన విష్ణుభక్తిపరాయణులు తమతమపూర్వ
జన్మంబులం జేసినపుణ్యఫలంబులు కారణంబులుగాఁ గొందఱు మానవులు
బ్రహ్మచేత నిర్మింపఁబడుదురు.[70]

97


ఉ.

తామసలోభమోహమదతాపములం బడి పుణ్యసంశ్రయం
బేమియు లేక రోగముల నింద్రియముల్ పెనుపంగ ద్వంద్వదుః
ఖామయబాధలం దగిలి యెంతయుఁ గాననిపాతకంబులం
బామరు లైనమానవులఁ బద్మభవుండు సృజించుఁ గొందఱన్.[71]

98


ఉ.

కొందఱు పుణ్యవంతులును గొందఱు కేవలపాపకర్ములుం
గొందఱు రాజులున్ భటులు గొందఱుఁ గొందఱు మాననీయులుం
గొందఱు సంపదున్నతులు గొందఱు పేదలు నైనయట్లుగా
నందఱ నన్నిచందముల నబ్జభవుండు సృజించె మర్త్యులన్.[72]

99

సీ.

అన్యోన్యధనకాంక్షులై పోరుధరణీశులకు నెల్ల నాడకాడకును శైల
దుర్గంబులను వనదుర్గంబులను జలదుర్గంబులను మహీదుర్గములను
బుట్టించి వారికిఁ బురములుఁ దగినయావరణంబులును గృహావళులు వస్త్ర
శస్త్రాదిసంగరసాధనంబులు రథవారణహయభటావళులుఁ దగిన


తే.

చటులచతురంగబలములు సంపదలును, గ్రామములుఁ బొలిమేరలుఁ గాణయాచి
దేశములు మరియాదలు దేటపడఁగ, నబ్జగర్భుండు గల్పించె నాదియందు.[73]

100


తే.

శీతవాతోష్ణబాధలచేత నరులు, నలఁగకుండంగ నుపకరణములు దగిన
భంగి సృజియించి భూషణాంబరవిలేప, నాదు లెల్లను గల్పించె నవ్విఛాత.[74]

101


క.

ఒక్కొకపని సాధింపఁగ, నొక్కొకసాధనము గల్గి యుండఁగఁజేసెన్
బెక్కువిధంబుల యుపమల, నక్కమలాసనునిబుద్ధి యది యెట్టిదొకో.[75]

102


క.

పైరును వ్యవహారంబును, గోరక్షయు యాచనంబుఁ గూలియు సేవా
పౌరుషము లాదిగాఁగల, కారణముల నరుల బ్రతుకఁగాఁ గల్పించెన్.[76]

103


వ.

మనుష్యులకు జీవనోపాయంబులుగా వ్రీహులును, గోధూమంబులును, యవ
లును, అణువులును, తిలలును, ప్రియంగువులును, ఉదారంబులును, కోద్రవంబు
లును, సతీనకంబులును, మాషంబులును, ముద్గంబులును, మసూరంబులును,
నిష్పావంబులును, కుళుతంబులును, అఢక్యంబులును, చణకంబులును, శణంబు
లును అనుధాన్యంబులు పదియేడు గల్పించె నందుఁ గోద్రవంబులును, కుళు
త్థంబులును, చణకంబునుం దక్కఁ దక్కినపదునాలుగు ధాన్యంబులును యజ్ఞం
బులకు యోగ్యంబులని పురాణవిదుల చేతఁ జెప్పంబడు. ఈధాన్యంబులచేత
యజ్ఞకర్మంబులు నడచు, యజ్ఞంబుల చేత మహితలంబున సస్యసమృద్ధం బగు
గావున ధాన్యంబులు మానవులయట్ల యజ్ఞంబుల కవశ్యంబులై యుండు నని
చెప్పి మఱియు నిట్లనియె.[77]

104

ఉ.

అంబుజగర్భుఁ డీక్రియ నొకప్పుడు నూఱటలేక సర్వలో
కంబులఁ బ్రాణులం గడుఁ బ్రకాశమతిన్ సృజియింప శూన్యభా
వంబునఁ బొందుఁగాని బహువంశపరంపరలన్ జగంబులె
ల్లం బరిపూర్ణతామహిమలన్ విలసిల్లక యున్న వేసటన్.[78]

105


క.

తనతో సరియగువారల, ఘనులఁ బ్రజాపతుల మునులఁ గల్పించి జగం
బునను బ్రజాపరిపూర్ణం, బొనరించెద ననుచుఁ దలఁచి యున్నతబుద్ధిన్.

106

భృగుపులస్త్యాదులసృష్టిక్రమము

వ.

తనమానససృష్టియందు భృగుపులస్త్యపులహక్రత్వంగిరోమరీచిదక్షాత్రివసిష్ఠు
లన నవబ్రహ్మలం బుట్టించి మఱియు ఖ్యాతియు భూతియు సంభూతియు క్షమ
యుఁ బ్రీతియు సన్నతియు నూర్జయు ననసూయయు నరుంధతియు ననువారినిఁ
దొమ్మండ్రు కన్యకలం బుట్టించి క్రమంబున నవబ్రహ్మలకు భార్యలం జేసె
మఱియును.[79]

107


చ.

అహిమకరోపమానుల దయాపరతంత్రుల సౌష్ఠవక్రియా
మహితుల వీతరాగుల విమత్సరులన్ సనకాదిమౌనులన్
బహుళతమోగుణాపనయభాస్కరులన్ శమచిత్తులన్ బితా
మహుఁడు సృజించెఁ దొల్లి తనమానసపుత్రులుగా ముదంబునన్.[80]

108


క.

వారు జితేంద్రియులై సం, సారసుఖశ్రీలయందు సంయములై యి
చ్ఛారతుల బ్రహ్మవిద్యా, పారగులై చనిరి పటుతపశ్చరణలకున్.[81]

109


క.

ఆయోగీశ్వరు లీగతిఁ, బోయిన నాత్మప్రయత్నములు విఫలములై
తోయజగర్భుఁడు కోపర, సాయత్తుం డగుచు నున్నయప్పుడు కణఁకన్.[82]

110

రుద్రోత్పత్త్యాదికథనము

క.

కుటిలభ్రూకుటి యగుత, న్నిటలస్థలియందుఁ గామినీసహితుండై

నిటలాక్షుఁడు రుద్రుఁడు ప్ర, స్ఫుటమధ్యాహ్నర్కుఁబోలెఁ బుట్టె మునీంద్రా.[83]

111


వ.

ఇ ట్లర్ధనారీసహితుండును ప్రచండదేహుండును నై తనయం దుద్భవించినరు
ద్రునివలన వెండియు నట్టిరూపంబులు పది జన్మించె నవి స్త్రీపురుషభావంబులును
సౌమ్యాసౌమ్యంబులును శాంతాశాంతంబులును శ్యామధవళవర్ణంబులును నై
వెలయ వా రేకాదశరుద్రు లైరి మఱియును.[84]

112


క.

అంభోరుహగర్భుఁడు పటు, గాంభీర్యప్రాభవములు గల్గినమతితో
డింభకుఁ బుట్టించెను స్వా, యంభువుఁ దనవంటివాని నాదిమమనువున్.[85]

113


క.

ఆతఁడు విమలతపోని, ర్ధూతమహాకలుష యైనతొయ్యలిఁ బుణ్యో
పేతను శతరూప నతి, ప్రీతిఁ బ్రజావృద్ధి కొఱకుఁ బెండిలి యయ్యెన్.[86]

114


తే.

ఆవధూవరులందుఁ బ్రియవ్రతుండు, నాఁగ నుత్తానపాదుండు నాఁగ నిరువు
(?)రాత్మజులుఁ బ్రసూతి యకూతి యనఁ గన్య, కాద్వయంబుఁ బుట్టె గరిమతోడ.[87]

115


క.

ఆతరలాక్షులయందుఁ బ్రసూతిని దక్షుఁడు వరించె సుందరి యగునా
కూతిని రుచికుఁడు పరిణయ, మై తనరెను వారియందు యజ్ఞుఁడు పుట్టెన్.[88]

116


క.

ఆయజ్ఞుఁడు దక్షిణయం, దాయతమతి నర్కసంఖ్యయాములఁ బడసెన్
స్వాయంభువమనుకాలం, బాయాములు దేవగణము లైరి మహిమతోన్.

117


క.

దక్షునకు సకలవిద్యా, దక్షునకుఁ బ్రసూతికిని ముదంబున జలజా
తేక్షణ లిరువదినలువురు, దాక్షాయణు లుదయమైరి తాపసముఖ్యా.[89]

118


వ.

వారియందు శ్రద్ధయు లక్ష్మియు ధృతియు తుష్టియు పుష్టియు మేధయు క్రియ
యు బుద్ధియు లజ్జయు వపువును శాంతియు సిద్ధియుఁ గీర్తియు ననుపదుమువ్వు
రను ధర్ముండు వరియించె. ఖ్యాతియు సతియు సంభూతియు స్మృతియు ప్రీతియు
క్షమయు సన్నతియు నససూయయు నూర్జయు స్వాహయు స్వధయు ననుపదు
నొక్కండఁ గ్రమంబున భృగుండును భవుండును మరీచియు నంగిరసుండును
పులస్త్యుండును పులహుండును గ్రతువు నత్రియు వసిష్ఠుండును వహ్నియుఁ
బితృదేవుండును వరించిరి. మఱియును.

119


మ.

అనురాగం బొదవం బితామహుఁడు కల్పారంభకాలంబునం
దనతోడన్ సరియైనపుత్రకుని నుత్పాదింతు నంచున్ ముదం

బునఁ జింతింప నిజాంకదేశమున నుద్భూతంబునుం బొందె లో
కనుతుం డప్పుడు నీలలోహితుఁ డనంగాఁ బుత్రుఁ డత్యున్నతిన్.

120


ఆ.

పుట్టి తనకుఁ బేరు పెట్టు మటంచు నా, నలువయెదుర రోదనంబు నేయ
రోదనంబుకతన రుద్రుండ వీ వని, నీరజాసనుండు పేరువెట్టె.

121


వ.

వెండియు నతం డేడుమాఱు లెలుంగెత్తి యేడ్చిన వారించి యతనికి భవుండును
శర్వుండును మహేశ్వరుండును పశుపతియు భీముండును నుగ్రుండును మహాదే
వుండు ననునామధేయంబులు సేసి రుద్రావ్యష్టనామసహితుం డైనయతనికి సూ
ర్యజలపృథ్వీపవనవహ్నిగగనదీక్షితచంద్రులను శరీకంబులుగా నొనర్చి యాసూ
ర్యాదులకు సువర్చలోషాసుకేశీశివాస్వాహాదిగ్దీక్షారోహిణులం గ్రమంబునఁ బ
త్నులం గావించె మఱియును.[90][91]

122


క.

హిమగిరికిని మేనకకును, బ్రమదంబుగఁ బుట్టినట్టిపరమేశ్వరి యా
దిమశక్తి గౌరిసతియై, యమరెఁ జుమీ యష్టమూర్తి యగురుద్రునకున్.[92]

123


ఆ.

ఖ్యాతియందు భృగుఁడు ధాతృవిధాతృలు, నాఁగ సుతుల లక్ష్మి నాఁగఁ గూఁతు
నర్థితోడఁ గాంచి యట్టిమహాలక్ష్మి, బ్రియముతోడ హరికిఁ బెండ్లి సేసి.[93]

124


వ.

అనిన విని మైత్రేయుం డిట్లనియె.[94]

125

క్షీరసముద్రపుత్రి యని ప్రసిద్ధినొందియున్న లక్ష్మీదేవి భృగుపుత్రి యెట్లయ్యె ననుశంకను పరిహరించుట

క.

భృగుకన్యక యని లక్ష్మిని, దగఁ జెప్పితి వంబురాశితనయ యటంచున్
జగమెల్లఁ జెప్ప విందుము, జగదేకస్తుత్య యేమిచందం బనినన్.

126


వ.

పరాశరుఁ డతని కిట్లనియె. సర్వభూతమయుం డైనవాసుదేవుని మాయాశక్తి
లక్ష్మీరూపంబున నతనికి సహాయయై విహరించుం గావున జగంబులకు సంపత్క
రంబు లైనపరికరంబు లెన్ని గల వన్నియును శ్రీచిహ్నంబు లనిచెప్పి మఱియు
నిట్లనియె.[95]

127


సీ.

బోధబుద్ధులు శైలభూములు ధర్మక్రియలు స్రష్టృసృష్టులు జలధివేల
లును దినయామినులును హుతాగ్నిస్వాహలును శంకరాంబికలును దినేశ్వ
రప్రభలును మఘప్రాగ్వంశశాలలు శ్రీపతిశ్రీలును యూపచితులు
సామగీతులు సుధాధామశాంతులు నిధ్మదర్భలు మఱి యజ్ఞదక్షిణలును

తే.

శక్రపౌలోములును నవష్టంభశక్తు
లును నిమేషారుకాష్ఠలు లోభతృష్ణ
లును మనోరాగవతులును లోను గాఁగఁ
గలుగుపుంస్త్రీత్వములు విష్ణుకమల లగును.[96]

128


మ.

గరువం బారఁగ నీకు నిన్నియును వక్కాణింపఁగా నేటికిన్
సురతిర్యఙ్మనుజాదిలోకములలోఁ జూపట్టునానాచరా
చరభూతంబులయందు నందమగు స్త్రీసంజ్ఞల్ రమారూపముల్
పురుషాకారము లన్నియున్ హరిమయంబుల్ గా విచారింపుమీ.[97]

129


ఉ.

నెట్టన దుగ్ధవార్ధిని జనించి రమాసతి దైత్యవైరికిం
బట్టపుదేవియై జగతిఁ బ్రస్తుతికెక్కుట వేదచోదితం
బట్టిచరిత్ర మంబుజభవాత్మజుఁ డైనమరీచిచేత నే
గట్టిగ విన్నచందము దగన్ వినిపించెద నీకుఁ బెంపుతోన్.[98]

130

దుర్వాసునిశాపంబువలన నింద్రునిసంపద సముద్రముపా లైపోవుట

మ.

అనసూయాపతి యైనయత్రికి సుతుండై శంకరాంశంబునన్
జననం బొంది పటుప్రచండతరశశ్వత్కోపదావాగ్నిచే
వనజాతాసనముఖ్యదేవతలగర్వంబైన వారింప నో
పినదుర్వాసుఁడు తాపసోత్తములలోఁ బెంపారు నత్యున్నతిన్.[99]

131


శా.

ఫాలాక్షప్రతిమానుఁ డమ్మునిమహాభాగుండు యోగీంద్రుఁ డై
బాలోన్మత్తపిశాచరూపముల భూభాగంబు సర్వంబు ని
చ్ఛాలంకారవిహారియై తిరిగి జంభారాతిలోకంబుఁ దా
నాలోకింపఁగఁ గోరి యొక్కఁడు వినోదార్థంబుగా నేగుచోన్.[100]

132


మ.

ఒకవిద్యాధరకాంత వాసవవిహారోద్యానహృద్యానవ
ద్యకరాపాదితపారిజాతసుమనోదామంబు సౌరభ్యముల్

సకలాశాపరిపూరితైకమహిమల్ సంధిల్లఁగాఁ గొంచు న
త్రికుమారుం డరుదెంచుమార్గమున నేతేరంగ దౌదవ్వులన్.[101]

133


మ.

కనియెన్ మౌని శరత్సుధాకిరణరేఖాసంగ్రహస్ఫూర్తిమై
ఘనతం బొల్చువిభావరీసతిగతిన్ గల్పద్రుమామ్లానపు
ష్పనిబద్ధాంచితదామముం గొని యథేచ్ఛన్ వచ్చువిద్యాధరిన్
వినుతానంగరతిప్రసంగమహిమావిర్భూతబింబాధరన్.[102]

134


చ.

పొడఁగని చేరఁబోయి మునిపుంగవుఁ డామదిరాక్షిచే బెడం
గడరెడుపువ్వుదండఁ బ్రియమారఁగ నిమ్మని సన్న చేసి త
న్నడిగిన మాఱువల్కఁగ భయంపడి చయ్యన నిచ్చి మ్రొక్కుచుం
బడఁతి నిజేచ్ఛ నేగెఁ బులిబారికిఁ దప్పినలేడికైవడిన్.[103]

135


క.

ఆదండ జడలదండను, వేదండఁ జెలంగఁ జెరివి వేదండగతిన్
వేదండముచే వీచుచు, నాదండధరారిపోలె నాడుచు వచ్చెన్.[104]

136


వ.

అట్టియెడ దేవేంద్రుండు నైరావతారూఢుండై దేవగంధర్వకిన్నరసిద్ధవిద్యాధర
పతులు గొలువ నాకలోకబాహ్యంబున వాహ్యాళిగా వెడలి విహరించుచున్న
సమయంబున దుర్వాసుండు దుర్వారగర్వంబున గీర్వాణవిభునిపాలికిం బోయి
నీలకంధరజటామకుటమండితం బైనశశాంకరేఖయుంబోలెఁ దనజడలలోపలి
మందారకుసుమదామంబుఁ గైకానుకఁగా నొసంగి దీవించిన నతం డంకుశంబున
నందుకొని.[105]

137

ఉ.

ఏపున మూఁడులోకముల నేలేడు రాజ్యమదంబు పెంపునన్
దాపసి చూడ:గాఁ గుసుమదామము నప్పుడు భద్రదంతికుం
భోపరిఁ జుట్టె జుట్టుటయు నొప్పెసలారెను రాజతాద్రిచూ
తాపరిశోభితస్థితి బెరంగగువేలుపుటేటికైవడిన్.[106]

138


వ.

అట్టిమందారకుసుమదామాభిరామసౌరభంబులకుం జొక్కి యైరావతగండమం
డలనిష్యందదానధారావారంబులకుం జొక్కి చిక్కిన చంచరీకంబు లనేకంబులు
రేగి మూఁగి ఝంకారంబులు చేసిన ఘీంకారంబుతోడ నగ్గజేంద్రంబు దిగ్గన
బెగ్గడిలి తొండంబు సాఁచి పూవుదండ మహీమండలంబునం ద్రోచి యేచి చెలఁగి
నలంగునట్లు గాఁ బదంబులం ద్రొక్కి చిక్కుచీఱునుం జేసి చెల్లాచెదరుగాఁ
బాఱఁజల్లిన.[107]

139


ఉ.

ఏనుఁగుచిట్టకంబులకు నెంతయు మెచ్చి సురాధినాథుఁ డౌ
నౌ నని సారెసారె కొనియాడె సమీపనివాసులెల్ల న
మ్మౌనివిధంబుఁ జూచి పలుమాఱును నవ్విరి నవ్వినన్ మహో
గ్రానలకీల లొల్కెడుకటాక్షములం గడుదుర్నిరీక్ష్యుఁడై.[108]

140


ఉ.

ఆమునినాథుఁ డప్పుడు సురాధిపుఁ జూచి త్రిలోకరాజ్యల
క్ష్మీమహనీయసంపదల మించినపువ్వులదండఁ దెచ్చి సు
త్రాముఁడ వంచు నీకుఁ బ్రమదంబున నిచ్చిన నాదరింప కే
లా మదియించి తింతయని యక్షుల నిప్పులు రాల నుగ్రుఁడై.[109]

141


చ.

అతిశయమై జగత్త్రయమునందు వెలుంగుచు నున్నదేవతా
పతిసిరియంతయున్ జలధిపా లగు నంచు శపించి కోపసం

భృతనివృతాస్యుఁడై చనియె విశ్వజగత్ప్రళయంబు చేసి తా
మతిఁ [110]దనుఁబోనిరోషమున మండెడు నాదిమరుద్రుడో యనన్.[111]

142


వ.

ఇట్లు శపియించి పార్ష్ణిఘాతప్రకంపితధరాధరుండును సంచలితాధరుండును కుటి
లభ్రూకుటినటన్నిటలభాగుండును రోషారుణవిస్ఫులింగలోచనారుణరాగుం
డును భయంకరప్రకంపమానదేహుండును నూర్ధ్వబాహుండును నై మొఱ
పెట్టుచుం బోవఁ బాకశాసనుండు విహ్వలీభూతచేతస్కుండై యైరావతంబు
దిగ నుఱికి దుర్వాసుని కడ్డంబు పోయి సాష్టాంగదండప్రణామంబు లాచరించి
నా చేసినయజ్ఞానంబు సహియించి న న్ననుగ్రహింపు మని యనేకభంగులం
బ్రార్థించుచుండ నతం డంతకంతకు నేయివోసినయగ్నియుంబోలై మండి
యాఖండలున కిట్లనియె.[112]

143


ఉ.

ఓరి దురాత్మ నీకు మొగమోట యొకింతయు లేదు నీవు నీ
వారును గూడి నాయెడ నవజ్ఞ యొనర్చితి రిట్టినీయెడన్
దారుణవృత్తి నున్నననుఁ దక్కులఁ బెట్టఁగఁ జూచెదేని నీ
పేరును పెంపుఁ దూలఁగ శపింతుఁ జుమీ యిఁక నొండు పల్కినన్.[113]

144


చ.

పనిడి నీవు నాఁడు మునిపత్ని నహల్యను గానితప్పు చే
సిన నినుఁ బట్టి దండనము సేసి పదంపడి సత్కృపామతిం
గనుఁగొని మెచ్చ గౌతముఁడఁ గాను భయంకరకోపహవ్యవా
హనపరిపూర్ణమానసుఁడ నత్రితనూజుఁడఁ గాని వాసవా.[114]

145


వ.

నన్ను నీ వెంత ప్రార్థించినం గోపంబు నిలుపరాదు గావున నాకు నీయందు నను
గ్రహంబు సేయఁ జిత్తంబు గొలుపకున్నయది పొమ్మని దుర్వాసుండు పోయి
నం బురందరుండును డెందంబు గుందుచుండ నై రావతంబు నెక్కి.[115]

146

మ.

అమితక్రోధపరీతుఁ డైనమునిచే నాక్షిప్తతేజస్కుఁడై
భ్రమతం జెందినమోముతోడఁ బంతప్తస్వాంతుఁడై బాష్పపూ
రము లొక్కుమ్మడిఁ గన్నులం దొరఁగ నారాటించుచున్ వేఱుపా
యముఁ జింతించియుఁ గాన కొక్కరుఁడ పోయెన్ వీటికిన్ దీనుఁడై.[116]

147


ఉ.

ఆమఘవుండు గన్గొనఁగ నచ్చరలేములుఁ గల్పవృక్షచిం
తామణికామధేనుసితదంతితురంగమకోశముఖ్యనా
నామహనీయసంపదలు నాశములయ్యెను నింద్రజాలవి
ద్యామయమయ్యెనో యనఁగ నయ్యమరావతి యుండె శూన్యమై.[117]

148


సీ.

మునిశాపదోషంబు ముట్టియుండుటఁ జేసి దానధర్మములు భూస్థలిఁ దొఱంగె
దానధర్మములు భూస్థలిఁ దొఱంగుటఁ జేసి వివిధదేశము లనావృష్టిఁ బొందె
వివిధదేశము లనావృష్టిఁ బొందుటఁ జేసి సస్యంబు లెల్ల నాశంబు నొందె
సస్యంబు లెల్ల నాశంబు నొందుటఁ జేసి ధనధాన్యములసొంపు దఱిఁగిపోయెఁ


తే.

బుడమి ధనధాన్యములసొంపు చెడినకతన, యజ్ఞకర్మంబులెల్లను నణఁగిపోయె
యజ్ఞకర్మంబు లణఁగిన నమరవరుల, కెల్లఁ దేజోబలంబులు పొల్లువోయె.[118]

149


వ.

ఇట్లు సర్వంబు నిశ్శ్రీకంబయ్యె నప్పుడు.[119]

150


ఉ.

శ్రీమహనీయసంపదలఁ జెందక యుండుటఁ జేసి సాత్వికం
బేమియు లేకపోవుటఁ జూమీ మఱి రాజసతామసంబులుం
గామము గ్రోధలోభములు గల్గి మనుష్యులు క్రూరకర్ములై
క్షామజరాదిరోగములక్రందున నాశముఁ జెంది రెంతయున్.[120]

151


వ.

ఇవ్విధంబునం బాకశాసనప్రముఖదేవగణంబులు ధైర్యశౌర్యతేజోబలశూన్యు
రప్పుడు.

152


చ.

అమరపురంబుమీఁదఁ జతురంగబలంబులఁ గూడి విప్రజి
త్ప్రముఖనిశాచరుల్ చని యపారపుసంపద లెల్లఁ గొల్లలా
డి మఘవుమీఁద సంగరపటిష్ఠతఁ జూపిన నాతఁ డుగ్రశౌ
ర్యము పఱివోయి యొక్కఁడుఁ బరాజితుఁడై చనియెన్ భయంబుతోన్.[121]

153

సంపద్విహీనుం డైనయింద్రుండు బ్రహ్మపురస్సరుండై శ్రీమన్నారాయణసన్నిధి కేగుట

మ.

చని పద్మాసనుఁ గాంచి మ్రొక్కి తనదుష్టం బైనదుర్వాసుశా
పనిమిత్తంబున మూఁడులోకముల సౌభాగ్యంబులెల్లన్ మహాం
బునిధిం గూలినచందముం దనబలంబుం దేజముం బోయినన్
దనుజుల్ నాకముఁ గొల్లలాడుటయు దైన్యవ్యక్తితోఁ జెప్పినన్.[122]

154


ఉ.

ఆపురుహూతుఁ జూచి జలజాసనుఁ డిట్లనుఁ దప్పెఁ గార్య మీ
పాపము నీకు నెట్లొదవె బ్రాహ్మణమాత్రుఁడె యత్రినందనుం
డాపురుదాలినోరిముని కడ్డము నారయ లేదు వానికిం
గోపమె కాని శాంతియును గూర్మియు లే దెటువంటివారితోన్.[123]

155


తే.

నాకవల్లభ నీమీఁద నాటుకొన్న, మౌనికోపాగ్ని దివిజసంపదలమీఁదఁ
బోయె నంతియచాలు నీపుణ్యమునను, వేయు నేటికిఁ బులి నాకి విడిచినట్లు.[124]

156


ఆ.

నీవు కల్గియున్న నిఖిలసంపదలను, బడయవచ్చు నేఁటిబారి తప్పె
నదియ చాలు వానియలుకకు నేనైన, గుండె గూఁడఁబెట్టి యుండ వెఱతు.[125]

157


ఉ.

ఆపదలెల్ల మాన్చి సుఖమైనపదంబులఁ బూన్చి యాత్మసం
తాపము లెల్లఁ బుచ్చి విదితం బగు సంపద లిచ్చి భక్తులం
దేపయుఁబోలె దుఃఖజలధిం బడకుండఁగఁ దేల్చి పోవ ల
క్ష్మీపతి యున్నవాఁడు మదిఁ జింత దొఱంగుము పాకశాసనా.[126]

158


వ.

అని యతనిం బురస్కరించుకొని హుతాశనప్రముఖదికృతులును బృహస్పతి
ప్రముఖమునిలోకంబునుం గొలువఁ గదలి.[127]

159


మహాస్రగ్ధర.

చని కాంచెం బంకజాతాసనుఁడు సతతసంచారనక్రాదిసత్వం
బును గంధర్వాస్సరస్సన్మునిజనసుమనోముఖ్యసంస్తూయమానం
బును రంగత్తుంగభంగస్ఫురదురునినదాపూరితాశావిడంబం
బును గంభీరాంబుమధ్యప్రకటమణిగణోద్భాసి దుగ్ధాంబురాశిన్.[128]

160

వ.

అమ్మహామహిమంబునకు నద్భుతచిత్తులై యరిగి తదీయమధ్యంబున శ్వేతద్వీ
పంబుఁ గని రందు.[129]

161


సీ.

ఘనమైఁ తోపులై కల్పవృక్షంబులు చూపట్టుచుండు నెచ్చోట నైనఁ
గామధేనువులు పెన్ గదుపులై దమయిచ్చఁ బొలముల నోరంత ప్రొద్దు దిరుగు
నేడఁ జూచిన నాడకాడకుఁ దిప్పలై చింతామణిశ్రేణి చెన్ను మెఱయు
నమృతంబు పరిపూర్ణమై సర్వకాలంబుఁ బ్రవహించి నదులలోఁ బాఱుచుండు


తే.

సురల పెన్నుద్దులై జరామరణభయము
లని యెఱుంగక వర్తింతు రెందుఁ బ్రజలు
సకలపుణ్యఫలైకనిష్యంద మగుచు
నుల్లసిల్లుచు నుండు నాతెల్లదీవి.[130]

162


వ.

అమ్మహాద్వీపమధ్యంబున.

163


మ.

కని రబ్జాసనముఖ్యనిర్జరవరుల్ కల్పావనీజావళీ
కనదుద్యానవనోపకంఠముఁ బతాకావ్రాతహేలావిడం
బన సూర్యప్రతిభావకుంఠము నిలింపస్వాంతసంతోషసం
జనితోత్కంఠముఁ బద్మలోచననివాసావాసవైకుంఠమున్.[131]

164


శా.

ఆవైకుంఠపురంబులోపల సముద్యద్రత్నకాంతిచ్ఛటా
శ్రీవిభ్రాజిత మైనయానగరలక్ష్మీమండపం బందు ని
చ్ఛావృత్తిన్ సనకాదిసంయములు శశ్వద్వేదవేదాంతవి
ద్యావేదుల్ ప్రమదంబునం గొలువఁ గొల్వై యున్నయద్దేవునిన్.[132]

165


సీ.

శతకోటిభాస్కరసందీప్తతేజునిఁ బ్రావృట్పయోధరభవ్యగాత్రు
శంఖసుదర్శనశార్హ్గగదాహస్తుఁ భీతకౌశేయశోభితకటీరు

లాలితశ్రీవత్సలాంఛనలాంఛితుఁ గౌస్తుభగ్రైవేయకప్రభావు
నిందిరామందిరాయితపీనవక్షునిఁ దారుణ్యకోటికందర్పమూర్తి


తే.

బుండరీకాక్షుజగదేకపూతచరితు, సతతకరుణాకటాక్షవీక్షణు సమస్త
యోగినిర్మలహృదయపయోజనిలయు, విష్ణుఁ బొడ గాంచి సంతోషవివశు లగుచు.[133]

166


వ.

పంకజాసనప్రముఖదేవతలు సంభ్రమభయభక్తితాత్పర్యంబులు చిత్తంబులం బెనం
గొనఁ బునఃపునఃప్రణామంబులు సేయుచున్నసమయంబున నత్యంతవిషాదవేదనం
బొగులుచున్న యింద్రునకు నింద్రావరజుం డిట్లనియె.

167


తే.

ఏమి దేవేంద్ర యెన్నఁడు లేమి నీవు. చిన్నవోయినమోముతో నున్నవాఁడ
వకట బ్రాహ్మణక్షోభ నీ కయినయట్లు, తేటపడుచున్న దిది యేమొ తెలుపు మనిన.

168


క.

కోపనుఁ డగుదుర్వాసుని, శాపంబున దివిజరాజ్యసంపద లెల్లన్
రూపఱినచంద మబ్జజుఁ, డాపురుషోత్తమునితోడ నంతయుఁ జెప్పెన్.[134]

169


వ.

ఇట్లు చెప్పి దేవా దీనికిఁ బ్రత్యుపాయం బెయ్యది యానతియ్యవలయు నని
ప్రార్థించినఁ గరుణాతరంగితలోచనుండై పరమేశ్వరుండు నిర్జరేశ్వరు నవ
లోకించి యిట్లనియె.

170


సీ.

ఈవు దిక్పతులతో నిప్పుడు ము న్నేగి కపటంపుసంధి రాక్షసులతోడఁ
జేసి వారును మీరు నాసహాయంబున నతిసత్వసంపన్నులై కడంగి
యోషధీలతలు దుగ్ధాబ్ధిలో వైచి మందరమహీకరము మంథంబుఁ జేసి
వాసుకిఁ దెచ్చి కవ్వపుత్రాడుగా నిడి మథియింపుఁ డమృతాదిమహితవస్తు


తే.

చయముతోఁగూడ, త్రైలోక్యసంపదలకుఁ గారణం బైనవిభవంబు గల్గు నమృత
పాన మొనరించెదవు దైత్యపతుల మొఱఁగి, నీవు లోకంబు లేలెదు నెమ్మితోడ.[135]

171


వ.

అని యానతిచ్చి వీడ్కొల్పిన నప్పుడు.

172

ఇంద్రుఁడు శ్రీమన్నారాయణాజ్ఞచే రాక్షసులతో గూడి సముద్రమథనంబు సేయుట

లయగ్రాహి.

మందరధరుండు దము నందఱఁ గృపాంబునిధి
              యందుఁ బొరయించె నని డెందముల సత్యా

నందరసపూరములు నిండఁగ నిలింపముని
              బృందములు పద్మజపురందరులతో నం
దంద చెలరేఁగుచు నమందగమనంబు లొద
              వం దిరిగి వచ్చి దితినందనులతోడం
బొందుపడ సంధి యొకచందమునఁ జేసి నిరు
              కందువలవారు నరవిందభవునాజ్ఞన్.[136]

173


క.

అమరాసురు లటఁ గాంచిరి, ప్రముదితగంధర్వయక్షవరకృతకేళీ
రమరమణీకందరమును, రమణీయమహేంద్రసుందరము మందరమున్.[137]

174


వ.

అమ్మహానగం బగలించి తెచ్చి.[138]

175


ఉ.

అవ్వనజాయతేక్షణునియానతిఁ జేసి మహౌషధీలతల్
జువ్వన నమ్మహాంబునిధిలోపల వైచి సురాసురావళుల్
కవ్వ మెలర్ప మందరము మంథముగా వెసఁ ద్రోచి వాసుకిం
గవ్వపుత్రాడు సేయ సమకట్టుచు నున్నతఱిన్ మునీశ్వరా.[139]

176


క.

ఆధరణీధర మడుగున, నాధారము లేక మునిఁగె నాసమయమునం
బాధరణీధరమర్దనుఁ, డాధరణీధరునిఁ దలఁచె నతులితభక్తిన్.[140]

177


వ.

ఇట్లు దలంచినసహస్రాక్షునకుఁ బుండరీకాక్షుండు ప్రత్యక్షంబై.[141]

178


సీ.

జలధిలో లక్షయోజనవిశాలంబైన కూర్మమై కవ్వపుకొండ యెత్తి
యాకాశభాగంబునందు శైలముమీఁద జడియకుండఁగఁ దనశక్తి నిలిపి
తరిత్రాడుగా నున్న యురగవల్లభునిగాత్రముఁ బ్రవేశించి సత్వంబు నొసఁగి
సమసత్వు లైనరాక్షసదివౌకసులలోఁ గలసి యెచ్చరికలు గలుగఁజేసి


తే.

యాదరంబున బ్రహ్మరుద్రాదిదివిజ, సమితితోఁ గూడి సుఖగోష్ఠి సలుపుచుండెఁ
దనమహత్త్వంబునకు సనందనవవత్సు, జాతసనకాదిమౌనులు సంతసిల్ల.[142]

179


ఆ.

భోగితలలపట్టు పూర్వదేవతలును, దోఁకపట్టు సురలు వీఁకఁ బట్టి
త్రచ్చునట్లు గాఁగ దామోదరుఁడు సమ, కట్టె వారివారికడల నిలిచి.[143]

180


క.

వాసుకిసహస్రముఖని, శ్వాసవిషోద్రేకచటులవహ్నిజ్వాలల్

డాసి తమమీఁదఁ బర్విన, నాసురనాయకులబలిమి యల్పంబయ్యెన్.[144]

181


తే.

విషధరాధీశునిశ్వాసవిపులవాయు, ఘాతమునఁ జేసి రాక్షసగణముదిక్కు
వారిధరములు వోయి దేవతలదిక్కు, శీకరాసారములనీడ సేయుచుండె.[145]

182


వ.

ఇవ్విధంబున దేవదానవులు మహామత్సరంబున సముద్రంబు మథియించునపుడు
దేవధనంబు లైనకల్పవృక్షకామధేనుచింతామణులును రూపౌదార్యగుణోపేత
లైనరంభాద్యప్సరసలును నైరావతోచ్చైశవంబులును బుట్టిన నారాయణుండు
వాని నన్నింటినిఁ బురందరున కిచ్చె మఱియును.

183


క.

నవనిధులును బుట్టిన వై, శ్రవణునిఁ గొమ్మనుచు నిచ్చెఁ జంద్రునికళ సం
భవమైన నద్రికన్యా, ధవుఁడు శిరోభూషణముగఁ దాల్చఁగ నొసగెన్.[146]

184


క.

మది రాజసంబు మెఱయఁగ, మదిరాకుంభంబుఁ బూని మదఘూర్ణితయై
మదిరాసతి పుట్టిన నె, మ్మది రాక్షసవరులు గొనిరి మాధవువలనన్.[147]

185


క.

గీర్వాణమహిమఁ జెఱిచిన, దుర్వాసునికోపవహ్ని దోఁచినకరణిన్
దుర్వారవిషము పుట్టిన, దర్వీకరవరులు దానిఁ దాల్చిరి వత్సా.[148]

186


ఉ.

అంతహరీతకీఫలసమంచితహస్తుఁడు దివ్యభూషణా
త్యంతవికాసుఁడు విలసితామృతకుంభదరుండు నౌషధా
త్యంతపరిశ్రముండు ధవళాంబరధారుఁడు నై జనించె ధ
న్వంతరి దుగ్ధసాగరమునన్ దివిజావళి సంతసిల్లఁగన్.[149]

187


ఉ.

అట్టియెడ ధృతాంబురుహయై జనియించె రథాంగపాణికిం
బట్టపుదేవి లోకములపాలిటి వేలుపు వజ్రిముంగిటం
బెట్టిన పెన్నిధానము మనీషిజనంబులతల్లి వార్ధికిం
బట్టి త్రిలోకసుందరి యపారకృపామతి లక్ష్మి పెంపుతోన్.[150]

188


వ.

ఇట్లు జనియించిన శ్రీదేవి నవలోకించి మునిగణంబులు శ్రీసూక్తంబులం గొని
యాడిరి విశ్వావసుప్రభృతు లైనగంధర్వులు సంగీతంబులు సేసిరి ఘృతాచీప్ర

ముఖంబు లైనయప్సరోగణంబులు నృత్యంబులు సల్పె నైరావతాదిదిగ్గజంబులు
కనకపాత్రంబుల గంగాజలంబులు దెచ్చి యభిషేకించె సముద్రవల్లభుం డమ్లాన
పంకజంబులమాలిక లిచ్చె విశ్వకర్మ దివ్యరత్నవిభూషణంబు లొసంగె బ్రహ్మ
రుద్రాదిదేవతలు దివ్యమాల్యాంబరంబులఁ జందనంబునం గైసేసి రిట్లు మహావిభ
వాభిరామ యైనయద్దేవి దేవదేవుం డైనవిష్ణుదేవునిచేతం బరిగ్రహింపంబడి
తదీయవక్షస్థలంబునన విలసిల్లెఁ ద్రిలోకంబులు సకలసంపత్సంపాదకంబు
లయ్యె నప్పుడు.[151]

189


తే.

తనకు విద్వేషు లైనట్టిదానవులకు, నొకపదార్థంబు నీక దామోదరుండు
తనకు దాసానుదాసులై యనుసరించు, వాసవాదుల ధన్యులఁ జేసె నపుడు.[152]

190


తే.

విప్రజిత్తిపురోగము లప్రమేయ, బలులు దైతేయదానవబలముతోడ
బలిసి యేతెంచి యమృతకుంభంబు గొనిరి, విబుధు లెల్లను భీతులై విహ్వలింప.[153]

191


క.

తోయజనాభుఁ డప్పుడు, మాయాసతియై నిశాటమధ్యంబునకుం
బోయి కుసుమబాణవికా, రాయత్తులఁ జేసె మోహనాకృతివలనన్.[154]

192


చ.

పలికెడులాగులుం గురులబాగులు బింకపుజన్నుదోయిమిం
చులు నిడువాలుగన్నుఁగవచూపులు తిన్ననినెమ్మొగంబునం
గలచెలువంబు మోహనవికాసము నన్నువకౌను గల్గు న
ప్పొలఁతుకఁ జూచి చిత్తరువుబొమ్మలకైవడి నుండి రందఱున్.[155]

193


క.

అమాయాసతిరూపసు, ధామృతపానంబువలన ననిమిషులై తా
మేమియు నెఱుఁగక దైత్య, స్తోమంబులు పారవశ్యదోహలు లైనన్.[156]

194


క.

జగదపకారపరాక్రము, లగుదైత్యులచేత నున్న యయ్యమృతముఁ దా
మగుడంగఁ దెచ్చి దయతో, నగభేదిప్రముఖసురగణంబుల కొసఁగెన్.[157]

195

ఆ.

పాకశాసనుండు పరమానురాగియై, దివిజగణముతోడఁ దేజమెసఁగ
నమృత మారగించి యత్యంతబలపరా, క్రమధురీణుఁ డయ్యెఁ గడిమి మెఱసి.[158]

196


వ.

ఇట్లు విజృంభించి జంభారి కుంభినీభృద్భయదంభోళిధారావిజృంభణంబువలన
రాక్షసులతోడ మహాఘోరయుద్ధంబుఁ జేసిన వెఱచి పఱచి యందఱును పా
తాళలోకంబునకుం జని రప్పుడు.[159]

197


క.

మందరశైలము నెప్పటి, కందువ నిడి యురగవిభుని కారుణ్యరసా
నందపయోనిధిలోపల, నందంబుగ విడిచి చనిరి యమరులు ప్రీతిన్.[160]

198


వ.

అనంతరంబ పాకశాసనుండు మధుకైటభశాసనునకు నభివాదనంబు చేసి తదీయ
కృపావిధేయుండై త్రిలోకంబులను నిజశాసనంబున నిలిపె సూర్యుండు ప్రసన్న
దీప్తిమంతుండై తేజరిల్లె గ్రహతారకాగణంబులు పూర్వప్రకారంబున విలసిల్లె
నగ్నిహోత్రంబులు ప్రదక్షిణార్చులై వెలింగె సర్వభూతంబుల హృదయంబులును
ధర్మజ్ఞానంబున విలసిల్లె మహీమండలంబును ననావృష్టిదోషంబును రాజవిడ్డూ
రంబును నుడిగి బహుసస్యసమృద్ధియును బ్రజాభివృద్ధియునుం గలిగె సకల
లోకంబులును సంపత్కరంబు లయ్యె నిట్లు లక్ష్మీవిలాసంబున సమస్తలోకంబులు
పరిపూర్ణంబు లయ్యె నపుడు.[161]

199


క.

శతమన్యుఁడు దివిజులతో, నతిముదమున విష్ణుచేత నామంత్రితుఁడై
యతులితవిభూతి నమరా, వతికిం జని ధర్మబుద్ధి వదలక యుండెన్.[162]

200


వ.

ఇట్లు నిరంతరోపాసకుం డైనపాకశాసనులకు నిరంతరతామరసవాసిని యైనమ
హాలక్ష్మి ప్రత్యక్షంబైన నతండు దండవన్నమస్కారంబులు సేసి కరంబులు మొగి
చి యిట్లని స్తుతించె.[163]

201

ఇంద్రుండు తనకు ప్రత్యక్షం బైనలక్ష్మీదేవిని స్తోత్రము సేసి వరంబులం గొనుట

క.

అంబుజభవుండు మునివ, ర్గంబును జిత్తమున వెదకి కాన నలవిగా
వంబ భవదీయదివ్యప, దంబులు నే నిపుడు గాంచి ధన్యుడ నైతిన్.[164]

202

ఉ.

ఎవ్వనిమూర్తి నార్తి యోకయించుక లేదు సభాంతరంబులం
దెవ్వఁడు పూజ్యుఁడై మెఱయు నీజనులెల్ల సదావిధేయులై
యెవ్వని నాశ్రయింపుదు రహీనవచోవిభవాభిరాముఁడై
యెవ్వఁడు తేజరిల్లు నతఁ డెప్పుడు నీకృపవాఁడు భార్గవీ.[165]

203


క.

నేరములు పెక్కు చేసిన, నేరుపులై చెల్లుచుండు నీకృప గలచో
నేరుపున నెట్లు నడచిన, నేరములై కీడు సేయు నీకృపలేమిన్.

204


క.

కలిమిగల కల్లచూపుల, కలిమి నిరంతరము నీవు గైకొని ప్రోవం
గలవారి నాశ్రయింపం, గలవారు జగంబులోనఁ గలవారెల్లన్.[166]

205


వ.

అని యిట్లు వినుతింప నిలింపవల్లభునకు విష్ణువల్లభ యిట్లనియె.[167]

206


క.

స్వారాజభక్తితో నను, నారాధన సేసినాఁడ వటుగావున నీ
కోరినవర మే నిచ్చెద, నారయ నేమేని యడుగు మని పలుకుటయున్.[168]

207


సీ.

అంబ మదభ్యస్త మైనవిద్యలయందు శరచాపఖడ్గాదిసాధనముల
రథసత్తివాజివారణచయంబులయందు గోమహిష్యాదిసద్ధామములను
మణిహేమవజ్రభూషణధాన్యములయందుఁ బరిమళద్రవ్యసంపదలయందుఁ
బుత్రమిత్రకళత్రపౌత్రబాంధవులందు శక్తిగుణేంద్రియసముదయముల


తే.

రాష్ట్రముల దుర్గములయందు రాజధాను, లందుఁ క్రీడావిహారంబు లైనయట్టి
రమ్యభూముల నాశరీరంబునందు, నీవు వసియింపుదువుగాక యింపుతోడ.[169]

208


క.

నిను నీనుతిచే నెవ్వఁడు, పనుపడి స్తుతియించు రాత్రిఁ బగలును వానిం
దనయుండువోలెఁ గృపతో, మునుకొని రక్షింపవలయు మురహరురాణీ.

209


క.

అని యతఁ డడిగినయావర, మనురాగముతోడ నిచ్చి యంతర్ధానం
బును బొందె నాటనుండియు, వనజాలయ యింద్రువీడు వదలక యుండున్.[170]

210


వ.

మఱియు దేవదేవుం డైనవాసుదేవుండు కృతయుగంబునఁ బరశురామావతా
రంబు నొందిననాఁడు భూమిదేవి యయ్యెఁ ద్రేతాయుగంబున రామావతా
రంబు నొందిననాఁడు సీతాదేవి యయ్యె ద్వాపరయుగంబునఁ గృష్ణావతారంబు
నొందిననాఁడు రుక్మిణీదేవి యయ్యెఁ గలియుగంబున సూర్యావతారంబు నొం
దిననాఁడు పద్మిని యయ్యె నివ్విధంబునఁ బద్మాలయ పద్మాక్షునకు సహాయయై

యుండు నతండు దేవరూపంబు ధరించిన దేవతాస్త్రీరూపంబును మనుష్య
రూపంబు ధరించిన మనుష్యస్త్రీరూపంబును నై శబ్దంబు ననుసరించు నర్థంబు
నుంబోలె ననుసరించునని లక్ష్మీచరిత్రంబు చెప్పిన విని మైత్రేయుం డిట్లనియె.

211

భృగ్వాదిముని కర్తృకసృష్టిక్రమము

తే.

అనఘ భృగుమౌని యాదియైనట్టిమునుల, సర్గములు వేఱువేఱ విస్తారఫణితి
నానతిమ్మని పల్కిన నవ్వసిష్ఠు, మనుమఁ డిట్లని చెప్పె నమ్మౌనితోడ.[171]

212


క.

ఖ్యాతికి భృగునకుఁ బుట్టిన, ధాతవిధాతలును మేరుధరణీధ్రతనూ
జాతల నాయతనియతుల, నాతతమతిఁ బెండ్లి యైరి యం దాయతికిన్.[172]

213


తే.

ప్రాణుఁ డుదయించె నియతికి భవ్యమూర్తి, యగుమృకండుండు జనియించె నతనివలన
దురితహరుఁడు మార్కండేయవరమునీంద్రుఁ, డవతరించెను దీర్ఘాయు రమలుఁ డగుచు.

214


వ.

మఱియుఁ బ్రాణునకు వేదశిరుండును వానికి ద్యుతిమంతుండును అతనికి నజ
గుండునుం బుట్టిరి వారివంశంబు లసంఖ్యాతంబులై జగంబులు విస్తరిల్లె మఱి
యును.

215


తే.

విను మరీచికి సంభూతి యనులతాంగి, యందు నుదయించెఁ బౌర్ణమాసాఖ్యసుతుఁడు
పరఁగ నతనికి విరజుండు పర్వతుండు, ననఁగఁ బుత్రులు జన్మించి రతులయతులు.

216


తే.

అంగిరసునకు స్మృతియందు ననుమతియును, రాకయును సినీవాలియు నాఁ గుహువును
నాఁగ నలువురు పుట్టి నానాజగత్ప్ర, సిద్దమహిమలు గాంచి రక్షీణముగను.

217


క.

అత్రికి ననసూయకు స, త్పుత్రకులై చందురుండు దుర్వాసుఁడు ద
త్తాత్రేయుఁడుఁ బుట్టిరి శత, పత్రభవాభవరథాంగపాణులు దామై.[173]

218


వ.

మఱియుఁ బ్రీతి యనుదానికి దత్తాగ్ని పుట్టె నతండు స్వాయంభువమన్వంతరం
బున నగస్త్యుం డయ్యెఁ బులహునకు క్షమయును దానికి గర్ధముండును సహి
ష్ణుండు నూర్ధ్వరేతుండునుఁ బుట్టిరి. క్రతువునకు సన్నతి యనుదానికి నంగుష్ఠ
పర్వమాత్రదేహులు నూర్ధ్వరేతస్కులును నైనవాలఖిల్యాదు లఱువదివే
వురు పుట్టిరి. వసిష్ఠునకు నూర్జ యనుదానికి విరజుండును గోత్రుండును నూర్ధ్వ
బాహుండును సవనుండును ననముండును సుతవుండును శక్రుండును నన

నేడ్వురు పుట్టిరి. వా రుత్తమమన్వంతరంబున సప్తమహర్షులైరి. వహ్నికి స్వాహ
యనుదానికిఁ బావకుండును పవిమానుండును శుచియునుం బుట్టిరి. వారు మువు
రకు నలువదియేవురు పుట్టిరి. ఇట్టు లేకోనపంచాశత్సంఖ్యు లైనవహ్నులు విస్త
రించిరి. పితృదేవునకును స్వధ యనుదానికిని బితృగణంబులును మేనకయును
వైతరణియు ననుకన్యకలు పుట్టిరి. అయ్యిరువురును దివ్యజ్ఞానమూర్తులును
బ్రహ్మవాదినులును యోగినీదేవతలును నైరి. అనిన మైత్రేయుం డిట్లనియె.[174]

219


క.

మునివల్లభ స్వాయంభువ, మరువంశజు లైనయట్టిమనుజేంద్రులవ
ర్తనములుఁ దదన్వయంబులు, వినవలతుం జెప్పు మనిన వేడుకతోడన్.

220


శా.

సారాచారవివేక వైభవకళాసంపన్న పంటాన్వయ
క్షీరాంభోనిధిపూర్ణచంద్ర విజయశ్రీవైభవోపేత శృం
గారాకార కవీంద్రయాచకసురక్షాదక్ష మందారచిం
తారత్నప్రతిమానదానగుణ యానంబాలగోత్రోద్భవా.[175]

221


క.

భరతభగీరథభార్గవ, మరుత్తశశిబిందురంతిమాంథాతృయయా
తిరఘుదిలీపసగరశిబి, నరరామనహుషసుహోత్రనరనాథనిభా.

222


మాలిని.

అమందగుణరాజితా హరిపదాబ్జసంపూజితా
సమస్తశుభలక్షణా సకలధీరసంరక్షణా
సమగ్రవిభవాకరా సమదశత్రురాడ్భీకరా
యమానుషపరాక్రమా యఖిలదుష్క్రియాపక్రమా.[176]

223


గద్య.

ఇది శ్రీమదమరనామాత్యపుత్ర హరితగోత్రపవిత్ర సుకవిజనవిధేయ వెన్నెల
కంటిసూరయనామధేయప్రణీతం బైనయాదిమహాపురాణంబగు బ్రహ్మాండపురా
ణంబునందలి పరాశరసంహితయైన శ్రీవిష్ణుపురాణంబునందు నాదిభూతసర్గప్రకా
రంబును బ్రహ్మండోత్పత్తియు మహావరాహకీర్తనంబును బ్రజాపతిసర్గంబును
దుర్వాసుశాపంబున నింద్రుండు నిశ్ర్శీకుం డగుటయు సముద్రమథనంబును
లక్ష్మీమాహాత్మ్యంబును భృగ్వాదిమహామునిసర్గంబును ననుకథలం గల ప్రథ
మాశ్వాసము.

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. విజయరమాశోభితభుజబలపార్థునకు = జయలక్ష్మిచేత ప్రకాశించునట్టి భుజబలమునందు అర్జునుఁడయినవానికి, సుజనహృదయాంబురుహపంకజమిత్రునకున్ = సజ్జనులమనస్సులనెడు కమలములకు సూర్యుఁడయిన వానికి.
  2. అభ్యుదయపరంపరాభివృద్ధిగాన్ = శుభపరంపరలు మిక్కిలి పెరుగునట్లుగా.
  3. శైశవము = శిశుత్వము, ప్రళయము = నాశము, అంబుజాననపుత్రుఁడు = బ్రహ్మకొడుకు, భక్తియుక్తిన్ = భక్తితో, పంకజాక్షుఁడు = విష్ణువు, పాదుకొల్పెన్ = స్థిరముగా నిలిపెను, చారుతరమూర్తి = మిక్కిలిమనోజ్ఞమైన యాకృతికలవాఁడు, చక్రవర్తి = శ్రేష్ఠుడు.
  4. కృతకృత్యుఁడు =కృతార్థుఁడు, శుశ్రూష = సేవ, ప్రభాతకాలోచితకృత్యములు = తెల్లవాఱుసమయమున చేయఁదగిన పనులు, నిర్వర్తించి = నడపి, ఆసీనుఁడు = కూర్చున్నవాఁడు.
  5. ప్రసాదము = అనుగ్రహము, సంవిజ్ఞానకంబు = జ్ఞానమునకు జన్మస్థానము, ప్రసన్నత = తేటదనముచేత, పొదలెన్ = ఆతిశయించెను.
  6. మూలము = ఆదికారణము, ఒడయఁడు = ప్రభువు, కనుపట్టున్ = కానఁబడును, భువనము = లోకము, అడఁగున్ = నశించును.
  7. సప్తాశ్వప్రముఖ = సూర్యుఁడు మొదలుగాఁగల, దేవాదిచతుర్విధభూతనిర్మాణంబు = దేవతలు మనుష్యులు తిర్యక్కులు స్థావరములు ననెడు నాలుగువిధములైన భూతములయొక్క సృష్టి, వినవలతును = వినఁగోరెదను.
  8. అర్థము = విషయము, పనుపడి = అభ్యస్తమై.
  9. అంభోరుహాసనపుత్రుఁడు = బ్రహ్మకొడుకు, ప్రమదవ్యాపారము = సంతోషవృత్తి.
  10. ఒదవెన్ = లభించెను.
  11. వాసిష్ఠసూతి = వసిష్ఠునికొడుకైన శక్తియొక్కకుమారుఁడు.
  12. జాతవైరమానసుఁడు = పుట్టినపగగల మనస్సుకలవాఁడు, తత్సూనులన్ = కొడుకులను, అబ్దము = సంవత్సరము, అంబ = తల్లి.
  13. ఉక్కణఁగించుట = చంపుట, నిగ్రహానుగ్రహశక్తి = శిక్షించను రక్షింపను జాలిన సామర్థ్యము.
  14. కులాగతము = తనవంశస్థుడైన పెద్దలనాటనుండివచ్చినది. మానితమంత్రములన్ = పూజ్యములైన మంత్రములచేత, సత్రమున్ = దుష్టనాశకమైన యజ్ఞవిశేషము.
  15. మ్రందక = చావక, బోరనన్ = శీఘ్రముగా, పొంతకున్ = దగ్గఱకు.
  16. పరమదయాగరిష్ఠుఁడు = మేలైనదయచేత మిక్కిలి గొప్పవాఁడు.
  17. అపవర్గము = మోక్షము.
  18. భుక్తి = అనుభవము, కడవన్ = మీఱుటకు.
  19. ఉపసంహృతరక్షస్సత్రుండను = ఉపసంహరింపబడిన రాక్షససంబంధిపత్రము గలవాఁడు - రాక్షసులను నశింపఁజేయుచున్న సత్రయాగమును నిలిపినవాఁడనుట, నిజకులప్రభూతులఁ = తనవంశమునఁ బుట్టినవారు.
  20. దేవతాజ్యేష్ఠతనూజుఁడు = బ్రహ్మకొడుకు, బ్రణామము = నమస్కారము.
  21. ప్రతిభ = సమయోచితస్ఫురణగలబుద్ధి, వైదగ్ధ్యము = విదగ్ధత - మిక్కిలి నేర్పరితనము.
  22. అస్తోకంబుగన్ = ఘనముఁగా, సుశ్లోకుఁడు = మంచికీర్తి గలవాఁడు, ప్రాకామ్యము = ఐశ్వర్యము.
  23. వేదసమానమున్ = ఇది విష్ణుపురాణము అనుదానికి విశేషణము.
  24. సావధానుఁడు = ఎచ్చరికగలవాఁడవు.
  25. అవికారుఁడు = వికారము లేనివాఁడు, జగదేకవీరుఁడు = జగత్తునందు ఒక్కఁడైన వీరుఁడు - ఇతనికంటే వీరుఁడు లోకమునందు లేఁడు అనుట, మహిమాయత్తుఁడు = మహిమకు ఆధీనుఁడు — మిక్కిలి మహిమ గలవాఁడు, మహాఘదూరుఁడు = గొప్పపాపములకు దూరమైనవాఁడు - పాపము లేనివాఁడు, నతామరేశుఁడు = మ్రొక్కినదేవతలు గలవాఁడు, నిత్యుఁడు = శాశ్వతుఁడు, మాధవుఁడు = లక్ష్మీపతి, కృతార్థము = ధన్యము.
  26. అభివాదనము = నమస్కారము, నిమీలితలోచనుఁడు = మూయఁబడిన కన్నులు గలవాఁడు - కన్నులు మూసికొన్నవాఁడు, కొండొక = కొంత, అతీతము = గడచినది, అనాగతము = రాఁగలది, విశారదుఁడు = నిపుణుఁడు.
  27. అనఘాత్ములు = పాపము లేని మనసుకలవారు.
  28. చరాచరములు = చరములును అచరములును. (చరములనగా తిరిగెడి మనుష్యాదులు, అచరములు తిరుగని వృక్షాదులు.)
  29. అమలము = నిర్మలము, అచ్యుతము = చ్యుతిలేనిది (చ్యుతి = జాఱుట - నాశము), అప్రమేయము =
    ఇట్టేదని నిశ్చయింపరానిది, ఆద్యంతశూన్యము = మొదలు తుదలు లేనిది, అశేషము = మిగులు లేనిది, దివానిశాప్రకృతిన్ = పగలు రేయి యను స్వభావముతో, చూపట్టున్ = కనఁబడును.
  30. అనాదినిధనుఁడు = పుట్టుకయు చావు లేనివాఁడు, విశ్వమయుఁడు = ప్రపంచస్వరూపుఁడు.
  31. నిరపాయశీలుఁడు = ఆపాయములేని మంచినడవడి కలవాఁడు, నిర్వికారాకారుండు = వికారము లేని ఆకృతి గలవాఁడు, నిరాలంబవర్తి = ఆవలంబములేక వర్తించువాఁడు, నిష్కళంకతేజుఁడు = కళంకములేని తేజస్సు కలవాఁడు.
  32. శశ్వద్యోధ్యబోధానువర్తనవృత్తి = మేలైన బోధింపఁదగిన బోధమును అనువర్తించునట్టి వ్యాపారముచేత.
  33. సర్గకాలవేళన్ = సృష్టికాలమైనసమయమందు.
  34. నిరస్తగతిన్ = తడఁబడినవిధముగా, ఏచిన = విజృంభించిన, లక్ష్మీవసుధాకళత్రుఁడు = శ్రీభూములు భార్యలుగాఁ గలవాఁడు.
  35. భూతవర్గవ్యాసక్తిన్ = భూతనృష్టి వ్యాసంగమును, తగిలి =పూని.
  36. బ్రహ్మణ్యుఁడు = వేదోక్తాచారములను నడపువాఁడు. ఉరగాధీశ్వరతల్పుఁడు = శేషుఁడు పాన్పుగాఁ గలవాఁడు, ఆత్మీయమూర్తి = తనదైన ఆకృతి, సర్గక్రియలు = సృష్టి కార్యములు.
  37. బుద్బదప్రతిమము = నీటిబుగ్గతో సమానమైనది, నిరూఢధ్వాంతమధ్యంబునన్ = మిగుల దట్టముగా కమ్ముకొన్న చీఁకటినడుమ, వారి =జలము, వహ్ని = అగ్ని, మరుత్ = వాయువు, విష్ణుపదము = ఆకాశము, ఆవృతములు = ఆవరించినవి - కమ్ముకొన్నవి.
  38. మానుగన్ = క్రమముగా, పానీయంబునన్ = జలమునందు, వారికడపుకాయ = టెంకాయ.
  39. గుల్ఫకము = గుల్ఫము - చీలమండ, కనకాద్రి = మేరుపర్వతము, జరాయువు = మావి, ధారుణీధరవ్రాతము = కొండలసమూహము, ఉన్నతజ్యోతి = గొప్పతేజస్సు, ఆతతశక్తిపెంపునన్ = మిక్కుటమైన బలముయొక్క అతిశయముచేత, అజాండమున్ = బ్రహ్మాండమును, పెంపుతోన్ = మహిమతో.
  40. నెట్టనన్ = క్రమముగా, నెమ్మి = మేలు - రక్షణ మనుట.
  41. నిర్గుణుఁడు = త్రిగుణవ్యాపారశూన్యుఁడు, అనర్గళముగన్ = అడ్డి లేక, సర్గస్థిత్యంతములగు మార్గములన్ = సృష్టిస్థితిసంహారములైన నడవళ్లను.
  42. సహజంబు = తనతోడఁబుట్టినది - సాధారణవృత్తి యనుట, నైజము నొప్పుచాడ్పునన్ = స్వభావగుణముగా ఒప్పునట్లు.
  43. నిర్వచనము = అర్థవివరణము
  44. నీరధిశయనునికిన్ = సముద్రమునందు శయనించినవానికి - వటపత్రశాయియైన విష్ణుమూర్తికి.
  45. హాయనము = సంవత్సరము, పరమాయువు = పూర్ణాయస్సు.
  46. త్రింశన్ముహూర్తంబులు = ముప్పదిముహూర్తములు, పంచదశకము = పదియేను, అహోరాత్రము = పగలు రాత్రియు.
  47. సౌరమానము = సూర్యుని తిరుగుటచేత అగునట్టి కాలపరిమాణము.
  48. సమలు = సంవత్సరములు.
  49. ఘస్రము = పగలు.
  50. సుధాభుక్కులము = దేవతాసమూహము.
  51. మనువు మాని = జీవితకాలము పోయి - గతించి.
  52. ఇప్పాటన్ = ఈచొప్పున, వర్తిల్లు = ఉండును.
  53. పరమేష్ఠి = బ్రహ్మ, అనల్పీకృతసత్వయుక్తుఁడై = అధికముగాఁ జేయఁబడిన సత్వగుణముతోఁ గూడినవాఁడై, కల్పించున్ = సృజించును, నారాయణకల్పము = నారాయణమూర్తితో తుల్యము, గరిమన్ = గురుత్వముతో - మహిమతో.
  54. పయోరుహాసనుఁడు = బ్రహ్మ, సాత్వికుఁడై = సత్వగుణయుక్తుఁడై.
  55. అతీతకల్పావసానంబునన్ = కడచిన కల్పము ముగిరయకముందు, నిశాకాలనిద్రాప్రబుద్ధుండు = రాత్రికాలమునందలి నిద్రవలన మేలుకొన్నవాఁడు, ఆలోకించి = చూచి, ఆగాధము = మిక్కిలి లోఁతుగలది, పాథోనిధానంబునన్ = సముద్రమునందు, వసుంధరన్ =భూమిని, ఉద్ధరింపన్ = మీఁది కెత్తను, మహార్ణవము = గొప్పసముద్రము.
  56. భూదారాధిపుఁడు = వరాహప్రభువు, నింగిన్ = ఆకాశమునందు, పొంగారన్ = ఉప్పొంగఁగా = వ్యాపింపంగా, హేలాదర్పోద్ధతశక్తియుక్తిన్ = విలాసరూపమైన గర్వముచేత నిక్కినబలముతో, అవలీలన్ = అనాయాసముగా, గహ్వరిన్ = భూమిని, దంష్ట్రాదండంబునన్ = కోఱపల్లనెడు దుడ్డుకఱ్ఱతో, అఖిలాశావిహ్వలీభూతనంపాదస్ఫారసటాకలాపనిబిడప్రక్రీడ = ఎల్లదిక్కులు చేష్టలు తక్కినవి యగునట్టి (విధమును) కలిగించునట్టి నిక్కబొడుచుకొన్న మెడవెండ్రుకలసమూహముచేత అతిశయించిన మేలైన ఆట్లాట, సంధిల్లఁగన్ = కలుగఁగా.
  57. ధరణీచక్రమున్ = భూమండలమును, శరనిధి = సముద్రమునందు, కర్ణధారుఁడు = ఓడనడుపువాఁడు.
  58. నాళీకదళము = తామరపాకు, సరసిన్ = సరస్సునందు.
  59. సూకరవరఘోణోద్గత =భీకరవాయువులవలన - ఆవరాహమూర్తియొక్క ముట్టెవలన మీఁదికి వ్యాపించిన భయంకరమైన వాయువులచేత, పైకొన్న = అతిశయించిన, సుపథగతి = మంచిత్రోవవిధము.
  60. ధరణీద్రంబులు = కొండలు, గెంటకుండన్ = చలింపకయుండ, కచ్ఛపేశ్వరశేషాహుల = ఆదికూర్మమును ఆదిశేషునిని, విశ్వవ్యాపి = అంతట వ్యాపించినది, విశ్వశక్తిన్ = సర్వశక్తిని.
  61. ప్రజాపతి బ్రహ్మరూపంబు = దక్షాదిప్రజాపతులయొక్కయు బ్రహ్మయొక్కయు రూపమును, ఉద్రిక్తుఁడు = ఉద్రేకించినవాఁడు - విజృభించినవాఁడు, సరిత్సాగరపర్వతద్వీపంబులును = నీళ్లు సముద్రములు కొండలు దీవులును, పురాతనసర్గంబులచందంబునన్ = పూర్వసృష్టులవలె.
  62. చతురాస్యుఁడు = బ్రహ్మ, సంవర్ధనుఁడు = చక్కగా వృద్ధిపొందినవాఁడు.
  63. ఏను = అయిదు.
  64. నలినగర్భుడు = బ్రహ్మ, స్రోకము = ప్రవాహము
  65. ప్రకాశబాహుళ్యతన్ = ప్రకాశాతిశయముచేత.
  66. ఉచ్చావచ = నానావిధములైన.
  67. మార్దవక్రౌర్యములు = మృదుత్వ క్రూరత్వములు.
  68. ఆప్యాయనము = ఊఱట.
  69. బలువిడి = మిక్కిలి విజృంభణముతో, ఊఁదక = నిలుపక, ఒచ్చెము = తక్కువ, మర్త్యులు = మనుష్యులు, సరివత్తురు = సరిపోలుదురు.
  70. సమ్యక్ఛ్రద్ధాసమాచారప్రవణులు = మేలైన శ్రద్ధతోడి వృత్తియందు ప్రీతికలవారు, యథేచ్భాచారరతులు = ఇచ్చవచ్చినట్టు ప్రవర్తించుటయందు ఆసక్తులు, సర్వబాధావివర్జితులు = ఎల్లకష్టములచేతను విడువఁబడినవారు - కష్టము లేనివా రనుట, అంతఃకరణశుద్ధులు = మనశ్శుద్ధిగలవారు - నిర్మలచిత్తు లనుట.
  71. పుణ్యసంశ్రయము = పుణ్యముయొక్క ఆశ్రయించుట - పుణ్యముయొక్క కలిమి, పెనుపంగన్ = పెంచఁగా, ద్వంద్వదుఃఖామయబాధలన్ = (పుణ్యపాపములు శీతోష్ణములు శత్రుమిత్రులు అనెడు) ద్వంద్వములవలని దుఃఖము లనెడు రోగబాధలను, తగిలి = అంటి - పొంది, పామరులు = అజ్ఞానులు.
  72. మాననీయులు = పూజ్యలు, సంపదున్నతులు = సంపదచేత అధికులు, మర్త్యులన్ = మనుష్యులను.
  73. అన్యోన్యధనకాంక్షులు =ఒకరొకరిధనము నపేక్షించువారు, పోరు = కలహించు, దుర్గము = అగడ్త మొదలగువానిచే చొరరానికోట మొదలగునది. ఇక్కడ ఇతరులకు చొరరానిచోటు అని యర్థము. ఆవరణంబులు = వెలుగుమరుగు మొదలగునవి, వంగరము = యుద్ధము, వారణము = ఏనుఁగు, యాచి = నిక్షేపము, మరియాద = మేర, తేటపడఁగన్ = విశదమగునట్లు.
  74. విలేపనము = పూఁత, విధాత = బ్రహ్మ.
  75. ఉపమలన్ = ఉపాయములచేత.
  76. పైరు = పైరు పెట్టుట = సేద్యము, వ్యవహారము * వర్తకవ్యాపారము, పౌరుషము = పురుషప్రయత్నము - ఒకనికొలువు చేయక జీవించుట యనుట.
  77. వ్రీహులు = వడ్లు, గోధూమంబులు = గోదుమలు, తిలలు = నువ్వులు, ప్రియంగువులు = కొఱ్ఱలు, ఉదారంబులు = ఊదర్లు, కోద్రవంబులు = ఆళ్లు, సతీనకంబులు = లంకలు, మాషంబులు = మినుములు, ముద్గంబులు = పెసలు, మసూరంబులు = చిఱుసెనగలు, నిష్పావంబులు = అనుములు, కుళుత్థంబులు = ఉలవలు, అఢక్యంబులు = కందులు, చణకంబులు = సెనగలు, శణంబులు = జనుములు, పురాణవిదులు = పురాణములు తెలిసినవారు.
  78. ఊఱట = నిలుపుదల, వేసటన్ = వేసరికచేత
  79. మాననసృష్టి = తలఁచుట చేతనే అగుసృష్టి.
  80. అహిమకరోపమానులన్ = సూర్యునిఁ బోలినవారిని, సౌష్ఠవక్రియామహితులన్ = చక్కనిపనులచేత గొప్పవారైనవారిని, వీతరాగులన్ = పోయినఆశలు గలవారిని, విమత్సరులన్ = మత్సరము లేనివారిని, తమోగుణాపనయభాస్కరులన్ = తమోగుణ మనెడు చీఁకటిని పోగొట్టుటయందు సూర్యులైనవారిని, శమచిత్తులన్ = ఇంద్రియనిగ్రహమానసులను.
  81. జితేంద్రియులు = ఇంద్రియజయము గలవారు, సంయములు = ఇంద్రియవ్యాపారములను అణఁచినవారు, ఇచ్ఛారతుల్ = ఇచ్చవచ్చిన లీలలతో, బ్రహ్మవిద్యాపారగులు = తత్వవిద్య తుదముట్ట నెఱిఁగినవారు, పటుతపశ్చరణలకున్ = దృఢమైన (చలింపని) తపము చేయుటలకు.
  82. విఫలములు = ఫలము లేనివి - వ్యర్థములు, కణఁకన్ = పూనికతో.
  83. జటిలభ్రూకుటి = వంకరైనబొమముడి కలవాఁడు, తన్నిటలస్థలియందు = అతనినొసటిప్రదేశమునందు, నిటలాక్షుఁడు = నొనట కన్ను గలవాఁడు, ప్రస్ఫుటమధ్యాహ్నార్కుఁబోలెన్ = చక్కఁగా వెలుఁగుచున్న పట్టపగటిసూర్యునివలె.
  84. అర్థనారీసహితుఁడు = సగము ఆఁడరూపముతోఁ గూడుకొన్నవాఁడు, సౌమ్యాసౌమ్యములు = తిన్నఁదనమును బెట్టిదమును గలవి, శ్యామధవళవర్ణంబులు = నలుపును తెలుపునైన వర్ణములు గలవి.
  85. గాంభీర్యము = గంభీరత, ప్రాభవము = ప్రభుత్వము, డింభకునిన్ = బిడ్డలి, ఆదిమమనువున్ = మొట్టమొదటిమనువును.
  86. విమలతపోనిర్ధూతమహాకలుష = నిర్మలమైన తపస్సుచేత తొలఁగఁగొట్టఁబడిన గొప్పపాపములు గలది, తొయ్యలిన్ = స్త్రీని, పుణ్యోపేత = పుణ్యముతోఁ గూడుకొన్నవానిని.
  87. గరిమతోడన్ = గురుత్వముతో.
  88. పరిణయమై = పెండ్లాడి.
  89. సకలవిద్యాదక్షునకున్ = ఎల్లవిద్యలయందు సమర్థుఁడైనవానికి.
  90. అష్టమూర్తి యనునభిధానంబు చేసె మఱియును - అని పాఠాంతరము.
  91. దీక్షితుఁడు = యజమానుఁడు.
  92. ప్రమదంబుగన్ = సంతోషముగా.
  93. నాఁగన్ = అనఁగా.
  94. భృగుకన్యక = భృగువుకూఁతురు, అంబురాశితనయ = సముద్రునికూతురు, జగదేకస్తుత్య = లోకమునందు ఒక్కఁడవయి స్తుతింపఁదగినవాఁడా.
  95. సంపత్కరములు = సంపదను కలుగఁ జేయునవి, పరికరంబులు = ఉపకరణములు, చిహ్నములు = గుఱుతులు.
  96. బోధబుద్ధులు = వివేకమును బుద్ధియు, స్రష్టృసృష్టులు = సృజించువాఁడును సృష్టియు, జలధివేలలు = సముద్రమును చెల్లెలికట్టయు, దినయామినులయి = పగలును రాత్రియు, మధుప్రాగ్వంశశాలలు = హవిర్గృహమున కెదుటిసభాగృహములును యజ్ఞశాలలును, పుంస్త్రీత్వములు = మగతనమును ఆఁడుఁదనమును.
  97. గరువం బారఁగ = విపులముగా, వక్కాణింప = చెప్పను, చూపట్టు = కనఁబడు.
  98. దుగ్ధవార్ధి = పాలసముద్రము, దైత్యవైరి = విష్ణువు, వేదచోదితము = వేదమునందు తెలుపఁబడినది, అంబుజభవాత్మజుఁడు = బ్రహ్మకొడుకు, పెంపుతోన్ = సవిస్తరముగా.
  99. పటుప్రచండతరశశ్వత్కోపదావాగ్నిచేన్ = సమర్థమై మిక్కిలివేండ్ర మైనయెడతెగని కోపమనెడి కార్చిచ్చుచేత.
  100. ఫాలాక్షప్రతిమానుఁడు = శివునితో తుల్యుఁడు, మహాభాగుఁడు = మహాత్ముఁడు, బాలోన్మత్తపిశాచరూపములతో = పసివానివంటియు పిచ్చివానివంటియు పిశాచమువంటియు ఆకృతులతో, ఇచ్ఛాలంకారవిహారి = ఇచ్చ వచ్చిన అలంకారముతో విహరించువాఁడు, జంభారాతిలోకంబు = ఇంద్రలోకము - స్వర్గము, ఒక్కఁడును = ఒక్కఁడే.
  101. వాసవ.. సౌరభ్యములు = ఇంద్రునియుద్యానవనమునందలిదియు యింపైనదియు ఘనమైనదియు చేతపట్టుకోఁబడినదియునైన పూదండవలని పరిమళములు, సకల .... మహిమలు = ఎల్లదిక్కులను నిండిన ప్రతిలేనిమాహాత్మ్యములు, సంధిల్లఁగాన్ = కలుగఁగాన్, కొంచున్ తీసికొని, ఏతే
    రంగు = రాఁగా, దౌదవ్వులన్ = కడుదూరమునందు.
  102. శర.. స్ఫూర్తిమైన్ = శరత్కాలమునందలి చంద్రరేఖను (రేఖాకారమైన బాలచంద్రుని ) సంగ్రహించుటవలని ప్రకాశముతో, విభావరీసతి= రాత్రి యనెడు స్త్రీవలె, కల్పద్రు... దామము = కల్పవృక్షమునందలి వాడనిపూవులచేత కట్టఁబడిన ఒప్పిద మైనసరమును, యథేచ్ఛన్ = స్వేచ్ఛగా, వినుత...బింబాధరిన్ = పొగడఁదగినమన్మథక్రీడావ్యాపారముయొక్క గౌరవము జనించిన (తోఁచుచున్న) దొండపండువంటి అధరము గలది.
  103. మదిరాక్షిచేన్ = మైకమును తోఁపించునట్టిమాపుతోడి కన్నులుగలదియైన ఆవిద్యాధరస్త్రీచేత, బెడంగడరెడు = అంద మతిశయించుచున్న, ప్రియమారఁగ = ఇష్టము పూర్తికాఁగా - మిక్కిలియిష్టముతో, సన్న = సంజ్ఞ, చయ్యనన్ = తటాలున, బారికిన్ = వశమునకు.
  104. జడలదండను = జడలవెంబడి - జడలలో, వేదండ = (వేదు, అండన్) చెమటకంపుతోడ, చెరివి = తుఱిమి, వేదండగతిన్ = ఏనుఁగునడకవంటినడకతో, వేదండముచేన్ = ఏనుఁగుతొండమువంటి చేతిని, వీచుచు = ఊచుకొనుచు.
  105. ఐరావతారూఢుఁడు = ఐరావతమనుఏనుఁగు నెక్కినవాఁడు, నాకలోకబాహ్యంబునన్ = న్వర్గలోకమునకు వెలుపల, వ్యాహ్యాళిగా = షికారుగా, దుర్వార = అణఁపఁగూడని, గీర్వాణవిభునిపాలికిన్ = ఇంద్రునియొద్దకు, నీలకంధరజటామకుటమండితంబు = శివునిజడముడియందు అలంకరింపఁబడినది, శశాంశరేఖ = చంద్రరేఖ, మందారకుసుమధామంబు = కల్పవృక్షపుపువ్వులదండ, కైకానుక = చేతికియ్యఁబడిన కానుక.
  106. ఏపునన్ = గర్వముతో, తపస్వి = దుర్వాసుఁడు, భద్రదంతీకుంభోపరిన్ = భద్రజాతిదైన తనయేనుఁగుయొక్క కుంభస్థలముమీఁద, ఎసలారెన్ = అతిశయించెను, రాజతా...స్థితిన్ = వెండికొండశిఖరమునందు శోభించునట్టియునికిచేత, వేలుపుటేఱు = దేవగంగ.
  107. అభిరామసౌరభంబులకున్ = మనోజ్ఞ మైన మంచివాసనలకు, చొక్కి - వరవశమై, ఐరావత...వారంబులన్ = ఐరావతముయొక్క చెక్కిళ్లయందుండి జాఱుచున్న మదధారలయొక్క సమూహములకు, చిక్కిన = చిక్కుకొన్న - అసక్తములైన, చంచరీకంబులు =తుమ్మెదలు, రేఁగి = విజృంభించి, మూగి = ముసురుకొని, ఘీంకారంబుతోడన్ = గీఁశతో - గీ పెట్టుచు ననుట, దిగ్గనన్ = మనసు బెదరఁగా, బెగ్గడిలి = కలఁతనొంది, ఏచి = విజృంభించి, చెలంగి = ఉత్సహించి, చిక్కుచీఱు = చిన్నభిన్నము.
  108. చిట్టకంబులకున్ = వింతపనులకు, ఔనౌను = బాగుబాగు - ఇది ప్రశంసార్థకము, కొనియోడెన్ = పొగడెను, మహోగ్రా... కటాక్షములన్ = మిక్కిలిభయంకరమైన అగ్నిజ్వాలలు వెడలుచున్న కడగంటిచూపులతో, దుర్నిరీక్ష్యుఁడు = చూడ నశక్యమైనవాఁడు.
  109. సుత్రాముఁడవు = చక్కగా లోకములను పాలించువాఁడవు, ఆదరింపక = లక్ష్యపెట్టక, మదియించి తింత = ఇంత మదించితివి, అక్షులన్ = కన్నులయందు.
  110. తనివోనిరోషమున - అని పాఠాంతరము.
  111. వివృతాస్యుఁడై = తెఱవఁబడినవాఁడై - నోరు తెఱచుకొన్నవాఁడై, విశ్వజగత్ప్రళయంబు = ఎల్లలోకములయొక్క నాశమును, తనుఁబోని = తన్నుఁబోలిన (తనివోని = తనివితీరని - తృప్తి పడని)
  112. పార్ష్ణిఘాతకంపితధరాధరుఁడు = మడమతాఁకులచే వడఁకెడు కొండలుగలవాఁడు, సంచలితాధరుండు = అదురునట్టి పెదవులు గలవాఁడు, కుటిల... భాగుఁడు = వంకరైన బొమముడిచేత అదురుచున్న నొసటిప్రదేశముగలవాఁడు, రోషారుణ...రాగుఁడు = కోపముచేత ఎఱ్ఱనిమిడుఁగుఱులు రాలుచున్న కన్నులయొక్క ఎఱ్ఱదనముగలవాఁడు, ప్రకంపమానదేహుండు = మిక్కిలివడఁకుచున్న శరీరముగలవాఁడు, ఊర్ధ్వబాహుఁడు = మీఁది కెత్తఁబడిన చేతులుగలవాఁడు, విహ్వలీభూతచేతస్కుఁడు = భయముచేత వశము గాని మనస్సు కలవాఁడు, అజ్ఞానము = అవివేకము.
  113. మొగమోట = దాక్షిణ్యము, అవజ్ఞ = అవమానము, తక్కులఁ బెట్టఁగన్ = మోసపుచ్చుటకు, పేరు = కీర్తి, పెంపు = గౌరవము, కూలఁగన్ = నశించఁగా, ఒండు = మఱియొకటి - వేఱొకమాట యనుట.
  114. పనివడి = పూని, కానితప్పు = చేయరానితప్పు, భయంకర...మానసుఁడ = వెఱపును కలుగఁజేయునట్టి కోపాగ్నిచేత నిండినమనస్సు కలవాఁడను.
  115. చిత్తంబు గొలుపకున్నయది = మనను రాకయున్నది, పురందరుండు = ఇంద్రుఁడు.
  116. అమితక్రోధపరీతుఁడు = అధికమైన కోపముచేత ఆక్రమింపఁబడినవాఁడు, ఆక్షిప్తతేజస్కుఁడు = ఆక్షేపింపఁబడిన తేజస్సుగలవాఁడు, ఆరాటించుచు = ఆరాటపడుచు, వీటికిన్ = పట్టణమునకు.
  117. మఘవుఁడు = ఇంద్రుఁడు, అచ్చరలేములు = అప్సరస్త్రీలు, సీకదంతి = తెల్లయేనుఁగు - ఐరావతము, కోశము = బొక్కసము.
  118. ముట్టి = ఆక్రమించి, అనావృష్టి = వఱపు, సొంపు = బాగు - పంట యనుట.
  119. నిశ్శ్రీకము = సంపద లేనిది.
  120. క్షామజరాదిరోగములక్రందునన్ = కఱవు ముసలితనము మొదలైన రోగములసందడిచేత.
  121. మఘవుమీఁదన్ = ఇంద్రునిమీఁద, సంగరపటిష్టత = యుద్ధమునందలి నేర్పును, పఱివోయి = కొల్లపోయి - అడఁగి.
  122. దుష్టము = చెడ్డది, చందము = విధము, కొల్లలాడుట = కొల్ల పెట్టుట, వ్యక్తితోన్ = విధముతో ననుట.
  123. పురుదాలినోరిమునికిన్ = దుడుకునోటిఋషికి.
  124. నీపుణ్యమునన్ = నీవు చేసికొన్న పుణ్యముచేత - నీవు నశింపక నీసంపదలు మాత్రము నశించుటకు నీవు చేసికొన్న పుణ్యఫలముచేత ననుట.
  125. బారి = ఆపద, గుండె గూడఁబెట్టి =మనస్సు దృఢపఱచుకొని.
  126. పదము = స్థానము, పుచ్చి = పోఁగొట్టి, తేప = తెప్ప.
  127. పురస్కరించుకొని = ముందు పెట్టుకొని, హుతాశనప్రముఖ - అగ్ని మొదలగు.
  128. సతతసంచారనక్రాదిసత్వంబున్ = ఎల్లప్పుడు మెలఁగుచుండెడు మొసళ్ళు మొదలగు ప్రాణులుగలదానిని, సుమనోముఖ్యసంస్తూయమానంబు = దేవతలు మొదలుగాఁ గలవారిచేత స్తోత్రము చేయఁబడుచున్నదానిని, రంగత్తుంగ... విడంబంబు = చలించుచున్న గొప్ప అలలచేత అతిశయించుచున్న మిక్కుటమగు ధ్వనిచే నిండింపఁబడినదిక్కు లయొక్క వ్యా ప్తి కలదానిని, గంభీరాంబు ... ద్భాసిన్ = లోతైననీటినడుమ నుండెడు ప్రసిద్ధములైన రత్నములసమూహముచేత మిక్కిలి ప్రకాశించుదానిని, దుగ్ధాంబురాశిన్ = పాలసముద్రమును.
  129. అద్భుతచిత్తులు = ఆశ్చర్యము నొందిన మనస్సు గలవారు.
  130. తోపు = గొప్పవృక్షములు గలవనము, పెన్ గదుపులు = గొప్పమందలు, ఓరంతప్రొద్దు = ఎల్లప్పుడు, చెన్ను = బాగు - ఒప్పిదము, పరిపూర్ణము = కొఱఁతలేక నిండినది, ప్రవహించి = వెల్లువయై.
  131. కల్పావ... కంఠము =కల్పవృక్షపఙ్క్తులచేత ఒప్పుచున్న ఉద్యానవనములు గలదానిని, పతాకా...కుంఠము = టెక్కెముల సమూహములయొక్క విలాసమును ప్రకటించుటచేత సూర్యకాంతిని మఱుఁగుపఱచుదానిని, నిలింప...త్కంఠమున్ = దేవతలమనస్సులకు సంతోషమును పుట్టించునట్టి వేడుకలుగలదానిని, పద్మ... వైకుంఠమున్ = శ్రీవిష్ణునియునికితోడి గృహములు గలవైకుంఠపట్టణమును.
  132. సముద్య... విభ్రాజితము = మిక్కిలి వెలుఁగుచున్నరత్నములకాంతిజాలములకలిమిచేత ప్రకాశించునది, నగరన్ = రాజసౌధమునందు, శశ్వద్వేద...వేదులు = అపారములైన వేదములు వేదాంతములు నయిన విద్యల నెఱుఁగువారు.
  133. శతకోటిభాస్కరసందీప్తతేజునిన్ = నూఱుకోట్లసూర్యులు వెలుంగునట్లు వెలుఁగుతున్న తేజస్సుగలవానిని, ప్రావృట్పయోధరభవ్యగాత్రున్ = వానకాలపుమేఘమువలె (ఒప్పునట్టి) పూజ్యమైన దేహము గలవానిని, పీఠికౌశేయశోభితకటీరున్ = పచ్చపట్టుతాపితాచేత శోభించునట్టి కటిప్రదేశముగలవానిని, లాలిత...లాంఛితున్ = ఒప్పిదమైన శ్రీవత్సమనుమచ్చచేత గుఱుతుపెట్టఁబడినవాఁడు, ఇందిరా... పీనవక్షునిన్ = లక్ష్మీదేవికి ఇల్లుగా చేయఁబడిన విశాలమైనఱొమ్ముగలవానిని, కారుణ్యమూర్తిన్ = తరుణభావముతోడి కోటిమన్మథులరూపమువంటి రూపముగలవానిని, జగదేకపూతచరితున్ = లోకమునకు ఒక్కఁడైన పావనమైన నడవడిగలవానిని, సమస్త...నిలయున్ = ఎల్లయోగులయొక్క నిర్మలములైన మనఃపద్మములు ఉనికిపట్టుగాఁ గలవాఁడు, వివశులు = పరవశులు.
  134. రూపఱిన = నశించిన.
  135. మంథము = కవ్వము, మొఱఁగి = వంచించి.
  136. డెందముల = మనసులయందు, పూరములు = ప్రవాహములు, నిలింపమునిబృందములు = దేవతలయొక్కయు మునులయొక్కయు సమూహములు, పొందుపడన్ = సరిపడునట్టు, కందువ = స్థానము - తెగ.
  137. ప్రముదిత...కందరమును = సంతోషించిన గంధర్వులును యక్షులు నైనభర్తలకు చేయఁబడిన క్రీడచే మనోజ్ఞురాండ్రైన విలాసస్త్రీలుగల గుహలు గలదానిని.
  138. అగలించి = పెల్లగించి.
  139. జువ్వనన్ = జువ్వు అనుధ్వని కలుగునట్లుగా, మవ్వము = బాగు - పూనికయనుట, సమకట్టుచున్ = యత్నించుచు.
  140. ధరణీధరము = కొండ, ధరణీధరమర్దనుఁడు = ఇంద్రుఁడు, ధరణీధరుఁడు = విష్ణుఁడు.
  141. సహస్రాక్షుఁడు = ఇంద్రుఁడు.
  142. కవ్వపుకొండ = మందరపర్వతము, జడియకుండఁగన్ = తొలఁగకుండ, తరిత్రాడు = కవ్వపుత్రాడు, ఉరగవల్లభుని = సర్పరాజుయొక్క - వాసుకియొక్క, గాత్రమున్ = దేహమునందు, సత్వంబు = శక్తిని, దివౌకసులు = దేవతలు.
  143. భోగి =సర్పము, వీఁకన్ = పూనికతో.
  144. పర్వినన్ = వ్యాపింపఁగా, ఆసురనాయకుల = రాక్షసరాజులయొక్క.
  145. విషధర...ఘాతమునఁ జేసి = సర్పరాజగువాసుకియొక్క బుసతోడి గొప్పగాలియొక్కపెట్టుచేత, దిక్కు = తట్టు, వారిధరములు = మేఘములు, శీకరాసారములన్ = తుంపురువానలతో.
  146. వైశ్రవణునిన్ = కుబేరుని, అద్రికన్యాధవుఁడు = గౌరీపతి - శివుఁడు.
  147. మదిర = కల్లు.
  148. దర్వీకరవరులు = పర్సరాజులు.
  149. హరితకీఫలసమంచితహస్తుఁడు=కరకకాయచేత ఒప్పిద మైనచేయిగలవాఁడు, దివ్యభూషణాత్యంతవికాసుఁడు = దివ్యము లైన ఆభరణములచేత మిక్కిలి వెలుఁగువాఁడు, విలసితామృతకుంభధరుఁడు = ప్రకాశించునట్టి అమృతకలశమును ధరించినవాఁడు, ఔషధాత్యంతపరిశ్రముఁడు = మందులవిషయమున మిక్కిలివాడుక పడినవాఁడు, ధవళాంబరధారుఁడు = తెల్లనివస్త్రమును కట్టుకొన్నవాఁడు, దుగ్ధసాగరము = పాలసముద్రము.
  150. ధృతాంబురుహ = ధరియింపఁబడిన కమలము గలది, వజ్రిముంగిటం బెట్టినపెన్నిధానము = ఇంద్రునియొక్క యింటిముందుభాగమునందు ఉంచిన గొప్పనిధి, పట్టి = బిడ్డ.
  151. కొనియాడిరి = స్తుతించిరి, సముద్రవల్లభుఁడు = వరుణుఁడు, అమ్లాన = వాడని, కైసేసిరి = అలంకరించిరి, సంపత్సంపాదకంబులు = కలుములను సంపాదించునది.
  152. విద్వేషులు = విరోధులు, దాసామదాసులు = దాసులను అనుసరించినదాసులు (దాసుఁడు = భక్తుఁడు).
  153. అప్రమేయబలులు = మితి లేనిబలముగలవారు, బలసి = ఆవరించి, విబుధులు = దేవతలు, విహ్వలింపన్ = అవయవపాటవము లేనివారు కాగా.
  154. తోయజనాభుఁడు = విష్ణువు, మాయాసతి = కపటస్త్రీ, నిశాటమధ్యంబునకున్ = రాక్షసులనడిమికి, కుసుమబాణవికారాయత్తులన్ = మన్మథవికారమునకుఁ లోబడినవారినిగా, మోహనాకృతివలన = మోహింపఁజేయఁ జాలిన ఆకారముతో.
  155. బింకము = బిగువు, మించులు = మెఱుఁగులు - కాంతులు, నిడువాలుగన్నుఁగవ = విశాలములై మనోజ్ఞము లైనకన్నులజంట, తిన్నని = మేలైన, చెలువంబు = అందము, అన్నువకౌను = సూక్ష్మమైననడుము, పొలఁతుకన్ = స్త్రీని.
  156. అనిమిషులు = ఱెప్పపాటు లేనివారు, దైత్యస్తోమము = రాక్షససమూహము, పారవశ్యదోహలులు = పరవశత్వముచేత అతిశయించినవారు - మిక్కిలిపరవశులైనవారు.
  157. జగదపకారపరాక్రములు = లోకమునకు చెఱుపును గలుగఁజేసెడుపరాక్రమము కలవారు, మగుడంగన్ = మరల, నగభేది = ఇంద్రుడు.
  158. పాకశాసనుఁడు = ఇంద్రుఁడు, పరమానురాగి = అధికమైన అనురాగముగలవాఁడు, కడిమి = శౌర్యము.
  159. జంభారి = జంభునిశత్రువు, కుంభినీ...విజృంభణంబువలనన్ = కొండలకు భయమును కలుగఁజేయునట్టి వజ్రాయుధముయొక్క వాదరయొక్క విజృంభణముచేత, పఱచి = పరుగెత్తి.
  160. కందువ = స్థానము, పయోనిధి = సముద్రము, అందంబుగన్ = చక్కగా.
  161. మధుకైటభశాసనునకున్ = మధుకైటభులకు శిక్షకుఁడైన విష్ణువునకు, అభివాదనము = నమస్కారము, కృపావిధేయుఁడు = కృపకు అధీనుఁడు, నిజశాసనంబునన్ = తనఆజ్ఞయందు, ప్రసన్నదీప్తిమంతుఁడు = మసక లేని ప్రకాశము కలవాఁడు, తేజరిల్లె = వెలిగెను, ప్రదక్షిణార్చులై = ప్రదక్షిణములైన మంటలు గలవై, రాజవిడ్డూరంబు = రాజులవలని తొందర, ఉడిగి = అణఁగి.
  162. శతమన్యుఁడు = ఇంద్రుఁడు, ఆమంత్రితుఁడు = పంపఁబడినవాఁడు, అతులితవిభూతిన్ = సరిపోల్పరాని సంపదతో.
  163. ఉపాసకుఁడు = సేవకుఁడు, తామరసవాసిని = తామరయందు వాసము చేయునది.
  164. అలవికావు = లభింపవనుట.
  165. మూర్తిన్ = దేహమునందు, ఆర్తి = పీడ, సభాంతరంబులందు = సభలలో, నీకృపవాఁడు = నీదయకు అధీనుఁడు.
  166. కల్లచూపులు = కపటపుచూపులతో.
  167. నిలింపవల్లభునకున్ = దేవేంద్రునితో, విష్ణువల్లభ = లక్ష్మీదేవి.
  168. స్వారాజ = స్వర్గమునకు రాజైన యింద్రుఁడా, ఆరాధన = అర్చన.
  169. అంబ = తల్లీ, మదభ్యస్తము = నాచే అభ్యసింపఁబడినది, పత్తి = పదాతి - కాలుబలము, వాజి =
    గుఱ్ఱము, వారణము = ఏనుఁగు, మహిషి = ఎనుము - బఱ్ఱె, హేమ = బంగారు, రాజధానులందున్ = ప్రధానపట్టణములయందు.
  170. అంతర్ధానంబును బొందెన్ = మఱుఁగుపడిపోయెను, వనజాలయ= లక్ష్మీదేవి, వీడు = పట్టణము.
  171. వరములు = సృష్టులు, ఫణితిన్ = పక్కికచేత.
  172. ధరణీధ్రము = కొండ.
  173. శతపత్ర...పాణులు = బ్రహ్మశివవిష్ణువులు.
  174. ఏకోనపంచాశత్సంఖ్యులు = నలువదితొమ్మిదిసంఖ్యలు గలవారు.
  175. సారాచారవివేక = సారవత్త్తెననడవడియు వివేకమును గలవాఁడా, వైభవకళాసంపన్న = విభవమనువిద్యచేత సంపన్నుఁడా, విజయశ్రీవైభవోపేత = గెలుపుసంపదయనెడు వైభవముతోఁ గూడుకొన్నవాఁడా, మందార...దానగుణ = కల్పవృక్షముతోడను చింతామణితోడను సమానమైన యీవిగుణముగలవాఁడా.
  176. అమందగుణరాజితా = చొరవగల గుణములచేత ప్రకాశించువాఁడా, హరిపదాబ్జసంపూజితా = విష్ణువుయొక్క పాదకమలములను పూజించువాఁడా, సమగ్రవిభవాకరా = సంపూర్ణమైన వైభవమునకు గనియైనవాఁడా, సమదరాడ్భీకరా = మదించిన రాజులకు భయంకరుఁడైనవాఁడా, అమానుషపరాక్రమా = సామాన్యమనుష్యులయందు లేనిపరాక్రమము గలవాఁడా, అఖిలదుష్క్రియాపక్రమా = సమస్తదుష్టకృత్యములను తొలగించువాఁడా.