ఆంధ్ర శ్రీవిష్ణుపురాణము/ఆంధ్ర శ్రీవిష్ణుపురాణము-పీఠిక

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీవిష్ణుపురాణము

(సటిప్పణము)

పీఠిక



కాంతాకుచహేమకుంభములపైఁ జెల్వారు కాశ్మీర మ
స్తోకంబై తనపేరురంబునఁ గడున్ శోభిల్లి దీప్తిచ్ఛటా
వ్యాకోచంబుగఁ గౌస్తుభంబునకు జోడై యున్న మోదించుసు
శ్లోకుం డబ్బసవేంద్రురాఘవున కిచ్చున్ సుస్థిరైశ్వర్యముల్.[1]

1


ఉ.

సల్లలితాస్యపంచకము శాఖలు చారుజటారుణద్యుతుల్
పల్లవకాంతి చందురుఁడు పక్వఫలంబు శిరోగ్రగంగ సం
ఫుల్లసుమంబు సత్కరుణ పుష్పరసం బగుచున్న పార్వతీ
వల్లభకల్పశాఖి బసవప్రభురాఘవు ధన్యుఁ జేయుతన్.[2]

2


చ.

సరసిజనాభునాభిజలజాతము పుట్టినయిల్లు సత్కవీ
శ్వరులకుఁ బల్కుఁదోడయిన శారద పట్టపుదేవి వేదముల్
పరఁగువినోదవాక్యముల పద్ధతులై కనుపట్టు భారతీ
వరుఁడు శుభంబు లిచ్చు బసవప్రభురాఘవభూమిభర్తకున్.[3]

3


మ.

జననీస్తన్యము గ్రోలుప్రాయమున నుత్సాహంబుతో దేవతా
వనితల్ వేడుకపుట్టఁ దాళగతులన్ వాయించుచుం బాడఁగాఁ
గనదుల్లాసముతోడ బొజ్జ గదలంగా నాడులంబోదరుం
డనురాగంబున రాఘవప్రభుని నిత్యశ్రీయుతుం జేయుతన్.[4]

4

చ.

అరుదుగ నాదిలక్ష్మిసరియైన మహీసుతతోడఁ బంకజో
దరనిభుఁడై యయోధ్యఁ బ్రమదంబు చెలంగఁగ నుండు కైవడిన్
వరవిభవంబుతోఁ జెదలువాడపురంబున నుండు రాఘవే
శ్వరుఁ డిలువేలుపై యొసఁగు సంతతమున్ గృతినాథుకోరికల్.[5]

5


చ.

మెఱసి శశాంకపోత మనుమెచ్చుల క్రొవ్విరికొప్పుచెంగటన్
దుఱిమి కృపారసామృతము తొంగలిఱెప్పలతోడికన్నులన్
నెఱయఁగ యోగినీజనులు నెమ్మిమెయిన్ భజియింకు నున్నమా
కరిముఖదేవుతల్లి దయఁ గాచుఁ గృతీశ్వరుఁ డైనరాఘవున్.[6]

6


శా.

వేదంబుల్ పరమార్థచోదితములై విఖ్యాతసాంగంబులై
యాదిం బంకజగర్భుచే రచితమైన ట్లంశషట్కంబునం
బాదై యుండ నొనర్చె వైష్ణవపురాణం బట్టిజ్ఞానవి
ద్యాదీక్షాగురునిం బరాశరుని నిత్యప్రీతితోఁ గొల్చెదన్.[7]

7


శా.

ఆరూఢస్థితి నెల్లలోకములఁ బ్రఖ్యాతంబుగా భారత
శ్రీరామాయణముల్ రచించినమనీషిస్తుత్యచారిత్రులన్
సారస్ఫారగభీరచారుకవితాసంపన్నవాచాసుధా
ధారాసారవిహారులన్ గొలుతు వేదవ్యాసవాల్మీకులన్.[8]

8


ఉ.

మున్నిటి కాళిదాసకవిముఖ్యులకుం బ్రణమిల్లి వారిలో
నెన్నికగాఁ బ్రబంధపరమేశ్వరుఁ దిక్కనసోమయాజినిన్

నన్నయభట్టు భాస్కరుని నాచనసోముని రంగనాథునిన్
వెన్నెలగంటిసూర్యుఁ బదివేలవిధంబులఁ గొల్చి భక్తితోన్.[9]

9


ఉ.

ఏను పరాశరుండు రచియించినవిష్ణుపురాణ మాంధ్రభా
షానిపుణోక్తులం బలుకఁజాలెద నంచుఁ దలంచినాఁడ శే
షానిలభుగ్విభుం డురుసహస్రశిరంబులఁ దాల్చులోకముల్
హీనపుఁబూరిపాము ధరియించెద నంచుఁ దలంచుచాడ్పునన్.[10]

10


మ.

హరిసంకీర్తన యైననాకవితయం దాక్షేపముల్ గల్గినన్
సరసత్వంబుల కామదిం దలఁపుడీ సర్వజ్ఞులై సత్కవుల్
కరమొప్పారెడుచంద్రబింబము కళంకప్రస్థ మయ్యున్ సుధా
పరిపూర్ణస్థితి నెల్లలోకముల సంభావ్యంబునం బొందదే.[11]

11


ఉ.

పన్నగశాయిసత్కథ లపారము లన్నియుఁ జెశ్పనోపుదే
సన్నపుబుద్ధివాఁడవని సత్కవులాడిన విన్నవించెదన్
మున్ను పితామహుండు మునిముఖ్యులు విష్ణుపురాణపద్ధతుల్
కొన్నియెకాక యన్నియును గోరి నుతించిరె యేయుగంబులన్.[12]

12


ఉ.

తామరసాక్షుపుణ్యచరితంబు లనంతము లందులోపలన్
నామది భక్తియుక్తియును నానిపుణత్వము నెట్టి దట్టివా
చామలవృత్తి నెన్నెద సుధాంబుధిలోపలినీరు చూచి తృ
ట్కాముఁడు వచ్చి దప్పి యడఁగందగుమాత్రము గ్రోలుచాడ్సునన్.[13]

13


ఉ.

ఆదర మొప్పఁగా సుకవు లారసి చాటుతరప్రబంధసం
పాదము మేలుమే లనుచుఁ బల్కిన నొప్పు జగత్ప్రసిద్ధమై
కాదని తప్పుఁబట్టి కొఱగామిఁ దలంచినఁ దొంటికాళిదా
సాదిమహాకవీశ్వరులకైనను నేరము లేకయుండునే.[14]

14


వ.

అని యిష్టదేవతాప్రార్థనంబును, పురాతనకవిస్తోత్రంబును, మదీయచిత్తసమా

ధానంబునుం జేసి శ్రీవిష్ణుపురాణనిర్మాణప్రవీణహృదయుండనై యుండునప్పుడు
సకలసముద్రముద్రితాఖిలవసుంధరాచక్రపరిపాలనపరాయణుండును, రూప
నారాయణుండును, చటులకుటిలవిరోధియూధగహనధనంజయుండును, సంగ్రా
మధనంజయుండును, సంగరోత్సాహసంగతచతురంగసేనాసమేతారాతిగర్వాం
ధకారసముజ్జ్వలాదిత్యుండును, పల్లవాదిత్యుండును, సముద్దండప్రచండవిరోధి
మండలేశ్వరప్రాణానిలమండలాగ్రభుజంగుండును, రాయవేశ్యాభుజంగుం
డును, అనవరతసుకవినికరస్తోత్రవచనరచనాసమయనిర్వికారుండును, చంచుమల
చూఱకారుండును, వేదశాస్త్రపురాణప్రవీణభూసురాశీర్వాదప్రవర్ధమాన
గోత్రుండును, యానపాలగోత్రుండును, పంటవంశపయఃపయోరాశిరాకాశర్వ
రీశ్వరుండును, రావూరిపురవరాధీశ్వరుండును నైనబసవభూపాలురాఘవుండు.[15]

15


సీ.

గౌరీసమేతుఁడై గరిమతో నేవీట నేపారు నీలకంఠేశ్వరుండు
వారాశికన్యతో వర్ణించు నేవీట గిరిభేదినుతుఁ డైన కేశవుండు
యోగినీసహితయై యొప్పారు నేవీటఁ బసిఁడిపోలేరమ్మ భవునికొమ్మ
పాపవినాశయై ప్రవహించు నేవీట మన్నేఱు మిన్నేటిమారటగుచుఁ


ఆ.

గుంజరములు వేయి గొలువంగ నేవీటఁ, గొడగుచక్రవర్తి పుడమియేలె
నట్టిరాజధాని యై యొప్పు గుడ్లూరి, నొనర నేలుచుండి యొక్కనాఁడు.[16]

16


సీ.

వేదాంతవిదులైన విద్వాంసు లొకవంక నుభయభాషాకవు లొక్కవంక
సకలాప్తబాంధవసంబంధు లొకవంక నుదుటుమన్నెకొమారు లొక్కవంక
నీతికోవిదులైన నెఱమంత్రు లొకవంక నుద్దండరణశూరు లొక్కవంక
సంగీతసాహిత్యసర్వజ్ఞు లొకవంకఁ జొక్కపుభరతజ్ఞు లొక్కవంక


తే.

రాజరాజులు పంచిన రాయబారు, లొక్కవంక విలాసిను లొక్కవంక

బలసి కొలువంగ నతులవైభవముతోడ, రమణఁ గొలువుండె బసవయరాఘవుండు.[17]

17


సీ.

కరమూలరుచులబింకపుఁబంకజాక్షులు రమణతో వింజామరములు వీవ
గుబ్బపాలిండ్లనిగ్గులు దేరు నొకయింతి ప్రమదంబుతోకో నడపంబుఁ బూర
వాలుచూపులచే నివాళించి యొకలేమ కాళాంజిపూని చెంగట నటింప
పంచమస్వరమునఁ బద్మాక్షి యొక్కతె యవధారు చిత్తేశ యనుచుఁ బలుక


తే.

లలితబిబ్బోకహేలావిలాసములను, రాజబింబాస్య లుభయపార్శ్వములఁ గొలువ
రాజసంబున బసవయరాఘవుండు, నిండుకొలువుండెఁ గన్నులపండు వగుచు.[18]

18


క.

పౌరాణికు లఖిలకళా, పారీణులు బహుపురాణపద్ధతు లతిగం
భీరోక్తుల వినిపింపఁగ, గౌరవమున వినుచుఁ బరమకౌతుక మొప్పన్.[19]

19


క.

అనవేమమండలేశ్వరుఁ, డును నళ్లయ వీరభద్రుఁడును మొదలుగఁ గ
ల్గినతొంటిరెడ్డిరాజులు, ఘనకీర్తులు గనిరి కృతిముఖంబున ననుచున్.

20


తే.

కృతిముఖంబునఁ దానును గీర్తివడయఁ, బూని పెద్దలయనుమతంబునఁ దెనుంగు
బాస విష్ణుపురాణ ముపన్యసింప, సరసుఁ డైనట్టిసత్కవీశ్వరుని నరసి.[20]

21


ఉ.

ఈనిఖిలంబు మెచ్చ నమరేశ్వరదేవుఁడు చూడఁ గృష్ణవే
ణీనది సాక్షిగా పనికి నిల్చినరావుతుఁ గేసభూవిభుం
గానకుఁ దోలి వెన్నడిచి కాచినవేమయయన్నపోతభూ
జానికి సత్ప్రబంధము లొసంగిన వెన్నెలగంటివారిలోన్.[21]

22


సీ.

భవ్యచరిత్రు నాపస్తంబమునిసూత్రు, శుద్ధపారస్వతస్తోత్రపాత్రు
హరితగోత్రపవిత్రు నాంధ్రభాషాకావ్యరచనాభినయవిశారదుఁ బ్రబంధ
కర్తను వెన్నెలకంటిసూర్యునిమనుమనిఁ జెరుకూరియమరయమంత్రి
సత్పుత్రు నాశువిస్తారవిచిత్రమాధుర్యకవిత్వచాతుర్యశీలు


తే.

నిజకులాచారమార్గికనిపుణుఁ బరమ, సాత్వికోదయహృదయు వైష్ణవపురాణ

వేది సారస్యవిద్యాప్రవీణు సుకవి, మాననీయుని సూరనామాత్యవరుని.[22]

23


క.

నన్నుఁ బిలిపించి పెద్దయు, మన్నించి గురూపచారమార్గంబులు సం
పన్నములు చేసి వినయము, దన్నెంతయుఁ బ్రోదిసేయఁ దగ నిట్లనియెన్.[23]

24


క.

నీ విప్పు డాంధ్రభాషం, గావించుచు నున్న చంపుకావ్య మ్మగునీ
శ్రీవిష్ణుపురాణము నా, కీవలయు మరియకీర్తి యిలలో నెగడన్.[24]

25


క.

క్షితిలోనఁ బసిఁడి పరిమళ, యుతమై రత్నమును గూడి యున్నట్లు సుమీ
కృతి శ్రీవిష్ణుపురాణము, కృతికర్తవు నీవు నేను గృతిపతి నగుటల్.[25]

26


వ.

అని బహుమానపూర్వకంబుగా గంధాక్షతంబు లొసంగి కనకమణిభూషణాం
బరంబులు గట్టనిచ్చి కర్పూరసహితంబుగాఁ దాంబూలంబు సమర్పించి తమతం
డ్రిపేర బసవాపురం బనునగ్రహారం బేకభోగంబుగా నొసంగి గౌరవించిన
నేనును బరమసంతోషపరిపూర్ణహృదయుండనై మదీయప్రణీతకావ్యకన్యా
మనోహరుం డగురావూరిబసవభూపాలురాఘవువంశం బభివర్ణించెద.[26]

27


ఆ.

జలజనాభునాభిజలజాతమున బ్రహ్మ, జనన మొందె నతనిచరణపంక
జమున శూద్రజాతి జన్మించి వారిల, యందుఁ బంటవంశ మతిశయిల్లె.[27]

28


ఆ.

అట్టిపంటకులంబునందు నేడవచక్ర, వర్తి యన్న వేమవసుమతీశుఁ
డుద్భవించి కీర్తియును సత్ప్రతాపంబు, నెసఁగ భూమియెల్ల నేలుచుండె.[28]

29


క.

తనబ్రతుకు భూమిసురులకుఁ, దనబిరుదులు పంటవంశధరణీశులకున్
దననయము భూమిప్రజలకు, ననవేమన యిచ్చెఁ గీర్తి నధికుం డగుచున్.[29]

30


క.

ఆపంటవంశమునఁ గుల, దీపకుఁ డగులింగశౌరి తేజోధికుఁడై
యేసారెఁ గీర్తిలక్ష్మికిఁ, బ్రాపై తొల్లింటిరెడ్డిరాజులకరణిన్.[30]

31


క.

ఘనుఁ డాలింగారెడ్డికి, తనయుఁడు కీర్తిప్రతాపధాముఁడు తేజో
ధనుఁడై పేరమరెడ్డి సు, జనవినుతుఁడు పుట్టె భాగ్యసంపద వెలయన్.[31]

32


క.

పేరుగల లింగయప్రభు, పేరన నుదయించె సుతుఁడు పెంపున్ సొంపున్

బౌరుషము యశము గలత, న్మూరెడ్డి సమస్తజనులు ప్రస్తుతి సేయన్.[32]

33


సీ.

తనగుణశ్రేణి దిగ్ధరణీశకోటీరసముదయంబులకు రత్నములు చేసెఁ
దనసాహసము సముద్యదర్పవిద్వేషిజగతీశులకు గుండెదిగులు చేసెఁ
దనకీర్తి తారకాధవతారకాతారవసుధాధరములకు వన్నె చేసెఁ
దనదానమహిమ మందారగుహ్యకరాజశిబిదధీచులకును సిగ్గు చేసెఁ


తే.

దనవిభవలక్ష్మి మిత్రబాంధవకవీంద్ర, నీలపంకేరుహంబుల నెలవు చేసె
బసవశంకరజగరక్షపాలబిరుద, ధనుఁడు రావూరిపేరయతమ్మవిభుఁడు.[33]

34


క.

ఆతమ్మక్షితిపాలుఁడు, పాతివ్రత్యమున సకలభాగ్యశ్రీలన్
సీతకుఁ బ్రతి వచ్చినవి, ఖ్యాతగుణాలంబ మాచమాంబ వరించెన్.[34]

35


తే.

ఆవధూటికి నుదయించి రమితగుణస, మగ్రవైభవు లత్యంతమహితయశులు
బసవశౌరియు నన్నయప్రభువరుండు, లింగవిభుఁడు ననంగ నుత్తుంగయశులు.[35]

36


క.

వారలలోపల బసవ, శ్రీరమణుఁడు పేరుపెంపు గలమన్నీఁడై
భూరిప్రతాపజయల, క్ష్మీరతుఁడై వెలసె నుదయగిరిరాజ్యమునన్.[36]

37


సీ.

కుటిలతరారాతికుంభినీధవమహాభూభృత్కదంబరంభోళిధరుఁడు
దారుణాహితపయోధరపాటనవ్యగ్రబంధురఝంఝాప్రభంజనుండు
పటుతరప్రతిపక్షపక్షఘోరారణ్యసముదగ్రచటులవైశ్వానరుండు
కఠినాహితవ్రాతగాఢాంధకారలుంటాకప్రచండప్రభాకరుండు

తే.

సమదవిద్వేషి రాజన్యసైన్యజలధి, ఘోరసంరావశోషణకుంభజుండు
భీమబలశాలి నిస్సీమభూమిదాన, పరశురాముఁడు తమ్మయబసవవిభుఁడు.[37]

38


సీ.

నిరుపమగుణశీలనిజబంధులోచనోత్పలకలాపమున కుత్సవ మొనర్చి
నిఖిలభూజనచిత్తనిస్తంద్రనవచంద్రకాంతరత్నంబులఁ గరఁగఁజేసి
సంభృతైశ్వర్యప్రశస్తవంశామృతాంభోనిధానంబు నుప్పొంగఁజేసి
సన్నుతసత్కవీశ్వరగాయకచకోరసమితి కానందంబు సంతరించి


తే.

వైరిరాజన్యకామినీవదనపంక, జములు ముకుళింపఁజేయుచు జగములందు
నెసఁగు రావూరితమ్మయబసవవిభుని, కీర్తిచంద్రుఁడు సత్కళాకీర్ణుఁ డగుచు.[38]

39


సీ.

కపటారివాహినీకాంతారములఁ గాని దరికొల్పఁ డతులతాపవహ్ని
బంధుమిత్రనిశాంతపంకజంబులఁ గాని భాసిల్లనీఁడు సౌభాగ్యలక్ష్మి
బ్రహ్మాండమండలోపఘ్నసీమలఁ గాని వర్తింపనీఁడు సత్కీర్తిలతల
రాజరాజాస్థానరంగస్థలులఁ గాని యాడనీఁ డురుచరిత్రాప్తి నటుల


తే.

సకలసుకవీంద్రబంధునిర్జరులఁ గాని, యాననీఁడు వచోమధురామృతంబు
నవ్యసంగ్రామకేళీధనంజయుండు, పల్లవార్కుండు రావూరిబసవవిభుఁడు.[39]

40


సీ.

కటకాధిపతియైన గజపతిరాజుచేఁ బ్రతిలేనిపల్లకిపదవి నొందె
మహిమచేఁ గర్ణాటమండలాధిపుచేతఁ గడలేనిరాజ్యభాగములు గాచెఁ
ప్రౌఢపౌరుషమున రాజిల్లి మెఱయఁ గామలకవజీర్ల కమ్మలికఁజేసెఁ
దెలగాణభూములఁ గలమన్నెవారిచే బలవంతమునను గప్పములు గొనియెఁ


తే.

జాటుధాటీనిరాఘాటఘోటకావ, ళీఖురోద్ధూతనిబిడధూళీవిలిప్త
మండితాశాంగనాకుచమండలుండు, బాహుబలశాలి తమ్మయబసవవిభుఁడు.[40]

41


క.

ఆతనిసహోదరుఁడు జల, జాతప్రియతేజుఁ డహితశాసనకేళీ
కౌతూహలుఁ డన్నయధా, త్రీతలనాథుండు వెలసెఁ దేజోధికుఁడై.[41]

42

సీ.

గురుభుజస్తంభాసికుంభీనసస్వామి కరినృపప్రాణానిలాన్న మొసఁగి
లలితసత్కిరివల్లరుల కుల్లసితోరుసుగుణాలవాలంబు నిగుడఁ జేసి
భవ్యప్రతాపదీపజ్వాలికకును దామరసగర్భాండమందిర మొనర్చి
సుకవిగాయకచకోరకనికాయములకు నిజకృపాపాంగచంద్రికల నొసఁగి


తే.

గగనజగతీహరిత్కుడుంగప్రకీర్ణ, దానధారాభిరామచేతఃప్రవర్తి
యతఁడు పంటకులాంబుధి కబ్జవైరి, సన్నుతోదారి తమ్మయయన్నశౌరి.[42]

43


చ.

అరుదుగఁ దమ్మభూవిభునియన్ననిదాడికి నోడి శాత్రవుల్
దిరుగనిడొంకలుం బడనితెక్కలిటెంకులు పాదచారులై
యరుగనికానలుం జొరనియీఱమికోనలు భీతచిత్తులై
సురుఁగనిత్రోవలున్ నిలువఁజూడనిక్రేవను లేవు భూస్థలిన్.[43]

44


ఆ.

అట్టితమ్మరెడ్డి యన్నభూపాలుని, యనుగుఁదమ్ముఁ డైనవినుతయశుఁడు
లింగభూమిభర్త సంగీతసాహిత్య, సరసవిద్యలందుఁ జతురుఁ డయ్యె.

45


సీ.

కుంభినీభృత్కుంభికుంభీనసేంద్రుల కూఱట యెవ్వనియురుభుజంబు
పాథోధిరాధేయపారిజాతములకు వీడుదో డెవ్వనివితరణంబు
కందర్పచంద్రసంక్రందనసుతులకుఁ దలవంప దెవ్వనిలలితమూర్తి
రాధేయబాహులేయాదితేయజులకు వెక్కసం బెవ్వనివిక్రమంబు


తే.

కంజబాంధవశంపాధనంజయులకు, వెఱపుఁ బుట్టించు నెవ్వనివిపులతేజ
మతఁడు సంతతదానవిద్యావినోది, లేఖనిభుఁ డైనతమ్మయలింగవిభుఁడు.[44]

46


సీ.

పరమయోగజ్ఞానపారీణతలయందు ఖాండిక్యజనకులకంటె మేలు
సంతతత్యాగసిద్ధాంతవిద్యలయందుఁ గమలాప్తసూనునికంటె మేలు
సమ్మోహనాకారసౌందర్యములయందుఁ గమపూవిలుకానికంటె మేలు

సకలభోగాస్పదసంపత్కరములందుఁ గౌరవాధీశ్వరుకంటె మేలు


తే.

గురుతరస్ఫారధీరతాగుణములందుఁ, గనకధరణీధరేంద్రునికంటె మేలు
చటులకుటిలవిరోధిరాజస్యశైల, లేఖవిభుఁ డైనతమ్మయలింగఘనుఁడు.[45]

47


క.

ఘనుఁ డగుతమ్మయలింగన, వినుతజ్ఞానమున నీగి విభవమునందున్
జనకునిఁ బయోధికన్యా, జనకుని మఱి పుష్పబాణజనకునిఁ బోలున్.[46]

48


క.

వీరల కెల్లను గులగురుఁ , డై రాజులపూజలింగమై సుఖవిమనః
పూరితఘనవితరణవి, ద్యారసికుఁడు పంగులూరియన్నయ వెలసెన్.[47]

49


సీ.

వినుతనానావేదవేదాంగశాస్త్రపురాణేతిహాసనిర్వాహకుండు
శైవవైష్ణవసౌరశాక్తగాణాపత్యమంత్రతంత్రాగమమర్మవిదుఁడు
పరమపావనపరాపశ్యంతిమధ్యమావైఖరిమార్గప్రవర్తకుండు
ఆధారమణిపూరకాదిపంకజపత్రనిక్షిప్తపంచదశాక్షరుండు


తే.

కావ్యనాటకాలంకారభవ్యమూర్తి, పరమగురుసంప్రదాయప్రభావనిరతుఁ
డగుచు ఘోడియరాయవిఖ్యాతి నొందెఁ, బంగులూరన్నయార్యుండు బ్రహ్మవిదుఁడు.[48]

50


ఆ.

అట్టిపంగులూరియన్నయాచార్యుని, కరుణ వడసి సిరులఁ గాంచి మించె
రసికశేఖరుండు రావూరితమ్మయ, బసవభూవిభుండు వసుధయందు.

51


వ.

అతని కాంతారత్నంబు.

52


ఆ.

ఘనత నశ్వదానగజదానదీక్షాగు, రుండు నాఁగ నవని రూఢి కెక్కి
నట్టిమేటితాత యల్లూరియనమార, విభుఁడు పాకనాట విస్తరిల్లె.

53


క.

ఆయన మారనపుత్రుఁడు, పాయనిపౌరుషము యశము భాగ్యము విభవ
శ్రీయును గలపెమ్మమహీ, నాయకరత్నంబు పాకనాటను వెలసెన్.

54


వ.

అతనికుమారులు.

55


సీ.

నానాజన ప్రమోదానూనపంచపర్వాన్నదానవినోది యన్నఘనుఁడు
కంటకాచలపక్షలుంటాకనాకాధివాసవల్లభుఁ డైనవల్లభుండు

సకలవిద్వత్కవీశ్వరమనోరథదానచింతామణినిభుండు చింతవిభుఁడు
చటులాహితివ్రాతసంహారదోస్సారగాంగేయసదృశుండు గంగశౌరి


ఆ.

దాశరథులకరణి ధరణీధరునిబాహు, దండములవిధమునఁ దమ్మిచూలి
మోము లనఁగ ధర్తమూర్తుల నలువురఁ, బెమ్మవిభుఁడు గాంచెఁ బెంపుతోడ.[49]

56


క.

ఆనలుగురికి సహోదరి, యై నెగడినయమ్మలాంబ యతులితభాగ్య
శ్రీ నుల్లసిల్లి తనసరి, మానవతులలోన నెల్లమహిమలు గాంచెన్.[50]

57


సీ.

ప్రకటసౌభాగ్యసంపదల నాదిమలక్ష్మి యఖిలశోభనముల నద్రికన్య
చతురభాషావిశేషముల సరస్వతి సౌకుమార్యంబున జనకతనయ
పరమపతివ్రతాగరిమ నరుంధతి ధైర్యంబుపెంపున ధరణికాంత
రూపలావణ్యనిరూఢి రతీదేవి సంతానమహిమచేఁ గుంతిదేవి


తే.

తోడఁ బ్రతివచ్చు గీర్తులు దొంగలింపఁ, బరఁగురావూరితమ్మయబసవవిభుని
కులవధూమణియై మహి నలరి మించె, నమితసౌభాగ్యనికురుంబ యమ్మలాంబ.[51]

58


క.

కులశీలంబులఁ బుట్టిన, యిలు చొచ్చిన యిల్లు వన్నె కెక్కఁగఁ జేసెన్
లలనలు రావురిబసవయ, కులసతి యగునమ్మలాంబకును సరి గలరే.[52]

59


క.

 ఆరమణీరమణు లతి, శ్రీరమ్యునిఁ జెదలువాఁడ శ్రీరఘునాథున్
గోరి భజించిరి యవ్విభు, కారుణ్యమువలన సుతులఁ గాంచిరి ముగురిన్.[53]

60


వ.

అం దగ్రజుండు.

61


సీ.

చూడనేర్చిననాఁడె చూడంగ నేర్చెను గవిగాయకులయిండ్లఁ గలిమి గలుగ
నవ్వనేర్చిననాఁడె నవ్వంగ నేర్చెను ధనలోభు లైనదుర్మనుజపతులఁ
బలుకనేర్చిననాఁడె బలుకంగ నేర్చెను సుజనసమ్మతముగా సూనృతంబు
నడవనేర్చిననాఁడె నడవంగ నేర్చెను మహనీయ మగుధర్మమార్గమునను


తే.

జదువనేర్చిననాఁడె తాఁ జదువనేర్చెఁ, ద్యాగసిద్ధాంతవేద్యంబు లైనకథలు

రాయవేశ్యాభుజంగుండు రమ్యకీర్తి, రతుఁడు రావూరిబసవయరాఘవుండు.[54]

62


మ.

అవలీలన్ జయలక్ష్మితోడను విహారుం డైనరావూరిరా
ఘవభూపాలునకు దిశావనితలాఖద్యోతనీరాజనో
త్సవము ల్సేయఁ దదీయదీపకలికాసంభూతధూమాసితం
బవలంబింపఁగ నల్లనై మెఱసె నయ్యాకాశ మాద్యంతమున్.[55]

63


సీ.

తనప్రతాపాగ్ని శాత్రవగర్భనిర్భరాంభోనిధానమున కౌర్వానలంబు
తనకీర్తిబింబ ముద్దండారివదనాబ్జమండలంబున కబ్జమండలంబు
తనబాహుదండ ముద్ధతవిరోధికడంగరీయంబులకు శిరోధీయయష్టి
తనగుణశ్రేణి మత్తవిరోధిసామంతపాఠీనతతులకు బడిశరజ్జు


తే.

తనసముజ్జ్వలతేజ ముద్దామవిమత, గర్వతమసంబులకుఁ బ్రభాకరమరీచి
చేసె జగనబ్బగండఁ డక్షీణవిజయ, రతుఁడు రావూరిబసవయరాఘవుండు.[56]

64


చ.

ఇతఁడు భుజంగవల్లభుఁడు హీనవివేకి యనంతభోగసం
శ్రితుఁ డిటువంటిశేషునియశేషసుఖంబులు పాముతోడిపొ
త్తతివలకంచు రోసి వసుధాంగన చెందె నవక్రవిక్రమ
వ్యతికరుఁ డైనరెడ్డిబసవప్రభురాఘవుబాహుపీఠమున్.[57]

65


సీ.

అఖిలలోకాధీశుఁ డయ్యుఁ దాపసవృత్తి నడవినుండిననాఁటిహైన్య మొకటి
యమరేంద్రసేవితుఁ డయ్యు వానరులతోఁ గూడియుండిననాఁటికొంచె మొకటి
యసహాయరణశూరుఁ డయ్యు మాటుననుండి శత్రుఁజంపిననాఁటిశంక యొకటి
యతిదయారసచిత్తుఁ డయ్యుఁ దమ్ముని నిల్లు వెడలఁద్రోచిననాఁటివెలితి యొకటి

తే.

మానకుండినఁ గాదని మదిఁ దలంచి, యుర్విఁ గీర్తిప్రతాపంబు లుల్లసిల్ల
రాఘవేంద్రుండు బసవయరాఘవేంద్రుఁ, డై ధరిత్రీతలంబున నవతరించె.[58]

66


క.

ఆతనియాచార్యుఁడు వి, ఖ్యాతయశోధనుఁడు సింగనార్యుఁడు వెలసెన్
భూతలమునందుఁ దిరుమల, తాతయవంశమున సకలధర్మజ్ఞుండై.

67


సీ.

వేదాంతవిద్యావివేకి షడ్దర్శనపారంగతుండు పరాపరరహస్య
వేది బ్రహ్మాండాదివివిధపురాణజ్ఞుఁ డపమానధర్మశాస్త్రాభినేయ
కుశలుఁడు పరమార్థకోవిదుం డఖిలాధ్వరక్రియానిపుణుఁ డవక్రకావ్య
నాటకాలంకారనానాకళాభిజ్ఞుఁ డుభయభాషాకవితోజ్జ్వలుండు


తే.

పరమవైష్ణవమార్గతత్పరుఁడు కీర్తి, ధనుఁడు తిరుమలతాతయ్యమనుమఁ డైన
సింగరాచార్యు గురువుగా సేవ సేసి, రమణఁ జెలువొందె బసవయరాఘవుండు.[59]

68


క.

ఆరాఘవునిసహోదరుఁ, డై రమణీయప్రతాపహరిదశ్వుఁడు త
మ్మారెడ్డి తేజరిల్లెను, నారీనికురుంబములకు నవమన్మథుఁడై.[60]

69


ఉ.

మండితకాంతిభూతిమహిమన్ బసవప్రభుతమ్మభూవిభున్
రెండవచందురుండు పదిరెండవశంకరమూర్తి యంచు భూ
మండలిఁ బ్రస్తుతింతురు సమస్తజనంబులు నవ్విధంబు గా
కుండినఁ గల్గునే కళలయొప్పిదమున్ జితమన్మథత్వమున్.[61]

70


మ.

అసకృత్తేజము మిన్నుముట్టి రిపుభార్యానేత్రనీలోత్సల
ప్రసవంబుల్ నలఁగించి యాశ్రితముఖాబ్జశ్రేణికిన్ సంతసం
బెసఁగంజేసి విరోధిగర్వతమసం బింకింప దీపించుఁబో
బసవక్ష్మావిభు తమ్మయప్రభుప్రతాపద్వాదశాత్మప్రభల్.[62]

71


సీ.

భాగ్యసంపదలచే భాసిల్లు టరిదియే రంజిల్లు రూపనారాయణునకు
రిపుభూపతుల విదారించుట కడిఁదియే నవ్యసంగ్రామధనంజయునకు
భూమిభరం బెల్లఁ బూనుట చోద్యమే భాసిల్లుజగరక్షపాలకునకు
సంగీతసాహిత్యసరసత చిత్రమే తలపోయ రాయపితామహునకు


తే.

నీప్సితము లర్థులకు నిచ్చు టెంత పెద్ద, తలుప హేమాద్రిదానచింతామణికిని
అనుచుఁ గొనియాడుదురు జను లనుదినంబు, ధర్మమతి యైనబసవని తమ్మవిభుని.[63]

72

క.

ఆతమ్మరెడ్డితమ్ముఁడు, చేతోజాతోపమానశృంగారకళా
చాతుర్యుఁ డైనలక్ష్మయ, భూతలమున వెలనేఁ గల్పభూరుహ మనఁగన్.[64]

73


ఉ.

చెంగటిబోటికత్తియలు సిగ్గులు రేచఁగ లేఁతనవ్వుతోఁ
దొంగలిఱెప్పలన్ వలపు దూకొనఁ బయ్యదకొంగు జాఱఁగా
ముంగిటిమేడపైఁ జిలుక ముద్దులు చూచుచు నిల్చియున్న య
య్యంగన నిన్నరాత్రి బరవాధిపులక్ష్మునిఁ గూడెనే చెలీ.

74


చ.

రసికపుమాటలన్ మనసు రంజిలఁజేయఁగ నేర్చు నీగులన్
బిసిడితనంబు లేదు వలపించి యలంపఁడు మోహనాకృతిన్
బసగన జాణరాయఁడని పల్కినఁ దల్లికిఁ గూడ దక్కటా
బసవయలక్ష్మునిన్ రతులఁ బాయుట కంతునిఁ బాయుటే చెలీ.[65]

75

షష్ఠ్యంతములు

క.

ఈతమ్ము లిరువురును దన, చేతులయందమున బనులు సేయఁగఁ ద్రిజగ
త్పూతాత్తుఁ డగుచు వెలసిన, యాతతగుణశీలునకు దయాలోలునకున్.[66]

76


క.

శ్రీమత్పంటకులాంబుధి, సోమునకు ననంతభోగసుత్రామునకున్
హేమాద్రిదానవరచిం, తామణికిఁ బ్రతాపసంభృతనభోమణికిన్.[67]

77


క.

తిరుమలతాతయదేశిక, వరశిష్యున కనుపమేయవైదుష్యునకున్
పరభూపాలతమస్సం, హరణాదిత్యునకుఁ బల్లవాదిత్యునకున్.[68]

78


క.

హరిపాదపద్మసేవా, పరచిత్తున కధికతరకృపామత్తునకున్
నిరుపమవినయసమన్విత, గురువాచాలునకు రాయగోపాలునకున్.[69]

79

క.

విజయరమాపరిశోభిత, భుజబలపార్థునకు నమితపురుషార్థునకున్
సుజనహృదయాంబురుహపం, కజమిత్రున కమ్మలాంబికాపుత్రునకున్.[70]

80


క.

రావురితమ్మయబసవ, క్ష్మావరసూనునకు బంధుసన్మానునకున్
సేవాగతరిపుభూపా, లాననశుభమతికి రాఘవావనిపతికిన్.

81


వ.

అభ్యదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పం బూనినయాదిమహాపురాణం బగు
బ్రహ్మాండపురాణంబునందలి పరాశరసంహితయైన శ్రీవిష్ణుపురాణంబునకుఁ గథా
ప్రారంభం బెట్టిదనిన.[71]

82

ప్రథమాశ్వాసము

సీ.

వేదశాస్త్రపురాణవిద్యలు దమతల్లియుదరంబులోనన యుండి నేర్చె
శైశవంబునఁ దపస్సామర్థ్యమునఁ జేసి రాక్షసప్రళయసత్రంబుఁ జేసె
నిజకోపదావాగ్ని నిశ్శేషముగఁ బుచ్చి పర్వతాటవులపైఁ బాఱవైచె
నంబుజాసనపుత్రుఁ డగుపులస్త్యబ్రహ్మచేత దివ్యజ్ఞానసిద్ధిఁ బడసె


తే.

భక్తియుక్తిప్రసన్నతఁ బంకజాక్షు, పాదపద్మంబులందునే పాదుకొల్పెఁ
జారుతరమూర్తి మునిలోక చక్రవర్తి, రమ్యతేజోధరుండు పరాశరుండు.[72]

1


వ.

అమ్మహానుభావుం డాచార్యుండుగా మైత్రేయుం డతనివలన వేదవేదాంగం
బులు ననేకధర్మశాస్త్రంబులు నభ్యసించి కృతకృత్యుండై యనేకకాలంబు
శుశ్రూష సేయుచున్న సమయంబున నొక్కనాఁడు ప్రభాతకాలోచితకృత్యం
బులు నిర్వర్తించి సుఖాసీనుండై యున్నయాచార్యునకు నమస్కరించి బహు
విధంబుల స్తుతియించి యిట్లనియె.[73]

2


క.

మునినాథ నీప్రసాదం, బున సాంగములైన వేదములు శాస్త్రములున్

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. హేమకుంభములు = బంగారు కుండలు, కాశ్మీరము = కుంకుమపువ్వు - కుంకుమపువ్వు చేర్చిన పరిమళచందనమని యర్థము, అస్తోకము = అల్పము కానిది - మిక్కుటము అనుట, పేరురంబునన్ = విశాలమైన ఱొమ్మునందు, దీప్తిచ్ఛటావ్యాకోచంబు = కాంతినమూహముచేత వికాసమునొందినది, సుశ్లోకుఁడు = మంచికీర్తి గలవాఁడు.
  2. అస్యపంచకము = అయిదుముఖములు, ఆరుణద్యుతులు = ఎఱ్ఱనికాంతులు, శిరోగ్రగంగ = తలమీఁదనుండు గంగానది, సంఫుల్లసుమంబు = చక్కఁగా వికసించినపువ్వు, కల్పశాఖ = కల్పవృక్షము
  3. జలజాతము = తామర, శారద = సరస్వతి, పద్ధతి = మార్గము - సరణి, కనుపట్టు = కానఁబడు.
  4. స్తన్యము = చనుఁబాలు, క్రోలు = త్రాగు, లంబోదరుఁడు = వ్రేలుబొజ్జ గలవాఁడు, వినాయకుఁడు, నిత్యశ్రీయుత = శాశ్వతమైన ఐశ్వర్యముతోఁ గూడుకొన్నవానిగా
  5. మహీసుతతోన్ = సీతతోడ, పంకజోదరనిభుఁడు = విష్ణువుతో సమానుఁడు. ప్రమదము = సంతోషము, చెలంగఁగన్ = అతిశయించగా, ఇలవేలుపు = పరంపరగా తమపెద్దలు సేవించెడు దేవత - గృహదేవత.
  6. శశాంకపోతము = బాలచంద్రుఁడు, మెచ్చులక్రొవ్విరి = మెచ్చుకోఁదగిన క్రొత్తగా పూచిన పువ్వు, చెంగట = సమీపమునందు దీని ప్రథమైనకవచనము చెంగలి, తుఱిమి = చెరివి, కృపారసము = దయారసము, తొంగలి ఱెప్పలతోడికన్నులన్ = వాలుగలకందెఱతోడి కన్నులయందు, నెఱయఁగన్ = వ్యాపింపఁగా, నెమ్మిమెయిన్ = భక్తితో, భజియింపన్ = సేవింపఁగా, కరిముఖదేవుతల్లి = వినాయకుని తల్లి యగు పార్వతి.
  7. పరమార్థచోదితములు = పరతత్వభావమును బోధించునవి, విఖ్యాతసాంగంబులు = ప్రసిద్ధములైన శిక్షాది అంగములతో కూడినది, పంకజగర్భుచేన్ = బ్రహ్మచేత, అంశషట్కంబునన్ = ఆఱుఅంశములతో, పాదై = నెలకొనినదై, విజ్ఞానవిద్యాదీక్షాగురునిన్ = విశేషజ్ఞానయుక్తమైన విద్యకు దీక్షవహించిన యాచార్యుఁడైనవానిని.
  8. ఆరూఢస్థితిన్ = మిక్కిలి నిలుకడ చెందినయునికిచేత, మనీషిస్తుత్యచారిత్రులన్ = విద్వాంసులచేత స్తోత్రము చేయఁదగిన చరిత్ర గలవారిని, సారస్పారగభీరచారుకవితాసంపన్నవాచాసుధాధారాసారవిహారులన్ = రసవంతములును అర్థస్ఫురణకలవియు గంభీరములును మనోజ్ఞములు నై కవిత్వసంపత్తిగలవాక్కులనెడు అమృతధారావర్షమునందు విహరించునట్టివారిని.
  9. ప్రణమిల్లి సనమస్కరించి, ఎన్నికగాన్ = లెక్కపెట్టినట్లు, ఇందు చెప్పఁబడినవారు ఆంధ్రశవులలో ముఖ్యులు అని తెలియవలెను.
  10. అనిలభుగ్విభుండు = గాలిని భుజించునవి యైనపాములకు రాజు, పూరిపాము = పసిరిక పాము.
  11. ఆక్షేపములు = ఆక్షేపింపఁదగిన విషయములు, సర్వజ్ఞులు = అన్నియు తెలిసినవారు, కళంకప్రస్థము = కళంకము యొక్క మంచియునికి గలది, సుధాపరిపూర్ణస్థితిన్ = అమృతముయొక్క నిండినయునికిచేత, సంభావ్యము = సంభావింపఁదగినది, గౌరవించఁదగినది.
  12. పన్నగశాయి = శేషుఁడు పఱపుగాఁగల విష్ణువు, అపారములు = సరిలేనివి, సన్నము = అల్పము, పితామహుఁడు = బ్రహ్మ
  13. తామరసాక్షుఁడు = తామరలవంటి కన్నులుగల విష్ణువు, అనంతములు = అంతము లేనివి, యుక్తి = కూడిక, నిపుణత్వము = నేర్పరితనము, నాచామలవృత్తి = వాక్కులయొక్క నిర్మలమైన వ్యాపారము, సుధాంబుధి = పాలసముద్రము, తృట్కాముఁడు = దప్పిచేత కోరఁబడినవాఁడు - దప్పిగొన్నవాఁ డనుట.
  14. చాటుతరప్రబంధసంపాదము = మిక్కిలి స్తోత్రార్హమయిన ప్రబంధమును కలుగఁజేయుట, మేలుమేలు = ఇది ప్రశంసార్థము, కొఱగామి = పనికిమాలినతనమునుగా, తలంచినన్ = తలంచెడుపక్షమున.
  15. ముద్రితము = ముద్ర వేయఁబడినది - ఆవరింపఁబడినదనుట, పరాయణుఁడు = ఆసక్తుఁడు, చటులకుటిలవిరోధియూధగహనధనంజయుండు = గడుసైనవారును చెడ్డనడతగలవారునకు పగవారిగుమి యనెడు అడవికి అగ్నిహోత్రుడైనవాఁడు, సంగ్రామధనంజయుఁడు = యుద్ధమునందు అర్జునుఁడు, సంగరము = యుద్ధము, సంగతము = కూడుకొన్నది, ఆరాతి = శత్రువు, పల్లవాదిత్యుఁడు = బాలసూర్యుఁడు, సముద్దండప్రచండవిరోధిమండలేశ్వరప్రాణానిలమండలాగ్రభుజంగుండు = గర్వించిన ప్రతాపవంతులగు శత్రురాజులయొక్క ప్రాణవాయువులను (హరించునట్టి) కత్తియనెడు సర్పముగలవాఁడు, రాయవేశ్యాభుజంగుండు = భోగమునారికి విటుఁడు, చూఱకారుఁడు = కొల్లపెట్టినవాఁడు, ఈరెండును బిరుదుపేళ్లు, ఇట్టివి గ్రామ్యములైనను గ్రహింపఁబడును. గోత్రము = భూమి-వంశము, పంటవంశపయఃపయోశిరాకాశర్వరీశ్వరుఁడు = పంటవంశమనెడు పాలసముద్రమునకు పున్నమనాటిచంద్రుఁడు.
  16. గరిమ = గౌరవము, వీటన్ = పట్టణమునందు, వారాశికన్య = లక్ష్మి, గిరిభేది = ఇంద్రుడు, మారట = మాఱు, కుంజరము = ఏనుఁగు.
  17. వేదాంతవిదులు = వేదాంతము నెఱిఁగినవారు, ఒకవంక = ఒకతట్టు, ఉభయభాషాకవులు = సంస్కృతాంధ్రకవులు, ఉదుటు = గర్వము, మన్నెకొమారులు = రాజపుత్రులు - లేక, సామంతరాజపుత్రులు, తజ్ఞులు = భరతశాస్త్రము నెఱిఁగినవారు, రమణన్ = ఒప్పిదముగా.
  18. కరమూలరుచులు = చంకలయందలికాంతులు, నిగ్గులు దేరు = వన్నెమీఱు, నివాళించి = ఆరతులెత్తి, కాళాంజి = కమ్మపడిగము, అవధారు = అవధరింపుము, చిత్తేశ = మనోనాయకా, బిబ్బోకము = స్త్రీలయొక్క విలాసవిశేషము, రాజబింబాస్య = చంద్రబింబమువంటి ముఖముకలది, కన్నులపండువు = నేత్రోత్సవము.
  19. అఖిలకలాపారీణలు = ఎల్లవిద్యలు తుదముట్ట నెఱిఁగినవారు.
  20. కృతిముఖంబునన్ = గ్రంథమూలమున, ఉపన్యసింపన్ = చెప్ప, అరసి = విచారించి.
  21. వెన్నడిచి = వీఁపు తట్టి, భూజాని = రాజు.
  22. నయవిశారదుఁడు = నీతివిద్యయందు నేర్పరి, పరమ సాత్వికోదయహృదయంన్ = శ్రేష్ఠమైన సాత్వికగుణములకు జనస్థానమైన హృదయముగలవానిని - మిక్కిలి సాత్వికగుణము కలవానిననుట, సారస్యములు = సరసభావము.
  23. పెద్దయున్ = మిక్కిలి, గురూపచారమార్గంబులు = గొప్పయుపచారములను నడపెడుతోవలను, సంపన్నములు = కలిమి కలవి - గొప్పయుపచారములను నడపి యనుట, ప్రోది సేయన్ =గొప్పపఱుపఁగా.
  24. చంపుకావ్యము = పద్యములును వచనములును గల కావ్యము, ఇలలోన్ = భూమియందు, నెగడన్ = వ్యాపింపఁగా.
  25. పసిఁడి = బంగారు, కృతికర్త = ప్రబంధరచన చేయువాఁడు, కృతిపతి = ప్రబంధమును రచింపించినవాఁడు.
  26. కనకమణిభూషణాంబరంబులు = బంగారుమయములును రత్నమయములునగు సొమ్ములను వస్త్రములను, మదీయప్రణీతము = నాచేఁ జేయఁబడినది.
  27. జలజనాభుఁడు = విష్ణువు, చరణవంశజమున = పాదకమలమునందు.
  28. సత్ప్రతాపము = మేలైవప్రతాపము.
  29. నయము = నీతి.
  30. ఏపారి = అతిశయించి, ప్రాపు = రక్షకము.
  31. కీర్తిప్రతాపధాముఁడు = కీర్తికిని ప్రతామునకును ఇల్లయినవాఁడు, తేజోధనుఁడు = పరాక్రమమే ధనముగాఁ గలవాఁడు.
  32. పెంపు = అభివృద్ధి, సౌంపు = బాగు, యశము = కీర్తి, ప్రస్తుతి సేయ = పొగడఁగా.
  33. దిగ్ధరణీళకోటీరసముదయంబులకు =ఎల్లదిక్కులయందు నుండెడు రాజులయొక్క కిరీటములయొక్క సమూహములకు, సముద్యద్దర్పవిద్వేషిజగతీశులకున్ = పూనికయు గర్వమును గలశత్రురాజులకు, తారకాధనతారకాతారవసుధాధరములకున్ = చంద్రునకును నక్షత్రములకును వెండికొండకును, మందారగుహ్యకరాజశిబిదధీచులకున్ = కల్పవృక్షకుబేరచంద్రశిబిచక్రవర్తిదధీచిమునులకు, వీరు మిక్కిలి దాతలని చెప్పుదురు, నీలపంకేరుహము = నల్లకలువ, ఇట్టిచోట్ల పంకేరుహశబ్దమునకు కమల మని యర్థము చెప్పుట సరి కాదు, నెలవు = స్థానము, బసవశంకరజగరక్షపాలబిరుదధనుఁడు = ఇది బిరుదును తెలుపునది కాన జగరక్షపాల యనునది దుష్టముగా గ్రహింపదగదు.
  34. పాతివ్రత్యము = పతివ్రతాత్వము, విఖ్యాతగుణాలంబ = ప్రసిద్ధగుణములకు అవలంబమైనది.
  35. ఉత్తుంగయశులు = అధికకీర్తి గలవారు.
  36. మన్నీఁడు = రాజు (మన్నెము = పర్వాదాయము ననుభవించదగినభూమి) అది కలవాఁడు అని వ్యుత్పత్యర్థము.
  37. కుటిల.....ధరుఁడు = మిక్కిలిక్రూరులగు శత్రురాజులనెడు గొప్పకొండలగుమికి ఇంద్రుఁడైనవాఁడు, దారుణా... ప్రభంజనుండు = భయంకరులగు శత్రువులనెడు మేఘములను ఎగురఁగొట్టుటయందు భయంకరమై యతిశయించిన వానగాలి, పటు... వైశ్వానరుండు = మిక్కిలి సామర్థ్యముగల శత్రువులపక్షము నవలంబించినవారనెడు భయంకరమయిన అడవికి మిక్కిలి విజృంభించిన వేండ్రముగల అగ్నిహోత్రుఁడు, కఠినా.. ప్రభాకరుండు = కఠినులైన శత్రువులసమూహమనెడు దట్టమైనచీఁకటిని హరించెడు మిక్కిలి వేడిమిగల యెండను కలుగఁజేయునట్టి సూర్యుఁడు, సమద...కుంభజుండు = మదించిన శత్రురాజులసేన యనెడు సముద్రముయొక్క భయంకరమైనధ్వనిని ఆణఁచుటయందు అగస్త్యుఁడైనవాఁడు, భీమబలశాలి = భీమునితో సమానమయిన బలముగలవాఁడు, నిస్సీమభూమిదానపరశురాముఁడు = ఎల్లలేనిభూమిని దానము చేయుటయందు పరశురాముఁడయినవాఁడు.
  38. ఉత్పలకలాపమునకు = నల్లగలువలసమూహమునకు, నిస్తంద్ర = చలింపని, అమృతాంభోనిధానము = పాలసముద్రము. సంతరించి = బాగుపఱచి - కలిగించి యనుట, కళాకీర్ణుఁడు = కళలను వెదచల్లినవాఁడు.
  39. వాహిని = సేన, దరికొల్పఁడు = కాల్పఁడు, నిశాంతము = ఇల్లు, ఉపఘ్నము= ప్రాకుడు, రంగస్థలి = నాట్య మాడెడుచోటు.
  40. రాజిల్లి = ఒప్పి, మలకనజీర్లకున్ = తురకయోధులకు, ఉమ్మలిక = పరితాపము, చాటు...మండలుండు = స్తుతిచేయఁదగిన యుద్ధయాత్రయందు తడఁబాటు లేని గుఱ్ఱపుబారులయొక్క గొరిసెలచేత ఎగురజిమ్ముఁబడిన దట్టమయినదుమ్ముచే పూయఁబడుటచేత అలంకృతములైన దిక్కులనెడు స్త్రీలయొక్క గుండ్రనైన స్తనప్రదేశములు గలవాఁడు.
  41. జలజాతప్రియతేజుఁడు = సూర్యునితేజస్సువంటి తేజస్సు కలవాఁడు, అహితశాసనకేళీకౌతూహలుఁడు = పగవారిని శిక్షించుట యనెడు క్రీడయందు కుతూహలము కలవాఁడు.
  42. గురు ... స్వామికి = గొప్పభుజమనెడు స్తంభమునందలి కత్తియనెడు సర్పరాజునకు, వల్లరులకున్ = లజ్జతీఁగలకు, ఆలవాలము = పాది, జ్వాలికకున్ = జ్వాలకు, తామరసగర్భాండమందిరము = బ్రహ్మాండమనెడి యిల్లు, అపాంగచంద్రికల్ = కడగంటిచూపులనెడు వెన్నెలలను, గగన...ప్రవర్తి = ఆకాశమునందును లోకమునందలి యెల్లదిక్కులనెడు పొదరిండ్లయందును చల్లఁబడినదానోదకధారలచేత మనోజ్ఞముగా చేయఁబడిన మనోవ్యాపారము గలవాఁడు, అబ్జవైరి = చంద్రుఁడు.
  43. దాడికిన్ = ధాటికి – యుద్ధయాత్రకు, తెక్కలిటెంకులు = దొంగచోట్లు - రహస్యప్రదేశము లనుట, కానలు = అడవులు, ఈఱమికోనలు = చెట్లచే తఱుచైనకొండలు, సురుఁగని = దాఁగని, క్రేవలం = పార్శ్వములు.
  44. శంఖినీ... కుంభీనసేంద్రులకున్ = భూమిని భరించునట్టి దిగ్జములకును ఆదిశేషునకును, ఊఱట = అలఁపు దీర్చుకొనఁదగిన సహాయము, పాథోధి = సముద్రము, వీడుదోడు = అంపుతోడు, కందర్పచంద్రసంక్రందనసుతులకు = మన్మథచంద్రజయంతులకు, తలవంపు = అవమానకరము, బాహులేయుఁడు = కుమారస్వామి, ఆదితేయజుఁడు = అర్జునుఁడు, కంజబాంధవశంసాధనంజయలకున్ = సూర్యునకు మెఱపునకు అగ్నికిని, లేఖనిభుఁడు = దేవసముఁడు.
  45. కమలాప్తసూనుఁడు = కర్ణుఁడు, కమ్మపూవిలుకాఁడు = మన్మథుఁడు, కౌరవాధీశ్వరుఁడు = దుర్యోధనుఁడు, కనకధరణీధరేంద్రుఁడు- పర్వతరాజుగు మేరువు, లేఖవిభ్యుడు = ఇంద్రుఁడు.
  46. వినుతజ్ఞానమునన్ = పొగడఁబడిన తెలివియందును, ఈగిన్ = దాతృత్వమునందును, పయోధికన్యాజనకుని = సముద్రుని.
  47. సుకవిమనఃపూరితఘనవితరణవిద్యారసికుఁడు = సత్కవులయొక్క మనస్సులను నిండించునట్టి (తృప్తినొందించునట్టి) దాతృత్వవిద్యయందు నేర్పరి.
  48. వేదాంగములు = శిక్షావ్యాకరణాదులు, పురాణములు = బ్రాహ్మము మొదలగునవి, ఇతిహాసములు = పూర్వకాలపువృత్తాంతములు, సౌరము = సూర్యునికి పర్వతమును స్థాపించాడుమతము, పరాపశ్యంతి మధ్యమా = (ఇవి యీపేళ్లచే ప్రసిద్ధములైన) శాస్త్రవైఖరులు, పంచదశాక్షరుఁడు = పంచదశాక్షరీవిద్యను నేర్చినవాఁడు, భవ్యమూర్తి = శుభస్వరూపుఁడు.
  49. నానాజనప్రమోదానూనపంచపర్వాన్నదానవినోది = సకలజనులకు సంతోషకరమయి మిక్కుటమైన పంచపర్వములయందలి అన్నదానముచేత వినోదించువాఁడు, (పంచపర్వములు: పున్నమ, అమావాస్య, కృష్ణాష్టమి, కృష్ణచతుర్దశి, సంక్రాంతి.) కంటకా... వల్లభుఁడు = క్షుద్రశత్రువులనెడు పర్వతములయొక్క రెక్కలను విఱుగఁగొట్టుటయందు దేవేంద్రుఁడు, సకల....చింతామణినిభుండు = ఎల్లవిద్వాంసులయొక్కయు కవీశ్వరులయొక్కయు కోరికలను యిచ్చుటయందు చింతామణిని పోలినవాఁడు (చింతామణి = కోరినదాని నియ్యఁజాలినరత్నము), చటుల...సదృశుండు = క్రూరులైన శత్రువులసమూహమును చంపఁజాలిన భుజపరాక్రమమునందు భీమునితో సమానుఁడు, ధరణీధరుఁడు = విష్ణువు, తమ్మిచూలి = బ్రహ్మ, ధర్మమూర్తులన్ = ధర్మస్వరూపులను.
  50. అతులితభాగ్యశ్రీమహిమలన్ = సరిపోల్పరాని మంచియదృష్టము కలిమివలని గొప్పతనములచేత.
  51. సౌభాగ్యము = సుభగత-సౌందర్యము, పెంపు = సమృద్ధి, ప్రతివచ్చు = సమానమగు, తొంగలింపన్ = అతిశయింపఁగా.
  52. వన్నె కెక్కన్ = ప్రసిద్ధి వహింప, కులసతి = ఇల్లాలు.
  53. రమణీరమణులు = ఆలుమగలు, అతిశ్రీరమ్యున్ = అధికైశ్వర్యముచేత మనోజ్ఞుడైన వానిని, భజించిరి = ఉపాసించిరి.
  54. సూనృతము = సత్యము, నడవంగన్ = ప్రవర్తింప, వేద్యములు = తెలియఁదగినవి.
  55. ఖద్యోతనీరాజనోత్సవము = సూర్యుఁడనెడు కర్పూరహారతి వేడుకలు, తదీయదీపకలికాసంభూతధూమాసితంబు = దానిదైన దీపపుకొడివలన పుట్టిన పొగచేత నల్లదనమును.
  56. శాత్రవగర్భనిర్భరాంభోనిధానమునకున్ = శత్రువులగర్భములనెడునిబ్బరముగల సముద్రమునకు, ఔర్వానలము = బడబాగ్ని, ఉద్దండారివదనాబ్జమండలంబునన్ = గర్వించినశత్రువులమొగములనెడు కమలములగుబురులకు, అబ్జమండలము = చంద్రబింబము, ఉద్ధతవిరోధికడంగరీయంబులకున్ = అణఁగనిపగవారనెడు వృషభములకు, శిరోధీయయష్టి = తలమీఁదికఱ్ఱ, మత్తవిరోధిసామంతపాఠీనతతులకు = మదించినవిరోధులైన సామంతరాజులనెడు చేఁపలసమూహములకు, బడిశరజ్జు = గాలాపుత్రాడు, సముజ్జ్వలతేజము = లెస్సగా వెలుఁగునట్టిప్రతాపము, ఉద్దామవిమతగర్వతమసంబులకున్ = అణఁపరాని శత్రువులగర్వమనెడు చీఁకట్లకు, ప్రభాకరమరీచి = సూర్యకిరణము, అక్షీణవిజయరతుఁడు = తక్కువ కాని గెలుపునందు ఆస గలవాఁడు.
  57. భుజంగవల్లభుఁడు = సర్పరాజు - విటులకు ప్రియుఁడు, హీనవివేకి = వివేకముచేత తక్కువైనవాఁడు - సర్పము తిర్యగ్జంతువు కనుక వివేకహీనత స్వాభావికము, అనంతభోగసంశ్రితుఁడు = మితిలేనిపడగలచేత పొందఁబడినవాఁడు - పెక్కుపడగలు గలవాఁడు, మేరలేనిభోగములచే ఆశ్రయింపఁబడినవాఁడు - బహువిధభోగముల నపేక్షించువాఁడు, అవక్రవిక్రమవ్యతికరుఁడు = క్రమమైన పరాక్రమముచేత మీఱరానివాఁడు.
  58. తాపసవృత్తిన్ = తపస్వియొక్క వ్యాపారముతో, మాటునన్ =మఱుఁగున.
  59. పరాపరరహస్యవేది = పరతత్త్వరహన్యము నెఱిఁగినవాఁడు.
  60. హరిదశ్వుఁడు = సూర్యుఁడు, నికురుంబము = సమూహము.
  61. మండిత = అలంకరింపఁబడిన, భూతి = ఐశ్వర్యము, కళలయొప్పిదము = పదియాఱుకళలచే నైన ఒప్పిదము, విద్యలచేత నైన ఒప్పిదము.
  62. అనకృత్తేజము = ఎడతెగని ప్రతాపము, విరోధిగర్వతమసంబు = పగవారిగర్వమనెడు చీఁకటి, ఇంకించి = అణఁచి, ద్వాదశాత్మప్రభ = సూర్యకాంతి.
  63. అరిది = దుర్లభము, విదారించుట = భేదించుట, కడిది = అశక్యము, హేమాద్రిదానచింతామణికిన్ = బంగారుకొండను దానము చేయుటయందు చింతామణివంటివానికి - కొండవలె మితిమీఱిన ధనమును యాచకుల కిచ్పుటయందు వెనుదీయనివాఁడని యర్థము.
  64. చేతోజాత...చాతుర్యుఁడు = మన్మథునితో సరిపోల్పఁదగిన శృంగారవిద్యయందు నేర్పరియైనవాఁడు.
  65. పసిడితనము = లోభిత్వము, కంతుని = మన్మథుని.
  66. చేతులయందమునన్ = చేతులవిధమున, త్రిజగత్పూతాత్ముఁడు = మూఁడులోకములను పావనములనుగా చేయుమనస్సుగలవాఁడు.
  67. పంటకులాంబుధిసోమునకు = పంటకులమను సముద్రమునకు చంద్రుఁ డైనవానికి, అనంతభోగసుత్రామునకు = మేరలేనిభోగమునకు దేవేంద్రుఁడైనవానికి, హేమాద్రి = బంగారుకొండ, ప్రతాపసంభృతనభోమణికిన్ = ప్రతాపమును భరించుటయందు సూర్యుండైనవానికి - మిక్కిలి ప్రతాపము కలవాని కనుట.
  68. తిరుమలతాతయదేశికవరశిష్యునకున్ = తిరుమలతాతాచార్యులనెడు గురుశ్రేష్ఠునికి శిష్యుఁడైనవానికి, అనుపమేయవైదుష్యునకున్ = విద్యాప్రవీణత కలవానికి, వరభూపాలతమస్సంహరణాదిత్యునకున్ = శత్రురాజుల చెడుచీఁకటిని హరించుటయందు సూర్యుఁడైనవానికి, పల్లవాదిత్యునకు = పల్లవాదిత్యుఁడు అను బిరుదుపేరుగలవానికి.
  69. హరిపాదపద్మసేవాపరచిత్తునకున్ = శ్రీవిష్ణువుయొక్క పాదకమలములను సేవించుటయందు ఆసక్తమైన మనస్సుగలవానికి, అధికతరకృపామత్తునకున్ = మిక్కిలి అధికమయిన దయచేత పరవశుఁడయినవానికి, వివయసమన్వితగురువాచాలునకున్ = అడఁకువతోఁగూడుకొన్న గౌరవముగల మాటలాడువానికి.
  70. విజయరమాశోభితభుజబలపార్థునకు = జయలక్ష్మిచేత ప్రకాశించునట్టి భుజబలమునందు అర్జునుఁడయినవానికి, సుజనహృదయాంబురుహపంకజమిత్రునకున్ = సజ్జనులమనస్సులనెడు కమలములకు సూర్యుఁడయిన వానికి.
  71. అభ్యుదయపరంపరాభివృద్ధిగాన్ = శుభపరంపరలు మిక్కిలి పెరుగునట్లుగా.
  72. శైశవము = శిశుత్వము, ప్రళయము = నాశము, అంబుజాననపుత్రుఁడు = బ్రహ్మకొడుకు, భక్తియుక్తిన్ = భక్తితో, పంకజాక్షుఁడు = విష్ణువు, పాదుకొల్పెన్ = స్థిరముగా నిలిపెను, చారుతరమూర్తి = మిక్కిలిమనోజ్ఞమైన యాకృతికలవాఁడు, చక్రవర్తి = శ్రేష్ఠుడు.
  73. కృతకృత్యుఁడు =కృతార్థుఁడు, శుశ్రూష = సేవ, ప్రభాతకాలోచితకృత్యములు = తెల్లవాఱుసమయమున చేయఁదగిన పనులు, నిర్వర్తించి = నడపి, ఆసీనుఁడు = కూర్చున్నవాఁడు.