ఆంధ్ర శ్రీవిష్ణుపురాణము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీవిష్ణుపురాణము

పంచమాశ్వాసము



లక్ష్మీవల్లభకరు
ణాలంకృత భూమిమండలాఖండల శౌ
ర్యాలక్షితరపుహృదయక
రాళీకృతసుప్రతాప రాఘవభూపా.[1]

1


వ.

సకలపురాణవిద్యాధురంధరుం డైనపరాశరుండు మైత్రేయున కిట్లనియె నిట్లు
నావలన సమస్తంబును సవిస్తరంబుగా వింటి వింక వినవలయునవి యెట్టివి యని
యడిగిన నతం డిట్లనియె.

2


తే.

కీర్తిపెంపున దేవతామూర్తులైన, సూర్యసోమవంశంబుల క్షోణిపతుల
చరితములు వేఱువేఱు విస్తారఫణితి, వినఁగఁ గోరెడుఁ జిత్తంబు విప్రముఖ్య.

3

సూర్యచంద్రవంశపురాజులచరిత్రములు

వ.

అని రాజవంశకథాశ్రవణకుతూహలపరుండై యడిగిన మైత్రేయునకుఁ బరాశరుం
డిట్లనియె.

4


ఉ.

భానుసుధాకరాన్వయవిభాసితులై జగదేకవీరులై
యీనిఖిలంబునన్ వినుతి కెక్కినరాజులఁ జెప్ప నొప్పు వం
శానుచరిత్రముల్ వినిన యట్టివివేకికిఁ గల్గుఁ బుణ్యముల్
వానికి నెన్నఁడేనియును వంశవినాశము లేదు ధాత్రిలోన్.5 [2]

5


వ.

కావున ననేకవీరకుమారభూపాలాలంకృతం బైన మానవవంశంబులు ప్రతి
దినంబు విన ననేకపాపపంకప్రక్షాళనం బగునని యిట్లని చెప్పందొడంగె.[3]

6

మ.

జగదారాధ్యుఁడు విష్ణుమూర్తిధరుఁడున్ సర్వాగమాధీశుఁడున్
భగవంతుండును యోగివంద్యుఁడుఁ బరబ్రహ్మస్వరూపంబునై
తగ జన్మించె హిరణ్యగర్భుఁడు జగద్రక్షాగరిష్ఠాత్మకుం
డగునారాయణునాభిపద్మమున సృష్ట్యర్థంబుగా నర్థితోన్.[4]

7


ఆ.

అబ్జభవునిదక్షిణాంగుష్ఠమున దక్షుఁ, డవతరించె నతని కదితి పుట్టె
నాసతీలలామయందుఁ గశ్యపునకు, దివసకరుఁడు పుట్టి తేజరిల్లె.[5]

8


ఆ.

కమలహితుఁడు విశ్వకర్మతనూభవ, యైనసంజ్ఞయందు నాత్మసుతుని
జనన మొందఁజేసె సాంప్రతం బేడవ, మనువు నఖిలలోకమాన్యయశుని.[6]

9


వ.

ఆవైవస్వతమనువున కిక్ష్వాకు నృగ దృష్ట శర్యాతి సరిష్యంత నభగ దిష్ట
కరూశ వృషధ్ధు లను కుమారులు తొమ్మండ్రు పుట్టి నానాద్వీపమండితం బైన
మహీమండలంబునకు రాజులైరి మఱియును.[7]

10


క.

ఆవైవస్వతుఁ డమ్మై, త్రావరుణులఁ గూర్చి కడుముదంబున భాగ్య
శ్రీ వెలసిన సంతతికై, కావించె నతండు పుత్రకామేష్టి తగన్.

11


తే.

అందు నపహుతమై హౌతృకాపచార, దోషవశమునఁ జేసి పుత్రుండు జనన
మొందనేరక కన్యక యుదయమయ్యె, నవ్య సౌందర్యవతి యిళానామమునను.[8]

12


వ.

పదంపడి యక్కన్య మిత్రావరుణప్రసాదంబునం జేసి సుద్యుమ్నుం డను కుమా
రుండై పెరుగుచుండి యౌవనమదంబున నెవ్వరిం గైకొనక యన్యపురుషులకు
దురవగాహం బైనగౌరీవనంబున విహరించుచుండ నలిగి యీశ్వరుండు తొల్లిం
టియట్ల స్త్రీరూపం బగునట్లుగా శాపం బిచ్చిన నయ్యింతి సోమసూనుం డైన
బుధునియాశ్రమంబునఁ బరిభ్రమించుచుండె నంత.[9]

13


సీ.

మగువకెమ్మోవికమ్మనితేనె లానంగఁ గలుగుట రసనంబు గలఫలంబు
నలినాస్యయాలింగనశ్రీలఁ దేలంగఁ గలుగుట దేహంబు గలఫలంబు
భామినీమణిమంజుభాష లాకర్ణింపఁ గలుగుట కర్ణముల్ గలఫలంబు
వనజాక్షిరూపలావణ్యసంపదఁ జూడఁ గలుగుట కన్నులు గలఫలంబు


తే.

ముదితతనుసౌరభంబులు మూరుకొనెడి, ఘనత గల్గుట నాసిక గలఫలంబు
నాకు ననుచును రోహిణీనందనుండు, సొంపుతోడ నిలాకన్యఁ జూచి చొక్కె.

14

ఉ.

ఆనలినాయతాక్షి తనయౌవనసంపదలెల్ల రోహిణీ
సూనున కీకయుండినఁ బ్రసూనశిలీముఖుచేత నోర్వఁగా
లేనని యక్కుమారుశుభలీలలు నాతనిరూపవైభవా
నూనవిలాసభాసురతయు బ్రియమారఁగఁ జూచె నర్థితోన్.[10]

15


వ.

ఇ ట్లన్యోన్యసమాగమంబున నయ్యిద్దఱుం బెద్దకాలంబు దాంపత్యసుఖంబుల
ననుభవించుచుండ నమ్మిథునంబునకుఁ బురూరవుండు జన్మించె నంత.

16


ఆ.

అప్పు డమితతేజు లైనమహాముని, వరులు భక్తితోడ వైష్ణవాఖ్య
మైనక్రతువు చేసి యయ్యింతి సుద్యుమ్నుఁ, గా నొనర్చి రధికగౌరవమున.

17


క.

మును సుద్యుమ్నుఁడు సతియై, జనియించుటఁ జేసి రాజ్యసంప్రాప్తము లే
కునికి యెఱింగి వసిష్ఠుఁడు, మనువు నొడంబఱిచి యాకుమారవరునకున్.

18


వ.

సకలభోగాధిష్ఠానం బైన ప్రతిష్టానపురంబునందుఁ బట్టంబు గట్టించిన నతండు
రాజ్యసుఖంబు లనుభవించుచు నుత్కళ గయ వినుతు లనుమువ్వురుకుమా
రులం బడసి మహాధర్మశీలుండై యనేకయజ్ఞంబులు చేసి నిజపదంబునఁ బురూ
రవుఁ బట్టంబు గట్టి తపంబునకుం జనియె.[11]

19


తే.

మనుతనూభవు లైనతొమ్మండునృపుల, యందు వృషదుండు దా గురుహత్య చేసి
యిది నిమిత్తము శూద్రుఁ డయ్యెను దదన్వ, యంబువారును శూద్రులై రతనియట్ల.[12]

20


క.

క్షితిపతి యైనకరూశుఁడు, సుతులం గారూశు లనఁగ సూనృతరతులన్
ధృతిబలపరాక్రమశ్రీ, యుతులం బెక్కండ్రం గాంచె నున్నతమతులన్.[13]

21


క.

మనుపుత్రుఁ డైనదిష్టుఁడు, గనియెను నాభాగుఁ డనఁగ గాదిలిసుతునిన్
విను మతనికి వైశ్యత్వం, బనుగుణమయ్యెను ధరిత్రి యంతయు నేలన్.[14]

22


వ.

ఇట్టినాభాగునకు బలంధనుండును బలంధనునకు వత్సప్రీతియును వత్సప్రీతికి
నుదారకీర్తియును ఉదారకీర్తికిఁ బ్రాంశుప్రజాపతియును వానికి ఖనిత్రుండును
వానికి క్షుపుండును క్షుపునకు నతిబలపరాక్రమనిధి యైన వింశుండును వానికి
ఖనేత్రుండును అతనికి నతివిభూతియును అతివిభూతికి నధికబలపరాక్రముం
డైనకరంధముండును వానికి నవేక్షియును అవేక్షికి మరుత్తుం డనుచక్రవర్తియుం
బుట్టిరి.

23


మ.

మనువంశోత్తముఁ డమ్మరుత్తుఁడు జగన్మాన్యుండు భూలోకమె

ల్లను దుర్వారబలప్రతాపవిభవోల్లాసంబు శోభిల్లఁగా
ననురాగంబున నేలె నవ్విభుఁడు దా నాదేవతాసార్వభౌ
మునికంటెన్ బలవంతుఁడై రిపుకులంబున్ గూల్చె నుగ్రాజులన్.[15]

24


సీ.

క్రతుశాల మొదలుగాఁ గలసాధనము లెల్లఁ గాంచనమయములుగా నొనర్చెఁ
బ్రత్యక్షమున సోమపానంబు గావింప దేవతావల్లభుఁ దెచ్చి తనిపె
గౌరవంబున మరుద్గణముల రావించి పరివారముగఁ జేసి పనులు గొనియె
సకలనిర్జరులను సభ గూర్చి యండఱ నయ్యైవిధంబుల నాదరించె


తే.

దక్షిణలుగా మహీదేవతలకు పసిఁడి, త్రవ్వి తండంబులుగఁ జేసి తనియ నిచ్చి
యశ్వమేధంబు గావించె నమ్మరుత్తుఁ, డఖలలోకంబులును దన్ను నభినుతింప.[16]

25


వ.

అట్టిమరుత్తునకు సరిష్యంతుండును సరిష్యంతునకు దముండును వానికి రాజవర్ధ
నుండును ఆతనికి సుధృతియును సుధృతికి నరుండును నరునకుఁ గేరళుండును
బుట్టి రట్టికేరళునిపేరం గేరళదేశం బయ్య నాకేరళునకు బంధుమంతుండును
వానికి వేగవంతుండును వానికి బుధుండును బుధునకుఁ దృణబిందుండును
బుట్టిరి.

26


తే.

అట్టితృణబిందునకుఁ గన్యయై జనించె, నిలబిలానామమున నొక్కయిందువదన
యామృగాక్షి యలంబస యనఁగ నొక్క, యప్సరసం గాంచెఁ గూఁతుఁగా నర్థితోను.

27


ఉ.

ప్రీతి వహించి దానిఁ దృణబిందుఁడు పెండిలియాడి లోకవి
ఖ్యాతచరిత్రుఁడై మెఱసినట్టివిశాలునిఁ గాంచెఁ బుత్రుఁగా
నాతనిపేర నీధరణియందు వెలింగె విశాలనాఁ బురం
బాతతరాజ్యవైభవసమంచితలక్ష్మికి జన్మభూమియై.

28


సీ.

ఆవిశాలునిపుత్రుఁడై హేమచంద్రుండు జనియించె నతనికిఁ జంద్రుఁ డనఁగ
దనయుఁడు పొడమె నాతనికి ధూమ్రాశ్వుండు జనియించె నతఁడు సృంజయుని గాంచె
నాసృంజయునిపుత్రుఁడై సహదేవుండు పుట్టె గుణాశ్వుఁ డాభూమిపతికి
సుతుఁడయ్యె నతనికి సోమదత్తుఁడు పుట్టె నారాజచంద్రుండు నవని యేలె


తే.

నర్థితోడ దశాశ్వమేధాధ్వరములు, చేసి కాంచనరత్నవిలాసినీతు
రంగమోత్తుంగగోధేనురాజినెల్ల, దక్షిణల భూమిసురులకుఁ దనియ నిచ్చి.

29


క.

ఆజననాయకునకు సుతుఁ, డై జనమేజయుఁడు పుట్టె నతులితబలతే
జోజయశాలి యతనికిని, రాజన్యుఁడు సుమతి పుట్టె రాజతయశుఁడై.

30

తే.

ఆయురైశ్వర్యసంపన్ను లతులధార్మి, కులు మహాత్ములు వీర్యవంతులు ననంగ
మహి వెలింగిరి తృణబిందుమహిమవలన, సశలవైశాలికావనీశ్వరచయంబు.[17]

31


వ.

ఇది దిష్టవంశప్రకారం బనిచెప్పి మఱియును.

32


క.

మనుసుతుఁ డగుసంయాతికి, జనియించెను గన్య యనఁగఁ జంద్రానన య
వ్వనితారత్నముఁ జ్యవనుం, డనుమునిభార్గవుఁడు పెండ్లియాడెన్ బ్రీతిన్.

33


వ.

మఱియు నాసంయాతికిఁ బరమధార్మికుం డైన యానర్తుండు పుట్టె వానికి రేవ
తుండు పుట్టె నతండు కుశస్థలి యనుపురంబున రాజ్యంబు చేసి నూర్వురుకుమా
రులం బడసె నందు భ్రాతృశతజ్యేష్ఠుం డైనకకుద్మి యనువానికి రేవతి యను
కన్యారత్నంబు పుట్టె.[18]

34

రేవతీబలరాములవివాహప్రకారము

చ.

అభినవచారుయౌవనవిహారసమంచితవైభవంబులం
ద్రిభువనలక్ష్మికిన్ వెనుక తీయనికన్నియఁ జూచి తండ్రి యీ
యిభగమనం వరింపఁ బతి నెవ్వనిఁ గట్టడ సేసెనొక్కొ ప
ద్మభవుఁడు నాకు నిట్టియనుమానము మాను నతండు చెప్పినన్.[19]

35


వ.

అని విచారించి రేవతీసమేతుండై యారాజు బ్రహ్మలోకంబునకుం బోయె నప్పు
డప్పితామహుండు హాహాహూహు లనుగంధర్వులచేత దివ్యగాంధర్వంబు
వినుచుండుటంజేసి తనకు నవసరంబులేక ముహూర్తమాత్రంబు తానును దదీ
యసంగీతవిద్యావిలాసంబులకుం జొక్కి. మసలె నక్కాలంబున ననేకమహాయు
గంబులు చనియె గీతావసానంబున సుముఖుం డైనచతుర్ముఖునకుం బ్రణమిల్లి
కరంబులు మొగిచి యిట్లనియె.[20]

36


క.

దేవా యిది నాకన్నియ, రేవతి యీకమలముఖ వరింపఁదగినధా
త్రీవరకుమారు నెవ్వనిఁ, గావించితి వానతిచ్చి కరుణించఁగదే.[21]

37


క.

అనినఁ బితామహుఁ డిట్లను, జననాయక నీకు లాభిజ్యములకుఁ దా
ననుకూలుఁ డైననృపనం, దనునకు నెవ్వనికి నొసఁగఁ దలఁచితి కూఁతున్.[22]

38


చ.

అనినఁ గకుద్మి పద్మజునియంఘ్రులకు బ్రణమిల్లి తొల్లి రా
జ్యనిరతి నుండుకాలమున సన్నుతికెక్కిన రాజకోటిలోఁ

గొనకొని వేఱువేఱ నొకకొందఱిఁ బేర్కొని వీరిలోన నె
వ్వనికి మదీయపుత్రిని వివాహము సేయుదు నాన తీఁగదే.[23]

39


వ.

అనినం దరహసితవదనుండై పితామహుం డిట్లనియె.

40


ఆ.

వసుమతీశ నీవు వచ్చి యిచ్చోట గాం, ధర్వవిద్యయందుఁ దగిలి వినుచు
నునికిఁ జేసి యొకముహూర్తంబు చెల్లిన, కాలమునను బహుయుగములు చనియె.

41


క.

మహిలో నిరువదియెనిమిది, మహాయుగము లరిగె నిపుడు మనుకాలంబై
సహజము లైనయుగంబుల, మహిమలు నీ కెఱుఁగరాదు మాలోకమునన్.

42


ఉ.

నీ విపు డర్థిఁ జెప్పిన మహీశులు నాఁడె ధరిత్రి యేలి కా
లావధి నొంది పోయిరి తదన్వయసంభవులందుఁ బుత్రపౌ
త్రావలు లెందఱేనియు లయంబునఁ బొంది రనేకభంగులం
గావునఁ జేరువం గలియుగం బగుచున్నది రాజనందనా.[24]

43


తే.

ధాత్రిలోపల నీపుత్రమిత్రసహజ, బలకళత్రసచివభృత్యబంధుకోశ
ములు మొదలుగాఁగఁ గాలంబువలన బహుప, రంపరలు చెల్లె నిప్పుడు రాజముఖ్య.[25]

44


క.

నీ వింక ధరణికిం జని, యీవనితం దగినవరున కిమ్మనిన ధరి
త్రీవల్లభుఁ డాశ్చర్యర, సావేశుం డగుచు మ్రొక్కి యజ్ఞజుఁ బల్కెన్.[26]

45


క.

 జగదేకనాథ యిప్పుడు, జగతీతల మేలు రాజచంద్రులలోనన్
మగువకు ననుకూలుం డగు, మగని విచారించి చెప్పి మన్నించఁగదే.

46


చ.

అనవుడు సర్వలోకగురుఁ డైనపితామహుఁ డాదరంబునన్
వినమితమస్తకుండును వివేకపరిస్ఫుటమానసుండునై
యొనరఁగ గొంతసేపు దలపోసి మహాత్ము నెఱింగి సంతసం
బునఁ గరపద్మముల్ మొగిచి ముత్పులకల్ జనియింప నిట్లనున్.[27]

47


క.

జగతీశ నీతనూజకుఁ, దగినవరుం డున్నవాఁడు ధరణీస్థలిలో
జగదేకరక్షణక్రముఁ, డగువిష్ణుం డమ్మహాత్ముఁ డై జనియించెన్.[28]

48

వ.

ఆతనిమహత్త్వంబు వినుము.

49


చ.

మురహరుఁ డైనకేశవుతమోగుణమెల్ల ననంతమూర్తియై
ధరణిభరంబు సర్వమును దాల్చు జగత్ప్రళయంబు సేయు న
ప్పురుషుఁడు చిత్రరూపమునఁ బొంది వెలుంగు నతండు నేఁడు ద్వా
పరమున భూమిభార ముడుపన్ జనియించినవాఁడు రాముఁడై.

50


సీ.

మనుజేశ యతఁ డాదిమధ్యాంతశూన్యుండు నిరపాయచిత్తుండు నిర్వికల్పుఁ
డాదిదేవుఁ డనంతుఁ డవ్యయాత్ముఁడు కళాకాష్టానిమేషాదికాలరూపి
సర్వంకషుఁడు రజస్సత్వతామసగుణోద్రిక్తుండు నుద్భవస్థితివినాశ
కారణభూతుఁ డాకాశతత్వోపసత్సంపన్నుఁ డపహృతజన్మమరణుఁ


తే.

డతులకల్యాణమూర్తి వేదాంతవేద్యుఁ, డతులయోగీంద్రహృదయవిహారశీలుఁ
డప్రమేయుం డవాఙ్మయుఁ డాహితాగ్ని, యదుకులంబున జన్మించి యవని మించె.[29]

51


క.

బలభద్రమూర్తి యగునా, బలభద్రుఁడు నీలవస్త్రపరిధానుఁడు లాం
గలముసలపాణి యాదవ, కులరత్నము నీతనూజకుం దగు ననఘా.[30]

52


ఆ.

విష్ణుదేవుఁ డతఁడు విష్ణుమాయాశక్తి యీలతాంగి వీర లిరువురకును
దగు నరేంద్రచంద్ర దాంపత్యవైభవం, బట్లు సేయు సంశయంబు మాని.

53


వ.

మున్ను నీచేతం బరిపాలింపంబడిన యమరావతికంటె రమ్యం బయినకుశస్థలీపురం
బిప్పుడు యుగాంతరంబుల ద్వారావతి యనంగ యాదవరాజధానియై యున్న
యది యందు యదువృష్ణిభోజాంధకలోకంబు గొలువ వినోదించుచున్న కామ
పాలునకు నీకన్నియ వివాహంబు సేయుపొ మ్మని యామంత్రణము సేసినం
బ్రణమిల్లి వీడ్కొని రేవతీసమేతుండై భూమండలంబునకు వచ్చి.[31]

54


క.

హ్రస్వుల నిస్తేజుల దుఃఖస్వా౦తుల విష్ణుభక్తిగర్హితమతులన్
స్వస్వానురూపసన్మా, ర్గస్వల్పులఁ గాంచె నవనికాంతుఁడు నరులన్.[32]

55


వ.

ఇట్లు కనుంగొనుచుఁ జని ద్వారకాపురంబు సొచ్చి.

56


క.

అతులోదీర్ణస్ఫటిక, క్షితిభృత్సమగాత్రుఁ డైనసీరధరు సము

న్నతతేజోనిధిఁ గన్గోని, యతనికిఁ బ్రార్థించి యిచ్చె నాత్మతనూజన్.[33]

57


ఉ.

ఇచ్చి కృతార్థుఁ డైనమనుజేంద్రుఁడు తక్కినవారు చూడఁగా
నచ్చపలాయతాక్షి పొడవైనశరీరము లాంగలంబునం
గ్రుచ్చి హలాయుధుండు కడుఁగొంచెము చేసి వివాహమై కడున్
మచ్చికతో వహించె గరిమంబున నైహికభోగసంపదల్.[34]

58


వ.

ఇట్లు బలభద్రునకు రేవతిం బాణిగ్రహణంబు సేయించి కకుద్మి హిమవంతంబు
నకుం దపంబు సేయం జనియె.

59


ఉ.

రైవతుఁ డాదికాలమున రాజ్యము సేయక బ్రహ్మపాలికిం
బోవుట చూచి రాక్షసులు పుణ్యజనాఖ్యులు పూర్వవైరముఁల్
భావములందుఁ గ్రందుకొన బల్విడి నాతనిదేశమెల్ల ని
చ్ఛావిధిఁ జూఱగైకొని కుశస్థలియంతయుఁ బాడుచేసినన్.[35]

60


వ.

కకుద్మి సహోదరులు నూర్వురుఁ బుణ్యజనభయార్తులై నానాదేశంబుల నుండి
రారాజవంశంబుల ననేకులు పుట్టిరి.

61


క.

భూభుజుఁ డగునభగునకును, నాభాగుఁడు పుట్టె నతఁడు నానాధర్మ
స్వాభావికుఁడై యేలెను, భూభాగంబెల్లఁ గీర్తి భువనము నిండన్.[36]

62


శా.

ఆనాభాగున కంబరీషుఁ డుదయంబయ్యెన్ విరూపాఖ్యుఁ డా
భూనాథోత్తముపుత్రుఁడై బహుముఖంబుల్ చేసి నారాజు తే
జోనీరేరుహమిత్రుఁ గాంచెఁ బృషదశ్వున్ వాఁడు ధర్మక్రియా
సూనుం గాంచె రథీరథుం డనఁగ నత్యుగ్రప్రతాపోన్నతున్.[37]

63


తే.

ఆరథీరథువంశజు లైననృపతు, లాంగిరసనామములతోడ నవని యేలి
వంశవర్ధనులై తపోవైభవమున, నుల్లసిల్లుచు నేడును నున్నవారు.

64


క.

వైవస్వతుండు తుమ్మిన, నావిభుముకుఁగ్రోళ్లఁ బుట్టె నతులైశ్వర్య
శ్రీవిభుఁడు సాధుజనసే, వావిధుఁ డిక్ష్వాకుఁ డర్కవంశవిభుండై.[38]

65


వ.

ఆయిక్ష్వాకునకు నూర్వురు కుమారులు జన్మించి రందు గుక్షియు వికుక్షియు
దుందుండు ననుమువ్వురను నిజరాజ్యపదంబున నియోగించి.

66


ఆ.

తండ్రికంటె నధికధార్మికుఁడై మహీ, చక్ర మెల్ల నతిపరాక్రమమున
నేలె మనుతనూజుఁ డిక్ష్వాకుఁ డయ్యయో, ధ్యాపురంబు రాజధానిగాను.

67


వ.

అమ్మహీపతి యొక్కనాఁ డష్టకాశ్రాద్ధంబు సేయువాఁడై మృగమాంసంబు
దెమ్మని వికుక్షిం బనిచిన నతం డనన్యశరణ్యం బైనయరణ్యంబునకుం జని.

68

క.

బలువేఁటవెంట నడవిం, గలమృగములనెల్లఁ జంపి కడునాఁకటిచే
నిలువంగలేక యొకశశ, పలలము కఱకుట్లు చేసి భక్షించి యొగిన్.[39]

69


క.

ఆచిక్కినమాంసంబు య, థోచితముగఁ దెచ్చి తండ్రి కొసఁగిన మనువం
శాచార్యుఁ డగువసిష్ఠుఁడు, చూచి వివేకించి యది యశుద్ధం బగుటన్.[40]

70


వ.

ఇక్ష్వాకు నవలోకించి యిట్లనియె.

71


మ.

జననాథోత్తమ నేఁడు నీసుతుఁడు దా శ్రాద్ధార్థమై సంతరిం
చినమాంసంబులు మీఁదుబుచ్చి శశమున్ ఛేదించి భక్షించి త
క్కినయుచ్ఛిష్టము దెచ్చినాఁ డకట యెంగి ళ్లేగతిం బైతృకం
బునకుం బెట్టఁగ యోగ్యమౌనె యనినన్ భూపాలకుం డుగ్రుఁడై.[41]

72


తే.

ఆకుమారుని గోపించి యప్పు డడవి, కరిగి మృగమాంసములు దెచ్చి యర్హమైన
యష్టకాశ్రాద్ధకర్మంబు లాచరించె, నవ్వసిష్ఠాదిమౌనీంద్రు లలరుచుండ.[42]

73


వ.

ఇవ్విధంబున నిక్ష్వాకుండు పుణ్యశ్లోకుండై యుండె వికుక్షియు శశభక్షకుం
డగుటం జేసి శశాదుం డనంబరఁగె నట్టిశశాదుండు తండ్రిపిమ్మట నఖిలభూమం
డలంబు ధర్మమార్గంబునం బరిపాలించి.

74


ఉ.

నెట్టిన నశ్వమేధములు నెమ్మి ననేకము చేసి వైరులం
గిట్టి వధించి లోకములఁ గీర్తి దళంబుగ నించె మించఁగా
నట్టిశశాదుఁ డాత్మసుతుఁ డైనపురంజయు భూమి యేలఁగాఁ
బట్టము గట్టి కొనకుఁ దపం వరింపఁగఁబోయెఁ బెంపుతోన్.[43]

75


క.

రంజితభువనత్రయుఁడు పు, రంజయుఁ డిక్ష్వాకుఁ బోలి రమణీయయశో
మంజులుఁడై భూజనులకు, సంజీవినిఁబోలె నేలె జగతి మునీంద్రా.[44]

76


క.

ఆకాలంబున రాక్షస, నాకౌకసులకు మహారణంబైన సురా
నీకంబుల సురకోటికిఁ, గాక వెఱచిపఱచి రధికకంపితమతులై.[45]

77


వ.

ఇవ్విధంబునం బురందరప్రముఖనిఖలదేవతలు వైకుంఠంబునకుం జని.

78

సీ.

 సనకసనందాదిసంయమీశ్వరులకు సంతతానందంబు సలుపువాని
లీలావినోదకేలీవిలాసంబుగా భువనంబులన్నియుఁ బ్రోచువానిఁ
గలశపాథోరాశికన్యకారత్నంబు నొద్దికతోఁ గూడియున్నవాని
శతకోటిభాస్కరసందీప్తతేజుఁడై దుర్నిరీక్ష్యస్థితిఁ దోఁచువాని


తే.

శంఖచక్రగదాశార్ఙ్గసాధనములు, నలుగడలఁ జేరి భజియింప నలరువానిఁ
బుండరీకాక్షు నతులభూభువనరక్షు, విష్ణుదేవునిఁ బొడగాంచి విబుధవరులు.[46]

79


వ.

దండవన్నమస్కారంబులు చేసి భయార్తులై దానవులచేతం దమపడినబన్నంబులు
విన్నపంబులు చేసినఁ బన్నగశయనుం డాపన్ను లైనయన్నిలింపుల కిట్లనియె.[47]

80


క.

మీ కేమిభయము దానవ, లోకంబులఁ జంపి పోరిలో జయలక్ష్మీన్
జేకొని మిము రక్షింపఁగ, భూకాంతుం డొకఁడు గలఁడు భూరిబలుండై.

81


క.

రాజర్షి యగుశశాదుత, నూజుండు పురంజయుఁడు మనుజలోకమునన్
రాజిల్లు మదీయాంశము, తేజంబున నమ్మహీశతిలకం బయ్యెన్.

82


ఉత్సాహము.

ఆపురంజయుండు మీకు నహితు లైనదైత్యులన్
రూపుమాప నోపుఁ దదనురూపమైనవృత్తి మీ
రోపి సేయుఁ డింక శంక లుజ్జగించి యవ్విభున్
బ్రాపు వేడుకొండు పొండు పైనమై ధరిత్రికిన్.[48]

83


మ.

అని యి ట్లానతి యిచ్చి పంపుటయు దేవానీకముల్ ధాత్రికిన్
జని సాకేతపురంబులో నతులరాజ్యశ్రీలఁ బెంపొందుచు
న్ననరేంద్రోత్తమునిం బురంజయుని నానాలోకసంసేవితున్
మనువంశోత్తముఁ గాంచి యాదరమునన్ మన్నించి వా రర్థితోన్.[49]

84


ఉ.

ఓజననాథ మాదగు ప్రయోజనముల్ విను దైత్యకోటిచే
నాజులలోఁ బరాజితులమై హరిఁ జేరితి మవ్విభుండు నీ
తేజముఁ జెప్పినం గలఁకదేఱి నినుఁ భజియించినార మ
వ్యాజసుఖంబు లీయమరవర్యుల కిచ్చి వధింపు శత్రులన్.[50]

85


వ.

అని యనేకవిధంబులం బ్రార్థించినఁ బార్థివనందనుండు బృందారకబృందంబున
కిట్లనియె.[51]

86

చ.

క్రతువులు నూఱు చేసి త్రిజగంబుల నేలి సమస్తదేవతా
ప్రతతులఁ బ్రోచువజ్రి వృషభం బగునేనియుఁ దత్కకుత్స్థలం
బతులితశక్తి నెక్కి చని యాజి నెదుర్కొని దైత్యవర్గమున్
హతముగఁ జేసి మీకు విజయం బొనరించెద నిక్క మింతయున్.[52]

87


తే.

అనిన నింద్రాదిదేవత లట్ల కాక, యని యొడంబడి రప్పు డయ్యమరభర్త
వృషభరూపంబుతోడ భూవిభునియెదుర, నిలిచె శివుఁ జేరి యున్న నందియునుబోలె.

88


క.

ఆవృషభకకుత్స్థుండై, భూవరుఁ డతిభక్తితోడఁ బురుషోత్తమునిన్
భావించి కొలిచి తత్తేజోవిభవముఁ దాల్చి సకలసురులున్ గొలువన్.[53]

89


క.

దురమునకు నరిగి దానవ, వరులం బరిమార్చి వాసవప్రభృతులకున్
బరమానందముఁ బెంపును, నిరమిత్రము జేసెఁ కార్యనిధియై కడిమిన్.[54]

90


వ.

ఇవ్విధంబునం బురంజయుండు వృషభకకుత్స్థుం డగుటంచేసి కకుత్స్థనామంబునం
బరఁగె.

91


తే.

ఆకకుత్స్థునినందనుఁ డయ్యె వేనుఁ, డెంచఁగా వేనునకు నుద్భవించెఁ బృథుఁడు
పృథుకు విశ్వగుఁ డతనికిఁ బృథుయుతుండు, పుట్టె వానికిఁ జంద్రుండు పుత్రుఁ డయ్యె.[55]

92


క.

చంద్రునకు యౌవనాశ్వన, రేంద్రుఁడు జన్మించె నతని కిద్ధచరితుఁడౌ
నింద్రయశుఁడు శావస్తుఁడు, సాంద్రయశుం డుద్భవించె సౌజన్యనిధీ.

93


క.

ఆవసుధేశ్వరుపేరను, శావస్తి యనంగఁ బురి ప్రశస్తి వహించెన్
భూవలయంబున నది యమ, రావతియునుబోలె మిగుల రమ్యం బగుచున్.

94


తే.

అట్టిశావస్తునకు బృహదశ్వుఁ డనఁగ, సుతుఁడు జన్మించెఁ గువలయాశ్వుండు వాని
పుత్రుఁ డయ్యను విష్ణునిభూరిమహిమ, దాల్చి భూలోకమంతయుఁ దానె యేలె.

95


ఉ.

తొల్లి యుదంకుశాపమున దుందుఁడు ఘోరనిశాటుఁడై జగం
బెల్లను బాధసేయఁగ మునీంద్రులు భీతిలిపోయి యమ్మహీ
వల్లభుతోడఁ జెప్పిన నవార్యబలోన్నతి యుల్లసిల్లఁగా
నల్ల ననేకవింశతిసహస్రకుమారులఁ గూడి సేనతోన్.[56]

96

ఉ.

ఏమఱిపాటువోయి దనుజేంద్రునితో నతిఘోరమైనసం
గ్రామ మొనర్పఁ జొచ్చుటయు రాక్షసవీరునివేఁడియూర్పు లు
ద్దామవిషాగ్నికీలలవిధంబున నొక్కటఁ జుట్టుముట్టి నా
నాముఖవీరసేనల వినాశము చేసె భయంకరంబుగన్.[57]

97


వ.

అందు దృఢాశ్వచంద్రాశ్వకపిలాశ్వు లనుమువ్వురుకుమారులు దక్కఁ దక్కినకు
మారులందఱు భస్మీభూతులై రప్పుడు కువలయాశ్వుండు విష్ణుభక్తిప్రభావం
బునం జేసి యారక్కసు నుక్కడంచె నది కారణంబుగాఁ గువలయాశ్వుండు
దుందుమారుండయ్యె.[58]

98


క.

ఐశ్వర్యశాలి యైనదృ, ఢాశ్వుఁడు హర్యశ్వుఁ గాంచె నతనికి సురలో
కేశ్వరనిభుఁడు నికుంభుఁడు, శశ్వజ్జయశాలి పుట్టె సన్మునితిలకా.[59]

99


వ.

ఆనికుంభునకు నహితాశ్వుండును వానికిఁ గృతాశ్వుండును వానికిఁ బ్రసేన
జిత్తుండును వానికి యువనాశ్వుండును బుట్టి రయ్యువనాశ్వుండు మహాధర్మ
శీలుండై రాజ్యంబు చేసి సంతానంబు లేనిసంతాపంబున నిర్వేదించి యొక్కనాఁ
డాత్మగతంబున.[60]

100


ఉ.

ఏలితి లోకమున్ నిరవహిత్థవిభూతి వెలుంగ శత్రులం
దోలితి భూమిభృద్విపినదుర్గములన్ జరియింపఁ గీర్తులన్
వాలితి మూఁడులోకములవారలు మెచ్చఁగ నిట్టులయ్యు నా
కేలని తోచుచున్నయవి యిన్నియు సంతతి లేకయుండుటన్.[61]

101


ఉ.

ఎడ్డమి యైనయప్పటికి నెవ్వరుఁ జేరరు లోకు లేమియున్
సడ్డలుసేయ నొల్ల రవసానపువేళల దండధారుచే
జడ్డలె కాని మేలుకొనసాగదయో తలపోసిచూచినన్
బిడ్డలు లేనివాని కడవి మృగజన్మము రోఁత పుట్టదే.[62]

102


మ.

అని సర్వంబుఁ బరిత్యజించి నిజభృత్యామాత్యవర్గంబుల
దనరాజ్యం బరయంగ నిల్పి ప్రియకాంతాయుక్తుఁడై కానకుం
జని యత్యుగ్రతపంబు సేయునెడ నాసర్వంసహామండలా
వనకేళీరతుఁ డైనభూవిభునిసద్వంశంబు రక్షింపఁగన్.[63]

103

క.

అనుకంపలు చిత్తములన్, బెనలు గొనన్ మౌనివరులు పృథివీతలనా
థునికడకు వచ్చి సంభా, వనలు వడసి యధికగౌరవము దీపింపన్.[64]

104


ఉ.

పార్థివచంద్ర యీగతిఁ దపం బొనరింపఁగనేల వేల్పులన్
బ్రార్ధన చేసి దుర్దశలు పాటిలనేల నికరంబు లీ
యర్థము లెల్ల వీనియెడ నాసలఁ జెందకు మేము నీకుఁ బు
త్రార్థము వైష్ణవం బగుమహాక్రతు విప్పు డొనర్తు మర్థితోన్.[65]

105


ఆ.

అందుఁ గులపవిత్రుఁ డగుపుత్రుఁ డుదయించు, లలిత మైనపుణ్యఫలము నీకుఁ
గలుగు ననుచుఁ బుత్రకామేష్టి వేల్చిరి, దివ్యమంత్రశక్తి తేజరిల్ల.[66]

106


సీ.

ఈరీతిఁ బుత్రకామేష్టి వేల్చి సమాప్త మగుదివసంబున నర్ధరాత్రి
వరమంత్రపూతాంబుపరిపూర్ణకాంచనకలశంబు వేదిపై నిలిపి జాగ
రము సేయ మఱచి సంయములు నిద్రాసక్తులైయున్న యాసమయంబునందు
యువనాశ్వుఁ డనవరతోపవాసపిపాస నొంది యచ్చోటికి నొయ్యవచ్చి


తే.

వేదిపై నున్న మంత్రపూతోదకములు, గ్రోలి తానును నిద్రించెఁ గొంతసేపు
నకు మునీంద్రులు మేల్కని యరసి రిత్త, యైనకలశంబు చూచి యిట్లనిరి కినిసి.[67]

107


క.

సంతానార్థం బీనృపు, కాంతకుఁ బానంబు సేయఁగా నునిచినకుం
భాంతరమంత్రోదకములు, చింతింపక గ్రోలినట్టి చెడు గెవ్వఁడొకో.

108


క.

చెప్పుఁడు చెప్పకయుండిన, నిప్పుడె శపియింతు మనిన నిలఱేఁడు భయం
బుప్పతిల లేచి వణఁకుచు, నప్పరమమునీశ్వరులకు నర్థిం బలికెన్.[68]

109


క.

ఉపవాసాయాసంబున, నపరిమితపిపాసనొంది యంగము లెల్లం
దపియింప నోర్వఁజాలక, యిపు డుదకము గ్రోలినాఁడ నే నని పలికెన్.

110


క.

తాపసవరులందఱు నా, భూపతి వీక్షించి యకట బుద్ధివిహీన
వ్యాపారదోషమున నీ, వేపుగ గర్భంబు దాల్తు వింతియుఁ బోలెన్.[69]

111


క.

జననాయక నీగర్భం, బునఁ గడుబలవంతుఁ డైనపుత్రుఁడు జన్మిం
చు ననుచుఁ బలికి రప్పుడు, మునివరులయనుగ్రహం బమోఘం బగుటన్.

112


వ.

ఇవ్విధంబున నతండు గర్భంబు దాల్చియున్నంతఁ గొంతకాలంబునకు నతని దక్షి
ణకుక్షి భేదించి మహాబలపరాక్రమసంపన్నుం డైనపుత్రుండు జన్మించిన.

113


తే.

విరులవాన గురిసె సురదుందుభులు మ్రోసె, దివ్యవాణి పొగడె దివిజఖచర

గరుడసిద్ధసాధ్యగంధర్వపన్నగ, వరులు గొల్వ వచ్చె వాసవుండు.

114


వ.

వచ్చి యమ్మహామునుల నవలోకించి యీయర్భకుండు మదీయరాజ్యంబును
నన్నును భరియింప సమర్థుండగుటంజేసి మాంధాత యను నామంబు చేసితి
నని పలికి.

115


తే.

వరసుధామృతధారలు దొరుగుచున్న, తనప్రదేశిని నమ్మహీవరకుమారు
నోరి లోపల నిడి కడుపారఁ దుష్టి, చేసె బండ్రెండుసమములు వాసవుండు.[70]

116


వ.

ఇవ్విధంబునఁ బండ్రెండేళ్లకుమారుండై మాంధాత సప్తద్వీపసమేతం బైనవసుం
ధరాచక్రం బవక్త్రపరాక్రమంబున ననుభవించి చక్రవర్తియైన.

117


తే.

సూర్యుఁ డుదయించి క్రుంకెడుచోట్ల నడిమి, ధాత్రియెల్లను యువనాశ్వపుత్రుఁడైన
యట్టి మాంధాతృక్షేత్రంబె యని జగంబు, లభినుతించుచు నుండుదు రనుదినంబు.

118


వ.

అట్టి మాంధాత శశిబిందుపుత్రి యైనబంధుమతిం బాణిగ్రహణంబు చేసి దాని
యందుఁ బురుకుత్సాంబరీషముచికుందు లనుకుమారుల మువ్వురం బడసి మఱి
యును.

119


తే.

మెఱుఁగుఁదళుకు లనఁగ మెలఁగెడుబంగారు, బొమ్మ లనఁగ గమ్మపువ్వుతీఁగె
లనఁగ మోహనాంగు లైనకన్నియల నేఁ, బండ్రఁ గాంచె రాజు ప్రమదమునను.[71]

120


వ.

ఇవ్విధంబున లబ్ధసంతానుండై మాంధాత రాజ్యంబు సేయుసమయంబున.[72]

121


క.

జననుతచరితుఁడు సౌభరి, యనఁగా నొకదివ్యమౌని యంతర్జలముల్
తన కునికిపట్టుగాఁ దప, మొనరించె శతాబ్దకాల మున్నతభక్తిన్.[73]

122


ఉ.

అందు నతిప్రమాణసముదంచితదేహముతోడ నందనీ
నందనబంధుమిత్రులు మనఃప్రమదంబున నిత్యకృత్యముల్
క్రిందను మీఁదఁ బార్శ్వములఁ క్రీడ యొనర్పఁగ సంచరించుచో
మందుఁ డనంగఁ బేరుగల మత్స్యవిభుం డొకఁ డుండె నర్థితోన్.

123


క.

బహువిధముల నాజలచర, విహారసౌఖ్యములు చూచి వేడుకతో న
మ్మహితాత్తుఁడు గృహపతియై, యిహసౌఖ్యము లనుభవింప నిచ్చఁ దలంచెన్.

124


వ.

ఇవ్విధంబునం దపస్సమాధివలన నిలిపిన లక్ష్యంబు వదలి సంసారసుఖంబులకు నభి
ముఖుండై యంతర్జలంబులు వెలువడి కన్యార్థియై మాంధాతపాలికి వచ్చిన.

125


ఉ.

ఆదర మొప్పఁగా నృపకులాగ్రణి యమ్ముని కాసనార్ఘ్యపా
ద్యాదిబహూపచారవిధు లర్థి నొనర్చి నమస్కరించి పు

ణ్యోదయ మీరు నాకడకు నొక్కరు రాఁబని యేమి కల్గెనో
నాదెస మీకుఁ గల్గినఘృణారసవారిధి యిట్టు లుబ్బెనో.[74]

126


క.

నావుడు మునినాథుఁడు వసు, ధావల్లభు నుచితవాగ్విధానంబుల సం
భావించి నీవు దాతవు, గావున ని న్నొకటి యడుగఁగాఁ దగు మాకున్.[75]

127

సౌభరి యనుమునీంద్రుండు మాంధాతకూఁతులఁ బెండ్లియాడి భోగంబు లనుభవించుట

ఆ.

ఎవ్వ రేపదార్థ మేవేళ గోరిన, వారి కుచితమైనవాని నెల్ల
నిచ్చి యనుపకునికి యిక్ష్వాకువంశజు, లైనభూపతులకుఁ గానివావి.[76]

128


ఉ.

అదియునుగాక విన్ము జగమంతయు నుజ్జ్వలబాహుశౌర్యసం
పద వెలయంగ నేలి సురభర్తకు నైననభీప్సితంబు లీ
నొదవినదాత వీ వగుట నొక్కఫలం బిహలోకసౌఖ్యమై
పొదలినదాని ని న్నడుగఁబూని ముదంబున నేగుదెంచితిన్.[77]

129


క.

క్షేత్ర మెఱిఁగి వి త్తిడుటయుఁ, బాత్ర మెఱిఁగి దాన మిచ్చి పనుచుటయు వివే
కత్రాణపరాయణులకు, ధాత్రీశ్వర యిందు నందుఁ దగ మేలొసఁగున్.

130


క.

అనవుడు నవ్విభుఁ డిట్లను, మునినాయక యేపదార్థములు గోరిన వా
నిన యిత్తు నుచితమైనవి, యనుమానము మాని యడుగు మని పలుకుటయున్.

131


ఉ.

ఇన్నిగుణంబులందు నుతి కెక్కినవాఁడవు సత్యవాక్యసం
పన్నుఁడ విట్టినీకు నరపాలక నా కొసఁగంగరానివే
మున్నవి యైననేమియును నొల్ల నరేంద్రకులావతంస నీ
కన్నియలందు నాకు నొకకన్నియ నిమ్ము గృహస్థు నయ్యెదన్.[78]

132


వ.

అనిన నమ్మహీవల్లభుండు.

133


క.

బడలికయుఁ జాల నరసిన, జడలును గడ్డంబు మిగుల జర్జరీతమునై
బెడ గెడలినపొడవును గడు, జడతయునుం గలిగినట్టి సౌభరిఁ జూచెన్.[79]

134


వ.

ఇట్లు చూచి తనమనంబున.

135


ఆ.

ఏమి సేయువాఁడ నీపని యెబ్భంగిఁ, దీర్తు ననుచు వసుమతీవిభుండు
చింతనొంది కొంతసేపున కనియె స, దు త్తరంబు గాఁగ నుపమ దలఁచి.[80]

136


క.

వచ్చిన యిమ్ముని నూరక, పుచ్చినఁ గోపించుఁగాని పోవిడువఁడు దా
నిచ్చెద ననినను గన్యలు, మెచ్చరు వార్ధకముచేత మెదిగినవానిన్.

137


వ.

అని యమ్ముని నవలోకించి.

138

ఉ.

మున్నిటి మాకులంబునృపముఖ్యులు కన్యలఁ బెండ్లి సేయుచోఁ
గన్యల కిచ్చవచ్చుపతిఁ గైకొనిరేనియు నిత్తు రట్లుగా
కున్నఁ గులాభిజాత్యముల నున్నతి కెక్కినవారికైన నీ
రెన్నఁడు నిట్టి మాసమయ మిప్పుడు నేనును జెల్ల నిచ్చితిన్.[81]

139


చ.

అదియునుగాక జర్జరిత మైనశరీరముతోడఁ దద్దయున్
ముదిసినవాఁడ వీవు కడుమోహనరూపవిలాసరేఖలం
బొదలినవారు కన్నియలు భూరిగుణాకర నిన్నుఁ జూచినన్
హృదయములందు మెచ్చరని యిప్పుడు నామదిఁ తోఁచె నెంతయున్.[82]

140


వ.

అనిన నమ్ముని నగుచు మాంధాత కిట్లనియె.

141


ఉ.

నా కిది మంచిమాట నరనాయక కన్నియ లున్నచోటికిన్
దోకొనిపొమ్ము వారు పరితోషముతో నను నాదరించుచున్
జేకొనిరేనిఁ బెండ్లి తగఁజేయుము గాక తిరస్కరించినన్
బోకలఁబోక నే మగిడిపోయెద వచ్చినత్రోవ వెంబడిన్.[83]

142


ఆ.

అనిన నతనిమాట లంగీకరించి య, మ్మనుజవల్లభుండు మాఱుమాట
లాడవెఱచి కన్యకాంతఃపురంబుల, నుండువర్షధరుని నొకనిఁ బిలిచి.[84]

143


ఉ.

ఇమ్మునినాథుఁ గన్నియల కెల్లను జూపి ప్రియంబయేనిఁ గై
కొమ్మని చెప్పు మేతరుణికోరిన దానిన పెండ్లి సేసెదన్
సమ్మద మొప్పనంచు నృపచంద్రుఁడు సౌభరిఁ గూర్చి హెగ్గడిం
బొమ్మని యాజ్ఞయిచ్చె మునిపుంగవుఁడుం బ్రియ మందె నాత్మలోన్.

144


వ.

ఇవ్విధంబున సౌభరి కన్యకాంతఃపురంబుఁ బ్రవేశించి యఖిలసిద్ధసాధ్యగంధర్వమ
నుష్యులకంటె నతిశయంబైనరూపంబు ధరియించె నప్పుడు వర్షధరుండు రాజ
కన్యకాజనంబుల రావించిన.

145


ఉ.

కాఱుమెఱుంగులో మెలవుఁ గైకొన నేర్చిన పైఁడిబొమ్మలో
మారునిదీములో కలికిమాటలచంద్రికలో చెలంగు శృం
గారరసాధిదేవతలొ కమ్మని క్రొవ్విరితీఁగెలో యనన్
వారిజపత్రలోచనలు వచ్చిరి మోహవిలాసమూర్తులై.[85]

146


వ.

ఇ ట్లరుగుదెంచిన మాంధాతృదుహితలకు వర్షధరుం డిట్లనియె.

147


క.

మీతండ్రికడకు ముదుసలి, యీతాపసి వచ్చి కన్య నిమ్మనిన ధరి

త్రీతలపతి మాఱాడక, యీతనిఁ బుత్తెంచె మీర లిందఱుఁ జూడన్.[86]

148


క.

మీలోన నెవ్వ రీతని, లీలం గామింతు రటువలెన్ భూవిభుఁ డ
బ్బాలామణి నిమౌనికి, నాలింగాఁ బెండ్లి సేయు నని పలుకుటయున్.

149


క.

భావజుమోహనశరముల, కైవడి గుమికూడియున్న కాంతలు ధరణీ
దేవోత్తము సౌందర్య, శ్రీవిభవముఁ జూచి మెచ్చి చిత్తము లలరన్.[87]

150


ఉ.

ఈతఁడు నాకుఁ బ్రాణవిభుఁ డీతనికిం బ్రియురాల నన్ను ము
న్నీతఁడు సూచె నీతనికి నిల్లడమానిసి నేను నాకుఁగా
నీతఁడు వచ్చెఁ దండ్రి నను నీతని కిచ్చె నటంచు నొక్కమై
నాతరుణీమణుల్ జగడమాడిరి మారవికారచిత్తలై.[88]

151


క.

ఇత్తెఱఁగున నయ్యింతులు, చిత్తజజాణములచేత సిగ్గంతయుఁ బో
నొత్తి మునిఁ బెండ్లియాడఁగఁ, దత్తఱపడు టెఱిఁగి వర్షధరుఁ డాలోనన్.[89]

152


ఆ.

అధిపుసమ్ముఖమున కరుదెంచి వారల, విధముఁ దేటపడఁగ విన్నవించె
మునితపోమహత్త్వమునకు నమ్మాంధాత, విస్మయమునఁ బొంది వేడ్కతోడ.

153


క.

తనకన్యల నేఁబండ్రను, మునిసౌభరి కొక్కలగ్నమునను వివాహం
బొనరించి తగుతెఱంగునఁ, గనకాంబరభూషణములు గారవమొప్పన్.

154


వ.

ఇచ్చి మణికనకశిబికారూఢులం జేసి పంపిన సౌభరియును బంచాశన్నవోఢాసమే
తుండై నిజాశ్రమంబునకు వచ్చి యనేకశిల్పకల్పనాచార్యుం డైనవిశ్వకర్మ
నాకర్షించి యతనితో నిట్లనియె.[90]

155


ఉ.

ఏను గృహస్థధర్మము వహించితి నాదు భార్యలం
మానవనాథకన్యకలు మానితభోగము లందియున్నవా
రీనలినాయతాక్షులకు నిందఱకున్ విహరింప దివ్యరత్నా
నుపమేయకాంచనగృహంబులు పెక్కొనరింపు నేర్పుతోన్.[91]

156


వ.

అనిన నతం డాక్షణంబ బహువిధద్వారోపద్వారకవాటవప్రప్రాకారపరిభావిశా
లంబు లయినకనకరత్నధగద్ధగాయమానప్రాసాదంబులును నానావిచిత్రభిత్తికాస
భాస్తంభసంభృతదేహళిప్రాంగణసుందరంబు లైనమందిరంబులును ప్రోత్ఫుల్లనీ
లోత్పలపంకజకూజితకలహంసకారండవాదివిహంగమాతిశయంబు లయినజలాశ

యంబులును బహువిధప్రసూనగంధబంధురానేకీరకోకిలాదికలరవాభిరామంబు
లైనయారామంబులును లలితమృదులహంసతూలికానల్పంబు లైనతల్పంబులును
వినోదకేళివిహారలోలంబు లైనడోలాజాలంబులును మొదలుగా ననేకంబు
లనేకప్రకారంబులుగా నిర్మించిన.[92]

157


క.

మునినాథుఁ డైనసౌభరి, తనభార్యలనెల్ల సముచితముగను వేర్వే
ఱను గనకమందిరంబుల, నునిచి తపశ్శక్తివలన నూడిగములకున్.

158


క.

యువతులుగ నప్సరస్త్రీ, నివహంబుల నొసఁగి రామణీయాంబరది
వ్యవిభూషణమాల్యాదులు, వివిధపరిమళానులేపవితతులు నొసఁగెన్.[93]

159


ఆ.

అతిమనోహరంబు లగుభక్ష్యభోజ్యాది, సముచితాన్నపానచయము లెల్లఁ
గలుగజేసి యతఁడు కాంతాజనంబుల, యందు సురతసుఖము లనుభవించె.

160


వ.

ఇట్లు పరమగృహస్థధర్మంబున సంసారసుఖంబు లనుభవించుచున్న కొండొకకా
లంబునకు.

161


క.

బహుళీకృతరాజ్యరమా, మహనీయుండై వెలుంగు మాంధాతమదిన్
దుహితృస్నేహము పెనఁగొన, మహిళామణి యైనబంధుమతియుం దానున్.[94]

162


చ.

అడవులఁ గందమూలముల నాఁకలి దీర్చి తపంబు సేయుచున్
బడలినవృద్ధతాపసుని బాలికలతో సుకుమారమూర్తులన్
గడుసుఖు లైనవారలను గట్టిఁడినై వెసఁగట్టి త్రోచితిన్
నడుఁకుచు వార లెవ్విధమున దురపిల్లుచు నున్నవారొకో.[95]

163


క.

అని కూఁతుల సుఖదుఃఖము, లొనర విచారింపఁగోరి యుర్వీపతి స
జ్జనపరివృతుఁడై సౌభరి, మునియాశ్రమమునకు నరిగి ముందట గాంచెన్.

164


సీ.

బహువిధాలంకారభర్మదీప్తిచ్ఛటాప్రాకారమణిహర్మ్యభవనములును
నానావిధప్రసూనానూనసౌరభరమణీయమందిరారామములును
కలహంసచక్రవాకక్రౌంచకలనాదజలజకైరవజలాశయచయంబు
ధనధాన్యయుతనిరాతంకశంకాచతుర్వర్ణసంకీర్ణనివాసములును

తే.

తతఘనానద్ధసుషిరాభిధానవాద్య, కీలితామరకామినీగీతరవము
గలిగి త్రిభువనలక్ష్మికి నిలయమగుచుఁ, బరఁగు సౌభరి సౌభాగ్యపురవరంబు.[96]

165


వ.

ఇట్లు కనుంగొని.

166


క.

ము న్నెన్నఁడు లే దిచ్చట, నున్నది సురపురియుఁబోలె నొకపట్టణ మ
త్యున్నతవిభూతి వెలయుచు, నిన్నగరంబునకు నాథుఁ డెవ్వఁడో యనుచున్.

167


వ.

చేరవచ్చి యప్పౌరజనంబులవలన సౌభరి తపఃప్రభావంబున నైనపురం బగుట
యెఱింగి పరమహర్షాశ్రుపూరితలోచనుండై యమ్మహామునిం బొడగని నమ
స్కరించి తగుతెఱంగున సంభావితుండై.

168


క.

జననాయకుండు కన్యా, జనులం జూడంగఁ గోరి చనుదెంచిన య
ప్పని విన్నవించి యమ్ముని, యనుమతి నంతఃపురము నకటఁ జని యెదురన్.

169


మ.

కనియెన్ భూపతి రమ్యహర్మ్యనిలయం గర్పూరవీటీవరా
ననపద్మన్ మణిడోలికాచలితనానాభూషణాలంకృతన్
ఘనదివ్యాంబరసంవృతస్తనయుగళగాశ్మీరకస్తూరికా
ఘనసారాంచితగంధబంధురశుభాంగశ్రీనిధిం గన్యకన్.[97]

170


వ.

ఇట్లు కనుంగొనిన.

171


క.

జనకునిరాకకు వినయం, బును భక్తియుఁ బెనగొనంగఁ బూఁబోణి యెదు
ర్కొని దండనమస్కారము, లొనరిచి కరములు మొగిడ్చి యుచితప్రీతిన్.

172


క.

తనకేలీసౌధమునకుఁ, గొని చని యాసీనుఁ జేసి కుశల మడిగిన
జనపతి సర్వము సేమం, బని తెలియఁగఁజెప్పి కూఁతు నాశ్వాసించెన్.

173


వ.

ఇట్లు పరమానందహృదయుండై యతండు వెండియు నిట్లనియె.

174


మ.

పడఁతీ నీ చెలియండ్రు, నీవు సుఖులై భాసిల్లుచున్నారె మీ
యెడ నత్యంతవిధేయుఁడయ్యు విభుఁ డేవేళం బ్రమోదించునే
దొడుగం బుయ్యను గట్టఁగాఁ దగినవస్తువ్రాతముల్ గల్గునే
కుడువంగా సరసాన్నముల్ గలవె నాకుం జెప్పుమా యేర్పడన్.

175


వ.

అనినం దండ్రికిఁ గూఁతు రిట్లనియె.

176


క.

న న్నిప్పుడు మీ రడిగిన, వన్నియు నొకకడమ పడక యఖిలంబును సం
పన్నంబు మిమ్ముఁ జూడక, యున్నవిషాదంబెకాని యుర్[98] వీనాథా.

177


చ.

మదనసమానరూపమహిమం జెలువొంది మనోవిభుండు నా
సదనమునంద యుండు ననిశంబును మన్మథరాగభోగ మే

కొదవయు లేదు నన్నుఁ దనకుం బ్రియురాలిగ నేలినాఁడు సం
పదలకు నేమిటం గొఱఁత పార్థివనాయక నాకు నావుడున్.

178


క.

ఇలఱేఁడు దనమనంబునఁ, గలఁగి జడుఁడు మౌని యొక్కకాంతకె మిగులన్
వలచి మఱియున్నభార్యలఁ దలఁపఁడొ కాకనుచు మిగులఁ దత్తఱపడుచున్.[99]

179


వ.

తగుతెఱంగున నయ్యిందువదన వీడ్కొని రెండవప్రాసాదంబున కరిగి తొంటి
వాలుఁగంటికంటె మహావిభవంబున నున్నపుత్రికారత్నంబువలన నమస్కారా
ద్యుపచారంబులఁ బ్రీతుండై కుశలం బడిగిన.[100]

180


క.

అప్పడఁతి యప్ప చెప్పిన, యప్పలుకులకంటెఁ దండ్రి కానందముగాఁ
జెప్పిన సంతోషము మది, ముప్పిరిగొన మఱియు నడిగె మూఁడవకూఁతున్.[101]

181


వ.

ఇవ్విధంబున నందఱ నట్ల యడిగిన వార లేఁబండ్రును నొక్కవాక్యంబుగా మగ
నివలన సకలసుఖంబు లనుభవించుచున్నవార మని చెప్పిన మాంధాత విస్మిత
చిత్తుండై సౌభరితపోమహత్త్వంబురకు మెచ్చి యతనికడకుం జని నమస్కరించి
యిట్లనియె.[102]

182


క.

నిన్ను వరించి సుఖస్థితి, నున్నారు కుమారికలు మహోల్లాసముతోఁ
గన్నియలను బెక్కండ్రను, గన్నఫలము నేఁడు చూడఁగంటి మహాత్మా.

183


క.

అని పెక్కుచందముల మునిఁ, గొనియాడి నరేశ్వరుండు కూఁతులకెల్లన్
ధనకనకవస్తువాహన, వనితారత్నముల గౌరవంబున నిచ్చెన్.

184


ఆ.

ఇచ్చి నిజపురమున కేగె సౌభరియు మాం, ధాతృదుహిత లైనధర్మపత్ను
లందు నైహికంబు లైనభోగములు పెం, పార సురతసుఖము లనుభవించె.

185


వ.

ఇవ్విధంబున నయ్యేఁ బండ్రుభార్యలందు నూటయేఁబండ్రుకుమారులం గాంచి.

186


సీ.

శైశవక్రీడాప్రసంగములో కొన్నేండ్లు కొన్నేండ్లు ముద్దుపల్కులబెడంగు
లల్లనల్లన నడయాడంగఁ గొన్నేండ్లు కొన్నేండ్లు విద్యావినోదగోష్ఠి
వడుగుప్రాయపువైభవంబులు గొన్నేండ్లు కొన్నేండ్లు వరయౌవనోన్నతులును
వైవాహికక్రియావ్యసనంబు గొన్నేండ్లు గొన్నేండ్లు కోడండ్రకోట్రములును


తే.

మనుమలును మనుమరాండ్రును మనఁగ వారి, సొబగు కొన్నేండ్లు కొన్నేండ్లు సుతుల సుతుల
తరతరంబును దామరతంపరైన, చూచి సంసారసుఖములఁ జొక్కె నతఁడు.[103]

187


వ.

ఇట్లు సంసారసాధనంబు లైనమనోరథంబులం దగిలి యనేకవత్సరంబులు వినో
దించి యొక్కనాఁడు పరతత్త్వచింతాసమాధానమానసుండై.

188

ఆ.

ఐహికంబు లైనమోహలతానేక, బంధనంబు లెల్లఁ బరమయోగ
విమలతత్త్వ మనులవిత్రమునను గోసి, వైచి నిష్కళాత్మవర్తి యగుచు.[104]

189


క.

దుస్సహ మిహసౌఖ్యంబౌ, దుస్సంగతి పుత్రమిత్రదుహితృతతి యిసీ!
నిస్సారము సంసారము, లెస్స యనుచు మనుజు లేల లెక్కింతురొకో.[105]

190


క.

పదివేలవిధంబుల నే, వదలక విషయోపభోగవాంఛలవలనం
బొదలియు నాచిత్తము తని, యదు మిక్కిలి నాడు నాటి కధికం బగుచున్.

191


సీ.

అంతర్జాలంబులయందుఁ దపోవృత్తిఁ జరియించు నాకు మత్స్యప్రసంగ
వశమునఁ జేసి వివాహంబునకు నేకకన్యార్థినై పోవఁగా ననేక
భార్యాజనంబులఁ బరిణయం బొనరింపఁ బాటిల్లె మఱి కుటుంబములఁ బ్రోవ
బాహుళ్య మైనసంపదలు సంపాదింపవలసెఁ దదాసక్తివలనఁ జేసి


తే.

పుత్రపౌత్రదౌహిత్రకళత్రమిత్ర, బంధుధనధాన్యవైభవప్రాభవములు
చూచి పెక్కేండ్లు సంసారసుఖములందు, గాసిపడితి వృథాపోయెఁ గాలమెల్ల.[106]

192


క.

యోగము గల్గినచోటను, భోగంబులు లేవు భోగములు గల్గినచో
యోగంబు లేదు గావున, యోగము భోగంబుఁ బడయ నొరులకు వశమే.

193


మ.

అని సర్వంబుఁ బరిత్యజించి నిజభార్యాయుక్తుఁడై కానకున్
జని పెక్కేండ్లు తపంబు చేసి పిదపన్ సన్యాసియై వార్ధకం
బున సాంగత్యవశంబు లైనవిషయంబుల్ మాని యంత్యంబునన్
గనియెజ్ సౌభరి విష్ణుభక్తివలనఁ గల్యాణకైవల్యమున్.[107]

194


క.

ఈసౌభరికథ దలఁచిన, వ్రాసినఁ బేర్కొనిన వినిన వర్ణించిన న
భ్యాసము చేసినవారికి, శ్రీసంపద లొనరి మోక్షసిద్ధియుఁ గలుగున్.

195


వ.

అని చెప్పి పరాశరుండు మాంధాతృపుత్రసంతతి వినుమని యిట్లనియె.

196


తే.

తాపసోత్తమ మాంధాతతనయుఁ డైన, యంబరీషున కుదయించె ననఘచరితుఁ
డైనయువనాశ్వుఁ డతనికి హరితుఁ డనఁగఁ, బుత్రుఁ డుదయించె నమ్మహీభుజునియందు.

197


తే.

అంగిరసు లనుగంధర్వు లాఱుకోట్లు, పుట్టి పాతాళమునఁ జొచ్చి భుజగపతుల
కెల్ల నుపహతి చేసి యనేకదివ్య, రత్నములతోడఁ గామినీరత్నములను.[108]

198


క.

బలిమిం గైకొనిన రసా, తలలోకము వెడలి భుజగతతు లెల్ల భయా
కులితాత్ము లగుచుఁ జని యా, జలనిధిపై యోగనిద్ర సలిపెడువానిన్.

199


శా.

కాలాత్మున్ భువనైకసేవితు జగత్కల్యాణమూర్తిన్ దయా
శీలున్ బన్నగతల్పు సన్నిహితరాజీవాసనున్ సర్వలో

కాలంకారుని శంఖచక్రధరు నుద్యద్భానుకోటిప్రభా
జాలోదంచితదివ్యతేజు నసకృత్సౌభాగ్యలక్ష్మీయుతున్.[109]

200


క.

పరివేష్టించి సముచ్ఛ, స్వరముల గాంధర్వగానసముపేతముగాఁ
బొరిఁ బొరి బొగడిన లక్ష్మీ, శ్వరుఁడు నిదుర మేలుకొని ప్రసన్నుండయ్యెన్.[110]

201


వ.

ఇట్లు యోగనిద్రాప్రబుద్ధుం డైనయద్దేవదేవునకు దండప్రణామంబులు సేసి
గంధర్వులచేతఁ దమకు నైనబన్నంబులు విన్నవించిన మన్నించి వెన్నుండు పన్న
గేంద్రుల కిట్లనియె.[111]

202


క.

ధరఁ జక్రవర్తి యగు నా, పురుకుత్సుఁడు నామహత్త్వమున నున్నాఁ డా
ధరణీశుఁడు గంధర్వులఁ, బరిమార్పఁగ నోపు నతనిఁ బ్రార్థింపుఁ డొగిన్.

203


క.

అని యానతిచ్చి వీడ్కొలి, పినఁ బన్నగముఖ్యు లెల్లఁ బీతాంబరుచె
ప్పినయట్ల నాగలోకం, బునకు మగిడివచ్చి యొక్కప్రొవై తమలోన్.[112]

204


తే.

కార్యచింత యెఱింగి యిక్ష్వాకువంశ, సంభవుం డైనపురుకుత్సచక్రవర్తి
పాలి కెవ్వరిఁ బనుపంగఁ బాడియెుక్కొ, యని విచారించుచున్న యయ్యవసరమున.[113]

205


క.

మునియొకఁడు వచ్చి భుజగులఁ, గనుఁగొని మీతలఁచినట్టికార్యము సంఘ
ట్టన సేయఁదగినవారల, వినిపించెద మీరు వోయి వేఁడుకొనుఁ డొగిన్.[114]

206


వ.

పురుకుత్పుండు నర్మదానదియందు బద్ధానురాగుండై యున్నవాఁ డన్నదియు
నంతకంటె నతనియందుఁ బ్రియంబు గలిగియున్నయది మీర లాసోమపుత్రిం
బ్రార్థించి పంపిన నారాజన్యుండు వచ్చి మీపగ సాధింప నోపునని నిర్దేశించి పోయె
నప్పుడు.[115]

207


శా.

ఆరేవానది దైవయోగమునఁ దా నచ్చోటికికిన్ దేవతా
నారీరూపముతోడ వచ్చిన నహీంద్రశ్రేణి యేతెంచి య
త్యారూఢప్రియభాషలం దనిపి యయ్యాసన్నగంధర్వుల
బోరం జంపి భుజంగనాథులకుఁ బెంపున్ సొంపుఁ గావింపఁగన్.[116]

208

క.

పురుకుత్సుఁ డోపుననుచును, హరి యానతి యిచ్చె మాకు నటుగాన సుధా
కరపుత్రి నీవు చని యా, నరనాథునిఁ దెచ్చి కావు నాగకులంబున్.[117]

209


వ.

నీవు మాకు నియ్యుపకారంబు సేయు మిట్లయిన నీకుఁ బ్రత్యుపకారంబు సేయు
వార మని ప్రార్థించిన నొడంబడి నర్మదానది భూలోకంబునకు వచ్చి మాంధాత
పుత్రుం బొడగాంచి భుజంగభయాపనయార్థంబుగా నిష్టోపభోగంబులం దనుపు
నట్లుగా నియ్యకొని రసాతలంబునకుఁ దోడి తెచ్చిన.[118]

210


క.

భుజగేశ్వరులు ధరిత్రీ, భుజునిం బూజించి కదనమున గంధర్వ
ప్రజలను మర్దింపు మధో, క్షజుపలుకులు నిట్టివనుచు సమకట్టుటయున్.[119]

211


మ.

హరితేజోవిమలప్రతాపములచే నాప్యాయితుండై మహీ
శ్వరచూడామణి సంగరాంగణమునన్ షట్కోటిగంధర్వులన్
వరవజ్రప్రతిమానదారుణశరవ్రాతంబులం ద్రుంచి ని
ర్భరసంతోషము చేసెఁ బన్నగులకుం బాతాళలోకంబునన్.[120]

212


వ.

ఇవ్విధంబున రసాతలలోకంబునకు నిరాతంకంబు చేసి పన్నగేంద్రులవలన నిజకు
లాభివృద్ధి యగునట్లుగా వరంబు వడసి నిజపురంబునకు వచ్చి సుఖంబుండె నంత.[121]

213


క.

తమకెల్లను గడునుపకా, రము చేసిననర్మదకు వరం బొసఁగ భుజం
గమపరులందఱు నానదిఁ, బ్రమదంబునఁ బూజ చేసి పలికిరి దయతోన్.

214


తే.

అంబ నీదివ్యనామధేయముఁ జతుర్థి, నమరఁజేసి నమఃపదాంతముగ నుభయ
సంధ్యలందును దప్పక స్మరణసేయు, నతని కెన్నఁడు విష మెక్క దహులవలన.[122]

215


వ.

మఱియు నీదివ్యనామోచ్చారణంబు చేసినవారలకు భోజనసమయంబున విషంబు
భుజియించిన నమృతం బగునని వరం బొసంగిన నొడంబడి నర్మదానది పురుకుత్సు
కడకుంబోయి యతనియందు బద్ధానురాగయై యతని వరియించిన.

216


క.

పురుకుత్సునకును రేవకుఁ, దరణిప్రతిమానుఁ డగుచు ద్రసదస్యుఁ డనన్
వరసుతుఁడు పుట్టె నతనికి, హరివిక్రముఁ డుదయమయ్యె ననరణ్యుఁ డనన్.

217


క.

ఆయనరణ్యుఁడు జన్నము, సేయంగా రావణుం డశేషబలాఢ్యుం
డై యేగుదెంచి దుర్జయుఁ, డై యజ్ఞముఁ జెఱిచి యతనియసువులు గొనియెన్.[123]

218


వ.

అయ్యనరణ్యునకు హర్యక్షుండును హర్యక్షునకు వసుమనుండును వానికిం
బ్రియారణుండును నతనికి సత్యవ్రతుండునుం బుట్టిరి. ఆసత్యవ్రతుండు త్రిశం
కునామంబున వసిష్ఠుశాపంబునఁ జండాలుండై యుండె నక్కాలంబున.

219

సీ.

ధరణిఁ బండ్రెండువత్సరము లనావృష్టియై మహాదుర్భిక్షమైన నాత్రి
శంకుండు వచ్చి విశ్వామిత్రుపుత్రమిత్రకళత్రములకు నిత్యంబు నడవి
మృగమాంసములు దెచ్చి మెఱసి చండాలప్రతిగ్రహమునకు ననుగ్రహింపఁ
డో యని కొంకి తా నొరు లెఱుంగకయుండ జాహ్నవిదరిఁ దదాశ్రమసమీప


తే.

వటమహీరుహశాఖ నావటము గాఁగఁ, గట్టఁ గౌశికుఁ డందుచేఁ గఱవు దీర్చి
వసుమతీనాథుఁ బరమపావనునిఁ జేసి, బొందితోడ నమరపురంబునకు ననిచె.[124]

220


వ.

అట్టి త్రిశంకునకు హరిశ్చంద్రుండు పుట్టె.

221


సీ.

సకలసంపదలు విశ్వామిత్రునకు నిచ్చి సత్యవ్రతంబు శాశ్వతము చేసె
బాహుగర్వమున సప్తద్వీపములఁ దనయాజ్ఞ చెల్లంగ రాజ్యంబు సేసె
నవ్యాహతైశ్వర్యుఁడై పెక్కువేలేండ్లు హరిమూర్తిఁ దాల్చి విఖ్యాతిఁ గాంచె
నర్థితో రాజసూయాశ్వమేధాదిమహాధ్వరంబులు పెక్కు లాచరించె


తే.

నంతమున దేవలోకంబునందు నింద్రు, సరస సింహాసనంబున బెరసియుండె
నిఖిలమున ధర్మమార్గంబు నించి మించె, సాంద్రయశుఁడు హరిశ్చంద్రచక్రవర్తి.[125]

222


వ.

అట్టి హరిశ్చంద్రునకు లోహితాశ్వుండును వానికి హరితుండును వానికిఁ జం
చుండును నతనికి విజయవసుదేవు లన నిరువురును బుట్టి రందు విజయునకు
రురుండును రురునకు వృకుండును వృకునకు బాహుండునుం బుట్టిరి.

223


క.

బాహుళ్యమహిమతో న, బ్బాహుఁ డయోధ్యాపురంబుఁ బాలింపంగా
హైహయులు మొదలుగా నృపు, లాహవమున నతనిరాజ్యమంతయుఁ గొనినన్.

224


క.

ఆనృపతి నిండుగర్భిణి, యైనమహిషితోడ నౌర్వునాశ్రమమునకు
దీనతఁ జనియుండఁగ, నమ్మానినికి సపత్నియైన మగువ కడంకన్.

225


క.

అర్భకుఁడు దనకుఁ గలుగని, నిర్భాగ్యత్వంబు దెలియనేరక కినుకన్
గర్భస్తంభంబుగ నా, గర్భిణికిన్ విషముఁ బెట్టెఁ క్రౌర్యముతోడన్.[126]

226


వ.

ఇట్లు గర్భస్తంభంబై యేడుసంవత్సరంబు లుండునంత బాహుండు వయో
వృద్ధుండు గావున పరలోకగతుండయ్యె.

227

సగరునిచరిత్రము

క.

మృతుఁ డైనప్రాణవల్లభుఁ, జితిపై నిడి యగ్రమహిషి చిత్తములోనన్
ధృతి దళుకొత్తఁగఁ దానును, బతితో ననలంబుఁ జొరఁగఁ బయనం బయ్యెన్.[127]

228

వ.

అంత నతీతానాగతవర్తమానకాలత్రయవిజ్ఞానవిద్యాఖర్వుం డైనయౌర్వుండు
నిజాశ్రమంబు వెలువడివచ్చి యయ్యంబుజాక్షి నగ్నిప్రవేశంబు చేయకుండ
నివారించి యిట్లనియె.[128]

229


క.

సుదతీ యేటికి సొద సొ, చ్చెదు నీయుదరంబులోనిశిశువు విరోధి
ప్రదముఁడు వీర్యపరాక్రముఁ, డుదితార్కసమానుఁ డుర్వి యొక్కడ యేలున్.[129]

230


తే.

సకలయజ్ఞంబులును జేసి చక్రవర్తి, యై యనేకకుమారులు నర్థిఁ గాంచి
వంశకరుఁ డగుఁ గావున వలదు నీకు, నింతసాహస మన్న నయ్యిందువదన.

231


క.

మరణంబు మాని పతికిం, బరలోకక్రియలు సేసి పరమానందో
త్కరమతితో నమ్మౌనీ, శ్వరునాశ్రమభూమియందు వర్తించుతఱిన్.

232


క.

కతిపయదినములలో న, య్యతివ గరముతోడఁగూడ నాత్మజుఁ గనినన్
ధృతి నౌర్వుఁడు సగరుండని, యతనికి నామంబు చేసె నర్హస్థితితోన్.

233


వ.

జాతకర్మాదిక్రియలు నిర్వర్తించి పెంచి చౌలోపనయనాదికృత్యంబు లుదాత్తం
బులుగా నడపి వేదశాస్త్రపురాణంబులం బ్రవీణుంజేసి యనేకశాస్త్రశిక్షాదక్ష
విద్యలు దెలిపి రథాశ్వగజారోహణాదు లైనరాజవర్తనంబుల నేకొఱంతయు
లేకుండ శిక్షించె. ఇట్లు కృతకృత్యుండై సగరుండు జననికడకుం జనుదెంచి
యొక్కనాఁ డిట్లనియె.[130]

234


క.

జననీ యడవుల నుండఁగ, మన కేటికి నెందుఁ బోయె మజ్జనకుఁడు నా
విని తల్లి పుత్రుతోడను, మునుకొని కన్నీరు దొరుఁగ మొగి నిట్లనియెన్.

235


క.

తనయా యేమని చెప్పుదు, ననిలోపల హైహయాదు లగురాజులు మీ
జనకుని గెలిచి సమస్తముఁ, గొని పాఱఃగఁ దోలి రిట్టి ఘోరాటవికిన్.

236


వ.

అని పలికి సవతి తనకు గర్భస్తంభం బగునట్లుగా విషంబుఁ బెట్టుటయును వార్ధకం
బున రాజు పరలోకగతుం డగుటయు నౌర్వుప్రసాదంబునఁ దమకు సకలరాజ్యం
బును దొల్లింటియట్ల యనుభవింపగలుగుటయునుం జెప్పినఁ గోపించి.

237


చ.

మదమునఁ దండ్రిరాజ్యము సమస్తముఁ గొన్న విరోధివర్గమున్
గదనములోనఁ జంపి త్రిజగంబునఁ గీర్తి వెలుంగునట్లు చే
నెద ననుచుం బ్రతిజ్ఞ దగఁ జేకొని హైహయవంశరాజులం
బొదివి నిశాతఘోరశరపుంజముల న్వధియింప బల్విడిన్.[131]

238


వ.

అంత శకయవనకాంభోజపారదప్లవాదిదేశంబులరాజులు ప్రాణభయార్తులై
తత్కులగురుం డైనవసిష్ఠు శరణు చొచ్చిన నమ్మునీంద్రుండు వారల నిజకులాచార
ధర్మంబులు విడిపించి జీవన్మృతులం జేసి సగరున కిట్లనియె.[132]

239

క.

నీ వింక వీరిఁ జంపకు, భూవల్లభ నీప్రతిజ్ఞ భూయిష్ఠముగా
జీవన్మృతులం జేసితి, నీవసుధేశ్వరులనెల్ల నిది యెట్లనినన్.[133]

240


క.

ధారుణిఁ దమతమవంశా, చారంబులు విడుచు టెల్లఁ జచ్చుట కాదే
వైరుల జీవన్మృతు లగు, వారల నెవ్వారుఁ జంపవలదు నరేంద్రా.

241


వ.

అదియునుంగాక ప్రాణభయార్తులై శరణుచొచ్చినవారిని రక్షించుటకంటెఁ బర
మధర్మంబు లేదు. విశేషించి మద్వచనంబు లంఘనీయంబు గాదు గావున వీరియందు
బ్రతిజ్ఞాభంగంబున నైనదోషంబు లేదు వీరియందుఁ గోపోపశమంబు సేయుమనిన
గురువచనంబు లభినందించి యారాజులం గాచి విడిచె నాటనుండియు యవను
లు ముండితోత్తమాంగులును శకు లర్ధముండితులును పారదులు ప్రలంబకేశులును
ప్లవులు శ్మశ్రుధరులును కాంభోజు లస్వాధ్యాయపరులును నై నిజకులాచారపరి
త్యాగంబు చేసి బ్రాహ్మణులచేత విడువంబడి మ్లేచ్ఛు లై రివ్విధంబున సగరుండు
విజయసంపన్నుండై స్వాధిష్ఠానంబునకు వచ్చి రాజ్యాభిషిక్తుండై సప్తద్వీపసమేతం
బుగా మహీమండలంబుఁ బరిపాలించుచుండి.[134]

242


తే.

వినతకును గశ్యపునకును దనయయైన, సుమతియు విదరరాజన్యసుత సుకేశి
యిరువురును భార్యలై రమణీయసురత, సుఖవినోదంబు లొనరింప క్షోణి యేలె.

243


క.

అంతట నాసగరమహీ, కాంతుఁడు పుత్రార్థియై వికాసప్రీతిం
గాంతలు దానును నౌర్వు ని, రంతరమును సేవ చేసి యారాధింపన్.

244


క.

ఒకసతికి వంశవర్ధను, నొకతనయుని నిత్తు నొకపయోరుహసమనే
త్రకు నఱువదివేవురుపు, త్రకుల నొసఁగువాఁడ ననుచు దాపసి పలికెన్.

245


క.

పలికిన విదర్భనందన, కులదీపకు నొక్కసుతునిఁ గోరుకొనియె ని
మ్ముల నఱువదివేవురు తన, యులఁ గాశ్యపి కోరె మునియు నొసఁగెం బ్రీతిన్.

246


వ.

ఇవ్విధంబున నౌర్వుప్రసాదంబునం జేసి కతిపయకాలంబునకు సుకేశికి నసమంజ
సుఁ డనుకుమారుం డొక్కరుండును సుమతికి నఱువదివేవురుకుమారులు జ
న్మించి పెరుగుచుండ నసమంజసుండు బాల్యంబుననుండియుఁ బాపకర్మపరుండై
తమ్ములుం దానును సాధుజనంబుల బాధించుచుండఁ దండ్రికి నసహ్యంబయ్యును
భావికాలంబున బుద్ధిమంతుం డగునో యనునాసం జేసి సంప్రాప్తయౌవనుం డగునం
తకుం బెనిచిన నతఁ డంతకంతకు దుర్గుణంబులు విడువక వర్తించుచున్న నయ్య
సమంజసునకు వంశుమంతుం డనుకుమారుండు జన్మింపఁ బౌత్రపరిగ్రహంబుఁ జేసి
పాపాత్ముం డైనకుమారుని వెడలనడిచిన.[135]

247

క.

అసమంజసచరితుం డగు, నసమంజను నట్ల తమ్ము లందఱు నతిపా
పసమన్వితమానసులై, వసుమతిఁ గలగుండు పెట్టి వర్తించి రొగిన్.[136]

248


క.

యాగములు చెఱిచి తపములు, సాగంగా నీ కసాధుజనమార్గపరి
త్యాగక్రియ లొనరించిన, సాగరులం జూచి సుర లసహ్యాత్మకులై.[137]

249


తే.

సకలవిద్యామయుండును సంహృతాఖి, లాఘుఁడును భగవంతుఁడు నంబుజేక్ష
ణాంశసంభూతుఁడును నైనయట్టి కపిల, సంయమీశ్వరుకడ కేగి శరణు సొచ్చి.[138]

250


ఆ.

ధర్మహీనులై యధర్మోపలక్షణ, దారుణక్రియావిహారులైన
సగరసుతులదుష్టచరితంబు లేర్పడ, విన్నవించి మఱియు విబుధవరులు.[139]

251


ఆ.

దుష్టశిక్షణమును శిష్టరక్షణమును, నర్థిఁ జేయఁబూని యవనియందు
నవతరించినట్టి హరిమూర్తి వగుట నీ, కెఱుఁగఁజెప్పవలసె నింతవట్టు.[140]

252


వ.

ఇద్దురాత్ముల చేత జగంబు లేమి గాఁగలవోకో యనినఁ గపిలమహాముని దేవ
తల కిట్లనియె.

253


తే.

పాపకర్ములై యొరుల కుపద్రవములు, సేయువారల దైవంబు చెఱుచుఁ గాన
వారి నెవ్వరుఁ జెఱుపంగవలదు దమకు, హానివృద్ధులు పాపపుణ్యములఁ గలుగు.

254


వ.

కావున నల్పకాలంబున సగరసుతులు దముందార వినాశంబై పోవంగలవారు
మీరు పొండని యమ్మునీంద్రుండు తపంబు సేయుచుండె నంత.[141]

255


ఆ.

సగరుఁ డశ్వమేధసవనంబు గావింప, దీక్షఁ బూని యశ్వరక్షణార్థ
మాత్మసుతులఁ బనుప నఱువదివేవురు, నాతురంగమంబు నరయునపుడు.

256


చ.

అనిమిషదూత యొక్కఁడు రయంబున నానరనాథసూనులన్
గను మొఱిఁగించి యజ్ఞతురగంబును భూమిబిలంబులోనికిం
గొని చని నాగలోకమున ఘోరతపం బొనరించుచున్న స
జ్జననుతమూర్తి యాకపిలసంయమియాశ్రమభూమిఁ గట్టినన్.[142]

257


చ.

తురగముఁ గాన కానృపసుతుల్ పటుబాహుబలప్రతాపులై
యురుతరశక్తితో నవని నొక్కొకఁ డొక్కొకయోజనాయతం
బురవడిఁ ద్రవ్వి కానక మహోగ్రతఁ బన్నగలోకమంతయుం
దిరుగుచు నచ్చటం గనిరి దివ్యమునిం గపిలున్ మహాత్మునిన్.

258

వ.

ఇ ట్లనతిదూరంబున శరత్కాలదివాకరుండునుంబోలె ననవరతతేజోవిభాసి
తుండై యశేషదిశాసముద్యోతమానుం డగునమ్మునీంద్రు నాశ్రమంబునం గట్టి
యున్న యధ్వరాశ్వంబుఁ బొడగని సముద్యతాయుధహస్తులై యతనిం
బరివేష్టించి.[143]

259


క.

మనతండ్రి యధ్వరాశ్వముఁ, గొనివచ్చిన దొంగ వీఁడె గుఱ్ఱముతోడం
జనఁ జోటులేక నిక్కపు, మునిగతి నున్నాఁడు వీని మోఁదఁగవలయున్.

260


ఉత్సాహము.

అనుచు బెట్టిదంబులాడునవనినాథసూనులం
గినిసి మౌనిముఖ్యుఁ డగ్నికీల గ్రమ్ముచుండు లో
చనకటాక్షవీక్షణములఁ జలనవృత్తిఁ జూచినన్
దనువులందు నగ్ని పొదువ దగ్గమైరి వారొగిన్.[144]

261


తే.

ఇవ్విధంబునఁ గపిలమునీంద్రుకోప, పావకముచేతఁ బుత్రులు భస్మమైన
వార్త సగరుండు విని శోకవార్ధి మునిఁగి, యధ్వరాశ్వంబుఁ గొనితేర నంశుమంతు.

262


వ.

పనిచిన నయ్యసమంజసపుత్రుండు నరిగి.

263


ఆ.

సగరసుతులు మున్ను చనినమార్గమునంద, యరిగి కపిలమౌని నర్థిఁ గాంచి
పరమభక్తితోడఁ బ్రణమిల్లి కరములు, మొగిచి పెక్కుచందముల నుతింప.

264


క.

కపిలుఁడు ప్రసన్నమతియై, నృపనందనుఁ జూచి పుత్ర నీ కీహయమున్
గృపతో నిచ్చితిఁ గొనిపో, యి పితామహునశ్వమేధ మీడేర్పు మొగిన్.

265


వ.

అనిన నంశుమంతుండు కృపాయత్తచిత్తుం డైనయమ్మునీంద్రునకుఁ గృతాంజలియై
దేవా బ్రహ్మదండోపహతు లైనమత్పితృవర్గంబులకు స్వర్గప్రాప్తికరం బైనవరంబు
బ్రసాదింపవలయు ననిన నతం డిట్లనియె.

266


శా.

నీపౌత్రుండు భగీరథుం డతితపోనిష్ఠాపరుండై త్రిలో
కీపూతం బగు వేల్పుటే ఱిలఁ జెలంగించుం దదీయాంబువుల్
పై పైఁ బర్వగ నస్థిభస్మనికరప్లావం బగున్ నీపితృ
క్ష్మాపలావళి కంతటం గలుగు శశ్వత్స్వర్గసౌభ్యోన్నతుల్.[145]

267


ఉ.

పూని ముకుందుపాదమునఁ బుట్టి జగత్పరిపూత యైనగం

గానదిలోపలన్ మునుఁగఁ గల్గిన శాశ్వతనాకసౌఖ్యముల్
మానక గల్గుటే యరిది మర్యులయంగములందు నొక్కటే
దేనియు నజ్జలంబు లొకయించుక సోఁకినఁ గల్గు స్వర్గమున్.[146]

268


క.

అని యిట్లు పలికి యానృప, తనయునిఁ బొమ్మనిన నతఁడు తాపసికి ముదం
బున మ్రొక్కి యధ్వరాశ్వముఁ, గొనివచ్చి పితామహునకుఁ గొమ్మని యిచ్చెన్.

269


ఆ.

సగరచక్రవర్తి శాస్త్రమార్గంబున, నశ్వమేధయజ్ఞ మాచరించె
జలధి నాటనుండి సాగరుం డనుపేర, వినుతికెక్కి సగరతనయుఁ డయ్యె.

270


వ.

సగరుపరోక్షంబున నంశుమంతుండు రాజ్యాభిషిక్తుఁ డయ్యె నతనికి దిలీపుండు
పుట్టె నతనికి భగీరథుండు జన్మించి.[147]

271


క.

ఘన మైనతపము పెంపున, ననిమిషనది నిలకుఁ దెచ్చి యఖిలము నెఱుఁగం
దనపేరను భాగీరథి, యనునామముఁ గలుగఁ జేసె నతఁ డానదికిన్.[148]

272


వ.

అట్టి భగీరథునకు సుహోత్రుండును సుహోత్రునకు నాభాగుండును నాభాగు
నకు నంబరీషుండును నంబరీషునకు సింధుద్వీపుండును సింధుద్వీపునకు నయుతా
యువును నయుతాయువునకు ఋతుపర్ణుండునుఁ బుట్టి రట్టిఋతుపర్ణుం డుపవిద్యా
ప్రవీణుండై జూదంబున రాజ్యంబుఁ గోలుపోయిననలచక్రవర్తికి సాహాయ్యంబు
చేసి తపోమహత్త్వంబున రాజఋషి యయ్యె నట్టిఋతుపర్ణునకు సర్వకాముం
డును సర్వకామునకు సుదాసుండును సుదాసునకు మిత్రసఖుండునుం బుట్టి రట్టి
మిత్రసఖుండు రాజ్యంబు సేయుచుండి యొక్కనాఁడు.

273


క.

కానకు వేటాడఁగ నా, భూనాథుఁడు వోయి రెండుపులుల మహోగ్ర
ద్వాన మొనరించుచుండెడు, వానిం బొడగాంచి చేరవచ్చి మనములోన్.

274


క.

ఈకోలుపులులకతమున, నీకాననమున మృగంబు లెవ్వియు లేవం
చాకరశరమున నందొక, భీకర మగుమృగముఁ బడఁగఁ బెలుచన నేయన్.[149]

275


క.

దనుజాకృతి నాబెబ్బులి, తనువు విడిచె నున్నయదియు ధరణీపతి దా
విన దీనికిఁ బ్రతికారం, బొనరించెద నీవు మఱవకుండు మటంచున్.[150]

276


క.

పగచాటుచు దనుజుండై, యెగసి చనియె నపుడు విస్మయీభూతాత్ముం
డగుచుఁ దనరాజధానికి, మగుడం జనుదెంచి నృపకుమారుం డుండెన్.[151]

277

సౌదాసుండు వసిష్ఠుశాపంబున నరమాంసభక్షకుం డగుట

వ.

అంత నాసౌదాసుండు నిజకులాచార్యుం డైనవసిష్ఠుండు పురోహితుండుగా

యజ్ఞంబు సేసె నయ్యజ్ఞసమాప్తదివసంబున నమ్మునీంద్రుం డనుష్ఠానార్థంబుగాఁ
జనినసమయంబు వేచి.[152]

278


క.

మును పగచాటుచుఁ బోయిన, దనుజుండు వసిష్ఠురూపుఁ దాల్చి ధరిత్రీ
శునికడకుఁ జని రహస్యం, బున నరమాంసంబుతోడి భోజన మడిగెన్.

279


చ.

జనపతి యట్లకాక యని సమ్మతిచేసెను సూపకారుఁ డై
దనుజుఁడు వచ్చి యవ్విభుమతంబున మానవమాంస మిమ్ముగాఁ
గొని చని వండి బంగరపుఁగోరను గోరిక మీఱఁ బెట్టి య
మ్మునిపతి కిమ్మటంచు నృపుముందఱఁ బెట్టి యదృశ్యమై చనెన్.[153]

280


ఆ.

అంత నవ్వసిష్ఠుఁ డరుదెంచి భోజన, మర్థిఁ జేయునప్పు డవ్విభుండు
మునికిఁ గడురహస్యమున నరమాంసంబుఁ, దెచ్చి పెట్టె మీఁదు దెలియలేక.

281


క.

మౌనీశ్వరుండు దానిన్, మానవమాంసంబుగా సమంజసదివ్య
జ్ఞానమునఁ దెలిసి యానృప, సూనునెడం దప్పులేమిఁ జూడక కినుకన్.

282


ఉ.

శ్రీకరమైనపుణ్యములఁ జెందఁగ ఘోరతపంబు సేయఁగా
మాకు నభోజ్య మైననరమాంసము బెట్టుట యాసురంబు నీ
వీకపటంబుఁ జేసితివి యింతటనుండియు రాక్షసత్వముం
జేకొని యిట్టిభోజనము సేయు మటంచు శపించె నుగ్రుడై.[154]

283


వ.

ఇట్లు శపించినవసిష్ఠునకు నరేంద్రుం డిట్లనియె.

284


తే.

నీవ కావె మునీశ్వర నేటిరేపు, మనుజమాంసంబుతోడి భోజనము నన్ను
నడిగినాఁడవు నీ విప్పు డది తలంప, కేల శపియించితివి కృప యింతలేక.[155]

285


వ.

అనిన నమ్మునీంద్రుండు క్రమ్మఱం దనయోగసమాధిం జూచి రాజువలన నపరా
ధంబు లేకుండు టెఱింగి పండ్రెండువత్సరంబులకు శాపమోక్షణం బగునని
యనుగ్రహించిన శాపానుగ్రహంబులు గైకొని నరేంద్రుండు మునీంద్రున
కిట్లనియె.

286


ఆ.

నిరపరాధి నన్ను నిష్కారణము శపి, యించినాఁడ వింక నీవు సూర్య
కులము భూపతులకు గురువవుగాఁగ న, ర్హుఁడవు గాక నవయుచుందుగాక.[156]

287


క.

అని ప్రతిశాపజలంబులు, గొనఁగా నపు డెఱిఁగి యతనికులసతి మదయం
తి నరేశ్వర యోహోహో, చనునే గురువునకు నలిగి శాపం బీయన్.

288


వ.

అని నివారించిన నతండు మనసు విఱిగి యాశాపజలంబులు భూనభంబులం జల్లిన
లోకంబులకు నుపద్రవం బగునని తనపాదంబులయంద చల్లుకొనిన నాత్మీయకో
పానలాశ్రితంబు లైనయాజలంబులచేతం దనపాదంబులు దగ్ధచ్ఛాయ యైన

కల్మాషత్వంబున నుపగతంబయ్యె నట్టికారణంబున నారాజు కల్మాషపాదుండయ్యె
నంత.[157]

289


ఉ.

అమ్ముని శాపదోషమున నాసురవృత్తి నతండు రాత్రికా
లములయందుఁ బేరడవులన్ నరులన్ వధియించి మాంసముల్
సమ్మతిమై భుజించి దివసంబుల మానుషభంగి నుండు ని
ట్లమ్మనుజేంద్రచంద్రుని భయంకరవేషముఁ జెప్పఁ జిత్రమా.[158]

290


సీ.

ఇవ్విధంబున నన్నరేంద్రుండు రాక్షసాకారంబుతోడ నక్కాననముల
నొంటిమైఁ దిరుగుచు నున్నకాలంబునం దొకనాఁడు బ్రాహ్మణుం డొక్కరుండు
ఋతుమతి యైనట్టి సతితోడ సుఖకేళి గావించుచున్న యక్కాల మెఱిఁగి
పటువేగమున వానిఁ బట్టి వధింపంగఁ బఱతెంచుకల్మాషపాదుఁ జూచి


తే.

భయముతోడ వెఱచి పఱచుచునుండ నా, రక్కసుండు విప్రు నుక్కణంగఁ
బట్టుకొనిన నతనిభార్య శోకించుచు, నతనికడకు వచ్చి యర్థిఁ బలికె.[159]

291


క.

లోకస్తుతమిత్రసఖా, ఖ్యాకుఁడవు మహాత్ముఁడవు దయామూర్తివి యి
క్ష్వాకుకులాధారుండవు, నీ కేటికి విప్రుఁ జంపి నెత్తురు ద్రావన్.[160]

292


వ.

నీవు ధర్మసుఖాభిజ్ఞుండవు గావున నీ వెఱుంగనిధర్మంబు లేమి గలవు నేను
ప్రాణవల్లభునివలన సురతసుఖంబులఁ దృప్తింబొందక యున్నదానఁ గావున
నాకుం బతిదానంబు సేయుము బ్రాహ్మణహత్య మహాపాతకం బిట్టి నీచకర్మం
బులు ధర్మంబులు గావని పెక్కువిధంబులం బ్రార్థించుచుండ నప్పాపాత్ముండు.

293


క.

పులి పసరముఁ జంపినగతి, బలువిడి బ్రాహ్మణునిఁ జంపి భక్షించిన యా
తులువం గనుఁగొని బ్రాహ్మణు, కులసతి నిలువం రాని కోపవశమునన్.

294


తే.

నిర్దయాత్మక నాపతి నిరపరాధి, జంపితివి గాన నీవును సతులతోడి
సంగతికిఁ బోయినప్పుడ చత్తు వనుచు, శాప మిచ్చి యగ్నిప్రవేశంబు చేసె.

295


వ.

ఇవ్విధంబున నారాజు చేసిన యన్యాయంబునకు సకలభూతంబులును హాహాకా
రంబుల నాక్రోశించె నప్పుడు.

296


క.

మునివరుశాపంబున న, జ్జననాథుఁడు పదియు రెండు సంవత్సరముల్
దనుజుండై దుష్కర్మము, లొనరించె జగంబు లెల్ల నోహో యనఁగన్.

297


క.

ఘను లైనవసిష్ఠమహా, మునిముఖ్యులు వచ్చి నృపతిమొక్కలమునఁ జే
సినపాతకములు శాంతిగ, ఘనయజ్ఞముఁ జేసి సుకృతిఁ గావించి రొగిన్.[161]

298


వ.

ఇట్లు నిష్కల్మషుండైన కల్మాషపాదుండు.

299

ఉ.

ఇమ్ముల భూమియంతయును నేలుచు నాత్మవధూటితోడి సౌ
ఖ్యమ్ములు గోరియున్న మదయంతియుఁ దొల్లిటి విప్రకాంతశా
ప మ్మెఱిఁగించి నీకు నిది ప్రాణభయం బగునన్న నాత్మలో
నుమ్మలికించుచున్ సతుల నొల్లకయుండెను షండుకైవడిన్.[162]

300


వ.

ఇట్లు స్త్రీసంగమపరాఙ్ముఖుండై పెద్దకాలంబు రాజ్యంబు చేసి సంతానార్థంబుగా
వసిష్ఠుఁ బ్రార్థించి తన భార్య యైనమదయంతిని సమర్పించిన నమ్మునీంద్రుం
డయ్యింతికి గర్భాధానంబు చేసి బలపరాక్రమసంపన్నుం డైన కుమారుండు
జన్మించు నని చెప్పి చనియె నంత.

301


ఆ.

అధిపుకాంత గర్భమై యేడుసంవత్స, రంబు లుండి పుత్రరత్న ముద్భ
వింపకున్నఁ జాల వేసఱి భరియింప, లేక యొక్కనాఁడు భీకరముగ.

302


తే.

అశ్మమునఁ దనగర్భ మయ్యంబుజాక్షి, పొడిచికొనుటయు జన్మించెఁ బుత్రకుండు
వాని కశ్మకుఁ డనునభిధాన మర్థిఁ, జేసి నవయౌవనంబునఁ జెలఁగుటయును.[163]

303


క.

ఆకల్మాషపదుం డ, స్తోకముదముతోడఁ దనదుసుతు నశ్మకునిన్
సాకేతరాజ్యవిభవము, చేకొన నియమించి తపము సేయంబోయెన్.

304


క.

ఆయశ్మకుండు రాజై, యాయతముగ భూమి యేలె నాతనికి సుతుం
డై యుదయించెను మూలకుఁ, డాయవనిపుఁ డుర్వి యేలె నాకాలమునన్.

305


ఉ.

రాజుల నందఱం బరశురాముఁడు ద్రుంచెడునాఁడు వాఁడు ఘో
రాజి నెదుర్కొనన్ వెఱచి ప్రాణభయంబున నగ్నవేషకాం
తాజనకోటిలో నొదిఁగినన్ వనితాసముఁ డంచుఁ గాచి యా
రాజులవైరి వోయె సమరంబున నన్యనృపాలహింసకున్.

306


వ.

ఇట్లు నారీజనరక్షితుం డగుటంజేసి యామూలకుండు నారీకవచుం డనం బరఁగె
నట్టినారీజనకవచునకు నిలబిలుండును వానికి ఖట్వాంగదిలీపుండునుం బుట్టిరి.
అద్దిలీవుండు రాజ్యంబు చేయుసమయంబున.

307


మ.

చల మొప్పారఁగ దేవదానవులకున్ సంగ్రామరంగంబు వా
టిలినన్ దేవగణంబు లయ్యసురకోటిన్ మార్కొనలేక
భీతిలి ఖట్వాంగదిలీపభూమిపతి నర్థిం దెచ్చి విద్వేషులం
గలనం జంపి జయంబు చేకొని భుజాగర్వంబు లేపారఁగన్.[164]

308


ఆ.

ఉన్నయవసరమున మన్నించి వేల్పులు, వరము వేఁడుమనిన వసుమతీశుఁ
డట్లయేని నాకు నాయుఃప్రమాణ మెం, తనిన రెండుగడియ లనిరి సురలు.

309


ఉ.

నవ్వి మహీశుఁ డాసురగణంబులఁ గన్గొని యట్లయేని నే
నవ్వర మొల్ల న న్ననుపుఁ డంచుఁ బసిండివిమాన మెక్కి కా

నువ్వున నచ్చరల్ గొలువ నుర్వికి వచ్చి ముహూర్తమాత్రలో
మవ్వపుటైహికక్రియలు మాని పరాపరతత్వవేదియై.[165]

310


తే.

వరుస బ్రహ్మాదులకునైన వశముగాని, సచ్చిదానందయోగవాసనలఁ బొదలి
యొకముహూర్తములో నృపాలకుఁడు మిగుల, విష్ణుసాయుజ్యమునఁ బొందె విస్మయముగ.

311


క.

ఆరాజు యోగవిద్యా, సారస్యముఁ జూచి మెచ్చి సప్తర్షులు రై
వారములు సేయుచుండుదు, రారయ నొక్కొక్కవేళ నలరుచుఁ దమలోన్.[166]

312


క.

ఏపున నొక్కముహూర్తము, లోపల గైకొనియె విష్ణులోకసుఖంబుల్
తాపసు లీఖట్వాంగది, లీపుని సరి గారు యోగలీలాప్రౌఢిన్.[167]

313


క.

అని యిట్లు నేటికాలముఁ, గొనియాడుదు రాదిలీపకువలయపతికిం
దనయుండు రఘునృపాలుఁడు, జనియించె నతిప్రతాపసంపద మెఱయన్.

314


ఉ.

ఆరఘుభూమిభర్తసుతుఁడై జనియించె నజుండు వానికిం
దోరపుకీర్తిచే దశరథుం డుదయించె నతండు వైరిదు
ర్వారపరాక్రమక్రమనివారణకారణమండలాగ్రుఁడై
ధారుణియెల్ల నేలె విదితంబుగ షష్టిసహస్రవర్షముల్.[168]

315

శ్రీరామచరిత్రము

క.

ఆదశరథేశునకు దా, మోదరుఁడు త్రిలోకరక్షణోద్యమలీలం
గాదె తనమూర్తి నాలుగు, భేదంబులుగా జనించెఁ బెం పేపారన్.[169]

316


క.

ఇల విష్ణుమూర్తివలనన్, నలువొందిన రామలక్ష్మణభరతశత్రు
ఘ్నులు బాహాబలదర్పో, జ్జ్వలులై విలసిల్లుచున్న వారలలోనన్.

317


ఉ.

భూచరఖేచరాభినుతపుణ్యుఁడు రాముఁడు శైశవంబునం
దేచిన తాటకన్ రణ మహిం బడనేసి సుబాహు నొక్కనా
రాచమునన్ వధించి ప్రమదంబున నంబుధిలోఁ బడంగ మా
రీచుని నొంచి కౌశికు వరించిన యజ్ఞముఁ గాచెఁ బెంపుతోన్.[170]

318

తే.

గౌతమునిశాపదోషంబుకతన నడవి, యందుఁ బాషాణమైయున్న యయ్యహల్యఁ
దనపదాంగుష్ఠసంభూతధారుణీప, రాగదర్శనమునఁ బాపరహితఁ జేసె.[171]

319


చ.

జనకుఁడు మెచ్చఁగా హరునిచాపము రూపఱఁజేసి పెంపుతోఁ
దనభుజవీర్యశుల్కముకతంబున సీత నయోనిజాత నే
ర్పున వరియించి హైహయపురోగమరాజకులాంబుదప్రభం
జను జమదగ్నిసూనుభుజసత్వ మపాస్తము చేసె ధీరతన్.[172]

320


ఉ.

ఆతతరాజ్యవైభవవిహారసమంచిత మైనయీధరి
త్రీతల మేలనొల్లక ధృతిం దలిదండ్రులయాజ్ఞ యూఁది యా
సీతయు లక్ష్మణుండును భజింపఁగఁ గాననభూమియందు సం
ప్రీతిమెయిన్ వసించె మునిబృందము లెల్లను సంతసిల్లఁగన్.[173]

321


చ.

అనిమొనలో విరాధుఁ దెగటార్చి భయంకరవృత్తితోడ శూ
ర్పణఖను భంగపెట్టి పటుబాణములన్ ఖరదూషణాదిదై
త్యనికరముం జతుర్దశసహస్రరథంబుల మేటివీరులన్
దునిమి కబంధుఁ జంపి రిపుదుర్జయు వాలి నడంచె నర్థితోన్.[174]

322


క.

తపనజుఁ డగుసుగ్రీవునిఁ, గపిరాజ్యంబునకు రాజుఁగాఁ జేసి దశా
స్యుపురంబునఁ జెఱఁజిక్కిన, విపులాసుతఁ జూడఁ బ్లవగవిభు హనుమంతున్.[175]

323


వ.

పనిచి సీతావృత్తాంతంబు దెలిసి.

324


చ.

అలఘుమతిన్ మహావనచరావళి డెబ్బదిరెండువెల్లువల్
గొలువఁగ నేగి వారినిధిఁ గొండలచేతను గట్టి లంకపై
బలువిడి సేనతో విడిసి బాహుపరాక్రము లైనదైత్యులం
గలహములోఁ గులక్షయముగా నొనరించె మహానుభావుఁ డై.[176]

325


ఉ.

రావణకుంభకర్ణులశిరంబులు వజ్రసమానదారుణా
స్రావళి పాలు నేసి యనలార్చులఁ బావన యైనజానకీ
దేవి నశేషదేవగణదివ్యమునిస్తవనీయశీలస

ద్భావ మెలర్పఁ గైకొని యపారకృపామహిమాభిరాముఁ డై.[177]

326


తే.

పఙ్క్తికంధరుతమ్మునిఁ బరమభాగ, వతు విభీషణుఁ దనకీర్తి వసుధఁ గలుగు
నంతకాలంబు లంకకు నధివుఁ జేసి, యయ్యయోధ్యాపురంబున కరుగుదెంచి.

327


మ.

జగదానందచరిత్రుఁ డై మెఱసి రాజ్యం బర్థిఁ బాలించుచో
నొగి గంధర్వుల మూఁడుకోట్ల భరతుం డుగ్రాజిలోఁ జంప దు
ష్టగణాఢ్యున్ మధుపుత్రకున్ లవణునిన్ శత్రుఘ్నుఁ డేపారి యా
శుగజాలంబులఁ జంపి యాతనిపురిన్ శోభిల్లఁ దా నేలఁగన్.[178]

328


వ.

ఇత్తెఱంగున బలపరాక్రమధుర్యులై రామలక్ష్మణభరతశత్రుఘ్నులు దుష్టనిగ్రహ
శిష్టప్రతిపాలనంబు సేయుచుఁ బదునొకండువేలసంవత్సరంబులు రాజ్యంబు
చేసి సుఖంబు లనుభవించుచు నంత్యంబునఁ గోసలరాజ్యంబునంగల నానావర్ణ
జనంబులతోడ దివంబునకుం జనిరి.

329


సీ.

రామచంద్రుఁడు సమగ్రశ్రీవిలాసులఁ గుశలవాఖ్యులఁ గాంచె విశదయశుల
లక్ష్మణుం డతులబలప్రతాపులఁ గాంచె నంగదచంద్రసేనాఖ్యసుతుల
భరతుండు రాజన్యవరుల నిద్దఱఁ గాంచెఁ బుత్రుల దక్షకపుష్కరులను
శత్రుఘ్నుఁ డొగిఁ గాంచెఁ జతురాత్ములను బాహుశూరసేనుల నంగసుతయుగంబు


తే.

వీర లెనమండ్రు జలరాశివేష్టితాఖి, లావనీచక్రమున హరిదష్టకమున
నాజ్ఞ వెలయంగ మెఱసి రాజ్యములు సేసి, రందుఁ గులకర్త యై మించె నాకుశుండు.[179]

330


వ.

అట్టికుశునకు నతిథియును వానికి నిషధుండును నిషధునకు నలుండును వానికి నభ
సుండును నభసునకుఁ బుండరీకుండును బుండరీకునకు క్షేమధన్వుండును వానికి
దేవానీకుండును వానికి నహీనుండును వానికిఁ బారియాత్రుండును నతనికి
దళుండును దళునకుఁ జలుండును చలునకు యుక్తుండును యుక్తునకు వజ్ర
నాభుండును వానికి శంఖణుండును వానికి నుషితాశ్వుండును వానికి విశ్వసఖుం
డును వానికి హిరణ్యనాభుండునుం గ్రమంబునఁ బుట్టి రాహిరణ్యనాభుండు.

331


తే.

అర్థి జైమినిమునిశిష్యుఁ డైనయాజ్ఞ, వల్క్యయోగీశ్వరునిచేత వాఁడు యోగ

విద్య నేర్చి మహాత్ముఁడై వెలసె నవని, నతఁడు సుతుఁ గాంచెఁ బుణ్యు నున్నతగుణాఢ్యు.

332


వ.

తదీయవంశపరంపరలై ధ్రువుండును ధ్రువునకు సుధన్వుండును సుధన్వునకు
నగ్నివర్ణుండును వానికి శీఘ్రుండును శీఘ్రునకు మరుండు ననురాజులు క్రమం
బునం బుట్టి రెందు నమ్మరుండు.

333


క.

విను మాగామియుగంబున, నినవంశము నిలుపఁగా నహీనపుయోగం
బున నేఁడు నున్నవాఁ డ, త్యనఘుండు కలాపమను మహాగ్రామమునన్.[180]

334


వ.

అట్టి మరువంశపరంపరలు విను మమ్మరునకుఁ బ్రత్యాకుండును వానికి సుగం
ధియు సుగంధికి సమర్షణుండును వానికి సహస్వంతుండును వానికి విశ్వభవుం
డును విశ్వభవునకు బృహద్బలుండునుం బుట్టి రాబృహద్బలుం డర్జునపుత్రుం
డైనయభిమన్యునిచేత భారతయుద్ధంబునం బరలోకగతుం డయ్యె నని యిక్ష్వాకు
పుత్రుం డైనశశాదునివంశంబునఁ బ్రసిద్దులైన రాజులచరిత్రంబులు సెప్పి పరా
శరుండు వెండియు నిట్లనియె.

335

నిమిచక్రవర్తి వసిష్ఠశాపంబున విదేహుండై లోకులనేత్రముల నుండునట్లు దేవతలవలన వరంబు పడయుట

మ.

లలి నిక్ష్వాకుతనూజుఁ డైననిమి లీలన్ వేయిసంవత్సరం
బులు సత్రం బొనరింపఁబూని కరుణామూర్తిన్ వసిష్ఠు దపో
బలసంపన్నుని హోతఁగాఁగ నతనిన్ బ్రార్థించినన్ ధారుణీ
తలనాథోత్తముతోడ నమ్ముని సముద్యత్ప్రీతితో నిట్లనున్.[181]

336


క.

భూనాయక పురుహూతుం, డేనూఱేఁడులు మఘంబు హితమతిఁ జేయం
బూని మును నన్ను హోతం, గా నియమించెను నపారగౌరవ మొప్పన్.

337


తే.

అతనియజ్ఞంబు గావించి యది సమాప్త, మైన మఱి నీమహాక్రతు వాచరింతు
ననిన నేమియుఁ బలుకక యానరేంద్రుఁ, డుండె నది సమ్మతంబని యొనరఁ దలఁచి.

338


క.

మునివరుఁడు వజ్రియాగం, బొనరింపఁగఁ జని సమాప్తి నొందించి ముదం
బున నిమియజ్ఞము సేయం, జనుదెంచె నతిప్రయత్నసంభ్రమ మెసఁగన్.[182]

339


వ.

ఇట నిమిచక్రవర్తియు యజ్ఞోపకరణంబు లైనపదార్థంబు లనేకంబులు సంపాదిం
చినవాఁ డగుటం జేసి వసిష్ఠాగమనంబు మనంబునఁ దూష్ణీంకృతంబు చేసి గౌతముఁఁ
బురోహితుంగా వరియించి యజ్ఞంబు సేయుచున్న సమయంబున వసిష్ఠుండు గర్మ

కర్త యైనగౌతముం జూచి కోపాటోపావేశితాధరుండును కలుషితతామ్ర
ఘూర్ణాయమానలోచనుండును నై యజ్ఞవాటంబు సొచ్చి వచ్చి నిద్రించుచున్న
యారాజుం జూచి నన్ను నుదాసీనంబు చేసినదోషంబున వీఁడు విదేహుఁ డగుఁ
గాకయని శపియించి ధిక్కరించి వీక్షించిన.[183]

340


క.

జననాథుఁడు మేల్కొని యా, మునినాథునిఁ జూచి కోపమున నిట్లను నే
మును నీయెడఁ జేసినత, ప్పు నిరూపింపక శపింపఁబోలునె నీకున్.

341


తే.

నిరపరాధుల శిష్యుల నిగ్రహించి, శాప మిచ్చిన గురుఁ డెంతశాంతుఁ డైన
వానియెడ భ క్తియుక్తులు వదలి శిష్యుఁ, డేమి సేసిన దోష మొకింతలేదు.

342


క.

కావున నిట్టి దురాత్ముఁడ, వీవును దేహంబు విడిచి హీనపువృత్తిన్
బోవుదు ననుచును గోపపుఁ, జేవను బ్రతిశాప మవ్వసిష్ఠున కిచ్చెన్.[184]

343


వ.

ఇట్లు శపియించి యారాజు శరీరంబు విడిచె వసిష్ఠుండును విగతదేహుండై
యాత్మీయతేజంబు యోగవిద్యాబలంబునం జేసి మిత్రావరుణులయందు నివే
దించి పదంపడి యూర్వశీదర్శనంబువలన మిశ్రావరుణులవీర్యంబులు స్ఖలితంబు
లైననిమిత్తంబున వసిష్ఠుండు దేహధారి యయ్యె నంత.[185]

344


తే.

నిమిశరీరంబు తైలగంధములచేతఁ, బాక మొందించి గౌతమప్రముఖమునులు
వేయిసంవత్సరంబులు విధివదుక్త, మార్గములు దప్పకుండ నమ్మఘము సేయ.[186]

345


చ.

సవనముఁ దీరఁజేయుదివసంబున నింద్రపురోగమాదితే
యవరులు యజ్ఞభాగములకై చనుదెంచిన వారికెంతయుం
బ్రవిమలతృప్తి సేయఁగ సుపర్వవరుల్ నిమికిన్ శరీర మీ
సవరణ యైనమాటలు' ప్రసంగము చేసిరి మౌనికోటితోన్.[187]

346


తే.

అప్పు డశరీరి యయ్యును నచట సంచ, రించుచున్నట్టి విభుఁడు నిలింపవరుల
తోడ నిట్లను నీదేహదుఃఖ మింక, నొల్లఁ దొల్లింటిదుఃఖంబు లెల్లఁ జాలు.

347


క.

దేహంబు దుఃఖహేతువు, దేహము రోగాస్పదంబు దేహంబు మహా
మోహాంధకారభూతము, దేహం బేమిటికిఁ గోరి దీనత నొందన్.

348

ఉ.

కైకొని యెల్లవారు ననుఁ గన్నులఁ గప్పుచు గౌరవింపఁగా
లోకులనేత్రపద్మములలోన శరీరియుఁబోలె నుండి య
స్తోకసమస్తవస్తువులు చూచుచునుండెడునట్లుగా వరం
బేకమనస్కులై కరుణ నీవుత నాకు సుపర్వులందఱున్.[188]

349


ఆ.

అనిన నట్ల కాక యని యవ్వరం బిచ్చి, యపుడ దివికి దివిజు లరిగి రిట్లు
నిమియు నఖిలజనులనేత్రాబ్జముల యందుఁ, దదనురూపముగను దనరుచుండె.[189]

350


క.

ఇమ్ముగ నున్మేషనిమే, షమ్ములు మనుజులకునెల్ల సమకూడెను నే
త్రమ్ములలోపలనే రూ, పమ్ములుఁ బొడసూపఁదొడఁగెఁ బరమమునీంద్రా.[190]

351


వ.

ఇవ్విధంబున నిమిచక్రవర్తి విగతదేహుం డగుటంజేసి విదేహుం డనంబరఁగె
రాజు లేనిరాష్ట్రంబునఁ బ్రజాపీడ పాటిల్లునని గౌతమాదిమహామునీంద్రులు నిమి
పూర్వదేహంబునందు దక్షిణభుజంబు మధించినఁ గుమారుండు జననంబు నొందె
నదినిమిత్తంబున వానికి జనకుండను నామధేయంబు చేసి పట్టంబు గట్టిరి. ఆజన
కునిరాజ్యప్రదేశంబు విదేహప్రదేశం బయ్యె నివ్విధంబున.[191]

352


క.

మిథిలుం డాజనకునకును, బ్రథమసుతుండయ్యె నానృపాలుని పేరన్
మిథిలాపురి ధరలోపల, నధికశ్రీ నుల్లసిల్లె ననఘచరిత్రా.

353

జనకవంశానుక్రమము

వ.

అమ్మిథిలాన్వయసంభవు లైన రాజులవంశపరంపరలు వినుము. అట్టి మిథిలునకు
నింద్రావసుండును వానికి నందివర్ధనుండును వానికి సుకేతుండును వానికి దేవ
రాతుండును దేవరాతునకు బృహదుత్కుండును నతనికిఁ దుహవీర్యుండును
తుహవీర్యునకు సుధృతియు వానికి ధృష్టకేతుండును వానికి హర్యశ్వుండును
నతనికి మరుండును మరునకుఁ బ్రతిధరుండును వానికిఁ గృతిరథుండును వానికి
దేవమీఢుండును వానికి బుధుండును వానికి మహాధృతియు నతనికిఁ గృతరా
తుండును వానికి మహారోముండును నతనికి సువర్ణరోముండును వానికి హ్రస్వ
రోముండు నతనికి సిరధ్వజుండునుఁ బుట్టి రట్టిసిరధ్వజుం డనేకకాలంబు సంతాన
హీనుండై రాజ్యంబు సేయుచు.

354


తే.

పుత్రకామేష్టి సేయంగఁ బూని యతఁడు, యజనభూమి దున్నింపంగ నవనియందుఁ
బుట్టె సీతామహాదేవి భువనమాత, యైనయాదిమహాలక్ష్మియంశమునను.

355

క.

అట్టి సిరధ్వజుసుతుఁడై, పుట్టెఁ గుశధ్వజుఁడు వాఁడు భూరిబలుండై
నెట్టన కాశీనగరము, పట్టమునకు నర్హుఁడయ్యె భవ్యప్రౌఢిన్.

356


వ.

అట్టి కుశధ్వజునకు భానుమంతుండును వానికి శతద్యుమ్నుండును వానికి శుచి
యును వానికి నూర్జనాముండును వానికి సవధ్వజుండును వానికిఁ గృతియును
కృతికి రంజకుండును వానికిఁ బురుజిత్తుండును వానికి నరిష్టనేమియు నతనికి
శ్రుతాయువు వానికి సుపార్శ్వుండును వానికి సంజయుండును నతనికి క్షేమా
రియు క్షేమారికి సత్యరథుండు వానికి నుపగూహుండును నతనికి నుపగుప్తుం
డును నతనికి స్వాగుండును నతనికి స్వాపనుండును వానికి సువర్చసుండును
వానికి ననుభాషుండును నతనికి శ్రుతుండును నతనికి జయుండును జయునకు
విజయుండును విజయునకు ఋతుండును ఋతునకు నయుండును వానికి వ్యూత
హవ్యుండును వానికి ధృతియును నతనికి బహుళాశ్వుండును నతనికి సంతుష్టుం
డునుం బుట్టి రిది జనకవంశప్రకారంబు.

357


తే.

జనకవంశంబునృపులెల్ల జనకనామ, ధేయసంజ్ఞల నవనిలోఁ దేజరిల్లి
యాత్మవిద్యాపరాయణు లగుచు ముక్తి, కామినీపరిరంభసౌఖ్యములు గనిరి.

358


క.

అని యిట్లు సూర్యవంశం, బున ఘనులగురాజవరులపుణ్యకథలు నే
ర్పున వినిపించిన వాసి, ష్ఠునినందనుతోడ నతఁడు సమ్మతిఁ బలికెన్.

359


క.

భానుకులంబున వెలసిన, భూనాథుల నెల్ల వింటి భూయిష్ఠముగా
మౌనీంద్ర సోమవంశమ, హీనాథుల వినఁగ నాకభీష్టం బనినన్.[192]

360


శా.

సారాచారవివేక శాత్రవమహీశవ్రాతసంహార దో
స్సారప్రాభవబాహులేయ విలసత్సంగీతసాహిత్యవి
ద్యారత్నాకర యానపాలవరగోత్రాధీశ విశ్వంభరా
భారప్రౌఢతరోఢ యచ్యుతపదాబ్జధ్యానపుణ్యోదయా.[193]

361


క.

అభ్రేభామరతరుశర, దభ్రసురాహారహీరహరవాగ్వనితా
శుభాంకుకుందచంద్రా, దభ్రామలధాళధళ్యధావళ్యయశా.[194]

362

పంచచామరము.

కరూశకాశలాటభోటగౌళచోళహూణబ
ర్బరాంగవంగశూరసేనపాండ్యసింధుమండలే
శ్వరోపగీయమానభూరిసత్కథాభివైభవా
ధరాధరాధరోపమానధైర్యశౌర్యశోభితా.[195]

363


గద్యము.

ఇది శ్రీమదమరనామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సుకవిజనవిధేయ వె
న్నెలగంటి సూరయనామధేయ ప్రణీతం బైనయాదిమహాపురాణంబగు బ్రహ్మాం
డంబునందలి పరాశరసంహితయైన శ్రీవిష్ణుపురాణంబునందు సూర్యవంశంబున
మనుకీర్తనంబును శశాదుకథయును దుందుమారుచరితంబును మాంధాతృ
జన్మంబును సౌభరిపరమగృహస్థధర్మంబున నుండుటయు పురుకుత్సుండు జన్మించు
టయు సగరుచరితంబును కల్మాషపాదునివర్తనంబును దాశరథివంశపరంపరాప్ర
భావంబును నిమిచక్రవర్తియజ్ఞప్రశంసయు జనకవంశానుక్రమంబును నన్నది
పంచమాశ్వాసము.

———

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. శ్రీలక్ష్మీవల్లభకరుణాలంకృత = శ్రీవిష్ణుదేవునియొక్క కృపచేత అలంకరింపఁబడినవాఁడా - శ్రీహరికరుణను పొందినవాఁడా, భూమిమండలాఖండల = భూమండలమునకు దేవేంద్రుఁడా - మహారాజా, శౌర్యాలక్షితరిపుహృదయకరాళీకృతసుప్రతాప = శూరత్యముచేత చక్కగా గుఱుతిడఁబడి శత్రువుల హృదయములందు భయంకరముగా (తోపింప)చేయఁబడిన మేలైన ప్రతాపము గలవాఁడా.
  2. భానుసుధాకరాన్వయవిభాసితులు = సూర్యచంద్రవంశములయందు ప్రకాశించువారు.
  3. పాపపంకప్రక్షాళనంబు = పాపములనెడు బురదను చక్కగా కడుగుట.
  4. ఆరాధ్యుఁడు = ఆరాధింపఁదగినవాఁడు, హిరణ్యగర్భుఁడు = బ్రహ్మ, జగద్రక్షాగరిష్ఠాత్మకుండు = లోకమును రక్షించుటయందు మిక్కిలి గురుత్వమునొందిన మనసుగలవాఁడు, సృష్ట్యర్థంబుగాన్ = సృష్టికొఱకు.
  5. దివసకరుఁడు = సూర్యుఁడు.
  6. కమలహితుఁడు = సూర్యుఁడు, సాంప్రతంబు = ప్రకృతము - ఇప్పటిది.
  7. మండితము = అలంకరింపఁబడినది.
  8. అందు = ఆయిష్టియందు, అవహంతమై = (కూఁతురు పుట్టవలెనని మనుపత్ని కోరుటచేత) వ్యత్యస్తముగా హోమము చేయఁబడినదై, హౌతృక = హోతృసంబంధమైన - ఈయర్థమందు శ్లో. “తత్ర శ్రద్ధామనోః పత్నీ హోతారం సమయాచక, దుహిత్రర్థముపాగమ్య ప్రణిపత్య పయోవ్రతా, తేన హోత్రపచారేణ కన్యేశానామ సాభవత్" అని శ్రీశుభమహర్షిచేత శ్రీభాగవతంబునఁ జెప్పఁబడియున్నది.
  9. సోమసూనుండు = చంద్రునికొడుకు.
  10. ప్రసూనశిలీముఖుచేతన్ = మన్మథునిచేత.
  11. అధిష్ఠానము = ఉనికిపట్టు.
  12. తదన్వయంబువారు = వానివంశస్థులు.
  13. సూనృతరతులన్ = నిజము చెప్పుటయందు ఆసక్తులైన వారిని, ధృతిబలపరాక్రమశ్రీయుతులన్ = ధైర్యముతోను బలముతోను పరాక్రమముతోను సంపదతోను కూడుకొన్నవారిని.
  14. గాదిలి = ప్రియమైన.
  15. జగన్మాన్యుండు = లోకమునందు పూజ్యుఁడు, దుర్వార = అణఁపరాని, రిపుకులంబున్ = శత్రుసమూహమును, ఉగ్రాజులన్ = భయంకరమైన యుద్ధములయందు.
  16. తనిపెన్ = తృప్తి నొందించెను, మరుద్గణములన్ = దేవతాసమూహములను, త్రవ్వి తండములుగన్ = అపరిమితములుగా.
  17. వైశాలికావనీశ్వరచయంబు = విశాలుని వంశస్తులైన రాజులయొక్క సమూహము.
  18. భాతృశతజ్యేష్ఠుండు = నూఱుగురు సహోదరులందును పెద్దవాఁడు.
  19. అభినవ = క్రొత్తయైన - అపూర్వమైన, ఇభగమనన్ = ఏనుఁగువలె గంభీరమైననడక గలదానిని, కట్టడ చేసెనొక్కొ = నిర్ణయించెనో.
  20. గాంధర్వంబు = గానము - పాట, అవసరంబు = సమయము, మసలెన్ = ఆలస్యము చేసెను, గీతావసానంబునన్ = పాటముగిసినతోడనే.
  21. కన్నియ = కూఁతురు.
  22. నీకులాభిజాత్యములకున్ = నీయొక్క జాతికిని ఉత్తమవంశమునందలి పుట్టుకకును.
  23. అంఘ్రులకున్ = పాదములకు, పేర్కొని = పేరు గ్రుచ్చి చెప్పి.
  24. కాలావధిన్ = కాలముయొక్క మేరను - జీవిత కాలపుపరిమితిని, లయంబునఁ బొందిరి = చచ్చిరి.
  25. పుత్రమిత్రసహజబలకళత్రసచివభృత్యబంధుకోశములు = కొడుకులు చెలికాండ్రు తోడఁబుట్టువులు దండు భార్యలు మంత్రులు సేవకులు చుట్టములు ధన ముంచుకొట్టళ్లు.
  26. అబ్జజున్ = బ్రహ్మతో.
  27. వినమితమస్తకుండు = మిక్కిలివంపఁబడిన తలగలవాఁడు, వివేకపరిస్ఫుటమానసుండు = యుక్తవిచారముచేత ప్రకాశించునట్టి మనసు గలవాఁడు, తలపోసి = ఆలోచించి, కరపద్మముల్ మొగిచి = ఆమహాత్మునిఁ గూర్చి కరకమలములను ముకుళించి, ముత్పులకలు = సంతోషాతిశయమువలని రోమాంచములు.
  28. జగదేకరక్షణక్రముఁడు = లోకమునకు ముఖ్యమైన రక్షించునట్టిమర్యాద గలవాఁడు.
  29. ఆదిమధ్యాంతశూన్యుండు = జన్మస్థితినాశములు లేనివాఁడు, నిరపాయచిత్తుండు = కీడులేని మనసు గలవాఁడు, నిర్వికల్పుఁడు = పొరపాటు లేనివాడు, అవ్యయాత్ముఁడు = నాశరహితస్వరూపుఁడు, సర్వంకషుఁడు = ఎల్లయెడల నిండియుండువాడు, ఉద్రిక్తుండు = మిక్కిలి అతిశయించినవాఁడు, ఆప్రమేయుఁడు = ఇట్టివాఁడని తెలియరానివాఁడు, అవాఙ్మయుఁడు = వాక్కునకు అందనివాఁడు, అహితాగ్ని = యజ్ఞము చేసినవాఁడు.
  30. బలభద్రమూర్తి = బలముచేత పదిలుఁడైనవాఁడు - అతిబలవంతుఁడు, పరిధానుఁడు = కట్టుబట్టగాఁ గలవాఁడు.
  31. ఆమ౦త్రణము సేసినన్ = సెలవియ్యఁగా.
  32. హ్రస్వులన్ = పొట్టివాండ్రను, నిస్తేజులు = తేజస్సు లేనివారిని, గర్హిత = నిందింపఁబడిన, స్వస్వానురూప = తమతమకుఁ దగిన.
  33. అతులోదీర్ణస్ఫటికక్షితిభృత్సమగాత్రుఁడు = సరిలేని వెలుఁగునట్టి స్ఫటికపుకొండతో సమానమైన దేహముగలవాఁడు, సీరధరున్ = నాఁగేలు ధరించినవానిని - బలరాముని.
  34. మచ్చికతోన్ =ప్రేమతో.
  35. ఇచ్ఛావిధిన్ = ఇచ్చవచ్చినట్లు, చూఱగైకొని = కొల్లపెట్టుకొని.
  36. భువనము = లోకము.
  37. ధర్మక్రియానూనున్ = పుణ్యకర్మములచేత తక్కువకానివానిని - ఎల్లపుణ్యకర్మములు నడపువానిని.
  38. ముకుఁగ్రోళ్లన్ = ముక్కురంధ్రములందు.
  39. శశపలలము = కుందేటిమాంసము, కఱకుట్లు = కఱ్ఱచే గ్రుచ్చి కాల్పఁబడిన మాంసఖండములు.
  40. వివేకించి = తెలిసికొని.
  41. సంతరించిన = సంపాదించిన, ఉగ్రుఁడు = కోపము గలవాఁడు.
  42. అలరు = సంతోషించు.
  43. నెమ్మి = నెమ్మదిగా, దళంబుగన్ = దట్టముగా, పెంపుతోన్ = గౌరవముతో.
  44. రంజితభువనత్రయుఁడు = అనురాగము నొందింపఁబడిన మూఁడులోకములు గలవాఁడు, మంజులుఁడు = మనోజ్ఞుఁడు, జగతిన్ = భూమిని.
  45. నాకౌకసులకున్ = దేవతలకు, మహారణము = గొప్పయుద్ధము, సురానీకంబులు = దేవతాసమూహములు, కాక = సరిపోలఁజాలక, కంపితమతులై = చలించినమనసులుగలవారై,
  46. కలశపాథోరాశి = పాలసముద్రము, సందీప్తతేజుఁడు = లెస్సగా వెలుఁగునట్టి తేజస్సుగలవాఁడు, దుర్నిరీక్ష్యస్థితిన్ = చూడనలవిగానియునికితో.
  47. బన్నంబులు = భంగములను, ఆపన్నులు = ఆపదనొందినవారు, నిలింపులకున్ = దేవతలతో.
  48. రూపుమాప నోపున్ = చంపఁజాలును, తదనురూపము = దానికి తగినది. ఉజ్జగించి = విడిచి, ప్రాపు = ప్రాపుగా - రక్షకుఁడుగా.
  49. పెంపొందు = వర్ధిల్లు, నానాలోకసంసేవితున్ = అనేకజనులచేత లెస్సగా కొలువఁబడుతున్నవానిని, మన్నించి = గౌరవించి.
  50. ఆజులలోన్ = యుద్ధములయందు, పరాజితులము = ఓడఁగొట్టఁబడినవారము, కలఁకదేఱి = కలవరమునుండి తేఱినవారమై, భజియించినారము = సేవించినాము.
  51. పార్థివనందనుండు = రాజకుమారుఁడు.
  52. ప్రతతులన్ = సమూహములను, వజ్రి = ఇంద్రుడు, కకుత్స్థలంబు = మూఁపుప్రదేశము.
  53. కకుత్స్థుండు = మూఁపునఁ గూర్చున్నవాఁడు, భావించి = ధ్యానించి.
  54. దురమునకున్ = యుద్ధమునకు, పెంపు = గౌరవము, నిరమిత్రము = శత్రువులలేమి.
  55. పృథునకున్ = పృథుచక్రవర్తికి.
  56. అల్లనన్ = మెల్లగా - క్రమముగా.
  57. ఏమఱిపాటు = అకస్మాత్తుగా, ఒక్కటన్ = ఏకాకారముగా.
  58. ఉక్కడంచెన్ = చంపెను.
  59. శశ్వజ్జయశాలి = ఎల్లప్పుడు గెలుపుచేత ఒప్పునట్టివాఁడు.
  60. నిర్వేదించి = దుఃఖించి, ఆత్మగతంబునన్ = మనసులో.
  61. నిరవహిత్థవిభూతి = కొఱఁత లేనియైశ్వర్యము, భూమిభృద్విపినదుర్గములన్ = కొండలయందలి యడవు లనెడు (నరులకు) ప్రవేశింపరాని కోటలయందు, వాలితిన్ = అతిశయించితిని - మించితిని.
  62. ఎడ్డమి = హీనదశ, సడ్డలు సేయనొల్లరు = లక్ష్యము చేయఁజాలరు, అవసానము = అంతము, జడ్డలె = నిర్బంధములే, మృగజన్మము = మృగజన్మమున కైనను అనుట.
  63. కానకున్ = అడవికి, సర్వంసహామండలావనకేళీనిరతుఁడు = భూమండలమును ఏలుట యనెడు క్రీడలయందు ఆసక్తుఁడు - వినోదముగా భూమి నేలువాఁడు.
  64. అనుకంపలు = దయలు.
  65. ఈగతిన్ = ఈవిధమున, నిరర్థకంబులు = వ్యర్థములు, ఈయర్థములు = ఈ ప్రయోజనములు - ఈపను లనుట.
  66. లలితము = మనోజ్ఞము.
  67. పూతము = పరిశుద్ధము, కాంచనకలశము = బంగారుకుండ, వేదిపై = వేదికమీఁద - అరుఁగుమీఁద, పిపాసన్ = దప్పిని, ఒయ్యన్ = మెల్లగా, క్రోలి = త్రాగి, రిత్త = వట్టిది, కినిసి = కోపించి.
  68. ఇలఱేఁడు = భూపతి - రాజు, ఉప్పతిలన్ = పుట్టఁగా.
  69. బుద్ధివిహీనవ్యాపారదోషమునన్ = బుద్ధితక్కువపనివలని తప్పుచేత, ఏపుగన్ = అతిశయముగ - అపూర్వముగా.
  70. తొరఁగు = స్రవించు, ప్రదేశిని = చూపుడువ్రేలు, పండ్రెండుసమములు = పండ్రెండేండ్లు.
  71. తళుకులు = తళతళయను కాంతులు, కమ్మ= పరిమళము గల.
  72. లబ్ధ = పొందఁబడిన.
  73. అంతర్జలములు = లోపలినీళ్లు - నీళ్లలోపలి ప్రదేశము అనుట.
  74. ఘృణారసవారిధి = దయారససముద్రము.
  75. సంభావించి = గౌరవించి.
  76. కానివావి = వరుస కానిది - వాడుక లేనిది.
  77. అభీప్సితములు = కోరికలు, ఒదవిన = కలిగిన, పొదలినదానిన్ = గొప్ప వహించినదానిని.
  78. నరేంద్రకులావతంస = రాజశిరోమణి.
  79. జర్జరితము = శిథిలమైనది - మిక్కిలి కృశించినది, బెడఁగెడలిన = బాగుతప్పిన, పొడవు = ఆకారము.
  80. తీర్తును = నెఱవేర్తును, ఉపమ = ఉపాయము.
  81. సమయము = ప్రతిజ్ఞ.
  82. జర్జరితము = సడలి ముడుతలు పడినది, మోహనరూపవిలాసరేఖలంబొదలినవారు = మోహింపఁజేయునట్టి సౌందర్యముయొక్కయు శృంగారచేష్టలయొక్కయు మేలిమిచేత అతిశయించినవారు.
  83. పరితోషముతోన్ = సంతోషముతో, పోకలఁబోక = దుష్టచేష్ట లేవియు చేయక.
  84. వర్షధరునిన్ = కొజ్జావానిని - హెగ్గడిని.
  85. మెలఁపు = మెలగుట - సంచారము, దీముఁలు = మృగములను పక్షులను వశపఱచుకొనుటకై మరిపిన పెంపుడుమృగములును పక్షులును, చంద్రిక = చంద్రకళ, క్రొవ్విరి = క్రొత్తగా పూచినపువ్వు.
  86. పుత్తెంచెను = పంపెను.
  87. భావజుమోహనకరములకైవడిన్ = మన్మథునియొక్క మోహనములను బాణములవలెనే.
  88. ఇల్లడమానిసిన్ = నిక్షేపమువంటిదానను, ఒక్కమైన్ = ఒకవిధముగానే.
  89. పోనొత్తి = పోగొట్టి - విడిచి.
  90. పంచాశన్నవోఢాసమేతుండు = ఏఁబదియాఱుగురుకన్యకలతోడను గూడుకొన్నవాఁడు.
  91. అనుపమేయ = సరిపోలఁదగని.
  92. బహు...విశాలంబులు = నానావిధములైన వాకిళ్లు దిడ్డివాకిళ్లు తలుపులు కొఱళ్లు కోటలు అగడ్తలు వీని చేత విరివియైనవి, ప్రాసాదంబులు = నగరులు, భిత్తికా = గోడ, సంభృతము = చక్కగా భరించినది, దేహళీ = కడప, ప్రాంగణ = ముంగిలి, ప్రోత్ఫుల్ల...అతిశయంబులు = చక్కగా వికసించిన నల్లగలువలచేతను తామరపువ్వులచేతను కూయుచున్న రాజహంసలు కన్నెలేళ్లు మొదలగుపక్షులచేతను అతిశయించినవి, జలాశయంబులు = నీటిటెంకులు, ప్రసూన...కలరవాభిరామంబులు = పువ్వులవాసనలచేత మిక్కిలి యతిశయించిన పెక్కు చిలుకలు కోవెలలు మొదలగువాని యవ్యక్తమధురధ్వనులచేత ఒప్పినవి, తల్పంబులు = పానుపులు, లోలంబులు = ఊఁగునవి, డోలాజాలంబులు =ఉయ్యాలలసమూహములు.
  93. అనులేపవితతులు = పూసికొను ద్రవ్యములసమూహములు.
  94. బహుళీకృతరాజ్యరమామహనీయండు = అధికముగాఁ జేయఁబడిన దొరతనపుకలిమిచేత గొప్పవాఁడు, దుహితృస్నేహము = కొమార్తెలయందలిప్రేమ, మహిళామణి = స్త్రీరత్నము.
  95. కట్టిఁడిని = నీతి దప్పినవాఁడను, దురపిల్లుచున్ = దుఃఖించుచు.
  96. భర్మ = బంగారు, దీప్తి = కాంతి, ఛటా = సమూహము, హర్మ్య = మేడలుగల, ప్రస్తూన = పుష్పములయొక్క సౌరభపరిమళముచేత, నిరాతంకశంకా = భయమును సంశయమును లేని, సంకీర్ణ = కలకలుపుగల.
  97. వీటీ = వీడెము, డోలికా = ఉయ్యెల, కాశ్మీర...శ్రీనిధిన్ = కుంకుమపువ్వు కస్తూరి పచ్చకర్పూరము వీనియొక్క ఒప్పిదమైనవాసనలచేత అతిశయించిన మనోజ్ఞమైన అవయవసంపత్తికి స్థానమైనదానిని
  98. కడమపడక = తక్కువపడక, సంపన్నంబు = సమృద్ధము, విషాదంబె = విచారమే.
  99. ఇలఱేఁడు = రాజు.
  100. తొంటివాలుఁగంటికంటెన్ = మునుపటిచిన్నదానికంటె.
  101. అప్ప = అక్క
  102. విస్మితచిత్తుండు = ఆశ్చర్యమునొందిన మనసుగలవాఁడు.
  103. శైశవక్రీడాప్రసంగములు = శిశుత్వమునందలి యాటలయొక్క మేలైనకూడికలు, కోట్రములు = కోడంట్రికములు, తామరతంపర = అపరిమితము.
  104. లవిత్రము = కొడవలి.
  105. దుస్సహము = సహింపరానిది, సంగతి = సంసర్గము, ఇసీ = సీ.
  106. కుటుంబములన్ = పోష్యవర్గములను, ప్రాభవము = ప్రభుత్వము.
  107. కల్యాణకైవల్యమున్ = శుభకరమైన పరమపదమును.
  108. ఉపహతి = బాధ.
  109. సన్నిహితరాజీవాసనున్ = సమీపించినబ్రహ్మ గలవానిని, ఉద్యద్భానుకోటిప్రభాజాలోదంచితదివ్యతేజున్ = మిక్కిలి వెలుఁగునట్టి కోటిసూర్యులవలె వెలుఁగుచున్న కాంతిసమూహములో యన ఒప్పుచున్న దివ్యమయిన తేజస్సు కలవానిని, అనకృత్సౌభాగ్యలక్ష్మీయుతున్ = ఎడతెగక సౌభాగ్యలక్ష్మితో కూడుకొని యుండువానిని.
  110. సముచ్చస్వరములు = గట్టిగా వినపచ్చుకంఠస్వరములతో, పొరిఁ బొరిన్ = క్రమక్రమముగా.
  111. యోగనిద్రాప్రబుద్ధుఁడు = యోగనిద్రనుండి మేలుకొన్నవాఁడు, బన్నంబులు = భంగములను.
  112. పీతాంబరు చెప్పినయట్ల = పీతాంబరమును ధరించిన శ్రీహరి చెప్పినచొప్పున, ప్రొవై = గుంపు గూడి.
  113. పాడి = ధర్మము - యుక్త మనుట.
  114. సంఘట్టన = సంఘటన - ఇది యపూర్వప్రయోగము.
  115. పగ = శత్రువును, నిర్దేశించి = చెప్పి.
  116. అత్యారూఢప్రియభాషలన్ = అతిగౌరవములును ప్రియముల నైనమాటలతో, ఆసన్న = (బాధింప) సమీపించిన.
  117. సుధాకరపుత్రి = ఓ చంద్రునికూఁతురా.
  118. భుజంగభయాపనయార్థంబు = పాములభయమును పోఁగొట్టుటకొఱకు.
  119. ధరిత్రీభుజునిన్ = రాజును, కదనమునన్ = యుద్ధమునందు.
  120. ఆప్యాయితుఁడు = ఊరడింపఁబడినవాఁడు, చూడామణి = శిఖామణి - శ్రేష్ఠుఁడు, ప్రతిమాన = సమానమైన, నిర్భర = మిక్కిలి యధికమైన.
  121. నిరాతంకంబు = నిర్భయము.
  122. చతుర్థిన్ = చతుర్థీవిభక్తితో.
  123. అసువులు = ప్రాణములు.
  124. కొంకి = సంకోచించి, అవటము గాఁగన్ =అనుకూలముగా.
  125. ఆవ్యాహతైశ్వర్యుఁడు = కొంచెమేనియు కొఱతలేని యైశ్వర్యము కలవాఁడు, సరసన్ = వెంబడి, బెరసి = పొంది.
  126. గర్భస్తంభంబుగన్ = గర్భము నిలఁబడిపోవునట్లు.
  127. తళుకొత్తఁగన్ = ప్రకాశింపఁగా - కలుగఁగా ననుట.
  128. అఖర్వుఁడు = గొప్పవాఁడు.
  129. ప్రదముఁడు = లెన్సగా ఆణఁగఁగొట్టువాఁడు.
  130. ఉదాత్తంబులుగాన్ = ఘనములుగా.
  131. పొదివి = ఆక్రమించి, నిశాతఘోరశరపుంజములన్ = చురుకుగల భయంకరములైన బాణసమూహములచేత, బల్విడి = అతిశౌర్యముతో.
  132. జీవన్మృతులన్ = బ్రతికియు చచ్చినవారినిఁగా.
  133. భూయిష్ఠము = అంతట వ్యాపించినది.
  134. లంఘనీయంబు = దాఁటఁదగినది, అభినందించి = కొనియాడి - ఆదరించి యనుట, అర్ధముండితులు = సగము గొఱుగఁబడినవారు, ప్రలంబకేశులు = మిక్కిలి వ్రేలుచున్న తలవెండ్రుకలు గలవారు, శ్మశ్రుధరులు = గడ్డము మీసమును ధరించినవారు, స్వాధిష్ఠానంబునకున్ = తనయునికిపట్టునకు.
  135. కతిపయకాలంబునకు = కొంతకాలమునకు, అసహ్యంబు = సహించరానిది, భావికాలంబుల్ = రాఁగలకాలమున.
  136. అసమంజసచరితుఁడు = చెడ్డనడవడి కలవాఁడు, కలగుండు పెట్టి = కలఁత పెట్టి.
  137. అపహ్యాత్మకులు = ఓర్వలేనిమనసు గలవారు.
  138. సంహృతాఖిలాఘుఁడు = సంహరింపఁబడిన యెల్లపాపములు గలవాఁడు - ఎల్లపాపములను తొలఁగించినవాఁడు, భగవంతుఁడు = షడ్గుణైశ్వర్యసంపన్నుఁడు.
  139. అధర్మోపలక్షణదారుణక్రియావిహారులు = అధర్మమును సూచించునట్టి భయంకరమైన పనులయందు వినోదముగా తిరుగువారు.
  140. ఇంతవట్టు = ఇదంతయు.
  141. తముందార = తమంతటఁ దామే.
  142. కను మొఱఁగించి = ఏమఱించి - ఇది యపూర్వప్రయోగము.
  143. అశేషదిశాసముద్యోతమానుఁడు = ఎల్లదిక్కులను ప్రకాశింపఁజేయుచున్నవాఁడు, సముద్యతాయుధహస్తులు = ఎత్తఁబడిన ఆయుధములు చేతులందుఁ గలవారు.
  144. బెట్టిదంబులు = పరుషవాక్యములు.
  145. త్రిలోకీపూతంబు = మూఁడులోకములను పావనములనుగాఁ జేయునది, వేల్పుటేఱు = దేవగంగ, చెలంగించున్ = ప్రవహింపఁజేయును, ప్లావంబు = తడియుట, శశ్వత్స్వర్గసౌఖ్యోన్నతులు = మేలైన స్వర్గసుఖముయొక్క ఘనతలు.
  146. జగత్పరిపూత = లోకమును పరిశుద్ధమునుగాఁ జేయునది, అరిధి = దుర్లభము.
  147. పరోక్షంబునన్ = అనంతరము.
  148. పెంపునన్ = అతిశయముచేత.
  149. కోలుపులులు = పెద్దపులులు, పెలుచనన్ = దురుసుతనముతో.
  150. బెబ్బులి = పెద్దపులి, ఉన్నయదియు = మరియుకపెద్దపులియును.
  151. పగ చాటుచున్ = విరోధమును ప్రసిద్ధపఱచుచు, విస్మయీభూతాత్ముండు. = ఆశ్చర్యము నొందిన మనసుగలవాఁడు.
  152. వేచి = కనిపెట్టి.
  153. ఇమ్ముగా = బాగుగా, బంగరవుఁగోరన్ = బంగారుగిన్నెయందు.
  154. అసురంబు = అసురకృత్వము.
  155. నేటిరేపు = ఈదినము ప్రాతఃకాలమున.
  156. నిరపరాధిన్ = తప్పులేనివానిని, నవయుచుందు = అలయుచుందువు.
  157. ఆత్మీయకోపానలాశ్రితంబులు = తనకోపమనెడు నిప్పును ఆశ్రయించినవి - కోపాగ్నిచే వేఁడిమి నొందినవి, దగ్ధచ్ఛాయయై = కాలినవర్ణము గలవి కాఁగా, కల్మాషత్వంబున్ = చిత్రవర్ణత్వమును, ఉపగతంబు = పొందఁబడినది.
  158. దివసంబులన్ = పగటివేళలయందు.
  159. పటువేగమునన్ = మిక్కిలి వడిగా, ఉక్కణంగన్ = చిక్క.
  160. మిత్రసఖాఖ్యాకుఁడవు = మిత్రసఖుఁ డనుపేరు గలవాఁడవు.
  161. మొక్కలమునన్ = ముష్కరత్వముచేత.
  162. ఉమ్మలికించుచున్ = విచారపడుచు.
  163. అశ్మమునన్ = రాతితో.
  164. కలనన్ = యుద్ధరంగమునందు, ఏపారఁగన్ = అతిశయింపఁగా.
  165. ఉవ్వునన్ = తటాలున, మవ్వపు = మనోజ్ఞమైన.
  166. సారస్యము = సరసత్వము, కైవారములు = స్తోత్రములు.
  167. ఏపునన్ = ఉత్సాహముతో.
  168. వైరి...మండలాగ్రుఁడు = శత్రువులయొక్క అడ్డగింపరాని పరాక్రమమర్యాదను పోఁగొట్టుటకు హేతువైన ఖడ్గము గలవాఁడు - అణఁపరానిశత్రువుల పరాక్రమమును ఆణఁచినవాఁ డనుట.
  169. పెంపు = గౌరవము.
  170. భూచరఖేచరాభినుతపుణ్యుఁడు = భూమియందు సంచరించునట్టి మనుష్యులచేత ఆకాశమున సంచరించునట్టి దేవతలచేతను కొనియాడఁబడిన ధర్మముగలవాఁడు, శైశవంబునందున్ = శిశుత్వమునందు - పసితనమునందే, ఏచిన = చెలరేగిన, నొంచి = నొప్పించి.
  171. సంభూత = పుట్టిన.
  172. రూపఱఁ జేసి = స్వరూపనాశము చేసి - విఱిచి, శుల్కము = ఓలి, హైహయ...ప్రభంజనున్ = హేహయవంశస్థులు మొదలుగాఁగల రాజసమూహము లనెడు మేఘములను పడఁగొట్టుటయందు గొప్పగాలివంటివాఁ డైన, అపాస్తము చేసెను = అణఁచెను.
  173. ఊఁది = అవలంబించి, భజింపఁగన్ = సేవింపఁగా.
  174. తెగటార్చి = చంపి, రిపుదుర్జయున్ = శత్రువులకు జయింపరానివానిని, అడంచెన్ = చంపెను.
  175. తపనజుఁడు = సూర్యునికొడుకు, విపులాసుతన్ = భూపుత్రిని - సీతను, ప్లవగవిభున్ = వానరశ్రేష్ఠుని.
  176. వెల్లువలు = వాహనులు (వాహిని = 81 రథములు, 81 ఏనుఁగులు, 243 గుఱ్ఱములు, 405గురు పదాతులును గల సేన), బలువిడిన్ = అతిశౌర్యముతో.
  177. అనలార్చులన్ = నిప్పుమంటలచేత, సద్భావము = శ్రేష్ఠత్వము. ఎలర్పన్ = చిగుర్చఁగా - అతిశయింపఁగా.
  178. ఒగిన్ = పూనికతో, ఉగ్రాజిలోన్ = భయంకరమైన యుద్ధమునందు, ఏపారి = చెలరేఁగి, ఆశుగజాలంబులన్ = బాణసమూహములచేత.
  179. సమగ్రశ్రీవిలాసులన్ = సంపూర్ణమైనకలిమి గలవారిని, అతులబలప్రతాపులన్ = సరిపోల్పరానిశక్తియు తేజస్సుని గలవారిని, రాజన్యవరులన్ = క్షత్రియశ్రేష్ఠులను, చతురాత్ములన్ = చతురమైన మనసు గలవారిని, జలరాశివేష్టితాఖిలావనీచక్రమునన్ = సముద్రముచేత చుట్టఁబడిన సమస్తభూమండలమునందును, హరిదష్టకమునన్ = దిక్కు లెనిమిదింటియందును.
  180. ఆగామి = రాఁగల.
  181. సత్రము = యాగము, హోత గాఁగన్ = ఋగ్వేదవేత్తయైన మహర్షి.
  182. వజ్రి = ఇంద్రుఁడు.
  183. తూష్ణీంకృతంబు = నిరాశ, కోపాటోపావేశితాధరుండు = కోపముయొక్క త్వరనుపొందిన పెదవులు గలవాఁడు - కోపాతిశయముచేత అదరుచున్న పెదవులు గలవాఁడు, కలుషితతామ్రఘూర్ణాయమానలోచనుండు = కోపము నొందుటచేత ఎఱ్ఱనై తిరుగుడుపడుచున్న కన్నులు గలవాఁడు, యజ్ఞవాటంబు = యజ్ఞశాలయందు, ఉదాసీనంబు = అలక్ష్యము, విదేహుండు = దేహము లేనివాఁడు.
  184. చేవను = బలముచేత - అతిశయముచేత ననుట.
  185. నివేదించి = ప్రవేశింపఁజేసి, స్ఖలితంబులైన = జాఱిన.
  186. పాకమొందించి = పరిపక్వము చేసి, విధివదుక్తమార్గములు = శాస్త్రప్రకారము చెప్పఁబడినరీతులను.
  187. సవరము = యజ్ఞము, ఇంద్రపురోగమాదితేయపరులు ఇంద్రుడు మొదలగు దేవతాశ్రేష్ఠులు, సుపర్వవరులు = దేవతాశ్రేష్ఠులు, ఈన్ = ఇచ్చుటకు, సవరణ = బాగు = అనుకూలము, ప్రసంగము చేసిరి = చెప్పిరి.
  188. ఏకమనస్కులు = ఒకమనసు గలవారు - ఒకవిధమైన అభిప్రాయము గలవారు, ఈవుతన్ = ఇత్తురుగాక.
  189. తదనురూపముగన్ = దానికి తగినట్టు.
  190. ఉన్మేషములు = ఱెప్ప లెత్తుటయు వాల్చుటయు, సమకూడెను = కలిగెను, పొడచూపన్ = కనఁబడ.
  191. మథించినన్ = తరుపఁగా.
  192. భూయిష్టముగాన్ = సమగ్రముగా.
  193. సారాచారవివేక = సత్తైననడవడి నెఱిఁగినవాఁడా, శాత్రవ...సంహార = శత్రురాజులనమూహమును చంపినవాఁడా, దోస్సారప్రాభవబాహులేయ = భుజబలముయొక్క మహిమచేత కుమారస్వామివంటివాఁడా, విలస...రత్నాకర = ప్రకాశించునట్టి సంగీతము సాహిత్యము ఆశువిద్య లనురత్నములకు గనియైనవాఁడా, యానపాలవరగోత్రాధీశ = శ్రేష్ఠమైన యానపాలగోత్రమునకు రాజైనవాఁడా, విశ్వంభరాభారప్రౌఢతరోఢ = భూభారమును మిక్కిలినేర్పుతో వహించినవాఁడా, అద్యుతపదాబ్జధ్యానపుణ్యోదయా = విష్ణుదేవునియొక్క పాదకమలములను ధ్యానించుటవలనఁ బుట్టినపుణ్యము గలవాఁడా.
  194. అద్రేభ = ఐరావతమును, అమరతరు = కల్పవృక్షమును, శరదభ్ర = శరత్కాలమేఘమును, సురాహార = అమృతమును, హీర = వజ్రమణిని, హర = శివుని, వాగ్వనితా = సరస్వతిని, శుభ్రాంశు = చంద్రుని, కుంద = మొల్లపువ్వులను, చంద్ర = కర్పూరమును, (పోలిన) అదభ్ర = అల్పముగాని, ధాళధళ్య = తళతళలుగల, ధావళ్య = తెల్లనైన, యశా = కీర్తిగలవాఁడా.
  195. మండలేశ్వర = రాజులచేత, ఉపగీయమాన = కొనియాడఁబడుచున్న, భూరి = అధికమైన, సత్కథాభివైభవా = మంచికథల కలిమిగలవాఁడా, ధరా...శోభితా = భూమివలె చలించనిధీరత్వముచేతను పర్వతమువలె ఉన్నతి గలశూరత్వముచేతను ప్రకాశించువాఁడా.