ఆంధ్ర శ్రీవిష్ణుపురాణము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీవిష్ణుపురాణము

చతుర్థాశ్వాసము



మత్సకలపురాణక
థామధురసుధానుభవబుధవ్రతనుత సం
గ్రామధనంజయ జగదభి
రామవపుఃపుష్పచాప రాఘవభూపా.[1]

1


వ.

సకలపురాణవిద్యాధురంధరుం డైనపరాశరుండు మైత్రేయున కిట్లనియె. ఇట్లు
నావలన భూవిస్తారంబును సముద్రవర్ణితంబులును సూర్యాదినవగ్రహస్థానంబు
లును జ్యోతిశ్చక్రప్రభావంబును దేవర్షికీర్తనంబును జాతుర్వర్ణ్యోత్పత్తియును
దిర్యగ్యోనిజన్మంబులును ధ్రువప్రహ్లాదచరిత్రంబులును వింటి వింక నేమి వినవల
యునని యడిగిన నతం డిట్లనియె.[2]

2


క.

మునివర మన్వంతరముల, మనుపుత్రుల సురల సప్తమౌనుల దేవేం
ద్రనికాయంబుల నేర్పడ, వినవలతుం జెప్పవే సవిస్తరఫణితిన్.

3

మన్వంతరమనుపుత్రాదివివరణము

వ.

అని యడిగిన పరాశరుం డిట్లను నతీతానాగతంబు లైనచతుర్దశమన్వంతరంబులం
జెప్పెద స్వాయంభువస్వారోచిషోత్తమతామసరైవతచాక్షుషమన్వంతరంబు
లాఱును గడచనియె. వైవస్వతమన్వంతరంబు వర్తమానంబై నడుచుచున్న
యది. కల్పాదికథలవలన స్వాయంభువమన్వంతరప్రకారంబు వింటి వింక స్వారో
చిషమన్వంతరంబుఁ జెప్పెద వినుము.

4


క.

స్వారోచిషాంతరమునఁ, బారావతతుషితముఖసుపర్వగణము లే
పారువిపశ్చిత్తుం డను, స్వారాజు వెలుంగు లోకసన్నుతమహిమన్.[3]

5


తే.

ప్రాణవాతాగ్నివృషనిస్వరాహ్వయులును, స్తంబకుండును మఱియు నూర్జకుఁ డనంగ

సప్తమౌనులు వెలసిరి చైత్రచిత్ర, మదనకింపురుషాదు లమ్మనువుసుతులు.

6


వ.

ఉత్తమమన్వంతరంబున సుశాంతుండు దేవేంద్రుండయ్యె. సుధామసత్యశివప్రత
ర్దనవశవర్తు లను ద్వాదశగణంబులు దేవతలు తొల్లి నీకుం జెప్పిన వసిష్ఠతనయు
లేడ్గురు సప్తమహర్షు లైరి మఱియును.

7


సీ.

నాలవమనువు నానాలోకనుతకీర్తి యయ్యొప్పెఁ దామసుఁ డనుమహాత్ముఁ
డతనికాలంబున నమరాధిపతి యయ్యె శిబి యనునాతండు విబుధవరులు
హరసత్యరూపాదు లన సప్తవింశతిగణములై మెఱసిరి కావ్యచైత్ర
పృథుకావ్యవర్ణాగ్నిపీవరజ్యోతిధాములు సప్తమానులై రలఘుమతులు


ఆ.

ఖ్యాతిజానుజంఘకేతురూపనరాది, మనుజనాథవరులు మనువుతనయు
లమ్మహానుభావు లత్యంతధర్మాత్ము, లైరి పెక్కుక్రతువు లాచరించి.

8


తే.

రైవతాహ్వయమన్వంతరంబునందు, విభుఁ డనెడువాఁడు దేవతావిభుఁడు దేవ
గణము లమితాభవైకుంఠకావ్యభూత, దయు లనంగఁ జతుర్దశద్వయము వెలసె.

9


తే.

ఊర్ధ్వబాహుఁడు దేవబాహుఁడు హిరణ్య, రోముఁడును వేదవంతుండు థామకుండు
శ్రీమతుండు పర్జన్యుఁడు నా మునీంద్ర, సప్తకము సప్తమును లై రి సంయమీంద్ర.

10


క.

బలబంధూజ్జ్వలసంభా, వ్యులు మొదలుగ రాజులందు నొగి మనువుకుమా
రులు దేవేంద్రుని వెన్ను, ద్దులగతి విలసిల్లి రధికదోర్బలమహిమన్.

11


ఉ.

ఏచినయాప్రియవ్రతమహీతలనాథుఁడు తొల్లి పుష్పనా
రాచగురుం గుఱించి యనురాగముతోఁ దప మాచరించి స్వా
రోచిషుఁ డాదియౌ నలువురుం దనవంశజులై వెలుంగఁ బు
ణ్యోచితవృత్తిఁ దాఁ బడసె నుజ్జ్వలరాజ్యరమావిభూతితోన్.[4]

12


క.

ఆతనివిమలతపోమహి, మాతిశయమువలన మనువులై వెలసిరి యీ
భూతలనాయకు లతులవి, భూతిక విలసిల్లి రవనిఁ బుణ్యోదయులై.

13


వ.

మఱియు షష్ఠం బైన చాక్షుసమన్వంతరంబునకు మనోజవుం డను దేవేంద్రుం
డును, నార్య ప్రభూతభవ్యపృథుకరేఖాదు లైనయష్టకాగణంబులు దేవతలను,
సుమేధుండును విజరుండును హవిష్మంతుండును నుత్తముండును మధుండును
సహిష్ణుండును అతినామకుండును అనువారలు సప్తమహర్షులును, పూరుశత
ద్యుమ్నప్రముఖు లైనవారలు మనుకుమారులు నై విలసిల్లిరి. తదనంతరంబ.

14


తే.

అనఘ సాంప్రతమైనమన్వంతరమున, కధిపుఁడై విలసిల్లె నయ్యనఘమూర్తి

వనజబాంధవసుతుఁడు వైవస్వతాఖ్యుఁ, డందు దేవేంద్రుఁ డయ్యె పురందరుండు.[5]

15


సీ.

ఆదిత్యవసురుద్రు లమరగణంబులు గౌతమజమదగ్నికశ్యపాత్రి
మునులు భరద్వాజుఁడును వసిష్ఠుండు విశ్వామిత్రుఁడును నాఁగ సప్తమౌను
లిక్ష్వాకునాభాగధృష్టవరిష్యంతశర్యాతివృషదాదిజనపతులును
మహనీయమతులు తొమ్మండు వైవస్వతమనుకుమారులు జగన్మాన్యయశులు


తే.

వారలెల్లను వేర్వేఱ వంశకర్త, లై తురంగమమేధాదు లైనయాగ
ములు సమగ్రంబుగాఁ జేసి యలఘుబాహు, శక్తిఁ బాలించి రిమ్మహీచక్ర మెల్ల.[6]

16


క.

అగణితము నప్రమేయము, నగువిష్ణునిశక్తి యాచరాచరసహితం,
బగుమన్వంతరములతో, జగములు రక్షించుచుండు సాత్వికయుక్తిన్.[7]

17


క.

తోయజనాభునియంశము, లాయామన్వంతరముల నవతారములై,
ధీయుక్తి నెల్లజగములఁ, బాయక రక్షించుచుండుఁ బరమప్రీతిన్.[8]

18


వ.

అది యెట్లనిన స్వాయంభువమున్వంతరంబున నాకూతిదేవికి యజ్ఞుం డన మానస
పుత్రుండై పుట్టె, స్వారోచిషమన్వంతరంబునం దుషితాదేవికిఁ దుషితాదిదేవ
గణంబులతోడఁ దుషితుండై పుట్టె, ఉత్తమమన్వంతరంబున సత్యాదేవికి
సత్యాదిదేవగణంబులతోడ సత్యుండై జన్మించె, తామసమన్వంతరంబుర హర్య
యనుదానికి హరిప్రముఖదేవగణంబులతోడ హరిమూర్తియై పుట్టె, రైవతమ
న్వంతరంబున సంభూతికి రైవతు లనుదేవగణంబులతోడ సంభూతుండై పుట్టె,
చాక్షుషమన్వంతరంబున వికుంఠాదేవికి వైకుంఠాదిదేవగణంబులతోడ వైకుం
ఠుండై జన్మించె, వైవస్వతమన్వంతరంబునఁ గశ్యపప్రజాపతికి నదితియందు
నాదిత్యాదిదేవగణంబులతోడ వామనుండై పుట్టి త్రివిక్రమంబునం ద్రిలోకంబు
లాక్రమించి నిహతకంటకం బైనత్రిలోకంబును పురందరునకు నొసంగె, ఇట్లు
సప్తావతారాదివిహారంబులవలన సమస్తలోకంబులుం దాన యై విష్ణుండు ప్రతి
పాలించును.

19


ఆ.

ఇవ్విధముననైన నీవిశ్వమున నమ్మ, హాత్ముశక్తి విష్ట మగుటఁ జేసి
విష్ణునామ మయ్యె విశధాతువు ప్రవేశ, నార్థయుక్తితోడ నమరుఁ గాన.[9]

20


చ.

అనిమిషసిద్ధసాధ్యులుఁ జరాచరభూతములు సుపర్వులున్
(?)మనువులు ఖేచరుల్ మనుకుమారులు లోనగు నీజగంబులె
ల్లను బహుసాత్వికస్ఫురణల వెలుఁగొందుచు నుండు నన్నియున్
వినుతకృపావిధేయుఁ డగువిష్ణువిభూతులుగా నెఱుంగుమీ.

21


వ.

అని చెప్పి వెండియు ననాగతమన్వంతరంబులు వినిపించువాఁడై యిట్లనియె.

22

ఆ.

కమలహితుఁడు విశ్వకర్మతనూభవ, యైనసంజ్ఞ యనుమృగాక్షిఁ బెండ్లి
యాడి దానివలన నత్యంతసుఖలీలఁ, దేలుచుండి కొంతకాలమునకు.

23


క.

మనువును యముఁడును యమునయు, ననువారల మగుడఁ బడసె నాసతివలనన్
వనరుహబాంధవుఁ డెంతయు, ననురాగరసాబ్ది నోలలాడుచునుండెన్.

24


వ.

అంత నమ్మహాదేవియును సూర్యదేవునిచండకిరణంబులు డాయ నోపక వృద్ధ
పరిగ్రహ యైనయువతిచందంబున నిజచ్ఛాయకుం దనయట్ల శరీరంబు గల్పించి
పతిశుశ్రూష సేయ సమకట్టి పెట్టి యరణ్యమధ్యంబునకుం జని వాజిరూపంబు ధరి
యించి యజ్ఞాతవాసంబునఁ దపంబు సేయుచుండె నంత.[10]

25


ఉ.

ఛాయయు సంజ్ఞయట్ల జలజప్రియసేవ యొనర్చుచుండ నా
తోయజభాంధవుండు తనతొయ్యలియట్ల మనోనురాగముల్
సేయఁగ నుండె సంజ్ఞ మును చేసినసేఁత లెఱుంగ కిమ్మెయిన్
మాయలు పన్నుభామినుల మంచితనంబులు నమ్మవచ్చునే.[11]

26


వ.

ఇట్లు కపటరూపసేవావిధేయ యైనఛాయయందు మనువును శనైశ్చరుండును
దపతియు జన్మించి పెరుగుచున్న యప్పుడు.

27


తే.

ఛాయ నిజపుత్రకులయట్ల సవతిసుతుల, గౌరవంబునఁ జూడక కడునుపేక్ష
సేయుచుండంగ యముఁడు వీక్షించి కోప, మాత్మఁ బెనఁగొనఁ బినతల్లి కనియె నపుడు.

28


ఆ.

తల్లివయ్యు నీవు తనయుల నందఱ, నొక్కభంగిఁ జూడకుండు టెట్టు
లిట్టిబుద్ధి నీకు నేటికిఁ బాటిల్లె, ననిన నతనిమీఁద నాగ్రహించి.

29


క.

మానక విన నర్హంబులు, గానియుదాసీనవచనఘనకంటకముల్
వీనులలో నాటించిన, నానలినదళాక్షిఁ దన్నె నాతఁడు కిన్కన్.[12]

30


వ.

ఇ ట్లవమానంబుఁ బొంది యమ్మానవతి యతనిచరణంబులు భంగంబు లగునట్లుగా
శపియించె నప్పుడు సూర్యుం డది యేమి కారణం బని యడిగిన యముం
డిట్లనియె.

31


ఉ.

అన్నలు దమ్ము లైనమము నందఱ నొక్కవిధంబునం గృపన్
మన్నన సేయవేల యనినన్ నను నూరకతిట్టెఁ దిట్టినం
దన్నితిఁ దన్నినం దనపదంబులు గూల శపించె నిట్టికో
పోన్నతబుద్ధి తల్లులకు యుక్తమె పుత్రకులన్ శపింతురే.

32


ఆ.

తల్లియైన నేల తన్నుదు సుతుఁడైన, నేల నను శపించు నీమృగాక్షి
యేను గాను సుతుఁడ నీయమ తల్లియుఁ, గాదు చిత్తగింపు కర్మసాక్షి.

33

మ.

అనినం బంకజబాంధవుం డపుడు ఛాయాదేవి నీక్షించి యో
వనితా యెవ్వతె వీవు దండధరుఁ దీవ్రక్రోధవృత్తిన్ శపిం
ప నిమిత్తం బది యేమి నీవలనఁ గాపట్యంబు గాన్పించె నం
దనుపై నిర్దయకర్మముల్ చనునె కొంతా యింత గావింతురే.

34


క.

నీవలన మిగులఁ గపటపు, భావంబులు పెక్కు గానఁబడుచున్నవి కాం
తా వెరవవలదు నాయెడ, నీ వెవ్వర వింతయలుక నీ కేమిటికిన్.

35


క.

నిక్కము చెప్పుము చెప్పక తక్కిన ని న్నిపుడు పెట్టి దండింతు ననన్
స్రుక్కి దివాకరుఁ గనుఁగొని, యక్కమలదళాక్షి కడురయంబునఁ బల్కెన్.[13]

36


తే.

అబ్జబాంధవ నీభార్య యైనసంజ్ఞ, గాను నాపేరు ఛాయను గమలవదన
నిన్ను డాయంగ శంకించి నన్ను నునిచి, తా నరణ్యంబునకుఁ బోయెఁ దపము సేయ.

37


వ.

అనినం గర్మసాక్షి యాతామరసాక్షి నొండేమియుం బలుకక ధర్మరాజుపాదం
బులు పూర్వప్రకారంబున నుండునట్లుగా ననుగ్రహించి వాజిరూపంబున
నున్న సంజ్ఞానివాసంబు ఛాయాదేవివలన నెఱింగి యచ్చోటికిం జని తాను
నశ్వరూపంబు ధరియించి యయ్యింతితోడం గ్రీడించెఁ దత్సమాగమంబువలన
నశ్వినీదేవతలును రేవంతుండునుఁ బుట్టిరి ఇట్లు భార్యాసమేతుండై నిజనివా
సంబునకు వచ్చి సుఖంబుండె నంత.[14]

38


తే.

తృష్ట చనుదెంచి లోకబాంధవునిఁ గాంచి, దేవి సంజ్ఞవిధం బెల్లఁ దెలియఁ జెప్పి
యతనితీవ్రమయూఖసహస్రకమున, నెనిమిదవపాలు కరసానఁ దునియఁబట్టె.[15]

39


తే.

చండకిరణంబు లీరీతి సానఁబట్టి, కొంతకాంతంబు గావించి కూఁతుఁ దెచ్చి
యల్లునికిఁ బ్రియమారంగ నప్పగించె, వివిధశిల్పకళాకర్మ విశ్వకర్మ.[16]

40


వ.

ఇట్లు సూర్యకిరణంబులవలన రాలినరజంబు శంకరునకుఁ ద్రిశూలంబును, విష్ణు
నకుఁ జక్రంబును, కుబేరునకు ఖడ్గంబును, కుమారునకు శక్తియును, మఱియు
నానాదేవతలకు ననేకదివ్యాయుధంబులుం జేసె నిట్లు వైష్ణవతేజంబు పెక్కు
విధంబులఁ బ్రవరిల్లుచుండె నంత.[17]

41

క.

ఛాయాసంజ్ఞలు గాంచిరి, తోయజవనబంధునికి సుతున్ సావర్ణిన్
ధీయుతునిఁ బూర్వతనయ, ప్రాయమహితు సుజనలోకపావనమూర్తిన్.[18]

42


వ.

అట్టిసావర్ణితపోమహత్వంబునను విష్ణు ప్రసాదంబునను మన్వంతరపట్టంబునకుఁ
దపంబు సేయుచున్నవాడు రసాతలంబునకుం బతి యైనవిరోచనకుమారుం
డగుబలీంద్రుం డింద్రపదంబుఁ గోరి వాసుదేవు నారాధించుచున్నవాఁడు సుత
పాదివింశతిగణంబులు దేవత్వంబునకుఁ దపంబు సేయుచున్నవారు గాలవుం
డును దీప్తిమంతుండును బరశురాముండును గృపాచార్యుండు నశ్వత్థామయుఁ
గృష్ణద్వైపాయనుండును ఋష్యశృంగుండును ననువారు సప్తమహర్షులు నిర్మో
హవీరబాహు లైనరాజులు సావర్ణినందనులుగాఁ గలవార లి ట్లమ్మన్వంతరంబు
చనినపిదప.

43


సీ.

మఱి దక్షసావర్ణిమన్వంతరమున మహావీర్యుఁ డనువాఁడు దేవవిభుఁడు
ధారామరీచిసుధర్మగర్భాదులు ద్వాదశగణదేవతలును సవనుఁ
డును భవ్యుఁడును ధర్ముఁడును ద్యుతిమంతుండు దీప్తియు మేధుండు దీపకుండు
జ్యోతిష్మతియు నన నొనరినసంయము లేడ్వురు సప్తమునీంద్రు లైరి


తే.

దివ్యకేతు మహాకేతు దీప్తికేతు, పంచహస్తనిరామయప్రముఖు లైన
మనుజనాథులు పెక్కండ్రు మనువుసుతులు, ఘనులుగా నున్నవారు జగంబునందు.[19]

44


తే.

బ్రహ్మసావర్ణిమన్వంతరంబురందు, శాంతి యనువాఁడు దేవతాచక్రవర్తి
సుఖసుఖాత్మసుధర్మాదిసురలు నూర్వు, రందు దేవపదంబుల నందఁగలరు.[20]

45


తే.

సత్యుఁ డనఁగ నాభాగుఁడు సంస్తుతి యన, సత్యకేత ప్రతిమహరిష్మంతు లనఁ ద
పోధనుండును ననువారు పుణ్యఘనులు, సప్తమునులు గాఁగలవారు సంయమీంద్ర.

46


వ.

సుక్షేత్రభూనిషేణాదు లైనరాజులు పదుండ్రు బ్రహ్మసావర్ణిపుత్రులై మేదినీ
తలంబు రక్షింపంగలవారు మఱియును.[21]

47


తే.

పదునొకండవమనువు భూవిదితకీర్తి, విష్ణుసావర్ణి యను వేర వెలయు నతని
యంతరంబునఁ బృషుఁ డందు రమరవిభుఁడు, విహగకారుగమాదులు విబుధగణము.[22]

48

వ.

శనైశ్చరుండును సంస్తుతియును వహ్నితేజుండును వపుష్మంతుండును ననుజ్జ్వ
లుండును జ్వలనుండును ననుభవ్యమూర్తులు సప్తసంయములు సర్వత్రగసుధ
ర్మదేవానీకాదులు విష్ణుసావర్ణినందనులు గాఁగలవారు మఱియును.

49


తే.

రుద్రసావర్ణి యనువాఁడు రుద్రసుతుఁడు, ద్వాదశాంతరమనువు తద్రాజ్యమునను
దైవతప్రభుఁడై ఋతుధాముఁ డుండు, హరితరోహితదేవాదు లమరవరులు.

50


వ.

తపస్వియును దపోమయుండును దపోమూర్తియుఁ దపోరతియును దపోధృతి
యును దపోధనుండును ద్యుతిమంతుండును ననువారు సప్తమహర్షులు దేవోప
దేవదేవశ్రేష్ఠాదు లైనరాజులు మనుపుత్రులు గాఁగలవారలు.

51


సీ.

మఱి పదుమూడవమనువు రౌచ్యుం డనునవనీశ్వరుఁడు వానియంతరమున
సుగ్రాముఁ డనువాఁడు సురలోకనాథుండు ధర్మసుధర్మసుకర్మముఖులు
ముప్పదిమువ్వురై యొప్పారెదరు సురగణములు నిర్మోహకప్రదర్శ
నిష్ప్రకంపావ్యయనిత్యనిరుత్సుకహితమతు లనుమును లేడుగురును


తే.

సప్తసంయము లాదిత్యసవనచిత్ర, చిత్రసేనవిచిత్రాదిధాత్రిపతులు
మనుతనూభవులై మహీమండలంబు, తమభుజాశక్తిఁ బాలించెదరు మునీంద్ర.

52


వ.

పదునాలవమన్వంతరంబున శుచి యనువాఁడు దేవేంద్రుండు గాఁగలవాఁడు.
చాక్షుషసావిత్రకనిష్ఠవాచావృద్ధాదులు దేవగణంబు లయ్యెదరు. అగ్నిబాహుం
డును శుచిచిత్తుండును శుక్రుండును మాగధుండును నగ్నిరథుండును యుక్తుం
డును నజితుండును ననువారు సప్తమహర్షు లయ్యెదరు. గురుగంభీరముఖ్యా
దులు మనుతనూభవు లయ్యెదరు.

53


క.

ఈమనువులు నీయింద్రులు, నీమౌనులు నీనృపతులు నీదేవతలు
శ్రీమహిళావల్లభుతే, జోమండితు లైరి పద్మజునిదివసమునన్.[23]

54


చ.

వినుము చతుర్యుగాంతమున వేదము లన్నియు విప్లవంబు లై
చనిన మహీతలంబునకు సప్తమునీంద్రులు నేగుదెంచి పెం
పున బహువేదశాస్త్రములు మున్నిటియట్ల ప్రతిష్ఠ చేసి రూ
ఢిని నొనరించుచుండుదురు డెబ్బదియొక్కమహాయుగంబునన్.[24]

55


క.

స్మృతులు ప్రతిష్ఠింతురు ప్రతి, కృతయుగముల మనువు లవనిఁ గీర్తులు వెలయన్
క్షితి పాలింపుడు రమ్మను, సుతులు దివిజవరులు క్రతుభుజులుఁ బెం పెసఁగన్.[25]

56


క.

మనువులు మనుపుత్రులు న, య్యనిమిషులును సప్తఋషులు నమరాధిపులున్
విను మాయామన్వంతర, మున కధికారులు జగంబుఁ బోషింపంగన్.

57

వ.

ఇట్లు చతుర్దశమన్వంతరంబులును మనుసంధికాలంబులునుంగూడ సహస్రదివ్య
యుగంబులై పితామహదివసం బగునప్పుడు నిశ్శేషకల్పంబై యుండుఁ దావ
త్ప్రమాణకాలంబై నిశాసమయంబునుం జెల్లుఁ బరమేశ్వరుండు బ్రహ్మరూప
ధరుండై మహార్ణవంబున శేషపర్యంకంబున నిజమాయామోహంబున సకలలో
కభూతంబులను సంగ్రహించినవిశేషంబగుమహత్త్వంబున యోగనిద్ర నొంది
ప్రభాతసమయంబున మేలుకొని రాజసగుణోద్రిక్తుండై సృష్టి గావించు నిట్లు
నానాకల్పంబులు ననల్పప్రకారంబున నిర్మించు మఱియును.[26]

58


క.

మనువులు మనువులసుతులును, మునులు సుపర్వులు సురేంద్రముఖ్యులు నబ్జా
క్షునిసాత్వికగుణసంవ, ర్ధనులై పాలింతు రతిముదంబున జగముల్.[27]

59


క.

ఆదియుగకాలమునఁ గపి, లాదులరూపములు దాల్చి యఖిలమునకు దా
మోదరుఁ డతులజ్ఞానం, బాదేశించుచు వెలింగె నతులప్రీతిన్.[28]

60


తే.

చక్రవర్తిరూపంబులఁ జక్రధరుఁడు, తొడరి త్రేతాయుగంబున దుష్టశిక్ష
ణంబు గావించి శిష్టలోకంబునెల్ల, లీల ధర్మంబు మెఱయఁ బాలించుచుండు.[29]

61


క.

ఆదేవుఁడు ద్వాపరమున, వేదవ్యాసత్వమునఁ బ్రవీణతతోడన్
వేదంబు లుద్ధరించు స, మాదరమునఁ బెక్కుశాఖలై విలసిల్లన్.

62


ఆ.

కలియుగంబునందు గమలాయతాక్షుండు, కలికిరూపమున జగంబునందు
వేదశాస్త్రమార్గవితతులు చెడకుండ, సరయుచుండుఁ గరుణ బెరయుచుండ.[30]

63


వ.

ఇట్లు భూతభవిష్యద్వర్తమానకాలాత్ముం డైన యమ్మహాత్మునియధీనంబై సమస్తం
బు విస్తరిల్లు నని చెప్పిన విని మైత్రేయుం డిట్లనియె.

64

వ్యాసకృతవేదవిభాగాదిక్రమము

సీ.

ధరణీధరుండు వేదవ్యాసరూపంబు దానె గైకొని ప్రతిద్వాపరమున
వేదంబులను మఱి వేదశాఖాసహస్రంబును మఱి ధర్మశాస్త్రములఁ బ్ర
తిష్ఠించునని చెప్పితివి యతీతము లైనయేయేయుగంబుల నెవ్వరెవ్వ
రనఘ వేదవ్యాసు లైరి వా రెట్టెట్టివిధముల వేదముల్ విస్తరించి


తే.

చదివి రీవేదముల కెన్నిశాఖలుగ నొ, నర్చి రెబ్భంగి దీపించినారు చెప్పు
నాకు ననుటయు వాసిష్ఠనందనుండు, పలికె మైత్రేయసంయమిప్రవరునకును.[31]

65


మ.

చలితాఘం బగువేదభూజమునకున్ శాఖోపశాఖాచయం
బులు పెక్కుల్ గల వన్నియుం బ్రకటితంబు ల్గా వివక్షింప నా
జలజాతాననుఁడైన నోపఁ డిపు డే సంక్షేపరూపంబుగా

వెలయం జెప్పెద సావధానమతితో విన్నంత విప్రోత్తమా.[32]

66


ఉ.

తేజములు వివేకములు ధీరతలున్ గడునల్పముల్ గదా
భూజనకోటికంచుఁ దలపోసి తదీయహితార్థకారియై
యాజలజాముఁ డేకవిధమై కడగానఁగరానివేదముల్
నైజముగా నొనర్చె మును నాలుగుభేదములై వెలుంగఁగన్.[33]

67


వ.

ఆనాలుగువేదంబులకును ఋగ్యజుస్సామాధర్వణంబులను సంజ్ఞలు చేసి సాంప్ర
తంబయిన వైవస్వతమన్వంతరంబున నతీతంబు లైనయష్టావింశతిమహాయుగం
బులం గలద్వాపరంబులయందుఁ గ్రామంబున బ్రహ్మయుఁ బ్రజాపతియు శుక్రుం
డును బృహస్పతియును సూర్యుండును మృత్యువును దేవేంద్రుండును వసిష్ఠుం
డును సారస్వతుండును ద్రిధాముండును ద్రివృషుండును భరద్వాజుండును
నంతరిక్షుండును ధర్ముండును ద్రయ్యారుణియును ధనంజయుండును గృతంజ
యుండును సంజయుండును భరద్వాజుండును గౌతముండును ఉత్తముండును[34]
వాజిశ్రవుండును సోమశుష్మాయణుం డనుతృణబిందుండును వాల్మీకియు మజ్జన
కుం డైనశక్తియును నేనును జాతుకర్ణుండును మత్పుత్రుం డైనకృష్ణద్వైపాయ
నుండును వేదవ్యాసరూపంబులు ధరియించి వేదవేదాంగధర్మశాస్త్రపురాణాగ
మంబులు మొదలుగాఁ బదునెనిమిదివిద్యలు జగంబులం బ్రసిద్ధంబు చేసితిమి.
ద్రోణపుత్రుండైనయశ్వత్థామ ముందరిద్వాపరయుగంబున వేదవ్యాసుండు గాఁ
గలవాఁ డివ్విధంబున నానామన్వంతరంబులయందునుం గలనానాద్వాపరంబుల
నొక్కొక్కమహాత్ముండు వైష్ణవాంశంబున వేదవ్యాసుండై వేదంబు లుద్ధరించు
నని చెప్పి మఱియు నిట్లనియె.[35]

68


క.

వేదంబు తొల్లి నాలుగు, పాదంబులతో సహస్రభావమ్ముగ సం
పాదించి రంబుజాతభ, వాదులు వ్యాసస్వరూపులై క్రతువులకున్.[36]

69


క.

నాపుత్రుఁ డైనకృష్ణ, ద్వైపాయనమౌని వైష్ణవం బగుమహిమన్
దీపించెఁ గాకయుండిన, నీపాటికవిత్వరచన నెవ్వఁడు నేర్చున్.

70


వ.

తొల్లి వల్మీకసంభవుం డైనవాల్మీకి బ్రహ్మచేత నియుక్తుండై రామాయణం బేడు
కాండంబులు నేనూఱుసర్గలు నిరువదినాలుగువేలల్లో కంబులుగాఁ చేర్చి కావ్యం
బు చేసె నతనియట్ల కృష్ణద్వైపాయనుండును మహాభారతంబు హరివంశయుక్తం
బుగా నూఱుపర్వంబులు సపాదలక్షగ్రంథంబునుగాఁ జేసి జగంబులఁ బ్రసిద్ధంబు
గావించె. ఆవ్యాసవాల్మీకు లిరువురు నాదికవీంద్రు లైరి వారియందు.[37]

71

శా.

వేదక్ష్మారుహమూలకంద మసకృద్విజ్ఞానభానుప్రభా
ఛ్ఛాదీభూతమహోగ్రపాతకతమశ్ఛాదంబు నానారస
ప్రాదుర్భూతమహాకవిత్వరచనాపారీణుఁ డైనట్టియా
వేదవ్యాసమునీశ్వరుండు వెలసెన్ విష్ణుప్రభావంబునన్.

72


వ.

అట్టివేదవ్యాసుం డైనకృష్ణద్వైపాయనుండు బ్రహ్మచేత నియుక్తుండై వేదంబులు
నాలుగుపాదంబులుగాఁ జతుర్భేదంబుఁ జేసి యందు ఋగ్వేదంబు పైలుండును
యజుర్వేదంబు వైశంపాయనుండును సామవేదంబు జైమినియు నధర్వవేదంబు
సుమంతుండును పురాణేతిహాసంబులు రోమహర్షణపుత్రుం డగుసూతుండునుం
జదువునట్లుగా నియమించె వారలందఱు దమతమ శిష్యప్రశిష్యసంతతులచేతం
జదివించిన వారివారిపేర శాఖాసహస్రంబు లయ్యె నెట్లనిన.

73


క.

పైలుఁడు ఋగ్వేదము గుణ, శీలురు బోధాయనాదిశిష్యవరులచే
నాలోడింపఁగఁ జేసె వి, శాలగతిన్ బహుసహస్రశాఖలు గల్గన్.[38]

74


క.

ధీయుతమతి యగువైశం, పాయనుఁ డాత్మీయవేదపాఠంబునకున్
భూయిష్ఠమహిమ నధికుం, డై యిరువదియేడుశాఖ లమరఁగఁ జేసెన్.

75


తే.

చేసి యాశాఖలన్నియు శిష్యవరుల, చేతఁ జదివించె వారు విశేషమహిమ
దనర శిష్యప్రశిష్యసంతతులవలనఁ, బెక్కుశాఖలు గావించి రక్కజముగ.[39]

76


వ.

అట్టి వైశంపాయనశిష్యులలోన.

77


ఉ.

పుణ్యుఁడు బ్రహ్మరాతమునిపుత్రుఁ డుదంచితవేదపాదపా
రణ్యవిహారసింహుఁడు విరాజితభూరితపోమయుండు బ్ర
హ్మణ్యుఁడు యాజ్ఞవల్కి యనుమౌని గురున్ భజియించి వానికా
రుణ్యకటాక్షవీక్షణపరుం డగుచున్ విలసిల్లెఁ బెంపుతోన్.[40]

78


ఉ.

అమ్ముని యొక్కనాఁడు పరమార్థరహస్యము లైనవేదవా
దమ్ములు చేయుచున్ మునికదంబము లెల్ల వినంగ సప్తరా
త్రమ్ములలోన మద్గురుఁడు బ్రాహ్మణహత్య యొనర్చునట్టిపా
పము హరింప నోపుపరిపాటిమహత్వము గల్గు నాయెడన్.[41]

79


వ.

అని యిట్లు యాజ్ఞవల్కి పల్కినవచనంబులు శిష్యులవలన విని వైశంపాయనుం
డతనిమీఁదం గోపించియుఁ దనయం దతండు పరమభక్తుండు గావున నొండే
మియు ననక యెప్పటియట్ల వేదంబులు చెప్పుచుండి తనయాజ్ఞలో నడవక ప్రల్ల

దంబున దురాచారంబు చేసిన మేనల్లునిం గోపంబు నిలువనోపక తన్నిన.[42]

80


ఆ.

బ్రహ్మహత్యతోడఁ బ్రతియైనయాపాప, మతనిఁ జెందె నప్పు డమ్మహాత్తుఁ
డిచ్ఛలోనఁ గలఁగి యింకఁ బ్రాయశ్చిత్త, కర్మ మెవ్విధమునఁ గలుగునొక్కొ.[43]

81


తే.

అని విచారించి శిష్యుల నపుడు పిల్చి, మీరలండఱు నను సంక్రమించినట్టి
పాప ముడుగంగ వ్రతము సద్భక్తితోడ, నాచరింపుఁడు నావుడు యాజ్ఞవల్కి.[44]

82


క.

గురువులఁ గనుఁగొని యే నీ, దురితముఁ బాపంగ నోవుదును వీరలు నా
సరిగారు నామహత్వం, బరయుము నాయంతవారలా యీవిప్రుల్.[45]

83


క.

అని యిట్లు గురువుసన్నిధి, దనగర్వము మెఱసి విప్రతతులను నిందిం
చిన నావైశంపాయన, ముని మండుచు యాజ్ఞవల్క్యముని కిట్లనియెన్.[46]

84


తే.

ఓరి నాముందఱనె మొగమోటలేక, నీవు గర్వించి బ్రాహ్మణనింద చేసి
తిది మహాపాతకముగాన నింక నిన్ను, నొల్ల నినుఁ జూచినను గోప ముడుపలేను.[47]

85


వ.

కావున నీవు నావలన నేర్చిన వేదంబు మరలం గ్రక్కి పొమ్మనిన.

86


చ.

అనఘుఁడు యాజ్ఞవల్కి గురునం ఘ్రులకున్ బ్రణమిల్లి నామదిన్
ననిచినభక్తితోఁ బలికినాఁడను గర్వములేదు దుష్టుగా
ననుటయు నంతకంత కతఁ డాడినమాటయె యాడుఁగాని శి
ష్యునిఁ బరనూనురాగమునఁ జూడఁడు కోపభరంబుపెంపునన్.[48]

87


వ.

యాజ్ఞవల్కియు ననేకప్రకారంబులం బ్రార్థించి యతనివలన మెత్తఁబాటుగానక
మున్ను తననేర్చినవేదంబులు రుధిరరూపంబుగా ఛర్దిచేసి యెందుకడకుం బోయి
గురువు బ్రహ్మహత్య వాయునుపాయంబు లైనవ్రతంబులు సేయుచుండె నంత.[49]

88


క.

అత్తపసి యిట్లు గ్రక్కిన, నెత్తురుమాంసములు నైననిఖిలశ్రుతులున్
దిత్తిరిపక్షులు మ్రింగినఁ, దిత్తిరు లనుశాఖలయ్యె ధృతి నెల్లెడలన్.

89


ఆ.

అంత యాజ్ఞవల్కి యాచార్యుదోషంబుఁ, బాపి గురువుమీఁదిభక్తిఁ జేసి
దోషరహితబుద్ధితోడఁ బ్రాణాయామ, మహితుఁడై తపస్సమాధివలన.

90


వ.

సకలవేదమయుం డైనసూర్యదేవుని నారాధించుచుండె నంత.

91


తే.

వాజిరూపంబుతో వచ్చి వనజహితుఁడు, యాజ్ఞవల్కికిఁ బ్రత్యక్షమై వరంబు
వేఁడు మనుటయు భక్తిని వినుతి చేసి, బహువిధంబుల వినుతించి పల్కె నతఁడు.[50]

92


తే.

అనఘ నాగురుఁ డెఱుఁగనియతిరహస్య, మగుయజుర్వేద మిపుడు నే నభ్యసింప

వలయు నీచేత ననిన నావనజహితుఁడు, గరుణ దైవాఱఁ గతిపయకాలమునకు.[51]

93


వ.

పరమరహస్యం బైనశుక్లయజుర్వేదంబు చదివించె నవ్వేదంబు పదియేనుదెఱం
గులై వాజిశాఖ లనం బ్రసిద్ధంబు లయ్యె నాశాఖలు కణ్వాదిమహామునుల
చేత నభ్యస్తంబు లయ్యె మఱియును.[52]

94


క.

జైమినీముని తా నేర్చిన, సామమునకు బహుసహస్రశాఖలు గలుగం
గా ము న్నొనర్చి శిష్యుల, చే మూడుజగంబులందుఁ జెలఁగఁగఁజేసెన్.[53]

95


క.

ఆది సుమంతుఁ డధర్వణ, వేదము బహుసంహితలుగ విరచించి మనో
మోదమున శిష్యవరుల స, మాదరమున నభ్యసించు నట్లుగఁ జేసెన్.

96


వ.

మఱియు వేదవ్యాసశిష్యుం డైనసూతుండు సకలపురాణంబులు నాఖ్యానోపా
ఖ్యానంబులు నేర్పడునట్లుగాఁ దనశిష్యు లైనసుమతియు నగ్నివర్చుండును
మిత్రుండును శంఖపాలుండును కృతవ్రణుండును సావర్ణియు ననునార్వుర
చేతం జదివించిన.

97


క.

వా రఖిలద్వీపంబులఁ, బౌరాణికులై యనేకభంగుల గీర్వా
ణోరగనరకిన్నరదే, వారులలోకములఁ జదివి రధికప్రీతిన్.[54]

98

అష్టాదశపురాణముల యనుక్రమణికయు, చతుర్దశవిద్యల తెలివిడియు

మ.

భువి బ్రహ్మాండము వామనంబు గరుడంబున్ స్కాందమున్ గూర్మభా
గవతాగ్నేయకమాత్స్యలైంగములు మార్కండేయమున్ బాద్మవై
ష్ణవశైవంబులు నారదీయము భవిష్యద్బ్రహ్మకైవర్తది
వ్యవరాహంబులు నాఁ బురాణములు ముయ్యాఱయ్యె విప్రోత్తమా.[55]

99


వ.

అవి సర్గప్రతిసర్గవంశమన్వంతరవంశానుచరితంబు లనుపంచలక్షణంబులం జెప్పఁ
బడియుండును.

100


ఆ.

ఏను నీకు నిప్పు డెఱిఁగించుచున్నవై, ష్ణవపురాణ మఖిలజగములందు
వేదసమ్మతంబు వివరించి చెప్పఁగాఁ, బడుటఁ జేసి చాలఁ బ్రభవహించె.[56]

101


వ.

మఱియును వేదంబులు నాల్గును వేదాంగంబు లాఱును మీమాంసయును
న్యాయశాస్త్రంబును ధర్మశాస్త్రంబును సకలపురాణజాలంబును జతుర్దశవిద్య
లయ్యె నివియును నాయుర్వేదంబును ధనుర్వేదంబును నీతిశాస్త్రంబును నర్థ
శాస్త్రంబునుంగూడఁ బదునెనిమిదివిద్యలని చెప్పంబడి బ్రహ్మర్షిదేవర్షిరాజర్షుల
చేత నుపన్యసింపంబడు ననిన మైత్రేయుం డిట్లనియె.[57]

102


క.

నా కిపుడు మీరు చెప్పిన, యీకథ లన్నియును వింటి నింకను సుగుణ

స్వీకార యొకరహస్యము, గైకొని చెప్పంగవలయుఁ గరుణాదృష్టిన్.[58]

103

యమయాతనానివృత్త్యుపాయమును దెలుపుట

సీ.

పాతాళలోకసప్తకము సప్తద్వీపములు సప్తసాగరములును సప్త
లోకంబులును మొదలుగఁ గల బ్రహ్మాండభాండమధ్యంబున నిండియున్న
స్థూలరూపంబులు సూక్ష్మరూపంబులు స్థూలంబులకు నతిస్థూలములును
సూక్ష్మంబునకు నతిసూక్ష్మమై చెలువొందు ప్రాణికోటులచేతఁ బట్టు చాల


తే.

కున్న యది కర్మబంధనియుక్తిఁ బరఁగు, జంతువులు దండధరుచేతఁ జచ్చి తీవ్ర
వేదనలఁ గుందుచుందురు వీర లధిక, దుఃఖములఁ బొందకుండెడుత్రోవ గలదె.[59]

104


క.

అనవుడుఁ బరాశరుం డి, ట్లనుఁ దొల్లి మహానుభావుఁ డగుకాళింగుం
డనుమౌని నాకు నెంతయు, వినయంబున సేవ చేసి వేడుకతోడన్.

105


ఆ.

అధికభక్తి నున్నయతనికి జాతిస్మ, రత్వ మొసఁగి ధర్మరతునిఁ జేసి
యున్న యతఁడు నాకు నొక్కనాఁ డేకాంత, వేళ నధికభక్తి వినతిచేసి.[60]

106


క.

ఇప్పుడు నను నీ వడిగిన, చొప్పున నేతద్రహస్యసూక్ష్మంబులు వా
తప్పక ప్రశ్న మొనర్చినఁ, జెప్పితి విను తత్కథావిశేషము లనఘా.[61]

107


వ.

తొల్లి నకులుం డనుమహాముని యమకింకరభయంకరం బైననరకలోకంబున
నత్యంతదుఃఖీభూతులై యున్న ప్రాణులం జూచి వగచుచుఁ బితామహుపాలికిం
జని నీవు నన్నడిగినయట్ల యడిగిన నతనితోడ యమకింకరసంవాదం బను
నొక్కకథ గలదు వినుమని యిట్లనియె.

108


ఆ.

యమునిచే నియుక్తులై కింకరులు పాశ, దండహస్తు లగుచు దండితోడ
నొప్పుఁ దప్పు నరసి యుర్విలోఁ బ్రాణులఁ, బట్టి తెచ్చుటకును బైనమైన.[62]

109


తే.

యముఁడు కింకరవరుని డాయంగఁ బిల్చి, వానికర్ణములందు నెవ్వరు నెఱుంగ
కుండ నేకాంతమునఁ గొన్ని యుగ్గడించి, పనిచె నావచనంబు లేర్పడఁగ వినుము.[63]

110

యముండు తనకింకరులకు వైష్ణవమాహాత్మ్యమును దెలుపుట

ఉ.

నీవు మహీతలంబునకు నేగి ముకుందునిమీఁది భక్తిచేఁ
జేవ వహించి యున్నగుణశీలురుఁ దెచ్చెదు సుమ్ము వైష్ణవుల్
పావను లమ్మహాత్ములకుఁ బాపము లెన్నఁడుఁ జెంద వెమ్మెయిన్

గావున వారు లోకములకంటెను మాన్యులు ధన్యు లెంతయున్.[64]

111


చ.

నలినదళాక్షురాజసగుణంబునఁ బుట్టినతమ్మిచూలికిన్
దలవరివాఁడనై తగినదండనముల్ గడుఁ జేయునాకు ను
జ్జ్వలమహిమాఢ్యులై వెలయు వైష్ణవు లెల్ల నజేయు లట్టివా
రలదెస వోకుమీ బ్రతుకుఁ బ్రాణములున్ వలతేని కింకరా.[65]

112

వైష్ణవలక్షణము

చ.

అనుటయుఁ గింకరుండు జలజాప్తతనూజునిఁ జూచి దేవ యా
వనరుహనాభుభక్తజనవర్గము వేషము వారిశీలవ
ర్తనములు వారిచర్యలును వారిగుణంబులు నానతీఁగదే
యనుటయు నమ్ముహాభటున కంతకుఁ డిట్లని పల్కెఁ బెంపుతోన్.[66]

113


ఆ.

శత్రుమిత్రులందు సమబుద్ధియై నిజా, చారవర్తనములవలన మెలఁగి
యల్పమైన నధికమైనఁ బరద్రవ్య, వాంఛ లేనివాఁడె వైష్ణవుండు.

114


తే.

పసిఁడియైనను దృణమైనఁ బరులసొమ్ము, ఏకతంబునఁ దన
కబ్బెనేనిఁ గొనక
యధికశుద్ధాత్ముఁడై యుండు నాశలేక, వాఁడె లోకోత్తరుం డైనవైష్ణవుండు.[67]

115


క.

తనకుఁ గలికలుష మొదవిన, మనసున దుఃఖంబు లేక మధుసూదనుపైఁ
గొనకొన్నభక్తి వదలని, మనుజుఁడెపో విష్ణుభక్తిమహితుఁడు జగతిన్.[68]

116


తే.

స్ఫటికశైలశిలామలోద్భాసి వాసు, దేవుఁ డెక్కడ మత్సరాధీనమలిను
లైనమానవు లెక్కడ యమృతకిరణు, తుహినరశ్మిమధ్యంబున దహనునట్ల.[69]

117


వ.

అని విచారింపుము.

118


తే.

అమలహృదయవిమత్సరులై ప్రశాంతు, లై సమస్తభూతంబులయందు మిత్రు

లై యతిప్రియవాక్యు లైనట్టివారి, హృదయములయందు వర్తించు నీశ్వరుండు.[70]

119


క.

హరికరుణవలనఁ బొదలిన, పురుషుం డత్యంతసౌమ్యమున విలసిల్లున్
సరస మగుభూమిఁ బుట్టిన, ధరణీరుహ మెలమిఁ బొంది తనరినభంగిన్.[71]

120


చ.

యమనియమాదియోగనియతాత్ముల నిర్గతమానమత్సరో
ద్యములఁ బరాంగనాజనపరార్థపరాఙ్ముఖులన్ సమస్తధ
ర్మమయుల సర్వలోకజనమాన్యుల నచ్యుతపాదపద్మస
క్తమతులఁ జేరఁబోవకుము ధన్యులు వారలు గానఁ గింకరా.[72]

121


తే.

శంఖచక్రగదాభయచారుహస్తుఁ, డైనయావాసుదేవుని నాత్మఁ దలఁచు
వారి కెన్నఁడు మనవంటివారు వెఱతు, రంధకారంబు నిలుచునే యర్కునెదుర.

122


ఆ.

ప్రాణిహింస చేసి పరులయర్థము గొని, యనృతనిష్ఠురోక్తు లాడి యశుభ
కర్మనిరతుఁ డైనదుర్మతి కతిదూరుఁ, డగుచు నుండు విష్ణుఁ డనుదినంబు.[73]

123


ఆ.

ఒరులకలిమి చూచి యోర్వక సుజనుల, నింద చేసి యధికనీచకర్ము
లైనయధములకు ననంతుఁడు కడుదూర, వర్తి యగుచు నుండు వసుధయందు.[74]

124


ఆ.

అధికదుష్టచిత్తుఁడై యర్థతృష్ణతో, మిత్రబంధుసుతకళత్రమాతృ
సహజపితృధనములు చౌర్యంబు గావించు, నతనియందు విష్ణుఁ డలిగియుండు.[75]

125


వ.

కావున విష్ణుపరిగ్రహంబు లేనిదురితమతులు మనవలని యతిక్రూరదండంబునకు
నర్హులు పరమవైష్ణవులకు సకలశోభనకల్యం బగుకైవల్యంబు గాని మనలో
కంబు దుర్గమంబు. అని యిట్లు వైవస్వతుండు భీష్ముం డనుకింకరునకుం జెప్పిన
విధంబు పద్మయోనివలన నకులుం డెఱింగెఁ దదీయవృత్తాంతం బేను గాళింగున
కుపన్యసించిన నతండు గృతార్థుండై పోయెం గావున నీవు నీయర్థంబులు యథా

ర్థంబులుగా విచారింపుము వాసుదేవారాధనతాత్పర్యహృదయులై యుండు
వారికి నరకలోకంబులు నుద్దండదండధరదండనంబులును లేవు విను మన
మైత్రేయుం డిట్లనియె.[76]

126


తే.

అనఘ సంసారవిజిగీషు లగుమహాత్ము, లాదిదేవు ననంతుని నవ్యయాత్ము
నిందిరానాథు భజియించి యెట్టిఫలము, లందుదురు నాకుఁ దెలియంగ నానతిమ్ము.[77]

127


క.

అనవుడుఁ బరాశరుం డి, ట్లను సగరుఁడు దొల్లి యేతదర్థము నౌర్వుం
డనుదివ్యయోగి నడిగిన, వినిపించె నతండు లోకవిస్పష్టముగన్.

128


వ.

అది యెట్లనిన నిక్ష్వాకుకులసంభవుం డైనసగరచక్రవర్తి భార్గవుం డైనయౌర్వు
కడకుం జని నమస్కరించి యిట్లనియె.

129


తే.

భూసురోత్తమ విను మహాపురుషులకును, మాధవారాధనోపాయమహిమ యెట్టు
లమ్ముకుందుని భజయించు నమ్మహాత్ము, లేమిఫలములఁ బొందుదు రెఱుఁగవలయు.

130


వ.

అనిన నౌర్వుం డిట్లనియె.

131


తే.

వసుమతీశ మనోరథవర్గమైన, భౌమమైనను నాకసంప్రాప్తియైన
మోక్షమైనను గాంతు రబ్జాక్షుఁ గొలిచి, కోరినట్ల ఘనంబైనఁ గొంచెమైన.[78]

132


క.

తమతమవర్ణాశ్రమధ, ర్మములయెడ నిరతు లైనమనుజులచేతన్
గమలాక్షుఁ డగుముకుందుఁడు, బ్రమోదమతియై యభీష్టఫలముల నొసఁగున్.[79]

133


తే.

యజ్ఞకర్మాదివిధులచే యాజ్యుఁ డగును, జపవిధేయులచేతను జప్యుఁ డగును
దూషకులచేత నత్యంతదూష్యుఁ డగుఁ బ, యోజనాభుండు భూతమయుండు గాన.[80]

134


సీ.

పరధనంబుల కాసపడక పరస్త్రీలఁ దలఁపక జీవహింసలకుఁ జొరక
యొకరిఁ గోపించి తిట్టక సాధుజనులకుఁ గీడు సేయక తనతోడ నెమ్మి
గలవారియెడ దురాగ్రహము వాటింపక గురుజనంబులయెడఁ బరమభక్తి
వదలక సకలదేవబ్రాహ్మణోపాస్తి విడువక రిపునైనఁ గొడుకునైన


తే.

నాత్మయట్లు పాలించి వర్ణాశ్రమక్ర, మమున నియతాత్ములై శాస్త్రమార్గములను
ధీరులై యున్న వారిచే దేవదేవుఁ, డగుముకుందుండు పూజితుం డగుచు నుండు.[81]

135

క.

ధాత్రీశ వినుము విప్ర, క్షత్రియవిట్ఛూద్రజాతిజనులు నిజాచా
రత్రాణపరత నడిపిన, స్తోత్రారాధనల శౌరి తుష్టుఁ డగుఁ జుమీ.[82]

136


వ.

అనిన నమ్మహీపతి యతని నవలోకించి మహాత్మా వర్ణాశ్రమధర్మంబు లెఱుంగ
వలయు నానతి మ్మనిన నౌర్వుం డిట్లనియె.

137

వర్ణాశ్రమధర్మాద్యభివర్ణనము

సీ.

ఉచితజ్ఞుఁడై దాన మొసఁగుచు దేవార్చనాశీలుఁడై కరుణంబు గలిగి
యగ్నిపరిగ్రహుం డగుచు నిరంతరస్వాధ్యాయతత్పరుండై కుటుంబ
వృత్త్యర్థయజనంబు వేదవిక్రయమును మాని శుక్లముఁ గొని దాన మొరుల
వలనఁ గైకొనక సర్వప్రాణులకు హితకారియై మైత్రియు గౌరవంబు


తే.

మనుజులకు నెల్లఁ జేయుచు మణియు శిలయుఁ, దనకు సరియకాఁ జూచుచు ధర్మపత్ని
నొనర ఋతుకాలములయందె యనుభవించి, నియతుఁడై యుండు టది విప్రునికి మతంబు.[83]

138


సీ.

క్రతువులు సేయుట శ్రుతు లభ్యసించుట దానంబు లొసఁగుట ధర్మి యగుట
శస్త్రజీవికయు భూచక్రరక్షణమును మఱవకుండుట వేద నెఱిఁగి తగిన
భంగిఁ బ్రోచుట పరబాధలు లేకుండఁ బ్రజల రక్షించుట బ్రాహ్మణులకు
భక్తిఁ గావించుట పాపకర్ముల వధించుట శిష్టజనులఁ బ్రోచుట త్రివర్గ


తే.

పరత నేమఱకుండుట పార్థివునకుఁ, బరమధర్మంబు లగు నిట్లు బ్రతికెనేని

లోకములు మెచ్చ నభిమతలోకములకుఁ, బోవు నాభూమిపాలుఁడు భూవరేణ్య.[84]

139


సీ.

బ్రాహ్మణక్షత్రియోపాస్తి దప్పక శ్రుతు లభ్యసించుచు దాన మర్హవృత్తి
నొసఁగుచుఁ బరధనం బొల్లక నిత్యనైమిత్తికక్రియలను మేర చెడక
నిర్మలానుష్ఠానకరుఁడై క్రయవిక్రయములందు నెంతయు విమలుఁ డగుచు
ధర్మమార్గమున నర్థముఁ గూడఁబెట్టుచు వ్యవహారపరిశుద్ధవర్తి యగుచుఁ


తే.

బైరు వాణిజ్యమును బశుపాలనంబు, వదలకుండంగవలయును వైశ్యవరుని
కనుచు లోకపితామహుం డాదియందుఁ, బలికె వేదార్థసరణిగాఁ బార్థివేంద్ర.[85]

140


సీ.

వసుధామరక్షత్రవైశ్యజాతులకు శుశ్రూషలు గావించుచును గులోచి
తాచారనియతాత్ముఁడై పంచయజ్ఞంబు లాచరించుచుఁ బాత్ర మరసి దాన
మొనరించుచును సర్వజనులయందును బ్రీతికారవాత్సల్యతాకలితుఁ డగుచుఁ
బరనిందయును నాత్మపౌరుషస్తుతియును జేయక తనచేయుసేవవలన


తే.

నఖిలజనములు ప్రియమందునట్టిమహిమ, గలిగి ఋతుకాలములయందుఁ గాంత గవిసి
నిష్ఠనుండుట సచ్ఛూద్రునికి మతంబు, చేసెఁ బద్మాసనుఁడు పూర్వసృష్టియందు.

141


ఉ.

మైత్రియు సత్యమున్ దయయు మంచితనంబును మాయలేమియుం
బాత్ర మెఱింగి యిచ్చుటయుఁ బ్రాణులయందు సమత్వమున్ గుణా
మిత్రతయుం బ్రశాంతమును మేళనమై విలసిల్లుబ్రాహ్మణ
క్షత్రియవైశ్యశూద్రులకు సంతతమున్ ధరణీతలేశ్వరా.[86]

142


తే.

ఎంతదురవస్థ వచ్చిన నెంతగీడు, గల్గియుండిన నెన్నివిఘ్నంబు లైనఁ
దనకులాచారమార్గముల్ దప్పనడుచు, టనుచితం బని చెప్పెఁ బద్మాసనుండు.

143


వ.

అని యిట్లు వర్ణాశ్రమధర్మంబు లుపన్యసించి యాశ్రమంబులు చెప్పువాఁడై
భృగువంశసంభవుండు కాకుత్స్థవంశసంభవున కిట్లనియె.

144


తే.

బాలకుం డుపనీతుఁడై బ్రహ్మచర్య, మాచరింపంగఁ బూని వేదాధ్యయనము
గోరి తనభక్తియుక్తి నెక్కొనినయట్టి, గురువు నత్యంతశాంతు సద్గుణవిశాలు.

145


తే.

వేదశాస్త్రపురాణార్థవేది విగత, రాగు గుణవంతు నానావిధాగమజ్ఞు

నుభయకులశుద్ధు విజతేంద్రియుని మహాత్ము, నరసి యతనికి శిష్యుఁడై యధికభక్తి.[87]

146


ఉ.

సమ్మద మొప్పఁగా వినయసమ్మదముల్ దళుకొత్త గోత్రనా
మమ్ములు చెప్పి సాగిలి నమస్కృతిఁ జేసి తదాజ్ఞతోడ ని
త్యమ్మును సేవ చేసి తనయందుఁ బ్రసన్నత గల్గియున్నచో
నమ్మహనీయుచేత శ్రుతు లభ్యసనం బొనరించు టొప్పగున్.[88]

147


చ.

గురువుల కెన్నఁడేని బ్రతికూలము లాడక సాధువృత్తితో
బెరయుచుఁ దోడిశిష్యులకుఁ బ్రీతి యొనర్చుచు నమ్మహాత్ముపై
నెరవును నేవయున్ విడిచి యెక్కువతక్కువ లైనసేవలం
బొరయక వేదముల్ చదువఁ బూనిన మేలగు బ్రహ్మచారికిన్.[89]

148


క.

స్నానము సంధ్యయు జపమును, మానక హోమంబు రేపు మాపు నడిపి క
ర్మానుష్ఠానపరాయణుఁ, డై నిత్యముఁ జదువు టుచిత మగు వేదంబుల్.

149


క.

తన గురుమతమున భిక్షా, శనము భుజించుచును సాధుజనమార్గముచే
నొనరిన వ్రతములు సేయుచు, ననఘా వేదములు చదువ నగు వడువునకున్.[90]

150


తే.

పత్రభాజనములును సంపన్నకంద, మూలములు సమిధలు జలంబులు ఫలంబు
లును మొదలుగాఁగ వదలక యనుదినంబు, నిచ్చి గురుకృప వేదంబు లెఱుఁగవలయు.

151


క.

ఆచార్యునిసమ్ముఖమున, నీచగతి మెలంగి వినయనిపుణతఁ దత్కా
లోచితసేవాపరుఁడై, యేచిన వేదములు శిష్యుఁ డెఱుఁగఁగవలయున్.[91]

152


వ.

ఇవ్విధంబున బ్రహ్మచర్యాశ్రమంబున వేదాధ్యయనంబు చేసి గురుదక్షిణ యథా
శక్తిపూర్వకంబుగా నొసంగి యాచార్యుచేత ననుజ్ఞాతుండై విధివంతంబుగా
దారపరిగ్రహంబు చేసి ధర్మమార్గంబున నర్థం బుపార్జించి శక్త్యనుసారంబుగ
గృహస్థధర్మంబులు నడుపుచు సత్పుత్రులం బడసి పితృఋణంబును యజ్ఞంబులం
జేసి దేవతలఋణంబు నధ్యయనంబుచేసి మునీంద్రులఋణంబును బలిహరణా
దులచేత భూతములఋణంబునుం దీర్చి వాత్సల్యంబున సకలలోకంబులను
సంతోషింపంజేయుచు.[92]

153


సీ.

సన్న్యాసులును బ్రహ్మచారులు వేదవిద్యార్థులుఁ దీర్థయాత్రాభిముఖులుఁ
బరసులై భూమిఁ దిరిగెడువారును గతిలేక యాఁకటఁ గ్రాఁగువారు

దూరంబు నడచి ప్రొద్దునఁ బోక వచ్చిన తెరువరులును మఱి దిక్కులేని
పేదబ్రాహ్మణులు వినోదంబులకుఁ దమ్ముఁ బొడగన వచ్చినభూమిసురులు


తే.

మొదలుగ నతిథులయి తమసదనములకు, నేగుదెంచిన భక్తితో నెదురువోయి
తోడుకొనివచ్చి తనయింట దొరకినట్టు, లన్నపానంబులకు నుపాయంబు సేయఁ
గలుగుగృహమేధి పుణ్యలోకముల కరుగు.[93]

154


ఆ.

ఇంటఁ గలపదార్థ మేమియు దాఁపక, లేకయున్న ఋణము దేక యతిథి
కకభక్తితోడ నన్నపానాదులఁ, దృప్తిసేయవలయు దినదినంబు.

155


తే.

అతిథి యాఁకలిగొని యింటి కరుగుదెంచి, కడునుదాసీనమునఁ బొంది వెడలెనేని
తనకుఁ గలపాప మాగృహస్థునకు నిచ్చి, వానిపుణ్యంబు గొనిపోవు వసుమతీశ.[94]

156


ఆ.

కాన నతిథియందు గర్వంబు మదమును, బరుసఁదనము బెరుకుఁ బ్రల్లదంబుఁ
బొడమకుండఁజేసి భోజనశయనాస, నములఁ బ్రీతుఁ జేయు టమరు గృహికి.[95]

157


వ.

మఱియు ననేకప్రకారంబు లైనగృహస్థధర్మంబుల నిర్మలులై కంటులేక వర్తించు
మహాత్ములు పుణ్యలోకసుఖంబుల ననుభవింతురు. ఇప్పు డతిథిసత్కారంబులు
సేయుగృహపతులు గలగ్రామంబులు సకలశోభనధామంబులు నానారిష్టవిరా
మంబులు నగు నట్టిగృహమేధిధర్మంబు విడుచుటకంటెను బాతకంబు లేదు
సుమీ యని పలికి మఱియును.[96]

158


చ.

పరమగృహస్థధర్మపరిపాలన ఖేలనవృత్తి ధన్యుఁడై
పురుషుఁడు వార్ధకంబు తనుఁ బొందినఁ బుత్రకులం దదాశ్రమా
కరులుగఁ జేసి తానుఁ దనకాంతయుఁ గొనకు నేగి సత్తప
శ్చరణవిధంబు లేమఱక సంతతముం దప మాచరించుచున్.[97]

159


సీ.

దినము దప్పకయుండఁ ద్రిషవణస్నానంబు జరిపి గడ్డము పెంచి జడలుగట్టి
భూశాయియై ఫలంబులు శాకములుఁ గందమూలంబులును భుజింపుచుమహాజి
నము కుశంబులు వల్కలములును దేవపూజనము భూదేవతర్పణము చేసి
మంత్రతంత్రముల హోమంబు యథాప్రకారంబునం జేసి భిక్షంబు బలియు


తే.

నొనరఁబెట్టి వనస్నేహమున శరీర, మెల్ల నభ్యంగ మొనరించి హిమనిదాఘ

ములకు నోర్చి వానప్రస్థుఁ డలఘువృత్తి, దప మొనర్చినఁ గల్గు నుత్తమపదంబు.[98]

160


వ.

ఇవ్విధంబున వానప్రస్థాశ్రమంబు నడిపి చతుర్థాశ్రమంబుఁ బ్రవేశించి.

161


క.

పుత్ర కళత్రద్రవ్య, క్షేత్రారామముల నాస చెడి యెచ్చోటన్
మైత్రి యొనర్పక బ్రహ్మ, క్షత్రియవైశ్యక్రియలు విసర్జించి ధృతిన్.

162


తే.

వీతమత్సరుఁడై సర్వభూతచయము, నాత్మగతిఁ జూచుచు జరాయజాండజాది
జీవములయందు మోదస్వభావుఁ డగుచు, నమలధృతి నుండవలయు సన్యాసి యనఘ.[99]

163


క.

సౌహార్ధవచనరచనా, బాహుళ్యతవలన నెల్లప్రాణుల నధిక
స్నేహమున బుజ్జగించుచు, నైహికములు విడుచు టుచితముగు భిక్షునకున్.[100]

164


ఉ.

ఏకదినంబు గ్రామమున నేనుదినంబులు పట్టణంబునం
దేకమనంబుతోడ వసియించి త్రివర్గగృహంబులందు న
స్తోకత భిక్షమెత్తి పరితోషమునన్ భుజియించి దేహయా
త్రాకుశలంబు గైకొనుట ధర్మము భిక్షునకున్ నరేశ్వరా.[101]

165


క.

వ్యామోహంబును లోభము, కామక్రోధములు మదవికారము దర్పో
ద్దామమును లేక యాత్రా, రాముండై భిక్షుఁ డున్న రంజిల్లుఁ జుమ్మీ.[102]

166


క.

భిక్షాకదంబకంబున, నక్షయశారీరవహ్నియందును దినమున్
లక్షించి వేల్వఁగల్గిన, సాక్షాదీశ్వరుఁడు గాఁడె సన్న్యాసి నృపా.

167


వ.

ఇట్లు సంకల్పితబుద్ధియుక్తుండును నైహికానేకభోగవిరక్తుండును నత్యంతశౌచ
చిత్తుండును పరమతత్త్వవిద్యాయత్తుండును నై మోక్షాశ్రయం బాశ్రయించు
నమ్మహాతుం డింధనరహితంబైన వహ్నియునుంబోలె తన్నుఁ దానె ప్రశాంతుండై
బ్రహ్మలోకసుఖంబునం బొందునని చెప్పిన సగరుం డిట్లనియె.[103]

168


తే.

ఉత్తమము లగునిత్యనైమిత్తికప్ర, కారములు మూఁడు పురుషుఁ డేగతి నొనర్ప
వలయు నిత్తెఱం గెల్లను దెలియఁజెప్ప, వే కృపాచిత్తమున మునిలోకనాథ.

169


క.

అనవుడు భృగునందనుఁ డ, మ్మనుజేంద్రునిఁ జూచి నీవు మ మ్మడిగినయీ

వినుతార్థరహస్యంబులు, వినిపించెద మేర్పడంగ విను మతిభక్తిన్.[104]

170


ఆ.

ధర్మపత్నియందుఁ దనకు జన్మించిన, సత్సుతునకుఁ దండ్రి జాతకర్మ
ములు యథాప్రకారముగఁ జేసి నాందీము, ఖాఖ్యమైనశ్రాద్ధ మాచరించి.

171


తే.

యుగ్మసంఖ్యాకు లగుభూసురోత్తముల సు, ఖాసనములయందుఁ బూర్వాభిముఖులఁ
గా నమర్చి యభీష్టప్రకారములను, భోజనమ్ములు సేయించి పూజ చేసి.[105]

172


ఆ.

యవలు పెరుగు తవుడు నాదిగాఁ గలపదా, ర్థములచేత హోమ మమర రెండు
కాలముల నొనర్పఁ గావలయును బ్రహ్మ, తీర్థమునను దేవతీర్థమునను.[106]

173


తే.

పదునొకండవనాఁడు భూపాలచంద్ర, పురుడు వెడలంగ సంతతాభ్యుదయమైన
మంగళస్నాన మొనరించి మందిరమున, శుద్ధిపుణ్యాహవాచన జోక సేసి.[107]

174


ఆ.

తనకుఁ బెద్దలైన తాతలదండ్రుల, పేరు లొండె గురులపేరు లొండెఁ
దగినయిష్టదేవతల పేరు లొండెను, దండ్రి నామ మిడఁగఁ దగు సుతునకు.

175


సీ.

అర్థహీనంబులు నపశబ్దములు నప్రశస్తంబులును జుగుప్సాసమేత
ములు నమంగళవర్ణములు నతిదీర్ఘాక్షరంబులు గోపాక్షరములు సర్వ
గురువులు సర్వలఘువులు నతిక్రూరములు గాక యెల్లవారలకుఁ బ్రియము
నతిముదంబును జేయునట్టి సమాక్షరయుక్తంబుగా నామ మొసఁగవలయు


తే.

ధారుణీసురులాదివిధానశబ్ద, వాచ కాంతంబులను శర్మవర్మగుప్త
దాసు లనుప్రత్యయంబులఁ దగ నొనర్ప, వలయునని వేదములయందుఁ బలికె నజుఁడు.[108]

176


వ.

వఱియు యథాకాలయోగ్యంబు లైనసమస్తకర్మంబులు నాయావర్ణధర్మప్ర

కారంబుగా నొనర్చునది విశేషజాతులకు బ్రహ్మోపదేశంబైన యుపనయనక్రియా
కలాపంబులు వేదోక్తమార్గంబున నిర్వర్తించి వేదాధ్యయనతత్పరుం డగుచు.[109]

177


మ.

చతురామ్నాయరహస్యవేది యగుచున్ శాస్త్రజ్ఞుఁడై నిర్మల
ప్రతిభోద్రిక్తమనస్కుఁడై యతికృపాపారీణుఁడై సంతత
వ్రతసంపన్నగరిష్ఠుఁడై గుణగణావష్టంభుఁడై సత్కళాం
చితుఁ డైనట్టిగురున్ భజింపవలయు శిష్యుండు సద్భక్తితోన్.[110]

178


క.

గురుశుశ్రూష యొనర్చుచు, సరసత్వముతోడ శ్రుతులు చదువుచు నిగమా
ర్థరహస్యంబులు దెలియుచుఁ, జరితార్థుం డగును బ్రహ్మచారి నరేంద్రా.

179


వ.

యథోక్తప్రకారంబున గురుదక్షిణ యొసంగి యమ్మహాత్మునిచేత ననుజ్ఞాతుండై
సంకల్పపూర్వకంబుగా గృహస్థవానప్రస్థయత్యాశ్రమంబులయందు నిష్టంబైన
యాశ్రమంబు నడుపవలయు. విశేషించియు గృహస్థాశ్రమంబు సమస్తాశ్రమం
బులకు నాశ్రయంబు గాన నమ్మహనీయపథంబునకు నభిముఖుండై.[111]

180

సదసత్కన్యకాస్వరూపనిరూపణము

తే.

అనఘ తనవయసునఁ దృతీయాంశమైన, ప్రాయమునఁ గలకన్నియఁ బరమసాధ్వి
నుభయకులములఁ దనయట్ల యొప్పుదానిఁ, బెండ్లియాడంగవలయు సంప్రీతితోడ.[112]

181


సీ.

నైసర్గికాంగహీనను శోఫి నతికేశఁ గేళహననతివఁ గృష్ణవర్ణ
రోమాంగిఁ గులటను రోగిని దుష్టాత్మ దుష్టవాత్సల్య నికృష్టవృత్తి
నధికపింగళ వినయాచారహీన మాతాపితృప్రతికూలఁ బాపహృదయ

శ్మశ్రుముఖిని బురుషస్వరరూక్షాక్షి ఖర్వరూపక హీనకంఠనాద


తే.

వివృతబద్ధాక్షి నున్నతవిపులగుల్ఫఁ, గాకనాదను రోమజంఘను విపాండు
కరజ నరుణాక్షి గండకూబర కరాళ, వదన నుద్వాహమైన నొప్పదు నరేంద్ర.[113]

182


ఆ.

హస్తపాదహీన నతిదీర్ఘ వామన, క్లిన్నరక్త నతివికీర్ణకేశఁ
గపటహృదయఁ బంగుగమనఁ బ్రాణిగ్రహ, ణంబు గాఁగఁ దగదు నరవరేణ్య.[114]

183


ఆ.

తల్లివంక నైదుతరముల వివరించి, తండ్రివంక నేడుతరము లరసి
వారివారిగోత్రవంశసంకరము గా, నియక యతివఁ బెండ్లి యయిన మేలు.

184


వ.

బ్రాహ్మంబును దైవంబును నార్షంబును బ్రాజాపత్యంబును నాసురంబును గాంధ
ర్వంబును రాక్షసంబును బైశాచంబును నను నెనిమిదివివాహంబులయందును
నాయావర్ణధర్మంబు లైన వివాహంబులను దారపరిగ్రహంబు చేసి తద్ధర్మపత్నీ
సమేతంబుగాఁ బరమగృహస్థధర్మంబున నున్న మహాత్ముండు సకలలోకంబులకు
నుత్తమశ్లోకుం డగు ననిన సగరుం డిట్లనియె.[115]

185


క.

మునివర గృహస్థధర్మం, బునఁ బాయకయున్న పరమపుణ్యుల యాచా
రనియతులెల్లను దప్పక వినవలతుఁ జెప్పు మతివివేకప్రౌఢిన్.

186


వ.

అనియడిగిన యాభృగువంశశిఖామణి యన్నరేంద్రచంద్రు నవలోకించి సదా
చారవంతు లైనగృహస్థు లుభయలోకంబులయందును నత్యంతసౌఖ్యంబు
లనుభవింతురు. తొల్లి స్వాయంభువాదు లైనమనువులును సప్తమహామును
లును బ్రజాపతులును సకలలోకోపకారకంబులుగా సదాచారమార్గంబులు
గల్పించిరి గావున నిజవర్ణధర్మంబు లైన యాచారంబు లవశ్యంబును నాచరిం
పవలయు వినుము.

187

గృహస్థసదాచారరూపములైన నిత్యకృత్యములు వివరించుట

మ.

అనురాగం బొదవ గృహాధిపతి బ్రాహ్మంబౌ ముహూర్తంబునం

దొనరన్ మేల్కని సావధానమతితో నుద్యద్వికాసంబునన్
దనయాచార్యుని నిష్ట దైవచరణధ్యానంబుఁ గావించి ధ
ర్మనిరోధంబులు గానియర్ధమును గామంబున్ విచారించుచున్.[116]

188


తే.

ప్రకటధర్మార్థకామంబులకుఁ బరస్ప, రానుకూలంబు గలయుపాయములు దలఁచి
యతిసుఖోదరమును జగదభినుతంబు, నైనధర్మంబు వదలనిమానసమున.[117]

189


వ.

శయ్యాగృహంబు వెడలి గ్రామంబునకు నిరృతిభాగంబున నమ్మువేటునేలకంటెను
దూరంబుగాఁ జని ముసుంగుపెట్టుకొని మౌనంబున గోసూర్యబ్రాహ్మణవా
యుగురువహ్నిదేవతల కభిముఖుండు గాక దివసంబుల నుత్తరాభిముఖం
డును రాత్రుల దక్షిణాభిముఖుండును నై మూత్రపురీషోత్సర్జనంబులు సేయ
వలయు.[118]

190


ఆ.

వీథి నూరినడుమ విత్తినపైరులో, మాకునీడ నాలమందలోన
నేటినడుమ వల్లకాటిలో దుక్కిలో, నీళ్లనడుమ గాదు నీరుముట్ట.[119]

191


తే.

రచ్చఁ దెరువును గృహవాటి మచ్చుమీఁద, నీటిచేరువఁ గొఱగాదు నీరుముట్ట
వసుధమీఁదను దళముగా గసవు బఱపి, వేగ మూత్రపురీషముల్ విడువవలయు.

192


ఆ.

పుట్టమన్ను గోడపెట్టినమన్నును, జలములోనిమన్ను నెలుకమన్ను
దుక్కిమన్ను పురుగుచెక్కినమన్నును, శౌచమునకుఁ గాదు సంగ్రహింప.

193


తే.

ధరణిఁ బరిశుద్ధమైనచోఁ దానె త్రవ్వి, మన్ను గొనివచ్చి బుద్బుదమలినఫేన
పూతిగంధాదు లెవ్వియుఁ బొరయకున్న, జలములను శౌచ మొనరింపవలయు ననఘ.[120]

194

తే.

తనదులింగంబునందు గుదస్థలమున, వామహస్తమునను గటిద్వయమునందు
వరుస నేకత్రిదశసప్తవారములను, మృత్తికాశౌచ మొనరింప మేలు గలుగు.

195


వ.

కేశవాదినామంబులతోడ గోకర్ణహస్తంబున మాషమజ్జనపరిమితశుద్ధోదకంబుల
ముమ్మాఱు లోనికిం గొని యినుమాఱు పరిమార్జనంబు చేసి దక్షిణపూర్వకం
బులుగా నేత్రనాసాపుటశ్రోత్రద్వయశిరోబాహుద్వయనాభిహృదయంబుల
న్యసించి యాచమనంబు చేసి.[121]

196


క.

తల నిమ్మపండ్లు మొదలుగఁ, బులుసులు పట్టించి పుష్పములు నంజనముం
జెలువొప్పఁ బూని కడుని, ర్మలహృదయముతోడ నుదకమధ్యంబునకున్.

197


చ.

అరిగి సమస్తనిర్ఝరయంబును నవ్యసుధాకరాభమున్
బరమపవిత్రమున్ సకలపాపహరంబును నైననీరుఁ ద
త్పరమతి విష్ణురూపముగ భావన చేసి కృతావగాహత
త్పరుఁ డగుపుణ్యపూరుషుఁడు ధన్యుఁ డగున్ భువనత్రయంబునన్.[122]

198


తే.

నదుల నదములఁ జెఱువుల హ్రదములందు, దేవఖాతజలంబుల దీర్ఘకలను
గూపములఁ బల్వలంబులఁ గోరి దినము, తాన చూడంగవలెఁ గాని మానరాదు.[123]

199


వ.

ఇట్లు సంకల్పపూర్వకంబుగా స్నానంబు చేసి వెడలివచ్చి ధౌతవస్త్రపరిధానుం
డై దేవర్షిపితృతర్పణంబులు సేసి సంధ్యాదికక్రియలు నిర్వర్తించి సూర్యోపాస్తి
యెవర్చి నిజగృహంబునకు వచ్చి యథాప్రకారంబుగ పోడశోపచారంబుల
తోడ దేవతార్చన గావించి జపౌపాసనవైశ్వదేవంబులు చేసి యుక్తప్రకారస్థా
నంబుల నాయాదేవతలకుఁ బ్రీతిగా హుతశేషాన్నంబు బలులు పెట్టి గృహంబు
వెలుపలను భూతప్రేతపిశాచకూశ్మాండపిపీలికాదిజంతువులకుఁ దత్తన్మంత్రంబుల

బలులు వెట్టి గృహస్థుండు సకలభూతసమాశ్రితుండు గావున గోదోహన
మాత్రకాలంబు బహిఃప్రదేశంబున నభ్యాగతాగమనంబుఁ గోరుచు నిలుచుండి
పుణ్యవశంబున నతిథి వచ్చిన.[124]

200


క.

తనపాలిభాగ్యదేవత, యని లోనికిఁ గొంచుఁబోయి యర్షం బగునా
సన మిడి యర్ఘ్యముఁ బాద్యము, నొనరించి మనంబులోన నొదవినభక్తిన్.

201


క.

నామకులగోత్రవిద్యా, భూములు ము న్నడుగ కతనిఁ బూజించి యభీ
ష్టామృతరసాన్నపానము, లామహితున్ విష్ణుమూర్తి యని యిడవలయున్.[125]

202


మ.

నరనాథోత్తమ బ్రహ్మచారి గృహి వానప్రస్థ సన్న్యాసులం
దొరుఁ డెవ్వాఁ డట వింతబ్రాహ్మణుఁడు దా నొప్పన్ క్షుధావేదనా
పరుఁ డై వచ్చిన నన్నదాన మొనరింపన్ లేక దుర్మార్గత
త్పరుఁ డై యొంటిఁ జరించెనేని నరకప్రాప్తుం డగున్ దీనతన్.[126]

203


క.

కావున నతిథులఁ బూజలు, గావించి యథోచితప్రకారంబున ధా
త్రీవర భిక్షంబులు నిడ, గావలయు గృహస్థధర్మకలితులకెల్లన్.

204


క.

ఆపంకజాసనుండుఁ బ్ర, జాపతులును బావకుండు శక్రుండును ల
క్ష్మీపతియును నాదిత్యమ, హాపురుషులు వత్తు రింటి కభ్యాగతులై.[127]

205


తే.

అవనీనాయక యన్నార్థు లైనవృద్ధ, బాలకుల గర్భిణుల దుఃఖభాజనులయుఁ
గోర్కి దీర్పక తా నొంటిఁ గుడిచెనేని, వాఁడు కడుఘోర మగురౌరవమునఁ గూలు.[128]

206


ఆ.

అన్నకాంక్షు లైనయఖిలజనంబులఁ, దనిపిగాని కుడువఁ దనకుఁ జనదు
మునుపు దా భుజించి వెనుక నతిథి కిడు, వాఁడు గూలు రౌరవంబునందు.[129]

207


తే.

స్నానమును దర్పణంబును సంధ్యయును జ, పంబు దైవతపూజ హోమంబు వైశ్వ
దేవమును మఱి యతిథిపూజావిధంబు, మాని భుజియించుటెల్లను మలము దినుట.

208


తే.

అన్నదానంబు చేసినయమ్మహాత్ము, నకును బలము నారోగ్యంబు ప్రకటశుభము

నై యరిష్టాత్మకము లైనయరులవలని, భయము నభిచారకృత్యముల్ పరిసిపోవు.[130]

209


వ.

కావున గృహమేధి యథాప్రకారంబున స్నానతర్పణసంధ్యాజపదేవపూజాగ్ని
హోత్రవైశ్వదేవబలిహరణంబులు నిర్వర్తించి యన్నార్థు లైనయభ్యాగతులం
బూజించి ప్రశస్తమణిముద్రికాధరుండును ధవళవస్త్రయుగ్మపరివృతుండును గంధ
పుష్పాలంకృతుండును శుద్ధోదకార్ద్రపాదహస్తుండును నాచమనక్రియాపరిశుద్ధ
వదనుండును నై యపరదిశాముఖుండు గాక పూర్వాభిముఖుండై సుఖాసనం
బునం గూర్చుండి ప్రశస్తశుద్ధపాత్రంబులందు సర్వగుణసంపన్న యైనధర్మపత్ని
వడ్డింప నిజశిష్యపుత్రబంధుమిత్రసహితుండై భుజియించుచు.[131]

210


తే.

మునుపు మధురాన్నములు చవిగొనియెనేని, నడుమ లవణామ్లతిక్తముల్ నంజెనేని
పిదప కటుకార్ద్రభోజనం బొదవెనేని, బలము నారోగ్యమును జాల గలిగియుండు.[132]

211


వ.

ఇవ్విధంబునఁ బంచప్రాణాహుతిపూర్వకంబుగా భుజియించి యుచ్ఛిష్టవార
ణార్థంబుగాఁ బాణిపాదప్రక్షాళనంబులు చేసి స్వస్థప్రశాంతచిత్తుండై కూర్చుండి
యభీష్టదేవతాస్మరణంబు చేసి భోజనంబు సుఖజీర్ణంబుగా నగస్త్యబడబానల
స్తోత్రంబు లనుష్ఠించి యనాయాసం బైనయానంబున నుచితప్రయోజనం
బులు నడపి వేదశాస్త్రప్రసంగంబులం బొద్దుపుచ్చి యపరసంధ్యావిధులు నిర్వ
ర్తింపవలయు.[133]

212


తే.

రేపు చుక్కలఁ జూచుచు మాపు తిమిర, వైరిఁ జూచుచు సంధ్య వార్వంగవలయు
నట్టివేళలు దప్పించి యాచరించు, నిత్యసంధ్యావిధానముల్ నిష్ఫలములు.[134]

213


వ.

కావున యథాకాలంబున సంధ్యావందనంబు దీర్చి తాంబూలచర్వణం బొన
రించి శయ్యాతలంబునం బవ్వళింపవలయు.

214


ఆ.

కుక్కిపడిన మిగులఁ గొంగోడువోయినఁ, గుఱుచయైన విఱిగి కొంచెమైన
మలినమైన నేఁత పలచనైనను నల్లు, లున్న నుల్కమంచ మొప్ప దండ్రు.[135]

215

తే.

పట్టెమంచంబు దలగడ పఱుపు దెరయు, మేలుకట్టును బొడవైనమేడమీఁదఁ
జల్లగాలియు ధూపవాసనలు నున్న, యట్టిశయ్యకుఁ జని నిద్ర నందవలయు.

216


తే.

తూర్పుదక్షిణములలోన దొరికినట్టి, దిక్కు తలగడ గాఁగ నిద్రించెనేని
మేలు తక్కినదిక్కులు మేదినీశ, యధికరోగంబు గావించు ననిరి బుధులు.

217


తే.

అనఘ పురుషనక్షత్రంబు లైన జ్యేష్ఠ, మొదలుగాఁ గలనక్షత్రముల నయుగ్మ
కములనై నను ఋతుదివసములనైనః, దనకులాంగనఁ గవయుట ధర్మ మగును.[136]


సీ.

పరకాంత ముట్టైనపడఁతి నన్యాసక్త యైనతొయ్యలి దుఃఖి యైనచెలువ
సంతసం బెఱుఁగనిసతి ననాచారంపుటిభయాన బాలింత యిగురుబోఁడి
నిష్ఠమాలినలేమ నిర్మోహి యగుకొమ్మ కలహంబు వెట్టెడికమలవదన
రతులు నేరుపు లేనిరామ జారయుఁ జోర కుమతి యౌ నెలనాఁగ కూటిపేద


తే.

యైన మృగనేత్ర పరితుష్ట యైనయువతి, తన్ను మెచ్చనితన్వంగి దమ్ములంబు
నీనిపద్మాస్య కడురోగి యైనయువతి, రతి యొనర్పంగఁ గోఱగాదు రసికులకును.[137]

219


సీ.

రతితంత్రములయందుఁ బ్రౌఢయై తనమీఁద నత్యంతభయభక్తు లతిశయిల్ల
సౌకుమార్యముచేత నేకొదవయులేక సుందరాకారత సొంపు గలిగి
సరసశృంగారవేషముల నెంతయు మించి యుచితప్రియాలాపరచన లెఱిఁగి
వినయవిధేయవివేకశీలతలచే ననుకూలమును నెఱతనము నేర్చి


తే.

నిర్మలాంగియు నిపుణయు నిర్మలాభి, జాత్యయును బుణ్యవతియును సతియునైన
తనకులాంగన రతికేళిఁ దనిపెనేని, యతని కైహికలోకసౌఖ్యములు గలుగు.[138]

220


తే.

అనఘ విను పౌర్ణమాసుల నమవసలఁ జ, తుర్ధసులయం (?)దష్టమీప్రదోషములను
సంక్రమణములయందును సతుల రతుల, ననుభవింపంగ రాదని రార్యులెల్ల.

221


తే.

చైత్యచత్వరగోష్ఠశ్మశానతీర్థ, వారిశృంగాట కారామవాహినీసు
రాలయగ్రామమధ్యంబులందుఁ బగలు, సతులఁ గవిసిన దోషంబు సంభవించు.[139]

222


మ.

పరకాంత న్మదిలోననైనఁ దలఁపం బాపంబు దుఃఖంబునుం
బరివాదంబును నొంది ఘోరనరకప్రాప్తవ్యథల్ పెక్కువ

త్సరముల్ చెందుదు రట్టియన్యవనితాసంభోగదోషంబు దా
నరనాథోత్తమ యింత యంత యనియెన్నన్ వచ్చునే నేరికిన్.[140]

223


క.

కావునఁ బరకాంతారతి, గావింపక ధర్మమార్గగతి దప్పక యి
చ్ఛావృత్తి నాత్మభామిని, తో వేడుక సలుపవలయు దురితవిదూరా.

224


వ.

అని చెప్పి మఱియు నిట్లనియె.

225


సీ.

దేవతాగోబ్రాహ్మణావలిఁ బొడగన్న మ్రొక్కి సంధ్యాద్వయంబును దిశాధి
పతులఁ బ్రార్థించి తప్పక యగ్నిహోత్రంబు లొనరించి తెల్లగా నుదికినట్టి
మణుఁగుఁజీరలు గట్టి మణిభూషణముఁ బెట్టి కస్తూరితోఁ గమ్మగంద మలఁది
సురుచిరం బైనట్టి చొక్కంపుఁబూదండ లొఱపుగా శిరమున నొప్పఁ దాల్చి


తే.

మస్తకంబును నొడలును మాయనీక, యేకశయ్యనై పవళించి యిచ్ఛవచ్చి
నపుడు భోగించి బహుభాష లాడఁబోక, శాంతుఁడై యుండవలయును సజ్జనుండు.[141]

226


క.

పరకాంతపొందుఁ గోరక, పరధనములమీఁద నాస పాటింపక యె
వ్వరితోడఁ గల్లలాడక, సరసుండై యుండవలయు సజ్జనుఁ డధిపా.[142]

227


క.

వినియెడువారికి హితమై, నను సత్యముఁ దప్పఁజనదు నానయు భయమున్
మనమునఁ దలఁపక పరులను, బనివడి దూషించెనేని పాపము వచ్చున్.[143]

228


తే.

పరులతోడుత వైరంబు బంధురోష్ట్ర, వాహనారోహణంబును వానకాల
మేటిదరినీడ నిద్రింప నేగుటయును, గడుఁబ్రమాదంబు లగు నండ్రు కార్యవిదులు.

229


మ.

పతితుం దస్కరు వెఱ్ఱివానిఁ బగతున్ బాపాత్మునిన్ బంధకీ
పతి నీచున్ వ్యభిచారు సత్యరహితున్ భ్రాతృవ్యు వారాంగనా
రకు నత్యంతఋణస్థు దుర్జను ననారంభున్ సురాపానమో
హితు బాలుం బరమాప్తుఁ జేయుటలు గా దెవ్వారికిన్ భూవరా.[144]

230

ఆ.

ఒంటిఁద్రోవఁ జనుటయును నిండి పాఱెడి, యేటిలోన నుఱికి యీఁదుటయును
దహనమైనయిల్లు దఱియఁ జొచ్చుటయుఁ బ్ర, మాదమండ్రు బుధులు మనుజనాథ.[145]

231


క.

పలుమాఱు బిట్టునవ్వుట, పలు గొఱుకుట యనుచితములు భాషించుట వి
చ్చలవిడిఁ దుమ్ముట యూరక, తలఁ పుడుకుట దుష్టచేష్టితము లెవ్వరికిన్.[146]

232


క.

ఊరక పుడకలు విఱుచుట, వైరంబున నొరులతోడ వాదడుచుట దు
ర్వారగతిఁ బరువు వాఱుట, గోరన్ గో రొలుచుటెల్లఁ గొఱగాదు సుమీ.[147]

233


క.

ఊరక మీసము గొఱుకుట, వారక పాదమున నేలవ్రాయుట చెక్కుల్
సారెకు చేతులఁ బిసుకుట, పౌరుషముల కెల్ల హాని పాటిల్లు నృపా.[148]

234


క.

రాత్రి యమేధ్యముతో న, క్షత్ర గ్రహవిమలతారకాపఙ్క్తులపై
నేత్రములు నిల్పి చూచుట, ధాత్రీశ్వర దోషమండ్రు తత్వజ్ఞు లిలన్.[149]

235


క.

భాను నుదయాస్తమయములఁ, బీనుఁగుఁబాడియను రతులఁ బెనఁగెడువారిన్
మానినుల నగ్నరూపుల, భూనాయక చూడఁజనదు పుణ్యాత్ములకున్.[150]

236


ఆ.

అసతియింటిలోన నారామములను శృం, గాటకముల వల్లకాటిలోన
యుద్ధభూమిలోన నుగ్రాటవులయందు, నొక్కరుండ రాత్రు లుండఁజనదు.[151]

237


ఆ.

శూన్యగృహములందు శూన్యదేశంబుల, నొంటి నెట్టివార లుండఁజనదు
గురుజనముల భూమిసురులు దేవతలను, నెదురుకొనినఁ దొలఁగి యేగవలయు.

238


క.

బలిభస్మంబును గంటక, ములు విష్ఠయు ఛిన్నకేశములు నెమ్ములు నెం
గిలియును స్నానార్ద్రమహీ, తలముం ద్రొక్కంగఁ జనదు ధర్మజ్ఞులకున్.[152]

239


క.

పలుమఱు గొమ్ములు గోఱలు, గలిగినజంతువులఁ జేరఁగాఁ జన దెదురెం
డలు మంచు నెదురుగాలియు, దలసోఁకినఁ దెవులు వచ్చు ధరణీనాథా.[153]

240


తే.

లోన దోవతి గట్టక మానవేంద్ర, నిద్రవోవను నడవను నీతిగాదు

తల విరియఁబోసికొని యొంటి వెలికివచ్చి, రాత్రి నిలుచుండఁ గాదండ్రు రాజముఖ్య.

241


క.

జగడము పెండ్లియుఁ దనతోఁ, దగుచోటులఁ జేయవలయుఁ దా నందఱతోఁ
బగగొని వర్తించినఁ గీ, డగుఁ గాని శుభంబు నొంద దనిరి మహాత్ముల్.

242


క.

బలవంతుతోడఁ బగయును, బలహీనునితోడఁ జేయు బంధుత్వముఁ దాఁ
గిలిధన మిచ్చియు నూరక, కలహమునకుఁ గాలుద్రవ్వఁగారాదు సుమీ.

243


ఆ.

కాలు కాలఁ దోమి కడుగుట వెండ్రుకల్, విడిచి త్రిప్పుకొనుట నడుచుచుండి
కూడు గుడిచి నీళ్లు గ్రోలుట నిలుచుండి, యాచమించు టొప్పదనిరి బుధులు.

244


ఆ.

వానయైన నెండవచ్చిన గొడు గవ, శ్యంబు వలయు రాత్రి యడవిలోనఁ
దిరుగునపుడు గుదియ ధరియింపవలయును, గాలఁ జెప్పు లిడక కదలరాదు.[154]

245


క.

కెలఁకులమీఁదను దూరము, బలుమఱుఁ జూడంగఁ జనదు పయనంబునఁ గో
డెలకాఁడి యంతద వ్వెడ, గలుగఁగ ముందఱను దృష్టి గదురగవలయున్.

246


వ.

ఇట్లు నీతిపరుండై నిజకులాచారం బైనధర్మంబు వదలక ధర్మార్థకామంబులయందు
సమదర్శియై పాపకర్మంబులు పరిహరించి సమస్తభూతంబులయందు స్నేహార్ద్ర
చిత్తుండై యరిషడ్వర్గంబునందు బద్ధుండు గాక సదాచారసంపన్నుండై సాత్వి
కంబు వదలక పరపీడయుఁ బరనిందయుఁ జేయక తనజీవనంబు సకలప్రాణిసంఘం
బులకు నవికారభూతంబుగాఁ ద్రికరణశుద్ధిగా వర్తించుపుణ్యపురుషుండు పుణ్య
లోకప్రాప్తుం డగు నని చెప్పిన నమ్మహీవల్లభుం డిట్లనియె.[155]

247


క.

భృగువంశోత్తమ నీచే, నగణితముగ వినఁగఁ గలిగె నఖిలము విశదం
బుగ నింక నాకు నపరం, బగుపైతృకకర్మకాండ మది వినవలయున్.[156]

248

పైతృకకర్మక్రమమును వివరించుట

వ.

అనిన భార్గవనందనుండు రాజనందనున కిట్లనియె.

249


తే.

పెద్దనిదురకు మాఁగన్ను పెట్టుచున్న, మానవునిఁ దెచ్చి దక్షిణమస్తకంబు
గా మహీశయ్య నునిచి యుత్క్రాంతిదాన, మవనిదేవోత్తమున కొక్కయావు నిచ్చి.[157]

250


తే.

అచ్యుతానంతగోవింద యనుచుఁ బద్మ, నాభునామత్రయోచ్చారణంబు చేసి

ప్రాణవాయువు దొలఁగినయంతమీఁద, విధియుతంబుగఁ దత్కాలవిధులు దీర్చి.[158]

251


తే.

అగ్నిసంస్కారకర్మంబు లాదిగా స, మస్తవిధులును వేదోక్తమార్గములను
బెరయఁజేసి తిలోదకపిండదాన, ములు యథావిధిఁ గావింపవలయు నెఱిఁగి.[159]

252


క.

ద్విజులకుఁ బదిదినములు భూ, భుజులకుఁ బండ్రెండుదివసములు విట్ఛూద్ర
వ్రజములకుఁ బక్షమాసము, లు జనాధిప సూతకంబులు సుమీ వరుసన్.[160]

253


వ.

ఇట్లు సూతకాంతదివసంబున నేకోద్దిష్టంబును మఱునాఁడు సపిండీకరణంబును
జేసి సంవత్సరపర్యంతంబు నేకోద్దిష్టంబు చేయునది ప్రతిసాంవత్సరికమృతాహం
బున నన్నశ్రాద్ధంబు చేయవలయు.[161]

254

నిమంత్రణబ్రాహ్మణనిరూపణము

సీ.

ఆచార్యుఁ ద్రిమధుఁ ద్రిణాచికేతుని ద్రిసువర్ణు నానావేదపారగుని ష
డంగవేదిని విష్ణుసంగతహృదయుని యోగీశ్వరుని శ్రోత్రియుని మఖేజ్యు
వివిధసామజ్ఞు ఋత్విజు మేనయల్లుని నల్లుని దౌహిత్రు నతనితండ్రిఁ
బంచమహాయజ్ఞపరు మేనమామను వియ్యము నురుతపోవిభవు శిష్యు


తే.

మాతృపితృభక్తుఁ గారుణ్యమయు గుణాఢ్యు, నిర్మలాచారసంపన్ను నియమహృదయుఁ
బైతృకశ్రాద్ధమునకును బ్రాహ్మణార్థ, మర్థిఁ గావింపవలయును బార్థివేంద్ర.[162]

255


సీ.

మిత్రవంచకుని స్వామిద్రోహి నతినీలదంతు జారునిఁ బరదారగమను
వేదపరిత్యాగి వేదవిక్రయు సోమవిక్రయు హరికథావిముఖు బధిరు

వృషలీతనుభవుని వృషలీవిభుని గృహదాహకుఁ గానీను ధర్మరహితు
గ్రామయాజకుఁ గొండెగాని మాతాపితృభక్తిహీనునిఁ బదభ్రష్టుఁ గునఖిఁ


ఆ.

గుష్ఠరోగిఁ గుండుఁ గోళకు నతివృద్ధు, బేడి దేవలకునిఁ బిన్నపడుచు
వానిఁ బైతృకమున బ్రాహ్మణార్థము చెప్ప, వలవదండ్రు బుధులు వసుమతీశ.[163]

256


ఆ.

యోగ్యులైన బ్రాహ్మణోత్తములను దొలు, నాటిరాత్రి భోజనంబు పిదపఁ
బైతృకార్థముగను బ్రాహ్మణార్థము చెప్ప, వలయు వినయగౌరవములతోడ.

257


క.

స్త్రీసంభోగము గమనా, యాసముఁ గోపంబు నుడిగి యతినియమముతో
భూసురులుఁ దాను శాంత, వ్యాసత యజమానుఁ డుండవలయు నరేంద్రా.

258


క.

పైతృకకర్తలు భోక్తలు, నాతులతో రతులు సలిపినను వారలెపో
పాతకులు వారిపితరులు, రేతములోఁ గూలుదురు ధరిత్రీనాథా.[164]

259


క.

కావునఁ గర్తయు భోక్తయు, భావపరిజ్ఞానశుద్ధిఁ బాటించి ధరి
త్రీవరసుస్నానాదులు, గావించినపిదపఁ గుతపకాలమునందున్.[165]

260


క.

తనయింటికి విప్రులఁ గొని, చని శాస్త్రార్థంబు గాఁగ సంకల్పముతో
నొనర క్షణాదికృత్యము, లొనరిచి పాదములు గడిగి యుచితప్రీతిన్.[166]

261


వ.

ఆసనంబులం బ్రవేశంబు చేయించి.

262


తే.

విశ్వదేవార్థ మిరువురు విప్రవరులఁ, బ్రాఙ్ముఖంబుగ నొనరించి పైతృకార్థ
మవనిదివిజుల మువ్వుర నలవరించి, యుత్తరాభిముఖులుగఁ గూర్చుండఁబెట్టి.[167]

263


వ.

పితృపితామహప్రపితామహుల నిజగోత్రనామోచ్చారణపూర్వకంబుగా వసు
రుద్రాదిత్యరూపంబుల నమ్మహీసురులం బూజించి వర్గత్రయస్వరూపంబుగా నా
వాహనగంధపుష్పాదు లైనసర్వోపచారంబులును విధిప్రకారంబుగ నాచరించి

విశ్వదేవతలకు స్వర్ణపాత్రంబులను పితృదేవతలకు రజతపాత్రంబులను బెట్టి
యగ్నౌకరణంబులు దీర్చి హుతశేషాన్నంబు పితృపాత్రంబులం బెట్టి రక్షోఘ్న
మంత్రంబు లనుష్ఠించుచుఁ దనవలన సంపాదింపబడినయన్నంబును బాయసా
పూపసూపవ్యంజనంబులును వడ్డించుసమయంబున.[168]

264


తే.

అతిథి తనయింటి కన్నార్థి యగుచు వచ్చె, నేని విప్రులయనుమతి నెదురుపోయి
తోడుకొనివచ్చి సద్భక్తితోడ వారి, పఙ్క్తియందును విష్ణురూపముగఁ దలఁచి.

265


తే.

భోజనము సేయఁబెట్టిన భూవరేణ్య, పైతృకం బొప్పు సర్వసంపన్న మగుచు
నతిథి యపుడు తిరస్కృతుం డయ్యెనేని, బైతృకక్రియ వృథ యని పల్కె శ్రుతులు.

266


తే.

దేవతామూర్తి యగునట్టిదివ్యయోగి, వివిధభంగుల నజ్ఞాతవృత్తితోడ
నవనిఁ జరియించునట్టియభ్యాగతులను, బూజసేయక యుండినఁ బుణ్యహాని.[169]

267


తే.

రాజవల్లభ వేదశాస్త్రములయందు, వినవె “యభ్యాగత స్స్వయం విష్ణు” వనఁగ
నతిథిసంతర్పణము వెలియైనఁ బుణ్య, మేమి యున్నది యజ్ఞంబు లేల సేయ.[170]

268


వ.

ఇవ్విధంబున నభ్యాగతసమేతంబుగాఁ బైతృకంబు సేయునప్పుడు బ్రాహ్మణోత్త
ములు మౌనంబుతో యథేష్టంబుగా భుజియించినయనంతరంబ తదుచ్ఛిష్టసన్నిధి
యందు మంత్రపూర్వకంబుగా పితృపితామహప్రపితామహులకుఁ బిండదానం
బు చేసి పితృతీర్థంబునం దిలోదకంబు లిచ్చి పాణిప్రక్షాళనానంతరంబున బ్రాహ్మ
ణాశీర్వాదంబులు వడసి యథాక్రమంబున సత్కారంబులు చేసి వారి ననిచి
పుచ్చి వారియనుమతంబున వైశ్వదేవంబును బలిహరణంబును దీర్చి సకలబంధు
సమేతంబుగా భోజనంబు చేసి కృతార్థుండై యుండవలయు.[171]

269


తే.

పైతృకశ్రాద్ధ మొనరింపఁ బరమభక్తి, యు క్తిలేక దురాత్ముఁడై యుండెనేని
మాలఁడై పుట్టుఁ గోటిజన్మములయందు, ననుచుఁ బలుకుదు రార్యులు మనుజనాథ.

270


క.

సారంగము మనుఁబోతును, సైరిభమును గొఱియ దుప్పి శశము నకులమున్
వారిచరంబును మేఁకయు, నారయఁ బలపైతృకమున కర్హ మగుఁ జుమీ.[172]

271

శ్రాద్ధయోగ్యాయోగ్యద్రవ్యప్రశంస

ఆ.

యవలు వడ్లు చామ లావాలు మినుములు, తిలలు పెనలు గోదుమలు ప్రియంగు
వులు వనంబులందుఁ గలయోషధులు మేలు, శ్రాద్ధకర్మములకు సంతరింప.[173]

272


క.

ఉలవలు కందులు కోద్రవ, ములు కంబులు రాజమాషములు ననుములు చో
ళ్లులు తమిఁదలు నూఁదరలును, గలవని యిడఁజనదు పైతృకమునకు నధిపా.[174]

273


ఆ.

మునగకాయ యుల్లి ముల్లంగి గుమ్మడి, కాయ నేతిబీఱకాయ పుచ్చ
కాయ నక్కదోసకాయ వట్రువసొర, కాయ గాదు శ్రాద్ధకర్మములకు.

274


ఆ.

గోఁగుకూర యీలకూర చెంచలికూర, తుంటికూర పొన్నగంటికూర
నల్లతోఁటకూర పుల్లబచ్చలికూర, శ్రాద్ధములకుఁ గాదు సంతరింప.[175]

275


ఆ.

గొఱియ మేఁక కడితి గోడిగ యెనుఁబెంటి, గార్దభములపాలు గావు పూతి
గంధఫేనిలములఁ గల్గినజలములు, గావు శ్రాద్ధములకు భూవరేణ్య.[176]

276


ఆ.

పాపకర్ము వేదబాహ్యుని నతిరోగిఁ, గుక్క నక్కఁ బిల్లిఁ గ్రోతి గోడి
గ్రామసూకరంబు గార్ధభంబును నగ్నుఁ, గాదు చూడఁ బైతృకంబునాఁడు.[177]

277


వ.

ఇవ్విధంబున శ్రాద్ధంబు యథాకాలయోగ్యంబుగా నాచరించిన మహాత్ములు కృత
కృత్యు లగుదు రని చెప్పిన సగరచక్రవర్తి కృతార్థుండై యౌర్వోపదిష్టమార్గం
బున సదాచారసంపన్నుండై సుఖంబుండె నని చెప్పిన మైత్రేయుం డిట్లనియె.[178]

278


తే.

అనఘ పైతృకదివసంబునందు నగ్నుఁ, జూచినను కడుదోషంబు సోఁకు ననుచు
నాకుఁ జెప్పితి నగ్నుఁ డనంగ నెట్టి, వాఁడు తెలియంగ నానతీవలయు ననిన.

279

నగ్నలక్షణము

ఉ.

ధీమతిఁ జిన్ననాఁ డఖిలదేవతలన్ భజియించి ఋగ్యజు
స్సామము లభ్యసించి బహుశాస్త్రపరాయణుఁడై మహీసురుం
డేమియు బుద్ధిలేక శ్రుతు లెంతయు నింద యొనర్చు వానిఁ బో
పామరుఁడైన నగ్నుఁడని పల్కిరి వేదవిదుల్ మునీశ్వరా.[179]

280

ఆ.

వేద మభ్యసించి వేదమార్గంబులు, విడిచిపెట్టి దుర్వివేకబుద్ధి
బహుమతముల నడుచు పాషండుఁడే నగ్ను, డతనిఁ జూచి యర్థ మాడవలదు.[180]

281


వ.

నగ్నసంభాషణంబు లనేకపాతకహేతుభూతంబు లేతద్విషయం బైనయొక్క
యితిహాసంబు గలదు తొల్లి శంతననందనుం డైనభీష్మునకు మత్పితామహుం
డైనవసిష్ఠుండు వినిపించునప్పు డేను తెలివిపడ వింటి నత్తెఱంగు వినుము.[181]

282


ఉ.

పూర్వమునన్ హిరణ్యకశిపున్ గమలాక్షుఁడు నారసింహుఁడై
గర్వ మడంచి దేవతలఁ గాచిననాటివిరోధ మాత్మలో
నోర్వఁగలేక వానితనయుం డగుహ్లాదుఁడు దైత్యసేనతో
నుర్వియు నింగియుం బగుల నొక్కట నార్చుచు వచ్చి యుగ్రుఁడై.[182]

283


మత్తకోకిల.

నాకలోకముమీఁద ఘోరరణం బొనర్చిన భీతులై
పాశశాసనుఁ డాదియైనసుపర్వులందఱు దేవతా
నీకసేవితుఁ డైననీరదనీలవర్ణుని నుత్తమ
శ్లోకునిం బరముం బయోరుహలోచనున్ భజియించుచున్.[183]

284


మ.

చని దుగ్ధాంబుధియుత్తరంబున వళక్షద్వీపమధ్యంబునన్
ఘనచింతామణిశైలకందరమునన్ గల్పద్రుమోద్యానశో
భనదేశంబులయందు నుజ్జ్వలతపఃపారీణులై యుండి రా
వనజాతాక్షసహస్రనామపఠనవ్యాపారపారీణులై.[184]

285


తే.

కోరి యిబ్భంగి నత్యంతఘోరతపము, సేయుచుండంగఁ ద్రైలోక్యనాయకుండు
భక్తలోకైకరక్షణోపాయుఁ డగుచు, నతులకారుణ్యరసహృదయంబుతోను.[185]

286


పంచచామరము.

సముజ్జ్వలంబు లైనశంఖచక్రముల్ కరంబులం
దమర్చి పక్షివాహనంబునన్ బసిండిచీరతో
సమస్తదివ్యమౌనికోటి సన్నుతించి మ్రొక్కఁగా
రమావిభుండు వచ్చె నిర్జరవ్రజంబుపాలికిన్.[186]

287

వ.

ఇట్లు ప్రత్యక్షంబైన.

288


శా.

దేవేంద్రప్రముఖాఖిలామరవరుల్ దేదీప్యమానప్రభా
శ్రీవిభాజితమూర్తియై వెలుఁగు లక్ష్మీదివ్యవక్షస్స్థలున్
భావంబుల్ వికసింపఁ జూచి గరిమన్ భక్తిప్రణామంబు లి
చ్ఛావృత్తుల్ దళుకొత్తఁజేసి నుతిసేయం జొచ్చి రత్యున్నతిన్.[187]

289


లయగ్రాహి.

ఆదిపురుషోత్తమ యనాదినిధ నాసురని
                    షూదన సుఖామృతరసోదన రమాసం
పాదన మహోగ్రభవశాదశుచివాసరక
                    రోదయ వినమ్రజనఖేదహారణా ప్ర
హ్లాదహృదయస్థిత మహాదురితసంహరణ
                    వేదమయ దుర్జనవివాదహ జగత్ప్రా
ణాదరిపువాహన పయోదనిభగాత్ర సన
                    కాదిమునివంద్య కమలోదర నమస్తే.[188]

290


చ.

అనుచును బెక్కుచందముల నంబుజనాభునిఁ బ్రస్తుతించి యో
వనరుహనేత్ర భక్తజనవత్సల యోజగదీశ యేము వ
చ్చినపను లాదరించి విని చిత్తమునం గలయట్లు చేయవే
యనుచు వినమ్రవృత్తి నపు డయ్యమరావలి భక్తి నిట్లనున్.

291


ఉ.

ధీరత లోకముల్ వొగడ దేవర నాఁడు నృసింహమూర్తివై
భూరిబలున్ హిరణ్యకశిపుం బరిమార్చి నిలింపరాజ్యల
క్ష్మీరమణీయవైభవవిశేషము లింద్రుని కిచ్చినట్టియా
వైరము కారణంబుగ నవార్యబలోన్నతి చెంగలింపఁగన్.[189]

292


ఉ.

వానిసుతుండు హ్లాదుఁ డనువాఁడు భయంకరవీరదైత్యసే

నానికురుంబుఁడై కదలి నాకము సర్వముఁ గొల్లలాడి దు
ర్మానమదప్రతాపమహిమల్ విలసిల్లఁగ యజ్ఞభాగముల్
తానె హరింపఁజొచ్చె సురలన్ నిరసించుచు దుండగంబునన్.[190]

293


శా.

దేవా దేవరయందు ము న్నుదయమై దేవాంతకశ్రేణియున్
దేవవ్రాతము దత్తదుక్తవిధులన్ దీపించునట్లయ్యు ల
క్ష్మీవక్షస్స్థల యజ్ఞభాగముల శేషీభూతముల్ గాఁగ మా
కీ వర్థిం గృపసేసినాఁడ వవి మా కీరానిశాటావలుల్.[191]

294


క.

వేదములును శాస్త్రములును, వేదాంగములున్ బఠించి వివిధక్రతువుల్
మోదమునఁ జేయుచున్నా, రాదనుజులు బెరుకు లేనియాచారములన్.[192]

295


ఉ.

కావున వేదమార్గములు గైకొని యజ్ఞము లాచరించుదై
త్యావలితోడ మార్కొని జయంబు గొనంగ నశక్తులైన యీ
దేవతలన్ గృపాకలితదృష్టిఁ గనుంగొని తద్వినాశకే
లీవిధ మాచరింపుము నిలింపశుభార్జిత పాపవర్జితా.[193]

296


క.

అని విన్నపంబు చేసిన, దనుజకులాంతకుఁడు దేవతావర్గములున్
ఘనతరకరుణారసలో, చనములు వికసిల్లఁ బల్కె సదయుండగుచున్.

297


క.

దైతేయులు మీ చెప్పిన, భాతిని నిజవర్ణధర్మపరిచితుమతులై
శ్రౌతస్మార్తక్రియలం, దాతురులై యున్నవార లమరులకంటెన్.[194]

298


తే.

వేదవేదాంగమార్గముల్ విడువ కెవ్వఁ, డేని నిజవర్ణధర్మభూయిష్ఠుఁ డగుచు
నుండు నావీర్యవంతుని నోర్వ నెట్టి, వారుఁ జాలరు కడునిక్కువంబు వినుఁడు.[195]

299


క.

ఆదనుజదైత్యవీరుల, వేదబహిష్కృతులఁ జేసి వీర్యము బలమున్
భేదించి విజయమును సం, పాదించెద మీకు నెల్లభంగుల ననుచున్.[196]

300

మాయామోహుండు తనమాయోక్తులచే నసురుల వేదబాహ్యులుగాఁ జేయుట

క.

తనమూర్తియందు నొకపురు, షుని మాయామోహుఁ డనఁగ సురుచిరతేజో

ధనుఁ బుట్టించి మురాంతకుఁ, డనిమిషవర్గములతోడ ననియె బ్రీతిన్.

301


తే.

ఈమహామహుఁ డసురులనెల్ల వేద, శాస్త్రబాహ్యులఁ జేసి పాషండకర్మ
ములకు నూల్కొల్పి పటుతేజమును బలంబుఁ, జెఱుచు నప్పుడే మీచేతఁ జెడుదు రరులు.[197]

302


వ.

అని నిర్దేశించి యద్దేవుం డంతర్ధానంబునం బొందె దేవగణంబులును మాయా
మోహసమేతులై క్రమ్మఱి నిజనివాసంబులకుం జని రంత నమ్మాయామో
హుండును.

303


తే.

బర్హిపత్రధరుండు విస్పష్టముండ, మ స్తకుండును మఱి దిగంబరుఁడు జైన
శాస్త్రశీలుండు నై సర్వజనులఁ దనదు, మాయఁ జొక్కించుచును గరిమంబుతోడ.[198]

304


తే.

నర్మదాతీరమునఁ దపోనవ్యవృత్తి, నెనయుదానవవిభులస్ననిధికిఁ బోయి
వరుస దీవించి వారిచే వలయుపూజ, లంది యుచితసల్లాపంబు లాచరించి.[199]

305


క.

అతిమధురము నతిశాంతము, నతివినయము నతిహితంబు నగునర్థములన్
బ్రతిభ గలవాక్చమత్కృతి, దితిజుల నీక్షించి పలికె దివిజులు పొగడన్.

306


క.

మీ రిహలోకసుఖంబులు, గోరియెు పరలోకసుఖము గోరియొ కడుదు
ర్వారగతి దపము సేసెద, రారసి నా కెఱుఁగఁజెప్పుఁడని పలుకుటయున్.

307


తే.

అనఘ మా కైహికములపై నాసలేదు, పరమపావనకైవల్యపదము నందఁ
జేయుచున్నార మీతపస్సిద్ధి మాకు, నగువిధం బెట్లు తెలియంగ నానతిమ్ము.[200]

308


వ.

అనిన నతం డిట్లనియె.

309


తే.

మీకు నావచనంబులమీఁదఁ బరమ, మైనవిశ్వాస మొదవినయట్లయేని
[201]యైహికాముష్మికములప్రయత్నమెల్ల, వివరముగ మీకుఁ జెప్పెద వినుఁడు తెలియ.[202]

310


తే.

బ్రతికియుండినయన్నాళ్లుఁ బరమసౌఖ్య, మైన యైహిక మగుఁ జచ్చినపుడె ముక్తి
నాఁగఁ బరలోక మనఁగ నెక్కడిది దీని, నరసి మీవంటిపురుషు లె ట్లరిగినారు.

311


క.

ఎంతతప మాచరించిన, నెంతవివేకమునఁ జదువు లెఱిఁగిన దైవం
బెంతగలదన్న నిన్నియు, భ్రాంతిజ్ఞానములు గాక పరమార్ధములే.

312


ఉ.

కావున వేదశాస్త్రములు గల్లలు యజ్ఞము లాచరించినన్
గోవధపాతకంబు సమకూరుట తథ్యము ముక్తిసౌఖ్యపుం

ద్రోవ లెఱుంగఁగోరిన వినుం డధమాధమవైదికక్రియల్
పోవిడువుండు మామతముఁ బొందుఁడు పొందుఁడు ముక్తికామినిన్.[203]

313


వ.

అని యనేకవిధంబుల వేదనిందాసమర్థంబు లైననాస్తికశాస్త్రంబులు ప్రసంగిం
చిన నాదైతేయులు మాయామోహవాక్యంబులకుం జొక్కి పూర్వపరిచితంబు
లైన వేదంబులు విడిచి దురాచారులై జైనచార్వాకబౌద్ధమతంబులు గైకొని
పాషండవరు లై యందఱు వేదతంత్రంబు లైనయజ్ఞంబుల నిందసేయుచు
వైదికకర్మబాహ్యు లైరి మఱియును.[204]

314


క.

అరుణాంబరధరుఁడై య, ప్పురుషుఁడు వెండియును దనుజపుంగవుల నిరం
తరవేదమార్గరతులన్, నిరతము దుర్మార్గవృత్తి నెగడం జేసెన్.[205]

315


వ.

అంత నొక్కనాఁడు దనుజపరివృతుం డైనయప్పురుషుండు యజ్ఞంబు సేయు
చున్న సోమయాజులపాలికిం బోయి యిట్లనియె.

316


ఆ.

జీవహింస గోరి చేసినపాతకం, బనుచు శ్రుతులు చెప్పునట్టిమీరు
జీవహింస లిపుడు సేయుచు నున్నారు, కరుణలేక దుష్టకర్ము లగుచు.

317


క.

పేర్మి సహింసా పరమో, ధర్మ యనెడితొంటిపలుకుఁ దలఁపుచు నేత
త్కర్మములు విడిచి తద్దయు, నిర్మల మగుమామతమున నిలువుఁడు గరిమన్.[206]

318


తే.

ఆహుతులు వేల్వఁగా సవనాగ్నిచేత, దేవతాజ్యేష్ఠశక్రాదిదివిజులకును
దృప్తి యగు నను చెనఁటివైదికుల నమ్మి, యేల చెడిపోయెదరు మోక్ష మెఱుఁగలేక.[207]

319


తే.

దేవపితృకార్యములకు నై ద్విజుల కన్న, మిడినవారికిఁ బరితుష్టి యెట్లు కలుగు
సొరిది ఘటముల నన్నంబుఁ జూచి తృప్తి, నొందుదురయేని మఱి యిదియును నిజంబు.

320


ఉ.

కల్లలు వేదముల్ స్మృతులు గల్లలు కల్లలు యజ్ఞకర్మముల్
కల్లలు పైతృకక్రియలు కల్లలు ఘోరతపఃప్రభావముల్
కల్లలు దేవకార్యములు గావున బైజలు మాని మామతం
బెల్లవిధంబులన్ నడుపుఁ డిమ్ముల ముక్తికిఁ బోవఁ గోరినన్.[208]

321


వ.

అని యనేకప్రకారంబులు బోధించి శ్రౌతస్మార్తబహిష్కృతులం జేసి శుద్ధపాషండ
కర్మంబులకు నూలుకొల్పిన దైత్యదానవలోకంబు లమ్మహాపాతకంబునం జేసి తేజో

బలశూన్యులై తారుదార వినాశంబు నొంది రప్పుడు దేవతలు పరమధర్మపరా
యణులును వేదమార్గవర్తులునై రాక్షసుల నశ్రమంబున సాధించి పూర్వప్రకా
రంబున యజ్ఞభాగంబు లుపయోగించుచు సుఖంబుండి రని చెప్పి మఱియును.[209]

322


క.

వేదములు విడిచి క్రతువులు, గాదని పోనాడి పైతృకంబులమేలున్
లేదని నాస్తికవిధి సం, పాదించినవాఁడు నగ్నపాషండుఁ డగున్.

323


మ.

నలి మీఱంగలబ్రహ్మచారి గృహి వానప్రస్థ యత్యాశ్రమం
బులలో నేమియు నొల్ల కాగమచయంబు న్నింద గావించుచున్
బలుదుర్మార్గము లెల్ల నిక్కములుగా పాటించుచున్ విష్ణుభ
క్తుల నిందించినవాఁడు నగ్నుఁ డని యెందుం జెప్పు వేదార్థముల్.[210]

324

శతధన్వుం డనురాజు పాషండసంభాషణదోషంబున శునకాదిజన్మంబులఁ బొందుట

తే.

అనఘ పాషండుఁ జూచిననబ్జమిత్రుఁ, జూడవలయును వానితోఁ గూడి మాట
లాడినను దుష్టజన్మంబులందుఁ బుట్టుఁ, జెలిమి చేసిన పాపంబు చెప్పరాదు.[211]

325


వ.

పాషండభాషణంబున నైనపాతకంబు తేటపడునట్టి కథఁ జెప్పెద వినుము.

326


క.

శతధనుఁ డనియెడుధరణీ, పతి తొల్లి భుజప్రతాపబంధురయశుఁడై
క్షితిఁ బాలించుచు ధర్మ, స్థితిఁ గ్రతువులు భక్తితోడఁ జేయుచునుండున్.[212]

327


తే.

అమ్మహీపతికులకాంత యధికసాధ్వి, సర్వలక్షణ సంపన్న సత్యశౌచ
వినయవిజ్ఞానరూపవివేకనిరత, శైభ్య యనునది పతిభక్తి సలుపుచుండె.[213]

328


వ.

అమ్మహీపతి కార్తీకమాసంబున నొక్కనాఁడు యజ్ఞంబు చేసి ధర్మపత్నీసహితుం
డై భాగీరథియందు నపభృథస్నానంబు చేసి తత్తీరంబున బ్రాహ్మణోత్తములకు
దక్షిణ లిచ్చుచున్నసమయంబున.[214]

329


క.

తనకు విలువిద్య మును చె, ప్పిన యాచార్యునిసఖుండు పీడావర్తుం
డనుపాషండుం డొకరుఁడు, చనుదెంచిన వానితోడ సంభాషించెన్.

330


తే.

వానిఁబొడ గని యారాజవనిత దొలఁగి, పోయి హరిచింత సేయుచుఁ దోయజాప్తుఁ
జూచి దోషవిముక్తయై క్షోణివిభుని, రాక గోరుచు నున్నంత రాజవరుఁడు.

331


క.

పాషండుని నీతిగౌరవ, భాషణములఁ దన్పి వానిఁ బన్పి ముదముతో
యోషిత్సమేతుఁడై పరి, తోషంబున వచ్చి గరిమతో మహి యేలెన్.[215]

332

వ.

అంతఁ గొంతకాలంబునకు నారాజు పంచత్వంబు నొందె నయ్యిందువదనయు
నతనితోడన యగ్నిప్రవేశంబు చేసి జన్మాంతరంబున జాతిస్మరత్వంబు గలిగి సర్వ
విజ్ఞానసంపన్నయై కాశిరాజునకుం గన్యయై జన్మించి పెరుగుచుండె నారాజును
పాషండసంభాషణదోషంబున విదిశాపురంబునం గుక్కయై పుట్టిన.[216]

333


తే.

రాజబింబాస్య జాతిస్మరత్వమహిమ, వలనఁ దనజన్మమంతయుఁ దెలిసి ప్రాణ
నాథుఁ డెచ్చోట నేమియైనాఁడొ యనుచు, నాత్మఁ దలపోసి కుక్కపుట్టగుట దెలిసి.

334


ఆ.

తండ్రి పెండ్లి సేయఁ దలఁచిన నొల్లక, పిన్నతల్లిఁ జూచు ప్రేమతోడ
నిందువదన విదిశ కేతెంచి శునకమై, యున్న ప్రాణవిభుని నొనరఁ గాంచి.

335


ఆ.

అధికదుఃఖనిరత యగుచు నేకాంతమై, నపుడు ప్రాణనాథు నల్లఁ జేరి
పరమభక్తితోడఁ బ్రణమిల్లి యింతి యిట్లనియెఁ గరపయోకుహములు మొగిచి.

336


ఆ.

నిన్నువంటిపుణ్యనిరతుఁడు పాషండ, భాషణమున నైనపాతకమున
నిట్టియధమజాతిఁ బుట్టఁగఁ బాలయ్యె, తప్పఁ ద్రోయరాదు దైవఘటన.

337


తే.

నీవు జాతిస్మరత్వంబు నిశ్చయింప, లేక యజ్ఞానవృత్తి నీలీల నధమ
జాతి నున్నాఁడ వీపాటి చాలు నింక, నీశరీరంబు విడువంగదే మహాత్మా.

338


వ.

అని పరమోపదేశంబు చేసిన యప్పుణ్యవతితోడిసంభాషణంబునం జేసి యాశున
కంబు జాతిస్మరత్వంబున నిరాహారియై కతిపయదినంబులకు శరీరంబు విడిచి
కోలాహలం బనుపర్వతంబున నక్కయై పుట్టిన యేడుగాలంబునకును.

339


ఆ.

దివ్యదృష్టి నింతి తెలిసి యచ్చోటికి, నొక్కనాఁడు వచ్చి నక్కఁ జూచి
యల్ల కుక్కతోడ నాడినవాక్యంబు, లెల్ల నాడి మగుడ వేగుటయును.[217]

340


క.

ఆసగ్గారియుఁ బుణ్య, స్త్రీసంభాషణము దనకుఁ జెందినకతనం
జేసి వివేకజ్ఞానవి, కాసంబున నుల్లసిల్ల కాననభూమిన్.[218]

341


క.

ప్రాయోపవేశమునఁ దన, కాయంబు పరిత్యజించి గ్రక్కునఁ దోడే
లై యుదయించిన నచటికిఁ, బోయి యతివ తొంటియట్ల బోధించుటయున్.[219]

342


వ.

ఆవృకంబు పంచత్వంబు నొంది వెండియు వానరంబై పుట్టి యప్పుణ్యవతివచ
నంబువలన నప్పుట్టువు విడిచి కొక్కిరయై పుట్టి యారాజవదసహితోపదేశంబు
నం జేసి యాజన్మంబు విడిచి మయూరంబై పుట్టి వేఁటకారులచేతఁ బట్టువడి

కాశిరాజునివాసంబునకు వచ్చి కన్యాంతఃపురంబునం బ్రవర్తించుచున్న నక్కన్య
యెఱింగి యత్యంతగౌరవంబునం బెంచుచున్నంత.[220]

343


ఆ.

జనకచక్రవర్తి జాహ్నవీతటమున, నశ్వమేధయజ్ఞ మాచరించి
ధర్మయుక్తి నపభృథస్నాన మాగంగ, యందుఁ జేయుచున్న యవసరమున.

344


క.

ఆపుణ్యకాలమున ధర, ణీపాలకపుత్రి తాను నెమలియునుం దే
వాపగలోపలఁ గ్రుంకెను, బాపంబులు వాయ బహుశుభంబులు గలుగన్.[221]

345


క.

ఆలోన నెమలి కతిపయ, కాలమునకుఁ గాలవశతఁ గలిగి జనకభూ
పాలునికిఁ బుత్రుఁడై గుణ, శీలవివేకముల నుల్లసిల్లుచుఁ బుట్టెన్.[222]

346


వ.

పుట్టి సంప్రాప్తయౌవనుండై పెరుగుచున్నంత కాశిరాజు తనకన్నియకు స్వ
యంవరోత్సవంబు సేయ సమకట్టి సకలరాజలోకంబులు రప్పించి కూఁతునకుం
జూపిన యప్పరమపతివ్రత పూర్వజన్మంబునం దనప్రాణవల్లభుం డైన జనకునికు
మారుని వరియించి యనేకకాలంబు దాంపత్యసుఖంబు లనుభవించె. వైదే
హుండును జాతిస్మరత్వంబు గలిగి మహాధర్మశీలుండై తండ్రిపిమ్మట సముద్రము
ద్రితవసుంధరాచక్రంబు నిర్వక్రంబుగం బాలించి కృతార్ధుండై యంతంబునం
గాంతాసమేతుండై విష్ణుసాయుజ్యంబునం బొందె అని పాషండసంభాషణ
దోషంబును నశ్వమేధంబున నపభృథస్నానవిశేషంబును బతివ్రతాగణ్యపుణ్యా
తిరేకంబునుం జెప్పి మఱియును.[223]

347


మ.

అనవేమక్షితిపాన్వయోత్తమ సముద్యద్వైభవోపేంద్ర కాం
చనభూమీధర ధైర్యశాశ్వతయశస్సంపన్న దైతేయశా
సనపూజాపరతంత్ర నామితరిపుక్ష్మాపాలకోటీర శాం
తనవప్రాభవ సత్కవీంద్రకవితాతాత్పర్య శౌర్యోన్నతా.[224]

348


క.

గుజ్జరిదట్టవిభాళ జ, గజ్జనసంస్తుత్య నిత్యకపటారివధూ
హృజ్ఙనితాప్రతితాప మ, రుజ్జప్రతిమానబల నిరూఢవివేకా.[225]

349

రంజనీవృత్తము.

కామధేనుశిబికల్పభూమిరుహకంజబాంధవతనూజచిం
తామణిప్రతిమదానశోభిత నితంబినీజనమనోజ సం
గ్రామపార్థ బలగర్వితారిపురకాలకంధర మహాకవి
స్తోమసన్నుతవచోవికాస రణశూర బంధురపరాక్రమా.[226]

350


గద్యము.

ఇది శ్రీమదమరనార్యపుత్ర హరితసగోత్రపవిత్ర సుకవిజనవిధేయ వెన్నెల
కంటిసూరయనామధేయప్రణీతం బైనయాదిమహాపురాణం బగుబ్రహ్మాండంబు
నందలిపరాశరసంహిత యైనశ్రీవిష్ణుపురాణంబునందుఁ జతుర్దశమన్వంతరప్రకా
రంబును వేదవేదశాఖావర్ణనంబులును యాజ్ఞవల్క్యచరిత్రంబును సకలపురాణ
విద్యాకీర్తనంబును యమకింకరసంవాదంబును బ్రాహణాదివర్ణధర్మంబులును
బ్రహ్మచర్యాదిచతురాశ్రమక్రమంబులును ఆచారవర్తనంబులును పాషండో
పాఖ్యానంబును శతధన్వచరిత్రంబు నన్నది చతుర్థాశ్వాసము.


———

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. జగదభిరామవపుఃపుష్పచాప = లోకమునందు మనోజ్ఞమైనశరీరముచేత మన్మథుఁడైనవాఁడా.
  2. చాతుర్వర్ణ్యోత్పత్తి = బ్రాహ్మణవర్ణము మొదలుగాఁగల నాలుగువర్ణముల సముదాయముయొక్క పుట్టుక, తిర్యగ్యోనిజన్మంబులు = పశుపక్ష్యాదులపుట్టుకలు.
  3. స్వారాజు = ఇంద్రుడు.
  4. పుష్పనారాచగురున్ = మన్మథునితండ్రిని - విష్ణువును.
  5. సాంప్రతము = వర్తమానము - ఇప్పడు జరుగునది, వనజబాంధవసుతుఁడు = సూర్యునికొడుకు.
  6. జగన్మాన్యయశులు = లోకమునందు గౌరవింపఁదగిన కీర్తిగలవారు.
  7. అగణితము = లెక్క పెట్టరానిది, అప్రమేయము = మేరలేనిది.
  8. తోయజనాభుని = విష్ణునియొక్క.
  9. విష్టము = ప్రవిష్టము.
  10. చండ = వేండ్రమైన, డాయన్ = సమీపింప, వృద్ధపరిగ్రహ = ముసలినానిఁ జేపట్టినది, వాజి = గుఱ్ఱము.
  11. తొయ్యలి = ఆఁడుది - భార్య.
  12. ఉదాసీనవచనఘనకంటకములు = ఉచ్చరింపరాని మాటలనెడి గొప్పముండ్లు, కిన్కన్ = కోపముతో.
  13. స్రుక్కి = సంకోచించి (లేక) వెఱచి.
  14. ఒండు = ఇతరము, తత్సమాగమంబునన్ = ఆకూడికచేత.
  15. తీవ్రమయూఖసహస్రకమునన్ = తీక్ణములైన వేయికిరణములయందు, కరసానన్ = కత్తులకు పదును పెట్టెడు చక్రాకారమైన సానయందు.
  16. చండకిరణంబులు = వేండ్రమైనకిరణములు, శాంతము =వేండ్రము లేనిది.
  17. రజము= పొడి, త్రిశూలము=మూఁడుమొనలు గలశూలము.
  18. తోయజవనబంధునికిన్ = కమలములపఙ్క్తులకు మిత్రుఁడైన సూర్యునివలన, పూర్వతనయప్రాయమహితున్ = మునుపటికొడుకులను బోలినమహిమగలవానిని.
  19. సంయములు =ఋషులు.
  20. దేవతాచక్రవర్తి = దేవరాజు - ఇంద్రుఁడు.
  21. పదుండ్రు = పదిమంది.
  22. భూవిదితకీర్తి = భూమియందు ప్రసిద్ధమైన యశస్సుగలవాఁడు.
  23. శ్రీమహిళావల్లభుతేజోమండితులు = శ్రీవిష్ణునియొక్క తేజస్సుచేత అలంకరింపఁబడినవారు, పద్మజునిదివసమునన్ = బ్రహ్మదినమునందు.
  24. విప్లవంబులు = ప్రళయమును పొందినవి - చెడినది, ప్రతిష్ఠ చేసి = నిలిపి.
  25. క్రతుభుజులు = దేవతలు.
  26. నిశ్శేషకల్పంబు = మిగులు లేనిదిగా లయము నొందినది, పర్యంకంబు = శయ్య, ప్రభాత సమయంబునన్ = వేగుజామున, అనల్పప్రకారంబునన్ = అల్పముకానివిధమున.
  27. సంవర్ధనులు = చక్కగా వృద్ధిపొందినవారు.
  28. ఆదేశించుచున్ = ఉపదేశించుచు.
  29. తొడరి = పూని, లీలన్ = విలాసముగా.
  30. బెరయు = ప్రసరించు.
  31. ధరణీధరుండు = విష్ణువు.
  32. చలితాఘంబు = చలించిన పాపముగలది - పాపహరము, భూజము = వృక్షము, విపక్షింపన్ = విశదవఱువ, వెలయన్ = ప్రసిద్ధముగా.
  33. హితార్థకారి = మేలైన ప్రయోజనమును చేయువాఁడు, నైజముగాన్ = స్వభావముగా.
  34. ఇతనికి హర్యాత్ముఁడు అని నామాంతరము.
  35. సంజ్ఞలు = గుఱుతులు - పేరులు, సాంప్రతంబు = ఇప్పుడు జరుగునది, అతీతంబులు = కడచినవి.
  36. అంబుజాతభవాదులు = బ్రహ్మ మొదలగువారు.
  37. వల్మీకసంభవుండు = పుట్టయందుఁ బుట్టినవాఁడు, నియుక్తుండు = నియోగింపఁబడినవాఁడు.
  38. ఆలోడింపఁగన్ = విచారింప, విశాలగతిన్ = విశేషముగా ననుట.
  39. అక్కజముగన్ = ఆశ్చర్యముగా.
  40. వేదపాదపారణ్యవిహారసింహుఁడు = వేదముల నెడువృక్షములుగల అడవియందు విహరించుటయందు సింహమైనవాఁడు. వేదములన్నియు చక్కగా చదివినవాఁడు అనుట, విరాజితభూరితపోమయుండు = మిక్కిలి ప్రకాశించునట్టి అధికతపస్సే స్వరూపముగాఁగలవాఁడు, బ్రహ్మణ్యుఁడు = వేదవిహితమైన యాచారము నడపువాఁడు, పెంపుతోన్=గౌరవముతో.
  41. కదంబములు = సమూహములు, పరిపాటి = అనుసరించునది - అంతమాత్రము అనుట.
  42. ప్రల్లదంబునన్ = ముష్కరత్వముతో, దురాచారంబు = చెడ్డనడత.
  43. కలఁగి = కలఁత నొంది.
  44. సంక్రమించినట్టి = పొందిన, ఉడుగంగన్ =అణఁగ - పోవ.
  45. దురితము = పాపము.
  46. మండుచున్ = కోపవికారమును జూపుచు.
  47. మొగమోట = దాక్షిణ్యము.
  48. ననిచిన = అతిశయించిన, కోపభరము = కోపముయొక్క అతిశయము.
  49. మెత్తఁబాటు = మృదుత్వము - దయ కలిగినతనము, రుధిరరూపంబుగాన్ = నెత్తురుగా, ఛర్ది చేసి = క్రక్కి.
  50. వాజి = గుఱ్ఱము, వనజహితుఁడు = సూర్యుఁడు.
  51. దైవాఱన్ = అతిశయింపఁగా, కతిపయకాలమునకున్ = కొంతకాలమునకు.
  52. అభ్యస్తములు = అభ్యసింపఁబడినవి.
  53. చెలఁగఁగన్ = ప్రసిద్ధమగునట్లు.
  54. గీర్వాణ = దేవతలయొక్క, దేవారుల = దానవులయొక్క.
  55. భువిన్ = భూలోకమునందు, ముయ్యాఱు = పదునెనిమిది.
  56. ప్రభ వహించెన్ = ప్రకాశమును పొందెను.
  57. ఆయుర్వేదము = వైద్యశాస్త్రము, ఉపన్యసింపఁబడును = చెప్పఁబడును.
  58. సుగుణస్వీకార = మంచిగుణమును వహించినవాఁడా.
  59. చెలువొందు = ఒప్పు, పట్టు = స్థానము.
  60. జాతిస్మరత్వము = పూర్వజన్మమునం దిట్టివాఁడనై యుంటిని అనుజ్ఞానము కలిగియుండుట, ధర్మరతునిన్ = ధర్మమునం దాసక్తునిఁగా, వినతి = నమస్కారము.
  61. ఏతద్రహస్యసూక్ష్మములు = ఈరహస్యమైన సూక్ష్మవిషయములను, వాతప్పక = మాటపొరపాటులేక.
  62. పాశదండహస్తులు = త్రాళ్లు కఱ్ఱలు చేతఁ బట్టినవారు, దండితోడన్ = గంభీరత్వముతో.
  63. కింకరవరునిన్ = కింకరులలో ముఖ్యుని, ఉగ్గడించి = చెప్పి, పనిచెన్ = పంపెను.
  64. చేవ = సత్త, లోకములకంటెన్ = ఎల్లలోకములకంటెను, మాన్యులు = గౌరవింపఁదగినవారు, ధన్యులు = కృతార్థులు.
  65. తమ్మిచూలికి = బ్రహ్మకు, తలవరివాఁడను = బంటను, ఉజ్జ్వలమహిమాఢ్యులు = మిక్కిలి ప్రకాశించునట్టి మహిమగలవారు, వలతేని = అపేక్షించువాఁడవైతివేని.
  66. జలజాప్తతనూజున్ = సూర్యునికొడుకును - యముని, శీలవర్తనములు = మంచియాచారములు, చర్యలు = చేష్టలు, అంతకుఁడు - యముఁడు.
  67. పసిండి = బంగారు, ఏకతంబునన్ = ఏకాంతమునందు - సొమ్ముగలవారు ఎదుటలేనియెడ, అబ్బెనేని = దొరకినపక్షమున, కొనక = తీసికొనక, అధికశుద్ధాత్ముఁడు = మిక్కిలి పరిశుద్ధమైన మనసుగలవాఁడు, లోకోత్తరుండు = ఎల్లలోకులకును ఆవలివాఁడు - అందఱియందును ముఖ్యుడు.
  68. కలుషము = పాపము, కొనకొన్న = తుదముట్టిన - అతిశయించిన, మహితుఁడు = పూజ్యుఁడు.
  69. స్ఫటికశైలశిలామలోద్భాసి = పటికపుకొండయందలి రాళ్ళవలె స్వచ్ఛముగా ప్రకాశించువాఁడు, మత్సరాధీనమలినులు = విడువనివిరోధమునకు అధీనులగుటచే ప్రకాశహీనులైనవారు, అమృతకిరణుతుహినరశ్మిమధ్యంబునన్ = చంద్రుని చల్లనికిరణములనడుమ, దహనునట్ల = అగ్నిహోత్రునివలెనే.
  70. అమలహృదయవిమత్సరులు = నిర్మలమైన మనస్సుచేత మత్సరము లేనివారు.
  71. పొదలిన = వృద్ధిపొందిన, సౌమ్యమునన్ = తిన్నఁదనముచేత, ఎలమి =వికాసమును, తనరినభంగిన్ = వృద్ధిఁ బొందినట్లు.
  72. నిర్గతమానమత్సరోద్యములన్ = పోయిన గర్వముయొక్కయు చలముయొక్కయు పూనికగలవారిని, పరాంగనాజనపరార్థపరాఙ్ముఖుల = అన్యస్త్రీలయందును అన్యులధనమునందును మాఱుమొగముగలవారిని, సమస్తధర్మమయులన్ = ఎల్లధర్మములును స్వరూపముగాఁ గలవారిని, సర్వలోకజనమాన్యులన్ = ఎల్లలోకములలోని ప్రజలచేతను గౌరవింపఁదగినవారిని, అచ్యుతపాదపద్మసక్తమతులన్ = విష్ణుపాదకమలములయం దాసక్తిగలమనసు గలవారిని.
  73. అర్థము =ధనము, అనృతనిష్ఠురోక్తులు = అసత్యములును కఠినములు నైనమాటలను, అనుదినంబు = ప్రతిదినము - ఎల్లప్పుడును.
  74. దూరవర్తి = దూరముగా నుండువాడు.
  75. అర్థతృష్ణన్ = ధనమునందలి యాశచేత, చౌర్యంబు = దొంగతనము.
  76. పరిగ్రహంబు = కైకోలు - అంగీకారము, దురితమతులు =పాపబుద్ధులు, సకలశోభనకల్యంబు = ఎల్లమేలులను దెలుపునది, దుర్గమంబు = పొందరానిది, వైవస్వతుండు = యముఁడు, పద్మయోనివలనన్ = బ్రహ్మవలన, ఉద్దండ = ఉద్ధతమైన.
  77. విజిశేషులు = జయింపనిచ్ఛయించువారు.
  78. భౌమము = భూసంబంధియైనది, నాకసంప్రాప్తి = స్వర్గప్రాప్తి.
  79. ప్రమోదమతి = సంతోషించిన మనసు గలవాఁడు.
  80. యాజ్యుఁడు = యజింపఁదగినవాఁడు - యజ్ఞమునందు పూజింపఁదగినవాఁడు, జప్యుఁడు = జపింపఁదగినవాఁడు, భూతమయుండు = సర్వజీవస్వరూపుఁడు.
  81. నెమ్మి = స్నేహము, ఆత్మయట్లు = తనవలె, పూజితుండు – పూజింపఁబడినవాఁడు.
  82. నిజాచారత్రాణపరతన్ = తమనడవడిని కాపాడుకొనుటయందు ఆసక్తిగలవా రగుటచేత, తుష్టుఁడు = సంతోషించినవాఁడు.
  83. వృత్త్యర్థయజనంబున్ = జీవనార్ధమైనయజ్ఞము చేయుటను - యజ్ఞము చేయు నెపము పెట్టి ధన మార్జించుట, వేదవిక్రయమును = జీతము నిర్ణయించుకొని వేదము చెప్పుటను, సంస్కృతమునందు శ్లో. "వృత్త్యర్థం యాజయేచ్చాన్యాసన్యానధ్యావయేత్తథా, పర్యాత్ప్రతిగ్రహాదానం శుక్లార్థాన్న్యాయతో ద్విజః.” అని యాజనాధ్యాపనప్రతిగ్రహములు బ్రాహ్మణులకు ముఖ్యవృత్తులుగాఁ జెప్పఁబడియుండుటవలన ఇచ్చట (వృత్త్యర్థయజనంబు వేదవిక్రయమును మాని) అనుచో యజ్ఞము చేయునెపంబున ధన మార్జించుటయు, జీతము నిర్ణయించుకొని వేదముఁ జెప్పుటయును అని అర్థము వ్రాయఁబడెను. కాబట్టి జీవనార్థమై యాజనాధ్యాపనములు చేసి శాస్త్రసమ్మతముగా వచ్చినదక్షిణాదులఁ బ్రతిగ్రహించవచ్చునని భావము. శుక్లమున్ = స్వవృత్తిచే ధన మార్జించునట్టి విప్రాదులవలని పరిశుద్ధద్రవ్యమును, ఈశుక్లశబ్దార్థమును."క్రమాగతం ప్రీతిదాయం ప్రాప్తంచ సహభార్యయా, అవిశేషేణ సర్వేషాం ధనం శుక్ల ముదాహృతమ్.” అని విష్ణువును, శ్లో."శ్రుతశౌర్యతపఃకన్యాయాజ్యశిష్యాన్వయాగతం, ధనం సప్తవిధం శుక్లం." అని నారదుఁడును వివరించి యున్నారు. హితకారి = మేలు చేయువాఁడు, మతంబు = ధర్మము.
  84. ధర్మి = ధర్మముచేయువాఁడు, త్రివర్గపరతన్ = ధర్మార్థకామములయం దాసక్తి కలిగినతనముచేత, పార్థివునకున్ = రాజునకు.
  85. ఉపాస్తి = ఉపాసన - అర్చన, నిత్యము = ప్రతిదినము తప్పక చేయవలసినది, నైమిత్తికము = ఏదేనినిమిత్తముచేత పితృదేవతాదుల నుద్దేశించి చేయవలసినది, మేర = మర్యాద - క్రమము, సరణి = మార్గము.
  86. మాయ = వంచన, మేళనము = కలగలుపు.
  87. వేదశాస్త్రపురాణార్థవేదిన్ = వేదములయొక్కయు శాస్త్రములయొక్కయు పురాణములయొక్కయు యర్థములను తెలిసినవానిని, విగతరాగున్ = పోయిన విషయానురాగము గలవానిని, గుణవంతున్ = ఎల్ల సద్గుణములు గలవానిని, ఆగమజ్ఞు =ఆగమములను తెలిసినవానిని, ఉభయకులశుద్ధున్ = తల్లిదండ్రు లైనయుభయులయొక్క వంశములవలన పరిశుద్ధుఁడైనవానిని, విజితేంద్రియుని= గెలువఁబడిన యింద్రియములు గలవానిని.
  88. అభ్యసనము = అభ్యానము.
  89. బెరయుచున్ = చేరుచు, ఎరవు = భేదము, ఏవ = జుగుప్స - రోత, పొరయక=పొందక.
  90. వడువు = వడుగు - బ్రహ్మచారి.
  91. నీచగతిన్ = తక్కువైనవిధమున, ఏచిన = అతిశయించిన.
  92. అనుజ్ఞాతుఁడు = అనుజ్ఞను పొందినవాఁడు, దారపరిగ్రహంబు చేసి = పెండ్లి చేసికొని, ఉపార్జించి = సంపాదించి.
  93. ఆఁకటఁ గ్రాఁగువారు = ఆఁకటిచే తపించువారు, తెరువరులు = బాటసారులు, సదనములకున్ = ఇండ్లకు, గృహమేధి = గృహస్థుఁడు.
  94. ఉదాసీనమునన్ = ఆదరింపమిని.
  95. పరుసఁదనము = గడుసుదనము, బెరుకు = భేదము, ప్రల్లదంబు = దుష్టత్వము, గృహికిన్ = గృహస్థునకు.
  96. కంటు = నిరోధము, శోభనధామంబులు = శుభస్థానములు, అరిష్టవిరామములు = కీడులను పోగొట్టునవి.
  97. ఖేలనవృత్తిన్ = క్రీడావ్యాపారములచేత, తపశ్చరణ = తపస్సు చేయుటయొక్క.
  98. త్రిషవణస్నానంబు = త్రిశాలసంధ్యోపాననార్థస్నానము, వనస్నేహమునన్ = అడవియందు దొరకెడు (గార) నూనెచేత, హిమనిదాఘములకున్ = శీతోష్ణములకు.
  99. వీతమత్సరుఁడు = పోయిన మత్సరముగలవాఁడు, జరాయజాండజాది = మావివలనఁ బుట్టిన (మనుష్యాదులును) గ్రుడ్డువలనఁ బుట్టిన (పక్ష్యాదులును) మొదలైన, మోదస్వభావుఁడు = సంతోషస్వభావము గలవాఁడు, అమలధృతిన్ = కళంకములేని ధైర్యముతో.
  100. సౌహార్ద = స్నేహభావముగల, ఐహికములు = ఈలోకమునందలి సుఖములను, భిక్షునకున్ = సన్న్యాసికి.
  101. త్రివర్గగృహంబులందున్ = గృహస్థులయిండ్లయందు, అస్తోకతన్ = గౌరవముతో, దేహయాత్రాకుశలంబు = దేహమును పోషించుకొనునట్టి మేలును.
  102. వ్యామోహంబు = విశేషమోహము, దర్పోద్దామము = గర్వాతిశయము, రంజిల్లున్ = ప్రకాశించును.
  103. ఇంధనరహితంబు = చిదుగులు లేనిది.
  104. వినుతార్థరహస్యంబులు = పొగడఁబడిన విషయములయొక్క రహస్యములును.
  105. యుగ్మసంఖ్యాకులు = జంటలెక్కగలవారు.
  106. బ్రహ్మతీర్థమునన్ = పెద్దవ్రేలి మొదటనుండియు, దేవతీర్థమునన్ = వ్రేళ్లకొనలయందుండియు.
  107. సంతతాభ్యుదయము = ఎప్పుడును మేలుగలది, జోక = బాగుగా.
  108. అప్రశస్తములు = అయుక్తములు - లజ్జాకరములు, జుగుప్ప = రోఁత, అమంగళవర్ణములు గలవి, కోపాక్షరములు = కఠినవర్ణములు గలవి, సర్వగురువులు = అన్ని గుర్వక్షరములుగానే యుండునవి, ధారుణీసురులాది = బ్రాహ్మణులాదిగా - బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రక్రమముగా, విధాన = విధ్యుక్తముగా, శబ్దవాచకాంతంబులన్ = నామవాచకశబ్దాంతములయందు, శర్మవర్మగుప్తదాసులు = శర్మ వర్మ గుప్తుఁడు దాసుఁడు, అనుప్రత్యయంబులన్ = అనునట్టి ప్రత్యయములను, తగన్ = యుక్తమగునట్లు, ఒనర్పవలయు = చేయవలెను - అనఁగా బ్రాహ్మణనామమునకు శర్మయనియు, క్షత్రియనామమునకు వర్మయనియు, వైశ్యనామమునకు గుప్తుఁడు అనియు, శూద్రనామమునకు దాసుఁడు అనియు కడపట ప్రత్యయరూపముగా చేర్చవలెనని తాత్పర్యము.
  109. నిర్వర్తించి = నడపి.
  110. చతురామ్నాయరహస్యవేది = నాలుగువేదములయందలి రహస్యార్థముల నెఱిఁగినవాఁడు, నిర్మలప్రతిభోద్రిక్తమనస్కుఁడు = కళంకములేని సమయోచితన్ఫురణ గలబుద్ధిచేత అతిశయించిన మనసుగలవాఁడు, అతికృపాపారీణుఁడు = మిక్కుటమైన దయచేత పూర్ణుఁడు, సంతతవ్రతసంపన్నగరిష్ఠుఁడు = ఎడతెగనినియమములకలిమి గలవారియందు గొప్పవాఁడు - ఎల్లప్పుడు సద్వ్రతములు తప్పక నడపువాఁడు, గుణగణావష్టంభుఁడు = మంచిగుణములయొక్క సమూహములకు అవలంబమైనవాఁడు - ఎల్లమంచిగుణములు గలవాఁడు, భజింపవలయున్ = సేవించవలెను.
  111. యథోక్తప్రకారంబునన్ = శాస్త్రమునందు చెప్పఁబడిన చొప్పున, ఆశ్రయము = ప్రాపు, అమ్మహనీయ పథంబునకున్ = ఆగొప్పమార్గమునకు.
  112. వయసునన్ = ప్రాయమునందు, తృతీయాంశము = మూడింట నొకపాలు, ఉభయకులములన్ = తల్లివంశముచేతను తండ్రివంశముచేతను.
  113. నైసర్గిక = స్వభావసిద్ధమైన, శోఫిన్ = వాఁపుగలదానిని, కృష్ణవర్ణన్ = నల్లనిదానిని, రోమాంగిన్ = అతిరోమముగల దేహముగలదానిని, కులటన్ = ఱంకులాఁడిని, రోగిన్ = రోగముగలదానిని, దుష్టాత్మన్ = చెడ్డమనసుగలదానిని, దుష్టవాత్సల్యన్ = కపటప్రీతిగలదానిని, నికృష్టవృత్తిన్ = నీచవ్యాపారము గలదానిని, అధికపింగళన్ = మిక్కిలి పల్లవన్నె గలదానిని, వినయాచారహీనన్ = అడఁకువచేతను సదాచారముచేతను తక్కువైనదానిని, మాతాపితృప్రతికూలన్ = తల్లిదండ్రులకు విరుద్ధమైన నడతగలదానిని, శ్మశ్రుముఖిన్ = మీసము గలమొగము గలదానిని, పురుషస్వరన్ = మగగొంతు గలదానిని, రూక్షాక్షిన్ = క్రూరపుచూపు గలదానిని, ఖర్వరూపన్ = మిక్కిలి పొట్టియైనదానిని, విశృతబద్ధాక్షిన్ = మిడిగ్రుడ్లదానిని, ఉన్నతవిపులగుల్ఫన్ = పొడువును వెడలుపునైన చీలమండలు గలదానిని, కాకనాదన్ = కాకికూఁతవంటి కంఠస్వరము గలదానిని, రోమజంఘన్ = వెండ్రుకలుగల పిక్కలు గలదానిని, విపాండుకరణన్ = తెలుపు మాసిన గోళ్లు గలదానిని, అరుణాక్షిన్ = ఎఱ్ఱనికన్నులు గలదానిని, గండకూబరన్ = నిడుకణతలుగలదానిని, కరాళవదనన్ = భయంకరమైన ముఖము గలదానిని, ఉద్వాహము = పెండ్లి.
  114. క్లిన్న = తడిసిన - నీళ్లవలె పలుచనైన, అతివికీర్ణకేశన్ = మిక్కిలివిరళములైన తలవెండ్రుకలు కలదానిని, పంగుగమనన్ =కుంటిదానిని, పాణిగ్రహణంబు = పెండ్లి.
  115. దారపరిగ్రహంబు = పెండ్లామును చేపట్టుట, ధర్మపత్ని = అగ్నిసాక్షిగా పెండ్లాడిన పెండ్లాము, ఉత్తమశ్లోకుఁడు = మంచికీర్తిగలవాఁడు.
  116. ఒదవన్ = కలుగఁగా, బ్రాహ్మంబు = బ్రాహ్మమను పేరుగలది (సూర్యోదయమునకు ముందు మూఁడవముహూర్తము)- వేకువజాము అనుట, ఉద్యద్వికాసంబునన్ = ప్రకాళించునట్టి తేటదనముతో, ధర్మనిరోధంబులు = ధర్మమును అడ్డగించునవి - ధర్మవిరుద్ధములు.
  117. సుఖోదర్కము = సుఖకరమైన భవిష్యత్కాలఫలము గలది, జగదభినుతము = లోకమునందు మిక్కిలి కొనియాడఁబడునది.
  118. అమ్మువేటునేలకంటెన్ =వింటిపట్టుదూరము గలభూమికంటె, అభిముఖుండు = ఎదురుమొగమైనవాఁడు, దివసంబులన్ = పగళ్ళయందు, మూత్రపురీషోత్సర్జనంబులు = మూత్రమును మలమును విడుచుటలు.
  119. ఆలమందలోనన్ = పసులమందయందు, వల్లకాటిలోనన్ = శ్మశానమునందు, కాదు = తగదు. నీరుముట్ట = మూత్రమును మలమును విడుచుట.
  120. బుద్బుదమలినఫేనపూతిగంధాదులు = నీళ్లమీఁది బుగ్గలు నురుగు మురికి చెడ్డకంపు మొదలగునవి, పొరయక = పొందక, శౌచము = శుద్ధి.
  121. మాషమజ్జనపరిమితశుద్ధోదకంబులన్ = మినుపగింజ మునుఁగునంతకొలఁదిగల మంచినీళ్లను, పరిమార్జవంబు చేసి = చక్కగా తుడిచికొని, న్యసించి = ఉంచి - ముట్టి యనుట.
  122. నిర్ఝరమయంబు = నదీస్వరూపమైనది, నవ్యనుధాకరాభము = లేఁతచంద్రునిఁ బోలినది, భావన చేసి = తలఁచి, కృతావగాహతత్పరుఁడు = చేయఁబడిన మునుకయందు ఆసక్తుఁడు - ఆసక్తితో స్నానము చేసినవాఁడు.
  123. నదములన్ = పడమరగా పాఱునట్టి యేళ్లయందును, హ్రదములందున్ = మడుఁగులయందును, దేవఖాతజలంబులన్ = దేవతలచే త్రవ్వఁబడిన (మనుష్యులు త్రవ్వఁగా ఏర్పడని) కొండదోనలోనగువానియందలి నీళ్లయందు, దీర్ఘికలన్ = నడబావులయందును, పల్వలంబులన్ = పడెలయందును, తానము = స్నానము.
  124. ధౌతవస్త్రపరిజ్ఞానుండు = మడుఁగువస్త్రము కట్టుకొన్నవాఁడు, ఉపాస్తి = ఉపాసన, హుతశేషాన్నంబు = హోమము చేయఁగా మిగిలినయన్నము, భూతప్రేతపిశాచకూశ్మాండపిపీలికాది = భూతము ప్రేతము పిశాచము కూశ్మాండము (అను భేదములుగల) భూతములు చీమలు మొదలైన, సకలభూతసమాశ్రితుండు = ఎల్లభూతములచేత ఆశ్రయింపఁబడువాఁడు, గోదోహనమాత్రము = ఆపువును పిదుకునంతటికాలము, బహిఃప్రదేశంబునన్ = ఇంటి వెలుపట, ఆగమనంబు = రాకను.
  125. మహితున్ = పూజ్యుని.
  126. గృహి = గృహస్థుఁడు.
  127. పావకుండు = అగ్ని, శక్రుఁడు = ఇంద్రుఁడు.
  128. దుఃఖభాజనులు = దుఃఖమునకు చోటైనవారు - దుఃఖమును పొందినవారు.
  129. తనిపి = తృప్తి పొందించి.
  130. అరిష్టాత్మకములు = చెఱుపును గలుగఁజేయు స్వభావము గలవి, అభిచారకృత్యములు = మారణకర్మములు, పరిసిపోవున్ = తేలిపోవును - తప్పిపోవుననుట.
  131. గృహమేధి = గృహస్థుఁడు, ప్రశస్తమణిముద్రికాధరుండు = దోషములు లేనిరత్నములు చెక్కిన ఉంగరమును ధరించినవాఁడు.
  132. చవిగొను = రుచిచూచు - భుజించు, సంజుజనంజుకొను, కటుకార్ద్ర = కారము గలదియు ద్రవమైనదియునైన.
  133. ఉచ్ఛిష్టవారణార్థంబుగాన్ = ఎంగిలి పోఁగొట్టుకొనుటకుఁగాను, స్వస్థ = చలనము లేవి, ప్రశాంత = మిక్కిలియోర్పుగల, అనుష్ఠించి = చేసి.
  134. రేపు = ప్రాతఃకాలము, మాపు = సాయంకాలము, తిమిరవైరిన్ = సూర్యుని.
  135. కుక్కిపడినన్ = అల్లికనళ్లి పల్లము పడినను, కొంగోడువోయిన = తడిసి ఒకకోడు మీఁదును ఒకకోడు క్రిందునుగా నీల్గుకొన్నను, ఒప్పదు = తగదు.
  136. అయుగ్మకములు = బేసిలెక్కగలవి.
  137. నిర్మోహి = మోహములేనిది, కుమతి = అల్పబుద్ధి గలది, తన్వంగి= స్త్రీ, కొఱగాదు = తగదు.
  138. ప్రౌఢ = గడిదేఱినది, ఉచితప్రియాలాపరచనలు =- తగిన ప్రియవాక్యములయొక్క పొందుపఱచుటలు, నెఱతనము = చాతుర్యము, నిర్మలాభిజాత్య = శుద్ధమైన ఉత్తమవంశమునందలి పుట్టుక గలది, సతి = పతివ్రత, కులాంగనన్ = ఇల్లాలి.
  139. చైత్యచత్వరగోష్ఠశ్మశానతీర్థవారిశృంగాటకారామవాహినీసురాలయగ్రామమధ్యంబులందున్ = రచ్చచెట్టు ముంగిలి పసులమంద శ్మశానము పుణ్యనదీపుణ్యస్థలములు నీరు నాలుగుత్రోవలు గూడిన రాజమార్గము ఉపవనము ఏఱు దేవాలయము ఊరినడుము ఈప్రదేశములయందును.
  140. పరివాదంబును = అపవాదమును, నేరికిన్ = ఎవరికేనియు.
  141. సంధ్యాద్వయంబును = ప్రాతస్సాయంసంధ్యలు రెంటియందు, మణుఁగు = మడుఁగు - పరిశుద్ధము, కమ్మగంధము = పరిమళచందనము, అలఁది = పూసికొని, చొక్కము = శ్రేష్ఠము, ఒఱపుగాన్ = ఒప్పిదముగా, మస్తకము = తల.
  142. కల్లలు = అసత్యములు.
  143. నాన = సిగ్గు, పనివడి = పూనికతో.
  144. పతితున్ = ఆచారాదులచేత నిందింపఁబడినవానిని, బగతున్ = శత్రువును, బంధకీపతిన్ = ఱంకులాడిమగనిని, వ్యభిచారున్ = జారుని, వారాంగనారతున్ = లంజల మరిగినవానిని, అనారంభున్ = సత్క్రియారంభము లేనివానిని, సురాపానమోహితున్ = కల్లు త్రాగుటచే మైకము పొందినవానిని.
  145. ఉఱికి = దుమికి, దహనము = కాలినది, తఱియన్ = చేర, ప్రమాదము = మోసము.
  146. బిట్టు = గట్టిగా, తలఁ పుడుకుట = మనస్సు తపించుట - మనస్తాపము, దుష్టచేష్ఠికములు = చెడునడవళ్లు.
  147. వాదడుచుట = వాదాడుట, పరువు వాఱుట = పరుగెత్తుట.
  148. వారక = మానక, పౌరుషములకున్ = పురుషార్థములకు, పాటిల్లున్ = కలుగును.
  149. అమేధ్యముతోన్ = మలముతో - పాఁచితోననుట.
  150. నగ్నరూపులన్ = దిపమొలవారిని.
  151. అసతి = ధూర్తస్త్రీ, ఆరామములన్ = ఉపవనములందును, శృంగాటకములన్ = చదుకములయందును, వల్లకాటిలోనన్ = శ్మశానమునందును, ఉగ్రాటవులయందున్ = భయంకరమైన అడవులయందు, ఒక్కరుండు = ఒకఁడే, చనదు = తగదు.
  152. విష్ఠ = మలము, ఛిన్నకేశములు = గొరిగిన వెండ్రుకలు, ఎమ్ములు = ఎముకలు, స్నానార్ద్రమహీతలము = స్నానము చేయుటచేత తడిసిననేలను.
  153. తెవులు = వ్యాధి.
  154. గుదియ = దుడ్డుగఱ్ఱ.
  155. సమదర్శి = ఎచ్చుతక్కువలు లేక చూచువాఁడు, పరిహరించి = విడిచి.
  156. అగణితముగన్ = లెక్కలేక, పైతృకకర్మకాండము = పితృసంబంధమైన కర్మములసమూహము.
  157. పెద్దనిదురకున్ = చావునకు, మాఁగన్ను పెట్టుచున్న మానవునిన్ = కన్నులు తేలవేయుచున్న మనుష్యుని, మస్తకము = తల, మహీశయ్యన్ = నేలమీఁదను, ఉత్క్రాంతిదానము = ప్రాణము పోవుటను గుఱించినదానము, అవనిదేవోత్తమునకున్ = బ్రాహ్మణశ్రేష్ఠునికి.
  158. నామత్రయోచ్ఛారణంబు చేసి = మూఁడు నామములను ఉచ్చరించి, విధియుతంబుగన్ = శాస్త్రవిధితో, తత్కాలవిధులు = ఆకాలమునకుఁదగినపనులు, తీర్చి = నెఱవేర్చి.
  159. అగ్నిసంస్కారకర్మంబులు = దహనక్రియలు, బెరయన్ = పొందునట్లు, యథావిధిన్ = విధిప్రకారము.
  160. విట్ఛూద్రవ్రజములకున్ = వైశ్యశూద్రసమూహములకు, పక్షమాసములు = వైశ్యులకు పదియేనుదినములును, శూద్రులకు నెలదినములును.
  161. సూతకాంతదివసంబునన్ = అంటు తీఱునట్టిదినమునందు, ఏకోద్దిష్టంబు = ఒకని నుద్దేశించి చేయు శ్రాద్ధము, ప్రతిసాంవత్సరికమృతాహంబునన్ = ప్రతిసంవత్సరమునందలి మృతతిథియందు.
  162. ఆచార్యుని = గురువును, త్రిమధున్ = మధుత్రయాధ్యేతయై తదర్థానుష్ఠాతయగువానిని, త్రిణాచికేతున్ = త్రిణాచికేతములను అనువాకములను అధ్యయనము చేసి తదర్థములను అనుష్ఠించువానిని, త్రిసువర్ణున్ = త్రిసువర్ణ ములు ఆనుమూఁడు అనువాకములను అధ్యయనము చేసి తదర్థములను అనుష్ఠించువానిని, నానావేదపారగున్ = ఎల్లవేదములను తుదముట్ట చదివినవానిని, షడంగవేదిన్ = ఆఱుఅంగములతోను వేదము చదివినవానిని, విష్ణుసంగతహృదయున్ = విష్ణువును మనస్సునం దుంచుకొన్నవానిని, శ్రోత్రియునిన్ = శ్రుత్యాచారము తప్పక నడపువానిని, మఖేజ్యున్ = యజ్ఞములచేత పూజ్యుఁడైనవానిని, వివిధసామజ్ఞున్ = నానావిధములైన సామముల నెరుఁగినవానిని, ఋత్విజున్ = యజ్ఞము నడుపువానిని, వియ్యమున్ = వియ్యంకుని, అర్థిన్ = ప్రియపూర్వకముగా.
  163. పరిత్యాగి = బొత్తిగా విడిచినవానిని, సోమవిక్రయున్ = సోమలతను అమ్మునట్టివానిని, హరికథావిముఖున్ = విష్ణుకథలకు మాఱుమొగమైనవానిని, బధిరున్ = చెవిటివానిని, వృషలీ = పెండ్లిగాక రజస్వలయైన స్త్రీలోనగునది, గృహదాహటిన్ = ఇల్లు కాల్చినవానిని, కానీనున్ = పెండ్లికానిదాని కొడుకును, గ్రామయాజకున్ = ఊరిపురోహితుని, పదభ్రష్టున్ = ఉత్తమపదమునుండి తొలఁగినవానిని, కునఖిన్ = వికృతనఖుని, కుండున్ = మగఁ డుండఁగా ఱంకుమగనికిఁ గన్నదానికొడుకును, గోళకున్ = మగఁడు చచ్చినపిమ్మట ఱంకుమగనికిఁ గన్నదాని కొడుకును, పేడిన్ = నపుంసకుని (లేక) తగినవయసు వచ్చియు మీసము మొలవనివానిని, దేవలకునిన్ పూజారివానిని, పిన్నపడుచువానిన్ = బాలుని, పైతృకంబులకు = పితృకర్మలకు.
  164. కర్త = చేయువాఁడు, భోక్త = భుజించువాఁడు.
  165. కుతపకాలము = మిట్టమధ్యాహ్నము.
  166. క్షణము = నిమంత్రణార్థము నియమించి యిచ్చెడు అక్షతలు మొదలగునది.
  167. ప్రాఙ్ముఖంబుగ = తూర్పుమొగముగా, అలవరించి = జతపఱిచి.
  168. అగ్నౌకరణంబులు = అగ్నికార్యములు, రక్షోఘ్నమంత్రంబులు = రాక్షసనాశకము లైనమంత్రములను, అనుష్ఠించుచున్ = చెప్పుచు, పాయసాపూపసూపవ్యంజనంబులు = పరమాన్నము అప్పములు పప్పుకూరలును.
  169. వివిధభంగులన్ = నానావిధముల, అజ్ఞాతవృత్తితోడన్ = తెలియనివర్తనముతో.
  170. అభ్యాగత స్స్వయం విష్ణుః = అన్నార్థియై యెదురుకొని వచ్చినవాఁడు తాను విష్ణువు, సంతర్పణము = సంతుష్టి.
  171. యథేష్టంబుగాన్ = ఇష్టముచొప్పున, పితృతీర్థంబునన్ = బొటనవ్రేలికొననుండి, పాణిప్రక్షాళనాంతరంబునన్ = చేతులు కడుగుకొన్నపిమ్మట.
  172. సారంగము = జింక, సైరిభము కారుదున్నపోతు, శశము = కుందేలు, నకులము = ముంగిన, వారిచరము = చేఁప, పలపైతృకమునకున్ = మాంసము పెట్టి చేయు పితృకర్మకు.
  173. ప్రియంగువులు = కొఱ్ఱలు.
  174. కోద్రవములు =ఆళ్లు, కంబులు = సజ్జలు, రాజమాషములు = అలసందెలు, చోళ్లు = నల్లరాగులు.
  175. సంతరింపన్ = సేకరింప
  176. గోడిగ = ఆఁడుగుఱ్ఱము, ఎనుఁబెంటి = బఱ్ఱె, పూతిగంధఫేనిలములన్ = చెడ్డకంపుగల కుంకుడుచెట్లవేళ్ల ఊటలయందు.
  177. నగ్నున్ = నియమపూర్వకముగ వేదశాస్త్రములను పఠించియు వేదముల నిందించునట్టి బ్రాహ్మణుని.
  178. ఔర్వోపదిష్టమార్గంబునన్ = ఔర్వునిచేత ఉపదేశింపఁబడిన చొప్పున.
  179. ధీమతిన్ = వివేకయుక్తమైన బుద్ధితో, భజియించి = సేవించి, పామరుఁడు = జ్ఞానహీనుఁడు, వేదవిదులు = వేదముల నెఱిఁగినవారు.
  180. పాషండుఁడే = వేదనిందకుఁడే.
  181. ఇతిహాసంబు = పూర్వకథ.
  182. నింగి = ఆకాశము, ఒక్కటన్ = ఏకముగా, ఉగ్రుఁడు = భయంకరుఁడు.
  183. నాకలోకము = స్వర్గలోకము, ఘోరరణంబు = భయంకరయుద్ధము, పాకశాసనుఁడు = ఇంద్రుఁడు, సుపర్వులు = దేవతలు, దేవతానీకసేవితుఁడు = దేవతలసమూహములచేత సేవింపఁబడువాఁడు, నీరదనీలవర్ణునిన్ = మేఘమువంటి నల్లనిచాయగలవానిని, పరమున్ = అత్యుత్తముని, పయోరుహలోచనున్ = కమలములవంటి కన్నులుగలవాఁడైన శ్రీహరిని.
  184. దుగ్ధాంబుధి = పాలసముద్రము, పళక్షద్వీపము = తెల్లదీవి - శ్వేతద్వీపము, కందరమునన్ = గుహయందు, కల్పద్రుమోద్యానశోభనదేశంబులయందు = కల్పవృక్షములు గల ఉద్యానవనమునందలి పుణ్యప్రదేశములయందు, ఉజ్జ్వలతపఃపారీణులు ప్రకాశమానమైన తపస్సుచేత గట్టెక్కినవారు.
  185. త్రైలోక్యనాయకుండు = మూఁడులోకములయందలి ప్రాణులకు ప్రభువైనవాఁడు, భక్తలోకైకరక్షణోపాయుఁడు = భక్తులసముదాయమును ముఖ్యముగ రక్షించుటయందలి ఉపాయముగలవాఁడు.
  186. సముజ్జ్వలంబులు = మిక్కిలి వెలుఁగునవి, పసిండిచీరతోన్ = బంగారుపచ్చడముతో, నిర్జరవ్రజంబుపాలిన్ = దేవతలసమూహమువద్దకు.
  187. దేదీప్యమానప్రభాశ్రీవిభాజితమూర్తి = మిక్కిలి వెలుఁగుచున్న కాంతిసంపదచేత ఒప్పునట్టి ఆకృతిగలవాఁడు, ఇచ్ఛావృత్తులు = మనోవ్యాపారములు, తళుకొత్తన్ = ప్రకాశముకాఁగా.
  188. అనాదినిధన = జన్మనాశములు లేనివాఁడా, అసురనిషూదన = అసురులను చంపువాఁడా, సుఖామృతరసోవన = సుఖభావమైన అమృతరసమే అన్నముగాఁ గలవాఁడా - ఎల్లప్పుడు సుఖము ననుభవించువాఁడా అనుట. మహోగ్రభవశాదశుచివాసరకరోదయ = అతిభయంకరమైన పాప మనెడుబురదకు బరిశుద్ధత్వ మనెడు సూర్యోదయమైనవాఁడా, వినమ్రజనఖేదహరణా = మ్రొక్కినవారి దుఃఖమును పోఁగొట్టువాఁడా, వేదమయ = వేదస్వరూపుఁడా, దుర్జనవివాదహ = దుష్టులవాదును పోఁగొట్టువాఁడా, జగత్ప్రాణాదరిపువాహన = వాయుభక్షకములైన సర్పములకు పగవాఁ డగుగరుత్మంతుఁడు వాహనముగాఁ గలవాఁడా, పయోదనిభగాత్ర = మేఘమువంటి దేహముగలవాఁడా, నమస్తే = నీకొఱకు నమస్కారము.
  189. అవార్య = నివారింపరాని, చెంగలింపఁగన్ = అతిశయింపఁగా.
  190. నికురుంబుఁడు = సమూహము గలవాఁడు, కదలి = వెడలి - బయలుదేఱి, కొల్లలాడి = కొల్లపెట్టి, దుర్మానమదప్రతాపమహిమలు = చెడ్డగర్వము క్రొవ్వు పరాక్రమము వీనియొక్క ఆధిక్యములు,
    నిరసించుచున్ = తిరస్కరించుచు, దుండగంబునన్ = చెడ్డతనముతో.
  191. దేవాంతకశ్రేణి = రాక్షసులబారు, వ్రాతము = సమూహము, తత్తదుక్తవిధులన్ = వారివారికి చెప్పఁబడిన క్రమములతో, అశేషీభూతముల్ గాఁగన్ = మిగులు లేనివిగా - సర్వమును.
  192. బెరుకు = సంకోచము.
  193. తద్వినాశకేలీవిధము = వారిని నాశము చేయుట యనెడు ఆటరీతిని - వారిని చంపుటను, నిలింపసుఖార్జిత = దేవతలకొఱకు సంపాదింపఁబడిన సుఖముకలవాఁడా, పాపవర్జిత = పాపములచేత విడువఁబడినవాఁడా.
  194. భాతి = విధము, నిజవర్ణధర్మపరిచితమతులు = తమకులాచారమునందు వాడుక చేయఁబడినబుద్ధిగలవారు, శ్రౌత = వేదమునందు చెప్పఁబడిన, స్మార్త = స్మృతులయందు చెప్పఁబడిన, ఆతురులు = ఆసక్తులు.
  195. నిజవర్ణధర్మభూయిష్ఠుఁడు = తనకులాచారము తఱుచుగాఁ గలవాఁడు, నిక్కువంబు = సత్యము.
  196. వేదబహిష్కృతులన్ = వేదమువలన వెలిఁబడినవారిని, సంపాదించెదను = కలిగించెదను.
  197. బాహ్యుల = వెలియైనవారిని, పాషండకర్మములకున్ = వేదవిరుద్ధక్రియలకు, నూలుకొల్పి = ప్రేరేపించి.
  198. బర్హిపత్రధరుఁడు = నెమలిఱెక్కల ధరించినవాఁడు, ముండమస్తకుండు = బోడితలవాఁడు, చొక్కించుచు = పరవశత్వము నొందించుచు, గరిమంబుతోడన్ = గొప్పదనముతో.
  199. తపోనవ్యవృత్తిన్ = తపస్సుయొక్క అపూర్వమైన వర్తనమును, ఎనయు = పొందునట్టి.
  200. ఐహికములు= ఈలోకమునందలి సుఖములు.
  201. పరమపావననిర్వాణపదవిహార, విభవము కుపమఁ జెప్పెద వినుఁడు తెలియ. అని పాఠాంతరము.
  202. విశ్వాసము = నమ్మిక.
  203. కల్లలు = అసత్యములు, తథ్యము = సత్యము.
  204. సమర్థములు = చాలినవి, నాస్తికశాస్త్రంబులు= దేవుఁడు లేఁడనుటను స్థిరపఱచునట్టి శాస్త్రములు, పూర్వపరిచితంబులు = మునుపు అభ్యసింపఁబడినవి.
  205. నెగడన్ = అతిశయింప.
  206. పేర్మిన్ = గౌరవముతో.
  207. దేవతాజ్యేష్ఠశక్రాది = బ్రహ్మ యింద్రుఁడు మొదలైన, చెనఁటి =కుత్సితము.
  208. బైజలు = అజ్ఞానములు.
  209. బహిష్కృతులన్ = వెలియైనవారిని, నూలుకొల్పినన్ = పురికొల్పఁగా, తారుదార = తమంతట దామే, ఉపయోగించుచున్ = అనుభవించుచు.
  210. నలి = బాగు.
  211. అబ్జమిత్రున్ = సూర్యుని, చెప్పరాదు = చెప్పశక్యముకాదు.
  212. బంధురము= అధికము.
  213. కులకాంత = భార్య.
  214. అపభృథస్నానంబు = యజ్ఞమున దీక్షాంతమందు చేయునట్టి స్నానము.
  215. యోషిత్సమేతుఁడు = భార్యతో గూడుకొన్ననాఁడు, పరితోషంబునన్ = అధికసంతోషముతో.
  216. పంచత్వంబు = చావు, కన్య = కూఁతురు.
  217. దివ్యదృష్టిన్ = జ్ఞానదృష్టిచేత.
  218. సగ్గారి = సృగాలము - నక్క, కతనం జేసి = కారణముచేత.
  219. ప్రాయోపవేశము = చచ్చుతలఁపుతో ఆహారము మాని శయనించుట, కాయంబు = దేహము
  220. వృకంబు = తోడేలు.
  221. దేవాపగ = దేవనది - గంగ.
  222. కాలవశత = చావు.
  223. సముద్రముద్రితవసుంధరాచక్రంబు = సముద్రముచే చుట్టఁబడిన భూమండలమును, నిర్వక్రంబుగన్ = ఏలోపమును లేక, అతిరేకము = అతిశయము.
  224. దైతేయశాసనపూజాపరతంత్ర = విష్ణుదేవుని అర్చించుటయందు ఆసక్తమైన ప్రవర్తనముగలవాఁడా, నామితరిపుక్ష్మాపాలకోటీర = చంపఁబడిన శత్రురాజులయొక్క కిరీటములు గలవాఁడా, శాంతనవప్రాభ = భీష్మునిశక్తివంటిశక్తి గలవాఁడా, సత్కవీంద్రకవితాతాత్పర్య = సత్కవిశ్రేష్ఠులయొక్క కవిత్వమునందలి తత్పరత్వము గలవాఁడా, శౌర్యోన్నతా = శూరత్వముచేత గొప్పవాఁడా.
  225. గుజ్జరిదట్టవిభాళ = ఇది బిరుదు పేరు, జగజ్జనసంస్తుత్య = లోకులచేత స్తుతింపఁదగినవాఁడా, నిత్యకపటారివధూహృజ్జనితాప్రతితాప = శాశ్వతమైన కపటశత్రువుల భార్యలహృదయములందు పుట్టించఁబడిన సరిలేని సంతాపము గలవాఁడా, మరుజ్జప్రతిమానబల = వాయుపుత్రుఁడైన భీమునిబలముతో సమానమైన బలముగలవాఁడా, నిరూఢవివేక = మిక్కిలి స్థిరపడిన తెలివిగలవాఁడా.
  226. కంజబాంధవతనూజ = సూర్యునికొడుకైన కర్ణుని, ప్రతిమ = పోలిన, దానశోభిత = ఈవిచేత ప్రకాశించువాఁడా, నితంబినీజనమనోజ = స్త్రీలకు మన్మథుఁడా, సంగ్రామపార్థ = యుద్ధమునందు అర్జునుఁడా, బలగర్వితారిపురకాలకంధర = బలముచేత గర్వించిన శత్రువుల పట్టణములకు శివుఁడా, మహాకవిస్తోమసన్నుతవచోవికాస = గొప్పకవులసమూహములచేత కొనియాడఁబడిన మాటలయొక్క వికాసము గలవాఁడా, రణశూర = యుద్ధమునందు శూరుఁడా, బంధురపరాక్రమా = మిక్కుటమైన పరాక్రమము కలవాఁడా.