ఆంధ్ర వీరులు - రెండవ భాగము/విజయ రామరాజు

వికీసోర్స్ నుండి

నాంధ్రేతరులకు నెంతయు గౌరవభావము గలదు. ఇంతటి ప్రశక్తికి గారకుడగు సోమనాద్రి సర్వజనవంద్యుడనుటలో సంశయ ముండదు.

_________

విజయ రామరాజు

తాండ్ర పాపరాయుడు బొబ్బిలిసంగరమునందు విజయనగర సంస్థానాధీశ్వరుడగు విజయరామరాజును జంపెను. అనంతర మాయనరాణి తన సమీపజ్ఞాతుల యొద్దనుండి పండ్రెండుసంవత్సరముల బాలునిగొనివచ్చి దత్తతజేసికొని విజయరామరాజు అని యాబాలునకు నామకరణ మొనరించెను. యుక్తవయస్సు వచ్చువఱకు రాణిగా రీబాలునకు సంస్కృతము, ఆంధ్రము, పార్సీలోనగుభాషలు నేర్పించి అనంతరము రాజ్యముగూడ నొసంగెను. విజయరామరాజునకు జనకస్థానము నందు అన్నయగు సీతారామరాజు కూడ విజయనరమునకు వచ్చి సోదరునకు సహాయముగా బరిపాలనా వ్యవహారములు చూచుచుండెను. క్రమముగా సీతారామరాజునకు విజయనగరరాజ్యము నందును అపుడు బలవంతముగా నున్న --- సువారియొద్దను బరిచయము మెండయ్యెను. రాజకీయ వ్యవహారము లన్నియు నాతడె మిగుల నేర్పుగా నిర్వహించుచుండెను. విజయరామరాజు తనయన్న పరిపాలనా చాక యములు విజయనగరమును ముట్టడించి పాళ్లు పంచుకొన జూచిరిగాని కార్యకౌశలుడగు సీతారామరాజు ఆప్రయత్నములన్నియు విధ్వంసము గావించి ఆంగ్లేయసైనిక సహాయమున బ్రతిపక్షరాజుల రూపుమాపి వారి రాజ్యములను గైకొనెను.

సీతారామరాజు పేరునకు మంత్రిగా నున్నను తానే రాజుగా వ్యవహరించి పూర్వులొసంగిన మాన్యక్షేత్రములు అగ్రహారములు ఆక్రమించి రైతులకు గౌలున కొసంగుచుండెను. దానిచే బ్రజలకు గూడ నీతనిపయి మిగుల నసహ్యము జనించెను. ఈదోషములన్నియు బ్రజలు విజయరామరాజువిగా భావించి యాతనినిగూడ విద్వేషించిరి. సీతారామరాజు ప్రజాభిప్రాయములు పాటింపక తనయిచ్చచొప్పున జరించుచుండెను. ఈ నూతనపరిపాలనమునకు మిగుల విసికి అడిదము సూరకవి "రామలింగేశ శతకము"మున సీతారామరాజును మనసునందుంచుకొని ధుష్టరాజులను దూలనాడెను. ఎవరెన్నివిధముల నాందోళనము జరుపుచున్నను సీతారామరాజు పాటింపక తనయిచ్చ వచ్చినటుల వ్యవహరించు చుండెను. విజయరామరా జెటుల జెప్పిన నేమివచ్చునో యని తటస్థముగా నుండెను. ఈపరిస్థితులలో గాలము గడపుట ప్రజలకు సాటివారికి గష్టమయ్యెను. అందుచేత విజయనగర రాజ్యము నెటులేని కంపెనీవారికి గట్టిపెట్ట వలయునని సాటి రాజులందఱు కుట్ర చేయుచుండిరి. సీతారామరాజు కంపెనీ వారితో గలిసి దూరాలోచనలు గావించి తమపై పితూరి చేయుచున్న జమీందారుల నందఱను జయించెను. జయపురపు కోట నాక్రమించుకొనెను. ఇంకను బ్రతికూలురని యనుమానముతోచిన రాజులనందఱను గారాగృహములం దుంచెను. చండశాసనుడై దండనీతిని దీవ్రముగా నుపయోగించు సీతారామరాజునెడ సమకాలికులయసూయ మిగుల వృద్ధియయ్యెను. ఆతనిసాహసకృత్యములు కంపెనీవారికి గూడ సహింపరానివిగా నుండెను. సాటిరాజులందఱు విజయరామరాజునకు 'సీతారామరాజును మంత్రిపదవినుండి తొలగింపవలయు, లేకున్నచో మేము ప్రతిపక్షులుగా నుందు'మని వర్తమానములంపిరి. ఇవియన్నియు మనస్సునం దుంచుకొని విజయరామరాజు సీతారామరాజున కేమేమియోచెప్పి మంత్రిపదవికి రాజీనామ యిప్పించెను. సీతారామరాజునకు గుమారులు గలరు. విజయరామరాజునకు బుత్రసంతానము లేదు. విజయరామరాజునకు బుత్రసంతానము కలుగకపోయినచో తన కుమారుడగు నరసింహ గజపతిరాజును బెంచుకొందునని వాగ్దానము గావించుటచేతనే సీతారామరాజు రాజీనామనుబెట్టి యుద్యోగము మానుకొనెనని కొంద ఱందురు.

క్రీ.శ. 1778 లో దొరతనమువారు జమీందారులకు భూస్థితియు ఆదాయము ఎంతయున్నదో నిర్ణయించుకొని పేష్కషులు పరిష్కరింపనెంచి యందఱ నాహ్వానించిరి. పలువురు పరిష్కారార్థము వచ్చిరి. సీతారామరాజు ఈనిర్ణయమునకు దానుగూడ మదరాసునకు వచ్చి దొరతనమువారి యాశ్రయమును సంపాదించుకొని మరల మంత్రియయ్యెను. సీతారామరాజు మంత్రియైనచో మఱలనేమి కల్లోలములు జనించునోయని విజయరామరాజు తొలుత సంశయించెనుగాని ఈనిర్ణయము కంపెనీవారు కావించినదిగాన నాయన యేమియు జెప్పజాలక యంగీకరించెను. సీతారామరాజు నిరంకుశాధి కారముతో రాజ్యచక్రము త్రిప్పుచుండెను. హవేలీ భూము లన్నియు నీయనకు గౌలుగా నుంటచే బలుకుబడి కూడ మిక్కుటముగా నుండెను. మరల బ్రజాపీడనము గావింప మొదలుపెట్టెను. అడ్డుపడిన తమ కెట్టి తిరుగుబాటు కలుగునోయని దొరతనమువారు తటస్థముగా నుండిరి. ఈ యవకాశమును బురస్కరించుకొని సీతారామరాజు మిక్కిలి చొరవజేయుచుండెను. దొరతనమువారు సీతారామరాజు విషయములో నుపేక్షించిన లాభములేదని క్రీ.శ. 1784 లో నొక ఉపసంఘము నేర్పఱచి ప్రకృత పరిపాలనా విధానమునందు బ్రజాభిప్రాయములు నివేదింప నాజ్ఞాపించిరి. వారు విచారించి యీక్రింది యభిప్రాయముగల నివేదికను బ్రచురించిరి. "విజయనగరము సంస్థానమువలన వచ్చు ఆదాయ మంతయు జమీందారులు తమ స్వంతఖర్చుల కే వ్యయము గావించుకొను చున్నారలు. రైతుల విషయములో నేమాత్రము శ్రద్ధగైకొనుట లేదు. ప్రజలు క్షామపీడితులై తినుట కన్నము లేక మలమల మాడుచున్నారు. నీటివసతు లేమాత్రము తృప్తికరముగా లేవు. సైన్యముకొఱకు బ్రతిసంవత్సరము ఐదు లక్షల రూపాయలు వ్యయముచేయుచుంటచే బొక్కసమందలి ధనమంతయు వ్యయమగుచున్నది. ఈవిషయములో ఆంగ్ల దొరతనమువారు శ్రద్ధపుచ్చుకొని విజయనగర సంస్థానమును కట్టుబాటులలో నుంచుట చాల నవసరము." ఈ నివేదిక దొరతనమువారి సంకల్పమునకు దోడయ్యెను. పాలకొండ, జయపురము, గోలుకొండ, టెక్కలి, కిమిడిలోనగు సంస్థానముల ప్రభువులను సైన్య సహాయము చేయుమని యొత్తిడి చేయుటయు, గొందఱు జమీందారులకు ఖ్యాతి యొసంగి గ్రామముల గైకొనుటయు, సాలూరు, పాచిపెంట, విషమకోట, కాశీపురము, బొబ్బిలి లోనగు సంస్థానము లేలు ప్రభువులను జెరసాలలోబెట్టి సాధించుచుంటయు దొరతనమువారికి దుస్సహముగా నుండెను. బొబ్బిలి పరిపాలకుడగు వెంగళరంగారావు జయిలునుండి మాయోపాయములతో దప్పించుకొని హైదరాబాదునకు బాఱిపోయి తమ కష్టములు, కంపెనీవారి యుపేక్షయు దెలిపి నవాబును సహాయముకమ్మని కోరినట్లు, ఈయంశములు గూడ ఉపసంఘమువారు తెలిపిరి.

కంపెనీవారు విజయరామరాజునకు సైనికబలము కావలయుననియు సీతారామరాజును మంత్రిపదవి నుండి తొలగింప వలయుననియు వార్త బంపగా నందుల కంగీకరించెను. సీతారామరాజునకు విజయరామరాజుగారిచే నుపకార వేతన మిచ్చునట్లు దొరతనమువారు కట్టుబాటు చేసిరి. ఆకట్టుబాటు ప్రకారము సీతారామరాజునకు నెల యొకటికీ ఐదువేల రూపాయల నొసంగుచు మదరాసును విడిచి బయటికి బోవరాదని దొరతనమువా రాజ్ఞాపించిరి. ఇవియన్నియు జరిగిన పిదప విజయరామరాజు తాను స్వతంత్రముగా రాజ్యమును బాలించుకొనుచుండెను. పరిపాలనాకౌశల్యము గలవాడు గావున నమ్మకమగు నౌకరులను బెట్టి రాజ్యమున మంచి కట్టుబాటును జేసెను. దొరతనమువారు ఇతర రాజ్యములతో బాటు తనరాజ్యము గూడ హరించుటకె యెన్నో యత్నములు చేయుచున్నారనియు గనుగలిగి మెలగ కున్నచో విప్లవము తప్పదని తన విధులు సక్రమముగా నెరవేర్చు చుండెను. రాజ్యమునందు బంటలు మందగించుటచే సిస్తులు సకాలమున వసూలు కాకపోయెను. ఆకారణమున విజయరామరాజుచేయునది లేక దొరతనము వారికి నీయవలసియున్న పేష్కషు గూడ బకాయి పెట్టెను. కడకు విజయరామరాజు దొరతనము వారికి ఆఱులక్షల యిరువదియైదువేల రూపాయలు బాకిపడెను. అందుచే గంపెనీవారు విజయనగర రాజ్యమును దాము గైకొని ముప్పదివే లొక్కమాఱుగ నిచ్చునట్లును నెలనెలకు బండ్రెండు వందల రూపాయలు వ్యవయములకు ఇచ్చెద మని యును విజయరామరాజును బందరులో నుండవలసినదనియు నిర్బంధించిరి. కంపెనీవారు విజయనగరరాజ్యమును ఇతరులకు గౌలునకీయ యత్నించిరి. ఎవరునురాకపోయిరి. ఎటులేని భేదనీతితో విజయనగర రాజ్యము పరాధీనము గావింప నెన్నివిధముల యత్నించినను లాభము లేక పోయెను. విజయరామరాజు రాజ్యమునుంచి బందరుపోవుట కెంతమాత్ర మిష్టములేక పోయెను. ఆంగ్లేయుల యొత్తిడికి సహింపజాలక కడకు విజయరామరాజు బందరునకు బ్రయాణమయ్యెను. రాజ్యమును విడచి బందరులో బరాధీనముగా బడియుండ నాతనిమనస్సు ఒప్పుకొనకపోయెను. వెంటనే వెనుకకుమరలి తనరాజ్యమునందున్న సుప్రసిద్ధక్షేత్రరాజమగు పద్మనాభము జేరెను. అది యాంగ్లేయులు గ్రహించి విజయరామరాజును బందరునకు బొమ్మని మిగుల నొత్తిడిచేయుచుండిరి. ఆయన సమయమునకేదో ప్రత్యుత్తరము వ్రాయుచు బందరునకు బోడాయెను. కంపెనీవారి కిదియంతయు నవమానకరముగా నుంటచే విజయరామరాజునకు ఇరువదినాలుగు గంటలలో బద్మనాభమును విడిచి బందరునకు బోవలసినదనియు అట్లు పోవనియెడల సైనికసహాయమున మేము పంపకమానమనియు వర్తమానమంపిరి. స్వతంత్రశీలుడు పరాక్రమశాలియునగు విజయరామరాజున కీసందేశము మిగుల నవమానకరముగ దోచి రాజ్యమునుండి తన్నంపుటకు కంపెనీవా రెవరిని తిరస్కార వాక్యముల నాడి తిరుగుబాటు చేయుటకు గొంతసైన్యమును సమకూర్చెను. పూర్వాభిమానము జ్యాతిభిమానముగల నాల్గువేలమంది రాచవారు స్వాతంత్ర్యసంగరమున బ్రాణముల వదలుటకు నిశ్చయించి విజయరామరాజు పక్షమున జేరిరి. రాచవారందఱను బద్మనాభస్వామి దేవళమున సంగరమున బ్రాణమున్నంతవఱకు బాల్గొన వాగ్దానము లొనరించి ప్రసాదమును స్వీకరించిరి. పైవారి యుత్తరువుచొప్పున ఆంగ్లేయ సైనికాధిపతియగు పెండరుగాష్టుగారు సుశిక్షితులగు నేడువందల యేబదిమంది భటులతో (క్రీ.శ. 1794 సం|| జూలయి 10 తేదికి) సూర్యోదయమగుసమయమునకు బద్మనాభమునకు జేరిరి. ఉభయులకు సంధికి వీలుకాకపోయెను. విజయరామరాజు స్వాతంత్ర్యము కోలుపోవుట కించుకేని యంగీకరింపక భటులను సంగరమునకు బురికొల్పి తానును ప్రతిపక్ష సైనికుల నెదిరింప బయలువెడలెను. ఉభయదళములకు ముప్పావుగంటసేపు ఘోరముగా యుద్ధముజరిగెను.

విజయరామరాజువెంట అంగరక్షకులుగా విజయగోపాలరాజు, వత్సవాయినరసరాజు, దాట్ల అప్పలరాజు, రావు జోగయ్య మొదలగు వీరులు పరివారముతోనుండి ఆంగ్లసైన్యమును భేధించుటకు ముందునకు ద్రోవతీయుచుండిరి. అందఱికంటె ముందు దావతుఖాన్ అను యవనుడు సైన్య ప్రేల్చిరి. విజయరామరాజు దేహమునందు బలుతావుల గాయములుపడెను. దానికిని లక్కచేయక వాడికత్తితో విరోధిసేన నఱకుచుండెను. ఒడలినుండి రక్తము విశేషముగా గారుచుంటచే గొంతసేపటికి విజయరామరాజు పడిపోయెను. రాజుపడిపోయిన సంగతి వినినంతనే హతశేషులగు సైనికులు చెదరిపాఱిపోయిరి. రాజుస్థితి మిగుల దుస్తరముగా నుండెను. ఒడలంతయు గాయములతో నిండిపోయెను. ఇంతలో నాంగ్లసైనికులు నాలగైదుతుపాకుల నొక్కమాఱు ప్రేల్చిరి. విజయరామరాజు ఘోరమరణ మొందెను. కర్నలు పెండర్గాష్టు సంగరము నాపివేయించి యుద్ధప్రదేశమును దిలకించుటకు వచ్చెను. మూడువందల తొమ్మిదిమంది క్షత్రియసైనికులు వీరమరణము నొంది పడియుండిరి. విజయరామరాజు చుట్టును కోటగట్టినట్టుల నలువదిమంది క్షత్రియవీరులు తుపాకి దెబ్బలచే జచ్చిపడియుండిరి. వీరమరణమొందిన యాంధ్రవీరుల కళేబరములు ఆంగ్లసేనాధిపతికి మిగుల నాశ్చర్యము కలుగజేసెను. స్వతంత్రసంరక్షణము కొఱకు భటునివలె బోరాడి రణరంగమున నొఱగిన విజయరామరాజు త్యాగము పాశ్చాత్యులకు విస్మయము గూర్చెను. ఆంగ్లసైనికులు క్రమశిక్షణ గలవారగుటచేతను తుపాకులు ఫిరంగులు లోనగు మారణ పరికరములు సమృద్ధిగా నుంటచేతను విశేషనష్టమొందక జయించిరి. కంపెనివారిసేనలో బదుముగ్గురు మాత్రమె మర ణించిరి. అఱువదియొక్కరు గాయపడిరి. మహారాజును స్వాతంత్ర్యప్రియుడును ధర్మమూర్తియు నగు విజయరామరాజు మరణము విని దేశమంతయు నొక్కమాఱు పరితపించెను.

ఆంగ్లసైనికులు విజయరామరాజు దేహముపై నున్న అమూల్యరత్నాభరణములు, దుస్తులు లాగికొనిరి. బొబ్బిలి సంగ్రామములో దాండ్ర పాపారాయునిచే బెద్ద విజయరామరాజుగారు చంపబడిన పిదప ముప్పది తొమ్మిది సంవత్సరముల కీసంగరము జరిగెను. ఈ విజయరామరాజు గతింపగనే ఆంగ్లేయులు రాజ్యము నాక్రమించుకొనిరి. ఈ ఘోరసంగరవార్తవిని రాజ్యమున నున్న దనకేమి యపాయము వాటిల్లు నోయని విజయరామరాజుభార్య నారయణ బాబను నామముగల ఎనిమిది సంవత్సరముల బాలుని దీసికొని మన్నెములకు బోయెను. ఆంగ్లేయులు ఆబాలుని దల్లిని రప్పించి సంవత్సరమున కింతయని పన్ను గట్టునటుల నేర్పాటుగావించి రాజ్యము నాబాలున కప్పగించిరి.

విజయనగర రాజ్య విస్తృతియు నైశ్వర్యము స్వాతంత్ర్యాభిలాషయు విజయరామరాజు మరణముతో దగ్గిపోయెను. తరువాత నాకుటుంబమున స్వతంత్ర శీలుడగు రాజవతంసుడు జనించుట కవకాశములు లేక పోయెను. అతి విస్తృతమై యాంధ్రదేశమున కంతటికి నాయకరత్నము కాదగిన విజయనగర రాజ్యము క్రమముగా గొంతకొంత