ఆంధ్ర వీరులు/యాచశూరుడు

వికీసోర్స్ నుండి

యాచశూరుడు

ఆంధ్రవీరులలో వెలమవారగు రేచర్లగోత్రీయులు సుప్రసిద్ధులు. భేతాళనాయకుడు, అనపోతనాయకుడు, సర్వజ్ఞసింగభూపాలుడు మున్నగు వెలమవీరులందఱు నీ రేచర్లగోత్ర సంజాతులె. రేచర్లగోత్రీయులు తొలుత కాకతీయసామ్రాజ్యమున సేనానాయకులుగ నుండి యప్రతిమాన పరాక్రమముటొ సంగరములలో జయముగడించి తమప్రభువులచే సత్కారముల నొందిరి. కాకతీయసామ్రాజ్యము పడిపోయిన పిదప నీ వెలమవీరులు స్వతంత్ర రాజ్యములను స్థాపించి చిరకాలము పాలించిరి. అనంతర మీరాజ్యము యవనుల యొత్తిడిచే రానురాను జీలి భిన్నభిన్నమైపోయెను. ఈరేచర్ల గోత్రము నందు జనించిన యాచశూరుడు చంద్రగిరి వీరవేంకటపతిరాయలు పాలించుతఱి కొంతకాలము మధురాంతకమునందును మఱికొంత కాలము ఉత్తరమల్లూరునందును సామంతరాజుగా నుండి స్వామిభక్తివిశేషమున బేరెన్నిక గాంచెను.

విద్యానగర సామ్రాజ్యము పతనము కాగానే తిరుమలరాయలు పెనుగొండ జేరినటుల మన మెఱింగియున్నారము. అక్కడగూడ విరోధులవలని యొత్తిడి తగ్గకపోవుటచే జంద్రగిరి చేరెను. ప్రకృత కథాకాలమున దిరుమలరాయని తనయుడగు వీర వేంకటపతిరాయలు చంద్రగిరి రాజ్యమును


యాచశూరుడు ములుగా నున్నవనియు వీర వేంకటపతిరాయలచే బట్టాభిషిక్తుడైన రంగరాజే తమకు నిజమగు ప్రభువనియు యాచశూరుడు జగ్గరాజునకు వర్తమానమంపెను. జగ్గరాజు యాచశూరునిమాట పాటింపక చిక్కరాజుపేర దానె రాజ్యవ్యవహారములను నిర్వహించు చుండెను.

యాచశూరుడు చెఱసాలయందున్న రంగరాజు నెటులేని విడిపింపవలయునని విశ్వప్రయత్నములు చేసెనుగాని లాభములేకపోయెను. కారాగృహవాసుల వస్త్రము లుదుకు చాకలి వాండ్రను లోగొని వాండ్రకు లంచము లొసంగి శ్రీరంగరాయల ముగ్గురు కుమారులలో మధ్యవాడగు పండ్రెండు సంవత్సరముల బాలుని బట్టలమూటలలో బెట్టి బయటికి దెప్పించి యాచశూరు డాబాలుని తనయొద్ద నుంచుకొని పెంచుచుండెను. యాచశూరుని భేదనీతియు జగ్గరాజు దుర్మార్గము ఫలింప నెనిమిదివేల సైన్యముతో నలుగురు సేనానాయకులు యాచశూరుని గలిసిరి. యాచశూరుడు విశ్వాసపరులగు నిరువదిమంది సైనికులను బిలిపించి చంద్రగిరికేగి చెఱసాల పాలకునియొద్ద నుద్యోగమున గుదిరి యెటులేని రంగరాజును విడిపించుడని పంపెను. వారు చెఱసాల యధికారి యొద్ద స్నేహము సంపాదించుకొని కారాగృహమునుండి బయటికొక సురంగము త్రవ్వి వారి నా సురంగపు ద్వారమున బయటికి గొనివచ్చుచుండిరి. అంతకుమున్ను వేటకేగి తిరిగి వచ్చుచున్న జగ్గరాజుగుఱ్ఱపుకాలు సురంగపు మొదట దిగబడెను. ఏదియో వింతవలె నున్నదని యాభాగము ద్రవ్వింప నందుండి బయటికివచ్చుచున్న సైనికులు, రంగరాజు, నాతని కుటుంబము బయటపడెను. జగ్గరాజీ ద్రోహమున బాలుగొన్న సైనికుల నందఱను జిత్రవధము గావించి యింకొక దృడతరమగు గృహమునందు రంగరాజు నాతని కుటుంబమును జేర్చి విస్వాసపాత్రులగు మఱికొందరు భటులను గావలిపెట్టి జాగ్రత్తగా మెలగ నజ్ఞాపించెను.

తనయత్నము నిష్ఫలము కాగానే యాచశూరుడు కొందఱువేగుల వాండ్రను జంద్రగిరిసేనానాయకుని యొద్దకు బంపి కొంతధనము లంచముగ నొసగజేసి జగ్గరాజు లేనపుడు కారాగృహపాలకుల జంపి కారాగృహద్వారముల దెఱచి తనకు వర్తమానము చేయునటుల గట్టడిజేసెను. జగ్గరాజు రాజ్యమునలేని తరుణము గనిపెట్టి సైన్యాధికారి కారాగృహ పాలకులను జంపించి కారాగృహద్వారములు తెఱపించి తనకు నమ్మకమైన దూత కీవార్తనువ్రాసిన జాబొసంగి యాచశూరునియొద్దకు బంపెను. దురదృష్టవశమున నాదూత జగ్గరాజుచేత జిక్కెను. జగ్గరాజు దొడ్డిగుమ్మము నుండి కోటలో బ్రవేశించి కారాగృహమును మరల బంధించి సైన్యాధికారిని నాతనితో గలిసిన యితరోద్యోగులను గూడ జంపించెను. ఈవర్తమానము యాచశూరుడు విని తనప్రయ త్నములన్నియు విఫలమైనందులకు మిగులవగచి సైన్యసహితముగ బోరాడి చంద్రగిరి దుర్గమును సాధించినగాని రంగరాజును విడిచిపెట్ట వీలుకాదని సైనికబలము నభివృద్ధిచేయు చుండెను. ఇంక నుపేక్షించినయెడల బ్రతిపక్షులు బలవంతులై రంగరాజును బంధోన్ముక్తినిగావించి తిరుగబడక మానరని దయావిహీనుడగు జగ్గరాజు రంగరాజు కుటుంబమును నాశనముజేయ సిద్ధపడెను. జగ్గరా జొకదినమున తనసోదరుడగు ఓబలరాజును బిలిపించి యాతనికి ఖడ్గము నొసంగి కారాగృహమునకేగి లోనున్న రంగరాజును గుటుంబసహితముగా దెగటార్చిరమ్మని పంపెను. క్రూరుడగు ఓబలరాజు దయారహితుడై కారాగృహమున బ్రవేశించి తన యన్నయాజ్ఞ వారికి వినిపించి వారి జెండబోయెను. రంగరాజు తిరుగబడి యోబలరాజును నాతనికి సహాయముగావచ్చిన సైన్యమును బొరొగొనవలయునని యత్నించెను. గాని దానివలన నిరపరాధులగు సైనికులు మరణించుటయెగాని తన కపాయము తొలంగజాలదని తలంచి రంగరాజు కుటుంబమరణమునకె యనుమతించెను. "ఓబలనాయకునిచేత జావనేల? నాచేతిమీదుగ దొలుత గుటుంబమును దెగటార్చి యాత్మహత్మ గావించు కొందుగాక" యని శూరశిరోమణియగు రంగరాజు కత్తిగైకొని యేపాపము నెఱుంగని తనపసిబిడ్డల నిరువురను ధర్మపత్నిని ఖండించి తనతల దాను నఱకికొని పడిపోయెను. ఈఘోరహత్యల విన్నంతనె జగ్గరాజుపై నసహ్యము రంగరాజుకుటుంబముపై గనికరము ప్రతిపౌరునకు జనించెను. జగ్గరాజుపరిపాలనముపై నసూయవహింపని మనుష్యుడె లేడు. రాజ్యచక్రము కేలనుంచుకొని కపటనాటకము నాడించు నా జగ్గరాజు దుర్మార్గ వృత్తికి జంకి పౌరుడెవ్వడును మాఱాడ డయ్యెను. కాని లోలోన నందఱకు గోపము వృద్ధినొందెను.

ఈ దుష్కృత్యము లన్నింటిని గాంచి యాచశూరుడు మిగుల నాందోళనపడి తాను బ్రతికియుండియు, నధర్మమును వారింపజాలనందులకు విచారపడెను. యాచశూరు డొకదినమున జగ్గరాజునొద్దకు నొకదూతని బంపి "రంగరాజు రెండవకుమారుడు ఇంకను జీవించియున్నాడు. ఆతనిని నన్ను జంపి మామేనల్లుచే జంద్రిగిరిరాజ్యము నాచంద్రార్కస్థాయిగా బాలింపజేయు"మని వర్తమాన మంపెను. జగ్గరాజావృత్తాంతమువిని తాను వేయికనులతో జూచుచున్నను శత్రుశేషము మిగిలినందులకు జాల విచారపడి యాచశూరు డాబాలు నెటులేని జంద్రగిరిరాజ్య ప్రభువును జేయకమానడని తలంచి యుద్ధప్రయత్నములు మానుమానియు సంధి గావించుకొందమనియు రాయబారములు పంపెను. యాచశూరుడు సంధికియ్యకొనననియు జంద్రగిరి సామ్రాజ్యము నిలువబెట్టుటయో చేతగాకున్న నశించుటయో కర్తవ్యమనియు రాజద్రోహులకు రాజభక్తులకు సంధికనుకూలమార్గములు లేవని వర్తమానము చేసెను. జగ్గరాజుపక్షమువారు చాలమందిధర్మపక్షమగు యాచశూరుని వైపు చేరిరి. సైన్యసహాయమున యాచశూరుడు చంద్రగిరి దుర్గము నొక్కుమ్మడి ముట్టడించెను. జగ్గరాయడు కొంతవఱకు బోరాడి పరాజయసూచనలగాంచి పటకుటీరమును వదలి రాజప్రసాదమునకు బారిపోయెను. పట్టువదలక యేబదివేల సైనికులను సమకూర్చుకొని యాచశూరవతంసుడు జంద్రగిరిని రెండు సంవత్సరము లెడతెగక ముట్టడించెను. జగ్గరాజు పదునేనువేల సైనికులతో గొంతకాలము ముట్టడికి నాగి రాయబారమునకు మరల బ్రయత్నించెను. యాచశూరుడు రాయబారుల దిరస్కరించి చంద్రగిరి దుర్గమును లోగొనెను. జగ్గరాజీ సంరంభమును జూచి పారిపోయెను. యాచశూరుడు రాజమందిరమున బ్రవేశించి కోటను స్వాధీనపఱచికొని విశ్వసనీయులగు సైనికులకు నుద్యోగములు నొసంగి పూర్వవస్తువు లన్నింటిని బయటికి దీయించి సామంత పౌరసమక్షమున శ్రీరంగరాయల పుత్రుడగు రామరాయ భూవిభునకు జంద్రగిరి రాజ్యము పట్టాభిషేకము గావించెను. బౌరులందఱును యాచశూరుని ధర్మపరతంత్రబుద్ధికిని స్వామిభక్తిని సంతసించి చంద్రగిరి రాజ్యమునకు మంత్రిగ నుండుమని ప్రార్థించిరి. కాని తన కర్తవ్యము నిర్వహింపబడినదని యాచశూరుదు తెలిపి తన రాజ్యమునకు నేగెను. పూర్వప్రభు వంశజుడగు రామరాజు తమకు బరిపాలకుండైనందులకు జగ్గరాజు దుష్టపరిపాలన మంతరించినందులకు బ్రజలు సంతసించి రాజ్యమున జిరకాలము మహోత్సవము లొనరించి తమయానందము బ్రకటించిరి.

ఈ యాచశూరుని విజయము క్రీ.స. 1601 లోనిదని చరిత్రకారుల విశ్వాసము. ఈ కథాంశమును న్యూయలు దొరవారు విజయనగర చరిత్రమునందు వ్రాసియున్నారు. దేశీయచరిత్రముల శోధించి వ్రాయబడిన దగుటచే నీకథ విశ్వసనీయమనక తప్పదు. తనప్రభునివంశమును నిలువబెట్టుటలో నెన్నియో కష్టములకోర్చి స్వామిభక్తి ప్రకటించిన వీరశిరోమణియగు యాచనాయకునకు ఆంధ్రవీరులు "రామరాజ రాజ్యస్థాపనాచార్య" బిరుదము నొసంగి తమశాశ్వత కృతజ్ఞతను బ్రకటించిరి. యాచశూరుని శూరత్వమును దామెర వేంగడపతి యిట్లు వర్ణించినాడు.

సీ. ఉత్తరమల్లూరియొద్ద దావల పావ
            విభుసి గొట్టిన నాటి విజయకలన
   తిరుమల జేరి ధాత్రిని మన్నెరాజుల
            బాఱదోలిన నాటి బాహుబలము
   చెంగలుపట్టు వీక్షించి లగ్గలుపట్టి
            యాక్రమించిన నాటివిక్రమంబు
   పాలెముకోట వెల్పల నాజి యతిరాజు
            జరుగ జేసిననాటి శౌర్యపటిమ

తే.గీ.మున్నెతోవూరు జగ్గరాణ్ముఖుల గెల్చి
    మధురదొర చెంజిమన్నీని మదమడంచి
    తిరుచినాపల్లి దొర దోలు తేజముగల
    మేటి వెలుగోటి యాచనిసాటి గలడె!
                  (బహులాశ్వచరిత్రము)

_______

అక్కన్న మాదన్న మంత్రులు

చిరకాలమునుండి మన మక్కన మాదన్న యనుజంట నామము లాలకించుచున్నారము. ఈ మంత్రివర్యుల జీవితములు సమగ్రముగా దెలిసికొనుట కాధారములు చాలినన్ని లేవు. సుప్రసిద్ధులగు నాంధ్రుల నాంధ్రేతరుల తమవారని చెప్పుకొనుట సహజముగాని వీరిని మహారాష్ట్రులని కొందఱనుచున్నారు. ఇది విశ్వసనీయముకాదు. వీరలాంధ్రులనుటకె యవకాశము లెక్కుడు కలవు.

అక్కన్న మాదన్నలలో మాదన్నగారె సర్వతంత్ర స్వతంత్రుడు, సమర్థుడును, నున్నతస్థితియం దున్నవాడునని తెలియుచున్నది. అక్కన్నమాదన్నగారలకుగల బాంధవ్యాదికములు నిర్ణయింప వీలు కలుగదు. వీరినిగూర్చి యొక చిత్ర