ఆంధ్ర వీరులు/అక్కన్న మాదన్న మంత్రులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తే.గీ.మున్నెతోవూరు జగ్గరాణ్ముఖుల గెల్చి
    మధురదొర చెంజిమన్నీని మదమడంచి
    తిరుచినాపల్లి దొర దోలు తేజముగల
    మేటి వెలుగోటి యాచనిసాటి గలడె!
                  (బహులాశ్వచరిత్రము)

_______

అక్కన్న మాదన్న మంత్రులు

చిరకాలమునుండి మన మక్కన మాదన్న యనుజంట నామము లాలకించుచున్నారము. ఈ మంత్రివర్యుల జీవితములు సమగ్రముగా దెలిసికొనుట కాధారములు చాలినన్ని లేవు. సుప్రసిద్ధులగు నాంధ్రుల నాంధ్రేతరుల తమవారని చెప్పుకొనుట సహజముగాని వీరిని మహారాష్ట్రులని కొందఱనుచున్నారు. ఇది విశ్వసనీయముకాదు. వీరలాంధ్రులనుటకె యవకాశము లెక్కుడు కలవు.

అక్కన్న మాదన్నలలో మాదన్నగారె సర్వతంత్ర స్వతంత్రుడు, సమర్థుడును, నున్నతస్థితియం దున్నవాడునని తెలియుచున్నది. అక్కన్నమాదన్నగారలకుగల బాంధవ్యాదికములు నిర్ణయింప వీలు కలుగదు. వీరినిగూర్చి యొక చిత్ర కథ వాడుకలో నున్నది. అందు సత్యమెంతయున్నను వినుటకు మాత్రము యుక్తియుక్తముగ నున్నది.

మాదన్నమంత్రి దానకర్ణుడై యహోరాత్రములు లేదనకుండ దనగృహమున బ్రాహ్మణజనమునకు సత్రము బెట్టుచుండువాడట. ఆసత్రములో జిరకాలమునుండి యక్కన్న భుజించుచు గాలక్షేపము చేయుచుండెను. అక్కన్నగారు సత్రమువారందఱితో గూడ దాను మాదన్నగారికి సోదరుడనని చెప్పువాడు. రానురాను సత్రమువారెకాక మాదన్నగారి భార్యసైతము గౌరవముగా నక్కన్నగారిని దిలకించుచు భోజనాదికములలో శ్రద్ధవహించుచుండెను. ఒకనాడు మాదన్నగారి భార్య భర్తతో మంతనము నాడుచు "మీసహోదరుడు చాలకాలమునుండి సత్రములో భుజించుచు దిక్కుమాలిన వానివలెనుండ జూచుచుండెదరేమి? సంస్థానములో నుద్యోగము నిప్పింపరాదా!" యని ప్రశ్నించెను. మాదన్న నివ్వెఱపోయి "సోదరు డెవరు నేనెఱుగనే!" యనెను. అంత నాతని ధర్మపత్ని "మనసత్రములో భుజించుచున్న యక్కన్నగారు మీసహోదరుడని నేనాతనిముఖమునకా వినియున్నాను. మీరెఱుగనటుల భాషింతురేల?" యనెను. మాదన్న ఆశ్చర్యపడి వెంటనే పరిచారకునిచే నక్కన్నగారిని పిలిపించి యుచితాసనము జూపించి కూర్చుండ జేసి "మిత్రమా? నీవెవ్వడవు నీనివాసమెద్ది? నీకు నాకుగల బాంధవ్యమే దియొ తెలుపు"మని యడిగెను. అక్కన్న మిగుల వినయముతో మాదన్ననుజూచి 'నన్ను నీవెఱుగక పోవచ్చును. నేను పెద్దమ్మకుకుమారుడను, నీవు చిన్నమ్మకుమారుడవు. కావున మనమిరువురము సహోదరులము. ఇది నీకును నాకును మాత్రమె తెలియదగిన యంశము. నాయందింకముందు గూడ నిటులె భ్రాతృగౌరవ ముంచవలయు' ననెను. నాట గోలె మాదన్నయు నాతని ధర్మపత్నియు నక్కన్నగారిని మిగుల దయతో దిలకించుచు నింటనేయుంచి యాదరింపసాగిరట. ఈకథలోని సత్యాసత్యములను విచారింప బూనుట ప్రకృతముకాదు.

అబూహసన్ కుతుబ్‌షా యనునామాంతరముగల తానీషానామము మనము రామదాసుచరిత్రము పఠించిననాటనుండి వినుచునె యున్నారము. తానీషా మిగుల పరాక్రమశాలియై హిందూ మహమ్మదీయుల నైకమత్యముగ బాలించుచు గోలకొండ ముఖ్యస్థానముగ జేసికొని చిరకాలము రాజ్యమును బరిపాలించెను. ఇతనియొద్దనె మాదన్నముఖ్యమంత్రియై రాజ్యాంగములను నిర్వహించుచుండెను. అక్కన్న మాదన్నగారి లిరువురు సహోదరులనియు బింగళియను నింటిపేరు గలవారనియు, భారద్వాజస గోత్రులనియు దద్వంశీయులు చెప్పుచున్నారు. అక్కన్న మాదన్నగారల మేనల్లుడని మనము వినుచున్న కంచెర్ల గోపమంత్రియను రామదాసు సైతము నియోగియు, నాంధ్రుడు కావున నక్కన్న మాదన్నగారలు నాంధ్రులా, కారా యనుచు విచారింపనవసరములేదు. అక్కన్న మాదన్నయను నామము లాంధ్రులలో గానవచ్చుటవలనను జిరకాల మాంధ్రదేశమునందె వీరుంటవలనను నాంధ్రులతో బాంధవ్యము గానవచ్చుటవలనను వీరల నాంధ్రులనియె విశ్వసించి తీఱవలయును.

తానీషాయొద్ద మాదన్నగా రింతయనరాని గౌరవముతో మంత్రిపదవి నిర్వహించుచుండిరి. అక్కన్నగారు తానీషాయొద్ద సర్వసైన్యాధ్యక్షుడై రాజ్యక్షేమమునకై యావచ్ఛక్తి వినియోగించుచుండెను. మాదన్నగారు హిందూమహమ్మదీయుల కైకమత్యము ఘటించుచు భిన్నాభిప్రాయముల బాఱదోలుచు మిగుల జాగరూకతతో రాజ్యస్థితిగతుల నరయుచు రాజ్యపరిపాలనము గావించుచుండెను. అన్యశ్రేయసునకు సహింపని కొందఱు దుర్మార్గమున కొడిగట్టి యక్కన్న మాదన్నగారికి మహమ్మదీయ జాతికి భిన్నాభిప్రాయమును గల్గింప నారంభించిరి. అట్టివారిలో మహమ్మద్ ఇబ్రహీం అనువా డొకడు. ఇబ్రహీం తానిషాయొద్ద సర్వసైన్యనాయకుడుగ నుండి దుర్మార్గము లనేకములు గావించుచుండె. నాతని దొలంగించి మాదన్నగా రాస్థలమున నక్కన్నగారిని జేర్చిరి. అది మొద లక్కన్నగారి యొక్కయు మాదన్నగారి యొక్కయు మారణమున కిబ్రహీము తన యావచ్ఛక్తి వినియోగించుచుండెను. తానీషాయొద్ద నిచితమగు గౌరవ భావము ప్రజలయొద్ద భక్తి విశ్వాసములు గల యీమంత్రివర్యుల నేవిధముగనేని వంచింపనెంచి తరుణముకొఱకు వేచియుండెను. అక్కనమాదన లాతని లక్ష్యపెట్టరైరి.

మొగలురాజు లెటులైన గోలకొండరాజ్యము హరింప దీప్రయత్నములు కావింపసాగిరి. ఔరంగజేబు మిగులనాసక్తితో గోలకొండ రాజ్యముకొఱకు గుటుకలు మ్రింగుచుండెను. అక్కన్న మాదన్నగార లీయంశము గ్రహించి రాజ్యములోని హిందూమహమ్మదీయుల కైకమత్య మభివృద్ధిగావించి యాకాలమున బలవంతుడైయున్న శివాజీచక్రవర్తితో దానీషాకు స్నేహము కుదిర్చిరి. శివాజి గోలకొండ కొకమారువచ్చి తానీషా యొసంగిన యాతిధ్యము స్వీకరించి గోలకొండ రాజ్యము సురక్షితముగ జేయుదునని వాగ్దానము గావించెను. శివాజీ కాలధర్మము నొందిన పిమ్మట శంభాజి రాజ్యమునకు వచ్చెను. అక్కన్నమాదన్నగారలు పూర్వము వలెనే శంభాజికి దానీషాకు నైకమత్యము గుదిర్చిరి.

రాజ్యతృష్ణగల డిల్లీశ్వరుడగు నౌరంగజేబు గోలకొండ రాజ్యము హరింపవలయునని పలుమాఱు సైన్యమును బంపెను. అక్కన్న మాదన్న గారలు యవనాంధ్ర సైన్యముల నెదురు నడిపి యౌరంగజేబు సైన్యముల వినాశము గావించిరి. అవమాన పీడితుడగు నౌరంగజీ బంతతో నాయత్నము మానుకొనక గోలకొండ రాజ్యముకొఱకు దురాలోచనములు పెక్కు చేయుచుండెను. ఆకాలమున ఈష్టుఇండియా కంపెనీవారు హిందూదేశమున బ్రవేశించి మదరాసు, మచిలీపట్టణము లోనగుచోటుల చిన్నచిన్న కొట్లువెట్టి వ్యాపారము జేయుచుండిరి. ఔరంగజేబునకు గంపెనీవారికి నభిప్రాయము భేధించుటచే వారికి నిలువనీడ దొరకదయ్యెను. అపుడు కంపెనీవారు గోలకొండరాజ్యము సర్వాధికారములతో బరిపాలించుచున్న యక్కన్నమాదన్నల నాశ్రయించి సముద్రతీర ప్రాంతములను గౌలునకు బుచ్చుకొని వ్యాపారము జేయ నిశ్చయించి యుపాయాంతరము నన్వేషింప సాగిరి. గోలకొండ రాజ్యమున కంతటికి సుబేదారుగా నున్న పగడాల లింగప్ప యను నొకసరదారు రేవులలో గంపెనీవారి సామానులు దిగకుండ నాటంక పఱచి కంపెనీవారి విజృంభణము నంతయ దుదముట్టింప సిద్ధపడెను. కంపెనీవా రక్కన్న మాదన్న గారలతో స్నేహము సంపాదించుకొని పగడాల లింగప్పవలన దమకు గలుగుచున్న చిక్కులన్నియు నివేదించిరి. అపు డక్కన్న మాదన్నగారలు పగడాల లింగప్పకు నొకజాబు వ్రాసిరి. లింగప్ప యాజాబు నందలి "కంపెనీవారి వ్యాపారమునకు నాటంకము గలుగనీయకుము" అను వాక్యముజూచి యపటికి జేయునదిలేక యూరకుండెను. కంపెనీవారు వ్యాపారప సైనికబలము వృద్ధిచేయుట జూచి లింగప్ప అక్కన్నమాదన్న గారలకు దెలిపి కంపెనీవారు కొలదికాలములో స్వతంత్ర రాజ్యము స్థాపించి మనకపాయము గలిగింతురని తెల్పెను. అక్కన్న మాదన్న లామాటలువిని యందలి సత్యము విచారించి తెలిసికొని గాని తొందరపడరాదని వారి యత్నము లరయుచుండిరి.

పగడాల లింగప్పయే అక్కన్న మాదన్న గారలకు దమకు భిన్నాభిప్రాయము కలుగ జేసెనని తలంచి కంపెనీ వారు గోలకొండకేగి అక్కన్న మాదన్నను సందర్శించి తాము సేనలను వృద్ధిచేయుచున్నది ఆత్మసంరక్షణముకె గాని దేశము నార్జించుటకు గాదనియు తమ పని వర్తకముమాత్రమె యని నివేదించిరి. ఇంతలో మాదన్నగారి తనయుడగు మల్లప్పయను వాని యుపనయనము సమీపించెను. అది గ్రహించి కంపెనీవారు మాదన్నగారి కొక వీసెబరువుగల బంగారు గొలుసు, నాలుగువందల వరహాలు అనేకామూల్యములగు పట్టు వస్త్రములు బహుమానముగా నొసంగిరి. అంతతో బోక మాదన్నగారి పేష్కారునకు గొంతధనము మాదన్నగారి పినతండ్రిగారికి గొంతరొక్కము నొసంగి యందఱ సంతృప్తి పఱచిరి. మాదన్నగారు కంపెనీవారు ధర్మ వర్తనులనియు విధేయులనియు గేవల వ్యాపారులనియు దలంచి యెవరివలన నెట్టి యాటంకములు లేకుండ రేవులలో వ్యాపారవస్తువులు దిగుమతిచేయించుకొని విక్రయించి కొనుటకు ఖండాంతరములనుండి వ్యాపారమునకు వచ్చు నితర వర్త కులను వెడలగొట్టుటకు నంగీకరించెను. దీనితో ఈష్టిండియా కంపెనీవారు వ్యాపారము వృద్ధిచేసికొని స్వతంత్రులగుట కవకాశము చిక్కెను.

తానీషయు నక్కన్న మాదన్న గారలు చేయు ధర్మపరిపాలనము విప్లవకారులగు కొందఱకు మిగుల కష్టతరముగ నుండెను. అట్టివారిలో బూర్వము సైన్యాధ్యక్షుడుగ నుండి స్థానభ్రష్టుడైన మహమ్మద్ ఇబ్రహీం ఒకడు. ఇతడుకొంత పలుకుబడి కలవాడగుటచే దీవ్రముగ బ్రయత్నము జేసి యక్కన్న మాదన్నగారలయందు మహమ్మదీయజాతికంతకు నేవము పుట్టించెను. విడిగనున్న నీతనివలన విప్లవమువచ్చునని తానీషా మహమ్మదు ఇబ్రహీమునకు సేనానాయక పదవి మాత్ర మొసంగి వానిని జాగరూకతో దిలకించుచుండెను.

మాదన్నగారు మిగులనాచారపరాయణుడు. ప్రతిదినముదయమున బ్రాత:కాలకృత్యముల దీర్చుకొని చాలసేపు శివపూజ గావించి యనేక బ్రాహ్మణుల నాహ్వానించి వారి పంక్తిని భుజించి రాజకీయ కార్యములు నిర్వహించువాడు. మాదన్న త్యాగశీలుడు. పండితపక్షపాతి. సర్వకాల సర్వావస్థలయందు విద్వత్సహవాసము గావించుటచే నీతనికి గొప్ప పాండిత్యము కూడ నలవడెను. మాదన్నగారు తమ యుపవనములోని సరోవరమున స్నానము గావించుచుండ నిబ్రహీంచే బ్రేరేపితుడై వచ్చి యొకతురుష్కు డా కొలనిలో మునిగెను. మాదన్నగా రాతురుష్కుని సాహసమునకు మిగుల గోపించి వెంటనే యాతని శిక్షించిరి. దుర్మార్గుడగు నాయవనుడు దేహమునిండ గాయములుగావించుకొని పురములోని మహమ్మదీయు లందఱకు జూపి మాదన్నగారి దుర్మార్గమును వేయివిధముల నుగ్గడించెను. మాదన్నగారి విషయమై తానీషాకు దెల్పినను లాభములేదని మహమ్మదీయు లందఱు నిశ్చయించి బ్రాహ్మణ మంత్రులచే దానీషా చేయించు దుండగములలో నిదియొకటిగ డిల్లీశ్వరునకు నివేదింపుమని వానినిబ్రోత్సహించి పంపిరి. వెంటనేవాడు బయలువెడలి కొన్నిదినములకు డిల్లీకి జేరి యౌరంగజీబును సందర్శించి తానొందిన దురవస్థయు దానిషాయొక్క యధర్మ పరిపాలనము, అక్కన్న మాదన్నల యవినీతి యను నంశములగూర్చి లేనిపోనివి చాలసేపు ఘోషించెను. చాలకాలము నుండి గోలకొండ రాజ్యముకొఱకు ప్రయత్నము జేయుచు విఫలమనోరథుడగుచున్న యౌరంగజీబు గోలకొండ రాజ్యములోని సైనికుల యంతరంగము, రాజద్వేషము నా యవనులవలన సాకల్యముగ విని యిదియె తరుణమని తన కుమారుడగు మువాజ్జం అనువాని కమితమగు సైన్యము నొసంగిపంపెను.

తానిషా, మువాజ్జం గోలకొండ రాజ్యమును ముట్టడింప వచ్చుచున్నాడని విని మార్గమధ్యమున బ్రతిఘటించుటకై తనబలములో సగము నొసంగి మహమ్మద్ ఇబ్రహీం మును బంపి మిగిలిన సగముసైన్యము నక్కన్నగారి యాధీనము గావించి గోలకొండ దుర్గమును రక్షింప నియోగించెను. అక్కన్న మాదన్నగారల నంతము నొందింప వలయుననియు తానీషాను రాజ్యమునుండి తొలగింప వలయుననియు, దలంచిన వాడగుటచే నౌరంగజీబుచే బంపబడిన మువాజ్జంరాన్‌జహాన్ అనువారితో మహమ్మదు ఇబ్రహీం కలిసి వారిని గోలకొండ దుర్గమునొద్దకు గొనివచ్చెను. ప్రత్యర్థుల సైన్యమంతయు నమితోత్సాహముతో హైదరాబాదునకు సమీపములోనికి వచ్చెను. తానీషా, మహమ్మద్ ఇబ్రహీ మొనర్చిన దుర్మార్గము నంతయు నాలకించి యపజయము నిశ్చయమని భావించి సైనికుల శక్తియున్నవఱకు బోరుమని నియోగించి తాను ప్రాణభీతిచే దుర్గములోనికేగి దుర్గద్వారము లన్నియు మూయించి యఱచేతిలో బ్రాణములు పెట్టుకొని యుండెను.

మువాజ్జం సైన్యము స్వేచ్ఛగా గోలకొండ దుర్గములోనికి గసుగందకుండ బ్రవేశించి ధనవంతుల గృహములదోచి స్త్రీల జెఱబట్టి యనేక దురంతములు గావించిరి. ఈదుర్మార్గములన్నియు స్వామిద్రోహియగు మహమ్మదు ఇబ్రహీము దగ్గరనుండి చేయించెను. రాజ మందిరములో బ్రవేశించి తానీషాను అంత:పురకాంతలను జెఱబట్టదలంచిరి గాని యప్పటికి సాయంకాలమగుటచే గోటభేదించుటకు బొద్దుచాలదని యాప్రయ త్నము మఱునాటి యుదయమున జరుపవలయునని నిశ్చయించుకొని శిబిరములకు జేరిరి.

ఈ సంగ్రామమునకు ముఖ్యముగ బ్రాహ్మణు లగు నక్కన మాదనగారలు మంత్రులుగ నుండుటయే కారణమని పరిజనుల వలన విని యంత:పుర కాంతలు వీరభటులను దానిషాకు దెలియకుండ హంతకుల బిల్పించి వారి కనేక భూషణముల నొసంగి యక్కన్నమాదన్నగారల వధించి వారితలల గొనిరమ్మని యాజ్ఞాపించిరి. హంతకులు త్రోవలు గాచి దాక్షిణ్యశూన్యులై నిర్దోషులగు నక్కన్న మాదన్నగారల రాజద్వారము ముందు దునిమి యుత్తమాంగ లంత:పురమునకు జేర్చిరి. వెంటనే యంత:పుర కాంతలు ఖండితశీర్షముల నొక వెండిపళ్లెరములోనుంచి మువాజ్జమునొద్దకు బంపిరి. అక్కన్న మాదన్నలు వధింపబడగనే వీరావేశముతో మహమ్మదీయు లందఱు విజృంభించి గోలకొండలోనున్న బ్రాహ్మణుల నందఱను జెండాడి రక్తప్రవాహములచే దుర్గమంతయు గలుషితము గావించిరి. తానీషా మంత్రివర్యుల యొక్కయు బ్రాహ్మణుల యొక్కయు దుర్మరణమునకు విచారము నొంది చేయునదిలేక రెండుకోటుల రూపాయ లపరాధము నొసంగి మువాజ్జంతో సంధి గావించుకొనెను. మువాజ్జం సైనికు లాసంగ్రామములో గోలకొండనగరములో నాలుగైదు కోటులకు బైగా ధనము దోచికొనిరి. 1686 సంవత్సరములో నౌరంగజేబు సేనలతో గుల్బర్గాకు బోవుచున్నటుల బ్రయాణమై యాకస్మికముగ గోలకొండను ముట్టడించెను. తానీషా తనబలము నతంయు వినియోగించి యేడుమాసములు పోరాడి యోడిపోయెను. ఔరంగజేబు తానిషాను బంధించి 1687 లో దేవగిరి దుర్గముమీద జెఱబెట్టెను. అతడా కారాగృహమునందె మరణించెను.

అక్కన్న మాదన్నగారలు తానీషా సామ్రాజ్యమున క్రీ.శ. 1659 మొదలుకొని 1686 వఱకుండియుందురు. స్వామిభక్తి పరాయణులు సత్యప్రియులు నగు నీయాంధ్ర మంత్రివర్యు లకారణముగ జాతి ద్వేషపరాయణులచే వధింపబడిరి. అక్కన్నమాదన్నలతో గోలకొండ రాజ్య మంతరించెను. గోలకొండరాజ్య మష్టైశ్వర్యములతో నుంటకు నక్కనమాదన గారలు వినాశమగుటకు మహమ్మదు ఇబ్రహీము కారకుడు. అక్కన్న మాదన్నలు మరణించినను వారి చరిత్రము భారత జాతి యున్నంతవరకు సజీవముగ నుండ గలదు. అక్కన్న మాదన్న రచ్చనావడులు బెజవాడ కనకదుర్గాలయ సమీపమునను వారల సత్రము లను ప్రదేశము నందిగామ సమీపమున ముని యేటియొడ్డునను నేటికి దర్శనీయములుగ నున్నవి. అక్కన్న మాదన్నలు ధర్మసంస్థాపకులు. హిందూ మహమ్మదీయ సమ్మేళనమునకు వారు పాటుపడి దేశమాతకు బలి యొసంగ బడిరి. వారానాడు నాటిన బీజమె యిప్పటికి మహావృక్షమై దుర్భేదమై ఫలవంతమైనది. మహాత్ముల జీవితముల లోని ధర్మ రహస్యముల గ్రహించుటకు దివ్యదృష్టి కావలెననుట కీ యక్కన్న మాదన్నల చరిత్రమె ప్రమాణము. భద్రాచల రామదాసను పరమభక్తుని పవిత్ర చరిత్రము ఎఱుంగని యాంధ్రుడు లేడు. రామదాసు మొదటిపేరు గోపన్న. ఈయన అక్కన్న మాదన్నలకు మేనల్లుడనియు దానీషాకు జెందవలసిన ధనమును జేర్పక హరించుటచే జెఱసాలలో నుంచిరనియు నీయన భద్రాచలమున దాశీలుదారుగా నున్నప్పుడు రామాలయము గట్టించెననియు మనము వినియున్నారము. రామదాసు వంటి భక్తునకు మేన మామయగుట గూడ అక్కన్న మాదన్నల ప్రశస్తి కొక సాదనము.


సంపూర్ణము.
Andhraveerulupar025903mbp.pdf