ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం) విన్నపం

వికీసోర్స్ నుండి
ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం)‎ (విన్నపం)
కొమర్రాజు వెంకట లక్ష్మణరావు


విన్నపము


 

విజ్ఞాన మానందము. విజ్ఞానము పురుషార్థము. విజ్ఞానము పరమార్థము. విజ్ఞానము పరబ్రహ్మము. విజ్ఞాన తరంగములు విశ్వవిలాసములు. శాస్త్రజ్ఞులు, కవులు, శిల్పులు, మంత్రులు, యోధులు, మతాధిపతులు, త్యాగులు, కార్మికులు మొదలగు విజ్ఞానోపాసకులు దేశకాలపాత్రావరణాతీతమైన విజ్ఞానారాధనమును మానవధర్మాభ్యుదయమునకుఁ జేయుచున్న విధమును విజ్ఞానోదంత మనంతముఖములను విశదము చేయుచున్నది.

ఆంధ్రవిజ్ఞానసర్వస్వమును నీ మహాకార్యమును యధాశక్తిని నిర్వహించుట కుపక్రమించిన విధము మొదటిసంపుటము నందలి ప్రస్తావనయందు విశదీకరింపఁబడినది. రెండవసంపుటము నందీ చర్వితచర్వణ మనవసరము. రెండవసంపుటమును ప్రకటించుటయందుఁ గలిగిన కాలవిలంబనము వర్తమాన దేశ పరిస్థితులం దనివార్యము. బహుజన సాహాయ్యమునను, విశేష సాధనసంపద వలనను సాధ్యమైన ప్రచురణనందు కాలవిలంబనము సహజము. రెండవ సంపుటమునకు వ్యాసములను వ్రాసి ప్రచురణమును సాధ్యము చేసిన వ్యాస లేఖకులకు వందనములు. మాకుఁగావలసిన ఛాయాచిత్రములనొసంగి ద్వితీయ సంపుటమునందు ముద్రించుట కనుమతించిన మద్రాసు గవర్నమెంటు మ్యూజియము, సూపరింటెండెంటు గారికిని,కోటగిరి ఆర్కెయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సదర? సర్కిల్ సూపరింటెండెంటుగారికిని, కలకత్తా ఇండియా మ్యూజియము సూపరింటెండెంటు (ఆర్కెయోలాజికల్ సెక్షను) గారికిని హైదరాబాదు హెచ్.ఇ.హెచ్. ది నిజామ్స్ ఆర్కెయోలాజికల్ డిపార్టుమెంట్ డైరెక్టరుగారికిని సంపాదకులు కృతజ్ఞులు. పునర్ముద్రణము నందు నూతనాంశములు చేర్చఁబడి ద్వితీయ సంపుటము అన్-అశ్విని వఱకును పర్యాప్తమగుచున్నది. భగవంతుడును, ఆంధ్ర మహాజనులును నీప్రయత్నము సార్థకమగుట కనుగ్రహింతురుగాత!


భావ సం. మాఘశుద్ధ
౧౪, శనివారము
}         కా.నాగేశ్వరరావు.