Jump to content

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం)1

వికీసోర్స్ నుండి
అన్-అనంతజిత్తు


అన్ — అన్ అనునది దక్షిణబర్మాయందలి క్యాక్ ఫ్యూ జిల్లాయందలి యొక పట్టణప్రాంతమునకు పేరు. దీని వైశాల్యము 2,861 చతురపు మైళ్లు. జనసంఖ్య 27,863. ఆదవిభాగము విశేషము, వ్యవసాయము తక్కువ. రాబడి రూ.31,000లు. ముఖ్య పట్టణము అన్ అనునది. అక్కడ 826గురు జనులు గలరు.

అనంగ — భారతవర్షీయనది (భార, భీష్మ, అ. 9).

అనంగజీవన — ఇది యొక బాణము. వాసంతికా వసంత శేఖరుల యన్యోన్యానురాగమును,వారి సమావేశము నిందు వర్ణింపఁబడినవి. ఆత్రేయసగోత్రజుఁడగు వరదగురువు అనునతఁడు దీనిని రచించెను. విశ్వగుణాదర్శమును వ్రాసిన వేంకటాచార్యుని కితఁడు పినతండ్రి. ఇతని యితర గ్రంధములు: కారికాదర్పణము, కృష్ణాభ్యుదయము.

అనంగదేవుడు — చేదిదేశపు రాజు. హైహయ వంశమునందు జననమందెను. తండ్రి పేరు అర్జునుఁడు.రాష్ట్రకూట నృపాలుఁడు ఇంద్రుఁడీ యనంగదేవుని కూఁతును బెండ్లియాడెను.

అనంగపాలుఁడు — ఢిల్లీ రాజు. తువర వంశముసందుఁ జివరివాఁడు. ఈతనికాలముననే యీతని రాజధానికి 'ఢిల్లీ' యని పేరు గలిగెను. ఇతనికి పుత్రసంతానము లేదు. ఇద్దఱుకొమార్తెలుండిరి. అందు కమలదేవి యనునామెను అజమీరు రాజయిన సోమేశ్వరున కిచ్చెను. ఈమె కుమారుఁడే తరువాత ఢిల్లీశ్వరుఁడైన పృథ్వీరాజు. రెండవ కుమార్తె యగు విమలాదేవిని కనోజ్ రాజైన విజయపాలున కిచ్చిరి. ఈమెయే జయచంద్రుని తల్లి. అనంగపాలుఁడు ముసలివాఁడై బదరికాశ్రమమునకుఁ బోవునపుడు తన ఢిల్లీ రాజ్యమును దౌహిపుత్రుఁడగు పృథ్వీరాజున కిచ్చెను.

అనంగబ్రహ్మవిద్యావిలాసము — ఇది యొక భాణము. శృంగారరసప్రధాన మైయినది. రచయిత వాధూల వరదార్యుఁడు.

అనంగభాగి — ఒక బ్రహ్మర్షి.

అనంగవిజయము — శృంగారరసప్రధాన మగునొక నాటకము. దీనిని రచించినవాఁడు శివరామకృష్ణుఁ డను నతఁడు. నారాయనుఁ డనునతఁ డీశివరామకృష్ణుని తండ్రి.

అనంగాధరి — ఉభయవక్రసంపూర్ణరాగము. 39వ మేళకర్తయగు ఝలవరాళీరగజన్యము. అరోహణము: స రి గ రి మ ప ని ధ ని స; అవరోహణము: స ని ప ధ మ గ మ రి స యని సంచారముకలది.

అనంగుఁడు — 1. శివునిచే భస్మము చేయఁబడిన తరువాత మన్మధునకు వచ్చిన పేరు (చూడుడు: మన్మధుడు), 2. రామసేనయందలి యొక వానరుఁడు.

అనంత — 1. ఈ పేరుగల సంస్కృతకవు లెందఱో కలరు. వారిలో నీ క్రిందివారు ముఖ్యులు: (1) ఉదయభాను కావ్యకర్త; (2) కారకచక్ర రచయిత; (3) చిదంబరాష్టకకారుఁడు; (4) యోగామృతార్థచంద్రిక యను పాతాంజలయోగసూత్రభాష్యమును రచింఛినవాఁడు; (5) వాక్యమంజరీ రచయిత; (6) విథ్యపరాధ ప్రాయశ్చిత్తప్రయోగ రచయిత; (7) వాజసనేయసంహితకు 'శుక్లదశభాష్యము'ను వ్రాసినవాఁడు; (8) సాహిత్యకల్పవల్లి యను నలంకారగ్రంథమునుగూర్చినవాఁడు; (9) భీముని కుమారుఁడు, నైగేయార్చికానుక్రమమును వ్రాసిన వాఁడు; (10) మంత్రిమండల కుమారుఁడు; 1458వ సంవత్సరమున కామసమూహ మహా ప్రబంధము అను కామశాస్త్రమును రచించినవాఁడు. 2. వక్రషాడవ - ఔడరాగము. పదునేడవ మేళకర్తరాగమగు సూర్యకాంతి రాగజన్యము. ఆరోహణావరోహణములందు - రి స మ ప ధ ని స; స ప మ గ రి స యని సంచారము కలది.

అనంతకవి (చిత్రకవి) — ఇతఁడు పెమ్మసాని చినతిమ్మానాయని కాశ్రితుఁడు. పదునేడవ శతాబ్ది మొదటియర్ధముననున్న వాఁడు. ఆఱువేలనియోగి బ్రాహ్మణుఁడు. చిత్రకవి పెద్దనార్యుని పుత్రుఁడు. భారద్వాజసగోత్రుఁడు. ఇందుమతీపరిణయమను ప్రబంధమును రచించెను. హరిశ్చంద్రనలోపాఖ్యానమునకును, విష్ణుచిత్తీయ మునకును టీకా వ్రాసినవాఁడు. ఆంజనేయోపాసకుఁడు.

అనంతగిరి -

  1. తూర్పుగోదావరి ఏజెన్సీజిల్లా, యెల్లవరం తాలూకాయందలి గ్రామము. జనసంఖ్య 100 (1931).
  2. గంజాంజిల్లా పర్లాకిమిడి తాలూకాలోని జమిందారీ గ్రామము. జనసంఖ్య 131 (1931).
  3. గంజాంజిల్లా పర్లాకిమిడి తాలూకా జమిందారీ గ్రామము. జనసంఖ్య 20 (1931).
  4. గంజాంజిల్లా పర్లాకిమిడి తాలూకా జమిందారీ గ్రామము. జనసంఖ్య 143 (1931).
  5. గంజాంజిల్లా టెక్కలి తాలూకాలోని ఈనాం గ్రామము. ఇచ్చటి జనసంఖ్య 535 (1931).

అనంతచ్ఛందస్సు - (చూడుఁడుః అనంతామాత్వుఁడు).

అనంతజిత్తు - ఇరువదినలుగురు జినులలోఁ బదునాలుగవవాఁడు. ఇతఁడు వర్తమానావసర్పిణి నుండి యావిర్భవించెను. ఇతని