Jump to content

ఆంధ్ర రచయితలు/వేంకట రామకృష్ణ కవులు

వికీసోర్స్ నుండి

వేంకట రామకృష్ణ కవులు

1883 - 1939

1889 - 1918

మొదటివారు ఓలేటి వేంకటరామశాస్త్రిగారు. రెండవవారు వేదుల రామకృష్ణశాస్త్రిగారు. వీరు మేనత్త మేనమామ బిడ్డలు (వేంకట రామశాస్త్రి తండ్రి రామకృష్ణశాస్త్రి మేనమామ. రామకృష్ణశాస్త్రి తల్లి వేంకటరామశాస్త్రికి మేనత్త) ఆరామద్రావిడశాఖీయ బ్రాహ్మణులు. మొదటికవి జన్మస్థానము: పల్లిపాలెము (కాకినాడ తాలూకా) తల్లి: కామేశ్వరమ్మ. తండ్రి: నారాయణశాస్త్రి. జననము: 15-11-1883 సం|| అస్తమయము: 3-12-1939 సం|| రెండవకవి యభిజననము: కాకరపర్రు (తణుకు తాలూకా) తల్లి: సూరమ్మ. తండ్రి: రామచంద్రశాస్త్రి. జననము: 1889. నిర్యాణము: 1918. ఈ జంటకవుల నివాసగ్రామము పిఠాపురము. విరచితగ్రంథములు: వ్యాసాభ్యుదయము, దమయంతీ కల్యాణము (అచ్చతెలుగు కావ్యము) విశ్వగుణాదర్శము, ఉత్తరరామచరిత్ర, మదాలస, దమయంతి, ఇందిరాదేవి, శకుంతల, సుభద్ర, భోజచరిత్ర, కాత్యాయన చరిత్ర, కవికంఠాభరణము, సువృత్తి తిలకము, పాణిగృహీతి, కొండవీటి దండయాత్ర, అత్యద్భుత శతావధానము, శతఘ్ని, అట్టహాసము, పరాస్తపాశుపతము, రామకృష్ణ మహాభారతము, ఆంధ్ర కథాసరిత్సాగరము (6 లంబకములు) ఇత్యాదులు.

ఆంధ్రభోజుని యాస్థాన విద్వత్కవులగు వేంకట రామకృష్ణ కవుల కవితాప్రతిభ, విమర్శనశక్తి తెలుగువారికి దెలిసియే యుండును. 1909 సంవత్సరమున రామకృష్ణులు పిఠాపురసంస్థానమున బ్రవేశించిరి. నాటికి వేంకటరామశాస్త్రిగారి వయస్సు ఇరువదియాఱు వత్సరములకు మించదు. రామకృష్ణశాస్త్రిగారికి బదునెనిమిది దేండ్లు దాటినవి. సంస్థాన ప్రభువులు శ్రీ రావు వేంకట కుమార మహిపతి సూర్యరాయేంద్రు వీ కవకవుల బుద్ధి చాకచక్యమునకు గవితాధోరణికి నానందపడి యవధానవిశేషముల గాంచుట కనుమతించిరి. ఏ సుముహూర్తమున నీ జంటకవులు ప్రభువుకంట బడిరో యపుడే శ్రీవారి యనుగ్రహాంకూరము రామకృష్ణుల యభ్యుదయ క్షేత్రమున బడినది. దిగ్దంతులవంటి పండితులమ్రోల నా మహాస్థానమంటపమున నత్యద్భుతావధానము సేయునపుడు రామకృష్ణుల లీలలు పలువుర కానందాశ్చర్యములు కలిగించినవి. మహీనాథు డవధానానంతరము మూడు నూటపదియార్లు పట్టుసాలువలతో బహూకరించి యా కవులను దమ సంస్థానిలో నుండగోరెను.

పిమ్మట నత్యద్భుత శతావధానము, శతవిధానము [గంటకు నూఱుపద్యములు చెప్పుట] శతప్రాసము [ఒకేప్రాసముమీద నూఱు పాదములు గంటలో జెప్పుట] అష్టావధానము మున్నగువానిచే మన కవులు మహారాజు చిత్తమును మఱింత రంజింపజేసిరి. శతప్రాసము చెప్పుసందర్భమున "...ఇట్లిరవుగ గొన్నిపాదములనే మును గబ్బము తాత సెప్ప న, బ్బురపడి తత్సభాస్థలిని బోరన గద్దియ డిగ్గి గండ పెం, డెరమును గృష్ణరాయుడు తొడ్గె న్నృపపుంగువ!..." అని యభిప్రాయగర్భముగా నెట్లుచెప్పిరో పరికింపుడు.

వేంకటరామకృష్ణులు పిఠాపురసంస్థానమునకు బోవుచున్నటు లింటియొద్ద బెద్దవారి కేరికిని జెప్పనేలేదు. పట్టుసాలువలు కప్పుకొని సింగపు బిల్లలవలె వచ్చుచున్న యా యువకవుల గని తలిదండ్రు లానందభరితులైరి. గ్రామస్థు లాశ్చర్యకలితులైరి. ఈ జంటలో దొంటికవి ఓలేటి వేంకటరామశాస్త్రి, ద్వితీయుడు వేదుల రామకృష్ణశాస్త్రి. వీరు మేనత్త మేనమామ బిడ్డలు. వీరిని స్మరించునపుడు నంది మల్లయ్య, ఘంట సింగన జ్ఞప్తికి వత్తురు. జంటకవులలో దిరుపతి వేంకట కవులపేరు లెటులు కుదిరినవో రామ కృష్ణ కవుల నామము లట్లు సరిపడినవి. ఈ కవికోకిల యుగళము పిఠాపుర ప్రభుని మ్రోల మధురకంఠము లెత్తియిట్లు పాడినది. భోజనమాను నర్థి సురభూజుని జూచితిరే? పిఠాపురీ

రాజు నతండు మిమ్ము గవిరాజుల నెట్లు బహూకరించె? సం

చోజను గోరువారికి సదుత్తర మిచ్చి తదాసనంబులం

దేజరిలంగ జేసెడుగతి న్మము నీవును గారవింపుమా !

     *            *            *

అక్షరలక్ష లిచ్చునృపు డట్టి కవీంద్రులు కానరా రటం

చీ క్షితివారలెల్ల వచియించెడు నుద్దుల నాలకింతె హ

ర్యక్షసదృక్ష ! నీవును దిరంబుగ నేమును గక్షగట్టి ప్ర

త్యక్షము సేయ బూనెదమె ? తత్సములం గవుల న్న రేంద్రులన్.

     *           *            *

ధారణతప్పరాదు, కవితారసమాధురి పోవరా, దలం

కారము లేగరాదు, కనగా నవశబ్దము లుండరాదు వా

గ్ధోరణి యాగరాదు తమతోడ బ్రగల్భములంట గాని, యె

వ్వారికినైన నిట్లు నొడువంగలవార మనంగ జెల్లునే?

వీరు పిఠాపుర సంస్థానమున బ్రవేశించిన వెనువెంటనే సుప్రసిద్ధులైన తిరుపతి వేంకటకవులతో వాగ్యుద్ధము తటస్థించినది. రామకృష్ణకవులు వయసున బసివారయ్యును నా కవుల కృతులలోని దోసములు బయట బెట్టి 'శతఘ్ని' యను ఖండన గ్రంథము ప్రకటించిరి. 'శతఘ్ని' శక్తి నాడు పెద్దపండితులను గూడ దల లూపించినది. ఈ సాహిత్య సమరముననే రామకృష్ణ భారతము, పాశుపతము, అట్టహాసము, శృంగభంగము, కోకిలకాకము మున్నుగా నెన్నో రచనలు వెలువడినవి. ఈ వివాదము తొలుత జక్కని కృతివిమర్శనములతో నారంభమై క్రమక్రమముగా శ్రుతి మించి వ్యక్తిదూషణములకు బాలుపడి ముదిరినది. ఏది యెటులయిన, నాటి యీవివాదము సాహిత్యజిజాస హెచ్చించి ముచ్చటగా సాగినది. ఈ వాక్సమరమున దేశము లోని పండిత కవులెందఱో కలుగ జేసికొని పైకి వచ్చిరి. ఇది సారస్వత చరిత్రలో మఱవరాని సరసఘట్టము ఈ వివాదారంభమున 'కవిత' యను మాసపత్రిక రామకృష్ణులు నెలకొలిపి నడపిరి. ఈ పత్త్రిక తొమ్మిది పదియేం డ్లవిచ్ఛిన్నముగా సాగి యాగినది. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారికి, వేంకటరామశాస్త్రి గారికి గల గురు శిష్య సంబంధమును బురస్కరించుకొని యీ వివాదము ప్రారంభమైనది.

ఎట్టొ చదివితి మూన్నాళ్ళ పట్టపవలు

పట్టుమని రెండుముక్కలు పలుకకున్న

దిరుగ డికనెన్ని చెప్పిన గురుడ ననుచు

దగులు కొన్నాడు నిన్ను సైతానులాగు

రామకృష్ణ మహాభారతము లోని యీపద్యము వేదుల రామకృష్ణశాస్త్రి ఓలేటి వేంకట రామశాస్త్రిని గుఱించి చెప్పినది. ఈ పద్యములో యావద్విషయము గొప్పగా సరిస్ఫురిత మగుచున్నది. శ్రీ చర్ల నారాయణశాస్త్రిగారు రామకృష్ణుల సాహిత్య గురువులు. రామడుగుల వీరేశ్వరశాస్త్రిగారు వ్యాకరణ గురువులు విశ్వపతిశాస్త్రిగారు న్యాయశాస్త్ర గురువులు.

దేవులపల్లి సోదరకవుల తరువాత వీరు పిఠాపుర సంస్థాన కవులై పేరొందిరి. మొత్తము రామకృష్ణకవుల కృతులు ముప్పదివఱకున్నవి. శ్లేషయమకచక్రవర్తి వేంకటాధ్వరి రచనము నాంధ్రీకరించుట యేటి కెదురీదుట. ఈతని రచనలో యనుక భేదమో శ్లేషాలంకార భేదమో లేని పద్యములు మిక్కిలితక్కువ. అట్టివిశ్వగుణాదర్శమున కాదర్శప్రాయమగు నాంధ్రీకృతి గావించిన రామకృష్ణకవులు ప్రశంసనీయులు. తెనుగు మధ్యన కొకచోట మూళాను వాదములు మూదలింతును. నిర్వృత్తాధ్వరకృత్య ఋత్విజ మహాతీర్ణాపగో నావికం

యుద్ధార్తం నుభటం చ సిద్ధవిజయో వోడార మాప్తస్థల:

వృద్ధం వార వధూజనంచ కితవో నిర్విష్ట తద్యౌవనో

ధ్వస్తాతంకచయ శ్చికిత్సక మపి ద్వేష్టి ప్రదేయార్థినం.

అనబృథస్నానంబు నాచరించిన సోమ

యాజికి ఋత్విజుడన్న నలుక

యేరంతయును దాటి తీరమ్ము జేరిన

పాంథునకు నరంగుపై జిరాకు

విజయమ్ము గైకొని నిజపురమ్మున కేగు

నవనీపతికి బంటునం దసూయ

యిష్ట దేశమ్మున కేగిన పిదప స్వా

మికి యాసవాహకుమీద వినుపు

యౌవన మ్మంతయును జూఱలాడినట్టి

కితవునకు వారసతి యెడ గేరడంబు

వ్యాధి కుదిరిన వానికి వైద్యుపట్ల

వెగటు తా మీయవలసిన విత్త మడుగ.

సంస్కృతమున క్షేమేంద్రుడు రచించిన ఔచిత్య విచారచర్చ, కవి కంఠాభరణము, నువృత్తతిలకము వీరు తెనుగుపఱిచిరి. ఇందిరాదేవి, సుభద్ర, శకుంతల, దమయంతి మున్నగునవలలు వీరివి చదువదగినవి. వీరి యుత్తర రామచరత్రాంధ్రీకరణము నాలు గంకములు మాత్రము వెలువడినవి. ఇవిగాక, యీజంటకవులు కవితా పత్త్రికా మూలమున నెన్నో ప్రాచీనార్వాచీనకృతులు వెలువరించిరి. వానిలో మత్స్యపురాణము, పరమయోగివిలాసము, మైరావణచరిత్ర, ఆధ్యాత్మ రామాయణము, చంపూ భారతము, భారతఫక్కి, ప్రబోధ చంద్రోదయము, పరాశరస్మృతి ముఖ్యగ్రంథములు.

                                                    38 రామకృష్ణకవులు సారస్వతములో గ్రొత్త క్రొత్తత్రోవలు తీయునుద్దేశము గలవారు. కవిత్వములో సంస్కృతిని వీరు వలచియున్నారు. 'ఆంధ్రపత్రిక' కాలయుక్తి సంవత్సరాది సంచికలో వీరు "ఆంధ్రకవుల అపరాధములు" అను శీర్షికతో గొన్ని పద్యములు ప్రకటించిరి. పరిహాస గర్భముగా బ్రాచీనకవుల యపరాధము లందు వర్ణింపబడినవి. పద్యములు మొత్తము ముప్పదియేకాని తెలుగుదేశమున గొప్ప యలజడి రేపినవి. కొన్ని యుదాహరించుట యవసరము. రచనా చమత్ర్కియకు మనము మెచ్చుకోవలయునుగదా!

గీ. ఆంధ్ర లోకోపకారమ్ము నాచరింప

భారతమ్మును నన్నయభట్టు తెలుగు

జేయుచున్నాడు సరియె; బడాయిగాక

తొలుత సంస్కృతపద్య మెందులకు జెపుడి!

గీ. పామరుడువోలె దిక్కనసోమయాజి

వెఱచి తాంధ్రీకరింప విడిచినట్టి

భారతమ్మున వ్రేల్వెట్ట బట్టిగాని

యెఱ్ఱప్రెగ్గడ బండార మెవ రెఱుగరు?

గీ. అచ్చ తెనుగు పదంబుల నిచ్చకొలది

బుచ్చి తలతిక్క యంవయంబులను బెట్టి

పాడుచేసెను నన్నయభట్టుదారి

యుభయకవి మిత్రులష! తిక్కయొజ్జగారు.

గీ. రావు సర్వజ్ఞసింహ భూరమణుతోడ

బావ శ్రీనాథ కవిసార్వభౌము డేమొ

చెప్పి తత్కరుణాపాత్రు జేయుపిదప

భోగినీదండకము నాడె బోతరాజు. గీ. ఎఱచి తినువార లేనియు నెమ్ముమెడకు

గట్టుకొందురె? శ్రీనాథకవివరేణ్య!

సానికూతుల తగుల మీశానునకును

బలికితివి నీస్వభావము బయలుగాను.

గీ. ప్రాలుమాలికచే దాళపత్త్రపుస్త

కాటపవులనర్థపుందెరువాట్లు గొట్టి

కొఱతబడునని కుకవిని గొసరితిట్టి

పెద్దనయొనర్చినట్టి తప్పిదము నిదియె.

గీ. తనకు నంత:పురమునకు మనసులందు

నెడమడుగు పుట్ట ముద్దులొల్కె నుడులను

బారిజాతాపహరణంబు బల్కి మాన్చి

నట్టి తిమ్మనఋణము రా జెట్టుతీర్చు?

గీ. కృష్ణరాయడు చేసిన విష్ణు చిత్త

కావ్యమందలి భావము శ్రావ్యమెయగు

నెన్నిమార్లు పఠించిన నెఱుకపడని

వట్టి పాషాణపాక మెవ్వండుసదువు?

గీ. శ్లేషకావ్యంబు జేసి విశేషయశము

గనిన పింగళ సూరన గడుసువాడె

కాని శుభమస్తని యదేమి గారుడంబు

దెలుగు జేసినవాడు వైదికుని పగిది.

గీ. తగని గర్వంబునంజేసి తన్ను దానె

పొగడుకొనువా డటంచు జెప్పుదురుగాక

నాలిపలుకులు రావు తెనాలి రామ

కృష్ణ కవినోట బంగారు గిలకదీట. గీ. ఒకడు స్వప్నప్రకారము నుగ్గడింప

నెల్లవారలకు గలవె తెల్లవార్లు

నవ్వుదురను తలంపు లే దెవ్వరికిని

పేరుకొననేమిటికి నట్టి బీదకవుల?

గీ. పూర్వకవిరాజులకు నిది భూషణంబొ

దూషణమొ యనుకొనుడు మీతోచినట్లు

నన్నయాదుల పట్ల మాకన్న గూర్మి

గలుగువారలు లేరు జగమ్మునందు.

ఈ యపరాధ పద్యములపై క్షమాపణము చెప్పవలసినదని ప్రతి పట్టనమున సభలు గావించి తీర్మానములు చేయుచుండిరి. అపు డీ కవకవులు కాళ్లు విరగ ద్రొక్కుకొను తెలుగు సోదరుల గని నవ్వుకొనుచు 'దేశభక్తి' యను నొకవ్యాఖ్య వ్రాసి "మేము చేసినది నిందాస్తుతిగాని కేవలనిందగాదు. ఈ విధముగా మేము ప్రాక్తనకవులను గూర్చి వ్రాయుట యాధునికులకు బ్రాచీన కవిసత్తములపై నెంతగా భక్తివిశ్వాసములు కలవో పరీక్షించుటకే" అని సమాధానము చెప్పిరి. అపుడీ నవీన పద్ధతిని గనిపెట్టి రామకృష్ణులను సరసు లభినందించిరి. విరసులు పరిహసించిరి. "కౌరవగౌరవ" మనుపేర బాండవులది యన్యాయమనియు, కౌరవులది న్యాయమనియు సమర్థించుచు జక్కని పద్యములు 'ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక' లో నావిష్కరించిరి. అందలి విషయ మెట్లున్నను గవితా ధోరణి భారతమును బోలియున్నదని జయంతి రామయ్యపంతులు గారు మఱిమఱి ప్రస్తుతించిరి. ఇట్లే రామకృష్ణకవులు విలక్షణ భావనా పథవిహారులై యుండెడివారు. వీరి 'పాణిగృహీతి' యను ఖండకావ్యము తెలుగు వాజ్మయమున కొక గళాభరణము. ప్రతిపద్యము నొక మహానర్ఘమణి. కొన్నిమణులు ముందు పెట్టెదను.

వధువు-పెండ్లికూతురు

ఏ గచ్చేరికి నేగ గావలయు నోసీ! పిల్లనిం బుచ్చుకో

"వేగన్ ర" మ్మని బొమ్మ యొండిడు వరున్ విప్రోపదిష్టార్థయై

"యే గీతంబుల నేర్చికోవలయు నేడీ మీజవా? నెత్తుకో

నీ గాగూడదె?" యంచు బల్కువధు వెందిష్టాప్తి రంజిల్లుతన్.

సువాసిని-ఆడుపడుచు

ఒకసాయ మ్మసివారి కేగిన మగండొక్కింత కేతెంచి పి

ల్వకయే తల్పును దట్టగా దయిత "యెవ్వార్వా" రనన్ లజ్జ మి

న్నక యుండన్ బతి; "పల్కవే" మని కృతన్యక్కారయై తల్పు దీ

సి కడున్ వెల్వెలబాఱి పర్విడు మృగాక్షిన్ భర్త మన్నించుతన్.

మధ్యమ-కొమరాలు

అనువాదమ్ములతో బురోహితుడు గర్భాధానఖండం బఠిం

చినమీదం గులపాలికల్ తమకు బాసెం బేక పాత్రంబులో

దిన బెట్టన్ బతి గిన్నెలోన దన చేతిం దాకు సారస్యమున్

గని యాపై జెయినే కదా యిడని ముగ్ధన్ నేత మోహించుతన్

స్నుష-కోడలు

కియతిన్ వర్ణనసేయరానియవియౌ కేళీవిలాసమ్ము ల

క్షయమై యుండనె మూడునిద్దురలు కాగా సారెయుం జీరయున్

గయికొం టెట్టులొ పుట్టినిల్లు విడి సాక్షాల్లక్ష్మిఆ గ్నానగా

నయి యత్తింటికి వచ్చు క్రొత్తడికి జిత్తాహ్లాద మేపారుతన్!


గుర్విణి-చూలాలు

నెలదప్పన్ బొరుగిండ్ల యాండ్రు "కడుపా నీదైన గారాబు కో

డలికిన్? జెప్పపు, చిన్న నాటనె యదృష్టం" బన్న చోనత్త "యౌన్

దల లేర్పాటయి లోకులంబడిన గాదా?" యన్న దన్నానుడిం

గల తీరడ్గెడు గోల నేల నడువంగా నిచ్చునే యెట్టిడున్.

కుటుంబిని-ఇల్లాలు

"ఏలా నీకు భయంబుజెంద ? దలపై నెక్కించుకొందు న్నినున్

బాలా! యత్తయు నాడుబిడ్డలును నీపంతంబు చెల్లింత్రు నా

శ్రీలన్నింటికి నీవెరాణి" వని పేర్మింబల్కి పెండ్లాడి య

య్యాలిం గూలిపడంతికై వడిగనం బ్రాణంబు లెట్లొప్పెడిన్.

ఇది యటుండ, చెన్నపురమున నొక విద్వత్సమాజ మేర్పడి కృష్ణదేవరాయల కొండవీటి దండయాత్రను గూర్చి యొకకావ్యము రసోత్తర ముగా రచించువారిలో నుత్తమ శ్రేణికి జెందిన కవికి బంగారుపతకము బహూకరింతు మని ప్రకటించిరి. ఆ పందెములో మన కవుల రచనమే నెగ్గినది. అపు డిటులు చెప్పుకొన్నారు.

మద్రనగరాంధ్ర విద్వత్సమాజ దత్త

నూత్నవిషయ క్రియాలబ్ధ రత్నఖచిత

హేమబిరుదాభిరాములు, రామకృష్ణ

రచయితలు పీఠపుర యువరాజ గురులు.

ఇట్లీ మేనత్త-మేనమామబిడ్డలు క్రొత్తపోకడలతో గవితాభారతి నారాధించుచుండ 1918 లో ద్వితీయుడగు రామకృష్ణకవి యకాలమృతికి బాలుపడియెను. ఇత డాచార్య శంకరులవలె నత్యంత తరుణ వయస్సుననే మరణించి యేకైక పుత్రకులు సజీవులునైన తలిదండ్రుల దు:ఖాబ్ధి ముంచినాడు. చనిపోవునప్పటికీ కవికి 29 ఏడుల యీడు. ఈ సందర్భమున నీతరుణకవి విశిష్టత బేర్కొనుట యప్రస్తుత ప్రశంస కాదు. ఇతడు తన పదునొకండవ యేట 'నరకాసురవ్యాయోగము' నాంధ్రీకరించినాడు. పదునాల్గవయేట 'దమయంతీకల్యాణము' అను నచ్చ తెనుగు ప్రబంధము సంతరించినాడు. అసాధారణమైన మేధాసంపద గలవాడు. మూడు భాషలలోని మూడు పద్యములు కలిపివైచి 'వ్యస్తాక్షరి' యీయగా హేలగ జెప్పిన బుద్ధిశాలి. కాకరపఱ్ఱున జిన్ననాట నితడు వీథివెంబడి బోవుచుండు నపుడు అరగులపై బాఠములు చెప్పుచుండు పండితులు జంకు చుండెడి వారట. ఇతని కబ్బినది ప్రాక్తన జన్మవిద్యగాని యభ్యస్తముగాదని యిచ్చటివారు ముచ్చటగా జెప్పుచుందురు. ప్రాకృతమున 'గుకవినిందనము' - సంస్కృతమున "కర్ణవిజయ వ్యాయోగము" వ్రాసినాడు. ఇవి యముద్రితములు. ఇంత చిన్న తనముననే బహుగ్రంథములు సంధానించి, సంస్థాన విద్వత్కవియై పేరు మోసిన కృష్ణుడు కవిలోక జిష్ణుడు. "కృష్ణకవి నోట బంగారు గిలక దీట." సహకవి యెడబాటు పిమ్మట, జంటలో దొంటివారగు వేంకట రామశాస్త్రిగారు-

అనగు మేనత్త కొమరుడై యాశుకవిత

నాకు జేదోడు వాదోడునై కడచిన

కృతి సమర్థుండు మారామ కృష్ణ శాస్త్రి

యున్న నీ సాయ మర్థింతునోటు దేవి!

చనియె గదమ్మ నీ యపరజన్మవిలాసము మాకుజూప వ

చ్చినగతి వచ్చి సత్కవితచే గవికోటికి వన్నె దెచ్చి యం

తనె యతడట్లు నీతనువునన్విలసిల్లిన నెవ్వ రింక నా

పొనరుచు నీకృతి క్రియకు బూనిక దోడ్పడువారు భారతీ!

అని దు:ఖించు సోమ దేవ భట్టారక విరచితము, అష్టాదశలంబకాత్మకము నగు 'కథాసరిత్సాగరము'నాంధ్రీకరింప దొడగిరి. అందాఱు లంబకము లయినవి. ఆంధ్ర కథాసరిత్సాగరము లోని కవితా శైలి నన్నయ కవిత్వపు దెన్నునకు దీటు వచ్చునట్లున్నదని తెలుగు దేశములోని పండిత కవులెందఱో కొండాడియున్నారు. ఆ కృతిపీఠికలో నాధునిక కవిత్వమునుగూర్చి వేంకట రామశాస్త్రిగారి యభిప్రాయ మిట్లు తేలినది. బంధము లెల్లవీడి బహుభావ సమృద్ధిగ నేడు మత్తపు

ష్పంధయగీతి నా విరియబాఱుచు నున్నది తెన్గుగైత; మ

ద్గ్రంథము గాంచుకాల మిదికా దటులైనను నేను బూర్వ ని

ర్బంధ కవిత్వపద్ధతుల బట్టియె దీని రచింప బూనితిన్.

ఈగ్రంథము నొకరురచించినను 'వేంకటరామకృష్ణ ప్రణీత' మనియే ప్రకటిత మగుట వారి యభేద భావమునకు జక్కని గుఱుతు. ఈ కృతి పీఠికాపుర యువరాజవరులు, ప్రియఛాత్రులు నగు రావు వేంకట గంగాధరరామరాయ కవిరాజుల కంకితము అందలి సుప్రసన్న శయ్యతియ్యదన మిట్లున్నది:

శా. 'కానీచూత' మటంచు నీవడుగ వీకన్ జేతిలో బోసితిన్

దీనారమ్ములు పెక్కు; వానికగు వృద్ధిందే; వదట్లుండె; నా

దీనారమ్ముల నేని నాకిడవు; సందేహింప కీరీతిగా

నౌనా! వెండియు వచ్చితే యడుగ మూర్ఖా! సిగ్గులేదయ్యెనే?

క. ఓ చెడుగా! యచ్చో గల

యాచచ్చిన మూషకమ్ము నైన బణముగా

జూచుకొని కుశలు డగువా

డేచందంబుననొ ధనము నిట్టెగడించున్.

గీ. అట్టియెడ నీవు చేతిలో బెట్టినట్టి

సొమ్ము గడ తేర్చి వెండియు దెమ్మనంగ

వచ్చినాడవు; పోపొమ్ము చచ్చినాడ!

దాచ బెట్టితె యిచట నీతాత మూట?

క. అని కనరు మండ నే నది

విని యామృత మూషకమ్ము వేడెద నా కి మ్మనఘా! యిదియ పణమ్ముగ

గొని నేవర్తకము జేసికొందు నటంచున్.

క. చచ్చిన యాయెలుకను నా

కిచ్చినయటు పద్దు వ్రాసి యిడి యతనికి, నే

దెచ్చితి దానిం గని యత

డచ్చెరుపడి నవ్వు కొనుచు నభినందింపన్.

ఈ తీరుగా మెత్తని నిర్దుష్ట శయ్యలో నీకృతి యున్నది. వారి చేతి మీదుగానే కృతి తుదముట్ట కుండుట దుర్విధి. 'నూటఏబదియార్లు' అనుపేర బరమేశ్వరుని గూర్చి వీరు సీసములు రచించిరి. అవి సువర్ణములు. ఈ కబ్బము తెనుగువారి డెందము లుబ్బింపగల గీతాంజలి. ప్రతిభాజన్య మయిన దీనికి దగినంత ప్రశస్తి దేశమున లేదు.

హృదయ పాత్రంబులో నేమియున్నదొ కాని

తొలకుచున్నది నిన్ను దలచినపుడు

ఈ మన:ఫలకమం దేమి యున్నదొ కాని

మ్రోగుచున్నది నిన్ను మ్రొక్కినపుడు

శీర్ష పేటిక నేమి చిత్రమున్నదొ కాని

మూయుచున్నది నిన్ను ముట్టినపుడు

ఈ భావవీథిలో నేమియున్నదొ కాని

తారుచున్నది నిన్ను గోరినపుడు

రమ్ము! నాతండ్రి! నను జేరరమ్ము! ప్రణతి

గొమ్ము! కరుణించి నన్నేలుకొమ్ము! చేర

నిమ్ము! నీదర్శనంబు నాకిమ్ము! నిన్నె

నమ్మినాడను శాశ్వతానందనిలయ!

                          __________