ఆంధ్ర రచయితలు/వేంకట పార్వతీశ్వర కవులు

వికీసోర్స్ నుండి

వేంకట పార్వతీశ్వర కవులు

(1) 1880

(2) 1882

నియోగి శాఖీయ బ్రాహ్మణులు. మొదటివారు బాలాంత్రపు వేంకటరావుగారు. వాధూలసగోత్రులు. తల్లి: సూరమ్మ. తండ్రి: వేంకట నరసింహము. జన్మస్థానము: మల్లాము (పిఠాపుర పరిసరము) జననము 1880 సం. విక్రమవత్సరము. రెండవరావు ఓలేటి పార్వతీశముగారు గౌతమగోత్రులు. తల్లి: వెంకమ్మ. తండ్రి: అచ్యుతరామయ్య. జన్మస్థానము: కొమరగిరి (పిఠాపుర ప్రాంతము) జననము: 1882 సం. చిత్రభాను వత్సరము.

గ్రంథములు : నవలలు : ఇందిర - అరణ్యక - ఉన్మాదిని - సీతారామము - సీతాదేవి వనవాసము- నిరద - నీలాంబరి - ప్రణయకోపము - ప్రతిజ్ఞా పాలనము - ప్రభావతి - ప్రమదావనము - శ్యామల - శకుంతల - చందమామ - రాజసింహ - వసుమతీ వసంతము - వీరపూజ - రాజభక్తి - వంగవిజేత - లక్షరూపాయలు - మనోరమ - మాతృ మందిరము - మాయావి - హారావళి - రజని - సాధన - కృష్ణకాంతుని మరణశాసనము - పరిమళ - సంతాపకుడు - చిత్రకథా సుధాలహరి - మున్నగునవి.

పద్యకావ్యములు:- 1. కావ్యకుసుమావళి [2 సంపుటములు 1924] 2.బృందావనము [1935 ముద్రి] 3. ఏకాంతసేవ [1922 ముద్రి] 4. ధనాభిరామము [నాటకము:వేంకటరావుగారు ప్రత్యేకముగ రచించిరి] 5. తారాశంకము. 6. సువర్ణమాల [ఈ రెండునాటకములు పార్వతీశ్వర కవిగారి ప్రత్యేకరచనములు] 7. శ్రీ రామాయణము [వాల్మీకి రామాయణమునకు జక్కని తెలుగుసేత: బాలకాండము పూర్తియై యిప్పుడయోధ్యకాండములో నున్నది రచన]

వేంకటపార్వతీశ్వరకవుల కీర్తిపతాకనెత్తినది 'ఆంధ్రప్రచారణీ గ్రందమాల. ఆంధ్రప్రచారణీ కట్టు పేరు బ్రతిష్ఠలు వచ్చుటకు వేంకట పార్వ తీశ్వర కవులు కారణము. ఆంధ్రములో నభినవరీతులుగల నొకతీరు కవితకు అంకురార్పణము చేసినవా రీ జంట కవులే యని నేటి వారిలో మేటికవులు కొందఱభిప్రాయపడు చున్నారు. ఈయభిప్రాయమున కాయుగళము రచించిన 'ఏకాంతసేవ' యనుకృతి పట్టుగొమ్మ. అనుకృతి దారికి లోక, సాజముగా వచ్చిన తియ్యని బాసతో గొత్త వడుపున భావవిలక్షణత రాణించు కవితను రచించు నేటివారిలో 'వేంకట పార్వతీశ్వరకవులు' కడుగౌరవనీయు లనుట స్వభావోక్తి. ఇక వీరి చరిత్రాదికము గూర్చి ప్రకటించెదను.

బాలాంత్రపు వేంకటరావుగారు 'ప్లీడరుగుమస్తా' పని చేసుకొనుచు నేవో యల్లిబిల్లిపద్దెము లల్లుచుండెను. ఓలేటి పార్వతీశముగారు చెలికాని లచ్చారావుగారి దగ్గర నుండి యచ్చుపనులు చూచుచుండెను. 1908 సంవత్సరప్రాంతముదాక నీ కవకవు లొకరినొక రెఱుగరు. కాని, యిరువురు పిఠాపురమునకు బరిసరములోనే యున్నారు. విమర్శకాగ్రేసరులని ప్రసిద్ధి పడసిన శ్రీ నడకుదిటి వీర రాజకవిగారు విద్వజ్జన మనోరంజనీ ముద్రాలయద్వారమున సారస్వతసేవ గావించుచు నాడు పిఠాపురముననే కాపురముండి యున్నారు. ఈ మహాశయుడే మన ప్రస్తుత కవు లిరువురకు నేతుసంధానము చేసినవారు. ఆచంట సాంఖ్యాయనశర్మగారి సంపాదకత్వమున "కల్పలత" యను పత్త్రిక నడుచుచున్నతఱియది. ఆకల్పలతలో భాషాసంబంధములగు ప్రశ్నములు, సమస్యలు వెలువరింపబడెడివి. ఒకనెల గొన్ని ప్రశ్నములకు వీరరాజకవియును బిఠాపురము నుండి ప్రత్యుత్తరములు వ్రాసి పంపెను. వానికే పార్వతీశముగారు సమాధానము లంపిరి. వేంకటరావుకారు నెక్కడనుండియో వ్రాసి పంపించిరి. ఒకరివిషయ మొకరెఱుంగరు. పార్వతీశముగారికి ప్రథమ బహుమానము. వీరరాజకవికి రెండవభుమానము. వేంకటరావుగారికి మూడవ బహుమానము నిచ్చినటులు పత్త్రికలో బ్రకటితమైనది. ఈ మువ్వురు నొకశాఖపై నున్న కోకిలములే. ఒకరి గానమాధురు లొకరు విని యానందపడినారు. వీరరాజ కవిగారి సహృదయత మల్లాముకవిని - కొమరగిరి కవిని తీసికొని వచ్చి సంధానము చేసినది. నాటి నుండి వేంకట పార్వతీశ్వర కవులు. ఈ జంట యేర్పడని సమయమున వేంకటరావుగారు 'ధనాభిరామము' నాటకము - 'సురస^ యను నవల వ్రాసికొనిరి. పార్వతీశముగారు పిఠాపురము మహారాజుగారి పట్టాభిషేకమునకు 1907 లో 'సువర్ణమాల' యను నాటకమును, 'తారాశశాంకము' అను వేఱొక నాటకమును రచించిరి. ఇవియే ప్రత్యేకరచనలు. తరువాతివన్నియు వేంకటపార్వతీశ్వర విరచితములే. కవ కలిసినతోడనే 'అనురూప' యను కావ్యము రచించిరి. అది యిపుడు 'చిత్ర కథా సుధాలహరి' గా బ్రచురింప బడినది. ఈ కవుల మేలి కలయికవలన 1911 లో నాంధ్ర ప్రచారణి వెలసినది. కార్యస్థానమునకు సూత్రపాతము తణుకులో జరిగినది. అక్కడ నొకయేడు మాత్రము ముండి నిడదవోలు - రాజమండ్రి - కాకినాడ - పిఠాపురము క్రమక్రమముగ సంచారము చేసినది. 1980 సం. దాక నీగ్రంథమాల మహోన్నతస్థితిలో నున్నది. శ్రీ కొవ్వూరి చంద్రారెడ్డిగారు తొట్టతొలుత 'ప్రచారిణికి' సహకృతి చేసిరి. ఆయన చేతిచలువ వలన నా గ్రంథమాల కట్టి ప్రఖ్యాత వచ్చినది. చంద్రారెడ్డి తెలుగు వారికి స్మరణీయుడైన వ్యక్తి. ఆంధ్రప్రచారిణికి దీటువచ్చు గ్రంథమాలలు మననేలలో రెండో మూడో. చక్కని వచన వాజ్మయమును సేవించిన గ్రంథమాలలే తక్కువ. 1980 నాటికి ప్రచారిణి వెలువరించిన గ్రంథముల సంఖ్య 170. ఆంధ్రప్రచారిణికి బ్రాణము వేంకట పార్వతీశ్వర కవులు. ఈ జంటకవులకు నడుమ నడుమ బొడముచుండు మానసికములగు కలతలను ప్రచారిణి మధ్యవర్తినియై తొలచుచుండెడిది. రెండు దశలు గ్రంథమాల జాతకము విఖ్యాతముగ వెలిగినది. వేంకట పార్వతీశ్వర నవలలు తెలుగులో నలుమూలల బేరు సంపాదించుకొన్నవి. ఈ కవు లిర్వురును గురుముఖమున సంస్కృతమునుగాని, ఆంగ్లముగాని యధ్యయనము చేయలేదు. వీరికి వంగభాష కొంచెము వచ్చును. మిత్రునివలన గన్నడములో ననువదింపబడిన బంకించద్రుని నవల నొకదానిని చదివించుకొని విని, వంగ వాజ్మయపు సొగసులకు, బంకించద్రుని కల్పనముల పొంకమునకు నివ్వెఱపడి మెల్లమెల్లగ నాభాషలో గృషి చేసిరి. ఆ కృషియైనను సాధారణమైనదే. ఏమైన నేమి! వంగము కాదు, ఆంగలము కాదు, అన్యభాష లెన్నో యెఱిగినవారికంటె గూడ వీ రెక్కువ సేవ చేసిరి. వీరి నవలలోని రచనసొంపు వేఱే నేను వక్కాణింప నక్కఱయుండదు.

అనువాదములు గావించిరి. కల్పనములును జేసిరి. ఏవి రచించినను సహజత్వము శైలిలో నుండుటచే వీరి రచనలు పాఠక హృదయములను హత్తుకొన గలిగినవి. వీరి నవలావాజ్మయము తెలుగుతల్లి విహారమునకు 'బ్రమదావనము'. ఇక వీరి పద్యకావ్యముల సంగతి: 'అనసూయ' పత్త్రికలో మొట్టమొదట 'ఏకాంతసేవ' కావ్యము బయట బడినది. అదియాది వీరి నాధునికులు మెచ్చి కవులలో నొక మంచిస్థాన మిచ్చినారు. 1922 లో నా కృతి యచ్చుపడి తెలుగువారి కెల్లరకు నందుపాటులోనికి వచ్చినది. వంగ సారస్వత మెఱుగరు. ఆంగలము తెలిసినవారు కారు. రవీంద్రుని భావోన్నతి వీరి కెట్టు లబ్బినదో యని యంద ఱబ్బురపడినారు. 'ఏకాంతసేవ' నేటి కృతులలో రసభావపరిపూర్ణమై యున్నదని యెన్నుకొనినారు. ప్రకృతి పులకించునటులు భక్తుడు జీవితేశ్వరుడైన యా పరమేశ్వరుని గూర్చి పాడుకొన్న ప్రణయ గీతముల సంపుటమీ 'యేకాంతసేవ'.

నా మెలంగుతోట నామాటలలో దేట

నావరాలకొంగు నావెలుంగు నావయాళి తేప నాచూపులో బాప

నిలుచుగాక! తన్ను గొలుచుదాక.

అని ప్రార్థించి కృతిగానమున కుపక్రమించిరి. కవుల భాకత యను పదమున బాఠకులకు దట్టుచుండును. నిశితమైన భావనాశక్తి గల కవులు వీరని 'యేకాంతసేవ' ఘోషించి చెప్పుచున్నది. ఈ పదములు చదువుడు:

తూరుపుగోనలో దుందుభిస్వనము

వీణాన్వనంబులో వినరాకయుండె

నానందవనములో నాగస్వరంబు

నూదకే కోకిలా యొక్కింతసేపు

         *

శృంగారనదిలోన చిగురాకుదోనె

యే రాగజలధిలో నీదుచున్నదియొ

తలిరు జొంపంబులందలి గానలహరి

యే దివ్యసీమల కేగుచున్నదియొ!

పరువంపు బూపులోపలి కమ్మతావి

యేవాయుపథమునం దెగయు చున్నదియొ

తారాపథంబునందలి తటిల్ల తిక

యే మహాతేజమం దెనయుచున్నదియొ!

గాలిలో జాడలు కనిపెట్టగలుగు

దివ్యమూర్తికి నీకు దెలియదటమ్మ!

ప్రణయవనంబులోపలి పుష్పరథము

తుమ్మెదా! వేవేగ తోలితేవమ్మ! ఏకాంతసేవకు బీఠిక వ్రాసి వ్రాసి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు చివర కిటులు తమ యభిప్రాయము తేల్చినారు. "ఇది విమర్శనాతీతము. వంగభాషకు రవీంద్రుని గీతాంజలి యెట్టిదో, మన యాంధ్రమున కీ మహాకవుల - భక్తుల యేకాంతసేవ యట్టిది"

వేంకట పార్వతీశ్వర కవుల భావరాశి స్వాభావికమైనది కాని, యాంగ్ల వంగములనుండి దొంగలిగొన్నది కాదని మన మనుకొనవలసిన విషయము. వీరి 'కావ్యకుసుమావళి' రెండు సంపుటములు చూడుడు! కవిత యెచ్చోటనేని సహజతలో గొఱతపడినటులున్న దేమో!

తిన్నని నున్నని తెల్లని యెనలేని

మొగ్గలలోనుండి నిగ్గుదీసి

చక్కని చిక్కని సరిలేని కమ్మని

పూవులలోనుండి ప్రోవుజేసి

విఱుగని తఱుగని వెలలేని తీయని

తేనియలోనుండి తేటదీసి

నలగని తలగని నలిలేని తొలిలేని

చివురాకుదొన్నెల సేకరించి-

ఆంధ్రకవితా సరస్వతి నమ్లానపుష్పోపహారములతో నర్పించిన కవివరులు వీరు. కవితలో దఱచుగ బదముల పున:పునరావృత్తి వీరి కిష్టము. నవ్యకవితావతారమునకు ముందే యనేక నూతన విషయములపై వీరిలేఖిని 1909 సం.కంటె దొల్లి పత్త్రికలలో వెల్లివిరిసినది. కొన్నిరకముల కవితామార్గములకు వేంకట పార్వతీశ్వర కవులు దర్శకులుగాని, వీరు వేఱొకరి కవితతీరు ననుకరించినటులు మన మనుకొనరాదు. అట్టి స్వాభావికత వారి రచనలో బదముపదమున బరికింపవచ్చును. ఈ జంట కవుల యభ్యుదయము గుఱుతించి శ్రీ పీఠికాపురాధీశ్వరుడు వీరి కొక ముద్రాయంత్రమునుగొనియిచ్చి తదుద్యమమునకు జేయూతనొసగెను. నరసారావుపేటలో జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్తున శ్రీ ఉయ్యారు రాజావారి సభాధిపత్యమున నీకవులకు 'కవిరాజహంస' బిరుద మొసగబడెను. 1943 లో రాజమహేంద్రవరమున వీరికి షష్ఠిపూర్తి సమ్మాన మహోత్సవము వైభసపూర్ణముగా సాగినది. అప్పుడు కూడిన యాధునిక కవివర్గము వీరికి "కవికులాలంకార" బిరుదము నిచ్చి గౌరవించిరి. ఈ బిరుదములు రెండును వీరియెడ దగినటులుండి యందగించుచున్నవి.


ఉ. పావనమూర్తి నీశ్వరుని బమ్మెర పోతన రామరాజుగా

భావనచేసి పాడుకొనె భాగవతంబును; నట్లె రామభూ

మీ వరు సద్గుణావళుల మేము జగత్ప్రభు లీలగాంచి బృం

దావన కావ్య మంకిత మొనర్చితి మాతని పెండ్లిపాటగన్.


అని చెప్పి శ్రీ పిఠికాపుర యువరాజు గంగాధర రామరాయ ప్రభునకు 'బృందావనకావ్యము' నంకితము గావించిరి. ఈ కబ్బము శ్రీ రఘునాథరాయల కాలమున వెలసిన శృంగారకావ్యములను దలదన్ను చెన్ను ననున్నది. ఈ కూర్పు నేర్పు పరికింపుడు.


సీ. మణి కిరీటంబుపై మన్నింపలేదటే

కొరగాని పురినెమ్మికోడిఱెక్క

అధరపల్లవముపై నానింపలేదటే

వెలివోని విరసంపు వెదురుపుల్ల

శ్రీవత్సకాంతిపై జెలగింపలేదటే

వెలలేని చిఱుమోక తులసిరేక

కల్యాణమూర్తిపై గదియింపలేదటే

కొరరాని నసరాకుపురుగునూలు అఖిలలోకవిభుని నతిభక్తి సేవింప

నాత్మవిభుని కరుణ నభిలషింప

దగనివారు బడయ దగనివా రెవరమ్మ?

తరతరంబు లేల తడవెదమ్మ!


ఉ. వేంకట పార్వతీశ్వర కవిద్వయ నిర్మల వాజ్మన:క్రియా

సంకలసంబునం బొడమి సమ్మతమై ఫలపుష్ప శాఖికా

సంకుల సత్కవిప్రకర సాధునుతంబయి రామరాణ్మహేం

ద్రాంకితమైన యీకృతినురాగమ మర్థుల దన్పు గావుతన్!


మన తెనుగువారిలో నీ కవులను దాటిన కవు లున్నారు. పండితులున్నారు. భావకు లున్నారు. తెలుగుపలుకుబడి యింతమధురముగా, మృదువుగా, తేట తెల్లముగా, దీరుతియ్యముగా దీర్చి దిద్దినవారు తక్కువగ నున్నారు. పసిపిల్లవానినుండి, పండితునివఱకు నచ్చునట్లు తేలికభాసలో నింత సంతనగా సంతరించు కవిరాజహంసలు మనవారిలో నెందఱో లేరు. 'బాలగీతావళి' పలువురు చూచియుందురు. ఎంతసేపు, సాధారణజనబోధకముగా నుండునట్టి నడక వారి సొమ్ము. అట్టులని, యర్థగంభీరత యుండకుండునా? ప్రతిపద్యమున జాల గాంభీర్యము. ఈ జంటకవులు తమ 'లేఖిని' గూర్చి యీరీతి యుపదేశములు చేయుచుందురు.


వ్రాయుము నిర్మలభావ వి

ధేయమ్ముగ బుధజనాతిధేయముగ జగ

ద్గేయమ్ముగ లలితసుధా

ప్రాయమ్ముగ బాఠకశ్రవణసేయముగన్.


ఇట్టి కరపులు గఱచిన లేఖినితో నీనడుమ వేంకటపార్వతీశ్వర కవి కోకిల యుగళము తెనుగులో నాదికావ్యగానము చేయదొడగినది. రచన నేటి కయోధ్యకాండములోనికి వచ్చినది. అది సాంతమై గీటు ఱాతికి వచ్చుగాక!

                              _________