Jump to content

ఆంధ్ర రచయితలు/తిరుపతి వేంకట కవులు

వికీసోర్స్ నుండి

తిరుపతి వేంకట కవులు

1871 - 1919

1870 - 1950

ఈ జంటకవులలో మొదటివారు దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు. రెండవ వారు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారు. తిరుపతి శాస్త్రిగారిది వెలనాటి శాఖ. అభిజనము: ఎండగండి (కృష్ణామండలము).తల్లి: శేషమ్మ. తండ్రి: వేంకటావధాని. జననము: 1871 సం. నిర్యాణము: 1919. వేంకటశాస్త్రిగారిది ఆరామద్రావిడశాఖ. జన్మస్థానము: ఏనాము [ఫ్రెంచివారిది]. నివాసము: కడియము. తల్లి: చంద్రమ్మ. తండ్రి: కామయ్య. జననము 1870 ప్రమోదూత సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశీ సోమవారము. నిర్యాణము: 15 పిబ్రవరి 1950 సం. శివరాత్రి పుణ్యదినమున. విరచిత గ్రంథములు: పాండవజననము, పాండవోద్యోగము, పాండవాశ్వమేధము, పాండవ రాజసూయము, పాండవ విజయము, పాండవ ప్రవాసము, ముద్రారాక్షసము, మృచ్ఛకటికము, ప్రభావతీప్రద్యుమ్నము, బాల రామాయణము [నాటకములు]. బుద్ధచరిత్రము, లక్షణా పరిణయము, ఏలామహాత్మ్యము, శ్రీనివాసవిలాసము, దేవీభాగవతము, పతివ్రత, సుశీల, పూర్వహరిశ్చంద్రము, శివలీలలు, నానారాజ సందర్శనము, శ్రవణానందము [పద్యకృతులు]. విక్రమాంకదేవ చరిత్రము, చంద్రప్రభాచరిత్రము, హర్షచరిత్రము, [వచనగ్రంథములు]. గుంటూరిసీమ, గీరతము, శృంఖలాతృణీకరణము, పశ్యాం పుశ్యాం, పశ్యశబ్దవిచారము, శనిగ్రహము [విమర్శగ్రంథములు]. శతావధాన సారము, గుంటూరు శతావధానము, పినపాడు శతావధానము, వేమవరాగ్రహార శతావధానము [శతావధానకృతులు] ఇత్యాదులు.

దోసమటం చెఱింగియును దుందుడుకొప్పగ బెంచినార మి

మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగ

రోసముకల్గినం గవివరుల్ మముగెల్వుడు-గెల్చిరేని యీ

మీసము తీసి మీపదసమీపములం దలలుంచి మ్రొక్కమే. అని ప్రతినపట్టి కొన్నినా ళ్లాంధ్రకవితా సామ్రాజ్యము నేకచ్ఛత్రముగ బరిపాలించిన తిరుపతివేంకట కవులు జగమెఱిగిన బ్రాహ్మణులు. ఆంధ్రదేశమున వీరి పేరు నెఱుగని యభిజ్ఞడుండడు. అభినవాంధ్ర కవులలో వీరిని గురువులుగా భావించువారు వందలమీద నుందురు. తిరుపతి వేంకటకవుల కేకలవ్యశిష్యుల మని చెప్పుకొని గౌరవింప బడువారు పెక్కుఱు. ఆంధ్రవసుంధరలో వీరు సందర్శింపని రాజాస్థానములేదు. ఆరంభదశలో దిరుపతి వేంకటకవులు "తిరుపతివేంకటేశ్వరు" లనియే తెలుగునాట వాడుక. ఈజంటకవు లే మహారాజును లెక్కసేయలేదు. "అనుభవించితిమి దీవ్యద్భోగములన రాజాధిరాజులకన్ననధికముగను"-"ఏనుగునెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము" అని చెప్పుకొనుచు బ్రతిపట్టణము, ప్రతిగ్రామము తిరిగినారు; ప్రతిదాతను దర్శించినారు. వారిచే దగినట్లు సన్మానింప బడినసరే- లేనిచో సహజకవితా ధోరణినిమొగము వాచునట్లు తిట్టబద్దెములు చెప్పుట, ఈ కవులు సిద్ధవాక్కులని వారు వెఱచి పాదాక్రాంతులగుట పెక్కుచోట్ల జరిగినది. అనిదంపూర్వమైన వీరి యద్భుతశక్తి కబ్బురపడి యనేకకవులు 'శిష్యోహ' మ్మని చరణముల బడజొచ్చిరి. వీరి యవధాన ప్రతిభ నరసి తెనుగుమన్నీ లెందఱో బిరుదములు నొసగిరి; సాలువలుగప్పిరి; సన్మానములుచేసిరి; ఏనుగులపై నూరేగించిరి.

తిరుపతికవుల జీవిత మొక మహాభారతము. ఇందేపర్వము పరిశీలించినను బ్రతిజ్ఞలుసేయుట, మీసములు దువ్వుకొనుట, ప్రతిపక్షులను బరిహసించుట, పద్మవ్యూహములు పన్నుట, వానిని భేదించుట, యెదిరి యెట్టివాడైన సాహసించి మీది కురుకుట-యివిచూతుము. ఈ భారతమున గూడ రాయబారముల రభసలు, శతఘ్నుల చప్పుడులు, పాశుపతప్రయోగములు, అట్టహాసములు, తాలుకుట్టనములు కలవు. ఉద్యోగ విజయములు, రాజసూయాశ్వమేధములు దీనిలోనివే. గీరతముకూడ నీ భారతములోనిదే. ఈ భారసంగరమునకు 'గుంటూరుసీమ' కురుక్షేత్రము. వాగ్యుద్ధములవలన దిరుపతికవుల యశశ్చంద్రికలు నలుమూలల వెల్లివిరిసినవి. ఇంత నిర్లక్ష్యముగా మహారాజులను, మహాపండితులను ధిక్కరించిన తెలుగు కవులు శ్రీనాథాదు లేకొందఱో మనకు వినబడుచున్నారు.

సంగరశక్తి లేదు, వ్యవసాయముసేయుట సున్న, సంతలో

సంగడివేసి యమ్ముటది యంతకుమున్నె హుళక్కి మష్టికిన్

బొంగు బుజానవైచికొని పోయెద మెక్కడికేని ముష్టి చెం

బుం గొనిపెట్టు మొక్కటి యమోఘ మిదేకద, దంతిరాణ్నృపా!

మహారాజునుగూర్చి చేసిన యీ మందలింపులో నెంతయర్య్హము దాగియున్నదో పరికింపుడు.

మ. అటు గద్వా లిటు చెన్నపట్టణము మధ్యం గల్గు దేశమ్మునన్

జటులస్ఫూర్తి శతావధానములు మెచ్చం జేసియున్నట్టి మా

కిట రా జీయక యున్న దర్శనము నింకెవ్వాని కీ రా జొసం

గుట ? చెప్పంగదవయ్య పాలితబుధా, కోదండరామాభిదా!

శ్లో. రాజా విద్వాన్ భవాన్ విద్వా సహో భాగ్యం మహాకవే,

అత్రాపి దర్శనం నోచే త్కవితాయై నమోనమ:.

విజయనగర ప్రభుని దర్శించుటకు వెళ్ళినపుడు, వారు సభ చేయింపక సన్మానింపగా నపుడు దివాను కోదండరావుగారిని గూర్చి తిరుపతి కవులు వ్రాసిన పద్యము లివి. రాజసందర్శనము ధనాపేక్షతో గాక పాండితీ ప్రదర్శనమునకే జేసికొన్నట్లు పలు పద్యములు విశదము చేయుచున్నవి. ఈ జంటకవులలోని యొకలక్షణము నానారాజసందర్శనమువల్ల నిట్లు తెల్లమగుచున్నది. అవసరమగునపుడు, దాత యెట్టి నీచుడైనను వాని నింద్రుడుగా, చంద్రుడుగా స్తోత్రములు చేయుటయు, తిరస్కారభావము కనబఱచిన రసిక ప్రభువునైన దృణప్రాయముగా దీసివైచుటయు వీరికి సహజము. ఇందులకు వందలు నిదర్శనములు.

వేంకటరామకృష్ణ కవులతో, కొప్పరపు గవులతో వీరు గావించిన వివాదములు భాషాచరిత్రములో శాశ్వతముగా నుండగలతీరున నున్నవి. గీరతము, గుంటూరిసీమ చూచునది. ఆ ప్రతిజ్ఞలు బహు భయంకరములుగ నుండును.

శా. ఱతుల్ మానడు తిర్పతిద్విజుడు నీరంధ్రా వివేకాన్విత

స్వాంత భ్రాంత నిరంతరానృత వచ: ప్రకాంత దుష్కల్పనా

ధ్వాంత క్రాంత కుకావ్య నవ్యరవి దీప్య ద్భవ్య తేజోంచితా

హంతా దంతుర పాక్ర్పణాళికల నీహమ్మార్ప కేనాటికిన్.

శా. ఱతుల్ మానడు తిర్పతి ద్విజుడు పర్యాయాదృ తానేక సా

ధ్వంతేవాసి కృతావధాన సమయ వ్యాఖాన విఖ్యాపితా

శాంతస్థాయి యశ: ప్రసూన కవితా సొందర్య రాజద్గళో

పాతున్ దేశికుగూర్చి వ్రాసిన యసత్యాల్ మాంప కేనాటికిన్

శా. 'రావుల్ వీడు' మటంచు మిణ్కెదవు ధీరమ్మన్యుని న్నిన్ను దు

ర్వ్యాపారున్ సభలోని కీడ్చి భవదార్థబావవాదానృతా

లాపంబు ల్మొదలంట గాల్చి పయి వాలాయంబు శిక్షించి నీ

పాపం బూడ్చి నతుల్ గ్రహించునట! తత్ర్పాగల్భ్య మూహించి తే!

శా. 'రాపుల్ వీడడు వేంకటాచల' మసారస్సార ఘోరానృతా

లాసాం తేవస దాన్య కర్కట విశాల శ్వభ్ర దుర్ద్వార్బహి:

ప్రాప-రతరా విలాంబు పృష దావత్ర్పాపకాత్మీయ వా

గ్రూపాసార పరంపరా విభవముల్ గుప్పింప కేనాటికిన్.

శా. 'డంబాల్ మాను' మటంచు మిణ్కెదవు ప్రౌడమ్మన్యతాదోషమూ

డంబై నట్టి భవన్మనంబునకు వ్రీడం బుట్టగాజేయ ని న్నుం బాండిత్య నిధాను లుండు సభయందుం బట్టి రెట్టించి గ

ర్వంబున్మాన్చి యనుగ్రహించునట! తద్వాత్సల్య మూహించితే?

తిరుపతిశాస్త్రిగారు వెలనాటివారు, వేంకటశాస్త్రిగా రారామద్రావిడులు నైనను నేకోదరులవలె మెలంగుచు బరస్పరసహకారముతో నవధానములు, ఆశుకవితలు, ఆకాశపురాణములు ప్రదర్శించుటచే వీరిపేరు త్వరలో బ్రశస్తికెక్కినది. అవధానకళకు గౌరవము తెచ్చినవారు, చులుకదనము కల్పించినవారును దిరుపతి వేంకటకవులే. వీరికిముందు మాడభూషి వేంకటాచార్యులు, అంతకుమిక్కిలి ముందు రామరాజభూషణుడు మున్నగువారు శతలేఖినీ గ్రంథసంధానచాతురికలవా రున్నను, వారెవ్వరును దిరుపతి వేంకటకవులవలె జంటకవులుగా నుండి యవధానములు చేసినవారు కారు. పిఠాపురసంస్థాన కవులయిన దేవులపల్లి సోదరులును, వేంకటరామకృష్ణులు, అత్యద్భుతావధాన కవితా ప్రదర్శనముల గావించియున్నను తిరుపతికవుల తీరున నవధానవిద్యను జగద్విఖ్యాతము చేసినవారు కారు. రాయలకాలమున నంది మల్లయ్య, ఘంట సింగయ యను జంటకవులు ప్రబంధరచనము చేసిరి. వారవధానము లొనరించి యుండిరో, లేదో చెప్పజాలము. "జగదాశ్చర్యకరావధానకవితాసంపత్తి" ఒక్క తిరుపతి వేంకటకవియుగళమునకే తక్కినది.

'గోణము కట్టుటాది' వేంకటశాస్త్రిగారికి గవితాభిలాష యుండెడిది. ప్రఖ్యాత శాస్త్రపండితులు చర్ల బ్రహ్మయ్యశాస్త్రిగారి యొద్ద నీ జంటకవుల వ్యాకరణాధ్యయనము. ఇరువురును మహామేధావులుగాన నచిరకాలములో నాభాష్య మధికరించిరి. దేవీభాగవతము నందు గురుస్తుతి యిట్లున్నది.

సీ. అఇఉణ్ మొదలుగాగ నాభాష్యపర్యంత

మే మహామహుడు మాకిచ్చె విద్య కన్న సంతానమ్ముకన్న నెక్కుడుగాగ

నే దయాళుండు మమ్మాదరించె

పెండ్లి పేరంటముల్ ప్రియ మెలర్పగజేసి

యే గుణనిధి మమ్ము బాగుచేసె

తిండికై యిల్లిల్లు దిరుగనీయక యన్న

మేయన్న దాత మాకింటనిడియె

గీ. సకలదిగ్దేశ రాజన్యసభలయందు

డంబుమీఱ శతావధానం బొనర్చి

నిర్వహింపగ నెవ్వ డాశీర్వదించె

నట్టిగురునకు గృతియిచ్చు టర్హమకద!

బ్రహ్మయ్యశాస్త్రిగారి కీర్తి పరమశాశ్వతము చేసిన శిష్యులు తిరుపతి వేంకటకవులే. ఇదియటుండ, తిరుపతి కవులకే పరస్పరము శైష్యోపాధ్యాయిక యున్నది. వయోధర్మముచే 'వేంకటతిరుపతికవులు' కావలసిన వారు వీరు. తిరుపతికవికంటె వేంకట శాస్త్రిగారు ఒక సంవత్సరము ముందు పుట్టినవారు. సహసాఠిదశలో దిరుపతి శాస్త్రిగారికి బద్యలక్షణములు వేంకటశాస్త్రిగారే చెప్పినట్లు స్పష్టము. ఈ పద్యముదానికి దారకాణ.

వితతాత్మీయ శతావధాన కవితా విద్యాపయోరాశి, సం

భృత శిష్యాంబుద వాజ్మయామృత రసప్రీతాఖిలాంధ్ర క్షమా

ధృత రజ్యద్రసికావతంసకృత వందిస్తోత్రమాలా విభూ

షితు మా వేంకటశాస్త్రి నే బొగడెదన్ శిష్యస్వరూపంబునన్.

తిరుపతికవి యప్రతిమానమైన పాండితీ ప్రతిభయు జెళ్ళపిళ్ళకవి యసాధారణమైన మేధాబలమును బలసి తిరుపతి వేంకటేశ్వరులను దెలుగుకవులలో నగ్రేసరుల నొనరించినది. తిరుపతి లేనిదే వేంకటేశ్వ రుడులేడు. వేంకటేశ్వరుడు లేనిదే తిరుపతిలేదు. ఈ జంటపేరులిట్లు కుదురుటయే వీరిఘనతకు గారణమని చెప్పవలయును. ఎక్కడ వినినను వారిపద్యములే. ఎక్కడ జూచినను వారిశిష్యులే. ఏ ప్రాంతమున దిరిగిన వారియవధాన ప్రశంసలే. "తిట్టుల్ తిట్టితి దిట్టులంబడితి" నని యనేకుల హుంకరించినారు. అనేక పండితులను గద్దించినారు. "అటు గద్వాలిటు చెన్నపట్టనము మధ్యంగల్గు దేశమ్ము" నొక యూ పూపినారు. పేరి కాశీనాధశాస్త్రివంటి యుద్దండపండితుల 'నబ్బా' యనిపించినారు. మహామహోపాధ్యాయులు సైతము మర్యాదగా, దప్పించుకొని తిరుగుచుండెడివారు. అది కేవలము వారిశాస్త్రపాండిత్యమునకు జంకియనుటకు వీలుగాదు. తిరుపతికవులు సంస్కృతాంధ్రములలో బెద్దపాండిత్యము కలవారేయైనను శాస్త్రేతరములందు బ్రత్యేక కోవిదులైన మహామహులను గూడ మాటాడనీయక పోవుట మాత్రమాంధ్రలోకమున కాశ్చర్యావహమైనది.

తిరుపతిశాస్త్రిగారు ప్రాచ్యపాశ్చాత్య భాషలయందు విద్వాంసులైన పోలవరము జమీందారు శ్రీ కొచ్చెర్లకోట వేంకటకృష్ణారావు బహద్దరు వారికడ నిలయ విద్వాంసులుగా నుండిరి. కొన్నివత్సరములు వారియొద్ద గౌరవవేతనము బడయుచు ననేకభంగుల సన్మానింపబడిరి. ఇంతలోగాల మీ మహాకవిని మ్రింగివైచినది. తిరుపతిశాస్త్రి యస్తమయము చెళ్ళపిళ్ళకవి హృదయమునకు బట్టరాని కష్టపాటు కలిగించినది. ఇరువురు నభేదముగా సంచరించిన సోదరులు. వేంకటకవి దివాకరాస్తమయమును గుఱిచి యిటులు పలవించెను.

నాకన్న థీబలమ్మున

నే కాదు తనూబలమున నెంతయు హెచ్చొ

లోకస్తుత్యుడు తిర్పతి

నా కన్నన్ మున్నె యెట్లు నాకము ముట్టెన్. ఏబది దాటెనా, కతని కేబది కింక నెలల్ కొఱంత నా

ల్గా బుధమాన్యు డిందనుక నాగక సల్పె శతావధాన, మే

నొ బహుకాలమై యొకట నుండియు నాతనిచేయియూత బ్ర

జ్ఞా బహుళావధానపు బ్రసంగము లీడ్చుచునుంటి నెట్టులో.


ఈ జంటకవుల సౌహార్ద మిట్టిది. "ఒక్కరు రచియించిరేని నది కాదగుదిర్పతి వేంకటీయమై" అను మాటలో నంతర్వాహినిగా వీరి సౌభ్రాత్రము వెల్లివిరియుచున్నది. తిరుపతి కవి నిర్యాణమున కిటీవల వేంకటశాస్త్రిగారు పెక్కు కృతులు రచించినారు. అవన్నియు జంటపేళ్లతోడనే ప్రచురితములగుట యొక మహాదర్శము.

చెళ్ళపిళ్ళకవి కవిత్వపుగఱుడు. అనగా, ఆయన నిలువెల్లగవిత. పండు వయస్సులో నాయన కలము కొన్నివేల గద్య పద్యములు సృష్టించినది. వ్యాసునివలె వ్రాసినది తుడుచుట యాయన కలవాటులేదు. కడకాలమున విజయవాడ గవర్నరుపేట యందలి యద్దెయింట గుక్కిమడత మంచముపై కౌపీనధారియై పరుండియుండెడి యా జరఠమూర్తి నెందఱెందఱో దర్శించి పోవుచుండెడివారు. ఆయన మెట్టిన ప్రదేశమే యొక దివ్యతీర్థము. మనసు వచ్చినచో వచ్చిన మానిసిని బలుకరించుచు; లేనిచో బలుకరించుట కూడ నుండదు. వచ్చినవాడు వచ్చి కవిగారి చరణములు కనుల కద్దుకొని చక్కబోవును. ఆ యాగంతుకున కదే పదివేలు. యౌవనములో వేంకట శాస్త్రిగారి యుపన్యాసవాణి మేజువాణి. ఆయన సభలో నుపన్యసించు నపుడు వేనవేలు విఱుగబడి వినవలసినదే. యౌవనములోనే కాదు, షష్టిపూర్తి దాటిన తరువాత గూడ వారి కంఠస్వరములోని ఝంకారము, మాధుర్యము సడలలేదు. ఎంతవానినైన నప్పటి కప్పుడు ముఖపిధానము సేయు శక్తియాయనలో గొప్పగా నుండెడిది. వీరి ప్రతి పదము ధ్వనిపూరితము, వీరి పేరు విని బందరు నందలి యున్నత పాఠశాల పండితులుగా దయచేయుడని యాహ్వానించినది. అక్కడ పదునైదు సంవత్సరములు తెలుగుపండిత పదవి-ఆసందర్భమున ననేకులు వీరిచేతిలో గవులైరి. విశ్వనాధ సత్యనారాయణ ప్రభృతు లావిధముగా శిష్యులు. తిరుపతి కవుల శిష్యులము, విశేషించి వేంకటశాస్త్రిగారి శిష్యుల మనువారిలో అవ్వారి, వేటూరి, వేలూరి, కాటూరి, పింగళి కవులు ముఖ్యులు. బందరు వేంకట శాస్త్రిగారిని బ్రహ్మరథము పట్టినది. 'కృష్ణ' వీరి పలుకు విని పొంగిపోయినది. 1933 సం. బందరు పౌరుల ప్రోత్సాహమునను, కవిశిష్యుల యభినివేశమునను శాస్త్రిగారికి జరిగిన షష్టిపూర్తి సన్మానము చరిత్రలో రమణీయము, నవిస్మరణీయము నయిన ప్రధానఘట్టము. ఆ సుసమయమున వీరి శిష్యప్రశిష్యు లనేకులు కావ్యోపహారము లర్పించి ధన్యులైరి. ఆ దివ్యమహముననే-

పుడమిఱేడులు తల లడుగులు మోపంగ

నర్పించు కాన్కల నందువాడు

అత్యద్భుతంబైన యవధానవిద్యకు

బ్రభవకారణమైన ప్రతిభవాడు

వీనుదోయికి దేనె సోనలు వర్షించు

వాజ్మాధురికి బేరు వడినవాడు

చిననాడె వలచి వచ్చిన కవితాకన్య

నేకపత్నిగ జేసి యేలువాడు.

పూర్ణకాముండు త్యాగియు భోగియైన

గురుని ఋణ మీగుపొంటె నీ చిఱుతకబ్బ

మర్హత గడించుకొనుగాక యాంధ్రవాణి

కడకనుల జాల్కొను ప్రసాదళణ లవాప్తి

అని గురుదక్షిణగా 'సౌదరనంద' కావ్యము పింగళి కాటూరి కవి యుగళముచే వేంకటశాస్త్రిగారి కర్పింపబడినది. ఆ షష్టిపూర్త్యుత్సవము తెలుగువాణి కొక యుజ్జలాలంకారము. ఇది యననేల? తిరుపతి వేంకటకవులు తెలుగు భూమిలో నొందని సన్మానము లేదు. కృష్ణా పత్త్రికాధిపతులన్నటులు 'వీరి కవిత్వము ప్రాచీనకవితకు భరతవాక్యము. నవీనకవిత్వమునకు నంది. వీరికవిత్వమందెచ్చట జూచినను సౌకుమార్యము పౌరుషము జీవము గోచరించుచుండును. ఈ విలక్షణములే యాంధ్ర దేశమున శిష్య సహస్త్రములు వెదచల్లినవి. వీరిరచన లెక్కువగ వీరి జీవితమునకు సంబంధించిన వగుటచే నా కవిత్వ మాత్మగౌరవమును బ్రతిష్ఠించు కొనినది."

ఈ శతావధానులు సారస్వత సమారాధనము 1949 సంవత్సరము నాటికి సంపూర్ణముగా బండి, మదరాసు ప్రభుత్వముచే నిండుగా గుర్తింపబడినది. శ్రీ వేంకటశాస్త్రిగారిని మదరాసు దొరతనపు బ్రథమ సంస్థానకవిగా గౌరవించుటలో భేదభావ మెవరును జూపకుండుట తిరుపతికవుల వాజ్మయసేవ కొక విజయధ్వజము. తనయూరు దాటక యావత్ర్పభుత్వమును, యావత్కవిలోకమును విజయవాడకు రప్పించుకొనిన శ్రీ శాస్త్రిగారి వార్థక శ్రీ తెలుగుదేశమునకు గర్వాభరణము. ఏమహాకవిని నిట్టితీరుగా దేశము సన్మానింపలేదు. శిష్య ప్రశిష్యులు బ్రహ్మరథము పట్టిరి. మదరాసు ప్రధానమంత్రులు, మంత్రులు, విశ్వవిద్యాలయాధికారులు, మహాపండితులు, కవులు పరివేష్టించియున్న నాటి సన్మాన సభావృత్తాంతము సారస్వత చరిత్రములో నొక దివ్య ప్రకరణము. రాయలసీమనుండి వచ్చిన గడియారము వేంకటశేషశాస్త్రిగారు నాడిటులు ప్రశంసించినారు.

జయమేపార శతావధాన కవితా సామ్రాజ్యపీఠంబు స

చ్ఛయశోమూలముగాగ నేలిన మహాసారస్వత జ్యోతి రు

చ్చయమౌ వేంకటశాస్త్రి యాంధ్రకవితా స్థానీప్రభుండయ్యె, న

న్నయ తిక్కనల నాటి వైభవము లీనాడయ్యె వాగ్దేవికిన్.

      *      *      *      *       * కవిసభ లిచ్చు గౌరవముగా దిది, యొక్కనృపాలు డిచ్చు గౌ

రవమునుగాదు, కావ్యరసరంజిత భాపుక యావదాంధ్ర గౌ

రవము ప్రజాప్రభుత్వము కరమ్మున వేంకట శాస్త్రిగారికిన్

నవ వరణ స్రజ మ్మిది యనన్య మపూర్వముగాదె తెన్గునన్.

కవి సాధారణుల వలెగాక "కపనార్థ మ్ముదయించితిన్; సుకవితా కార్యంబె నావృత్తి; మద్భవ మద్దాన దరింతు; తద్భవమ మద్భాగ్య్ంబు......" అని చెప్పుకొన్న మహాత్ముడు చెళ్ళపిళ్ళకవి. వ్యావహారికభాషలో నాయన చివరికాలమున రచించిన వివిధ వ్యాసముల బండ్ల దోలవచ్చును. అవన్నియు గలిపి వెలువరించినచో 'విజ్ఞానసర్వస్వము' పునరుద్ధరించినవార మగుదుము. అందుగొన్ని రచనలు 'కథలు, గాధలు' గా నచ్చుపడుచున్నవి. వేంకటశాస్త్రిగారి వ్రాతయైన, నుపన్యాసమైన నొకరకముగానే యుండును. విషయాంతరములోనికి తఱచు దాటుచున్నను, ఎక్కడికక్కడ హృదయంగమముగా నుండునట్లు వ్రాయుటలో, మాటాడుటలో వారిని మించిన వారు లేరు. ఆయన యేమిమాటాడిన నది ధ్వనికావ్యము. వేయేల! ఆయన యుచ్ఛాసనిశ్స్వాపములు, ఆయనపొడుముపట్టులు, ఆయన పొన్నుకఱ్ఱపట్టులు మహాకావ్యములుగా ననవి. పద్యములు పఠించుటలో చెళ్ళపిళ్ళకవి దొకక్రొత్తతీరు. ఆయన ననుకరించి యెందఱో నేటికందముగా బద్యములు చదువుచుందురు. ప్రతివిషయమునను తనదొక ప్రత్యేకత యున్నటులు వేంకటశాస్త్రిగారు ప్రదర్శించినారు. ప్రభుత్వ సంస్థానకవి పదవీప్రదాన సందర్భములో వారుచెప్పినపద్యములు మహోదాత్తములై శాస్త్రిగారి సర్వహృదయమును దాచిపెట్టుకొని యున్నవి.

శా. నన్నాస్థాన కవీంద్రుజేసితి; విక న్నా కాయురారోగ్య సం

పన్నత్వంబు నొసంగుటన్నది క్రమప్రాప్తంబ, నా యీడువా రున్న రెందఱొ విజ్ఞలల్లఘనులం దొండొక్క రాస్థానమం

దున్నన్ దేహబలంబు గోరుదురె ? నిన్నో తల్లి ! కామేశ్వరీ !

మ. పదొకండేడులపైని రెండిపుడు నాప్రాయంబు, నాబోటికిన్

గదిలోమంచమె యెల్లలోక మగుచున్ గాలమ్ము వెళ్లించు వృ

ద్ధు దయార్ద్రంబగు దృ ష్టిజూచి యిడి తేదో గొప్పదౌగద్దె నా

కది భుక్తంబగుదాక నాయువిడుమం చర్థింతు గామేశ్వరీ!

మ. అనుకంపామృతవృష్టి నించినను నీవాస్థాన విద్వత్క వీం

ద్రుని గావించితి; నేను తత్పదవియందున్ గూరుచుండంగ నే

ర్తునె మందిచ్చితి, తేనెగూడ నిడుమందున్నిన్నె యీదృగ్భిష

ఘ్ఝనులున్ మాదృశరుగ్ణులుం గలరుసూ, కల్యాణి, కామేశ్వరీ!

శా. సన్నాసిన్ పరుజేయుచో నెరవెకా సర్వంబునా కిప్డు వి

ద్వన్నేతల్ కవులేలగాదగిన "ఆస్థానంబు" నీజేసి తీ

యౌన్నత్యంబున కిమ్ము దీర్ఘతరమౌ నాయుష్య మట్లిచ్చుచో

నిన్నున్‌మెచ్చు జగ మ్మిశెట్టివరమున్నే గోర గామేశ్వరీ!

మ. ప్రతిసంవత్సర మింకనాకిడు బ్రజారాజ్యంబు వేయారు లు

న్నత ముద్యోగముచేసి వాసిమెయి "బెన్షన్" గొన్నబల్మేటికిన్

భృతకంబిచ్చు విధాన, దీనికి భవత్ర్పేమమ్ము తోడౌచుదీ

ర్ఘతరంబాయు వొసంగగావలె గృపార్ద్రా! తల్లి కామేశ్వరీ!

శా. ఆయుర్దాయము మూడు భాగములుసేయన్ దాన 'వన్‌ధర్డు' బో

నేయంగా మిగిలెన్ శరీరము కడున్ జీర్ణించి శుష్కించె; శే

షాయుర్దాయము భోజ్యమౌట కడుగడ్డె తోచు ద్వత్సన్నిధి

స్థాయింగా నొనరింపు మేమిటికన్ జాలంబు కామేశ్వరీ!

శా. కౌపీనంబుధరించి యా సభకునేగ న్నన్నువీక్షించి యో

హో పారుం డిటుమాఱేనే! వయసుచే నొండొక్కరుండయ్యె వా గ్వ్యాపారమ్మును మాఱితీరుననుచున్ గారుణ్యమొప్పార నా

వైపే చూతురు పంపుమమ్మ సభకున్ పండితు గామేశ్వరీ!

మ. కవులెల్లన్ జయపెట్టు వైభవ మొసంగన్‌లేదొ తచ్ఛిష్యవ

ర్గ విభూతిన్ గరుణింపవో తనుజనుర్భాగ్యంబు గై సేయవో

వివిదైశ్వర్యము లిచ్చితింక నొకటే విశ్వేశి! నీసన్నిధిన్

గవిగానుండ ననుగ్రహింపు మిదియే కామ్యంబు కామేశ్వరి!

శ్రీ వేంకటశాస్త్రిగారి కామేశ్వరీభక్తి కీ పద్యములు నిదర్శనమణులు. ప్రభుత్వసంస్థాన కవితాపదవికి మెఱుగుపెట్టిన శాస్త్రిగారు, ఆపదవి వచ్చిన కొలదినెలలకే పరమపదము జేరుట మనదురదృష్టము. ఆంధ్ర సారస్వతారామమున ననంతశోభతో వెలుగొందిన వసంతరేఖ యస్తమింపగా, ఆయన శిష్యుడు పింగళి లక్ష్మీకాంతకవి పాపము ! ఎట్లు వగచెనో కనుడు.

మరల దిరుపతి వేంకటేశ్వరులజంట

కలిసె, ముప్పదియేండ్ల పై కాలమునకు

సాగ గలదింక దిక్పాల సభలయందు

అద్భుతాపహ శతావధానాంధ్ర కవిత.

        *          *

మాగురుం డిప్డు దిగిన వాజ్మయపుగద్దె

యుర్వి ననధిష్ఠితంబయి యుండగలదు;

ననభిగమ్యము నప్రధృష్యమ్ము నగుచు

విక్రమార్కుని సింహాసన క్రమమున.

       *            *

ఈ జంటకవుల కావ్యములలో "బుద్ధచరిత్రము" చక్కనిపాకమున బడినది. వీరి దేవీభాగవతతో పాటు బుద్ధచరిత్రము సారస్వత లోకమున స్థిరముగా నుండునని చెప్పవలయును. తిరుపతి కవుల కావ్య ములకంటె, వారినిగూర్చిన గాధలు, వారు చెప్పిన చాటువులు, వారి వీరాలాపములు, వారి చమత్కార సంభాషణములు దేశములో నిలిచిపోగలవు. కవితకు జీవితమునకు భేదము లేదని నిర్ధారణము చేసినవారొక్క తిరుపతి కవులే. ఈ జంటకవుల జీవిత-కవితా మాధుర్యములు పడుగుపేకల వలె విడదీయరానివై కలసియున్నవి. వీరు ప్రాచీన ప్రబంధ ధోరణి వీడి నవ్యమార్గములో వర్ణ నాదులు కావించిరి. శ్రవణానందాదులలోని శృంగార వర్ణనములు కొంత హద్దుగడచినటులు కనబడును. కాని, నాడవి రసవంతముగానే యగపట్టినవి. "రాజులెల్లరును భార్గవరాములే యన్న దేజంపు బెంపు సుతింప వలెనె, కోమటు లెల్ల జక్కులరాజులే యన్ననైశ్వర్యముల పెంపు లడుగ వలెనె......" ఈమొదలగు వర్ణనములు పూర్వవాసనా వాసితములు. "మనమా ! వద్దిక నాదుమాట వినుమా మర్యాద కాపాడుమా!" మున్నగు పద్యములకు దెలుగుదేశమున నాశనము లేదు.

'వ్యాకరణ మొకత్రోవ, మహాకవు లొకత్రోవ' యని చెప్పి తిరుపతికవులు వ్యాకరణబంధములు నిరంకుశులై సడలించి గిడుగువారి వాదమున కాదరువునిచ్చిరి. ఈ కవకవుల జీవనజ్యోతి సర్వాభినవ కవిరక్ష, వారి పద్యములు సర్వము శిష్య ప్రశిష్యద్వారమున లోకమెల్లెడ వ్యాప్తములై యచ్చులోలేకున్న, అయిదాఱు శతాబ్దులదాక నశింపని స్థితిలోనున్నవి. పాండవనాటకములు, శ్రవణానందము, మఱికొన్ని చాటువులు పారాయణము చేసికొనువారు చాలమంది కలరు. ఈక్రింది పద్యములు మఱచిపోలేము.

శతఘంట కవసమ్ము సల్పుసంగతి యన్న

"గరతలామలకమ్ము" గాదె మాకు

అష్టావధాన కష్టావలంబన మన్న

"నంబి కొండయ దండనంబు" మాకు ఆశుధారా కవిత్వా డంబరంబన్న

"నల్లేరుపై బండి నడక" మాకు

సత్కావ్య నిర్మాణ చాకచక్యం బన్న

"షడ్రసోపేత భీజనము" మాకు

వ్యర్థమగువాదము లొనర్చు నట్టి వారి

డంబ మణగించు టాపోశనంబు మాకు

దాన రాథేయ! కవిసముదాయ గేయ!

పండితవిధేయ! రామభూపాలరాయ!

       *         *         *

అభినవరామలింగ బిరుదాంకుడ నాకవనమ్మునందు నీ

యభణపు గాండ్లు తప్పు లిడ నర్హులె? కాదని తప్పు దిద్ద మా

యుభములలో నొక్కడు మఱొక్కనికిం దగుగాక యీర్ష్యచే

నభము శుభమ్మునుం దెలియ కార్చెడి దేబెలు మాకు లెక్కయే?

      *         *          *

ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము స

న్మానము లందినాము బహుమానములన్ గ్రహియించినార మె

వ్వానిని లెక్కపెట్ట కనివారణ దిగ్విజయం బొనర్చి ప్ర

జ్ఞానిధులంచు బేరుగొనినారము నీవలనన్ సరస్వతీ!

      *          *          *

నవ్యకవితావతరణమునకు భగీరథులై, ఆంధ్ర సారస్వతమున కొక యపూర్వపు వెలుగు కలిగించిన తిరుపతి వేంకటకవులు బాల కలానిధులు, బాలసరస్వతులు, కింకవీంద్ర ఘటాపంచాననులు, కళాప్రపూర్ణులు, శతావధానులు, శాశ్వతులు.