ఆంధ్ర రచయితలు/త్రిపురాన వేంకట సూర్యప్రసాదరాయకవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

త్రిపురాన వేంకట సూర్యప్రసాదరాయకవి

1889 - 1945

తెలగా వంశీయుడు. తల్లి: నారాయణమ్మ. తండ్రి: తమ్మయ్య దొర. జన్మస్థానము: శ్రీకాకుళము తాలూకాలోని సిద్ధాంతము. జననము: 1889 అక్టోబరు 31 తేదీ. నిర్యాణము: 1945. ముద్రిత కృతులు: 1. నిర్వచన కుమారసంభవము (6 ఆశ్వాసములు. 1913 ముద్రి.) 2. రఘూదయము (4 ఆశ్వా. 1924 ముద్రి.) 3. రతి విలాపము (ద్విపద కావ్యము 1926 ముద్రి.) 4. మొయిలు రాయబారము (కాళిదాసుని మేఘ సందేశమునకు స్వతంత్ర దేశీయ గేయానువాదము. 1940 ముద్రి.) ఆముద్రితములు: 1. నిర్వచన రఘువంశము (శ్లోకమునకు బద్యముగా దెనిగించినది. 19 సర్గములు) 2. ఇందుమతీ మందారము (అజ చరిత్రము) 3. ఉత్తరరామ చరిత్రము (భవభూతి నాటకమునకాంధ్రీకృతి) 4. కిరాతార్జునీయము (భారతికి బద్యాంధ్రీకరణము) 5. అజవిలాపము (ద్విపద ఇది ' భారతి ' లో ప్రకటించిరి) 6. మృతజీవి జీవితామృతము (తమ్మయవిభూ! తండ్రీ! కవిగ్రామణీ! " అను మకుటముతో దండ్రిగారి జివితచరిత్ర ప్రతిబింబునట్లు వ్రాయబడిన చిన్నగ్రంథము) 7. శ్రీరామాశ్వమేధము (పద్మపురానములోని పాతాళఖండము, ఇది యసంపూర్ణము) 8. శ్రీభగవద్గీతామృతము (దేశీయచ్ఛందో గీతికలలో ద్విపాత్రనాటికగా రచింపబడినది).

శ్రీ సూర్యప్రసాదరాయకవి త్రిపురాన తమ్మయరాట్కవీంద్రునకు దగిన తనయుడు. ఇంకను కొడుకు కళాప్రపూర్ణుడు కాలేదు, సరిగా బదునాలుగు నెలలేని నిండలేదు. తమ్మయకవి భగవదాజ్ఞకు బద్ధుడయ్యెను. పాండితిలో గవితలో వీరి రచనములను బట్టి పరికించినవారికి 'పుత్రాదిచ్ఛేత్పరాజయ' మ్మనిపించును. సూర్యప్రసాదరావుగారి జననం 1889 లో. ఆయనకేమి ? పరులకడకు బోయి చేచాపనక్కఱలేకుండ, స్వేచ్ఛగా దిని చేతులార నింత పెట్టుకొను శ్రీమంతుల వంగడములో బుట్టెను. పసితనముననే తండ్రిని బాసినవాడని కడుగారాబమున బెంపబడెను. పదునైదేండ్లు వచ్చుదాక వేటమీదను, ఆటలమీదను గల వేడుక విద్యపై లేదు. "తమ్మనదొరగారికి దప్పి పుట్టితివి నాయనా!" అని యొక పెద్దమానిసి వీధి బోవుచు నన్నమాట శూలపు బోటై. సూర్యప్రసాదరావుగారు వెంటనే యింటికిబోయి తన బుద్ధి చదువు బాటపై నడిపించెను. మనోరథము మంచిది గాన దమ యింటి పండితుడు శ్రీ ముక్కవిల్లి సాంబయశాస్త్రిగారి సారథ్యముతో నడక చఱ చఱ సాగినది.

గురుదేవులు సాంబయశాస్త్రిగారిని గుఱిచి ప్రసాదరాయ కవి "మృతజీవి జీవితామృతము" లో గనబఱిచిన భక్తి గౌరవ మీ పద్యములలో నారయగలరు.

మ. హరి భక్తుండను శేముషీ గురుడు నీ యాస్థాన విద్వత్కవీ

శ్వరుడౌ సాంబయశాస్త్రి ముక్కవిలి వంశ స్వచ్ఛ రత్నమ్ము మ

ద్గురుడైనాడు సుమయ్య! యయ్యనఘు గన్గొన్నప్డు నిన్గన్న యా

దరమున్ భక్తియు గల్గు దమ్మయ విభూ! తండ్రి! కవిగ్రామణీ!

మ. పదునై దేండుల యీడు వచ్చుదనుకన్ బాలో చితక్రీడలం

జదువుల్ మాని చరించునాకు గవితాసక్తిం బ్రసాదించి యొ

ప్పిదమౌదారికి ద్రిప్పి తా జదువుచెప్పెన్ మద్గురుండెందు నం

త దయాళుండు గలాడె తమ్మయ విభూ! తండ్రీ! కవిగ్రామణీ!

మ. ధన మీవిచ్చితిగాని యాతడిడు విద్యాబుద్ధులే నాకు నీ

ధన సంపత్తికి మీఱి కీర్తియు మహత్సమ్మానముంగూర్చె, న

య్యనఘు న్నన్ను దలంప నెక్కు డతడేయౌ, గాని, నాకట్టియా

తని నీవిచ్చితి గాదె తమ్మయ విభూ! తండ్రి! కవిగ్రామణీ రఘువంశము మొదలిడి, కావ్యములు, నాటకములు మున్నగా జదువవలసిన వెల్ల జదివిరి. తెనుగులు తనివితీఱ వినిరి. తండ్రిని స్మరణకు దెచ్చుచు, పండితుల మెచ్చు లందుచు జానుదెనుగులో దియ్యని కవిత్వము కట్టుటకుపక్రమించిరి. రఘువంశము, కుమారసంభవము, శ్లోకమునకు బద్యము చొప్పున జెప్పిరి. మొన్న 1940 లో మేఘదూతమునకు కడు గ్రొత్తరీతిని గేయములలో ననువాదము గావించి ప్రకటించిరి. ఆంధ్రకాళిదాసుడని యీయనకు బిరుదమున్నది. 'బారతీతీర్థము' లో శ్రీజయపురాధీశ్వరునివలన వీరికి 'కవిభూషణ' యను నుపాధి లభించినది. వానితో బనేమి? ఆంధ్ర విశ్వకళాపరిషత్తువారు 1943 లో జిలకమర్తి కవితో పాటు వీరిని 'కళాప్రపూర్ణు' లని బిరుదనామ మిచ్చి మెచ్చిరి.

సూర్యప్రసాదరాయ కవి కవితాకళలో బ్రపూర్ణు డనుట కతని కృతులు పరమప్రమాణములు ఇక్కవిమణికి దిక్కనమభి కవిత యాదర్శముగా నుండి యున్నటులు పదము పదమున గానవచ్చును. పొలుపు గల తెలుగు పలుకు గూర్పులో మంచి నేర్పు మన కవి గారి కున్నది. వీరి 'నిర్వచన కుమార సంభవము' లో నెల్లను గందములు, గీతములు, పెద్దవృత్తములు పెక్కు లేవు. ఉదాహరణమున కొక మెత్తని పద్యము చూడుడు:

క. కటముల తీటలు వో గజ

ఘటలు సరళతరుల రాయగా బాల్వడి తత్

స్ఫుటతరపరిమళ భర మ

చ్చొటున న్నెత్తముల జేయు సురభిళములుగాన్.

'రఘూదయము' లోని వొక రెండు ప్రకటింతును:

మ. ఒకనాడొక్కమదాంధ సిందురము గండోద్భూత కండూతి కో

ర్వక యీ చెట్టునరాయ మాడె వలపారన్ దీనిపైపట్ట దా నికి నీహార ధరాధిరాజసుత కన్నీ రుట్ట శోకించె స్కం

దకుమారుండసురాశుగక్షతులు వొందం గుందు చందంబునన్.

ఉ. ఆదినమాదిగానె త్రిపుర్రారి ననుం గరివైరి జేసి కుం

భోదర యీహిమాద్రి గుహనుండి యిటన్ దరిజేరు జంతువున్

గాదన కారగించుచును గాపుము దీని నటంచు బంచె దో

డ్తో దయితాకపోలములతో నెలనవ్వులు వియ్యమందగన్.

వీరిగ్రంథములలో నే పట్టులు పట్టిచూచినను తియ్యని పలుకుబళ్లతో గనుపట్టుచున్నవి. ఈయన కృతు లన్నియు ననుసృతులైనను, దెనుగుసేతలో నొక క్రొత్తదన ముండి యందగించుచున్నది. మేఘదూతమునకు స్వతంత్ర గేయరూపముగా వీరుగావించిన తెలుగు పరివర్తనము వీరి కృతులు కెల్ల గిరీటము. గేయరూపముగ నున్న నేటి సలక్షణి కావ్యములకును నిది మస్తక మాణిక్యము. శ్రీ జయపురమహారాజులు శ్రీ విక్రమదేవవర్మగారి కీ కృతిని పెంపుడుబిడ్డగ నంపిరి. వారు దానిని శ్రీరామచంద్రున కర్పించుకొనిరి. ఈకృతి తొలుత 'మొయిలు మఱుగులలో శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ముచ్చటించినటులు "...యల్ల నల్లన్న విరియుచు వల్పులు గొల్పుచు నమృతబిందులొలుకు నలది రేకులవోలే సులలితములై జిలు జిలు మన జలువల జల్లుచు జవుల జిందుచు విందులు గొల్పుచు నున్న పలుకుల్ పొలుపుతో మురిపం టొయ్యారపుటూపుదోపించు శయ్యతో దేశితెలుగు తీరున గడుదియ్యమైన పాటసౌరుతో నిక నిట్లు తెలిగించు టన్యుల కసాధ్యమన దగిన ట్లున్నది......"

సీ. పువు దేనె సోనలై చెవులపండుపు సేయు

కలికిపల్కుల ముద్దులొలుక నేర్చు బద్దెమ్ములో బాట పాటలో బద్దెమ్ము

గూడి రా హాయిగా బాడ నేర్చు

నరటిపం డొలిచి తానరచేత నిడురీతి

భావార్థముల దేటపఱుపనేర్చు

గానాభినయ నాట్య కవితాకళల గూర్చి

యరుదార నాటకా లాడనేర్చు

సర్వగతుల నీకును సంతనమ్ము గూర్చు

గాళిదాస సత్కవి మేఘ కావ్యకల్ప

పుష్ప సౌరభ లహరికా మూర్తి యైన

మా మొయిలు గబ్బపుంగన్నె భూమహేంద్ర! [మొయిలు రాయబారము]

పలువన్నె జోతి రేకల చుట్లతో గూడి

పొలుపారునే నెమిలిపురికన్ను పట్టూడి

యిలరాల గొడుకుపై గల ప్రేముడిని దాని

గలువఱే కిడుచెవిం గయినేయు నాగౌరి

నెలతాల్పు శిరసు వన్నెలలచే సెంతయు

దెలుపారు కన్ను గొల్కులతోడి గుహుని య

ప్పులు గుదత్తడి నవల మలగపుల మఱుమ్రోత

లలమ బిట్టుఱిమి గొండిలికి దార్సగదన్న! [క్రొమ్మెఱపు...]

ఇట్టి కవితతో నున్న యీ 'మొయిలురాయబారము' క్రొత్తతీరు గలదైనచారువుగా నున్నదనుట నిర్వివాదము. యక్షుడు చిట్టచివర మేఘున కనుచున్న మాటల యందపు బొందిక కనుగొనుడు! కాళిదాసుని కవితతో వియ్యమందు చున్నదిగదా! మొయిలురాయడ ! యిట్లు మొదటివియుక్తి

జాలశోకించు నీసకియ నో దార్చి

సంది కోరాటలన్ సలగు నా వెండి

మలనుండి వేవేగ మరలి యే తెంచి

తగినగుర్తులతోడ దరళాయతాక్షి!

పంపిన నేమపంపువార్తలం దెల్పి

వేబోక తఱిమల్లె విరివోలె బ్రిదిలి

తలరు నా జీవము న్నిలుపంగదయ్య!

  *   *   *   *

ఇట్లు నీదు మెఱుంగు టిల్లాలితోడ

నీకెన్నడు వియుక్తి లేకుండుగాక!

ఈ మొయిలు రాయబారములోని గేయముల తీరుననే "శ్రీ భగవద్గీతామృతము" కూడ రచించిరి. కృష్ణార్జును లిరువురు నిందుపాత్రలు. ఈ గ్రంథమింకను ముద్రణము లోనికి రాలేదు.

శ్రీ సూర్యప్రసాదరావుగారు తెలుగు కవితలో మంచి మంచి మెలకువలు తెలిసిన సరసకవులు. కవితలో నధునాతన భావములు వీరియందున్నవిగాని, భాషావిషయకమైన సంస్కారము వీరికంగీకారము కాదు. 1927 లో బళ్ళారిని జరిగిన ఆంధ్రసాహిత్య పరిషద్వార్షిక మహాసభకు వీరి నధ్యక్షులుగా నెన్ను కొనిరి.

1922 సం. జూలై 18 వ తేదీన్ జార్జిచక్రవర్తి కుమారుడు 'ప్రింస్ ఆఫ్ వేల్సు' మదరాసు సెనేటు హాలులో శ్రీ వేదము వేంకటరాయశాస్త్రి, చదలువాడ సుందరరామశాస్త్రి గారలతో పాటు మన ప్రసాదరావు గారికిని సువర్ణకంకణము, సాలువలు నొసగి గౌరవంచిరి. ఈడెశి నెన్నో సన్మానము లందిన ధన్యులువీరు. ఈయన ఇష్ట దేవతాప్రార్థన మిట్లున్నది.

సీ. వాసస్థలంబు లక్ష్మీ సరస్వతుల శు

ద్ధాంత మైనట్టి సిద్ధాంతమనియు

జననంబు విద్యాయశశ్శ్రీగుణాకరం

బగు త్రిపురాన వంశాబ్ధి యనియు

వప్తదేవీభాగవతము దెల్గించి పెం

పెసగు తమ్మయరాట్కవీంద్రు డనియు

నిత్యకృత్యము భవత్ర్పీత్యర్థమై నవ్య

కృతి పుష్పపూజలర్పించు టనియు

జెప్పి కొనుట కుత్సాహంబు జెంద దగిన

యిట్టి యౌన్నత్య గరిమ నా కిచ్చినావు

వినుతి సేయంగ దరమె నీ వినమ దమన

దక్ష సత్సక్ష కరుణా కటాక్ష మహిమ.

చ. కడుకొని యన్యులంగడపు కక్కుఱితిం జెయి సాపకుండ దా

గుడువగ గట్టగా నొరులకుం దగ బెట్టగ జాలినంత యె

క్కుడుసిరు లిచ్చి దాన బ్రతికూల మదాది వికార చేష్టలం

బడి చెడనీక నీదుపదభక్తుని జేసితి వింతయొప్పదే!

              _____________