ఆంధ్ర రచయితలు/వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి

1896

వెలనాటిశాఖీయబ్రాహ్మణులు. తల్లి: మణికర్ణికా సోమిదేవి. తండ్రి: వేంకట చయనులు. జన్మస్థానలు: ఇందుపల్లి. పెంచుకొన్న తలిదండ్రులు: కామమ్మ, రామయ్య. దత్తత, కొమానపల్లి. జననము: దుర్ముఖి నామ సంవత్సర- అధిక జ్యేష్ఠశుద్ధషష్ఠి-ఇందువాసరము. 1896 సం. రచనలు: 1. వేంకటేశ్వర శతకము 2. మునిత్రయచరిత్రము 3. శంకరవిజయము. 4. శబర శంకర విలాసము - ఇత్యాదులు.

ప్రతిభా వ్యుత్పత్తులు సరితూకములో నున్న కవులెందఱో యుండరు. ఆవిధముగా నున్ననేటి కవులు కొందఱిలో వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగా రొకరు. వీరు 'శంకరవిజయ' ప్రబంధకర్తలుగా నేడు మంచివిఖ్యాతి నందుచున్నారు. వీరి 'మునిత్రయచరిత్ర' ప్రౌడార్థప్రచురమైన రుచిరకావ్యము. ఈ రెండు కృతులును శాస్త్రిగారికి మహాకవితా పట్టము గట్టించుటకు జాలియున్నవి.

శ్రీసూర్యనారాయణశాస్త్రిగారు శిష్టవంశీయులు. వారితండ్రి వేంకటచయనులుగారు ఆహితాగ్నులు. చయనాంత క్రత్వనుష్టాతలును. తల్లిమణికర్ణికాసోమిదేవి. ఈపుణ్యదంపతుల కడుపు మనశాస్త్రిగారు. వీరు చిననాట శ్రీ మరువాడ కాశీపతి శాస్త్రిగారితో గాళిదాసత్రయము పఠించిరి. పదపడి, చావలి లక్ష్మీనరసింహశాస్త్రిగారి సన్నిధిని సాహిత్య గ్రంథములు, లఘుకౌముదియు నధ్యయనము చేసిరి. అప్పుడవ్ యాంధ్రకవితాభిరతియు నంకురించినది. లక్ష్మీనరసింహ శాస్త్రిగారి యాచార్యకమునెడల మన శాస్త్రిగారి కృతజ్ఞత చక్కనిది.

మ. కలమున్‌జేతను బూని పద్యమని యేకాసంతయున్ ప్రాయగా

దలపుంజెందినముందుమ్రొక్కవలెగాదా, సంస్కృతాంధ్రమ్ములన్ గల మర్మంబులు నాకుదెల్పి కవితా నైపుణ్యముంగూర్చు చా

వలి లక్ష్మీ నరసింహశాస్త్రి గురుదేవ స్వామికిన్ భక్తిమై.

1925 ప్రాంతమున పిఠాపురమున నుండి, శ్రీ దర్భాసర్వేశ్వరశాస్త్రిగారి కడ వీరు వ్యాకరణ శాస్త్రాధ్యయనము గావించినారు. ఈక్రింది పద్యము చూడుడు:

శా. తర్కవ్యాకృతి పారదృశ్వు నిఖిలాంధ్ర జ్యౌతిషాంగ్లోక్తి సం

పర్కున్ సూర్యబుధేంద్ర శిష్యమణి దర్భావంశ్యు సర్వేశ వి

ద్యార్కున్ వ్యాకరణోపదేశికు ద్వితీయానంతు నెంతున్ శుభో

దర్కత్వంబు కృతజ్ఞతం బడసి మత్కావ్యంబు రంజిల్లగన్.

"మునిత్రయచరిత్ర"

మహామహోపాధ్యాయ శ్రీ తాతా సుబ్బరాయశాస్త్రిగారికి వీరు 'మునిత్రయచరిత్ర' నంకిత మొసంగిరి. ప్రత్యేకముగా "రాయడు శాస్త్రి యశశ్చంద్రిక" కావ్యము రచించి మహామహోపాధ్యాయుల షష్టిపూర్తి సన్మానసందర్భమున నర్పించిరి. ఇవన్నియు నేల పేర్కొనుచుంటి ననగా, శ్రీ సూర్యనారాయణశాస్త్రిగారి హృదయములో పండితగురువులపట్ల నిట్టి భక్తి ప్రపత్తు లున్నవనుటకు.

సంస్కృతాంధ్ర వైదుషీ భూషితులైన వీరు 1930 సం.లో అమలాపురము బోర్డుహైస్కూలున తెలుగు పండితులుగా బ్రవేశించి రెండేండ్లు అచ్చటనుండిరి. తరువాత కాకినాడ నేషనల్ స్కూలులో మఱిరెండేండ్లు పండితోద్యోగము. పిదప, పాణంగిపల్లి జమీందారు శ్రీనబ్నివీను కృష్ణారావు పంతులు (బి.ఏ) గారికి సంస్కృతాంధ్రోపాధ్యాయత్వము.అప్పుడే ప్రొద్దుటూరి 'కవి' వ్యాసపు పోటీపరీక్షలో ద్వితీయ బహుమానము. ఈ పురస్కారము కారణముగా జమీందారు "కవిసింహకంకణము" చే సూర్యనారాయణ శాస్త్రిగారిని బహూకరించెను. "జీమూతవాహనచరిత్ర" మను ఖండకావ్యము పాణంగిపల్లి ప్రభువునకు శాస్త్రిగారంకిత మిచ్చినారనుట ప్రకృతము తలచుకోవలసిన విషయము. ఇది యిటులుండగా, శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయమున బండితులుగా నుండి వీరు కావించిన వాజ్మయసేవ మఱచిపోరానిది. 1925 సం. నుండి 1937 వఱకు వీరా కార్యాలయోద్యోగము నిర్వహించిరి. ఈ యుద్యోగమువలన శాస్త్రిగారి మేధాసంపద మఱింత మెఱుగులు దేఱినది. ఆంధ్రప్రబందములలోని రహస్యములు వెంపరాలవారికి దెలిసినన్ని వేఱొకరికి దెలియవేమో యనిపించును. ఆయన కున్న ప్రయోగపరిజ్ఞానము నిస్సమానమైనది. ఆయనకు వేలకొలది పద్యములు నోటికి వచ్చును. ఒక ప్రయోగమునకు బది యుదాహరణపద్యములు వెంట వెంటనే చదివి చూపగలరన్నది యతిశయముగా నన్నమాట గాదు. ఇట్టి ధారణాపాటవముగల వీరు సూర్యరాయ నిఘంటు కార్యాలయమునకు జేసిన యువకృతి కృతజ్ఞతకు బాత్రమైనది.

మఱి, శాస్త్రులుగారి కవితారచనలోని విశిష్టత యేమనగా, వారు ప్రయోగవైచిత్ర్యమును వలచిన రచయిత లగుటచే నడుగడుగున నూతన ప్రయోగములు కనబఱచెదరు. ఇంచుమించుగా వారి కావ్యములోని పెక్కు ఘట్టములు భట్టి కావ్యమును స్ఫురణకు దెచ్చుచుండును. పాణినీయము నామూలచూడము చుళుకించినవారు కావున వారి కవిత యిటు లుండుటలో నబ్బురమేమి? ప్రయోగదృష్టి యెంత యున్నదో శాస్త్రులు గారికి రసదృష్టియు నంతేయున్నది. ఆ హేతువున వారి కృతులు పండిత హృదయరంజకములై యున్నవి. మునిత్రయ చరిత్రము నందలి కొన్ని యుదాహరణములు:

ఉ.వియ్యపురాలటుల్ తినెడు వేళకు వచ్చుటెకాని యింత సా

హాయ్యముసేయ వాడుదికదా పసిపాప విలాసమొందగా నుయ్యెల నూపరాదొ జలమొక్క వనంటెడు తేరరాదొ లే

దెయ్యెడ నిట్టిదంచు గణియించు గరాసయి తోడి కోడలిన్.

         *

సీ. చెదపుర్వు గమి గ్రసించిన కప్పునుండి యౌ

పాసనానల ధూమవటలి వెడల

ముంజూరిలకు వంగిపోవుట లోనికి

వచ్చి యేగెడు వారు వంగిమసల

గోడలమాఱు నాల్గుదెసల నిల్పిన

కంపపెందడుకలు గాలి గదల

నుసిరాలి లోపలి వస మాసి నిట్టరా

డొకప్రక్క కొక్కింత యొదిగియుండ

గోమయ విలేపనంబు మ్రుగ్గులునుమాత్ర

మమర దారిద్ర్యదేవి విహారసౌధ

మనదగిన వర్షగురు ప్రాతయాకుటిల్లు

లోచనంబుల కెదురుగా గోచరింప,

      *

ఈతీరైన సాధుప్రౌడశయ్యలో శాస్త్రులుగారు "శంకరవిజయము" మహాప్రబంధముగా నంతరించిరి. ఆకృతి శాశ్వతముగానుండుటకు జాలియున్నది. మహాకవితా పట్టము శంకర విజయమువలన శాస్త్రులుగారికి లభించుచున్న దనుటలో విప్రతివన్ను లుండరు. వారు రచించుచున్న 'విద్యారణ్య చరిత్ర' తెలుగు కవితాశాఖకు కైనేత కాగలయది. ఆస్తిక బుద్ధి సంపన్నులు, వ్యుత్పన్నులునైన సూర్యనారాయణశాస్త్రి గారు తీసికొన్న యితివృత్తములన్నియు సుపవిత్రములై యుండుట సుప్రశంసార్హమైన విషయము.

           __________________