Jump to content

ఆంధ్ర రచయితలు/సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి

వికీసోర్స్ నుండి

సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి

1897

వైదికబ్రాహ్మణులు. తల్లి: బుచ్చినరసమ్మ. తండ్రి: సుబ్బయ్య. నివాసము: సికిందరాబాదు. జననము: 10-2-1897 సం. గ్రంథములు: 1. తత్సమ చంద్రిక 2. కావ్యాలంకార సంగ్రహము (వ్యాఖ్యాన సహితము) 3. జాతక కథాగుచ్ఛము (2 భాగములు) 4. కీరసందేశము - ద్వంద్వయుద్ధము. 5. గోవర్ధానాచార్య సప్తశతీ సారము 6. పువ్వులతోట (ఖండకావ్యసంపుటి) 7. కావ్యమంజరి 8. నడుమంత్రపు సిరి (అధిక్షేప కావ్యము) 9. ఖడ్గతిక్కన 10. అమృతకనములు 11. వాసవదత్త 12. రేణుక విజయము 13. వివేకానందము (కావ్యములు) ఇత్యాదులు.

జాతక కథాగుచ్ఛాది పద్యరచనల వలనను, తత్సమ చంద్రికాది లక్షణ గ్రంథరచనలవలనను సన్నిధానము సూర్యనారాయణ శాస్త్రి గారిపేరు తెనుగువారు లెస్సగా విన్నదియై యున్నది. ఆయన మంచి పండితులు. గొప్పకవులు. వ్యాకరణమున, అలంకార శాస్త్రమున, వీరు ప్రధానముగా గృషిచేసిరి. వారి వ్యాకరణ కృషికి తత్సమచంద్రికయు, అలంకార శాస్త్రకృషికి కావ్యాలంకార సంగ్రహ వ్యాఖ్యయు నిదర్శనములుగా నిలబడు గ్రంథములు. వేదాంతమున, ప్రస్థానత్రయపాఠము చేసిరి. ఇట్టి వ్యుత్పత్తి గౌరవముతో, శ్రీ వేలూరి శివరామ శాస్త్రిగారి గురుత్వముతో సూర్యనారాయణ శాస్త్రిగారు సహజమైన కవిత్వమును వృద్ధిపరుచుకొని, యెన్నోకృతులు రచించిరి, రచించుచున్నారు.

శ్రీశాస్త్రిగారి పట్టుదల మిగుల మెచ్చ దగినది. ఆయన కావ్యాలంకార సంగ్రహవ్యాఖ్య 700 పుటలు పరిమితిగల గ్రంథము. ఆలంకారికుల సర్వసిద్ధాంతములు పరిశీలన చేసి వా రావ్యాఖ సంఘటించిరి. కావ్య స్వరూపము - రససిద్ధాంతము మున్నగు స్థలములలో మన ప్రాచీనాలంకారికులు భిన్నవిభిన్నములుగా బ్రదర్శించిన మతములు వీరు గుఱుతెంచి వాని నెల్ల నీ వ్యాఖ్యలో బయలుపఱుచుట వీరి పరిశ్రమకు దార్కాణమైన విషయము.

వారి తత్సమచంద్రిక యు నమోఘ కృషి ఫలితము. సిద్ధాంత కౌముది, మఱి యితర పాణినీయవ్యాఖ్యాన గ్రంథములు శాస్త్రి గారు బాగుగా బరిశీలనము చేసినా రని ఈ కృతి తెలుపుచున్నది. పయి రెండు లక్షణ గ్రంథములు వీరికి లాక్షణికులలో మంచి స్థానము నిచ్చుటకు జాలియున్నవి.

ఇది యిటులుండగా, సప్తశతీసారము, జాతక కథాగుచ్ఛము, వివేకానందము, వాసవదత్త మొదలయిన వీరి పద్యరచనలు పాఠ్యములై ప్రసిద్ధిగొన్నవి. తెలుగు పలుకుబడి వీరిది సుఖముగానుండును. వ్యాకరణవిశేష విశిష్టములైన ప్రయోగములు వీరి కవితలో దఱచు అన్వయములో నెడనెడ దిక్కనగారి తీరులు, యతిప్రాసలకు దడవు కొన్నటులుండదు. కాని, శాస్త్రిగారు యతి ప్రాసబంధములు పద్యకవితకు దగిలింపరాదని యెకప్పుడు వాదము నెఱపినవారు.

కావించె నేపతి తన వజ్రకాయంబు
ఆహా! వివరించి వ్రాయుటకు బట్టదు కావ్యమొకండు

ఇత్యాదులుగా గొన్ని పద్యములలో యతులు తప్పించి చూపిరి. ఈ పద్ధతి సార్వత్రికము చేయుట నచ్చకయే, వారు మరల గృతుల నన్నింట సలక్షణత పాటించుచునే వచ్చుచున్నారు. అచ్చటిచ్చటివి సూర్యనారాయణ శాస్త్రిగారి కావ్యములనుండి మచ్చు తునుకలు.

క. మీసాల తేనె నాదగు
నీ సంస్కృతి సుఖము కొఱకు గృహమేధము గో

చీ సంరక్షింపగ స
న్న్యాసి పటాటోప మట్టు లర్థింత్రు జనుల్.

క. విడిది నికుంజాంతరముల
బడక శిలాతలములందు; బ్రాశము బిసముల్
మడుగులు నారలు కాగా
గడగిరి తపమునకు నియతగతి నా భ్రాతల్.

శా. సాయాహ్నంబుల దమ్ములంద ఱొకవృక్షచ్ఛాయ గూర్చుండగా
బ్రేయశ్శ్రేయములం గురించి యతి గంభీరం బుపన్యాసముం
జేయుం ; దేల్చును దారతమ్యమును దజ్జేష్ఠుండు; వారెల్లరుం
బీయూషంబును గ్రోలు చందమున దృప్తింబొంది హర్షింపగన్.

ఇది జాతకథా గుచ్ఛమునందలివి. ' వివేకానందము ' నుండి మరి మూడు :-

మ. అడుగంటెన్ మన భారతీయమగు విద్యల్ ; పుచ్చిపోయెన్ గడున్
గడు ధర్మంబులు ; వేషభాషణములుం బాశ్చాత్యలోకంపు బో
కడలన్ మైలపడెన్ ; సమస్తజనలక్ష్యం బర్థకామంబులై
పెడదారింబడె; బూతిగంధియగు నీ విశ్వం బిసీ! కన్పడున్.

తినగా మూల్గుచు నెంగికులపయిన్ దీర్పంగ బెన్దప్పినిం
జనుచున్ సీ ! గవులారు గుంటలకు, వృక్షచ్ఛాయలంబండు చెం
డన్ వానన్, మెయి జింకిపాతలను మాసంబెట్లొ ! రక్షించు కొం
చును జీవించెడి పేదలం గనగ జించున్ దుఃఖ మీడెందమున్.

చాలున్ మూలము లేని సాంఘక దురాచారంబులే యయ్యె బో
మేలుబంతులు జాతికీ భరతభూమిం; దత్పురోవృద్ధికిన్
ఆలోచింపగ వేరుబుర్వులు మఠాధ్యక్షుల్ ; పురోధోగణం
బేలా, పెక్కులు ! దయ్యముల్ కరణి నెంతే బట్టిపల్లార్చెడిన్.

ఏవంవిధముగా మధురమైనదియు మృదువైనదియు సాధువైనదియు నగు కవితారచనతో శ్రీ సూర్యనారాయణ శాస్త్రిగారు పెక్కు కబ్బములు సంతరించుచున్నారు. నిజాంరాష్ట్రమున, ఆంధ్ర సారస్వత పరిషత్తువారి మాహాదరణ గౌరవములకు వీరు పాత్రులయినారు. యావదాంధ్రమున వీరి రచనలు ప్రాకు చున్నవి. మహబూబు కాలేజీలో తెలుగు పండితులై మూడు దశాబ్దులనుండి శిష్యుల నెందరినో తీర్చి దిద్దుచున్నారు. వీరు సాహిత్య శిరోమణి, విద్వాన్, పి.పి.యల్. మున్నగు పట్టములు వడసినారు. సకల సౌభాగ్య సంపన్నులై, పండిత కవులై విరాజిల్లుచున్న సన్నిధానము శాస్త్రిగారి సారస్వత జీవితము చక్కనిది.