Jump to content

ఆంధ్ర రచయితలు/భమిడిపాటి కామేశ్వరరావు

వికీసోర్స్ నుండి

భమిడిపాటి కామేశ్వరరావు

1897

వెలనాటి శాఖీయ బ్రాహ్మణుడు. తల్లి: లచ్చమ్మ. తండ్రి: నరసావధానులు. జన్మస్థానము: ఆకివీడు. నివాసము: రాజమహేంద్రవరము. జననము: 30 ఏప్రిలు 1897. రచనలు: 1. కాలక్షేపం 2. ఇప్పుడు 3. అవును 4. నిజం 5. అప్పుడు 6. మాటవరస 7. గుసగుసపెళ్లి 8. పెళ్లిట్రయినింగు. 9. రెండురెళ్లు. 10. అన్నీ తగాదాలే. 11. మేజువాణి. 12. మన తెలుగు. 13. కాలక్షేపం (2 భాగాలు) 14. లోకోభిన్నరుచిః. 15. తనలో. 16. మాయలమాలోకం. 17. చెప్పలేం. 18. మృచ్ఛకటిక. 19. ముద్రారాక్షసం. 20. ప్రణయరంగం. 21. త్యాగరాజు ఆత్మవిచారం- ఇత్యాదులు.

ఈనాటి హాస్యరచయితలలో శ్రీభమిడిపాటి కామేశ్వరరావు గారి స్థానము ప్రత్యేకము విశిష్టము నైనది. బాగుబాగు-ఎప్పుడూ ఇంతే-కచట తవలు-తప్పనిసరి-వద్దంటే పెళ్లి-ఘటన-ఈ మొదలయిన ప్రదర్శనాల సంవిధానముతో వేఱుచేయలేని కామేశ్వరరావుగారి పేరు యువ ప్రపంచమున నిత్యవిహారము కలది. ముఖ్యముగా, కళాశాలలలో వీరి నాటికలు ప్రాయికముగా ప్రదర్శితము లగుచుండుట గమనింపదగినది. విద్యార్థుల హృదయములు కృతకసంసార దూషితములు కానివి; పరమస్వచ్ఛములైన వారి యాత్మ లానందమయములు. కనుకనే తత్త్వావధారణమునకు దారి చూపు హాస్యరసముపైనే వారికి జూపు. సంసారబంధితుడు తఱచుగా నవ్వలేని కుటిలుడు. సత్యమును సత్యముగా గుఱుతింపలేకపోవుట హాస్యమునకు గారణమగుచున్నది. ఈగుఱుతుగల సంసారులు అరుదుగానుందురు. అనగా తత్త్వనిర్ధారణమునకు చర్చా గ్రంథమైన హాస్యరసము నాస్వాదించుటకు సంయతాత్ముడే అధికారియగుచున్నాడు. బ్రతుకును పొడిగించుకొన దలచినవారికి నృత్య-హాస్యముల యక్కఱ మిక్కిలి కావలసియుండును. కాబట్టి హాస్యము నకు దపస్సుతో సాదృశ్యము చెప్పవచ్చును. ఈ యభిప్రాయ మాలంకారికులు సూచించినదియును.

ప్రకృతము; భమిడిపాటి కామేశ్వరరావుగారి ప్రతిరచనయు హాస్యరసప్రచురము. ఆయన రచన చేతిలో నున్న పాఠకుడు, ఏయవస్థలో నున్నవాడైన నవ్వును; చిఱునవ్వును; అంతలో, పెద్దపెట్టున నవ్వును; మరల మందహాసమున కవతరించును; అంతలో, అట్టహాసమున కధిరోహించును. ఇట్లు చేయింపగల నుగుణము, ఆయన వ్రాతలలోను, మాటలలోను, సరితూకముగానే యున్నది. కామేశ్వరరావుగారి కూర్పులలో భావముతోపాటు, భాషయును హాస్యరసోత్పాదకమగుట విశేషము. వ్రహసనకర్తలలో బేరుమోసిన వీరేశలింగముపంతులు, చిలకమర్తి కవియు దీనిని నకృత్తుగా బాటించినారు. "కన్యాశుల్క" కారునిలో స్విష్టకృత్తుగా నీలక్షణమున్నది. 'భమిడిపాటి' వారికి 'గురుజాడ' వారిదారి యొరవడి కావచ్చును. కామేశ్వరరావుగారి రచన వినీవినగనే భాష, మొదల నవ్వించును; భావము పిదప కవ్వించును. వీరిభాషలో అపార రమణీయహాస్యము భావములో విచారిత రమణీయహాస్యము నుండెనని నేననుకొందును.

"...నాగరికత అబ్బి, జెంటిల్ మెన్ అనగా పెద్దమనిషిఅవడానికి సర్వవిధములా పెరుగుతూన్న నన్ను ఈన ఇంతడౌన్‌రైటుగా ఇన్సల్ట్ చేయుట చూచి ఎటులఊరుకొనుట? దేర్‌ఫోర్ తమషా బికేమ్‌కసి. చదువుకోనివాడు ఏదేనాచేస్తే తప్పు. అదే చదువుకున్నవాడు చేస్తే పామరులకి తప్పులా కనిపించినా దానిగర్భంలో గొప్పప్రిన్సిపల్ ఉందని సమర్థించి, తప్పుకాదని స్థాపించి, అదిఒకవేళ నలుగురికీ భర్జించకపోతే కాంట్ హెల్ప్ అనగా సహాయము చేయలేము అని చెప్పిపారేసినెగ్గొచ్చు..." "బాగుబాగు" నుండి ఊరకే మచ్చుకొఱకై యీపంక్తులు పేరుకొంటిని. స్థూలరూపముగా నుండిన యిక్కడిభాషలోను సూక్ష్మరూపముగానుండిన భావములోను మనస్సులను గదలించి నవ్వింపగ తీరు స్పష్టముగా దోచుచున్నది. ఇట్లే కామేశ్వరరావుగారి ప్రదర్శనములు, ఉపన్యాసములు, కథలు బహిరంతర్హాస్యరసవాహినులు. ఆయన రచనల పేళ్లు, వానిలోని వ్యక్తులపేళ్లు కూడా వింత పుట్టించునవి. కచటతపలు-వద్దంటేపెళ్లి-ధుమాలమ్మ ఓఘాయిత్యం-శానయ్య-మరకమ్మ-చిక్కేశ్వరరావు-ఈ నామకరణములు మఱి యెటువంటివి? శ్రీ కామేశ్వరరావుగారి రచనలో కొన్నిపట్టులు, చెవినిబడిన కొంతసేపువఱకు నవ్వుపుట్టింపక, చర్వణమయిన తరువాత గడుపు చెక్కలు చేయును. నాయుద్దేశమున 'భమిడిపాటి' వారి హాస్యములో ఉత్తానమైన వాచ్యతకంటె, ఉదాత్తమైన వ్యంగ్యమర్యాదపాలు హెచ్చుగా నుండుననియే. ఒక ప్రసిద్ధవిమర్శకుడు లక్ష్మీనరసింహముగారి హాస్యమునకును వీరేశలింగముగారి హాస్యమునకును భేద మున్నదని చెప్పుచు నిట్లు తేల్చెను: "వీరేశలింగముగారి హాస్యము చిక్కనిది. లక్ష్మీనరసింహముగారి హాస్యము పలుచనిది. లక్ష్మీనరసింహముగారి హాస్యము గిలిగింతలు పెట్టి నవ్వించును. వీరేశలింగముగారి హాస్యము గిల్లి బాధించును" అని. రచయితకు ప్రజాప్రబోధదృష్టి నిండుగా నుండునపుడు, వాని రచనలు వాచ్యార్థమువైపునకు ములునూపుట తప్పదు. వీరేశలింగము పంతులు సాంఘికముగా సంస్కారపు మెఱుగులు సరితీర్పవలసిన సుప్రచారకుడు 'చిలకమర్తికవి' కూర్పుతీరులు కోరినంతగా, వీరేశలింగముపంతులువలె ప్రబోధదృష్టి పరిపుష్టముగా గలిగి యున్నవాడు కాడేమో? అందుకే, ఆ యుభయుల హాస్యరచనలకు నిట్టియంతర మేర్పడినది.

ఇపుడు మన కామేశ్వరరావుగారు కూడ ప్రబోధదృష్టిని మించిన కళాదృష్టి కలవారని నేను నిశ్చయించుకొన్నాను. వీరు అనువదించిన 'మోలియర్‌' ప్రదర్శనములు, స్వతంత్రించి వ్రాసిన ప్రదర్శనములు, మొత్తముమీద సొంతరచనల వలెనే యుండుట మెచ్చదగిన విషయము అనుసరణమును గూడ స్వతంత్రముగానే తీర్చగల చాతుర్య మాయన కలములో నున్నది. 'బాగుబాగు' కామేశ్వరరావుగారు తొట్టతొలుతగా వ్రాసిన 'ఆట' దానిరచనాకాలము 1923 సం. అదికళాశాలవిద్యార్థుల కోరికపై వ్రాయబడ్డది. ఈ 'ఆట' నాటికి, నేటికి సుప్రచారప్రశస్తుల నందుచునేయున్నది. మొదటిరచన కీరితి ప్రసిద్ధివచ్చుట యెక్కడనో కాని యుండదు. కామేశ్వరరావుగారి "ఆట" లన్నియు బ్రదర్శితములగుట శ్లాఘనీయము.

ఉత్తమ హాస్యరచయిత తత్త్వావధారణమునకు మార్గదర్శి యనుకొంటిమి. ఇట్టి దర్శకత్వము 'భమిడిపాటి' వారిలో నున్నది. ఉదాహరణమునకు 'అద్దెకొంపలు' రచన యొక్కటి చూతుము.

ఇంచుమించుగా నిరువది పుటలు అద్దెకొంపలనుగూర్చి సామాన్యధోరణిలో వ్రాసి వ్రాసి చిట్టచివర ఈ దిగువ పంక్తులు సంధానించిరి:

"...అద్దెలధోరణిబట్టిచూస్తే బౌతికలోకంయొక్క అస్థిరత్వం స్ఫురణకొస్తుంది. కొంపలేకాదు ఊళ్లూ, జిల్లాలు, ఈఇండియా, ఈప్రపంచము ఇవన్నీకూడా అద్దెవ్యాపారాలే కదా అనిపిస్తుంది! రోగంవల్లో, బెడదచేతో, అవాంతరం మూలాన్నో, కూనీ ద్వారానో, ఆత్మహత్య రూపంగానో, దారిద్ర్యం ధర్మమా అనో ఏదో తరవాత తరవాత మాత్రమే మానవులకి గోచరించే కారణాన్ని పురస్కరించుకుని జీవుడు శరీరం ఖాళీచేసి పోతూండడం ఆరగారగా చూడగా ఎవడిమట్టుకువాడికే తెలిసేదాన్నిబట్టి-జీవుడికి శరీరాలు అద్దెకొంపలు."

పయినున్న యావద్రచనకును, దిగువనున్న యీపదిపంక్తులు జీవము పోసినవి. ప్రాణమువంటి యీ 'పేరా' లేనిచో 'అద్దెకొంపలు' వ్యాసము సర్వము శరీరముగదా! నిస్సారమైన యీ వస్తువును హాస్యరసస్ఫూర్తితో జిత్రించుటలో గల విశేషముకంటె, దానిని తత్త్వసరణిని సమన్వయపఱచుటలో జూపిన విశేషము ప్రశంసాభాజనమని నేను భావించెదను. ఇది యొకటి కాదు, కామేశ్వరరావుగారి రచనలలో బెక్కింట నిట్టి మెఱపులు తట్టుచుండును. ఇట్టి తత్త్వదష్టిలేని హాస్యరచయిత హాస్యాస్పదుడు కావలసినదే.

శ్రీ కామేశ్వరరావుగారి ప్రదర్శనములు, తదితర రచనలు నిటులుండగా, "త్యాగరాజు ఆత్మవిచారం" వారి కూర్పులలో గొప్పతావు నాక్రమించుకొనిన గ్రంథము. ఆరువందల సంఖ్యకు బైబడియున్న త్యాగరాజు కీర్తనములను తొమ్మిదిభాగములుగా విభజించి, కీర్తనార్థములు చక్కని వచనములో సంతరించినారు. పాఠవైవిధ్యమువలన దుర్గమార్థములైయున్న కీర్తనల సరసార్థములు తేర్చి సహజమధురమైన భాషలో నీగ్రంథము రచితమైనది. ఈకృతిలో శ్రీ కామేశ్వరరావుగారి విమర్శన పాటవము, సంగీతములో వారికిగల యభిమానము రూపము కట్టియున్నది. ఆయన యశస్సున కీగ్రంథము వైజయింతి. పద్యమునకు రాగమక్కఱలేదను వీరి సిద్ధాంతము జగమెఱిగినది.

వీరు ఆంగ్లమున బట్టభద్రులగుటయేకాక, సంస్కృతమున జక్కని సాహిత్యము కలవారును. 1920, 21 సంవత్సరములలో మదరాసు "ఎక్కౌంటెంటు జనరల్ ఆఫీసు" లో నుద్యోగించిరి. వాజ్మయారాధన దృష్టి ప్రబలముగా గలవారగుటచే, అది విరమించి రాజమహేంద్రవరము వచ్చి వీరేశలింగోన్నత పాఠశాలలోనుండి యిందాక అధ్యాపక పదవి నిర్వహించుచున్నారు.

                        ____________________