ఆంధ్ర రచయితలు/వావిలికొలను సుబ్బారాయకవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వావిలికొలను సుబ్బారాయకవి

1863 - 1939

భారద్వాజగోత్రజులు. ఆపస్తంబసూత్రులు. గోల్కొండవేపారి. తల్లి: కనకాంబ. తండ్రి: రామచంద్రుడు. అభిజనము: కడప మోచము పేట. జననము: 1863. నిర్యాణము: 1939. విరచితకృతులు: శకుంతల చరిత్ర, సులభ వ్యాకరణము, సతీహితచర్య, ఆర్యకథానిధి (ఆరు భాగములు), నలచరిత్ర, గర్భిణి, హరిశ్చంద్రచరిత్ర, ఆంధ్ర వాల్మీకి రామాయణము, కుమారహితచర్య, కుమారాభ్యుదయము, కృష్ణ లీలామృతము, కౌసల్యాపరిణయము, ఏకశిలానగరద్వయవివాద సంగ్రహము, హనుమంతచరిత్రము, భవతారకలీల, బాలకహితచర్య, భగవద్గీత, కృష్ణావతారతత్త్వము - మున్నగునవి.

శ్రీ సుబ్బారావుగారు పండితకవులుగా బేరుసంపాదించిరి. భక్తాగ్రేసరులుగా గీర్తిగాంచిరి. లోకమున గొందఱకు బాండిత్యకవిత్వములు పురాకృత విశేషమువలన గలిగి యుండవచ్చును. అట్టివా రాపాండిత్య కవిత్వ ప్రకర్షమును దేశమున వెల్లడించుటకు రామాయణము రచింపవచ్చును. భాగవతము వ్రాయవచ్చును. అంతమాత్రమున నట్టికవులకు దైవభక్తి దైవ విశ్వాసము సంపూర్ణముగ నుండు ననుట పొసగదు.


అట్లుగాక, మన సుబ్బారావుగారి దైవభక్తి యవ్యాజసిద్ధమైనది. దైవభక్తియే వీరికి గవిత్వలక్షణము చెప్పినది. దైవభక్తియే యీయనకు బాండిత్యవంతు నొనరించినది. భాగవతరచయిత పోతనామాత్యుడే యిందులకు బ్రథమోదాహరణము. వీరిని మొదట భాగవతులని, ఎదన బండితులని, చివర గవులని చెప్పుట క్రమానుగుణము. సుబ్బారావుగారికి బోతన్నపై బెద్దయభిమాన మున్నది. నరకృతుల నీయక పోవుటలోను భగవద్భక్తి పారవశ్యములోను వీరిర్వురు సహపాఠులు. కవితారచనయందు మాత్రము వీరికి పెద్దయంతర మున్నది. భాస్కర రామాయణమునకు వెనుకను ముందును గూడ దెలుగులో నెన్నో రామాయణములు వెలువడినవి. కాని తెలుగుభాగవత మొక్క పోతనామాత్య రచనమే. ద్విపదభాగవత మొం డున్నదనినను నది ప్రచారములో లేదు. ఆధునికులలో నిదారుగురు యథావాల్మీకి రామాయణములు రచించినవారును, రచించుచున్నవారును, రచింప దలంపు గలవారును గలరు. భాగవతము దరి కెవ్వరును బోజూచుటలేదు. ఇది పోతనమహాకవిలోని విశేష మేమో ? ఆ కవివరునిపై మన సుబ్బారావుగారెట్టి యభిప్రాయము ప్రకటించిరో చూడుడు !


తుచ్ఛులు సరిగా దనినను
స్వఛ్ఛపు బోతన కవిత్వసంపద చెడునే
నేచ్ఛ జరచి దూషించిన
నచ్ఛపతివ్రతను బావ మంటుట యున్నే ?
                   ( శ్రీరామాయణ పీఠిక.)


వా. సు. దాసుగారి చేతిలో జాలమంది విషయరక్తులు పరమ భక్తులైరి. వీరు ' భక్తసంజీవని ' యను మాసపత్త్రిక కొన్ని వత్సరములు వెలువరించిరి. దైవ, భాషాసేవ లొకదాని నొకటి మించునట్లు గావించి ధన్యులైన సుబ్బారాయకవిగారు వాల్మీకి రామాయణము యథా మాతృకముగా నాంధ్రీకరించిరి. కళాప్రపూర్ణ జనమంచి శేషాద్రిశర్మగా రొక రిట్లేవ్రాసిరి. వా. సు. దాసుగారి రామాయణకవితలో బ్రౌఢతకు లోపములేదు. వీరు రామాయణము నిర్విఘ్నముగా రచించి తరించిరి.


సీ. కనులకు గలకయు గరళంబు మదికినై
          తపియింప జేయు విత్తమ్ములేదు
కాళ్ల బందా లురిత్రాళ్లు కుత్తుకకునౌ
          బిడ్డల జంజాట మడ్డు లేదు
మంచిసెబ్బెర లెద స్మరియింపనీయని
          యంతటి భోగంబు లమరలేదు

ఈపూట హరిహరీ! యేపాట గడచునన్

దారిద్ర్యభీతి యింతయును లేదు

రాము దలపజేయు నామయం బుండగ

సౌఖ్య మరయుపొంటె జాయ యుండ

నింతవలను గలుగ నిప్పుడ శ్రీరాము

దలపకున్న నెపుడు దలచువాడ

(శ్రీరామాయణ పీఠిక)


రామాయణ రచనమున వీరి యుద్దేశమిది. వీరు యావజ్జీవమును గోదండరామస్వామికే ధారవోసిన భక్తులు. ఆ యాలయము పునరుద్ధరించుటకు వీరుతెనుగు నాడు పర్యటించి పెక్కువేల ధనము సంపాదించి భగవదర్పితము గావించిరి.

పాపము! సుబ్బారావుగారికి జిన్ననాటనే పితృవియోగము సంభవించినది. పినతండ్రి లక్ష్మణరావుగారి పెంపకమున విద్యాబుద్ధుల గఱచి పెద్ద చదువు చదివిరి. పదునొకండు సంవత్సరములు కడపమండలమున రెవెన్యూ ఇనస్పెక్టరుగా బనిచేసి, చెన్నపురి సర్వకళాశాలలో బ్రధానాంధ్రపండిత పదవి నలంకరించిరి. పుష్కలముగా ధన మార్జించిరి. చేతులార వర్థులకిచ్చుకొనిరి. ఒక ఆంధ్రవాల్మీకి రామాయణమేగాక వీరివి పేరు తెచ్చుకొన్న కబ్బములు కుమారాభ్యుదయము, కౌసల్యా పరిణయము, సుబద్రావిజయము మున్నగునవి కొన్ని యున్నవి. వీరి సులభవ్యాకరణము వజ్జల చినసీతారామశాస్త్రి ప్రభృతులు మెచ్చుకొనిరి. ఈయన వచనకృతు లెన్నో పాఠ్యములుగా నున్నవి.


కడపకును నందలూరునకును పడమనున్న పల్లెటూరు ఒంటిమెట్ట. కోదండరామస్వామి యాలయ మిచటనే యున్నది. ఈరామస్వామికే--------------------. ఈరామస్వామికే వా.సు దాసు-----------------------------------------

(ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు) ______________