ఆంధ్ర రచయితలు/వడ్డాది సుబ్బారాయకవి

వికీసోర్స్ నుండి

వడ్డాది సుబ్బారాయకవి

1854-1938

నియోగి బ్రాహ్మణులు. హరితసగోత్రులు. తండ్రి: సురపరాజు. తల్లి: లచ్చాంబ. జన్మస్థానము: నగరము తాలూకాలోని పాసెర్లపూడి. నివాసము: రాజమహేంద్రవరము. జననము: 30-7-1854 సం- (ఆనంద నామ సం. శ్రావణ శుద్ధ పంచము ఆదివారము). నిధనము: 2-3-1938. కృతులు: ప్రబోధ చంద్రోదయము, ఆంధ్రవేణిసంహారము, అభిజ్ఞాన శాకుంతలము, మల్లికా మారుతము, విక్రమోర్వశీయము, చండకౌశిక నాతకము, నృసింహ విశ్వరూపము, గౌతమీ జల మహిమాను వర్ణనము, భక్త చింతామణి, ఆర్తరక్షామని, మేఘ సందేశము, నందనందన శతకము, సతీస్మృతి, సుతస్మృతి, వసురాయచాటూక్తిముక్తావళి, శ్రీసూక్తివసుప్రకాశిక, సుగుణ ప్రదర్శనము - ఇత్యాదులు.

ఉపాధ్యాయత్వమున గవిత్వమున సుబ్బారాయుడుగారు చాలసమర్థులు. రాజమహేంద్రవరమునందలి సర్వకళాశాల వీరి యధ్యాపకత్వమున కాశ్చర్యపోయెడిది. ఓ.జె.కూల్డ్రెదొరయంతవాడు వ.సు.రాయకవిగారి పాఠము వినుటకు జెవికోసికొని తలుపుచాటున నక్కువాడనిప్రతీతి. అందులో నాయన భారతపాఠము మఱియు నద్భుతము. వినితీరవలె నని నాటి విద్యార్థులిప్పటికి జెప్పుకొనుచుందురు.

మదరాసు గవర్నరైన సర్.కె.వి.రెడ్డినాయుడు వీరికి దెలుగున శిష్యుడు. విదేశీయుడు "హ్యామ్నెటు" దొర సుబ్బారాయుడు గారియొద్ద జాలకాల మాంధ్రభాష నభ్యసించెను. వీరికడ విద్యాభ్యాసము చేసి పైకివచ్చినవారు పెక్కండ్రు. ఎంతవారైన వీరియెడ నమ్రులై యుండవలసినదే. ఆయన యితరులకు లొంగలేదు. విధ్యార్థులకు లోకువకాలేదు. ఆత్మగౌరవము కాపాడుకొనుచు దా మేస్థానమున నుండవలయునో, యాస్థానమున నుండుట వారి సహజగుణము. మాట లలో బొందిక, నడతలో నార్జనము, జీవికలో నిరాడంబరము వ.సు.రాయకవికి బెద్దమనుష్యులలో బేరుదెచ్చినవి. నచ్చినవారి నదేపనిగా నుతించుట, నచ్చనివారిని బట్టి దూషించుట వారిచేతకాదు. విద్యకు దగినసుగుణసంపద యుండుటచే వసుకవి యనంతకీర్తి నందెను. సుబ్బారాయుడుగారు తమ జీవితసంగ్రహము తెలియుట కీసీసము వ్రాసికొనిరి.

పుట్టుక పొసెర్లపూడిలంకను, దండ్రి

బందుగులింట నానందయందు

మెత్తని పొత్తుల సత్తమిల్లుట, శైశ

వక్రీడ, పదుకొండువత్సరముల

ప్రాయంబుదనుక నొరంగ మౌకోరంగి

గన్నవారల వియోగంబు నటనె

అక్షయ మొదలు పరాన్న మేడేండ్లు దొ

డ్డమ్మపేట దివాణమందు, శ్రీము

ఖాబ్దమున సొంతకాపుర మక్కొటికనె

ప్రథమజాయానియోగహృద్వ్యధయు, భావ

రాణ్మహేంద్రంబునందు నాంధ్రంపుటొజ్జ

పదవి: ననురాయ చరితంబు ప్రథిత మవల.

సుబ్బారాయుడుగారు చిన్ననాట దొడ్డమపేట దివాణమువారి పోషణమున నుండి విధ్యాభ్యాసము చేసిరి. నాడు వీరిగురువులు వాసుదేవశాస్త్రులుగారు దొడ్డమపేటకు సమీపమున గల 'భీమక్రోశపాలెము' లో భాగవతుల హరిశాస్త్రిగారను సుప్రసిద్ధవై యాకరణు లుండెడివారు. వారియొద్ద జదువుకొను విద్యార్థి యొకడు "శ్రీదక్షపురీనివేశ! శ్రీ భీమేశా!" యను సమస్యను మనకవిగారి కీయగా వీరు దానిని పదిరకములుగా బూరించి చూపించిరట. అప్పుడు వీరి గురువులు సంతసించి ముందుముందు నీవు కవిశేఖరుడ వౌదు వని యాశీర్వచించిరట. అప్పటి కీయనవయస్సు పదుమూడేండ్లకు మించదు. ఈదిగువపద్యము ప్రస్తుతకవిగారి పుట్టుకను దెలుపుచు నెంతయందముగా నడచినదో పరిశీలింపుడు.

గౌతమి గట్టి కాలువలు 'కాటను' ద్రవ్వినకాలమందె సం

భూతుడ నైనవాడ బదుమూడగు నేడులయీడుతల్లికిన్:

మాతకు లేమి బా: లచట మంటిని మ్రోసెడియుప్పరమ్మలే

ప్రీతిని నన్ను జన్గుడిపి పెంచిర టేమి ఋణానుబంధమో?

వసుకవిగారికృతులలో 'భక్తచింతామణి' జీవము గలకృతి. దీనిలోని పద్యములు చాలమందికి గంఠస్థములు. భక్తచింతామణి సామాన్య శతకముకాదు. "భావగాంభీర్యమందును దత్త్వబోధనమందును భక్తచింతామణి పద్యములు కొన్ని ప్రపంచ సాహిత్యమందలి యేకవితకును దీసిపోవు" అని విమర్శకులు వ్రాసియున్నారు.

తలిదండ్రుల్ బలె దప్పులోగొనుచు వాత్సల్యంబునంబ్రోతు: నె

చ్చెలియుంబోలె సుధామయోక్తులను మానేమంబెఱింగింతు: కే

వలధర్మప్రభువట్లు నీప్రజలయిబ్బందుల్ తొలగింతు: ని

న్నెలమిం గొల్వమి మాయభాగ్యదశగాదే, భక్త చింతామణి!

సేవింతున్ భవదీయపాదజలరుట్చింతాను సానంబుతో

దేవా! మందు: ననామయత్వము ప్రసాదింపంగదే మేనికిన్

బ్రావృణ్మేఘవు బ్రావుగల్గినను, దానంబేర్చునే వృక్షమున్

నీవుండన్ హృదినాకు వ్యాధిభయమున్నే? భక్త చింతామణీ!

మున్నగు సనర్ఘమణులకు దావల మీశతకము. ఇది భక్తిప్రధానమైన దైనను ననేకవిషయము లిందు సంధానింపబడినవి. పద్యభావములన్నియు నుదారములు. భాషామృదుల గంభీరము. తెలుగున 'భక్తచింతామణి' వలె నధికముగ నమ్ముడుపడిన గ్రంథములు తక్కువ.

సుబ్బారాయకవిశేఖరులు సూక్తిమధానిధులు. ప్రౌడతకు, భావసంపదకు వీరికవిత నిదానము. భట్టనారాయణుని 'వేణిసంహారము' వీరాంధ్రీక రించిరి. ఆతనిశైలి ఈయనకు సరిపడినది. అభిజ్ఞానశాకుంతలము, మల్లికామారుతము, ప్రబోధచంద్రోదయము, విక్రమోర్వశీయము, కుందమాలమున్నగునాటకము లనువదించిరి. ఇవన్నియు దెలుగువారికి శిర:కంపన కారణములు, ఆంధ్రరంగస్థలములకు నలంకారములు, విశ్వవిద్యాలయములకు బాఠ్యములునై యశస్సు నార్జించుకొనినవి. అన్నినాటకములకంటెను వీరి 'వేణీసంహారము' వినుతి గనినది. సుబ్బారాయుడుగారు చిన్ననాట నాటకములలో నభినయించువారట. వేణీసంహారమున ధర్మరాజపాత్రమును దామే నటించినట్లు చెప్పుదురు. ఈకళాభిమానమే యిన్ని నాటకములు వ్రాయించినది. నాటకకర్త నటకుడైనగాని నాటకము రసవత్తరముగా సంఘటింపలేడు. భవభూతికూడ నటకుడైనట్లు చారిత్రకులు చెప్పుదురు. సుబ్బారాయుడుగారు పద్యములు చక్కగా జదువు నలవాటు కలవారు. చిలకమర్తి లక్ష్మినరసింహముగారు 'స్వీయచరిత్ర' లో నిట్లువ్రాయుచున్నారు: పద్యములు చదువుటలోను దండకములు చదువుటలోను మిక్కిలి నేర్పుగల సుబ్బారాయుడుగారి నోటనుండి వినినప్పుడు నాయొడలు పరవశమైనది.

రసానుగుణమైన శయ్యాసౌభాగ్యము వీరి కవితకు నిసర్గజమయిన సుగుణము. వేణీసంహారము లోని యీ భీమావాక్యము నరయునది.

తత ఘూర్ణద్ఘట వార్థి మధ్య విలుఠన్మందాచలధ్వాన ధీ

రత గోణాహతమై జగత్ప్రళయ గర్జన్మేఘ సంఘట్ట చం

డత దృష్ణోగ్రరుషాగ్ర దూత కురురాణ్ణాశంకరోత్పాత

నతి! మత్సింహరవానుకారి రణనిస్సాణం బిదే మ్రోగెడన్.

మరల, దుర్యోధనుడు తండ్రిని బాసిన యశ్వత్థామను బరామర్షించు నీవిలాపవాక్యమునుగూడ నరయునది.

దగ్గఱ రమ్ము; నాకతన దండ్రికి బాసినబిడ్డవై తె? నన్

బిగ్గ గవుంగిలింపు సఖ! నీ కడుమెత్తని మేను హత్తగా నగ్గురు బాహుబట్టి భవదాయత బాహులు మేను సోకినన్

గగ్గరుపాటు సంభవముగా దెటులారట మొందు చుండినన్

ఈ రెండు ఘట్టములలో గవి వెలువఱించిన కవితా శయ్యా భేదములు సహృదయాస్వాద్యములు.

రాజమహేంద్రవరమున నాధునికాంధ్రకవిత్రయ మని పేరొందినవారిలో వీరొకరు. ఆంగ్లభాషావిశారదులగు మిత్రులతో నిరంతరము సంభాషించుచుండుటవలన వీరికవిత్వమునకు బాశ్చాత్యకవిత్వమునందలి నవీన భావములు కొన్ని యబ్బినవి. వీరి కవిత్వరచన కేవలము ప్రాచీనఫక్కినే నడచిన దని చెప్ప వీలుకాదు. క్రొత్తభావము లెన్నో వీరిపద్యములలో బరికింప వచ్చును. ఆశుకవిత యనిన సుబ్బారాయుడుగా రసహ్యపడువారు. కబ్బం బల్లుదుగాని యాశుకవనోగ్రవ్యాఘ్రదంష్ట్రాళికే నబ్బబ్బా! గుఱిగాను.......అనివీరు బాధపడినారు. ఆశుకవిత నందముగా జెప్పసమర్థులే యైనను దానియందు వారి కప్రీతి. ఇది కొందఱకు వింతగానుండును. పద్యము చెప్పి నాలుగైదుమాఱులు వెనుకముందు లాలోచించి సానబట్టినగాని వారెన్నడు ప్రకటింపలేదట. వ.సు.కవి తనప్రతిభా ప్రభ నాంధ్రమున బ్రసంచించి సహస్రమాసములు జీవించి చనిన మహాకవి. 1933 లో రాజమహేంద్రవరమున జరిగిన ఆంధ్ర సాహిత్య పరిషన్మహాసభ కధ్యక్షతవహించి 38లో జీవయాత్ర చాలించిరి. వ.సు.చరిత్రము మధురగంభీరమైనది. వ.సు.కవి సంకల్పసిద్ధుడు.వార్థకమున నతడీ క్రిందివిధముగా దైవప్రార్థనము చేయువాడు.

కడచిననాళ్ళ బైబడిన కష్టములం దలపోయ నిప్డు నా

యొడలు గగుర్వడంకు జెమ రుప్పతిలున్ బెడగొండలట్టినా

యిడుమల నెట్టు నన్మనిచి యీస్థితి నిల్పితొ యంచు నబ్బురం

పడుదు, శుభాంతముంజలువుమా వనునాటకమున్ జగత్కనీ!

                     _________________