ఆంధ్ర రచయితలు/కోలాచలము శ్రీనివాసరావు

వికీసోర్స్ నుండి

కోలాచలము శ్రీనివాసరావు

1854-1919

జన్మస్థానము: హంపీ విరూపాక్ష క్షేత్ర సమీపమున నున్న కమలాపురము. జననము: 13-3-1854 సం. నిర్యాణము: 20-6-1919 సం. గ్రంథములు: సునందినీ పరిణయము, మదాలసా పరినయము, శ్రీరామ జననము, పాదుకా పట్టాభిషేకము, లంకా దహనము, ద్రౌపదీ వస్త్రాపహరణము, కీచకవధ, బభ్రువాహన నాటకము, హరిశ్చంద్ర, రుక్మాంగద, చంద్రహాస, శిలాదిత్య, ప్రతాపాగ్బరీయము, కాళిదాదు, ప్రహ్లాద, రామరాజుచరిత్ర, మైసూరు రాజ్యము, చాందుబీబీ, కుశలవ (నాటకములు) హాస్యమంజూష, అగస్త్యబాలభారత శతకము, ఆంధ్రీకృతాగస్త్య భారతము - మొదలగునవి.

పేరుమోసిన నాటకరచయిత లిరువురు "బళ్ళారి" ని పావనము చేసిరి. అందు మొదటివారు ధర్మవరమువారు. రెండవవారు శ్రీనివాసరావుగారు. వీరిరువురును న్యాయవాదులు. ఇరువురును నటకులు, ధనికులును. కృష్ణమాచార్యులవారి చిత్రనళీయ మెంతపేరు సంపాదించినదో, శ్రీనివాసరావుగారి రామరాజుచరిత్ర మంత ప్రతిష్ఠ నార్జించినది. "రామరాజుచరిత్రము" చారిత్రకము. తల్లికోట యుద్ధమున గీర్తిశేషుడైన యళియ రామరాజుకథ యిం దభివర్ణితము. వీరి మైసూరు రాజ్యము, ప్రతాపాక్బరీయము చారిత్రకములు.

వీరు గ్రామ్యభాష నొప్పుకొనరు. కళాశాలలలో గ్రామ్యము నుపయోగింపవచ్చు నన్నప్పుడు మదరాసు విశ్వవిద్యాలయము వారేర్పాటు చేసిన సంఘమునకు శ్రీనివాసరావుగారు సభాపతులై వ్యావహారికమును నిరసించివైచిరి. సంఘసంస్కారమును గూడ వీరు కోరినటులు లేదు. నాటకములు విషాదాంతములు చేయుట వీరి కనిష్టము. ప్రాకృతాది భాషలకు బదులు వ్యావహారిక ముపయోగించ వచ్చునన్న వేదమువారి మతము సైతము వీరికి సమ్మతము కాదు. చారిత్రకములు, సంఘసాంబంధికములు నగు నాటకములే యీనాట వెలయవలెనని వీరు చెప్పినారు. తెలుగునకు శ్రీనివాసరావుగా రిచ్చిన సందేశమునకు సంగ్రహ మిది : "భాషను జెఱుచుట తప్పు. అశ్లీలము లుంట తప్పు. దుర్నీతికరములుగ నుంట తప్పు. బండుబూతుమాటల నీతిజెప్పుట తప్పు. పేరుపెట్టి దూషించి యెత్తివేయుట తప్పు. గ్రంథమునం దిత్యాదులు తప్పు లగునుగాని మిగతవి తప్పులు గావు. విషయవైశద్యము కొంతవరకు నుండిన జాలు. లోహములన్నియును స్వర్ణమయములు కాకపోయినను బనికిమాలినవి యెవ్వియును గావు. పూర్వకాలమునుండియు బుద్ధికుశలులని పెరందిన పండితుల గ్రంథములు చదివి తమ బుద్ధి బలిమిని వానికి జేర్చి యిప్పటివారు వ్రాయు గ్రంథములు చెడెనని చెప్పుట యసమంసంబు."

శ్రీనివాసరావుగారు మల్లినాధసూరి వంశీయులు. వీరి పూర్వజు లందరును విజయనగర సంస్థాన పండితులు. వీరు నాటకాంత సాహిత్యము నెఱిగి స్వాధ్యాయపాఠము చేసిరి. జ్యోతిషము తెలిసికొనిరి. 1876 లో ఎఫ్.ఏ. పరీక్షలో నెగ్గిరి. రెవెన్యూ డిపార్టుమెంటులో బనిచేసి 1881 లో అనంతపుర మండలము "డిప్యూటి కలక్టరు" కడ దివానుగా నుద్యోగించిరి. 1888 లో రెండవతరగతి ప్లీడరు పరీక్షలో దేలి బళ్ళారిని న్యాయవాదులైరి. అంతటినుండి వీరి సారస్వతసేవ యభ్యుదయ మార్గమున బడినది. 1917 లో కడపయందు జరిగిన ఆంధ్ర సాహిత్య పరిషత్సభ శ్రీనివాసరావు గారి నధ్యక్షులుగా నాదరించినది. మండపాట పార్వతీశ్వర శాస్త్రి ప్రభృతులు వీరి కవిత్వమును గొండాడిరి.

శ్రీనివాసరావుగా రుదారభావులు. పండితులను సత్కరించిరి. కవులను సన్మానించిరి. పేదలను బోషించిరి. తెలుగునాట నాటక శబ్ద మున్నంతదాక శ్రీనివాసరావుగారి పేరు నిలబడుననుట నిశ్చయము. "ప్రతాపాక్బరీయము" లోని యొక పద్యము మచ్చు.

మూరెడు మీసలన్బెనిచి ముప్పిరిగాబలుమారుదువ్వుచున్
నేరువుమీఱ దుస్తులను నీటుగ గట్టుచు వాలుబట్టుచున్
ధీరులమంచు నోటికసిదీఱగ బ్రల్లదమాడునట్టి యీ
భీరుల బోల కీవు రణభీకరవైతివి తక్కె గీర్తియున్.