Jump to content

ఆంధ్ర రచయితలు/పారనంది రామశాస్త్రి

వికీసోర్స్ నుండి

పారనంది రామశాస్త్రి

1853-1930

కాసలనాటి వైదిక బ్రాహ్మణులు. ఆశ్వలాయన సూత్రులు. కాశ్యపస గోత్రులు. తల్లి: రామలక్ష్మమ్మ. తండ్రి: ముఖలింగేశ్వరుడు. జన్మస్థానము: పిండివాడ (పర్లాకిమిడి సంస్థానమునకు జెందినది). జననము: 1853 సం. (పరీధావి శ్రావణ శుక్ల నవము) నిర్యాణము: 6-12-1930 సం. గ్రంథములు: 1. ఆంధ్రశబ్దచింతామణి (ఉద్ద్యోలినీ వ్యాఖ్య) 2. ఆంధ్రమహాభారత విమర్శనము 3. కురుక్షేత్రయుద్ధ కాలనిర్ణయము 4. ముధుకేశ్వరీయము (నాటకము ఆముద్రితము).

శ్రీ రామశాస్త్రిగారు పెద్దయాస్తి కలవారు కాకపోయినను గొప్ప యాస్తికులు. పేరు మోసిన పండితులు. క్రొత్తతీరు లెరిగిన విమర్శకులు. సంస్కృతాంధ్రములలో సరితూకముగల పరిశ్రమ పాటవము గలవారు. తొలుత గావ్యపాఠము గావించి శాస్త్రపఠనముపై మనసు గూరి బొబ్బిలి చేరి శ్రీ సుసర్ల సీతారామశాస్త్రిగారితో దర్కా లంకార వేదాంతము లధ్యయనించిరి. సంస్కృతములో లోతులు తడవిన పాండితి సంపాదించి, పదపడి తెలుగుబాస పొలుపులు గుర్తించినారు.

పర్లాకిమిడి రాజు రామశాస్త్రిగారి సామర్ధ్యము నెరిగి సంస్థానోన్నత విద్యాలయమున నుపాధ్యాయ పదవి యిడి గౌరవించిరి. ఆయుద్యోగము 1853 మొదలు 1911 వరకు చిచ్చిత్తి లెకుండ గొనసాగినది. శ్రీ శాస్త్రిగారు తాత్వికదృష్టిగల కర్మిష్ఠియగుటచే, తన కుమారుడు పట్టభద్రుడై, యుద్యోగియై, పదిరాళ్లు సంపాదించుకొను ప్రయోజకుడై యుండుట జూచి తనపని చాలించుకొనెను.

దేవీ భాగవతమును దెలిగించిన త్రిపురాన తమ్మయదొర వీరిని గౌరవించి ధన్యుడయ్యెను. ఉర్లాము మున్నగు నాస్థానులలో వీరు ధర్మాది శాస్త్రముల పరీక్షల నెగ్గి యుగ్గడింపబడిరి. పండితులతో శాస్త్రార్థ ములు "నీవా నేనా" యని చేయగల శ్రీ రామశాస్త్రిగారు చాలకాలము దాక తెలుగు నెరుగరుట యొక రహస్యము. గిడుగువారి వాద శంఖనాదములు చెవులబడి ఆంధ్రభారతము తీరెట్లుండునో యని చదువ నారంభించిరి. అదియాది, యాగస్తివలె యావదాంధ్ర వాజ్మయ మహోదధిని రామశాస్త్రిగా రాపొశనించిరి. దాని ఫలమే "ఆంధ్ర మహాభారత విమర్శనము". ఇది 500 పుటలు పైబడిన కూర్పు. ఉద్యోగ పర్వ విమర్శనము మాత్రమే యచ్చువెలుగు చూచినది.

ఆంధ్రశబ్దచింతామణిపై "ఉద్ద్యోతిని" అను గొప్ప వ్యాఖ్యా గ్రంథము వీరు చరించిరి. శ్రీ వీరేశలింగము పంతులుగారు చింతామణి నన్నయ కృతము కాదనగా, ఆ వాదము సరిగాదని రామశాస్త్రిగారు సోదాహరనముగా నన్నయకృతమే యని నిరూపించిరి. ఇది తెలుగులో వీరి తొలిరచన. జంకులేని విద్వాంసులగుటచే, వీరేమి వ్రాసినను స్వాతంత్ర్య రేఖలు స్పష్టముగ గోచరించును. "జ్ఞ" యను వర్ణము కంఠ్యమా, తాలవ్యమా యని విషయమును జర్చించుచు గొప్ప విమర్శనము వెలువరించిరి. వీరి విమర్శన రచన లెన్నియో "భారతి" ప్రభృతి పత్రికలలో బ్రచురితములు. వీరి సంస్కృతరూపక రచనకు దోహదము చేసిన మహనీయులు పర్లాకిమిడి ప్రభువుల పిన్నతండ్రియగు నొక రాజుగారు. ఆయన గీర్వాణ వాజ్మయాభిరుచి పెద్దగా గలవాడని ప్రసిద్ధి.

ధర్మశాస్త్రముపై రామశాస్త్రిగారికి మంచి యభినివేశము. నిరంతరము ధర్మగ్రంథావలొకనముతో గాలక్షేపము చేసి, మహావ్యాఖ్యాతగా, విమర్శకుడుగా బేరందిన పారనంది పండితుడు తెలుగుభూమిలో దాగిన చిరత్న రత్నము.