ఆంధ్ర రచయితలు/పురాణపండ మల్లయ్యశాస్త్రి
పురాణపండ మల్లయ్యశాస్త్రి
1853-1925
ఆరామద్రావిడశాఖీయ బ్రాహ్మణుడు. తండ్రి: భద్రయ్యశాస్త్రి. తల్లి: రామమ్మ. జన్మస్థానము: పెదతాడేపల్లి. నివాసము: ఖండావల్లి, పిఠాపురము, రాజమహేంద్రవరము. జననము: 1853 సం. అస్తమయము: 1925 సం. గ్రంథములు: ఆంధ్రీకృతబ్రహ్మసూత్ర భాష్యము (4 సంపుటములు) ఉపనిషత్కథలు, శుక్రనీతిసారము, ప్రభావతీ ప్రద్యుమ్న, భద్రా పరిణయములకు వ్యాఖ్యలు - ఇత్యాదులు.
మల్లయ్యశాస్త్రిగారు సంస్కృతాంధ్రములలో మహాపండితులు. వీరు ప్రఖ్యాతప్రాజ్ఞఉలైన వెంపరాల దక్షిణామూర్తి శాస్త్రిగారి సన్నిధిని సూత్రభాష్యము నియమపూర్వకముగ నధ్యయనించిరి. తర్క వ్యాకరణములు పఠించిరి. ప్రస్థానత్రయతత్త్వ మెరింగిరి. ఇట్టి విద్యాధికార సంపత్తి కలిగిన మీదట మల్లయ్యశాస్త్రిగారు పీఠికాపురాధిపతుల యాజ్ఞచే శాంకరసూత్ర భాష్యమును దేటతెల్లముగ దెలుగున వ్రాసిరి. సూత్ర భాష్యమునకు మరికొందరుకూడ తెలుగు వ్రాసిరి. ఆ యనువాదములలో నీయదియే మేలైనది. బ్రహ్మసూత్ర భాష్యము ననువదించుటకు సామాన్య పరిజ్ఞానము చాలదు. సర్వశాస్త్ర ప్రవేశము, సర్వదర్శన పరిచయము నుండవలయును. అధీతిబోధాచరణ ప్రచారణము లున్నవారికిగాని యిట్టి యుద్గ్రంథముల తత్త్వము తెలియదు. సర్వధా సామర్ధ్యము కలిగి యాంధ్రవచనరచనలో గూడ నారితేరినవారగుటచే మల్లయ్యశాస్త్రిగారు ' ఆంధ్రసూత్రభాష్య ' మందు పాటులోనున్న శైలిలో రచింపగలిగిరి. విషయ గౌరవ ప్రాశస్త్యాదులం బట్టియు నాంధ్రభాషకు బుష్టికరమగుత బట్టియు నీగ్రంథము శాశ్వతముగ నాంధ్రమున నుండగలదు. రచనావిశేషమున కీపంక్తులు పరికింపుడు.
" శాస్త్రయోనిత్వాత్ " - ఋగ్వేదాది శాస్త్రమునకుం గర్త యగుటవలన (బ్రహ్మము సర్వజ్ఞము) బ్రహ్మస్వరూప జ్ఞానమునందు ఋగ్వేదాదిశాస్త్రమే ప్రమాణమగుట వలన దానిచేతనే జగజ్జన్మాది కారణమగు బ్రహ్మము తెలియంబడునేని అని యర్ధము. " భా. గొప్పది యును పురాణన్యాయ మీమాంసాదులగు పెక్కు విద్యాస్థానములచే నుపకరింపబడినదియు దీపమువోలె సర్వార్థములం బ్రకాశింప జేయునదియు సర్వజ్ఞకల్పము నగు ఋగ్వేదాదిశాస్త్రమునకు బ్రహ్మము యోని = కారణము. సర్వజ్ఞఉనిగుణమగు సర్వార్థములం బ్రకాశింపజేయు శక్తితోగూడిన ఋగ్వేదాది శాస్త్రమునకు సర్వజ్ఞఉనికంటె వేరొక దానినుండి యుత్పత్తి సంభవింపదు. పాణిని మొదలగు వారవలన దెలియందగినవానిలో నొకభాగమగు వ్యాకరణాదికమువలెనే యేయేవి ... రాథమగుశాస్త్ర మేయే పురుషుని వలన బుట్టుచునందో యాతడా శాస్త్రము కంటె నధికతర విజ్ఞానము కలవాడని లోకము నం బ్రసిద్ధము..."
శాస్త్రిగా రీరీతిగ బూసగ్రుచ్చినట్లు సూత్రభాష్యభావము కొరవడ కుండ దెనిగించి యాంధ్రభాషకు మహోపకృతి గావించిన మహాశయులు. మల్లయ్యశాస్త్రిగారు "ఉపనిషత్కథలు" వ్యాసిరి. "శుక్రనీతి సారము" వచనమున రచించిరి. పింగళి సూరనార్యుని ప్రభావతీ ప్రద్యుమ్నమునకు వ్యాఖ్య వ్రాసిరి. వీరి గ్రంథములన్నియు పీఠికాపుర ప్రభువులే ప్రకటించిరి. అల్లమరాజు సుబ్రహ్మణ్య కవిగారి భద్రాపరిణయమునకు వ్యాఖ్యా విపులపీఠికలు రచించిరి. అనేక పాఠాంతరములతో ననుగుణమగు వ్యాఖ్యతో నాంధ్రభారతములోని కొన్ని పద్యములు వీరు పరిష్కరించిరి. ఈ పీఠిఅవల్ల వీరి యాంధ్రకవిత్వ పరిశ్రమ తెల్లమగును. మల్లయ్య శాస్త్రిగారు పద్యకవిత్వమున గృషిచేసిన కవులు కారు. అయినను నడుమనడుమ బద్యము లల్లునలవా టున్నది. అల్లినపద్య మందముగనే యుండును.
శ్రీరఘువంశ వారినిధిశీతమయూఖుడు జానకీమన
స్సారనచంచరీకము నిశాచరమత్తకరీంద్ర సింహమున్
ధీరజనాగ్రగణ్యుడు సుధీజనసన్నుతకీర్తిశాలియౌ
నారఘురామమూర్తి మదినాదర మొప్పగ గాచులోకముల్.
' ఆంధ్రసూత్రభాష్యారంభము '
చిలకమర్తి లక్ష్మీనరసింహకవి మల్లయ్యశాస్త్రిగారి మేనల్లుడు. అచ్చముగా, ఆయన మాటచాలిక మేనమామ పోలికయే. ప్రసన్న యాదవ నాటకములో చిలకమర్తికవి యిటులు ప్రస్తావించెను.
గీ. శ్రీపురాణపండ కులాబ్ధి శీతికరుడు
నరసు డాంధ్రగీర్వాణ భాషావిదుండు
మల్లయార్యుండు నామేనమామ యగుట
గవిత యెటులున్న కీకృతి గణుతిగాంచు.
పురాణపండ పండితుడు ఆంధ్రసూత్రభాష్యము వలన నవినాశమగు యశము సంపాదించుకొనిన రచయిత.