Jump to content

ఆంధ్ర రచయితలు/దేవులపల్లి సోదరకవులు

వికీసోర్స్ నుండి

దేవులపల్లి సోదరకవులు

1853-1909, 1856-1912

అగ్రజులు: దేవులపల్లి సుబ్బారాయ శాస్త్రులవారు. తమ్ములు: తమ్మన శాస్త్రియను నామాంతరముగల వేంకటకృష్ణశాస్త్రిగారు. మొదటి వారి జననము: 1853 సం. నిధనము: 1909 సం. రెండవవారి పుట్టుక: 1856 సం. నిర్యాణము: 1912 సం. కూచిమంచి తిమ్మకవి కడకాలమున నివసించిన చంద్రమపాలెమున (గోదావరి మండలము) వీరి మనుగడ- తెలగాణ్య వైదిక శాఖీయులు. కౌండిన్యసగోత్రులు. తండ్రి: వేంకటకృష్ణ శాస్త్రి. మహేంద్రవిజయము (ఆంధ్ర ప్రబంధము) రావువంశ ముక్తావలి (సంస్కృతము-అచ్చుకాలేదు) మల్హణస్తవము (తెలుగుసేత) రామరాయ విలాసము, రామపంచాశత్తు (సంస్కృతము) ఇవి సుబ్బారాయశాస్త్రి విరచితములు - నయనొల్లాసము, యతిరాజ విజయము, రావువంశ ముక్తావళి (తెలుగు కావ్యము, ఆముద్రితము) సకలేశ్వర శతాము, ఇవి తమ్మనశాస్త్రి రచితములు.

వేలుపు రాఘవుండు; పదివేలపురాణము లన్యు నెన్న నీ
యేలిక లెన్న రావుకులు లెప్పటివారల కప్పు డొప్పు భూ
పాళి నిజంబుగా దనకటంచును దేవులపల్లివంశ భూ
పాళి దలంచుచుండు దనపాలిటి కీయభయంబె ప్రాపుగన్.

చూచితిరా సుబ్బరాయశాస్త్రివరుల రామభక్తివిశేషము? రామ భక్తిని మించినది రాజభక్తి. ఈ రెండింటి ప్రాపుచేతను, మహేంద్రవిజయాది మహోత్తమకృతులు రచించి, యాంధ్రదేశమున నక్షయకీర్తి నార్జించి మించిన మహాశయు డీయన. గంగాధర రామరాయేంద్రుడు తనసింహపీఠిపై గూరుచుండబెట్టి "ప్రాజ్యతరంబగురాజ్య మెల్ల నీ, దేగదా సుబ్బరాయసుకవి! యని యఖండసత్కార మొనరించినను అవలిప్తుడు కాని యభిజ్ఞశేఖరు డీయన. సుబ్బరాయశాస్త్రిగా రాంధ్రభోజాభిఖ్యతో వెలయుచున్న నేటి సూర్యరాయమహారాజ వరునకు సంస్కృతభాషాదేశికుడై యలరారిన యదృష్టవంతుడు. రామనామసంస్మరణము, రామరాయసందర్శనము నను దినకృత్యములుగా నెంచి పవిత్రజీవయాత్ర నెఱపినపండితుడు.

దేవులపల్లి వంశీయు లెల్లరు విద్వత్కవులు. పీఠికాపుర రాజ్యస్థాపకులు శ్రీ రావు తెనుంగురాయణింగారి యాదరణముచే వీరివంశస్థులు పిఠాపురమున బ్రవేశించిరి. సుబ్బరాయశాస్త్రిగారి తండ్రి గొప్పపండితుడు. శాస్త్రులుగారు పితురం తేవాసులు. వారికడ గావ్యనాటకాలంకారాదులు, జ్యోతిర్విద్య నధికరించిరి. కవిత్వాభిరుచి యుగ్గుబాలతో బెట్టినది. ఇక విశేషమేమన, అశువులో బ్రబంధశైలి శాస్త్రిగారి కలవడినది.

1879 లో శ్రీ మాన్ మాడభూషి వేంకటాచార్యులవారు పిఠాపురాస్థానమున నవధానము గావించిరి. అప్పుడు గంగాధర రామరాయేంద్రులు "మనయాస్థానమున నిట్టియవధానముచేయు ప్రతిభావంతు లుండి రే" యనిప్రశ్నించిరట. మరునాడు దేవులపల్లి సోదరుల శతావధానము ప్రారంభమైనది. అనన్యసామాన్యమగు కవితాధారతో నాయవధానము జయప్రదముగా నెఱవేరినది. వేంకటాచార్యులవారు సోదరకవుల ప్రతిభకు నివ్వెఱపోయిరి. మహారాజు తన సంస్థానకవుల శక్తికానందపడెను. అప్పటినుండియు నాస్థానమున వీరిపేరు మాఱుమ్రోసినది. సుబ్బారాయశాస్త్రిగారు "రావువంశముక్తావళి" సంస్కృతమున సంతరించిరి. అదిమహారాజు 1882 లో గృతినందెను. అసందర్భముననే ఈకవిరాజున కామహారాజు "రాజ్యమిచ్చితి బుచ్చుకొ"మ్మనెను. "నుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్?"

1890 లో గంగాధరు డస్తమించెను. ప్రభువియోగము భరింపలేక మనకవి పీఠికాపురాంగ్ల పాఠశాలోపాధ్యాయపదవి విడిచి యింట గూర్చుండెను. ప్రభుభక్తి యిట్లుండవలయును. సుబ్బారాయశాస్త్రి గారి తమ్ములు తమ్మనశాస్త్రిగారియెడలను బై విషయము లుపలక్షణ విధిచే నన్వయించుకొందురని పునరుక్తి సేయలేదు. ఈ సోదరకవుల సౌభ్రాత్రము గొప్పదని చెప్పు కొందురు. తమ్మనశాస్త్రిగా గన్నిటను నాయన్నకు దగిన తమ్ముడు. అవధానాది ప్రదర్శనములలో నన్నగారి కంటె దమ్ముడేమిన్న యని జనశ్రుతి, పాండిత్యమున మాత్రమగ్రజునిదే యగ్రతాంబూలము.

ఈ కవిసోదరులు తమ నాటికి సుగృహీతనాములైయున్న కూచిమంచి వేంకటరాయుడు-శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి-మాడభూషి వేంకటాచార్యుడు-మొదలగువారి పరిచితివలన దెలుగుకవిత్వమున మెలకువలు, కొన్ని క్రొత్త పోకడలు సంగ్రహించినారు. మాడభూషికవిని మించి యవధానము చేసెదమని కృతార్థులైనారు. మదరాసుపుర ప్రముఖలనుగూడ నవధాన ప్రదర్శినమున మెచ్చించిరి. ఎన్నడో పదునాఱవ శతాబ్దికి బూర్వ మంకురితమై, మాడ భూషికవిచే బల్లవితమై, దేవులపల్లి సోదరులచే గోరికితమై తిరుపతి వేంకటేశ్వరాది కవులచే గనిమితమై యీయవధానవిద్యాలత కొన్నాళ్ళు దెలుగుమన్నీల తల లూపించి క్రమముగా వెఱ్ఱితలలు వేయుస్థితికి వచ్చినది.

సుబ్బారాయశాస్త్రిగారు ప్రభుల యభియోగవిజయ వార్త విని వార్తాహరునకు దమచేతుల నున్న బంగారుకంకణములు బహూకారముచేసెనట. ఆయన ప్రభుభక్తి యట్టిది. "మహేంద్రవిజయ" ప్రబంధ మీవిషయమును తార్కాణించును. ఈ "మహేంద్రవిజయము" నవీన వాసన ముమ్మరముగా గల మధురకావ్యము. వీరికృతిసంతతికెల్లనిది మేలుబంతి.మచ్చున కొకపద్యము చాలును.

తొలికోడి తానెయై యెలుగెత్తి మూడుభం

        గుల గుక్కు టీశుండు కొసరి కూసె

నాలమందల కెల్ల నధినేత తానెయై

        పొంకంబుగా నంది ఱంకెవై చె దీర్థంబు దెచ్చుహస్తికి బెద్ద తానెయై

లంబోదరుడు బృంహితం బొనర్చె

విహగంబులకు నెల్ల బెద్ద తానై కుమా

రునికేకి పెలుచ నిస్వన మొనర్చె

దానె లింగార్చకులకు బ్రాధమికు డనుచు

బ్రాతర నిలుండు కేతనాగ్రముననున్న

ఘంట మ్రోయించె వందిమాగధులు తామె

యగుచు భక్తులు పేర్కొని రపుడుమమ్ము.

మహేంద్రవిజయము.(......)

శాస్త్రిపాదుల దేవభాషాకవితాధోరణి కొక శ్లోకము మూదలింతును.

జ్ణాతార శ్శ్రోతార స్స్తోతార: కాంక్షి తార్థదాతార:

నేతార స్సంతి యదిఖ్యాతా రచయంతి సత్కృతీ కనయ:

అన్నదమ్ము లిర్వురును సంస్కృతభాషా కవితలో జేయితిరిగిన వారు. తమ్మనశాస్త్రిగారి ధారాశుద్ధి మాడుడు.

ఫణీశదర తారకా శశిమణీ ఘృణీధోరణీ

తృణీకరణనై పుణీ విలసితాపన న్యాంగకమ్

గణాధిపసమర్చితం గణసుధీగణ గ్రామణీ

పణాయితగుణాన్వితం మనసి కుక్కుటేశం భజే,

తమ్మనశాస్త్రిగారి తెలుగుకూర్పులలో నయనోల్లాసము, యతిరాజ విజయము పేర్కొనదగినవి. నయనోల్లాసము ప్రభుపట్టాభిషేకోత్సవ సమయమున వెలువడినది. అప్పుడు "నయనోల్లాసము" సార్థకత నొందినది.ఇందలిపద్యములు ధారాళముగా నడచినవి. కానివ్యర్థపదములు బహుళముగ దొరలినవి. వీరి "యతిరాజవిజయము" చక్కనిశైలిలో నున్నది.ఇది మూడాశ్వాసములు వ్రాసి తమ్మనశాస్త్రిగారు గతించిరి. వారి తరువాత బీఠికాపుర సంస్థానకవులు వేంకటరామకృష్ణులు తక్కిన యాశ్వాసము పూరించిరి. యతిరాజవిజయమున దమ్మనశాస్త్రిగారు కృతిపతులచే నిట్లు చెప్పించుకొనిరి.

పదునాలుగేడుల బొదలు ప్రాయమునాడె

కడగినాడవుగదా కవితసేయ

బదునన్మిదవయేట నాక్రుచ్చితివిగదా

సకలేశశతక మాశ్చర్యఫణితి

నిరువదైదవయేట విరచించితివిగదా

రావుసత్కులచరిత్ర ప్రబంధ

మెడనెడ వేనవే ల్నుడివినాడవుగదా

యనమపద్యముల నత్యాశులీల

నేడు వేడుక జేయుచున్నాడవస్మ

దనుమతిని నయనోల్లాస మనెడు కృతిని

క్షితిని బరికింప నతిశీఘ్రగతిని బూని

నుకవితను గూర్చునేర్పు నీసొమ్ముగాదె!

అభిన వాంధ్రకవులలో బ్రసిద్ధిభావుకులగు దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు తమ్మన శాస్త్రిగారి తనూజు లని తెలియనివా రుండరు.